15, నవంబర్ 2012, గురువారం

మై స్పేస్ అమ్మలక్కల కబుర్లు 5

కష్టపడి సంపాదించిన  ప్రతి పైసా విలువ నాణ్యత గల వస్తువు లు కొన్నప్పుడు మరింత పెరుగుతుంది. అంటారు కదా! షాపింగ్ కి వెళితే నేను అదే ఆలోచిస్తాను.

ఈ మధ్య రెండు మూడు రోజులు షాపింగ్ కి వెళ్ళినప్పుడు  నేను  పరిశీలించిన విషయాలు తో.. కొన్ని ముచ్చట్లు..మోసుకొచ్చాను.

సాధారణ మానవుడికి కొనుగోలు శక్తి కన్నా కోర్కెల చిట్టా అనంతం.

పేదవాడికి నిత్య అవసరాలు తీరే ఆదాయం లేకున్నా ముఖ్యమైనవి కొనుక్కుని మిగతావి రేపటికి వాయిదా వేసుకుని సరిపుచ్చుకుంటాడు. హాయిగా నిద్రిస్తాడు.

మధ్య తరగతి వ్యక్తీ ఈ రోజు అవసరాలు తీరకున్నా రేపటి కోసం ఆలోచిస్తాడు.మదుపు చేయాలని ప్రయత్నం చేస్తాడు.

ధనవంతుడు తన దగ్గర అపరిమితమైన ధనం ఉన్నప్పటికీ ఈ రోజు జీవించడం అనే అనుభూతిని కోల్పోతూ ఇంకో నాలుగు తరాల వారు కూడా వెనకేసుకునే అంత డబ్బుని ఎలా కూడబెట్టాలా ! అని ఆలోచిస్తూ ఉంటాడు.

రైతులకి కడుపు మండి  క్రాఫ్ హాలిడే  ప్రకటించినా వర్షా భావాలు నెలకొన్నా..తుఫాను తాకిడికి గురైనా  నింగిని తాకుతున్న నిత్యావసరాల ధరవరలతో..సగటు జీవి కుదేలైపోతున్నాడు.అయినా ఆర్ధిక భద్రత కోసమో..ఆడంబరం కోసమో నలుగురిలో పలుచన కాకుండా ఉండాలని ధర చుక్కలనంటుతున్నా  సరే బంగారం కొంటూనే ఉన్నారు.  ఏ దుకాణాలు   చూసినా బట్టలు,బంగారం,వన్ గ్రామ్  గోల్డ్ నగలు అమ్మే షాపులు క్రిక్కిర్సి ఉంటున్నాయి.

 అసలే ముహూర్తాల కాలం. బంగారం స్త్రీల ఒంటిమీదే కాదు  పురుషులు కూడా అభినవ బప్పీ లహరి లాగా కనబడుతున్నారు. మధ్య తరగతి అమ్మాయిలూ కూడా  తల్లిదండ్రులని పీడించి అయినా సరే ఒకో డ్రస్స్  అయిదు వేలు ఖరీదు కి తక్కువ కాకుండా కొంటున్నారు.  ప్రతి పంక్షన్  కి సరి క్రొత్త చీరో,డ్రస్ కొనడం పరిపాటి అయిపోయింది. ఇలాంటివి అన్నీ గమనిస్తూ ఉంటే భారతీయులకి కొనుగోలు శక్తి పెరిగిందని తెలియవస్తుంది.

ఒకప్పుడు విదేశీ బ్రాండ్ అంటే కొనడానికి భయపడే ఈ దేశపు యువత..ఇప్పుడు అచ్చంగా  బ్రాండ్ అయిటంస్ ని అవలీలగా కొనుగులు చేస్తున్నారు. మహా నగరాలలోనే కాదు..విజయవాడ పట్టణంలో కూడా అతి ఖరీదైన విదేశీ బ్రాండ్ యాక్ససరీస్ కనబడుతున్నాయి.

ఇక అమ్మాయిల విషయానికి వస్తే పెళ్లి విషయం వచ్చేటప్పటికి అన్ని ఎంత ఖర్చు అయినా సరే  అన్ని ముచ్చట్లు సంప్రదాయంగా కావాలని కోరుకుంటున్నారు..

చదువుకున్న అమ్మాయిలకి డిమాండ్ ఎక్కువ. అబ్బాయిలు  విద్యావంతులు కాకుంటే   ఎంత ఆస్తిపాస్తులున్నా వారికి తగిన వధువు లభించడం కష్టమైపోతుంది. వారికి ముప్పయిలు దాటుతున్నా వివాహం కావడంలేదు.అమ్మాయిల కోసం వెదుకులాట .అమ్మాయిల కోర్కెలు కొండెక్కి కూర్చుంటున్నాయి

విదేశాలలో చదువుకుని ఉద్యోగం చేస్తున్న వారి కష్టాలు తక్కువేమీ కాదు. వధువు కోసం వెదుకులాటలో సంవత్సరాలు గడచిపోతున్నాయి. పెళ్లి కూతురికి వడ్డాణం  పెడతారా.. లేక  డైమండ్ నెక్లెస్ పెడతారా అని అడుగుతున్నారు.

 మా చిన్నతనం లో ఊరంతటి లోను  ఏ ఒక్కరికో ఇద్దరికో  వడ్డాణం ఉండేదేమో! ఇప్పుడు నాలుగు ఇళ్ళకి ఒక ఇంట్లో అయినా వడ్డాణం తో మెరుస్తున్న అమ్మాయిలూ కనబడుతున్నారు.(పుత్తడి అయినా ఇత్తడి అయినా )

ఈ  మధ్య  మా ఇంటి అమ్మాయే పెళ్లి ముందు రోజు ఏడుస్తూ కూర్చుంది. "వడ్డాణం " చేయించలేదని.  పోనీ ఈ అమ్మాయిలు వడ్డాణం  పెట్టుకుని  విదేశాలకి వెళతారా అంటే అదీలేదు.  వడ్డాణం చేయించడం కన్నా దానిని భద్రం చేయడం చాలా కష్టం అండీ!   బ్యాంకు లలో వడ్డాణం  పట్టే  లాకర్స్ కూడా దొరకడం లేదు. ఇంట్లో  పెట్టుకుని కంటి నిండా నిద్రపోయే రోజులు కావు ఇవి

డైమండ్ లా జీవితం ప్రకాశించాలని,వడ్డాణం లాంటి బంధనంలో ఆలుమగల బంధం అందంగా అల్లుకుని ఉండాలని కోరుకోవాలి కాని ఆడంబరం గా కనబడాలనే తాపత్రయం కనబడుతుంది. ఏమిటో.. ఈ కాలం  పిల్లలు అస్సలు అర్ధం కారు.

అమ్మాయిలకి  చదువులు, ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత అవసరమో.. పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకుని.. సింపుల్ అండ్ కంఫర్ట్ బుల్ లైఫ్ లో   ఇమిడిపోవాలని  కోరుకుంటే..బావుంటుంది అనుకున్నాను.

అన్నట్లు.. నాకు ఉంటుంది మున్ముందు మొసళ్ళ పండుగ. కాబోయే కోడలికి వడ్డాణం  లేదా  డైమండ్ నెక్లెస్ నో పెట్టరా.? అని ప్రశ్నలు మొదలయ్యాయి :)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కోడలికి ఒక టన్ను బంగారంతో నగలు వడ్డాణం చేయించెయ్యండి :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ కోడలికి మంచి నగలతో పాటూ మీ కళాకాంతులను కూడా గిఫ్ట్ గా ఇవ్వండి..
పెళ్ళికి మేము కూడా వస్తాము కదా అన్నీ చూస్తాము :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే ..మాస్టారు.. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు. టన్ను బంగారం ఏమో కాని జీవితాంతం బంగారం తో పోల్చుకునే అబ్బాయిని కోడలకి బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను. :)

@ రాజీ గారు..తప్పకుండా నండీ! మీ లాంటి ఆత్మీయులు లేకుండా..మా ఇంట శుభకార్యం జరగదు. తప్పకుండా రావాలి,చూడాలి. థాంక్ యు వెరీ మచ్,