7, నవంబర్ 2011, సోమవారం

మూగబోయిన ‘ భూపేన్ ’ రాగం

భూపేన్ హజారిక ఆలపించిన   గీతాలు 
నేను ఎంతగానో ఇష్టపడే ఓ..సంగీత దిగ్గజం. వారి మరణం చాలా బాధ కల్గించింది. వారి పాటలు ఒక నాలుగు పరిచయం తో పాటు మరింత వివరంగా ఇక్కడ లింక్ లో.
మూగబోయిన ‘ భూపేన్ ’ రాగం
సంగీత దిగ్గజం భూపేన్ హజారికా కన్నుమూత
ముంబై: అపురూప స్వరఝరి ఆగిపోయింది. స్వాతిముత్యపు మెరుపులాంటి సాహిత్య పుష్పం నేలరాలింది. అస్సాం అడవుల నుంచి మహానగరాల దాకా సాగి, కోట్లాది గుండెల్లో పులకరింతలు రేపిన శ్రుతిలయల బాటసారి ప్రస్థానం ముగిసింది. సంగీత, సాహిత్య దిగ్గజం భూపేన్ హజారికా జీవనగానం అస్తమించింది. ఆయన శనివారమిక్కడి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. నాలుగు నెలలకు పైగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ల హజారికా సాయంత్రం 4.30 ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. నిమోనియా కారణంగా పలు అవయవాలు పనిచేయకపోవడంతో ఆయన చనిపోయారని ఆస్పత్రి ప్రతినిధి జయంత నారాయణ్ సాహా చెప్పారు. నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని, వెంటిలేటర్, డయాలసిస్‌పై ఉన్నారని ఆస్పత్రి సీఈవో డాక్టర్ రామ్ నారాయణ్ చెప్పారు. హజారికా అంతిమ క్షణాల్లో ఆయన జీవిత సహచరి, దర్శకురాలు కల్పనా లాజ్మీ ఆయన పక్కనే ఉన్నారు. హజారికా శ్వాస సమస్యతో జూన్ నెలాఖర్లో ఈ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే ఐసీయూ గదిలో ఉన్నారు. డయాసిస్ చికిత్స పొందారు. గత నెల 23న ఆరోగ్యం బాగా క్షీణించి, నిమోనియా సోకింది. చిన్న శస్త్రచికిత్స కూడా జరిగింది. సెప్టెంబర్ 8న ఆయన ఆస్పత్రిలోనే అభిమానుల గీతాలాపన మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు జరుపుకున్నారు. హజారికా కెన్యాలో జన్మించిన భారత జాతీయురాలు ప్రియమ్‌ను పెళ్లాడారు. వారి సంసారం కొన్నేళ్లే సాగింది. వారికి తేజ్ హజారికా అనే కుమారుడు జన్మించాడు. తర్వాత హజారికా కళాత్మక చిత్రాల దర్శకురాలు కల్పనా లాజ్మీకి దగ్గరయ్యారు. మరణించేదాకా ఆమెతోనే ఉన్నారు. వారిది మూడు దశాబ్దాల అనుబంధం.
స్వరలోక సంచారి..: బహుముఖ ప్రజ్ఞశాలికి అచ్చమైన ఉదాహరణ హజారికా. ఆయన గాయకుడు, సంగీతకారుడు, కవి, పాత్రికేయుడు, నటుడు, రచయిత, సినీనిర్మాత. ‘దిల్ హూమ్ హూమ్ కరే..’, ‘ఓ గంగా బెహతీ హో..’ లాంటి మరపురాని గీతాలు ఆలపించిన ఆయన సాహిత్య, సినీ రంగాల్లో కూడా తనదైన ముద్ర చూపారు. మంద్ర, ఉచ్ఛ స్వరాల మధ్యన ఉండే విలక్షణ స్వరంతో సాగే ఆయన గానం గురించి చెప్పాలంటే పదాలు చాలవు. ఆయన సుసంపన్న అస్సామీ సంప్రదాయ, గిరిజన సంగీతాల నుంచి అద్భుతం, అపురూపమైన స్వరజగతిని సృష్టించి శ్రోతల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. దక్షిణాసియా కళారంగానికి ఆయన విశిష్ట ప్రతినిధి, అస్సామీ రచయితల్లో ప్రముఖుడు. ఆ భాషలో వెయ్యికిపైగా గీతాలు రాశారు. కథలు, వ్యాసాలు, యాత్రారచనలు, కవితలు, పిల్లల పాటలు కూడా రచించారు. పిల్లాపెద్దలు ఆయన్ను ఆప్యాయంగా ‘భూపేంద్ర’ అని పిలుచుకుంటారు. అస్సాంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి గుర్తుగా ఆయనను ‘బ్రహ్మపుత్ర వాగ్గేయకారుడు’ అని అంటారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా ఆయన వీరాభిమాని. ఓ సభలో హజారికాతో తనకిష్టమైన పాట ‘మోయ్ ఎతి జజాబోర్’ను పాడించుకున్నారు.
గిరి‘జానపదమే’ ప్రేరణ.. 

హజారికా తనను తాను సంచారి(జజాబోర్)గా అభివర్ణించుకునేవారు. ఆ సంచారమే ఆయనను కళావేత్తగా తీర్చిదిద్దింది. గిరిజన జానపద సంగీతం తనకు ప్రేరణ అని ఆయన చెప్పేవారు. ‘గిరిజన సంగీతం వింటూ పెరిగా. నాకు గానకళా వారసత్వం మా అమ్మనుంచి వచ్చింది. ఆమె నన్ను నిద్రపుచ్చడానికి జోలపాటలు పాడేది. అందులో ఓ పాటను ‘రుదాలి’ చిత్రంలో వాడుకున్నా’ అని తెలిపారు. ఆయన అమెరికాలో చదువుకుంటున్నప్పుడు ప్రఖ్యాత నల్లజాతి గాయకుడు పాల్ రాబ్సన్‌తో పరిచయమేర్పడింది. రాబ్సన్ పాట ‘ఓల్డ్ మేన్ రివర్’ స్ఫూర్తితో హజారికా ‘బిస్త్రినో పరోరే’(హిందీలో ఓ గంగా బెహతీ హో) గీతాన్ని స్వరపరిచారు. ఇది వామపక్షాల కార్యకర్తలకు దాదాపు జాతీయగీతమైంది. విద్యాభ్యాసం తర్వాత హజారికా ఇండియన్ పీపుల్స్ థియేటర్ మూవ్‌మెంట్(ఇప్టా)లో పనిచేయడానికి ముంబై చేరుకున్నారు. సలీల్ చౌధురీ, బలరాజ్ సాహ్నీ ఇతర మార్క్సిస్టు మేధావులతో కలిసి పనిచేశారు. ఆ నగరంతో మమేకమయ్యారు. 

సినిమాల్లో..:హజారికా అస్సామీ, బెంగాలీ, హిందీ సినిమాలకు వందలాది పాటలు రాసి, స్వరకల్పన చేశారు. శకుంతల,ప్రతిధ్వని తదితర అస్సామీ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. వాటికి సంగీతమూ అందించారు. పాటలూ పాడారు. కల్పనా లాజ్మీతో కలిసి రూపొందించిన రుదాలి, ఏక్‌పల్, దార్మియాన్, దామన్, క్యోన్ వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చాయి. 
తీరని లోటు:హజారికా మృతిపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కళారంగానికి చేసిన సేవలు మరపురానివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. మృణాల్‌సేన్, మహేశ్‌భట్ తదితర సినీ ప్రముఖులు హజారికాతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 
దుఃఖసంద్రంలో కల్పనా లాజ్మీ..
హజారికా అస్తమయంతో ఆయన జీవిత సహచరి కల్పనా లాజ్మీ విషాదంలో మునిగిపోయారు. కన్నీళ్ల పర్యంతమవుతూ ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘నా తండ్రిని, సోదరుడిని, ప్రేమికుడిని, భర్తను, స్నేహితుడిని కోల్పాయా.. ఆయన కళాకారుడే కాదు సంఘ సంస్కర్త కూడా’ అని చెప్పారు. 
జీవిత విశేషాలు..
జననం: అస్సాంలోని సాదియాలో 1926 సెప్టెంబర్ 8. ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించారు. 
విద్యాభ్యాసం: 1942లో గువాహటిలో ఇంటర్మీడియెట్, 1944లో బెనారస్ హిందూ వర్సిటీ నుంచి బీఏ, 1946లో పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ. తర్వాత కొలంబియా వర్సిటీలో మాస్‌కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ. 
తొలిపాట: 12 ఏళ్లప్పుడు అస్సామీ చిత్రం ఇంద్రమాలతి(1939)లో
చివరి పాట: ఈ ఏడాది విడుదలైన ‘గాంధీ టు హిట్లర్’ సినిమాలో ‘వైష్ణవ జన్..’
అవార్డులు, పదవులు: జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడు(1976లో.. చమేలీ మేమ్‌సాబ్ చిత్రానికి), అంతకుముందు కొన్ని చిత్రాలకు రాష్ట్రపతి పతకాలు. 1977లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 1992లో దాదా ఫాల్కే అవార్డులు.1967-72 మధ్య ఎమ్మెల్యే(అస్సాం)గా.1999-2004 మధ్య సంగీత నాటక అకాడమీ చైర్మన్.
అరుదైన ‘ఆవిష్కరణ’: జీవించి ఉండగా తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్నారు. అఖిల అస్సాం విద్యార్థి సంఘం గువాహటిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆయన 2009లో ఆవిష్కరించారు.
"సాక్షి"వార్తా  పత్రిక  లో  ప్రచురించిన  భాగం  ఇది

కామెంట్‌లు లేవు: