12, మార్చి 2023, ఆదివారం

ఈస్తటిక్ సెన్స్

ఈస్తటిక్ సెన్స్ _వనజ తాతినేని


అర్ధరాత్రి కావస్తుంది. తోటలో ఉయ్యాలబల్లపై కూర్చుని ఎయిర్పోర్ట్ నుండి వచ్చే కారు కోసం ఎదురుచూస్తుంది మైథిలి. సెక్యూరిటీ గార్డ్ మొబైల్ ఫోన్ లో పెట్టుకున్న పాట పైకి వినబడతూ వుంది. “అందంగా లేనా అసలేం బాగోలేనా” అంటూ.  మైథిలికి చప్పున ఆమె మేనమామ కూతురి  మాటలు గుర్తొచ్చాయి. అప్పటి ఆమె ముఖం గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. ఆ ముఖంలో అసహనాన్ని  అసంతృప్తిని తూకం వేయగలిగితే టన్నులకొద్దీ వుంటుందనిపించింది అపుడు. “అదేనమ్మా మనమందరం ఏవరేజ్ గా వుంటాం కదా” అంటే “నేను ఏవరేజ్ గా వుంటానా,అందంగా లేనా” అని పదేపదే ప్రశ్నించింది. 


“అవునమ్మా అందుకు అంత ఫీల్ అవ్వాల్సిన  అవసరమేముంది? అందంగా లేను సాధారణంగా వున్నాను అని అంగీకరిస్తే వచ్చిన నష్టం ఏముంది?” అంది తను.  మైథిలి అది గుర్తుచేసుకుంటూ ఇప్పుడు ప్రియకు కూడా అదే అసంతృప్తి. ఏమిటో ఈ అమ్మాయిలు! వాస్తవాన్ని ఎంత మాత్రం భరించలేకుండా అబద్దంలో అందంగా బ్రతుకుతామనుకుంటారు. అది వారి తప్పుకాదు. మరి తప్పెవరిది.. అందాలకు ఆకర్షణీయమైన రూపాలకు వున్న విలువ వ్యక్తిత్వాలకు  ఎందుకు కొరవడుతుంది? అలా దీర్ఘంగా ఆలోచిస్తూ వుండగా గేటు ముందు కారు ఆగి హారన్ కొట్టింది. మైథిలి లేచి మెయిన్ డోర్ వైపు నడిచింది.


కారు దిగిన ప్రియను అసాంతం పరికించి చూస్తూ “ఊ... మొత్తానికి రూపంలో బాగా మారిపోయావు. బాగానే వున్నావు గానీ సహజంగా మాత్రం లేవమ్మీ”  అంది మైథిలి.  

 

“నువ్వు నన్ను చూసి బాగా ఇంప్రెస్ అవుతావనుకున్నా అత్తా. ఇంత సింపుల్ గా తేల్చేస్తావు అనుకోలేదు” అంది కినుక వహిస్తూ పక్కనున్న ఆమెను నా ఫ్రెండ్ పద్మ అని పరిచయం చేసింది. ఫోన్లో చెప్పింది ముందే మైథిలికి తనతో మరొక గెస్ట్ వస్తున్నారు అని. పద్మను విష్ చేసి ప్రియ దగ్గరకు వచ్చి భుజంపై చెయ్యేసి “నువ్విపుడు తోటలో కుండీలో పూసిన గులాబీ పువ్వులా వున్నావు. అప్పుడేమో అడవి పూవు సౌందర్యమూ  సహజమైన సుగంధం. అప్పుడు మనస్సుకు శాంతిగా అనిపిస్తే ఇప్పుడు కంటికి ఆకర్షణీయంగా వున్నావు” అంది. 


ఈ అందం వెనుక రెండు రైనోప్లాస్టీ సర్జరీలు డెంచర్స్ సర్జరీ చిన్నగడ్డం కోసం జెనియోప్లాస్టీ  జరిగాయి.  ఖర్చుకు ఖర్చు హింసకి హింస. శరీరానికి  యెంత హింస అనుకున్నావ్. అంత భరించితేగానీ ఈ అందం సొంతం కాలేదు. నిజం చెప్పు. “ఇప్పుడు మా అమ్మకన్నా నేను అందంగా లేనా” అని ఎదురుగా వచ్చి నిలబడింది.  


“మీ అమ్మకన్నా అందంగా వున్నావా లేదా అనే ప్రశ్న ఎందుకసలు?కాస్మెటిక్ సర్జరీ అనుకూలంగా వుంది కాబట్టి లోపాలు వొంకలూ సరిదిద్దుకోగల్గావ్! అదే సరిజేసుకోలేని అవకరాలుంటే వాటిని సరిజేసుకోవడం సాధ్యమయ్యేదా? సౌందర్యంగా వుండకపోవడం లోపం కాదు. సౌందర్య రాహిత్యంతో యుద్దం చేసి నిన్ను నువ్వు విద్యలో ఉన్నతంగా నిలబెట్టుకున్నావు చూడు అదీ అసలు ఆత్మవిశ్వాసం”. 


 “అది సరేలే! నిజం చెప్పత్తా. అమ్మ కన్నా నేనే అందంగా వున్నానా లేదా” అని రెట్టించి సమాధానం కోసం ఒత్తిడి చేసింది. 


“ నిజమే మీ అమ్మ కన్నా అందంగానే వున్నావు.  ఇపుడెళ్ళి మీ అమ్మను చూస్తే ఆశ్చర్యపోతావు. అనారోగ్యంతో ఎంత యుద్దం చేసిందనుకున్నావు. సమయానికి డబ్బు పంపకపోతివి. ఆమె కంటికి కనబడకపోతివి. కళ్ళలో వొత్తులేసుకుని చూస్తుంది.ఊరికి పోయి నాలుగు రోజులుండి రా! కంటినిండా చూసుకుని సంతోషిస్తుంది.”


“డబ్బు పంపలేదని అమ్మ బాధపడిందా? ఏం చేయను, నాకే ఈ సర్జరీలకు బోలెడు ఖర్చైపోయింది. అడిగినప్పుడన్నా పంపలేకపోయాననే బాధ నాకు మాత్రం లేదా? అర్దం చేసుకోకుండా బడ బడ వాగేసి తిట్టేసి ఫోన్ కట్ చేసుకుంది. పిల్లలతో అంత పంతమైతే ఎలా? “


“మీ అమ్మది పంతం కాదు ప్రియా!  బాధ అని నీకర్దంకావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అదో పిచ్చిమొహంది. ఎంత మనం కనిపెంచిన పిల్లలైనా ఎవరి ప్రయారిటీస్ వారికి వుంటాయి అంటే అర్దం చేసుకోదూ. మనమలా వుండగల్గుతున్నామా! ఆ తరానికి ఈ తరానికి మధ్య యెంత నలిగిపోతున్నాం.ఎవరన్నా అర్ధం చేసుకుంటున్నారా అని ఏడుస్తుంది.ఆ ఏడుపు అసహాయత వల్ల కాదు.మానసిక క్షోభ. అయినా ఇవ్వన్నీ నీకు చెప్పడం మాత్రం యెందుకులే! నువ్వెళ్ళి స్నానం చేసి రా, ఇంత తినేసి పడుకుందురు గాని’’ అని టాపిక్ మార్చి వంట గదిలోకి వెళ్ళింది మైథిలి. 


కాసేపటి తర్వాత ఫ్రెష్ గా కళకళలాడుతూ వచ్చి మీకేమైనా హెల్ప్ చేయమంటారా అంటూ మైథిలి పక్కకు వచ్చి నిలబడింది పద్మ. మీరెళ్ళి కూర్చోండి, అంతా రెడీ చేసేసాను.నేతి గిన్నెతో వచ్చి కూర్చీ లాగి పద్మ కూర్చున్నాక ఆమె ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది. డైనింగ్ టేబుల్ మీద వున్న ఫోటో ఫ్రేమ్ పద్మను ఆకర్షించింది. అందులో మైథిలి పక్కన వున్న ఆమెను చూపించి “ఎవరూ ఈమె? మీ సిస్టరా..షి ఈజ్ స్టన్నింగ్ బ్యూటీ” అంది కంటి మెరుపుతో. 


“ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. ప్రియ వాళ్ళమ్మ. ప్రియ ఎపుడూ వాళ్ళమ్మను చూపలేదా“. 


“ప్రియ తో నాది కొద్దిపాటి పరిచయమే. ఒకే కమ్యూనిటిలో వుంటాం అంతే! ఇంతకూ ప్రియ అమ్మ ఏం చేస్తారు? జాబ్” అని ప్రశ్నార్దకంగా చూసింది. “ఆమె టెంత్ క్లాస్ తోనే చదువు ఆపేసింది. ఆమె అందమే ఆమెకు శాపమైంది. అనుమానపు భర్త నుండి విడిపోయింది. ప్రియను అంత ఎత్తుకు చేర్చడానికి ఎంతో శ్రమ పడింది. ఒకప్పుడు ఇంత అందంగా వుండేది కానీ ఇప్పుడు అనారోగ్యంతో చాలా పాడైపోయింది” అంది బాధగా. 


ప్రియ వచ్చి కూర్చుంటూ “నీ స్నేహితురాలికి తాను అందంగా వున్నానని గర్వం ఎక్కువ. అందరినీ ఇన్సల్ట్ చేస్తుంది. అందుకే నాకు మా అమ్మంటే కోపం” అంది ప్లేట్ లు పెడుతూ. 


“నీ మొహంలే.. మీ అమ్మది గర్వం కాదు అదో సౌందర్య లాలస. అందంగా తయారవమని నాలా వుండండని అన్యోపదేశంగా చెబుతుందంతే! నన్ను మాత్రం అనదనుకున్నావా. “నీకు చన్ను సంక అన్నీ తక్కువ. క్రాస్ కటింగ్ బ్లౌజ్ లు ఎందుకు అనేది. నాక్కూడా అప్పుడు నీకొచ్చినట్టే సర్రున కోపం వచ్చేది. తమాయించుకుని ఆ అవయవాల అవసరాన్ని నేను దిగ్విజయంగా పూర్తి చేసాను నా బిడ్డకు పద్దెనిమిది నెలలు పాలిచ్చి’’ అన్నాను. తర్వాత తెలిసింది మీ అమ్మ  జాకెట్ క్రింద రెండు వరుసల ఉడుపులు ధరిస్తుందని”  మైథిలి నవ్వింది ఆ మాట చెపుతూ.


“ఆమె అందరినీ అంతే అంటుంది.బాడీ షేమింగ్ చేస్తుంది.పదే పదే నా పోలిక రాలేదు నీకు అంటుంది. అసలు ఆ కంపేరింగ్ ఏమిటి? “ఆవేశం ప్రియ గొంతులో. 


“కూల్ కూల్.. ఈ టాపిక్ ఇంతటితో మానేద్దాం. మీ కమలా హారిస్ గురించి చెప్పు తెలుసుకోవాలని ఆసక్తిగా వుంది”.


ప్రియ పద్మ వైపు చూసింది మీరు చెప్పండి అన్నట్టు. 


“హారిస్ అంత ఎత్తుకు చేరడం పట్ల ఎంతో కృషి వుంది. ఆమె ఆ ఎత్తుకు ఈజీగా చేరుకోలేదు.పురుషుడితో సమానంగా రాజకీయాలు చేసిన ప్రతిసారి ఆమెను నైతికవిలువలు కోల్పోయిన స్త్రీగా పరిగణిస్తుంది అక్కడ సమాజం కూడా. అందుకు అక్కడ ఇక్కడ అనే బేధం లేదు. స్త్రీలు రచయితలైతేనే వారి రచనలకూ ఊహప్రపంచానికి కూడా  అనేక పరిమితులు విధించే ఈ సమాజం ఆమెను రాజకీయరంగంలో మాత్రం నిలబడనిస్తుందా?  తన ఉనికితో పోరాటం చేయనిస్తుందా? ఉమెన్ విల్ బి ఉమెన్ గానే వుండమని ఉద్భోధ చేస్తారు. కానీ ఆమె ఆ అడ్డంకులన్నీ అవలీలగా దాటేసారు” అంది ఒకింత గర్వంగా. “మీ రాజకీయ జీవితం గురించి చెప్పండి.నాకు తెలుసుకోవాలని వుంది” అంది మైథిలితో పద్మ. 


వారిరువురికి పెరుగు వడ్డిస్తూ  “నాకు జీవితం రాజకీయ జీవితం వేరు వేరు కాదు.ఒకే జీవితం. కొందరు మంచి మనిషి అంటారు. కొందరు నిలువెల్లా అహంకారం..అంటారు.మరికొందరు లేదు లేదు లంబకోణంలో కానే కాదు మూడొందల అరవై డిగ్రీలలోనూ ఆమెలో కనబడేది అదే అహంకారం అంటారు. నేను ప్రజలతో మమేకమై పనిచేస్తాను.వారి కష్టాలు నావిగా చేసుకుని వారి కోసం గళం విప్పుతాను పోరాడతాను. అయినా నన్నుగా నన్నుగా నిలబడనిస్తుందా ఈ సమాజం. ఎప్పుడూ వుండనివ్వదు. ఎన్నో రకాలుగా ప్రలోభపెడతారు.నేను వేటికి లొంగను. ఎమ్మెల్యేగా లేకపోతే ఈ ఇల్లూ వుండదు కారూ వుండదు. మాములు గుడిసెలో కూడా బతకడానికి నేను సిద్దపడే వుంటాను. నా అనుభవంతో చెబుతున్నా వినండి. గతి తప్పితే చూపులతో మాటలతో పొడిచి పొడిచి చంపుతుంది. నీతిగా నిలబడితే బతకడం చేతకాని దద్దమ్మ అని కూడా అంటుంది  ఈ సమాజమే. సమాజానికి వేయి నాలుకలు.”


వింటున్న  ఇద్దరూ నిట్టూర్పు విడిచి సింక్ దగ్గరకు వెళ్ళి ప్లేట్ లు క్లీన్ చేసి స్టాండ్ లో పెట్టేసి..” ఇంకా మీతో మాట్లాడాలని వుంది. మీకభ్యంతరం లేకపోతే కాసేపు కూర్చుందాం” అని రిక్వెస్ట్ చేసింది పద్మ. “తప్పకుండా రండి” అంటూ హాల్లోకి దారితీసింది మైథిలి.. 


“మీకు నా గురించి చెప్పాలి.ఈ సిటికీ ఎందుకు వచ్చానో కూడా చెప్పాలి. ఇరవై  రెండు ఏళ్ళ క్రితం బి. టెక్ చదివి అమెరికా వెళ్ళాను. నాలుగేళ్ళు ఉద్యోగం చేసాను పెళ్ళైన రెండేళ్ళ తర్వాత మానేసాను. అబ్బాయికి పదహారు అమ్మాయికి పది. పిల్లలను పెంచుకోవడం వారిని స్కూలుకు పంపడం తెచ్చుకోవడం వీటితోనే సరిపోయింది. ఇపుడు నలభై మూడేళ్ళు. కొత్తగా నాకొక సమస్య వచ్చిపడింది. అదీ నాభర్తతో. కన్యగా ఉన్నప్పుడు చిన్నగా వున్న చనుకట్టు పిల్లలు పుట్టాక మారిపోతుందిలే అనుకున్నా. ఇప్పటికి కూడా అలాగేవుంది. సంతృప్తినివ్వని నీతో సంసారం చేయడం కష్టం. పైగా హిస్టిరెక్టమీ చేసినప్పటి నిలువైన కోతను చూస్తే జెర్రిపామును చూసిన ఫీలింగ్ తో మూడ్ అంతా పోతుంది. నేను ఇంకోదాన్ని చూసుకుని నీకు విడాకులిచ్చేస్తాను అని బెదిరిస్తున్నాడు నా భర్త. ఇద్దరు పిల్లల తల్లిని. అతను కాదంటే నేనెలా బతకాలి పిల్లలను ఎలా పెంచుకోవాలి.. అందుకే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కి సిద్దమై ఇలా వచ్చాను” అంది ముఖం దాచుకుని  కన్నీరు తుడుచుకుంటూ. అదీ ఇక్కడ తక్కువ ఖర్చు  అవుతుందని అని  బలవంతపు నవ్వును పులుముకుని ఇటు తిరిగింది.  


వింటున్న మైథిలి ఆశ్చర్యపోయింది. ఆవేశం తన్నుకొచ్చింది.

“రాత్రవగానే మల్లెపూలు పెట్టుకుని తెల్లచీర కట్టుకుని మొగుడుని ఆకర్షించకపోతే పక్కదారులు పడతాడని నానాతంటాలు పడే ఆడదానికి మీకూ తేడాయే లేదు” అంది. 


“తప్పేముంది మైథిలి గారూ దాంపత్యం ఆకర్షణీయం చేసుకుంటే వారి మధ్యకు మూడో మనిషి రాకుండా వుంటారుగా. కుటుంబం పదిలంగా వుంటుంది” అంది పద్మ.

 

“మూడోమనిషి బయటకాదమ్మా వుండేది ఆలుమగల లోపలే! అనేకరకమైన అయిష్టాలతో  అసంతృప్త బీజం వేసుకుని లోలోపల అణిచిపెట్టుకుని వుంటాడు లేదా వుంటుంది. అవకాశం దొరకగానే బయటపెడతాడు లేదా బయటపెడుతుంది. రూపం కాదు అక్కడ వుండేది అరూపంగా వుండే అనేక డిజైర్స్ వారిని ప్రేరింపజేస్తాయి తప్ప కారణం అందం తగ్గిపోవడం శరీరంలో ఫిట్ నెస్ తగ్గడం కాదు.”  


“సరిగా చెప్పావత్తా.  మగవాడి వయస్సు ముప్పైల దగ్గరే ఆగిపోయినట్లు ఫీల్ అయ్యి స్త్రీలు రుబ్బుపొత్రం లాంటి శరీరం తమకు పనికిరావడంలేదని గొప్పగా ఫీల్ అవుతాడు. మీ ఆయన మాత్రం ముందుకు పొడుచుకు వచ్చిన పొట్టను ఇన్ షర్ట్ క్రింద దాచేసి బెల్ట్ తో బిగదీసి కట్టి జారిపోయిన దవడలను కనబడకుండా గడ్డం పెంచి లోతుకుపోయిన కళ్ళను కళ్ళజోడు క్రింద దాచేసి ట్రిమ్ గా తయారవుతాడు. దానిని మీరెందుకు క్వొచ్చన్ చేయకూడదూ?” అంది మొహమాటం లేకుండా. ప్రియ అలా అనగల్గుతుందని అనుకోని పద్మ తెల్లబోయింది. 


మైథిలి నవ్వడం సభ్యత కాదని  బలవంతంగా నవ్వును ఆపుకుంది. “సాధారణంగా ఉండడంలో వున్న సౌఖ్యాన్ని కాదనుకుని అసాధారణంగా ఉండాలనుకుంటున్నావు పద్మా. అదీ అతని కోరిక పై. నీవు నీవులా గాకుండా మరోలా ఉండాలని అతను ఎపుడూ  డిమాండ్ చేస్తూనే వుంటాడనిపిస్తుంది. అవునా?” అనడిగింది మైథిలి.  


అవునని తలవూపి “మరి ఇదే కారణం పై ఐ మీన్ అదే  బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకోవడానికే ప్రియ కూడా వచ్చింది కదా, ఆమె బోయ్ ప్రెండ్ మీ కొడుకేనంట కదా” అనేసింది పద్మ. 


ఆశ్చర్యంగా చూసింది మైథిలి.” ప్రియా! నిజమా ఇది. ఇది నీ కోరిక  లేక శశాంక్ కోరికా, నిజం చెప్పు” తెలియకుండానే ఒకింత ఆవేశానికి లోనై తీవ్రత పలికింది గొంతులో.


“వాస్తవం ఇదే అత్తా. శశాంక్ కోరికపైనే ఇదంతా జరుగుతుంది. మగవాడిగా తాను నిర్ణయించిన గైడ్లైన్స్ లో లేకపోతే నువ్వు పెళ్ళిచేసుకోవటానికి సంసారం చేయడానికి పనికిరావని ఎంత ఈజీగానో అనేస్తాడు.అంతెందుకు ప్రేమిస్తున్నాను అంటూనే ముక్కు బాగోలేదు నవ్వు బాగోలేదు అని ఎన్ని వొంకలు పెడతాడో తెలుసా! “అంది ఆరోపణగా. 


“వాడంటే అన్నాడు. అందుకు నీ జవాబెలా వుండాలి!? అందంగా లేకపోవడమనేది అవకరం కాదు. అలా ఫీల్ అవుతూ ఆత్మనూన్యత భావం తో నువ్వు కుంచించుపోవటం యెందుకు ? నీలో వుంది చూడు ఆ అసంతృప్తి అనేది ఒక మానసిక అవకరం అని నువ్వు ఎందుకు అనడం లేదు. మీ చదువులు మీ ప్రపంచ పర్యటనలు ఇది నేర్పలేదంటే నేను అంగీకరించను. సౌందర్య రాహిత్యంతో మీరు బ్రతకలేరు.  అమ్మాయిలు కూడా  నెపం ఇంకొకరిపై నెట్టి మిమ్మలను మీరు వంచించుకుంటారు. లిఫ్టిక్ పూసుకోకపోతేనో నెయిల్ పాలిష్ వేసుకోకపోతేనో జుట్టు విరబోసుకోకపోతేనో నడుము సన్నగా వుండకపోతేనో  మగవాడిని ఆకర్షించలేకపోతాం అనే ఆత్మనూన్యత భావం చాలామందిలో పేరుకుపోయింది. అవన్నీ మనిషి అందానికి మెరుగులే కానీ వ్యక్తిత్వ ప్రధానం కాదు. మగవాడు తను యిష్టపడిన కొలతల్లో మీ శరీరం కుదించుకుపోవాలనుకొని ప్రయత్నించడమే మీ బలహీనత. అది మీకెందుకో అర్దం కావడం లేదు”అంది కఠినంగా.


ప్రియ బిత్తరపోయింది.మైథిలి ఆపలేదు.


వయసులో వున్న కోతి ఎలా వున్నా అందంగానే వుంటుందంటారు. నీకు ఆ విశ్వాసం కూడా లేకపోయే. నీకున్న చదువు విద్వత్తు లాంటివి  ఏమీ లేకపోయినా నీకన్నా మీ అమ్మే నయం. తన అందంతో వల వేసి  మగాళ్ళను కుక్కను తిప్పినట్లు తిప్పుకుని తనకు కావాల్సిన పనులు తెలివిగా చేయించుకుంటుంది” అంది కోపంతో వణికిపోతూ. 


పద్మ మైథిలి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఆమె వాగ్ధాటికి. ఆమె మాటల్లో పరిపక్వత నిండిన  ఫెమినిజాన్ని చూస్తుంది. ఆమె భావాలు స్థిరంగా వాడిగా వున్నాయి. ములుకుల్లా గుచ్చుకుంటున్నాయి. అయినా ఎందుకో బాధ కల్గడంలేదు. నిర్మొహమాటంగా మాట్లాడే అంకితభావంతో  పనిచేసే ఆమెను ప్రజలెందుకు ఆరాధిస్తారో అర్దమైంది. 


ప్రియా! నా కొడుకో మరొక మగవాడో ఎవరో  మిమ్మలను తిరస్కరిస్తారనే భయంతో మిమ్మలను మీరే అలా  శిల్పంలా చెక్కుకుంటారు. చెక్కుకునే క్రమంలో గాయం చేసుకుంటారు. గాయపడి రక్తకన్నీరు కార్చుతుంటారు. కాదంటావా!? 


అవునన్నట్టు తలవూపింది ప్రియ.


మగవాడిని ఆకర్షించడానికే మన శక్తియుక్తులన్నీ ధారపోయడం అసహ్యంగా వుండదూ!? మన మనస్సుపై మనకు హక్కు లేదు. మన జట్టుపై మనకు హక్కు లేదు. కనీసం చదువుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడిన అమ్మాయిలైనా మగవాడి భావజాలపు ఇనుపపాదాల క్రింద మట్టగిడిసి పోకుండా తలెత్తుకుని తిరగొద్దూ! ఎందుకో కన్నీరు ముంచుకొచ్చింది మైధిలికి. పెద్దగా ఏడ్చేసింది కూడా. 


“నిన్ను ఎంతగానో  ప్రేమిస్తున్నా అనే నీ కొడుకు మాటకు సరెండర్ అయిపోతున్నా అత్తా! ఏం చేయను మరి” అంది ప్రియ  నిస్సహాయతంతా  గొంతులో ప్రతిధ్వనిస్తూ.


కళ్ళు తుడుచుకుని గట్టిగా నవ్వింది మైధిలి. “ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకో అనేవాడు.. కొన్నాళ్ళకు నీకు నాకు మధ్య ఎపుడూ స్త్రీ పురుష సంబంధమేనా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం ట్రాన్స్ జెండర్ గా మారిపో అంటే అపుడు కూడా పిల్లాజెల్లా వద్దనుకుని అలా మారిపోతావా?” అంది. 


ఆమె మాటలు పూర్తవకుండానే.. “ఛీ ఛీ.. మరీ అలాగా! నెవ్వర్” ..అని అరిచేసింది ప్రియ.


“ఏం అలా అనకూడదని గ్యారంటీ ఏమైనా వుందా ఆలోచించుకో  ప్రియా.. తొందరేమిలేదు ఇక్కడ ఒక నెల వుంటానని అంటున్నావు కదా”.


తలూపింది ప్రియ.


మీరు కూడా ఆలోచించుకోండి పద్మా. ఇరవై రెండేళ్ళ క్రితం అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయగల్గిన మీరు ఇప్పుడు మీ కాళ్ళమీద మీరు నిలబడలేరా? నీ భర్త విడాకులిస్తానంటే  ఆత్మాభిమానంతో అందుకు అంగీకరించి ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేరా? స్త్రీని పురుష ప్రపంచం  వస్తువును చేసింది. తమకు కావాల్సినట్లు తీర్చిదిద్దుకునే హక్కును గుత్తాధిపత్యం చేసుకుంది. మనం అందంగా వుండాలంటారు. అందుకోసం సౌందర్య సాధనాలు తయారుచేసి వాటిని  అంటకట్టి మార్కెట్  చేసుకుంటారు. అందం మాత్రమే స్త్రీకి కొలమానం చేస్తారు. దానిని మనమే నమ్మేటట్టు మంత్రజాలంలో ముంచెత్తుతారు. దానిని  మనమందరం కలసి మూకుమ్మడిగా ఎదుర్కోకపోతే మనం ప్రాణమున్న మనుషులం కాదు. ఒఠ్ఠి మట్టిముద్దలం ఒఠ్ఠి మట్టిముద్దలం.. అంది ఆవేదనతో.  


పద్మ మైథిలి మాటలు వింటూ ఆలోచిస్తుంది.


“ఎవరో ఒకరు తమను ప్రేమిస్తేనో  తాము ఇంకొకరిని ప్రేమిస్తేనో తమకు అస్తిత్వం వుందనుకోవడం దురదృష్టకరం. ఎవరిని వారే ప్రేమించుకోవాలి. తప్పదు,అప్పుడే మనం జీవించినట్లు. లేకపోతే పరాధీనలమైనట్లు. మన గురించి మనం ఆలోచించడం మొదలిడితే జీవితం ఆ క్షణం నుండే ప్రారంభం అవుతుంది. మన జీవితాన్ని మనం జీవించే కళే అసలైన సౌందర్యం.అదే ఈస్తటిక్ సెన్స్. సౌందర్యాభిలాష కల్గి వుండటం తప్పు లేదా నేరమేమి కాదు. ఎవరో నిన్ను గుర్తించాలనే ఆకాంక్ష తాపత్రయం కన్నా కూడా నిన్ను నీవు ఉన్నతీకరించుకునే విధమైన సౌందర్యాభిలాష కల్గివుండటం సంతృప్తినిస్తుంది. ఎవరి మనసు ఏది చెబితే అదే చేయండి. నా మాటలు నచ్చితే తీసుకోండి. లేకపోతే వదిలేయండి. నేను ఉదయాన్నే ఊరికి వెళ్ళాలి. గిరిజన గ్రామాల్లో  ప్రజలకు సమస్యలున్నాయి. రెండు మూడు రోజులు రాకపోవచ్చు. మీ కోసం కారు వుంటుంది. డ్రైవర్ వంటమనిషి  ఎప్పుడూ సిద్దంగా వుంటారు”  అని చెప్పి మైథిలి లేచి నిలబడింది. వారిద్దరూ ఇంకా అలాగే కూర్చుని ఆలోచిస్తున్నారు.


పద్మ మనసులో అనుకుంది. ‘పురుషులతో జతపడిన స్త్రీల జీవితాల్లో అలజడి దుఃఖం బహుముఖాలు. ఉల్లిపాయలోని పొర పొరకి కంటనీరు తెప్పించే గుణం వున్నట్టు పురుషుడి ప్రతి చర్య  స్త్రీ దుఃఖానికి కారణమవుతుంది. ఈ కన్నీటికి విరుగుడు ఎక్కడా??’


ప్రియ షాకింగ్ లో వుంది. అత్త చెప్పిన మాటల్లో వాస్తవం వుంది. సౌందర్యకాంక్ష వెనుక ఎడతెగని హింస వుంది.వ్యాపారం వుంది.వయస్సు పెరుగుతుంటే తరిగే అందాన్ని ఎన్ని బొటాక్స్ కాస్మెటిక్ యూనిట్స్ తో యధాస్థితికి తేగలం!? స్త్రీలు అందంగా మాత్రమే వుండటం పురుషులు కోరుకున్న కొలతలతో వుండటమే కొలమానమా!? అందం ప్రసక్తి లేని స్త్రీలు కూడా కఠోరపోరాటాలు చేసి జీవితాన్ని గెలిచి తమ వారి జీవితాలకు బాట వేసి తమ అస్తిత్వ నిరూపణతో గర్వకారణంగా నిలిచినవారున్నారు. తను చదివిన ఆఫ్రికన్ అమెరికన్ సోజర్న్ ట్రూత్ జీవిత చరిత్ర తో పోల్చుకుంటే ఈ ఆధునిక స్త్రీ లది మిస్ ఇండియా మిస్ యూనివర్స్ లది తనది ఏ పాటి అస్తిత్వ నిరూపణ!? ఇంతింత చదువులు తనకు నేర్పిందేమిటి? ఆలోచిస్తుంటే సిగ్గుగా వుంది అనుకుంది. 


ప్రియ ఆలోచనలకు అంతరాయం కల్గిస్తూ…”రేపు మీరిద్దరూ హాస్ఫిటల్ కు  వెళ్ళాలనుకుంటే వెళ్ళండి.  ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. నేను వేరే కారులో వెళతాను. ఇక మీరెళ్ళి పడుకోండి.  ఇవన్నీ విన్న నాకు ఈ రాత్రి నిద్రపట్టదు అంటూ ఇంటి ముందున్న తోటలోకి దారితీసింది మైథిలి. నల్లని ఆకాశంలో మినుకు మినుకుమంటూ నక్షత్రాలు వెలుగుతూ వున్నాయి ఆమె ఆలోచనలు లాగానే.


****************౦****************

#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.
కామెంట్‌లు లేవు: