29, డిసెంబర్ 2019, ఆదివారం

అమరావతి విధ్వంసం తగదు

అమరావతి ఇకపై  రాజధాని గా ఉండబోదు అన్న ప్రకటన వల్ల  లేదా మార్పు వల్ల  నాకు వ్యక్తిగతంగా నష్టం లేదు. లాభం లేదు.


సామాజికపరంగా చూస్తే  ఒక ఐదేళ్లపాటు ఈ ప్రాంతంలో జరిగిన ట్రేడింగ్ ఏదైనా ఉందంటే అది అమరావతిని కేంద్రంగా  చేసుకుని పెరిగినదే. ఈ రాజధాని పరిధిలో అందరిని అభివృద్ధి వైపు ఊరించిన అంశం ఇది. అనేకమంది  పెట్టుబడులు పెట్టారు. ఎక్కడెక్కడ వున్నవాళ్ళందరూ  ఇల్లు కట్టుకోవాలని పిల్లలు చదువులు ఇక్కడే కొనసాగాలని ఇక్కడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . అలాంటివారికి ఈ నిర్ణయం ఆశానిఘాతం. పల్లెల నుండి ఇతర పట్టణాల నుండి వచ్చి మా ఊరులో ఎంతోమంది ఇళ్ళు కొనుక్కున్నారు. రాజధాని రావడం మూలంగా మా వూరు ఈ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందటం కాదు. ఇది అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం.

కానీ అమరావతి ప్రాంతంలో అక్కడ జరిగిన  జీవన విధ్వంసం    ఏదైతే ఉందొ ..ముఖ్యంగా వ్యవసాయ విధ్వంసం అది మళ్ళీ పునరుద్దించలేనిది. భూములిచ్చిన రైతుల వితరణ దాని వెనుక వారి అభివృద్ధి ఆకాంక్ష ఆ ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమైన అభివృద్ధి ఆనవాలు అవన్నీ యిపుడు  నాశనమైపోతాయి. 


ఆనాడు ప్రతిపక్షంలో వుండి  ఒప్పుకున్న నాయకుడు ఈ రోజు కుంటిసాకులు చెప్పి మార్చాలనుకోవడం బాగోలేదు. వారికి అసలు దీనిపై అవగాహన శూన్యం. వ్యతిరేక భావనలు మినహాయించి ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. అన్ని వేల ఎకరాల పొలం రూపు రేఖలు మారిపోయాక ఎన్నో కుటుంబాల ఆశలు ధ్వంసం అవుతుంటే వారు రోడ్డున పడుతుంటే అలాంటి నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేనూ నా ప్రాంతమూ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు భావోద్వేగాలు త్యాగాలు  అక్కడి అభివృద్ధి అంతా సామాజిక అభివృద్ధి అనుకుంటానండీ. అవి పరిణామక్రమంలో జరుగుతున్న జరిగిన మార్పులు. వాటిని ఇప్పుడు మార్చాలనుకోకూడదు. అందరూ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు వారి స్వార్ధం  కోసం అమరావతిని మార్చకూడదు. 


ముఖ్యంగా .. నేను చెప్పేది ఏమిటంటే ..ఎంతోమంది విదేశంలో నివసిస్తున్నవారు సాఫ్ట్ వేర్  ఉద్యోగస్తులు ఇక్కడ అభివృద్ధి కోసం కలలు కంటున్నారు. మాతృదేశానికి తిరిగి  వచ్చేయడానికి. వారి ఉద్యోగాలకు అనువుగా.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. వారి కష్టాన్ని ఇక్కడ పెట్టుబడులుగా  పెట్టారు.అదంతా యిపుడు ఏమైపోవాలండీ? ఆర్ధిక అనిశ్చితితో చాలామంది  నిత్య మానసిక క్షోభతో కూలిపోయే చెట్లల్ల వున్నారిప్పుడు. నాయకుల వ్యక్తిగత ద్వేషాలు వారి వ్యక్తిగత అభివృద్ధి ఈ ప్రాంత ప్రజలను అధోగతి పట్టించడం భావ్యమా?  ఇక్కడ చదువుకున్న పిల్లలు వలసలు వెళ్లిపోతున్నారు ఆ తల్లిదండ్రుల మానసిక క్షోభ ..వలస వెళ్లిన చోట వారికి కలుగుతున్న కష్టాలు,జీవన  సంఘర్షణ వెళ్ళినచోట  గుర్తింపు రాక వెట్టి చాకిరి చేస్తూ అయినవాళ్లకు దూరంగా వాళ్ళు పడే బాధలు వర్ణనాతీతం . ముఖ్యంగా ... "అమరావతి "  ఈ ఆంధ్ర  రాష్ట్ర ప్రజల కలల రూపం. అది వాస్తవ రూపం దాల్చకుండా ప్రజలే తింటున్న వాళ్ళ కంచంలో నీళ్లు పోసుకున్నారు. ఇంతకన్నా ఊహించిన అభివృద్ధి ఇప్పుడు మారాలన్న చోటులో రాదు. మౌలిక వసతులు అమరావతికన్నా వేరొక చోట మెరుగ్గా వుండవు. ఇది సత్యం.  ఇది కేవలం నాయకుల వ్యక్తిగత అభివృద్ధి కోసం జరుగుతున్న మార్పు. కనబడేది 29 గ్రామాలే కానీ ప్రజలు పతనమయ్యే కనబడని కోణాలు ఎన్నో .. నేను ఒక మామూలు మనిషిగా స్పందిస్తున్నా .. బహుశా నేను ఆలోచిస్తున్న తీరు కొందరికి సున్నితంగా కనబడవచ్చు. హాస్యాస్పదంగా కనిపించవచ్చు . అయ్యో ఇలా అవుతుందేమిటి అనుకునే సామాన్య మానవులు నా చుట్టూ వేలమంది . 


మళ్ళీ రాజధాని పేరిట ఇంకోచోట వేల  ఎకరాల భూములను నాశనం చేయొద్దు...ప్లీజ్ . అభివృద్ధి చేయాలంటే అనేక మార్గాలు. రాజధానులు పెట్టాల్సిన పని లేదు.     

కామెంట్‌లు లేవు: