10, మార్చి 2023, శుక్రవారం

తలపుల నావ


చాలా  కాలం తర్వాత చెప్పాపెట్టకుండా తన స్నేహితురాలిని కలవడానికి వచ్చింది అచల.


"ఏమిటో  యింత దయ మా పైన" అంటూ  సంతోషంగా యెదురేగి హత్తుకుంది గగన.


 "ఎలాగూ  తమరు రారు.అందుకే నేనైనా వచ్చిపోదామని" అంది అచల నిష్టూరంగా.


"నీకేమైనా పనా పాటా, మరి నా సంగతి నీకు  తెలుసు కదే!" అన్న తన మాటలకు కళ్ళ నీళ్ళ పర్యంతమైన అచల ను  చూసి  తనే నొచ్చుకుంది గగన. వచ్చి రాగానే ఆమెను బాధ పెట్టినందుకు తనని తాను తిట్టుకుని “సారీ అచలా”  అంది.


" పర్లేదు లే,  వున్న మాటేగా అన్నావు" అంది.


"ఫ్రెష్ అయి రా, కాఫీ యిస్తాను” అని వంటింట్లోకి వెళ్లింది.


ఫ్రెష్ అయి వచ్చి హాల్లో  కూర్చున్న అచల కు కాఫీ కప్పు అందించి “చెప్పేవే, యెలా వున్నావ్? వరుణ్ యెలా వున్నాడు, అమ్మ- నాన్న యింట్లో అందరూ  బాగున్నారా” అడిగింది గగన.


"అందరూ బాగున్నారు. నేనే వరుణ్ ని మిస్ అవుతున్నాను. అందరూ   అంతులేని గారాబం చేయడం వల్ల వాడికి హాని జరుగుతుందనేది అన్నయ్య వాదన. వాడేమో  హాస్టల్ లో వుండనని  గొడవ. అదీ గాకుండా వాడి తండ్రి వైపు చుట్టపక్కాలు వాడికి కనబడటం అన్నయ్యకి యిష్టం లేదు. పసి మనసుపై రక రకాల మాటల ప్రభావాలు నాటుకుని పోతాయి. వాళ్ళ నీడ పడకూడదనేగా యింత ప్రాకులాడుతున్నాం అంటాడు. వదినేమో  యెన్నాళ్ళు అలా గది వొదిలి బయటకి రాకుండా వుంటావ్? చదివిన చదువుకి ప్రయోజనం చేకూర్చూ,వుద్యోగం  చేయకూడదా, నీకు మార్పు వుంటుంది అంటుంది.అమ్మ దానికి వుద్యోగాలు చేయాల్సిన ఖర్మ యేమిటీ? కోట్లు ఆస్తులున్నాయి అంటుంది. నా మనసుకి, నా వ్యక్తి గత అభిప్రాయానికి విలువే లేదు. నాది కాని జీవితం బ్రతుకుతూ వున్నాను’’ అంది నిసృహగా. 


"నేనొక మాట చెపుతాను కోపం రాదు కదా"


 "నువ్  చెపుతావనే వచ్చాను. వొంటరితనంతో రాయిలాగా బ్రతకడం కన్నా శాపం యింకోటి వుంటుందా చెప్పు''


 "సరే తర్వాత తీరికగా మాట్లాడుకుందాం. నీ కోసం కాకరకాయ కూర చేయనా '' 


"నీ కెంత జ్ఞాపకమే, నాకు ఆ కాకరకాయ యిష్టమని నువ్వు మర్చిపోలేదన్నమాట."  


"మరి యేమనుకున్నావ్,  చిట్టి ఈతకాయలు కోసం మిట్టమధ్యానపు యె౦డలో తుప్పలు గుట్టలు గాలించడంతో సహా యేవీ మరువలేదు. అన్నట్టు మన సరళ యిక్కడే వుంది తెలుసా!”


"అవునా, వాళ్ళింటికి యిప్పుడే   వెళదాం’’


"ఆగు తల్లీ, లేడికి లేచిందే ప్రయాణమా, అది యింకా గూటికి  చేరి వుండదు. భర్త నడిపే షాప్లో కాష్ కౌంటర్ లో కూర్చుంటుంది.  యింటికి రాగానే యీ రాత్రికి యిక్కడే వుండేటట్లు రమ్మని పిలుస్తాను’’ అంటూ మొబైల్ చేతిలోకి తీసుకుని రింగ్ చేసింది.


"నీకో విశేషకరమైన వార్త చెప్పాలే అంటూ "మాట్లాడు" అని ఆచలకి  మొబైల్  యిచ్చింది. అచల గొంతు వినగానే సంబరపడి పోయింది. "మా పిల్ల గుంపుని పడుకోబెట్టి త్వరగా వచ్చేస్తానే, మీరు తినకండి అందరం కలసి తిందాం" అంది. 


అలాగే.. అంటూ లైన్ కట్ చేస్తూ “దీనికెప్పుడూ తిండి పిచ్చే, అందుకే పిప్పళ్ళ బస్తాలా తయారైంది” అని నవ్వింది. వెంటనే యింకో  నంబర్కి కాల్ చేస్తుండగా "ఇంకెవరైనా మన వాళ్ళు యిక్కడున్నారా’’ అనడిగింది అచల.


"లేదు,సరళ భర్త పర్మిషన్ తీసుకోవద్దు.లేకపోతే  అది రావడం వీలవదు"


 "నమస్తే అండీ! మా స్నేహితురాలు  అచల వచ్చింది. మేమంతా   కలసి యీ రోజు మా యింట్లో మూన్ లైట్  డిన్నర్ ప్లస్ కబుర్లు పెట్టుకోవాలనుకుంటున్నాం.  రేపు ఆదివారమే కాబట్టి మీకు యిబ్బంది యేమి వుండదుగా" అని అడిగింది. 


"అయ్యో, మీరు అడగడం, నేను కాదనడమూ నా? విత్ ప్లెజర్ తప్పకుండా స్వయంగా తీసుకొచ్చి దిగబెడతాను" అని అన్నాడతను.  

 

అమ్మయ్య వొక పని అయింది. "ఇతను వొక పట్టాన అర్ధమై చావడు.ఎప్పుడు వద్దు అంటాడో, యెప్పుడు   వెళ్ళ మంటాడో అని మొత్తుకుంటూ వుంటుంది  సరళ ” అని వివరించింది.


"అందరికి యేవో వొక సమస్యలే మనలో యెవరు బాగుండలేదు కదా"  అంది అచల. 


  "అచలా, నీ ఆలోచన మార్చుకో, మనం అనుకుంటే  ప్రతిదీ  సమస్యగా కనబడుతుంది.తేలికగా తీసుకుంటే రోజువారీ పనిలా వుంటుంది అంతే”


"నువ్వు అలాగే అంటావ్, నీకన్నీ  తేలికగానే వుంటాయి"


అచల మనసు నలుగుతుందని అర్ధమైంది గగనకి. "సరే.. వర్క్ షాప్లోకి వెళ్లి చూసొద్దాం రా" అంటూ బయటకి దారి తీసింది. 


"వీళ్ళు చూడు యెంత ఏకాగ్రతతో పని చేస్తున్నారో  వీళ్ళకి పని సమస్య కాదు. కుటుంబ పోషణ సమస్య. అందుకే యిన్ని వందల మైళ్ళు దాటి కుటుంబాలని వదిలేసి వచ్చి యెక్కువ డబ్బు సంపాదించడం  కోసం శ్రమ పడుతున్నారు. నీకు అలా కష్టపడే అవసరం లేదు.  ఇంట్లో వాళ్ళు పని చేయనివ్వకపోవడమే నీ సమస్య. అంతేనా? 


“అవును, అదే ప్రస్తుత నా సమస్య”. 


“నాకైతే వీరిలా పని రాకపోవడం సమస్య. అలా అని అది మాత్రమే సమస్య అనుకుని యెప్పుడు అదే ఆలోచిస్తూ కూర్చుంటానా ? లేకపోతే రాత్రికి రాత్రే అలా వర్క్ ఎక్స్ పర్ట్ కావాలని ఆలోచించి అదీ  సమస్య అనుకుని భయపడతానా  ఆలోచించి చూడు" అంది గగన. 


తల వూపుతూ ఆలోచనలో పడింది అచల. 


వర్కర్స్ కి   పని అప్పగించి “ కాసేపు యిక్కడే వుండు, వాళ్ళతో మాట్లాడుతూండు” అని లోపలికి వచ్చి వంట పనికి పూనుకుంది గగన.. 


గంటసేపటిలో నాలుగు రకాలు చేసి వచ్చేటప్పటికి.. వర్కర్స్ ఆ రోజు పని ముగించుకుని  వారం రోజుల జీతం కొరకు వరుస కట్టారు. వారికి లెక్కలు చూసి వారిని పంపేటప్పటికి  అవలీలగా అరగంట గడిచింది. 


 అచల అదంతా చూసి “అమ్మో, వీళ్ళు యిన్నేసి డబ్బులు సంపాదిస్తారా” అడిగింది ఆశ్చర్యంగా.


"అవును, వీళ్ళని  పోషించేది ఖచ్చితంగా  ధనవంతులే! ఎలా వుంది వీళ్ళ పని తనం”


"వండర్ఫుల్.నీకు బాగా కాలక్షేపం"


"కాదు, ఆర్థిక అవసరం’’ అంది గగన. "నువ్వు కూడా యిలా యింతకన్నా పెద్దగా పరిశ్రమగా  చేపట్టి ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేయగలవు తెలుసా? పైగా వొక కళని ప్రోత్సహించి పని కల్పించి చాలా మంది జీవితాలకు వెలుగునివ్వవచ్చు " అంది అచల ముఖంలోకి  చూస్తూ, నమ్మకం కల్గిస్తూ.


"ఇంట్లో వొప్పుకోవద్దూ నామోషీతనం అంటారు".


"వారి సంగతేమో కానీ నీకేమనిపిస్తుంది"


"చేయగలను, చేయాలి అనిపిస్తుంది.చేస్తాను కూడా! బొటిక్ పెడతాను. నీ హెల్ప్ కావాలి మరి"


“అమ్మయ్య నీకొక సమస్య తీరిపోయింది” అంది గగన. 


“నీకు ధైర్యం యెక్కువ.ఎవరి సహాయం లేకపోయినా ఆర్ధికంగా బలవంతురాలివి కాకపోయినా ఆత్మాభిమానంతో ఆర్దిక స్వావలంబనతో నీ జీవితానికో చక్కని బాటను వేసుకుని పిల్లలను తీర్చిదిద్దుకుంటున్నావ్. వొంటరి మహిళ విజయగాథ నీది. నాకు గర్వంగా వుంటుంది నిన్ను చూస్తే” అంది.


అంతలో సరళ పతీ సమేతంగా వచ్చింది. అచల ని చూసి వాటేసుకోవడాలు,కన్నీళ్లు పెట్టుకోవడాలని సరళ భర్త నవ్వుతూ చూస్తున్నాడు.


“ఇక ఆపండే, దిష్టి తగులుతుంది” నవ్వుతూ సరదాగా హెచ్చరించింది గగన.


“ఏమే,యింత  త్వరగా వచ్చేసావ్. చేసినవన్నీ మేము ముందే తినేస్తాం అనుకున్నావా యేమిటి” అచల కొంటె ప్రశ్న.

 

“నేనే షాప్ నుండి  తిన్నగా యిటువైపే తీసుకొచ్చేసానండి.ఫ్రెండ్స్ ముగ్గురూ యెక్కువసేపు కబుర్లాడుకుంటారని” అన్నాడు శ్రీనివాస్. 


“మీరు యింటికి వెళ్లి పిల్లలకి యింత పెట్టి మీరు తిని పెందలాడే పడుకోండి. ఫోన్ లో ఫ్రెండ్స్  తో కబుర్లు గట్రా అవీ పెట్టుకోకుండా” అని హెచ్చరించింది సరళ.


అలాగే అంటూ  అతను సెలవు తీసుకోగానే “ఏమిటే ఆ అప్పగింతలు, యింకా మారలేదా మీ ఆయన” అడిగింది గగన. 


“అయ్యో..అంత అదృష్టం కూడానా, మీలా యేడ్వలేక తుమ్మితే వూడిపోతుందని తుమ్మకుండా ఆపుకుంటున్నాను” అంది.


“సరే, మీరు మాట్లాడుకుంటూ కూర్చోండి. నేను అన్నీ డాబా పైకి  చేరవేసి వస్తా” అంటూ వాళ్ళని వదిలేసింది గగన.


మిత్రురాళ్ళు ముగ్గురూ జ్ఞాపకాలు, కబుర్లు, బాధలు,సమస్యలు,పరిష్కారాలు అన్నీ కలబోసుకుంటూ యిష్టమైన పదార్ధాలను తినకుండానే వదిలేసి నిట్టూర్చుకున్నారు.


సరళ అలా ప్రక్క పై వాలుతూ “మా ఆయన యే౦ చేస్తున్నాడో దిక్కుమాలిన స్నేహాలుతో దొరికిందే చాన్సే అనుకుని కబుర్లాడుకుంటూ వుంటాడు” అంది. 


“ఏమిటే, నీ బాధ  నాకు అర్ధం కాలేదు వివరంగా చెప్పు”  అనడిగింది అచల.  


సరళ మాట్లాడలేదు. 


గగన చెప్పుకొచ్చింది. “శ్రీనివాస్ పైకి అందరికీ సంస్కారి గానే కనబడతాడు.లోపలంతా వేరే. హాస్యం పేరిట రెండర్దాల మాటలు, స్త్రీల తో యెడతెగని ఫోన్ సంభాషణలు,  యెదిగిన యిద్దరు పిల్లల్ని పెట్టుకుని యింకా కుర్రవాడిలా లవ్ ఎపైర్స్  నడపడం,  సరళ ముందే నిత్యం రాత్రుళ్ళు ఫోన్ లోనే ప్రేమకలాపాలు నెరుపుతాడు.  ఏ దురలవాట్లు లేవు కాబట్టి అందరికి అతను సద్గుణ సంపన్నుడు,బాగా సంపాదిస్తాడు, మేడలు కట్టాడు,బోలెడు స్థలాలు కొన్నాడు, కార్లలో తిప్పుతాడు. పైగా బయటకు వెళ్ళిన  అరగంటకొకసారి యింటికి ఫోన్  చేసి అరేయ్..ఒరేయ్ అంటూ ప్రేమగా భార్యని పలకరిస్తూ యే౦కావాలో కనుక్కుంటూ వుంటాడు. యెంత మంచి భర్తో అనేటట్లు వుంటాడు. అవే తెలుసు చూసేవారికి. కానీ అతనిలో  దాగిన మరొక వికృత కోణం భార్య పై అనుమానం. తనలా  తన భార్య కూడా యెవరితోనయినా  చాట్ చేస్తుందన్న భయం. అడుగడుగుకి అనుమానం. దానిని కనబడనీయకుండా శ్రద్ద తీసుకోవడం అనే ముసుగు వేసేస్తాడు. నిత్యం నరకమే సరళకి. అలా అని యెవరితోనైనా సరససల్లాపాలు  సాగిస్తాడా అంటే అదీ లేదు. గడప దాటడు. అతిగా వుండే వాగుడు కి పుల్ స్టాప్ పెట్టాలని  రోజూ  యింట్లో పని తొందరగా ముగించుకుని షాప్ కి వెళుతుంది సరళ “ అని చెప్పింది  గగన. 

 

“  ఇంతకీ అతనేమైనా  మారాడంటావా?” అచల ఆసక్తి.


“ఏం చచ్చాడో, రోజూ సందు దొరికితే చాలు. యెవరితో వొకరితో మాట్లాడుతూనే వుంటాడు. నేను దగ్గరలోకి వెళ్ళ గానే మాట మార్చేసి మగవాడితో మాట్లాడుతున్నట్లు నటిస్తాడు.  ఒకామె ముగ్గురు పిల్లలను పెట్టుకుని బాధ్యత లేకుండా  పిల్లలు వింటున్నారనే యింగిత జ్ఞానం లేకుండా, మా ఆయన బంగారం అంటూనే నా మొగుడితో రాత్రుళ్ళు రహస్యంగా గంటల తరబడి  మాట్లాడుతూ..మీరు  యింద్రుడు చంద్రుడు అంటూ మునగ చెట్టు యెక్కిన్చేస్తుంది. ఛీ ఛీ వీళ్ళ మాటలు వినకూదడనుకుంటూనే వింటూ ఉంటాను. వీళ్ళ కన్నా వేశ్యలు నయం.  వేశ్యల జీవితాల్లో నిజాయితీ వుంటుంది. వీళ్ళు మానసిక వ్యభిచారులు” అని తిట్టిపోసింది.


“మొబైల్ ఫోన్ లు సంసారంలో చిచ్చు పెడుతున్నాయి అని వొప్పుకోక తప్పదు”  అని అచల జాలిపడింది.


“నిజమే,  రోజూ యెంత  బాధ అనుభవిస్తున్నానో, కళ్ళెదురుగా  బాగోతాలు చూస్తూ యెవరు మిన్నకుండా వుండగల్గుతారు. ఏమన్నా అంటే నాకు స్నేహితులు వుండకూడదా అని ఆర్గ్యూ  చేస్తాడు.ఈ బాపతు వాటిని స్నేహాలు అనాలా? ఈ రహస్య స్నేహితురాళ్ళు - రహస్య స్నేహితులు యింటింటికి వుంటున్నారు. ఏది స్నేహమో యేది మోహమో తెలుసుకోవడం కాపురాలు కాపాడుకోవడం కష్టమైపోయింది. పిల్లలని చూసి దిగమింగుకుంటున్నాను. పైగా యితనికి చుట్టపక్కాలలో మంచి పేరు. ఏమైనా అంటే నన్నే తప్పు పడతారని భరిస్తున్నాను”   బాధగా చెప్పింది సరళ.


 స్నేహితురాళ్ళు మౌనంగా వింటూ వున్నారు.


సరళ కొనసాగిస్తూ ..ఎప్పుడన్నా గట్టిగా యిలా చేస్తే నేను వోర్చుకోలేను అంటే  యే౦ చేస్తావ్? నీ స్నేహితురాలుని  స్ఫూర్తిగా తీసుకుని  మొగుడిని వదిలేద్దమనుకుంటున్నావా అని  వ్యంగంగా నడుం విరిచేసే మాటలు అంటాడు. 


అందరి మధ్య మౌనం. వివాహ వ్యవస్థ వున్న లోపాలు, స్త్రీల అసహయత,  యింటి కట్టుబాట్లు, సమాజ పరంగా  యెదుర్కునే సమస్యలు మాట్లాడుకుంటూ యెప్పటికో నిద్ర పోయారు. 


వాళ్ళ మాటలు విన్న చంద్రుడు కూడా విచారపడ్డాడా అన్నట్టు మబ్బుల మాటుకి వెళ్లి దాక్కున్నాడు. 


గగన  కళ్ళు మూసుకుందే కానీ నిద్ర రావడం లేదు. యెడ తెగని ఆలోచనలు. పురుషుడితో ముడిపడిన స్త్రీ జీవనయానం సముద్రంలో నావ ప్రయాణం లాంటిది. యెన్ని ఆటు పోటులు యెదురైనా, భయంకరమైన తుఫాన్లు అల్లకల్లోలం సృష్టించినా నావ నడిపేవాడు యోగ్యుడైతే విచక్షణ కల్గినవాడైతే యేదో వొక తీరానికి నావ సురక్షితంగా చేరుతుంది. నావని ముంచేసి సేఫ్ బోటు ని కూడా చేజిక్కనీయకుండా తను మాత్రం వేరొక నావలోకి దూకేసేవాడితో ముడిపడిన జీవితం అచల జీవితంలాగానే  వుంటుంది. ఏదో వొక పరిష్కార మార్గం దొరికి అచల అనే నావ యే తీరానికి చేరుతుందో, మా అందరి జీవితాలు అల్లకల్లోల౦గానే వున్నాయి అనుకుంది.

 

అలా లోకం అంతా అలసి నిద్రపోతున్నవేళ, ఒకో చోట మేలుకున్న వేళ 

మేలుకుని నిద్రపోతున్నవేళ, నిద్రిస్తూ కూడా మెలుకువగా మెలిగే వేళ.. 

 అచల తలగడ ప్రక్కనే వున్న మొబైల్ రింగ్ అవుతున్న శబ్దానికి అందరి నిద్ర  చెదిరిపోయింది. కమ్మటి కల ఆచూకి మిగల్చకుండానే ! 


అచల కు మనసు చెప్పింది అతనే అని.అలాంటి సమయాలలో మాత్రమే ఫోన్ చేయడం అతని ప్రత్యేకత అని. మాట్లాడాల్సిందేనా?ఆలోచిస్తుంది.


తప్పదు.అతని మానసిక స్థితి యెలా వుందో  "మనిషిని లోపాలతో సహా ప్రేమించడమే, స్నేహించడమే కదా కావాల్సింది." అన్న ఆమె  స్టేట్మెంట్ ఆమెకే  గుర్తుకువచ్చిందీ ఆ క్షణంలో.


రెండవసారి రింగ్ అవడం మొదలైంది. ఆ చప్పుడుకి మిగతా యిద్దరు లేచి కూర్చుని ఫ్రశ్నించారు. “ఎవరే, యింటి నుండా,  క్షేమంగా చేరినట్లు  యింటికి ఫోన్  చేయలేదా?” అని.


“ ఉష్..మాట్లాడకండి. మా ఆయన” అంటూ లిఫ్ట్ చేసింది. లౌడ్ స్పీకర్ ఆన్ చేసి వినమని సంజ్ఞ  చేసింది. 


" హలో బాగున్నావా అచలా" అడిగాడతను.


"నా బాగోగులు గురించి యె౦దుకు కానీ యెందుకు ఫోన్ చేసారో చెపితే బాగుంటుంది" 


 

"ఎవరు ఆప్తులో, యెవరు శ్రేయాభిలాషులో యిన్నేళ్ళ తర్వాత కూడా తెలుసుకోలేకపోతే యెలా? తలచుకుంటే జాలి వేస్తుంది" అన్నాడు. 


"ఆ జాలి నాకక్కరలేదు”


"అంతా నీ ఖర్మ. యే మాత్రం సర్దుకున్నా యిలా వుండేదానివి కాదు" తప్పంతా అచల మీద నెట్టే ప్రయత్నం చేస్తూనే వున్నాడింకా.

 

  "సర్దుకోవడాలు గురించి యెoదుకు గానీ నీ పిల్లలు బాగున్నారా” వెటకారంగా అడిగింది  


“ ఆహా.. బ్రహ్మాండంగా వున్నారు. వాళ్ళకి యే౦ తక్కువ. గోల్డెన్ స్పూన్ లతో పుట్టకపోయినా సిల్వర్ స్పూన్లతో తింటున్నారు. వాళ్లకి మంచి భవిత అందించాలని కష్టపడుతున్నాను.అది వాళ్ళు గుర్తించి  కష్టపడి   చదువుకుంటున్నారు."  


 నవ్వింది అచల. ఆగి ఆగి మళ్ళీ నవ్వింది తెరల తెరలాగా. మనసులో దాగున్న కసిని, వేదనని కలిపి వెళ్ళ గ్రక్కుతూ..


"అవును..మీలా పెళ్ళయి  పదేళ్ళు  కాపురం చేసి  కొడుకుకి యేడెనిమిది యేళ్ళు వచ్చాక  యింకొక స్త్రీ మోహంలో చిక్కుకుని భార్యని,కొడుకుని వదిలేసి దూరాలకి  యెగిరి పోయి,ఇక వాళ్ళే సరస్వం  అనుకుంటూ బ్రతికే నువ్వు  బాగానే వుంటావ్, నీ పిల్లలు కాని పిల్లలు  బాగానే ఉంటారు."  


గగన,సరళ చెవులు విప్పార్చుకుని మాట్లాడుతుంది మన ఆచలేనా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ౦డగా..


"ఆర్నెల్లకోసారి అర్ధరాత్రుల్లు కట్టుకున్న పెళ్ళాం..యెలా వుందో అని గుర్తుకువచ్చి లేదా నీ ప్రియురాలితో గొడవపడినప్పుడు గుర్తుకొచ్చో యిలా అర్ధరాత్రులు ఫోన్  మాట్లాడుతూ వుంటావ్? లేదా  యిది  యింకా వొ౦టరి జీవితం గడుపుతుండా? లేక యెవరినైనా చూసుకుందా అని అనుమానపు ఆలోచనలతో ఫోన్  చేస్తావ్..అంతేగా!" 


“అది కాదు అచలా” సర్దుబాటు ధోరణిలో అన్నాడతను.


" నీ సంగతి నాకు బాగా తెలుసు.నీకు ఆ లైఫ్ బోర్ అనిపించినప్పుడూ లేదా నీలో నిజంగా పశ్చాతాపం మెదిలినప్పుడో గుర్తుకొచ్చి యిలా ప్రేమ వొలకబోస్తావ్.  చక్కగా యిలా ప్రేమగా వీణ మీటినట్లు మీటి ఓ ప్రక్కన పడేసి పెట్టుకుందాం.అవసరమైనప్పుడు వాడుకోవడానికి వో వస్తువులా వుంటుంది అనుకుంటున్నావ్ కదా"


 

"నేన్నీకు  యే౦ తక్కువ చేసాను చెప్పు? నువ్వే చేజేతులా నాశనం చేసుకుంటున్నావ్"అన్నాడు.


"నీవు కురిపించే ప్రేమ-ఆపేక్ష అన్నీ..నా చుట్టూ వున్న డబ్బు  గురించే అని నాకు బాగానే తెలుసు. ఇన్నాళ్లు మన మధ్య విడాకులు ప్రస్తావన రాలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నాను చట్టపరంగా విడిపోదాం" అంది.



"ఎందుకు!?" అనుమానంగా, కోపంగా అడిగాడతను.


"నీలా సెటిల్ అవడానికి మాత్రం కాదులే" అంది ఎగతాళిగా.

.

"నేను ఆ మాటే భరించలేను. వద్దు అచలా" బ్రతిమాలుతున్న దోరణిలో అతను. 


"యు..స్టుపిడ్.. చెప్పేది విను.ఇన్నాళ్ళు నీ అక్రమ సంతానానికి తండ్రివి, యిప్పుడు వాళ్ళు పెరిగి పెద్దయి కాలేజ్ చదువులకి  వచ్చారు. అమ్మ మెడలో తాళిబొట్టు కి లైసెన్సు వుండాలి కదా, అందుకే జాలితో, సానుభూతితో నేనే  మీ అధికారిక పెళ్ళికి అనుమతి పత్రం యిస్తున్నాను"  అంది అచల.


 "అచలా..నీకు నువ్వు అన్యాయం చేసు కుంటున్నావ్! నేను అంత త్యాగాన్ని కోరలేదు. విడాకులు వద్దు" అన్నాడు. 


ఈ సారి ఆచలకి నవ్వు, దుఖం రెండు వచ్చాయి.అవును, విడాకులు త్యాగం. అతని పై  అసహ్యం పెరిగిపోతుంది.గౌరవం తగ్గిపోతుంది. ఏకవచనంలోకి దిగిపోయింది.


  "ఒరేయ్! జీవితాన్ని పంచుకుంటానికి వచ్చి జీవితాన్ని కావాల్సినంత దోచుకెళ్ళి  నీ దారి నువ్వు చూసుకుని విడాకుల అడగకుండా యివ్వకుండా  భార్య అనే  గిరిలోనే  కూర్చోబెట్టి వుంచి  యెన్నో యేళ్ళ తర్వాత  కాటికి కాళ్ళు చాపుకునే ముందు నా దగ్గరికి చేరి నన్ను క్షమించు..అచలా అంటే కరిగి కన్నీరై ప్రవహించి  క్షమించే స్త్రీని అనుకున్నావా, యే౦ జన్మరా, ఛీ! నువ్వు అసలు మనిషివేనా? జీవితంలో వొక్క సారి అయినా, వొకే వొక్కసారైనా వొక్క స్త్రీ మూర్తి ముందైనా నిజాయితీగా బ్రతకడం నేర్చుకో!" అంది. 


"నువ్వు యింకా మడి గట్టుకు కూర్చునే వున్నావా" అన్నాడు.


అసలు అనుమానం బయటపడనే పడింది. ఇలాటి ప్రశ్న వస్తుందని యెప్పుడో అనుకుంది అచల. నిబ్బరంగా సమాధానం చెప్పింది.


  "ఇలాటి ప్రశ్న  నీ నుండి యెప్పటికైనా వస్తుందని నాకు తెలుసు.ఇప్పుడు నేను చెప్పేది విని జీర్ణం చేసుకోవడం నీకు కష్టమే కానీ తప్పదు  నాలాంటి  వొంటరి వాళ్ళని చూసి నీలాటి జాలి, ప్రేమ గల లోకాన్ని వుద్దరించే పురుషులు  చాలా మంది ముందుకొచ్చారు. ఒకడు మహారాణిలా చూసుకుంటాను  నాతో వుండి పో అంటాడు.

మరొకడు నిన్ను చచ్చేంత ప్రేమిస్తున్నాను. మన భావాలు,అభిరుచులు వొకటే! మనం కలిసి వుంటే యెంత సంతోషంగా వుంటామో అంటాడు.ఇలా స్నేహం ముసుగులో యె౦దరో!  నువ్వు యిలా యెప్పుడైనా  అర్ధరాత్రులు, అపరాత్రులు ఫోన్ చేస్తే ఫోన్ ఎంగేజ్ లో వుంటే వాళ్ళతో మాట్లాడుతూ వుంటానని మాటలతో అతన్ని స్వాంతన పరుస్తూ వుంటానని  అర్ధం అన్నమాట. ఆ సంగతి గుర్తుపెట్టుకో" కక్షగా అంది.


యు.. ____ అతని మాటలో  కుసంస్కారం వెలువడింది మాటల రూపంలో.


"ఏంటిరా చించుకుంటున్నావ్? నీ దృష్టిలోనే కాదు చాలా మంది దృష్టిలో  నువ్వు చేస్తే వొప్పు. నేను అలా చేస్తే కొవ్వు. అయినా మూడో మనిషివయిన నీకు మరో మూడో మనిషి గురించి ఆలోచించే అర్హత  తీరిక వున్నాయా? నీలా నేను మూడోమనిషి కాలేనురా" అంది జుగప్సగా

.

  "అయితే యేమంటావ్? నా అవసరం లేదంటావ్"  అన్నాడు వ్యంగంగా.


"మానసికంగా నేను యెప్పుడో విడిపోయాను. ఇప్పుడు యెప్పుడూ నేను వొంటరినే!  మరొక మగాడి అవసరమో,నీడో  అవసరం లేదు నాకు" అంది అహంగా .


మౌనం కాసేపు. అటునుండి శబ్దం లేదు.కొన్ని క్షణాల తర్వాత  ఫోన్  కట్ చేసుకున్న శబ్దం.


"ఎందుకే,అంత ఇరిటేట్ అయ్యావ్ " అంది గగన.


"ఇన్నేళ్ళ యీ వొంటరి జీవితంలో యెన్ని దాచుకున్నానో యెన్ని  అణచుకున్నానో!  కనీసం కొడుకు అనేవాడు వొకడున్నాడని గుర్తుందా వాడికి! కనీసం బిడ్డ క్షేమ సమాచారం అయినా అడిగాడా, నన్ను గుప్పిటలో బిగించుకుంటే డబ్బుకు కొదవ ఉండదు.మొగుడనే  పిచ్చి ప్రేమతో వాడికి కావాల్సినంత డబ్బు యిచ్చేస్తాను. అప్పుడు వాడి సరదాలకి సంతోషాలకి డబ్బు కొరత వుండదని వాడి ప్లాను. ఇప్పటికన్నా నేను మేలుకోలేకపోతే నా అంత వెర్రిది యీ లోకంలో యెవరూ వుండరు"


"వాడిని వద్దంటూన్నానని యింకా యెవరితోనైనా సంబంధం  వున్నట్టేనా?  మనసుకే కాదు శరీరానికి జడత్వం వచ్చేసింది. ఇంకొకడి గురించి ఆలోచన కూడానా?  మా యింట్లోనూ యెన్నో ఆంక్షలు! నన్ను యెక్కడికి కదలనివ్వరు,వుద్యోగం చేయనీయరు, స్నేహితులు వుండకూడదు, రాయిలా స్పందన లేకుండా,వొంటరిగా పరువు-ప్రతిష్టలు అనే నాలుగు గోడల మధ్య బ్రతికే బ్రతుకుని అసహ్యించుకుంటూ బ్రతకలేను,  అందుకే నా కొడుకుని తీసుకుని నేను బయటకొచ్చి బ్రతకాలని అనుకుంటున్నాను" అంది ఆవేశంగా.


మిత్రురాల్లిద్దరూ చెరోవైపు దన్నుగా వున్నట్టు అచల చేతులని చెరోకటి చేతుల్లోకి తీసుకున్నారు. ఆ యిద్దరి చేతులని హృదయం దగ్గరికి చేర్చుకుని నిశ్చింతగా శ్వాస తీసుకుంది. అచల మనసులో అలజడి  కొంత తగ్గింది.


చల్లని మంచినీళ్ళు త్రాగి  ప్రశాంతంగా  నిద్రకుపక్రమించింది.


భార్య మనసెరిగి తగిన గౌరవం యిచ్చి వొంట్లోనూ  యింట్లోను సగభాగంగా చూసేది యెందరు?పురుషుల్లో యెక్కడో కాని వుండరు పుణ్యపురుషులు అనుకుంటూ నిద్రకి  వుపక్రమించింది  గగన.  ఆమె ఆలోచనలలో యిప్పుడు అచల అనే నావ వొడ్డుకు చేరి లంగరు వేసి వుంది.


*******సమాప్తం********


( ఈ కథ కొంత సవరణ తర్వాత “బహుళ ” త్రైమాసిక వెబ్ పత్రిక 2023 మార్చి సంచికలో ప్రచురితం)


కామెంట్‌లు లేవు: