అర్ధరాత్రి సమయం . తలగడ ప్రక్కనే ఉన్న మొబైల్ రింగ్ అవుతున్న చప్పుడు. స్క్రీన్ పై కనబడుతున్న నంబరు చూసి ఆశ్చర్యపోలేదు కానీ .. రింగ్ అయిన శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళకి నిద్రాభంగం అవడం అటు ఉంచి అనేక అనుమానాలు రావడం ఖాయం అనుకుంటూనే సైలెంట్ లోకి మార్చి బెడ్ దిగి హాల్లో ఉన్న లాండ్ లైన్ దగ్గరకి రాబోయింది కుముద . ఆమె ఫోన్ దగ్గరకి వెళ్ళే లోపే ఆ ఫోన్ మ్రోగడం హాల్లో పడుకున్న తండ్రి ఫోన్ తీసి ఎవరూ అని అడగడం జరిగిపోయాయి. అవతలి వ్యక్తీ ఏమి అడిగాడో ? తండ్రి సమాధానం ఇవ్వకుండానే అతను లైన్ కట్ చేయడం జరిగిపోయాయి.
"ఎవరో .. శంకర్ ఉన్నాడా? అని అడిగాడు . సమాధానం చెప్పేలోగానే పెట్టేసాడు " అన్నాడాయన ఆమె వంక అనుమానంగా చూస్తూ.
కుముదకి చాలా సిగ్గనిపించింది ఎన్నడూ లేనిది తండ్రి ముందు చాలా అవమాన పడినట్లై౦ది. నాకు ఈ స్నేహం అవసరమా ? అని కోపంగా ప్రశ్నించుకుంది. అలా ప్రశ్నించుకోవడం అనే గొప్ప అలవాటు వలనే ఎన్నో తప్పుల బారిన పడకుండా ఆమెని ఆమె నియంత్రించుకుంది.
"ఛీ ఛీ .. ఇతనికి బుద్ది లేదు నన్నెందుకు అస్తమాను ఇలా తన వాళ్ళ ముందు తలవంచుకునేలా నిలబెడతాడు. రేపు ఉదయమే ఫోన్ చేసి నాలుగు కడిగేసి అతనితో తనకున్న స్నేహానికి గుడ్ బై చెప్పాలి" అనుకుంది కోపంగా.
అలా అనుకుందో లేదో .. మెసేజ్ వచ్చిన చప్పుడు . చేతిలోకి ఫోన్ తీసుకుని చూసింది .. "హాయ్ బంగారం "
మనసులో ఉన్న ప్రేమనంతా రంగరించి మెసేజ్ లో గ్రుమ్మరించినట్లు.
చప్పున ప్రేమ పరిమళం ఏదో కుమదని చుట్టేసిన భావన. మనసు ఆపుకోలేక ఆ మెసేజ్ ని మనిషిని తడిమినట్లు ఆత్మీయంగా తడిమింది. ఆమె చూపులు అప్రయత్నంగా ఆ పేరు పైన ఆగాయి .. "సురేష్ " ఆ పేరు వింటేనే ఆమెకి వివసత్వం. ఎన్నడూ నవ్వని పెదాలు మెల్లగా విచ్చుకుంటాయి కళ్ళలో పొంగిన సంతోషం ముఖమంతా ఎగబ్రాకి పోతుంది బహుశా దానిని కవుల బాషలో ప్రేమంటారేమో! అని అనుకుంటూ నవ్వుకుంటుంది .
అతని పరిచయం ఏ మాత్రం ఊహించనిది. ప్రెవేట్ ఎఫ్.ఎమ్ ల పుణ్యమా అని జీరో అవర్స్ లో కూడా కాల్ చేసి మాట్లాడటం, ఇష్టమైన పాట కోరుకోవడం ఇష్టమైన వారికి డెడికేట్ చెయ్యడం ని బాగా ఎంజాయ్ చేసే రోజులవి.
ఆ రోజే ఆత్మీయంగా మసలుకుంటూ తమ్ముడూ అని పిలిపించుకుంటూ ఉండే "నివాస్ " ఒక విషయం చెప్పాడు "ఈ రోజు మనలని చూడాలని ఒక లిజనర్ వచ్చారు "తార్నాక " లో ఉంటారట మిమ్మల్ని చూడాలని అడిగారు . అలా ఎవరూ కలవడం నీకిష్టముండదు కదా ! అందుకే నువ్వు ఊర్లో లేవని అబద్దం చెప్పాను ఫోన్ నంబర్ అడిగారు లాండ్ లైన్ నంబర్ ఇచ్చాను" అని చెప్పాడు
మంచి పని చేసావు అని మెచ్చుకుని అతని నంబర్ తీసుకుంది. ఎప్పుడైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటం మంచిదనే ఉద్దేశ్యం తో ముందు జాగ్రత్తగా.
అదే రోజు రాత్రి ఒక అసహన సమయంలో ఒకే ఒక క్షణం లో రేడియోకి లైన్ కలవడం ఆ అసహనాన్ని తగ్గించుకోవడానికి చల్లని పాటా కోరుకోవడం అలవాటుగా ఎవరికీ డెడికేట్ చేస్తున్నారు అని ఆర్ జె అడిగిన ప్రశ్నకి "సురేష్ " కి అని చెప్పడం జరిగిపోయాయి. పాటతో పాటు అతని కాల్ తనని పలకరించాయి ఆ మాట ఈ మాట తో చిన్నపాటి పరిచయం అంతే ! మరునాడు ఆమెని చూడాలనే ఆత్రుత తో అతను ప్రత్యక్షం కావడం ఏ మాత్రం ఊహించని విషయం.
కుముద ది పెక్యులియర్ వాయిస్. అలాగే ఆమె సంభాషణా చాతుర్యం, విషయ పరిజ్ఞానం వల్ల ఆమె అంటే ఎంతోమందికి అభిమానం . ఆర్ జె కబుర్లు మాకెందుకు కుముద గారి మాటలు వినడం కోసమే అర్ధరాత్రుళ్ళు మేలుకుని రేడియో వింటున్నామని అనేవాళ్ళు ఎక్కువయ్యారు అలాంటి .అభిమానగణం ఉన్న కుమద ని ఇష్టపడటంలో తప్పేముంది ? అంటూ .. సురేష్ తన మనసులో మాట చెప్పేయగానే గుండె గుబేల్ మంది. క్షణ కాలం అతనిని పరికించి చూసింది ఒకింత నిర్మోహమాట మైన మాట .. ఎప్పుడూ నవ్వినట్లు ఉండే కళ్ళు.,. ప్రశాంత వదనం. ఆ నడక ఏదో ప్రత్యేకత ఉంది ఇతనిలో. ఆ ఆకర్షణలో పడకుండా ఉండటం చాలా కష్టం అనుకుంది.
ఒంటరిగా ఉండే ఆమె జీవనంలోకి ఆతను ప్రత్యక్షంగా కాకపోయినా నిత్యం ఫోన్ ద్వారా మాట్లాడడంతో పరోక్షంగా జొరబడి పోయాడు. వారి వేవ్ లెంగ్త్ బాగా కలసి పోయాయి
ఒకరోజు అడిగింది "ఇలా మీరు రోజు నాతో మాట్లాడటం నాకు నచ్చలేదు. మీ భార్య కి తప్పకుండా అభ్యంతరం ఉంటుంది కాబట్టి నాకు కాల్ చేయకండి " అని చెప్పింది
"నాకు మాత్రం ఎవరున్నారు నేను మీలాంటి వాడినే ! నా భార్య నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ బాధ్యతలో నన్ను నేను అంకితం చేసుకుని ఇష్టమైన వ్యాపకాలు కొనసాగిస్తూ జీవితం గడుపుతున్నాను " అని చెప్పాడు
కుమద ఆశ్చర్య పోయింది " ఇద్దరు బిడ్డల తల్లి. ఎంత బలమైన కారణాలు లేకుంటే బిడ్డలని కూడా కాదని వెళ్ళిపోతుంది ? కారణాలు ఏమైనా ఆమెని మీరు వెళ్ళి స్వయంగా ఆహ్వానించండి " అని చెప్పింది
అలా కుముద రెండు మూడు సార్లు చెప్పడం ఆతను మౌనం వహించడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. అంతకన్నా తన జోక్యం మంచిది కాదు అన్నట్లు ఊరుకుండి పోయింది. నెలలు గడుస్తున్న కొద్ది వారి రువురి మధ్య చొరవ పెరిగింది. ఏ విషయాన్ని అయినా నిస్సంకోచంగా మాట్లాడుకునే అంత స్నేహం కుదిరి పోయింది.
ఒకనాడు న్యూస్ పేపర్ లో ఒక విషయాన్ని చదివిన కుముద వణికి పోయింది . ఏటేటా పెరుగుతున్న హెచ్ ఐ వి బాధితుల సంఖ్య అని వార్తని చదవగానే ఆమెకి చప్పున సురేష్ గుర్తుకు వచ్చాడు ' ఆ రాత్రి ఫోన్ చేసినప్పుడు మీ నగరంలో హెచ్ ఐ వి ఉదృతి ఎక్కువ ఉంది అని వింటున్నాను, జాగ్రత్త”అంటూ హెచ్చరించింది
ఆతను బిగ్గరగా నవ్వడం వినిపించింది.
"ఎందుకు నవ్వుతారు ?" కినుక ఆమె గొంతులో.
"నా పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధకి " .. అంటూ మళ్ళీ నవ్వాడు . "పర స్త్రీ ల వైపు కన్నెత్తి కూడా చూడను "నమ్మకంగా చెప్పాడు. ఆమె రిలీఫ్ గా ఫీల్ అయింది.
ఒకరోజు చనువుగా అడిగాడు.. "నేను రానా ఇంటికి ?"
ఆమెలో కంగారు. "ఈ సమయం లోనా ? వద్దు ఎవరైనా చూస్తే బావుండదు ".
"మనిద్దరికీ ఇష్టం అయినప్పుడు ఎవరేమి అనుకుంటే మనకెందుకు ? ఇప్పుడే వస్తాను " అడిగాడు
అతనికి అలాంటి ఉద్దేశ్యం కలగడం ఆమె ఊహించనిది . అలాంటి అభిప్రాయాన్ని తుడిచి వేయాలనుకుని "సురేష్ .. నేను చెప్పేది వినవా ? "అభ్యర్ధనగా అడిగింది
"తప్పకుండా వింటాను... చెప్పు బంగారం !"
మన అభిరుచులు, ఇష్టాలు, మనకి కల్గే భావాల పట్ల ఉన్న సారూప్యం మనలని కలిపి ఉంచడానికి ఏ మాత్రం దోహదపడదని నాకు తెలుసు. మనది పరస్పరాకర్షణ ల వలలో చిక్కుకునే వయసు కాదు . వివాహ వైఫల్యంతో బిడ్డలనే ఊపిరి చేసుకుని బ్రతుకున్న వారిమీ. ఎన్ని రాత్రులు మన మన లోపాలను,ఆకాంక్షలను , ఏ ముసుగు వేసుకోకుండా మనసు విప్పి చెప్పుకున్నాం కదా ! . మన మధ్య మన గురించి కన్నా మన పిల్లల భవిష్యత్ గురించి కనే కలలే ఎక్కువ ఉండేవి. సానుభూతి,కరుణ, అవగాహన తో మనం మాట్లాడుకున్న మాటలలో ఒకరంటే మరొకరికి ఉన్న గౌరవాన్ని ఎప్పుడూ అలాగే నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఏమనుకుంటున్నారో మనకి అనవసరం కానీ మనకి మనం అద్దంలో చూసుకుంటున్నట్లు ఉండాలి. ఎలాంటి వికారాలు మన మనస్సులో లేకుండా రానీయకుండా మనం ఉండలేమా? మన మనసులు కలిసి ఉండవచ్చు మీరు కోరుకున్నట్లే మీ సాన్నిహిత్యం కావాలని పదే పదే నా మనసు కోరుకుంటుంది. అది కూడా తప్పే కావచ్చు మీతో సన్నిహితంగా మెలిగితే బావుండునని నా శరీరభాష చెపుతుంది అయినా మనం హద్దులు దాటి స్త్రీ పురుషుల స్నేహాన్ని శరీర సంబంధాల భాషలో చూడటం నాకిష్టం లేదు. నా వరకు నేను నిబద్దత తో ఉండాలని కోరుకుంటాను ఇతరులు అలానే ఉండాలని కోరుకుంటాను, అంతకి మించి ఏమైనా కోరుకుంటే మన ఈ స్నేహానికి అర్ధం ఉండదు. .అని చెప్పి "మీకు నా పై స్నేహం కాని మరొక అభిప్రాయం ఉండి ఉంటే ఆ అభిప్రాయం మార్చుకుంటే మంచిది కూడా" చెప్పేసింది .
"మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరోలా ఉండటం నా వల్ల కాదు" చెప్పాడతను
"నా వల్ల అవుతుంది " ఖండితంగా చెప్పింది. ఒక స్త్రీ -పురుషుడు మధ్య శారీరక సంబంధం లేని స్నేహం ఉండ కూడదా ఏమిటీ ? మీ మగవాళ్ళు అందరూ స్నేహాన్ని అర్ధం చేసుకోలేరూ? ఎక్కడ మొదలెట్టినా స్నేహాన్ని తుదకు శారీరక సంబంధం దగ్గరకే తీసుకువచ్చి ఆపుతారు .. ఛీ ఛీ.. అనుకుని విసుక్కుంది
మనసులో ఇలా అనుకుంది "మీకు పరిచయం ఉన్న ఆడవాళ్ళందరూ, తారసపడిన వాళ్ళందరూ స్నేహాన్ని మీరు కోరుకునే స్థాయికి దించేసి ఆ స్నేహానికి మరో అర్ధం చెప్పవచ్చు . కానీ వారందరి లాంటి దానిని నేను కానే కాదని మీకు తెలియజేయడానికి, అర్ధం కావడానికి చాలా సమయం పట్టవచ్చు. మీకు స్త్రీలందరూ అలా ఉండరని నిరూపిస్తూ.. మీ మనసు, బుద్ది వికసించేటట్లు చేయక పొతే చూడండి అనుకుంది. మనసులో చాలెంజ్ కూడాచేసింది.
పెళ్ళితో ముడిపడని బంధాలేవో వారి మధ్య బలోపేతం చేసుకోవడానికి అతను రంగం సిద్దం చేసుకోవాలని ప్రయత్నించే లోపే సురేష్ కి అతని భార్యకి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి భార్యని భర్తని కలపని దేవుడే లేడని అన్నట్లు వారి కాపురం కుదుట పడింది
వారి సంసార రధం హాయిగా సాగిపోతూనే ఉంది.
అలా నాలుగేళ్ళు గడచి పోయాయి. అప్పుడప్పుడూ నిద్రపట్టని రాత్రులలో భార్య సముఖంలోనే కుముద తో గంటలు తరబడి మాట్లాడటం ఆమె ముందు కుమదని విపరీతంగా మెచ్చుకోవడంని ఆ భార్య మాత్రం ఎలా ఓర్చుకోగలదు ? కుముద తో స్నేహాన్ని, ఆమెకి చేరువకాబోయి వీలుకాక విడివడిన విషయాలని చెపుతుంటే ఆమె జీర్ణించుకోవడం ఎంత కష్టం ? కానీ ఆతనలలాంటివన్నీ పట్టించుకోడని అర్ధం అయ్యాక కుముద అతని ఫోన్ ని లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త పడేది. వీలయితే పగటి పూట నాలుగు మాటలు క్షేమ సమాచారం .. అంతవరకే ! అలా చేయడం వలన అతనికి చాలా అసంతృప్తి ఉండేది.
"ఈ మధ్య నన్ను కావాలని నిర్లక్ష్యం చేస్తున్నావ్ ! " ఆరోపణ.
"లేదు లేదు .. అదివరకు అంటే నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని ఇప్పుడు అలా కాదు ఇంట్లో నాతో పాటు కొందరు ఉన్నారు. వారి మధ్య అర్ధరాత్రుళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏం బావుంటుంది చెప్పండి ? నా వాళ్ళందరూ నా గురించి తప్పుగా ఊహించడం కూడా నేను భరించలేను " వివరణ ఇచ్చింది
నిండు యవ్వనాన్ని ఒంటరితనం తో గడిపేస్తున్నావ్? ఎందుకు అలా నిన్ను నువ్వే శిక్షించుకుంటావ్. జీవితంలో లభించిన కొన్నింటిని అందుకోవాలి. మనసైన మనిషితో సన్నిహితంగా ఉంటే తప్పేమిటి? అతని ప్రశ్న.
సురేష్ ! తప్పు ఒప్పుల సంగతి కాదు .. నేను ఆలోచించేది . నాది కాని పరాయి వస్తువుని నేను కన్నెత్తి కూడా చూడను. అది నాకెంత అవసరమైన వస్తువైనా సరే! మనిషైనా సరే! నన్ను ప్రేమించే మనిషి నాకు మాత్రమే పరిమితమైన మనిషి, నేను ఏడిస్తే అతని కళ్ళల్లో నీరుండాలి, నేను నవ్వితే అంతకన్నా బాగా నవ్వగలగాలి, నేనే అతనై అతనే నేనై బ్రతుకంతా ఇమిడి పోవాలి. కానీ మీరు చెప్పే పార్టిషన్ లైఫ్ నాకు వద్దనే వద్దు, నేను కోరుకునేది ఇవ్వగలిగే అవకాశం ఉంటే చెప్పండి, అప్పుడా లోచిస్తాను " పట్టుదలగా చెప్పింది .
మనం అలాంటి పరిమితమైన సంబంధంలో ఉండే అవకాశం ఇప్పుడు రాదు కదా ! నా కంటూ వేరే జీవితం ఉంది, పిల్లలు ఉన్నారు., ఎలా సాధ్య పడుతుంది చెప్పు?
"అందుకేగా నేను వద్దంటున్నాను" స్థిరంగా చెప్పింది
"నిన్ను చూస్తే జాలివేస్తుంది .. "
“నన్ను చూసి జాలిపడవద్దు వీలయితే తిట్టుకో! ఇంకా పచ్చిగా చెప్పాలంటే దీని చుట్టూ తిరిగే కన్నా వేరేవారి చుట్టూ తిరిగినా వర్కవుట్ అయ్యి ఉండేదని కసిగా తిట్టుకో “ సలహా ఇచ్చింది
ఆతను దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయాడు . ఇంతేనా నన్ను అర్ధం చేసుకుంది ? బాధగా అడిగాడు .
"నిష్టూరంగా ఉన్నా నేనిలాగే మాట్లాడతాను, సారీ సురేష్ ! ఇకపై ఇలాంటి ప్రసక్తి మన మధ్య రాకూడదు" గట్టిగానే చెప్పాననుకుంది కుముద.
సురేష్ కి కుముద పై మునుపటికంటే ఎక్కువ ఇష్టం కల్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్ది సురేష్ లో బలవత్తరమైన కోరిక . భార్యని ఒప్పించి అయినా సరే కుమద కి అతని జీవితంలో స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అది కుముద గుర్తించి పర్యవసానం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పింది
“ సురేష్ ! అంతకు ముందు మీ భార్యాభర్తల మధ్య అపార్ధాలకి కారణమేదో నాకు తెలియదు ఇప్పుడు మీ మధ్య వచ్చే అపార్ధాలకి నేనంత మాత్రం కారణం కాకూడదని నేనో కఠిన నిర్ణయం తీసుకున్నాను. మీ నుండి వచ్చే ఎలాంటి సందేశాన్ని చూడకూడదని, మీ మాట విననే కూడదని నిశ్చయించుకున్నాను. నాకు ఎప్పుడూ కాల్ చేయకండి .. నన్ను కలవాలని ప్రయత్నించకండి” అని చెప్పింది
ఆతను విననట్టే ఉండేసరికి .. ఇంకా వివరంగా చెప్పాల్సి వచ్చింది విసుగ్గా ముఖంపెట్టి గొంతులోకి కాఠిన్యం అరువు తెచ్చుకుని
"ఈ అక్రమ సంబంధాల అవసరమో , అన్ కండీషనల్ లవ్ అవసరమో నాకు లేదు. మీకు అంతగా ఇష్టం అయింది కాబట్టి పెళ్లి చేసుకుని రెండో భార్యగానో లేదా స్టెప్నీ మాదిరి గానో ఉంచుకుంటానంటారు ! అంతేగా ? మీ మగవాళ్ళ ఆలోచనలు ఎన్నటికి మారవు . ప్రేమో , వ్యామోహమో రెండిటికి తేడా తెలియదన్నట్లు బిహేవ్ చేస్తారు . మీ చేతుల్లో మైనం ముద్దగా మారేదాకా అనేక మాయమాటలు చెపుతారు మీకు కావాల్సింది దొరికాక మీ మోజు తీరిపోయాక శీతకన్ను వేస్తారు. ముందు రోజూ ఆడదాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు . తర్వాత తర్వాత పనుల వత్తిడి అంటూ వారానికి ఒకసారి దర్శనం ఇస్తారు, మరి కొన్నాళ్ళకి మోజు తీరిపోయి పూర్తిగా మరచిపోతారు . అందులో ఆయాచితంగా లభించే వొంక ని ఉపయోగిస్తారు, ఇంట్లో తెలిసి పోయింది, గొడవ ఎక్కువైపోయింది అంటూ తెర దించేస్తారు. అంతకి మించి క్రొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి! విని నా నిర్ణయం చెపుతాను" అని నిలబెట్టి దులిపేసింది
కుముద అలా మాట్లాదగలదని ఊహించని సురేష్ అవాక్కైపోయాడు ఆ ఆవేశంలోనే అతనికి ఇంకొన్ని కఠోర సత్యాలు చెప్పింది
ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను సురేష్ ! ఈ సహజీవన బంధంలో మిమ్మల్ని హోల్డ్ చేయగల కెపాసిటీ నా దగ్గర ఉంటే అందుకు బలి అయిపొయ్యేది మీ భార్య పిల్లలు . అలాంటి హోల్డింగ్ కెపాసిటీ నా దగ్గర లేకపోతే నాకే సొంతం కావాలనుకునే నా మరోమనసుని , ఆ మనసు నడిపించే మనిషిని నేను కోల్పోతాను. ఇంకోసారి నన్ను అమితంగా ప్రేమించే మనిషిని , నా మనసుని కోల్పోయి జీవచ్ఛవంలా బ్రతకలేను. ఆ బాధని భరించడం కన్నా మీరు ఆశిస్తున్న బంధంలో మంచి చెడులని బేరీజూ వేసుకుని ఈ ఆశాభంగాన్ని తట్టుకుని బ్రతకడమే నాకిష్టం, నన్ను వదిలేయండి.నా బ్రతుకు నన్ను బ్రతకనీయండి, చేతులు జోడించి వేడుకుంది.
సురేష్ ఏమనుకున్నాడో ఏమో కాని తర్వాతెప్పుడూ కుముదని డిస్ట్రబ్ చేయలేదు.
అతనిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమ నంతటిని గుండెల్లో భద్రంగా దాచుకుని తన జీవితాన్ని తానూ సాధించుకునే పనిలో ఆమె అలసి పోతూనే ఉంటుంది. అతను ఎంత దూరంలో ఉన్నా ఎన్ని ఏళ్ళు గడిచినా తన పట్ల సురేష్ లో ఉన్న అభిమానం లో ఎలాంటి మార్పు లేకపోవడం చూసి బాధపడుతుంది. ప్రేమని, ఇష్టాన్ని ప్రకటించే వారిని ఎవరు మాత్రం కాదనగలరని అనుకుంటుంది కానీ అతన్ని మాత్రం దూరంగానే ఉంచగల్గిన కఠినత్వం అలవాటు చేసుకుంది.
నేను నిన్ను వదలబోను అంటూ అప్పుడప్పుడూ అతని పలకరింపు.చెప్పా పెట్టకుండా హటాత్తుగా ఊడిపడి ఆమెని అలా ఓ,,నిమిష కాలం చూసి వెళ్ళిపోయే చూపు. ఎంత మర్చిపోదామన్నా ఆమెకి గుర్తుకు రాక మానవు, నిట్టూర్పు విడువక మానదు.
.
కట్టువిప్పిన లేగ దూడ తల్లిని వెతుక్కుంటూ పరువులు తీసినట్లు గాఢమైన ప్రేమ నిండిన అతని పలకరింపు తనని అతని దరికి చేర్చుతుందని అంతర్లీనంగా ఆమెలో ఒక భయం . అందుకే ఆ బలహీన క్షణాలకి చిక్క కుండా ప్రేమ సందేశాన్ని మోసుకువచ్చే ఆ ఫోన్ ని గిరాటు కొడుతుంది పట్టువదలని విక్రమార్కుడిలా మరొక ఫోన్ కి ప్రయత్నం చేస్తాడు. కుముద నిర్దాక్షణ్యం గా ఆ మరో ఫోన్ పీక నొక్కుతూనే ఉంటుంది
.
" నా బలం ఏమిటో ,నా బలహీనత ఏమిటో అన్ని తెలిసిన అంతరంగికుడివి. నన్ను అర్ధం చేసుకున్నట్లే ఉంటారు , నాపై జాలి చూపుతారు, మళ్ళీ అంతలోనే వేధిస్తారెందుకు ? అంటూ మనసు మూలుగుతుండగా స్వగతంలో అనుకోబోయి ఒకోసారి పైకే అనేస్తుంటుంది
" మనసునెందుకు అలా చంపేస్తావు ! కోరికల్ని ఎందుకు అలా అణచి పెట్టుకుంటావు" సూటిగా ప్రశ్నిస్తాడతను ".
"మనసా.! గినసా? జానే దో!" అంటుంది నవ్వుతూ
మాట మార్చేయడంలో ఒక పట్టభద్రురాలివని కితాబునిస్తాడు .
" మాట కోసం మనిషిని, ఇతరుల కోసం వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన మనసు నీది కదా ! నీ గురించి నా కన్నా ఎవరికీ తెలుసు నేను కూడా అలా వదిలేస్తే ఎలా? అంటూనే . నీకున్న స్వేచ్చ ఎవరికైనా ఉండి ఉంటే లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేసి ఉండేవారో .. !! అని నిష్టూరం ఒలికిస్తాడు.
"ఇదంతా నా మీద ప్రేమ నంటావా? ప్రేమ మాత్రమే కాదని అంతకు మించి ఆసక్తి ఉందని నాకు తెలుసులే! " ఆట పట్టిస్తుంది
" నీకు తెలుసునని నాకూ తెలుసు అయినా ఇద్దరం విడి విడిగా ఉండటం కూడా తెలుసు " అంటాడు.
మళ్ళీ అంతలోనే మనం ఒకరినొకరు మోసం చేసుకోవడం లేదు కదా ! తీరని కోరికలు ఉంటే ఆత్మ శాంతించదంట చనిపోయాక కూడా దెయ్యమై ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటూ పీక్కు తింటావు జాగ్రత్త ! అని నవ్వుతూనే బెదిరిస్తూ ఉంటాడు ఆఖరి రాయి వేస్తున్నట్లూ గా ...
"నేను దెయ్యాన్ని కాదు, కాను కూడా .. లైఫ్ టైమ్ ఫుల్ ఫిల్ హాపీ " అంటూ సమర్దించుకుంటుంది
"ఎందుకు కాదు గుర్తుకువచ్చినప్పుడు దేవతలా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటావు. చికాకులలో ఓదార్చే మనసైన స్నేహితురాలివి అనిపిస్తావ్, నిద్రని చెడ గొట్టినప్పుడు దెయ్యంలా కనిపిస్తావు." గట్టిగా నవ్వుతూ . నిజం చెప్పేస్తాడు
స్త్రీ -పురుషుల మధ్య ఇలాంటి ఆకర్షణలు లేకుంటే ఈ సృష్టి రహస్యానికి అర్ధమే ఉండేది కాదు నిబద్దత , కట్టుబాట్లు లేకుంటే ఈ కుటుంబ జీవనానికి అంతకన్నా విలువ ఉండేది కాదు కదా! ఎవరైనా ఎక్కడైనా ఏది ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెదుక్కోవడం మంచిది మరొక చోట వెదుక్కుంటే కొన్నాళ్ళకి అశాంతి తప్ప ఏది మిగలదు అనుకుంది సురేష్ ని గుర్తుచేసుకుంటూ కళ్ళల్లో నీళ్ళని జారనీయకుండా జాగ్రత్త పడుతూ.
నేస్తమా ! నిరాశ,తమస్సులని తడచిన కనురెప్పల మధ్య దాచేస్తే ,
పూడిపోయిన గొంతు వెనుక హృదయ వేదనని, రోదనని మాటేస్తే
మాట మౌనం అవుతుంది. మనసు పాట పల్లవిస్తుంది
చేరెదెటకో తెలిసి
చేరువ కాలేమని తెలిసి ...
చెరిసగమైనామెందుకో....
20 కామెంట్‌లు:
హ్మ్!.. ఎవరి హద్దులు, బాధ్యతలు వారు తెలుసుకొని, అందులోనే ఉండిపోతే అందరికీ మంచిది. అలాగే ఇతరులు మనతో స్నేహాన్ని హాయిగా వారి కుటుంబ సభ్యులతో కలసి ఆస్వాదించగలగాలి. అందులో పొరపొచ్చాలు ఉండకూడదు. అన్నింటికన్నా నమ్మకం అనేది పోకూడదు. ఇతరుల అంతరంగిక జీవితం మన పరిచయం వల్ల కలుషితం అవబోతుందీ అంటే - ఆ పాపం మూటగట్టుకోక, వారి ఉసురుతగలక ముందే దూరం జరిగినది బెస్ట్. జీవితాంతం కలిసుండాల్సింది వారు.
రాజ్ గారు మీ స్పందనకి ధన్యవాదములు . మీ వ్యాఖ్య తో ఎకీభవిస్తాను. కథ లో ముగింపు కూడా అదే చెప్పింది. థాంక్యూ సో మచ్
జలతారు వెన్నెల గారు మీ అభిప్రాయానికి స్వాగతం . ఆకర్షణ అని దేనిని అంటారో ..అది ప్రేమే అనుకుని భ్రమ పడతారో చక్కగా చెప్పారు . కవుల బాష రచయితల బాష కి ప్రేమంటే ఏమిటో సరిగ్గా తెలియదు అనుకుంటాను . నాకు కూడా తెలియనట్లే ఉంది. :)
వనజ గారు మీరు ఈ కథ కి పెట్టిన టైటిల్ చాలా బాగుంది. ముగించిన తీరు కూడా బాగుంది.
వనజగారు, పేరు చాలా బాగా పెట్టారు. కథని కూడా చాలాబాగా ముగించారు. కుముద పాత్రలోని రకరకాల సంఘర్షణలు బాగా చూపించారు. జలతారు వెన్నెలగారు చెప్పినట్టు ప్రేమకి ఆకర్షణకి తేడా ఉంది. అది ఒడ్డున నిల్చుని చెప్పేవారికి తెలుస్తుంది. ప్రేమ అనుకుంటూ ఆ భావనలో నిలువు లోతున నిలబడిఉన్నవారికి మాత్రం తమ భావం ప్రేమలాగే అనిపిస్తుంది. కుముద పాత్రకి సంబంధించినంతవరకూ ఆమె దానిని ప్రేమ అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీలేదు. కథలో మొబైల్ లో మాత్రమే పరిచయం అన్నట్టుగా లేదే...ఓసారి చదవండి మళ్ళీ.
ఏంటో అర్ధం కాలా :)
సుధ గారు .. కథ నచ్చినందుకు సంతోషం, మీరన్నట్టు ప్రేమ కి ఆకర్షణ కి తేడా ఒడ్డున ఉన్నవాళ్ళకే తెలుస్తుంది . కథలో ఇద్దరికీ ముఖాముఖీ పరిచయం ఉంది ఽది కూడా ఏళ్ళ తరబడి . కతా శీర్షిక నచ్చినందుకు థాంక్ యూ ! కుముద పాత్ర చిత్రణ నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు .
కష్టే ఫలే మాస్టారూ .. మీకు అర్ధం కాలేదు అంటే నేను బాగా వ్రాయలేదేమో ! :)
ఇలాంటి ఆకర్షణ ప్రేమలు చాలా జరుగుతుంటాయి. సమీర్ లాంటి వాళ్ళు ప్రేమను శారీరక సంబంధం అనుకుంటారు. అందుకే అమ్మాయిలందరూ కుముద లాగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, సమీర్ లాంటి నక్కజిత్తుల వలలో పడకుండా ఉంటారు. కథ చాలా బాగుంది వనజ గారు. కుముద పాత్ర నాకు బాగా నచ్చింది.
ఒంటరి మహిళలకి ఏదో ఒక రూపంలో పురుష పరిచయాలు ఉంటాయి కదండీ ! ఆ పరిచయాన్ని ఆలింగనం చేసుకోవడానికి వేనుకాడుతూ కాస్త విజ్ఞత తో నడుచుకునే స్త్రీ గా "కుమద" ని బాగా తీర్చి దిద్దారు. కథ చాలా బావుంది. సంభాషణలు కత్తి లా గ్రుచ్చుకునేటట్లు బావున్నాయి టైటిల్ చాలా బావుంది.
చేరెదెటకో తెలిసి
చేరువ కాలేమని తెలిసి ...
చెల్లని ప్రేమను చాటుకు నెట్టి
చల్లని మమతను పిల్లల కిచ్చి
చెల్లిపోతే కాలమే
చాలదా అది ఈ జన్మకీ...
శ్రీ లలిత గారు మీ వ్యాఖ్య నాకు ఎంత బాగా నచ్చిందో! చాలా బాగా చెప్పారు . ధన్యవాదములు . మీ వ్యాఖ్యని మన ఫ్రెండ్ ఒకరు బాగా మెచ్చుకున్నారు. మీ అభిప్రాయంతో ఏకీభవించే ముగింపు ఉంది కాదా! :)
కాయల నాగేంద్ర గారు .. కథ నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు
కుముద పాత్ర నచ్చినందుకు ధన్యవాదములు.
ఓపికగా కథని చదివి వ్యాఖ్య ద్వారా అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములు
వైష్ణవి కథ నచ్చినందుకు ధన్యవాదములు . అప్పుడప్పుడూ ఎదో ఇలా వ్రాస్తూ ఉంటాను :)
చక్కగా రాసారు:) Interesting
అనూ .గారు కథ నచ్చినందుకు ధన్యవాదములు.
చేరేదెటకో తెలిసి... చేరువ కాలేమని తెలిసి...
చెరిసగమయినామందుకో....
ఓ ఓ ఓ తెలిసి తెలిసి తెలిసి
కలవని తీరాల నడుమ కలకల సాగక యమునా
వెనుకకు తిరిగి పోయిందా మనవు గంగతో మానిందా ఆ
ఊ ఊహూ ఊహూ
చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి
చెరిసగమయినామందుకే ఏ ఏ ఏ తెలిసి తెలిసి తెలిసి
.....
కుముద పాత్రలోని సంఘర్షణ, వ్యక్తిత్వాలను బలంగా ప్రతిబింబించేలా ఉంది మీ కథనం వనజగారూ...
నాకు బాగా నచ్చిందండీ... :) మీ రైటింగ్ స్టైల్ కూడా సింప్లీ సూపర్బ్....
శోభ గారు .. కథ నచ్చినందుకు ధన్యవాదములు. సాంగ్ ని భలే పట్టేసారే!! థాంక్యూ..
మీ వ్యాఖ్య కి మరీ మరీ ధన్యవాదములు
(పూర్తిగా అర్ధం చెసుకొ లేకపొయా మీ పోస్ట్ ని...మళ్లీ చదవాలి తీరిగ్గా..)
హెల్లో సార్..బాగున్నారా అనే మగాడే బయటకు..ప్రపంచానికి కనబడతాడు...నిజానికి ప్రేమ విషయం లొ ఈ ప్రపంచం లోని మగాళ్లంతా...ఏ ఒక్కరూ మినహాయింపులేకుండా...ఒక్కటే...
దూరంగా ఉన్నపుడు ఏమయినా... రేర్ గా చాలా కొద్ది మంది...ఆ స్త్రీ పై... ఆరాధనా భావం కలిగిఉంటారేమో గానీ...దగ్గరయ్యాక మాత్రం ...దుష్త శక్తే బయటపడేది...ఎందుకంటే అదే మగాడి నిజరూపం కాబట్టి...మగాళ్లలో ప్రేమ శూన్యం.....ప్రేమ ని అనుభవించె అదృష్టం మగాడికి లేదు...వాడి ఖర్మ!!!
kvsv గారు మీ వ్యాఖ్య నచ్చింది థాంక్ యూ సర్ !
కామెంట్‌ను పోస్ట్ చేయండి