3, జూన్ 2013, సోమవారం

రాయికి నోరొస్తే !?" అపర్ణా! యెందుకే  బెల్లం కొట్టిన రాయిలా అలా మౌనంగా నిలబడ్డావ్  ? అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకుంది  కదాచూసే వాళ్ళు మౌనం అర్దంగీకారం అనుకుంటారు. చెప్పు, సమాధానం చెప్పు,  అడిగినవాడి చెంప చెళ్ళు మనిపించేలా సమాధానం చెప్పాలి . తప్పు చేయనప్పుడు రోషం పొంగుకు రావాలి కానీ అలా కన్నీళ్లు కార్చడం కాదు చేయాల్సింది " కోపంగా చెప్పింది తల్లి పద్మ

అపర్ణ అప్పుడూ యేమీ  మాట్లాడలేదు. అక్కడి నుండి లోపలికెళ్ళిపోయింది .

"దీని  వరుస చూస్తుంటే బాబీ  అన్న మాటలు నిజమే నేమో అనిపిస్తున్నాయి "అన్నాడు తండ్రి విశ్వం

"ఛీ.. ఛీ!  అలాంటి  మాటలనకండి. అది మన బిడ్డ . కలలో కూడా తప్పు చేసే ఆలోచన దానికి రాదు. అసలు తన మనసులో యేముందో మనకి అర్ధం కావాలి కదా ! దాని మనసుని, ఆలోచనలని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం"

"ఇది ఇలా నోరు విప్పకుండా మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే రేపు వాళ్ళకి యేమని సమాధానం చెప్పగలం? " విసుకున్నాడు

"అవతల వాళ్ళు అడిగినట్లు మనమూ అడిగి తన మనసుని బాధపెట్టవద్దు. అదసలే సున్నిత మనస్కురాలుఇన్నేళ్ళుగా యీ అనుమానపు చూపులు యెదుర్కొంటూ  అవమానపడుతూ యెలా బ్రతికిందో  నా బిడ్డ . వాడికి అసలు ఆ మాటనడానికి నోరెలా వచ్చిందో !? "గొంతులో దుఃఖం అడ్డుపడుతూ వుండగా యింకా యేదో అనాలనుకుని కూడా అనలేక  ఆపేసింది.

"ఇద్దరూ చిన్నప్పటి నుండి కలసి పెరిగినవారే కదా! అపర్ణ గురించి వాడికి మాత్రం తెలియదూ ! ఇద్దరూ ప్రేమించుకుని యిష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు . ఇపుడు యీ అనుమానాలు యేమిటో?   బయటకి పొక్కి నలుగురికి తెలిస్తే మనం తలెత్తుకుని తిరగ గలమా? ఆవేదనగా అన్నాడు విశ్వం
కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండి పోయారు

"వదినా భోజనాలు అయ్యాయా? " అంటూ గోడవతలి నుండి పలకరించింది పద్మకి ఆడపడుచు అపర్ణకి  అత్త గారైన విజయ.

“లేదొదినా, యిప్పడు చెయ్యాలి” అంటూ లోపలి రాబోయింది. "వదినా ! వొక చిన్న మాట. యిలా వచ్చి విని పో అంది. తప్పదన్నట్లుగా రెండిళ్ళ మధ్య వున్న గోడ దగ్గరికి వెళ్ళింది .

 "ఏమంటుంది అపర్ణ " యే సంగతి చెపితేనే కదా ! రేపు టెస్ట్ లకి వెళ్ళగలరు. ఎక్కువ సెలవలు కూడా లేవయ్యే! మళ్ళీ తిరిగి  వెళ్ళిపోవాలి కదా" అంది

వెర్రి మొర్రి ఆలోచనలతో జీవితాలకే సెలవు చెప్పుకునే పరిస్థితి తెచ్చింది నీ కొడుకు, యిక నా కూతురిని యే౦  చెప్పమంటావు ? మీకేమైనా  చేతనైతే మీ  కొడుకుకే కాస్త గడ్డి పెట్టండి " అంటూ అక్కడి నుండి విసురుగా వచ్చేసింది

లోపలి వచ్చి చూస్తే పిల్లలిద్దరినీ కూర్చోపెట్టుకుని అన్నం తినిపిస్తున్న అపర్ణ కనిపించింది. పోన్లే! కూతురైనా యే ఆలోచన లేకుండా పిల్లలతో స్థిమితంగా కనబడింది అనుకుంది

అపర్ణ పిల్లలు లిద్దరిని నిద్ర పుచ్చి వచ్చే దాకా వుండి ముగ్గురు కలసి అన్యమనస్కంగానే భోజనాలు ముగించారు.
గదిలోకి వెళ్ళబోతూ ఆగిన అపర్ణ "అమ్మా!  రేపు పిల్లలిద్దరినీ  DNA టెస్ట్ కి తీసుకుని వస్తామని వాళ్ళకి  చెప్పమ్మా " అని చెప్పి లోపలి వెళ్లి తలుపేసుకుంది.

ఆ మాట విన్న అపర్ణ తండ్రి నిశ్చింత గా పడుకున్నాడు . తల్లి పద్మకి దుఖం పోర్లుకొస్తుంది
భర్త వైపుకి తిరిగి యిప్పుడైనా మన బిడ్డని నమ్ముతారా? అంది .

"ఇక్కడ నమ్మడం నమ్మక పోవడమన్నది సమస్య కాదు పద్మా, యెవరికైనా తల్లి నిజం తండ్రి నమ్మకంఆ నమ్మకమే ప్రశ్నార్ధకం అయి కూర్చుంటే దానికి నిరూపణ చేయాల్సి రావడం ఆ తల్లికి  కష్టమేకానీ తప్పదు, నమ్మకం లేనివాడు నా మేనల్లుడు, అల్లుడు కావచ్చు అవమాన పడుతుంది నా కూతురు కావచ్చు. ముద్దాయి స్థానంలో మన అమ్మాయి నిలబడి వుంది కాబట్టి నిరూపించుకోవాల్సిన అవసరం మనకి వుంది కదా! అందుకు అపర్ణ వొప్పుకున్నందుకు బరువు తీరినట్లు వుంది" అన్నాడు

మీరు యెన్నయినా చెప్పండి, ఒక తల్లిగా కన్నా వొక స్త్రీగా నేను యీ విషయాన్ని అంత  తేలికగా తీసుకోలేకపోతున్నాను.  మగవాడు తన బిడ్డలని చూసిన ప్రతి క్షణం వీళ్ళు నాకే పుట్టారా ? లేక యెవరికైనా పుట్టి వుంటారా నన్న అనుమానంతో చూడటం మొదలైతే ఆ బిడ్డలని ఆతను మనఃస్పూర్తిగా ప్రేమించగలడాఆ భార్యని విశ్వసించగలడా అపర్ణ మాత్రం క్షణ క్షణం  అలా అవమానింపబడటాన్ని యెలా తట్టుకోగలదు ? అంత  కన్నా నరకం మరొకటి వుంటుందంటారా? అడిగింది

"జీవితం అంటే నమ్మకం పద్మా! ఆ నమ్మకం లేనప్పుడు కొన్ని జీవితాలు ఇలాగే ఉంటాయిభారంగా చెప్పాడు
 పద్మకి  అప్పుడెప్పుడో చూసిన  "అస్తిత్వ్ " చిత్రం గుర్తుకు వచ్చింది. ఆ చిత్రం లో  "అదితి " లాగా తన కూతురు భర్త యెడబాటుతో పరాయి పురుషుడికి సన్నిహితమయిందేమో అన్న అనుమానం కల్గింది. కానీ అలాంటి అనుమానాలన్ని పఠాపంచలు  అయిపోయాయిమరునాడు జరగబోయే విషమ పరీక్ష గురించి వారికి యెలాంటి సందేహం లేదు . అపర్ణ నడవడిక మంచిది కానట్లయితే భర్త బాబీ అనుమానం నిజమైన పక్షంలో ఆమె టెస్ట్ లకి వొప్పుకునేదే కాదు   అపర్ణ యీ విషయాన్ని ముందు అవమానంగా తీసుకుంది తర్వాత యేడ్చింది, ఆ తర్వాత మౌనం వహించింది. కొంత ఆలోచన తర్వాత   ఆఖరికి నిరూపణకి వొప్పుకుంది కానీ తర్వాత భర్త తో కలసి వుండగలదా కూతురి మనస్తత్వం తెలిసిన పద్మ మనసులో అనేక ఆందోళనలతో తెల్లారిపోయింది

అపర్ణని,  పిల్లలిద్దరినీ తీసుకుని పద్మ, విశ్వం కారు ఎక్కి కూర్చున్నారు  "ఎక్కడికి వెళదామంటారు బావా " అడి గాడు  విశ్వం .

 బాబీ తండ్రి "వాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి కదా బావా అని విసుక్కుంటూ "ఎక్కడికి వెళ్ళాలి రా ?" అని అడిగాడు. ఒక పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ పేరు చెప్పి అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్న వొకతని పేరు చెప్పి అతనిని కలిస్తే అవసరమైన పరీక్షలు చేస్తారని చెప్పాడు

ఆ విషయం చెపుతున్న బాబీ  వైపు అభావంగా చూసింది అపర్ణ. రెండు కార్లలోను రెండు కుంటుంబాల వారు కలసి  ఆ హాస్పిటల్ కి వెళ్ళారు

DNA టెస్ట్ అంటే ఏమిటో, పిల్లలని టెస్ట్ ల పేరిట యెన్ని సూదులు పొడిచి నమూనాలు సేకరిస్తారో ?పాపం,పుణ్యం  యేమి యెరుగని అమాయకపు పిల్లలెలా తట్టుకుంటారో ఆని భయపడిపోయింది పద్మ .అవన్నీ యేమి లేకుండానే పిల్లలని యేమి హింస పెట్టకుండానే వొక గంట లోపే పిల్లలిద్దరికీ పరీక్షలు నిర్వహించి పంపేసారు.

వచ్చేటప్పుడు  అపర్ణ వాళ్ళతో పాటు కారెక్కిన విజయ. యింటి ముందు కారాగగానే దిగి అపర్ణ ప్రక్కకి వచ్చి .. "నువ్వు కాస్త పద్దతిగా, విరగబాటు లేకుండా వుండి  వుంటే  ఈ పరీక్షల తంతు వుండేది కాదు కదా ఆడవాళ్ళు యెంత చదువుకున్నా, వుద్యోగాలు చేసినా, వూళ్ళేలినా  మగవాడితో పోటీ పడరాదే అంటే వూరుకోలేదు. వాడితో సమానంగా వుద్యోగాలు  చేయాలి అన్నావ్ఇద్దరూ వేరు వేరు వూర్లలో వుద్యోగం చేయడం , నెలల తరబడి ఆపీస్ పనులపై టూర్ లెళ్ళీ  ఆ పై బిడ్డలని కంటే మగవాడికి నమ్మకం కుదరొద్దు . ఏ వూరి ఆంబోతు అయితే మాకేమిటి,మా దొడ్లో ఈనితే చాలనుకుంటానికి యిదేమన్నా పశువుల కొట్టమా !? వంశం ,ఆచారం, పోలికలు యెన్ని వుండాలి ! అవన్నీ వుంటే  వాడెందుకు అనుమానపడతాడు " అంటూ  అనాల్సిన నాలుగు మాటలు అనేసింది

అపర్ణ యిప్పుడూ  యేమి మాట్లాడలేదుఅక్కడి నుండి మౌనంగా లోపలి  వెళ్ళిపోయింది

మరో నాలుగు రోజుల తర్వాత  విశ్వం యింటి ముందు పదిమంది పెద్దలు కూర్చుని పంచాయితీ మాదిరిగా మాట్లాడుకుంటున్నారు

"మీరైనా చెప్పండి అన్నయ్యా ! మా అన్న విశ్వానికి  మా వదినకి వెరుపు అనేది లేకుండా పోయింది కూతురేమంటే దానికి తందానా అంటూ తలూపుతున్నారుదాన్ని కాస్త మందలించి కాపురం నిలబెట్టవద్దూ ! జరిగి పోయిందేదో  జరిగి పోయింది, పిల్లలిద్దరూ వాడి బిడ్డలే అని తెలిసిన తర్వాత బాబీ బాగానే వున్నాడుగా, పెళ్ళాం మాట్లాడకపోయినా బిడ్డలిద్దరినీ యెత్తుకుని మురిపెంగా  చూసుకుంటున్నాడు కదా! వెళ్ళేరోజు దగ్గరబడుతుంది అన్నీ సర్దుకోమని చెప్పడానికి వెళ్ళాడు . ఇకపై వుద్యోగం చేయాల్సిన పని లేదు, యింట్లో వుండి  పిల్లలని చూసుకుంటే చాలని చెప్పాడు. ఆ మాటకి శివంగిలా విరుచుకు పడి వాడిని బయటకి నెట్టేసింది. ఆడడానికే అంత  పొగరుంటే మగాడు నా కొడుకుకి యెంత  పొగరు వుండాలి " అంటూ పెద్ద పెద్దగా మాట్లాడ సాగింది.

నువ్వేమంటావ్ విశ్వం ? అడిగారు పెద్దమనుషులు

"నేనేమంటాను బాబాయ్! అపర్ణ చిన్న పిల్లేం కాదు కదా! తన నిర్ణయానికి తనని వదిలేద్దాం అనుకుంటున్నాను ".
"ఇద్దరికీ కావాల్సిన వాడిగా నేను చెపుతున్నాను జరిగిందేదో జరిగిపోయింది . వాడు  వెదవ ఆలోచనలే చేసాడు . సీతమ్మ వారిలా అపర్ణ అగ్ని పరీక్షనే యెదుర్కొంది  కాదనను, కానీ కొంచెం సర్డుకుంటే  కాపురం నిలబడుతుంది . పైగా మీరేమి పరాయి వాళ్ళు కాదు. అన్నా-చెల్లెళ్ళ మధ్య యేమి జరిగినా తప్పు యెవరిదయినా సర్డుకుంటే తప్పేమీ లేదు  అందులో ప్రక్క ప్రక్క యిళ్ళలోనే వున్నారు తెల్లారి లేచింది మొదలు వొకళ్ళ ముఖాలు వొకళ్ళు చూసుకోవాలి " సర్ధి చెప్పే ప్రయత్నం చేసారు బాబాయ్.

విశ్వం భార్య పద్మ వైపు చూసాడుఅది అర్ధం చేసుకున్న ఆమె  లోపలికెళ్ళి అపర్ణ ని పిలుచుకుని వచ్చింది
"ఏమ్మా  అపర్ణా! బాబీ పిలుస్తున్నాడు కదా పిల్లలని తీసుకుని వాడితో  వెళ్ళమ్మా " అనునయంగా చెప్పాడు

"నాకు విడాకులు కావాలి తాతయ్యా" కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పింది.

ఆ మాట వినగానే కూర్చున్న కుర్చీలో నుండి లేచి కుర్చీ విసిరి కొట్టాడు బాబీ."ఏమిటి  ఎక్స్ ట్రా వేషాలు వేస్తున్నావ్ ? టెస్ట్ రిజల్ట్స్ రాగానే పెద్ద ప్రతివత నయిపోయాననుకున్నావా ? నీ వేషాలు నాకు తెలియదు అనుకున్నావా? అందరి ముందు నంగనాచిలా వేషాలు వేయకు,లగేజ్ సర్దు రేపే ప్రయాణం " అన్నాడు

"నాకు విడాకులు కావాలి " మళ్ళీ అదే  స్తిరమైన మాట అపర్ణ నోటి వెంట.

నీకు విడాకులు కావాలి  అంటున్నావ్ ! అందుకు కారణం ఉండాలి కదా అడిగాడు తాతయ్య
"తాతయ్యా నీకు ఐదుగురు పిల్లలు  వున్నారు, నువ్వెప్పుడైనా మా అమ్మమ్మని వీడు నాకే పుట్టాడా అని అడిగావా ? " అని అడిగింది

"ఛీ ఛీ అదేం మాటమ్మా తాళి గట్టిన భార్యని బ్రతుకంతా నాతోనే అరగదీసుకుందామని  వచ్చినామెని అలా అనుమానం గా చూడగలనా? తప్పు అలా మాట్లాడకు " అన్నాడు చప్పున.

"అత్తా ! మీకు పిల్లలు పుట్టడం ఆలస్యం అయిందని మామయ్యా లేకుండా నువ్వు సేవల కోసమని  ఆశ్రమాలకి ఇంకా అప్పుడప్పుడు గురు పీఠాలకి వెళ్లి ఇరవై రోజులు  పాటు ఉండేదానివి కదా! ఆ తర్వాత యెన్నేళ్ళకో బావ పుట్టాడు . అప్పుడు వీడు నాకే పుట్టాడా అని మామయ్యా నిన్ను అడిగాడా? " అడిగింది .

" ఏంటే ! నోటికి యెంతొస్తే అంత మాట్లాడుతున్నావ్ ? చెప్పు తీసుకుని కొడితే పళ్ళు రాలతాయి జాగ్రత్త " అని  అపర్ణ ని కొట్టడానికన్నట్లే  వొక్క వుదుటున లేచింది విజయ

"నేను మాటవరసకి అడిగిన మాటలకే  మీరు యింత నొచ్చుకుంటే ఆరు సంవత్సరాల పాటు అనేక అనుమానాలు వున్న యితనితో కాపురం చేసినందుకు నేనేమనాలి. ఇద్దరం ఒకేరకం చదువు చదివాం,  ప్రేమించుకున్నాం, యిద్దరి వైపు  పెద్దవాళ్ళు వొప్పుకుని రంగ రంగ వైభవంగా పెళ్లి చేసారు, ఇద్దరూ అవకాశాలు దొరక బుచ్చుకుని విదేశంలో వుద్యోగం చేసుకుంటున్నాంకొన్నేళ్ళు చెరొక చోట వున్నంత మాత్రాన నన్ను అనుమానించాలా ? నాకు పుట్టిన పిల్లలకి తండ్రి అతనేనా  అన్నది సందేహమే! బిడ్డలని యెత్తుకున్న ప్రతిసారి వాళ్ళ వైపు అనుమానంగా చూస్తాడు, వాళ్ళని వున్నట్లు వుండి  బంతిని విసిరినట్లు విసిరి కొట్టి వెళ్ళిపోతాడు,తోటి  ఉద్యోగితో మాట్లాడినా తప్పే! వాడేనా నీ రహస్య స్నేహితుడు అంటాడు, సంవత్సరాల తరబడి మౌనంగా అతని అనుమానాలని  భరించాను, అవమానాల్ని యెదుర్కొన్నాను తాతయ్యా.  ఇప్పుడు నిజం నిరూపించుకున్నా సరే అతనితో కలసి నేనుండలేను” ఖచ్చితంగానే చెప్పింది.

నువ్వు చెప్పింది నిజమే ననుకో, యేదో తప్పు జరిగిపోయింది. నువ్వు కాస్త సర్దుకుంటే బావుంటుందని .

"తర తరాలుగా, యుగ యుగాలుగా ఆడదానికి యీ శీల పరీక్షలు, అవమానాలు వుండాల్సినదేనా !? మనం నేర్చిన నాగరికత ఇదేనా! మనిషి పై నమ్మకం లేనప్పుడు ఆ మనిషికి పుట్టిన బిడ్డలని తన బిడ్డలా కాదా అని అనుమానంతో చూసేటప్పుడు  ఆ బంధానికి  వున్న విలువ యేపాటిదన్నది ప్రశ్నించుకుంటే చాలు సమాధానం దొరుకుతుంది . ఇక్కడ యెవరి సంస్కారం యే  పాటిదో  మీఅందరికి  తెలియడం లేదా ? నేనెందుకు అతనితో కలసి వుండాలో చెప్పండి ?

"బిడ్డలున్నారు కదమ్మా ! వారి కోసం అన్నీ భరించాలి,నీ వొక్కదానికే   కొత్తగా కష్టాలు వచ్చాయాఇలాంటివి చాలా విన్నాం . తర్వాతర్వాత అవే సర్దుకుంటాయి " రాజీ దోరణిలో చెప్పింది విజయ

నిజమే అత్తా! అందరికి యెన్నో కష్టాలు వస్తాయి. వాటిని యెదుర్కోవాలి కాదనను. ఇలాంటి అవమానకరమైన ప్రశ్నతో నన్ను నేను యెలా సముదాయించుకోవాలో  చెప్పండి ? ఆడవాళ్ళు మగవారితో సమానంగా చదువుతున్నారు, వుద్యోగాలు చేస్తున్నారుఇద్దరూ కలసి వుండే అవకాశం  లేక భర్త వేరొక చోట వున్నంత మాత్రానా అతను  వేరొక స్త్రీ తో సంబంధం పెట్టుకున్నాడనిబిడ్డలని కన్నాడని నేను అనుమానించానా ? కానీ  ఆతను అదే చేసాడు. ఆతను అలా చేసాడు కాబట్టీ నేను  కూడా అలాగే చేస్తాననుకుంటున్నాడుఅంతెందుకు అంతరిక్షంలోకి కల్పనా చావ్లా , సునీత విలియమ్స్ పురుషులతో కలసి  వెళ్ళ లేదా వుండ లేదా ! వారిని అనుమానించ గలమా? ఆ ఆలోచన మనకెవరికైనా వస్తుందా కానీ వారిని కూడా అవమానకరంగా మాట్లాడే  భయంకరమైన మనస్తత్వం కల యిలాంటి వాడితో కలసి వుండటం నాకిష్టం లేదు" ఖరాఖండిగా చెప్పింది

"ఓ యబ్బా తెగ ఉపన్యాసాలు చెపుతున్నావ్ కదే! నా కొడుకు వద్దనుకున్నప్పుడు నా కొడుకుకి పుట్టిన బిడ్డలు నీ దగ్గర ఎందుకే ? నా మనుమల్లిద్దరినీ  యిచ్చేయి " అంటూ పిల్లల్ని తీసుకోబోయాడు అపర్ణ మామగారు

"నా పిల్లల మీద చెయ్యేస్తే మర్యాద దక్కదు, నరికి పారేస్తాను . DNA  టెస్ట్ లు చేయక పొతే   వీళ్ళు నీ కొడుకు కే  పుట్టారని నేను చెపితేనే కదా తెలిసేది " అంది ఉగ్రకాళిలా మారి.

"ఈ పిల్ల హద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంది వీళ్ళకి మనం చెప్పలేం, మన దారిన మనం పోదాం పదండి వాళ్ళు వాళ్ళే తేల్చుకుంటారు" అని లేచి పోబోతున్నారు పెద్ద మనుషులు

"న్యాయం చెప్పడానికి వచ్చిన పెద్దల్లారా ! నా యీ  వొక్క మాట వినిపోండి,  నాకిన్ని మాటలు చెప్పారు కదా ! నేను చెప్పే   వొకే వొక్క మాట  విని ఆ మాటల గురించి ఆలొచించండి." అడిగింది

అందరూ అపర్ణ  యేమి చెపుతుందా అన్న ఆసక్తితో  వినడానికి నిలబడి వుండిపోయారు

" అలాగే  ఈ బిడ్డలకి తండ్రి యెవరు ? అని అని నన్ను గ్రుచ్చి గ్రుచ్చి ప్రశ్నించిన  భర్త గారు, అత్తగారు  నా మాటకి సమాధానం చెప్పి వెళ్ళాలి పంతంగా అన్నట్లు అడిగింది.

"ఇది అన్నీ ఇడిచేసి రోడ్డుకెక్కింది. దీనితో మనకెందుకు ? నాలుగునెలలు తిరిగేలోగా దీన్ని మించిన దాన్ని తెచ్చి నీకు పెళ్ళి  చేస్తాను పోదాం పదరా అని కొడుకుని లాక్కేళుతున్న మామగారి ముందుకి వెళ్లి అడ్డంగా నిలబడి 

"ఆడవాళ్ళు తరతరాలుగా నోరు విప్పి ప్రశ్నించకుండా బండ రాళ్ళలా పడి వుంటున్నారు కదా అని యిష్టమొచ్చినట్లు మాట్లాడవద్దు. మీ దౌష్ట్యాలన్ని  యె౦డగట్టే రోజొకటి వుంటుందని తెలుసుకుంటే మంచిది. రాళ్ళకి నోరొస్తుందిపెదవి విప్పని యె౦తోమంది  ఆడవాళ్ళు దగ్గర  మీ మీ నిజాయితీలు భద్రంగా దాగున్నాయి మామయ్యా !   మీ వంశ వృక్షం యిక్కడ వూరి చివర  వాడలలోను, యిళ్ళ మధ్యనూ, విదేశాలలోనూ కూడా  వున్నారు, వారిని తెచ్చుని భద్రంగా యింట్లో పెట్టుకుని మీ గౌరవాన్నిమీ  పురుష అహంకారాన్ని  భద్రంగా కాపాడుకోండి. ఇకపై కోర్టులో కలుసుకుందాం అంటూ లోపలికి నడిచింది.

అమ్మమ్మ తాతయ్యలని అంటిపెట్టుకుని జరుగుతున్న గొడవేమిటో తెలియని పసివాళ్ళ వద్దకి వెళ్ళి  వారిని  దగ్గరగా తీసుకుని తన డొక్కలోకి  పొదువుకుంది.10 కామెంట్‌లు:

Sharma చెప్పారు...

పెద్దలు ఎపుడూ , తమకు ఆడపిల్ల ఎదురు చెప్పకూడదు అనుకుంటారు . అది పెద్ద( రికపు ) తప్పు.
మగవాళ్ళు ఆడవాళ్ళని మాటలతో మానసిక హింస పెట్టటం ఘోరాతి ఘోరం , నీచాతి నీచం . ఇటువంటి పరిస్థితులలో తన నిజాయితీని ౠజువు చేసుకున్న పిదప కూడా , బాబీ అలా వున్నప్పుడు , అపర్ణే కాదు , ఎవరైనా అలా కోర్టుకు ప్రొసీడ్ కావలసిందే . ఇది న్యాయమే .

అజ్ఞాత చెప్పారు...

ఏంటో! భయంగా ఉందండి.!విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకి కోపం.

కాయల నాగేంద్ర చెప్పారు...

అనుమానం పెద్ద పెనుభూతం. ఒక్కసారి కలిగితే ఇక దానికి మందే ఉండదు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శర్మ గారు .. నాగరికంగా కనబడే మనుషుల అనాగరికమైన ఆలోచనలు మొలకెత్తి అవి వటవ్రుక్షాలైతె.. జీవితాలు కథలు గా మారతాయి
అలాంటి కథే ఈ కథ అందీ ! స్పందనకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టే ఫలే మాస్టారూ ..మీరన్నది నిజమే! విశ్వసనీయత తగ్గిపోతున్నందుకు దిగులు వేస్తూ ఉంటుంది ఇలాంటి పెడధోరణలు వల్ల కుటుంబం అనేది ఉంటుందా అని భయం వేస్తూ ఉంటుంది

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నాగేంద్ర గారు.. అవునండీ ! స్త్రీల పరిస్థితి కి చాలా దుఖం కల్గుతూ ఉంటుంది. ఈ కథ వ్రాసిన తర్వాత ఒకరి సూచన మేరకి "విముక్త " చదివి వచ్చాను. చాలా ఆలోచింపజేసింది మీరు "విముక్త" చదవండి

SRINIVASA RAO చెప్పారు...

చాలా బాగుంది

Krishna చెప్పారు...

baga chepparu vanajamali garu. inta jarigina inni jarigina a Asamajapu jeevulu (attta, mama, mogudu, migilina peddalu) tanani sarduku pommani cheptunanre kani vaditi tappu ani cheppu tisukoni kottaledu. alanti vallu unnantakalam Aparna lanti vallu kalika avataram ettalsi vastundi. kani chala baga rasaru.

Saraswathi Durbha చెప్పారు...

అనుమానం లేక పోయినా, నిజం తెలిసినా, తమ స్వార్ధం కోసం అనుమానాన్ని నటిస్తూ ఆడవాళ్ళ బతుకులు నరకం చేసే వాళ్ళు, వాళ్ళకి వత్తాసు పలికే వాళ్ళు కూడా ఉన్నారు సమాజం లో. చదువుకున్న కుటుంబాలు, చదువుకున్న సమాజం నేటి రోజులలో కూడా తెలివైన, స్వాభిమానం కలిగి ఉన్న ఆడవాళ్ళని జంతువుల కంటే హీనంగా చూస్తున్న సంఘటనలు ఉన్నాయి.

Visala Appidi చెప్పారు...

ఆడవాళ్ళ బలహీనత పిల్లలపై ప్రేమ.వాళ్ళ గుర్తింపు కోసం భావిష్యతులో ఇబ్బంది పడకుండా టెస్ట్ కి ఒప్పుకున్నా అపర్ణ అపరాజిత.ప్రేమ అనే బలహీనతను వాడుకోవడం మగవాడి టాలెంట్.ఆ టాలెంట్ కి తలవంచని అపర్ణ అంతకుమించి ఆమెని సప్పోర్ట్ చేసిన తల్లి తండ్రులు విముక్తలే.