18, జూన్ 2013, మంగళవారం

తెలుగు తెగులు వెలుగు చోటు

డాడ్ .. డాడ్ .. అంటూ పిలుస్తూ .. "మే ఐ కమిన్" అంటూ అనుమతి కోసం గుమ్మం దగ్గర నిలబడ్డాడు హర్ష.

కమిన్ ... అంటూ అనుమతి ఇచ్చాడు తండ్రి.

"మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను" సమయం ఉందా అన్నట్టు చూసాడు.

"చెప్పు" . అన్నారు మిస్టర్ రావు

పక్షులు ఏ భాష మాట్లాడతాయి ?

"పక్షుల భాష "

"జంతువులూ" ?

"జంతువుల భాష "

మనం మన భాషలోనే అంటే మన మాతృ భాషలో యె౦దుకు మాట్లాడం ?

ఆంగ్లంలోనే మాట్లాడుతూ ఆంగ్లేయుల మధ్య బ్రతుకుతూ ఆంగ్లమునే శ్వాసిస్తున్న ఆ తండ్రికి కొడుకు ప్రశ్నతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.
మీరు,అమ్మ యిరువురు కూడా మన మాతృభాష ను నేర్పడం లో అలసత్వం, అల్పత్వం కూడా ప్రదర్శించారు అందువల్ల తెలుగు వాడిగా పుట్టిన నాకు తెలుగు మాట్లాడటం తెలుగు మాట్లాడిన వారి భాష మాకు అర్ధం కాకపోవడం జరుగుతుంది

ముఖ్యంగా ఆంగ్లం యే మాత్రం తెలియని నానమ్మ,తాతయ్యలతో యేమి మాట్లాడలేకపోవడం, వాళ్ళు మాట్లాడినది అర్ధం చేసుకోలేకపోవడం వల్ల మా మధ్య తాతా-బామ్మా మనుమడి అనుబంధం యేమిటో తెలియకపోయింది దగ్గరికి వెళ్ళినప్పుడు నాకర్ధం కాని వాళ్ళ బాషలో యేదో చెపుతూ ఆత్మీయంగా ప్రేమగా తడుముతూ వారి ప్రేమ భాషను  వ్యక్తపరుస్తుంటే వారికి వొట్టి థాంక్స్ మాత్రమే కాకుండా వారిపై నాకున్న ప్రేమని తెలియజెప్పాలనిపిస్తుంది . నేను చెప్పినా వారికి అర్ధం కాదని తెలిసి మూగగా కంటి చూపుతో మాట్లాడి బయట పడటం నాకు సిగ్గుగా ఉంది.నేను వారితో మాట్లాడలేకపోవడం వల్ల యెన్నో కోల్పోయాను.
.
 
పరాయి దేశానికి బ్రతకడానికి వచ్చి మన భాషని మర్చిపోయి వారి భాషనే ఆశ్రయించి మనకి మనమే అన్యాయం చేసుకుంటున్నాం, మన మూలాలు మనం కోల్పోతున్నాం.మీలా అందరూ మాతృ బాషని నేర్పించకుండా నిర్లక్ష్యం చేస్తే .. మంచి అవకాశాల కోసం ఉద్యోగం కోసమో అందరూ ఆంగ్లమే నేర్చుకుంటే... కొన్నాళ్ళకి సవర భాష , ఎరుకల భాష లాగా మన భాష కనుమరుగవడంలో ఆశ్చర్యం లేదు" చిన్న ఉపన్యాసమే యిచ్చాడు హర్ష.
మిస్టర్ రావు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. హర్ష తన మాటలు కొనసాగిస్తూ

ఈ రోజు నుండి నేను తెలుగు తరగతులకి వెళుతున్నాను తెలుగే మాట్లాడతాను, నానమ్మ తాతయ్యలతో రోజు కబుర్లు చెప్పుకోవడానికి తెలుగు నేర్చుకుంటాను అని చెప్పాడు .పాతికేళ్ళ కొడుకు తమ తప్పుని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పడానికి మాటలు రాక మౌనంగా వుండిపోయాడు మిస్టర్ రావ్.
***************************
ఇది నేను వ్రాయబోతున్న ఒక కథలో భాగం
ఈ కథ వెనుక కథ .. అనబడు ఒక విషయం పంచుకోవాలని పించి ఈ పోస్ట్ .
నేను ఆంగ్లంలో బాగా వెనుకబడి ఉంటాను . అంటే అత్తెసరు మార్కులతో యెలాగోలా గండం గట్టెక్కేది . ఆంగ్లం అంటే భయమో లేదా అనాసక్తో తెలియదు కాని తెలుగు అంటే వల్లమాలిన ప్రేమ. (తెలుగు సరిగ్గా రాదనుకోండి :)
మా అబ్బాయితో ఎప్పుడూ దెబ్బలాడే దాన్ని,కనీసం వారానికి వొకసారి అయినా నాకు తెలుగులో ఒక ఇ-ఉత్తరం వ్రాయాలని. నేను కొన్నాళ్ళు రోజూ మా అబ్బాయికి ఇ -ఉత్తరం వ్రాసేదాన్ని. దానికి జవాబుగా మా అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడేవాడు . నాన్నా ! తెలుగు వ్రాయడం చదవడం మర్చిపపోతావేమో ..కాస్త తెలుగు చదువు, వ్రాయి .అంటూ తెగ నస పెట్టేదాన్ని . అబ్బ ఆపమ్మా ... నీ గోల అనేవాడు. మరీ... సోది అంటే నేను బాధపడతానని . పోనీ నా బ్లాగ్ అయినా చదువు బంగారం అని మరో చచ్చు సలహా యిచ్చేదాన్ని. అన్నీ వ్రాయి, నా పిల్లలతో కలసి మా అమ్మ ఇలా వ్రాసింది అని వారికి చూపిస్తూ తీరికగా చదువుకుంటాను, యిప్పుడు తీరిక లేదు అంటాడు 

అలాంటి సమాధానం విన్నప్పుడల్లా అసలు తర్వాత తరం పిల్లలు తెలుగు నేర్చుకుంటారా? పెద్దలు వారికి అంత శ్రద్దగా తెలుగు నేర్పుతారా? వాళ్ళు తెలుగు నేర్చుకోకపోతే నేను నా మనుమడు మనుమరాలితో ఎలా మాట్లాడాలి ? అనే బోలెడు సందేహాలు .

"అమ్మా ! నువ్వు నా దగ్గరికి వచ్చేయమ్మా " అన్నాడు నేను అప్పుడప్పుడు ధారాపాతంగా కార్చే కన్నీరు చూసి .

"వస్తాను ..కానీ నాకు ఆంగ్లం రాదు కదా ! స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు లకి వెళతాను" అన్నాను . "క్లాస్ లకి వద్దులేమ్మా.. హోం ట్యూషన్ పెట్టించుకుని నేర్చుకో! "అని చెప్పాడు .

నేను అలాంటి ప్రయత్నం లోనే ఉన్నాను 
.
పైన కథ కోసం వ్రాసిన సంభాషణ అక్షరాలా నిజం 
.
ఇకపోతే ఇది వ్రాస్తూ నా ఆలోచన మార్చుకున్నాను . నేను ఆంగ్లం నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే నా భావితరాల వారికి తెలుగుని పరిచయం చేసి వారికి తెలుగు నేర్పడం మూలంగా మన భాషకి న్యాయం చేసినట్లు అవుతుంది. నా వారితో నేను నా భాష మాత్రమే మాట్లాడుకోవాలి అని దృఢ నిశ్చయం చేసుకున్నాను
(అయినా నాకు ఈ ఇంగ్లీష్ రాదులే అనుకుంటూ ..వెధవింగ్లీష్ .అనుకుంటూ పుస్తకాలు గిరాటు కొట్టాను) .

మనలో ఒక మాట ..

మన తెలుగు కథల కోసం ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉంది . "కథ గ్రూప్" అని . ఆ వేదిక పై తెలుగు కథ గురించి మూడొంతులు మంది ఆంగ్లం లోనే చర్చలు జరుపుతారు ఆంగ్లం వచ్చి ఉంటే ఆంగ్లంలో అభిప్రాయాలు చెప్పేందుకు నేను తయారుగా వుండేదాన్నేమో ! అక్కడ నాకు ఒక్క ముక్క అర్ధం కాదు. అదంతా తెలుగువారి కోట. ఆ కోటలో ఆంగ్ల పాగా వేసేవాడిదే రాజ్యం అనుకుంటూ తప్పుకుంటాను. మన తెలుగు వాళ్లకి ఆంగ్ల తెగులు బాగా తగిలింది . అది తెలుగుని వూడ్చి పెట్టేస్తుంది. అది ఖాయం అని అనుకుంటూ ఉంటాను.
వలచి విలపించడం అంటే ఇంతే  కదా ! అని అనుకుంటాను .

పై కథ లోని భాగంలా ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారి యింట యిలాంటి సన్నివేశాలు  యెదురుకాకూడదని కోరుకుంటూ .. ప్రవాసాంద్రులు  వారి పిల్లలకి  తెలుగు నేర్పుతూ యితర   దేశీయులకి  నేర్పుతూ  మన మూలాలని మిగుల్చుతున్నందుకు మనస్పూర్తిగా  ధన్యవాదములు తెలుపుతూ

 అవును .. ఈ  టపా కి  యే౦  పేరు పెట్టా లబ్బా  !?
తెలుగు తెగులు వెలుగు చోటు  అనేస్తాను బావుంది కదా!!

(అచ్చు తప్పులుంటే క్షమించాలి)  .

12 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

పిల్లలు చిన్ననాటనే తెలుగు నేర్చుకునేటట్లు చేయడం తల్లిదండ్రుల బాధ్యత!ఆ తర్వాత పెరిగినాక నేర్చుకోవడానికి వారు ఉత్సుకత చూపరు!మాతృభాష బాగా నేర్చుకున్నవారు ఎన్నిభాషలయినా అవలీలగా నేర్చుకోవచ్చు!పట్టుదలగా నేర్చుకుంటే ఆంగ్లంకూడా ఇట్టే అభ్యసించవచ్చు!తెలుగుటపాలలో తెలుగులోనే రాయాలి!ఎక్కడయినా ఆంగ్ల ఉటంకింపులుంటే కోట్ చేయవచ్చును.వనజవనమాలిగారి టపా ఆలోచింపజేసింది.

Sharma చెప్పారు...

చాలా చక్కటి , చిక్కటి ఇతివృత్తం ఇది . నిత్యం దాదాపుగా అందరి యిళ్ళలో నడుస్తున్న చరిత్ర .
అయితే కొన్ని విషయాలు మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి యిక్కడ .
1 ) మనల్ని ఎన్నో ఏళ్ళు పరిపాలించి , చిట్ట చివరకు మనకు స్వాతంత్ర్యాన్ని యిచ్చినవాడు ఆంగ్లేయుడే .
2 ) నిరుద్యోగం మన దేశంలో రాజ్యమేలుతుంటే , అత్యున్నత అవకాశాలకొరకు పరాయి ఆంగ్ల దేశాలకు , కిరాయి వాళ్ళుగా వెళ్ళవలసి వస్తున్నది మనకే .
3 ) ఆ తెలుగు " కధ గ్రూప్ " కోట లో ఆంగ్లం పాగా వేసిందని , వారిదే రాజ్యమని , తెలుగు పూర్తిగా ఊద్చిపెట్టుకుపోతుందని అన్నారు , ఆంగ్ల తెగులు పట్టుకున్నదని .

ఏ తెగులు పట్టుకున్నా వారు చర్చిస్తున్నది , వ్రాయాల్సింది తెలుగు కధలనే గదా ! కాకుంటే మనకు ఆంగ్లం తెలియనంత మాత్రాన , అపోహ పడకూడదు . రుచి చూడకుండా ఇది చేదుగా ఉన్నది , అది తియ్యగా ఉన్నదని చెప్పటం కరెక్ట్ కాదేమో .
4 ) అన్ని భాషలూ సంస్కృతం నుంచే పుట్టాయని అనగా వినటం జరిగింది . ఎవరు ఏ మాత్రం ఒకటే భావాన్ని రకరకాల భాషలలో సంభాషించుకుంటుంటారు . దిగితే గాని లోతు తెలియదంటుంటారు . వాస్తవానికి ప్రతి భావం తీయగా వున్నట్లే , భాష కూడా తీయగానే వుంటుంది అని మనం భావించటం మంచిది .
5 ) నాకూ కాన్వెంట్ పిల్లవాడికి వచ్చినంత కూడా రాదు . అంత మాత్రాన పరాయి భాషలు మంచివి కావు అని అనలేను కదా ! ఎందుకంటే ఆ భాషలలోని రమ్యత నాకు తెలియదు కనుక .

మీరు మన తెలుగు వారు మాతృభాష మరచిపోకూడదు అన్న సలహా , మీ కధ నాకు నచ్చాయి .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శర్మ గారు మీ వ్తయాఖ్యకి ధన్యవాదములు. ఏ బాష అయినా రుచి చూస్తే మాధుర్యం గానే ఉందవచ్చు. నేను ఇతర భాషలని చులకన చేయలేదు. కానీ మన పిల్లలు కూడా మన మాతృబాషకి దూరమ్ అవుతున్నారు అని బాధ.
అలాగే కథల విషయం తెలుగు కఠ గురించి చర్చించేటప్పుడు ఆంగ్లంలోఎందుకు చర్చించాలి? వారేమి మాట్ర్ బాష రానివారు కాదు. వారి ఆంగ్ల చర్చలవల్ల పూర్తి ప్రయోజనం అయితే రాదు కదా అన్నది నా ఉద్దేశ్యమే తప్ప మరొక వ్యాఖ్యానం అయితే మాత్రం కాదు . బహుశా నా ఠపాని మీరు సరిగా అర్ఢం చేసుకోలేకపొయారేమో..మన్నించండి

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సsurya prakash apkari గారు మీ స్పందనకి ధన్యవాదములు. మీరన్నది నిజం అండీ ఉత్సుకత ఉంటె వయసుతో నిమిత్తం లెకుందా ఏ బాష అయినా నేర్చుకోవచ్చు.

జలతారు వెన్నెల చెప్పారు...

నిజమే, పిల్లలకి తెలుగు భాష నేర్పటం కంటే, ఫ్రెంచ్,స్పానిష్ నేర్చుకుంటే ఉపయోగపడుతుంది కదా అన్న అలోచనా దోరణిలోనే ఉన్నావేమో! ఒకవేళ అక్షరాలు దిద్దించి , చదవటం నేర్పినా, మాకు తెలుగు చదవటం,కొద్దిగా రాయటం వచ్చు వరకేనేమో! అయినా గుడ్డిలో మెల్ల, ఏదో ఒకటి తెలుగు నేర్చుకుంటున్నారు అనుకోవటమే...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు .. :) ఈ రోజు నిద్ర లేచిన దగ్గర్నుండి నిజాలు విని జీర్ణించుకోలేక అవస్తపదుతున్నాను. మీ మాటలలొ నిజాన్ని పట్టేసాను. ధన్యవాదములు.

చెప్పాలంటే...... చెప్పారు...

మీ టపా చదివితే నాకు నా ఇంజనీరింగ్ మొదటి సంవత్సతం గుర్తు వచ్చింది... తెలుగు తప్ప మరో భాష రాని నేను కన్నడ 12 రోజుల్లో నేర్చుకున్నా తప్పలేదు నాతోపాటు ఉన్న అమ్మాయిలకి తెలుగు తెలియదు... తరువాత వాళ్లకి చక్కగా తెలుగు నేర్పెసాను అనుకోండి మీ ఆలోచనే కరక్ట్ వనజ గారు

శశి కళ చెప్పారు...

akkada antha english lo vaadistharu.nijam

అజ్ఞాత చెప్పారు...

ముందుగా మీ మంచి టపాకి నా అభినందనలు.
మా మేనత్త కూతురు పిల్లల కోసం మొన్ననే తెలుగు పుస్తకాలు కొన్ని రెండు పదాల మాటలవి అమెరికాకు పంపాను. తను కోల్కత్తాలో పెరిగి అమెరికాలో సెటిల్ అయ్యినా పిల్లలతో తెలుగు లోనే మాట్లాడుతుంది. ప్రతీ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడకు తెస్తుంది. తను బెంగాలీని పెళ్ళిచెసుకోవడం వల్ల అదీ నేర్పిస్తోంది.
నా స్నేహితుల్లో నేను ఒక్కదాన్నే తెలుగు ప్రధమ భాషగా తీసుకుంది. అందరూ హిందీ లేదా స్పెషల్ ఇంగ్లీషే. ముందు తెలుగు వచ్చినా కూడా తమ పిల్లలకు నేర్పని తల్లితండ్రులని అనాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పదు, జీవనోపాధి కోసం. కానీ మాతృభాష నేర్చుకున్న తరువాతే మిగిలినవి. ఇప్పటికీ బ్లాగులని చూస్తూ, నేను పద్యాలను అర్థం చేసుకునేంత తెలుగు నేర్చుకోలేకపొయానే అని బాధ పడుతూ ఉంటాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Thank you All

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Manju Garu @ SaSi Garu @ Anu Garu mee andari spandanaki mee vyakhyalaki dhanyavaadamulu

ranivani చెప్పారు...

వనజగారూ మీ టపా ఆలస్యం గా చదివానండీ .నేటి తెలుగు తల్లుల అశక్తతను బాధను ,మీ టపా ద్వారా బాగా తెలియచేశారు .మంచివిషయాన్ని మరోసారి మననం చేసుకొన్నాం .మనవలకు తెలుగు నేర్పాలన్న మీ ఆశ,ఆశయం తప్పక నెరవేరాలని అనుకుంటన్నాను