23, ఆగస్టు 2017, బుధవారం

అరె కొమ్మపై దీపం

ఏ విషయం పైన అయినా ఆసక్తి కల్గితే దాని అంతు చూడాల్సిందే అనే తత్త్వం నాది. తవ్వా ఓబుల్ రెడ్డి గారి "సూతకం"  కథలో ఒక విషయం  చదివాను  ఈ విషయం ఆరె కొమ్మని చుట్టి దానిపై దీపారాధన చేయడం  అని . 

శుభ కార్యం జరుపుకునేటప్పుడు ఆరె కొమ్మని చుట్ట జుట్టి దానిపై మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేస్తారట. అలాగే దసరా పండుగ రోజు శమీ వృక్షంతో పాటు తెల్ల ఆరె చెట్టుని పూజిస్తారట. అసలు ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయోనని వెతికితే  . గూగుల్ నాకు తెలుపు,ఎరుపు,పసుపు,గులాబీ ఇన్ని పూలు చూపింది . నల్లమల కొండలలో ఇవి బాగా ఉంటాయట. 

అయితే ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేకపోయారు. ఈ మధ్య రచయిత కడప ఇన్ఫో సైట్ ని చక్కగా నిర్వహిస్తున్న తవ్వా ఓబులరెడ్డి గారిని వివరణ అడిగాను . వారు నేను పైన పోస్ట్ చేసిన చిత్రాన్ని , ఆ చెట్టు చిత్రాన్ని కూడా పంపించారు ..అలాగే వారు ఇచ్చిన వివరణ ఇది .. ఇదే చేత్తో  సూతకం కథ  లింక్ కూడా ఇస్తున్నాను.ఆసక్తి ఉంటె చదివేయండి మరి.

"అరె చెట్టు అని ఉంటుంది  దానికొమ్మతో దీపపు సమ్మె చుట్టి దానిపై ప్రమిదను వెలిగించి పెళ్ళికి ముందు జరిగే దాసంగం లేదా దాసర్లు కార్యాన్ని చేస్తారు. రాయలసీమ ఈ ఆచారం ఉంది." ఇదే అరె చెట్టు ..దీనిని శ్వేత కాంచనం అని కూడా అంటారు అని చెప్పారు.  
20, ఆగస్టు 2017, ఆదివారం

ఎరుక గల్గి..

నిత్యజీవితంలో పరిసరాలు మనకెన్నో పాఠాలు భోదిస్తూ ఉంటాయి. 

అప్పుడప్పుడూ నేర్చుకున్న పాఠాలని ఇలా వ్రాసి పెట్టుకుంటాను ..

డైరీలో వ్రాసుకున్నట్లు.. 


ఏదైనా విషయాన్ని ఎరుక గల్గి ఉండటం మంచిదే కదా !


నాకు తులిప్స్ అంటే మక్కువ యెక్కువ. 

తులిప్స్ గురించి.. ఇలా..

ఆరు రేకుల పుష్పమా ఆరాధ్య పుష్పమా

అరిషడ్వర్గాలనిజయింపమని భోధించేవు

నిలువుగనూ ఒంటిగానూ పెరిగేవు

ఏకాత్మ భావనకి రూపమై నిలిచేవు.


ఇంకా ఇలాక్కూడా .. 


రేకులు విప్పని మొగ్గ

నిశ్శబ్దంగా ప్రార్ధిస్తుంది

వికసించే ముందే మేల్కొని.

పిమ్మట ఆహ్లాదానికో 

ఆస్వాదనకో అలంకరణకో

పోనీ మరునాటికి

నేలరాలడమో కదా..

కడకు మిగిలేది

ఇంకొక్కటి..ఇలాగే అనిపించింది ...
మంచు కురిసే వేళలో 

ముద్దబంతి నవ్వులు, 

దవనపు పూల సువాసన,

సీతాకోకచిలుక విహారం 

కాఫీ పరిమళం...

ఒకరి జీవితాన్ని ఇంకొకరు

ఎన్నటికి జీవించలేరన్న సత్యాన్ని గుర్తు చేస్తాయి.

****************************

16, ఆగస్టు 2017, బుధవారం

యుద్ధం చేసితినీ.. అలసితినీ..


నాకు నదుల పుట్టుక, వాటి పరీవాహక ప్రాంతాలు నదులొడ్డున వెలిసిన నాగరికత ఇవన్నీ చూడటం, తెలుసుకోవడం ఒక ఆసక్తి. అనుకోకుండా ఒకరోజు అర్ధరాత్రి నదీ తీరానికి వెళ్ళాల్సి వస్తుందని ..మహాభారతంలో గాంధర్వ పర్వంలో ఒకే రేవులో అనేక మంది స్త్రీలు దుఃఖిస్తూ తమ సౌభాగ్యాన్నితుడిచేసుకుంటూ  నల్లపూసలని తెంచి వేసినట్లే ఈ ఆధునిక కాలంలో కాస్తో కూస్తో అభ్యుదయ భావాలతో బ్రతికే నాకు అలాంటి స్థితి వస్తుందని  నేనేనాడు ఊహించలేదు. అందులో "గడప బొట్టు' లాంటి కథ వ్రాసిన నాకు వాస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలో అన్న స్పష్టమైన ఆలోచనయితే ఉంది కానీ ఇంత దారుణంగా అర్ధరాత్రి నదీ తీరానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అసలలాంటి తలంపే నాకు పెద్ద అవమానంగా తోస్తాను.

ఎందుకంటే.. నాకు చిన్నతనం నుండి భర్త చనిపోయిన స్త్రీలని తోడబుట్టినవారు, బంధువుల మధ్య కూర్చోపెట్టి మరీ చేసే తతంగాలంటే పరమ అసహ్యం .  మా పెద్దనాన్నగారి కూతురు అక్కకి ఇలాంటి తంతే నిర్వహించారని తెలిసి బాధపడ్డాను. అక్కని ఇంటికి నిద్రకి పిలిచినప్పుడు ఆమె వస్తున్నప్పుడు ఎదురుగా వెళ్ళొద్దని  లోపలి గదిలోకి కూర్చోమని  మా అమ్మ ఆజ్ఞ జారీ చేసినా నేను పట్టించుకోలేదు. అక్క వచ్చినప్పుడు ఆమెకి ఎదురుగా వెళ్లి చూసాను కూడా !  ఆనక అమ్మ చేత రెండు మొట్టికాయలు తిన్నాను.  మరి కొంత కాలానికి  నేను పురిటి మంచంలో ఉండగానే తాతయ్య చనిపోయి మా నాయనమ్మకి అలా చేస్తుంటే తట్టుకోలేక ఏడ్చేసాను. మా అన్నయ్య, చెల్లి మేమంతా వ్యతిరేకించినా మా మాట చెల్లుబాటు కాక  అనాగరిక మూక  ఆమెని ఆ అర్ధరాత్రి సమయంలో మరింత దుఃఖానికి గురిచేసే తీరారు.

పసుపు రాసుకోవడం, ఇంత మందాన కుంకుమ దిద్దుకోవడం,  రంగు రంగుల గాజులేసుకుని, నిర్దాక్షిణ్యంగా పూలని తెంపి జడలో అలంకరించుకోవడం వాటి వల్లే అందంగా ఉన్నామని భ్రమ పడటం లాంటివన్నీ లేని దాన్ని. అలాగే  మనిషికన్నా తాళిని గౌరవించడం పరమ పవిత్రంగా కళ్ళకద్దుకోవడం లాంటివన్నీ చేయని పెడసరి మనిషిని కూడా! అకస్మాత్తుగా మా ఇంటికి బంధువులో తెలిసిన వారో వస్తే కొత్తగా మతం పుచ్చకున్న వారి మాదిరిగా కనబడతాను. ఎవరన్నా సుద్దులు చెప్పినా వినేసి, నవ్వేసి ఊరుకుంటాను తప్ప నా కిష్టం లేని పని ఎన్నటికి చేయని మొండిదాన్ని. అలాంటి నా చేత తెల్ల చీర (విధవరాలు కట్టే చీర ) కట్టించి కొంతమంది తృప్తి పడ్డారు. తోడబుట్టిన వారికి మంచిది కాదంట, కీడు జరుగుతుందని కొందరు ఏవేవో వ్యాఖ్యానాలు.

నా భర్తకి పదమూడు నెలల క్రితం ఊపిరి తిత్తుల కేన్సర్ అని నిర్ధారణ అయింది. ఒక ఆధునాతన చికిత్సా కేంద్రం లో ఆ విభాగానికి చెందిన వైద్యులు కూడా కొన్ని నెలలు మించి బ్రతకడం కష్టం.. చికిత్చ కూడా వద్దని సూచించారు. అయినా చికిత్చ చేయించదల్చాము.  బ్రతికినన్నాళ్లు వైద్యుల సూచన మేరా నడుచుకుంటూ ఉన్నాను. చికిత్చ చేయించాము.

నలబై రోజుల క్రితం ఆయన చనిపోయిన తర్వాత నాలుగో రోజు నుండీ  విపరీతంగా వస్తున్న బంధువులని చూసి నా మనసులో మాటని   మా కుటుంబాలలో ఉన్న  అత్తలు,ఆడపడుచులు, తోటి కోడళ్ళు అందరూ కలసి కూర్చున్నప్పుడు  చెప్పేసాను. పసుపు రాయడాలు  కుంకుమ తుడవడం,గాజులు పగల గొట్టడం లాంటి విషయాలు నేను ఏమీ చేయను . నాకు వాటి పట్ల ఆసక్తితో ఎప్పుడూ ధరించలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ధరించి వాటిని తీసేయడం లాంటివి నేను చేయను, మీరందరూ ప్రత్యేకించి ముఖం చూసే రోజు అంటూ రావద్దు, స్వీట్స్ లాంటివి తేవద్దు. వివాహం ద్వారా నాకు ఏదైతే నా శరీరం పై తోడైనవో అవే తీసి ప్రక్కన పెడతాను. మిగతావి నేను చేయను అని చెప్పాను. ఈ తరం వారందరూ హర్షించి మనఃస్పూర్తిగా అభినందించారు. అత్తల తరం వారు కొంత వ్యతిరేకత ..ప్రక్క గదిలోకి వెళ్లి చర్చలు పెట్టారు.

నాకు తెలుసు ..నాకు తెలుసు . నా చుట్టూ ఉన్నవారందరూ  దేని గురించి ఆలోచిస్తున్నారో .. నాకొక అగ్ని పరీక్ష పెట్టదల్చారన్నది నాకు సుస్పష్టంగానే తెలిసిపోతుంది. ఇలాంటిది ఏదో ఎదుర్కోవాల్సి వస్తుందని  ఒక సంవత్సర కాలం నుండి నేను తయారుగానే ఉన్నాను. జనన మరణాలు మన చేతిలో ఏమీ ఉండవన్నది రోగికి వైద్యం చేస్తున్న డాక్టర్లకి కూడా తెలియదు.ఏ రోజున ఏమి జరగనున్నదో .. ఆయనకన్నా నేను ముందుగా చనిపోతే ? అన్న ఆలోచన వచ్చి ఆగిపోయేది కూడా ! జరిగేది జరిగి తీరింది. ఇక జరపాల్సింది మా వంతు అన్నట్టు ఉన్నారు ఈ కొందరు. మా అత్త గారు కూడా సాంప్రదాయాలు అని పెట్టింది ఎందుకు ? అవన్నీ చేయకపోతే ఎట్లా ? అని వ్యాఖ్యానించినట్లు విన్నాను. ఎవరి సూచన మేరకో మా అన్నయ్య భార్య గాజులు, పూలు, పసుపు కుంకుమ  స్వీట్స్ తెచ్చి నా ఎదురుగా పెట్టింది.  స్వీట్స్ తెచ్చి డైనింగ్ టేబుల్ పైన మిగతావన్నీ  తీసి అద్దం అరమారలో పెట్టేసాను.

మా హౌస్ ఓనర్ కాల్ చేసి తొమ్మిదో రోజునో, పదకొండో రోజునో, పదిహేనోరోజునో చేసే కార్యక్రమాలు అన్నీ ఇంట్లో చేయవద్దు అని చెప్పారు. పెద్ద కర్మ లాంటి సంస్కరాలన్నీఏమీ ఇంట్లో  చేయము,పార్కింగ్ ప్లేస్ లో చేసుకుంటాం అని చెప్పాను . మళ్ళీ తొమ్మిదో రోజు, పదకొండోరోజు అంటూ ప్రత్యేకించి చెపుతుంటే అప్పటికి గాని   విషయం నాకర్ధం  అయి అలాంటివన్నీ ఏమీ చేయను అని చెప్పాను. దాదాపు పన్నెండు నిమిషాల సమయం అదే విషయం రిపీట్ చేస్తూ వచ్చారు . నాకు  మనసుని మెలేసే నొప్పితో పాటు చెవి నొప్పి వచ్చి మాట్లాడటం ముగించాను. సొంతిల్లు లేకపోవడం అంటే ఏమిటో  అర్ధం అయి మనో దుఃఖం వెల్లువలా ముంచేసింది నన్ను. తర్వాత రోజు  నా కొడుకు  పెద్దవాళ్ళు అందరూ కూర్చుని పెద్ద కర్మ రోజు  ఎంతమందిని పిలవాలి, ఎంత ఘనంగా చేయాలో బందుమిత్రులకి చేసే విందు భోజనాల్లో ఏమేమి వంటకాలు వడ్డించాలి అని మాట్లాడుకుంటుంటే..  నేను తక్కువ ఖర్చుతో ముగించేసి ..ఏదైనా అనాధ శరణాలయానికి విరాళం ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఆ మాటని తోసి పుచ్చి ఘనంగా చేయాల్సిందే అన్నాడు నా కొడుకు. చావు కూడా పెళ్ళి లాంటిదే అన్న మాటలని,తీరుని నిజం చేయాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు మరి.

అదే సమయానికి మళ్ళీ నాకొక ఫోన్ కాల్ . మా ఇంటి ఓనర్ పిన్ని గారు .. ఇంట్లో పదకొండో రోజో, పదిహేనో రోజో చేసే కార్యక్రమం చేయొద్దు అని. పైగా ఆ మాటలని విన్నపం అనుకోమని చెపుతుంటే నాకు ఎందుకు బ్రతికి ఉన్నానా అని విరక్తి కల్గింది. నేను దుఃఖిస్తూ ఉంటే మా అబ్బాయి చాలా బాధ పడ్డాడు. మానాన్నగారికి ఏమి చేయాలో కొడుకుగా నేను అన్నీ చేస్తాను . అమ్మని మాత్రం అలా చేయి, ఇలా చేయి అంటూ మీరెవరూ బలవంతపెట్టవద్దు. ఆమెకి ఎలా ఇష్టం అయితే అలా ఉండనీయండి అని చెప్పాక కాస్త సతాయించడం మానుకున్నారు. అర్ధంలేని ఆచారాలతో అనుమానపు భయాలతో సంకోచించే   వీళ్ళందరూ చదువుకున్నవారు సెక్యులేషన్,సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు. షేర్లు ధర ఎప్పుడు పతనం అవుతుందో తెలియదన్నట్లు ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు కదా ! ఇంట్లో ఎందుకు చనిపోనిచ్చారు . ఎప్పటి నుండో అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కదా ..ముందు తెలియలేదా అన్న ఆరాలు. ఆయన బాత్ రూమ్ కి స్వయంగా వెళ్లి బయటకి  వచ్చిన తర్వాత పడిపోయి మనిషిని  లేవదీసే క్రమంలో  నా రెండు చేతుల మధ్య ఊపిరి అందక ఊపిరి ఆగిపోయిన మనిషి. నెలలు మాత్రమే  బ్రతుకుతారనుకున్న వ్యక్తిని సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాచుకుని కాపాడుతున్నాను. ఆయనకి సమయం వచ్చేసింది వెళ్ళిపోయారు.

విగతజీవిగా మారిన ఆయన్ని రెండు గంటలు నట్టింట్లోనే పరుపు వేసి పడుకోబెట్టాం. సంప్రదాయం ప్రకారం తల వైపు  దీపం కూడా వెలిగించలేదు. మార్చురీకి  పంపి ఖండాంతరంలో ఉన్న కొడుకు వచ్చిన తర్వాత దహనక్రియలు చేయడం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు జరుపుతూ మా పార్కింగ్ ప్లేస్ లో నుండి ప్రక్కవారి పార్కింగ్ ప్లేస్ లోకి  వారి భౌతిక కాయం జరిగినందుకు వారు చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. పైగా ఆ భార్యాభర్త లిరువురు టీచర్ ఒకరు ఎం.ఈ.ఓ ఒకరు. వీరు పాఠశాలల్లో పిల్లలకి ఏం సంస్కారం నేర్పుతారో ! .అడుగడునా మూడాచారాలు.   నిత్యం పూజలు చేస్తారు, దుఃఖంలో ఉన్న, వారి ప్రక్కనున్న సాటి మనిషి పట్ల క్రూరంగా వ్యవహరిస్తారు. ఆఖరికి మా పార్కింగ్ ప్లేస్ కి తెరలు అడ్డుకట్టుకుని కార్యక్రమం జరిపించాము. వేరే  ఫంక్షన్ హాల్ లో  భోజనాలు ఏర్పాటు. ఆరోజు మా ప్రక్క పార్కింగ్ ప్లేస్ లో కారు పార్క్ చేసే ఉంచారు.  ఇంకొక వికృతం ఏమిటంటే ..ఆ రోజు  నా చేత తెల్ల చీర కట్టించడం నా ముఖం బయటకి కనబడకుండా కట్టడి చేయడం లాంటి మూర్ఖాచారాలు బలవంతంగా అమలు చేయించడంలో మా అత్త గారు కృతక్రుత్యులయ్యారు. అయినా నా స్నేహితురాండ్రు ఇద్దరు నా దగ్గరికి వచ్చి కూర్చుని నాకు అండ అనిపించారు.

ఆయనకీ ఆరోగ్యం బాగోలేదు అని తెలిసిన తర్వాత మొట్టమొదటగా నేను హౌస్ ఓనర్ తోనే విపులంగా మాట్లాడాను. మరి ఒకవేళ ఇంట్లో ఉండగా జరగరానిది జరిగితే మీకేమన్నా అభ్యంతరాలు ఉంటాయా ? అని . మాకు అలాంటివి ఏమీ లేవు ఆంటీ ..ఇంట్లో ఏమీ చేయొద్దు పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోండి, కార్యక్రమాలు అవి అక్కడే చేసుకోండి  అని భరోసా ఇచ్చారు ఆమె. హమ్మయ్య అనుకున్నాను. ఆ భరోసా వల్లనే మావారి స్వగ్రామం వెళ్ళిపోవాలని అనుకుని కూడా ఈ ఇంట్లోనే ఉండిపోయాం. కానీ వారు మరణించిన తర్వాత వీళ్ళందరి మనస్సులో భయాలు, అనేకానేక అనుమానాలు,మూడాచారాలు చూస్తే మనం నాగరిక ప్రపంచంలో ఇంటర్నెట్ యుగంలో బ్రతుకుతున్నామన్నది అబద్ధం అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడు ఉన్నా లేకపోయినా నీడ అంటే సొంత గుడిసె చిన్నదైనా ఉండాలనిపించింది. ఒకానొక దశలో చాలా అసహనంతో ఇంటి ఓనర్స్ కి  ఏ ఏ హక్కులైతే ఉంటాయో అద్దెకి ఉన్నవారికి అవే హక్కులుంటాయి. ఆ హక్కులన్నవి ఏమిటో లాయర్ చేత ఒక నోట్ తయారు చేయించి ఇంటి గోడకి అతికించి మరీ చేయాల్సిన కార్యక్రమం చేసుకుంటాం అని అన్నాను . అప్పుడు నాకొక లాయర్ సపోర్ట్ గా కూడా ఉన్నారు. కానీ నేను అలాంటిదేమీ చేయలేదు.  నాకిప్పటకీ ఇంటి ఓనర్ల పైన ఎలాంటి కోపం, నిరసన కూడా లేదు. లక్షలు,ఎకరాలు,నివేశన స్థలాలు అన్నీ పోగొట్టుకున్నా ఎప్పుడు పోయినవనే బాధ కూడా లేని నాకు తొలిసారిగా  బాధ అనిపించింది.  ఇలాంటి సమయాల్లో  సొంత ఇల్లు లేకపోవడం అనే అవమానం తట్టుకుని నిలబడాల్సి వచ్చింది.

ఇక తర్వాత రోజునుండి నా దినచర్య మాములుగా సాగిపోవాలి తప్పదు,   ఆ సమయాన అనేక మానసిక సంఘర్షణలు ఉన్నా వంట చేయడం అన్నది అందులో ముఖ్యమైనది. నెమ్మదిగా మనసు సంభాళించుకుని లేచి నిలబడి  దైనందిత జీవితంలోకి వచ్చేసాను. మంచి రోజు చూసి  పుట్టింటికి నిద్రకి వెళ్ళమన్నారు. అయిష్టంగా తల అడ్డంగా ఊపాను . అక్కడ  మళ్ళీ హితోక్తులు. పుట్టింటివాళ్ళకి కీడు . ఇప్పుడు వెళ్ళకుండా తర్వాత ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళడం కుదరదు అని . అక్కడ తలవంచాను. మిత్రులు,బంధువులు అందరూ వెళ్ళిపోయారు.  పుట్టెడు దుఃఖం వెంటబెట్టుకుని నా కొడుకు వెళ్ళాడు. తర్వాత బ్యాంక్ పనుల నిమిత్తం, కూరగాయలు తెచ్చుకోవడానికి, కరెంట్ బిల్లు కట్టడానికి అన్నింటికీ నేను మాములుగా బయటకి  వెళుతున్నాను. నిత్యం సాయిబాబాని కొలిచే వాళ్ళు ఆయన చెప్పినవి,  ఆచరించి చూపిన  వాటిలో ఒక్క మార్గంలో కూడా నడవరు.  ఒకే ఫ్లోర్ లో ఎదురుగా ఉన్న ఇంట్లో మనిషి చనిపోతే చిన్న  పలకరింపు కూడా   పలకరించని మనుషులని చూసాను నేను .

ఇక ఇంట్లో నుండి  అడుగు బయట పెట్టగానే డభేల్  మంటూ ముఖాన తలుపు వేసుకునే వాళ్ళు ,  నేను కనబడగానే ముఖాన  చెంగు వేసుకుని ముఖం దాచుకునే వాళ్ళు ,ఎదురుగా ఎప్పుడూ కనబడే మనుషులే అయినా చిన్న చిరునవ్వు నవ్వకుండా ముఖం బిగదీసుకునేవాళ్ళు ఇవన్నీ షరా మామూలే ! వీళ్ళందరినీ  చూసి నేను నవ్వుకుంటాను .  నాకు ముఖాన కుంకుమ పెట్టుకోవాలనిపిస్తే మట్టి గాజులు వేసుకోవాలనిపిస్తే పూలు పెట్టుకోవాలని అనిపిస్తే నిరభ్యరంతంగా పెట్టుకుంటాను. ఎవరు ఏమనుకుంటారో అని నేను పట్టించుకోను. వాస్తవ జీవితాల్లో స్త్రీల జీవితంలో మతాలకి సంబంధించిన ఆచారాలు ఇప్పటికి  కఠోరంగా ఉన్నాయి. ఇంకా అజ్ఞానం పేరుకునే ఉంది.  ఇప్పుడే ఇలా ఉంటే రాజారామ్మోహన్ రాయ్ ,కందుకూరి వీరేశలింగం గారు ఈ మూర్ఖపు సమాజంలోని మనుషులతో ఎంత యుద్ధం చేయాల్సి వచ్చిందో అన్నది తలుచుకుని తెరిపిన పడతాను. ఈ అనుభవం ఇతరుల సానుభూతి ఆశించి పంచుకోవడం లేదు నేను. సమాజం ఇప్పుడు కూడా ఇలాగే ఉంది అని తెలియజేయడానికి మాత్రమే ! నిజంగా నేను చేసిన యుద్దంలో నేను ఓడిపోయాను. ఇది మరీ అవమానంగా ఉంది నాకు.  నాలాంటి, మీలాంటి వారు మార్పు కోరుకున్నా మారని, మారనివ్వని మనుషులు మన మధ్యనే ఉన్నారు.

ఇంకో విషయం ఏమిటంటే ..ఇలాంటి మూడాచారాల వల్ల హిందూ ధర్మం పట్ల కూడా విముఖత కల్గుతుంది. మానసిక వికాసం లేని మతం,ఆచారం, ధర్మం మనకి ఏల..అని ఆలోచనలు వస్తాయి. చానల్ కి ఒక లేక నలుగురైదుగురు పండితులు, గురువులు, ప్రవచనకారులు ఉన్నారు కదా ! what is the meaning of culture?  what is the meaning of rituals, ? ఏమిటో అన్నది అజ్ఞానులకి తెలియజేయాలి  .

 "సముద్రమంత అజ్ఞానాన్ని ఎని కాగడాలు వెలిగించి పారద్రోలగలం"  అని చలం గారన్నట్లు మతాలూ,ఆచారాలు  పేరిట  ఉన్నఅజ్ఞానాన్ని మనం పారద్రోలాలని నా ప్రయత్నం నేను చేసాను.

జీవన పోరాటంలో ఎన్నో యుద్దాలు చేసాను .. అన్ని చోట్లా నేనే గెలిచాను . కానీ ఈ  యుద్దంలో నిస్సందేహంగా నేను ఓడితిని .


12, ఆగస్టు 2017, శనివారం

కథ కాని కథ

ఫ్రెండ్స్ .. ఈ రోజు  నా చేదు అనుభవం గురించి చెప్పదలిచాను. నిజానికి  నా ఈ చేదు అనుభవం ఒక కథ అవుతుంది కూడా ..అయినా అనుభవాన్ని అనుభవంగానే చూడదల్చాను. ఇక్కడే share చేసుకోవడం ఎందుకు అంటే ఇక్కడ అంటే ఈ ఫేస్ బుక్ లో మసిలే వ్యక్తుల మానసిక రోగం ఇలా ఉంటుందని  మీకు అనుభవమవుతుందని...  
నాకు ఒక రోజు ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అపరిచితవ్యక్తి మేడమ్ బాగున్నారా ? అని పలకరించాడు. ఎవరండీ మీరు ? అనడిగినాను. అదేంటి మేడమ్ నన్ను గుర్తుపట్టలేదా ..నేను తిరుపతి నుండి మాట్లాడుతున్నాను అన్నాడు . నేను రాంగ్ నెంబర్ అని కాల్ కట్ చేసాను. మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఓపికగా మీరెవరో నాకు తెలియదు,అసలు నాకు తిరుపతిలోనే ఎవరూ తెలియదు అన్నాను. అదేంటి మేడమ్..లాస్ట్ సండే మీరు తిరుమలకి వచ్చారు కదా ..నేను పోలీస్ కానిస్టేబుల్ ని. మీకు చాలా హెల్ప్ చేసాను. మీరు నాతో చాలా క్లోజ్ గా కూడా మాట్లాడారు. ఇంతలోనే అలా మాట్లాడతారేమిటీ, మరీ మర్చిపోయినట్లు అన్నాడు. నాకు చిరాకు వచ్చేసి మళ్ళీ కాల్ కట్ చేసాను. మళ్ళీ కాల్ వచ్చింది. నాకు కోపం నషాళానికి అంటింది. నేను తిరుపతి రాలేదు, మీరెవరో నాకు తెలియదు, ఏ నెంబర్ కి చేయబోయి ఈ నెంబర్ కి చేసావో సరిగ్గా చూసుకోండి అని మర్యాదగానే చెప్పాను. సారీ..మేడమ్.. మీ పేరు  XXX కాదా ..అని అడిగాడు. కాదు బాబూ .. నా పేరు, ఊరు చెప్పాను. అతను నమ్మినట్లు కనబడలేదు. టచ్ లో ఉందాం అంటూ .. మీరే ఈ నెంబర్ నాకిచ్చారు. ఇంటికెళ్ళగానే ఇలా మారిపోతారని నేను అనుకోలేదు ..అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. బాబూ ..ఈ నెంబర్ ఫలానా నేను అనబడే స్త్రీ ది. నేనొక రచయిత ని. ఏదైనా కథ, కవిత చదివినప్పుడు నెంబర్ సేవ్ చేసుకున్నారేమో  అది చూసుకోండి అన్నాను. ఇంకా నమ్మినట్టు కనబడలేదు కానీ ఆలోచనలో పడి ..ఒక్క క్షణం తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తాను మీరు లిఫ్ట్ చేయండి మేడమ్ అన్నాడు. బాబూ! నేను ఫలానా వ్యక్తి అని మీకు రుజువు కావాలంటే ..ఇంటర్నెట్ లోకి వెళ్లి గూగుల్ సెర్చ్ చేయండి ..నా పేరు మీద. అక్కడ నా ఫోటో,బ్లాగ్ ,రచనలు,నివాసం, రచనల క్రింద  మొబైల్ నెంబర్ కనబడతాయి. అవి చూసిన తర్వాత అంటే నా ఫోటో చూసిన తర్వాత కూడా నేను తిరుపతి, తిరుమల లో మీకు కనబడ్డానని, మీరు హెల్ప్ చేసానని నేను మీకు నా ఫోన్ నెంబర్ ఇచ్చానని అనిపిస్తే కాల్ చేయండి అని చెప్పాను. మళ్ళీ సాయంత్రం కాల్ చేసి "సారీ మేడమ్.. మీరు కాదు కానీ నాకు పరిచయం అయిన ఆమె నెల్లూరు అని టీచర్ గా వర్క్ చేస్తున్నాని చెప్పారు. వీడ్కోలు సమయంలో ఫోన్ నెంబర్ అడిగితే ఈ నెంబర్ ఇచ్చారు" అని చెప్పాడతను. 
ఇలా ఉంటాయి కొందరి స్త్రీల తెలివితేటలు, బజారుతనాలు. ఎక్కడబడితే అక్కడ దొరికిన వాడిని అవసరాలకి ఉపయోగించుకోవడం, వాళ్ళతో క్లోజ్ గా మూవ్ కావడం .. ఆఖరికి ప్లేట్ తిప్పేయడం ..ఇతరుల నెంబర్ ఇచ్చి జారుకోవడం ..ఇవీ వీళ్ళ ప్రతివతా లక్షణాలు. అతనెవరో ఓపికమంతుడు కాబట్టి వివరంగా చెపితే అర్ధం చేసుకున్నాడు.  నిజం తెలిసాక కాల్ చేసి విసిగించినందుకు క్షమాపణ చెప్పాడు.   మరి ఆ టీచర్ అన్న వృత్తికే అనర్హురాలైన ఆ నీచ మనస్తత్వం కల స్త్రీ ని ఏమనాలి. ఆమె ఎవరో ..నాకు తెలుసు. అయినా లైట్ గా తీసుకుని వదిలేసా .. ఆమె నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉండవచ్చు, లేదా నా రచనలు చదువుతూ ఉండి ఉండవచ్చు. కచ్చితంగా నా ఫోన్ నెంబర్ తెలిసీ .. అతనికిచ్చి నన్ను ఇరికించాలని చూసింది మరి. బహుశా ఆమెది నెల్లూరు కాకపోవచ్చు ,టీచర్ కూడా కాకపోవచ్చు. అన్నీ అబద్ధాలే చెప్పి ఉండవచ్చు కూడా ! 
అమ్మలూ ..టేక్ కేర్.  కొందరు మగవాళ్ళే కాదు, కొందరు  ఆడవాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళే !  అడిగినవారందరికీ ఫోన్ నెంబర్ ఇవ్వకండి. అందరూ నాలా ధైర్యవంతులు,సహనం కలవారు కాకపొతే చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్లే ! రచయితని కాబట్టి ..ఇలాంటి వాటిని ఎదుర్కొనే తెలివి, ఆత్మవిశ్వాసం ఉంది.  మరి మీరూ  వ్యక్తిగత వివరాలు ఇతరులకి  ఇచ్చేముందు ఆలోచించుకోండి . జర భద్రం.

ఇంకొక విషయం ఏమిటంటే ..ఫలానా వ్యక్తి  నెంబర్ నా దగ్గర ఉంది అంటే ..వాళ్ళతో నేను మాట్లాడుతున్నాని అర్ధం కాదు. వారి నెంబర్  చూసుకుని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండటానికి జాగ్రత్తపడి సేవ్ చేసుకోవడం , బ్లాక్ లిస్ట్ లో పెట్టటానికి కావచ్చు.  ఎవరి దగ్గరో నా నెంబర్ ఉంది అంటే వారు నాతో మాట్లాడుతుంటారు అని కూడా కాదు. వారి దగ్గర ఉంటే ఉండవచ్చు. వారు నాకు పరిచయం కూడా లేకపోవచ్చు. 
 
కొంతమంది కాలక్షేపానికి ఫోన్ చేసి  మాట్లాడి అటు విషయాలు ఇటు ఇటు విషయాలు అటు ఇంకా నాలుగు లేనిపోనివి జేర్చి అనకాపల్లి నుండి అమెరికా దాకా మోసే వాళ్ళు కాలాన్ని వృధాచేయకుండా మంచి పనులకి ఉపయోగిస్తే మరీ మంచిది కదా ! 

10, ఆగస్టు 2017, గురువారం

పరస్వరంమమ్మీ .. మమ్మీ ! టూ టైమ్స్ పిలిచినా పలకవు. నేను ఊహ మమ్మీ  రూమ్ కి వెళ్ళి పడుకుంటాను. బెడ్ దిగబోయిన  వేద చేయి పట్టుకుని ఆపేసింది జనిత.
"ఇప్పుడెందుకు ఆ రూమ్ కి,  ఎందుకో పిలిచావ్ గా, చెప్పు ఏం కావాలి ?"
నేను పిలిచినపుడు  నువ్వెందుకు పలకలేదు. ఊహా మమ్మీ  రూమ్ కి వెళతానని అనగానే రెస్పాండ్  అయ్యావు. నువ్వు బేడ్మామ్ వి.
నో నో ..వేదా ! ఊహా మమ్మీ  ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళాలి కదా ! నువ్వెళ్ళి తనని డిస్ట్రబ్ చేస్తావని ఆపాను అంతే !
మళ్ళీ పడుకున్నాడు వేద . కొడుకు వైపుకి తిరిగి చేయి మీదేసి దగ్గరకి లాక్కుని నుదుటి పై ముద్దు పెట్టి నిద్రపో అంది. తల్లి నడుంపై చేయేసి కాళ్ళపై కాళ్ళేసి కళ్ళు మూసుకున్నాడు. జనిత  కూడా హమ్మయ్య అనుకుని కళ్ళు మూసుకుంది .
"మమ్మీ  ! నా కొక డౌట్ ... నువ్వు క్లియర్ చేయగలవా !
చెప్పు నాన్నా ?
"మరీ మరీ ..నాకు డాడ్ ఏడీ ? ఎక్కడ ఉన్నాడు ?" పక్కల్లో బాంబ్ పడినట్టు ఉల్కిపడి లేచి కూర్చుంది.
"చాలా మంది పిల్లలకి డాడ్ ఉండడు  వేదా , నువ్వు  చాలా ఇంట్రెస్ట్ గా  తెలుగు లో మహాభారత్ చదువుతున్నావ్ కదా ! అందులో పాండవులకి పాండు రాజు తండ్రి.  కానీ  దేవతలా ద్వారా కుంతీకి ముగ్గురు కొడుకులు, మాద్రి కి ఇద్దరు కొడుకులు పుట్టారు కదా ! అట్లా అనుకో .. నువ్వు కూడా అలాగే పుట్టావ్ . డాడీ ఉంటాడు. కానీ కనబడడు "అంది.
"మా స్కూల్ లో చాలా మంది పిల్లలకి ,  నా ఫ్రెండ్స్ కి మన నైబర్స్ పిల్లలకి డాడ్ కనబడుతున్నాడు కదా !  వాళ్ళందరి డాడ్ చక్కగా స్కూల్ లో డ్రాప్ చేసి వెళతారు , గ్రౌండ్ లో ఆడుకుంటారు,షాపింగ్ కి తీసుకెళతారు. మనింట్లో డాడ్ ఎందుకు ఉండడు? నేనెందుకు డిఫ్ఫ్రెంట్ గా ఉండాలి ,  నాకు డాడ్ కావాలి అంతే " మారాం చేసాడు.
"నువ్వలా అడగకూడదు . నీకు మమ్మీ  ఉంది కదా, అది చాలదూ !"
"మరి ఊహా  మమ్మీ  కూడా మమ్మీ  అనే చెప్పావు కదా ! ఇద్దరు మమ్మీలు  ఉన్నారు కానీ డాడ్ లేడు అని మా ఫ్రెండ్స్  ఎగతాళి చేస్తున్నారు. నాకు డాడ్ కావాలి . డాడ్ కూడా మనింట్లో ఉండాలి " అన్నాడు  వేద గట్టిగా.
గుండెల్లో బండ పడినట్టు అయింది జనిత కి.
"సర్లే ! త్వరలో మీ డాడ్ ని తీసుకు వద్దాం. నువ్వు నిద్రపో , గుడ్ బాయ్స్ ఎప్పుడూ బేడ్ క్వొచ్చన్స్ వేయరు . నువ్వు గుడ్ బాయ్ వా/ బేడ్ బాయ్ వా ? ఎలా అనిపించుకోవడం నీకిష్టం చెప్పు ? అంది.
వేద మోహంలో అసంతృప్తి . అడిగిన ప్రశ్నకి సమాధానం దొరకలేదు . మమ్మీ  డౌట్ సరిగా క్లియర్ చేయలేదు . రేపు ఊహా మమ్మీ ని  అడిగి తెలుసుకోవాలి, ఆమైతే  జనిత మమ్మీ  లాగా ఎస్కేప్ అవదు,  అన్నీ వివరంగా చెపుతుంది అనుకున్నాడు . నెమ్మదిగా వేద నిద్రలోకి జారుకున్నాడు .
వేద వేసిన ప్రశ్నకి జనితకి నిద్ర పట్టలేదు ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసి వస్తుందని తెలుసు కానీ మరే ఇంత త్వరగా ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలేదు . బెడ్ పై నుండి లేచి వేద కి దుప్పటి కప్పి ఊహా రూమ్ ముందు నిలబడి డోర్ నాక్ చేసింది. ఊహ వచ్చి తలుపు తీసింది. ఊహా ! నిద్ర పోలేదా ?
"లేదు జనితా,  కొంచెం ఫీవర్ గా ఉంది ".
వచ్చి బెడ్ పై కూర్చుంది. వేదా నిద్రపోయాడా ?  "ఊ ..నాకు డాడ్ ఎవరూ అని అడిగాడు . అదివరకు కూడా అడిగాడు . ఏదో ఒకటి చెపుతూ వచ్చాను . రేపు నిన్ను కూడా అడగవచ్చు. అది చెపుదామనే వచ్చాను .
ట్వంటీ ఫస్ట్ సెంచరీ చివరికి వచ్చాం . సెక్స్ ఎడ్యుకేషన్ లేని దేశాన్ని మన దేశాన్నే చూసాను . రేపు స్కూల్ కి వెళ్ళి క్లాస్స్ టీచర్ తో మాట్లాడి రావాలి . ఆమె ఒకసారి కలవమని కాల్ చేసి చెప్పారు. వేద తోటి పిల్లలతో ఎక్కువగా గొడవ పడుతున్నాడట.  అలాగే చిల్డ్రన్స్  సైక్రియాటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి."
" అన్నీ నువ్వే నిర్ణయించుకుని చెప్పేసావుగా! నేనేమన్నా హెల్ప్ చేయాలా ?"
"నో నో ..నేను చూసుకోగలను"
 "జనితా ! నాదొక అడ్వైజ్.  వేదని సైక్రియాటిస్ట్  దగ్గరకి  తీసుకు వెళ్ళడం దండుగ అనిపిస్తుంది .తనొక ఇన్సేమినేషన్  బేబీ అని చెప్పేస్తే ఏమవుతుంది?
ఎప్పటికైనా  నిజం తెలియాలి కదా ?
అవన్నీ తెలియడం అవసరమని నేననుకోవడంలేదు. డాడ్ కావాలని కూడా అడుగుతున్నాడు . చుట్టూ ఉన్న పిల్లలకి తండ్రి ప్రత్యక్షంగా కనబడటం చూస్తున్నాడు కదా ! ఇప్పుడెవరినయినా   తీసుకుని వచ్చి తండ్రిగా పరిచయం చేయాలేమో, అదొక న్యూసెన్స్ నాకు  ? అంటూ లేచి నిలబడి  నువ్వు పడుకో, గుడ్ నైట్ అని, నీ కార్డ్ ఇస్తావా ? మనీ కావాలి  అంది .
కార్డ్ ఇస్తూ .."ఈ సారి మనీ చాలా తక్కువగా ఉన్నాయి జనితా, ఇక నుండి ప్రతి నెలా కూడా ఇలాగే ఉంటాయి. నేను ప్లాట్ తీసుకున్నాను. దానికి  మనీ కట్ అయిపోతాయి"
"అదెలా ... ఊహా !   నాకు మాట మాత్రం చెప్పకుండా అలా ఎలా ప్లాన్  చేసావ్ ? మనమిప్పుడు ప్రతి నెలా చాలా ఇబ్బంది పడాలి .  అయినా ఇప్పుడు నీకు ప్లాట్ ఎందుకు ? " విసుగ్గా అంది .
"ఏమో ఎలాగోలా నువ్వే మేనేజ్ చేసుకో ! నాకు జాబ్ వచ్చి పదేళ్ళు అయింది . ఇంతవరకూ కొద్దిపాటి ఆస్తి కూడా లేదు నాకు,గోల్డ్ కూడా లేదు. ఇప్పుడన్నా సేవ్ చేసుకోకపోతే కష్టం అనీ" ...
"నీకు ప్రత్యేకంగా కావాలని నీకెందుకు అనిపించింది .. మనిద్దరిలో ఎవరికీ ఉన్నా నీది కాకుండా పోతుందా ? నేను నువ్వూ అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావ్ కొత్తగా ".
"కొత్తగా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు జాగ్రత్త పడాలని అనిపిస్తుంది .కదా "
"ఏం తెలుసుకున్నావ్ ? నీకు వేరుగా ఎస్సెట్ ఏర్పరుచుకోవాలని అనుకున్నావంటే ఇదేదో సీరియస్ విషయమే, చెప్పు ఏం తెలుసుకున్నావ్ ?" ఎదురుగా వచ్చి కూర్చుని కళ్ళలోకి సూటిగా చూసింది.
నువ్వు .. ఆ షైనీ తో చాలా క్లోజ్ గా ఉంటున్నావ్ . ఆమె ఎక్కువగా ఇక్కడికి వస్తుందని మీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు . నువ్వు అలా నన్ను మోసం చేస్తావని నేననుకోలేదు . నన్నునిర్లక్ష్యం చేస్తున్నావ్ , అలాగే వేద ని కూడా నా దగ్గరికి రానివ్వడం లేదు . వాడు నాతో  ప్రేమగా ఉండటం ఓర్చుకోలేకపోతున్నావ్".
"రెండూ నిజమే ! ఈ విషయంలో అబద్దం ఆడాల్సిన అవసరం నాకు లేదు . నేను షైనీ  క్లోజ్ గా ఉంటే నీకెందుకు అభ్యంతరం? మనమేమీ మేరేజ్ బాండ్ వ్రాసుకోలేదు . నీతో లైఫ్ లాంగ్ ఉంటానని కూడా ప్రామిస్ చేయలేదు . నేను చేసిన మోసం ఏముంది ఇందులో ?"
"నువ్విలా అంటావని  నాకు తెలుసు .  అచ్చు  స్త్రీ-పురుష వివాహంలో ఎలాగైతే పురుషుడి ఆధిపత్యం ఉంటుందో అలాంటి ఆధిపత్యమే నువ్వు చూపుతున్నావ్ . ఇద్దరం ఇష్టపడ్డాం. పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా వాళ్ళకి దూరంగా ఇలా  ముంబయిలో బ్రతుకుతున్నాం. నీకు తల్లిని  కావాలనిపిస్తుంది అన్నావ్. అడాప్ట్ చేసుకుందాం అంటే .. ప్రెగ్నెంట్ అయ్యాననే  ఫీలింగ్, బిడ్డని మోయాలనే కోరిక ఉందన్నావ్ . నాకు  తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నావ్ నువ్వెక్కడ బిడ్డని కేరీయింగ్ చేయగలవంటూ జాలి చూపిస్తూనే  ఆస్తమా ఉందని జీన్స్  ద్వారా పుట్టే పిల్లకి వస్తాయని నువ్వే ప్రెగ్నెంట్ కావడానికి నిర్ణయించావ్. నువ్వే కన్నావ్ . రాత్రుళ్ళంతా నేను వేద ని కనిపెట్టుకుని ఉండటం , నువ్వేమో రాత్రుల షిఫ్ట్ ఉన్న జాబ్ లో ఉంటూ పగలు రెస్ట్  తీసుకోవడం  నేనేమో రాత్రింబవళ్ళూ చాకిరీ చేయడం ... నువ్వేమో నీ పేరున ఆస్తులు అమర్చుకోవడం, ఆఖరికి వేద స్కూల్ రిజిష్టర్ లో తల్లిగా నీ పేరే వ్రాయించుకున్నావ్.  బిడ్డ, ఆస్తులు, సుఖం అన్నీ నీకు. కష్టంమాత్రం నాకు. పైగా నాపై మోజు తీరిపోయింది నీకు . కొత్త స్నేహాలు మొదలెట్టావ్ . వేద నాకు దగ్గరవకూడదని కూడా ప్రయత్నం చేస్తున్నావ్. నిన్నెలా అర్ధం చేసుకోవాలి.
"నువ్వు అతిగా ఏదేదో ఊహించుకుంటున్నావ్ . నిన్ను నేను మోసం చేస్తానా ? అంత మోసం చేసే  దానిగా కనిపిస్తున్నానా  చెప్పు ? అంటూ లాలనగా  దగ్గరికి తీసుకుంటూ అడిగింది .
 జనితని  ప్రక్కకి నెట్టేసి .. కిటికీ దగ్గరకెళ్ళి  నిలబడి "జనిత  ఆస్తులన్నీ తన  పేరునే అమర్చుకుంటుందని . నీకంటూ ఒక్క రూపాయి అన్నా దాచుకున్నావా"  అని మా అమ్మ  అడిగిందాకా .. నాకా ఆలోచనే రాలేదు.  ప్లాన్డ్ గా పదేళ్ళలో సేవింగ్స్ అన్నీ నీ పేరు మీద ఎస్సెట్ గా మార్చుకున్నావ్ .  నాకేం ఇచ్చావ్ ?"
"ఓహ్ .. ఇదంతా మీ అమ్మ నీకెక్కిస్తున్న ద్వేషమన్నమాట. ఆమెకి మొదట నుండి మన సంబంధం ఇష్టం లేదు. ఈ విధంగా నీ మైండ్ పొల్యూట్ చేస్తుంది.  పేరెంట్స్ తో మాట్లాడకూడదని అనుకున్నాం కానీ ఆ రూల్ ని నువ్వు బ్రేకప్ చేస్తున్నావ్, నాకిది నచ్చలేదు "
 "మన విషయం వదిలేయ్ ! వేద కి ఏం చెపుదామనుకుంటున్నావ్ ,  ఏం చెప్పినా క్లారిటీ ఉండాలి . నన్ను అడిగాడు నాకు  మీ ఇద్దరూ అమ్మలైతే నాన్నఎవరు  అని అడిగాడు  మేమిద్దరం ఫ్రెండ్స్ .. మేమిద్దరం కలిసి ఉంటూ నిన్ను పెంచుకుంటున్నాం అని చెప్పాను . నువ్వేమో నా పొట్టలో నుంచి పుట్టావ్ అని వాడికి చెప్పావ్ . పైగా నువ్వే అసలు మమ్మీ వి ఊహా మమ్మీ కేర్ టేకర్ లాంటిది అని చెప్పావంట. ఆఖరికి నన్ను కేర్ టేకర్ ని చేసావ్ " దుఖాన్ని బయటకి రానీయకుండా అదిమిపెట్టింది ఊహ .
"షటప్ ఊహా !   నువ్వూ, వేద కలిసి .. నా మైండ్ తినేస్తున్నారు ... మీ ఇద్దరూ ఎలాగైనా చావండి." దిండుని తీసుకుని ఊహ మీదకి విసిరి కొట్టి రూమ్ నుండి బయటకి వెళ్ళిపోయింది.
ఊహ కి చాలా తేలికగా అనిపించింది . ఎన్నాళ్ళుగానో  లోపలున్నది అంతా కక్కేసాక   మనసుకి కల్గిన జ్వరం తగ్గిపోయినట్లు అనిపించింది . మార్నింగ్ మాములుగానే డ్యూటీకి వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి ... వేద స్కూల్ నుండి ఇంటికి వచ్చేసి హోం వర్క్ చేసుకుంటున్నాడు . జనిత  మమ్మీ  స్నాక్స్ చేసి ఇవ్వకుండానే ఆఫీస్ కి వెళ్ళి పోయింది అన్నాడు.
బేగ్ అక్కడ పడేసి ప్రెష్ అవకుండానే త్వర త్వరగా స్నాక్స్ చేసి ఇచ్చి ..తర్వాత ప్రెష్ అయి వచ్చి కాఫీ కలుపుకుని వచ్చి వేద ముందు కూర్చుని  జనిత మమ్మీ స్కూల్ కి వచ్చిందా .. అని అడిగింది . స్కూల్ కి రాలేదు కానీ నీకో లెటర్ ఇమ్మంది అంటూ బేగ్ లో నుండి లెటర్ తీసి ఇచ్చాడు. లెటరా .. ఆశ్చర్యంగా చూస్తూ అందుకుంది . చదివిన ఆమె ముఖంలో త్వర త్వరగా రంగులు మారిపోయాయి . జనిత రూం లోకి వెళ్ళి  చూసింది . అంతా ఖాళీగా కనబడింది. నిస్సత్తువగా అక్కడే బెడ్ పై కూలబడి పోయింది .
 " ఏమైంది  మామ్ ? "వేద కుదిపి అడిగేంతవరకూ తనే స్థితిలో ఉందో అర్ధం కానంత అయోమయంలో ఉంది ఆమె .
"ఏం లేదు ... నాన్నా ! జనిత మమ్మీ  ప్రమోషన్ పై లండన్ వెళ్ళింది. అదే వ్రాసింది లెటర్ లో "
"నాకు చెప్పకుండానే వెళ్ళింది మమ్మీ"  వెక్కుతూ అన్నాడు .
"త్వరగానే వచ్చేస్తుంది.  మమ్మీకి ఇలాంటి టూర్ లు అలవాటేగా ! నీకు  నేనున్నాను కదా!   అంటూ దగ్గరికి తీసుకుంది కానీ  జనిత మమ్మీ ఇక ఎప్పటికి రాదని, షైనీతో కలిసి ఎక్కడికో ఎగిరిపోయిందని చెప్పలేకపోయింది.
సెవెన్ థర్టీకి తెలుగు క్లాస్ కి తీసుకువెళ్ళింది. పిల్లలకి క్లాస్ చెపుతూ ఉంటే  వింటూ రిసెప్షన్ లో  కూర్చుండి  పోయింది.  మధ్యలో పిల్లలకి ఫిఫ్టీన్ మినిట్స్ టెస్ట్ పెట్టి టీచర్ బయటకొచ్చింది.
"ఏమిటీ ఊహా !  అంత డల్ గా ఉన్నావ్? " అని పలకరించింది. ఆమెతో  ఊహ కి క్లోజ్నేస్ ఎక్కువే. జనిత విషయం చెప్పింది.
"అయ్యో ... ఇప్పుడెలా నీకు?"  అనడిగింది. "జాబ్ ఉంది కాబట్టి కొద్దిగా పర్లేదు కానీ వేదని కూడా చూసుకోవాలి కాబట్టి ఆర్థికంగా ఇబ్బందే ! ఇలా ఉంటుందని నేనసలు ఎప్పుడూ ఊహించలేదు"  అంది దిగులుగా .
 "ఒకప్పుడు మన అమ్మల కాలంలో పురుషుడు చేసినట్లు చేసింది జనిత. నువ్వు కూడా అంత గుడ్డిగా నమ్మాల్సింది కాదు" అంది సానుభూతిగా .
"అసలు చిక్కంతా వేద ని పెంచడంలోనే  ఉంది. ఏం చేయాలో  ఏం చెప్పాలో ? చాలా ప్రశ్నలే వేస్తున్నాడు.  చెప్పినా అర్ధం కాని వయసు "
"నేను ఒకటి చెపుతాను ఏమీ అనుకోవు కదా !"
"చెప్పండి టీచర్,  మీ అడ్వైజ్ కూడా చాలా అవసరం నాకు "
"నచ్చినట్లు బ్రతికే హక్కు ఉన్నంత  మాత్రాన, లైంగిక స్వేచ్చ వచ్చినంత మాత్రాన  స్త్రీ పురుషుల మధ్య  ఉండే సహజమైన సంబంధం రాణించినంతగా స్వలింగ సంపర్కాలు, సహజీవనాలు రాణించవు. పిల్లలు కావానుకుంటే తండ్రిని ఎన్నుకోవడం.  తండ్రి ఎవరో సమాజానికి పరిచయం కాకుండా  గుప్తంగా  ఉంచడమూ , పిల్లల ఆలోచనలు, మానసిక స్థితి  ఇవన్నీ ఆలోచించకుండా ముందుకి వెళ్ళిపోయారు మీరిద్దరూ . ఇప్పుడు జనిత తనదారి తను చూసుకుంది."
"పదేళ్ళ కాలం తనతోనే లోకంగా బ్రతికాను. పిచ్చిగా ప్రేమించాను. చాలా ఈజీగా వదిలేసుకుని వెళ్ళిపోయింది, వేద కూడా తనకి అడ్డనుకుంది" బాధగా కళ్ళు తుడుచుకుంది.
 "బయలాజికల్ నీడ్స్ విషయంలో మానవుడికి   మిగతా జీవులకి తేడా వుంది కదా ! విచక్షణ కూడా ఉంది.  సహజమైన మానవ సంబంధాలన్నీ ప్రకృతి పురుషుడు లాంటివి .  నిజానికి  పురుషులు అచ్చులు లాంటి వారు . స్వరం కలవాడు.  స్త్రీలు  హల్లులు లాంటి వారు . అచ్చుల సాయం లేనిదే హల్లులు పలక లేనట్లే పురుషుల సాయం లేనిదే స్త్రీలు ముందుకెళ్ళలేరు. పరస్వరం కలవాల్సిందే ! స్వరాలూ రెండు రకాలు ఉన్నట్టు పురుషుడు హ్రస్వములు లాగా  బిడ్డ పుట్టుకకి కారణంగానే మిగిలిపోవచ్చు. దీర్ఘములు లాగా దీర్ఘంగా కొనసాగవచ్చు .  భాషైనా , బతుకైనా పరస్వరం జతకూడనిదే అందగించదు.
"పర స్వరం ! యెస్..  పరస్వరం కావాల్సిందే "అంది ఊహ .
"నేను చెప్పింది అర్ధమైందా? ఏదో  నాకలవాటైన భాషలో, రీతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను" అంది టీచర్ .
ఊహ నవ్వి .. "అక్షరాలలో భావాన్ని బాగానే అర్ధమయ్యేవిధంగా చెప్పారు  టీచర్ ".
"మానవ సమాజం  క్రమపద్దతిలో సాగిపోవాలంటే తల్లి తండ్రి ఇద్దరూ అవసరం . మీలాంటి వాళ్ళు   నేనిలాగే కంటాను, ఇలాగే పెంచుతాను అని అనవచ్చు  కానీ, ఒంటరిగా పిల్లని పెంచడం ఒంటరిగా పిల్లని కన్నంత తేలికకాదు. ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్య కంటే భిన్నమైన సమస్య ఇది. లక్షాధికారైనా లవణమన్నమే తింటాడన్నది ఎంత నిజమో, పుట్టిన ప్రతి బిడ్డా తన పుట్టుకకి కారణమైన తండ్రిని  చూడాలనుకుంటాడు. అలా అడగకుండా ఉండటమంటే ఎంతో క్లారిటీ రావాలి. అది మీరు  అనుకున్నంత తేలిక కాదు"
" వేదని నేను  పెంచి పెద్ద చేస్తున్న కాలంలోనే జనిత రాదనీ, తన బిడ్డపై తనకి హక్కులు ఉన్నాయని అనదని గేరంటీ ఏమీ లేదు. చాలా సమస్యలున్నాయి, కానీ వాటిని ఫేస్  చేయడానికి సిద్దంగానే ఉన్నాను . వేదని మాత్రం  ఎట్టి  పరిస్థితుల్లోనూ  వొదులుకోను " స్ధిరంగా పలికింది ఊహ .
"మంచి నిర్ణయం" భుజం తట్టి మెచ్చుకుని ఆమె క్లాస్ కి వెళ్ళిపోయింది .
రాత్రికి తనని వాటేసుకుని పడుక్కున్న  వేద ని చూస్తూ .. ఇప్పుడు వీడికి ఒక నాన్నని వెదకాలి. చాలా కష్టం అయినా వెతకాలి.  దొరుకుతాడో లేదో, తన వయసు థర్టీ టూ యేగా,  ట్రై చేయాలి. తనవంక ఆరాధనగా చూసే శ్యామ్  మనసులో మెదిలాడు .
(అడుగు వెబ్  సాహిత్య మాస పత్రిక ఆగష్టు మాసం 2017 సంచికలో ప్రచురితం )