13, నవంబర్ 2011, ఆదివారం

డాలర్ ల ఆకలి...

జ్యోతిర్మయి గారి అన్నదాత సుఖీ భవ పోస్ట్ చూసిన తర్వాత చాలా భాద కల్గింది.

మన వాళ్ళు అనుకోవడంలో.. ఆత్మ బలం పెంచుకుంటాం. ఆ అనుకోవడంకి అలవాటు అవ్వకపోతే.. పరాయి దేశాలలో.. అయిన వాళ్ళందరికీ    దూరంగా నివశించే వారందరికీ  ఒంటరితనం వరదలా ముంచేస్తుంది.

నిద్ర లేచినది మొదలు హడావిడి బ్రతుకులు డాలర్ కై ఆరాటాలు.   మన తిండి తినక, మన వాళ్ళు కానరాక .. మన పలకరింపు కూడా విసుగ్గా   తోచి ఒకసారి.. పలకరింపు కై ఎదురు చూసే కొన్ని సార్లు. ఎన్ని జీవన పోరాటాలు.

వివాహితులు అయితే పర్వాలేదు..ఒకరికొకరు తోడు ఉంటారు.

అప్పుడే ఎల్లలు దాటి వెళ్ళిన యువత ఫీలింగ్స్ ఎలా ఉంటాయో.. అర్ధమైతే.. తల్లిదండ్రులు ఎవరు వారి పిల్లలని.. ఖండాలు దాటించరు కూడా.. తిండికి,నిద్రకి, అన్నీ  కరువే! అభద్రతా భావం..వెంటాడే చోట పిల్లలు ఎలా మనుగడ సాగిస్తారో తెలిస్తే.. మనసు సంద్రమే అవుతుంది.  వాళ్ళది   డాలర్ ల  ఆకలి ఆనాలేమో!

రెండు నెలల క్రిందట మా అబ్బాయి "నిఖిల్ చంద్ర " వచ్చి కొన్నాళ్ళు ఉన్నాక తిరిగి వెళ్ళేటప్పుడు.. తన ఫ్రెండ్ ని ఫోన్ లో ఏం తీసుకుని రమ్మంటావ్!? ..అని అడిగాడు .అందుకు సమాధానంగా "ఒరేయ్ బావా ! వేడి వేడి ఇడ్లీలు కొబ్బరి పచ్చడి ప్యాక్ చేయించుకుని  రారా..అని అడిగాడు. అవి నేను తెచ్చి ఇచ్చేటప్పటికి ఉండవు కదరా..పాడైపోతాయి ..అని నవ్వుకుంటూ..చెప్పుకున్నా.. ఆ మాటలు విని నాకు మనసు యెంత కలుక్కుమందో! పిల్లలు ఇష్టమైన తిండి కి యెంత మొహం వాచి పోయి ఉన్నారు..అనిపించి.. వెంటనే,, నిన్న అయినా చెప్పి ఉంటే.. ఇనేస్టంట్   ఇడ్లి  పిండి తయారి చేసి ఇచ్చేదాన్ని కదా,, అన్నాను. ఎందు కంటే మా అబ్బాయి అప్పుడు..తన క్లాస్మేట్ ఫ్రెండ్ కోసం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇచ్చిన  ఇడ్లీ పాత్ర.ఇడ్లీ తయారీ స్టాండ్ కూడా  తీసుకుని వెళుతున్నాడు కూడా.
రవి వంట 
నా కైతే.. ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా, బంగాళా దుంప ప్రై చేసినా పప్పు చారు పెట్టినా.. రసం వాసన చూసినా.. మా అబ్బాయి గుర్తుకు వచ్చి వాటిని తిన లేను కూడా.. అందుకే  ఆ కూరలు చేయడమే మానేసాను. వంట చేయడం అంతగా రాని మా అబ్బాయి ఇన్ టైం లో తినడం వీలవక ఆలస్యంగా తింటే అది నచ్చక.. ఆకలి చంపుకోవడం, ఓ..కప్ కాఫీ కోసం మొహం వాచి పోవడం.. ఎక్కువగా పచ్చళ్ళతో సరి పెట్టుకోవడం..నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం లేకపోవడం ఇలాటి కారణాలతో యెంత ఆకలిని చంపుకుంటూ ఉన్నాడో అర్ధం అవుతూ ఉంటె..కన్నీళ్లు వచ్చేస్తాయి. 

మా అబ్బాయి వీడియో   చాట్ లో కనబడుతూ ఉంటె  గంటల తరబడి మాట్లాడుతున్నా కూడా కాఫీ కూడా త్రాగాలేను. "ఎందు కంటే కన్న బిడ్డ ఎదురుగా ఉండి బిడ్డకి  తాగడానికి తినడానికి ఇవ్వలేని అసహాయ స్థితి లో.. గ్రుక్క మింగుడు పడదు. ముద్ద క్రిందికి దిగదు. మాట వరసకి కూడా ఏం తిన్నావ్ ? అని అడగకూడదు. వాళ్ళు చెప్పే మాటలు దుఖం తెప్పిస్తాయి. మా అబ్బాయి అయితే ఒకసారి నాలుగు రోజులైయింది అన్నం తిని అంటే..నేను యెంత ఏడ్చానో! 
మనవాళ్ళు ప్రక్కనే ఉన్నా పలకరించడం కూడా చేయని వారు అక్కడే ఉంటారు. మన వాళ్ళు కానివారు.. మనకి ఏమి కాని వారు మనకి ఎంతో సాయంగా ఉండే వాళ్ళు ఉంటారు.అది నా అనుభవం కూడా. ఆర్ధిక సంబందాలు   తప్ప హార్దిక సంబందాలు లేని  రక్త సంబంధాలు  వెగటు పుడతాయి.


మా ఇంటికి దగ్గరలోనే ఉన్న..మా అబ్బాయి రూమ్మేట్ కి.. చెయ్యి ప్రాక్చార్ అయితే  ఇంట్లో వాళ్లకి కూడా తెలియనివ్వలేదు. ఎందుకంటే ..ఇంట్లో తెలిస్తే చాలా బాధపడతారు అని. ఇంకొక  అబ్బాయి అయితే ( ఆస్ట్రేలియా లొ ఉంటాడు) మా  అబ్బాయికి  సీనియర్. ఫీజు కట్టలేదంటూ డబ్బు అడిగి తీసుకుని ..ఫోన్ నంబెర్ కూడా మార్చుసుకుని యెంత ఇబ్బంది పెడుతున్నాడో! 1600  డాలర్ లు చేట్టుకేం కాయలేదు కదా తెంపి ఇవ్వడానికి. విజయవాడలో ఉన్న అతని తల్లిదండ్రులకి ఆ విషయం  తెలుసో తెలియదో! కానీ మా అబ్బాయి మాత్రం చాలా  ఓపిక పడుతున్నాడు. సున్నిత మనస్కులకి,సహాయము చేసే  తత్వం ఉన్న వారికి చాలా కష్టాలు కూడా. అలాటి చోట నే ఇలాటి ఫ్రెండ్స్ కూడా 

                       జిగ్నేష్, నిఖిల్ 

జిగ్నేష్ వంట 
ఇలా పిల్లలు ఎలాటి ఇబ్బందులు ఎదుర్కుంటూ   పోరాటం .చేస్తుంటారో....! ఇక్కడ ఉన్నవారికి డాలర్ తప్ప  ఏమి కనబడదు. మీకేమిటమ్మా! మీకు డాలర్లే డాలర్ లు అంటారు. అందని ద్రాక్ష పుల్లనో.. తీయనో..అందితే కదా తెలిసేది.  నేనేయితే ఎవరైయినా విదేశాలు అంటే .. ఆర్ధికం గా..ఒక రకంగా ఉన్నవారికి వెళ్ళడం వద్దనే చెపుతున్నాను. దిగితేనే కదా లోతు తెలిసేది!?


మాకు పరిచయం ఉన్న ఒక పెద్దావిడ వల్ల అబ్బాయి ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తిన లేదని ఎంత భాద పడుతుందో! ఎవరైనా తెలిసినవారు వెళుతుంటే..ఆ పచ్చడి చేసి పంపాలని యెంత తాపత్రయ పడుతుందో.. ఆ తల్లి ప్రేమ నాకు యెంత అబ్బురంగా తోచిందో! అంతే కదా.. తల్లి మనసంటే!!  ఇప్పుడు మా అబ్బాయి కోపంగా నా వైపు చూస్తూ ఏమంటాడంటే.. అమ్మా! నీకు వ్రాసుకోవడానికి ఏమి లేక పొతే..నీ బ్లాగ్ మూసి పడేయి..ఇలా నా + నా ఫ్రెండ్స్ వంట పరువు తీయకు..అని అంటున్నాడు. చూడండీ!!!


నిఖిల్

7 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

తల్లి మనసు ఇలానే ఉంటుందేమో కదా! అమ్మతో ఎప్పుడు వీడియో చాట్ చేసినా ఇలానే అంటుంది ఏమి తింటున్నావ్ ఏమి వండుకున్నావ్ అంటూ నేనేమో అబ్బ ఎప్పుడూ తిండి గురించే అడుగుతావే అంటాను. బానే తింటున్నాను అన్నా వినిపించుకోదు. సరిగా తిను సరిగా ఉండు చూసుకోడానికి కూడా ఎవరూ లేరు అని. మీరిలా రాస్తుంటే నాకు ఎందుకనో అమ్మ గుర్తుకొచ్చింది తను కూడా ఇలానే అనుకుంటుందేమో కదా! కళ్ళు చెమర్చాయి.

Shabbu చెప్పారు...

చదివి కాసేపు బాధపడ్డాను.. .. నేను నా స్నేహితులకి అదే చెబుతుంటా ఫారిన్ వెళ్లడం అదో గొప్పగా ఫీలయి, కుటుంబానికి దూరంగా, కష్టాలపాలయ్యే బదులు ఉన్నదాంట్లోనే సంతోషంగా ఇంటికి ఆసరాగా ఉండాలని...
Shabbu, Knr

Raj చెప్పారు...

మీ మాతృ హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు. దూరాన ఉన్న మీ అబ్బాయి యోగక్షేమాలు, బాగోగులూ, పదే ఇబ్బందులూ.. ఒక తల్లి కి తన కొడుకు మీద ప్రేమ ఎంతగో ఉంటుందో హృదయం ద్రవించేలా చాలా బాగా తెలియచేశారు. మీకు అభినందనలు.

వనజ వనమాలి చెప్పారు...

రసజ్జ్ఞ.... తల్లి మనసు అంతే కదా! బిడ్డలు ఏం తింటున్నారా!ఎలా ఉన్నారు.. అనే తలపోస్తారు. ఎలా ఉంటారో అని అనుక్షణం బెంగపడతారు. అమ్మ ప్రేమ అమ్మ అయితే తెలుస్తున్దోయి. అమ్మని విసుక్కోకు. స్పందిన్చినందులకు ధన్యవాదములు .

@ రాజ్.. మీరు క్లుప్తంగా వ్యాఖ్య వ్రాస్తారు.అలాంటిది ఎంత స్పందించి ఉంటె.. ఇలా మీ స్పందనని తెలియ జేసారో.. గమనించి .. చాలా సంతోషం. ధన్యవాదములు.

@ షబ్బు.. నిజమే కదా! నిజంగా మాతృ దేశం కన్నా,మాతృ ప్రేమ కన్నా జగాన వేరొక మిన్న ఉండునా !? నా బ్లాగ్ నిత్యం చూస్తున్నందుకు ధన్యవాదములు.

బుద్దా మురళి చెప్పారు...

వనజవనమాలి గారు బాగా రాశారు మనకు అందుబాటులో ఉన్న వాటి విలువ తెలియదంటారు ఇక్కడ పేదరికం వంటి సమస్యలు ఎన్ని ఉన్న ఇక్కడ జీవితంలో ఉన్న తృప్తి సంతోషం డాలర్లలో ఉండదు . కొద్ది కాలం డబ్బు కోసం విదేశాలకు వెళ్ళ వచ్చు కానీ జీవితమంతా ఇక్కడి వారిని వదిలి అక్కడ బతకడం వద్దు అనేది నా అభిప్రాయం. జూబ్లి హిల్స్ లో విదేశాల్లో పిల్లలు ఉన్న్న తల్లి తండ్రులు ఓ సంఘాన్ని పెట్టుకున్నారు కనీసం ఒకరికొకరు పళ్లల గురించి మాట్లాడుకోవచ్చు

జ్యోతిర్మయి చెప్పారు...

ఒక దగ్గర కలిసున్న తరువాత అభిమాన౦గా కలసిపోతాం వనజ గారూ..కొంత సమయం పడుతుందంతే..మీ తల్లి ప్రేమ హృదయాన్ని కదిలించింది. నా టపా చూసి స్పంది౦చారా..మీ అభిమానానికి ధన్యవాదాలు

వనజ వనమాలి చెప్పారు...

జ్యోతిర్మయి గారు ధన్యవాదములు . @ మురళీ గారు మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. స్పందించినందుకు ధన్యవాదములు.అండీ !