17, నవంబర్ 2012, శనివారం

తీగకు పందిరి ఓలే

తీగకు పందిరి ఓలే  

అవసరమైనవన్నీ సర్దుకున్నావా, అక్కడి వెళ్ళాక అవి పెట్టుకోలేదు,యివి పెట్టుకోలేదు. మర్చి పోయాను మామ్..అంటూ.. గారాలు పోతావా అడిగింది మల్లిక.

"ఓహ్.వాటే పిటి, నాకు  ట్వంటీ వన్ ఇయర్స్ దాటినా  యింకా నేను చిన్న పిల్లనే అన్నట్లు మాట్లాడతావు. నాకేం  కావాలో అది  నాకు తెలుసు. వెనుక ఉండి నువ్వే నన్ను నడిపిస్తున్నట్లు మాట్లాడకు మామ్,  నాకు  చిరాకొస్తుంది అంది వైషు.

"వైషు డియర్,  మామ్ తో అలా మాట్లాడకూడదని చెప్పానా మృదువుగా అన్నాడు  శ్రీకాంత్.

"డాడ్ మీరు కూడా మామ్ నే సపోర్ట్ చేస్తారు. అసలు నా బాధని అర్ధం చేసుకోరు. నిన్న నైట్ నుండి స్టార్ట్ చేసింది అవి సర్డుకున్నావా యివి సర్దుకున్నావా ,  డ్రెస్లన్నీ   పెట్టుకున్నావా అంటూ.
ఎవెరి థింగ్ ఆమె చెప్పినట్లే నేను వినను. ఐ డోన్ట్ లైక్  ఇట్." కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పింది.

ఆ మాటలకి హర్ట్ అయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మల్లికకి.

ఓకే.. బాయ్ డాడ్..అంటూ తండ్రిని హగ్ చేసుకుని కిస్ చేసి వెళుతూ  వొక సారి వెనక్కి తిరిగి  బాయ్..మామ్ అంటూ డోర్ తీసుకుని పోర్టికోలోకి దిగింది .వైషు కార్ డోర్ తెరచి లగేజ్ ని నిర్లక్ష్యంగా వెనుక సీట్ లో వేసి సీట్ బెల్ట్ పెట్టుకుని కారుని కదిల్చి బాయ్..అంటూ ముందుకు ప్రయాణించింది.

హాల్లో స్థాణువులా నిలబడి వున్న మల్లిక దగ్గరికి వచ్చాడు శ్రీ

"మల్లికా."..పిలిచాడు యేమిటన్నట్లు చూసింది.

"నువ్వు వైషు పట్ల మరీ యెక్కువ శ్రద్ధ తీసుకుంటున్నావేమో! తనేమి చిన్న పిల్ల కాదుగా.. గ్రాడ్యుయేషన్   అయిపోయింది.  వాళ్ళే అన్నీ తెలుసుకుంటారు. అయినా యిదేమి "ఇండియా " కాదు మనం చెప్పినట్లు పిల్లలు వినడానికి ."

"ఇండియా కాకపొతే యేమిటీ, యిక్కడయితే యేమిటీ!? మనం తనకి తల్లిదండ్రులం. మనం జాగ్రత్తలు చెపితే.. కావాల్సిన వస్తువులు మర్చిపోతే యిబ్బంది పడుతుందని గుర్తు చేస్తేనే  తన స్వేచ్చ దెబ్బ తింటుందా!పంతంగానో, ప్రేమ గానో అంది మల్లిక

"బిడ్డ యెక్కడ యిబ్బంది పడుతుందేమోనని నువ్వు అన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటావు.తనేమో అధికారం చెలాయిస్తున్నావనుకుంటుంది.ఇలాంటి గ్యాప్ మీ యిద్దరి మధ్య రాకూడదు. అది యిద్దరికీ మంచిది కాదు"  చెప్పాడు శ్రీ.

"ఏం పిల్లో  తన రూం లోకి కూడా పర్మిషన్ తీసుకుని రమ్మంటుంది.నాకైతే అర్ధం కాదు అంది. నేను యెలా పెంచాలని అనుకున్నాను. నా ఆలోచనలకి వ్యతిరేకంగా పెరుగుతున్న తనని చూసి జీర్ణించు కోలేకపోతున్నాను "అంది దిగులుగా.
 "నీ మనసుకి కష్టం కల్గినా నేను నీకొక  మాట చెప్పనా !?    పరిశుభ్రత,క్రమశిక్షణ గురించి చెవిలో యిల్లు కట్టుకుని చెప్పి చెప్పి వైషు కి  నీ పట్ల నెగిటివ్ ధోరణి ని నువ్వే పెంచుకున్నావు. ఇప్పుడు దూరం పెరుగుతుందని బాధ పడుతున్నావ్."అన్నాడు జాలిగా.

"తనలో నా పట్ల అదివరకటి కన్నా యెక్కువ నిర్లక్ష్యం,మొండితనం కనబడుతున్నాయి. నన్ను అసహ్యించుకున్నట్లు..నాకు బలమైన ఫీలింగ్." చెప్పింది.

"శ్రీ..తనకి  ఆ విషయాలు యేమైనా తెలిసాయి అంటావా!"అడిగింది అనుమానంగా.

"నో..నో.. అందుకు ఆస్కారమే లేదు.మనం యెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..అయినా యెప్పుడూ.. మనం లేకుండా తనని ఇండియాకి పంపలేదు.వెళ్ళినా మనం ముగ్గురుం కలిసే వెళ్ళాము.ఇక యిక్కడెవరు మనకి తెలిసిన వాళ్ళు లేరు.ఇంకెలా తెలుస్తుంది.అంటూ మల్లిక ని దగ్గరికి తీసుకుని.".పిచ్చీ, యిలాటి అనుమానాలతో బుర్ర పాడు చేసుకోకు.అందరి పిల్లల్లో వుండే నిర్లక్ష్యమే తప్ప మన బంగారు తల్లి ప్రవర్తనలో యే మార్పు లేదు.నువ్వన్నీ మనసులో పెట్టుకుని బాధపెట్టుకోకు.కాస్త అలా నీ ఫ్రెండ్స్ తో కలిపి.. ఓల్డ్ ఏజ్ హోం కి   వాలెంటరీ  సర్వీసెస్ చేయడానికి వెళ్ళు..ఈ రోజు స్టోర్స్ కి నువ్వు రానవసరం లేదులే! నేను యెవరిని వొకరిని అరేంజ్ చేస్తాను" చెప్పాడు. తల ఊపింది.

ఒక అరగంటకి శ్రీ కాంత్  వెళ్లి పోయాడు.

వైషు రూం లోకి వెళ్ళింది. సర్దడానికి కూడా  తనకి పని లేకుండా నీట్ గా రూం అంతా సర్దుకుని వెళ్ళిపోయింది.అనవసరంగా తనకి అతి జాగ్రత్తలు చెప్పి విసిగిస్తున్నానా  అని ప్రశ్నించుకుంది.
అలా అనుకుంటేనే కాని తన మనసుకు శాంతం కలుగదని నిర్ణయించుకుని గబా గబా తయారయి ఆమె ఫ్రెండ్ నడుపుతున్న ఓల్డ్ ఏజ్ హాస్పిటాలిటీ సెంటర్ కి వెళ్ళింది.

ఓ..రెండు గంటలు అక్కడ గడపడం ఆమెకి రిలీఫ్ నిచ్చింది.ఇంటికి వచ్చి కొంచెం స్నాక్స్ తిని స్టోర్స్ కి వెళ్ళింది. అక్కడకెళ్ళి  పనిలో పడిపోతే ..మళ్ళీ శ్రీ వచ్చేదాకా తనని తానే మర్చిపోయింది.

శ్రీ కాంత్ ని అడిగింది.."వైషూ సేఫ్ గా వెళ్ళిందా..జర్నీ బాగా జరిగింది .. నీకు కాల్ చేసిందా!? " ప్రశ్నల వర్షం కురిపించింది.

"అంతా ఓకే..మల్లికా, నీ కూతురి  పై వున్న  ప్రేమని కాస్త నా పై కూడా కురిపించు. నీ ప్రేమ తక్కువయ్యి నేను చూడు యెలా చిక్కి పోయానో..!" నవ్వుతూ జోక్ గానో, నిజం గానోఅన్నాడు ..

"సారీ ..శ్రీ,  ఐ యాం వెరీ సారీ" అంది మనఃస్పూర్తిగా.

అలా  వో వారం రోజులు గడిచాయి.ఆ వారం రోజుల్లో  శ్రీ, వైషూ రోజు కాల్ చేసుకుని మాట్లాడుకుంటూనే వున్నారు. అప్పుడప్పుడు తనతో మాత్రం ముక్తసరిగా మాటలు. తను మాట్లాడుతూ వుంటే కూడా..డాడ్ కి  ఫోన్  యివ్వు మమ్మీ ..అంటూ తప్పించుకుంటుంది.

ఏదో జరిగింది అనుకుంది..తన అనుమానాలు శ్రీ తో చెపితే అదేం కాదులే అని సర్ది చెపుతాడు. అనుకుని ఆ వీకెండ్ లో తనే "వైషు" కి   కాల్ చేసింది.. ఏ కళ న వుందో కానీ చాలా సేపు బాగానే మాట్లాడింది.
మాటల్లోనే హఠాత్తుగా "మామ్..నాకూ వొక బ్రదర్ వుంటే బాగుండేది.."అని అంది.

ఇరవయ్యి  సంవత్సరాల కూతురు వొక్కసారిగా అలా అడగడం తో..ఖంగు తిన్నట్లు అనిపించింది.సమాధానం చెప్పే లోపే మళ్ళీ అదే మాటని రెట్టించి అడిగింది.

"బాగుంటుంది కానీ .ఆ చాన్స్ లేదుగా వైషూ.. డాడ్ కి నువ్వంటే  పంచ ప్రాణాలు.నాకు నువ్వు ప్రాణం తో సమానం అందుకే..నీ తర్వాత యింకో చైల్డ్ వద్దనుకున్నాం రా..బంగారు."అంది.

"అయితే నాకు యిప్పుడు వొక అన్నయ్య కావాలి. ఎవరినైనా అడాప్ట్  చేసుకోండి."అంది.

మల్లిక కి సమాధానం చెప్పడానికి గొంతు పెగల లేదు.  "బాయ్ మమ్మీ, ఈ విషయం గురించి ఆలోచించు ..మర్చిపోకు" అంటూ పోన్ కట్ చేసింది.

కూతురు మాటలు మెరుపు లేని ఉరుములా వినబడి గుండెల్లో  పిడుగులు పడ్డట్టు అయ్యింది.

మనసులో మెదిలే భయాలు నిజం అవుతున్నట్లు సూచనలు. ఇరవయ్యి రెండేళ్ళు యేదైతే తెలియకుండా వుండాలని అందరికి దూరంగా వున్నారో.. ఆ విషయమే వైషు కి తెలిసి పోయినట్లు.
 తనపై  వేయినొక్క ప్రశ్నలు వొకే సారి  సంధించి వుక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు...వూపిరి ఆడలేదు  మల్లికకి.

 శ్రీకాంత్ ఫ్రెండ్స్ తో చిన్న  పార్టీ ఉంది లేట్ గా వస్తాను అని చెప్పాడు అయినా మనసు ఆగక .శ్రీకాంత్ కి పోన్ చేసింది.  "వచ్చేస్తున్నావా "అడిగింది. "ఎనీ ..ప్రాబ్లం?" అడిగాడు. "లేదు,లేదు..పర్లేదు నిదానం గానే  రా.." అని చెప్పింది.

అరగంటలో శ్రీకాంత్ రానే వచ్చేసాడు. వస్తూనే బెడ్ రూంలో దిగులుగా పడుకుని ఉన్న మల్లిక దగ్గరికి వచ్చి ప్రక్కన కూర్చున్నాడు.

"ఎందుకు..మల్లీ అలా కాల్ చేసావు." 

ఒక్క ఉదుటున లేచి అతనిని చుట్టుకుంటూ గట్టిగా ఏడ్చేసింది.

"ఏమిటో..చెప్పకుండా యేడిస్తే నేనెలా కనుక్కొను. మల్లీ..నా తల్లిగా కాస్త ఆ దుఖం తగ్గించుకుని యే౦ జరిగిందో..చెప్పు అన్నాడు లాలనగా.

"వైషూకి కాల్ చేసాను. తనకి వొక బ్రదర్ కావాలట. ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు కదా, డాడ్ తో చెప్పి ఆలోచించండి అని చెప్పింది".

శ్రీకాంత్ భ్రుకుటి  ముడి పడింది.అయినా అతనిలో కలిగే ఆలోచనలు బయట పెట్టకుండా.. "అలాగే అని చెపుదాం.ఇంత మాత్రానికే అంతలా దుఃఖ పడాలా అని వాతావరణాన్ని తేలిక పరచాలని చూసాడు.

"నాకొకటి అనిపిస్తుంది.కొన్ని నెలల క్రితం మా పిన్ని వచ్చి వెళ్ళింది కదా, ఆమె చెప్పి వుంటుంది నో..డవుట్.."అంది నిర్ధారణకి వచ్చినట్లు.

శ్రీకాంత్ మౌనంగా  ఉండిపోయాడు.

కాసేపటి తర్వాత ఇలా అన్నాడు. '"మనం నిజాన్ని  యెన్నాళ్ళని దాయగలం, వైషు కి అన్నీ అర్ధం చేసుకునే వయసు వచ్చింది. ఈ సారి వచ్చినప్పుడు తనకి అన్ని విషయాలు చెప్పేద్దాం "అన్నాడు.

"వద్దు..వద్దు.". అంటూ కంగారుగా లేచి కూర్చుంది మల్లిక.

"మనం విషయాన్ని  దాచి పెట్టి తనని మోసం చేసాం అనుకునే కన్నా అసలు విషయం చెప్పడం అన్ని విధాలా మంచిది. కనీసం నిన్ను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తుంది".అన్నాడు.

ఆ మాటకి దెబ్బ తిన్న పక్షిలా విల విల లాడి పోయింది. జరిగినదానిలో నాది మాత్రమే తప్పు  వుందని శ్రీకాంత్ వుద్దేశ్యమా అనుకుంది.తనకి కోపం వచ్చింది కూడా.

"నా మాటకి కోపం వచ్చిందా.."అన్నాడు శ్రీకాంత్ .మనసులో మాటలని చదివినట్లు.

అతనిలో ఆ గుణం వుండబట్లే తన మనసు తెలిసి తనకి వో క్రొత్త జీవితాన్ని యిచ్చాడనుకుంది.

"నేను ప్రెష్ అయి  తినడానికి రెడీ చేస్తాను,నువ్వు లేచి..ప్రెష్ ఆయి..రా "అని ఆ రూం నుండి బయటకి వెళ్ళాడు.

కళ్ళు మూసుకుని పడుకుంది.కళ్ళల్లో నీళ్ళతో పాటు గతం గిర్రున తిరుగుతుంది.

పదహారేళ్ళ మల్లిక ముగ్ద  మనోహరంగా ఉండేది. అప్పుడే టెన్త్ క్లాస్స్ పూర్తయింది. నలుగురు అక్కచెల్లెల్ల కూతురులు అందరిలోనూ అందంగా ఉండేది. నల్లటి జడ మడిచి కట్టక పొతే నేలపై జీరాడుతున్నట్లు వుండేది.

అనుకోకుండా ఆమెకి మంచి సంబంధం కుదిరిది. అతని పేరు సురేంద్ర.ఓ జాతీయ బ్యాంకు లో పని   చేస్తాడు. ఇంటికి పెద్ద కొడుకు. అతని తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు, వో చెల్లెలు. తల్లిదండ్రులకి ఆలస్యంగా పుట్టిన సంతానమవడం వల్ల గారాబంగా జల్సాగా పెరిగినవాడు.  తండ్రికి బోలెడంత పలుకుబడి,వ్యాపారాలు వున్నాయి.సురేంద్ర చదువుతో పాటు మత్తుమందు అలవాటుని పెంచి పోషించుకున్నవాడు. అవన్నీ పెళ్ళికి ముందు ఓ..లెక్కలోకి రాలేదు. మల్లిక అందం చూసి కోరి మరీ కోడలిని చేసుకున్నారు.

ఓ సంవత్సరం కాలంకే ఆ ఇంట్లో పసి వాడి బోసి నవ్వులతో అన్నీ సంతోష సమయాలే. మల్లికకి మాత్రం భర్త త్రాగుబోతుతనం నచ్చలేదు.

మొదట్లో భర్త అలవాటుని వ్యతిరేకించేది.తర్వాత గొడవ పడేది. ఒక త్రాగుడు విషయానికి బానిస అవడం తప్ప సురేంద్ర భార్యని యేడు మల్లెలెత్తుగానే చూసుకునేవాడు. నల్లగా ..ఓ..మాదిరిగా ఉన్న అతని ప్రక్క మల్లిక సౌందర్య దేవతలా వుండేది.ఆమె అందాన్ని అందరు మెచ్చుకుంటుంటే అతనికి గర్వంగాను వుండేది.

అతను తల్లిదండ్రులు ఉంటున్న సిటీ నుండి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయింది. భార్య కొడుకుతో..అక్కడి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ఉమ్మడి కుటుంబంలో భర్త ప్రవర్తన నచ్చక పోయినా లోలోపల దిగమింగుకున్నమల్లికకి వొక్కసారిగా స్వేచ్చ పెరిగినట్లు అయింది. భర్త త్రాగుడి గురించి రోజు గొడవ పడేది. అతను ఆ గొడవకి  అసలు యింటికే రావడం మానేసాడు. వచ్చినప్పుడు మాత్రం కొడుకు సిద్దార్థ ని బాగా ముద్దు చేసేవాడు. అతనికి స్పూన్ తో అన్నం తినిపించేవాడు.అది మల్లిక కి నచ్చేది కాదు. సురేంద్ర ని    అతని తల్లిదండ్రులు గారాబంగా పెంచి అడిగినవి అన్నీ యిచ్చి చెడగొట్టారని ఆమెకి కడుపు మంట.  
"వాడికి మూడేళ్ళు వచ్చాయి వాడు తినే అన్నం వాడే తినాలి నువ్వు పెట్టడం ఏమిటీ." అని వాదులాడేది.

పరిశుభ్రం,క్రమశిక్షణ పేరిట సిద్ధార్దని చీటికి మాటికి కొడుతూనే ఉండేది. అది అంతా భర్త పై ఉన్న అసహనం,కోపం అని చూసే వాళ్ళకి తెలిసి పోయేది. అకారణంగా సురేంద్ర తల్లిదండ్రులని,ఆమె తల్లి దండ్రులని కూడా తిట్టి పోస్తూ తన జీవితం నాశనం చేసారు అని యేడ్చేది.

అత్తా-మామ పై గొడవ పెట్టుకునేది. మీరు యే౦ పట్టించుకోవడం లేదు. నా బతుకు బుగ్గి అయిపోయింది అని పోన్ చేసి యేడ్చేది.
సురేంద్ర యెవరు చెప్పినా త్రాగుడు మానేస్తాను కానీ సమయం పట్టుద్ది అనేవాడు. యెంత కాలంలో మానేస్తావో చెప్పు అని షరతులు అడిగేది. పెద్దలంతా తలలు పట్టుకుని కూర్చునేవారు. నాలుగు రోజులు అక్కడ వుండి యిద్దరికీ మంచి మాటలు చెప్పి వెళ్ళేవారు. అతని చేత వుద్యోగానికి సెలవు పెట్టించి.. రీహాబిటేషన్ సెంటర్ లో జేర్పించి ట్రీట్మెంట్ యిప్పించారు. కొన్నాళ్ళు బాగానే వున్నట్టు వున్నా మళ్ళీ  మాములుగానే తయారయ్యాడు సురేంద్ర.

 సిద్దార్థ స్కూల్ కి వెళుతున్నాడు. అంత చిన్నపిల్ల  వాడిలో కూడా భర్త మేనరిజాలు కనబడితే చాలు విచక్షణ లేకుండా  గొడ్డుని బాదినట్లు బాదేసేది. సురేంద్ర యింటికి రావడానికి సమయం నిర్ణయించేది. ఏ మాత్రం ఆలస్యం అయినా తలుపు తీసేది కాదు. అతను అలా మత్తుగా జోగుతూ బయట గుమ్మం ముందు రాత్రి తెల్లవార్లు పడే వుండేవాడు.

ఒకసారి మల్లిక తన  పిన్ని కూతురి యింట్లో వో పంక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు చెప్పింది..తాగుడు వ్యవహారాలూ ఏమి పెట్టుకోవద్దు, పంక్షన్ కి వెళ్లి అక్కడ గౌరవంగా మెలిగి రావాలని అనుకున్నారు.అలాగే అని సురేంద్ర వెళ్ళాడు కానీ మాట నిలుపుకోలేదు. పైగా బాగా త్రాగి ఆ పంక్షన్ కి వెళ్ళాడు. అందరు మల్లికని  చూసి జాలి పడ్డారు. "యెంత డబ్బు ఉంటే ఏం లాభం? యెంత గొప్ప ఇంటి కోడలు అయ్యి ఏం ప్రయోజనం''  అని జాలి కురిపించారు ఆ జాలిలో ఎగ తాళి కనబడింది. భరించలేక పోయింది. 

ఆ పంక్షన్ లోనే ఆమె మరొక  పిన్ని కొడుకు కలిసాడు.. అతనొక   లాయర్. అతను వో సలహా యిచ్చాడు.ఆ తాగుబోతుతో యెన్నాళ్ళు బాధ పడతావు. నేను చెప్పినట్లు చేయి అతని పీడా వదిలిపోతుంది అని అన్నాడు. అది ఆమెకి నచ్చింది.ఆ సలహాని వెంటనే అమలు పరచింది.

అత్తమామలకి  పోన్ చేసి బాగా మాట్లాడేది. పర్వాలేదు కోడలు  అదివరకటి లా కాదు. కొంచెం మార్పు వచ్చింది. భగవంతుడా.. ఇద్దరు యిద్దరులా ప్రవర్తించకుండా వొకరైనా సర్దుకుని వుంటే అంతే  చాలు అనుకున్నారు వాళ్ళు. మనుమడి పుట్టిన రోజుకి రమ్మని ఆహ్వానించింది. వాళ్ళు సంతోషంగా  వచ్చారు. ఆ రోజు కార్యక్రమం అయినాక అందరు నిద్ర పోయిన తర్వాత యింటి మెయిన్ డోర్ కి తాళం వేసి.. ప్రక్కనే ఉన్న ఉమెన్  ప్రొటెక్షన్ సెల్ కి  వెళ్లి అత్తమామలు,భర్త కలిపి తనని వర కట్నం యెక్కువ యివ్వలేదని వేదిస్తున్నారు.తనని మానసికంగా హింసిస్తున్నారు. తనని భర్త కొట్టి బయటకి నెట్టేసాడు.. అని చెప్పి రిపోర్ట్ చేసింది.
వెంటనే పోలీసులు వచ్చి అత్తమామాలని,భర్తని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు.

ఆ తర్వాత కేసు నడిచింది. మల్లిక కి విడాకులు తేలికగా లభించాయి.  కొడుకుకి భరణం లభించింది. సిద్దార్దని   చదువు పేరిట  హాస్టల్ లో వేసారు.సురేంద్ర యిక పూర్తి గా మందు మత్తులోనే మునిగి వుండేవాడు. అడిగిన వాళ్లకి ,అడగని వాళ్ళందరికీ సురేంద్ర తన భార్య మంచిదని చెప్పేవాడు. భార్య తన త్రాగుడు వల్లనే భరించలేక అలా చేసిందని చెప్పేవాడు. కొడుకు ని అప్పుడప్పుడు చూసి వస్తూ ఉండేవాడు.

మల్లిక  వో బ్యూటి పార్లర్ లో జాయినై బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటూ ఉంది. ఆమె అక్క యింట్లోనే వుండేది. ఆమె అక్క కి వో కూతురు..ఆ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. మేనత్త కొడుకు కిచ్చి వివాహం జరిపించాలని అనుకున్నారు. అతను శ్రీకాంత్. విదేశాలలో చదువుకుని అక్కడే వుద్యోగం చేస్తున్నాడు. అతనికి మల్లిక తో పరిచయం ఉంది. అతను స్వదేశానికి  వచ్చాడు. నిశ్చయ  తాంబూలాలు అందుకునే  రోజుకి  శ్రీకాంత్ మల్లికని పెళ్లి చేసుకుని వచ్చి బందువులందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మల్లిక అక్క చెల్లెల్ని తిట్టిపోసింది." పిన్నీ..నీకు నా బావే కావాల్సి వచ్చాడా అని అడిగింది అక్క కూతురు.

అమ్మ,నాన్న అందరు తిట్టిపోశారు.నీ కన్నా వయసులో అయిదారేళ్ళు చిన్నవాడు. అక్కకి కావాల్సిన అల్లుడిని చేసుకుని మా పరువు తీస్తావా  అని ముఖం మీదే తలుపు వేసారు.
శ్రీకాంత్ యెవరికి భయపడలేదు.ఎవరి ఒత్తిళ్ళకి తల వొగ్గలేదు.తన కోసం అన్నీ భరించాడు.పట్టుకున్న  తన చేయిని విడువలేదు.హైదరాబాద్ లో యిల్లు తీసుకుని అక్కడ వుంచి తను వెళ్ళిపోయి కొన్నాళ్ళకి వీసా పంపాడు.తనకి లభించిన జీవితం కోసం అందరిని వదిలేసి..శ్రీకాంత్ తో  సముద్రాలు దాటింది.

ఆ క్రమంలో కొడుకు సిద్దార్ధ కూడా ఆమెకి గుర్తుకు రాలేదు. ఒకవేళ గుర్తుకు వచ్చినా బలవంతాన తుడిచేసుకుంది. ఏ మనిషయినా  ముందుగా  తనని తానూ ప్రేమించుకోవాలి. తను బాగుంటేనే కదా యితరుల గురించి ఆలోచించ గల్గేది. ఆఖరికి బిడ్దలయినా సరే అనుకుంది.

రెండు మూడేళ్ళకు వైషు పుట్టింది. వైషు పుట్టుకప్పుడు సాయం కోసం శ్రీకాంత్ తల్లి వచ్చింది. కొడుకుని వదులుకోలేక మల్లిక అంటే యిష్టం లేకపోయినా రాజీ పడిపోయారు. మల్లికని చదివించాడు.  స్వంతంగా ఒక  ఇండియన్ స్టోర్స్  పెట్టుకుని ,శ్రీకాంత్ వుద్యోగం చేసుకుంటూ.. వైషు ని  ప్రాణం లా పెంచు కుంటూ వచ్చారు.

ఇప్పుడు యిలాటి ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది. తనలోని మాతృత్వం సిద్దార్దని వదిలేసినప్పుడు యేమైందో అర్ధం కాలేదు మల్లికకి.

అప్పుడపుడు పోన్ లో మాట్లాడటం, ఓ నాలుగేళ్ళకు వచ్చినప్పుడు వొంటరిగా వెళ్లి చూసి రావడమో చేసేది. ఒకసారి  "సిద్దూ" ని  మనతో  తీసుకువెళ్ళడానికి యె౦దుకు ప్రయత్నించ కూడదు"అనడిగాడు శ్రీకాంత్.

"వద్దు, అలాంటివి యేమి పెట్టుకోవద్దు నేను గతాన్ని నా వెంట తెచ్చుకోవాలనుకోవడం లేదు" అని చెప్పింది. 

అందుకు శ్రీకాంత్ నేను మనఃస్పూర్హిగానే" సిద్దూ"ని మనతో వుండటానికి యిష్టపడుతున్నానని చెప్పాడు.అయినా సరే తను అలా పాషాణం లా వుండిపోయింది.
ఆ తరువాత సిద్దూతో ఫోన్  లో మాట్లాడటమే తప్ప తను చూడనే లేదు. తన చెల్లెళ్ళు కూడా విస్తుపోయేవారు. నువ్వు "సిద్ధూ" కి తల్లివి. అలా వాడిని వదిలేసి యెలా  కఠినంగా వుండగాలుతున్నావ్, నీకు మనసనేది లేదా అనేవాళ్ళు. తను యేమీ మాట్లాడేది కాదు.

 "ఎవరు యేమనుకుంటే నాకేంటి, నాకు మంచి జీవితం లభించింది అది చాలు నాకు" అనుకుంది.

 అయితే  అప్పుడప్పుడు తనతో సిద్దార్ధ బాగానే మాట్లాడే వాడు. తండ్రి తోనూ బాగా దగ్గరి తనం తోనూ మెలిగే వాడు అని తెలుస్తూనే ఉండేది. సురేంద్ర మేనరిజంస్ కనబడుతున్నాయని అసహ్యించుకునే మల్లిక కి సిద్దార్ధలో కనబడే సాఫ్ట్ నెస్ కానీ అండర్ స్టాండింగ్ కానీ వైషు లో కనబడేవి కాదు. తను యెంత ప్రాణంగా చూసినా శ్రీకాంత్ తోనే దగ్గరగా మసలేది.

తను సిద్దార్దని పట్టించుకోకుండా వొదిలేసి వచ్చినందుకు తనకి అలా జరుగుతుందనే ఆత్మా నూన్యతా భావం యెక్కడో గిల్టీ ఫీలింగ్ మల్లికకి. నేను వో మంచి తల్లిని కాదేమో అని అనుమానం వచ్చేది. కానీ యిప్పుడు అనిపిస్తుంది. తను  చేసిన తప్పిదం వల్ల  ప్రాణం అనుకున్న బిడ్డ కూడా నన్ను అసహ్యించుకుంటే భరించలేను.

పాపం, శ్రీకాంత్ నాగురించి తెలిసి నాకు  క్రొత్త జీవితం యివ్వడం యెంత గొప్ప విషయం. అది ప్రేమే కావచ్చు లేదా సానుభూతి కావచ్చు  తన లోని తల్లిని కూడా మరిపించేసాడు.

తను సన్నగా నాజుగ్గా వుండబట్టి యిక్కడ కూడా యెవరికీ అనుమానం వుండేది కాదు.మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని కితాబు ఇచ్చేవారు. బంధువులు అందరు తనని చూసి ఈర్ష్య తో  యేడ్చేవాళ్ళు.మల్లికకి లభించిన జీవితం అందరికి దొరుకుతుందా, అంతా  తన అందంతో శ్రీకాంత్ కి వల వేసిందని అనుకునే వాళ్ళు.

 శ్రీకాంత్ భార్యగా  అతను యే రోజు యేమీ తక్కువ చేయలేదు. కానీ వైషు యిప్పుడు తనని ద్వేషిస్తున్నట్లు అనిపిస్తుంది. తనకి అన్ని నిజాలు తెలిసి పోయాయేమో!  అలా అనుకుంటూ గతాన్ని  గుర్తు తెచ్చుకుని బాధ పడుతూనే ఉంది మల్లిక

"ఇంకా  ఆలోచిస్తూనే వున్నావా  మల్లీ,  అంతా నేను చూసుకుంటాను  అన్నాను కదా దిగులు పడకు "అన్నాడు.

శ్రీ.. నువ్వు చెప్పు,  వైషు నన్ను అసహ్యించు కోదు కదా  అడిగింది దిగులుగా..

"లేదు, నేను అర్ధం చేసుకునేటట్లు  చెపుతాను కదా" అని తనని బలవంతంగా డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకు వెళ్ళాడు.

"నేను  రేపు వుదయం బయలుదేరి వైషు దగ్గరకి వెళతాను. అసలు తను  యే౦ చెపుతుందో చూస్తాను" అన్నాడు.

నేను వస్తాను అంది చప్పున. ఒకసారి సాలోచనగా చూసి "వద్దులే! నిన్ను చూస్తే యింకా మొండిగా తయారవుతుంది.పైగా నిన్ను యేమైనా అంటే నీకు  తట్టుకోవడం కూడా చాలా  కష్టం " 

"అంతేనంటావా శ్రీ" దీనంగా  అడిగింది. మౌనంగా వుండిపోయాడు. తాము  వుండే ప్లేస్ కి నాలుగు గంటలు ప్రయాణం .వైషు కి ముందుగా కాల్ చేసి చెప్పకుండానే బయలు దేరాడు.

అతను వెళ్ళాడో లేదో  వైషు ల్యాండ్ లైన్ కి  కాల్ చేసింది. మల్లిక ఫోన్ తీసింది

ఉపోద్ఘాతాలు యేమి లేకుండానే.. మామ్, నిన్ను వొకటి అడుగుతాను నువ్వు సమాధానం చెప్పాలి" 

"చెప్పు తల్లీ.." అంది  మల్లిక.

"డాడ్ మంచి వాడు కాకపొతే..డాడ్ కి డైవోర్స్ యిచ్చేసి యింకొకరు నచ్చితే పెళ్ళిచేసుకుని నన్ను వదిలేసి వెళ్లి పోతావా " అడిగింది నిర్మొహమాటంగా.

మల్లికకి కాళ్ళ క్రింద  భూమి కంపించి పోతుంది.

"నేనలా యె౦దుకు చేస్తాను వైషూ.. నువ్వు నా ప్రాణం తల్లీ"

"అంతా అబద్దం.నువ్వు యెప్పుడూ చెప్పే ఇండియన్ కల్చర్..తల్లి-బిడ్దల ప్రేమ ఆంతా అబద్దం." నీకు నువ్వు చెప్పిన మాటే నెగ్గాలి. చిన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తున్నాను. క్రమశిక్షణ,పరిశుభ్రం అన్న పేరిట సాధించి పెడతావు. డాడ్ చెప్పినట్లు యెప్పుడైనా నువ్వు చెప్పావా, నీ ప్రేమ అంతా నాటకం. తల్లికి బిడ్డ పై వున్న ప్రేమ నిజం అయితే.. అది భర్త మంచి అలవాట్లు,భర్త చూపించే ప్రేమ వల్ల మాత్రమే వుంటుందా, నా పై ఉన్న ప్రేమ నీకు సిద్దూ అన్నయ్య మీద యె౦దుకు లేదు?

తూటాల్లా తగులుతున్నాయి మల్లిక కి

"పాపం సిద్దూ అన్నయ్య నాకు పరిచయం కాకుండా వుంటే తెలిసేదే కాదు" అంది.

"సిద్దూ..నీకు తెలుసా "మాట పెగుల్చుకుంటూ అడిగింది.

"హా..తెలుసు, నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. నేను ఇండియన్ కల్చర్ పై చేస్తున్న రీసెర్చ్ వర్క్ లో నాకు అసిస్టెన్స్ గా చేస్తున్నాడు. మాటల్లో భారతీయ స్త్రీ వివాహ బంధం వైఫల్యం గురించి చెపుతూ.. తల్లిదండ్రి విడిపోతే పిల్లలు యెలా సఫర్ అవుతారో చెపుతూ తన కథ చెప్పాడు 
తర్వాత  మన ఇంటికి వచ్చిన చిన్నమ్మమ్మ నువ్వు మాట్లాడుకుంటున్న విషయాలలో సిద్దూ అన్నయ్య తల్లి వి నువ్వేనని తెలుసుకున్నాను.  సిద్దూ అన్నయ్య ఆ  విషయం చెప్పకుండా వుంటే యీ విషయం నాకెప్పటికి తెలిసేది కాదు.

"మామ్, యిండియన్  కల్చర్ లో బిడ్డలని వదిలేసే తల్లి వున్నట్లు నేను వినలేదు, చదవలేదు. పేగు బంధం అంటే యిదేనా మామ్! మా డాడ్  కూడా మంచి వాడు కాకపొతే నన్ను  వదిలేసి వెళ్ళిపోయే దానివి కదా,  ఐ హేట్ యూ , ఐ హేట్  యు మామ్ " అంది.

"వైషు..నా తల్లీ..ఈ అమ్మని అలా అనకురా, నువ్వు నా ప్రాణం! నువ్వు అలా  అంటే నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను."అని   హృదయ విదారకంగా ఏడుస్తుంది మల్లిక. 

"మామ్  అయితే ఒక పని చేయి. నేను నీ ప్రాణం అన్నావు కదా, నా కోసం నువ్వు చచ్చిపో, లేకపొతే నీ లాంటి మామ్ వున్నందుకు  నేనే చచ్చిపోతాను." అని చెప్పి పోన్  పెట్టేసింది.

ఉన్న చోటునే కుప్ప కూలిపోయింది మల్లిక.

వైషూ నే ప్రాణం అనుకున్న ఆమెకి  కూతురు తననే చచ్చిపోమ్మని చెప్పింది..ఇంకా యె౦దుకు బ్రతకాలి .? అనుకుంది .

అక్కడి నుండి లేచి బెడ్ రూం లోకి వచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్ అరలు అన్నీ వెదికింది.  పిచ్చిగా వెదుకుతూనే వుంది. కాసేపటికి ఆమెకి కావాల్సిన టాబ్లెట్స్ దొరికాయి. అవి వొక్కొక్కటిగా వేసుకుంటూ సిద్దూ ని తలచుకుంది.

"అయ్యో,  సిద్దూ.. నేనెంత తప్పు చేసాను. ఒక తల్లి చేయాల్సిన విధంగా నేను నీకేమి చేయలేదు కదూ,            నిన్ను వదిలేసి నా దారి నేను చూసుకున్నాను. అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. నేను చచ్చి పోతున్నాను. అవును నా కూతురు అడిగినందుకన్నా నేను చావాలి. తల్లిని అంటే యేమిటో నిరూపించుకోవాలి." కసిగా అనుకుంది.

అయ్యో, నా ప్రాణం పోతుందేమో ప్రాణం పోయే లోపు నేను సిద్దూని  వొక సారి చూడాలి లేదా వొక సారి మాట్లాడనైనా మాట్లాడాలి.

కానీ యెలా, కళ్ళు తిరుగుతున్నాయి. బలవంతాన కళ్ళు తెరుచుకుని.".శ్రీ "కి పోన్ చేసింది." శ్రీ నేను వెంటనే సిద్దూ తో మాట్లాడాలి ప్లీజ్! నేనిపుడు మాట్లాడకపోతే యెప్పటికి మాట్లాడలేను.
"శ్రీ" నాకోసం చాలా చేసావు.ఈ ఒక్కటి చేయవా ప్లీజ్..ప్లీజ్. మాటలు ముద్దగా మారుతూ  రిసీవర్  వదిలేసింది. ఏం జరిగిందో అర్ధమయింది  శ్రీకాంత్ కి. వెంటనే ఎమర్జెన్సీ కి పోన్ చేసి తన యింటి చిరునామా  చెపుతూనే   వెనక్కి ప్రయాణమయ్యాడు .

"వైషూ కి పోన్ చేసి సిద్దూ గురించి అడిగాడు." ఎస్ డాడ్ ఈ సిటీలోనే వున్నాడు.అతని పోన్ నంబర్ యె౦దుకు  అడిగింది. 
"యూ..స్టుపిడ్,  నువ్వు చేసిన చేష్టలకి మీ మామ్  చచ్చిపోతుంది. సిద్దూని చూడాలనుకుంటుంది." చెప్పాడు కోపంగా.

"ఓ..మై గాడ్, మామ్  అంతపని చేస్తుందని  అనుకోలేదు..రియల్లీ ఐ యాం సారీ..డాడ్. నేను ,సిద్దూ అన్నయ్య యిప్పుడే బయలు దేరి వచ్చేస్తాం." అంటూ యేడ్చింది.

ఆ రోజు రాత్రికి  కాని ప్రమాదం నుండి బయటపడలేదు మల్లిక.

కళ్ళు విప్పి చూసే సరికి తన వైపే ఆత్రుతగా చూస్తున్న సిద్దూ కనిపించాడు.దూరంగా వైషూ నిలబడి చూస్తుంది.

"సిద్దూ అమ్మా యిప్పుడు యెలా వుంది? ఆర్ యూ ఒకే!
వైషూ చూడు యెంత దిగులుగా  వుందో, తనని దగ్గరకి పిలువు."చెప్పాడు.

కళ్ళతోనే కూతురిని పిలిచింది. మామ్ అంటూ వచ్చి తల్లిని  హత్తుకుంది. ఆరిపోబోయిన ఆ కళ్ళల్లో వెలుగు వచ్చింది.

"వైషూ..అమ్మని చూడు యెంత బాధ పెట్టావో, అమ్మ పై నీకు కంప్లైంట్ గా నేనా విషయం చెప్పలేదు. అసలు నాకు నువ్వు చెల్లివి అవుతావని తెలియదు.అంతా అలా జరిగి పోయింది.
అయినా తల్లిదండ్రులు  పిల్లలకి  ప్రేమని పంచడం మాత్రమేనా కావాల్సినది. వాళ్లకి వ్యక్తి గతజీవితం ఉంటుంది కదా! ఆ కోణంలో చూస్తే అమ్మ చేసినది నాకు తప్పుగా తోచలేదు. మా డాడ్ కి త్రాగుడు వ్యసనం వుంది.కానీ ఆయన నాకు అమ్మ పై ద్వేషాన్ని పెంచే మాటలు చెప్పలేదు.
వాళ్ళ జీవితాలలో అలా జరిగిపోయిన సంఘటనలకి కారణం యెవరైనా  నేను యెవరినీ  తప్పు పట్టడం లేదు. అందరిలో తప్పు వొప్పులు వెదకడం మానేసి ప్రేమించడం చేస్తే అంతా పాజిటివ్ గానే కనబడుతుంది" అని చెప్పాడు సిద్ధూ .

మన ఇండియన్ కల్చర్ లోను ద్వితీయ వివాహాలు సర్వ సాధారణం అయిపోయాయి. మగ వాళ్ళు పిల్లల బాధ్యత నుండి తప్పించుకున్న వాళ్ళు ఉంటున్నారు. స్త్రీలు కూడా అలాగే వుండటం చూస్తున్నాం.ఇద్దరిలో యెవరు లేకపోయినా కొరత గానే ఉంటుంది.అది పిల్లల దురదృష్టం. అనాధలు పెరిగినట్లు పెరగడం అంటారే..అలాగన్నమాట.మా డాడ్ ప్రేమ నాకు బాగానే ఉన్నా.. ఆయన అన్ని కాలాలు '"అమ్మ"కాలేడు  కదా,
జీవితంలో లభించిన వాటికి రాజీ పడి పోవాలనుకున్నాను.  నేను అలాగే రాజీ పడిపోయాను అని చెప్పాడు. చాలా లోతుగా ఆలోచించినట్లు.
.
సిద్దూ..యెంత యెదిగి పోయావు నాన్నా, నిన్ను వదిలేసి నా దారి నేను చూసుకున్నా నీకు మంచి ఆలోచనలతో పాటు  అవగాహన చేసుకునే  శక్తి వచ్చింది.నా లాలనలో  కూడా నువ్వు యిన్ని నేర్చుకోలేక పోయి వుండవచ్చు అనుకుంది  లోలోపల. మల్లిక  వొకోసారి మనసు మాటలు బయటపడటం కూడా యిబ్బందే అన్నట్లు అనిపించింది.  ఇప్పుడు తనేం మాట్లాడినా లాభం లేదు.తన తప్పు-ఒప్పులని బేరీజు వేసునే సమయం కాదు. కరిగిన కాలాన్ని జరిగిన నష్టాన్ని తను యే మాత్రం పూడ్చ లేదు.ఇది జీవితం.ఏ ఒక్కరు లోపాలు లేకుండా తప్పులు చేయకుండా జీవితాన్ని జీవించలేరేమో! అది తప్పు అని తెలియకుండానే జీవిత ప్రయాణం సాగుతూ ఉంటుంది. నా ప్రయాణం స్వార్ధ ప్రయాణం. అనుకుంది. అనుకున్న మాట ఒక్కటి కూడా బయటకి చెప్పలేక. 

"సిద్దూ తల్లి పెంపకం కాకపోయినా బాగా యెదిగావు నాన్నా! నేను యింత కన్నా యేమి చెప్పలేను" చెప్పింది దుఖం ముంచుకు రాగా.

"నాకు ఇతరులని అర్ధం చేసుకునే  కోణంలో అన్ని విషయాలు  వివరించి చెప్పిన  వ్యక్తీ శ్రీకాంత్ అంకుల్ అమ్మా ఆ క్రెడిట్ ఆంతా అంకుల్ దే " అని చెప్పాడు.

"శ్రీకాంత్  నువ్వు సిద్దూ తో మాట్లాడతావా "అడిగింది. నవ్వుతూ తల ఊపాడతను.  ఏదో అర్ధమైనట్టు మల్లిక మనసు తేలిక పడింది. "మామ్, సిద్దూ అన్నయ్య  యిక నుండి మనతోనే వుంటాడు. ఓకేనా!అడిగింది.అందులో తన  ఆమోదం అవసరం లేదు అన్నట్టు ఆజ్ఞాపన  వొక్కటే  వున్నట్లు అర్ధం అయింది మల్లికకి.

"ఆడవాళ్లు లతల్లాంటి వారు, యెక్కడ ప్రేమ అనే ఆధారం దొరికితే అక్కడల్లుకు పోతారు.ఆ ఆధారం మంచిదైతే ఆ తీగ వికసించి  ఫలిస్తుంది. నేను మీ డాడ్ ని అలా అల్లుకున్న దానినే  వైషూ అని చెప్పింది కూతురితో.  అంత కన్నా యేమి చెప్పలేక.4 కామెంట్‌లు:

సుభ/subha చెప్పారు...

Very Very interesting and very nice narration. ఎంతో ఆర్థ్రతతో ఉందండీ కథ కాని కథ.

హితైషి చెప్పారు...

తన స్వార్ధం తో బిడ్డని కూడా వదులుకున్న ఓ తల్లి కథని సరి క్రొత్త కోణంలో చూపించారు చాలా బాగా వ్రాసారు. అభినందనలు ఏకబిగిన చదివించారు.మీ శైలికి ఉన్న గుణం అదే!
బిడ్డల కోసం త్యాగాలు చేసే తల్లికి పట్టం కట్టే ఈ దేశంలో "మల్లిక " లాంటి తల్లులు ద్వితీయ వివాహం చేసుకుని ఉన్నారు. ఇదేమి కొత్త కాదు కదా!

శశి కళ చెప్పారు...

nijamgaa inko konam.chala baga vrasavu akka

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సుభ గారు కథ నచ్చినందుకు ,మీ స్పందనకి ధన్యవాదములు.

@ వైష్ణవి.. జీవితాల్లో అనేక కథలు. వాస్తవ జీవన చిత్రణ.
మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను. అందుకే మాత్రుత్వంకి మరో కోణం అని చెప్పాను.

@శశి కళ గారు.. మీ స్పందనకి చాలా చాలా థాంక్స్ !