30, నవంబర్ 2012, శుక్రవారం

అంతర్ పట్టు ..

అంతర్ పట్టు .. ఈ పదం సంస్కృత పదం అని విన్నాను.

వధూవరుల మధ్య తెర  పట్టడం అనే సంప్రదాయం మన హిందూ సంప్ర దాయంలో ఉంది కదా!

మన తెలుగు వారి పెళ్ళిళ్ళలో జీల కర్ర బెల్లం పెట్టె ముందు వదూవరుల మధ్య తెర పట్టుకుంటారు.ఆ పద్దతిని తెరసెల్లా  అని అంటారట.ఈ మధ్య తెరసెల్లాని ని  కూడా అందంగా అలంకరించి వాడుతున్నారు. మా పెళ్లి అప్పుడైతే కొత్త దుప్పటి పెట్టుకున్నట్లు  గుర్తు లేదా..గోధుమ రంగు పట్టు పంచని తెరసెల్ల గా పట్టుకుంటారు.

ఇప్పుడు జరుగుతున్న  పెళ్ళిళ్ళలో సంప్రదాయం కూడా హంగు ఆర్భాటపు  రంగులద్దుకుని.. తళ తళ మెరిసిపోతుంది.
అందులో భాగంగానే  నాకు చేతికి పని బడింది.

అదేమంటే .. తెర సెల్లా ని ..కలశం డిజైన్ వేసి ఎంబ్రాయిడరీ చేయడం.

సరే ..పనిలో క్రొత్తదనం బావుంది..అని కలశం డిజైన్ చేసి .. ఎంబ్రాయిడరీ  చేయించాను.

ఈ డిజైన్ అలా చేసినవే.. 2.50 మీటర్ల తెరసెల్లా  కి ఉపయోగించిన మెటీరియల్ ,ఎంబ్రాయిడరీ .తెరసెల్లా  చుట్టూర  3 వరుసల లేస్ మొత్తం విలువ  దరిదాపుగా 4,000 రూపాయలు అయింది.

ఇప్పుడు ఈ తెరసెల్లా   డిజైన్ అందరి కంట పడి.. అలరిచనుంది.  మనదేశంలో ఇతరప్రాంతాలలో ,విదేశాలలో అంతర్పట్టుని  కళాత్మకంగా డిజైన్ చేసి వాడుతున్నారు. ఇప్పుడు మా పట్టణం లో కూడా ఉంది.

ఇదిగోండి.. నేను డిజైన్ చేసిన "అంతర్పట్టు"

28, నవంబర్ 2012, బుధవారం

"హిమ్మత్ హై జీనే కి" నిర్మల

మనమైతే చేయగలమా ..ఇలా..? అభినందించి స్ఫూర్తి పొందుదాం రండి ... వనజ తాతినేని


"హిమ్మత్ హై జీనే కి"  నిర్మల

ఆడపిల్ల పుడితే విసిరి పారేసే ఈ సమాజంలో.. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడం విచారకరమే కాదు అమానుషం కూడా!

కంటేనే తల్లి అని అంటే ఎలా.. !? డా ||  సి.నా.రె .. గారి గీతం ఎంత అర్ధవంతంగా ఉంటుందో..అన్నది.. ఈ స్పూర్తికరమైన వాస్తవ కథ చదివినప్పుడు నాకు అనిపించింది.

ఈ వాస్తవ కథ చూడండీ!!..

అది అక్టోబర్ 2010 లో ఒక చల్లని ,  నిశ్శబ్దంగా  ఉన్న మధ్యాహ్న  సమయం.

నిర్మల అనే ఆమెది  Savansa  అనే ఒక చిన్న గ్రామం.  ఉత్తరప్రదేశ్  రాష్ట్రంలో జౌంపూర్ జిల్లా లో  ఈ  గ్రామం ఉంది. (కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC), Maharajganj బ్లాక్ దగ్గర)

నిర్మల  తల్లి ఒక 'డై', లేదా శిక్షణ పొందిన మంత్రసాని  ఆరోగ్య కేంద్రంలో పని చేస్తూ ఉంటుంది. ఆమెని కలవడానికి నిర్మల నడుచుకుంటూ వెళుతుండగా  ఆమెకి ఒక శిశువు రోదిస్తున్న శబ్దం  వినవచ్చింది.

ఆ ధ్వని ఎక్కడ నుండి వస్తుందో..అర్ధం కాలేదు.  ఆమె చుట్టుప్రక్కల చూస్తూ ఉంది. ఆ శబ్దం ఆ ఆరోగ్య కేంద్రం లోపల ఉన్న స్టోర్ రూమ్ వైపు నుండి వినవస్తుందని  తెలుసుకుంది. అక్కడికి వెళ్లి చూసింది.

ఆ గది ఉపయోగంలో కూడా లేదు. కిటికీలు విరిగిపోయి..చుట్టూత ఉన్న చెట్ల నుండి రాలిన ఆకులు,చెత్త చెదారంతో నిండి ఉంది.ఆమె ఆ గది తలుపు తెరిచి చూసి కెవ్వున  కేకవేసింది.

అక్కడ చూస్తే అప్పుడే పుట్టిన బిడ్డ చిరిగిన పాత చొక్కాలో చుట్టబడి..పగిలిన గాజు పెంకులపైకి విసిరివేయబడి ఉంది. ఆ పసి బిడ్డ చాలా సేపు నుండి ఏడ్చి ఏడ్చి ఉన్నట్లు నీలంగా మారిన శరీరం. ఎండిపోయిన నోరు చెపుతుంది. వెంటనే ఆమె ఆబిద్దని చేతిలోకి తీసుకుని ఆ బిడ్డకి తన స్తన్యాన్ని అందించింది.. అప్పటికి నిర్మలకి ఒక ఆరునెలల వయసు ఉన్న పాప ఉంది  అందుకే ఆమె తన స్తన్యం ఇవ్వడం వీలయింది.

.తర్వాత ఆ పాడుబడిన శిదిలాల మధ్య పడి  ఉన్న ఆ పసి పాపని తీసుకుని ఆ బిడ్డ ఎవరి బిడ్డో.. అని కనుగొనే ప్రయత్నం చేసారు.ఆ బిడ్డ తల్లి దండ్రులు ఎవరైనది ఎవరు చెప్పలేక పోయారు.దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్లి బిడ్డ గూర్చిన సమాచారం అడిగి అడిగి అలసి పోయారు.

చివరికి, నిర్మల బిడ్డ ని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆమె ఉంటున్న గ్రామం లో  (Savansa వద్ద)  పిల్లల సంరక్షణ కోసం సరైన సౌకర్యం లేకపోవడంతో ఆమె నగరంలో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోం వద్ద  ఆ పాపకి చికిత్స చేయించింది. అందుకు ఆమె కి  తన కుటుంబం నుండి భారీ సవాలుని   ఎదుర్కోవాల్సి వచ్చింది.  ఆమెకి  అప్పటికే ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భర్త మరియు అతని కుటుంబం మరొక బిడ్డని పెంచాలి అనే  ఆలోచన ని  తీవ్రంగా వ్యతిరేకించారు.. ఈ విషయం పై నిర్మల కి  ఆమె భర్త  కి మధ్య తీవ్రమైన అసమ్మతి  కి దారితీసింది, ఆమె తన పిల్లలతో కలసి   వైవాహిక జీవితం నుండి తెగతెంపులు చేసుకుని ఇంటి నుంచి బయటపడింది.

అయిదుగురు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిన ఆమెకి అక్కడ ఆశ్రయం దొరకలేదు.అయినా ఆమె దైర్యం కోల్పోలేదు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడింది. ఆ పని ద్వారా వచ్చే డబ్బు..కుటుంబం నడపడానికి సరిపోవడంలేదు. ఎట్టకేలకు  ఆమెకి తన పుట్టింటి మద్దతు లభించి..ఆ పసి పాపకి ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు ఆపాప ఆ ఇంట్లో ఒక సభ్యురాలు. ఆ పాప పేరు "అంకిత"

నిర్మల ఒక పసి పాపని కాపాడటానికి తన కుటుంబ సభ్యులతో.. పోరాడి గెలిచింది. ఆడపిల్లలు పుడితే విసిరి పారేసే ఈ సమాజంలో  ఓ..మాతృ మూర్తి..ఆ  ఆడపిల్లని మానవత్వంతో చేరదీసి.. ఆదర్శంగా నిలిచింది. "Himmath hai jine ki " (జీవన దైర్యం)సత్కారాన్ని అందుకున్నారు..

అంకిత తో..నిర్మల 
ప్రేరణ కలిగించే విషయం కదండీ ఇది. "నిర్మల" గారిని మనఃస్పూర్తిగా అభినందిద్దాం.

ప్రస్తుత జనాభా సంఖ్యలో 1000 మంది పురుషులకి 899 మంది స్త్రీల నిష్పత్తి ఉండటం వల్ల  అనేక సమస్యలని ఎదుర్కోవలసి వస్తున్నా.. కూడా.. ఆడ శిశు వులని .. .మూర్కత్వంతో కాలరాస్తున్న సమాజానికి అవగాహన కల్పించే దశలో  Action Aid పనిచేస్తుంది. ఈ సంవత్సరం. నిర్మలతో పాటు మరికొందరు మహిళలను ఈ సత్కారంతో..గౌరవించారు. అందులో ఇద్దరు పురుషులు కూడా ఉన్నారు.

ఈ నిరక్షరాస్యులైన మహిళలు అట్టడుగు మరియు పితృస్వామ్య వ్యవస్థలో కొడుకు  ప్రాధాన్యత నియమం పేరు పేరుతొ.. ఆడపిల్లలని  బతికి బట్టకట్ట నీయడం  లేదు. . తాజా సెన్సస్ ఫిగర్ ప్రకారం, చైల్డ్ సెక్స్ నిష్పత్తి 914/1000
 UP లో అయితే 899 /1000  ఉంది.

Action Aid  సత్కరించిన వారి వివరాలు.. మరికొందరు స్పూర్తికరమైన వ్యక్తుల గురించి ఈ లింక్ లో చూడండి.

27, నవంబర్ 2012, మంగళవారం

మంగళగిరి నులక మంచం

మంగళగిరి నులక మంచం

ఆ రోజు ఆదివారం .

పిల్లలందరూ తీరికగా బొమ్మలాటలు ఆడుతూ... ఉండగా..

పాప,బాబు కూడా  కొబ్బరి ఆకులతో రెండు బొమ్మలు చేసి..  అమ్మ చక్కగా  కుట్టి ఇచ్చిన బట్టలు కట్టి..పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు ని ముస్తాబు చేసి.. ఆ బొమ్మలకి పెళ్లి చేయాలనుకున్నారు.

 అంతకన్నా ముందుగా  తాము అలంకరించిన బొమ్మలని అందరికి గర్వంగా చూపాలని  కూడా పాప,బాబు  తొందర. 

డాక్టర్  గారి కల్యాణి.. వాళ్ళ అక్క పంపించిన బార్బీ బొమ్మని తీసుకొచ్చి పెద్ద టెక్కు కొడుతుంది. కళ్ళు ఆర్పే బుట్ట గౌన్ బొమ్మకంటే మన తాటాకు బొమ్మే అందంగా ఉంటుంది. ఆ బొమ్మ మొఖాన బొట్టు కూడా లేదు. అయినా సరే ఆ బొమ్మని చంకనేసుకుని వచ్చి గొప్పలు పోద్ది. ఆ గొప్ప ని ఒప్పుకుంటామా ఏమిటీ.. ?  వెంకటేశ్వరావు మిషన్ దగ్గర నుండి  కత్తిరింపు లో మిగిలిన ముక్కలు పట్టుకొచ్చి పట్టు కుచ్చులు పెట్టి అమ్మ కుట్టి ఇచ్చిన బొమ్మ బట్టలు ఎంత బాగున్నాయి.!?  ఆ ఆర్పుడు కళ్ళ రబ్బరు బొమ్మ అసలు బాగోలేదు కదా..అన్నాయ్ అంది పాప. తన మాట ఒప్పుకుని తీరాల్సిందే అన్నట్లు. 

బాబు..ఏమో  అయోమయంగా తల ఊపాడు.. అలా ఒప్పుకోకపోతే పాప ఊరుకోదు మరి. బాబుకి పిల్లలతో గొడవ పడటమంటే భయం.పాప కేమో తేల్చుకుందాం..రా ..అనే టైపు. 

అన్నం తిని   ఎప్పుడెప్పుడు బొమ్మలాట ఆడుదామా అని ఎదురుచూస్తున్న పాప మనసులో మాట పసి కట్టిన అమ్మ "ఇలా చెప్పింది. "ఇప్పుడు ఎండగా ఉంది. ఆటలకి వెళ్లొద్దు. ఇంట్లోనే కూర్చుని   ఆడుకోండి అని చెప్పింది.

బుద్దిగా తల ఊపింది పాప. అలా పాప బాబు.. ఆటల్లో  మునిగి పోయారు.

అమ్మ ఇంట్లో పనులన్నీ ముగించుకుని వరండాలో మంచం వేసుకుని పడుకుంది. పనులు చేసి చేసి అలసి పోయి ఉందేమో, అందులో తలంటు  పోసుకుని ఉంది.  తల ఆరినట్లు లేదు ఒత్తైన జు ట్టుని..నేల  మీద జీరాడేటట్టు.  అలా వెనక్కి వేసుకుని పడుకుండి పోయింది.

వరండాలోనే కూచుని ఆడుకుంటున్న పాప,బాబు బొమ్మల పెళ్లి ఆట ఆపి లక్క పిడతలు అన్నీ చేర్చి వంట కార్యక్రమం మొదలెట్టారు. పాప గ్లాసుతో నీళ్ళు తెచ్చింది. బియ్యం కూడా తెచ్చింది. వంట ఇంట్లోకి వెళ్లి శబ్దం కాకుండా డబ్బాలు వెదికి కంది  పప్పు పట్టుకొచ్చింది. మరి పెళ్లి అంటే పప్పు అన్నం వండాలి కదా అన్నాయ్! అంటూ ఆరిందలా చెప్పింది. అవునని తల ఊపాడు బాబు. 

సరే ఇన్ని తెచ్చాం కదా.. ఉత్తిత్తి పొయ్యి మీద వంట చేయడం ఎలా.. నిజంగానే పొయ్యి పెడదాం..అంది పాప.

అమ్మో కాలుతుంది నాకు భయం. అమ్మ కొడుతుంది కూడా అన్నాడు బాబు. 

అమ్మ నిద్రపోతోంది గా .. ఈ లోపులో పొయ్యి వెలిగించడం నేర్చుకుందాం..అంది పాప. అమ్మ మంట దగ్గరికి వెళితే చెయ్యి కాలుతుంది అని అసలు పొయ్యింటి వైపే వెళ్ళ నీయదు. ఇప్పుడేమో..పాప నిజంగానే మంట వెలిగించి అన్నం కూర వండుతానంటుంది. ఆపేది ఎలా !? అని ఆలోచిస్తున్నాడు బాబు.  

పాప పిల్లిలా లోపలి వెళ్లి అగ్గిపెట్టె కోసం  పొయ్యింట్లో  వెతికింది. కనబడలేదు.  పాపకి అందకుండా పైన కిటికీలో పెట్టి ఉంచింది అమ్మ. పాపకి ఎప్పుడు ఆసక్తి. చిన్న అగ్గిపుల్ల గీయగానే మంట ఎందుకు వస్తుంది..? పొయ్యి వెలిగించడానికి గడ్డి చుట్ట ఎందుకు పెడతారు? కందికట్టె ఎందుకు అలా వామి వేసి పెడతారు?  నెక్కలం  నుండి తాతయ్య జీతగాళ్ళతో.. బండి మీద మామిడి పుల్లలు వేసుకొచ్చి అలా కొండ ఆకారంలో గూడు  కట్టి  ఉంచి వెళతారు ఎందుకమ్మా!అని ప్రశ్నలు మీద ప్రశ్నలు  అడిగేది.  అమ్మ మాట్లాడేది కాదు.

"కూతురు కందికంపతో, సీమ తుమ్మ పేళ్లతో, పొగ వచ్చి  ఇబ్బంది పడుతుందని.. మీ తాత బాధపడిపోయి.. మామిడి పుల్లలు గూడు కట్టి వెళతాడు" అని చెప్పేది నానమ్మ.  

పాపకి అగ్గి పెట్టె దొరకలేదు. అంతలో గుర్తుకువచ్చింది..ఇంట్లో ఇంకో చోట అగ్గి పెట్టె ఉంటుంది. పడమటింట్లో  గూట్లో దీపం పెట్టె దగ్గర అగ్గిపెట్టె ఉంటుంది అని పాపకి తట్టింది. 

 అక్కడ అగ్గిపెట్టె ఎందుకు ఉంటుంది అంటే..అమ్మ రోజూ చీకటి పడుతుండగానే.. కాళ్ళు చేతులు కడుక్కుని..పడమటింటిలోకి  వెళ్లి గూటిలో ఉన్న ప్రమిదలో ఆముదం పోసి వత్తి వేసి  వెలిగించి.."ఇరుగు చల్లన,పొరుగు చల్లన, మా ఇంట బిడ్డ-పాప పాడి పంట చల్లగా ఉండాలి” అనుకుంటూ దణ్ణం పెట్టుకుని వచ్చి తర్వాత బుడ్డి దీపాలు రెండు, ఇంకో పెద్ద లాంతరు  వెలిగించు తుంది కదా! 

ఇప్పుడు అక్కడ పెట్టి ఉన్న అగ్గిపెట్టె తెచ్చి  పొయ్యి వెలిగించాలి అనుకుని అక్కడికి వెళ్ళింది. పాప చిన్నది కదా! అక్కడా అగ్గిపెట్టె అందలేదు. ముక్కాలి పీట  వేసుకుని ఎలాగోలా అగ్గిపెట్టె అందుకుని వరండాలోకి వచ్చింది. 

అంతలో అమ్మ  నిద్రలో కదిలింది. అమ్మ లేచేస్తుంది. అయ్యో! ఇవాళ కూడా అగ్గిపుల్ల వెలిగించి మంట ఎలా వస్తుందో చూడటం కుదిరేటట్టు లేదు అని దిగులుపడింది పాప. 

బాబు,పాప ఇక్కడే ఉన్నారుగా, ఎక్కడికి వెళ్లొద్దు  ఇక్కడే ఆడుకోండి అని చెప్పేసి మళ్ళీ  కళ్ళు మూసుకుంది అమ్మ. 

 అమ్మ నిద్ర పోయింది అని నిర్దారించుకున్నాక  పాప అగ్గిపుల్ల గీసింది. అమ్మ అంటించినట్లు  పుల్లలు అంటుకోవడం లేదు. ఏం  చేయాలబ్బా!  అని ఆలోచించిది.

బాబు..అన్నీ చూస్తూ కూర్చున్నాడు. గాలి వస్తుంది కదా,అందుకే అంటు కోవడంలేదు. మంచం క్రిందకి వెళదాం రా..అంటూ..బాబుని పిలిచింది.. బాబు పాప ఇద్దరూ మంచం క్రిందకి చేరారు. కంది పుల్లలు ముక్కలు చేసి  పాత పుస్తకం తెచ్చి కాగితాలు ముక్కలు చేసారు. అవన్నీ గుట్టగా పోసి అగ్గిపుల్ల గీసి ఆ కాగితాల కుప్పకి అంటించింది పాప. మంట రాజుకుంది..  అమ్మయ్య..నాకు పొయ్యి వెలిగించడం వచ్చేసింది అంది సంతోషంగా.

మెల్లగా మంట రాజుకుని నులక మంచంకి అంటుకుంది. అసలే రంగు రంగుల  మంగళగిరి నూలుతో అల్లిన నులక మంచం అది. ఆ మంచం పై అమ్మ బొంత వేసుకుని పడుకుని ఉంది.నూలు మధ్య నుంచి బొంత అంటుకుని అమ్మకి సెగ తగిలింది.. మంట ప్రాకి నేల మీద జీరాడే అమ్మ జుట్టుకు అంటుకుని ఉండేది కూడా 

ఉలికి పడి  అమ్మ లేచింది. మంచం క్రిందకి తొంగి చూసింది.. మంచం క్రింద  దొంగ పిల్లుల్లా పాప బాబు పడుకుని గడ్డం క్రింద చేతులు ఉంచుకుని ఆసక్తిగా మంట వైపు చూస్తూ  కనిపించారు. అమ్మ కంగారు పడి  మంచం లేపి పిల్లల ఇద్దరినీ చేతులు పట్టుకుని ఇవతలకి లాగి గబా గబా  మంచి  నీళ్ళ కుండ లేపి ఆ మంట పై గుమ్మరించింది. 

మంట ఆరిన తర్వాత పిల్లలు వైపు చూసుకుంది.బిక్కు బిక్కు మంటూ నిలబడ్డ పాప,బాబు వద్దకు వచ్చి.. వాళ్ళకి ఎక్కడన్నా కాలిందేమో అని కంగారుగా చూసుకుంది. ఏమి కాలేదు. అమ్మయ్య ! అని నిట్టూర్చి ..

బాబు.. ఈ పని ఎవరు చేసారు?  అని గద్దించి అడిగింది. బాబు మాట్లాడలేదు. పాప వైపు అనుమానం గా చూసి ..ఓహో..ఇది నీ పనా! నీతో చస్తున్నాననుకో! అన్నీ వెదవ  సందేహాలే! మంట ఎలా వస్తుందో కనుక్కున్నా వన్న మాట. ఇంకో సారి అగ్గిపెట్టె అంటుకున్నావో .. వాత పెడతాను జాగ్రత్! అంది అమ్మ హెచ్చరికగా 

ఆ మాట ప్రకారమే అమ్మ ఎపుడు పుట్టింట్లో వంట గది వైపే అడుగు పెట్టనీయ కుండా పెంచింది.
పదిహేడు ఏళ్ళు నిండే టప్పటికి పెళ్లి అయి అత్తా గారింట్లో పొయ్యి వెలిగించడమే!

పాపకి ముప్పయి ఏళ్ళ అప్పుడు .."అమ్మ" కి బాగోకుండా వచ్చింది , కేన్సర్ అని తెలిసి అన్ని  రకాల ట్రీట్ మెంట్స్ ఇప్పించినా ఆ మహమ్మారికి తలవంచక తప్పదని తెలిసి పాప,బాబు,చెల్లి ఎంతో  ఏడ్చారు.పాప అయితే..  బిడ్డని,భర్తని,ఇంటిని మరచి అమ్మని చూసుకుంటూ మూడు నెలలు అలాగే ఉండి  పోయింది. పాప కి ఉన్న బాయ్ కట్ హెయిర్ స్టైల్  పెరిగి  పోతూ ఉన్నా కూడా అమ్మని ఒదిలి పార్లల్ కి కటింగ్ కి వెళ్ళడం ఇష్టం లేక పోయింది. కటింగ్ కి వెళ్లి వచ్చే లోపు అమ్మ చచ్చిపోతే అని భయం.దగ్గర లేకపోతే అమ్మని ఎవరు చూస్తారు అన్న బాధ కూడా! అప్పుడు   ఆ అన్నయ్యే స్వయంగా  చెల్లికి క్రాప్ చేసాడు. అది అన్నచెల్లెళ్ళ అనుబంధమే  కాదు.. అమ్మ పై ప్రేమ కూడా. 

ఇంతకీ ఆ పాప చెప్పేది ఏమిటంటే.. అమ్మ పడుకున్న మంచం క్రింద దూరి..మంట వెలిగించడం నేర్చుకున్న పాప అదే నులక మంచం పై "అమ్మ"  పడుతున్న విపరీతమైన బాధ ని  చూసింది. ఇరువది ఏడు రోజులు చెంచా  మంచి నీళ్ళు కూడా మింగుడు పడక నిరాహారంగా ఉండి  కూడా  తానూ మరణిస్తే బిడ్డల మంచి-చెడు ఎవరు చూస్తారు అన్నట్లు  బిడ్డల వైపు ప్రేమ దృక్కులతో చూస్తూ.. ఉండేది. 

క్రమేపీ ఆ కళ్ళ ల్లో జీవం తగ్గి గాజు కళ్ళు గా మారిపోయి.. మరణం కోసం ఎదురు చూస్తున్నట్లు ఉండేది.  విజయదశమి వెళ్ళిన మర్నాడు సాయంసమయంలో వీధిలో దేవుడి ఊరేగింపు జరుగుతుంది.అమ్మ చూస్తానని అడిగింది. బాబు పాప అమ్మని వరండాలోకి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి చూపించారు. ఆరోజు రాత్రి నాన్న మందు తాగి వచ్చి అమ్మను తిడుతున్నాడు. ఆ స్థితిలోకూడా తల్లిని తిడుతున్న తండ్రిపై అసహ్యంతో పాటు తమ జీవితంపై విరక్తి వచ్చేసింది.  అమ్మా! నాన్న ఎవరినమ్మా తిడుతున్నాడు  అని అడిగింది పాప. “నన్నే” శక్తి కూడదీసుకుని అంది అమ్మ.ఆ మాట వెనుక జీవితకాల వేదన కష్టాలున్నాయి పితృస్వామ్య పీడన వుంది. అమ్మ కనుల చివర ఒకే ఒక కన్నీటి చుక్క. అది చూసిన పాపకు గుండెలు పగిలేలా పెళ్ళున దుఃఖం. తల్లి తలకు చెరోవైపు కూర్చుని పాప బాబు గతాన్నంతా తల్చుకుని పొగిలి పొగిలి ఏడ్చారు. ఆ రోజు రాత్రి  తల్లి బాధ  చూడలేక పాప ఇలా అడిగింది.."అమ్మా! ఎప్పుడు చచ్చిపోతావు అమ్మా..అని.

అమ్మ పడుకుని ఉన్న మంచంకి తిన్నగా మంచం వేసుకున్న పాప బాబు పడుకుని ఉన్నారు. బాధతో మగత నిద్ర పోయారు.

మధ్య రాత్రి బాబుకి మెలుకువ వచ్చి..అమ్మ వైపు చూసాడు. దగ్గరకి వెళ్లి చూసాడు.అమ్మ ఊపిరి ఆగిపోయింది.మంగళగిరి నూలుతో అల్లిన నులక మంచం పైనే అమ్మ ప్రాణం వదిలింది.

బాబు చెల్లి దగ్గరికి వచ్చి ..అమ్మా..!  అమ్మ చచ్చిపోయింది అని చెప్పాడు. పాప పెద్దగా ఏడ్చింది. అమ్మా..!  ఏ బిడ్డా అడగ కూడని మాట అడిగాను కదమ్మా ‘’అని కుమిలి కుమిలి ఏడుస్తుంది.. ఇప్పటకీ కూడా.

 చిన్నప్పుడు తెలియక అమ్మ పడుకున్న మంచం క్రింద నిప్పు అంటించిన పాప ..పెద్దయ్యాక అమ్మ అంటే చాలా ఇష్టం పెంచుకుంది. అయితే సంప్రదాయానికి   విరుద్దంగా అమ్మని సాగనంపడానికి  మరుభూమి దాకా వెళ్ళ  లేక పోయింది. బాబు మాత్రం అమ్మ చితికి నిప్పు అంటించి వెక్కి వెక్కి ఏడ్చాడు.  

( పాప బాబు ఎవరో కాదు.. నేను, అన్నయ్య,  అమ్మ జ్ఞాపకంతో.. దుఃఖభారంతో..) 

 అమ్మంటే ఏమిటో తెలియాలంటే ఒక అమ్మగా మారాలి కదా!  అమ్మ ప్రేమతో పాటు అమ్మ కష్టాలు కన్నీళ్ళు అర్దం కావాలి కదా! (సూపర్ మామ్ అన్న ఓ..బ్లాగ్ ఫ్రెండ్  కామెంట్ కి స్పందించి ఈ పోస్ట్)

26, నవంబర్ 2012, సోమవారం

వెన్నెల సాక్షిగా విషాదం
చల్లగా కురిసే వెన్నెలతో పాటు  మంచు కూడా  పోటీ పడి  కురుస్తున్న ఆ  రాత్రి సమయంలో ఎదలో ఏదో ఏదో సవ్వడి. అలల సవ్వడిలా

వెంటాడుతున్న జ్ఞాపకాలు అవిశ్రాంతంగా  వెలుగుతూ..తమ ఉనికిని చూపుతున్న మిణుగురుల్లా

ప్రక్క మీద నుండి లేచి తలుపు తీసుకుని బయటకి నడిచాడు శరత్.

మెల్లగా డాబా ఎక్కాడు. ఇంటి చుట్టూ పెరిగిన కొబ్బరి చెట్ల మధ్య నుండి పడమర వైపుకు ఒరిగిన చంద్రుడు. దశాబ్దాలుగా అలవాటైన దృశ్యం. ఆ దృశ్యాన్ని పంచుకునే మనసైన తోడు  కోసం వెదుక్కునే మనసు.

ఆహ్లాదకరమైన వాతావరణం కరువైపోయిన యాంత్రిక జీవనం నుండి బయట పడి  కాస్త ప్రాణం ఊపిరి పోసుకోవాలంటే అప్పుడప్పుడు ఇలా బయటకి రావాల్సిందే! పోగొట్టున్నదేదో వెదుక్కోవాలంటే జ్ఞాపకాలని జల్లెడ పట్టాల్సిందే!

ఆ రోజు సాయంత్రం నుండి  తన మదిలో మెదిలే ఊసులు, చిత్రంగా అనిపించే స్పందనలు.  కాలాన్ని ఓపాతికేళ్ళు వెనుకకి త్రిప్పితే  పోయిన పెన్నిది ఏదో దొరికి మరలా  ప్రాణం పోసుకున్న జ్ఞాపకాలు, సత్యం అనిపించే అనుభూతులు. ఇలాంటి  అనుభూతులు కొరకైనా మళ్ళీ మానవుడిగానే పుట్టాలనే బలీయమైన ఆకాంక్షలు. మళ్ళీ అంతలోనే ముప్పిరిగొన్న విషాద వీచికలు.

చిత్రంగా ఇవన్నీ పంచుకోవాలనుకునే తోడూ కోసం వెదుక్కోవడం ఆ వెదుక్కునే పని లేకుండానే.. ఎద లయలలో ధ్వనించే ప్రాణ తేజం నడిచే మనిషిలో ప్రణవ మంత్రం "అమృత"

ఆ ఆమృత కోసం ఓ.. శరత్ చంద్రుడి .. మనస్పందన... వెన్నెల్లో.. అక్షరాలుగా మారి.. ప్రవాహంలా సాగుతున్నాయి.

"అమృతా" ఎలా ఉన్నావ్?  ఇది పలకరింపో,  క్షేమ సమాచారమో! నాలో ఉన్న  నిన్ను నేనడగకుండా ఉండలేను

ఎన్నో ఏళ్ళ  తర్వాత కార్తీక పున్నమికి మన ఊరికి వచ్చాను. కుటుంబమంతా  కలసి పౌర్ణమి పూట  సొంతింట్లో నోము నోచుకోవాలని అమ్మ కోరిక. ఆమె కోరిక కాదనలేక ఎంత పని ఒత్తిడి ఉన్నాదూరాభారం అయినా  అన్నదమ్ములందరూ,అక్క ,చెల్లి  అందరం ఊరికి రావాలనుకున్నాం.

అందరికన్నా నేనే ముందుగా ఊరికి వచ్చాను. ఎంతైనా సొంతూరిపై ఉన్న మమకారం కదా! ఉద్యోగ హోదాలు వాహన సౌకర్యాలు,ఆధునిక వసతులు మధ్య జీవించే నేను వచ్చీ రాగానే అమ్మ చేతి వంట తిని..స్వచ్చమైన గాలికి ఊపిరి పోసుకోవాలని. కాళ్ళకి చెప్పులైనా లేకుండా వడి వడిగా బయట పడ్డాను. ఆత్మీయుల పలక రింపులు వింటే మమతల గంగ పొంగి నట్లయింది.

పొలం గట్ల వెంట నడుచుచుకుంటూ ఏటి ఒడ్డుకు చేరుకున్నాను.

సాయంత్రం ఎండకి తళ తళ మంటూ నదిలో ఎన్నో  వర్ణాలు, రంగుల హరివిల్లులు. అది చూస్తూనే   మనసు రాగరంజితమైనది.చప్పున నువ్వు గుర్తుకు వచ్చావు.ఆ రంగుల కళ కళల లో నీ నవ్వులు కనిపించాయి.ఆ తుళ్ళింతలు.. నన్ను కవ్వించే మంద స్మితాలు ఓహ్ అన్నీ కనుల ముందు కదలాడాయి.

నవ్వులు రువ్వే పువ్వమ్మా..నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా అనే ఉంటాను కదా!

అలవాటుగా  కొంచెం ముందుకు నడిచాను. నీ మనసులా స్వచ్చంగా ఉన్న నీటి ప్రవాహం. అప్పటి దాకా వడి వడిగా  ప్రవహించి.. కడలి ఒడిని చేరుకున్న కృష్ణమ్మ మందగమనంతో.. సాగరుడిలో ఐక్యమవుతున్న అపురూప దృశ్యం. ఆ దృశ్యం చూడటానికి ఎన్ని జన్మలు అయినా చాలవు అనిపించేటట్లు.

ఎంత మనోహర దృశ్యం.! ప్రాక్ దిక్కున అనంత సాగరుడు. దక్షిణం,ఉత్తరం అంతా అనంత జలరాశి. ఆ కెరటాల మృదు మధుర ద్వనాలు తనలో ఐక్యం చేసుకునేందుకు గా సాగరుడు మునుముందుకు వస్తూ ఎగసి పడే కెరటాలు ఓహ్ ! ఆ దృశ్యం చూస్తుండగా నా హృదిలో మేల్కొన్న భావాలు ఏమని వర్ణించను అమృతా..!

ఈ సాగర సంగమాన్ని చేయి చేయి కలుపుకుని జతగా ఎన్ని మార్లు చూసి ఉంటాం!?  ఎన్ని సూర్యోదయాలు,ఎన్ని సూర్యాస్తమయాలు. ఈ అనంత ప్రకృతిలో నువ్వు నేను ఏకమైన మనసుతో వొదిగిపోయాం.! నాకు ఇప్పుడు కూడా అదే ఫీలింగ్. నువ్వు నాతో ఉన్నావన్న భావన. ఎన్నిమార్లు  కార్తీక పుణ్య స్నానాల జన సమూహం నుండి మనం దూరంగా జరిగిపోయి వెన్నెల్లో జలకాలాడాం!? ఎంతగా   మనసు  దాహార్తిని తీర్చుకున్నాం? ఇప్పడేది ఆ  ఆనవాలు? స్పందనలు కూడా కరువై  నడుస్తున్న శిలా రూపిని  నేను.

 చీకట్లు ముసురుకుంటున్నాయి.ఈ రోజు సోమవారం కదా! పుణ్య స్నానాల సందడి. పట్టణ వాసపు పిల్లలు.  పెద్దల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి సముద్రం ముందు సందడి చేస్తూ..

 కొందరు చిన్నారుల ఎదురు చూపులు చందమామరావే జాబిల్లిరావే  అంటూ..

ఆ పాట రేడియోలో  నా కోసం నువ్వు ఎప్పుడు అంకితమిచ్చే పాట  నేను మరచిపోతే కదా! హరిప్రసాద్ చౌరాసియ వేణువు చిందించిన నర్తనకి ఒడలు పులకించని  తనువు ఉంటుందా!

చాందిని రాత్  మే ఏక బార్ తుజే దేఖా హై అనుకుంటూ నేను నిన్ను తొలిసారిగా చూసిన ప్రదేశం ఇదే కదా!

నా ప్రాణ ప్రదమయిన నువ్వు, నువ్వు నేను కలసి ప్రేమించే ఆ ప్రదేశం  స్పందన లేకుండా  ఎలా ఉండగలను.?

నాకు ఈ నాటి చంద్రుడిని చూస్తే  గురుదత్ గుండెల్లో గుబులు రేపిన  "చౌద్విన్ కా చాంద్ " వహీదా రెహమాన్ గుర్తుకొస్తుంది. నువ్వు గుర్తుకు వచ్చావు.

చందమామ వచ్చాడమ్మా! తొంగి తొంగి చూసాడమ్మా అన్నట్లు అలల   వెనుక నుండి పైపైకి వస్తున్న చంద్రుడు. గుండెల్ని తీపి కోత  కోసే "రమేష్ నాయుడి స్వర కల్పన  ఎన్ని సార్లు ఏకంగా విని ఉంటాము.

నేను ఒక నాడు అతిధిగా మీ ఇంటికి వచ్చినప్పుడు..నన్ను గేటు వరకు సాగనంపడానికి వచ్చి.. ఆకాశంలో.. చందమామని చూడమన్నట్లు సంజ్ఞా  చేసావు.

ఆ చంద్రుడిని చూసి "నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు" పాట  గుర్తు చేసాను. అదే పాట ని  ఎన్నిసార్లు  రేడియోలో కోరి వినిపించావు తలచుకుంటేనే నా మనసంతా బరువుగా మారిపోతుంది.

మన మధ్య చిరు చిరు అలకలు,కోపతాపాలు కరిగిన క్షణాలు ఒకరిలో ఒకరు ఒదిగిన తరుణాలు ఇక్కడే  కదా!

చంద్రోయం ..చంద్రోదయం అంటూ ఆ జంట బదులు మనం జీవించిన కాలాలు ఎలా మరువ గలను? ఆ పాట  చిత్రీకరణ లో ఉన్న ప్రదేశం ఇలాటిదే కదా!అందుకే ఆ దృశ్యంలో మనమూ  మమేకం అయిపోయే వారిమి కదా!.

ఏటి ఒడ్డున నేను  నీ కై ఎదురుచూసిన నిమిషాలు..నువ్వేమో ఆలస్యంగా రావడం,   వచ్చి  నీ  ఆలస్యానికి క్షమాపణ చెప్పి

 "వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు వెన్నెలలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి వందనాలు" అని పాడి నన్ను చిత్తు  చేసిన తరుణాలు నేను మరువగలనా ప్రియా..!

మన వివాహం జరగడం అంటే  నింగి నేల ఒకటై నట్లు.

మన వివాహం జరిగినట్లు మనం ఇరువురం కలసి కలగన్నప్పుడు మన ఇరువురి మదిలో ఒకటిగా మెదిలిన పాట  "నేల  మీది జాబిలీ నింగి లోని సిరి మల్లి "

ఎన్ని కలలు  కన్నాము.   మోయలేని ఈ ఎద  బరువు కొండలా  పెరిగిపోతుంది. పంచుకునేందుకు  నీవూ లేవు..

అమృతా! పెరిగిన ఎద బరువు మోయడం అంటే మాటలా?  ఏళ్ళ కొలదీ ఆ బాధని  నేను అనుభవిస్తూనే ఉన్నాను.

నేను ఉద్యోగం వచ్చి దూరంగా  వెళ్ళిపోయినప్పుడు నా ఎడబాటుని భరిస్తూ నీవు ఒంటరిగా పాడుకుంటూ ఉన్నానని చెప్పిన పాట నేను మర్చిపోతే  కదా!

పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిలీ అడిగింది, పుష్కరమల్లె వచ్చి పొమ్మని గోదారి అడిగింది. ఇప్పుడు ఆపాటని  ఎప్పుడు విన్నా   గుండె కోతని  రేపుతూనే ఉంటుంది.

మన వివాహం జరపాలని మీ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళని అడిగినప్పుడు మనమధ్య ఉన్న తారతమ్యాలు అడ్డుగోడలై మన చుట్టూ కోటగోడలై నిలిచి

"జానకి కన్నుల జలధి తరంగం,రాముని మదిలో విరహసముద్రం.."

మనం దూరంగా ఉండి అనుభవించలేదా!

నీ వివాహానికి మీ వాళ్ళు సిద్దపద్దప్పుడు.. మరొకరి ఊహే భరించలేని నువ్వు..ఆత్మహత్య చేసుకుంటూ.. నాకు  వ్రాసిన   ఉత్తరంలోని ఆఖరి మాటలు  నేను కలనైనా మరువగలనా!?  

కార్తీక పున్నమి వేళలోన  కలికి వెన్నెల కెరటాలపైన వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నా రాజు ఈ రోజు.

ఈ పున్నమి.. ఈ వెన్నెల, ఈ నదీ, ఈ సాగర సంగమం అన్నీ ఇప్పటికీ  నిన్నే గుర్తుకు తెస్తున్నాయి. నిన్ను మర్చిపోతే కదా!  మరిస్తేనే  జ్ఞాపకం చేసుకోవడం అనేది  ఉంటుందని అపార్ధం చేసుకునేవు సుమా!

కాలం గాయాలని మాన్పుతుంది అంటారు. గాయం మానినా, గాయం తాలూకు చిహ్నంలా నీ అమృత ముద్ర నా మనసుపై  ఎన్నటికి నిలిచే ఉంటుంది.

నిర్మానుష్యమైన  ఆ సాగర  తీరంలో, ఈ సంగమ ప్రదేశం లో  నా మనసు వొంటరయి నీ కొరకు విలపిస్తుంది.

ఆ తీరంలోనే నీవు  శాశ్వతంగా విశ్రమించిన చోట అమర ప్రేమకి ఆనవాలు గా ఓ సమాది. ఆ సమాధి ని తాకే కెరటాలు ప్రేమకి అభిషేకం చేస్తూ..

అమృతా! ఇదంతా నేను ఎవరికీ చెప్పను ? నీకు తప్ప!

అందుకే  నీదరికి చేరని ఈ లేఖని నా మనసుకి ఊరట కల్గించుకోవడం కోసం వ్రాసుకుంటున్నాను. అంతే, అంతే!!

"కలసిన ఆత్మల అనుబంధాలే ఏ జన్మకు  విడిపోలేవు తనువులు వేరైనా దారులు వేరైనా ఆ బందాలే నిలిచేనులే!"24, నవంబర్ 2012, శనివారం

"అమ్మగా" ఇరువది ఐదేళ్ళు

మా ఇంటి వెలుగు, నా కంటి దీపం..

మా చిరునవ్వుల చంద్రుడు .."నిఖిల్ చంద్ర" తాతినేని  .. పుట్టిన రోజు.. ఈ రోజు. 


చిన్ని..! బంగారం.. !!  

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో.. 
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ.. 
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో 
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ.. 
భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ... 

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.                                                 ప్రేమతో ..    దీవెనలతో..     " అమ్మ" 23, నవంబర్ 2012, శుక్రవారం

మంత్రించే రింగ్ టోన్

కార్తీకమాసం .. ఏకాదశి తిది .. ఈ కార్తీకం లో నేను శివాలయం కి వెళ్ళడం ఇవాళే  తొలి రోజు. ఈ సంవత్సరం  తెల్లవారుఝామునే  పుణ్య స్నానం, దీపారాధన కోసం  దేవాలయానికి  వెళ్ళే ఓపిక లేక వెళ్ళడం మానుకున్నాను.

 సరే ఈ సాయంత్రం స్వామి కరుణతో..ప్రదోష కాలంలో మహా దేవుని సందర్శించుకుని.. నక్షత్ర మాల పూజ లో పాల్గొని దీపార్చన కావించి..

 రేపు మా "చంద్రుని" పుట్టిన రోజు కదా! ఏకాదశ రుద్రాభిషేకం గురించి మాట్లాడాలి అని  పూజారి గారి కోసం ఎదురుచూసాను.  రుద్రాభిషేకం,నక్షత్ర మాల పూజ కేటాయింపు విషయం గురించి  వివరాలు కోసం అడిగితే "అరె మీరు చెప్పలేదు కదా! అందుకే వేరేవారికి అవకాశం కల్పించాం" అని చెప్పారు పూజారి గారు.

మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు .అందుకే  తేదీ కేటాయింపు వివరాలు అన్నీ చెపుతూ.. మీకు మెయిల్ పంపాను. అని చెపితే ..మెయిల్ బాక్స్ చూడలేదని చెప్పారు ఆయన.  సేల్పోన్ కి దొరకక ,మెయిల్ బాక్స్ చూసుకోక, స్వయంగా కలవాలని వెళితే ఆయన దొరకక ..  అందరు బాగోగులు చూసే  దేవుని కన్నా పూజారి గారే బిజీగా ఉన్నారు. నేను, నా బోటి వాళ్ళు పూజారులని అలా బిజీ చేస్తారు కదా!..:)

సరే.. ఆ శివయ్య కృప అలా ఉంది అనుకుని సర్దుకున్నాను. ఇంటికి వచ్చాను.

హరుని దర్శనం అయింది హరి  దర్శనం కి కూడా వెళితే బాగుండును అనిపించింది. మా కాలనీ లో ఉన్న "రామాలయం" కి వెళ్ళాను.  (రామాలయంలో సమసంఖ్యలో ప్రదక్షిణ లు చేయాలని మా ఫ్రెండ్ చెప్పింది.)
రెండు ప్రదక్షిణలు గావించుకుని హారతి ఇస్తారని వేచి చూస్తున్నాం.

అంతలో.. పూజారి గారి సేల్పోన్ రింగ్ అయింది.. "తొలిసారి మిమ్ముల్ని  చూసింది మొదలు" .. పాట రింగ్ టోన్ .. పూజారి గారు  పూజ ఆపి పోన్ తీసి మాట్లాడారు.మళ్ళీ పూజ .మళ్ళీ పోన్ మ్రోగడం. నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. పూజారి గారికి చాలా ఇష్టమైన పాట  కాబోలు. ఎవరు పోన్ చేసినా సరే "తొలిసారి మిమ్ముల్నిచూసింది మొదలు"అంటూ.. ఆయనకీ తోలి ప్రేమలని గుర్తు చేస్తున్నట్లు ఉంది .. మంత్రాలు పఠించే పూజారి గారిని    మంత్రించే రింగ్ టోన్ ఇది అనుకున్నా..

భూసురులు ..అంటే భూమి మీద నడయాడే  దేవతలు .. చేసే పనిలో నిమగ్నం కావడం కంటే ఇతర విషయాలపై దృష్టి.. దేవాలయ పరిసరాలు,దైవ సన్నిది మాట మరచి కూడా పోన్ లో సంభాషణలు..

చికాకు అణుచుకుని.. తీర్ధం తీసుకుని వచ్చేసాం. వచ్చే దారిలో "సాయిబాబా"గుడి..
ఈ గుడిలోకి వెళ్లాం. అష్టోత్తరం చదువుతుండగానే ఈ పూజారి గారి పోన్ రింగ్ అయింది.పూజ ఆపి ఓ,,అయిదు నిమిషాలు మాట్లాడారు.

నాకు చాలా చిరాకు వేసింది. మొబైల్ తీసుకుని వెళ్ళకుండా ప్రశాంతత కోసం గుడికి వెళ్ళానా.. అక్కడా పోన్ ల గోలే!  సేల్పోన్ టాక్ లు వినడానికే వెళ్ళినట్లు గా..  ఇవి దేవాలయాలా..సెల్లాలయాలా?

అబ్బబ్బ! ఏం గోలండీ!!స్వర్గం నరకం ఎక్కడో లేవు.. మనం సృష్టించుకున్నవే! మనం ఇతరులని ఇబ్బంది పెట్టేందుకు ఉన్నవే! అంతే సుమీ!!21, నవంబర్ 2012, బుధవారం

ఇంతలోనే కరిగి పోయావా!?

నాకైతే అసలు నమ్మశక్యంగా లేదు.

ఏం  చేయను..? రెండు సంవత్సరాలు ఎలా గడచి పోయాయో..ఏమో!

ఎన్ని అనుభవాలు,ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని భావాలు వెలిబుచ్చి నిన్ను పరిపుష్ట్యం చేయడానికి నిద్రాహారాలు మానాను.

పాలు పొంగళ్ళు, మాడి మసిబొగ్గుగా మారిన వంటలు,  హాజరు కాని విందు వినోదాలు..అన్నీ నీవల్లనే !

నువ్వు పరిచయం కానప్పుడు ఎలా గడచిందో..గుర్తుకు రావడంలేదు. పరిచయం అయిన కొద్ది రోజులకే అందరిని మరపించావు. నీ మాయలో పడేసావ్!

ఎక్కడికైనా వెళ్ళానా..అక్కడ ఉండగల్గానా!?  వచ్చేయి వచ్చేయి..అంటూ ఉండేదానివి.ఎంత త్వరిత గతిని ఇల్లు చేరి..నిన్ను కళ్ళ నిండుగా చూసుకోవాలని ఒకటే ఉబలాటం.

నువ్వు పరిచయం అయ్యాక ఒక్క అక్షరం ముక్క వ్రాస్తే ఒట్టు. ఎంత మంది స్నేహితులని ఇచ్చావు. పాత వాసనలు లేకుండా నీవే  నా శ్వాస ,నీవే నా ధ్యాస గా మారిపోయావు.

ప్రతి రోజు నిన్ను కొత్త విషయాలతోముంచెత్తే యాలని ఆలోచనలకి పదును పెట్టడమే సరిపోయింది.

నా ఆలోచనలని పంచు కున్న ప్రియ నేస్తానివి.నా మనసులో మాటని ఆత్మీయులకి అందించిన వారదివి.
నన్ను నాకే సరి క్రొత్తగా పరిచయం చేసిన జాణవి.

నా అనుభూతులని, భావాలని,కోపతాపాలని,నిరసన ని,ఆవేశాన్ని,అన్ని రకాల పైత్యాలని  అన్నింటిని భరించిన ఒకే ఒక నేస్తానివి.

నీకు మించిన నెచ్చెలి  వేరవరు ఉంటారు.. అందుకే నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

నన్ను ఎప్పుడు ఇలాగే అంటి ఉండాలని,వెన్నంటి ఉండాలని .. ఆకాంక్షిస్తూ..
                                                హమారే  యే సఫర్ దో  బరస్ పూరా  కర్లీ
                                                                                                                             ప్రేమతో... నీలో నేను.

వర్ధమాన రచయితల దుస్థితి

పత్రికలలో వర్ధమాన రచయితల కథలు,కవితలు,వ్యాసాల ప్రచురణకు సంబంధించి అనేక విమర్శలు వినవస్తూ ఉంటాయి. అవి నిజం కూడా!

నిన్న పేస్ బుక్ లో ఒక ఫ్రెండ్ షేర్ చేసిన కవిత గురించి ఒకరి కామెంట్ " ఈ కవిత చాలా బాగుంది. ఇలాంటి కవితలు   నవ్య లాంటి పత్రికలలో, మరికొన్ని పత్రికలలో కనిపించవు ఎందుకని..అని. "

"అదంతా ఓ..రాజకీయం.." అని నా వ్యాఖ్య.

నేను ఎంత విసిగి పోయాను అంటే..  నాలుగైదేళ్లుగా ఎంత సునిశితంగా పరిశీలించిన పిమ్మటనే  నేను  ఆ వ్యాఖ్య చేసాను. ఈ క్రింది  విషయాలు చదివితే కొందరికైనా కొన్ని విషయాలు అవగతమవుతాయి ..అనే ఉద్దేశ్యంతో.. ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

నిజంగా వర్ధమాన కవులకి రచయితలకి పత్రికలలో స్థానమే లేదన్నది.. నా అభిప్రాయం కూడా.
ఈ బ్లాగ్ ల పుణ్యమా అని అనేక మంది ఎంతో  ఉత్సాహంగా వ్రాస్తున్నారు.  ఆ రచనలలో ఎంతో  పరిపక్వత,నవ్యత కనబడుతూ ఉంటాయి. అందుకు నిర్ధారణ ఏమిటంటే.. ఆ  పోస్ట్ లకి   లభిస్తున్న హిట్స్..ని తార్కాణంగా తీసుకోవచ్చు. బాగోక పొతే ఎవరు కావాలని అన్ని సార్లు చూడరు కదా!

ఇక పత్రికలో చూస్తే కొంత మంది రచనలకి మాత్రమే స్థానం కేటాయించినట్లు కనబడుతూ ఉంటుంది. ఒక పేరెన్నిక కల్గిన దిన పత్రిక సాహిత్యం కి సంబంధించిన పేజీలో కాని ,ఆదివారం అనుబంధం లో..కానీ..ఎక్కువ ఆ పత్రికలలో పనిచేసే వారి కవితలే దర్శనమిస్తుంటాయి లేదా...పాత తరం కవుల ఉనికి పదే పదే కనబడుతూ ఉంటుంది. ప్రముఖ పత్రికలలో కొత్త వారిని వేళ్ళ  మీద లెక్కించవచ్చు. ద్వితీయ శ్రేణి లో ఉన్న పత్రికలలో ఎపుడో ఒకప్పుడు.. ఊపిరి పోసుకుని..అమ్మయ్య! మేము రచయితలం అని తృప్తి పడటం ,లేదా నిరాశ  చెందటం వర్ధమాన కవుల పని.
సొంతంగా ఎవరు అచ్చు వేయించుకుని ఉచితంగా పంచగలరు చెప్పండి. ఉచితంగా ఇచ్చినా చదివే నాధుడే కరువయ్యాడు. ఇలాంటి దుస్థితిలో.. రచనలు అచ్చు వేయిన్చుకోవాలన్న దైర్యం ఎవరికీ ఉంటుంది?

వర్ధమాన రచయితలూ ఉత్సాహం కొద్ది వారి కథలు కాని కవితలు కాని పంపించడం జరిగితే.. వాటి అడ్రస్స్  ఉండదు. నెలలు తరబడి వేచి చూసినా.. రచనలు వెనక్కి తిరిగి పంపటం జరగదు. ఒక వేళ  ఏ  నక్కనో  తొక్కి  వెళ్ళిన రచన ప్రచురణకి నోచుకుంటే అది ప్రచురణకి అంగీకరించామని ఫలానా తేదీ నాటి పత్రికలో ముద్రణ గా రాబో తుందనే సమాచారం అందించడం,లేదా,,మెసేజ్ పాస్ చేయడం కూడా ఉండదు.

మొన్నీ మధ్య నాకు తెలిసిన ఆవిడ వ్రాసిన కవిత ముందుగా ఆంధ్రభూమి పత్రికలోను,ఆ తర్వాత నవ్య పత్రికలోను ఒకే కవిత ప్రచురితమయ్యాయి. ముందుగా ప్రచురించిన వారు ఏ విధమైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల    ఆమె విసుగు చెంది  అదే కవితని.. "నవ్య"కి పంపారు. వారు పోన్ చేసి మరీ చెప్పి ప్రచురించారు. తీరా చూస్తే  రెండింటిలోను ఒకే కవిత.ఆవిడ ఏదైనా సమస్య వస్తుందేమో..అని భయపడ్డారు కూడా!

 ఇలా జరగడం వల్ల పత్రికల వారు   ప్రచురణ హక్కుల విషయంలో ఏదైనా భాద్యత వహించాల్సి వస్తే అందుకు రచయితను ..భాద్యులని చేస్తారేమో! ఇక స్త్రీల  కోసమే నడప బడే పత్రికల విషయంలో కూడా మిగతా పత్రికల బాటే..నడుస్తున్నట్లు ఉంటుంది. అంతా కొంతమందే! కొద్ది మందే !! వారు చెప్పిన కోణమే నూరు శాతం నిజం అన్నట్లు ఉంటాయి.

ఇంకా  ఇంకా పాత తరం వారికే కొమ్ముకాయడం,మొహమాటాలు. ప్రాంతాభిమానం,దురభిమానం ,బంధుప్రీతి , స్వజనుల కే స్థానం కల్పించడం మాని అన్ని పత్రికల వారు.. వర్ధమాన కవులకి,రచనలకి  ఎప్పుడు స్థానం కల్పిస్తారో.. భగవంతుడికే ఎరుక. ఇలా అడిగే దమ్మున్నవాడిని మీ రచనలో లోపాలు ఉన్నాయి. స్టాండర్డ్స్  లేవు అంటారు. వాళ్ళకి నచ్చితే ఏ చెత్త అయినా ప్రచురణకి అర్హత కల్గినట్లే!

అందుకే పత్రికలని వదిలి..బ్లాగుల లోను, ఫేస్ బుక్ లలోను,  వెబ్ పత్రికలలోనూ ఎంతో కొంత మంచి కథలు,కవితలు దర్శనం ఇస్తున్నాయి. అక్కడ లభిస్తున్న ఆదరణ   కూడా  తక్కువేమీ కాదు. !  ఇక్కడ వెదుక్కున్న వారికి వెదుక్కున్నంత కాక పోయినా  కొన్ని మంచి రచనలు చదివామనే సంతృప్తి కూడా ఉంటుంది. ఇలాగే పత్రికల వైఖరి  కొనసాగితే.. పత్రికలని విసిరి పడేసి.. వెబ్ సాహిత్యం వైపు ఆసక్తి చూపుతారేమో! .. ఆ కాలం వచ్చేసిన సూచనలు ఇప్పటికే కనబడుతున్నాయి కూడా!

 ఇకపై పత్రికలకి, పుస్తకానికి కాలం చెల్లిపోతుందేమో !

19, నవంబర్ 2012, సోమవారం

నా బ్లాగ్ - నా సమీక్ష
నా బ్లాగ్  ని ఫాలో అవుతున్న మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు.

నా  బ్లాగ్ లో ఫాలోయర్ గాడ్జెట్ కూడా జతపర్చుకోలేదు. అయినప్పటికీ ఇరవయి ఒక్కరు..నా బ్లాగ్ ని ఫాలో అవుతున్న వివరం తెలుస్తుంది. అనుసరిస్తున్న అందరికి మనఃపూర్వక ధన్యవాదములు. 

ఇటీవలనే  మీకు ఈ బ్లాగ్ నచ్చిందా అని అడిగినాను.  నేను ఎవరికీ ఫాలోయర్ ని కానప్పటికీ కూడా నా వైఖరి ని ఏ మాత్రం పెద్ద  విషయంగా తీసుకోక   అభిమానంగా నా వ్రాతలని మెచ్చి అనుసరిస్తున్న మిత్ర బృందం కి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ..

ఇంకొక విషయం..

నా బ్లాగ్ ని అభిమానంతో చదివి శ్రద్ద తీసుకుని వ్యాఖ్యలు పెట్టిన మిత్రులందరికీ ధన్యవాదములు.
వ్యాఖ్య పెట్టడం అంటే మనం వ్రాసిన పోస్ట్ ని కూలంకషంగా చదివి.. వారి అభిప్రాయం తో పాటు మనం వ్రాసిన వాటిలో లోపాలని గుర్తించి..సహేతుకమైన విమర్శ చేయడం,బాగుంటే ఒక ప్రశంసని అందించడం సంస్కార చిహ్నం.

 ఒకో సారి వ్రాసిన పోస్టల కంటే కామెంట్ లే ఆసక్తికరంగా ఉండే సందర్భాలు ఎక్కువే! ఒకో సారి ఎంత బాగా వ్రాసినా కామెంట్స్ రావు. ఒకోసారి అతి సాధారణంగా వ్రాసిన దానికే కామెంట్ ల వర్షం కురుస్తుంది. ఏమిటో..ఈ కామెంట్స్ ప్రహసనం నాకు అర్ధం కాదు.

ఒకోసారి  ఎంత బాగా ఉన్న పోస్ట్ కి కూడా వీలుకాకపోవడం వల్ల   కామెంట్  చేయలేం. మళ్ళీ వచ్చి చూసుకునే తీరిక కూడా ఉండక పోవచ్చు.అలాటప్పుడు.. అయ్యో ! కామెంట్ ఇవ్వలేక పోయానే అనుకుని బాధపడటం కూడా కద్దు.

ఈ మధ్య నేను కూడా కామెంట్ ఇవ్వడం మానేసాను. (ఎందుకంటే.. బ్లాగులు  చదవడం లేదు కాబట్టి)

అట్టు పెట్టిన వాళ్లకి అట్టున్నర  పెట్టాలి  అంటారు కదా! ఆ విషయంలో నేను చాలా బాగా వెనుక బడి ఉన్నాను.

ఎవరికైనా కామెంట్ పెట్టాలి అనుకున్నా కాని భయం వేస్తుంది. ఒకరు అయితే నేను వ్రాసిన ఒక కవితకి ప్రశంసా పూర్వకంగా కామెంట్ పెట్టారు. నాకు బాగా గుర్తు కూడా. ఈ మధ్య ఆ పోస్ట్ చూస్తే కామెంట్ లేదు డిలేట్ చేసి ఉంది.అలాగే నేను వారి బ్లాగ్ లో  ఒక కామెంట్ పెట్టాను. వారు ఆ పోస్ట్ డిలేట్ చేసి ప్రెష్ గా ఆ చిత్రం ని రీ పోస్ట్ చేసారు.

ఇంకొకరు అయితే మీ పోస్ట్ బావుంది అని మెచ్చుకుంటే.. మీరు అనుకునేంత బాగోలేదు లెండి.. అన్నారు. ఇక నేను ఆ బ్లాగ్ లో కామెంట్ పెట్టడమే మానేసాను.  కామెంట్ చేసేవారు..అవసరం లేకపోయినా పల్లకీ ఎక్కించి మోసే బోయీలు కాదు కదండీ.. !

కొంతమంది ఏం వ్రాసినా బాగుంటుంది. అలా అని రోజూ.. వారి వారి బ్లాగ్లోకి వెళ్లి కామెంట్ చేయడం విసుగ్గా ఉంటుంది.చూసిన వాళ్లకి ఇదేదో భట్రాజు  పొగడ్తల గ్రూప్ లాగా ఉంది అని అనిపించేటట్టుగా  ఉంటుంది  అనిపిస్తుంది కాబట్టి చదివేసి వచ్చేస్తాను. 

ఒకోకరి బ్లాగ్ లో వర్డ్ వెరిఫికేషన్ పెడతారు.అందువల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.కాని వాళ్ళు  వాళ్ళకి వచ్చే కామెంట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది కూడా.. వర్డ్ వెరిఫికేషన్ సరి చూసి కామెంట్ చేసే తీరుబాటు..ఆసక్తి కొందరికి ఉండకపోవచ్చు కూడా. వర్డ్ వెరిఫికేషన్ పెట్టిన  మిత్రులంతా.. ఆ ఆప్షన్ తీసివేస్తే బావుంటుంది.

కొంత మంది కట్టుకున్న పట్టు చీరని చూసి పీటేసినట్లు చేస్తుంటారు. కామెంట్ చేయడానికి కూడా..అర్హత ఉండాలన్నట్లు ఉంటుంది. నిజానికి  వ్రాసిన విషయం వాళ్లకి లైట్ గా తోస్తే ఓకే.. ఓకే ..ఓకే.

గతంలో కూడా ఈ కామెంట్స్ గురించి  నేను వ్రాసినప్పుడు  పెద్ద వివాదాస్పదం అయినందువల్ల నేను ఇంతకు మించి వ్యాఖ్యానించ దలచుకోలేదు. ఈ కామెంట్స్ విషయంలో నేను ఆఛి తూచి..హృదయపూర్వకంగా చేసిన కామెంట్స్ వల్ల  కూడా పోస్ట్ డిలేట్ చేసుకోవడం  చాలా బాధ కల్గించింది.

బ్లాగ్ మిత్రులందరికీ ఓ..మనవి. నేను కామెంట్ పెట్టడం లేదని అన్యదా బావించకండి. స్పందిస్తే తప్పకుండా నా కామెంట్ ఉంటుంది. పోస్ట్ చదవక పొతే కామెంట్ ఉండకపోవచ్చు.(లేదా వీలుకాకపోవడం వల్ల  కూడా)

నా ఈ బ్లాగ్ పోస్ట్ లని చదివి..మీ హిట్స్ ద్వారా నాకు ఉత్సాహాన్ని అందించి.. మీ మీ అభిమానాన్ని కొండంతగా అందించి మీలో ఒకరిగా ఆదరించి నందులకు .. అందరికి మనఃపూర్వక ధన్యవాదములు. చాలా సార్లు.. మీ స్పందనకి నేను ప్రతిస్పందన కూడా అందించలేకపోవచ్చును . అందుకు అందరికి క్షమాపణలు కోరుతూ..

నా బ్లాగ్ ని పునఃసమీక్షించుకుంటూ.. ఈ విషయం ని గుర్తెరిగి.. మీతో ఒక సారి మనసు విప్పి చెప్పాలనిపించి..

నా ఈ పోస్ట్ ..నా బ్లాగ్ - నా సమీక్ష


17, నవంబర్ 2012, శనివారం

తీగకు పందిరి ఓలే

తీగకు పందిరి ఓలే  

అవసరమైనవన్నీ సర్దుకున్నావా, అక్కడి వెళ్ళాక అవి పెట్టుకోలేదు,యివి పెట్టుకోలేదు. మర్చి పోయాను మామ్..అంటూ.. గారాలు పోతావా అడిగింది మల్లిక.

"ఓహ్.వాటే పిటి, నాకు  ట్వంటీ వన్ ఇయర్స్ దాటినా  యింకా నేను చిన్న పిల్లనే అన్నట్లు మాట్లాడతావు. నాకేం  కావాలో అది  నాకు తెలుసు. వెనుక ఉండి నువ్వే నన్ను నడిపిస్తున్నట్లు మాట్లాడకు మామ్,  నాకు  చిరాకొస్తుంది అంది వైషు.

"వైషు డియర్,  మామ్ తో అలా మాట్లాడకూడదని చెప్పానా మృదువుగా అన్నాడు  శ్రీకాంత్.

"డాడ్ మీరు కూడా మామ్ నే సపోర్ట్ చేస్తారు. అసలు నా బాధని అర్ధం చేసుకోరు. నిన్న నైట్ నుండి స్టార్ట్ చేసింది అవి సర్డుకున్నావా యివి సర్దుకున్నావా ,  డ్రెస్లన్నీ   పెట్టుకున్నావా అంటూ.
ఎవెరి థింగ్ ఆమె చెప్పినట్లే నేను వినను. ఐ డోన్ట్ లైక్  ఇట్." కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పింది.

ఆ మాటలకి హర్ట్ అయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మల్లికకి.

ఓకే.. బాయ్ డాడ్..అంటూ తండ్రిని హగ్ చేసుకుని కిస్ చేసి వెళుతూ  వొక సారి వెనక్కి తిరిగి  బాయ్..మామ్ అంటూ డోర్ తీసుకుని పోర్టికోలోకి దిగింది .వైషు కార్ డోర్ తెరచి లగేజ్ ని నిర్లక్ష్యంగా వెనుక సీట్ లో వేసి సీట్ బెల్ట్ పెట్టుకుని కారుని కదిల్చి బాయ్..అంటూ ముందుకు ప్రయాణించింది.

హాల్లో స్థాణువులా నిలబడి వున్న మల్లిక దగ్గరికి వచ్చాడు శ్రీ

"మల్లికా."..పిలిచాడు యేమిటన్నట్లు చూసింది.

"నువ్వు వైషు పట్ల మరీ యెక్కువ శ్రద్ధ తీసుకుంటున్నావేమో! తనేమి చిన్న పిల్ల కాదుగా.. గ్రాడ్యుయేషన్   అయిపోయింది.  వాళ్ళే అన్నీ తెలుసుకుంటారు. అయినా యిదేమి "ఇండియా " కాదు మనం చెప్పినట్లు పిల్లలు వినడానికి ."

"ఇండియా కాకపొతే యేమిటీ, యిక్కడయితే యేమిటీ!? మనం తనకి తల్లిదండ్రులం. మనం జాగ్రత్తలు చెపితే.. కావాల్సిన వస్తువులు మర్చిపోతే యిబ్బంది పడుతుందని గుర్తు చేస్తేనే  తన స్వేచ్చ దెబ్బ తింటుందా!పంతంగానో, ప్రేమ గానో అంది మల్లిక

"బిడ్డ యెక్కడ యిబ్బంది పడుతుందేమోనని నువ్వు అన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటావు.తనేమో అధికారం చెలాయిస్తున్నావనుకుంటుంది.ఇలాంటి గ్యాప్ మీ యిద్దరి మధ్య రాకూడదు. అది యిద్దరికీ మంచిది కాదు"  చెప్పాడు శ్రీ.

"ఏం పిల్లో  తన రూం లోకి కూడా పర్మిషన్ తీసుకుని రమ్మంటుంది.నాకైతే అర్ధం కాదు అంది. నేను యెలా పెంచాలని అనుకున్నాను. నా ఆలోచనలకి వ్యతిరేకంగా పెరుగుతున్న తనని చూసి జీర్ణించు కోలేకపోతున్నాను "అంది దిగులుగా.
 "నీ మనసుకి కష్టం కల్గినా నేను నీకొక  మాట చెప్పనా !?    పరిశుభ్రత,క్రమశిక్షణ గురించి చెవిలో యిల్లు కట్టుకుని చెప్పి చెప్పి వైషు కి  నీ పట్ల నెగిటివ్ ధోరణి ని నువ్వే పెంచుకున్నావు. ఇప్పుడు దూరం పెరుగుతుందని బాధ పడుతున్నావ్."అన్నాడు జాలిగా.

"తనలో నా పట్ల అదివరకటి కన్నా యెక్కువ నిర్లక్ష్యం,మొండితనం కనబడుతున్నాయి. నన్ను అసహ్యించుకున్నట్లు..నాకు బలమైన ఫీలింగ్." చెప్పింది.

"శ్రీ..తనకి  ఆ విషయాలు యేమైనా తెలిసాయి అంటావా!"అడిగింది అనుమానంగా.

"నో..నో.. అందుకు ఆస్కారమే లేదు.మనం యెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..అయినా యెప్పుడూ.. మనం లేకుండా తనని ఇండియాకి పంపలేదు.వెళ్ళినా మనం ముగ్గురుం కలిసే వెళ్ళాము.ఇక యిక్కడెవరు మనకి తెలిసిన వాళ్ళు లేరు.ఇంకెలా తెలుస్తుంది.అంటూ మల్లిక ని దగ్గరికి తీసుకుని.".పిచ్చీ, యిలాటి అనుమానాలతో బుర్ర పాడు చేసుకోకు.అందరి పిల్లల్లో వుండే నిర్లక్ష్యమే తప్ప మన బంగారు తల్లి ప్రవర్తనలో యే మార్పు లేదు.నువ్వన్నీ మనసులో పెట్టుకుని బాధపెట్టుకోకు.కాస్త అలా నీ ఫ్రెండ్స్ తో కలిపి.. ఓల్డ్ ఏజ్ హోం కి   వాలెంటరీ  సర్వీసెస్ చేయడానికి వెళ్ళు..ఈ రోజు స్టోర్స్ కి నువ్వు రానవసరం లేదులే! నేను యెవరిని వొకరిని అరేంజ్ చేస్తాను" చెప్పాడు. తల ఊపింది.

ఒక అరగంటకి శ్రీ కాంత్  వెళ్లి పోయాడు.

వైషు రూం లోకి వెళ్ళింది. సర్దడానికి కూడా  తనకి పని లేకుండా నీట్ గా రూం అంతా సర్దుకుని వెళ్ళిపోయింది.అనవసరంగా తనకి అతి జాగ్రత్తలు చెప్పి విసిగిస్తున్నానా  అని ప్రశ్నించుకుంది.
అలా అనుకుంటేనే కాని తన మనసుకు శాంతం కలుగదని నిర్ణయించుకుని గబా గబా తయారయి ఆమె ఫ్రెండ్ నడుపుతున్న ఓల్డ్ ఏజ్ హాస్పిటాలిటీ సెంటర్ కి వెళ్ళింది.

ఓ..రెండు గంటలు అక్కడ గడపడం ఆమెకి రిలీఫ్ నిచ్చింది.ఇంటికి వచ్చి కొంచెం స్నాక్స్ తిని స్టోర్స్ కి వెళ్ళింది. అక్కడకెళ్ళి  పనిలో పడిపోతే ..మళ్ళీ శ్రీ వచ్చేదాకా తనని తానే మర్చిపోయింది.

శ్రీ కాంత్ ని అడిగింది.."వైషూ సేఫ్ గా వెళ్ళిందా..జర్నీ బాగా జరిగింది .. నీకు కాల్ చేసిందా!? " ప్రశ్నల వర్షం కురిపించింది.

"అంతా ఓకే..మల్లికా, నీ కూతురి  పై వున్న  ప్రేమని కాస్త నా పై కూడా కురిపించు. నీ ప్రేమ తక్కువయ్యి నేను చూడు యెలా చిక్కి పోయానో..!" నవ్వుతూ జోక్ గానో, నిజం గానోఅన్నాడు ..

"సారీ ..శ్రీ,  ఐ యాం వెరీ సారీ" అంది మనఃస్పూర్తిగా.

అలా  వో వారం రోజులు గడిచాయి.ఆ వారం రోజుల్లో  శ్రీ, వైషూ రోజు కాల్ చేసుకుని మాట్లాడుకుంటూనే వున్నారు. అప్పుడప్పుడు తనతో మాత్రం ముక్తసరిగా మాటలు. తను మాట్లాడుతూ వుంటే కూడా..డాడ్ కి  ఫోన్  యివ్వు మమ్మీ ..అంటూ తప్పించుకుంటుంది.

ఏదో జరిగింది అనుకుంది..తన అనుమానాలు శ్రీ తో చెపితే అదేం కాదులే అని సర్ది చెపుతాడు. అనుకుని ఆ వీకెండ్ లో తనే "వైషు" కి   కాల్ చేసింది.. ఏ కళ న వుందో కానీ చాలా సేపు బాగానే మాట్లాడింది.
మాటల్లోనే హఠాత్తుగా "మామ్..నాకూ వొక బ్రదర్ వుంటే బాగుండేది.."అని అంది.

ఇరవయ్యి  సంవత్సరాల కూతురు వొక్కసారిగా అలా అడగడం తో..ఖంగు తిన్నట్లు అనిపించింది.సమాధానం చెప్పే లోపే మళ్ళీ అదే మాటని రెట్టించి అడిగింది.

"బాగుంటుంది కానీ .ఆ చాన్స్ లేదుగా వైషూ.. డాడ్ కి నువ్వంటే  పంచ ప్రాణాలు.నాకు నువ్వు ప్రాణం తో సమానం అందుకే..నీ తర్వాత యింకో చైల్డ్ వద్దనుకున్నాం రా..బంగారు."అంది.

"అయితే నాకు యిప్పుడు వొక అన్నయ్య కావాలి. ఎవరినైనా అడాప్ట్  చేసుకోండి."అంది.

మల్లిక కి సమాధానం చెప్పడానికి గొంతు పెగల లేదు.  "బాయ్ మమ్మీ, ఈ విషయం గురించి ఆలోచించు ..మర్చిపోకు" అంటూ పోన్ కట్ చేసింది.

కూతురు మాటలు మెరుపు లేని ఉరుములా వినబడి గుండెల్లో  పిడుగులు పడ్డట్టు అయ్యింది.

మనసులో మెదిలే భయాలు నిజం అవుతున్నట్లు సూచనలు. ఇరవయ్యి రెండేళ్ళు యేదైతే తెలియకుండా వుండాలని అందరికి దూరంగా వున్నారో.. ఆ విషయమే వైషు కి తెలిసి పోయినట్లు.
 తనపై  వేయినొక్క ప్రశ్నలు వొకే సారి  సంధించి వుక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు...వూపిరి ఆడలేదు  మల్లికకి.

 శ్రీకాంత్ ఫ్రెండ్స్ తో చిన్న  పార్టీ ఉంది లేట్ గా వస్తాను అని చెప్పాడు అయినా మనసు ఆగక .శ్రీకాంత్ కి పోన్ చేసింది.  "వచ్చేస్తున్నావా "అడిగింది. "ఎనీ ..ప్రాబ్లం?" అడిగాడు. "లేదు,లేదు..పర్లేదు నిదానం గానే  రా.." అని చెప్పింది.

అరగంటలో శ్రీకాంత్ రానే వచ్చేసాడు. వస్తూనే బెడ్ రూంలో దిగులుగా పడుకుని ఉన్న మల్లిక దగ్గరికి వచ్చి ప్రక్కన కూర్చున్నాడు.

"ఎందుకు..మల్లీ అలా కాల్ చేసావు." 

ఒక్క ఉదుటున లేచి అతనిని చుట్టుకుంటూ గట్టిగా ఏడ్చేసింది.

"ఏమిటో..చెప్పకుండా యేడిస్తే నేనెలా కనుక్కొను. మల్లీ..నా తల్లిగా కాస్త ఆ దుఖం తగ్గించుకుని యే౦ జరిగిందో..చెప్పు అన్నాడు లాలనగా.

"వైషూకి కాల్ చేసాను. తనకి వొక బ్రదర్ కావాలట. ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు కదా, డాడ్ తో చెప్పి ఆలోచించండి అని చెప్పింది".

శ్రీకాంత్ భ్రుకుటి  ముడి పడింది.అయినా అతనిలో కలిగే ఆలోచనలు బయట పెట్టకుండా.. "అలాగే అని చెపుదాం.ఇంత మాత్రానికే అంతలా దుఃఖ పడాలా అని వాతావరణాన్ని తేలిక పరచాలని చూసాడు.

"నాకొకటి అనిపిస్తుంది.కొన్ని నెలల క్రితం మా పిన్ని వచ్చి వెళ్ళింది కదా, ఆమె చెప్పి వుంటుంది నో..డవుట్.."అంది నిర్ధారణకి వచ్చినట్లు.

శ్రీకాంత్ మౌనంగా  ఉండిపోయాడు.

కాసేపటి తర్వాత ఇలా అన్నాడు. '"మనం నిజాన్ని  యెన్నాళ్ళని దాయగలం, వైషు కి అన్నీ అర్ధం చేసుకునే వయసు వచ్చింది. ఈ సారి వచ్చినప్పుడు తనకి అన్ని విషయాలు చెప్పేద్దాం "అన్నాడు.

"వద్దు..వద్దు.". అంటూ కంగారుగా లేచి కూర్చుంది మల్లిక.

"మనం విషయాన్ని  దాచి పెట్టి తనని మోసం చేసాం అనుకునే కన్నా అసలు విషయం చెప్పడం అన్ని విధాలా మంచిది. కనీసం నిన్ను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తుంది".అన్నాడు.

ఆ మాటకి దెబ్బ తిన్న పక్షిలా విల విల లాడి పోయింది. జరిగినదానిలో నాది మాత్రమే తప్పు  వుందని శ్రీకాంత్ వుద్దేశ్యమా అనుకుంది.తనకి కోపం వచ్చింది కూడా.

"నా మాటకి కోపం వచ్చిందా.."అన్నాడు శ్రీకాంత్ .మనసులో మాటలని చదివినట్లు.

అతనిలో ఆ గుణం వుండబట్లే తన మనసు తెలిసి తనకి వో క్రొత్త జీవితాన్ని యిచ్చాడనుకుంది.

"నేను ప్రెష్ అయి  తినడానికి రెడీ చేస్తాను,నువ్వు లేచి..ప్రెష్ ఆయి..రా "అని ఆ రూం నుండి బయటకి వెళ్ళాడు.

కళ్ళు మూసుకుని పడుకుంది.కళ్ళల్లో నీళ్ళతో పాటు గతం గిర్రున తిరుగుతుంది.

పదహారేళ్ళ మల్లిక ముగ్ద  మనోహరంగా ఉండేది. అప్పుడే టెన్త్ క్లాస్స్ పూర్తయింది. నలుగురు అక్కచెల్లెల్ల కూతురులు అందరిలోనూ అందంగా ఉండేది. నల్లటి జడ మడిచి కట్టక పొతే నేలపై జీరాడుతున్నట్లు వుండేది.

అనుకోకుండా ఆమెకి మంచి సంబంధం కుదిరిది. అతని పేరు సురేంద్ర.ఓ జాతీయ బ్యాంకు లో పని   చేస్తాడు. ఇంటికి పెద్ద కొడుకు. అతని తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు, వో చెల్లెలు. తల్లిదండ్రులకి ఆలస్యంగా పుట్టిన సంతానమవడం వల్ల గారాబంగా జల్సాగా పెరిగినవాడు.  తండ్రికి బోలెడంత పలుకుబడి,వ్యాపారాలు వున్నాయి.సురేంద్ర చదువుతో పాటు మత్తుమందు అలవాటుని పెంచి పోషించుకున్నవాడు. అవన్నీ పెళ్ళికి ముందు ఓ..లెక్కలోకి రాలేదు. మల్లిక అందం చూసి కోరి మరీ కోడలిని చేసుకున్నారు.

ఓ సంవత్సరం కాలంకే ఆ ఇంట్లో పసి వాడి బోసి నవ్వులతో అన్నీ సంతోష సమయాలే. మల్లికకి మాత్రం భర్త త్రాగుబోతుతనం నచ్చలేదు.

మొదట్లో భర్త అలవాటుని వ్యతిరేకించేది.తర్వాత గొడవ పడేది. ఒక త్రాగుడు విషయానికి బానిస అవడం తప్ప సురేంద్ర భార్యని యేడు మల్లెలెత్తుగానే చూసుకునేవాడు. నల్లగా ..ఓ..మాదిరిగా ఉన్న అతని ప్రక్క మల్లిక సౌందర్య దేవతలా వుండేది.ఆమె అందాన్ని అందరు మెచ్చుకుంటుంటే అతనికి గర్వంగాను వుండేది.

అతను తల్లిదండ్రులు ఉంటున్న సిటీ నుండి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయింది. భార్య కొడుకుతో..అక్కడి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఉమ్మడి కుటుంబంలో భర్త ప్రవర్తన నచ్చక పోయినా లోలోపల దిగమింగుకున్నమల్లికకి వొక్కసారిగా స్వేచ్చ పెరిగినట్లు అయింది. భర్త త్రాగుడి గురించి రోజు గొడవ పడేది. అతను ఆ గొడవకి  అసలు యింటికే రావడం మానేసాడు. వచ్చినప్పుడు మాత్రం కొడుకు సిద్దార్థ ని బాగా ముద్దు చేసేవాడు. అతనికి స్పూన్ తో అన్నం తినిపించేవాడు.అది మల్లిక కి నచ్చేది కాదు. సురేంద్ర ని    అతని తల్లిదండ్రులు గారాబంగా పెంచి అడిగినవి అన్నీ యిచ్చి చెడగొట్టారని ఆమెకి కడుపు మంట.  
"వాడికి మూడేళ్ళు వచ్చాయి వాడు తినే అన్నం వాడే తినాలి నువ్వు పెట్టడం ఏమిటీ." అని వాదులాడేది.

పరిశుభ్రం,క్రమశిక్షణ పేరిట సిద్ధార్దని చీటికి మాటికి కొడుతూనే ఉండేది. అది అంతా భర్త పై ఉన్న అసహనం,కోపం అని చూసే వాళ్ళకి తెలిసి పోయేది. అకారణంగా సురేంద్ర తల్లిదండ్రులని,ఆమె తల్లి దండ్రులని కూడా తిట్టి పోస్తూ తన జీవితం నాశనం చేసారు అని యేడ్చేది.

అత్తా-మామ పై గొడవ పెట్టుకునేది. మీరు యే౦ పట్టించుకోవడం లేదు. నా బతుకు బుగ్గి అయిపోయింది అని పోన్ చేసి యేడ్చేది.
సురేంద్ర యెవరు చెప్పినా త్రాగుడు మానేస్తాను కానీ సమయం పట్టుద్ది అనేవాడు. యెంత కాలంలో మానేస్తావో చెప్పు అని షరతులు అడిగేది. పెద్దలంతా తలలు పట్టుకుని కూర్చునేవారు. నాలుగు రోజులు అక్కడ వుండి యిద్దరికీ మంచి మాటలు చెప్పి వెళ్ళేవారు. అతని చేత వుద్యోగానికి సెలవు పెట్టించి.. రీహాబిటేషన్ సెంటర్ లో జేర్పించి ట్రీట్మెంట్ యిప్పించారు. కొన్నాళ్ళు బాగానే వున్నట్టు వున్నా మళ్ళీ  మాములుగానే తయారయ్యాడు సురేంద్ర.

 సిద్దార్థ స్కూల్ కి వెళుతున్నాడు. అంత చిన్నపిల్ల  వాడిలో కూడా భర్త మేనరిజాలు కనబడితే చాలు విచక్షణ లేకుండా  గొడ్డుని బాదినట్లు బాదేసేది. సురేంద్ర యింటికి రావడానికి సమయం నిర్ణయించేది. ఏ మాత్రం ఆలస్యం అయినా తలుపు తీసేది కాదు. అతను అలా మత్తుగా జోగుతూ బయట గుమ్మం ముందు రాత్రి తెల్లవార్లు పడే వుండేవాడు.

ఒకసారి మల్లిక తన  పిన్ని కూతురి యింట్లో వో పంక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు చెప్పింది..తాగుడు వ్యవహారాలూ ఏమి పెట్టుకోవద్దు, పంక్షన్ కి వెళ్లి అక్కడ గౌరవంగా మెలిగి రావాలని అనుకున్నారు.అలాగే అని సురేంద్ర వెళ్ళాడు కానీ మాట నిలుపుకోలేదు. పైగా బాగా త్రాగి ఆ పంక్షన్ కి వెళ్ళాడు. అందరు మల్లికని  చూసి జాలి పడ్డారు. "యెంత డబ్బు ఉంటే ఏం లాభం? యెంత గొప్ప ఇంటి కోడలు అయ్యి ఏం ప్రయోజనం''  అని జాలి కురిపించారు ఆ జాలిలో ఎగ తాళి కనబడింది. భరించలేక పోయింది. 

ఆ పంక్షన్ లోనే ఆమె మరొక  పిన్ని కొడుకు కలిసాడు.. అతనొక   లాయర్. అతను వో సలహా యిచ్చాడు.ఆ తాగుబోతుతో యెన్నాళ్ళు బాధ పడతావు. నేను చెప్పినట్లు చేయి అతని పీడా వదిలిపోతుంది అని అన్నాడు. అది ఆమెకి నచ్చింది.ఆ సలహాని వెంటనే అమలు పరచింది.

అత్తమామలకి  పోన్ చేసి బాగా మాట్లాడేది. పర్వాలేదు కోడలు  అదివరకటి లా కాదు. కొంచెం మార్పు వచ్చింది. భగవంతుడా.. ఇద్దరు యిద్దరులా ప్రవర్తించకుండా వొకరైనా సర్దుకుని వుంటే అంతే  చాలు అనుకున్నారు వాళ్ళు. మనుమడి పుట్టిన రోజుకి రమ్మని ఆహ్వానించింది. వాళ్ళు సంతోషంగా  వచ్చారు. ఆ రోజు కార్యక్రమం అయినాక అందరు నిద్ర పోయిన తర్వాత యింటి మెయిన్ డోర్ కి తాళం వేసి.. ప్రక్కనే ఉన్న ఉమెన్  ప్రొటెక్షన్ సెల్ కి  వెళ్లి అత్తమామలు,భర్త కలిపి తనని వర కట్నం యెక్కువ యివ్వలేదని వేదిస్తున్నారు.తనని మానసికంగా హింసిస్తున్నారు. తనని భర్త కొట్టి బయటకి నెట్టేసాడు.. అని చెప్పి రిపోర్ట్ చేసింది.
వెంటనే పోలీసులు వచ్చి అత్తమామాలని,భర్తని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు.

ఆ తర్వాత కేసు నడిచింది. మల్లిక కి విడాకులు తేలికగా లభించాయి.  కొడుకుకి భరణం లభించింది. సిద్దార్దని   చదువు పేరిట  హాస్టల్ లో వేసారు.సురేంద్ర యిక పూర్తి గా మందు మత్తులోనే మునిగి వుండేవాడు. అడిగిన వాళ్లకి ,అడగని వాళ్ళందరికీ సురేంద్ర తన భార్య మంచిదని చెప్పేవాడు. భార్య తన త్రాగుడు వల్లనే భరించలేక అలా చేసిందని చెప్పేవాడు. కొడుకు ని అప్పుడప్పుడు చూసి వస్తూ ఉండేవాడు.

మల్లిక  వో బ్యూటి పార్లర్ లో జాయినై బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటూ ఉంది. ఆమె అక్క యింట్లోనే వుండేది. ఆమె అక్క కి వో కూతురు..ఆ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. మేనత్త కొడుకు కిచ్చి వివాహం జరిపించాలని అనుకున్నారు. అతను శ్రీకాంత్. విదేశాలలో చదువుకుని అక్కడే వుద్యోగం చేస్తున్నాడు. అతనికి మల్లిక తో పరిచయం ఉంది. అతను స్వదేశానికి  వచ్చాడు. నిశ్చయ  తాంబూలాలు అందుకునే  రోజుకి  శ్రీకాంత్ మల్లికని పెళ్లి చేసుకుని వచ్చి బందువులందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మల్లిక అక్క చెల్లెల్ని తిట్టిపోసింది." పిన్నీ..నీకు నా బావే కావాల్సి వచ్చాడా అని అడిగింది అక్క కూతురు.

అమ్మ,నాన్న అందరు తిట్టిపోశారు.నీ కన్నా వయసులో అయిదారేళ్ళు చిన్నవాడు. అక్కకి కావాల్సిన అల్లుడిని చేసుకుని మా పరువు తీస్తావా  అని ముఖం మీదే తలుపు వేసారు.
శ్రీకాంత్ యెవరికి భయపడలేదు.ఎవరి ఒత్తిళ్ళకి తల వొగ్గలేదు.తన కోసం అన్నీ భరించాడు.పట్టుకున్న  తన చేయిని విడువలేదు.హైదరాబాద్ లో యిల్లు తీసుకుని అక్కడ వుంచి తను వెళ్ళిపోయి కొన్నాళ్ళకి వీసా పంపాడు.తనకి లభించిన జీవితం కోసం అందరిని వదిలేసి..శ్రీకాంత్ తో  సముద్రాలు దాటింది.

ఆ క్రమంలో కొడుకు సిద్దార్ధ కూడా ఆమెకి గుర్తుకు రాలేదు. ఒకవేళ గుర్తుకు వచ్చినా బలవంతాన తుడిచేసుకుంది. ఏ మనిషయినా  ముందుగా  తనని తానూ ప్రేమించుకోవాలి. తను బాగుంటేనే కదా యితరుల గురించి ఆలోచించ గల్గేది. ఆఖరికి బిడ్దలయినా సరే అనుకుంది.

రెండు మూడేళ్ళకు వైషు పుట్టింది. వైషు పుట్టుకప్పుడు సాయం కోసం శ్రీకాంత్ తల్లి వచ్చింది. కొడుకుని వదులుకోలేక మల్లిక అంటే యిష్టం లేకపోయినా రాజీ పడిపోయారు. మల్లికని చదివించాడు.  స్వంతంగా ఒక  ఇండియన్ స్టోర్స్  పెట్టుకుని ,శ్రీకాంత్ వుద్యోగం చేసుకుంటూ.. వైషు ని  ప్రాణం లా పెంచు కుంటూ వచ్చారు.

ఇప్పుడు యిలాటి ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది. తనలోని మాతృత్వం సిద్దార్దని వదిలేసినప్పుడు యేమైందో అర్ధం కాలేదు మల్లికకి.

అప్పుడపుడు పోన్ లో మాట్లాడటం, ఓ నాలుగేళ్ళకు వచ్చినప్పుడు వొంటరిగా వెళ్లి చూసి రావడమో చేసేది. ఒకసారి  "సిద్దూ" ని  మనతో  తీసుకువెళ్ళడానికి యె౦దుకు ప్రయత్నించ కూడదు"అనడిగాడు శ్రీకాంత్.

"వద్దు, అలాంటివి యేమి పెట్టుకోవద్దు నేను గతాన్ని నా వెంట తెచ్చుకోవాలనుకోవడం లేదు" అని చెప్పింది. 

అందుకు శ్రీకాంత్ నేను మనఃస్పూర్హిగానే" సిద్దూ"ని మనతో వుండటానికి యిష్టపడుతున్నానని చెప్పాడు.అయినా సరే తను అలా పాషాణం లా వుండిపోయింది.
ఆ తరువాత సిద్దూతో ఫోన్  లో మాట్లాడటమే తప్ప తను చూడనే లేదు. తన చెల్లెళ్ళు కూడా విస్తుపోయేవారు. నువ్వు "సిద్ధూ" కి తల్లివి. అలా వాడిని వదిలేసి యెలా  కఠినంగా వుండగాలుతున్నావ్, నీకు మనసనేది లేదా అనేవాళ్ళు. తను యేమీ మాట్లాడేది కాదు.

 "ఎవరు యేమనుకుంటే నాకేంటి, నాకు మంచి జీవితం లభించింది అది చాలు నాకు" అనుకుంది.

 అయితే  అప్పుడప్పుడు తనతో సిద్దార్ధ బాగానే మాట్లాడే వాడు. తండ్రి తోనూ బాగా దగ్గరి తనం తోనూ మెలిగే వాడు అని తెలుస్తూనే ఉండేది. సురేంద్ర మేనరిజంస్ కనబడుతున్నాయని అసహ్యించుకునే మల్లిక కి సిద్దార్ధలో కనబడే సాఫ్ట్ నెస్ కానీ అండర్ స్టాండింగ్ కానీ వైషు లో కనబడేవి కాదు. తను యెంత ప్రాణంగా చూసినా శ్రీకాంత్ తోనే దగ్గరగా మసలేది.

తను సిద్దార్దని పట్టించుకోకుండా వొదిలేసి వచ్చినందుకు తనకి అలా జరుగుతుందనే ఆత్మా నూన్యతా భావం యెక్కడో గిల్టీ ఫీలింగ్ మల్లికకి. నేను వో మంచి తల్లిని కాదేమో అని అనుమానం వచ్చేది. కానీ యిప్పుడు అనిపిస్తుంది. తను  చేసిన తప్పిదం వల్ల  ప్రాణం అనుకున్న బిడ్డ కూడా నన్ను అసహ్యించుకుంటే భరించలేను.

పాపం, శ్రీకాంత్ నాగురించి తెలిసి నాకు  క్రొత్త జీవితం యివ్వడం యెంత గొప్ప విషయం. అది ప్రేమే కావచ్చు లేదా సానుభూతి కావచ్చు  తన లోని తల్లిని కూడా మరిపించేసాడు.

తను సన్నగా నాజుగ్గా వుండబట్టి యిక్కడ కూడా యెవరికీ అనుమానం వుండేది కాదు.మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని కితాబు ఇచ్చేవారు. బంధువులు అందరు తనని చూసి ఈర్ష్య తో  యేడ్చేవాళ్ళు.మల్లికకి లభించిన జీవితం అందరికి దొరుకుతుందా, అంతా  తన అందంతో శ్రీకాంత్ కి వల వేసిందని అనుకునే వాళ్ళు.

 శ్రీకాంత్ భార్యగా  అతను యే రోజు యేమీ తక్కువ చేయలేదు. కానీ వైషు యిప్పుడు తనని ద్వేషిస్తున్నట్లు అనిపిస్తుంది. తనకి అన్ని నిజాలు తెలిసి పోయాయేమో!  అలా అనుకుంటూ గతాన్ని  గుర్తు తెచ్చుకుని బాధ పడుతూనే ఉంది మల్లిక

"ఇంకా  ఆలోచిస్తూనే వున్నావా  మల్లీ,  అంతా నేను చూసుకుంటాను  అన్నాను కదా దిగులు పడకు "అన్నాడు.

శ్రీ.. నువ్వు చెప్పు,  వైషు నన్ను అసహ్యించు కోదు కదా  అడిగింది దిగులుగా..

"లేదు, నేను అర్ధం చేసుకునేటట్లు  చెపుతాను కదా" అని తనని బలవంతంగా డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకు వెళ్ళాడు.

"నేను  రేపు వుదయం బయలుదేరి వైషు దగ్గరకి వెళతాను. అసలు తను  యే౦ చెపుతుందో చూస్తాను" అన్నాడు.

నేను వస్తాను అంది చప్పున. ఒకసారి సాలోచనగా చూసి "వద్దులే! నిన్ను చూస్తే యింకా మొండిగా తయారవుతుంది.పైగా నిన్ను యేమైనా అంటే నీకు  తట్టుకోవడం కూడా చాలా  కష్టం " 

"అంతేనంటావా శ్రీ" దీనంగా  అడిగింది. మౌనంగా వుండిపోయాడు. తాము  వుండే ప్లేస్ కి నాలుగు గంటలు ప్రయాణం .వైషు కి ముందుగా కాల్ చేసి చెప్పకుండానే బయలు దేరాడు.

అతను వెళ్ళాడో లేదో  వైషు ల్యాండ్ లైన్ కి  కాల్ చేసింది. మల్లిక ఫోన్ తీసింది

ఉపోద్ఘాతాలు యేమి లేకుండానే.. మామ్, నిన్ను వొకటి అడుగుతాను నువ్వు సమాధానం చెప్పాలి" 

"చెప్పు తల్లీ.." అంది  మల్లిక.

"డాడ్ మంచి వాడు కాకపొతే..డాడ్ కి డైవోర్స్ యిచ్చేసి యింకొకరు నచ్చితే పెళ్ళిచేసుకుని నన్ను వదిలేసి వెళ్లి పోతావా " అడిగింది నిర్మొహమాటంగా.

మల్లికకి కాళ్ళ క్రింద  భూమి కంపించి పోతుంది.

"నేనలా యె౦దుకు చేస్తాను వైషూ.. నువ్వు నా ప్రాణం తల్లీ"

"అంతా అబద్దం.నువ్వు యెప్పుడూ చెప్పే ఇండియన్ కల్చర్..తల్లి-బిడ్దల ప్రేమ ఆంతా అబద్దం." నీకు నువ్వు చెప్పిన మాటే నెగ్గాలి. చిన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తున్నాను. క్రమశిక్షణ,పరిశుభ్రం అన్న పేరిట సాధించి పెడతావు. డాడ్ చెప్పినట్లు యెప్పుడైనా నువ్వు చెప్పావా, నీ ప్రేమ అంతా నాటకం. తల్లికి బిడ్డ పై వున్న ప్రేమ నిజం అయితే.. అది భర్త మంచి అలవాట్లు,భర్త చూపించే ప్రేమ వల్ల మాత్రమే వుంటుందా, నా పై ఉన్న ప్రేమ నీకు సిద్దూ అన్నయ్య మీద యె౦దుకు లేదు?

తూటాల్లా తగులుతున్నాయి మల్లిక కి

"పాపం సిద్దూ అన్నయ్య నాకు పరిచయం కాకుండా వుంటే తెలిసేదే కాదు" అంది.

"సిద్దూ..నీకు తెలుసా "మాట పెగుల్చుకుంటూ అడిగింది.

"హా..తెలుసు, నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. నేను ఇండియన్ కల్చర్ పై చేస్తున్న రీసెర్చ్ వర్క్ లో నాకు అసిస్టెన్స్ గా చేస్తున్నాడు. మాటల్లో భారతీయ స్త్రీ వివాహ బంధం వైఫల్యం గురించి చెపుతూ.. తల్లిదండ్రి విడిపోతే పిల్లలు యెలా సఫర్ అవుతారో చెపుతూ తన కథ చెప్పాడు 
తర్వాత  మన ఇంటికి వచ్చిన చిన్నమ్మమ్మ నువ్వు మాట్లాడుకుంటున్న విషయాలలో సిద్దూ అన్నయ్య తల్లి వి నువ్వేనని తెలుసుకున్నాను.  సిద్దూ అన్నయ్య ఆ  విషయం చెప్పకుండా వుంటే యీ విషయం నాకెప్పటికి తెలిసేది కాదు.

"మామ్, యిండియన్  కల్చర్ లో బిడ్డలని వదిలేసే తల్లి వున్నట్లు నేను వినలేదు, చదవలేదు. పేగు బంధం అంటే యిదేనా మామ్! మా డాడ్  కూడా మంచి వాడు కాకపొతే నన్ను  వదిలేసి వెళ్ళిపోయే దానివి కదా,  ఐ హేట్ యూ , ఐ హేట్  యు మామ్ " అంది.

"వైషు..నా తల్లీ..ఈ అమ్మని అలా అనకురా, నువ్వు నా ప్రాణం! నువ్వు అలా  అంటే నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను."అని   హృదయ విదారకంగా ఏడుస్తుంది మల్లిక. 

"మామ్  అయితే ఒక పని చేయి. నేను నీ ప్రాణం అన్నావు కదా, నా కోసం నువ్వు చచ్చిపో, లేకపొతే నీ లాంటి మామ్ వున్నందుకు  నేనే చచ్చిపోతాను." అని చెప్పి పోన్  పెట్టేసింది.

ఉన్న చోటునే కుప్ప కూలిపోయింది మల్లిక.

వైషూ నే ప్రాణం అనుకున్న ఆమెకి  కూతురు తననే చచ్చిపోమ్మని చెప్పింది..ఇంకా యె౦దుకు బ్రతకాలి .? అనుకుంది .

అక్కడి నుండి లేచి బెడ్ రూం లోకి వచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్ అరలు అన్నీ వెదికింది.  పిచ్చిగా వెదుకుతూనే వుంది. కాసేపటికి ఆమెకి కావాల్సిన టాబ్లెట్స్ దొరికాయి. అవి వొక్కొక్కటిగా వేసుకుంటూ సిద్దూ ని తలచుకుంది.

"అయ్యో,  సిద్దూ.. నేనెంత తప్పు చేసాను. ఒక తల్లి చేయాల్సిన విధంగా నేను నీకేమి చేయలేదు కదూ,            నిన్ను వదిలేసి నా దారి నేను చూసుకున్నాను. అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. నేను చచ్చి పోతున్నాను. అవును నా కూతురు అడిగినందుకన్నా నేను చావాలి. తల్లిని అంటే యేమిటో నిరూపించుకోవాలి." కసిగా అనుకుంది.

అయ్యో, నా ప్రాణం పోతుందేమో ప్రాణం పోయే లోపు నేను సిద్దూని  వొక సారి చూడాలి లేదా వొక సారి మాట్లాడనైనా మాట్లాడాలి.

కానీ యెలా, కళ్ళు తిరుగుతున్నాయి. బలవంతాన కళ్ళు తెరుచుకుని.".శ్రీ "కి పోన్ చేసింది." శ్రీ నేను వెంటనే సిద్దూ తో మాట్లాడాలి ప్లీజ్! నేనిపుడు మాట్లాడకపోతే యెప్పటికి మాట్లాడలేను.
"శ్రీ" నాకోసం చాలా చేసావు.ఈ ఒక్కటి చేయవా ప్లీజ్..ప్లీజ్. మాటలు ముద్దగా మారుతూ  రిసీవర్  వదిలేసింది. ఏం జరిగిందో అర్ధమయింది  శ్రీకాంత్ కి. వెంటనే ఎమర్జెన్సీ కి పోన్ చేసి తన యింటి చిరునామా  చెపుతూనే   వెనక్కి ప్రయాణమయ్యాడు .

"వైషూ కి పోన్ చేసి సిద్దూ గురించి అడిగాడు." ఎస్ డాడ్ ఈ సిటీలోనే వున్నాడు.అతని పోన్ నంబర్ యె౦దుకు  అడిగింది. 
"యూ..స్టుపిడ్,  నువ్వు చేసిన చేష్టలకి మీ మామ్  చచ్చిపోతుంది. సిద్దూని చూడాలనుకుంటుంది." చెప్పాడు కోపంగా.

"ఓ..మై గాడ్, మామ్  అంతపని చేస్తుందని  అనుకోలేదు..రియల్లీ ఐ యాం సారీ..డాడ్. నేను ,సిద్దూ అన్నయ్య యిప్పుడే బయలు దేరి వచ్చేస్తాం." అంటూ యేడ్చింది.

ఆ రోజు రాత్రికి  కాని ప్రమాదం నుండి బయటపడలేదు మల్లిక.

కళ్ళు విప్పి చూసే సరికి తన వైపే ఆత్రుతగా చూస్తున్న సిద్దూ కనిపించాడు.దూరంగా వైషూ నిలబడి చూస్తుంది.

"సిద్దూ అమ్మా యిప్పుడు యెలా వుంది? ఆర్ యూ ఒకే!
వైషూ చూడు యెంత దిగులుగా  వుందో, తనని దగ్గరకి పిలువు."చెప్పాడు.

కళ్ళతోనే కూతురిని పిలిచింది. మామ్ అంటూ వచ్చి తల్లిని  హత్తుకుంది. ఆరిపోబోయిన ఆ కళ్ళల్లో వెలుగు వచ్చింది.

"వైషూ..అమ్మని చూడు యెంత బాధ పెట్టావో, అమ్మ పై నీకు కంప్లైంట్ గా నేనా విషయం చెప్పలేదు. అసలు నాకు నువ్వు చెల్లివి అవుతావని తెలియదు.అంతా అలా జరిగి పోయింది.
అయినా తల్లిదండ్రులు  పిల్లలకి  ప్రేమని పంచడం మాత్రమేనా కావాల్సినది. వాళ్లకి వ్యక్తి గతజీవితం ఉంటుంది కదా! ఆ కోణంలో చూస్తే అమ్మ చేసినది నాకు తప్పుగా తోచలేదు. మా డాడ్ కి త్రాగుడు వ్యసనం వుంది.కానీ ఆయన నాకు అమ్మ పై ద్వేషాన్ని పెంచే మాటలు చెప్పలేదు.
వాళ్ళ జీవితాలలో అలా జరిగిపోయిన సంఘటనలకి కారణం యెవరైనా  నేను యెవరినీ  తప్పు పట్టడం లేదు. అందరిలో తప్పు వొప్పులు వెదకడం మానేసి ప్రేమించడం చేస్తే అంతా పాజిటివ్ గానే కనబడుతుంది" అని చెప్పాడు సిద్ధూ .

మన ఇండియన్ కల్చర్ లోను ద్వితీయ వివాహాలు సర్వ సాధారణం అయిపోయాయి. మగ వాళ్ళు పిల్లల బాధ్యత నుండి తప్పించుకున్న వాళ్ళు ఉంటున్నారు. స్త్రీలు కూడా అలాగే వుండటం చూస్తున్నాం.ఇద్దరిలో యెవరు లేకపోయినా కొరత గానే ఉంటుంది.అది పిల్లల దురదృష్టం. అనాధలు పెరిగినట్లు పెరగడం అంటారే..అలాగన్నమాట.మా డాడ్ ప్రేమ నాకు బాగానే ఉన్నా.. ఆయన అన్ని కాలాలు '"అమ్మ"కాలేడు  కదా,
జీవితంలో లభించిన వాటికి రాజీ పడి పోవాలనుకున్నాను.  నేను అలాగే రాజీ పడిపోయాను అని చెప్పాడు. చాలా లోతుగా ఆలోచించినట్లు.
.
సిద్దూ..యెంత యెదిగి పోయావు నాన్నా, నిన్ను వదిలేసి నా దారి నేను చూసుకున్నా నీకు మంచి ఆలోచనలతో పాటు  అవగాహన చేసుకునే  శక్తి వచ్చింది.నా లాలనలో  కూడా నువ్వు యిన్ని నేర్చుకోలేక పోయి వుండవచ్చు అనుకుంది  లోలోపల. మల్లిక  వొకోసారి మనసు మాటలు బయటపడటం కూడా యిబ్బందే అన్నట్లు అనిపించింది.  ఇప్పుడు తనేం మాట్లాడినా లాభం లేదు.తన తప్పు-ఒప్పులని బేరీజు వేసునే సమయం కాదు. కరిగిన కాలాన్ని జరిగిన నష్టాన్ని తను యే మాత్రం పూడ్చ లేదు.ఇది జీవితం.ఏ ఒక్కరు లోపాలు లేకుండా తప్పులు చేయకుండా జీవితాన్ని జీవించలేరేమో! అది తప్పు అని తెలియకుండానే జీవిత ప్రయాణం సాగుతూ ఉంటుంది. నా ప్రయాణం స్వార్ధ ప్రయాణం. అనుకుంది. అనుకున్న మాట ఒక్కటి కూడా బయటకి చెప్పలేక. 

"సిద్దూ తల్లి పెంపకం కాకపోయినా బాగా యెదిగావు నాన్నా! నేను యింత కన్నా యేమి చెప్పలేను" చెప్పింది దుఖం ముంచుకు రాగా.

"నాకు ఇతరులని అర్ధం చేసుకునే  కోణంలో అన్ని విషయాలు  వివరించి చెప్పిన  వ్యక్తీ శ్రీకాంత్ అంకుల్ అమ్మా ఆ క్రెడిట్ ఆంతా అంకుల్ దే " అని చెప్పాడు.

"శ్రీకాంత్  నువ్వు సిద్దూ తో మాట్లాడతావా "అడిగింది. నవ్వుతూ తల ఊపాడతను.  ఏదో అర్ధమైనట్టు మల్లిక మనసు తేలిక పడింది. "మామ్, సిద్దూ అన్నయ్య  యిక నుండి మనతోనే వుంటాడు. ఓకేనా!అడిగింది.అందులో తన  ఆమోదం అవసరం లేదు అన్నట్టు ఆజ్ఞాపన  వొక్కటే  వున్నట్లు అర్ధం అయింది మల్లికకి.

"ఆడవాళ్లు లతల్లాంటి వారు, యెక్కడ ప్రేమ అనే ఆధారం దొరికితే అక్కడల్లుకు పోతారు.ఆ ఆధారం మంచిదైతే ఆ తీగ వికసించి  ఫలిస్తుంది. నేను మీ డాడ్ ని అలా అల్లుకున్న దానినే  వైషూ అని చెప్పింది కూతురితో.  అంత కన్నా యేమి చెప్పలేక.15, నవంబర్ 2012, గురువారం

మై స్పేస్ అమ్మలక్కల కబుర్లు 5

కష్టపడి సంపాదించిన  ప్రతి పైసా విలువ నాణ్యత గల వస్తువు లు కొన్నప్పుడు మరింత పెరుగుతుంది. అంటారు కదా! షాపింగ్ కి వెళితే నేను అదే ఆలోచిస్తాను.

ఈ మధ్య రెండు మూడు రోజులు షాపింగ్ కి వెళ్ళినప్పుడు  నేను  పరిశీలించిన విషయాలు తో.. కొన్ని ముచ్చట్లు..మోసుకొచ్చాను.

సాధారణ మానవుడికి కొనుగోలు శక్తి కన్నా కోర్కెల చిట్టా అనంతం.

పేదవాడికి నిత్య అవసరాలు తీరే ఆదాయం లేకున్నా ముఖ్యమైనవి కొనుక్కుని మిగతావి రేపటికి వాయిదా వేసుకుని సరిపుచ్చుకుంటాడు. హాయిగా నిద్రిస్తాడు.

మధ్య తరగతి వ్యక్తీ ఈ రోజు అవసరాలు తీరకున్నా రేపటి కోసం ఆలోచిస్తాడు.మదుపు చేయాలని ప్రయత్నం చేస్తాడు.

ధనవంతుడు తన దగ్గర అపరిమితమైన ధనం ఉన్నప్పటికీ ఈ రోజు జీవించడం అనే అనుభూతిని కోల్పోతూ ఇంకో నాలుగు తరాల వారు కూడా వెనకేసుకునే అంత డబ్బుని ఎలా కూడబెట్టాలా ! అని ఆలోచిస్తూ ఉంటాడు.

రైతులకి కడుపు మండి  క్రాఫ్ హాలిడే  ప్రకటించినా వర్షా భావాలు నెలకొన్నా..తుఫాను తాకిడికి గురైనా  నింగిని తాకుతున్న నిత్యావసరాల ధరవరలతో..సగటు జీవి కుదేలైపోతున్నాడు.అయినా ఆర్ధిక భద్రత కోసమో..ఆడంబరం కోసమో నలుగురిలో పలుచన కాకుండా ఉండాలని ధర చుక్కలనంటుతున్నా  సరే బంగారం కొంటూనే ఉన్నారు.  ఏ దుకాణాలు   చూసినా బట్టలు,బంగారం,వన్ గ్రామ్  గోల్డ్ నగలు అమ్మే షాపులు క్రిక్కిర్సి ఉంటున్నాయి.

 అసలే ముహూర్తాల కాలం. బంగారం స్త్రీల ఒంటిమీదే కాదు  పురుషులు కూడా అభినవ బప్పీ లహరి లాగా కనబడుతున్నారు. మధ్య తరగతి అమ్మాయిలూ కూడా  తల్లిదండ్రులని పీడించి అయినా సరే ఒకో డ్రస్స్  అయిదు వేలు ఖరీదు కి తక్కువ కాకుండా కొంటున్నారు.  ప్రతి పంక్షన్  కి సరి క్రొత్త చీరో,డ్రస్ కొనడం పరిపాటి అయిపోయింది. ఇలాంటివి అన్నీ గమనిస్తూ ఉంటే భారతీయులకి కొనుగోలు శక్తి పెరిగిందని తెలియవస్తుంది.

ఒకప్పుడు విదేశీ బ్రాండ్ అంటే కొనడానికి భయపడే ఈ దేశపు యువత..ఇప్పుడు అచ్చంగా  బ్రాండ్ అయిటంస్ ని అవలీలగా కొనుగులు చేస్తున్నారు. మహా నగరాలలోనే కాదు..విజయవాడ పట్టణంలో కూడా అతి ఖరీదైన విదేశీ బ్రాండ్ యాక్ససరీస్ కనబడుతున్నాయి.

ఇక అమ్మాయిల విషయానికి వస్తే పెళ్లి విషయం వచ్చేటప్పటికి అన్ని ఎంత ఖర్చు అయినా సరే  అన్ని ముచ్చట్లు సంప్రదాయంగా కావాలని కోరుకుంటున్నారు..

చదువుకున్న అమ్మాయిలకి డిమాండ్ ఎక్కువ. అబ్బాయిలు  విద్యావంతులు కాకుంటే   ఎంత ఆస్తిపాస్తులున్నా వారికి తగిన వధువు లభించడం కష్టమైపోతుంది. వారికి ముప్పయిలు దాటుతున్నా వివాహం కావడంలేదు.అమ్మాయిల కోసం వెదుకులాట .అమ్మాయిల కోర్కెలు కొండెక్కి కూర్చుంటున్నాయి

విదేశాలలో చదువుకుని ఉద్యోగం చేస్తున్న వారి కష్టాలు తక్కువేమీ కాదు. వధువు కోసం వెదుకులాటలో సంవత్సరాలు గడచిపోతున్నాయి. పెళ్లి కూతురికి వడ్డాణం  పెడతారా.. లేక  డైమండ్ నెక్లెస్ పెడతారా అని అడుగుతున్నారు.

 మా చిన్నతనం లో ఊరంతటి లోను  ఏ ఒక్కరికో ఇద్దరికో  వడ్డాణం ఉండేదేమో! ఇప్పుడు నాలుగు ఇళ్ళకి ఒక ఇంట్లో అయినా వడ్డాణం తో మెరుస్తున్న అమ్మాయిలూ కనబడుతున్నారు.(పుత్తడి అయినా ఇత్తడి అయినా )

ఈ  మధ్య  మా ఇంటి అమ్మాయే పెళ్లి ముందు రోజు ఏడుస్తూ కూర్చుంది. "వడ్డాణం " చేయించలేదని.  పోనీ ఈ అమ్మాయిలు వడ్డాణం  పెట్టుకుని  విదేశాలకి వెళతారా అంటే అదీలేదు.  వడ్డాణం చేయించడం కన్నా దానిని భద్రం చేయడం చాలా కష్టం అండీ!   బ్యాంకు లలో వడ్డాణం  పట్టే  లాకర్స్ కూడా దొరకడం లేదు. ఇంట్లో  పెట్టుకుని కంటి నిండా నిద్రపోయే రోజులు కావు ఇవి

డైమండ్ లా జీవితం ప్రకాశించాలని,వడ్డాణం లాంటి బంధనంలో ఆలుమగల బంధం అందంగా అల్లుకుని ఉండాలని కోరుకోవాలి కాని ఆడంబరం గా కనబడాలనే తాపత్రయం కనబడుతుంది. ఏమిటో.. ఈ కాలం  పిల్లలు అస్సలు అర్ధం కారు.

అమ్మాయిలకి  చదువులు, ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత అవసరమో.. పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకుని.. సింపుల్ అండ్ కంఫర్ట్ బుల్ లైఫ్ లో   ఇమిడిపోవాలని  కోరుకుంటే..బావుంటుంది అనుకున్నాను.

అన్నట్లు.. నాకు ఉంటుంది మున్ముందు మొసళ్ళ పండుగ. కాబోయే కోడలికి వడ్డాణం  లేదా  డైమండ్ నెక్లెస్ నో పెట్టరా.? అని ప్రశ్నలు మొదలయ్యాయి :)

14, నవంబర్ 2012, బుధవారం

విరిగిన వెన్నునిశని  చీల్చుకుంటూ రెండు పట్టాలపై
వరుస పెట్టెలు మంద గమనంతో
నడుస్తుంటాయి తల్లి గర్భం నుండి
బయటపడే శిశువులా

కలవని పట్టాలు ఎన్ని జీవితాలని
గమ్యస్థానం చేరుస్తుంటాయో
కలసిన రెండు తనువుల ఆకళ్ళు
ఓ..చిన్ని ప్రాణాన్ని విసిరిపారేస్తాయి

మరచిపోయిన మానవత్వం
గాలిపాట పాడుతూ ఊరేగుతుంది.
కొన్ని నిర్లక్ష్యాలు కొన్ని భావజాలాలు
వెన్నుని  విరిచేస్తాయి..
విరగబడి నవ్వుతుంటాయి.

ఆకాశంలో సగం నేలమట్టమవుతుంది.
లింగ వివక్ష నిలువెత్తు నిలబడుతుంది
జీవన్మ్రతులుగా మారే  పరిదృశ్యం
సూచికల పట్టీలో దిగజారుతూ ...
ఆడ వలదని వాడు బలమని తలచి
అనాగరిక  ముసుగు జారకుంటే
ధరిత్రి ఎరుగని ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది.
చరిత్ర లో చీకటి కోణాన్ని మిగల్చనుంది

 విరిగిన వెన్ను..నాశనం అయిన పంట చిహ్నమే  కాదు..
 నాశనమవుతున్నజాతి  కడుపు పంట  కూడా!!


                                           (చిత్రాలు  గూగుల్ చిత్రాల నుండి సేకరణ )

12, నవంబర్ 2012, సోమవారం

ఆనంద దీపావళి


అజ్ఞానం అనే అంధకారమును చీల్చి జ్ఞాన జ్యోతులు వెలిగించుకుని..

బ్రతుకంతా  ఆనంద దీపికల వెలుగులో   ప్రతి ఒక్కరూ నక్షత్రం లా వెలగాలని 
కోరుకుంటూ ..  

బ్లాగ్మిత్రులందరికీ ఆనంద దీపావళి  శుభాకాంక్షలు అందిస్తూ..

                   "ఆత్మ దీపోభవ "Happy Dipavali
happy pictures

                                                                                                                                  వనజ వనమాలి

11, నవంబర్ 2012, ఆదివారం

బంగారు

ఇంట్లోనుండి బాల్కనీ  లోకి వచ్చి నిలబడ్డాను

ఎదురింటి తలుపు తీసే వుంది. తీసే వుందని యె౦దుకంటున్నానంటే  తలుపులు మూసి వుంటే  లోపల యే౦ జరుగుతుందో తెలియదు కదా! అయినా యెదుటి వారింట్లోనూ, ప్రక్క వారింట్లోనూ,వెనుక వారింట్లో కి  తొంగి చూసి  యే౦ జరుగుతుందో తెలుసుకోవడం నా అభిమతం కాదు

యధాలాపంగా చూడటం, యేదైనా విభిన్న దృశ్యం అయితే  ఆసక్తిగా పరిశీలించడం చేస్తుంటాను.ఎదుటవారు చేసే పనుల పై ఆసక్తి చూపడం మంచిది కాదని తెలుసు.అయినా అదే పని చేయడం వెనుక నా ఉద్దేశ్యం మనుష్యుల  నైజం విభిన్న రూపాలలో ఉండటానికి తగిన లాజిక్ వుంటుందని నేను భావించడమే!

నిజంగా ప్రతి మనిషి కూడా తను చేసే పనిలో లాజిక్ ని వెదుక్కుంటాడేమో!

ఎదురింట్లో నేను చూసిన దృశ్యం రోజూ లాంటిదే! రోజులో దాదాపు పద్దెనిమిది గంటలపాటు ఆ టీవి  మ్రోగుతూనే  ఉంటుంది ఆ టీవి ముందు యెవరు కూర్చుని  ఉండరు.

"ఎందుకండీ టీవి చూడటం కుదరనప్పుడు అలా పెట్టేసి  వుంచుతారు అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం .."ఔరా"అన్పించక తప్పదు. ఆ మాట యేమిటంటే ..మేము యెవరం టీవి చూడకపోయినా పెట్టి వుంచడం యెందుకంటే   మా పని అమ్మాయి కోసమే! అలా టీవిలో వచ్చే మాటలు వింటూ పని చేసుకుంటూ వుంటుంది .టీవి పెట్టకపొతే పనికి రానని మొండికేసింది పనులు చేసుకోలేక విసుగేస్తున్నా, చెవుల్లో హోరుమనిపిస్తున్నా టీవి ని భరించక తప్పదు,తడిసి మోపెడు భారమయ్యే కరంట్ బిల్  కట్టక తప్పదు  అందామె . వారి పనిపిల్ల టీవిలో వచ్చే దృశ్యాలని అర కొర చూస్తూ వింటూ  పని చేసుకుంటూ వుంటుంది.అదివరకయితే ఆ పిల్లని చూస్తూ నవ్వుకునేదాన్ని కాని యిప్పుడు  నాకు "బంగారు " కళ్ళల్లో మెదిలింది. అది అంతే! పదే పదే టీవి పెట్టమని అడుగుతుండేది.

"బంగారు" నా మదిలో మెదలడం  ఆ రోజులో యెన్నోసార్లు. ఇంతకీ "బంగారు " యెవరు అంటే  వో ఆరు నెలలు కాలం  వెనక్కి వెళ్ళాల్సిందే!

రోజులాగే మా చాకలి బట్టలుతుకుంది.ఆ అమ్మాయికి బాల్య దశ వీడలేదు. బాల్యంతో బండ పని చేయించడం నాకిష్టం వుండదు. ఆ పిల్లతో ఆమాట యీ మాట మాట్లాడుతూ సాయం చేస్తూ వున్నాను. ఇంతలో వీధి  గేటు ముందు యేదో కలకలం. నేను వెళ్లి చూసాను. యేడెనిమిదిమంది ముష్టి పిల్లలు. వాళ్ళలో యిద్దరు అబ్బాయిలు కొట్టుకుంటూ వుంటే   మిగిలినవారు వినోదంగా చూస్తూ నవ్వుకుంటున్నారు.వాళ్ళందరిలో వున్న వొకే  వొక అమ్మాయి కొట్టుకుంటున్న వారిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు యేమాత్రం తగ్గక పోగా.. కోడి  పుంజుల్లా కలబడుకుంటూనే ఉన్నారు. నేను గట్టిగా వో కేక వేసి  మందలిస్తూన్నట్లే .."ఎందుకురా కొట్టుకుని చస్తున్నారు?"

వాళ్ళు సమాధానం చెప్పలేదు కాని ఆ పిల్ల చెప్పింది. రోజువారిలా కాకుండా వొకరు వెళ్ళే వీధిలోకి రెండవ వాడు వెళ్లి  యిళ్ళల్లో పదార్ధాలు అడుక్కోవడం వల్ల ..గొడవలు వచ్చాయని. ఆ పిల్ల ఆవిషయం చెపుతూ మాటలకి అనుగుణంగా చక్రాల్లాంటి కళ్ళు త్రిప్పుతూ చేతులు త్రిప్పుతూ చూపడం చూసి ముచ్చటేసింది.ఎనిమిదేళ్ళు ఉంటాయేమో! మంచి రంగే  కానీ మట్టి గొట్టుకుని మసి బారినట్లు  వుంది.
."ఒరేయ్ మీరిద్దరూ అట్టా కొట్టుకొకండి రా, కావాలంటే యీ రోజు నాకు దొరికినదంతా యిచ్చేస్తాను" అంది. ఆ పిల్ల ఆ మాట అనడం ఆలస్యం వొకడు వచ్చి ఆ పిల్ల గిన్నెలో సేకరించుకుని పెట్టుకున్న ఆహార పదార్ధాలన్నీ తన గిన్నెలోకి వేసుకుని.. ఖాళీ గిన్నెని నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు. "వాడికి ఎందుకిచ్చావ్? నేను నీకు పెట్టను పో..అంటూ ఆ పిల్లని వదిలేసి పోయాడు మరొకడు. "పెట్టకుంటే పోనీలేరా, మీ ఇద్దరు కొట్టుకోకుంటే సాలు" అంటూ ..
పాపం ఆ పిల్ల ఆ ఖాళీ గిన్నెని తీసుకుని  వీధి కుళాయి దగ్గరికి వెళ్లి శుభ్రం చేసుకుని కళ్ళు చేతులు కడుక్కుని పొట్ట నిండా మంచి నీళ్ళు త్రాగి యివతలకి వచ్చింది. నాకు ఆ పిల్లని చూస్తే జాలి వేసింది.నేను "అన్నం పెడతాను రా.." అంటూ పిలిచాను వచ్చి గేటు బయట నిలబడింది. భవానీకని తీసి వుంచినఇడ్లీని .ఆ పిల్లకి పెట్టాను. పరుగులు తీస్తూ తన వాళ్ళని వెదుకుతూ వెళ్ళిపోయింది ఆ పిల్ల.

వాళ్ళంతా  యెక్కడ ఉంటారు? రోజంతా పనిపాటా లేకుండా గిన్నెలేసుకుని వూరంతా తిరుగుతూ వుంటారు అని అడిగాను భవానీని.  చాలా యేళ్ళ  నుండి హైస్కూల్  ప్రక్కనే వున్న ఖాళీ స్థలంలో వుంటారమ్మా.! వీళ్ళకి తల్లి దండ్ర్లులు యెవరూ లేరనుకుంటాను అంది.

"రోజు యిలా అడుక్కుని తింటూ బతికేస్తారా ? అంటూ మళ్ళీ అడిగాను.ఒకో రోజు ప్లాస్టిక్ కాగితాలు యేరుకుంటూ వుంటారు.యింకో రోజు చెత్త కుండీల దగ్గర కనబతారు. ఏమి దొరకనినాడు ముష్టికి బయలు దేరతారు" అని చెప్పి వాళ్ళ పనే హాయి " అంది. "యే౦  యె౦దుకని ?" అడిగాను. "కష్టం చేసే పని లేదు కదమ్మా." అంది.

"ఇంకేం అయితే నువ్వు అల్లా వెళ్ళు" అని అన్నాను. "మొదటి నుండి అలా వెళ్ళడం అలవాటు లేదు కదమ్మా."అంది నొచ్చుకున్నట్లు.

"పుట్టిన ప్రతి వొక్కరు పని చేసుకుని బ్రతకాలి.అప్పుడే పని విలువ తెలుస్తుంది.అలా అడుక్కు తినడం  యెంత హీనమైనదో, వాళ్ళకి తల్లి తండ్రి యెవరు  దిక్కు లేదు కాబట్టి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక అలా తయారయ్యారు.అంతే !

 మౌనంగా తన పని ముగుంచుకుని వెళ్ళిపోయింది.   రోజు అయితే ఆ అమ్మాయికి టిఫిన్ పెట్టి పంపేదాన్ని. ఈ రోజు.. ఆ ముష్టి  పిల్లకి పెట్టడం వల్ల  యీ పిల్లకి లేకుండా పోయింది. అనవసరంగా సంభాషణ పెంచి భవానీకి  బాధ కల్గించానేమో అనుకున్నాను. తను  కూడా వయసుకి మించి బండ చాకిరి చేసే బాల కార్మికురాలే! తండ్రి త్రాగుబోతుతనంతో యేడవ  తరగతి చదువుకి  గండి పడి నాలుగిళ్ళలో  బట్టలుతికే పనిలో పడింది. అందుకే ముష్టి వాళ్ళ పనే హాయి అనుకోగల్గింది అనుకున్నాను.

ఇంతలో ఉయ్యాలలో వున్న పాప  నిద్ర లేచి యేడుపు అందుకుంది. " అయ్యో !   యిక నా పని పూర్తి  అయినట్టే" అని చింతపడుతూ పాపను సముదాయించుకుంటూనే  వంట పూర్తి చేసుకుని ప్రక్కవీధిలో వున్న కాన్వెంట్ లో ఎల్.కే.జీ చదువుతున్న  మా బాబుకి క్యారేజ్ తీసుకు వెళ్లాను. ఈ లోపు నిద్ర పోతున్న పాపని కాస్త చూస్తూండమని ప్రక్కింటామెకి చెప్పి వెళ్లాను.

 బాబు చదువు కోసమని మావారితో దెబ్బలాడి పల్లె నుండి పట్టణానికి కాపురం మార్చాక కాని తెలిసి రాలేదు అన్ని పనులు చేసుకుంటూ యిద్దరు పిల్లలని సముదాయిన్చుకోవాలంటే తల ప్రాణం తోక కొస్తుంది. ఊర్లో అయితే అత్తగారి సాయం ఉండేది. చేసుకున్నవారికి  చేసుకున్నంత మహాదేవా అని  పెద్దలు ఊరికే అనలేదు  కదా అని అనుకుంటూ..
పాపని యెత్తుకోవడానికి వొక పిల్లని చూసి  మాట్లాడి పంపమంటావా  అన్న అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది,తను చెప్పిన సమాధానం గుర్తుకు వచ్చింది. పసి పిల్లని మోసేందుకు మరో పసిది బలి అవ్వాలా ! వద్దు అని ఖరాఖండిగా అన్నమాట కూడా గుర్తుకొచ్చింది.నిజమే కదా ! ఇళ్ళలో పనులకి ఆడపిల్లలని బలి చేసేది తల్లిదండ్రులు ,పనులు చేయించుకునే వాళ్ళు కూడా!

నా ఇబ్బందులేవో నేను పడుతూ రోజులు గడుస్తూ ఉన్నాయి. బాబుకి అన్నం తినిపించి  వచ్చే వరకు కూడా పాప  నిద్ర  పోతూనే ఉంది.

ఒక రోజు ఆరోజు నేను చూసిన ముష్టి  పిల్ల వీధి గేటు దగ్గరే నిలబడి..యెదురుగా కనబడే టీవి వంక ఆసక్తిగా చూస్తూ నిలబడి వుంది. అది చూసి గేటు తాళం తీసి లోపలకి పిలిచాను. బెరుకు బెరుకుగా లోపలి వచ్చింది. టీవి చూస్తావా? అడిగాను తల ఊపింది. సరే కూర్చో అన్నాను. కూర్చుని టీవిని శ్రద్దగా చూస్తుంది." అన్నం తిన్నావా" అడిగాను అవును కాదు అన్నట్లు మధ్యస్తంగా తల వూపింది.ఒక ప్లాస్టిక్ ప్లేట్ లో అన్నం తీసుకువచ్చి పెట్టి తిను అన్నాను. మొహమాట పడిపోయింది. "నేను లోపలకి వెళతాను లే! తిను" అంటూ బెడ్ రూమ్లోకి వెళ్లి కాసేపటి తర్వాత వచ్చి చూస్తే అన్నం తినేసి ప్లేట్ కడిగేసి ప్రక్కన పెట్టి ఉంచింది. "నీకు యెన్నేళ్ళు"? అడిగాను. "తెల్వదు" అంది.   "మీ అమ్మ -నాన్న ఎవరు?" మళ్ళీ అడిగాను. "అది తెలవదు" అంది.   "మా ఇంట్లో వుంటావా?" అడిగాను. "ఓ.. ఉంటాను" అంది. ఉండటం అంటే వూరికే వుండటం కాదు.అచ్చంగా యిక్కడే వుండి  పోవాలి " నాకు సాయం చేయాలి.పాపని ఎత్తుకోవాలి."అన్నాను తలూపింది. "అయితే కాసేపాగిన తర్వాత బజారుకి వెళదాం,నీకు బట్టలు కొని యిస్తాను "అని చెప్పాను. ఆ పిల్ల ముఖంలో సంతోషం. బజారుకి తీసుకు వెళ్లి ఓ..మాదిరి రేటులో మూడు జతల బట్టలు కొంటుంటే షాపతను విచిత్రంగా చూసాడు.  ఇంటికి వచ్చాక .ఓ షాంపు పేకెట్ యిచ్చి శుభ్రంగా తల స్నానం చేసి రమ్మని చెప్పాను. స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు వేసుకుని కడిగిన ముత్యంలా ఉంది. నీ పేరు ఏమిటి? అడిగాను. "రంభ " అంది. నాకు నవ్వు వచ్చింది. ఆ పేరు యెవరు పెట్టారు? అడిగాను "నేనే పెట్టుకున్నాను"..అంది." సినిమాలు బాగా చూస్తావా? "ఆ చూస్తాను. రైలు స్టేషన్  కాడ,బస్ స్టాండ్ లోను చూత్తాము.ఏరిన సామానుకి డబ్బులు యెక్కువ వస్తే హాల్లో కెళ్ళి చూస్తాం " అని వివరంగా చెప్పింది. ఎక్కడ పడుకుంటావు? రైల్ స్టేషన్ కాడ, ఒకోసారి పోలీసు వాళ్ళు అక్కడ పడుకోవద్దని కొడతారు. అప్పుడు హై  స్కూల్  కాడికి చేరుకుంటాం.ఒకోసారి తినడానికి యేమీ వుండదు.అప్పుడు అడుక్కుంటాం..అంటూ వాళ్ళ యెతలు  చెపుతుంటే  హృదయం కలచి వేసింది.

ఇక నుండి నీ పేరు బంగారు.. బాగుందా ? బంగారు బంగారు.. అని రెండు సార్లు అనుకుని భలే బాగుంది అంది. ఇక నుండి నన్ను "అమ్మా!" అని పిలువు అన్నాను.ఆశ్చర్యంగా చూసింది.

సాయంత్రం అయ్యేసరికి ఆ పిల్ల స్నేహితుల గుంపు గుంపు  ఆ పిల్లని వెదుక్కుంటూ మా యింటి ముందుకు వచ్చి పడింది. అది వాళ్ళ దగ్గరకి వెళ్లి నేను యిక యిక్కడే వుంటాను. ఈ అమ్మ నాకు అన్నం పెట్టింది, కొత్త బట్టలు కొని పెట్టింది అంటూ వొంటిమీద బట్టలు చూపింది. ఈ ఇంట్లో టీవి ఉంది. ఆడుకోవడానికి బోలెడు బొమ్మలు ఉండాయి. ఇంకా పాప బాబు కూడా వున్నారు.  ఇక నేను మీతో వుండను మీ వెంటరాను అని సంతోషంగా చెప్పింది.

నేనూ  బయటకి వచ్చి..ఇక నుండి యీ పిల్ల మీతో రాదు. ఇక్కడే ఉంటుంది అని చెప్పా ను. వారి కళ్ళల్లో ఆశ్చర్యం,కొందరి కళ్ళల్లో ఈర్ష్యా కూడా కనిపించాయి. వారందరికీ తలా ఒక అరటి పండు యిచ్చి యెప్పుడైనా బంగారుని చూడాలనుకుంటే రావచ్చని చెప్పాను. వాళ్ళకి కనబడేదాక చేతులు వూపి లోపలకి వచ్చింది. ఏడుస్తున్న పాపని దానికి అందించి నేను వంట యింట్లోకి వెళ్లాను. తర్వాత బాబుకి స్నానం చేయిస్తుంటే నా ప్రక్కనే నిలబడి చూస్తూ వుంది. బాబుకి హోం వర్క్ చేయిస్తూ నువ్వు కూడా చదువు కోవాలి అన్నాను. కిసుక్కున నవ్వింది. పలక తీసి అక్షరాలూ వ్రాసి ఇచ్చాను. అ,ఆలు వద్దు.. ఏ.బి.సి.డి లు కావాలి అని అడిగింది. నేను నవ్వుకుని వ్రాసి యిచ్చాను. అయిదే అయిదు నిమిషాల్లో నాలుగు అక్షరాలూ వ్రాసి చూపించింది.చురుకైనదే అనుకున్నాను.

ఆ రాత్రి పల్లె నుండి వచ్చిన మావారు హాల్లో చాప మీద పడుకుని వున్న బంగారుని చూసి యెవరు యీ పిల్ల అని అడిగారు. ఊరునుండి అమ్మ తీసుకొచ్చి దింపి వెళ్ళింది అని చెప్పాను. తెల్లవారిన తర్వాత బంగారుని మరొక సారి చూసి యెక్కడో చూసినట్లు వుంది అని అనుమానంగా అడిగారు. నిజం చెప్పాను. ఇలాగే చేరదీయి.. యెప్పుడో వొకప్పుడు  అదును చూసుకుని చేతికందినవి వేసుకుని పారిపోతే కాని తెలుస్తుంది అన్నారు. "పాపం దాని మొహం చూస్తే అలా కనబడటం లేదండీ! అన్నాను నేను.

ఎవరు యెవరు యెలాంటి వారో వాళ్ళ ముఖం మీద కనబడుతుందా ఏమిటీ అన్నారు విసుగ్గా.

పాపం ఆ గుంపులో యేడెనిమిది మంది మధ్య అది వొక్కతే  ఆడ పిల్లండీ!! వాళ్లతో తిరుగుతూ రేపు పెరిగి పెద్దదైతే దానికి యెన్ని యిబ్బందులు వస్తాయోనండీ! మనం కాస్త జాలి చూపితే మన దగ్గరే ఉంటుంది కదా.. కన్విన్స్ చేస్తూ అడిగాను.
"అలా అని వూర్లో వున్న అనాధలనందరినీ చేరదీస్తావా? తా దూర కంత  లేదు కాని వూర్లో వాళ్ళ పాపపుణ్యాలు మనకే కావాలి " అని వ్యంగంగా అన్నారు. మా పుట్టింటి వాళ్ళు బాగా కట్న కానుకలు యివ్వలేదని అప్పుడప్పుడు దెప్పుతూ ఉంటారు. అప్పుడు ఆ మాటలు నాకు బాధ అనిపించలేదు.   ఎలాగైనా వొప్పించాలి అన్న పట్టుదలతో.. మనం పూజలు పేరిట యెంతో  డబ్బు ఖర్చు పెడుతుంటాం. దానికన్నా యిలాటి వారికి సాయ పడితే మంచిది కదండీ. మంచి పనులు చేస్తే దేవుడు హర్షిస్తాడు అన్నాను.

సరి సర్లే! తర్వాత  యేమైనా  కంప్లైంట్స్ వస్తే  మాత్రం వూరుకునేదే లేదు. అన్నారు హెచ్చరికగా.

"అమ్మయ్య ..ఆయన వొప్పుకున్నారు అదే చాలు అనుకున్నాను." ఈ మాటల్లన్నీ వింటున్న బంగారు..
బాబు గారు! నేను అలాంటి పనులు యేమి చేయను. బుద్దిగా వుంటాను.మీరు చెప్పినట్టు చేస్తాను అంది. ఒక్క క్షణం దాని వంక  చూసి సరే..జాగ్రత్తగా వుండు, మళ్ళీ మీ వాళ్ళతో కలిసావా యింట్లో నుండి  గెంటేయడమే! అని అన్నారు. అది తల వూపి యివతలకి వచ్చేసింది.

నేను  నిద్ర లేచినప్పుడే లేచి ,నేను చెప్పిన పనులు అన్నీ చేస్తూ.. వొద్దికగా వుండేది.  నెల రోజులు తిరిగేటప్పటికి మా యింట్లో  అందరి నోటా దాని పేరు మారు మ్రోగి పోయేది. మా పాప కూడా.. వచ్చీ రాని మాటలతో.. దాని పేరు చెపుతూ వుండేది. అది చూసి  చాలా సంతోష పడేది బంగారు. ఆఖరికి దాని వైపు అనుమానంగా చూసే మా వారి మెప్పు కూడా పొందింది. ఆయన దాని కోసం ప్రత్యేకంగా పుస్తకాలు కూడా తీసుకొచ్చి  యిచ్చారు. మా అత్త గారు అయితే పనిలో సాయంగా ఉంటుంది తనతో పంపమని అడిగారు. మా వారు "వద్దులేమ్మా అది అక్కడ వుండటం కష్టం అని అన్నారు.

బంగారు మా యింటికి  వచ్చిన క్రొత్తల్లో "ఇదేంటి వీళ్ళు ఆ దెష్టపు ముఖం దాన్ని తెచ్చి యింట్లో  పెట్టుకున్నారు.అని ముఖం చిట్లించుకునే  వాళ్ళు. తర్వాత తర్వాతేమో జీతం భత్యం లేని పని పిల్ల దొరికింది.   యే అమ్మ కన్న బిడ్డో! యిక్కడ  చాకిరీ చేయడానికి పుట్టింది అనే వారు. నేను బంగారుకి  చక్కగా తలదువ్వి జడలు వేస్తుంటే దూరంగా జరిగి పోయేవారు.

బంగారుకి టీవి చూడటం బాగా అలవాటు అయింది. చదువుకో అంటే కాస్త  అయిష్టంగా వుండేది.ఖాళీ సమయాల్లో టీవి.పెట్టు  అమ్మా చూస్తాను అనేది. కాసేపు చూడనిచ్చి ఆపేసేదాన్ని.ఆ పిల్ల ముఖంలో అసంతృప్తి కనిపించేది ,   కాసేపు చదువుకో అంటే అయిష్టంగా చూసేది. వచ్చే సంవత్సరం నిన్ను కూడా స్కూల్లో జాయిన్ చేస్తాను. ఇప్పుడు బాగా చదువు కోవాలి అని చెప్పేదాన్ని.

అప్పుడప్పుడు బంగారు ని చూడటానికి తన ఫ్రెండ్స్  వచ్చేవారు. వాళ్ళు వచ్చినప్పుడు తను చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయాక చాలా దిగులుగా ఉండేది

 " .ఏమిటి బంగారు దిగులుగా వున్నావ్ అంటే  ఏం లేదమ్మా,  మా వాళ్ళు అందరు అలాగే ఉన్నారు. నేను ఒక్కదాన్నే యిక్కడ బాగున్నాను.  లోకంలో చాలా మంది డబ్బున్న వాళ్ళు వున్నారు కదమ్మా..మీకు లాగా అందరూ యెవరో వొకరిని చేరదీసి చూడవచ్చు కదమ్మా అంది. ఆ ప్రశ్నకి సమాధానం నాదగ్గర లేదు. మేమందరం చిన్నప్పటి నుండి కలిసే వున్నాము. నా చిన్నప్పుడు నుండే వాళ్ళ౦దరు  యెవరికి యే౦ దొరికినా  నాకు తీసుకొచ్చి పెట్టేవారు.  ఏది దొరికినా అందరం పంచుకుని తినేవాళ్ళం. నేను కడుపు  నిండా తిన్నా వాళ్ళే గుర్తుకొస్తున్నారు,పాపం .. వాళ్ళిప్పుడు యెలా వున్నారో."అంది. దాని చిన్ని మనసులో వాళ్ళ పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి కదిలి పోయాను.

సరేలే ! మనం వారానికి  వొకసారి వారికి భోజనం పెడదాం సరేనా అన్నాను.  ఆ మాటకే బంగారు ముఖంలో సంతోషం.ఆ రాత్రి అంతా  బంగారు అన్న మాటలు గురించే ఆలోచిస్తూ వున్నాను.

అన్నమాట ప్రకారం మా వారు లేకుండా చూసి ఏ పులిహారో,దద్దోజనమో చేసి వారి అందరికి యిచ్చేదాన్ని. ఒక అనాధ  శరణాలయం అడ్రస్ సంపాదించి వారందరినీ అక్కడ జాయిన్ చేయించి వచ్చాను. ఇక వాళ్ళ గురించి దిగులు పడకు. వాళ్ళు బాగానే ఉంటారు. బడికి వెళ్లి చదువుకుంటారు అని చెప్పాను. ఒక వారం రోజులకి వాళ్ళని మేము చూడటానికి వెళ్ళేటప్పటికి వొక్కరు కూడా అక్కడ లేరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు అని చెప్పారు.తర్వాత వొక రోజు యిద్దరు పిల్లలు బంగారుని ఛూడటానికి వచ్చారు. శరణాలయం నుండి యె౦దుకు వచ్చేసారని అడిగితే ..అక్కడ సరిగా అన్నం పెట్టడం లేదని ,కొడుతున్నారని,బయట పనులకి పంపిస్తున్నారని చెప్పారు. వాళ్ళు కాసేపు వుండి వెళ్ళిపోయారు.

మర్నాడు ఉదయానికి బంగారుకి మంటల జ్వరం ముంచుకు వచ్చింది. హాస్పిటల్ కి తీసుకుని వెళితే మామూలు జ్వరమే అని చెప్పి మందులు ఇచ్చారు. రెండు రోజులు  తర్వాత అలాగే ఉండి  జ్వరం వస్తూ ఉంది. . బంగారుని హాస్పిటల్ కి తిప్పడం చూసిన మా వారు.. విసుక్కునే వారు. ఏ దిక్కుమాలిన సంతానమో..ఇది. దీని శరీరంలో ఎయిడ్స్ లాంటివి యేమన్నా దాగి ఉన్నాయేమో.. బజార్లు వెంట తిరిగేపిల్లని తీసుకు వచ్చి యింట్లో  పెట్టావ్? ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ డబ్బులు వదిలిస్తున్నావ్?అన్నారు. ఆ మాటకి హడలిపోయాను. ఆయన పల్లెకి వెళ్ళాక మళ్ళీ హాస్పిటల్కి తీసుకు వెళ్లి  డాక్టర్ గారికి నా అనుమానాలు  అన్నీ చెప్పి బ్లడ్ టెస్ట్లు చేయిస్తే నెగిటివ్  అన్న  రిపోర్ట్  చూసి ఊపిరి పీల్చుకున్నాను. దానికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. కాని యెందుకో దిగులుగా వున్నట్టు అనిపించేది. ఆ దిగులు యె౦దుకో నాకు తెలుసు.ఆ దిగులు తీర్చేందుకు నేను ఆసక్తురాలిని. ఒక విధంగా బంగారు మీద కోపం వచ్చేది.

ఒక రోజు మధ్యాహ్నం అన్నం తింటూ.. అమ్మా! నేను మా వాళ్ళ దగ్గరకి  వెళ్ళిపోతా అంది. ఎవరే మీ వాళ్ళు అని గద్దించాను కోపంగా.. మా ప్రక్క యింటి  వాళ్ళు మా యింటి  వైపు తొంగి చూస్తున్నారు. అది మాట్లాడలేదు. .

సాయంత్రం వేళ  నా ప్రక్కకి వచ్చి అమ్మా, నేను వెళతానమ్మా..అని అడిగింది. నాకు యేడుపు ముంచుకు వచ్చింది ఆరు నెలలు కాలం దానిని నా బిడ్డగానే చూసాను. ఏం  తక్కువ చేసాను.. అయినా అది యిక్కడ వుండనంటుంది నేను మాట్లాడ లేదు.

"అమ్మా! పెన్నలో మునిగి రంగడి  గుడిలో ప్రసాదం  తిని చిత్తు  కాగితాలు యేరుకుని  యేదో వొకటి తినడమే బాగుంది  నేను యిక్కడ వుండలేను పంపించేయండమ్మా" అంది.కాదంటే మళ్ళీ జ్వరం తెచ్చు కుంటుందని "సరేలే."అన్నాను.

ఉదయం నేను నిద్ర లేచేటప్పటికి బంగారు నిద్ర  లేచి  వెళ్ళడానికి తయారుగా ఉంది. వెళతాను అంది కాని నిజంగానే వెళ్ళదు అనుకున్న నేను ఖంగుతిన్నాను.బంగారు పాపని ఎత్తుకుని ముద్దాడింది.పాపా పద్దాక  యేడ్చి అమ్మని యిబ్బంది పెట్టమాకు. బాబూ !  అల్లరి చేయకుండా అమ్మ చెప్పినట్టు విను అంటూ అప్పగింతలు పెట్టింది. దానికని కొన్న బట్టలు అన్నీ తీసుకోమన్నాను. ఒక పాత  బేగ్ ఇచ్చి అది కప్పుకునే దుప్పటి కాక మరో పాత దుప్పటి ఇచ్చాను.  బేగ్ చాలా బరువుగా తయారయింది టిఫిన్ పెడితే తినకుండా పొట్లం కట్టింది.ముఖం చూస్తే తేటగా సంతోషంగా కనబడింది. వాళ్ళ వారి దగ్గరకు వెళుతున్నందుకు కాబోలు. బేగ్ తీసుకుని బయలు దేరింది  నాకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి గుమ్మం మెట్ల మీద కూలబడ్డాను. గేటు దాక వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చింది

"అమ్మా! మా అమ్మ యెవరో నాకు తెల్వదు నువ్వే మా అమ్మ అనుకుంటా వుండాను. ఒక్కసారి నిన్ను వాటేసుకుంటానే " అంది. నేను తల ఊపాను. మెట్ల మీద కూర్చున్న నా ప్రక్కకు వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నా వీపుపై వాలింది అప్రయత్నంగా దాని చుట్టూ నా చేతులు బిగుసుకున్నాయి. కొద్ది సేపు అలా ఉంది. ఓ..నిమిషం తర్వాత నన్ను విడిపించుకుని బేగ్ తీసుకుని వెనక్కి తిరిగి అయినా  చూడకుండా పరుగెత్తింది. అది కూడా యేడుస్తుందేమో..నాకు లాగానే అనిపించింది. చాలా సేపు అలానే నిస్తేజంగా కూర్చుండిపోయాను. ఏ పని చేయబుద్ది  కాలేదు.

నన్ను నేను విశ్లేషించుకోవడం మొదలు పెట్టాను.బంగారుని చేరదీయడం పట్ల నా స్వార్ధం వుంటే వుండవచ్చు కాక. అది అప్పుడప్పుడు నన్ను అడిగే ప్రశ్నలు, అనాధల జీవితాల గురించి నన్ను ఆలోచింపజేసాయి.మనిషిలో యే మూలో దాగి ఉన్న జాలి దయలతో దానిని చేర దీసి రోజులు గడుస్తున్న కొద్ది దానితో పెంచుకున్న అనుబంధాన్ని అది తేలికగా తెంచుకుని వెళ్ళిపోయింది. అది నాతో  శాశ్వతంగా  వుంటుందని నేను ఆలోచించడం వల్లనే నాకు యీ బాధ తప్పదనిపించింది.ఏ పని చేస్తున్నా  బంగారు నా వెనుక వెనుక తిరుగుతున్నట్లు వుంది. కోపం వస్తుంది. అయినా నేను తనకి  యే౦ తక్కువ చేసాను? కడుపున పుట్టిన బిడ్డలా  కాకపోయినా బాగానే చూసాను.

వచ్చే యేడాదికి స్కూల్ కి పంపాలనుకున్నాను. నాలుగు అక్షరాలూ నేర్పించి యేదో ఒక కుట్టు సెంటర్లో చేర్పించి దాని బతుకుకి  ఒక మార్గం వేయాలనుకుంటే అది యిలా.. వెళ్ళిపోయింది. నాలుగు నెలల క్రితమే అకౌంట్ ఓపెన్ చేసి నెలకి మూడు వందలు లెక్కన   సేవింగ్ చేయడం  మొదలెట్టింది. యేమిటో..అదిలా వెళ్లి పోయింది. పసి మొగ్గ లాంటి దాని జీవితం యేమవుతుందో, యెవరైనా చిదిమేస్తారేమో అన్న ఆలోచనలు  ముంచేస్తున్నాయి.

రెండు రోజులు గడచి పోయాయి.చుట్టూ ప్రక్కల అందరు.. బంగారు చేత గొడ్డు చాకిరి చేయించడం వల్లనే అది వెళ్ళిపోయింది అని  యిష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించుకుంటున్నారు.రెండు మూడు రోజులు పల్లెకి వెళదామని  అనుకుంది   వెంటనే సందేహం ముంచుకొచ్చింది. బంగారు యేదన్న ప్రశ్నలు వస్తే అత్త గారికి యే౦  సమాధానం చెప్పాలి అనుకుని పల్లెకి వెళ్ళే వుద్దేశ్యం మానుకుంది. నాలుగు రోజులుగా  పొలం పని ఒత్తిడి వల్ల భర్త  యింటికి రావడం లేదు.ఈ రోజో,రేపో రావచ్చు. బంగారు యేది? అని అడిగితే  యే౦ సమాధానం చెప్పాలి? ఆలోచిస్తుంది.

ఆరు గంటలు దాటింది. చీకటితో పాటే వర్షం కూడా మొదలయింది. కరంట్ పోతుందని ముందు జాగ్రత్తగానే దీపం బుడ్డి ,కాండిల్స్ అగ్గి పెట్టె అన్నీ రెడీగా పెట్టుకుంది.  చాప పరచుకుని  పిల్లలని ఆడిస్తూ కూర్చుంది.  ఏడుగంటలు సమయంలో కరంట్ పోయింది. వరండా గ్రిల్స్ కి  తాళం వేద్దామని వెళ్లి.. వీధి  గేటు వైపు చూసాను. జోరున కురుస్తున్న వర్షంలో అప్పుడే మెరిసిన మెరుపు వెలుగులో బంగారు నిలబడి ఉండటం కనబడింది.

బంగారు.. త్వరగా లోపలకి రావే! యెందుకు అలా తడుస్తావ్? అని కేక వేసాను. గబా గబా బంగారు లోపలకి వచ్చింది.  తడిసిన దాని బట్టలు విప్పేసి తుడుచుకోమని తుండు ఇచ్చాను. మా వారి పాత షార్ట్ ఒకటి వేసుకోమని యిచ్చాను. వేడి వేడి అన్నం పెట్టాను. ఆత్రంగా తింది . నేను అలానే  చూస్తూ వూరుకున్నాను. అన్నం తిని చాప వేసుకుని పడుకుంటూ.. అమ్మా.. నేను యెక్కడికీ వెళ్ళను. యిక్కడే వుంటాను అంది. నేను కోపంగా వెళ్ళడం,రావడం అంతా నీ యిష్టమేనా..? అసలు ఎందుకు వెళ్ళావ్? అని గట్టిగా అరిచాను.అది తలవంచుకుని కూర్చుండిపోయింది. జాలి వేసింది. మళ్ళీ వెళతాను అని అనవు కదా! రెట్టించి అడిగాను. అడ్డంగా తల ఊపింది.

ఆ రాత్రి బంగారుకి విపరీతమైన జ్వరం వచ్చింది .నాకు ఒకటే కంగారు. ఇంట్లో ఉన్న మందులు యేవో ఇచ్చాను.
రాత్రంతా వొకటే కలవరింతలు."ఒరేయ్! నన్ను వదిలేయండి రా, నేను వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తుంది..నన్ను కొట్టవద్దు..అన్నా..అంటూ వొకటే యేడుపు . నాకు భయం వేసింది. బంగారుని తట్టి లేపాను. ఏమైంది బంగారు..? అడిగాను. నా గొంతులో  వినబడిన ప్రేమకి అది పెద్ద పెట్టున ఏడ్చింది.

"అమ్మా.. నాతో వుండాళ్ళంతా మంచి వాళ్ళు కాదమ్మా.. రైలు స్టేషన్ కాడ   యెవరో రౌడీ అన్న దగ్గర పని చేస్తా వుండారు. గంజాయి అమ్ముతున్నారు. రైళ్ళలో దొంగతనాలు చేస్తున్నారు. జేబులు కొట్టేస్తున్నారు. రంగడు గుడి దగ్గర,రాజరాజేశ్వరి గుడి దగ్గర అడుక్కుంటున్నారు. ఏవేవో చెడ్డ పనులు చేస్తున్నారు.  కష్ట పడి  పని చేస్తే పొట్టలు నిండవు అంట..పని చేస్తాను అన్నా నమ్మి పని చేయించుకునే వాళ్ళు వుండరట. నేను మంచి మాటలు చెప్పబోతే యెగతాళి చేసారు.  నన్ను మూలా  పేట  గుడి దగ్గర వో  అన్న దగ్గరికి నన్ను తీసుకు వెళ్ళారు. వాడు నన్ను అక్కడే వుండమన్నాడు.  వాడు  రాత్రేల  వొంటిమీద చెయ్యేసి  యేమేమిటో చేయబోయాడు.నేను గట్టిగా  అరిచాను, యేడ్చాను. ప్రక్కన వాళ్ళు అలికిడికి వాడు నన్ను అక్కడే వదిలేసి పారిపోయాడు.  నేను అక్కడి నుండి తప్పించుకుని రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను.  తెల్లారి మా వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్లాను. నన్ను తీసుకువెళ్ళి బొంబాయి వాళ్లకి అమ్మేస్తాడని చానా డబ్బులు వస్తాయని  మా వాళ్ళు చెప్పుకుంటున్నారు.  భయం వేసి పారిపోయి  వచ్చేసానమ్మా" ..అని చెప్పి యెక్కి యెక్కి  యేడుస్తుంది.   నా గుండె దడ దడ లాడింది.  కిటికీ తలుపులు కూడా మూసి వచ్చి మరొక చాప వేసుకుని దాని ప్రక్కనే పడుకున్నాను.

బంగారు ! వాడు నిన్ను యేమి చేయలేదు కదా అన్నాను. ఆ మాట దానికి అర్ధం అయ్యే వయసు లేదు.అర్ధం అయ్యేటట్టు యెలా అడగాలో నాకు తెలియలేదు.  ఆ సంగతి అడిగి దానిని యింకా  భయపెట్టడం మంచిది కాదని వూరుకున్నాను. మొదటిసారి దానిని కని దిక్కులేనిదానిగా  వొదిలేసిన తల్లిని తిట్టి పడేసాను.

 బంగారు."అమ్మా.. వాళ్ళు వచ్చి నన్ను పట్టుకు వెళతారేమో, నాకు భయం వేస్తుందమ్మా.." అంటూ నా ప్రక్కకు జరిగి పడుకుంది." నీకేం  భయం లేదు నేను ఉన్నానుగా !" అంటూ బంగారు వొంటి మీద చేయి వేసి వెన్ను నిమురుతూ వున్నాను. అది నన్నే చూస్తూ కాసేపటికి  నిద్ర పోయింది.

తెల్లవారిన తర్వాత బంగారు భయపడుతున్నట్లే  తనతో కలసి పెరిగిన వాడు వొకడు యింకొక  మనిషి మా యింటికి వచ్చారు.  నాకు కాళ్ళు వొణుకు తున్నా సరే  దైర్యం కూడా దీసుకుని బయటకి వచ్చాను.వాళ్ళు  బంగారుని పంపివ్వమని అడిగారు.నేను వాళ్లతో పంపడం కుదరదని చెప్పాను. మళ్ళీ యింకో సారి యిటువైపు  వస్తే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తాను అని బెదిరించాను. వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ రోజే  నాకు వరసకు బాబాయ్ అయ్యే హెడ్ కానిస్టేబుల్ని పిలిపించి  ఈ విషయం చెప్పాను. ఆయన ఆ యేరియా ఎస్సై దగ్గరకి తీసుకుని  వెళ్లి  కంప్లైంట్ వ్రాయించి యిప్పించారు. ఒక సాధారణ మైన ఇల్లాలిని నేను ఇవన్నీ చేయడం పోలీస్ స్టేషన్కి రావడం  మా కుటుంబంలో యెవరికైనా తెలిస్తే  నన్ను పుట్టింటికి పంపడం ఖాయం .అదే విషయాన్ని  ఎస్సై గారికి చెప్పాను.

మీ యింటి వైపు చూడ కుండా నేను యాక్షన్ తీసుకుంటాను మీకేం భయం లేదు. మళ్ళీ యింకోసారి పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం వుండదు.. మీరు వెళ్ళండమ్మా అని ఆయన హామీ ఇచ్చారు.

నేను బంగారు తిరిగి వచ్చేస్తుంటే నా దగ్గరకు వచ్చి" మీరు చాలా మంచి పని చేస్తున్నారమ్మా!కాస్తంత ప్రేమ అభిమానం చూపి వారి కడుపుకి నాలుగు మెతుకులు పెట్టి మంచి మార్గం చూపితే  లక్షల మంది  పిల్లలు  అనాధలుగా ఉండరు. అనాధలన్నవారే ఈ సమాజంలో వుండరు. ఇన్ని జాడ్యాలు ఉండవు" అని అభినందించారు.

"ఒకోసారి విసుకున్నా మా వారి సహకారం లేకుంటే  నేనీ పిల్లని చేరదీసే అవకాశం వుండేది కాదండి "అని చెప్పి సెలవు తీసుకుని వస్తూ మళ్ళీ బంగారు కోసం బట్టలు కొనడానికి షాపుకి వెళ్లాను.   ఇంటికి వచ్చాక బంగారు మాములుగానే  బాబుతో ఆడుకుంటూ పాపని ఆడిస్తూ నా వెనుక వెనుకనే తిరుగుతూ ఉంది. మళ్ళీ  యీ పిల్ల వచ్చేసిందే అంటూ ఇరుగు పొరుగు పలకరింపులు మొదలెట్టారు.

ఆ రాత్రికి బంగారు  యింకా  భయపడుతూనే వుంటుందేమో అన్నట్టు బంగారు  ప్రక్కనే నేను చాప వేసుకుని పడుకున్నాను.   అది నిశ్చింతగా నిద్ర పోయింది. అది యిక యెప్పటికి మా యింటిని వదలదు గాక వదలదు. నిద్రపోతున్న దాని అమాయకమైన ముఖం చూస్తూ అనుకున్నాను  అవును,నాకిప్పుడు ముగ్గురు బిడ్డలని.
(ఈ కథానిక  2002 వ సంవత్సరంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి "వనితా వాణి " కార్యక్రమం ద్వారా.. ప్రసారం అయినది. )


 .