తెలుగు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జూన్ 2021, శుక్రవారం

మన మూలాలు మన భాష

 చిన్నితల్లి ముచ్చట్లు

చిన్ని తల్లికి 15 వ మాసం నడుస్తుంది. నీలాలనింగిని అబ్బురంగా చూడటం యెగిరే పక్షులను చూసి ముఖం చాటంత చేసుకుని సంతోషంగా నవ్వడం వెళుతున్న విమానాలను చూస్తూ వాటి శబ్దాన్ని వింటూ జంకుగా మూతిముడుచుకుని చూడటం చేస్తుంది. 

అమ్మమ్మ తాతయ్య లను చూసి... దా.. దా.. అని పిలిచి చేయి పట్టుకుని .. ఆరుబయట పచ్చని పచ్చికపై చెప్పులు లేని చిన్ని చిన్ని పాదాలతో గజ్జలు ఘల్ ఘల్  మంటూండగా వేగంగా అటునిటు తిరగడం తల్లికి యిష్టంగా మారింది.  పెరటితోటలో విరిసిన పూలను కన్నార్పకుండా చూస్తూ వుంటుంది. రెండక్షరాల పదాలు పలుకుతుందీ చిలక. వాళ్ళమ్మ శ్రద్దగా నేర్పుతుంటుంది

ఇంతకు ముందే తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం, ఏల వచ్చెనమ్మ కృష్ణుడు యేల వచ్చెను శ్రద్దగా.. ఆసక్తిగా యిష్టంగా చూస్తుంది.  పిల్లకి సంగీత రసజ్ఞత కూడా వుంది. రిథమిక్ గా అపాదమస్తకం కదిలిస్తూ వుంటుంది కూడా.  

 మా మనుమరాలి కోసం కోడలు అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు (పంచతంత్రం తో సహా) ఆర్డర్ పెట్టి ఇక్కడ డెలివరీ ఇచ్చేవిధంగా కొనుగోలు చేసింది. ఇదేంటి ఇందులో తెలుగు పుస్తకాలు ఏవి అన్నాను ఆశ్చర్యపోయి. అక్కడమ్మాయే కదండీ.. అందుకే ఆ భాష అన్నారు మా చిన్న వియ్యపురాలు వియ్యంకుడు. లేదు అని ఇంగ్లీషు లో అరిచాను.. నా మనమరాలు పుట్టుకతోనే రచయిత అనుకుంటున్నాను.నాలా కవి కథకురాలు అవ్వాలి.. తెలుగు రాకుంటే ఎలా (అని అరిచేసాను కరిచేసాను అనుకునేరు అలా చేయకుండా  ) అని నెమ్మదిగా అన్నాను. ఎయిర్ పోర్ట్ కనుక  మనసులో అనుకున్నది బిగ్గరగా చెప్పడం బాగోదని అలా నెమ్మదిగా వున్నాను కానీ గొంతులో తీవ్రత అణిగేది కాదు. మరి జరగబోయేది అలాంటి అవమానమని నా భావన భావ వుద్వేగం కూడానూ. క్షణకాలం భవిష్యత్ అలాగే వుంటుందేమో అని భయం పట్టుకుంది కూడా.  

విమానాశ్రయం నుండి తీసుకువెళ్ళే సామాను ఎక్కువ బరువు వుండటం వల్ల పుస్తకాలు వెనక్కి వచ్చాయి. దాదాపు పన్నెండు కిలోలు. అవి ఎపుడో అపుడు వెళతాయి కానీ.. మా కోడలు  “చిన్నితల్లి” కి 56 అక్షరాలను అక్షరం అక్షరం విడదీసి ఉచ్చారణ స్పష్టంగా వుండే రీతిలో సరైన పెదవుల కదలికతో  పలకడం నేర్పుతుంది. బుడ్డది  తదేకంగా వాళ్ళ అమ్మ నోటి వొంకే చూస్తూ.. వుంటుంది. కొంచెం విరామం తర్వాత ఆ పదం పలికే ప్రయత్నం చేస్తుంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నా.  తెత్తు (చెట్టు) అంటుంది. నా ఆనందం అంతా యింతా కాదు. నా ఆనందం నాది.  ప్రకృతి ప్రేమికురాలిని కదా మరి.

అమ్మ నాన్న తో సహా అన్ని  పిలుపులూ మాతృభాష లోనే.  నేను నా కొడుకుకి “నాన్న గారూ” అని పిలవడం నేర్పించాను. ఎందుకో ఆ పిలుపు మనసులకు దగ్గరగా కాకుండా దూరంగా అయినట్టు  గంభీరమైన భావన కల్గించినదని అనుభవంలోకి వచ్చాక.. మనుమరాలితో “నాన్న” అని పిలిపించి  ఈ పిలుపే మధురంగా వున్నట్టు భావన కల్గుతుందని అనుకుంటాను. 

నా మనుమరాలు యెన్ని భాషలైనా నేర్చుకోనివ్వండి కానీ మాతృభాష పై బాగా పట్టుండాలని మన భాషను చదవడం వ్రాయడం కూడా బాగా రావాలని నా ఆకాంక్ష. నా రచనలు చదవగల్గే విధంగా చదివితే చాలని అనుకోవడం స్వార్దం అవుతుంది కానీ మన తెలుగు మాండలికాలన్నీ చదివి అర్దం చేసుకోవాలనే అత్యంత ఆశ కూడా. 


పిల్లల పెరుగుదల   అమ్మమ్మ  నానమ్మలూ తాతయ్యలతో వుండాలి. అది తల్లిదండ్రుల శ్రద్దను బట్టి వుంటుంది. వారు మాతృభాషతో అవసరం ఏముంటుంది అనుకుంటే పిల్లలకు పెద్దలతో అనుబంధం వుండదు. యాంత్రికమైన తరాలు మారుతుంటాయి. “Roots” నవలను మనమెందుకు ఇష్టపడుతున్నాం, మెక్సికన్ సంస్కృతికి మనకు బోలెడు పోలికలు వున్నాయని ఎందుకు సంబరపడుతున్నాం? భారతీయులందరూ ఎక్కువగా ఒకే కమ్యూనిటిలో వుండాలని ఎందుకు ఆరాట పడతారు? కొత్తచోట మన వాళ్ళను చూస్తే ఎందుకు సంబరపడతాము.. వీటికి అర్దం తెలుసుకోగల్గితే మనం కోల్పోయిన విలువ తెలుస్తుంది. ప్రపంచదేశాలు అవలీలగా చుట్టగల్గిన వారు మన భాష కోసం తపన పడుతున్నారు. వేదన పడుతున్నారు తప్పిదాలను తల్చుకుని. అనుబంధాలు శూన్యం కాకపోవచ్చు కానీ భాష అనే వారథి సాంస్కృతిక పెన్నిధి కదా!

నా మనుమరాలు బాగా గడగడా చదివే కాలానికి తమిళనాడులో కూడా తెలుగు భాషకు ఇతర దక్షిణాది భాషలకూ ప్రాముఖ్యతనివ్వాలని యిప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న  నిర్ణయాలు ఆదేశాలూనూ అంతకు ముందే ఆస్ట్రేలియా దేశంలో తెలుగు ను ఇంకొక భాషగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించి ఆదేశాలను జారీ చేసి అమలులోకి వచ్చిన సంగతి గుర్తొచ్చి.. హమ్మయ్య (అమ్మయ్య సరైనది అనుకుంటున్నాను) మన మాతృభాష కు వెలిగిపోయే రోజులు వచ్చేసాయని సంతృప్తి పడుతున్నాను.

‘అమ్మలాంటి కమ్మనైన గంగిగోవు పాలనొదిలి ఖరము పాల కొరకు ఇంగిలీషు షోకు వెంట  ఈ పరుగులెందుకు?''  అనకూడదు కదా.. అక్కడ పుట్టిన వారిని మనలా వుంచాలనుకునే వుండాలనుకుని చేసే ప్రయత్నాలన్నీ మన మూలాలను మర్చిపోనివ్వకుండా చేసే ప్రయత్నాలే.

అప్రయత్నంగా..   ఇప్పటికిపుడే నా మనమున పెదవుల పలికిన  లలితా చాలీసాలో వొక పాదము”శ్వేత వస్త్రము ధరియించి, అక్షర మాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞాన జ్యోతిని నింపితివి”

 నేర్చుకున్న యే అక్షరమైనా అది యే భాషైనా అమ్మ కరుణతోనే కదా! శ్రీ మాత్రే నమః 🙏

ప్రస్తుతం నాయనమ్మ లోకం  అంతా చిన్నితల్లి చుట్టూరా.. నే!


4, అక్టోబర్ 2019, శుక్రవారం

తెలుగు లెస్స

క్రీస్తుశకం 1515వ సంవత్సర ప్రాంతం.  కృష్ణదేవరాయలు కొండవీడు జయించాడు. కృష్ణానదికి కుడివైపున సైన్యాన్ని మొహరించి  కృష్ణానదిని దాటి కొండపల్లిని ముట్టడించాలని ప్రయత్నిస్తున్నాడు.
కంజీవరం ప్రాంతం నుండి తరిమివేయబడిన  కళింగాధిపతి కపిలేశ్వర గజపతి కొండపల్లిలో కేంద్రీకరించి వున్నాడు. రాయల సైన్యం అమరావతి నుండి ఉండవల్లి కొల్లూరు వరకు విస్తరించి వుంది 

రహస్యంగా ఒక సామాన్యమైన మనిషిలా రాయలవారు శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణుదేవాలయ సందర్శనకు వచ్చాడు. (దేవుడు లంక ) అప్పుడు కృష్ణలో వెన్నెలలో  నదీ విహారం చేస్తూ... 

కృష్ణమ్మను కీర్తించాడిలా.. 

సహ్యగిరి శిఖరాన 
శ్రీ కృష్ణ రూపాన 
కృష్ణమ్మ పుట్టింది 
ముందుకే సాగింది 

పరమేశు అంశాన 
వేణమ్మ పుట్టింది 
కృష్ణమ్మతో  కలిసి
కృష్ణవేణయ్యింది 

ముందుకే సాగింది 
ముచ్చట్లు పోయింది 






18, జూన్ 2013, మంగళవారం

తెలుగు తెగులు వెలుగు చోటు

డాడ్ .. డాడ్ .. అంటూ పిలుస్తూ .. "మే ఐ కమిన్" అంటూ అనుమతి కోసం గుమ్మం దగ్గర నిలబడ్డాడు హర్ష.

కమిన్ ... అంటూ అనుమతి ఇచ్చాడు తండ్రి.

"మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను" సమయం ఉందా అన్నట్టు చూసాడు.

"చెప్పు" . అన్నారు మిస్టర్ రావు

పక్షులు ఏ భాష మాట్లాడతాయి ?

"పక్షుల భాష "

"జంతువులూ" ?

"జంతువుల భాష "

మనం మన భాషలోనే అంటే మన మాతృ భాషలో యె౦దుకు మాట్లాడం ?

ఆంగ్లంలోనే మాట్లాడుతూ ఆంగ్లేయుల మధ్య బ్రతుకుతూ ఆంగ్లమునే శ్వాసిస్తున్న ఆ తండ్రికి కొడుకు ప్రశ్నతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.
మీరు,అమ్మ యిరువురు కూడా మన మాతృభాష ను నేర్పడం లో అలసత్వం, అల్పత్వం కూడా ప్రదర్శించారు అందువల్ల తెలుగు వాడిగా పుట్టిన నాకు తెలుగు మాట్లాడటం తెలుగు మాట్లాడిన వారి భాష మాకు అర్ధం కాకపోవడం జరుగుతుంది

ముఖ్యంగా ఆంగ్లం యే మాత్రం తెలియని నానమ్మ,తాతయ్యలతో యేమి మాట్లాడలేకపోవడం, వాళ్ళు మాట్లాడినది అర్ధం చేసుకోలేకపోవడం వల్ల మా మధ్య తాతా-బామ్మా మనుమడి అనుబంధం యేమిటో తెలియకపోయింది దగ్గరికి వెళ్ళినప్పుడు నాకర్ధం కాని వాళ్ళ బాషలో యేదో చెపుతూ ఆత్మీయంగా ప్రేమగా తడుముతూ వారి ప్రేమ భాషను  వ్యక్తపరుస్తుంటే వారికి వొట్టి థాంక్స్ మాత్రమే కాకుండా వారిపై నాకున్న ప్రేమని తెలియజెప్పాలనిపిస్తుంది . నేను చెప్పినా వారికి అర్ధం కాదని తెలిసి మూగగా కంటి చూపుతో మాట్లాడి బయట పడటం నాకు సిగ్గుగా ఉంది.నేను వారితో మాట్లాడలేకపోవడం వల్ల యెన్నో కోల్పోయాను.
.
 
పరాయి దేశానికి బ్రతకడానికి వచ్చి మన భాషని మర్చిపోయి వారి భాషనే ఆశ్రయించి మనకి మనమే అన్యాయం చేసుకుంటున్నాం, మన మూలాలు మనం కోల్పోతున్నాం.మీలా అందరూ మాతృ బాషని నేర్పించకుండా నిర్లక్ష్యం చేస్తే .. మంచి అవకాశాల కోసం ఉద్యోగం కోసమో అందరూ ఆంగ్లమే నేర్చుకుంటే... కొన్నాళ్ళకి సవర భాష , ఎరుకల భాష లాగా మన భాష కనుమరుగవడంలో ఆశ్చర్యం లేదు" చిన్న ఉపన్యాసమే యిచ్చాడు హర్ష.
మిస్టర్ రావు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. హర్ష తన మాటలు కొనసాగిస్తూ

ఈ రోజు నుండి నేను తెలుగు తరగతులకి వెళుతున్నాను తెలుగే మాట్లాడతాను, నానమ్మ తాతయ్యలతో రోజు కబుర్లు చెప్పుకోవడానికి తెలుగు నేర్చుకుంటాను అని చెప్పాడు .పాతికేళ్ళ కొడుకు తమ తప్పుని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పడానికి మాటలు రాక మౌనంగా వుండిపోయాడు మిస్టర్ రావ్.
***************************
ఇది నేను వ్రాయబోతున్న ఒక కథలో భాగం
ఈ కథ వెనుక కథ .. అనబడు ఒక విషయం పంచుకోవాలని పించి ఈ పోస్ట్ .
నేను ఆంగ్లంలో బాగా వెనుకబడి ఉంటాను . అంటే అత్తెసరు మార్కులతో యెలాగోలా గండం గట్టెక్కేది . ఆంగ్లం అంటే భయమో లేదా అనాసక్తో తెలియదు కాని తెలుగు అంటే వల్లమాలిన ప్రేమ. (తెలుగు సరిగ్గా రాదనుకోండి :)
మా అబ్బాయితో ఎప్పుడూ దెబ్బలాడే దాన్ని,కనీసం వారానికి వొకసారి అయినా నాకు తెలుగులో ఒక ఇ-ఉత్తరం వ్రాయాలని. నేను కొన్నాళ్ళు రోజూ మా అబ్బాయికి ఇ -ఉత్తరం వ్రాసేదాన్ని. దానికి జవాబుగా మా అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడేవాడు . నాన్నా ! తెలుగు వ్రాయడం చదవడం మర్చిపపోతావేమో ..కాస్త తెలుగు చదువు, వ్రాయి .అంటూ తెగ నస పెట్టేదాన్ని . అబ్బ ఆపమ్మా ... నీ గోల అనేవాడు. మరీ... సోది అంటే నేను బాధపడతానని . పోనీ నా బ్లాగ్ అయినా చదువు బంగారం అని మరో చచ్చు సలహా యిచ్చేదాన్ని. అన్నీ వ్రాయి, నా పిల్లలతో కలసి మా అమ్మ ఇలా వ్రాసింది అని వారికి చూపిస్తూ తీరికగా చదువుకుంటాను, యిప్పుడు తీరిక లేదు అంటాడు 

అలాంటి సమాధానం విన్నప్పుడల్లా అసలు తర్వాత తరం పిల్లలు తెలుగు నేర్చుకుంటారా? పెద్దలు వారికి అంత శ్రద్దగా తెలుగు నేర్పుతారా? వాళ్ళు తెలుగు నేర్చుకోకపోతే నేను నా మనుమడు మనుమరాలితో ఎలా మాట్లాడాలి ? అనే బోలెడు సందేహాలు .

"అమ్మా ! నువ్వు నా దగ్గరికి వచ్చేయమ్మా " అన్నాడు నేను అప్పుడప్పుడు ధారాపాతంగా కార్చే కన్నీరు చూసి .

"వస్తాను ..కానీ నాకు ఆంగ్లం రాదు కదా ! స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు లకి వెళతాను" అన్నాను . "క్లాస్ లకి వద్దులేమ్మా.. హోం ట్యూషన్ పెట్టించుకుని నేర్చుకో! "అని చెప్పాడు .

నేను అలాంటి ప్రయత్నం లోనే ఉన్నాను 
.
పైన కథ కోసం వ్రాసిన సంభాషణ అక్షరాలా నిజం 
.
ఇకపోతే ఇది వ్రాస్తూ నా ఆలోచన మార్చుకున్నాను . నేను ఆంగ్లం నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే నా భావితరాల వారికి తెలుగుని పరిచయం చేసి వారికి తెలుగు నేర్పడం మూలంగా మన భాషకి న్యాయం చేసినట్లు అవుతుంది. నా వారితో నేను నా భాష మాత్రమే మాట్లాడుకోవాలి అని దృఢ నిశ్చయం చేసుకున్నాను
(అయినా నాకు ఈ ఇంగ్లీష్ రాదులే అనుకుంటూ ..వెధవింగ్లీష్ .అనుకుంటూ పుస్తకాలు గిరాటు కొట్టాను) .

మనలో ఒక మాట ..

మన తెలుగు కథల కోసం ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉంది . "కథ గ్రూప్" అని . ఆ వేదిక పై తెలుగు కథ గురించి మూడొంతులు మంది ఆంగ్లం లోనే చర్చలు జరుపుతారు ఆంగ్లం వచ్చి ఉంటే ఆంగ్లంలో అభిప్రాయాలు చెప్పేందుకు నేను తయారుగా వుండేదాన్నేమో ! అక్కడ నాకు ఒక్క ముక్క అర్ధం కాదు. అదంతా తెలుగువారి కోట. ఆ కోటలో ఆంగ్ల పాగా వేసేవాడిదే రాజ్యం అనుకుంటూ తప్పుకుంటాను. మన తెలుగు వాళ్లకి ఆంగ్ల తెగులు బాగా తగిలింది . అది తెలుగుని వూడ్చి పెట్టేస్తుంది. అది ఖాయం అని అనుకుంటూ ఉంటాను.
వలచి విలపించడం అంటే ఇంతే  కదా ! అని అనుకుంటాను .

పై కథ లోని భాగంలా ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారి యింట యిలాంటి సన్నివేశాలు  యెదురుకాకూడదని కోరుకుంటూ .. ప్రవాసాంద్రులు  వారి పిల్లలకి  తెలుగు నేర్పుతూ యితర   దేశీయులకి  నేర్పుతూ  మన మూలాలని మిగుల్చుతున్నందుకు మనస్పూర్తిగా  ధన్యవాదములు తెలుపుతూ

 అవును .. ఈ  టపా కి  యే౦  పేరు పెట్టా లబ్బా  !?
తెలుగు తెగులు వెలుగు చోటు  అనేస్తాను బావుంది కదా!!

(అచ్చు తప్పులుంటే క్షమించాలి)  .

1, ఏప్రిల్ 2012, ఆదివారం

తేనే కన్నా తీయనిది తెలుగు భాష - తెలుగు పాటలు కి

 రాజ్ కుమార్ ..చిత్రం లో పాట
తెలుగు పాటలు..బాలు గారు .. మీ కోసం ఈ పాట.
తెలుగు పాటలని అత్యంత శ్రద్దగా అందిస్తున్న,పరిచయం చేస్తున్న  మీకు ఈ అచ్చు తెనుగు పాట .. సాహిత్యంని  సేకరించి..  మీ కోసం అభిమానంగా అందిస్తున్నాను




దినదినంబు వర్ధిల్లు తెలుగు దేశం 
దీప్తులను వెదజల్లు తెలుగు తేజం 

తేనె కన్నా తీయనిది తెలుగు భాష .. 
తేనె కన్నా తీయనిది తెలుగు భాష .. 
దేశ భాషలందు తెలుగు లెస్స 
తేనె కన్నా తీయనిది తెలుగు భాష .. 

భామల్లారా తుమ్మెదా
భామలమ్మల్లారా తుమ్మెదా 
హంసల్లు, చిలకల్లు తుమ్మెద 
ఆకాశమందు తిరుగు తుమ్మెదా 
కొంగల్లు,పిచుకల్లు తుమ్మెదా 
గుడి చుట్టూ తిరిగాయి తుమ్మెదా 
కొలనులో తామరలు తుమ్మెదా 
కోరి వికసించాయి  తుమ్మెదా 

మయూరాలు వయారాలు మాటలలో పురివిప్పును 
పావురాల కువకువలు పలుకులందు నినదించును (మయురాలు)
సప్తస్వరా నాద సుధలు నవరసభావాల మణులు (సప్త)
జానుతెనుగు సొగసులోన జాలువారు జాతి 
తేనె కన్నా తీయనిది తెలుగు భాష .. 
దేశ భాషలందు తెలుగు లెస్స 

అమరావతి సీమలో కమనీయ శిలామంజరి 
రామప్ప గుడి గోడల రమణీయ కళారంజని (అమరావతి)
అన్నమయ్య సంకీర్తన ,క్షేత్రయ్య శృంగారం (అన్నమయ్య)
త్యాగ రాజ మధువు తెలుగు సామగాన మయం 
తేనె కన్నా తీయనిది తెలుగు భాష .. 
దేశ భాషలందు తెలుగు లెస్స 
తేనె కన్నా తీయనిది తెలుగు భాష .. 
దేశ భాషలందు తెలుగు లెస్స
 ఈ తేనెలొలుకు పాటసాహిత్యం .. ఆత్రేయ గారు.
సంగీతం :ఇళయ రాజా.
ఈ క్రింది లింక్ లో  ఈ పాట వినండి.
తేనెకన్న  తీయనిది  తెలుగు  భాష