30, జూన్ 2013, ఆదివారం

స్వాతి వాళ్ళ అమ్మ

27, జూన్ 2013, గురువారం

అమ్మ చెప్పే కమ్మని కబుర్లు

ఓ ..  పది రోజులు పాటు దేశ సంచారం  చేద్దామని మా వర్కర్స్ ని కూడా ఇంటికి పంపించేసి .హాయిగా లేపాక్షి, రాయలసీమ అంతా తిరిగివద్దామని ప్లాన్ వేసుకున్నాం. ఎందుకో ఆ ప్రయాణం వీలుపడక పోయే సరికి నీరసం ముంచుకొచ్చింది.  ఛీ .. వెధవ జీవితం .అని తిట్టుకుంటూ.. తెగ బోర్ కొట్టి చచ్చిపోతున్నాను ..  వచ్చి ఓ ..నాలుగు రోజులు ఉండెళ్ళు తల్లీ ! అని నా ఫ్రెండ్ ని పిలిచాను.  తను వచ్చింది. బోలెడు సినిమాలు, కబుర్లు మధ్య ఇద్దరం కలసి  మన బ్లాగర్స్ వ్రాసిన కథలని చదువుతూ ఒక్కొక్కటి వరుస క్రమం లో ఉంచుతున్నాము.  చదువుట ఎక్కువైంది   కాబట్టి ఈ మధ్య ఏమి వ్రాయాలని అనిపించడం లేదు .. వేరే ఏదైనా చదవాలని ఆసక్తి లేదు, కొన్నాళ్ళపాటు బ్లాగ్ వ్రాతలకి విరామం ప్రకటించాలని అనుకుంటూ ఉన్నాను. ఓ రహస్యం చెప్పాలి,  అలా అనుకునప్పుడల్లానే మంచి మంచి పోస్ట్ లు వ్రాసినట్లు గుర్తు .. వరుసగా కొన్ని జ్ఞాపకాలని వ్రాసుకోవాలనిపిస్తుంది. 

 రాత్రి  హాల్లో పడుకుని నా ఫ్రెండ్, నేను  తక్కువ సౌండ్ తో  సరాగమాల (రేడియోలో వచ్చే పాత పాటల కార్యక్రమం) వింటూ ముచ్చట్లు చెప్పుకుంటూ అలా గోడల వైపు చూస్తున్నాను. ఒక ప్రక్క గోడకి నేను చాలా ఇష్టంగా తగిలించిన వాల్ పీస్ కనబడింది. ఆ పీస్ ని అలా గోడకి తగిలించి ఓ ..పది ఏళ్ళు అయింది. ఆ పీస్ మీద నా చూపులు ఆగిపోయాయి

ఒక జ్ఞాపకం అలా... నా కళ్ళ ముందు కదిలింది.  కొన్ని కన్నీళ్లు కూడా బయటకి వద్దామా- వద్దా .. అనుకుంటూ మొహమాటపడుతున్నాయి.  ఏమిటి ఇంతలోనే ఆ కన్నీళ్లు?  అంది నా ఫ్రెండ్.

అదిగో . ఆ వాల్ పీస్ చూసి అన్నాను . నిజానికి అది వాల్ పీస్ కాదు, అలా నేను తయారు చేసుకున్నాను.  అది ఒక   ఆర్టిఫీషియల్  ఫ్లవర్ .బొకే.  తను లేచి వెళ్ళి  గోడకి  తగిలించి ఉన్న దానిని తీసుకువచ్చింది. అది చేతిలోకి తీసుకుని పదేళ్ళ క్రిందటి ఆ సంగతి గుర్తు చేసుకున్నాను.

*********************

సాయంత్రం అయిదింటికి ఆడుకోవడానికని వెళ్ళిన అబ్బాయి ఎనిమిది గంటలు దాటినా ఇంటికి రాలేదు అమ్మ ఇంట్లోకి బయటకి తిరుగుతూ అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ క్రికెట్ ఆడటానికని కాలేజ్ గ్రౌండ్స్ కి వెళ్ళారా? లేక రాజేష్ తో కలసి సృజన్  వాళ్ళ ఇంటి దగ్గర క్యారమ్స్ ఆడుతున్నారా? లేక గోరా హరి తో కలసి సినిమాకి వెళ్ళాడా? ఇంకా ఇంటికి రాడేమిటి ?   ఆలస్యం అవుతున్న కొద్ది అమ్మకి లోలోపల  కంగారు. ఇంటికి రానీ .. వీడి పని చెపుతాను. ఎన్నిసార్లు చెప్పినా పొద్దుపోయిందాకా  ఫ్రెండ్స్ తో ఆటలు మానుకోడు,  పోనీ వెళితే వెళ్ళాడు కొంచెం లేట్ అవుతుంది అమ్మా .అని  పోన్ చేసి అయినా చెప్పవచ్చుగా ... అన్నీ నిర్లక్ష్యమే! అని కోపంగా అనుకుంటూనే ..ఇంకా రాడేమిటీ .. అని  ఇంటి ముందు గేటు ని దాటుకుని దూరంగా రోడ్డు వైపు చూస్తూనే ఉంది.

నిమిష నిమిషానికి   వరండాలోకి వచ్చి చూస్తూనే ఉంది. బిడ్డ వస్తున్న జాడ లేదు తొమ్మిది,పది,పదకొండు గంటలు అవుతుంది.  పదవ నంబరు బస్, 23 వ నంబర్ బస్ లు , ఉయ్యూరు  బస్ లు కంకిపాడు బస్ అన్నీ ఒకదాని వెనుక వెళ్ళి పోతూనే ఉన్నాయి.  ఏ బస్ లోను అబ్బాయి దిగి రావడం లేదు. వాడిదగ్గర డబ్బులు కూడా ఎక్కువలేవు. ఎక్కడ ఉన్నాడో ఏమి చేస్తున్నాడో, మొన్నీమధ్య ఎప్పుడో తమ చుట్టాలబ్బాయిని ఎవరో పట్టుకెళ్ళి మద్రాస్ లో వదిలిపెట్టారని విన్నది అలా ఏమైనా జరగలేదు కదా ! అమ్మకి ఏడుపు వచ్చేస్తుంది.  కొడుకు ఫ్రెండ్స్ లో ఎవరి ఇంటికైనా పోన్ చేసి కనుక్కోవాలన్నా వారి నంబర్స్ తన దగ్గర లేవు. ఎప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో ..!?  అమ్మకి కంగారు.

ఈ మధ్య పెత్తనాలు ఎక్కువైపోయాయి. చెప్పినమాట వినడంలేదు. ఈ రోజు ఇంటికి రానీ...   వీడి కాళ్ళు విరకోట్టాలి అనుకుంటూ..  కారుతున్న కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ .. కనిపించని దేవుడిని వేడుకుంది . నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు చేయి తండ్రి ! అని.

పదకొండున్నర దాటింది. అప్పటిదాకా అమ్మ బయట బాల్కనీలో నిలబడే ఉంది. ఇంకో పది నిమిషాలు గడిచాయి బస్ దిగి మెల్లగా నడుచుకుంటూ వస్తున్న కొడుకుని చూసి ప్రాణం లేఛి వచ్చినట్లు అయ్యింది అమ్మకి. వెంటనే కోపం వచ్చింది. అబ్బాయి మూడు అంతస్తులు మెట్లెక్కి వచ్చేటప్పటికి అమ్మ ఇంట్లోకి వెళ్లి ... కావాల్సిన వస్తువు కోసం వెదికింది. కోపం,ఏడుపు కలగా పులగం అయిపోయి .. గబా గబా ఓ వస్తువు పట్టుకుని వరండాలో .వచ్చి నిలబడింది. అబ్బాయి చెప్పులు విడిచి స్టాండ్ లోకి  పెట్టి .. అమ్మా.. అమ్మా .! .సారీ అమ్మా.. !  అంటూ ముందుకు వచ్చాడు

ఏరా ! ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావు ? ఆడుకోవడానికని కదా వెళ్ళావు ..ఇప్పుదు టైం  ఎంతైంది ? నిన్ను నేను ఎక్కడని వెదకాలి? అసలు  భయం ఉందా నీకు ..? అని అడుగుతూనే చేతిలో ఉన్న అట్లకాడతో దబ దబ ..ఒక అయిదు నిమిషాలు పాటు బాదేసింది. అబ్బాయి అలా నిలబడి దెబ్బలు తింటూనే ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమ్మ చప్పున చేతిలో అట్లకాడ అక్కడ పడేసి ఎక్కడికెళ్ళావ్ .్పోన్  చేసి అయినా చెప్పవచ్చు కదా ! నేను ఎంత కంగారు పడుతున్నానో .. అని ఏడ్చింది.

అమ్మా.. ఫ్రెండ్స్ అందరూ ..ఎగ్జిబిషన్ కి వెళదామన్నారమ్మా ! ఇంట్లో చెప్పలేదు అంటే .. త్వరగానే వచ్చేద్దాం పర్లేదు వెళదాం అని అన్నారు. అక్కడికి వెళ్ళాక .. అక్కడ అన్నీ చూస్తూ టైమే తెలియలేదు అన్నాడబ్బాయి.

"నీ దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవు ఫ్రెండ్స్ రమ్మన్నారని వెళ్ళి పోవడమేనా? అలా  వెళ్లకూడదని నీకు చెప్పానా లేదా .. అసలు ఈ మధ్య చెప్పిన మాట వినడం లేదు ".. అని మళ్ళీ అట్లకాడ  తీసుకుని రెండు దెబ్బలు వేసింది.
"నేను అసలు వెళ్ళేవాడిని కాదమ్మా ..  ఇదిగో .. ఇందు కోసం వెళ్ళా ".. అని వెనుక దాచుకున్న చేతులు చాచి ముందు పెట్టాడు. అప్పటి దాకా కోపంలో ఉన్న అమ్మ గమనించలేదు . ఎన్ని దెబ్బలు వేసినా చేయికూడా అడ్డుపెట్ట కుండా చేతులు  వెనుకకి దాచుకున్నాడని. అప్పుడే తెలిసింది ఆ..  సంగతి. చప్పున ఆ చేతిలొఉన్న వస్తువుని చూసింది ..

ఏమిటిది ? అడిగింది కళ్ళకి ఎదురుగా కనబడుతున్న వస్తువుని చూసి.

అప్పుడు అబ్బాయి ఇలా చెప్పాడు . "అమ్మా ! రేపు  మదర్స్ డే  కదమ్మా ! నిన్ను విష్ చేసి నీకు ఇవ్వాలని ఇది  తెచ్చాను " అన్నాడు

అంతే ! అమ్మ చేతిలో అట్లకాడ అప్రయత్నంగా క్రిందపదిపోయింది  . కోపంలో బిడ్డ ఒంటిపై పడ్డ ఎర్రటి వాతలని చూస్తూ ....అబ్బాయిని దగ్గరకి తీసుకుని   గట్టిగా ఏడ్చింది.

అమ్మా ! ఏడవకమ్మా ! ఇంకెప్పుడు నీకు చెప్పకుండా బయటకి వెళ్ళను .. అంటూ .. అమ్మ కన్నీళ్లు తుడిచి .. బుగ్గపై  ఓ .ముద్దు  పెట్టి .్ హ్యాపీ మదర్స్ డే " అమ్మా! అన్నాడు. అప్పుడు టైం  చూస్తే రాత్రి జీరో అవర్స్ .. ఆ రోజు మదర్స్ డే !

అమ్మ కళ్ళ లలో సంతోషం,దుఖం రెండూ పోటీ పడ్డాయి. బిడ్డని కొట్టినందుకు తనని తానూ తిట్టుకుంటూనే ..

"అవును ..ఇది ఎలా కొన్నావ్ ? నీ దగ్గర డబ్బులు లేవు కదా !? " అడిగింది ఆరాగా .

"మా ఫ్రెండ్ ని అడిగి డబ్బు అప్పుగా తీసుకున్నా నమ్మా ! రేపు నువ్వు ఇస్తావుగా ఇచ్చేస్తా ".అని  చెప్పాడు .

ఆ రోజు అబ్బాయి విష్ చేస్తూ  అమ్మకిచ్చిన గిఫ్ట్ ఇది ...
 ఈ.. జ్ఞాపకం .. నాకు చాలా ఇష్టమైనది ... అంటూ చెప్పాను ..నా ఫ్రెండ్ కి

నాకు మా అబ్బాయి నుండి ఎన్ని గిఫ్త్స్ అందుకున్నా ... ఈ గిఫ్ట్ .. చాలా చాలా విలువైనది  అపురూపమైనది
చాలా జాగ్రత్తగా చూసుకుంటాను

ఆ తర్వాత ఒ..పది మదర్స్ డే లు అయ్యాయి. ఎవరన్నా .. ఈ రోజు మదర్స్ డే అని  గుర్తు చేస్తే .." ప్రతి రోజూ మదర్స్ డే ".. నే అని చెప్పేం తగా ఎదిగిన   నా కొడుకు ని చూస్తే  ఆనందం

ఈ రోజు ఉదయం ... నా కొడుకుతో మాట్లాడుతూ ..ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ .. రాత్రి కూడా ఏడ్చాను . "చిన్నీ" ... అంటే .. తనూ  నవ్వుకుంటూ ఇప్పుడు కూడా ఏడుస్తావు కదమ్మా  ! అన్నాడు .

నిజంగానే .ఆ  రోజు సంగతి గుర్తు చేసుకుంటూ  నవ్వుకుంటూనే  మళ్ళీ ఏడ్చాను   ఎండావానా కలబోసినట్లు.
మా  అత్తమ్మ , నా ఫ్రెండ్ ఒకటే నవ్వు ....

 తనతో ... మాట్లాడుతూనే .. తర్వాత   ఏదో ఒక విషయం పై తనని మందలిస్తూ ఉంటే .. మారుమాట్లాడకుండా వింటూ .. " మా అమ్మ తిడుతుంది చూడండి " అన్నట్లు చూస్తూ, నానమ్మకి పిర్యాదు చేస్తూన్నట్లుగా,  మౌనంగా వింటున్న నా కొడుకు చిత్రం  ..ఇది.


:) ...

(ఈ మధ్య ఒకరు అడిగారు .. మీ అబ్బాయి కబుర్లు వ్రాయడం లేదేమిటీ .అని . అనుకోకుండా ఇలా మనసు పొరలు చీల్చుతూ ..వచ్చేసింది . ఈ విషయం పంచుకోవడం  మహదానందం    నేను నా కొడుకుని కొట్టిన నాలుగు సార్లు లో ఇది ఒక సందర్భం )  

24, జూన్ 2013, సోమవారం

మరణించిన ప్రేమ

ది స్వోర్డ్ అఫ్ టిప్పుసుల్తాన్ , విజయరాజ్ , దివ్యభారతి ..

ఈ మూడు పేర్లు వినగానే నాకు చప్పున .. ఒక జ్ఞాపకం .. ఆ జ్ఞాపకం బాధావీచికం.

ఆ అమ్మాయి ఎలా ఉందో !? అనుకుంటాను . ఎందుకు ఆ అమ్మాయి అలా చేసింది ? ప్రాణ ప్రదంగా ప్రేమించిన భర్తని అంత  త్వరగా ఎలా మర్చిపోగల్గింది ? అని ప్రశ్నలు వేసుకుంటాను ఆడవాళ్ళు అంత  త్వరగా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలని, జీవితానికి సంబందించిన మనిషిని అంత త్వరగా మర్చి పోతారా? అలా మర్చిపోవడం అంత సులభమా?  అనుకుంటూ మరీ...  నేను చాదస్తంగా ఆలోచిస్తున్నానేమో  ? అని  బలవంతంగా ఆ ఆలోచనల నుండి  బయట పడే ప్రయత్నం చేస్తాను .

ఈ రోజు దివ్య భారతిని (సినీ నటి ) ని ఒక వీడియో సాంగ్ లో చూస్తే చప్పున నాకు ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది అచ్చు దివ్యభారతిలా ఉంటుంది కాకపొతే చామానఛాయ రంగు  అంతే తేడా.

ఆ అమ్మాయి పేరు చాలా అందమైన పేరు సంజన ( పేరు మార్చాను ) తల్లి దండ్రులు ఇద్దరూ   ప్రభుత్వ ఉద్యోగులు .  ముగ్గురూ  ఆడపిల్లలే ! సంజన  చెల్లెలు నా చెల్లికి స్నేహితురాలు. అలా ఆ కుటుంబం తో నాకు పరిచయం ఉంది

సంజనకి చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకనేమో .. ఆ పిల్లని ఒక పంక్షన్ లో చూసి పెళ్లి చేస్తారా అనగానే అడిగిన అబ్బాయి మంచి చెడులు చూసి వెంటనే పెళ్లి జరిపించేసారు. అతని పేరు విజయ్ రాజ్  . తండ్రి లేడు
ఒక్కడే సంతానం. మద్రాస్ లో సినిమాల షూటింగ్ల  కి కెమెరా మెన్ గా పని చేసేవాడు.అతనికి ఇచ్చి సంజన కి పెళ్లి జరిపించారు. పెళ్ళైన ఏడాదికి ఒక పాప పుట్టింది.విజయ రాజ్ కి సంజయ్ ఖాన్ నిర్మిస్తున్న " టిప్పుసుల్తాన్"  కి పనిచేయడానికి అవకాశం వచ్చింది .   ఆతను ఆ సంస్థ లో పని చేస్తూ ఉండగానే .  ఆ పాపకి సంవత్సరం వయసు ఉండగా  ఒక నెలరోజులు పాటు  ఖాళీ లేకుండా షూటింగ్ ఉండటం వల్ల సంజన ని చుట్టం చూపుగా పుట్టింటికి పంపి ఆతను షూటింగ్ కి వెళ్ళాడు స్పెషల్ ఎఫెక్ట్స్ తీస్తూ ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది.  ఎంతో  మందిని రక్షించి అతను  ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు.

ఆ అగ్ని ప్రమాదం వార్త వినగానే కుటుంబ సభ్యలు అందరూ అక్కడికి పరుగులు తీసారు రెండుమూడు రోజుల తర్వాత గుర్తుపట్టని స్థితిలొఉన్న అతని పార్ధివ శరీరాన్ని అప్పగించారు. మట్టి చేయడం,మిగతా కార్యక్రామాలు పూర్తీ చేసుకుని మరో రెండు రోజులకి మద్రాస్ పట్టణం నుండి  ఇల్లు ఖాళీ చేసుకుని బరువైన మనసులతో తిరిగి వచ్చేసారు. విజయ్ రాజ్ తల్లి దుఃఖ భారంతో కృంగి పోయారు కోడలు మనుమరాలుతో సహా కోడలి పుట్టింట్లో  ఉంది.కొన్నాళ్ళకు    ఆమె కోడలు మనుమరాలుతో కలిసి కోడలి పుట్టింట్లో వారితో కలసి  ఉండలేక బంధువుల ఇంట్లో ఉన్నారు. అగ్ని ప్రమాదంలో మరణించాడు కాబట్టి ఇన్స్యూరెన్స్ ద్వారా లభించే డబ్బు  విషయంలో తప్ప ఆమెకి కోడలికి  అంత అనుబంధం ఉన్నట్లు కనబడేది కాదు. 

నేను ఆ అమ్మాయిని పలకరించడానికని వెళ్లాను. సంజన  కన్నా ఆమె తల్లి తండ్రి చాలా దిగులుగా కనిపించారు
సంజన వాళ్ళ అమ్మ ఫామిలీ ఆల్బుం తీసి విజయ్ రాజ్ ఫొటోస్ ఆతను భార్య,కూతురు తో దిగిన ఫొటోస్ చూపిస్తూ అతనికి తల్లితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆమె బిడ్డపై ఎన్నో ఆశలతొ జీవించారు ఇప్పుడు అతని మరణాన్ని ఆమె  తట్టుకోవడం చాలా కష్టమని చెప్పారు

అలాగే ఆ ఇంట్లో మద్రాస్ నుండి ఇల్లు ఖాళీ చేసి వేసుకువచ్చిన వస్తు సామాగ్రి ప్రిజ్ద్ , బీరువా ,టీవి లాంటి వస్తువులపై  విజయరాజ్ భార్య పేరు తన పేరు కలిపి  స్టిక్కరింగ్ చేసుకుని ఉన్న గుర్తులు అతనికి భార్యపై ఉన్న ప్రేమని ప్రత్యేకంగా చెప్పాయి

సంజన మాత్రం చాలా మాములుగా కనిపించింది. విజయ్ రాజ్ ని పుట్టింటికి వచ్చే ముందు చూడటమే! మళ్ళీ భర్త  ముఖాన్ని కూడా ఆమె చూడలేకపోయింది అయ్యో ..పాపం అనిపించింది.

సంజనా ! మళ్ళీ నువ్వు చదువుకోవడం మొదలెట్టు అని చెప్పాను. నాకు ఆ అమ్మాయి పట్ల సానుభూతి కన్నా కూడా విజయ్ రాజ్ పట్ల అభిమానం ఎక్కువైనట్లు అనిపించింది అతనిని నేను అసలు చూడనే లేదు మాట్లాడనూ లేదు. అతని గురించి విన్న మాటలు మూలంగానే అతని మరణం పట్ల బాధ కల్గింది. సంజన ని చూస్తే జాలి కల్గింది అందమైన పిల్ల, పైగా చాలా చిన్న వయసు. మళ్ళీ తనకి ఒక పిల్ల.  ప్చ్.. ఏమిటో గాలిబుడగ ల్లాంటి జీవితాలు అనుకున్నాను.  విజయ్ రాజ్ మరణం తర్వాత  ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది కదా అని బాధ పడ్డాను

రెండు మూడు నెలల తర్వాత ఒకరి నోటెంట ఒక విషయం విని ఆశ్చర్యపోయాను.సంజన ఒక పోలీస్ కానిస్టేబుల్ తో సన్నిహితంగా మెలుగుతుంది అని

చ.. అలాంటివేవి ఉండవు లెండి, వాళ్ళ ఇంటి ప్రక్కనే అతను  ఉంటాడు ..ఏదో  మాట్లాడుకుంటూ ఉంటే తప్పేమిటి అని. మళ్ళీ తరువాత ఇంకొకరి నోటి వెంట అలాంటి మాటే విన్నాను స్వయంగా చూసాను కూడా. నేను మా కుటుంబ సభ్యులు సినిమాకి వెళితే సంజన ఆ కానిస్టేబుల్ తో కలసి సినిమాకి వచ్చింది. అతనితో ఆ అమ్మాయి చాలా క్లోజ్ గా మూవ్ అవడం చూసాను. నిజం చెప్పొద్దూ .. నేను ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను

ఇదేమిటీ .. ఈ పిల్ల భర్త చనిపోయి నిండా నాలుగు నెలలు కూడా కాలేదు అంతగా ప్రేమించే భర్తని మర్చిపోయి   అప్పుడే .పరాయి పురుషుడితో అంత  సన్నిహితంగా మెలుగుతుంది అని చిరాకు పడ్డాను.

అది అలా జరిగిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి ఒక సంవత్సరం లోపే మళ్ళీ పెళ్లి జరిగిందని విన్నాను.  సంజనకి ఉన్న బిడ్డని ఆమె తల్లిదండ్రులు పెంచుతున్నారని విన్నాను. కొన్నాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా మా వూరు నుండి బదిలీ అయి వెళ్ళిపోయారు

కానీ నేను విజయ్ రాజ్ ని మర్చిపోలేదు. ది స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్, దివ్యభారతి,విజయ్ రాజ్  అలా నా మనసులో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు.

ఆ అమ్మాయి సంజన  గురించి ఇప్పటికీ అనుకుంటాను, మనుషుల మరణాన్ని  జీర్ణించుకోవడం అంత  సులభమా!? ఆ అమ్మాయికి చిన్న వయసు కావడం వలన అలా చేసిందా? లేక తోడూ కోసం అలా చేసిందా.. అన్నది నాకు అర్ధం కాలేదు.  మళ్ళీ వివాహం తప్పు కాకపోవచ్చు. మనుషుల్లో అంత  ప్రాక్టికల్  మైండ్ ఉండటం అవసరమేమో కాని నేను ఆ అమ్మాయి చేసిన పనిని  ఆమోదించలేకపొయాను. మరీ అంత తక్కువ కాలంలో అలా జరగడం వల్లనేమో నేను  ఆమోదించలేకపొయానని అనుకున్నాను.  బహుశా  నేను కొందరు మారినంత వేగవంతంగా  నా ఆలోచనలని, అభిప్రాయాలని మార్చుకోలేక పోవడం  వల్లనేమో !   సంజన స్థానం లో నేను లేను కాబట్టి నాకు అలా అనిపించింది   ఏమైనా స్త్రీల మనసు సముద్రం కన్నా లోతు  అందులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అంటారు . కదా ! ఇదీ  అంతే  నేమో !

విజయ్ రాజ్ కూతురు ఇప్పటికి ఇరవై ఏళ్ళ అమ్మాయి అయి ఉంటుంది ఆ అమ్మాయి ఖచ్చితంగా తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమని కోల్పోయి ఉంటుందని   నేను అనుకుంటాను

కొన్ని ప్రేమలు మనవి కాకపోయినా మన జ్ఞాపకాలలో  గాఢంగా అలా నిలిచి ఉంటాయి . కొన్ని ప్రేమలు .వారి   మనిషితోపాటు వెంటనే  మరణిస్తాయి.

ఒకటి మాత్రం అనుకుంటాను .. ప్రియరాగాలు చిత్రంలో జగపతి బాబుకి సంబంధించి ఒక మాట , భార్య సమాది పై వ్రాసి ఉంటుంది .. " నా ఆత్మ, నీ శరీరం ఇక్కడ సమాధి చేయబడ్డాయి " అని

ఒకవేళ సంజన యాక్సిడెంటల్  గా చనిపోయి ఉంటే ... విజయ్ రాజ్ ఖచ్చితంగా అలాగే బాధపడుతూ ఉండేవాడేమో  అని నేననుకుంటూ ఉంటాను.  అతని గురించి నేను విన్న కొద్ది మాటల్లోనే నాకు ఏర్పడ్డ అభిప్రాయం అది. అది కేవలం నా ఊహ కావచ్చు.

భార్య చనిపోతే నెల లోపే మళ్ళీ వివాహం చేసుకునవారు ఉన్నప్పుడు సంజన చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయి చేసుకున్న వివాహాన్ని  నేను వ్యతిరేకించలేదు కానీ ఓ తల్లికి బిడ్డ , ఓ బిడ్డకి తండ్రి రావడం చాలా కష్టం కదా ! ఆలోచిస్తూ ఉంటాను ఇప్పటికి కూడా.

వివాహం అంటే  అనుబంధాల అల్లిక మాత్రమే కాదు అవసరాల కోసం కూడానేమో కదా !

( నా ఆలోచనలని ఈ పొస్ట్ లో ఇలా వ్రాసినందుకు  "సంజనా .. ఐ యాం వెరీ సారీ )

20, జూన్ 2013, గురువారం

స్వాతి వాళ్ళ అమ్మ "సారంగ " లో

స్వాతి వాళ్ళ అమ్మ  "సారంగ " లో

   నేను వ్రాసే కథలు ఎప్పుడూ  వాస్తవిక జీవితాల్లో నుంచే  పుడతాయి.  స్త్రీలకి పునర్వివాహం లో ఉండే కష్ట నష్టాలు గురించి ఒక కథ వ్రాసాను . ఆ కథ   ఈ లింక్ లో "స్వాతి వాళ్ళ అమ్మ " కథ
 ఈ కథ వారం వారం మనని పలకరించే  వెబ్ మాగజైన్  "సారంగ " లో  పాఠకులకి చేరువలో ఉంది

కథని చదివి మీ ఆలోచనలని అభిప్రాయాన్ని పంచుకోండి .

18, జూన్ 2013, మంగళవారం

తెలుగు తెగులు వెలుగు చోటు

డాడ్ .. డాడ్ .. అంటూ పిలుస్తూ .. "మే ఐ కమిన్" అంటూ అనుమతి కోసం గుమ్మం దగ్గర నిలబడ్డాడు హర్ష.

కమిన్ ... అంటూ అనుమతి ఇచ్చాడు తండ్రి.

"మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను" సమయం ఉందా అన్నట్టు చూసాడు.

"చెప్పు" . అన్నారు మిస్టర్ రావు

పక్షులు ఏ భాష మాట్లాడతాయి ?

"పక్షుల భాష "

"జంతువులూ" ?

"జంతువుల భాష "

మనం మన భాషలోనే అంటే మన మాతృ భాషలో యె౦దుకు మాట్లాడం ?

ఆంగ్లంలోనే మాట్లాడుతూ ఆంగ్లేయుల మధ్య బ్రతుకుతూ ఆంగ్లమునే శ్వాసిస్తున్న ఆ తండ్రికి కొడుకు ప్రశ్నతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.
మీరు,అమ్మ యిరువురు కూడా మన మాతృభాష ను నేర్పడం లో అలసత్వం, అల్పత్వం కూడా ప్రదర్శించారు అందువల్ల తెలుగు వాడిగా పుట్టిన నాకు తెలుగు మాట్లాడటం తెలుగు మాట్లాడిన వారి భాష మాకు అర్ధం కాకపోవడం జరుగుతుంది

ముఖ్యంగా ఆంగ్లం యే మాత్రం తెలియని నానమ్మ,తాతయ్యలతో యేమి మాట్లాడలేకపోవడం, వాళ్ళు మాట్లాడినది అర్ధం చేసుకోలేకపోవడం వల్ల మా మధ్య తాతా-బామ్మా మనుమడి అనుబంధం యేమిటో తెలియకపోయింది దగ్గరికి వెళ్ళినప్పుడు నాకర్ధం కాని వాళ్ళ బాషలో యేదో చెపుతూ ఆత్మీయంగా ప్రేమగా తడుముతూ వారి ప్రేమ భాషను  వ్యక్తపరుస్తుంటే వారికి వొట్టి థాంక్స్ మాత్రమే కాకుండా వారిపై నాకున్న ప్రేమని తెలియజెప్పాలనిపిస్తుంది . నేను చెప్పినా వారికి అర్ధం కాదని తెలిసి మూగగా కంటి చూపుతో మాట్లాడి బయట పడటం నాకు సిగ్గుగా ఉంది.నేను వారితో మాట్లాడలేకపోవడం వల్ల యెన్నో కోల్పోయాను.
.
 
పరాయి దేశానికి బ్రతకడానికి వచ్చి మన భాషని మర్చిపోయి వారి భాషనే ఆశ్రయించి మనకి మనమే అన్యాయం చేసుకుంటున్నాం, మన మూలాలు మనం కోల్పోతున్నాం.మీలా అందరూ మాతృ బాషని నేర్పించకుండా నిర్లక్ష్యం చేస్తే .. మంచి అవకాశాల కోసం ఉద్యోగం కోసమో అందరూ ఆంగ్లమే నేర్చుకుంటే... కొన్నాళ్ళకి సవర భాష , ఎరుకల భాష లాగా మన భాష కనుమరుగవడంలో ఆశ్చర్యం లేదు" చిన్న ఉపన్యాసమే యిచ్చాడు హర్ష.
మిస్టర్ రావు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. హర్ష తన మాటలు కొనసాగిస్తూ

ఈ రోజు నుండి నేను తెలుగు తరగతులకి వెళుతున్నాను తెలుగే మాట్లాడతాను, నానమ్మ తాతయ్యలతో రోజు కబుర్లు చెప్పుకోవడానికి తెలుగు నేర్చుకుంటాను అని చెప్పాడు .పాతికేళ్ళ కొడుకు తమ తప్పుని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పడానికి మాటలు రాక మౌనంగా వుండిపోయాడు మిస్టర్ రావ్.
***************************
ఇది నేను వ్రాయబోతున్న ఒక కథలో భాగం
ఈ కథ వెనుక కథ .. అనబడు ఒక విషయం పంచుకోవాలని పించి ఈ పోస్ట్ .
నేను ఆంగ్లంలో బాగా వెనుకబడి ఉంటాను . అంటే అత్తెసరు మార్కులతో యెలాగోలా గండం గట్టెక్కేది . ఆంగ్లం అంటే భయమో లేదా అనాసక్తో తెలియదు కాని తెలుగు అంటే వల్లమాలిన ప్రేమ. (తెలుగు సరిగ్గా రాదనుకోండి :)
మా అబ్బాయితో ఎప్పుడూ దెబ్బలాడే దాన్ని,కనీసం వారానికి వొకసారి అయినా నాకు తెలుగులో ఒక ఇ-ఉత్తరం వ్రాయాలని. నేను కొన్నాళ్ళు రోజూ మా అబ్బాయికి ఇ -ఉత్తరం వ్రాసేదాన్ని. దానికి జవాబుగా మా అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడేవాడు . నాన్నా ! తెలుగు వ్రాయడం చదవడం మర్చిపపోతావేమో ..కాస్త తెలుగు చదువు, వ్రాయి .అంటూ తెగ నస పెట్టేదాన్ని . అబ్బ ఆపమ్మా ... నీ గోల అనేవాడు. మరీ... సోది అంటే నేను బాధపడతానని . పోనీ నా బ్లాగ్ అయినా చదువు బంగారం అని మరో చచ్చు సలహా యిచ్చేదాన్ని. అన్నీ వ్రాయి, నా పిల్లలతో కలసి మా అమ్మ ఇలా వ్రాసింది అని వారికి చూపిస్తూ తీరికగా చదువుకుంటాను, యిప్పుడు తీరిక లేదు అంటాడు 

అలాంటి సమాధానం విన్నప్పుడల్లా అసలు తర్వాత తరం పిల్లలు తెలుగు నేర్చుకుంటారా? పెద్దలు వారికి అంత శ్రద్దగా తెలుగు నేర్పుతారా? వాళ్ళు తెలుగు నేర్చుకోకపోతే నేను నా మనుమడు మనుమరాలితో ఎలా మాట్లాడాలి ? అనే బోలెడు సందేహాలు .

"అమ్మా ! నువ్వు నా దగ్గరికి వచ్చేయమ్మా " అన్నాడు నేను అప్పుడప్పుడు ధారాపాతంగా కార్చే కన్నీరు చూసి .

"వస్తాను ..కానీ నాకు ఆంగ్లం రాదు కదా ! స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు లకి వెళతాను" అన్నాను . "క్లాస్ లకి వద్దులేమ్మా.. హోం ట్యూషన్ పెట్టించుకుని నేర్చుకో! "అని చెప్పాడు .

నేను అలాంటి ప్రయత్నం లోనే ఉన్నాను 
.
పైన కథ కోసం వ్రాసిన సంభాషణ అక్షరాలా నిజం 
.
ఇకపోతే ఇది వ్రాస్తూ నా ఆలోచన మార్చుకున్నాను . నేను ఆంగ్లం నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే నా భావితరాల వారికి తెలుగుని పరిచయం చేసి వారికి తెలుగు నేర్పడం మూలంగా మన భాషకి న్యాయం చేసినట్లు అవుతుంది. నా వారితో నేను నా భాష మాత్రమే మాట్లాడుకోవాలి అని దృఢ నిశ్చయం చేసుకున్నాను
(అయినా నాకు ఈ ఇంగ్లీష్ రాదులే అనుకుంటూ ..వెధవింగ్లీష్ .అనుకుంటూ పుస్తకాలు గిరాటు కొట్టాను) .

మనలో ఒక మాట ..

మన తెలుగు కథల కోసం ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉంది . "కథ గ్రూప్" అని . ఆ వేదిక పై తెలుగు కథ గురించి మూడొంతులు మంది ఆంగ్లం లోనే చర్చలు జరుపుతారు ఆంగ్లం వచ్చి ఉంటే ఆంగ్లంలో అభిప్రాయాలు చెప్పేందుకు నేను తయారుగా వుండేదాన్నేమో ! అక్కడ నాకు ఒక్క ముక్క అర్ధం కాదు. అదంతా తెలుగువారి కోట. ఆ కోటలో ఆంగ్ల పాగా వేసేవాడిదే రాజ్యం అనుకుంటూ తప్పుకుంటాను. మన తెలుగు వాళ్లకి ఆంగ్ల తెగులు బాగా తగిలింది . అది తెలుగుని వూడ్చి పెట్టేస్తుంది. అది ఖాయం అని అనుకుంటూ ఉంటాను.
వలచి విలపించడం అంటే ఇంతే  కదా ! అని అనుకుంటాను .

పై కథ లోని భాగంలా ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారి యింట యిలాంటి సన్నివేశాలు  యెదురుకాకూడదని కోరుకుంటూ .. ప్రవాసాంద్రులు  వారి పిల్లలకి  తెలుగు నేర్పుతూ యితర   దేశీయులకి  నేర్పుతూ  మన మూలాలని మిగుల్చుతున్నందుకు మనస్పూర్తిగా  ధన్యవాదములు తెలుపుతూ

 అవును .. ఈ  టపా కి  యే౦  పేరు పెట్టా లబ్బా  !?
తెలుగు తెగులు వెలుగు చోటు  అనేస్తాను బావుంది కదా!!

(అచ్చు తప్పులుంటే క్షమించాలి)  .

16, జూన్ 2013, ఆదివారం

ఎవరూ...చెప్పరు !

స్త్రీలు మాత్రమే సున్నిత మనస్కులా? పురుషుడి ప్రేమ దక్కకపోతే ఆత్మహత్య చేసుకునే పిరికి వాళ్ళా ?

 కాలం ఏదైనా .. ఎన్ని విద్యలు నేర్చినా  స్త్రీల  యొక్క బలహీన స్వభావం బట్టబయలు అవుతూనే ఉంది వాళ్ళు కోల్పోయిన జీవితం, మోసపూరితమైన మాటలవల్ల,వ్యక్తీ గత బలహీనల వల్ల,ఆశించిన జీవితం లభించక పోవడం వల్ల  ప్రేమ రాహిత్యం తో బాధపడుతూ .. ఆత్మా హత్యలు చేసుకుంటున్నాం అని చెప్పి మరీ చేస్తున్నారు

జియా ఖాన్ మరణం  మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించింది రక రకాల కథనాలు ఆఖరిన ఆమె వ్రాసిన ఆఖరి ఉత్తరం  చదివి  భాదపడని వారు అంటూ ఎవరూ ఉండరేమో ! స్త్రీలు బలహీనమనస్కులు అని జియా ఖాన్ నిరూపించింది అంటున్నారు కొందరు.

 సెలబ్రిటీల సంగతి ప్రక్కన పెట్టి  మన చుట్టూరా  చూసినా  అవే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

చాలా మందికి ప్రేమ అనేది ఒక ఆట అయిపొయింది. ఒక దశకి చేరుకునేవరకే వారి కబుర్లు,  తర్వాత నిజస్వరూపాలు బయటపడటం  చంపడం  లేదా చావడం ఇవే కనబడుతున్నాయి

కీర్తి కండూతి కోసం ప్రాకులాడేది కొందరైతే, అవకాశాల కోసం అమ్ముడు పోయేవాళ్ళు కొందరు . ఎక్కడ చూసినా డబ్బు  డబ్బు . డబ్బు కి ప్రాధాన్యత ఇవ్వడం ఎక్కువైపోయింది  నమ్మక ద్రోహం ఎక్కువైపోయింది. ప్రేమించిన వారిని సరిగా అంచనా వేయలేక సర్వం కోల్పోయి మనసు విప్పి చెప్పుకునే వాళ్ళు లేక , ఉన్నా వారికి చెప్పుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నారు.

స్త్రీలు బలహీనమనస్కులు అని జియా ఖాన్ మాత్రమే కాదు చాలా మంది పురుషులు బలహీన మనస్కులే అని  నేను కొన్ని విషయాలు విని, చూసి రూడీ చేసుకున్నాను

కొన్నాళ్ళ క్రితమే ఒక యువకుడు అతి సన్నిహితంగా మెలిగే తన గర్ల్ ఫ్రెండ్ తనని అర్ధం చేసుకోవడం లేదని విలాసాల కోసం తనని విపరీతంగా వాడుకుని తన దగ్గర డబ్బులేక అప్పులు పాలై ఉన్నప్పుడు తన మొహం వంక కూడా చూడకుండా, కనీసం పోన్ లో కూడా దొరక్కుండా ,ముఖా ముఖి  కలసినప్పుడు  చీత్కరించుకుందని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు . స్త్రీలు మాత్రమే  కాదు పురుషులు కూడా బలహీన మనస్కులే ! అని

నిన్నటికి నిన్న ఒక మంచి విషయం విన్నాను . మా సమీపంలో ఉన్న వివాహ వేదిక పై ఒక వివాహం జరగవలసి ఉంది.క్రైస్థవ మతాచారం ప్రకారం పెళ్లి జరగవలసిన కొద్ది నిమిషాల ముందు ఆ పెళ్లిని ..ఒక యువతి వచ్చి అడ్డుకుంది. ఆమెని ప్రేమించి మోసం చేసి ఆమెకి తెలియకుండా వేరొకరిని వివాహం చేసుకోబోతున్న యువకుడిని బందుమిత్రుల సమక్షంలోనే నిలదీసి ఆ పెళ్లిని అడ్డుకుంది

మళ్ళీ ఆమె ప్రేమించిన యువకుడితో ఆమెకి వివాహం అవుతుందా లేదా అన్నది ముఖ్యం కాదు. కనీసం తనకి అన్యాయం జరిగిందని తెలుసుకున్నప్పుడు ప్రశ్నించడం కూడా చేయకుండా మౌనంగా భరించి తర్వాత వేదన చెంది,చీత్కరించుకుని, మరి కొన్నాళ్ళకి  జరిగిన దాన్ని మర్చి పోయి,మర్చిపోలేకపోతే బాధ పడి ఆత్మ హత్య చేసుకోవడం అలవాటైపోతుంది .

ఇంత పిరికితనం ని  మోస్తూ మా ఖర్మ అని సరిపెట్టుకునే వాళ్ళని చూసి జాలి పడాలనుకుంటాను నేను.
ఇప్పటి కాలంలో కన్నా ఇంతకూ ముందు తరాలలో వారు స్త్రీలు చాలా దైర్యంగా ఉండేవారు . చెట్టంత మగాడు పోయినా, వదిలేసి పోయినా   ఒంటరి స్త్రీలు పిల్లలని పెట్టుకుని దైర్యంగా  బ్రతికేవారు. జీవితం జీవించడం కోసమే అన్నట్టు ఇంటింటా బాల్య వితంతువులు గుండ్రాయి లాగా బ్రతికేవారు తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం తక్కువని  వింటూ ఉంటాం

అసలు బ్రతకడానికంటే  చావడానికంటే ఎక్కువ దైర్యం కావాలి కూడా!  బ్రితికేవాడు నిత్యం చస్తూ ఉంటాడు

మనదేశం లో ఐ ఐ టి లలో ప్రవేశం కోసం జరిగే అర్హత పరీక్షల ఫలితాలని ఇంకా ఇతర ఫలితాల ని సునిశితంగా పరిశీ లించి  చూస్తే   ప్రధమ స్థానాలలో అత్యుత్తమ రాంక్లు   సాధించిన వాళ్ళలో .. మగ పిల్లలు ఎక్కువ ఉంటారు. ఎంత బాగా చదివినా పరీక్ష సమయంలో ఆడపిల్లలు   విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు వారు మగపిల్లలతో పోటీ పడలేరు అందుకనే మేము ఆడపిల్లలు  అత్యుత్తమ రాంక్లు తెచ్చుకుంటారని  ఆశించం అని ఒక కార్పోరేట్ విద్యాసంస్థల డైరెక్టర్  అన్నారు.

స్త్రీలలో మానసిక వత్తిడి ని అధిగమించడం, ఆశాభంగం కలగితే  పాజిటివ్ గా తీసుకోగల్గడం  సమర్ధవంతంగా  ఎదుర్కోవడం లాంటి విషయాలలో ఇంకా పరిణితి సాధించాల్సి ఉంది .అందరు ఒకేలా ఉండరు ఒకేలా ప్రతిస్పందించరు   వ్యక్తికీ వ్యక్తికీ సామర్ధ్యం విషయంలో తేడా ఎలాగు ఉండనే ఉంటుంది . కానీ జీవితం మాత్రం  అందరికి ఒకటే !   జీవించడం అందరికి ఒకటే! ఆర్టిస్టిక్ గా జీవించగలగడం గొప్ప కళ .. ఆ కళ ని అందరూ నేర్చుకోవాలి. వ్యాధులు,బాధలు ,ఆశాభంగాలు అందరికి ఉండేవే! అవి ఉన్నాయని చచ్చిపోతే ఈ అసుపత్రులు అన్నీ ఏమైపోవాలి ,  సుఖం ఒకటే ఉంటే  బోర్ కొట్టి చచ్చి పోవాలనిపిస్తుంది. ఆశాభంగాలు లేకపోతే ...   సరదాగా చందమామని చేతి వేలుపై నిలబెడదామా.. అని పాటలు ఎవరు పాడుకుంటారు చెప్పండి ?

జీవితాన్ని ప్రేమించుకోవడం
జీవనాన్ని ప్రేమించడం
ఇతరుల ప్రేమని ఆశించకుండా ..
ఉండటం .. అవసరం కదా ! ..
ఇదే  సత్యం ..శివం.. సుందరం  

అని ఎవరూ చెప్పరు .. ఎవరికీ వారే నేర్చుకోవాలి . . 13, జూన్ 2013, గురువారం

చేరేదెటకో తెలిసిఅర్ధరాత్రి సమయం .. తలగడ ప్రక్కనే ఉన్న మొబైల్ రింగ్ అవుతున్న చప్పుడు . స్క్రీన్ పై కనబడుతున్న నంబరు చూసి   ఆశ్చర్యపోలేదు కానీ .. రింగ్ అయిన శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళకి  నిద్రాభంగం  అవడం అటు ఉంచి అనేక అనుమానాలు రావడం  ఖాయం అనుకుంటూనే  సైలెంట్ లోకి మార్చి బెడ్ దిగి హాల్లో ఉన్న లాండ్ లైన్ దగ్గరకి రాబోయింది  కుముద . ఆమె పోన్ దగ్గరకి వెళ్ళే లోపే  ఆ పోన్ మ్రోగడం  హాల్లో పడుకున్న తండ్రి పోన్ తీసి ఎవరూ అని అడగడం  జరిగిపోయాయి. అవతలి వ్యక్తీ  ఏమి అడిగాడో ?   తండ్రి సమాధానం ఇవ్వకుండానే  అతను లైన్ కట్ చేయడం జరిగిపోయాయి.

:"ఎవరో .. శంకర్ ఉన్నాడా అని అడిగాడు . సమాధానం చెప్పేలోగానే  పెట్టేసాడు " అన్నాడాయన ఆమె వంక అనుమానంగా చూస్తూ

కుముదకి చాలా సిగ్గనిపించింది ఎన్నడు లేనిది తండ్రి ముందు చాలా  అవమాన పడినట్లై౦ది.  నాకు ఈ స్నేహం అవసరమా.. ?  అని కోపంగా ప్రశ్నించుకుంది.  అలా ప్రశ్నించుకోవడం అనే గొప్ప అలవాటు వలనే   ఎన్నో తప్పుల బారిన పడకుండా   ఆమెని ఆమె నియంత్రించుకుంది.

"ఛీ ఛీ .. ఇతనికి బుద్ది  లేదు నన్నెందుకు  అస్తమాను  ఇలా తన  వాళ్ళ ముందు తలవంచుకునేలా నిలబెడతాడు రేపు ఉదయమే పోన్ చేసి  నాలుగు కడిగేసి అతనితో తనకున్న స్నేహానికి గుడ్ బై చెప్పాలి" అనుకుంది కోపంగా.
అలా అనుకుందో లేదో .. మెసేజ్ వచ్చిన చప్పుడు . చేతిలోకి పోన్ తీసుకుని చూసింది .. "హాయ్ బంగారం "
మనసులో ఉన్న ప్రేమనంతా రంగరించి మెసేజ్ లో  గ్రుమ్మరించినట్లు ..

చప్పున ప్రేమ పరిమళం  ఏదో కుమదని చుట్టేసిన భావన. మనసు ఆపుకోలేక ఆ మెసేజ్ ని  మనిషిని తడిమినట్లు ఆత్మీయంగా తడిమింది .. ఆమె చూపులు అప్రయత్నంగా ఆ పేరు పైన  ఆగాయి .. "సురేష్  " ఆ పేరు వింటేనే ఆమెకి  వివసత్వం. ఎన్నడూ నవ్వని పెదాలు మెల్లగా విచ్చుకుంటాయి కళ్ళలో పొంగిన   సంతోషం ముఖమంతా ఎగబ్రాకి పోతుంది  బహుశా దానిని కవుల బాషలో ప్రేమంటారేమో .! అని అనుకుంటూ నవ్వుకుంటుంది . 

అతని పరిచయం ఏ  మాత్రం ఊహించనిది.   ప్రేవేట్ ఎఫ్.ఎమ్ ల పుణ్యమా అని జీరో అవర్స్ లో కూడా కాల్ చేసి మాట్లాడటం, ఇష్టమైన పాట  కోరుకోవడం ఇష్టమైన వారికి డెడికేట్ చెయ్యడం ని బాగా ఎంజాయ్ చేసే రోజులవి
ఆ రోజే  ఆత్మీయంగా మసలుకుంటూ తమ్ముడూ అని పిలిపించుకుంటూ   ఉండే "నివాస్ " ఒక విషయం చెప్పాడు "ఈ రోజు మనలని చూడాలని ఒక లిజనర్ వచ్చారు "తార్నాక " లో ఉంటారట మిమ్మల్ని చూడాలని అడిగారు . అలా ఎవరూ కలవడం నీకిష్టముండదు  కదా ! అందుకే నువ్వు ఊర్లో లేవని అబద్దం చెప్పాను పోన్ నంబర్ అడిగారు లాండ్ లైన్ నంబర్ ఇచ్చాను"  అని చెప్పాడు

మంచి పని చేసావు అని .. మెచ్చుకుని  అతని నంబర్ తీసుకుంది  . ఎప్పుడైనా పోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటం మంచిదనే ఉద్దేశ్యం తో ముందు జాగ్రత్తగా.

అదే రోజు రాత్రి ఒక అసహన  సమయంలో ఒకే ఒక క్షణం  లో రేడియోకి లైన్ కలవడం ఆ అసహనాన్ని  తగ్గించుకోవడానికి చల్లని పాటా కోరుకోవడం అలవాటుగా ఎవరికీ డెడికేట్ చేస్తున్నారు అని  ఆర్ జె అడిగిన ప్రశ్నకి "సురేష్  " కి అని చెప్పడం జరిగిపోయాయి . పాటతో పాటు అతని కాల్ తనని పలకరించాయి  ఆ మాట ఈ మాట  తో చిన్నపాటి పరిచయం అంతే ! మరునాడు ఆమెని చూడాలనే ఆత్రుత తో అతను ప్రత్యక్షం కావడం ఏ మాత్రం  ఊహించని విషయం.

కుముద ది  పెక్యులియర్ వాయిస్..  అలాగే  ఆమె  సంభాషణా చాతుర్యం, విషయ పరిజ్ఞానం వల్ల  ఆమె  అంటే ఎంతోమందికి అభిమానం . ఆర్ జె కబుర్లు మాకెందుకు కుముద గారి మాటలు వినడం కోసమే అర్ధరాత్రుళ్ళు మేలుకుని రేడియో వింటున్నామని  అనేవాళ్ళు ఎక్కువయ్యారు  అలాంటి .అభిమానగణం  ఉన్న కుమద ని ఇష్టపడటంలో తప్పేముంది ? అంటూ .. సురేష్  తన మనసులో మాట చెప్పేయగానే గుండె గుబేల్ మంది. క్షణ కాలం అతనిని పరికించి చూసింది ఒకింత నిర్మోహమాట మైన మాట .. ఎప్పుడూ నవ్వినట్లు ఉండే కళ్ళు.,. ప్రశాంత వదనం .. ఆ నడక ఏదో ప్రత్యేకత ఉంది ఇతనిలో.,   ఆ ఆకర్షణలో పడకుండా ఉండటం చాలా కష్టం అనుకుంది.

ఒంటరిగా  ఉండే ఆమె జీవనంలోకి ఆతను ప్రత్యక్షంగా కాకపోయినా  నిత్యం పోన్ ద్వారా  మాట్లాడడంతో పరోక్షంగా జొరబడి పోయాడు. వారి వేవ్ లెంగ్త్  బాగా కలసి పోయాయి

ఒకరోజు అడిగింది "ఇలా మీరు రోజు  నాతొ మాట్లాడటం నాకు నచ్చలేదు .. మీ భార్య కి  తప్పకుండా అభ్యంతరం ఉంటుంది కాబట్టి నాకు కాల్ చేయకండి " అని చెప్పింది

"నాకు మాత్రం ఎవరున్నారు నేను మీలాంటి వాడినే ! నా భార్య నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి .. వాళ్ళ భాద్యతలో నన్ను నేను అంకితం చేసుకుని ఇష్టమైన వ్యాపకాలు కొనసాగిస్తూ జీవితం గడుపుతున్నాను " అని చెప్పాడు

కుమద ఆశ్చర్య పోయింది " ఇద్దరు బిడ్డల తల్లి . ఎంత బలమైన కారణాలు లేకుంటే  బిడ్డలని కూడా కాదని వెళ్ళిపోతుంది ? కారణాలు ఏమైనా ఆమెని మీరు వెళ్లి స్వయంగా ఆహ్వానించండి " అని చెప్పింది

అలా కుముద రెండు మూడు సార్లు చెప్పడం ఆతను మౌనం వహించడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి  ఉంటుంది అంతకన్నా తన జోక్యం మంచిది కాదు అన్నట్లు ఊరుకుండి  పోయింది. నెలలు గడుస్తున్న కొద్ది వారి రువురి మధ్య చొరవ పెరిగింది. ఏ విషయాన్ని అయినా నిస్సంకోచంగా మాట్లాడుకునే అంత స్నేహం కుదిరి పోయింది

ఒకనాడు  న్యూస్ పేపర్ లో ఒక విషయాన్ని  చదివిన కుముద వణికి పోయింది . ఏటేటా పెరుగుతున్న హెచ్ ఐ వి బాధితుల సంఖ్య అని వార్తని చదవగానే ఆమెకి చప్పున సురేష్  గుర్తుకు వచ్చాడు ' ఆ రాత్రి పోన్ చేసినప్పుడు మీ నగరంలో హెచ్ ఐ వి ఉదృతి ఎక్కువ ఉంది అని వింటున్నాను .. జాగ్రత్త .. అంటూ హెచ్చరించింది

ఆతను బిగ్గరగా నవ్వడం వినిపించింది

"ఎందుకు నవ్వుతారు ?" కినుక ఆమె గొంతులో

"నా పట్ల నువ్వు  చూపిస్తున్న శ్రద్దకి " .. అంటూ మళ్ళీ నవ్వాడు . "పర స్త్రీ ల వైపు కన్నెత్తి కూడా చూడను "నమ్మకంగా చెప్పాడు.  ఆమె రిలీఫ్ గా ఫీల్ అయింది

ఒకరోజు చనువుగా అడిగాడు .. "నేను రానా ఇంటికి ?"

ఆమెలో కంగారు .. "ఈ సమయం లోనా ? వద్దు ఎవరైనా చూస్తే బావుండదు ".

"మనిద్దరికీ ఇష్టం అయినప్పుడు ఎవరేమి అనుకుంటే మనకి ఎందుకు ? ఇప్పుడే వస్తాను "  అడిగాడు

 అతనికి అలాంటి ఉద్దేశ్యం  కలగడం ఆమె ఊహించనిది . అలాంటి అభిప్రాయాన్ని  తుడిచి వేయాలనుకుని  "సురేష్  .. నేను చెప్పేది వినవా ? "అభ్యర్ధనగా అడిగింది

"తప్పకుండా వింటాను... చెప్పు బంగారం !"

మన అభిరుచులు, ఇష్టాలు, మనకి కల్గే భావాల పట్ల ఉన్న  సారూప్యం మనలని కలిపి ఉంచడానికి ఏ మాత్రం దోహదపడదని నాకు తెలుసు.  మనది పరస్పరాకర్షణ ల వలలో చిక్కుకునే వయసు కాదు . వివాహ వైఫల్యంతో బిడ్డలనే ఊపిరి  చేసుకుని బ్రతుకున్న వారిమీ. ఎన్ని రాత్రులు మన మన లోపాలను,ఆకాంక్షలను ,  ఏ ముసుగు వేసుకోకుండా  మనసు విప్పి చెప్పుకున్నాం కదా ! . మన మధ్య మన గురించి కన్నా మన పిల్లల భవిష్యత్ గురించి కనే కలలే ఎక్కువ ఉండేవి.  సానుభూతి,కరుణ, అవగాహన తో మనం మాట్లాడుకున్న మాటలలో ఒకరంటే మరొకరికి ఉన్న గౌరవాన్ని  ఎప్పుడూ అలాగే నిలబెట్టుకునే ప్రయత్నం  చేద్దాం.  ఎవరు ఏమనుకుంటున్నారో  మనకి అనవసరం కానీ మనకి మనం అద్దంలో చూసుకుంటున్నట్లు ఉండాలి.  ఎలాంటి వికారాలు మన మనస్సులో   లేకుండా రానీయకుండా మనం ఉండలేమా? ,మన మనసులు కలిసి ఉండవచ్చు   మీరు కోరుకున్నట్లే మీ  సాన్నిహిత్యం కావాలని పదే పదే నా మనసు కోరుకుంటుంది.   అది  కూడా తప్పే కావచ్చు మీతో సన్నిహితంగా మెలిగితే  బావుండునని నా శరీరబాష చెపుతుంది  అయినా  మనం హద్దులు దాటి  స్త్రీ పురుషుల స్నేహాన్ని   శరీర సంబంధాల భాషలో చూడటం  నాకిష్టం లేదు.  నా వరకు నేను నిబద్దత తో ఉండాలని కోరుకుంటాను ఇతరులు అలానే ఉండాలని కోరుకుంటాను, అంతకి మించి ఏమైనా కొరుకుంటే మన ఈ స్నేహానికి  అర్ధం ఉండదు. .అని చెప్పి  "మీకు నా పై స్నేహం కాని మరొక  అభిప్రాయం  ఉండి ఉంటే ఆ అభిప్రాయం మార్చుకుంటే మంచిది  కూడా"  చెప్పేసింది .

"మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరోలా ఉండటం నా వల్ల  కాదు"  చెప్పాడతను

"నా వల్ల  అవుతుంది " ఖండితంగా చెప్పింది. ఒక స్త్రీ -పురుషుడు మధ్య శారీరక సంబంధం లేని స్నేహం ఉండ కూడదా  ఏమిటీ ?  మీ మగవాళ్ళు అందరూ  స్నేహాన్ని అర్ధం చేసుకోలేరూ? ఎక్కడ మొదలెట్టినా స్నేహాన్ని  తుదకు  శారీరక  సంబంధం దగ్గరకే తీసుకువచ్చి ఆపుతారు .. ఛీ చీ.. అనుకుని విసుక్కుంది

మనసులో ఇలా అనుకుంది  "మీకు పరిచయం ఉన్న ఆడవాళ్ళందరూ,  తారసపడిన వాళ్ళందరూ స్నేహాన్ని మీరు కోరుకునే స్థాయికి దించేసి ఆ స్నేహానికి మరో అర్ధం చెప్పవచ్చు . కానీ వారందరి లాంటి దానిని నేను కానే కాదని  మీకు తెలియజేయడానికి, అర్ధం కావడానికి   చాలా సమయం పట్టవచ్చు ..  మీకు  స్త్రీలందరూ  అలా ఉండరని నిరూపిస్తూ.. మీ మనసు, బుద్ది వికసించేటట్లు చేయక పొతే చూడండి అనుకుంది.  మనసులో చాలెంజ్ కూడాచేసింది.

పెళ్ళితో ముడిపడని బంధాలేవో  వారి మధ్య బలోపేతం చేసుకోవడానికి  అతను రంగం  సిద్దం చేసుకోవాలని ప్రయత్నించే లోపే సురేష్ కి అతని భార్యకి మధ్య ఉన్న  అపోహలు తొలగిపోయి భార్యని భర్తని కలపని దేవుడే లేడని అన్నట్లు వారి  కాపురం కుదుట పడింది

వారి సంసార రధం హాయిగా సాగిపోతూనే  ఉంది

అలా నాలుగేళ్ళు గడచి పోయాయి. అప్పుడప్పుడూ నిద్రపట్టని రాత్రులలో భార్య  సముఖంలోనే కుముద తో గంటలు తరబడి మాట్లాడటం ఆమె  ముందు కుమదని విపరీతంగా మెచ్చుకోవడంని  ఆ భార్య మాత్రం ఎలా ఓర్చుకోగలదు ?  కుముద తో స్నేహాన్ని, ఆమెకి చేరువకాబోయి  వీలుకాక విడివడిన  విషయాలని చెపుతుంటే   ఆమె  జీర్ణించుకోవడం ఎంత కష్టం ?  కానీ ఆతనలలాంటివన్నీ  పట్టించుకోడని అర్ధం అయ్యాక కుముద అతని పోన్ ని లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త పడేది.  వీలయితే పగటి పూట నాలుగు మాటలు క్షేమ సమాచారం .. అంతవరకే ! అలా చేయడం వలన అతనికి చాలా అసంతృప్తి ఉండేది.

"ఈ మధ్య నన్ను కావాలని నిర్లక్ష్యం చేస్తున్నావ్ ! " ఆరోపణ

"లేదు లేదు .. అదివరకు అంటే నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని ఇప్పుడు అలా కాదు ఇంట్లో నాతో పాటు కొందరు ఉన్నారు.  వారి మధ్య అర్ధరాత్రుళ్ళు మాట్లాడుతూ ఉంటే  ఏం  బావుంటుంది చెప్పండి ?  నా వాళ్ళందరూ నా గురించి తప్పుగా ఊహించడం కూడా నేను భరించలేను " వివరణ ఇచ్చింది

 నిండు యవ్వనాన్ని ఒంటరితనం తో గడిపెస్తున్నావ్? ఎందుకు అలా నిన్ను నువ్వే శిక్షించుకుంటావ్. జీవితంలో లభించిన కొన్నిటిని అందుకోవాలి. మనసైన మనిషితో సన్నిహితంగా ఉంటే  తప్పేమిటి? అతని ప్రశ్న.  

సురేష్  ! తప్పు ఒప్పుల సంగతి కాదు .. నేను ఆలోచించేది . నాది  కాని పరాయి వస్తువుని  నేను కన్నెత్తి కూడా  చూడను.  అది నాకెంత అవసరమైన వస్తువైనా సరే! మనిషైనా సరే!   నన్ను ప్రేమించే మనిషి నాకు మాత్రమే  పరిమితమైన మనిషి, నేను ఏడిస్తే అతని కళ్ళల్లో నీరుండాలి,  నేను నవ్వితే అంతకన్నా బాగా నవ్వగలగాలి, నేనే అతనై   అతనే నేనై బ్రతుకంతా ఇమిడి పోవాలి కానీ  మీరు చెప్పే పార్టిషన్ లైఫ్ నాకు వద్దనే వద్దు,  నేను కోరుకునేది  ఇవ్వగలిగే  అవకాశం ఉంటే  చెప్పండి అప్పుడా లోచిస్తాను " పట్టుదలగా చెప్పింది .

మనం అలాంటి పరిమితమైన సంబంధంలో ఉండే అవకాశం ఇప్పుడు రాదు కదా ! నా కంటూ వేరే జీవితం ఉంది పిల్లలు ఉన్నారు., ఎలా సాధ్య పడుతుంది   చెప్పు?

"అందుకేగా  నేను వద్దంటున్నాను"  స్థిరంగా  చెప్పింది

"నిన్ను చూస్తే జాలివేస్తుంది .. "

నన్ను చూసి జాలిపడవద్దు వీలయితే తిట్టుకో! ఇంకా పచ్చిగా చెప్పాలంటే దీని చుట్టూ తిరిగే కన్నా వేరేవారి చుట్టూ తిరిగినా వర్కవుట్ అయ్యి ఉండేదని  కసిగా తిట్టుకో .. సలహా ఇచ్చింది

ఆతను దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయాడు . ఇంతేనా నన్ను అర్ధం చేసుకుంది ? బాధగా అడిగాడు .

"నిష్టూరంగా ఉన్నా నేనిలాగే మాట్లాడతాను, సారీ సురేష్ !  ఇకపై ఇలాంటి ప్రసక్తి మన మధ్య రాకూడదు"  గట్టిగానే చెప్పాననుకుంది కుముద

సురేష్  కి  కుముద పై మునుపటికంటే  ఎక్కువ ఇష్టం కల్గుతుంది

ఏళ్ళు గడుస్తున్న కొద్ది సురేష్  లో బలవత్తరమైన కోరిక . భార్యని ఒప్పించి అయినా సరే కుమద కి అతని జీవితంలో స్తానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు.  అది కుముద గుర్తించి పర్యవసానం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పింది

 సురేష్ ! అంతకు ముందు మీ భార్యాభర్తల మధ్య   అపార్ధాలకి కారణమేదో నాకు తెలియదు ఇప్పుడు మీ మధ్య  వచ్చే అపార్ధాలకి  నేనంత  మాత్రం  కారణం కాకూడదని నేనో కఠిన నిర్ణయం తీసుకున్నాను. మీ నుండి వచ్చే ఎలాంటి సందేశాన్ని చూడకూడదని, మీ మాట విననే కూడదని  నిశ్చయించుకున్నాను.  నాకు ఎప్పుడూ కాల్ చేయకండి .. నన్ను కలవాలని ప్రయత్నించకండి .. అని చెప్పింది

ఆతను విననట్టే ఉండేసరికి .. ఇంకా వివరంగా చెప్పాల్సి వచ్చింది  విసుగ్గా ముఖంపెట్టి గొంతులోకి కాఠిన్యం అరువు తెచ్చుకుని

"ఈ అక్రమ సంబంధాల అవసరమో ,  అన్ కండీషనల్ లవ్  అవసరమో .. నాకు లేదు . మీకు అంతగా ఇష్టం అయింది   కాబట్టి పెళ్లి చేసుకుని రెండో భార్యగానో లేదా స్టేప్నీ  మాదిరి గానో ఉంచుకుంటానంటారు  ! అంతేగా ? మీ మగవాళ్ళ ఆలోచనలు ఎన్నటికి మారవు . ప్రేమో , వ్యామోహమో రెండిటికి తేడా తెలియదన్నట్లు బిహేవ్ చేస్తారు . మీ చేతుల్లో మైనం ముద్దగా మారేదాకా అనేక మాయమాటలు చెపుతారు మీకు కావాల్సింది దొరికాక మీ మోజు తీరిపోయాక శీత కన్ను వేస్తారు.  ముందు రోజూ ఆడదాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు . తర్వాత తర్వాత పనుల వత్తిడి అంటూ వారానికి ఒకసారి దర్శనం ఇస్తారు, మరి కొన్నాళ్ళకి మోజు తీరిపోయి పూర్తిగా  మరచిపోతారు . అందులో ఆయాచితంగా లభించే వొంక ని ఉపయోగిస్తారు, ఇంట్లో తెలిసి పోయింది .. గొడవ ఎక్కువైపోయింది అంటూ తెర దించేస్తారు.  అంతకి మించి క్రొత్తగా ఏమైనా  ఉంటే చెప్పండి!  విని నా నిర్ణయం చెపుతాను"  అని నిలబెట్టి దులిపేసింది

కుముద అలా మాట్లాదగలదని ఊహించని సురేష్  అవాక్కైపోయాడు  ఆ ఆవేశంలోనే అతనికి ఇంకొన్ని కఠోర సత్యాలు చెప్పింది

ఒకటి మాత్రం  స్పష్టంగా చెప్పగలను సురేష్  !   ఈ సహజీవన బంధంలో మిమ్మల్ని  హోల్డ్ చేయగల కెపాసిటీ నా దగ్గర ఉంటే  అందుకు బలి అయిపొయ్యేది మీ  భార్య పిల్లలు . అలాంటి హోల్డింగ్ కెపాసిటీ నా దగ్గర లేకపోతే  నాకే సొంతం కావాలనుకునే నా మరోమనసుని , ఆ మనసు నడిపించే మనిషిని నేను కోల్పోతాను. ఇంకోసారి  నన్ను అమితంగా  ప్రేమించే మనిషిని , నా  మనసుని కోల్పోయి  జీవచ్ఛవంలా బ్రతకలేను.  ఆ భాదని భరించడం కన్నా  మీరు  ఆశిస్తున్న బంధంలో మంచి చెడులని   బేరీజూ వేసుకుని  ఈ ఆశాభంగాన్ని  తట్టుకుని బ్రతకడమే నాకిష్టం నన్ను వదిలేయండి  ..నా బ్రతుకు నన్ను బ్రతకనీయండి,  చేతులు  జోడించి వేడుకుంది

సురేష్   ఏమనుకున్నాడో ఏమో కాని తర్వాతెప్పుడూ కుముదని డిస్ట్రబ్ చేయలేదు

అతనిపై  ఉన్న ఇష్టాన్ని,  ప్రేమ నంతటిని గుండెల్లో భద్రంగా దాచుకుని తన జీవితాన్ని తానూ సాధించుకునే పనిలో ఆమె అలసి పోతూనే ఉంటుంది. అతను  ఎంత దూరంలో ఉన్నా ఎన్ని ఏళ్ళు గడిచినా తన  పట్ల  సురేష్  లో ఉన్నఅబిమానం లో ఎలాంటి మార్పు లేకపోవడం చూసి బాధపడుతుంది.     ప్రేమని, ఇష్టాన్ని ప్రకటించే వారిని ఎవరు మాత్రం కాదనగలరని అనుకుంటుంది కానీ  అతనిని మాత్రం దూరంగానే ఉంచగల్గిన కఠినత్వం అలవాటు చేసుకుంది

 నేను నిన్ను వదలబొను అంటూ  అప్పుడప్పుడూ అతని పలకరింపు ..  చెప్పా పెట్టకుండా హటాత్తుగా ఊడిపడి ఆమెని అలా...  ఓ,,నిమిష కాలం చూసి వెళ్ళిపోయే చూపు .. ఎంత మర్చిపోదామన్నా ఆమెకి గుర్తుకు రాక మానవు, నిట్టూర్పు విడువక మానదు
.
కట్టువిప్పిన లేగ దూడ తల్లిని వెతుక్కుంటూ పరువులు తీసినట్లు గాఢమైన ప్రేమ నిండిన అతని పలకరింపు  తనని అతని దరికి చేర్చుతుందని  అతర్లీనంగా  ఆమెలో ఒక భయం .  అందుకే బలహీన క్షణాలకి చిక్క కుండా   ప్రేమ సందేశాన్ని మోసుకువచ్చే ఆ పోన్ ని గిరాటు కొడుతుంది    పట్టువదలని విక్రమార్కుడిలా మరొక పోన్ కి ప్రయత్నం చేస్తాడు   కుముద  నిర్దాక్షణ్యం గా  ఆ మరో పోన్ పీక నొక్కుతూనే  ఉంటుంది
.
" నా బలం ఏమిటో ,నా బలహీనత ఏమిటో అన్ని తెలిసిన అంతరంగికుడివి.  నన్ను అర్ధం చేసుకున్నట్లే ఉంటారు  , నాపై జాలి చూపుతారు  , మళ్ళీ అంతలోనే వేధిస్తారెందుకు ? అంటూ మనసు మూలుగుతుండగా స్వగతంలో అనుకోబోయి  ఒకోసారి పైకే అనేస్తుంటుంది   

" మనసు నేందుకు అలా చంపేస్తావు ! కోరికలని ఎందుకు అలా అణచి పెట్టుకుంటావు"   సూటిగా ప్రశ్నిస్తాడతను ".

"మనసా.! గినసా? జానే దో!.."  అంటుంది నవ్వుతూ

మాట మార్చేయడంలో  ఒక పట్టభదృరాలివని కితాబులిస్తాడు .

" మాట కోసం మనిషిని,  ఇతరుల కోసం  వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన మనసు నీది  కదా !  నీ గురించి నా కన్నా ఎవరికీ తెలుసు నేను కూడా అలా వదిలేస్తే ఎలా? అంటూనే . నీకున్న స్వేచ్చ ఎవరికైనా ఉండి ఉంటే లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేసి ఉండేవారో .. !! అని నిష్టూరం ఒలికిస్తాడు

 "ఇదంతా నా మీద ప్రేమ నంటావా?  ప్రేమ మాత్రమే కాదని అంతకు మించి ఆసక్తి ఉందని నాకు తెలుసులే! "  ఆట పట్టిస్తుంది

" నీకు తెలుసునని నాకునూ    తెలుసు అయినా ఇద్దరం విడి విడిగా ఉండటం కూడా తెలుసు " అంటాడు

మళ్ళీ అంతలోనే ...మనం ఒకరినొకరు మోసం చేసుకోవడం లేదు కదా !  తీరని కోరికలు ఉంటే  ఆత్మ శాంతించదంట  చనిపోయాక కూడా దెయ్యమై  ఇక్కడిక్కడే  తిరుగుతూ  ఉంటూ  పీక్కు తింటావు జాగ్రత్త ! అని ..  నవ్వుతూనే బెదిరిస్తూ ఉంటాడు  ఆఖరి రాయి వేస్తున్నట్లూ గా ...

 "నేను దెయ్యాన్ని  కాదు,  కాను కూడా ..  లైఫ్ టైమ్ ఫుల్ ఫిల్ హాపీ "  అంటూ సమర్దించుకుంటుంది

"ఎందుకు కాదు గుర్తుకువచ్చినప్పుడు దేవతలా  కళ్ళ ముందు కదలాడుతూ ఉంటావు. చికాకులలో ఓదార్చే మనసైన స్నేహితురాలివి అనిపిస్తావ్,  నిద్రని చెడ గొట్టినప్పుడు దెయ్యంలా కనిపిస్తావు." గట్టిగా నవ్వుతూ . నిజం  చెప్పేస్తాడు  

స్త్రీ -పురుషుల మధ్య ఇలాంటి ఆకర్షణలు లేకుంటే .. ఈ సృష్టి  రహస్యానికి అర్ధమే ఉండేది కాదు  నిబద్దత ,  కట్టుబాట్లు లేకుంటే ఈ కుటుంబ  జీవనానికి అంతకన్నా విలువ ఉండేది కాదు  కదా ..ఎవరైనా ఎక్కడైనా ఏది ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెదుక్కోవడం మంచిది  మరొక చోట వెదుక్కుంటే కొన్నాళ్ళకి అశాంతి తప్ప ఏది మిగలదు అనుకుంది  సురేష్ ని  గుర్తుచేసుకుంటూ కళ్ళల్లో నీళ్ళని జారనీయకుండా జాగ్రత్త పడుతూ

 నేస్తమా ! నిరాశ,తమస్సులని తడచిన కనురెప్పల మధ్య దాచేస్తే ,
పూడిపోయిన గొంతు వెనుక హృదయ వేదనని ,రోదనని మాటేస్తే
మాట మౌనం అవుతుంది .. మనసు పాట పల్లవిస్తుంది

చేరెదెటకో తెలిసి
చేరువ కాలేమని తెలిసి ...
చెరిసగమైనామెందుకో....

12, జూన్ 2013, బుధవారం

"బ్లాగ్ కథలు - సేకరణ "

బ్లాగ్ మిత్రులకి ఒక ఆత్మీయ సందేశం .

 ఇప్పుడిప్పుడే క్రొత్తగా కలం పట్టారా?  వ్రాయాలనే ఉత్సాహం మీలో మెండుగా ఉందా? మరయితే బాగా వ్రాసేయండి .మేము బాగానే వ్రాస్తున్నాం .మా బ్లాగ్ ని ఎవరు చూడటం లేదు. మా వ్రాతలు ఎవరికీ నచ్చడం లేదా అనే అసంతృప్తి మీలో పేరుకుపోతే దానిని  ఇక ఇప్పుడు తుడిచి పెట్టేయండి

మన భావ ప్రకటనకి వేదిక మన బ్లాగ్. అందులో మీరు కూడా కథలు   వ్రాసే వుంటారు . కథ కాని కథలు చెప్పే ఉంటారు. మీరు మంచి కథకులు అనే విశ్వాసం మీకు ఉంటే  మీరు బాగా వ్రాసాను అనుకున్న కథలని  . ఇప్పటికే ఆ  కథ బ్లాగ్ లో ప్రచురింపబడి  ఉంటే . వెంటనే ఆ కథ యొక్క లింక్ ని  ఈ పొస్ట్ లో వ్యాఖ్య రూపంలో   జతపరచ వచ్చును .సులభంగా మీ కథలని ఎక్కువ మంది చదివే ఒక చక్కని అవకాశం ఇది

  మీరు వ్రాసిన చక్కని కథలని చదివి "ఆహా బ్లాగ్ లలో ఇంత మంచి కథలు ఉన్నాయా .. అని ఆశ్చర్య పోయేటట్లు చేద్దాం . అసలు మన బ్లాగ్ లు ఎందులో తక్కువ చెప్పండి ..?ఇలా మన కథలని తెలుగు ప్రపంచానికి చేరువ చేద్దాం ..

వెంటనే మీ కథల లింక్ లని పంపండి  చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆహ్వానితులే!

"బ్లాగ్ కథలు  - సేకరణ  " కోసం ఏమైనా సందేహాలు ఉంటె ఈ మెయిల్ ఐ డి ని సంప్రదించండి

 blaagkathalu@gmail.com

10, జూన్ 2013, సోమవారం

అతడు - ఆమె - ఒక మొబైల్

చెమటలు క్రక్కుకుంటూ వంట గదిలో  పని చేసుకుంటున్న సౌమ్య ఫోన్ మ్రోగింది వీణ మ్రోగినట్లు.

 చేస్తున్న పని ఆపి చేతులు కడుక్కుని నాప్కిన్ తో తుడుచుకుంటూ .. పోన్ లిఫ్ట్ చేసి  వీణ మీటినట్లు .:"హలో " అంది 

"సౌమ్య  గారు నేనండి .. సుమ ని" .. అంది సుమ సౌమ్య వాళ్ళింటి పై భాగంలో అద్దెకి ఉంటారు.  పిల్లలని తీసుకుని సెలవలకని పుట్టింటికి వెళ్ళింది

"చెప్పండి  ఏమిటి విషయం ? ఎలా ఉన్నారు" అంది సుమ.
"నేను పిల్లలు బాగున్నాం  అండీ ! పిల్లల్ని తీసుకుని ఊరు వెళుతున్నాను . వారం రోజులు ట్రైనింగ్ కి వేరే  క్యాంపస్ కి వెళ్ళాలి. అత్తయ్య గారింట్లో పిల్లలని వదిలి రోజూ ట్రైనింగ్ కి వెళతాను .. మా వారికి మీరు ఒక విషయం పాస్ ఆన్ చేయాలి" అంది

"చెప్పండి .. ఏం  చెప్పాలి ??

"ఉదయం ఇంటి నుండి బయలుదేరినప్పుడు నాతొ మా ఫ్రెండ్ కూడా వచ్చారు లేట్ అయిపోతుంది అని నేను హడావిడి పడుతుంటే నాకు హెల్ప్ చేస్తూ .. టేబుల్ పై ఉన్న ఫోన్ ని బేగ్ లో వేసేసింది . నేను ఇప్పుడే చూసుకున్నాను నా పోన్ ,మావారి పోన్ రెండూ ఒకే విధంగా ఉండటం మూలంగా ఎదురుగా కనిపించిన పోన్ నా పోనే అనుకుంది . మావారు పోన్ కోసం వెదుక్కుంటారేమో ..  వారి పోన్ నా దగ్గరే ఉందని కాస్త .ఆయనకీ చెప్పండి " అంది రిక్వెస్ట్ గా..

 "అలాగే నండీ!" అంటూ పోన్ పెట్టేసింది సౌమ్య

సుమ భర్తకి విషయం చెపుదామని చూస్తే ఆతను కనబడలేదు

సుమ ఆమె ఫ్రెండ్ కూడా కూడబలుక్కుని సుమ భర్త పోన్ని  కావాలనే పట్టుకుని వెళ్లి ఉంటారు అనుకుంది సౌమ్య దానికి ఒక కారణం ఉంది సుమ భర్త  చేసేది రాత్రి ఉద్యోగం. ఆమె స్కూల్ టీచర్ . ఆమె స్కూల్ కి వెళ్ళిన టైం  లో ఎక్కువసేపు పోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు  ఆ విషయాన్ని  సౌమ్య గమనించి సుమని  హెచ్చరించింది  ఆతను గంటల తరబడి మాట్లాడుతున్నాడు . మాట్లాడుతున్నప్పుడు నేను  చాలా సార్లు గమినించాను  ఖచ్చితంగా  ఎవరో స్త్రీ  తోనే మాట్లాడుతున్నారు  కాస్త జాగ్రత్త పడండి  అని చెప్పింది కూడా.


"అవునండీ నాకు చాలా అనుమానంగా ఉంది, పైగా ఆయన పోన్ ని ఎవరిని అంటు కోనివ్వరు   పిల్లలు ముట్టుకున్నా ఊరుకోరు. కొట్టెస్తారు" అని చెప్పింది  సుమ ముఖం మాడ్చుకుని.

ఆ విషయం గురుకు వచ్చిన సౌమ్య ఇక సుమ భర్త పై సి . ఐ . డి  పని మొదలపెట్టింది అనుకుంది. అనుమానం ఏర్పడినప్పుడు ఏ భార్య అయినా నిశితంగా పరిశీలించక తప్పదు కదా!

ఓ అరగంట తర్వాత వరండా లోకి వచ్చిన సౌమ్య కి మేడ పై భాగం  లో నుండి సుమ భర్త మాటలు వినబడుతున్నాయి

" నా పోన్ నా దగ్గర లేదు .. మా ఆవిడ పట్టుకెళ్ళింది. నేనిప్పుడు  ప్రక్కింటి ఆయన పోన్ తీసుకుని మాట్లాడుతున్నాను, నువ్వు నిమిషానికి ఒకసారి మెసేజ్ లు పెట్టకు నా పెళ్ళాం  చూసింది అంటే కొంప కొల్లేరు అవుతుంది .. తనకి అసలే నా  మీద అనుమానగా ఉంది .. " అంటున్నాడు.

ఈ మాటలు వింటున్న సౌమ్యకి కూలిపోతున్న ఒక కాపురం కనిపించింది. ఇంటింటా మొబైల్ ముసలం పుట్టింది
(ముందు సరదా ..తర్వాత మాటల్లో ఏదో ఆకర్షణ, తర్వాత ఓ ..వింత ప్రేమ ,  సగ భాగానికి జరిగే ద్రోహం . ఎక్కడ చూసినా ఇదే రకం ప్రేమ రోగం )7, జూన్ 2013, శుక్రవారం

"బ్లాగ్ కథలు" గురించి ఒక ఆలోచన

బ్ల్లాగ్ మిత్రులకి నమస్తే ! అందరూ బావున్నారా అండీ !?

అడివరకటి లా రోజూ పొస్ట్ వ్రాయాలనే ఉత్సాహం తగ్గక పోయినా ..ఓ ..నిరాసక్తత  అలముకుంది.   అందుకని  ఎక్కువ బ్లాగులు చదివే  పనిలోనే  ఉన్నాను.

ఏదైనా తక్కువ వ్రాసే పని లోనే ఉన్నాను కదా! !

ముఖ్యంగా నేను వ్రాసిన పోస్ట్ లలో నేను  వ్యాసాలూ మాత్రమే చక్కగా వ్రాయగల్గాను. ఒక కథ, లేదా కవిత తో  అందరిని మెప్పించడం కూడా చాలా కష్టం కూడా . కానీ నేను కథలు వ్రాయడానికే ఎక్కువ ఆసక్తిగా ఉన్నాను.

నేను వ్రాసిన కథలు ఏ పత్రికలకో పంపి ఒక అర్ధ సంవత్సరం పాటు ఎదురుచూస్తూ  అసహనంగా ఉండటం నా వల్ల  కాదు. అందుకే వ్రాసిన వెంటనే ఠపీ మని బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను .

ఆ కథలపై స్పందన సరిగా రాకున్నా సరే  .. ఏదో నా తృప్తి  :)

ఈ వారంలో ఒక చిత్రమైన సంగతి గమనించాను . " రాయికి నోరొస్తే !? " కథ పోస్ట్ చేసిన తర్వాత  నాలుగు రోజులకి ఈ రోజు గమనిస్తే .. ఆ కథ కి 1549  వీక్షణలు వచ్చాయి

అలాగే అప్పుడెప్పుడో వ్రాసిన కథ "జాతర " కి 831 వీక్షణలు ఉన్నాయి  ఈ కథని Ashburn Virginia  లో రోజు ఒకరు చదువుతున్నట్లు గమనించాను

బ్లాగులలో వ్రాసిన కథలకి ఎవరు ఎప్పుడూ  వారి వారి కథలకి లభించిన  స్పందనలని చెప్పినట్లు నేను గమనించలేదు

ఈ బ్లాగ్ లో ఉన్న కథలని చాలా మంది చదువుతున్నట్లు నేను గమనిస్తున్నాను . కథ గ్రూప్ లో కూడా బ్లాగ్ కథలని పరిచయం చేస్తున్నారు

నాకు ఒక ఆలోచన తోస్తుంది . ఈ బ్లాగ్ లలో ఈ 2013 లో వ్రాసిన కథలలో ఒక పది లేదా పదిహేను కథలని  ఉత్తమమైనవి ఎంపిక చేయించి "బ్లాగ్ కథలు " అనే కథా సంపుటి వేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వస్తుంది

 ఈ ఆలోచన ఎలా ఉంది అంటారు !? ఆసక్తి కల్గిన వారందరూ ఒకసారి కూడి సమాలోచన చేద్దాం .

పత్రికల వారికి పంపి ప్రచురింప బడలేదు ఆన్న బాధ ని ప్రక్కకి పెట్టేసి మన మన బ్లాగ్ ల లోనే కథలు వ్రాసుకుందాం . ఔత్సాహిక రచయితలూ అందరూ .. మంచి మంచి ఇతివృత్తాలతో కథ వ్రాయడం మొదలెట్టండి .

అవకాశాన్ని బట్టి అచ్చు లోనూ ..లేదా డిజిటల్ ప్రచురణ లోను "బాగు కథలు " ని  పరిచయం చేద్దాం

నా ఈ ఆలోచన చెప్పగానే ఓ.. సాహితీ సంస్థ  వారు ఉత్తమ కథలకి మూడింటికి బహుమతులు ఇద్దాం .అని సంతోషంగా ప్రకటించేశారు

ఇంతకూ ముందు "కె ఎన్ మల్లీశ్వరి గారి బ్లాగ్ కథ ల సంపుటి " అలాగే కల్పన రెంటాల గారు  బ్లాగ్ లో సీరియల్ గా వ్రాసిన  "తన్హాయి " నవలగా రావడం చూసాం కదా!

వర్ధమాన రచయిత,రచయిత్రులందరూ  కలసి మనం  కూడా ఒక ప్రయోగం చేద్దాం .. ! పోయేది ఏముంది .. ఒక ప్రయత్నం విజయవంతం లేదా అపజయం .. అంతే కదా !

 ఆసక్తి కల్గిన వారు మీ మీ స్పందనల్ని వ్యాఖ్య ల రూపంలో తెలియజేయండి..సూచనలకి ఆహ్వానం పలుకుతూ


3, జూన్ 2013, సోమవారం

రాయికి నోరొస్తే !?" అపర్ణా! యెందుకే  బెల్లం కొట్టిన రాయిలా అలా మౌనంగా నిలబడ్డావ్  ? అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకుంది  కదాచూసే వాళ్ళు మౌనం అర్దంగీకారం అనుకుంటారు. చెప్పు, సమాధానం చెప్పు,  అడిగినవాడి చెంప చెళ్ళు మనిపించేలా సమాధానం చెప్పాలి . తప్పు చేయనప్పుడు రోషం పొంగుకు రావాలి కానీ అలా కన్నీళ్లు కార్చడం కాదు చేయాల్సింది " కోపంగా చెప్పింది తల్లి పద్మ

అపర్ణ అప్పుడూ యేమీ  మాట్లాడలేదు. అక్కడి నుండి లోపలికెళ్ళిపోయింది .

"దీని  వరుస చూస్తుంటే బాబీ  అన్న మాటలు నిజమే నేమో అనిపిస్తున్నాయి "అన్నాడు తండ్రి విశ్వం

"ఛీ.. ఛీ!  అలాంటి  మాటలనకండి. అది మన బిడ్డ . కలలో కూడా తప్పు చేసే ఆలోచన దానికి రాదు. అసలు తన మనసులో యేముందో మనకి అర్ధం కావాలి కదా ! దాని మనసుని, ఆలోచనలని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం"

"ఇది ఇలా నోరు విప్పకుండా మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే రేపు వాళ్ళకి యేమని సమాధానం చెప్పగలం? " విసుకున్నాడు

"అవతల వాళ్ళు అడిగినట్లు మనమూ అడిగి తన మనసుని బాధపెట్టవద్దు. అదసలే సున్నిత మనస్కురాలుఇన్నేళ్ళుగా యీ అనుమానపు చూపులు యెదుర్కొంటూ  అవమానపడుతూ యెలా బ్రతికిందో  నా బిడ్డ . వాడికి అసలు ఆ మాటనడానికి నోరెలా వచ్చిందో !? "గొంతులో దుఃఖం అడ్డుపడుతూ వుండగా యింకా యేదో అనాలనుకుని కూడా అనలేక  ఆపేసింది.

"ఇద్దరూ చిన్నప్పటి నుండి కలసి పెరిగినవారే కదా! అపర్ణ గురించి వాడికి మాత్రం తెలియదూ ! ఇద్దరూ ప్రేమించుకుని యిష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు . ఇపుడు యీ అనుమానాలు యేమిటో?   బయటకి పొక్కి నలుగురికి తెలిస్తే మనం తలెత్తుకుని తిరగ గలమా? ఆవేదనగా అన్నాడు విశ్వం
కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండి పోయారు

"వదినా భోజనాలు అయ్యాయా? " అంటూ గోడవతలి నుండి పలకరించింది పద్మకి ఆడపడుచు అపర్ణకి  అత్త గారైన విజయ.

“లేదొదినా, యిప్పడు చెయ్యాలి” అంటూ లోపలి రాబోయింది. "వదినా ! వొక చిన్న మాట. యిలా వచ్చి విని పో అంది. తప్పదన్నట్లుగా రెండిళ్ళ మధ్య వున్న గోడ దగ్గరికి వెళ్ళింది .

 "ఏమంటుంది అపర్ణ " యే సంగతి చెపితేనే కదా ! రేపు టెస్ట్ లకి వెళ్ళగలరు. ఎక్కువ సెలవలు కూడా లేవయ్యే! మళ్ళీ తిరిగి  వెళ్ళిపోవాలి కదా" అంది

వెర్రి మొర్రి ఆలోచనలతో జీవితాలకే సెలవు చెప్పుకునే పరిస్థితి తెచ్చింది నీ కొడుకు, యిక నా కూతురిని యే౦  చెప్పమంటావు ? మీకేమైనా  చేతనైతే మీ  కొడుకుకే కాస్త గడ్డి పెట్టండి " అంటూ అక్కడి నుండి విసురుగా వచ్చేసింది

లోపలి వచ్చి చూస్తే పిల్లలిద్దరినీ కూర్చోపెట్టుకుని అన్నం తినిపిస్తున్న అపర్ణ కనిపించింది. పోన్లే! కూతురైనా యే ఆలోచన లేకుండా పిల్లలతో స్థిమితంగా కనబడింది అనుకుంది

అపర్ణ పిల్లలు లిద్దరిని నిద్ర పుచ్చి వచ్చే దాకా వుండి ముగ్గురు కలసి అన్యమనస్కంగానే భోజనాలు ముగించారు.
గదిలోకి వెళ్ళబోతూ ఆగిన అపర్ణ "అమ్మా!  రేపు పిల్లలిద్దరినీ  DNA టెస్ట్ కి తీసుకుని వస్తామని వాళ్ళకి  చెప్పమ్మా " అని చెప్పి లోపలి వెళ్లి తలుపేసుకుంది.

ఆ మాట విన్న అపర్ణ తండ్రి నిశ్చింత గా పడుకున్నాడు . తల్లి పద్మకి దుఖం పోర్లుకొస్తుంది
భర్త వైపుకి తిరిగి యిప్పుడైనా మన బిడ్డని నమ్ముతారా? అంది .

"ఇక్కడ నమ్మడం నమ్మక పోవడమన్నది సమస్య కాదు పద్మా, యెవరికైనా తల్లి నిజం తండ్రి నమ్మకంఆ నమ్మకమే ప్రశ్నార్ధకం అయి కూర్చుంటే దానికి నిరూపణ చేయాల్సి రావడం ఆ తల్లికి  కష్టమేకానీ తప్పదు, నమ్మకం లేనివాడు నా మేనల్లుడు, అల్లుడు కావచ్చు అవమాన పడుతుంది నా కూతురు కావచ్చు. ముద్దాయి స్థానంలో మన అమ్మాయి నిలబడి వుంది కాబట్టి నిరూపించుకోవాల్సిన అవసరం మనకి వుంది కదా! అందుకు అపర్ణ వొప్పుకున్నందుకు బరువు తీరినట్లు వుంది" అన్నాడు

మీరు యెన్నయినా చెప్పండి, ఒక తల్లిగా కన్నా వొక స్త్రీగా నేను యీ విషయాన్ని అంత  తేలికగా తీసుకోలేకపోతున్నాను.  మగవాడు తన బిడ్డలని చూసిన ప్రతి క్షణం వీళ్ళు నాకే పుట్టారా ? లేక యెవరికైనా పుట్టి వుంటారా నన్న అనుమానంతో చూడటం మొదలైతే ఆ బిడ్డలని ఆతను మనఃస్పూర్తిగా ప్రేమించగలడాఆ భార్యని విశ్వసించగలడా అపర్ణ మాత్రం క్షణ క్షణం  అలా అవమానింపబడటాన్ని యెలా తట్టుకోగలదు ? అంత  కన్నా నరకం మరొకటి వుంటుందంటారా? అడిగింది

"జీవితం అంటే నమ్మకం పద్మా! ఆ నమ్మకం లేనప్పుడు కొన్ని జీవితాలు ఇలాగే ఉంటాయిభారంగా చెప్పాడు
 పద్మకి  అప్పుడెప్పుడో చూసిన  "అస్తిత్వ్ " చిత్రం గుర్తుకు వచ్చింది. ఆ చిత్రం లో  "అదితి " లాగా తన కూతురు భర్త యెడబాటుతో పరాయి పురుషుడికి సన్నిహితమయిందేమో అన్న అనుమానం కల్గింది. కానీ అలాంటి అనుమానాలన్ని పఠాపంచలు  అయిపోయాయిమరునాడు జరగబోయే విషమ పరీక్ష గురించి వారికి యెలాంటి సందేహం లేదు . అపర్ణ నడవడిక మంచిది కానట్లయితే భర్త బాబీ అనుమానం నిజమైన పక్షంలో ఆమె టెస్ట్ లకి వొప్పుకునేదే కాదు   అపర్ణ యీ విషయాన్ని ముందు అవమానంగా తీసుకుంది తర్వాత యేడ్చింది, ఆ తర్వాత మౌనం వహించింది. కొంత ఆలోచన తర్వాత   ఆఖరికి నిరూపణకి వొప్పుకుంది కానీ తర్వాత భర్త తో కలసి వుండగలదా కూతురి మనస్తత్వం తెలిసిన పద్మ మనసులో అనేక ఆందోళనలతో తెల్లారిపోయింది

అపర్ణని,  పిల్లలిద్దరినీ తీసుకుని పద్మ, విశ్వం కారు ఎక్కి కూర్చున్నారు  "ఎక్కడికి వెళదామంటారు బావా " అడి గాడు  విశ్వం .

 బాబీ తండ్రి "వాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి కదా బావా అని విసుక్కుంటూ "ఎక్కడికి వెళ్ళాలి రా ?" అని అడిగాడు. ఒక పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ పేరు చెప్పి అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్న వొకతని పేరు చెప్పి అతనిని కలిస్తే అవసరమైన పరీక్షలు చేస్తారని చెప్పాడు

ఆ విషయం చెపుతున్న బాబీ  వైపు అభావంగా చూసింది అపర్ణ. రెండు కార్లలోను రెండు కుంటుంబాల వారు కలసి  ఆ హాస్పిటల్ కి వెళ్ళారు

DNA టెస్ట్ అంటే ఏమిటో, పిల్లలని టెస్ట్ ల పేరిట యెన్ని సూదులు పొడిచి నమూనాలు సేకరిస్తారో ?పాపం,పుణ్యం  యేమి యెరుగని అమాయకపు పిల్లలెలా తట్టుకుంటారో ఆని భయపడిపోయింది పద్మ .అవన్నీ యేమి లేకుండానే పిల్లలని యేమి హింస పెట్టకుండానే వొక గంట లోపే పిల్లలిద్దరికీ పరీక్షలు నిర్వహించి పంపేసారు.

వచ్చేటప్పుడు  అపర్ణ వాళ్ళతో పాటు కారెక్కిన విజయ. యింటి ముందు కారాగగానే దిగి అపర్ణ ప్రక్కకి వచ్చి .. "నువ్వు కాస్త పద్దతిగా, విరగబాటు లేకుండా వుండి  వుంటే  ఈ పరీక్షల తంతు వుండేది కాదు కదా ఆడవాళ్ళు యెంత చదువుకున్నా, వుద్యోగాలు చేసినా, వూళ్ళేలినా  మగవాడితో పోటీ పడరాదే అంటే వూరుకోలేదు. వాడితో సమానంగా వుద్యోగాలు  చేయాలి అన్నావ్ఇద్దరూ వేరు వేరు వూర్లలో వుద్యోగం చేయడం , నెలల తరబడి ఆపీస్ పనులపై టూర్ లెళ్ళీ  ఆ పై బిడ్డలని కంటే మగవాడికి నమ్మకం కుదరొద్దు . ఏ వూరి ఆంబోతు అయితే మాకేమిటి,మా దొడ్లో ఈనితే చాలనుకుంటానికి యిదేమన్నా పశువుల కొట్టమా !? వంశం ,ఆచారం, పోలికలు యెన్ని వుండాలి ! అవన్నీ వుంటే  వాడెందుకు అనుమానపడతాడు " అంటూ  అనాల్సిన నాలుగు మాటలు అనేసింది

అపర్ణ యిప్పుడూ  యేమి మాట్లాడలేదుఅక్కడి నుండి మౌనంగా లోపలి  వెళ్ళిపోయింది

మరో నాలుగు రోజుల తర్వాత  విశ్వం యింటి ముందు పదిమంది పెద్దలు కూర్చుని పంచాయితీ మాదిరిగా మాట్లాడుకుంటున్నారు

"మీరైనా చెప్పండి అన్నయ్యా ! మా అన్న విశ్వానికి  మా వదినకి వెరుపు అనేది లేకుండా పోయింది కూతురేమంటే దానికి తందానా అంటూ తలూపుతున్నారుదాన్ని కాస్త మందలించి కాపురం నిలబెట్టవద్దూ ! జరిగి పోయిందేదో  జరిగి పోయింది, పిల్లలిద్దరూ వాడి బిడ్డలే అని తెలిసిన తర్వాత బాబీ బాగానే వున్నాడుగా, పెళ్ళాం మాట్లాడకపోయినా బిడ్డలిద్దరినీ యెత్తుకుని మురిపెంగా  చూసుకుంటున్నాడు కదా! వెళ్ళేరోజు దగ్గరబడుతుంది అన్నీ సర్దుకోమని చెప్పడానికి వెళ్ళాడు . ఇకపై వుద్యోగం చేయాల్సిన పని లేదు, యింట్లో వుండి  పిల్లలని చూసుకుంటే చాలని చెప్పాడు. ఆ మాటకి శివంగిలా విరుచుకు పడి వాడిని బయటకి నెట్టేసింది. ఆడడానికే అంత  పొగరుంటే మగాడు నా కొడుకుకి యెంత  పొగరు వుండాలి " అంటూ పెద్ద పెద్దగా మాట్లాడ సాగింది.

నువ్వేమంటావ్ విశ్వం ? అడిగారు పెద్దమనుషులు

"నేనేమంటాను బాబాయ్! అపర్ణ చిన్న పిల్లేం కాదు కదా! తన నిర్ణయానికి తనని వదిలేద్దాం అనుకుంటున్నాను ".
"ఇద్దరికీ కావాల్సిన వాడిగా నేను చెపుతున్నాను జరిగిందేదో జరిగిపోయింది . వాడు  వెదవ ఆలోచనలే చేసాడు . సీతమ్మ వారిలా అపర్ణ అగ్ని పరీక్షనే యెదుర్కొంది  కాదనను, కానీ కొంచెం సర్డుకుంటే  కాపురం నిలబడుతుంది . పైగా మీరేమి పరాయి వాళ్ళు కాదు. అన్నా-చెల్లెళ్ళ మధ్య యేమి జరిగినా తప్పు యెవరిదయినా సర్డుకుంటే తప్పేమీ లేదు  అందులో ప్రక్క ప్రక్క యిళ్ళలోనే వున్నారు తెల్లారి లేచింది మొదలు వొకళ్ళ ముఖాలు వొకళ్ళు చూసుకోవాలి " సర్ధి చెప్పే ప్రయత్నం చేసారు బాబాయ్.

విశ్వం భార్య పద్మ వైపు చూసాడుఅది అర్ధం చేసుకున్న ఆమె  లోపలికెళ్ళి అపర్ణ ని పిలుచుకుని వచ్చింది
"ఏమ్మా  అపర్ణా! బాబీ పిలుస్తున్నాడు కదా పిల్లలని తీసుకుని వాడితో  వెళ్ళమ్మా " అనునయంగా చెప్పాడు

"నాకు విడాకులు కావాలి తాతయ్యా" కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పింది.

ఆ మాట వినగానే కూర్చున్న కుర్చీలో నుండి లేచి కుర్చీ విసిరి కొట్టాడు బాబీ."ఏమిటి  ఎక్స్ ట్రా వేషాలు వేస్తున్నావ్ ? టెస్ట్ రిజల్ట్స్ రాగానే పెద్ద ప్రతివత నయిపోయాననుకున్నావా ? నీ వేషాలు నాకు తెలియదు అనుకున్నావా? అందరి ముందు నంగనాచిలా వేషాలు వేయకు,లగేజ్ సర్దు రేపే ప్రయాణం " అన్నాడు

"నాకు విడాకులు కావాలి " మళ్ళీ అదే  స్తిరమైన మాట అపర్ణ నోటి వెంట.

నీకు విడాకులు కావాలి  అంటున్నావ్ ! అందుకు కారణం ఉండాలి కదా అడిగాడు తాతయ్య
"తాతయ్యా నీకు ఐదుగురు పిల్లలు  వున్నారు, నువ్వెప్పుడైనా మా అమ్మమ్మని వీడు నాకే పుట్టాడా అని అడిగావా ? " అని అడిగింది

"ఛీ ఛీ అదేం మాటమ్మా తాళి గట్టిన భార్యని బ్రతుకంతా నాతోనే అరగదీసుకుందామని  వచ్చినామెని అలా అనుమానం గా చూడగలనా? తప్పు అలా మాట్లాడకు " అన్నాడు చప్పున.

"అత్తా ! మీకు పిల్లలు పుట్టడం ఆలస్యం అయిందని మామయ్యా లేకుండా నువ్వు సేవల కోసమని  ఆశ్రమాలకి ఇంకా అప్పుడప్పుడు గురు పీఠాలకి వెళ్లి ఇరవై రోజులు  పాటు ఉండేదానివి కదా! ఆ తర్వాత యెన్నేళ్ళకో బావ పుట్టాడు . అప్పుడు వీడు నాకే పుట్టాడా అని మామయ్యా నిన్ను అడిగాడా? " అడిగింది .

" ఏంటే ! నోటికి యెంతొస్తే అంత మాట్లాడుతున్నావ్ ? చెప్పు తీసుకుని కొడితే పళ్ళు రాలతాయి జాగ్రత్త " అని  అపర్ణ ని కొట్టడానికన్నట్లే  వొక్క వుదుటున లేచింది విజయ

"నేను మాటవరసకి అడిగిన మాటలకే  మీరు యింత నొచ్చుకుంటే ఆరు సంవత్సరాల పాటు అనేక అనుమానాలు వున్న యితనితో కాపురం చేసినందుకు నేనేమనాలి. ఇద్దరం ఒకేరకం చదువు చదివాం,  ప్రేమించుకున్నాం, యిద్దరి వైపు  పెద్దవాళ్ళు వొప్పుకుని రంగ రంగ వైభవంగా పెళ్లి చేసారు, ఇద్దరూ అవకాశాలు దొరక బుచ్చుకుని విదేశంలో వుద్యోగం చేసుకుంటున్నాంకొన్నేళ్ళు చెరొక చోట వున్నంత మాత్రాన నన్ను అనుమానించాలా ? నాకు పుట్టిన పిల్లలకి తండ్రి అతనేనా  అన్నది సందేహమే! బిడ్డలని యెత్తుకున్న ప్రతిసారి వాళ్ళ వైపు అనుమానంగా చూస్తాడు, వాళ్ళని వున్నట్లు వుండి  బంతిని విసిరినట్లు విసిరి కొట్టి వెళ్ళిపోతాడు,తోటి  ఉద్యోగితో మాట్లాడినా తప్పే! వాడేనా నీ రహస్య స్నేహితుడు అంటాడు, సంవత్సరాల తరబడి మౌనంగా అతని అనుమానాలని  భరించాను, అవమానాల్ని యెదుర్కొన్నాను తాతయ్యా.  ఇప్పుడు నిజం నిరూపించుకున్నా సరే అతనితో కలసి నేనుండలేను” ఖచ్చితంగానే చెప్పింది.

నువ్వు చెప్పింది నిజమే ననుకో, యేదో తప్పు జరిగిపోయింది. నువ్వు కాస్త సర్దుకుంటే బావుంటుందని .

"తర తరాలుగా, యుగ యుగాలుగా ఆడదానికి యీ శీల పరీక్షలు, అవమానాలు వుండాల్సినదేనా !? మనం నేర్చిన నాగరికత ఇదేనా! మనిషి పై నమ్మకం లేనప్పుడు ఆ మనిషికి పుట్టిన బిడ్డలని తన బిడ్డలా కాదా అని అనుమానంతో చూసేటప్పుడు  ఆ బంధానికి  వున్న విలువ యేపాటిదన్నది ప్రశ్నించుకుంటే చాలు సమాధానం దొరుకుతుంది . ఇక్కడ యెవరి సంస్కారం యే  పాటిదో  మీఅందరికి  తెలియడం లేదా ? నేనెందుకు అతనితో కలసి వుండాలో చెప్పండి ?

"బిడ్డలున్నారు కదమ్మా ! వారి కోసం అన్నీ భరించాలి,నీ వొక్కదానికే   కొత్తగా కష్టాలు వచ్చాయాఇలాంటివి చాలా విన్నాం . తర్వాతర్వాత అవే సర్దుకుంటాయి " రాజీ దోరణిలో చెప్పింది విజయ

నిజమే అత్తా! అందరికి యెన్నో కష్టాలు వస్తాయి. వాటిని యెదుర్కోవాలి కాదనను. ఇలాంటి అవమానకరమైన ప్రశ్నతో నన్ను నేను యెలా సముదాయించుకోవాలో  చెప్పండి ? ఆడవాళ్ళు మగవారితో సమానంగా చదువుతున్నారు, వుద్యోగాలు చేస్తున్నారుఇద్దరూ కలసి వుండే అవకాశం  లేక భర్త వేరొక చోట వున్నంత మాత్రానా అతను  వేరొక స్త్రీ తో సంబంధం పెట్టుకున్నాడనిబిడ్డలని కన్నాడని నేను అనుమానించానా ? కానీ  ఆతను అదే చేసాడు. ఆతను అలా చేసాడు కాబట్టీ నేను  కూడా అలాగే చేస్తాననుకుంటున్నాడుఅంతెందుకు అంతరిక్షంలోకి కల్పనా చావ్లా , సునీత విలియమ్స్ పురుషులతో కలసి  వెళ్ళ లేదా వుండ లేదా ! వారిని అనుమానించ గలమా? ఆ ఆలోచన మనకెవరికైనా వస్తుందా కానీ వారిని కూడా అవమానకరంగా మాట్లాడే  భయంకరమైన మనస్తత్వం కల యిలాంటి వాడితో కలసి వుండటం నాకిష్టం లేదు" ఖరాఖండిగా చెప్పింది

"ఓ యబ్బా తెగ ఉపన్యాసాలు చెపుతున్నావ్ కదే! నా కొడుకు వద్దనుకున్నప్పుడు నా కొడుకుకి పుట్టిన బిడ్డలు నీ దగ్గర ఎందుకే ? నా మనుమల్లిద్దరినీ  యిచ్చేయి " అంటూ పిల్లల్ని తీసుకోబోయాడు అపర్ణ మామగారు

"నా పిల్లల మీద చెయ్యేస్తే మర్యాద దక్కదు, నరికి పారేస్తాను . DNA  టెస్ట్ లు చేయక పొతే   వీళ్ళు నీ కొడుకు కే  పుట్టారని నేను చెపితేనే కదా తెలిసేది " అంది ఉగ్రకాళిలా మారి.

"ఈ పిల్ల హద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంది వీళ్ళకి మనం చెప్పలేం, మన దారిన మనం పోదాం పదండి వాళ్ళు వాళ్ళే తేల్చుకుంటారు" అని లేచి పోబోతున్నారు పెద్ద మనుషులు

"న్యాయం చెప్పడానికి వచ్చిన పెద్దల్లారా ! నా యీ  వొక్క మాట వినిపోండి,  నాకిన్ని మాటలు చెప్పారు కదా ! నేను చెప్పే   వొకే వొక్క మాట  విని ఆ మాటల గురించి ఆలొచించండి." అడిగింది

అందరూ అపర్ణ  యేమి చెపుతుందా అన్న ఆసక్తితో  వినడానికి నిలబడి వుండిపోయారు

" అలాగే  ఈ బిడ్డలకి తండ్రి యెవరు ? అని అని నన్ను గ్రుచ్చి గ్రుచ్చి ప్రశ్నించిన  భర్త గారు, అత్తగారు  నా మాటకి సమాధానం చెప్పి వెళ్ళాలి పంతంగా అన్నట్లు అడిగింది.

"ఇది అన్నీ ఇడిచేసి రోడ్డుకెక్కింది. దీనితో మనకెందుకు ? నాలుగునెలలు తిరిగేలోగా దీన్ని మించిన దాన్ని తెచ్చి నీకు పెళ్ళి  చేస్తాను పోదాం పదరా అని కొడుకుని లాక్కేళుతున్న మామగారి ముందుకి వెళ్లి అడ్డంగా నిలబడి 

"ఆడవాళ్ళు తరతరాలుగా నోరు విప్పి ప్రశ్నించకుండా బండ రాళ్ళలా పడి వుంటున్నారు కదా అని యిష్టమొచ్చినట్లు మాట్లాడవద్దు. మీ దౌష్ట్యాలన్ని  యె౦డగట్టే రోజొకటి వుంటుందని తెలుసుకుంటే మంచిది. రాళ్ళకి నోరొస్తుందిపెదవి విప్పని యె౦తోమంది  ఆడవాళ్ళు దగ్గర  మీ మీ నిజాయితీలు భద్రంగా దాగున్నాయి మామయ్యా !   మీ వంశ వృక్షం యిక్కడ వూరి చివర  వాడలలోను, యిళ్ళ మధ్యనూ, విదేశాలలోనూ కూడా  వున్నారు, వారిని తెచ్చుని భద్రంగా యింట్లో పెట్టుకుని మీ గౌరవాన్నిమీ  పురుష అహంకారాన్ని  భద్రంగా కాపాడుకోండి. ఇకపై కోర్టులో కలుసుకుందాం అంటూ లోపలికి నడిచింది.

అమ్మమ్మ తాతయ్యలని అంటిపెట్టుకుని జరుగుతున్న గొడవేమిటో తెలియని పసివాళ్ళ వద్దకి వెళ్ళి  వారిని  దగ్గరగా తీసుకుని తన డొక్కలోకి  పొదువుకుంది.