7, నవంబర్ 2013, గురువారం

సంస్కారం

సంస్కారం

ప్రొద్దునే వాకింగ్ ముగించుకుని వచ్చి కారిపోతున్న  చెమటని  తుడుచుకుంటూ ఇంటిముందు ఇష్టంగా పెచుకున్న పచ్చిక పై పారిజాతం చెట్టుకు ప్రక్కన  విశ్రాంతిగా వాలి  రాలిపడిన పూల నుండి పరిమళాలను ఇష్టంగా  ఆస్వాదిస్తూ  అలవాటుగా పేపర్ కోసం వెతికాను

రోజూ అదే సమయానికి సరళ ఒక మంచి నీళ్ళ బాటిల్,ఆ రోజు దినపత్రికలని తీసుకు వచ్చి అక్కడ పెట్టి ఉండేది. ఇంకొక పావు    గంట తర్వాత సువాసలు వెదజల్లే కాఫీ  కప్పుతో పాటు పోటీపడుతూ  "అమ్మ "  దేవుడి ముందు వెలిగించిన ఊదొత్తుల  పరిమళం కలగలిపి  తన నాసికా రంధ్రాలను తాకుతూ  హాయిగా అనిపించేవి.

ఈ రోజు పావు గంట దాటినా కాఫీ కాదు కదా, మంచినీళ్ళు కూడా బయటకి రాలేదు.

"సరళా " అని పిలుస్తూ లోపలకి వెళ్లాను. ఇంటి లోపల ఎక్కడా సరళ కనపడలేదు . ఇంకా నిద్ర లేవలేదా ఏమిటీ? తనకి అనారోగ్యమేమి లేదు కదా ! అనుకుంటూ బెడ్ రూం లోకి వెళ్లి చూసాను . అక్కడ బెడ్ ఖాళీగా ఉంది .

"అమ్మా." . అంటూ పిలుస్తూ  క్రిందకొచ్చాను .అమ్మ కనబడలేదు.

 అంతలో అనిరుద్ద్  .. వాడి రూం లో నుండి బయటకి వచ్చి .. "నాన్నా! అమ్మా,నానమ్మ ఇద్దరూ రఘు  అంకుల్ వాళ్ళింటికి వెళ్ళారు, రఘు అంకుల్ వాళ్ళ అమ్మ అదే తులసమ్మామ్మ చనిపోయారంట . మీరు రాగానే చెప్పమన్నారు, వెంటనే అక్కడికి రమ్మన్నారు "  అని చెప్పాడు.

"అరే ! ఎప్పుడు జరిగింది .. ? ఎవరు చెప్పారు ..విషయం  కన్ఫర్మ్ గా నీకు తెలుసా అనిరుద్ద్ " .అని అడిగాను

"మీరు అలా  వాకింగ్ కి వెళ్ళగానే కాల్ వచ్చింది . తులసమ్మామ్మ ని చూసుకునే హోం నర్స్ కాల్ చేసారు.  అమ్మ, నానమ్మ వెంటనే వెళ్ళారు . మీరు మొబైల్ తీసుకువెళ్ళలేదు కదా మీకెలా చెప్పాలో తెలియలేదు"  అని చెప్పాడు .

"సరే నేనిప్పుడే వెళతాను"  అంటూ  నా మొబైల్ తీసుకుని సరళ కి కాల్ చేసాను .

"సరళా .. నేను విన్న విషయం నిజమేనా "? ఇంకా నమ్మలేనట్లుగా అడిగాను .

 "అవునండీ, మన కాలనీలో డాక్టర్ కూడా వచ్చి చూసారు. ఆవిడ చనిపోయారు" అంది

కొద్ది క్షణాలు మౌనం

నేను రఘు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను . ఇంకా వాళ్ళ దగ్గర  బంధువులందరికీ  చెప్పాను మీరు త్వరగా రండి " అంది .

నేను త్వర త్వరగా  డ్రస్ మార్చుకుని రఘు  కి ISD  కాల్ చేసి మాట్లాడుతూనే ఇంటికి చేరుకున్నాను. రఘు చెపుతున్నాడు "నేను సండే  కి  కాని రాలేను  కృష్ణా ! మళ్ళీ నీకు శ్రమ ఇస్తున్నాను  అక్కడ ఏర్పాట్లు అన్నీ నువ్వే చూడాలి ప్లీజ్ !" గొంతులో దుఃఖాన్ని  అణుచుకుంటూ చెప్పాడు .

"రఘు ! ఆ  విషయం ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా ! అన్నీ చూసుకునేందుకు  నేనున్నానుగా !  నువ్వేమి వర్రీ అవకు.   ముందు టికెట్స్ సంగతి చూసుకో, మళ్ళీ నేను కాల్ చేస్తూనే ఉంటాను ." అని చెపుతూ  లోపలకి వచ్చాను.  అప్పటికే మా కాలనీ వాసులు కొందరు  వచ్చి ఉన్నారు. సరళ పొన్స్ చేస్తూ బిజీ గా కనిపించింది .

మంచం మీదే ప్రాణం పోయింది ఇంకా అలా మంచం మీదే ఉంచారే ! కొందరి ప్రశ్న. "బాక్స్ కోసం ఫోన్ చేసాము అయిదు నిమిషాలలో బాక్స్ వస్తుంది . బాక్స్ లో మార్చుతాం కదా అని అలాగే ఉంచేసామండీ " సరళ  చెపుతుంది.

ఇంకొకరు అదే ప్రశ్న వేయకుండా నేను లోపలి నుండి చాప ఒకటి తెచ్చి క్రింద పరచి దానిపై ఒక దుప్పటి పరచి ఇంకో ఇద్దరి సాయం తో  తులసమ్మ పిన్ని బౌతికకాయం ని  చాప పై పడుకోబెట్టాను . ఆమె ప్రక్కనే నేలమీద చతికిల బడి కూర్చున్నాను . చనిపోయే ముందు కూడా ఆమెలో ఏదో బాధ మొహంపై అలాగే నిలిచిపోయి ఉంది . నా కళ్ళల్లో కన్నీరు జల జలా రాలింది . ఆ చేతులతో కొడుకుతో సమానంగా తినిపించిన ప్రేమ ముద్దలు గుర్తుకు వచ్చాయి జీవితమంతా బాధ పడటానికే దేవుడి దగ్గర అగ్రిమెంట్ రాసుకుని వచ్చి ఉంటుందేమో అన్నట్టుగా  ఉండేది. ఆమె ముఖంలో అప్పుడప్పుడు కనిపించే చిన్న చిరునవ్వు మాత్రం కొడుకు కోసమే దాచుకున్నట్లుండేది.  గట్టిగా నోరు విప్పి మాట్లాడటం  తెలియదు,అందరకి తలలో నాలుకలా ఉండేది తులసమ్మ పిన్ని .

రఘు వాళ్ళ నాన్న నాకే కాదు రఘుకి కూడా  అంత బాగా తెలియదు రఘుకి మూడేళ్ళు న్నప్పుడు చనిపోయాడు అంతకు ముందు కూడా ఎప్పుడూ అనారోగ్యంతో మంచంపై ఉండేవాడట  రఘు వాళ్ళ నాయనమ్మ ఎప్పుడు తులసమ్మ పిన్నిని తిడుతూ ఉండేదన్నది మాత్రం  బాగా జ్ఞాపకం ఉంది .

 "నా కొడుకు శుభ్రంగా ఉన్నప్పుడే ఈ ముదనష్టపుది తాళి , బొట్టు గాజులు తీసేసి విధవ ముండ లాగా తయారయింది. పూజ పునస్కారం ఏమిలేకుండా  కొంపని కిరస్తానీ కొంప జేసింది. సిరింటదు  కాని సీద్రం అబ్బుద్ది అని  పెద్దలు ఊరికే అనలేదు . ఈ దేష్ట మొహం చూస్తూ ఉండలేకనే  నా కొడుకు  చచ్చాడు " అని తిడుతూ ఉండేది.

పుట్టెడు అప్పులు, అత్తా మామలు, ఆదరణ లేని పుట్టిల్లు. పొలం అంతా  అప్పుల వాళ్ళు కట్టుకు పోగా నాలుగెకరాల మెట్ట  చేను పెట్టుకుని వ్యవసాయంతో ఎదురీదింది. గొడ్ల  కాడి పని,  నీళ్ళు తోడే పని, చేలో పని ఆ పని ఈ పని మధ్య   ఒళ్ళు   అరగ దీసుకుని కట్టేలా బండబారి పోయి ఉండేది.

రఘు వాళ్ళిల్లు  చెరువు  కట్ట ప్రక్కనే  మంచి నీళ్ళ బావిని ఆనుకుని ఉండేది . ఊరందరికీ మంచి నీళ్ళ బావి అదే అవడంతో .అందరికి తులసమ్మ పిన్ని పరిచయం ఉండేది  ఎవరు మాట్లాడినా క్లుప్తంగా నాలుగు మాటలు మాట్లాడేది ఎక్కువ సమయం బైబిల్  చదువుకుంటూ, ప్రార్ధన చేసుకుంటూ కనబడేది   .

మా ఊరి  బడి, గుడి, లైబ్రరీ , కోపరేటివ్ బాంక్ అన్నీ ఒకే చోట ఉండేవి. నేను రఘు  అక్షరాలు దిద్దుకుంటూ తాయిలాలతో పాటు  మనసులో మాట  పంచుకుంటూ  పదిహేనేళ్ళ పాటు  ఇద్దరం కలిసే చదువుకున్నాం.  రఘు నాతొ పాటు మా ఇంట్లో చొరవగా తిరగడం వల్ల  మా ఇంట్లో ఆచారాలు, పూజలు, అమ్మ చేసే వ్రతాలు చూసెళ్ళి  "మన ఇంట్లో అలా ఎందుకు చెయ్యం ? వాళ్ళింట్లో దేవుడు గూడు ఉంది మనం అలా దేవుడు గూడు పెట్టుకుందాం పూజ చేసుకుందాం" అని తులసమ్మ పిన్నిని అడిగేవాడు .

నేను రఘు పక్కనే ఉండేవాడిని కాబట్టి తులసమ్మ పిన్ని ఏం  చెపుతుందా..  అని ఆసక్తిగా చూసేవాడిని

"వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు . మన  దేవుడికి అలాంటి పూజలు చెయ్యవసరం లేదు ఇదిగో ఈ బైబిల్ చదువుకుని ప్రార్దిస్తే చాలు ఈ లోకాలని ఏలే దేవుడు ఆయనొక్కడే . ఆయనే అన్నీ చూసుకుంటాడు" అని చెప్పీది

"అమ్మా! మనం కమ్మ వాళ్ళమే కదా ! "అడిగేవాడు రఘు.

"అవును " అనేది

"అయితే కమ్మ వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామీ, రాముడు,కృష్ణుడు ,శివుడు ఇలాంటి దేవుళ్ళు  ఉన్నారు  కదా! మన  వాళ్ళందరూ శివాలయం కి, రామాలయం కి వెళుతుంటే  నువ్వు  ఈ బైబిల్,  కనబడని దేవుడు మన దేవుడు అంటావేమిటి ? నాయనమ్మ తాతయ్య కూడా రామా కృష్ణా అంటున్నారు. నువ్వే  ఏసయ్యే దేవుడంటూ అందరిలాగా ఉండకుండా వేరేగా ఉంటన్నావు ! నాకు నువ్వు నచ్చలేదు, నన్ను అంటుకోబాకు ".అని దూరంగా పారిపోయేవాడు .

తులసమ్మ పిన్ని వాడిని దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నించేది వాడు ఇంకా దూరంగా పారిపోతూ  "నువ్వు నాకు అమ్మవే  అయితే, మనం  కమ్మాళ్ళం  అయితే ఊరి చివర వాళ్ళు మా దేవుడు అని చెప్పుకునే వాళ్ళ దేవుడిని ప్రార్ధించడం ఆపేయి " అని  కోపంగా చెప్పేవాడు . వాడి కోపంలో ద్వేషం ఉండేది .. ఆ ద్వేషం బలీయంగా ఉండటం మూలంగానేమో  క్రమం తప్పకుండా  ప్రతి రోజూ గుళ్ళోకి వెళ్ళేవాడు . దేవుడుకి దణ్ణం పెట్టుకునేవాడు .

"ఆ తులసమ్మ కిరస్తానీ మతం పుచ్చుకుంటే పుచ్చుకుంది కానీ .. పిల్లడు మాత్రం గుడికి వస్తున్నాడు .. ఏ నీరు ఆ నీరేమ్మటే  పారతాయి కాని ఏరే నీళ్ళు కలుస్తాయా ఏమిటీ ?" అనే వారు కొందరు .

ఏడవ  తరగతి చదువుతున్నపుడు  రఘు కి వాళ్ళ అమ్మ మీద మరింత ద్వేషం పెరిగింది  మా వూరి చివర సుదర్శనం మాస్టారు ఉండేవారు . ఆయన స్కూల్ మాస్టర్. అప్పుడప్పుడు విమానం ఎక్కి విదేశాలకి వెళుతూ ఉండేవాడు యేసు క్రీస్తు గురించి ఎప్పుడూ చెపుతూ ఉండేవాడు . రఘు ఆయన్నీ విపరీతంగా ద్వేషించేవాడు. మన మతాన్ని దేవుళ్ళని వదిలేసి యేసు క్రీస్తే ప్రభువని చెప్పడం నాకు నచ్చలేదని ఆయనతో గొడవ పెట్టుకునే వాడు . ఆయన కూతురు భర్త పాస్టర్ గా పనిచేసేవాడు . సువార్త సభలు పెట్టి మైకులు పెట్టి వారమేసి  రోజులపాటు ప్రార్ధనలు ,బైబిలు వాక్యాలు , కొత్తగా మతంలోకి చేరిన వారి అనుభవాలు వినిపించే వారు . మా వూరు చిన్నది అవడం వల్ల ఆ  సభలు మా చెవుల్లో రొద  పెడుతున్నట్లు ఉండేవి . ఆ సభలు కూడా  సంక్రాంతి పడక్కి ముందు పెట్టేవాళ్ళు . వెంకటేశ్వర స్వామీ గుళ్ళో వచ్చే సుప్రభాతం, తిరుప్పావై వినబడకుండా .. కర్ణ కఠోరంగా  ఆ పాటలు వినాల్సి రావడం రఘు కే  కాదు మా వూర్లో చాలా మందికి అసహనంగా ఉండేది  ఈ ఊరుని భ్రష్టు  పట్టిస్తున్నారు ఈ పాస్టర్ ని ఈ వూరు నుండి వెళ్ళగొట్టాలి అనుకున్నారు కూడా . వాళ్ళలా  అనుకున్న కొద్దీ ఆ ఫాస్టర్ ఊర్లో నిట్టాడిలా పాతుకు పోయాడు

 ఆ పాస్టర్ .. పేద పిల్లలందరిని చేరదీసి  వాళ్ళని  పనులకి వెళ్ళకుండా బడికి వెళ్లి చదువుకుంటే నెలకి ఒకొక్కరికి 150 రూపాయలు వచ్చే ఏర్పాటు చేస్తానని ఇంటింటికి తిరిగి చెప్పడం మొదలెట్టాడు. 150 రూపాయలు అంటే తక్కువేమీ కాదు మూడు బస్తాల ధాన్యం  ధర ఆ డబ్బు మీద ఆశ తో . మా వూర్లో ఊరిచివర వాడలో వాళ్ళే కాదు మా వాళ్ళ   పిల్లల పేర్లు కూడా వ్రాయించారు . వాళ్ళందరి పేర్ల మీద బాంక్ అకౌంట్ తెరిపించి  ప్రతి నెలా వారి  అకౌంట్ లోకే  డబ్బులు జమ అయ్యే  ఏర్పాటు చేసాడు పాస్టర్ గారు. డబ్బులు ఊరికే ఇప్పిస్తున్నాడు కాబట్టి ఆయన "దేవుడంటి " వారు అయిపోయారు . ఆయన స్కాలర్ షిప్ వచ్చే ఏర్పాటు చేసిన వారిలో "రఘు " కూడా ఉన్నాడు . రఘు వాళ్ళ అమ్మే వాడికి చెప్పకుండా ఆ పని చేసిందని వాడికి బాగా కోపంగా ఉండేది

" పేదాళ్ళకి సాయం చేస్తారు అంటే వాడి చదువుకి ఉపయోగపడతాయని రాయించాను  అంత  డబ్బు  ఎక్కడ నుండి వస్తుంది  పంట పండితే పండే లేక  పొతే లేయే ! పాడి గొడ్డు మీదే సంసారం నడవాలంటే  ఎట్టా జరుగుద్ది " తులసమ్మ పిన్ని  మాటల్లోనూ నిజం ఉండేది కాబట్టి  మరో మాట మాటాడటానికి అవకాశం ఉండేది కాదు  .

సంవత్సరానికి రెండు సార్లయినా రఘు కి తులసమ్మ పిన్నికి పెద్ద వాగ్వివాదమే నడిచేది . సువార్త సభలు పెట్టినప్పుడే విదేశాల నుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చేవారు . వారే మా వూర్లో పిల్లలందరికీ ఆర్ధిక సాయం చేస్తున్నవాళ్లని మా ఆంజనేయులు మాస్టారు చెప్పేవాళ్ళు . వాళ్ళు వచ్చినప్పుడల్లా నెలకి 150 రూపాయలు వచ్చే పిల్లలందరినీ హాజరు పరచి వారికి పరిచయం చేసేవారు . అలా పరిచయం చేయడానికి "రఘు " ని కూడా రమ్మనేవారు . ఆ స్కాలర్షిప్ డబ్బులు నాకొద్దు, నేను అక్కడికి రాను అని మొండి పట్టు పట్టేవాడు తప్ప తులసమ్మ పిన్ని ఎంతబతిమలాడినా వెళ్ళేవాడు కాదు . విదేశీ అతిధులు వచ్చిన ప్రతిసారి రఘుకి ఆరోగ్యం బాగోలేదనో .. బంధువుల ఇంటికి వెళ్ళాడనో సాకు చెప్పి వాడికి  బదులు తులసమ్మ పిన్నిని చూపేవారు .

తులసమ్మ పిన్ని కూడా అప్పుడప్పుడు చర్చి కి వెళ్ళడం మొదలెట్టింది . రఘు వాళ్ళ నాయనమ్మ,తాతయ్య మేము  బ్రతికుండగానే ఇంటావంటా లేని పనులు చేయడం చూస్తున్నాం . మనమేమిటి, మన కులమేమిటి ,మన సంప్రదాయం ఏమిటీ ? ఫలానా వాళ్ళ కోడలు వూరి చివర వాడల్లోకి వెళూతుందంటే ఎంత పరువు తక్కువ ?
రఘూ  ! మీ అమ్మ అలా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పరా అని రఘుని  సతాయించే వారు. మీ అమ్మ అలా చేస్తే ఇకపై దాని చేతి కూడు కూడా తినం . అని కూడా పంతం పట్టుకుని కూర్చున్నారు .

"అమ్మా ! నాయనమ్మ ,తాతయ్య ఏమంటున్నారో  విన్నావు కదా ! నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు గట్టిగా ఆదేశించాడు .

రఘు  అంత  గట్టిగా చెప్పడం చూసి ఇరుగు పొరుగు తులసమ్మ పిన్ని ని మందలించారు  తులసమ్మా !బిడ్డ నీ అంత అయ్యాడు వాడికి ఇష్టం లేదని చెపుతున్నాడుగా, ముసలివాళ్ళు ఇంటావంటా లేని  పనులని ఏడుస్తున్నారు, వాళ్లకి ఇష్టం లేని పనులు చేయడం ఎందుకు ?  ఈ వయసులో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు ?మానేయకూడదు ఆ ప్రార్ధనేదో ఇంట్లో చేసుకోరాదు అని మందలించారు

ఏమనుకుందో ఏమో తులసమ్మ పిన్ని  ఇక ఆ తర్వాత వూరి చివర వాడలో ఉన్న చర్చి వైపు వెళ్ళలేదు

పదవతరగతి అయిపోయి కాలేజీ చదువుకి బెజవాడ లయోలా కాలేజీలో చేరాము . ఆ కాలేజీలో చేరడం కూడా రఘు కి ఇష్టం లేదు. మా ఆంజనేయులు మాస్టారు వాడిని బాగా మందలించారు "ఈ కులం, మతం అన్నీ మన మధ్య మనం ఏర్పరచుకున్నవే ! నీకిష్టం లేకపోతే  ఆ మతం గురించి ఆలోచించకు నీకు నచ్చిన మతమే నువ్వు ఆచరించుకో .. మతాలకి సంబంధం లేని విషయం చదువు , అక్కడ మంచి అధ్యాపకులు ఉంటారు స్కాలర్ షిప్ లు వస్తాయి ,నువ్వు బాగా చదువుకోవాలంటే నీకున్న వ్యతిరేకత అంతా  మార్చుకుని ఆ కాలేజీలో చేరు " అని హితోపదేశం చేసాక .. అయిష్టంగానే నాతొ పాటు ఆ కాలేజీ లో చేరాడు.

ఫాస్టర్ గారు  స్కాలర్ షిప్లు ఏర్పాటు చేయడం వల్ల   మాతో పాటు మావూరి బీదబిక్కి పిల్లలు కూడా  ఉన్నత చదువులు చదువుకోవడానికి పట్నం రాగలిగారు. సువార్త సభలు  నిర్వహించడం వల్ల  తులసమ్మ పిన్ని లాగా చాలా మంది వారి బోధనలు వైపు ఆకర్షితులయ్యారు. అప్పుడే నాకొకటి అర్ధం అయింది . మనషులు సమస్యలలో ఉన్నప్పుడుఆ సమస్యలు తీరక ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి  తమని ఆదుకుంటాడనే  నమ్మకంతో ఉంటారు . తాము ఆ సమస్యలలో నుండి బయటపడలేనప్పుడు ఇంకొక దేవుడు ఆదుకుంటాడనే భ్రమలో మతం మారి అక్కడ నమ్మకం పెంచుకుంటారు తప్ప అది మనుషుల బలహీనత అని . ఆ బలహీనత ఆధారం చేసుకుని   మతమార్పిడి జరుగుతుందని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.  అయితే కొద్ది గొప్పో సేవా భావం కలవారు దైవం పట్ల నమ్మకం కలవారు, బలహీనులకి ఎంతోకొంత అండ ఉండి వారికి మంచి చేయాలని పాటుపడతారు అలాంటి  రెండో రకంకి చెందిన మనిషి కావడంతో మా వూరిలో ఫాస్టర్ గారిని అందరూ గౌరవించేవారు. కొత్త మతం పుచ్చుకున్న వారిని వ్యతిరేకించిన వారే  ఏ నీరు  ఆ నీరెంట నడవకుండా  పాత నీరులో కొత్తనీరు నిశ్శబ్దంగా కలసిపారుతుందని గ్రహించక తప్పలేదు

 పట్నంలో చదివేటప్పుడు రఘు కి డబ్బు  పంపడం కోసం  అవస్థ పడేది.  పంటలకి పెట్టుబడి పెట్టి  సరిగా  పంట చేతికందక, ముసలి వాళ్ళ ఇద్దరి రోగాలకి, చనిపోతే ఇద్దరి కర్మ కాండ లకి బాగానే అప్పు చేయాల్సి వచ్చింది .
 చేసిన అప్పుకి ఉన్న పొలమంతా  అమ్మితే  గాని బాకీ తీరదని  లేక్కలేసుకున్నాడు రఘు .

 "పూర్వికులు ఇచ్చినాస్తి. ఆ కొద్దిగా కూడా నిలుపుకోలేకపోతే ఎలాగురా..? నేను చదువు మానేసి ..ఏదో  ఒక ఉద్యోగంలో చేరతాను "అన్నాడు .

"ఈ నాలుగు నెలలాగు ఏదో  ఒకటి ఆలోచిద్దాం . ముందు నీ చదువు పూర్తి చేయి" అంటూ ఆంజనేయులు మాస్టారు  చెప్పారు .

ఒక నెలయ్యేసరికి ..  తులసమ్మ పిన్ని  రఘుకి ఒక ఉత్తరం వ్రాసింది ఇల్లు, ఇంటి స్థలం అమ్మేసానని ఆ డబ్బుతో అప్పులనీ తీర్చేసానని పొలం అమ్మనవసరం లేదని  ఇక ఏ దిగులు లేకుండా రఘు ని బాగా చదువుకోమని తానూ  ఇంటికి అవతల ఉన్న నాలుగు సెంట్లు స్థలంలో చిన్న తాటాకిల్లు వేసుకుని అందులో ఉన్నానని .. ఇక ఇబ్బందులు ఏమి లేవని అందులో సారాంశం .

మా ఇద్దరికీ ఆశ్చర్యం అనిపించింది. పాత ఇల్లు  అంత ఎక్కువ  రేటుకి ఎలా అమ్ముడయిందన్నసందేహం వచ్చింది    . ఇంతకీ ఎవరు కొన్నారొ ఆ ఇంటిని  అనుకున్నాం. కానీ మళ్ళీ  ఉత్తరాలలో ఆ సంగతి  గురించి మాట్లాడుకోవడం మర్చిపోయారు

మేము సంక్రాంతి సెలవలకి ఊరు వెళ్ళేటప్పటికి  రఘు  వాళ్ళింటి రూపు రేఖలే మారిపోయాయి.రోడ్డు మీదకి కనిపించే  ఇంటి చుట్టూ వెదురుబద్దలతో అల్లిన దడుల స్థానంలో  నిలువెత్తు ప్రహరీ గోడ కట్టేశారు ఇంటి మొత్తం కి చక్కగా రంగులు వేసారు . మిగిలిన ఖాళీ స్థలంలో రెండు మూడు రెల్లుగడ్డి తో కప్పిన చుట్టిళ్ళు  కనబడినాయి . ఇంట్లో నుండి బయటకి రావడానికి చక్కగా నాపరాళ్ళ దారి వేసారు .. ప్రహరీ గోడకి తలుపు పెట్టారు, ఆ తలుపు ప్రక్కనే గోడమీద రంగులతో రాసి ఉన్న అక్షరాలూ చూడగానే రఘు ముఖం నల్లబడి పోయింది  అక్కడ " ఏసు  సువార్త మందిరం " అని ఉంది

చెరువు కట్ట మీదగా గడ్డివాములు వేసే స్థలం లోకి వెళ్ళాడు .  అక్కడొక ఒంటి నిట్టాడి పాక వేసి ఉంది . గొడ్ల  పాకలో పనిచేకుంటుంది తులసమ్మ పిన్ని.  రఘుని చూడలేదు  ఆమె ముందుకు వెళ్లి  చేతిలో బట్టల బేగ్ ని ఆమె ముందు విసిరి కొట్టి  "ఈ ఇల్లు నిన్ను ఎవరు అమ్మమన్నారు ? చర్చి పెట్టడానికి నువ్వు ఇల్లు అమ్మావా? నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా ! అసలు ఇది నా ఇల్లు. నా ఇల్లు  అమ్మడానికి నీకేమి అధికారముంది ? కొనడానికి వాళ్ళకేమి అధికారముంది ? వెంటనే వాళ్ళని ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపొమ్మను " అని విరుచుకు పడ్డాడు .

ఇంట్లో  పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా గుడి అరుగులమీద కూర్చున్నాడు .

 "రఘు మా ఇంటికి వెళదాం రారా "అని బతిమలాడి మా ఇంటికి తీసుకు వచ్చాను . సాయంత్రం వాడి చుట్టూ  ఊళ్ళో  వాళ్ళు చేరి తలా ఒక మాట అనడం మొదలెట్టారు .

" అదివరకి ఊరి చివర చర్చి ఉండేది మీ అమ్మ ఇప్పుడు  వాళ్లకి ఇల్లు అమ్మి ఊరి మధ్యకి చర్చి ని తీసుకొచ్చి ఊరంతటిని సంకరం చేసి వదిలిపెట్టింది   ఎలాగైనా ఆడ మనిషి - ఆడ పెత్తనం అనిపిచ్చుకుంది . అమ్మేటప్పుడు  కనీసం నీకు ఒక మాటైనా చెప్పిందా ..? ఊళ్ళో అయినా ఎవరికైనా చెప్పిందా  అంటే అదీ...  లేదు.  బాకీలాళ్ళకి  డబ్బులు కట్టేటప్పుడు బయటపడింది నాలుగెకరాలు పొలం ధర పాతిక సెంట్లున్న  స్థలంలో  ఉన్న పాత ఇంటికి వచ్చిందని .   డబ్బంటే ఎంత ఆశ ఉన్నా..  ఊరిని ఇట్టా ..  సంకరం చేసి పెడతారా?  మీ అమ్మకి తోడూ ఆ..  ఆంజనేయులు  మాస్టారొకడు  ఎవరి ఆస్తులు వారిష్టం అమ్ముకుంటారో ఎవరికైనా దానం ఇచ్చుకుంటారో .. మనకి ఎందుకు? వాళ్ళు పీకల్లోతు అప్పుల్లో కూరుకు పొతే మనం చిల్లికాణీ  అయినా సాయం చేసామా..? అంటూ  మీ అమ్మ  తరపున వకాల్తా  పుచ్చుకున్నాడు . అది మీ తాత ముత్తాతలు  సంపాయించిన ఆస్తి .. మీ అమ్మకి అమ్మేదానికి హక్కు లేదు .పైగా నువ్వు సంతకాలు కూడా పెట్టలేదు ..  వాళ్ళని ఖాళీ చేయమని అడ్డం తిరుగు"  అని నూరిపోసారు .

ఆ రాత్రి కూడా రఘు ఇంటికి వెళ్ళలేదు . అమ్మ బలవంతం మీద ఏదో తిన్నాననిపించుకుని వరండాలో నులక మంచంపై  ఆలోచిస్తూ పడుకున్నాడు , నేను వాడి ప్రక్కనే ఇంకో మంచం పై పడుకుని వాడేం  మాట్లాడతాడో అని చూస్తూ ఉన్నాను .  బాగా పొద్దు పోయాక తులసమ్మ పిన్ని మా ఇంటికి వచ్చింది ఎన్నడు ఒకరింటికి పోనీ పిన్ని  మా ఇంటికి వచ్చేసరికి అందరికి ఆశ్చర్యమయితే  వేయలేదు కాని కొడుకు కోసం వెదుక్కుంటూ వచ్చిన  తల్లి మనసు అర్ధమై .జాలి కల్గింది .

అమ్మ తులసమ్మ పిన్నిని కూర్చోమని ముక్కాలి పీట వేసింది . పిన్ని ఆ పీటని తెచ్చుకుని రఘు మంచం ప్రక్కనే వేసుకుని కూర్చుంది .

"బాబూ ..  రఘూ కోపం వచ్చిందా ? "అంటూ వాడి తలమీద చేయివేసి నిమరబోయింది ..వాడు  విసురుగా ఆ చేయిని తోసేసి ..   "నన్ను అంటుకోబాకు,  అసలు నాకు నువ్వు అమ్మవే కాదు ". అంటూ దిగ్గున లేచి నించున్నాడు  తులసమ్మ పిన్ని కళ్ళల్లో నీళ్ళు

"తప్పు .రఘు ..  అమ్మని అలా అనవచ్చా .?"  అమ్మ కోప్పడింది

"నేను ఏమి చేసాను .. యశోదమ్మా ..  ! వాడట్టా  మండి  పడతా ఉండాడు . నెత్తి గింజ నేల  రాలిన్నాటి నుండి  ఏష్టపు  బతుకు అయిపొయింది . ఈ ఒక్క బిడ్డ కోసం ఎన్ని అగచాట్లు పడినాను . ఇప్పుడు ఈడు ఇంతై నన్ను సరిగ్గా  అర్ధం చేసుకోకుండా ఇట్టా మాట్లాడుతున్నాడు "

"నేను బైబిల్ చదవడం ఇష్టం లేదన్నాడు .. ఆ బైబిల్ ని  నేను ఎందుకు చదువుతున్నాను , యేసు ని ఎందుకు కొలుస్తున్నాను అని మీకెవరికైనా అర్ధం అయిందా? పెల్లైయిన ఏడాది లోపే మా ఆయనకీ పెద్ద జబ్బు చేసింది, బతకడం కష్టం అని చెప్పారు . ఎన్ని హాస్పటల్ కి తిప్పినాం . ఒళ్ళు ,ఇల్లు రెండు గుల్లయి పోయాయి ఆయన అట్టా  ఉండగానే వీడికి పిట్స్ మొదలయ్యాయి ..  ఆయనకీ చూస్తే అట్టా , బతుకాతాడో లేదో నమ్మకం లేదు బిడ్డకి చూస్తే ఇట్టా .. నేను ఏంచేయాలో తోచలేదు ..  ఎన్ని మొక్కులు మొక్కాను .. ఎన్ని పూజలు చేసాను  ఈ రాళ్ళలో ఉన్న దేవుడే మైనా   మా ఆయన రోగం తగ్గించ గల్గారా ?  మా ఇంటి ప్రక్క టీచర్ చెప్పింది ప్రభువుని  నమ్ముకో ..  ఆయన రోగం నయం చేస్తాడని  ఆమె మాటల మీద నమ్మకం కుదిరింది. యేసు ని నమ్ముకున్నాను   రఘుకి ఫిట్స్ రావడం తగ్గి పోయింది , వాళ్ళ నాన్న కాస్త తేరుకుంటున్నాడు . నా ప్రార్ధనలు  ఫలించాయనుకున్నాను . పూర్తిగా నయం కావాలంటే పూర్తిగా ఆయననే నమ్ముకోవాలి  మతం మారాలి ,హిందువుల ఆనవాళ్ళు ఏవి ఉండ కూడదని అంటే బొట్టు, గాజులు  అన్నీ తీసేసి బాప్టిజం తీసుకున్నాను.  అప్పటి నుండి నమ్మినదానిని విడవకుండా పాటిస్తున్నాను . అది తప్పా ?  ఎన్నెన్నో మాటలన్నారు మొగుడు చావక ముందే అన్నీ తీసేసింది అందుకే వాడు చచ్చాడని చెప్పుకున్నారు.   బతికున్నన్నాళ్ళు మా అత్తా మామ తిట్టి పోశారు . బొట్టు పెట్టుకొని, తాళి కట్టుకోని వాళ్ళ మొగుళ్ళు చాలా మంది బ్రతికే ఉన్నారు, మరి వాళ్ళని చూపిచ్చి నేను అడగవచ్చు గా .. ?  ప్రార్ధన కెళితే నా చేతి కూడు తినని శపథం చేసారు ముసలాళ్ళని  బాధ పెట్టడం ఎందుకులే అని నా ఇష్టాన్నే చంపుకున్నాను . ఈడు వేలెడంత ఉన్నప్పుడు నుండే నన్ను శాసించడం మొదలెట్టాడు . నా దారిన నేనే పోతన్నా గాని ఎవరినయినా  బైబిల్ చదవండి ,ప్రార్ధన చేయండి అని నేను బలవంతం చేసానా?

మీ అందరూ నమ్మే  దేవుడు మీకు రాళ్ళల్లో,పాముల్లో ,పశువుల్లో కనబడితే నేను నమ్మే దేవుడు నాకు బైబిల్లో,ప్రార్ధన లో  ఉన్నాడని పిస్తుంది . మీరు గుడికి వెళ్లినట్టు నేను చర్చి కి వెళితే అభ్యంతరం పెట్టారు  ఇదేట్టా న్యాయం అనిపిచ్చుద్దో మీరెవరైనా చెప్పండి"?  .సూటిగా తాకుతున్నాయి ప్రశ్నలు
వింటున్న ఎవరిమీ మాట్లాడలేదు .  పిన్ని మళ్ళీ ఆమె గోస చెప్పసాగంది

"నిండా అప్పుల్లో కూరుకు పోయి ఉన్నాను నాలుగెకరాలు పొలం అమ్మే కంటే ఇల్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని  ఇల్లు అమ్మాను  దానికి తప్పు పడతా ఉండారు  ఏ మనూర్లో రామాలయం దగ్గరలో మసీద్ లేదా ? పీర్ల పండక్కి పీర్లు ఊరేగింపులో మీరందరూ ఎదురెల్లి నీళ్ళు  పోసి మొక్కట్లేదా ? మరి ఆ మతం వాళ్ళు మాత్రం వేరే మతం కాదా!? వాళ్ళు పరాయి వాళ్ళు కాదా ? నన్నెందుకు తప్పు పడతా ఉండారు ? "

వింటున్న మాకు ఒక్కోమాట గునపంలా గుచ్చుతున్నట్టు ఉంది . రఘు ఏమి మాట్లాడలేదు

నా వైపుకి చూస్తూ .. "కృష్ణా నీకు తెలియదా .. రఘు అంటే నాకెంత ప్రాణమో ! వాడి కోసమే కదా రాత్రింబవళ్ళు  రెక్కలు ముక్కలు చేసుకుని ఒంటెద్దు వ్యవసాయం చేస్తూ ఈ కుటుంబాన్ని ఇక్కడిదాకా లాక్కొచ్చా . ఇప్పుడు ఈడే  నన్ను అసహ్యించుకుంటూ  నన్ను వేలేసినట్లు చూస్తే నేను ఎవరి కోసం బతకాలి, నేను ఎందుకు బతకాలి ? "
ఏడుస్తూ . ముక్కాలి పీట పై నుండి లేచి నిలబడింది  .

ఆ మాటలు విన్న నాకు కన్నీరొచ్చింది.  అవును, తులసమ్మ పిన్ని ఎంత కష్టపడుతుంది .రఘు వాళ్ళమ్మని అర్ధం చేసుకోవడం లేదని   నాకూ వాడిపై కోపం వచ్చింది .

అమ్మ కూడా అదే మాట అంది  " రఘు మీ అమ్మని నువ్వే అర్ధం చేసుకోవాలి ఏ దేవుడైతే ఏమైంది ?  ఆమెకి  కాకర కాయ నచ్చినట్టు ఆ దేవుడు, ఆ మతం  నచ్చింది నీకు గుమ్మడి కాయ నచ్చినట్టు ఈ మతం నచ్చింది  ఏ మతమయితే ఏముందిలే ! అందరి రక్తం ఒకటే రంగయినట్లు అందరు దేవుళ్ళు ఒకటే ! అసలు కన్నతల్లి  ప్రత్యక్ష దైవం  అంటారు కదా !  మీ అమ్మని బాధపెట్టే మాటలు మాట్లాడకూడదు ,  కష్ట పెట్టే  పనులు చేయకూడదు ".. అని సుద్దులు చెప్పింది .

"తులసమ్మా ! ఏడవబాకు నీ కష్టం మాకు తెలియదా ఏంటి? రఘు చిన్న పిల్లాడు , వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు తలకెక్కించుకుని ఇప్పుడలా కోపంగా ఉన్నాడు గాని వాడికి నీ పై ప్రేమ ఎందుకుండదు" అని అంటూ
"కృష్ణా ,నువ్వు రఘు ని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళు "అని చెప్పింది .

తులసమ్మ  పిన్ని కళ్ళు తుడుచుకుంటూనే  ఇంటి దారి పట్టింది. ఆ వెనుకనే రఘు,నేను బయలుదేరాం .
ఆ సంఘటన తర్వాత రఘు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది . వాళ్ళమ్మ మీద అసలు కోపమే లేకుండా తల్లిని సంతోషంగా ఉంచేవాడు .కాని ఆమె ఆచరిస్తున్న మతం పట్ల వ్యతిరేక వైఖరి మాత్రం వాడి మనసులో అలాగే ఉండిపోయింది

తులసమ్మ పిన్ని ఊరిలోనే ఉండేది మేము హాస్టల్లో ఉంది  డిగ్రీ  చదువు పూర్తీ చేసాము . తర్వాత ఇద్దరికీ గుంటూరు మెడికల్ కాలేజ్ లో సీట్లు వచ్చాయి . చదువు పూర్త వుతూ ఉండగానే  రఘుకి పెళ్ళయిపోయింది. రఘుకి హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేయించింది తులసమ్మ పిన్ని.  వియ్యాలవారికి ఆమె ఆచరించే మతం పట్ల అభ్యంతరం ఉండేది . అయితే రఘు లాంటి యోగ్యుడైన వాడిని పెంచిన తల్లి కాబట్టి అల్లుడు హోదాని చూసుకుని ఆమె పరమత ఆచరణకంత  ప్రాముఖ్యత నివ్వడం మరచిపోయారు .  రఘు హైదరాబాద్ లో  ఉద్యోగం చేస్తూ  తల్లిని కూడా తమతో ఉండమని గొడవ చేసేవాడు . కానీ తులసమ్మ పిన్ని పల్లెలోనే ఉండటానికి  ఇష్ట పడేది. రఘు  సొంత వూర్లో ఇల్లు కట్టడానికి  రామాలయం ప్రక్కనే కొంత స్థలాన్ని మార్కెట్లో  ఉన్న ధర కన్నా  ఎక్కువ ధర  పెట్టి  కొని   ఆ స్థలంలో  ఇల్లు కడతాను.. ఆ ఇంట్లో ఉండమని అన్నాడు . ఆమె ఆ గుడి ప్రక్కనే ఉండానికి ఇష్టపడలేదు

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విదేశంలో ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళిపోయాడు . తనతోపాటు తల్లిని తీసుకువెళతానని అంటే అందుకూ ఆమె ఇష్టపడలేదు . "ఎక్కడున్నా నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే  చాలు నేనీ వూరు వదిలి రానని చెప్పింది .   నా సలహా మేరకు నా ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకున్నాడు. సంవత్సరానికి ఒకసారో  ,వీలయితే రెండుసార్లు వచ్చి   ఆ  సమయానికి తులసమ్మ పిన్ని ని అక్కడికి రప్పించుకుని అందరూ కలసి ఆనందంగా గడిపి వెళ్ళడం చేయసాగాడు. వెళ్ళేటప్పుడు పేద పిల్లలకి స్కాలర్ షిప్ లు ఏర్పాటు చేసి వెళ్ళేవాడు

నాలుగేళ్ల క్రితం తులసమ్మ పిన్ని ఆరోగ్యం దెబ్బ తింది.  అప్పుడు వచ్చి ఒక నెల రోజులు ఉండి  ఆమెకి స్వయంగా సేవలు చేసాడు . ఇక సొంత వూర్లో ఒక్కదాన్నే ఉంచడానికి ఇష్టపడక నమ్మకమైన ఒక మనిషిని కుదిర్చి ఆమెకి సాయంగా ఉంచి వెళ్ళాడు అవసరం అయినప్పుడు సాయంగా  కొడుకు కాని కొడుకుని నేనెలాగూ దగ్గరలోనే  ఉన్నాను కాబట్టి రఘుకి ఎలాంటి దిగులు లేకుండా ఉంది . అమ్మ నాదగ్గరే ఉండటం తో అమ్మకి తులసమ్మ పిన్నికి ఇద్దరికీ బాగానే కాలక్షేపం అవుతూనే ఉండేది

తన పనులు తానూ చేసుకుంటూ అప్పుడప్పుడూ దగ్గరలో ఉన్న చర్చి కూడా వెళ్లి వస్తూ ఉన్న తులసమ్మ పిన్ని ఏ మాత్రం  సూచనలు ఇవ్వకుండానే తనువూ చాలించింది. .. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉన్న నన్ను సరళ తట్టి పిలుస్తుంది

 "ఏమండీ  .రఘు  అన్నయ్య వాళ్ళ మామగారు ఏమిటో అంటున్నారు చూడండి "

ఏమిటన్నట్లు ఆయన వైపు చూసాను "ఆమె శవం ని  బాక్స్ లోకి మార్చి ఇదిగో ఈ దండలు వేయండి, తలవైపు దీపం పెట్టండి . అలా అంత సేపు దీపం పెట్టకుండా ఉంచకూడదు " చెపుతున్నారు .

దీపం .. పెట్టటమా ? అడిగాను ఆశ్చర్యంగా . అదేమిటి అలా ఆశ్చర్యంగా అడుగుతున్నావ్ కృష్ణా !ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె ఎలా ఉంటె మనకెందుకు ? ఇప్పుడు ఆమె రఘు  తల్లి మాత్రమే! ! ఆమెకి హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు జరపడమే విధి . పైగా అలా చేయకపోతే రఘుకి కీడు జరుగుతుంది . అది మాత్రం ఆమె కోరుకుంటుందా ? అడుగుతున్నాడాయన .

నేను ఆలోచిస్తూ  ఉన్నాను  బుర్ర పాదరసంలా  పనిచేసింది వెంటనే ఇలా అన్నాను . "రఘు  రావడానికి  ఎంత  లేదన్నా  ఇంకా రెండు రోజులు పడుతుంది  కాబట్టి  బాడీని ఇక్కడ బాక్స్ లో  ఉంచడం కంటే మార్చురీ లో ఉంచడం నయం" అన్నాను .

నన్ను సమ ర్దిస్తూ మరి కొందరూ అలాగే చేయడం మంచిదని అన్నారు . అమ్మయ్య ! ఒక గండం గట్టెక్కింది అనుకుని అంబులెన్స్ కి పోన్ చేసాను. ఒకటిన్నర రోజు తర్వాత  భార్య పిల్లలతో సహా రఘు  వచ్చాడు . ఎయిర్ పోర్ట్ కి ఎదురెళ్ళి నేనే ఇంటికి  తీసుకువచ్చాను. మేము  ఇంటికి వచ్చే సమయానికి అంబులెన్స్ లో పిన్ని బౌతిక కాయాన్ని  ఇంటికి తీసుకు వచ్చారు.రఘు తల్లి శవాన్ని  చూస్తూ కన్నీరు కారుస్తూనే ఉన్నాడు . పిల్లలు ఒకసారి ఆమె దగ్గరికి వచ్చి చూసి దూరంగా వెళ్ళిపోయారు . భార్యని తల్లి తల దగ్గర దీపం పెట్టమని  చెప్పాడు రఘు  .

రఘు  మామగారు స్మశాన వాటిక వాళ్లకి ఫోన్ చేసి దహన క్రియలు గురించి  మాట్లాడుతున్నారు.

నేను నిర్ఘాంతపోయాను . తల దగ్గర  దీపం పెట్టబోతున్న  రఘు  భార్యని  "కాసేపు ఆగమ్మా" .. అని వారించి  వాడిని  ప్రక్కకి తీసుకువెళ్ళాను  .

"ఏంటిరా ఇది ".. అడిగాను

 "ఏముంది అన్నీ మాములేగా " అన్నాడు వాడు

"రఘు ..  నీకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మని వ్యతిరేకిస్తూనే ఉన్నావు . ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వ్యతిరేకిస్తున్నావు . ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకేమి నచ్చలేదు " అన్నాను .

"నచ్చడానికి ఏముంది రా కృష్ణా ! ఇప్పడు నేనేమి చేసినా  అమ్మకి తెలుస్తుందా ఏమిటీ ! అమ్మ పుట్టుకతో క్రిష్టియన్ ఏమి కాదుగా ! హిందువుగానే పుట్టింది హిందువుగానే ఆమెని కడసాగనంపడంలో ఎవరికీ అభ్యంతరం ఉంటుంది . మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి " అన్నాడు

మరి నువ్వు మధ్యలోనే వచ్చావుగా నువ్వు పోవాలిగా ? అన్నాను కోపంగా ." వాట్ "అన్నాడు  ఆశ్చర్యగా అర్ధం కానట్లు

"నేను అంటున్నదీ  అదే! నువ్వు ఆమె పుట్టినప్పటినుంచి ఆమెతో ఉండలేదుగా . ఆమెని ఇప్పుడు వదిలేయి" అన్నాను .

"ఎలా వదిలేస్తాను . అమ్మ ఉన్నప్పుడు ఆమెని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అంతగానే ప్రేమిస్తాను  ఆమె కి అంతిమ సంస్కారం  చేసి ఆమె ఋణం  తీర్చుకోవాలి కదా !" అన్నాడు

"మనుషులని ప్రేమించడానికన్నా ముందు వారిని  గౌరవించడం నేర్చుకోవాలి . మీ అమ్మని ఎప్పుడైనా గౌరవించావా ? అదే ఆమె అభిప్రాయాలని  గౌరవించావా ? ఆమె ఇష్టపడే బైబిల్ ని ఆమె ప్రార్ధనలని అంగీకరించావా? ప్రపంచ దేశాలన్నీ తిరిగావు.  మతం, , ఆచారం  ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి ఎవరికిష్టం అయినట్లు వారు మార్చుకుంటారు. మార్చుకోవద్దనటానికి, ఇలాగే ఉండాలి అనడానికి ఎవరికీ అధికారం లేదు. వ్యక్తి స్వేచ్చకి భంగం కల్గించమని ఏ రాజ్యాంగంలోను చెప్పబడలేదు. మన హిందూ ధర్మం  అసలు చెప్పలేదు.  ఆమె చనిపోయాక ఆమె కొడుకుగా నీకు ఆమె శవం మీద కూడా హక్కు  ఉండొచ్చు. కానీ ఆమె అవలంభించిన మతాచారం ప్రకారం ఆమె అంతిమ సంస్కారం జరగాలని ఆమె కోరిక . అమ్మ ఈ దగ్గరలో ఉన్న చర్చిలో ఆ విషయమే చెప్పిందట . వారొచ్చి  నిన్న నాకు ఆ విషయం గుర్తు చేసి వెళ్ళారు.  ఆమె ఇష్ట ప్రకారం మనం అలా పాటించడం అంటే ఆమెని మనం గౌరవించడమే కదా!  అది మన విధి కదా !  ఆలోచించు"  అన్నాను

" ఏమైందండీ !  అంత సీరియస్ గా చర్చించు కుంటున్నారు  అవతల జరగాల్సిన విషయం చూడకుండా " అంటూ దగ్గరికి వచ్చింది  సరళ .

"తల్లీకొడుకుల మధ్య కూడా ఈ మత  విశ్వాసాలు ఎంతటి  అగాధం సృష్టిస్తాయో అన్నది అర్ధమవుతుంటే  చాలా బాధగా ఉంది సరళా ."అన్నాను

"ఏమంటున్నారు రఘు అన్నయ్య  శవపేటిక,ప్రార్ధన, బరియల్ గ్రౌండ్ కి వద్దంటున్నారా ?"

అవునని తలూపాను .  రఘు మామగారు పురమాయించిన మనుషులు పాడే  సిద్దం చేస్తున్నారు  పూల దండల బుట్టలు, చావు మేళం,  టపాసులు   అన్నీ వచ్చి చేరుతున్నాయి

రఘు పది నిమిషాలు గడిచినా గదిలో నుండి బయటకి రావడం లేదు .

"సరళా నేను వెళుతున్నాను , ఆ కార్యక్రమం అయ్యాక అమ్మ, నువ్వు వచ్చేయండి " అని అంటూ బయటకి వస్తున్నాను .

"అయ్యో ! అదేమిటండి . మనకి నచ్చలేదని వెళ్ళి పోతామా ? ఇన్నేళ్ళు   ఆమెకి మీరు ఒక కొడుకుగానే ఉన్నారు . ఆ కార్యక్రమం ఏదో అయినాక మనమందరం  కలిసే వెళ్ళిపోదాం . తర్వాత మీ మిత్రుడు,  మీరు ఎలా ఉండదల్చుకున్నారో అలాగే  ఉండండి " అంటూ చేయి పట్టుకుని ఆపబోయింది .

"మరణం తర్వాత కూడా తల్లి అభిప్రాయాలని గౌరవించలేని వాడిని, సంస్కారం లేనివాడిని  నా స్నేహితుడిగా కాదు మనిషిగా కూడా అంగీకరించలేకపోతున్నాను . డాక్టర్ అన్న డిగ్రీని మెడలో వేసుకుని తిరుగుతున్న వాడిని   మరో మత మూడుడుగా   చూడలేకపోతున్నాను. ఆ విషయాన్ని జీర్ణం  చేసుకోవడం నావల్ల కావడంలేదు అందుకే వెళుతున్నాను ". తల విదుల్చుకుంటూ   గుమ్మం దాటి బయటకి రాబోతుండగా ..

"కృష్ణా !ఎక్కడికి రా వెళుతున్నావ్ ? అమ్మ అంతిమ సంస్కారం కి శవపేటిక  సిద్దం చేయించకుండా ? " అంటూ  దగ్గరగా వచ్చి నా చేయి పట్టుకున్నాడు రఘు.

తులసమ్మ పిన్నికి జరిగే అంతిమ  సంస్కారం రఘుని సంస్కార వంతుడిగా మార్చిందనుకుంటే నాకు  చాలా సంతోషమేసింది

 వాడి చెయ్యి పట్టుకుని తులసమ్మ పిన్నిని ఉంచిన చోటుకి వచ్చాను . ఆమె నిర్జీవ ముఖం చిన్నగా నవ్వుతున్నట్టు  కనిపించింది నాకు.


సారంగ వెబ్ పత్రికలో /

 .********************************

4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

very good story

Ennela చెప్పారు...

చాలా చాలా బాగుందండీ.

Hima bindu చెప్పారు...

good story heart touching

Saraswathi Durbha చెప్పారు...

తల్లీ కొడుకులను వేరు చేసింది, బంధువులందరి మనసులు కలచి వేసింది మతం కాదు, విదేశీ సంస్థలు ఇస్తున్న డబ్బు. తులశమ్మ డబ్బు కోసమే గా మతం మారింది. ఆ విదేశీ డబ్బు మన దేశం లోకి రాకుండా ప్రభుత్వం కట్టడి చేస్తే మనస్ఫూర్తిగా మతం మారే వారెవరో డబ్బుకోసం మారేవారెవరో తెలిసిపోతుంది. కష్టాలు అందరికీ వస్తాయి, అందరూ మతం మారుతున్నారా? కేవలం ప్రలోభాలకు లొంగిపోతున్నవారే మారుతున్నారు. ఏసుక్రీస్తూ దేవుడు కాదు, గుళ్ళో విగ్రహమూ దేవుడు కాదు. మన మనసు లో ఒక మానవాతీత శక్తి పై మనం పెట్టుకున్న నమ్మకమే దేవుడు.