29, నవంబర్ 2011, మంగళవారం

వెన్నెల కార్తీకం అంతా వెలుగుల జిలుగులు.

కార్తీకం .. శరదృతువులో వచ్చే కార్తీకం ... ఎంత హాయిగా ఉంటుందో!వర్షాలకి తెరిపి ఇచ్చి.. తెల్లని పిల్ల మేఘాలు కుదురుగా ఉండక  చక్కర్లు కొడుతూ ఆకాశం అంతా తామే అయినట్లు  తిరుగుతుండగా ప్రకృతి అంతా పచ్చగా,     వెన్నెల చల్లగా .. వీస్తున్న గాలి చల్లగా సృశిస్తూ  సంగతులేవో.. చెపుతున్నట్లు .. ఉండే ఈ కార్తీకం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి! ఈ కార్తీకం ఎలా గడిచిందంటే..  ....నేలంతా.. దీపాల వెలుగులు..ఆకాశం అంతా వెన్నెల వెలుగులు.. కార్తీకం..అంతా వెలుగుల జిలుగులు.


నాకైతే కార్తీకం అంటే చాలా ఇష్టం. ఎంచక్కా నా బద్ధకం ని బూజు దులిపినట్లు దులిపెస్తుంది.. నాలుగు గంటలకన్నా ముందుగానే నిద్ర లేవడం..ఇల్లు వాకిలి శుభ్రం   చేసుకుని ముగ్గులు పెట్టడం  ఆ చిరు చలిలో..చన్నీళ్ళ తలారా స్నానం  చేసి.. ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్ళడం అక్కడ కార్తీక దీపం పెట్టి రావడం ..నక్తం ఉండటం సాయంత్రం తులసి కోట దగ్గర దీపం పెట్టి కానీ భోజనం చేయడం .. భూ శయనం ..వీటన్నిటితో..బిజీ అయిపోతాను.  ఈ పనులన్నీ ఇష్టంగా చేస్తాను. ఈ సంవత్సరం అయితే ఎంచక్కా.. యూ ట్యూబ్ లో... అనేక క్షేత్రాలు,భక్తి గీతాలు వింటూ చూడటం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు చూడటం.. ఆఖరికి కార్తీక పురాణం కూడా చూస్తూ వినేశాను.  కార్తీకంలో..శివకేశవులని బేధం లేకుండా పూజించాలని చెపుతుంటారు కదా! నేనైతే..నాకు అదృష్టవ శాత్తు ఇద్దరు పరివేష్టించిన గుడికే వెళుతుంటాను. అంటే శివ పంచాయతనమ్  ని ధర్శించుకుంటాను..అన్నమాట. మా వూరి గుడి అలా ప్రత్యేకం కూడా . ..  నమక,చమకాలతో.. మహాదేవుని కి జరిగే అభిషేకాలు,, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చూడటం యెంత భక్తీ పారవశ్యమో..అనుభూతి స్వయంగా పొందాల్సిందే తప్ప చెప్పడం సాద్యపడదేమో! నేను నిత్యం వెళ్ళే గుడిలో పూజారి శర్మ గారు ఎంత బాగా దేవునికి సేవ చేస్తారో! నిజం చెప్పొద్దూ.. ఒకోసారి బద్ధకం వచ్చేసి మనసులో తలుచుకుంటే చాలదా?  రోజు ఇలా గుడికి వెళ్ళాలా!?అని వెర్రిమొర్రి  ఆలోచనలు చేస్తూ ఉంటాను కూడా.. మళ్ళీ అంతలోనే.. అలా అనుకోకూడదని గుర్తుకు వచ్చి లెంపలు వేసుకుంటాను. ఏమైనా నాస్తికులకి  ఉన్నంత ధీమా ఆస్తికులకి ఉండదు. ప్రతి చిన్న  విషయంకి..  పాప పుణ్యం లు  బేరీజు వేసుకుని..సంశయములతో నడుచుకుంటారు కదా..అనిపిస్తుంటుంది. అలాగే మనకి సాద్యం కాదు అనుకున్న పనులని భగవంతుడి అనుగ్రహంతో.. లభిస్తాయనే పాజిటివ్ థింకింగ్ తో.. ప్రశాంతంగా ఉంటాం. ఒక విధంగా అది కూడా పలాయనవాదమే కూడా.. చాలా మంది తాము చేయవలసిన పని కూడా చేయకుండా.. భగవంతుని దయ అంటారు కదా ! నేనైతే.. తొంబై తొమ్మిదిశాతం మనం చేయవలసినది చేసి ఆ ఒక శాతం మాత్రం అదృష్టమో, లేక భగవంతుని కృప కూడా ఉండటం వల్ల మనకి లభించడం అని నమ్ముతాను. వీటన్నిటికన్నా . భగవత్ సాన్నిద్యం మనసుకి ప్రశాంత ని ఇస్తుంది. అందుకోసమైనా నేను గుడికి వెళుతుంటాను. నిత్యం ఎన్నో చికాకులు..ఒత్తిడులు తట్టుకోవాలంటే.. గుడికి వెళ్ళడం,సంగీతం వినడం,ఆత్మీయులతో..కొద్ది సేపైనా ముచ్చటించుకోవడం తో..మనం బాగుండవచ్చు అనుకుంటాను.

ఇక కార్తీకం లో.. చేసే పూజలకి, దాన ధర్మాలకి..రెట్టింపు ఫలితాలు ఉంటాయట. అందుకనేమో.. ఈ మాసంలో..ఎక్కడ  గుడులు చూసినా కిట కిట లాడుతూ ఉంటాయి.  ఇక శివాలయంలో.. అయితే..అభిషేక ప్రియుడైన మహాదేవునికి అభిషేకంలు చేయించడం పరిపాటి కదా! సోమవారాలు ,ఏకాదశి,పౌర్ణమి,చతుర్దశి తిదులలో.. భక్తులందరూ.. తెచ్చే పూజా ద్రవ్యాలు పాలు పెరుగు తేనే,పళ్ళరసాలు ఇవన్నీ సమర్పించడం చూస్తుంటే.. తమ కోరికలు తీరడం కోసం భగవంతునికి అన్ని సమర్పించే భక్తులు ..అదే గుడి ముందు అమ్మా, అయ్యా అని అర్దించే  భిక్షకులని తెగ విసుక్కుంటారు. భిక్షకులు మనని  అర్దిస్తుంటే .. మనం వెళ్లి భగవంతుడిని గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటాం. అయినా ఈ కోరికలు తీరుతూ ఉంటె.. మళ్ళీ క్రొత్తవి పుడుతూనే ఉంటాయి.. కదా! ప్రపంచం అంతా..అర్ధం కోసం,ఆడదాని కోసమే.. తిరుగుతూనే ఉంటుందనేది..నిజం కదా! ఎంతో మంది పసి పిల్లలు, వృద్దులు సరి అయిన ఆహారం దొరకక ఇబ్బంది పడుతుంటే.. అభిషేకాలు పేరిట మనం ఇలా చేయడం సబబేనా.అనిపిస్తూ ఉంటుంది కానీ.. మళ్ళీ పాప భయం ..తో లెంపలు వేసుకుంటాను.ఇంకా చెప్పాలంటే..గత రెండు సంవత్సరాలనుండి  ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయం లో.. నాకెంతో..ఇష్టమైన శివుని సన్నిధిలో.. జ్వాలాతోరణం వెలిగించడం,నూట ఎనిమిది దీపాలు స్వయంగా వెలిగించడం చేస్తుంటాను. అలాగే సమాంతరంగా..బలహీనులకి.. నా శక్తి మేర సాయం చేస్తుంటాను. ఇంకా సాయం చేసే శక్తి నాకు ప్రసాదించమని కోరుకుంటాను. ఇతరుల కోసం ప్రార్ధిస్తూ ఉంటాను. ఇలా కార్తీకం గడచి పోయింది.
ఇంకో విషయం చెప్పడం మరచాను. కొంత మంది భక్తులు అయితే.. విరివిగా పూజా ద్రవ్యాలు తీసుకుని వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటారు. భగవంతుని ముందు అందరూ..సమానమే కదా.. దేవునికి సేవ చేయడం కూడా నామోషీతనం అనుకుంటారు. శివునికి చాలా ఇష్టమైన గంగా జలం,బిల్వ దళం, త్రయంబకం కన్నా వేరోకటి  ఏముంటాయి చెప్పండి? అభిషేకం సమయంలో.. జలపాత్రలలో నీళ్ళు నిండుకుని ఇంకా అభిషేకం పూర్తి కానపుడు.. జలం పట్టుకొచ్చి ఇమ్మంటే  కూర్చున్న చోటు నుండి ఒక్కరు కూడా కదలరు. ఖరీదైన పూజా ద్రవ్యాలతో..పూజ చేయించు కుంటున్నాం. పంపు కొట్టి బిందె తో  నీళ్ళు ఎవరు తెస్తారు..అన్నట్టు చూస్తారు. మా పూజారి గారు నా వైపు చూస్తారు.అదే మహా భాగ్యం అనుకుని ప్రతి నిత్యం..ఓ..బిందెడు గంగా జలం.. అయిదు మారేడు దళములు..కొన్ని తులసి దళములు..స్వామికి సమర్పించడం చేస్తుంటాను.. అలా చేయకుంటే నాకు చాలా వెలితి కూడా..

అర్చనకాలే రూపగతా, సంస్తుతి కాలే శబ్ద గతా
చింతన కాలే ప్రాణ గతా ,తత్వ విచారే సర్వ గతా..
అని ఉమా సహస్రంలో.. చెప్పబడింది కదా!

అంటే ..పూజ సమయంలో.."రూపం "లోను ,స్తోత్రం చేసేటప్పుడు 'శబ్దం "లోను , చింతన చేసేటప్పుడు "ప్రాణం' లోను, తత్వ విచార స్థితిలో.."సర్వత్రా" దైవం సాక్షాత్కారించును... అని అర్ధం .
ఈ దేహం సందేహం కాబట్టి .. నా సందేహాలని విడిచి పెట్టేసి..
                                                          అనంతానంద భోదాంబు
                                                          నిధిం, అనంత విక్రమమ్
                                                          అంబికా పతిం ఈశానం
                                                          అనిశం ప్రణమామ్యాహమ్ .. అనుకుంటూ.. ఉంటాను.
                                                          ఓం..నమః శివాయ.

ఇంకో పోస్ట్ లో..వనభోజనాలు విశేషాలు వ్రాస్తాను.  ఈ పాట చూడండీ!!!!

2 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి చెప్పారు...

వనజగారూ..కార్తీక మాసం అంతా భక్తిగా జరుపుకున్నరన్నమాట..మీ కబుర్లు బావున్నాయి..

sarma చెప్పారు...

నేటి కాలంలో డబ్బుతో దేవుణ్ణికూడా కొనేద్దామనుకుంటున్నారు.కాలం కూడా అలాగే వుంది. డబ్బు వుంటే కాని దేవుడుకూడా గుడిలో దర్శనం ఇవ్వటం లేదు. ఏచేస్తాం! చేయగల మానవ సేవ చేద్దాం,భగవంతునికి సేవ చేద్దాం. మనకు తెలియని శక్తి వుంది, ఆమే/ఆయనే చూసుకుంటుంది/చూసుకుంటాడు. మనకెందుకు.