8, నవంబర్ 2011, మంగళవారం

ఆడపిల్లలవి భద్రత లేని బతుకులు

ఈ రోజు ఒక సంఘటన జరిగింది. మా వర్క్ షాప్ లో పని నేర్చుకునే లక్ష్మి ఒక విషయం చెప్పగానే భయం వేసింది .ఏమిటీ ఈ పరిస్తితి?  ఆడపిల్లల కి ఏ మాత్రం భద్రతా లేదనిపించింది. అసలు విషయం ఏమిటంటే ..

కొంత నా సోది అనుకోండి.. ఇది చెప్పడం ఇప్పుడు అవసరమా అని విసుక్కోకండి. ప్లీజ్!


మా వర్క్ షాప్ లో వర్క్ నేర్చుకుని మళ్ళీ వాళ్ళే మాకు వర్కర్స్  గా మారుతుంటారు. నేను అయితే వర్క్ నేర్పేందుకు ఏమి తీసుకొను. వర్క్ నేర్చుకునే వాళ్ళందరూ ఆసక్తి కన్నా ఎక్కువ అవసరం మేరకే ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకోవడానికి వస్తారు కాబట్టి వారికి ఒక పని ఆసరా కల్గించడమే .. ఒక సేవ అనుకుని నేను ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలకే పని నేర్పి..మళ్ళీ వాళ్ళనే పనిలోకి తీసుకుని ఫినిషింగ్   వర్క్  వచ్చేవరకు మొట్టికాయలు వేసి మరీ నేర్పుతుంటాను. పని నేర్చుకోవడం దగ్గర,చేసే దగ్గర నేను యెంత క్రమశిక్షణ గా   ఉంటానో.. వాళ్ళ ఇబ్బందులు కుటుంబ సమస్యలు వినడం వాళ్ళకి మంచి మాటలు చెప్పడం,సరదాగా ఉండటం వల్ల పిల్లలకి   నా దగ్గర చనువు బాగానే ఉంటుంది. కొంత మంది పెళ్లి చేసుకుని వెల్లిపోయేటప్పుడు వాళ్ళ సొంత ఇంటిని వదిలే టప్పటి కన్నా     ఇక్కడ వదిలి వెళ్ళడమే భాదగా ఉందని కళ్ళ నీళ్ళతో చెపుతుంటే ..వాళ్ళతో పాటు నేను కన్నీళ్లు పెట్టుకుంటాను. అలా మా ఇంటితో మమేకం అయ్యే పిల్లల భాద్యత నా భాద్యతగా భావించి  పిల్లలు ఉదయం పూట వర్క్ కి  వచ్చేటప్పుడు  వాళ్ళు ఇంటికి పంపేటప్పుడుజాగ్రత్త తీసుకుంటూనే ఉంటాను.

మా వూరిలో బందర్ రోడ్డుని ఆనుకునే ఇప్పుడు రెండు మూడు బార్లు .. కల్లు  పాకలు దగ్గర మందు బాబులు తిష్ట వేసి ఆడవాళ్ళు నడచి వెళ్లేందుకు భయపడే అంతగా అభివృద్ధి చెందింది.పోనీ బస్ ఎక్కి ప్రయాణించుదాం   అంటే  అరకిలోమీటర్ కూడా లేని దూరానికి నాలుగు రూపాయలు చార్జీ. రాను పోను కలుపుకుని ఎనిమిది రూపాయలు ..పాపం వాళ్ళ  పరిస్థితికి  అది ఎక్కువే కూడా.. 

పోనీ సర్వీస్ ఆటో ఎక్కి ప్రయాణించడం అంటే అదీ భయం గా మారింది...ఇలాటి ఇబ్బందికర వాతావరణంలో.. ఆడపిల్లన్దరిని ఆరు గంటలికి అంతా ఇంటికి పంపించి వేస్తాను.

ఈ రోజు జరిగిన సంఘటన ఏమిటంటే ,, లక్ష్మి అనే అమ్మాయి ఇల్లు దగ్గరే కాబట్టి ..లంచ్ కి ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయిని ఎప్పుడు నుండి వాచ్   చేస్తున్నారో తెలియదు కానీ.. ఆ అమ్మాయి లంచ్ చేసి తిరిగి వచ్చేటప్పుడుఅది పెద్దగా జన సంచారం లేని ప్రాంతం కాబట్టి ఆటోలో  ఆమె వెనుకనే ..వెంబడించుతూ  ..వచ్చారట. ఆమెని దాటి ఎదురుగా ఆటో .నిలబెట్టి..మొబైల్ ఫోన్ లోని కెమెరా   ఉపయోగించి  ఫోటో..తీయడం ..అది  ఆ అమ్మాయికి అర్ధమై తేరుకునే లోపు గా మళ్ళి ఆ అమ్మాయిని క్రాస్ చేసి ఆగి మరొక సారి ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లోకి రాగానే ఆ అమ్మాయి నాకు చెప్పడం నేను వెంటనే బయటికి వెళ్ళగానే వాళ్ళు ఆటోలో.. స్పీడ్గా వెళ్ళిపోవడం చేసారు. కనీసం ఆటో నంబర్ కూడా చూడలేదు.టెక్నాలజీ పుణ్యమా అని వ్యక్తులకి ప్రైవసీ లేకుండా పోతుంది. ఎవడో ఒకడు .. ఇలా అమ్మాయిలని ఫోటోలు తీసి వాటిని దుర్వినియాగం చేయడం చేస్తున్నారని వింటూ ఉన్నాం. అలాగే షాపింగ్ కి వెళ్ళినప్పుడు.. ట్రయల్ రూమ్లో..రహస్య కెమరా ఏర్పాటు చేసి ..తరువాత బ్లాకు మెయిల్ చేయడం గురించి వింటూ ఉన్నాం.

ఇక అమ్మయిలు నెట్ సెంటర్ లకి వెళ్ళడం అంత మంచిది కాదని నా అభిప్రాయం.అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేసే చోట కూడా  ఆడపిల్లకి చాలా ఇబ్బందులు ఉంటాయని పదేళ్ళ నా అనుభవం లో తెలుసుకున్నాను. అలా అనుచిత ప్రవర్తన నాకు కనబడితే..నిర్ధాక్షిణ్యం గా  పనిలో నుండి తీసి వేసాను.

కేరళ నుండి వచ్చిన  సరస్వతి అనే ఆవిడ మాకు వర్క్ చేసేవారు .ఆవిడ భర్త మరణించారు. ఇద్దరు పిల్లలు. పాపం ఇంత దూరం పని కోసమే వచ్చారు. చాలా స్పీడ్ గా, నీట్ గా ఒకరి పని ని రెట్టింపుగా  పని చేసేది. ఆమెని అలాగే తోటి పురుష వర్కర్లే ఇబ్బంది పెట్టడం గమనించి.. తనకి వేరే షెల్టర్ కల్పించి.. ఆ పురుషులందరినీ పనిలో నుంచి తీసి వేసాను.అయినా ఆమెని ఫోనులో వేదిస్తుంటే ఆ నెంబర్ మార్చేసి.. స్థిమితంగా ఉందామనుకున్నా కుదరలేదు. ఆఖరికి ఆమె తన వూరు వెళ్ళిపోయారు
.

ఇంటి గడప దాటితే చాలు ..ఆడది అయితే చాలు  వేధింపులు మామూలు అయిపోయాయి. ఈవ్ టీజింగ్..అంటూ యువతులనే టీజ్ చేస్తారు   అనుకోవడం తప్పు.వయసు తో నిమిత్తం లేదు.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిన్చడంని సి .సి.  కెమెరా లని ఏర్పాటుచేసి జరిమానా తాకీదులని వాహన స్వంత దారునికి  పంపినట్లు బస్సు స్టాప్ ల దగ్గర ..సి.సి.కేమేరాలని ఏర్పాటు చేసి ఈవ్ టీజర్స్ నుండి అమ్మాయిలకి,.మహిళలకి రక్షణ ఇస్తే బాగుండును అనుకుంటాను నేను. ముఖ పరిచయం లేని వ్యక్తులు కూడా చొరవ చేసి మాట్లాడి ఫోన్ నెంబర్ లు అడగటడం పరిపాటి అయిపొయింది. యెక్కడని కాపాడుకోగలం చెప్పండి.  నాకైతే అమ్మాయిలని కాపాడుకోవడం చాలా క్లిష్టతరం అనిపిస్తుంది.

               

3 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

నిజమే! మా ఫ్రెండ్ ఒకమ్మాయి రూపాయి ఫోన్ నించి వాళ్ళ ఇంటికి చేసింది ఒకసారి. దానికి రీడయల్ చేసి చాలా రోజులు ఏడిపించాడు ఒకడు. అప్పటినించి ఎప్పుడు రూపాయి ఫోన్ నించి చేసినా మేము చివరలో 100 కి డయల్ చేసి పెట్టేసేవాళ్ళం.

అజ్ఞాత చెప్పారు...

మేడం ఇది మొదలు మాత్రమే. రానున్న రోజులలో ఇది మరింత విజృభిస్తుంది అన్ని రంగాలకు విస్తరిస్తుంది, అన్ని వర్గాల వారిని (పేద,మధ్య తరగతి, ధనిక,అన్నికులాల వారిని )తాకుతుంది. ప్రభుత్వం వైఫల్యం చెందటం వలన ఎవ్వరు వీటిని అదుపు చేయలేరు. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి.

ఈ కాలం మొబైల్ వలన టిచర్ వృత్తి చేసేవారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంట్టునారని విన్నాను. విద్యార్దులు మొబైల్ లో పిచ్చి పిచ్చి సినేమాలు చూడటం, ఎవరైనా టిచర్ మందలిస్తే, టిచర్స్ ని దబాయించటం పెరిగి పోయింది. విద్యార్దుల తల్లిదండృలు వారి పిల్లలను గారాబం వలన , ప్రైవేట్ స్కుల్ యజమాన్యం డబ్బుల కొరకు, విద్యార్దులను తప్పు చేస్తున్నా సమర్ధించటం చాలా పెరిగి పోతున్నాది. త్వరలో స్రీలు పని చేసే పోర్ట్ పోలియో నుంచి టిచర్ ఉద్యోగం వారికి వారే తప్పుకొనే పరిస్థితులు వస్తున్నాయి. మగ వారికి జాబ్ లేకపోతే ఇల్లు గడవదు కనుక విద్యార్దులు తిట్టినా పని చేయక తప్పదు.

జ్యోతిర్మయి చెప్పారు...

మీ టపా వల్ల మీరు కొంతమందికి జీవనమార్గం చూపిస్తున్నారని తెలిసింది. మిమ్మల్ని ఈ విషయంలో అభినందించాలి. ఆడపిల్లల సమస్యలు కొంతవరకైనా తొలగించడానికి కెమరాలు ఏర్పాటు చేసే పద్ధతి బావుంది.