30, మే 2023, మంగళవారం

ఒంటరి గాజు మేడ


 ఒంటరి గాజు మేడ “ఈ దేవదారు చెట్టు”

మునిమాపువేళ.. మా వెనుకవైపు అంతా పక్షుల కిలకిల రవాలతో సంగీతసభ జరుగుతున్నట్లు వుంటుంది. 

కళ్ళనిండుగా చూసింది చాలు అనుకుంటూనే.. మళ్ళీ చపలచిత్తంతో వీడియోలో భద్రపరిచే ప్రయత్నం చేస్తాను. మనుమరాలు నా ఒడిలో బుద్ధిగా కూర్చుని పక్షుల సందడిని ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తూ వుంటుంది. ఫోటో తియ్యి ఫోటో తియ్యి.. అంటూ ప్రేరేపిస్తూ వుంటుంది. మరి నాయనమ్మ ఫోటోల పిచ్చిని సంవత్సరంన్నర నుండి జాగ్రత్తగా గమనిస్తుందాయె. 😊😚

ఆ చెట్టును చూసినప్పుడల్లా.. ఎందుకో “ఆఖరికి నువ్వొకతివే నా కోసం నిలిచివుంటివి” అన్న కవి వాక్యం గుర్తుకొస్తూ వుంటుంది. ఈ అనుకోవడం వెనుక ఒక నిర్వేదం వుంది మరి. ఆ చెట్టు గురించి చెప్పాలంటే ఆ పరిసరాలు గురించి చెప్పాలి మరి. అదంతా గత వైభవంగా మిగిలిపోయిందిపుడు. 

ఇదిగో.. ఆ కనబడుతుందే .. అది మా కమ్యూనిటీ వెనుక విశాలమైన ఖాళీ స్థలంలో రోడ్డు వారగా  వున్న దేవదారు వృక్షం. ఏభై అడుగుల యెత్తుతో ఠీవిగా నిలబడివుంటుంది. ఆ ఖాళీ స్థలం అంతా దట్టమైన చెట్లతో ఎంత దట్టమైన అంటే మన రెండు కాళ్ళు పక్క పక్కనే వుంటే ఎలా వుంటుందో అలా వుండేవి చెట్లు. ఒకసారి పెద్ద గాలివానకు ఆ చెట్టు పక్కనే వున్న ఇంకొక రెండు చెట్లు పెళపెళమనే శబ్దంతో మొదలంటా విరుచుకుపడిపోయాయి. అర్ధరాత్రి ఆ శబ్దానికి ఉల్కిపడి లేచి.. ఈ చెట్టే పడిపోయి వుంటుంది అనుకున్నాం. కానీ అది అలాగే ఠీవిగా నిలబడివుంది. ఆ చెట్టు చుట్టుపక్కల అలాంటి దేవదారు వృక్షాలు తప్ప మిగతా దారంతా మేపిల్ వృక్షాలు! ఆ మేపిల్ వృక్షాలన్నీ రంగులు మారుతూ మోడులై మిగిలి బోసిపోతున్నా తాము మాత్రం పచ్చగా నిలబడివుంటాయి  దేవదారు వృక్షాలు. అలా అనేక పక్షులకు ఆవాసంగా వుంటుంది ఈ వృక్షం కూడా. పక్షులు వాలి వున్నప్పుడు ఆ  పక్షులే చెట్టు ఆకుల్లా వుండి కొత్తగా చూసేవారికి ఆకుల్లాగానే భ్రమింపజేస్తాయి. ఉదయసాయంత్రాలు వర్షం వేళల్లోనూ.. ఆ చిట్టడవిని చూస్తూ వుండటం అదొక చెప్పనలవికాని అనుభూతి.  ఆకుపచ్చని సముద్రంపై కారుమేఘాలు వాలినప్పుడు..నా మనసు కాన్వాస్ పై చిత్రించుకున్న చిత్రాలు యెన్నెన్నో! 

గత సెప్టెంబర్ లో నేను వచ్చిన వారం తర్వాత .. వొకొనొక రోజు అందరూ నిద్రలేవకముందే.. పెద్ద పెద్ద ఢబేల్మనే శబ్దాలతో చెట్లను రంపపు యంత్రాలతో కోస్తున్న శబ్దం దానికి తోడు జెసిబి ల చప్పుళ్ళతో ఆ ప్రదేశమంతా భీతావహంగా వుంది. నాకు గుండెల్లో చెప్పలేని అలజడి. గబగబా కిందకు వెళ్ళి.. తలుపు తెరుచుకుని బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళాను. అక్కడ జరుగుతున్న విధ్వంసకాండ ను చూసి నిశ్చేష్టురాలినయ్యాను. 

ఏడెనిమిది జెసిబిలు రెండు క్రేన్

లు ఒక నలభైమంది మనుషులు. నలభై అడుగుల ఎత్తున్న అనేకమైన చెట్లను ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ట్రక్ లకు ఎత్తుతున్నారు. వెలుపలికి తరలిస్తున్నారు. కాసేపు దిగులుగా చూసి బరువుగా నిట్టూర్చి..లోపలకు వచ్చాను. బ్రష్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి అక్కడ కాసేపు నిలబడి చూస్తూ వుండిపోయాను. ఎవరితోనైనా ఈ విషయం  పంచుకోవాలనిపించింది.  అబ్బాయికి కాఫీ కలిపి తీసుకొచ్చి ఇచ్చి .. మన వెనుక వున్న చెట్లన్నీ నరికేస్తున్నారు అని చెప్పగానే.. అవునా.. అంటూ వొక్క ఉదుటున లేచి బ్లైండ్స్  పూర్తిగా పైకి లాగి వెలుపలికి చూసాడు. పచ్చని వనం మాయమవుతూ వుంది. గూళ్ళు పెట్టిన పక్షుల దీనమైన అరుపులు. పైన తిరుగుతున్న రాకాసి గద్దలు. ఆ ప్రాంతమంతా రణరంగంలా గోచరిస్తుంది.  కొండంత ఆపేక్ష తప్ప ఆయుధాలు ధరించిలేని ధరణి జరుగుతున్న నాశనానికి కన్నీరు కార్చే వుంటుంది. నా చంకలో కూర్చున్న మనుమరాలు కూడా బిక్కముఖం వేసుకుని చూస్తూ వుంది. 

ఆ చుట్టుపక్కలంతా పచ్చగా కళకళలాడుతూ వుంటుంది. పొల్యూషన్ వుండదు. ఆరోగ్యకరంగా గాలి పీల్చుకోవచ్చు అనుకొని ఇక్కడ ఇల్లు కొనుక్కొన్నాను. ఆ పచ్చదనం అంతా మాయమైపోతుంది. ఈ రోడ్డు వెడల్పు చేసి హైవే లైన్ చేస్తున్నారేమో అందుకే నరికేస్తున్నారు అన్నాడు అబ్బాయి. అసలు కమ్యూనిటీ ఏర్పడినప్పుడు అక్కడొక పెద్ద పార్క్ నెలకొల్పుతారు అని ప్లాన్ వుందట. కాసేపు చూసి  భారంగా నిట్టూర్చి కూతురుతో “నీ చిన్నప్పుడు ఇదంతా అడవిలాగా వుండేది,అని చెప్పాలేమో ఇక”అంటూ అక్కడి నుండి కదిలి మాములు జీవితంలోకి వెళ్ళిపోయాము.   ఒక నెలయ్యే సరికి రెండు పర్లాంగుల వరకూ చెట్లన్నీ నరికేసి బయటకు తోలేసి భూమిని చదునుచేయడం మొదలెట్టారు. రోజూ చూసే దృశ్యాన్నే పదే పదే చూస్తూ వుంటే బాధ పలుచనవుతుంది అంటారు కదా! ఆ స్థితి లోకి వచ్చేసాము. 

అంతా నరికేసిన తర్వాత ఈ చెట్టును యెందుకో వదిలేసారు మరి.  ఒంటి స్తంభం మేడ వలె వొంటరిగా నిలబడిన ఆ చెట్టుని చూస్తే నాకు అదొక గుబులు. చుట్టూ వున్న  చెట్లన్నీ నిర్ధాక్షిణ్యంగా కూల్చబడ్డాక... ఆ చెట్టును ఆశ్రయించుకున్న పక్షులన్నీ ఏమి ఆలోచిస్తాయో అనుకుంటాను నేను. 

కాసేపు నా ఊహలో నా పక్షి మనసు ఈ విధంగా.. 

“ఆ ఇంటినాశ్రయించుకున్న  నాలాంటి అనేకానేక జీవులు. మేము వినిపించే కవిత్వాన్ని సంగీతమంటారు కొందరు కూజితాలు కువకువలు కిచకిచలు అంటారు మరికొందరు.. వాక్యంలో కవిత్వాన్ని వెతుక్కునే నిజమైన కవులు ప్రాణుల ఉనికిని చాటే చైతన్య జీవరాగం అంటారు. మాకు ఆశ్రయమంటూ మిగల్చాలి కానీ మా ఉనికి మీకు బతుకుపై తీపి ఆశని పెంచే ఆహ్లాదాన్ని పంచే  స్వర సంగీత ఝరి కదా మేము అంటూ విన్నపాలు వినిపిస్తుంటాయి”  

ఇంకా చెప్పాలంటే.. ఇప్పటికీ మనిషిని అమాయకంగా నమ్మి ఆ చెట్టుపై పక్షులన్నీ గూళ్ళు పెట్టుకుని వున్నాయి. ఆ గూళ్ళకు చెట్టు భరోసా ఇవ్వలేదు. చెట్టు కు ఆధారభూతమైన భూమి భరోసా ఇవ్వలేదు. 

పక్షులన్నీ ఎగిరిపోయాక ఒంటరిగా నిలబడ్డ చెట్టును చూస్తే మరింత దిగులు. చెట్టు వొంటరైంది అని. అంతలోనే ఓదార్పు ఇన్ని పక్షులకు ఆవాసమైంది జన్మ ధన్యం అని. ఏమిటో ఈ ద్వైద్వీ భావన. 

వొంటరితనమంటే భయపడే మనిషి  సమూహం నుండి తనను తాను వెలివేసుకుని ఆ వొంటరితనం లోకే జొచ్చుకుని పోతున్నాడు చెట్టు పుట్ట మట్టి జంతువు పక్షులు అన్నింటిని కడతేరుస్తూ.. 

ఆ మాయమైన స్థలంలో .. ఏదో స్టోరేజ్ లేదా మాల్ నిర్మాణం జరుగుతుంది. 

నిర్మాణాల పక్కన మిగిలిన భాగం .. ఆఖరి వీడియోలో.. 

అభివృద్ధి అంటే విధ్వంసమే ఎక్కడైనా సరే 🤔

#worldenvironmentday2023

#vanajatatineni

తరువాత మనుమరాలికి ఒక కథ చెప్పడం ప్రారంభించాను. అది ఇంకో భాగంలో..



29, మే 2023, సోమవారం

ఓ అన్నా.. నీ అనురాగం


 మహిళాభ్యుదయం కోణంలో రామన్న అడుగుజాడలు..

ఒక రాజకీయ నాయకుడిగా.. ముఖ్యమంత్రిగా.. మహిళలకు అండదండలు సమకూర్చిన శ్రీ .. నందమూరి తారక రామారావు గారిని అభివృద్ధి సంక్షేమ రాజకీయ కోణంలో నేను చూసినదాన్ని చెప్పే ప్రయత్నం ఇది.


ఒక మనిషి గురించి మనం మాట్లాడాలంటే వారితో మనకు వ్యక్తిగత పరిచయమే అవసరంలేదు. వారి వ్యక్తిత్వం మనకు అర్ధమైతే చాలు.వారి సేవలు  ఆచరణయోగ్యం గా మారి చరిత్రలో సువర్ణాక్షరాలుగా లిఖింపబడివుంటాయి.


నేను చిన్నతనం నుండే ఇతరుల ద్వారా విన్న మాటల్లో పత్రికల్లో చదివిన సమాచారంతో  రేడియో లలో విన్న వార్తల్లో చూసిన సినిమాల్లోనూ అప్పుడపుడే పరిచయం అయిన టివీ లో చూసిన వరకూ మాత్రమే ఎన్ టి ఆర్ తో  పరిచయం అని చెప్పవచ్చు. ఆయన రాజకీయరంగ ప్రవేశం జరిగిన తర్వాతనే  పూర్తి ఆసక్తిగా గమనించడం. 


స్వర్గీయ ఎన్ టి రామారావు గారిని నేను రెండుసార్లు సమీపంగా చూసి వుంటానంతే! అంతకుముందు ఆయన  గొప్ప ప్రజాదరణ వున్న   సినీ నటుడు రాజకీయవేత్త.   నటుడిగా పౌరాణిక పాత్రల ద్వారా వేసిన ముద్ర వల్ల కొంత  అభిమానం, రాజకీయరంగంలో సంచలనం సృష్టించిన తీరు వల్లనూ   పేదల అభ్యున్నతి పట్ల  వారికి గల శంకించలేని  చిత్తశుద్ధి వలన కల్గిన అభిమానం. ఈ పురానవ యుగ పురుషుడి గురించి రాయడం అంటే.. భయంతో కూడిన గౌరవమే!  


మహిళాభ్యుదయం పట్ల వున్న వారికి వున్న అభిలాష చేసిన ప్రయత్నాలు వల్ల 1985 తర్వాత మహిళల జీవితాల్లో పెనుమార్పులే వచ్చాయి. మహిళాభ్యుదయం అంటే మహిళలను గౌరవించడం వారికి వున్న అవకాశాలను సుగమం చేయడం వారి అభివృద్ధికి కంకణం కట్టుకోవడం.. 


మొదటగా ఆయన నటనా జీవితంలో తారసపడ్డ స్త్రీల పట్ల వారి వైఖరి.. 


నటనా జీవితంలో యెన్నో ఆకర్షణలుంటాయి. వాటి బారిన పడకుండా హుందాగా ప్రవర్తిస్తూ నటీమణుల పట్ల గౌరవం కల్లి వుండేవారని చాలామంది నటీమణులు తమ ఇంటర్వ్యూల్లో చెప్పడం మనం విన్నాం. ఒకానొక సందర్భంలో మోహం లో పడిపోకుండా ఔచిత్యం ప్రదర్శించారని చెప్పడం విన్నాను. 


తన  సహ నటీ నటులకు  విలువైన సూచనలు అందించేవారని క్రమశిక్షణ సమయపాలన కల్గిన వ్యక్తి అని అది సెట్ నుండి ఇంటి వరకూ  వ్యక్తిగతం వరకూ కూడా వుండేదని వారి పిల్లలు  సహ నటులు అనేక సందర్భాల్లో  చెప్పగా మనం విన్నాం. ఆహ్యారం వాచకం విషయంలో చాలా శ్రద్ద తీసుకునే వారని అదే ఆయనను ఉన్నతస్థానంలో నిలిపిందని అంటారు. 


నాలుగు దశాబ్దాల పాటు  నటనకు భాష్యం చెప్పినట్లుగానే  రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల మధ్య తిరుగుతూ  నాయకుడు అనే పదానికి నిర్వచనమై నిలిచారు. ఆయన విద్యావంతులైన స్త్రీలను గుర్తించి రాజకీయాల్లోకి ఆహ్వానించారు చట్ట సభల్లో ప్రవేశానికి అవకాశం కల్గించారు. కె. ప్రతిభా భారతి , రేణుకా చౌదరి

గ్రంధి మాధవి నన్నపనేని రాజకుమారి జయప్రద మొదలైన వారంతా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయరంగంలో ప్రవేశించినవారే! 


 ఊరూరా తిరిగి ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్గించారు. తెలుగు ప్రజల హృదయాన్ని చూరగొని ముఖ్యమంత్రి కాగానే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. తమ ఆడబిడ్డలను కూడా ఉన్నత విద్యలు చదువుకునే విధంగా ప్రోత్సహించడమే కాదు,  మహిళాభ్యున్నతి గొప్ప సాంఘిక ప్రయోజనం అని భావించి 1983 లో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తిరుపతిలో  పద్మావతి మహిళా కళాశాల (విశ్వవిద్యాలయం) స్థాపించబడింది.


స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్ , స్త్రీలకి చట్ట సభల్లో 30% రిజర్వేషన్,  తండ్రి ఆస్తిలో ఆడబిడ్డలకు సమ హక్కు కల్పించారు.


ఒకప్పుడు వైద్య, ఇంజనీరింగ్ కాలేజీలకి ఉన్న డొనేషన్లు, ఇంటర్లో మార్కులు బట్టి నిర్ణయించే విధానం తొలగించి అందరికోసం EAMSET ఎంట్రన్స్ 1986 లో మొదలుపెట్టింది ఎన్టీఆర్. అందువల్ల ప్రతిభావంతులైన ఆడపిల్లలందరూ మగపిల్లలతో పోటీపడి ఇంజినీరింగ్ డాక్టర్ చదివి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా  ఉన్నత స్థానాల్లో వున్నారు. 


1987 లో రాష్ట్రం అంతటా “ తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణం” “శిశు వికాస కేంద్రం”  “వృత్తి వికాస విద్యా కేంద్రం” పేరిట ఎన్నో సంస్థలు ప్రారంభించి మహిళా వికాసానికి మహిళాభివృద్ధికి పెద్దపీట వేసారు. 


మద్యపాన నిషేధ ఉద్యమానికి మద్దతు పలికి 1994 లో ప్రభుత్వం ఏర్పాటు కాగానే  మద్యపాన నిషేధం విధించి మగువల మనసును చూరగొన్నారు. 


నాకు తెలిసినంత వరకు స్త్రీ అభ్యున్నతి కోణంలో చెప్పాలంటే  అప్పటివరకుసమాజంలో, ఇంటిలో  భర్త,ఇతర పురుషులు మాత్రమే ఎవరికి  ఓటు వేయాలి అనేది నిర్ణయించేవారు. బయట రాజకీయ సభలు, సమావేశాలకు స్త్రీలు అసలు వచ్చే వారేకాదు.  వచ్చినా వారికి రాజకీయ కుటుంబ నేపథ్యం  వుండేది. ఎన్ టి ఆర్ పార్టీ పెట్టిన అనంతరం స్త్రీలలో రాజకీయ చైతన్యం అనేది ఎవరు నివారించలేని ఒక ఉత్తుంగ తరంగంలా యెగసిపడింది. అన్ని అంశాలపై స్వచ్చందంగా అవగాహన పెంచుకుని ప్రత్యక్ష రాజకీయలలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ పరిణామం  ఒక శతాబ్దకాలంగా ఒక జాతీయ పార్టీ, ప్రభుత్వం అన్నీ కలిసినా కూడా, ఆవిధానాలేవీ అంత చైతన్యం తీసుకురాలేకపోయాయి. అది వొక్క ఎన్ టి ఆర్ కే సాధ్యమైంది.


43 సంవత్సరాల దాంపత్య జీవనంలో భార్య బసవతారకం కు  సముచితమైన విలువనిచ్చారు. ఆమె కేన్సర్ వ్యాధితో మరణించగా కలత చెంది ఆమె పేరిట “బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్” స్థాపించారు. 


 లక్ష్మిపార్వతి ని ద్వితీయ వివాహం చేసుకునే క్రమంలో కూడా ఆమె విడాకులు తీసుకున్నాకనే  వివాహం  చేసుకున్నారు. విలువలకు ఆయన అంత ప్రాముఖ్యం ఇచ్చేవారు. రెండవ భార్యకే అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆమెనే ముఖ్యమంత్రిణి చేయాలి అనే భావనలో కూడా వుండేవారని విన్నాం.  


వారికి మహిళల పట్ల వున్న గౌరవభావం సహృదయత కు తార్కాణం ఇవన్నీ.  మన తెలుగునాట మళ్ళీ ఇలాంటి నటుడు రాజకీయ నాయకుడు మరొకరు పుడతారని వుంటారని కాబడతారని ఏ మాత్రం ఊహించలేం. ఎందుకంటే యుగానికి ఒక్కరే ఇలాంటి వారు వుంటారు. తెలుగు ఖ్యాతిని నలుచెరుగులా వ్యాపితం చేసిన నాయకుడు శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో వారిని మనసారా స్మరించుకోవడం నాకు తెలిసిన జ్ఞానంతో ఈ కొద్దిపాటి విషయాలను పంచుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తూ.... శ్రీ నందమూరి తారక రామారావు గారికి .. ప్రణతులు అర్పిస్తూ.. జయహో! జయహో!! జగత్ విఖ్యాత నందమూరి జయహో!!!


- వనజ తాతినేని

     

    


27, మే 2023, శనివారం

బెల్లం చుట్టూ ఈగలు

 బంధాలన్నీ బలహీనం అయిపోయినాయి. స్వార్ధం పెంకితనం మర్రి ఊడల్లా విస్తరించుకుపోతున్నాయి. 

విసుగు విరక్తి రెండూ వచ్చాక మనుషులను వద్దనుకోవటం మరణించడం కన్నా తక్కువేమీ కాదు.

చుట్టూ వున్న మనుషులు చెప్పాపెట్టకుండా మాయమైపోతున్నప్పుడు మనతో అనుబంధం వున్న మనుషులు హఠాత్తుగా గుర్తుకు వచ్చి గుబులు పుట్టిస్తారు. ఆత్రుతగా వారి కుశలం అడగాలని ఫోన్ పట్టుకుని మళ్ళీ అంతలోనే ఆగిపోవడం.. సంకోచాలను జయించడం అనుకున్నంత తేలికైన విషయమేమీ కాదు. సంకోచం జయించినపుడు వచ్చే స్వేచ్చ ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ కచ్చితంగా సంతోషాన్ని మాత్రం ఇస్తుంది. 

ఎవరైనా యేదైనా అడిగితే … సంశయం లేకుండా ఇవ్వడం కూడా అంత తేలికైన విషయమూ కాదు. మానసికమా శారీరకమా వస్తు రూపమా వడ్డీ రూపమా స్థిరచరాస్తులా అన్నది కాదు. అన్నింటి మీద మనకేం పూర్తి హక్కులు ఉండవు . మన  హక్కులో ఇతరుల హక్కులో ఇష్టాలో అయిష్టాలో యెన్ని కలగాపులగమై వుంటాయసలు. వాటితోనే వచ్చిన చిక్కు, సంకెళ్ళూనూ.  మాట ఇచ్చి తర్వాత అడ్డకత్తెర లో పోక చెక్క లా నలిగిపోతారు. 

 అడిగిన వారికేమో  మనం యివ్వలేదని నిరసన అలక ఆరోపణలు  అన్నీ ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూ వుంటాయి. అవి  మనసుకు తెలుస్తుంటాయి. అదేం రాయి కాదుగా. మాట ప్రవర్తన  అవతల మనిషిని మనకు పట్టిస్తాయి. ఒకవేళ వాటిని వారు అవసరం మేర దాపెట్టినా నువు  చూసింది విన్నది నిజం కాదనీ,నువ్వు ఏమి ఫీల్ అవుతుంటే అదే నిజమని నీ మనసుకు తెలుస్తుంటుంది. 

మనం కానీ, వారు కానీ వ్యక్తులను బహిష్కరించినంత  మాత్రాన

ద్వీపాంతర శిక్షలు వేసినంతమాత్రాన..భావజాలాన్ని నియంత్రించగలమా.. 

వ్యక్తీకరణలను నిరోధించగలమా.. 

భావ ప్రకటన భిన్నరూపాలు. చేరవలసిన వారికి చేరుతూనే ఉంటాయి ఇంకో నాలుగు కలిసి.

 

ఆక్టోపస్ లా రూపురేఖలు  ఆలోచనలను మార్చుకోగల్గిన కాలంలో ద్వేషం మాత్రం 

బతికే ఉంటుంది భూమి అడుగున చెట్టు వేర్లు విస్తరించి నట్లు.  

ఆ విస్తరించిన వేళ్ళను నరికే పనిలోనే ఉంటాము. పెకిళించి అగ్నికీలలకు ఆహుతివ్వాల్సిన సమయం సుదూరంగా  గోచరిస్తుంటుంది.

మన నడకలో అడుగడుగునా కొత్త కొత్త పాదాలు పదములు కలుపుతూ నవపథంలో  మనం పయనిస్తూ ఉంటాం . మనం మనమే కాని అనేకులంగా మారి ఎవరి నడక వారిదిగా.. విభిన్నమైనాం.విభిన్నంలోనూ మనం మనమే ఇంద్రధనస్సు లో రంగుల్లా.. 

జీవితం ప్రవాహం లాంటిదని అంటారు.. కలుపుకుంటూ ప్రవహించడమే.. అప్పులు ఇవ్వలేదని ఆర్థికసాయాలు చేయలేదని పగబూని యెడంగా జరిగిన మనుషులకు ఏం చెప్పినా అర్ధం కావు. దూరంగా ప్రశాంతంగా వుండటమే! 

మనం ఇంకొకరి పట్ల అసహనంగా వున్నామంటే వారు మనకన్నా మెరుగ్గా వున్నారనే భావంతో పాటు మనని తక్కువగా చూస్తున్నారనే ఆత్మనూన్యత వల్ల కావచ్చు. ఆత్మనూన్యతలో నుండే ఆరోపణలు మొదలవుతాయి. వ్యక్తులు అభివృద్ది పథంలో వుండటానికి లేకపోవడానికి కారణం తల్లిదండ్రులు మరొకరు మరొకరు ఇచ్చే సహకారమొకటే కాదు వ్యక్తికిగల తపన ఆకాంక్ష చదువు అవకాశాలు లభించడం అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

రుణ బంధాలు కథ అనుభవాల ఆధారంగా రాసిందే!


25, మే 2023, గురువారం

వాట్ నెక్స్ట్ !!?

 What next !!!??

పెళ్ళి సంప్రదాయంగా.. ఆడంబరాలు లేకుండా జరగడం పోయి చాలా ఏళ్ళు అయింది. ఎంగేజ్మెంట్  ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్స్ మెహందీ ఫంక్షన్ మంగళ స్నానం పెళ్ళి రిసెప్షన్.. ఇవన్నీ తప్పనిసరిగా ఆడంబరంగా తాహతుకుమించి జరుపుతున్నారు. 

యువతీయువకులు కూడా కష్టపడి పెళ్ళి ఆడంబరంగా జరుపుకోవడం కోసం డబ్బు దాచుకుంటున్నారు. చాలకపోతే క్రెడిట్ కార్డ్ లు. తల్లిదండ్రులు కూడా ఇరుగుపొరుగు వారిని బంధువులను చూసి తమ తాహతుని మించి ఆడంబరంబంగా పెళ్ళి జరిపిస్తున్నారు. తల్లిదండ్రులకు స్థోమత లేకపోయినా పిల్లల గొంతెమ్మ కోర్కెలకు తలవొంచక తప్పడంలేదు. 

ఇంతా చేసాక ఆ పెళ్ళి వలన పిల్లలు ఆనందంగా వుంటున్నారా లేదా అని తరచి చూసుకోవాల్సిన పరిస్థితి. వారానికి సంవత్సరం లోపు విడాకులకు వెళ్ళిన ఉదంతాలు యెన్నో. ఉన్న డబ్బు ఖర్చు పెట్టేసి.. పైగా అప్పులు అయ్యి విడాకులు పుచ్చుకున్న బిడ్జలను చూసి ఏడ్చుకునేది ఎందరో. 

మా ఫెండ్ వొకరు కూతురు పెళ్ళి చేసింది. అమ్మాయి అబ్బాయి ఆరు నెలలు సహవాసం చేసి వొకరికి వొకరు నచ్చి అన్ని లెక్కలు వేసుకున్నాకనే భారీగా పెళ్ళి జరిపించుకున్నారు. పది రోజుల తర్వాత విడాకులకు వెళ్లారు. తల్లుల మధ్య భేదాభిప్రాయాలంట. మా అమ్మ కరెక్ట్ అంటే మా అమ్మ కరెక్ట్ అని. విడాకులన్నాక వియ్యపురాళ్ళిద్దరూ సారీ చెప్పుకుని సర్దుకుంటాం అన్నా కూడా పిల్లలు వొప్పుకోలేదు అంట. అసలు స్వరూపాలు తెలిసాయి. ఇక మనకు కుదరదు లే అన్నారంట. విడాకులు అయ్యాయి. 

మా ఫ్రెండ్ వొకటే ఏడుపు. ఉన్న సొమ్మంతా అయిపోయింది. పట్టు చీరలు ఆల్బమ్ లు చూసుకుని ఏడ్వడం  అప్పులు తప్ప ఏమీ మిగలలేదు అని. 

మళ్ళీ తనే అంది. “సహజీవనాలు” అంటున్నారు గా. అదేదో చేసుకుంటే కన్నవాళ్ళ కు ఈ బాధలు తప్పుతాయి.. అని. 

అప్పుడు నా మనసులో మెదిలిన ఆలోచనలు ఇలా.. 

అది మాత్రం తప్పు ఏం వుంది లే ? తప్పు అనే భావన కల్గితే మరీ అంత ఫాస్ట్ యుగంలో మనం జీవించడం ఎందుకులే అనుకుంటే.. సింపుల్ గా పదిమంది దగ్గర వారందరి మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని చిన్న టీ పార్టీతో పెళ్ళి తంతును ముగించుకుని భవిష్యత్ అవసరాలకు డబ్బు ఉపయోగించుకుంటే మంచిది. 

బంధువుల కోసం స్టేటస్ ల కోసం ఉన్నదంతా ఊడ్చి చేసే పెళ్ళిళ్ళు పిల్లలకేమో గానీ పెద్దలకు మానసిక వేదనే! 

ఇంకొక విషయం ఏమంటే.. కన్యాశుల్కం కాలం నాటి నుండి వరకట్నం లోకి మారాం. వరకట్నం లో నుండి కులాంతర మతాంతర ప్రేమ వివాహాలను ఆమోదించడం ఆడంబరాలు ప్రదర్శించడంలో మెడకు ఉరితాళ్ళు తగిలించుకోవడం పెళ్ళి సక్సెస్ అవుతుందా లేదా అన్న టెన్షన్ ల మధ్య బ్రతకడం వరకూ వచ్చాం కాబట్టి.. 

సహజీవనం అంటే కూడా ఉల్కి పడకుండా.. ఆమోదించడం కి అలవాటు కావాలి. ఎలాగూ వచ్చే దశాబ్దాల్లో చట్టబద్దమైన వివాహం కన్నా సహజీవనాలే ఎక్కువ అయ్యేటట్టు వున్నాయి. అనిపిస్తుంది.

ఇంకో తరహా వాళ్ళ గురించి.. ఇది విదేశాల్లో వున్న వారి గురించి.. మాత్రమే!

ముఖ్యంగా అమ్మాయిల గురించి.. 

చాలామంది అమ్మాయిలు అన్నింటిలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రేమ పెళ్ళి విషయంలో తప్పటడుగలు వేయడం పరిపాటి అయిపోయింది. ఒకసారి దెబ్బతిన్నాక కానీ వాస్తవం లోకి రాలేకపోతున్నారు. 

నా పరిచితుల్లో అమ్మాయిలు ఇలా వున్నారు. (30-30+ లు అంతా)

సహజీవనం వద్దు.. అందులో చాలా రిస్క్ లు వున్నాయి. 

అమ్మ నాన్న కుదిర్చే సంబంధం వద్దు. జాతకాలు ఆస్తులు అంతస్తులు చూస్తారు. అది మరీ నరకం.

పోనీ మనమే యెన్నుకుందాం.. నాకు నచ్చితే వాళ్ళకు నేను నచ్చడం లేదు. మరి ఏం చేయాలి?

అతని లాగే తనకూ H1-B వుంది. అయినా కట్నం యెంత యిస్తారు? ఇన్నేళ్ళు సంపాదించిన డబ్బు ఏం చేసావ్ అని అడుగుతారేంటి? అని పెళ్ళి వద్దు ఒంటరి జీవితం మంచిది అనుకున్నట్టు వుంటున్నారు. 

ఇకపోతే అబ్బాయిలు.. ఇలా.. 

పెళ్లికి డైమండ్ నగలు పెట్టాలంట. వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం అంట. 

 పెళ్ళవగానే సింగిల్ హోమ్ పడవ లాంటి కారు,ఫ్యామిలీ ఇన్సూరెన్స్, పిల్లలు ఇవన్నీ మగవాడికే పరిమితమైన భాద్యతలు. 

స్వదేశంలో తల్లితండ్రులుతో పాటు మరికొన్ని భాద్యతలుంటాయి. అవి ఇవి కావాలంటే ఇవ్వన్నీ మన వల్ల కాదు. బ్యాచులర్ లైఫ్ హాయి. అనుకుంటున్నారు. 

అందుకే ఈ కాలం అమ్మాయిలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానివ్వండి.. ఇద్దరికీ భాధ్యతలుంటాయి. పైగా ఉద్యోగ భద్రత కూడా అంతంత మాత్రం. ఎవరూ దేనికీ సర్దుకోరు.. మరి అలాంటపుడు సహజీవనాలు చొచ్చుకుని రావడంలో ఆశ్చర్యం ఏముంది?

పెళ్ళి లో సామరస్యం కుదరడం లేదు.  సహజీవనం లో కూడా  అనేక సమస్యలు ఉత్పన్నం. 

ఇంకొకటి తప్పక జోడించాలి. సహజీవనం తర్వాత వివాహం బాగానే వుంటుంది. వివాహం తర్వాత సహజీవనం గురించి ఆలోచించాలి అనుకున్నప్పుడు విడాకులు పిల్లలు ఈ రెండు విషయాలు గురించి బాగా ఆలోచించాలి. 






24, మే 2023, బుధవారం

నాకు నచ్చిన నా కథ


సారంగ పత్రిక వారు ..నాకు నచ్చిన నా కథ గురించి చెప్పమని అడిగారు . నేను బాగా రాసాను అనుకున్న కథలను ఇతరులు బాగా మెచ్చిన కథలను వదిలేసి  ఇదిగో ..ఈ కథ గురించి ఇలా రాసాను.  ఆ రాత ఇక్కడ పంచుకుంటూ .. అసలు ..ఈ లింక్ లో 

*************

నాకు నచ్చిన నా కథ .. 

ఎవరైనా ఎందుకు రాస్తారు? మనసు ఉగ్గబట్టుకోకలేక తమ  ఆలోచనలకు అక్షరరూపం ఇస్తారు. వాక్యం  కుదురుగా వుందనీ తను రాసుకున్న విషయం ఇతరులను  కమ్యూనికేట్ చేయగలదని నమ్మకం కుదిరాక పత్రికల్లో ప్రచురింపబడటం కోసం ప్రయత్నం చేస్తారు. అది రచయితకు తన రచనపై గల నమ్మకం. నా దృష్టిలో రచన చేయడం అంటే  సామాజిక మార్పు కోసం జరిగే అనేక ప్రయత్నాలలో ఒక భాగం.


“బయలు నవ్వింది” కథ .. కేవలం ఇది  కథ కాదు. నిత్యం మనం చూస్తున్న మన విద్వంసం. విద్వంసాన్ని లక్షణంగా చేసుకున్న మానవజాతి చేజేతులా తమ నాశనాన్ని తామే కోరుకుంటుంది. 


ప్రకృతి యిచ్చే సహజసంపద ను నాశనం చేసేస్తున్నాం మనం. ఒక తరం నుండి మరొక తరానికి అందించే నిజమైన సంపద సంప్రదాయమే! సంప్రదాయమంటే మరేమిటో కాదండీ జీవన విధానమే..  పంట పశువు చెట్టు పుట్ట గుట్ట నీరు ఆహారవిహారాదులు. వాటిని వొక్కొక్కటిగా నాశనం చేసుకుంటూ వెళ్ళి పోవడం అంటే  మన వినాశనానికి మనమే బీజం వేసుకున్నట్టు కదా!


సంప్రదాయం లేని జాతి  వెన్నుముక లేని శరీరం లాంటిదని పెద్దలు చెబుతారు. తమ చుట్టూ వున్న ప్రకృతిని ప్రేమించడం పూజించడం గౌరవించడం మన సంస్కృతిలో భాగం. ఈ కథలో .. ఒక తరం జీవన విధానానికి మరో తరం జీవన విధానానికి ఆలోచనలకు చాలా తేడా వుంది.    


కథలో యశోదమ్మ యిలా  అంటుంది. 


“నిజం చెప్పరా తమ్ముడూ.. ఆడు చెట్లన్నీ నరికేసినప్పుడల్లా నీక్కూడా కాళ్ళూ చేతులూ అన్నీ కోసి పారేస్తున్న బాధ కలగలేదు” అని. 


ఈ వాక్యం రాయాలని అనుకోలేదు. ఒరవడిలో రాసేసినాక.. ఆగి చూసుకుంటే దుఃఖం ముంచుకొచ్చింది.


మూఢనమ్మకాలతో ఇళ్ళను చెట్లను నిలువునా కూల్చడం పరిపాటి అయిపోయింది. ఆధునిక జీవితం పై మోజు పెరుగుతున్న కొద్దీ తమ మూలాలను త్యజించడం అనివార్యమైంది. ఎకరాలను అమ్ముకోవడం అడుగులు కొనుక్కోవడం నీరు ను దూరం చేసుకోవడం నీరు కొనుక్కోవడం. సంపద అంతా కార్పోరేట్ కబందహస్తాలలో బందీ అవడం. మానవజాతి తమ అభివృద్దికి కారణమైన అన్నింటినీ నిర్దాక్షిణ్యంగా  తొక్కుకుంటూ వెళ్లిపోవడం సర్వసాధారణం అయిపోయింది. వీటన్నింటికీ మూలం సహజమైన జీవన విధానాన్ని దూరం చేయడం ద్వారా కొందరికి మాత్రమే కల్గే అపరిమిత లాభం. 


ఈ రచన ద్వారా నా ఉద్దేశం యెంత వరకూ నెరవేరుతుందో చెప్పలేను. కానీ పాఠకుడిని తప్పకుండా ఆలోచింపజేస్తుంది. నా ఆలోచన వొక్కటే!  నేను రాసినది సామాన్య పాఠకుడిని స్పందింపజేస్తుందా.. ఆలోచింపజేయగల్గిందా లేదా? అని.  అదే నా రచనకు గీటురాయి. ఈ కథ కన్నా గొప్ప కథలు రాసాను. కానీ ఈ కథ నాకు తృప్తినిచ్చిన కథ. ఏకబిగిన రాసిన కథ ఇది. 


ఈ చిన్న కథలో సందేశంతో పాటు యశోదమ్మ పాత్రలో ధీరత్వం కరుణ రెండింటి సమన్వయం వుంది. స్త్రీ సాధికారత వుంది. 


మానవుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తమ జీవనాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవచ్చు సౌఖ్యం గా బ్రతుకుతున్నాం అని భావించవచ్చు. కానీ తాను నిలబడి వున్న యీ భూమి పై ఆరోగ్యంగా బతకాలంటే పకృతి సమతౌల్యం వుండాలి. పంచభూతాల సమన్యయం వుండాలి. అప్పుడే భూమి పై ప్రాణ కోటి మనుగడ సాగించగల్గుతుంది. మిగతా ప్రాణులతో పాటు తాను అన్నది ఎరుక కల్గి వుండటం ముఖ్యం. 


మనిషికి శాంతి నిచ్చే అభివృద్ధి బదులు భయం కల్గించే అభివృద్ధిలో మనం బతుకుతున్నాం. మనమంటూ మిగిలివుంటేనే కదా.. ఏ ఘర్షణ సంఘర్షణై నా! మనం పచ్చగా వుండాలంటే మన చుట్టూ కూడా పచ్చగా వుండాలి. ఇదే ముఖ్యం.  సంపూర్ణ సత్యమిదే! మన సంప్రదాయం కూడా ఇదే! 


కథ చదవండీ.. 


బయలు నవ్వింది కథ ఈ లింక్ లో




చిత్రం కోసం వెతుకుతుంటే .. ఈ చిత్రం కనబడింది . విచిత్రంగా ఇది మన భారతదేశం లో  ఇళ్ళు కాదు. ఈ తరహాలో అమెరికా లో ఒహియో రాష్ట్రంలో Dayton లో ఈ తరహా ఇళ్ళు నిర్మించుకున్తున్నారట. మానవుడు ఆధునికత జీవనంలో విసిగి పోయాడు. ప్రకృతిలో సహజంగా బతకడానికి ఇష్టపడి .. ఆ దిశగా వెళుతున్నాడు. శుభ పరిణామమే !




22, మే 2023, సోమవారం

మాలతి గారి కథల్లో జీవన మాధుర్యం.

నిడదవోలు మాలతి గారిని నేను చదవడం మొదలెట్టి పన్నెండేళ్లు. కల్పన రెంటాల గారి తూర్పు-పడమర బ్లాగ్ లోని లంకె ల ద్వారా మాలతి గారి కథల గురించి చదివాను. ఆ తరువాత అడపదడపా వారి కథలను చదవడం జరిగేది. ఆ కథల్లోని క్లుప్తత గాఢత నన్ను బాగా ఆకర్షించింది. 


తర్వాత కాలంలో ఫేస్ బుక్ ద్వారా ఆమె పరిచయం అయ్యారు. మాలతి గారి కథలే కాదు వారి రోజూ వారీ అభిప్రాయాల్లో కూడా భావగాంభీర్యం లోతైన ప్రకటన నన్ను  పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెద లాగా మార్చింది. ముఖ్యంగా  నేను వ్రాస్తున్న విధానంలో మార్పు తీసుకువచ్చింది. వీలైనంత వరకూ ఆంగ్లం వాడకుండా తెలుగు రాయడానికి ఆ పరిచయం దోహదపడింది.అందుకు  వారికి కృతజ్ఞతలు. 


వర్దమాన రచయితలకు మాలతి గారి రచనలు పాఠ్యాంశాలు. ఒక సంభాషణ ను క్లుప్తంగా అర్ధవంతంగా స్పష్టంగా యెలా చెప్పగలం అన్నది ఆమె రచనల్లో చదివి తెలుసుకుంటాం. ఆమె కథలను మొదట కథ కోసం చదువుతాను. మళ్లీ రెండవసారి కథ యెలా రాసారు అన్నదాని కోసం అవగాహన కోసం చదువుతాను. వాక్యానికి వాక్యానికి మధ్య చెప్పని కథ గురించి ఆలోచించేదాన్ని.మాలతి గారి కథల్లో చెప్పిన దానికన్నా పాఠకుల ఊహకు అవగాహనను వదిలిపెట్టిన అంశమే ఎక్కువ వుంటుంది. 

 

మంచు దెబ్బ, అవేధ్యాలు, జేబు, ప్రాప్తం, నిజానికీ ఫెమిజానికి మధ్య, విషప్పురుగు,జీవన మాధుర్యం లాంటి కధలు మళ్లీ మళ్లీ చదివిన కథలు. ఆ కథలు చదివిన వెంటనే స్పందించానో లేదో గుర్తులేదు. ఇప్పుడు వేదికపై మాట్లాడటం కోసం మళ్లీ మాలతి గారి రచనలు చదివి అభిప్రాయాలను వల్లె వేయాలని నేను అనుకోవడం లేదు. ఆమె రచనా కాలం నా వయస్సు కన్నా పెద్దది.మనసైనప్పుడు తీసి చదువుకోవడమే!  


సామాన్య పాఠకురాలిగా నా స్పందన యెలా వుంటుందంటే… 

ఒక రచన చదివిన వెంటనే పాఠకురాలిగా నా స్పందనలో కొంత ఉద్విగ్నత ఆవేశం వుంటుంది. అది తగ్గిన తర్వాత మరలా  యింకోసారి చదవడం వలన కథ గురించి ఆలోచించడం మొదలుపెడతాను. ఇక అప్పుడు నా స్పందన నూ అభిప్రాయాలను చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటాను లేదా బద్దకిస్తాను. రచయితకు యెవరైనా తమ రచనలను చదివి మెచ్చుకుంటే చర్చిస్తే ప్రత్యేకంగా గుర్తిస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఇందుకు యెవరూ అతీతులు కారని నా అభిప్రాయం.


 ఆరు దశాబ్దాల పైబడి న మాలతి గారి రచనా వ్యాసంగం యెలాంటిదంటే..చెట్టు యొక్క వేర్లు భూమి లోపల విస్తరిస్తూ భూమి పైన కొమ్మల రూపంలో విస్తరించినట్లు ఆమె కూడా తన అనుభవాల గాఢతను లోలోపలికి యికింపజేసుకుని తనదైన శైలితో హృదయ సంస్కారం తో విశ్వజనీన భావాన్ని   అంతరంగంలో విస్తరించుకుంటూనే బాహ్యంగా తన భావ ప్రకటనతో రచనలను పాఠకుల దరికి చేర్చారు. 


చాలామంది రచనలు గొప్పగా వుండొచ్చు. రచన కన్నా రచయిత గొప్పవారు అయివుండవచ్చు. రచనలు రచయిత కూడా గొప్పగా నాకనిపించింది మాలతి గారిని  చూసినప్పుడు. మాలతి గారి రచనల్లో సందేశం సూచనాప్రాయంగానే వుంటుంది. రచయిత బలవంతంగా పాత్రలో ప్రవేశపెట్టిన నీతి సూత్రం యేది కనిపించదు. పాత్రలను సహజసిద్దంగా పాఠకుడు స్వీకరిస్తాడు. నాకు తెలిసిన సమాజం యిది. ఈ మనుషులు యిట్లా వున్నారు. వారిని నా కథల్లో నవలల్లో యిలా వారిని పరిచయం చేయాలి అన్నట్టు కాకుండానే పాత్ర ఔచిత్యం యేమిటో స్పష్టంగా రేఖాప్రాయంగా సూచిస్తారు. కాంత లాగా కావ్యం దిశానిర్దేశం చేయాలి కదా.. అన్నట్టు. అది నాకు బాగా నచ్చుతుంది. 


 ఎన్నెమ్మకతలు లో సంద్రాలు పాత్ర నాకు చాలా యిష్టం. రచయిత ప్రకటించలేని అభిప్రాయాలను నిర్మొహమాటంగా అమాయకత్వం నింపుకున్నట్టు భ్రమింపజేసే గడుసుదనంతో ప్రశ్నిస్తుంది.తీర్పును ప్రకటిస్తుంది.రచయిత మార్కు పాత్ర అలా పాఠకుల మనసుల్లో తిష్ట వేసుకోవడం రచయిత విజయంగా మనం భావించాలి.


కథల్లో దేశీయత యెంతో నిండుకుని వుంటుంది. పాత్రల మనస్తత్వాల లోగుట్టు ను కూడా చిన్న వాక్యాల ద్వారా పరిచయం చేసేస్తారు.    రంగు తోలు, నిజానికి ఫెమినిజానికి మధ్య  లాంటి డయస్సోర కథలు  మనను ఆలోచింపజేస్తే చాతక పక్షులు, మార్పు   నవలలు రెండూ జీవన వైరుధ్యాలను  కూడా రికార్డ్ చేసి రెండు సంస్కృతుల మధ్య నలిగిపోయి యెప్పుడూ సందిగ్దంలో నడక సాగించే రెండు తరాల ప్రతినిధులను కూడా మనకు పరిచయం చేసారు. స్వగతం లాంటి ప్రకటనకు అవకాశం లేని  అవసరమైన అర్దవంతమైన  చర్చను చేసారు. 


నేనింకా మాలతి గారి రచనలు అన్నీ చదవలేదు. 

మన తెలుగు సంకలనాల్లో మాలతి గారి కథలు అంతగా కనిపించని లోటును పత్రికలు పునఃప్రచురించి పాఠకులకు పరిచయం చేయాల్సిన అవసరం వుంది. 


తూలిక బ్లాగ్ గురించి యెంత చెప్పినా తక్కువే! మాలతి గారు ఆమె రచనలతో పాటు ఆంగ్లంలోకి అనువదించిన తెలుగు కథలు, పరిచయ వ్యాసాలు అన్నీ భద్రపరిచి భావి తరాలకు వొక శాశ్వత నిధి ని సమకూర్చారు. అందుకు ఆమె యెంతో అభినందనీయురాలు.మాలతి గారి విశేషకృషి చూసినప్పుడు ఆమెకు తగిన సహకారం మన తెలుగు సాహిత్య పీఠాల నుండి  లభించడం తక్కువని తెలిసినప్పుడు.. వొక మాట అనుకున్నాను.. ఆమె  బాట పక్కన మలుపులో వొంటరిగా నిలబడి కాంతులిచ్చే వీధి దీపం లాంటిదని. ఆ దీపం వెలుగుల్లో  మనమందరం తెలుగు ను వెలిగించుకోవాలి. మసకబారకుండా కాపాడుకోవాలి. 


 ఎంత బాగా రాసినా తమ రచనలు గుర్తింపబడనప్పుడు రచయితలకు వైరాగ్యం వస్తుంది. అందంగా పరిమళాలు వెదజల్లే పువ్వులు, నిండుగా వర్షించే మేఘాలు వున్నచోటనే  కొన్ని గడ్డిపూలు కురవని మేఘాలు వుంటాయి. వాటి ఉనికి వాటికీ వుంటుంది లే అని అనుకునే ఉదాసీనత కల  రచయితలు వుంటారేమో! కానీ నా అభిప్రాయంలో ఆమె అలాంటి ఉదాసీన రచయిత కాదు. రాసిన ప్రతిదాన్ని ఆమె జాగ్రత్తగా భద్రపరిచారు. నిజానికి ఆమె  సృజించిన సాహిత్యానికి అనువాదాలకు తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. సాహిత్య సంఘాల ముఠాకోరు వైఖరి వల్ల మాలతి గారిని గుర్తించడానికి అభ్యంతరాలు జెప్పి గుర్తించినా వెలుగులోకి రానీకుండా నిర్లక్ష్యం చేసారు. అందుకు ఉదాహరణే.. మునిపల్లె రాజు గారి కథల ఆంగ్ల అనువాదం ఇప్పటికి ప్రచురణ లోకి రాకపోవడం. సాహిత్య అకాడమీ తెలుగు విభాగం  సభ్యులు శ్రద్ద వహిస్తే అదెంత చిన్న విషయమో కదా అని అనిపించింది. 


 సాహిత్యంలో యెవరికి లభించిన గుర్తింపు వారిదే… 

నాకు లభించిన గుర్తింపే నా గుర్తింపు అని వినయంగా ప్రకటించుకునే మాలతి గారికి  కవయిత్రి “ మొల్ల పురస్కారం”  లభించిన సంధర్భంగా .. వారికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు. ఈ పురస్కారం అందించిన మొల్ల పురస్కార కమిటీ నిర్వాహకులకు అభినందనలు.


Old order must give place to the new order. And the new order can never adapt it self to the old. పాత వాళ్ళను కొత్త తరం గౌరవిస్తుంది కానీ అనుసరించదు.. అంటాడు జీవన మాధుర్యం కథలో అల్లుడు రమణారావు.సాహిత్యం విషయంలో అది నిజం కాదేమో! ఆధునిక సాహిత్య స్రవంతి లో యిప్పుడు కనబడుతున్న క్లుప్తత లోతు లను నవ్యతలను మాలతి గారూ యెప్పుడో సాధించారని నా అభిప్రాయం. 


మాలతి గారి గురించి యీ నాలుగు మాటలు చెప్పడం కూడా నేను వొక యోగ్యతాపత్రంగా భావిస్తూ..  నిడదవోలు మాలతి గారికి నమస్సులతో.. కల్పన రెంటాల గారికి ధన్యవాదాలతో…  - వనజ తాతినేని.


 



PS: ఈ అభిప్రాయం .. e-book గా తీసుకువస్తామని కల్పనా రెంటాల చెప్పారు . e-book వచ్చిందో లేదో సమాచారం లేదు. ఒక చోట ఈ ప్రసంగపాఠం కార్యక్రమంలో లేదు అని అన్నట్టు చదినాను. నేను అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమంలో పాల్గొనడం వీలవలేదు. గమనించగలరు. ఈ ప్రసంగ పత్రం ఇక్కడ ప్రచురించడం పట్ల అభ్యంతరం ఉంటుందని నేను అనుకోకపోవడం వల్ల ఇక్కడ ప్రచురించడమైనది.



18, మే 2023, గురువారం

బిడ్డల పెంపకం

 మన పిల్లలే మనకు స్వచ్ఛంగానూ… మురిపెంగానూ కనబడతారు. పెరిగి పెద్దయ్యాక కొత్తగా వారే వీరా అని మనం ఆశ్చర్యపడిపోయేటట్టు కనబడతారు. మన అంచనాలకు మించి సాధారణంగా కనబడతారు ముఖ్యంగా తల్లికి ఒక రకంగా తండ్రికి మరొక రకంగా… 

నాణేనికి రెండో వైపు చూడాలనుకుంటాను నేను… అలా చూసే క్రమంలో … యదాలాపంగా రాయకుండా వుండలేక నా ఆలోచనా స్రవంతి… ఇలా. 

మనుమరాలికి ప్లే స్కూల్ లో విత్తనం నుండి మొలకలు ఎలా వస్తాయో చూపించినట్టు వున్నారు. ప్లాస్టిక్ కప్ లో  ఏవో సీడ్స్ వేయించి మొలకెత్తినాక ఇంటికి ఇచ్చి పంపారు. ఆ కప్ కి మనుమరాలి ఫోటో కూడా అతికించి వుంది. మంచి ఆలోచన అనిపించింది. లేకపోతే అన్నం గింజలు అంటే ఏమిటి అని మన కార్పోరేట్ స్కూల్ విద్యావిధానంలో పిల్లల్లా అయిపోతారు అనుకున్నాను. 

 ఇంటి దగ్గర కూడా నా మనుమరాలికి  గింజలు వేయటం నేర్పించాను. మా రైతు భాషలో విత్తడం అంటాం. పక్షుల కోసం నానారకాల కలబోత కల ధాన్యం తీసుకువస్తాం. అందులో వడ్లగింజలు మాత్రం కనబడవు. (అమెరికా కాబట్టి) వాటిలో నుండి ఓ గుప్పెడు తీసి బెడ్ లో చల్లించాను. నా కొడుకు గార్డెన్ ను క్రమ పద్దతిలో చేయాలంటాడు. తనకు ఎవరైనా ఎక్కడైనా మొక్కలు నాటినా గింజలు విత్తినా అసహనం. ఇదిక్కడ ఎవరు వేయమన్నారు.. ఎందుకు వేసావు అని కోపం ప్రదర్శిస్తాడు. 


అలాంటి రియాక్షన్ లు చూసినప్పుడల్లా.. వీడు నేను పెంచిన బిడ్డ కాదబ్బా.. అచ్చం వీడు పితృస్వామ్య భావజాలానికి ప్రతీక అనుకుంటాను. అంత గొప్ప నిర్వచనం ఎందుకంటారా.. ? లేకపోతే ఎవరు వేయమన్నారు నిన్ను అని అడుగుతాడా? సరే నేను తల్లిని. గెస్ట్ ని కొద్దికాలం వుండి వెనక్కి సర్దుకుంటాను. కానీ భార్య ను కూడా అలాగే మాట్లాడతాడు. అది నాకస్సలు నచ్చి చావదు. కోడలు పిల్లకు నచ్చదు ఆ మాట తీరు. అందుకే తను గార్డెను జోలికే రాదు. తన కిష్టమైన మొక్క కొనుక్కొచ్చుకున్నా ఎక్కడ నాటాలో తనే ఆదేశిస్తాడు. ఇంట్లో వస్తువులు సర్దడం కూడా అంతే! 


కుటుంబంలో నలుగురు వున్నాక అందరి ఇష్టాలు వుంటాయి. దానికి తగ్గట్టు మిగతావారు సర్దుకోవాలి.. ఎంతసేపు నీకు ఇష్టమైనరీతిలోనే అందరూ ఇమిడిపోవాలి అనుకోకూడదు అని చెబుతాను. నేనింతే! ఇది నా ఇల్లు. నాకిష్టం వచ్చినట్టు నేను పెట్టుకుంటాను అంటాడు. అప్పుడు చెంప చెళ్లుమనిపించినట్టు భావన. ఈ భావజాలాన్ని పెంచిపోషించేది తల్లిదండ్రులే! ప్రతిది ఇది నీదే అని వారికి కష్టపడకుండా అప్పనంగా అప్పజెప్పడం అంటాను నేను. మరి వారికి నాది అన్న స్వార్థం తప్ప మన అనే భావన ఎలా వస్తుంది?


ఎలాగంటారా.. 

అమ్మో.. నా కొడుక్కి బంగాళాదుంపల డీప్ ఫ్రై యిష్టం, బెండకాయ కొబ్బరి ప్రై ఇష్టం, పప్పు చారు ఇష్టం అని నిత్యం వారికిష్టమైనవే చేసి పెట్టానే కానీ.. ఇదిగో ఈ ముక్కల కలగలుపు కూర నాకిష్టం కాకరకాయ కూర నాకిష్టం నేను ఇవాళ యిదే చేసాను తింటే తిను లేకపోతే లేదు అన్నానా.. అనలేదు కదా.. అలాగే మన ఇష్టం కోసం వారి ఇష్టాలను వొదులుకుంటారని పొరబడి వాస్తవం గుచ్చినట్లు వుంటే ముఖం మాడ్చుకుంటూ రాని నవ్వు నవ్వుకుంటాను.


అలా అని నా యిల్లు నా యిష్టం వచ్చినట్లు సర్దుకుంటాను మొక్కలు నాటుకుంటాను అంటే కూడా వొప్పుకోను.  విసుక్కుంటాను నొచ్చుకుంటాను. మన కోసం కాకపోయినా అందులో వారి మంచి ఇమిడివుంటుంది. అలా అనకూడదని విడమర్చి చెపుతాను. ఒకోసారి వింటాడు. ఇంకోసారి వినడు. చెప్పడం నాధర్మం అనుకుంటాను.


ఇక  నా కొడుకు తన కూతురు వేసిన గింజలు అనగానే గమ్మున వున్నాడు. మొక్కలు పీక కుండా వుంచేశాడు. మనుషులకు ఎమోషనల్ ఎటాచ్మెంట్ వుంటే తప్ప కొన్నింటిని ఆమోదించలేరు అనుకుంటా. అలా అని నా కొడుకు అన్నింటా తన వాదనే నెగ్గాలని తన యిష్టాలే నెరవేరాలని అనుకోడు. ప్రతి విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరూ చర్చించుకుని ఒకరి యిష్టాన్ని వొకరు గౌరవించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది సంతోషకరమైన విషయం. అది చూసి హమ్మయ్య.. నేను భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటాను. 


కిచెన్ గార్డెన్ లో మిక్స్ డ్ క్రాఫ్ వల్ల చీడపీడలుండవు అని చెబుతాను. అబ్బాయి కి చుట్టూ ఆహ్లాదంగా వుండాలి పూల మొక్కలు అంటాడు. నేను కూరగాయల పెంపకం కూడా అంటాను. బ్లాక్ బెర్రీస్ బ్లూ బెర్రీస్ రాస్ బెర్రీస్ వచ్చాయి. నేను సంవత్సరం పైగానే వున్నాను కాబట్టి ఐదారు బకెట్ ల కిచెన్ వేస్ట్ తో వర్మీ కంపోస్ట్ చేసాను. దానిని కుండీల్లో నింపాను. వంగ మొక్కలు టమోటా పచ్చిమిర్చీ వేసాము. ఫలితాలు ఎలా వుంటాయో చూడాలి మరి. 


ఇక నా మనుమరాలికి మొక్కలను సున్నితంగా తడిమి పలకరించడం వాటితో మాట్లాడటం.. పూలు పూసినా కాయ కాసినా మొక్క కు థాంక్స్ చెప్పించడం సూర్యుడికి దణ్ణం పెట్టి థాంక్స్ చెప్పించడం.. నీళ్ళు పారబోయకూడదని నువ్వు నీళ్ళు పారబోస్తే మొక్కలకు మనకు తాగడానికి నీళ్ళుండవని భయపెట్టి చెప్పడం నేర్పుతున్నాను. మనం చెప్పినవి ఎంత చక్కగా అర్ధం చేసుకుంటుందో మళ్ళీ వాళ్ళ అమ్మకు  చెబుతుంది ఆరింద లాగ. అరటిపండు తొక్కలను నారింజ తొక్కలను గులాబీ చెట్ల మొదలు లో పడేసి వస్తుంది. మొక్కలు స్ట్రాంగ్ అవుతాయి అంటుంది పిడికిలి బిగించి. పెద్దలను సైలెంటుగా అనుసరిస్తారు పిల్లలు. రెండు మూడు నెలల బట్టి ప్రతి కొత్త పదం విన్నప్పుడల్లా అంటే ఏమిటి? అనే ప్రశ్నలు వేస్తుంది.  ఇంగ్లీషు పదానికి తెలుగు మాట తో పాటు రెండు మూడు పర్యాయ పదాలు ఒక హిందీ పదం నేర్పుతున్నాను. ఇంకో ఏడాది నేను ఇక్కడే వుంటే బాగుండును అనిపిస్తుంది. పిల్లను వొదిలి వెళ్ళాలంటే మూడు నెలల ముందునుంచే  ఇప్పుడు నుండే దిగులు పుడుతుంది. అచ్చు ఇలాగే నా బిడ్డను పెంచాను కదా! వాడు నన్ను ఎలా నొప్పిస్తున్నాడో అలాగే మనుమరాలు కూడా అనుకుంటాను.


సంవత్సరం క్రితం …నాయనమ్మా నేను నిన్ను కొడతా.. అనేది. ఎందుకమ్మా అంటే.. అంతే, నేను నిన్ను కొడతా! అనేది మళ్ళీ. మీ తాత లాగా కొడతావు కాబోల్సు అని నవ్వేదాన్ని. మనం అనుకొంటాం కానీ అనువంశిక లక్షణాలు కొన్ని కనబడతాయి పిల్లల్లో. నా మొండితనం.. కనబడుతుంది. వాళ్ళ తాత లాగా చేయి కాలు విసరడం కనబడుతుంది. నెమ్మదిగా అలవాటు మానిపించాం. వాళ్ళ నాన్నకు కూడా తన తండ్రి అహంకారం బాగానే అంది పుచ్చుకున్నాడు. ఎంతైనా మగవాడు కదా అనే భావన, నా మాటే సాగాలి అనే పట్టుదల వచ్చిందని అర్ధం అవుతుంది. నా చేయి వదిలి పదమూడేళ్లు అయింది కాబట్టి ఇంతకాలం చాలా విషయాలను గమనించే అవకాశం రాలేదు. చిన్న విషయాలు లాగే కనిపించే పెద్ద విషయాలు గురించి ఆలోచన చేస్తాను. సున్నితంగా చెప్పి చూస్తాను. పిల్లలకు బాల్యంలో మనం వేసే ముద్రల వల్ల వ్యక్తి వికాసం వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటాయట. పిల్లది మనని చూసే నేర్చుకుంటుంది రా అబ్బాయీ అంటే.. నాకు తెలుసులే నువ్వు ఊరుకో అంటాడు.


ఇందాక వొక విషయం చెప్పలేదు కదా.. ఇంట్లో పురుషుడు ఎవరైనా ఇది నా ఇల్లు అని మాట్లాడితే నాకు వొళ్ళు మండుద్ది. వారికి పిత్రార్జితంగానో వారసత్వపు ఆస్థిగానో, లేదా స్వశక్తి తోనే నిర్మించుకుని కొనుక్కొని వుండొచ్చు. అంత మాత్రం చేత నా ఇల్లు అని వొక్కాణించడం నాకు నచ్చదు. ఆ ఇల్లు అచ్చంగా పురుషుడిది అయిపోదు. ఇంట్లో తల్లికో సోదరిమణులకో భార్యకో ఎంతోకొంత వారికి  కూడా భాగం వుంటుంది. గృహ నిర్వహణ ఇంటి పనులు కూడా ఉద్యోగం లాంటివే. మరి ఉద్యోగం అన్నాక జీతం భత్యం వుంటాయి కదా.. ఇల్లాలు కూడా ఇంటి ఓనర్ కింద లెక్క. ఇది నా ఇల్లు అని అహంకారంగా పురుషుడు ప్రకటించడం సబబు కాదు. స్త్రీలు ఎంత బాధ పడతారు. నొచ్చుకుంటారు. ఇది నా అనుభవమే కాక ఎంతోమంది అనుభవం కూడా. కవనశర్మ గారి భార్య ఇల్లు, పుట్టిల్లు, అమ్మకో గది లాంటి కథలు గుర్తొస్తాయి. గృహిణి లకు కూడా నాది అనుకోదగ్గ ఇల్లు వుండాలి. ఉద్యోగం చేసి నీకొక ఇల్లు సమకూర్చుకో అమ్మా.. అని కోడలికి చెప్పాను సీరియస్ గానే. మా మధ్య పుల్లలు పెడుతున్నావ్ అంటాడు అబ్బాయి. కాదు, ఇతరుల యిష్టాలకు విలువ గుర్తింపు ఇవ్వకపోవడం  అణచిపెట్టడం వల్ల ఎవరి స్వతంత్రం వారు వెదుక్కొంటారు. అది కుటుంబానికి మంచిది కాదు అని చెపుతాను. అందరి ఆకాంక్షలను కూడా ఈ భూమి తీర్చలేదు. ఉన్నంతలో సర్దుకోవాలి అని చెబుతాను.


గడచిపోయిన గాధల నుంచి  ఎంతోకొంత  మంచి నేర్చుకోని మనుషులు వికాసం చెందలేరు. 


 ఎంతోకొంత నేర్చుకుని తన భవిష్యత్తు నిర్మించుకోకపోతే మనిషికి  పతనం తప్పదు. 


అలాగే జరిగిన చరిత్రను మరచిన దేశం కూడా పతనం కాక తప్పదు. 


వ్యక్తి అయినా దేశం అయినా ప్రపంచం అయినా..  పాఠాలు నేర్చుకోవడం  తప్పనిసరి.


నిన్న నేను రాసిన ఈ చిన్నపాటి ఆలోచనలు కూడా  ఆ ఒరవడిలో రాసుకున్నవే! వ్యక్తుల్లో  సమాజంలో ఆధిపత్య భావజాలం సమసిపోవడానికి కొన్ని తరాలు చాలవు. బలవంతుడు బలహీనుడిపై సాగించే ఆధిపత్యం అది. బలహీనుడి నుండి కూడా నేను బలహీనుడిని కాను అనే తిరుగుబాటు రావాలి. కుటుంబంలో మాత్రం ఆధిపత్యభావజాలాన్ని ప్రేమతో దయతో భరించాల్సిందే. తప్పదు. కాదంటే..  ఏముందీ.. ఏకో నారాయణ😊😚


మా తాత తరం క్లుప్తంగా నిరాడంబరంగా బతికితే మా నాన్నల తరం సర్దుకుని బతుకుతుంది. మా తరం సౌకర్యంగా బతుకుతుంటే మా బిడ్డల తరం విలాసంగా బతుకుతున్నారు. క్షణం తీరిక లేదు. వెనుకేసే కొండలూ లేవు. నిశ్చింత లేదు.రేపటి తరం ఎలా బతుకుతుందో మరి. బిడ్డల పెంపకం తల్లిదండ్రులది.. ఫలితం వారికి సమాజానికి కూడా.







17, మే 2023, బుధవారం

మా ఊరు - మా ఇల్లు 7


మా ఊరు



మా ఇల్లు పశువుల శాల గడ్డివాము స్థలం వరకూ వీటన్నింటి పొడవునా  పడమట వైపు ప్రహరీ  వుండేది.  దక్షిణం వైపు అంతా పల్లం ఉత్తరం వైపు అసలు   స్థలం లేదు. తూర్పు ఓ పదడుగులు అదీ ఉమ్మడి దారి. మా చిన్న తాతగారికి ఉమ్మడి బావిలో నీరు తెచ్చుకోవడానికి గానూ  నడక హక్కులు వుండేవి. మాకు వారి ఇంటి ముందు నుండి వీధి లోకి రావడానికి నడక దారి వుండేది. మొట్టమొదటగా మా ఇంటి పరిసరాలు పరిశీలించిన వాస్తు సిద్ధాంతి దక్షిణం స్థలం ఎక్కువ వుండటం అదీ లోతుగా వుండటం వల్ల మీకు ఆర్ధిక నష్టాలు కలిసిరాకపోవడం లాంటివి చెప్పారనుకుంటా. ఇక మా వాళ్ళు ఆ సిద్ధాంతి చెప్పిన అన్ని సవరణలు చేయడానికి పూనుకున్నారు. 


ఇంటికి దక్షిణం వైపు వున్న పశువుల శాల స్థలం మధ్య  ప్రహరీ నిర్మించారు. పశువుల శాలకు గడ్డివాము వేసుకునే స్థలానికి మధ్య కూడా మరొక గోడ ఆరడుగుల యెత్తులో నిర్మించారు. కొంత మట్టి తోలి స్థలం యెత్తు పెంచారు. అప్పుడు ఆ పశువుల శాల చతురస్రాకారంగా అందంగా తయారైంది. ఆ స్థలంలో ఆగ్నేయ మూల స్నానాల గది కూడా నిర్మించారు. పశువుల శాల నుండి  ఉత్తరం వైపు ఇంటి  దక్షిణం గోడకు మధ్య నిర్మించిన గోడ కు మధ్య కొంత నైఋతి భాగం పెరిగిందని ఆ పెరిగిన స్థలం వాడకుండా పారు (పనికిరానిదని అర్ధం )  స్థలంగా విడగొట్టి మరొక చిన్న గోడ కట్టారు. అది వాడకూడదని ఎవరూ  నడవకూడదని అన్నారని అన్నయ్య నేను ఆ రెండుగోడల మధ్య మట్టి నింపి పూల మొక్కలు వేసాం. వంట ఇల్లు కూలగొట్టి ఆ స్థానం ఖాళీగా వదిలేసి దక్షిణం వైపున ఇంటి సరిహద్దుగా తాటాకు వంట ఇల్లు నిర్మించారు.


 ఇక మా నాయనమ్మ తాతయ్య లకు వొక్క గది మాత్రమే మిగిలింది. వంట చేయడానికి ఆరుబయట స్థలం. వర్షం వస్తే కట్టెలు తడిచి వంట చేసుకోవడానికి నానా ఇబ్బంది పడేది. పొగ వచ్చే కట్టెలు మండటానికి ఇనుప గొట్టంతో  ఊది ఊది దగ్గుతూ కళ్ళు తుడుచుకునే నానమ్మ రూపం గుర్తొస్తుందిపుడు. 🥲🥲 మా వంటిల్లు ను ఆనుకుని ఇటుకలతో ఆర్చి కట్టి.. అందులో పాటి మట్టి పోసి పశువుల ఎరువు పోసి మూడు రంగుల చామంతి మొక్కలు వేసాం. పారు స్థలంలో కాకర చెట్టు, కనకాంబరం మొక్కలు, బంతి మొక్కలు చిలక గోరింట మొక్కలు మందార బంగాళా బంతి (zinia) మొక్కలు వేసాము. అన్నయ్య నేను ఆ మొక్కలు చుట్టూ తెగ  తిరిగేవాళ్ళం. ఒకసారి ఏదో పువ్వు (గడ్డి పువ్వు కూడా కాదనుకుంటా) వున్న మొక్క వచ్చింది. దానికి పువ్వు కూడా వుంది. అది పీకేస్తాను అని నేను, వద్దు.. బాగుంది వుండనివ్వు అని అన్నయ్య. నేను వద్దు అన్నాక వుండనిచ్చే  రకాన్ని కాదు  కదా! ఆ పువ్వు వున్న చెట్టును మొదలంటా పీకి పడేసాను. అప్పుడు అన్నయ్య కోపంగా వచ్చి ఒక్క దెబ్బ కొట్టాడు. నేను ఏడుస్తుంటే.. పెరిగి పూలు పూస్తున్న మొక్కను ఎందుకు పీకావు? పిచ్చి మొక్కలు మంచి మొక్కలు అని వుండవు. ఎలా పెరిగేవాటిని అలా పెరగనివ్వాలి. నాశనం చేయకూడదు లాంటి హిత వాక్యాలు చెప్పిన గుర్తు. అప్పటి నుండి ప్రతి మొక్కను సునిశితంగా చూడటం అన్ని పూలను సమదృష్టితో చూడటం అలవడింది నాకు. ఇక సంక్రాంతి సమయం వచ్చేసరికి మా ఇంటి చుట్టూ పూలవనం తయారయ్యేది. ఒకసారి హైదరాబాద్ నుండి మా నాలుగో తాతయ్య కోడలు పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వేణి అక్క వచ్చారు. మా ఇంటి చుట్టూ వేసిన మొక్కలు విరిసిన పూలు చూసి భలే ఆశ్చర్యపోయారు. అది బాగా జ్ఞాపకం వుంది. పొయ్యిలో బూడిద పోసేవాళ్ళం తాతయ్య సలహాతో.  అందువల్ల మొక్కలు బాగా పెరిగేవి.


మా నట్టింట్లో చిన్న రాతి రోలు  నేల మట్టానికి వుండేది. రైస్ మిల్లు రాని కాలం అది. వానా కాలంలో ఆరుబయట పనిచేయడానికి వీలవనప్పుడు ఆ రాతి రోలుపై రాతి కుంది వేసి రోకళ్ళతో జొన్నలు తొక్కేవారంట. వడ్లు, బియ్యం పిండి,అటుకులు  దంచేవారంట. ఇంకా తొక్కుడు లడ్డు కోసం నువ్వులు బెల్లం అన్నీ దంచేవాళ్ళం అని నానమ్మ చెప్పింది. అలాగే కొయ్య కుంది కూడా వుండేది. నల్లమద్ది రోకళ్ళు బరువుగా వుండేవి. వాటికి మందపాటి ఇనుప రేకుతో చేసిన పొన్నులు వుండేవి.  అలాగే కలవారి కోడళ్ళ రోకళ్ళకు ఇత్తడి రేకు పొన్నులు వుండటమే గొప్ప అనుకుంటే మా నాయనమ్మకు వాళ్ళ పుట్టింటి వారు వెండి పొన్ను వేయించిన రోకళ్ళను పంపించారంట. ఆ రోజుల్లో ఆడపిల్లకు కాపురానికి వచ్చేటప్పుడు ఇత్తడి  సామాను పందిరి నవ్వారు మంచం భోషాణం మైలుపెట్టే పెద్ద కుర్చీ డ్రాయర్ బల్ల తప్పకుండా పంపేవారంట. అవన్నీ నాయనమ్మకు ఇచ్చారు.  అత్తగారు కోడలికి వెండి బొట్టు పెట్టె పెడితే అల్లుడికి అత్తగారు వాచీ వెండి సబ్బు పెట్టె సైకిల్ పెట్టేవారంట. 


మా నాయనమ్మ పుట్టిల్లు విజయవాడ పక్కన నిడమానూరు. పరిటాల వారి ఆడపడుచు. మేనమామలు అయినంపూడి వారు. మా నాయనమ్మ వారి కూటస్థులు కొంతమంది పరిటాల వారు కనసానపల్లి వెళ్ళిపోయారంట. మా నాయనమ్మ కు పుట్టింటి వారు ఎకరంన్నర మాగాణి ఒంటినిండా బంగారం పెట్టి పంపారంట. అందులో కంటె అనే నగ నవరత్నాల హారం ప్రత్యేకంగా వుండేది అంట. ఆమెకు ఒక అక్క ఊర్లోనే మేనమామకు ఇచ్చారు. ఒక అన్నయ్య. కాలక్రమేణా నాయనమ్మ అన్నయ్య కోర్టు కేసులు మూలంగా ఆస్థి అంతా కోల్పోయారు అని ఆ కేసులకు మూలం మా పెద తాతయ్య అని ఆయన బావమరుదలకు మా తాతయ్య బావ మరిదికి మధ్యనే కేసు నడిచినట్లు చెప్పుకునేవారు. వారి అన్నల కోర్టు కేసులు వాజ్యాలు గురించి ఇక్కడ తోడికోడళ్ళు కూడా పోట్లాడుకునేవారంట. ఆ వాదనలో మా పెదనాయనమ్మ మా నాయనమ్మ మెడలో కంటె పట్టుకుని లాగేదట. ఆమె చాలా గడుసరి.ఆమె దూకుడు చూసి నాయనమ్మ ఆమె మెడలో కాసుల దండ పట్టుకునేది అంట. అలా వుండేవట తగువులు. ఈ విషయం మా పెద్దతాత కూతురు సావిత్రి అత్తయ్య నవ్వుతూ చెప్పేది.



మొత్తానికి కోర్టు తీర్పు వల్ల నాయనమ్మ అన్నయ్య ఆస్తులన్నీ కోల్ఫోతే  అన్నయ్యకు ముగ్గురు నలుగురు పిల్లలు వున్నారు ఎలా బతుకుతారు అని అక్క చెల్లెళ్ళు ఇద్దరూ పుట్టింటి వారిచ్చిన పొలం బంగారం అంతా అన్నకు ఇచ్చేసారంట. అదే కాకుండా మా తాతయ్య ఉమ్మడి కుటుంబంలో నుండి విడిపోయాక ఆ కుటుంబానికి పప్పులు ఉప్పులు మిరపకాయలు మామిడికాయలు ధాన్యం పచ్చళ్లు లాంటివన్నీ బండికి వేసి పంపేవారంట. ఆలితట్టు వారు ఆత్మబంధువులగుదురు. కొంపంతా దోచిపెడుతున్నారు అని తాతయ్య సోదరులు వారి భార్యలు అనుకునేవారట. మా తాతయ్య ది జాలి గుణం.

 తన కున్నదానిని ఎవరికైనా ఉదారంగా పంచిపెట్టేవాడంట. 


ఇక తాతయ్య నాయనమ్మ ను బాగా చూసుకునేవాడంట. ఒక్క తిట్టు తిట్టడం వినలేదు మేము అనేవారు మా బంధువులు. నేను విన్న హాస్య సంభాషణ ఇది..

మీ పుట్టింటి గొప్ప ఏముందిలే.. పెళ్ళికి మేము తెచ్చిచ్చిన చీర కట్టుకుని పీటల మీద కూర్చున్నావు అని నాయనమ్మతో హాస్యం ఆడేవాడు తాతయ్య. అయ్యో! అదో సంబడమా.. ఆ మాత్రం మా పుట్టింటి వాళ్ళకు లేకా..!? పెళ్ళికి అత్తగారు ప్రధానంలో పెట్టిన చీర కట్టుకోవడం ఆచారం కాబట్టి మీరు తెచ్చిన చీర కట్టుకున్నా.. అనేది మా నాయనమ్మ ఉడుక్కుంటూ. 


ఇలాంటి కబుర్లన్నీ నాయనమ్మ తాతయ్య తెల్లవారుఝామున లేచి ఏమీ తోచక గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకునేవారు. అవి అలా నేను విని జ్ఞాపకం పెట్టుకున్నవీనూ ఇవన్నీ. వారి ముచ్చట్లలో గాంధీ గారు నిడమానూరు పెనమలూరు రావడం రేడియో కి లైసెన్స్ తెచ్చుకోవడం లాంటి విషయాలు వుండేవి. మా తాతయ్య కబుర్ల లో వేట విషయాలు నాటకాల విషయాలు కూడా వుండేవి. ఇంకా ఎద్దులు ఏట్లో ఈదడం కూడా అబ్బురం అనిపించే విషయాలు. అవన్నీ తాతయ్య గురించి రాసేటప్పుడు చెబుతాను.



మా నాయనమ్మ కు పదకొండో ఏడు వచ్చాక పెళ్ళైంది అంట. మూడవ తరగతి వరకూ చదువుకుంది. కావ్యాలు చది వేది. భగవద్గీత తప్పు రాకుండా చదివేది.  1938 లో మా పెదనాన్న పుట్టాడంట. ఆయనకు 1957 లో పెళ్ళైంది. మా రెండవ పెదనాన్నకు కూడా అప్పుడే పెళ్ళి జరిగింది. 1963 లో అమ్మ నాన్నల పెళ్ళి. అందరికీ 20 ఏళ్ళు రాకముందే పెళ్ళి అవడం పెద్దల అజమాయిషీ లేకుండా  కొడుకులు వ్యవహారవేత్తలుగా మారడం వలనే మా కుటుంబం ఆర్ధికంగా పతనమైంది అనుకుంటానిపుడు. ఇద్దరు మేనత్తలు. ఒకామె మరణించింది మా ఇంటి వెనుక వారికే ఇచ్చారు.రెండో మేనత్తను దగ్గరలోనే ఇచ్చి వివాహం చేసారు. నాయనమ్మ తాతయ్య వారి భాద్యతలు చక్కగా పాటించారు. ఆస్తులు మాత్రమే సంపాదించలేదు. కొడుకులకు అది చిన్న చూపేమో మరి అనుకోవడానికీ లేదు. మా వాళ్లు ఆ తరహా కూడా కాదు.   


మా నాయనమ్మ వెంట వొకసారి ఆమె పుట్టింటికి వెళ్ళాను.  మా మామిడి తోటలో నుండి నడుచుకుంటూ  తోట వెనుక వాగులో దిగి నడుచుకుంటూ  పెద్ద వాగు వరకూ చేరి అక్కడ రోడ్డు ఎక్కి.. విజయవాడ బస్ ఎక్కి వెళ్ళడం నిడమానూరు వెళ్ళడం బాగా జ్ఞాపకం నాకు. అప్పుడు మా ఇద్దరి కాళ్ళకు చెప్పులు కూడా లేవు. కాళ్ళు కాలుతూ చిందులేసాను. మా నాయనమ్మతో నాకు అనుబంధం ఎక్కువ. చింత చిగురేసి పప్పు వండేది. వంకాయ చింత చిగురు కూర వండేది. ఉల్లిపాయ వేసి చింత చిగురు వేపుడు చేసేది. చిలకడ దుంపలు నివురులో మగ్గబెట్టి ఇచ్చేది. ఆమె ప్రేమకు  మరేది సాటిలేదు. ధనం లేకపోవడం సమస్య కాదు. ఉన్నదానిలో ప్రేమగా పిల్లలకు పెట్టేది. తాటాకు మంట లాంటి కోపం. ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా  మాటపట్టింపులు లేకుండా అందరినీ కలుపుకుని పోవడం నోరార పలకరించడం మా నాయనమ్మ స్వభావం. ఒక కాలు వొంగేది కాదు కింద కూర్చోవడం కష్టం అయ్యేది.  ఒక చెక్క స్టూల్ మీద కూర్చుండేది. కింద కూర్చుంటే వొక కాలు ఆరజాపి కూర్చోవాల్సి వచ్చేది.


నాకు చిన్నప్పుడు బాగా జుట్టు ఎక్కువ. ఆ స్టూల్ మీద కూర్చుని తల మీద రసం పోసేది. తల యెల్లడానికి (మురికి విడవడానికి ) మూడు సార్లు రసం పోసేది.  నీ మనుమరాలికి నీ జుట్టు నీ కొడుకు జుట్టో వస్తే ఆరుసార్లు రుద్దే వాళ్ళేమో అని విసుక్కునేది అమ్మ. మా నాయనమ్మది నాన్నది ఉంగరాల జుట్టు. మా నాన్నకు తన మేనకోడలిని చేసుకోవాలని వుండేదట నాయనమ్మకు. ఆమె బంగారు బొమ్మలా వుంటుంది. నాన్న నలుపు. సరిగ్గా చదువు సంధ్యలు లేవని ఇవ్వన్నన్నారంట. ఎలాగైతేనేం పసిమిరంగు గల కోడలిని ధనవంతులింటి పెద్ద కూతురిని కోడలిగా తెచ్చికుంది నాయనమ్మ. అమ్మను అందరూ ఎర్ర కోడలా.. అని పిలిచేవారు అత్త వరుస అయ్యేవాళ్ళు అందరూనూ. నేను తొమ్మిదేళ్ళు వచ్చాకనే మా వూరు వచ్చాను. అంతకు ముందు అంతా అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగాను. అమ్మమ్మ వాళ్ళింటికి నానమ్మ వాళ్ళింటికి పూర్తీ వ్యతిరేకం. ఇక్కడ ఇల్లు వోట్టిపోయినట్టు వుండేది. అక్కడ పాడి పంట పొలాలు అంతా సంవృద్ది. నాయనమ్మ వెంట నేను హరికథా కాలక్షేపం కి వెళ్ళేదాన్ని. రోటి పచ్చడి చేసి రోట్లోనే అన్నం కలిపి ముద్దలు పెట్టేది. సంక్రాంతి వస్తే కోడిపందాలు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేది. మట్టి అరుగులు అలికి బొటనవేలితో చుక్కలు పెట్టేది. ముగ్గులు వేసేది. కార్తీక స్నానాలు త్రిమూర్తి వ్రతం చేసేది. ఎదురుగా ఉండే మా తాతయ్య మేనమామ కొడుకు ఇంటికి వెళ్ళేది. మా తాతయ్య మేనమామ  కోడుకి కి తాతయ్య పిన్ని కూతురిని ఇచ్చారు.వారి మధ్య  బంధుత్వం అనుబంధం  బలంగా ఉండేది.ఆమె పేరు నాగరత్నమ్మ. ఆ మామ్మ కోడలు పుష్పవతి అత్తయ్య నాయనమ్మకు ప్రతిరోజూ కూరలు మజ్జిగ ,తినుబండారాలు, కూరగాయలు అన్నీ పంపేవారు. నాయనమ్మ వెళ్లకపోయినా సరే .. బుట్టలో పెట్టి పని ఆమెకు ఆమెకు ఇచ్చి పంపేవారు. వారి ఇల్లు చల్లగుండా.. అని మనఃస్పూర్తిగా అనుకుంటాను ఈ రోజుకి.  


నాయనమ్మ తాతయ్య ఆస్తులన్నీ కొడుకులకిచ్చేసి మనోవర్తి తీసుకుంటున్నారు కాబట్టి వారికి చేతినిండా డబ్బు వుండేది కాదు. మా పెదనాన్న లిద్దరూ సమయానికి వారికి ధాన్యం పంపేవారు కాదు. వారి భుక్తి కి కష్టం వచ్చింది. ఇక చిరుతిండ్లు ఎక్కడ? వారు స్వయంశక్తి తో వున్నప్పుడు దండిగా ఏమి తిన్నారో అదే వారికి దక్కింది. యాబై ల్లోకి వచ్చేసరికే దంత సిరి లేకుండా పోయింది. మా అమ్మ వారికి ఇవ్వాల్సింది యెంతో అంత పంట రాగానే వారికి పంపించేది. కానీ వారికి ఏమీ పెట్టేది కాదు అంటే కాదు కానీ మర్యాదకు పెట్టేది ధారాళంగా పెట్టేది కాదు. అది పిండివంటలైనా పాలైనా పెరుగైనా కూరలైనా మామిడి పండ్లైనా పచ్చళ్ళైనా సరే. నాయనమ్మ తాతయ్య నోరు కట్టుకునే బతికారు. అదే దుఃఖంగా వుంటుంది నాకు. మా నాన్నపై వున్న కోపం అంతా అత్తమామలపై చూపేది అమ్మ. ఒకోసారి వాళ్ళు కదిలితే తప్పు మెదిలితే తప్పు అన్నట్టు వుండేది. వాళ్ళ కు వాడుకోవడానికి నీళ్ళు కూడా పోయనిచ్చేది కాదు. నేను తిట్లు తిని అయినా వాళ్ళకు తొట్టినిండా నీళ్ళు  వొంపేదాన్ని. మా ఆర్ధికనష్టాలు కష్టాలు మొదలయ్యాక వారికి బాధలు మరింత ఎక్కువయ్యాయి. మానసికంగా నలిగిపోయారు.పెదవి విప్పి ఎవరికీ చెప్పుకునేవారు కాదు. దానికి తోడు మా మేనత్త భర్త ఆమెను విపరీతమైన హింస పెట్టి పుట్టింటికి పంపేశాడు. కూతురు జీవితం గురించి కొడుకులు ఆస్తులు పోగొట్టుకోవడం గురించి దిగులుగా ఉండేది. 


ఇంకా తాతయ్య వ్యక్తిత్వం గురించి మంచితనం గురించి రాయడం మొదలు పెట్టనే లేదు. ఆయన గురించి వినాలంటే ఇంకా జీవించి వున్న అన్నదమ్ముల పిల్ల నోట వినాల్సిందే .. అమ్మో ! మా బాబాయి ఎంత బంగారమో ..మా పెదనాన్న కు పిల్లలంటే ఎంత ప్రేమో ..అని అందుకుంటారు. నాన్న మేనత్త కాకుండా ఇంకా ఐదుగురు కజిన్స్ ఉన్నారు. వారిని కదిలిస్తే బోలెడు విషయాలు వరదలా చుట్టేస్తాయి. 


గతమెంతో ఘనకీర్తి అని నేను చెప్పుకోవడంలేదు … అందులో  మా పూర్వీకుల వెతలు కష్టం ఉన్నాయి. వాటిని దాటుకుంటూ కూడా వారు గొప్పగా బతికారు. .. 


ఇంకా ఉంది …నా మనుమరాలు నాయనమ్మా అని పిలిచినప్పుడల్లా.. నాకు మా నాయనమ్మ గుర్తుకొస్తుంది. ఆ జ్ఞాపకాలు  బరువైనవి. మా నాయనమ్మ తాతయ్యకు ప్రేమతో..