బంధాలన్నీ బలహీనం అయిపోయినాయి. స్వార్ధం పెంకితనం మర్రి ఊడల్లా విస్తరించుకుపోతున్నాయి.
విసుగు విరక్తి రెండూ వచ్చాక మనుషులను వద్దనుకోవటం మరణించడం కన్నా తక్కువేమీ కాదు.
చుట్టూ వున్న మనుషులు చెప్పాపెట్టకుండా మాయమైపోతున్నప్పుడు మనతో అనుబంధం వున్న మనుషులు హఠాత్తుగా గుర్తుకు వచ్చి గుబులు పుట్టిస్తారు. ఆత్రుతగా వారి కుశలం అడగాలని ఫోన్ పట్టుకుని మళ్ళీ అంతలోనే ఆగిపోవడం.. సంకోచాలను జయించడం అనుకున్నంత తేలికైన విషయమేమీ కాదు. సంకోచం జయించినపుడు వచ్చే స్వేచ్చ ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ కచ్చితంగా సంతోషాన్ని మాత్రం ఇస్తుంది.
ఎవరైనా యేదైనా అడిగితే … సంశయం లేకుండా ఇవ్వడం కూడా అంత తేలికైన విషయమూ కాదు. మానసికమా శారీరకమా వస్తు రూపమా వడ్డీ రూపమా స్థిరచరాస్తులా అన్నది కాదు. అన్నింటి మీద మనకేం పూర్తి హక్కులు ఉండవు . మన హక్కులో ఇతరుల హక్కులో ఇష్టాలో అయిష్టాలో యెన్ని కలగాపులగమై వుంటాయసలు. వాటితోనే వచ్చిన చిక్కు, సంకెళ్ళూనూ. మాట ఇచ్చి తర్వాత అడ్డకత్తెర లో పోక చెక్క లా నలిగిపోతారు.
అడిగిన వారికేమో మనం యివ్వలేదని నిరసన అలక ఆరోపణలు అన్నీ ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూ వుంటాయి. అవి మనసుకు తెలుస్తుంటాయి. అదేం రాయి కాదుగా. మాట ప్రవర్తన అవతల మనిషిని మనకు పట్టిస్తాయి. ఒకవేళ వాటిని వారు అవసరం మేర దాపెట్టినా నువు చూసింది విన్నది నిజం కాదనీ,నువ్వు ఏమి ఫీల్ అవుతుంటే అదే నిజమని నీ మనసుకు తెలుస్తుంటుంది.
మనం కానీ, వారు కానీ వ్యక్తులను బహిష్కరించినంత మాత్రాన
ద్వీపాంతర శిక్షలు వేసినంతమాత్రాన..భావజాలాన్ని నియంత్రించగలమా..
వ్యక్తీకరణలను నిరోధించగలమా..
భావ ప్రకటన భిన్నరూపాలు. చేరవలసిన వారికి చేరుతూనే ఉంటాయి ఇంకో నాలుగు కలిసి.
ఆక్టోపస్ లా రూపురేఖలు ఆలోచనలను మార్చుకోగల్గిన కాలంలో ద్వేషం మాత్రం
బతికే ఉంటుంది భూమి అడుగున చెట్టు వేర్లు విస్తరించి నట్లు.
ఆ విస్తరించిన వేళ్ళను నరికే పనిలోనే ఉంటాము. పెకిళించి అగ్నికీలలకు ఆహుతివ్వాల్సిన సమయం సుదూరంగా గోచరిస్తుంటుంది.
మన నడకలో అడుగడుగునా కొత్త కొత్త పాదాలు పదములు కలుపుతూ నవపథంలో మనం పయనిస్తూ ఉంటాం . మనం మనమే కాని అనేకులంగా మారి ఎవరి నడక వారిదిగా.. విభిన్నమైనాం.విభిన్నంలోనూ మనం మనమే ఇంద్రధనస్సు లో రంగుల్లా..
జీవితం ప్రవాహం లాంటిదని అంటారు.. కలుపుకుంటూ ప్రవహించడమే.. అప్పులు ఇవ్వలేదని ఆర్థికసాయాలు చేయలేదని పగబూని యెడంగా జరిగిన మనుషులకు ఏం చెప్పినా అర్ధం కావు. దూరంగా ప్రశాంతంగా వుండటమే!
మనం ఇంకొకరి పట్ల అసహనంగా వున్నామంటే వారు మనకన్నా మెరుగ్గా వున్నారనే భావంతో పాటు మనని తక్కువగా చూస్తున్నారనే ఆత్మనూన్యత వల్ల కావచ్చు. ఆత్మనూన్యతలో నుండే ఆరోపణలు మొదలవుతాయి. వ్యక్తులు అభివృద్ది పథంలో వుండటానికి లేకపోవడానికి కారణం తల్లిదండ్రులు మరొకరు మరొకరు ఇచ్చే సహకారమొకటే కాదు వ్యక్తికిగల తపన ఆకాంక్ష చదువు అవకాశాలు లభించడం అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.
రుణ బంధాలు కథ అనుభవాల ఆధారంగా రాసిందే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి