మొబైల్ ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మొబైల్ ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జూన్ 2013, సోమవారం

అతడు - ఆమె - ఒక మొబైల్



చెమటలు క్రక్కుకుంటూ వంటగదిలో  పని చేసుకుంటున్న సౌమ్య ఫోన్ మ్రోగింది..


చేస్తున్న పని ఆపి చేతులు కడుక్కుని నాప్కిన్ తో తుడుచుకుంటూ.. ఫోన్ లిఫ్ట్ చేసి  వీణ మీటినట్టు "హలో " అంది. 


"సౌమ్య గారూ!  నేనండీ .. సుమ ని" అంది సుమ. సౌమ్య వాళ్ళింటి పై భాగంలో అద్దెకి ఉంటారు. ఈ రోజే పిల్లలను తీసుకుని సెలవలకి పుట్టింటికి వెళ్ళింది.


"చెప్పండి  ఏమిటి విషయం ? ఎలా ఉన్నారు" అంది సుమ.


"నేను పిల్లలు బాగున్నాం  అండీ ! పిల్లల్ని తీసుకుని ఊరు వెళుతున్నాను. వారం రోజులు ట్రైనింగ్ కి వేరే  క్యాంపస్ కి వెళ్ళాలి. అత్తయ్య గారింట్లో పిల్లలని వదిలి రోజూ ట్రైనింగ్ కి వెళతాను. మా వారికి మీరు ఒక విషయం పాస్ ఆన్ చేయాలి" అంది.


"చెప్పండి సుమ గారూ! ఏం  చెప్పాలి ?


"ఉదయం ఇంటి నుండి బయలుదేరినప్పుడు నాతో మా ఫ్రెండ్ కూడా వచ్చారు లేట్ అయిపోతుంది అని నేను హడావిడి పడుతుంటే నాకు హెల్ప్ చేస్తూ  టేబుల్ పై ఉన్న ఫోన్ ని బేగ్ లో వేసేసింది. నేను ఇప్పుడే చూసుకున్నాను నా ఫోన్, మావారి ఫోన్ రెండూ ఒకే విధంగా ఉండటం మూలంగా ఎదురుగా కనిపించిన ఫోన్ నా ఫోన్ అనుకుంది . మావారు ఫోన్ కోసం వెదుక్కుంటారేమో! వారి ఫోన్ నా దగ్గరే ఉందని కాస్త ఆయనకీ చెప్పండి " అంది రిక్వెస్ట్ గా.


 "అలాగే నండీ!" అంటూ ఫోన్ పెట్టేసింది సౌమ్య 


సుమ భర్తకి విషయం చెపుదామని చూస్తే ఆతను కనపడలేదు.


సుమ ఆమె ఫ్రెండ్ కూడా కూడబలుక్కుని సుమ భర్త ఫోన్ కావాలనే పట్టుకుని వెళ్లి ఉంటారు అనుకుంది. సౌమ్య దానికి ఒక కారణం ఉంది. సుమ భర్త  చేసేది రాత్రి ఉద్యోగం. ఆమె స్కూల్ టీచర్ . ఆమె స్కూల్ కి వెళ్ళిన టైం  లో ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు.  ఆ విషయాన్ని  సౌమ్య గమనించి సుమని  హెచ్చరించింది.  ఆతను గంటల తరబడి మాట్లాడుతున్నాడు . మాట్లాడుతున్నప్పుడు నేను  చాలా సార్లు గమినించాను.  ఖచ్చితంగా  ఎవరో స్త్రీ తోనే మాట్లాడుతున్నారు,  కాస్త జాగ్రత్త పడండి.  అని చెప్పింది కూడా.



"అవునండీ నాకు చాలా అనుమానంగా ఉంది, పైగా ఆయన ఫోన్ ని ఎవరిని అంటు కోనివ్వరు, పిల్లలు ముట్టుకున్నా ఊరుకోరు, కొట్టేస్తారు" అని చెప్పింది  సుమ ముఖం మాడ్చుకుని.


ఆ విషయం గుర్తుకు వచ్చిన సౌమ్య ఇక సుమ భర్త పై సి . ఐ . డి  పని మొదలు పెట్టింది అనుకుంది. అనుమానం ఏర్పడినప్పుడు ఏ భార్య అయినా నిశితంగా పరిశీలించక తప్పదు కదా!


ఓ అరగంట తర్వాత వరండా లోకి వచ్చిన సౌమ్య కి మేడ పై భాగం  లో నుండి సుమ భర్త మాటలు వినబడుతున్నాయి.


" నా ఫోన్ నా దగ్గర లేదు .. మా ఆవిడ పట్టుకెళ్ళింది. నేనిప్పుడు  ప్రక్కింటి ఆయన ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాను, నువ్వు నిమిషానికి ఒకసారి మెసేజ్ లు పెట్టకు, నా పెళ్ళాం  చూసిందంటే కొంప కొల్లేరు అవుతుంది. తనకి అసలే నా  మీద అనుమానం గా ఉంది .. " అంటున్నాడు.


ఈ మాటలు వింటున్న సౌమ్యకి కూలిపోతున్న ఒక కాపురం కనిపించింది. ఇంటింటా మొబైల్ ముసలం పుట్టింది. 


(ముందు సరదాగా, తర్వాత మాటల్లో ఏదో ఆకర్షణ, తర్వాత ఓ వింత ప్రేమ కథ,  సగ భాగానికి జరిగే ద్రోహం. ఎక్కడ చూసినా ఇదే రకం ప్రేమ రోగం )


23, నవంబర్ 2012, శుక్రవారం

మంత్రించే రింగ్ టోన్

కార్తీకమాసం .. ఏకాదశి తిది .. ఈ కార్తీకం లో నేను శివాలయం కి వెళ్ళడం ఇవాళే  తొలి రోజు. ఈ సంవత్సరం  తెల్లవారుఝామునే  పుణ్య స్నానం, దీపారాధన కోసం  దేవాలయానికి  వెళ్ళే ఓపిక లేక వెళ్ళడం మానుకున్నాను.

 సరే ఈ సాయంత్రం స్వామి కరుణతో..ప్రదోష కాలంలో మహా దేవుని సందర్శించుకుని.. నక్షత్ర మాల పూజ లో పాల్గొని దీపార్చన కావించి..

 రేపు మా "చంద్రుని" పుట్టిన రోజు కదా! ఏకాదశ రుద్రాభిషేకం గురించి మాట్లాడాలి అని  పూజారి గారి కోసం ఎదురుచూసాను.  రుద్రాభిషేకం,నక్షత్ర మాల పూజ కేటాయింపు విషయం గురించి  వివరాలు కోసం అడిగితే "అరె మీరు చెప్పలేదు కదా! అందుకే వేరేవారికి అవకాశం కల్పించాం" అని చెప్పారు పూజారి గారు.

మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు .అందుకే  తేదీ కేటాయింపు వివరాలు అన్నీ చెపుతూ.. మీకు మెయిల్ పంపాను. అని చెపితే ..మెయిల్ బాక్స్ చూడలేదని చెప్పారు ఆయన.  సేల్పోన్ కి దొరకక ,మెయిల్ బాక్స్ చూసుకోక, స్వయంగా కలవాలని వెళితే ఆయన దొరకక ..  అందరు బాగోగులు చూసే  దేవుని కన్నా పూజారి గారే బిజీగా ఉన్నారు. నేను, నా బోటి వాళ్ళు పూజారులని అలా బిజీ చేస్తారు కదా!..:)

సరే.. ఆ శివయ్య కృప అలా ఉంది అనుకుని సర్దుకున్నాను. ఇంటికి వచ్చాను.

హరుని దర్శనం అయింది హరి  దర్శనం కి కూడా వెళితే బాగుండును అనిపించింది. మా కాలనీ లో ఉన్న "రామాలయం" కి వెళ్ళాను.  (రామాలయంలో సమసంఖ్యలో ప్రదక్షిణ లు చేయాలని మా ఫ్రెండ్ చెప్పింది.)
రెండు ప్రదక్షిణలు గావించుకుని హారతి ఇస్తారని వేచి చూస్తున్నాం.

అంతలో.. పూజారి గారి సేల్పోన్ రింగ్ అయింది.. "తొలిసారి మిమ్ముల్ని  చూసింది మొదలు" .. పాట రింగ్ టోన్ .. పూజారి గారు  పూజ ఆపి పోన్ తీసి మాట్లాడారు.మళ్ళీ పూజ .మళ్ళీ పోన్ మ్రోగడం. నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. పూజారి గారికి చాలా ఇష్టమైన పాట  కాబోలు. ఎవరు పోన్ చేసినా సరే "తొలిసారి మిమ్ముల్నిచూసింది మొదలు"అంటూ.. ఆయనకీ తోలి ప్రేమలని గుర్తు చేస్తున్నట్లు ఉంది .. మంత్రాలు పఠించే పూజారి గారిని    మంత్రించే రింగ్ టోన్ ఇది అనుకున్నా..

భూసురులు ..అంటే భూమి మీద నడయాడే  దేవతలు .. చేసే పనిలో నిమగ్నం కావడం కంటే ఇతర విషయాలపై దృష్టి.. దేవాలయ పరిసరాలు,దైవ సన్నిది మాట మరచి కూడా పోన్ లో సంభాషణలు..

చికాకు అణుచుకుని.. తీర్ధం తీసుకుని వచ్చేసాం. వచ్చే దారిలో "సాయిబాబా"గుడి..
ఈ గుడిలోకి వెళ్లాం. అష్టోత్తరం చదువుతుండగానే ఈ పూజారి గారి పోన్ రింగ్ అయింది.పూజ ఆపి ఓ,,అయిదు నిమిషాలు మాట్లాడారు.

నాకు చాలా చిరాకు వేసింది. మొబైల్ తీసుకుని వెళ్ళకుండా ప్రశాంతత కోసం గుడికి వెళ్ళానా.. అక్కడా పోన్ ల గోలే!  సేల్పోన్ టాక్ లు వినడానికే వెళ్ళినట్లు గా..  ఇవి దేవాలయాలా..సెల్లాలయాలా?

అబ్బబ్బ! ఏం గోలండీ!!స్వర్గం నరకం ఎక్కడో లేవు.. మనం సృష్టించుకున్నవే! మనం ఇతరులని ఇబ్బంది పెట్టేందుకు ఉన్నవే! అంతే సుమీ!!



12, అక్టోబర్ 2012, శుక్రవారం

యాన్ ఐడియా కెన్ చేంజ్


  "యాన్ ఐడియా కెన్  చేంజ్ యువర్ లైఫ్ "..

సెల్ పోన్స్ జీవితాన్ని మార్చివేస్తున్నాయి. ముఖ్యంగా  విద్యార్ధుల జీవితాలని.  కమ్యూనికేషన్ కోసం తల్లిదండ్రులు ముచ్చటపడి  సెల్  పోన్స్ కొని పిల్లలకి  ఇవ్వడం వల్ల వారి చదువు పట్ల  శ్రద్ద తగ్గిపోతుంది కాబట్టి  
 హాస్టల్ లో ఉండి చదువుకునే పిల్లలకి సెల్ పోన్స్  ని ఇవ్వడం ని నిరోధించిన కళాశాల  యాజమాన్యం  కి తెలియకుండా కూడా విద్యార్దుల దగ్గర  సెల్ పోన్స్  ఉంటున్నాయని వినికిడి కూడా ఉంది.

అలాగే  విజిటర్స్  దగ్గర నుండి రిక్వెస్ట్ చేసి తీసుకున్న సెల్ పోన్ ల నుండి విద్యార్ధులు తల్లిదండ్రులతో మాట్లాడటం లేదని.. ఎవరు ఎవరికో పోన్ చేసి మాట్లాడుతుంటారు కాబట్టి.. సెల్ పోన్స్  ఇవ్వవద్దని  కఠినమైన రూల్స్ పెట్టారు.
సెల్ పోన్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ కూడా.. కదా !

విద్యార్ధులు వద్ద సెల్ పోన్స్  ఉండటం వల్ల  అవసరం కి ఉపయోగపడటం కన్న హాని ఎక్కువ కల్గుతున్న సందర్భాలు ఎక్కువ.

ముఖ్యంగా మెసేజెస్ సౌలభ్యంతో.. సవ్వడి లేకుండా చాటింగ్ ఆ తరువాత దమ్ముంటే డేటింగ్ ఇంకొక కోణంలో యాక్సిడెంట్స్ ఎక్కువై పోయాయి.  తల్లిదండ్రులు వద్దన్నా  పీడించి కొనిపించిన  సెల్ పోన్ ఉంటె చాలు రీచార్జ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. నాన్ స్టాప్ టాకింగ్ తో.. చదువుని చంకన పెట్టినట్లే!

ఒకప్పుడు ఓడిస్సా రాష్ట్రంలో  ఒక గ్రామంలో గ్రామ పెద్దలు  ఆడ పిల్లలకి సెల్ పోన్స్  ఇవ్వడంని నిషేదించాలని తీర్మానం చేస్తే .. నాకే విషయం నచ్చక  ఆడ-మగ వివక్ష  ఎందుకు అని బాధపడిన వారిలో నేను ఒకదాన్ని.

కానీ ఇటీవల వింటున్న ఆడపిల్లల అర్ధాంతర చావులకి కారణభూతం అవుతుందని తెలుస్తుంటే.. సెల్ పోన్స్  ఉండటం కూడా  చేటు అవుతుందని.. అనిపిస్తుంది.

విజయవాడ మేరీ స్టెల్లా  కాలేజ్లో.. పోస్ట్ గ్రాడ్యుయేషన్  చదువుతూ హాస్టల్ లో ఉంటున్న అమ్మాయి..  ఒక సెలవు రోజు తండ్రితో మాట్లాడి ఏ.టి.ఏం కార్డ్ తో.. డబ్బు విత్ డ్రా చేసుకుని.. సాయంత్రం హాస్టల్ కి వెళ్ళలేదు. మరునాడు..మా ప్రక్క వూరి పొలాల మధ్య పంటకాలువలో  శవమై ఉంది.  వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ముగ్గురు ఆడపిల్లలని ఉన్నత విద్యలు చదివిస్తున్న ఆ తల్లి తండ్రుల గుండె మంటకి కారణం సెల్ పోన్ మాత్రమే  కారణం అని తెలిసింది.  శాస్త్ర సాంకేతిక విజ్ఞానం,సమాచార  విప్లవం పుణ్యమా అని అభివృద్ధి కన్నా వినాశ కరమే ఎక్కువ కనబడుతుంది." పెరుగుట విరుగుట కొరకే " అన్న నానుడి గుర్తుకు వస్తుంది.

ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్న వారి దగ్గర కూడా సెల్ పోన్స్ ఉంటున్నాయి. సెల్ పోన్స్  వాడకంని పెద్దలు  ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. ఎదిగి ఎదగని వయస్సులో పరిపక్వత లేని ఆలోచనల  వల్ల  సెల్ పోన్  వాడకం ప్రమాదకారి అవుతుంది.

పద్దెనిమిది ఏళ్ళకు ఓటు హక్కు లాగా.. ఇరువది ఒక్క ఏళ్ళకు సెల్ పోన్  కనెక్షన్ ఇచ్చే విధంగా నిబంధన ఉంటె బాగుంటుంది అనుకుంటున్నాను. అండర్ ఏజ్ వారికి డ్రగ్స్,మద్య పానీయం అమ్మడం యెంత నేరమో.. సెల్ పోన్ ఉండటం నేరం గా పరిగణిస్తే బావుండును కదా!

కేవలం సమాచారం తెలియడం కోసమే పోన్ అవసరం అని భావిస్తే.. అతి ముఖ్య మైన పరిమితమైన  నెంబర్స్ కి మాత్రమే  కాల్  వెళ్ళే విధంగా  కార్డ్ సిస్టం ఏర్పాటు చేసి.. పబ్లిక్  టెలి  పోన్స్   నుండి అవుట్ గోయింగ్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం.. ఆ బిల్ ని తల్లి దండ్రులు చెల్లించడం చేస్తే బావుంటుందేమో..అని  అనుకుంటున్నాను.

పిల్లల జీవితాలు బాగుండాలంటే.. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో..! పిల్లలు అడుగుతున్నారని సెల్ పోన్ కొని ఇచ్చే తల్లిదండ్రులు .. సెల్ వారి జీవితాలని హెల్ చేస్తుందని ఒక్క నిమిషం ఆలోచించినా చాలు. కొన్నేళ్ళు వారిని కాపాడుకున్నట్లే.. !

విద్యార్ధి!  యాన్ ఐడియా కెన్  చేంజ్ యువర్ లైఫ్.!!


25, మే 2012, శుక్రవారం

మొబైల్ ముచ్చట్లు - ఇక్కట్లు




మహిళలు మీ మొబైల్ నంబర్లు ని ఇతరులకి ఇచ్చేముందు కాస్త ఆలోచించండి. మధ్య నా ఫ్రెండ్ ఒకరు వాళ్ళ అమ్మాయిని ..కార్పోరేట్ కాలేజ్ లో జాయిన్ చేయడానికి అమ్మాయితో కలసి వెళ్ళారు అక్కడ అవసరం అయిన చోట పోన్ నంబర్స్ ఇవ్వవలసి రావడం అవసరం కదా! అలాగే నంబర్ ఇచ్చి వచ్చిన తర్వాత నుండి మొదలయ్యాయి తల్లికి ఇబ్బందులు.
హాయ్
..అన్న పలకరింపులు ఎస్.ఎమ్.ఎస్ రూపంలో ప్రత్యక్షం.ఆన్సర్ ఇవ్వకపోయినా సందేశాల ప్రవాహం తగ్గలేదు సరి కదా పోన్ కాల్స్ రావడం మొదలయింది.
"
అసలు నువ్వెవరు..ఎందుకు ఎస్ ఎమ్ ఎస్ లు పంపుతున్నావ్? మా యోగ క్షేమాలతో..నీకేమిటి అవసరం? అసలు నా నంబర్ ఎలా వచ్చింది?ఇలా ఇబ్బంది పెడితే.. నీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది" అని గట్టిగా మాట్లాడే సరికి ..ఆంటీ!.. నంబర్ నా పోన్ లో ఉంది..ఎవరో నాకు తెలిసినవారు అనుకుని చేసాను అని చెప్పాడు.కానీ నంబర్ ఎవరిదో.. అని కాస్త కష్ట పడి సేకరిస్తే తెలిసిన విషయం ఏమిటంటే.. కాలేజ్ అడ్మిషన్ అప్పుడు రాసి ఇచ్చిన వివరాలలోని మొబైల్ నంబర్ తీసుకుని..అలా ప్రవర్తించినది.. "డీన్" స్థానం లో ఉన్న  ఒక లెక్చరర్ అని తెలుసుకుని.. వీళ్ళకి ఏం వచ్చిందే ! ఇలా ప్రవర్తిస్తున్నారు ..వీళ్ళు అసలు గురువులు స్థానంలో ఉండాల్సిన వారేనా!?  వీళ్ళు పిల్లలతో  ఎలా ప్రవర్తిస్తారో తలుచుకుంటే భయం వేస్తుంది" అని చెప్పింది నా ఫ్రెండ్.
ఇక
వాళ్ళ అమ్మాయి ఇంకొక స్టన్నింగ్ న్యూస్ చెప్పింది. తను పదవ తరగతి చదువుతున్నప్పుడు.. కో-ఆర్డినేటర్ సార్ మా క్లాస్ మేట్ అమ్మాయి అంటే ఇంటరెస్ట్ చూపించేవాడు. స్టడీ అవర్స్ లో అమ్మాయి తో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. అమ్మాయి మాట్లాడక పొతే కోపాన్ని అకారణంగా మిగతా ఆడపిల్లల పై ప్రదర్శించి తన అక్కసు తీర్చుకునేవాడు.ఆడపిల్లలపై కంప్లైంట్స్ రాసి  తన కసి తీర్చుకునేవాడట.
ఇక నా ఫ్రెండ్ ఒకామె భర్త యాక్సిడెంట్ లో చనిపోయి ఇద్దరు మగ పిల్లలతో ఒంటరి పోరాటం చేస్తూ..ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం కోర్ట్లు చుట్టూ తిరుగుతూ..ఒక సారి తన కేసు వాదించే లాయర్ కి కాల్ చేయాల్సి వచ్చింది  pపొరబాటుగా ఒక నంబర్ తప్పుతో వేరొక నంబర్ కి కాల్ చేయడం తో..ఆమెకి వచ్చి పడింది..పెద్ద ముప్పు.కాల్ చేయగానే లాయర్ కాకుండా వేరొకరు మాట్లాడటం తో..పొరబాటు తెలుసుకుని  "సారీచెప్పి లైన్ కట్ చేసిందట .
ఇక
ఆరోజు నుండి  ఆమె  పొరబాటుగా కాల్ చేసిన నంబరు నుండి అర్ధరాత్రుల్లు పోన్ చేసి ఆమెని ఎవరు మీరు ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నలు వేయడం మొదలయింది. పిల్లల ముందు రాంగ్ కాలర్ తో మాట్లాడాల్సి రావడం తో పాపం! ఆమె ఎన్ని అవస్థలు పడిందో!ఆఖరికి రాత్రుళ్ళు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. అతను పగలు కూడా  పోన్ చేయడం మొదలు పెట్టాడు. ఇబ్బంది భరించలేక నాకు కాల్ చేసి విషయం చెప్పింది.
ఇక
నేను చూసుకుంటాను నువ్వు దిగులు పడకు అని చెప్పి.. నంబర్ కి కాల్ చేసి మా బంధువుల నంబర్ అన్నట్లు మాట్లాడి..సారీ చెప్పి పెట్టేయడం మరలా మర్నాడు చేయడం ..మళ్ళీ సారీ అనడం ఇలా వారం రోజులు టిట్ ఫర్ టాట్ రుచి చూపించినా అతను ..ఆమెకి పోన్ చేసి విసిగించడం మానలేదు. రోజుకి ఆరోజు పోన్స్ ద్వారా ఏం జరుగుతుందో.. తెలుసుకుంటూ.. రాంగ్ కాలర్ కి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుని. అర్ధ రాత్రి అతని నంబర్ కి కాల్ చేయడం ..అతను భార్య ముందు పోన్ లిఫ్ట్ చేయలేక, లిఫ్ట్ చేయకుండా ఉండటం ఎందుకో భార్యకి చెప్పలేక తెగ ఇబ్బంది పడిపోయాడు.  గడ్డి పరక అని భావించిన ఆడవాళ్ళు , నానారకాలుగా ఇబ్బందులకి గురి అయిన ఆడవాళ్ళు తలచుకుంటే ఎలా ఉంటుందో ..తెలుసుకుని.. బుద్ధి వచ్చింది తల్లుల్లారా! అని దణ్ణం పెట్టేసాడు. భయ పడితే,కాస్త మెత్తగా కనబడితే అలాగే ఇబ్బంది పెడతారు. భయపడటం ఎందుకు ? అంటాను నేను.
ఇంకో
రకం వాళ్ళు ఉంటారు లెండి. మిస్ కాల్ ఇస్తారో,లేదా కాల్ చేసి అబ్బే మేము అసలు మీ నంబర్ కి కాల్ చేయలేదు అంటారు.మొబైల్ పోన్ లో మిస్ కాల్స్ లిస్టు చూసి సంస్కారంతో తిరిగి ఆ  నంబర్ కి కాల్ చేసేవాళ్ళు విషయంలో బాగా ఇబ్బంది పడతారు అని నా అనుభవం కూడా  .

ఒకోసారి
బిజీ టైములో కాల్స్ అటెండ్ అవడం వీలవక మిస్ కాల్స్ చూసి నంబర్ కి కాల్ చేస్తే మీకు మేము  అసలు కాల్ చేయలేదు అంటారు. అప్పుడు ఒళ్ళు మండి పోతుంది చూడండి.!?

ఒక సారి నాకు అలాగే జరిగింది ఒక ల్యాండ్ లైన్ నంబర్ నుండి మిస్ కాల్ వచ్చింది నేను వెంటనే నంబర్ కి కాల్ చేసాను. అబ్బే! అసలు మేము చేయలేదండి. మీ నంబర్ అసలు మాకు తెలియదు అంటాడు. లేదండి ఇప్పుడే కదా కాల్ వచ్చింది అన్నాను. ఆడవాళ్ళకి కావాలని ఇలా చేయడం ఇదొక అలవాటు అయిపొయింది..అని పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకుంటూ..ఏదో అంటున్నాడు. పోన్ ఆఫ్ చేసి నంబర్ వివరం చూస్తే మా లోకల్ నంబరే ఎక్సేంజ్ కి వెళ్లి గారిని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నంబర్ ఉన్న ఇంటి  అడ్రస్స్ ఇచ్చారు .
అడ్రెస్స్ కి వెళ్లి .. పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకున్న ఆ ఇంటాయనని,ఆయన భార్యని కూడా బయటకి పిలిచి ..కాల్ రిజిస్టర్ లో ఉన్న వారి నంబర్ ని చూపించాను. ఆమెకి నీ భర్త ఇలా మాట్లాడుతున్నాడు.అది సంస్కారమేనా అని గట్టిగా అడిగి వచ్చాను. అతను చెట్టులా నిలబడ్డాడు కానీ కనీసం సారీ కూడా చెప్పలేదు. అతని బదులు ఆమె చేతులు పట్టుకుని సారీ చెప్పింది.

మహిళల్లో కొంత మంది అతను చెప్పినట్లు చేసేవారు ఉండవచ్చు. అలాంటి వారి ప్రవర్తన వల్ల ఇతరులని కూడా అలా అనుకుంటే ఎలా!? ఏమిటో కొందరి చెడు ప్రవర్తన కల్గిన ఆడవారి వల్ల అందరు ఆడవాళ్ళకి కల్గుతున్న ఇబ్బందులు ఇవి.
అయినా ఏదో పొరబాటున ఒక కాల్ వెళితే జరిగిన పొరబాటు గుర్తించి ఓ..సారి క్షమించ మని అడగడం నామోషి అనిపించుకుంటుందో,లేకపోతే ఇంకో విధంగా కావాలని వేదించడం ,పనిగా పెట్టుకుంటారో..కాని ఇలాంటి విషయాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి.

వీలైనంత వరకు అవసరమైన చోట ఇంట్లో ఉన్న మగవారి నంబర్స్ ఇవ్వడం శ్రేయస్కరం అనిపిస్తుంది. అప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పుతాయి. అలా అని ఇబ్బందులు వస్తున్నాయని భయపడటం కూడదు.
నా ప్రెండ్ విషయం లో చూస్తే ఎక్కడో దూర ప్రాంతం లో ఉన్న ఆమె భర్త నంబర్ ఇవ్వడం కన్న కాలేజ్ తో అనుసంధానం కోసం ఆమె మొబైల్ నంబర్ ఇవ్వడం తప్పు కాదు. కానీ ఆ నంబర్ చూసి తీసుకుని కావాలని పరిచయం పెంచుకోవాలని,,ఇబ్బంది పెట్టాలని చూసిన "డీన్" స్థాయి వ్యక్తీ దగ్గర నుంచి.. అనాలోచితంగానో,లేక అహంకారం వల్లో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకునే వారి వరకు మన మధ్యనే ఉన్నారు.

పోన్ కాల్స్ తో వేధించే వారి సంఖ్యా విపరీతం గా పెరిగిపోతుంది.వేదింపులని ఎదుర్కునేవారు దైర్యంగా ముందుకు వచ్చి తమకి కల్గిన ఇబ్బందిని చెపుతూ కంప్లైంట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల గౌరవం దెబ్బ తింటుందని దాచి పెట్టుకుంటే అనేక సమస్యలు వస్తాయి.

అలాగే అవసరం అయినప్పుడు బయట వ్యక్తులకి నంబర్ ఇవ్వాల్సి వస్తే ల్యాండ్ లైన్ నంబర్ ఉంటే ఆ నంబర్ ఇవ్వడం శ్రేయస్కరం. ఎందు కంటే ల్యాండ్ లైన్ కి ఎస్ ఏం ఎస్ లు గట్రా అవకాశం ఉండదు కదా!
లేదా అసలు పోనే వద్దనుకుంటే మరీ మంచిది.ఈ నవీన యుగంలో పోన్ ల వల్ల కలిగే ఇబ్బందికి భయపడటమా?
సమస్యలకి భయపడటం గురించి మీరు చెపుతున్నారా !? అని అనుకోవద్దు.

పోన్ లేకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.అవసరం అనుకుంటే ముఖ్యమైన వారికి మాత్రమే మన నంబర్ తెలిసి ఉండటం కొత్తవారికి మొబైల్ నంబర్ ఇవ్వకుండా ఉండటం మంచిదని నా అభిప్రాయం.. ఎందుకంటే మొబైల్ హెల్ అంటే మాటలు కాదు. నానా రకాల పైత్యాలని చూడాలి .
నా అనుభవం ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యం తో ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదములు.

6, జనవరి 2012, శుక్రవారం

పోర్టబిలిటి విజయమో..వీర గర్వమో!

మొబైల్ పోన్ నెంబర్  పోర్టబిలిటి ... ఓడిన  నా పోరాట  పటిమ   

నేను దాదాపుగా ఎనిమిదేళ్ళ క్రితం హచ్..నుండి ఒక మొబైల్ కనెక్షన్ తీసుకున్నాను నాకు అంతా ఫ్యాన్సీ నెంబర్ల అభిరుచి. ఆ నెంబర్ పోస్ట్ పెయిడ్  అయితేనే ఇస్తానని.. నెట్ వర్క్ వాళ్ళు కండీషన్ పెట్టారు. సరే ఆ నంబర్   కావాలంటే..  రోట్లో తల పెట్టక తప్పదు. పెట్టాక రోకళ్ల దెబ్బలు తినక తప్పదు.

కనెక్షన్ తీసుకున్న ఓ..నాలుగేళ్ళు..వేలల్లోనే బిల్లులు చెల్లించి ఉంటాను.  ఎందుకంటె.. మా వర్కర్స్ ఇంటి నుండి ఓ..మిస్ కాల్ వచ్చేది. వాళ్ళు వెంటనే ..ఇంటికి పోన్ చేసుకుంటాం మేడం అనే వాళ్ళు.. మన వర్కర్సే కదా.. పోన్లే పాపం అని ఇచ్చేదాన్ని. నెల తిరిగి వచ్చేసరికి బిల్లు చూస్తే  కళ్ళముందు.. పట్ట పగలు నక్షత్రాలే  ఈస్టమన్ కలర్లో కనిపించేయి. అయినా తాగినోడు  తాళ్ళ పన్ను   కట్టక వేరొకరు ఎందుకు కడతారు చెప్పండి.? మొహం మాడ్చుకుని కట్టేసి బిల్ కట్టేసినాక హచ్ వాడు చెప్పే థాంక్స్ కి ఏడ్వలేక ఓ..వెర్రి నవ్వు నవ్వి బయట పడేదాన్ని.

పనిలో పని ఒకోసారి మెసేజెస్ చార్జ్ కూడా విపరీతంగా ఉండేది. అంతగా.. ఎస్ ఎమ్మెస్ లు చేసేదాన్ని. సరే...  హోం ,పైనాన్స్ శాఖలు రెండూ నావే  కాబట్టి.. వేరొకరితో తిట్ల దండకం,చీవాట్ల వడ్డింపులు ఉండేవి కాదు.  అలా హచ్ వాడిని నా నుండే.. లక్షాదికారిని చేసాక..కాస్త జ్ఞానం తెచ్చుకుని..నేనే లక్షణంగా లక్షాధి కారిగా మెలగాలని నా పోన్ కి బిల్ కట్టడం మానేస్తే.. నెలలో ఓ..పదిరోజులు.. బారింగ్లో పెట్టి.. (పెట్టించుకుని ) తీరిగ్గా బిల్ కట్టాక అవుట్ గోయింగ్ పర్మిషన్ ఇచ్చే టట్లు..తెలివిగా నడుచుకుని..వర్కర్స్ కి ద్రోహం చేసేదాన్ని. అలా నాలుగేళ్ళు గడిచి పోయాయి.

ఇంతలో..ఇల్లు షిఫ్ట్ అయ్యాం. ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ . ఒక్క పాయింట్ అయినా   సిగ్నల్ వస్తే ఒట్టు.  పోన్ అసలు మొగేదే కాదు..ఒకవేళ మ్రోగినా.. వీది గేట్ వరకు వెళితే కానీ మాట్లాడను వీలు ఉండేది కాదు. నాకు ఈ బజారు పోన్ వద్దురా బాబు అంటే..మా అబ్బాయి వినేవాడు కాదు..అమ్మో పాన్సీ నెంబర్ పొతే దొరకదు ..అనేవాడు. సరే ఏదో ఒకటి లే..చావనీ అనుకుని..ప్లాన్ తక్కువలోకి మారి..వేరే నెట్వర్క్ పోన్ తీసుకుని అది వాడుతున్నాను. ఇంతలోకి
నెంబర్ పోర్టబిలిటి  ఆశ రేపి  ఓ..సంవత్సరం..ఆటలాడుకున్నాడు. ఆశగా చూసి   చూసి  అంతా బ్రాంతి ఏనా.. అని పాటలు పాడుకునే అ..శుభ తరుణాన.. పోర్ట బిలిటి..సౌలభ్యం  వస్తునదని ప్రకటన వచ్చి రాగానే.. వోడా..పోన్ ఆఫీసుకి వెళ్లి నెంబర్ మార్చుకోవచ్చు అనుకుని తెగ సంతోష పడి పోయాను.

ఏ మాట కామాట చెప్పుకోవాలి. వోడా పోన్ వాళ్ళు   వొడ  అన్న పేరే కానీ మరీ డీప్ ప్రయ్ చేయరులే అనుకునే దాన్ని.  కానీ తర్వాత తెలిసింది కారు చవకగా లభించే సదుపాయాలూ ఇతర నెట్ వర్క్ ల లో  ఉన్నాయి అని. కానీ ఈ ఫ్యాన్సీ నెంబర్ వదలలేను. ఇలా రోజులు గడుస్తున్నాయి.  ఎట్టకేలకు.. పోర్ట బిలిటీ  నా పాలిట వరమై వచ్చింది.  పోర్టింగ్ నెంబర్ తీసుకోవడం  వోడా  పీడా వదిలించుకోవాలని ప్రయత్నించడం,  వాడు ఏదో సాకు చెప్పడం ఇలా ఓడా స్టోర్స్ చుట్టూ తిరగడం.. మొదలెట్టి  దాదాపు ఏడాది కావస్తుంది. అయినా వాడు నాకు విముక్తి ఇవ్వడు. మీరు  సరి అయిన కారణాలు చూపక పోవడం   వల్ల.. మీ నెంబర్ మార్పు సాధ్యపడదు. అని ఆ కంప్యూటర్ వాయిస్ రికార్డ్  అమ్మణ్ణి నన్ను వాయిస్తుంది.

ఇక వారి సేవలు మనలని మురిపించే విధం నానా రకములు.  పోస్ట్ పైడ్ కి వచ్చే.. ప్రింటెడ్ బిల్లు పంపడం మానేసి రోజుకొక పది మెసేజ్ లతో..బిల్ కట్టాలని గుర్తు చేసే సౌకర్యం ... ఉన్నది . ఇక బిల్ కట్టేస్తాము.ఏదైనాఅవసరం అయితే కస్టమర్   కేర్  ఉండనే ఉంది.  నెట్ వర్క్ వారి సేవలు యెంత   దయగలవి అనుకుంటాను.  అదేమిటో మన అవసరాలని మనం చెప్పా కుండానే గుర్తిన్చేసి..  ప్రొద్దున్నే సుప్రభాతం నుండి..రాత్రి పూట శుభ రాత్రి కూడా చెప్పకుండా  మనని  నాన్ స్టాప్ గా   దిల్ కుషి గా ఉంచే ఎన్నో   సేవల్ దొరుకుతుంటే.. ఇంట్లో..పెళ్ళాం బిడ్డ,అమ్మ అయ్యా ఊసేం ఎత్తకుండా రోజులకి రోజులు డోల్లించే యవచ్చు ..అనుకున్నాడట నాలాటి వెర్రి వెంగళప్ప.
 
కానీ నా నంబర్ ని ఇతర నెట్ వర్క్ లకి మార్చుకోనీయకుండా  ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అలుపెరగక..నేను  పోర్టింగ్ కోడ్ తీసుకోవడం .. నేను పోర్టింగ్ ప్రాసెస్ ని మొదలెట్టడం.. జరుగుతూనే ఉన్నాయి. ఇలా నాలుగు సార్లు వివిధ కారణాలు చెపుతూ  మార్చడం సాధ్యపడని చెప్పకుండానే.. చెపుతూ సహన్నాన్ని పరిక్శిస్తున్నారు.
ఇక ఈ సారి నేను ఉపెక్షించ దలచుకోలేదు. కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్ళా లనుకున్కుని ..  సిగ్నల్ ప్రాబ్లం గురించి  తెలియజేస్తూ..నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్లు.. వారితో.. ఒక ఆఫీషియల్ స్టాంప్ వేయించుకోవడం చాలా కష్టమై పోయింది. అలాగే..నేను పోర్టింగ్ కి ఎన్నిసార్లు ప్రయత్నించాను. ఏయే కారణాలు వల్ల వాళ్ళు నెంబర్ మార్పిడిని తిరిగి అడ్డుకున్తున్నారో.. అన్నిటిని ఉదాహరిస్తూ.. నేను కట్టిన బిల్లుల వివరాలన్నీ పొందు పరుస్తూ.. మళ్లి ఒక రిక్వెస్ట్ ని స్వయంగా ఇచ్చాను. ఈ సారి తప్పకుండా అయిపోతుంది మేడం..అంటూ..సన్నాయి నొక్కులు నొక్కి.. ప్లాస్టిక్ నవ్వులు పంచి పంపింది  అక్కడున్న ఒక సేవా భామిని.  మళ్ళీ పోర్టింగ్ గడువు ముగిసి పోయింది. నా నెంబర్ నెట్ వర్క్ మారనూ లేదు. నేను వోడాలో వడలా  వేగడం మాన లేదు. అసలు విషయం ఆరా తీద్దును   కదా.. ఏ నెట్ వర్క్ కూడా ప్యాన్సీ నెంబర్ ని  వదులుకోవడం లేదు. పోర్టింగ్ కి అనుమతి ఇవ్వడం లేదు. ఒక ఆలోచన వచ్చి  ఇలా ట్రై చేస్తే!!! కన్స్యూమర్ కోర్ట్ ... ఉందిగా..అని ఆలోచన వచ్చింది.

అదేమిటో..మా విజయవాడలో.. ఉన్న వినియోగ దారుల సేవా కేంద్రం వారు ఇచ్చిన నంబర్ ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది.. కానీ ఎవరు..అందుబాటులో ఉండరు. ఇంకా నేను ఏం చేయుదును? నా ఫ్యాన్సీ నంబర్ పిచ్చి కాదు కానీ.. ఎనిమిదేళ్లుగా అందరికి అలవాటైన నంబర్.. మా  కస్టమర్స్ అందరికి అలవాటైన నంబర్.. నేను వదల వీలుపడదు. కారణం ఏమనగా.. నెంబర్ పోర్ట బిలిటి అనేది  ఫ్యాన్సీ నంబర్స్ కాని వాళ్ళకి త్వరితంగా అవుతుంది. నా నంబర్ లాటి నంబర్ కి మాత్రం సాధ్యపడదు.  చచ్చినట్లు..వారి ఇనుప కబంధపు హస్తముల మద్య చిక్కుకుని విల విలలాదాల్సిందే! లేదా..కసిదీరా విసిరి కొట్టాల్సిందే   తప్ప వేరొక ప్రత్యాన్మయం కాన రాదు. రాదు. రాదు అని తీర్మానించుకుని.. :)))))))) తో..  పోన్ వచ్చింది. మరి   నేను మాట్లాడాలి కదా అనుకుని వీది లోకి పరిగెడుతూ.. ఛీ.. పాడు  మొబైల్ పోను - పాడు  జన్మ ..అని తిట్టుకుంటూ.. పోర్ట బిలిటి విజయమో..వీర గర్వమో! టెస్ట్ లు పెట్టుకుంటూనే ఉన్నాను.

ఎవరైనా సలహా చెపితే..  ఆ సలహా వర్కవుట్ అయితే నా తదనంతరం నా ఫ్యాన్సీ నెంబర్ మీకు ఇవ్వగలన ని  హామీ పత్రం రాసి ఇస్తానని మనవి చేస్తూ..  వోడా పై నేను చేసిన పోరాటంలో గెలిచి   నా మొహాన ఓ..విజయ గర్వం నాట్యమాడే దృశ్యం ఊహించుకుంటూ..   (కల లో అయినా ) నిద్ర వస్తుంది..ఫ్రెండ్స్.. శుభరాత్రి..

15, నవంబర్ 2011, మంగళవారం

మొబైల్ హెల్

నాకు ఈ మద్య మొబైల్ పోన్ వాడకం పట్ల విరక్తి పెరిగిపోయింది. ఎక్కడికైనా వెళుతున్నా మొబైల్  పోన్ వెంట తీసుకుని వెళ్ళడం మానేసాను. ఏమి అయి  పోయావ్? ఆ మొబైల్ పోన్  ఎందుకు నీకు? ఆ  బందరు కాలవలో పడేయి .. అని విసుక్కుంటున్న ఫ్రెండ్స్ కి .. బిజీ తల్లి.. అని నైస్ గా తప్పుకుంటాను. ఎందుకు అంత విరక్తి అంటారా? ఒకప్పుడు తెగ మోజు పడి కొనుక్కుని తెగవాడి పడేసి ..ఇప్పుడు మనుషులతో మాట్లాడటమే  విసుగేసి..ఇలా..

నేను ఒక  సంవత్సరం నుండి ఒక నియమం పెట్టుకున్నాను. రాత్రి 8  గంటల తర్వాత  పోన్  మాటలాడ కూడదని. ఎందుకంటారా!? ఆ పోన్ మ్రోగిందంటే ఇంట్లో అందరితో  కలసి భోజనం చేయడం కి..నీళ్ళు ఒదులుకొవాల్సిందే.!  ఆఖరికి స్నానం చేసే టైములో..కూడా..నాలుగు సార్లు మ్రోగి.. ఏదో కొంపలంటుకు పోయినట్లు.. ఎక్కడికి వెళ్ళావ్ ఇంత సేపు అనే ప్రశ్న వినగానే చిర్రెత్తుకొస్తుంది. చేసిన వాళ్ళు కస్టమర్స్ కావచ్చు. ఫ్రెండ్స్ కావచ్చు,బందువులు కావచ్చు.  ఇక పెళ్లి,పేరంటాల్లకి,జనన మరణాలకి..అన్నిటి కబుర్లు మోసుకొస్తుంది. నేను వీలు కుదరక  వెళ్ళ లేని స్థితులు. మళ్ళీ రాలేదు ఎందుకని ప్రశ్నలు,నిష్టూరాలు. ఒకోసారి కొందరు  పరిచయస్తులు,ఖాతాదారులు  అయితే.. ఏదైనా పని బడితే.. ఒకటే విసిగించేస్తారు.అందుకే పోన్ మాట్లాడుతుంటే కస్టమర్స్ వచ్చారని ,కస్టమర్స్ అయితే పోన్ వచ్చిందని తప్పించుకుంటాను.అందుకు..కొన్ని రహస్య  క్రియలు ఉన్నాయి లెండి.  ఒకోసారి మా వర్కర్స్  తో పోన్ తీయించి "మేడం బయటకి వెళ్ళారండి అని చెప్పిస్తాను". అంతగా విసిగి పోయాను.  

ఏదైనా ముఖ్యమైన పోన్ అయితే ఎవరికి  తెలియకుండా ఉన్న నెంబర్ కి మాత్రం కాల్స్ వచ్చే టట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటె  రాత్రి సమయాల్లో   వచ్చే పోన్ ల వల్ల నిద్ర చేటు.ఫ్రీ కాల్స్ వల్ల అనవసరం అయిన విషయాలు కూడా విని విని చెవులు దిబ్బడ వేస్తున్నాయి. రాత్రి సమయంలో అయితే ఫ్రీగా ఉంటామని ఫ్రెండ్స్  వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఇక మెసేజెస్ సంగతి సరే సరి. నేనైతే.. కొన్ని మెసేజెస్ చదవను కూడా చదవను.వెంటనే డిలేట్ చేసి పడేస్తాను. అవి చదివి,రిప్లై ఇచ్చే ఓపిక కూడా నాకు లేదు.ఒకప్పుడైతే "నొక్కింది చాల్లెమ్మా ..ఇక పడుకో!అని కసురుకునే వరకు.. మెసేజ్ లతో చాట్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మెసేజెస్ హింస తాకిడికి మొబైల్ పోనే వద్దు బాబు అనుకునే స్థితికి నేను వచ్చేసాను.

ఇక యువతరం అయితే మొబైల్ ఫోన్ వాడకంలోకి వచ్చాక మనుషులు సాటి వారితో..మాట్లాడం అరుదైపోయింది. ఎక్కడెక్కడో  ఉన్న దూర ప్రాంతం వారితో.. గంటల తరబడి మాట్లాడుతూ..చుట్టూ ఉన్న మనుషుల  గురించే పట్టించుకోరు. ముఖ్యమైన విషయం చెప్పటానికి కూడా దగ్గరి వారికి అందుబాటులోకి ఉండరు.
ఇప్పటి యువతరమే కాదు.. మద్య వయస్కులకి కూడా మొబైల్ ఫోన్ ఒక వ్యసనం అయిపొయింది. ఫ్రీ కాల్స్ ,నైట్ కాల్స్ ,ఫ్రీ మెసేజెస్ ..వీటన్నిటి హవా .. నడుస్తుంది. ఏ వస్తువు అయినా అవసరం మేర వాడుకోవడం మంచిది. అవసరానికి మించి వాడటం వ్యసనం అయితే..దానివల్ల వచ్చిన పర్యవసానం ఎలా ఉంటుందో.. ఈ చిన్ని చిత్రం లో చూడండీ!

8, నవంబర్ 2011, మంగళవారం

ఆడపిల్లలవి భద్రత లేని బతుకులు

ఈ రోజు ఒక సంఘటన జరిగింది. మా వర్క్ షాప్ లో పని నేర్చుకునే లక్ష్మి ఒక విషయం చెప్పగానే భయం వేసింది .ఏమిటీ ఈ పరిస్తితి?  ఆడపిల్లల కి ఏ మాత్రం భద్రతా లేదనిపించింది. అసలు విషయం ఏమిటంటే ..

కొంత నా సోది అనుకోండి.. ఇది చెప్పడం ఇప్పుడు అవసరమా అని విసుక్కోకండి. ప్లీజ్!


మా వర్క్ షాప్ లో వర్క్ నేర్చుకుని మళ్ళీ వాళ్ళే మాకు వర్కర్స్  గా మారుతుంటారు. నేను అయితే వర్క్ నేర్పేందుకు ఏమి తీసుకొను. వర్క్ నేర్చుకునే వాళ్ళందరూ ఆసక్తి కన్నా ఎక్కువ అవసరం మేరకే ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకోవడానికి వస్తారు కాబట్టి వారికి ఒక పని ఆసరా కల్గించడమే .. ఒక సేవ అనుకుని నేను ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలకే పని నేర్పి..మళ్ళీ వాళ్ళనే పనిలోకి తీసుకుని ఫినిషింగ్   వర్క్  వచ్చేవరకు మొట్టికాయలు వేసి మరీ నేర్పుతుంటాను. పని నేర్చుకోవడం దగ్గర,చేసే దగ్గర నేను యెంత క్రమశిక్షణ గా   ఉంటానో.. వాళ్ళ ఇబ్బందులు కుటుంబ సమస్యలు వినడం వాళ్ళకి మంచి మాటలు చెప్పడం,సరదాగా ఉండటం వల్ల పిల్లలకి   నా దగ్గర చనువు బాగానే ఉంటుంది. కొంత మంది పెళ్లి చేసుకుని వెల్లిపోయేటప్పుడు వాళ్ళ సొంత ఇంటిని వదిలే టప్పటి కన్నా     ఇక్కడ వదిలి వెళ్ళడమే భాదగా ఉందని కళ్ళ నీళ్ళతో చెపుతుంటే ..వాళ్ళతో పాటు నేను కన్నీళ్లు పెట్టుకుంటాను. అలా మా ఇంటితో మమేకం అయ్యే పిల్లల భాద్యత నా భాద్యతగా భావించి  పిల్లలు ఉదయం పూట వర్క్ కి  వచ్చేటప్పుడు  వాళ్ళు ఇంటికి పంపేటప్పుడుజాగ్రత్త తీసుకుంటూనే ఉంటాను.

మా వూరిలో బందర్ రోడ్డుని ఆనుకునే ఇప్పుడు రెండు మూడు బార్లు .. కల్లు  పాకలు దగ్గర మందు బాబులు తిష్ట వేసి ఆడవాళ్ళు నడచి వెళ్లేందుకు భయపడే అంతగా అభివృద్ధి చెందింది.పోనీ బస్ ఎక్కి ప్రయాణించుదాం   అంటే  అరకిలోమీటర్ కూడా లేని దూరానికి నాలుగు రూపాయలు చార్జీ. రాను పోను కలుపుకుని ఎనిమిది రూపాయలు ..పాపం వాళ్ళ  పరిస్థితికి  అది ఎక్కువే కూడా.. 

పోనీ సర్వీస్ ఆటో ఎక్కి ప్రయాణించడం అంటే అదీ భయం గా మారింది...ఇలాటి ఇబ్బందికర వాతావరణంలో.. ఆడపిల్లన్దరిని ఆరు గంటలికి అంతా ఇంటికి పంపించి వేస్తాను.

ఈ రోజు జరిగిన సంఘటన ఏమిటంటే ,, లక్ష్మి అనే అమ్మాయి ఇల్లు దగ్గరే కాబట్టి ..లంచ్ కి ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయిని ఎప్పుడు నుండి వాచ్   చేస్తున్నారో తెలియదు కానీ.. ఆ అమ్మాయి లంచ్ చేసి తిరిగి వచ్చేటప్పుడుఅది పెద్దగా జన సంచారం లేని ప్రాంతం కాబట్టి ఆటోలో  ఆమె వెనుకనే ..వెంబడించుతూ  ..వచ్చారట. ఆమెని దాటి ఎదురుగా ఆటో .నిలబెట్టి..మొబైల్ ఫోన్ లోని కెమెరా   ఉపయోగించి  ఫోటో..తీయడం ..అది  ఆ అమ్మాయికి అర్ధమై తేరుకునే లోపు గా మళ్ళి ఆ అమ్మాయిని క్రాస్ చేసి ఆగి మరొక సారి ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లోకి రాగానే ఆ అమ్మాయి నాకు చెప్పడం నేను వెంటనే బయటికి వెళ్ళగానే వాళ్ళు ఆటోలో.. స్పీడ్గా వెళ్ళిపోవడం చేసారు. కనీసం ఆటో నంబర్ కూడా చూడలేదు.

టెక్నాలజీ పుణ్యమా అని వ్యక్తులకి ప్రైవసీ లేకుండా పోతుంది. ఎవడో ఒకడు .. ఇలా అమ్మాయిలని ఫోటోలు తీసి వాటిని దుర్వినియాగం చేయడం చేస్తున్నారని వింటూ ఉన్నాం. అలాగే షాపింగ్ కి వెళ్ళినప్పుడు.. ట్రయల్ రూమ్లో..రహస్య కెమరా ఏర్పాటు చేసి ..తరువాత బ్లాకు మెయిల్ చేయడం గురించి వింటూ ఉన్నాం.

ఇక అమ్మయిలు నెట్ సెంటర్ లకి వెళ్ళడం అంత మంచిది కాదని నా అభిప్రాయం.అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేసే చోట కూడా  ఆడపిల్లకి చాలా ఇబ్బందులు ఉంటాయని పదేళ్ళ నా అనుభవం లో తెలుసుకున్నాను. అలా అనుచిత ప్రవర్తన నాకు కనబడితే..నిర్ధాక్షిణ్యం గా  పనిలో నుండి తీసి వేసాను.

కేరళ నుండి వచ్చిన  సరస్వతి అనే ఆవిడ మాకు వర్క్ చేసేవారు .ఆవిడ భర్త మరణించారు. ఇద్దరు పిల్లలు. పాపం ఇంత దూరం పని కోసమే వచ్చారు. చాలా స్పీడ్ గా, నీట్ గా ఒకరి పని ని రెట్టింపుగా  పని చేసేది. ఆమెని అలాగే తోటి పురుష వర్కర్లే ఇబ్బంది పెట్టడం గమనించి.. తనకి వేరే షెల్టర్ కల్పించి.. ఆ పురుషులందరినీ పనిలో నుంచి తీసి వేసాను.అయినా ఆమెని ఫోనులో వేదిస్తుంటే ఆ నెంబర్ మార్చేసి.. స్థిమితంగా ఉందామనుకున్నా కుదరలేదు. ఆఖరికి ఆమె తన వూరు వెళ్ళిపోయారు
.
ఇంటి గడప దాటితే చాలు ..ఆడది అయితే చాలు  వేధింపులు మామూలు అయిపోయాయి. ఈవ్ టీజింగ్..అంటూ యువతులనే టీజ్ చేస్తారు   అనుకోవడం తప్పు.వయసు తో నిమిత్తం లేదు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిన్చడంని సి .సి.  కెమెరా లని ఏర్పాటుచేసి జరిమానా తాకీదులని వాహన స్వంత దారునికి  పంపినట్లు బస్సు స్టాప్ ల దగ్గర ..సి.సి.కేమేరాలని ఏర్పాటు చేసి ఈవ్ టీజర్స్ నుండి అమ్మాయిలకి,.మహిళలకి రక్షణ ఇస్తే బాగుండును అనుకుంటాను నేను. ముఖ పరిచయం లేని వ్యక్తులు కూడా చొరవ చేసి మాట్లాడి ఫోన్ నెంబర్ లు అడగటడం పరిపాటి అయిపొయింది. యెక్కడని కాపాడుకోగలం చెప్పండి.  నాకైతే అమ్మాయిలని కాపాడుకోవడం చాలా క్లిష్టతరం అనిపిస్తుంది.

               

20, జూన్ 2011, సోమవారం

ఒక రాంగ్ కాల్ కథ.

మిస్సుడ్ కాల్ తో మొదలైన ప్రేమాయణం  పెళ్లి  వరకు వచ్చి నిలిచి పోయిన వైనం .. న్యూస్ పేపర్ లో ఓ..వార్త. కొంచెం ఆసక్తి. చదివేస్తూ ఉండగానే.. నాలో.. ఓ..సంఘటన మెదిలింది.

అది ఏమిటంటే..!!! 
మేము 8 సంవత్సరాలు  ఒకే ఇంట్లో ఉండి హటాత్తుగా ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు బోలెడు ఇబ్బంది పడ్డాం.  వేరే ఇంట్లోకి మారిపోయిన తర్వాత అన్నీ సర్దుకున్నాయి గాని  నాకే ఓ..ఇబ్బంది వచ్చి పడింది. నా మొబైలు ఫోన్ కి సిగ్నల్స్  సరిగా ఉండవు. ఇంట్లో ఉంటె మాటే వినబడదు.

అందుకే వేరేక నెట్ వర్క్  లోకి మారి..కొత్త నెంబర్ కి పాత నంబర్ తో..కాల్ చేసి చూసుకుంటున్నాను. అలా ఆ నంబర్ కి డయల్ చేసేటప్పుడు ఒక అంకె తప్పు కొట్టడం జరిగింది. ఆ నంబర్ కల వ్యక్తి వెంటనే కాల్ తీస్తే  ..అయ్యో! ఇదేమిటి..తప్పు వెళ్ళింది అని కట్ చేసాను. (ఆ కట్  చేయడం అనేది.. ఎంత అవివేకం అయింది అని నేను ఇప్పటికి అనుకుంటూ ఉంటాను.) ఆ రోజు ఆ కాల్ లిఫ్ట్ చేసిన అతను  వెంటనే తిరిగి కాల్ చేసాడు. నేను "ఎవరండి" అని అడిగాను. ఇప్పుడు ఈ నంబర్ కి పోన్ చేసారండి.అన్నారు. వెంటనే విషయం అర్ధమై.. అవునండి..నేను ఈ రోజే ఒక కొత్త  నంబర్ తీసుకున్నాను..  ఒక అంకె తప్పు వల్ల మీకు కాల్ వచ్చిందండి.. "సారీ" అని చెప్పి  కట్  చేశాను.

ఇంకొక గంట తర్వాత మళ్ళీ ..నా పాత నంబర్ కే మళ్లీ కాల్ వచ్చింది. మళ్ళీ లిఫ్ట్  చేసాను. అదే విషయం చెప్పాను. అంతటి తో ఆగి పోలేదు. మళ్ళీ ఇంకా కాసేపటికి అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. మళ్ళీ అదే విషయం చెప్పాను.కోపంగా.. మాట్లాడాను కూడా..  మళ్ళీ.. అర్ధ రాత్రికి కాల్ వచ్చింది..నేనే నిద్ర మత్తులో..తీసాను. మళ్ళీ అదే మాట. .ఎవరండీ మీరు..అని నాకే ప్రశ్నలు.. విపరీతంగా కోపం వచ్చేసి.. ఎన్నిసార్లు చెపాలి..నీకు..అన్నాను  గౌరవం తగ్గించి.అయినా నువ్వెప్పుడు పోన్ చేసినప్పుడు రాంగ్ కాల్ వెళ్ళలేదా? ఏమిటి..ఈ..అర్ధరాత్రి కాల్స్ . పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని తిట్టి పెట్టేసాను.

మళ్ళీ తెల్లవారిన తర్వాత అదే నంబర్ నుండి కాల్ వచ్చింది..మా అబ్బాయికి..ఇచ్చి వీడి సంగతి ఏమిటో.. చూడు నాన్నా..అన్నాను. మా అబ్బాయి మట్లాడి బాగా సీరియస్ అయితే.. .అబ్బే నేను ఏం తప్పుగా మాట్లడలేదండీ !ఈ నంబర్.. నా బార్య  దగ్గర ఉంటుంది. ఎవరో..ఏమిటో..తెలుసు కోవాలి కదండీ..అందుకే చేస్తున్నాను అన్నాడట. సరే.. అప్పటికి    ఆ విషయం  అయి పోయింది. ఎందుకైనా మంచిదని ..నేను ఆ నంబర్ కి అనౌన్ ని పేరు తగిలించి.. పెట్టి వారానికి..ఒక సారి అయినా వచ్చే ఆ పోన్ తీయ కుండా జాగ్రత్త పడే దాన్ని.

నేను..కొన్ని నెలలకి..ఆ విషయం కూడా మర్చి పోయాను. ఒక సారి మొబైల్ పీస్ మార్చినప్పుడు.. పేరు డిస్ప్లే లో పడక నంబర్ మాత్రమే ఉంటె..కాల్ లిఫ్ట్ చేసాను.. మళ్ళీ ఆ వ్యక్తే.. ఎందుకు ఇలా కాల్ చేస్తున్నావ్ ..అన్నాను.. ఈ నంబర్ నా భార్య దగ్గర ఉంటుంది..అన్నాడు .అయితే.. అన్నాను.  ఒక సారి ఈ..నంబర్కి కాల్ చేస్తే..మగవాళ్ళు తీసారు అందుకే ఎవరో..కనుక్కుందామని చేస్తున్నాను. అన్నాడు. నేను వెంటనే క్లారిటీ ఇచ్చాను .మాది విజయవాడ. మీ దరిదాపుల్లో.కూడా  మేను లేము.. అనవసరంగా నీ భార్యని అనుమానించకు.. అలా.. చేయడం..ఇలా.మాకు కాల్ చేసి విసిగించడం చాలా తప్పు..అని చెప్పాను. 

అతను చేసే పని మూలంగా..ఇంటికి దూరంగా ఉంటాడట. అతను లేనప్పుడు..భార్య ఎవరితో..అయినన మాట్లడుతు ఉంటుందేమో  అన్న అనుమానం తొలిచేస్తూ.. అతను ప్రశాంతంగా ఉండ లేడు. కచ్చితంగా తని భార్యని ప్రశాంతంగా  ..ఉండ నివ్వని..తత్వం నాకు అతని మాటల్లో..కనబడింది...బోధ పడింది. నేను అప్పుడు.మా వారికి..మా అబ్బాయికి చెప్పాను. మీరు  ఎప్పుడు నా పోన్ లిఫ్ట్ చేయకండి.ఆ అనుమానం పిశాచి కాల్ చేస్తే..నేను కాకుండా మీరు ఎవరైనా మాట్లాడితే.. పాపం వాడి భార్యకి నరకం చూపెడతాడు అని చెప్పాను.  అంతటి తో  ఆగలేదు. ఒక సారి నాకు అదే నంబర్ నుండి కాల్ వస్తుంది. ఇది ఎక్కడ  ఖర్మ రా బాబూ..అనుకుంటూ.. లిఫ్ట్ చేయకూడదు అనుకుంటూనే తీసాను. ఒక ఆడ  మనిషి స్వరం . ఏడుస్తూ..మాట్లాడింది.. అమ్మ..నువ్వు..ఏమంటూ  నాకు పోన్ చేసావో కానీ.. మీ వాళ్ళు మా ఆయనతో..ఎవరు మాట్లాడారో..కానీ..మా ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా.. ఎవడే.వాడు..నేను పోన్ చేస్తే   ఆడ మనిషి మాట్లాడతారు.. మల్లా మగ మనిషి మాట్లాడతారు.. ఏమవుతారు   ..నీకు..చెప్పు అని.. కొట్టి చంపుతున్నాడు..అని చెపుతుంది. నాకు..అంతా అయోమయం. ఏం మట్లాడాలో..అర్ధం కాలేదు.. ఒక క్షణం ఆలోచించుకుని..ఆమె భర్త కి..పోన్ ఇవ్వ మన్నాను. అతను..మాట్లాడటం మొదేలేట్టగానే..తిట్టేశాను. నువ్వు ఆ అమ్మయిని..అలా ఇబ్బంది పెట్టడం మానేయక పోతే.. నేనే ..నువ్వు నాకు పోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావని కాల్ రిజిస్టర్ చూపి సాక్ష్యం తో.. సహా  పోలిస్ కంప్లైంట్ ఇస్తాను..అన్నాను
అంతే.. మళ్ళీ   నాకు కాల్ చేయలేదు. ఒక ఏడాది కాలం అయ్యాక అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. సరే..చూద్దాం అనుకుని  మాట్లాడటానికి తీశాను.. ఈ సారి  అమ్మాయి  మట్లాడింది. చెప్పమ్మా..! ఏమిటి సంగతి అన్నాను. వాడిని వదిలేసాను..అంది.. కొంచెం గతుక్కుమన్నాను.  ఎందుకు..అని నేను అడగలేదు..రోజు.. అంతే వేధించే వాడు.. అందుకే.. వాడి కి..బుద్ధి చెప్పాలనుకుని.. వాడు అనుమానించి నట్లే.. ఒక అబ్బాయితో..పోన్ స్నేహం చేసి.. వాడిని వదిలేసి వచ్చి..పెళ్లి చేసుకుని..మీకు దగ్గరలోనే.."ప్రియ" పచ్చళ్ళ  కంపెని లోనే..ఉద్యోగాలు చేసుకుంటున్నాం.. నా మొదటి మొగుడు నుండి.. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టె  పోన్ లు..రావు లెండి అంది. నాకైతే..నవ్వాలో..ఏం చేయాలో..అర్ధం కాలేదు.  ఇది ఒక రాంగ్ కాల్ కథ..ఇందులో..నా తప్పు ఎంత..? మాకైతే.. ఏదో..తెలియని ఫీలింగ్..    

అది జరిగిన ఒక నెలకి. ఆమె..(భర్త)  వేరే నంబర్ తో..పోన్ చేసాడు. ఏవమ్మా. నా పెళ్ళం గురించి చెపితే..అలా అనుమానిచడం తప్పు అన్నావ్ గా.. నా పెళ్ళాం.. పోనుల్లో..మాట్టాడి మాట్టాడి..ఎవరితోనో వెళ్లిపోయింది. వాడు..నీకు తెలుసేమో.. ఎక్కడ ఉన్నారో చెప్పు. ఇద్దరినీ  నరికి..పారేస్తాను..అన్నాడు.. . ఇంకా   ఏదేదో.. అంటున్నాడు..  ఇక అంతే..  బంగారం అంటి నా పాత నంబర్  (ఎంత చక్కని ప్యాన్సీ నంబరో).. తీసి.. పడేసి..  మా బందరు కాలవలో.. నేనే స్వయంగా వెళ్లి భద్రం గా పడేసి వచ్చాను.. ఇది జరిగి ఒక ఏడాది అయింది.ఈ మద్య నా పాత నంబర్ మోగుతుంది.. మళ్ళీ..ఆమె భర్త వాళ్ళకి..కాల్ చేస్తాడు. ఈ సారి గట్టిగ్గా దెబ్బలు తింటాడు. .ఇప్పుడు నా పాత నంబర్ వాడుతున్న వాళ్ళు.. నా అంత  సహనశీలురు  కాకుండా ఉండాలి కోరుకుంటూ.....

రాంగ్ నంబర్స్.. మొబైల్ చాటింగ్ .. అమ్మో.. నాకు.. ఎంత ఇబ్బంది..  కొంత మందికి..ఎంత నరకం..మరికొంత మందికి ఎంత అనుమానం. అనుకుంటూ.. ఈ షేరింగ్.
ఒక చిన్న పొరబాటు..ఒక  వ్యక్తి అనుమాన ప్రవృత్తి. ఒక భార్య.. విసిగి వేసారి.. ఒక విధమైన కక్ష తో.. తీసుకున్న నిర్ణయం... వీటన్నిటి మద్య మొబైల్ పోన్..చిద్విలాసం.