15, జూన్ 2026, సోమవారం

తడిసిన కనురెప్పలు

 


తడిసిన కనురెప్పలు  - వనజ తాతినేని 


దుఃఖం ఒక సజీవ ప్రాణి. పరాన్నజీవి. 


కాదు, కాదు.. దుఃఖాన్ని ఆశ్రయించుకుని మనిషి, మనిషిని ఆశ్రయించుకుని దుఃఖం 

మనుగడ సాగిస్తూ హేతువు శోధిస్తూ.. శోధనలో మరణిస్తూ.. ఇలా ఏవో పొంతనలేని ఆలోచనలు  చేస్తుంది ఆమె. 

 

కారణం లేని దుఃఖం ఒకానొకరోజు పొద్దున్నే వచ్చిన వానలా వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంది ఆమెలో. ముసురులా మూడురోజుల నుండి విడవనంటుంది. తల్లి పొత్తిళ్ళల్లో హాయిగా నిద్రిస్తున్న పసిపాపను ఎవరో దొంగిలించుకు పోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పీడకలలు. కారు మేఘం వచ్చి కమ్ముకుంటున్నట్లు నిద్రలో ఉలికిపాటు కలవరం. 


ఆ అలజడి తగ్గాలన్నా  ఆ గుబులు మాయమవ్వాలన్నా…ఏళ్ళ తరబడి కాలింగ్ బటన్ నొక్కని ఆ నెంబర్ కి ఆమె ఫోన్ నుండి కాల్ వెళుతుంది. అతను లిఫ్ట్ చేస్తాడు.


 ఇటువైపు నుండి శబ్దం వుండదు. శబ్దం లేని దుఃఖం మాత్రం వుంటుంది. కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్ద సన్నివేశం. చిత్రీకరణ జరుగుతుంది. 


తర్వాత.. “హే.. పిచ్చీ!  ఎందుకేడుస్తున్నావ్!  నీకు నేను లేనూ! రా! ఇలా వచ్చి సేదతీరు.”   చేతులు చాచి పిలిచిన ఆ ఆహ్వానం లో ఆలింగనం తో పాటు తల ఆన్చుకోవడానికి విశాలమైన హృదయం  పెన్నిధిగా దొరుకుతుంది. దుఃఖ తీవ్రత తగ్గిన కొన్ని నిమిషాల తర్వాత.. 


“ఓ పాపా లాలి జన్మకే లాలీ ప్రేమకే లాలీ పాడనా తీయగా..” 


ఆ స్వరంలో SPB వెళ్ళి మెత్తగా ఒదిగిపోతాడు. చరణాలు మధ్య వినబడని ఇళయరాజా నిశ్శబ్ద సంగీతం చోటుచేసుకుంటుంది. పాట పూర్తయ్యేసరికి దుఃఖం పలుచబడుతుంది. మెదడులో, గుండెలో ఓపలేని భారంగా వున్న టన్నుల కొద్ది  బాధ బరువు క్రమేపీ అదృశ్యమవుతాయి.


తడి ఆరిన కన్నీటి చారికలు మధ్య ఆమె ముక్కు ఎగబీలుస్తుంది. 


 అప్పుడు అడుగుతుంది పూల మృదుత్వాన్ని నింపుకున్న అతని స్వరం  “ఎందుకమ్మా! ఏమైంది?నీకు నేను లేనూ!” అని.


 “ఏం లేదు, పది రోజులుగా ఎంతకీ నిద్ర రావడం లేదు. ఫ్యాన్ చప్పుడు కూడా భరించలేకపోతున్నా. ఏవో ఆలోచనలు బుర్రలో దెయ్యాలు వలె తిరుగుతున్నాయి. అనుకున్న పనులు ఎంతకీ పూర్తి కావడం లేదు.విసిగిస్తున్నాయి. ఓపిక లేదు.” ఆమె కంఠస్వరంలో మళ్ళీ దుఃఖం ఊరుతూ. 


కారణాలు అవి కాదని అతనికి తెలుసు. అతడు నమ్మడని ఆమెకు తెలుసు. 


నేను ఏడుస్తున్నది గడిచిన జీవితం కోసం, అలాగే  గడపలేని జీవితం కోసం కూడా కాదు!  అని ఆమె విప్పి చెప్పనవసరం లేదు. అతను గ్రహించలేని రాతి యుగం నాటి మనిషి కూడా కాదు.అసలు ఎన్నడూ ప్రస్తావించని ఆ విషయం గురించి కూడా కాదు. ఆమె ఏదో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కానీ అది అతనికి చెప్పడం ఇష్టం లేదు. అతను గ్రహించేసాడు..


“నేనొక విషయం చెప్పనా!”  విషయాన్ని తేలికచేసేందుకన్నట్టు అన్నాడు.


“ఊ.. “


“ఏడ్చిన బరువైన కనురెప్పలతో భలే అందంగా వున్నావు. విషాద సౌందర్యం గంభీర సౌందర్యం తో వెలిగిపోతున్నావ్, తెలుసా! వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో!”


లైట్ వేసి అద్దంలో చూసుకుంది. నిజమే! అద్దం లో వింత అందంతో మెరుస్తుంది. ఆమెను చూసుకుని ఆమె పక్కున నవ్వుతుంటే మళ్ళీ కన్నీళ్ళు ఊరాయి. ఆడియో కాల్ లో చూసినట్లే చెప్పాడు మరి. 


“నేనొకటి అడుగుతాను.. కాదనకూడదు.”అటునుంచి మన్నింపు కలగలిపిన అభ్యర్థన. 


“ఊ” అనబోయి క్షణం ఆగింది. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అయ్యాయి.మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 


“అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుడతారు అన్నమాట అబద్దం కాదు. అంత పిచ్చి ఆలోచన ఏమీ వద్దు కానీ.. నీ ఫేస్ బుక్ పాస్వర్డ్ చెప్పు?”


క్షణం తటపటాయించింది, కానీ చెప్పేసింది. ఇంకా మాట్లాడుతూ వుండగానే “వెరిఫికేషన్ కోడ్ వచ్చింది చూసి చెప్పు” అన్నాడు. 


చూసి చెప్పింది. 


“ఫేస్ బుక్ పాస్వర్డ్ మార్చేసాను. లాగవుట్ చేసాను. కొన్నాళ్లు హాయిగా నిద్రపో! సరేనా!”


“ఊ…” అంది. 


“దా! మరి కాసేపు బజ్జుని సేదతీరు. చిన్న చిన్న విషయాలకి నువ్వు ఏడ్వవని నాకు తెలుసులే!”


“ఊ.. “


చాహూంగా మై తుఝే సాంజ్ సవేరే.... రఫీ అతని గళ మాధుర్యంలో బతికివున్నాడు పాట పూర్తి అయ్యే వరకూ. 


“థాంక్యూ వెరీ మచ్”  


“అడ్రెస్ చెబుతావా! Noiseless ceiling  fan Order పెడతాను.” 


“ఊహు.. వద్దు. నేను కొంటాను.. రేపు బయటకు వెళ్ళే పని వుంది.”


“నువ్వు అశ్రద్ధ చేస్తావ్, నీపై నీకు అంత శ్రద్ధ కూడానా!” చిరుకోపం మందలింపు.

 

“వద్దులే!”


“సరే మరి” 


“………” 


“ఉండనా మరి,” 


“ఊ.. “


“ఫేస్ బుక్ పాస్వర్డ్  నువ్వు అడుగుతావ్, నేనిస్తాను”


“ఊహూ! నువ్విచ్చినప్పుడే నేను తీసుకుంటాను.అంతే!”


“కనురెప్పలు పై కొబ్బరి నూనె రాసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకో! నిద్ర పడుతుంది” 


“ఊ.. “


“……”


అతను  కాల్ కట్ చేయలేదు. చేయడని ఆమెకు తెలుసు. మర్యాద మూర్తీభవించిన పురుషోత్తముడు. ఆమె కాల్ కట్ చేసింది.


రెండు రోజుల తర్వాత.. ఆ ఏరియా పోస్ట్ మెన్ కాల్ చేసాడు.

 

మేడమ్! ఇంట్లో వున్నారా? మీకో పార్శిల్ వచ్చింది. 


“ఉన్నానండీ”


ఎవరో బుక్స్ పంపి వుంటారు అనుకుంది ఆమె. ఎకనాల్డెజింగ్ రిసీప్ట్ పై సంతకం చేసాక  సీలింగ్ ఫ్యాన్ పార్శిల్ ఆమె ముందు పెట్టాడు.   


“ఇలా కూడా డెలివరీ వుంటుందా” ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగింది.


“పేరు, ఊరి పేరు, ఫోన్ నెంబర్ వుంటే ఈజీ కదా మేడమ్” ఇది కూడా మీకు తెలియదా అన్నట్లు నవ్వాడు పోస్ట్ మెన్.


కార్టూన్ ఓపెన్ చేస్తూ అనుకుంది. “దూరం నుండి కూడా నక్షత్రాల వలె ప్రకాశవంతమైన  స్థిరమైన ప్రేమ నాపై ప్రసరిస్తున్నప్పుడు గాలివాటు ప్రేమల బ్లాక్మెయిలింగ్ బాధ నాకెందుకు? ఆమోదించలేదని రకరకాలుగా వేధింపులకు పాల్పడుతున్న వారి గురించి భయమెందుకు !?”   


చేస్తున్న పని ఆపి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వుందా లేదా అని చెక్  చేసుకొని తెరిపిగా ఊపిరి పీల్చుకుంది ఆమె. స్నేహం పేరిట అశ్లీల సందేశాలు పంపుతూన్న వారిని  బ్లాక్ చేసినా కూడా కొత్త అకౌంట్లతో వచ్చి వేధిస్తున్న వారందరిని లిస్ట్ లో చేర్చింది. తీసిన  స్క్రీన్ షాట్స్ అన్నింటిని ఫైల్ చేసింది. తర్వాత వారికి ఎదురవ్వబోయే సన్నివేశం ఊహించుకుంటే మనస్సు కొంత శాంతించింది.


తర్వాత ఫ్యాన్ బిల్ అమౌంట్ చూసి అతని నెంబర్ కి ఫోన్ పే చేసింది. 


కాసేపటి తర్వాత రిప్లై లో యాంగ్రీ ఎమోజీ తో పాటు థ్యాంక్స్ అనే టెక్స్ట్ కూడా వచ్చింది.


నవ్వుకుంది..ఆమె. మనసులో ఇలా అనుకుంది. 


“అన్ని స్నేహాలు ఒకటి కావు. ఈ స్నేహం అపురూపమైనది. ఎవరికీ అంతు చిక్కని నా రహస్య ప్రపంచంలో నేను మాత్రమే జీవించడంలో గల ఆనందాన్ని కనుగొన్నాను. నా గమ్యాన్ని చేరుకుని దశాబ్దాలు  గడిచిపోయాయి. కాలం క్షణాల్లా కరిగిపోయింది.  నీ ప్రేమలో నేను సేదతీరి నప్పుడల్లా.. నాకైతే మళ్ళీ ఇప్పుడే పుట్టినట్టు వుంది. ఇది చాలు. అమూల్యమైన నీ ప్రేమను గొడుగు గా మార్చి  అవసరమైనప్పుడు కాపు కాస్తావు. నీ హృదయాన్ని తల్పం చేస్తావ్, నన్ను సాంత్వన పరిచే మాంత్రిక విద్య కేవలం నీకు మాత్రమే తెలుసు. ఇంతకు మించి మరేది వద్దు. ఉన్న దాంతో ఉత్సవం చేసుకోవడం నాకు భగవంతుడు ఇచ్చిన వరం. మరియు విలువైన కానుక.” 


మరొక టెక్స్ట్ నోటిఫికేషన్.. అతని నుండే అది.


“చివరికి జీవితం అంటే ఏమిటంటే..

మీకు మార్గంలో తారసపడిన వారి గురించి కాదు 

మీ హృదయం తాను ఎన్నటికీ  వదులుకోవడానికి ఇష్టపడని వారి గురించి అది కార్చే కన్నీరు.”


పదే పదే చదువుకుని పదే పదే ఏడ్చింది ఆమె కనురెప్పలు వాచిపోయేలా. 


*********************(*)*********************


జూన్ మొదటి పక్షం “ సారంగ వెబ్ మ్యాగజైన్” లో ప్రచురితమైన కథ.


కామెంట్‌లు లేవు: