18, మే 2023, గురువారం

బిడ్డల పెంపకం

 మన పిల్లలే మనకు స్వచ్ఛంగానూ… మురిపెంగానూ కనబడతారు. పెరిగి పెద్దయ్యాక కొత్తగా వారే వీరా అని మనం ఆశ్చర్యపడిపోయేటట్టు కనబడతారు. మన అంచనాలకు మించి సాధారణంగా కనబడతారు ముఖ్యంగా తల్లికి ఒక రకంగా తండ్రికి మరొక రకంగా… 

నాణేనికి రెండో వైపు చూడాలనుకుంటాను నేను… అలా చూసే క్రమంలో … యదాలాపంగా రాయకుండా వుండలేక నా ఆలోచనా స్రవంతి… ఇలా. 

మనుమరాలికి ప్లే స్కూల్ లో విత్తనం నుండి మొలకలు ఎలా వస్తాయో చూపించినట్టు వున్నారు. ప్లాస్టిక్ కప్ లో  ఏవో సీడ్స్ వేయించి మొలకెత్తినాక ఇంటికి ఇచ్చి పంపారు. ఆ కప్ కి మనుమరాలి ఫోటో కూడా అతికించి వుంది. మంచి ఆలోచన అనిపించింది. లేకపోతే అన్నం గింజలు అంటే ఏమిటి అని మన కార్పోరేట్ స్కూల్ విద్యావిధానంలో పిల్లల్లా అయిపోతారు అనుకున్నాను. 

 ఇంటి దగ్గర కూడా నా మనుమరాలికి  గింజలు వేయటం నేర్పించాను. మా రైతు భాషలో విత్తడం అంటాం. పక్షుల కోసం నానారకాల కలబోత కల ధాన్యం తీసుకువస్తాం. అందులో వడ్లగింజలు మాత్రం కనబడవు. (అమెరికా కాబట్టి) వాటిలో నుండి ఓ గుప్పెడు తీసి బెడ్ లో చల్లించాను. నా కొడుకు గార్డెన్ ను క్రమ పద్దతిలో చేయాలంటాడు. తనకు ఎవరైనా ఎక్కడైనా మొక్కలు నాటినా గింజలు విత్తినా అసహనం. ఇదిక్కడ ఎవరు వేయమన్నారు.. ఎందుకు వేసావు అని కోపం ప్రదర్శిస్తాడు. 


అలాంటి రియాక్షన్ లు చూసినప్పుడల్లా.. వీడు నేను పెంచిన బిడ్డ కాదబ్బా.. అచ్చం వీడు పితృస్వామ్య భావజాలానికి ప్రతీక అనుకుంటాను. అంత గొప్ప నిర్వచనం ఎందుకంటారా.. ? లేకపోతే ఎవరు వేయమన్నారు నిన్ను అని అడుగుతాడా? సరే నేను తల్లిని. గెస్ట్ ని కొద్దికాలం వుండి వెనక్కి సర్దుకుంటాను. కానీ భార్య ను కూడా అలాగే మాట్లాడతాడు. అది నాకస్సలు నచ్చి చావదు. కోడలు పిల్లకు నచ్చదు ఆ మాట తీరు. అందుకే తను గార్డెను జోలికే రాదు. తన కిష్టమైన మొక్క కొనుక్కొచ్చుకున్నా ఎక్కడ నాటాలో తనే ఆదేశిస్తాడు. ఇంట్లో వస్తువులు సర్దడం కూడా అంతే! 


కుటుంబంలో నలుగురు వున్నాక అందరి ఇష్టాలు వుంటాయి. దానికి తగ్గట్టు మిగతావారు సర్దుకోవాలి.. ఎంతసేపు నీకు ఇష్టమైనరీతిలోనే అందరూ ఇమిడిపోవాలి అనుకోకూడదు అని చెబుతాను. నేనింతే! ఇది నా ఇల్లు. నాకిష్టం వచ్చినట్టు నేను పెట్టుకుంటాను అంటాడు. అప్పుడు చెంప చెళ్లుమనిపించినట్టు భావన. ఈ భావజాలాన్ని పెంచిపోషించేది తల్లిదండ్రులే! ప్రతిది ఇది నీదే అని వారికి కష్టపడకుండా అప్పనంగా అప్పజెప్పడం అంటాను నేను. మరి వారికి నాది అన్న స్వార్థం తప్ప మన అనే భావన ఎలా వస్తుంది?


ఎలాగంటారా.. 

అమ్మో.. నా కొడుక్కి బంగాళాదుంపల డీప్ ఫ్రై యిష్టం, బెండకాయ కొబ్బరి ప్రై ఇష్టం, పప్పు చారు ఇష్టం అని నిత్యం వారికిష్టమైనవే చేసి పెట్టానే కానీ.. ఇదిగో ఈ ముక్కల కలగలుపు కూర నాకిష్టం కాకరకాయ కూర నాకిష్టం నేను ఇవాళ యిదే చేసాను తింటే తిను లేకపోతే లేదు అన్నానా.. అనలేదు కదా.. అలాగే మన ఇష్టం కోసం వారి ఇష్టాలను వొదులుకుంటారని పొరబడి వాస్తవం గుచ్చినట్లు వుంటే ముఖం మాడ్చుకుంటూ రాని నవ్వు నవ్వుకుంటాను.


అలా అని నా యిల్లు నా యిష్టం వచ్చినట్లు సర్దుకుంటాను మొక్కలు నాటుకుంటాను అంటే కూడా వొప్పుకోను.  విసుక్కుంటాను నొచ్చుకుంటాను. మన కోసం కాకపోయినా అందులో వారి మంచి ఇమిడివుంటుంది. అలా అనకూడదని విడమర్చి చెపుతాను. ఒకోసారి వింటాడు. ఇంకోసారి వినడు. చెప్పడం నాధర్మం అనుకుంటాను.


ఇక  నా కొడుకు తన కూతురు వేసిన గింజలు అనగానే గమ్మున వున్నాడు. మొక్కలు పీక కుండా వుంచేశాడు. మనుషులకు ఎమోషనల్ ఎటాచ్మెంట్ వుంటే తప్ప కొన్నింటిని ఆమోదించలేరు అనుకుంటా. అలా అని నా కొడుకు అన్నింటా తన వాదనే నెగ్గాలని తన యిష్టాలే నెరవేరాలని అనుకోడు. ప్రతి విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరూ చర్చించుకుని ఒకరి యిష్టాన్ని వొకరు గౌరవించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది సంతోషకరమైన విషయం. అది చూసి హమ్మయ్య.. నేను భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటాను. 


కిచెన్ గార్డెన్ లో మిక్స్ డ్ క్రాఫ్ వల్ల చీడపీడలుండవు అని చెబుతాను. అబ్బాయి కి చుట్టూ ఆహ్లాదంగా వుండాలి పూల మొక్కలు అంటాడు. నేను కూరగాయల పెంపకం కూడా అంటాను. బ్లాక్ బెర్రీస్ బ్లూ బెర్రీస్ రాస్ బెర్రీస్ వచ్చాయి. నేను సంవత్సరం పైగానే వున్నాను కాబట్టి ఐదారు బకెట్ ల కిచెన్ వేస్ట్ తో వర్మీ కంపోస్ట్ చేసాను. దానిని కుండీల్లో నింపాను. వంగ మొక్కలు టమోటా పచ్చిమిర్చీ వేసాము. ఫలితాలు ఎలా వుంటాయో చూడాలి మరి. 


ఇక నా మనుమరాలికి మొక్కలను సున్నితంగా తడిమి పలకరించడం వాటితో మాట్లాడటం.. పూలు పూసినా కాయ కాసినా మొక్క కు థాంక్స్ చెప్పించడం సూర్యుడికి దణ్ణం పెట్టి థాంక్స్ చెప్పించడం.. నీళ్ళు పారబోయకూడదని నువ్వు నీళ్ళు పారబోస్తే మొక్కలకు మనకు తాగడానికి నీళ్ళుండవని భయపెట్టి చెప్పడం నేర్పుతున్నాను. మనం చెప్పినవి ఎంత చక్కగా అర్ధం చేసుకుంటుందో మళ్ళీ వాళ్ళ అమ్మకు  చెబుతుంది ఆరింద లాగ. అరటిపండు తొక్కలను నారింజ తొక్కలను గులాబీ చెట్ల మొదలు లో పడేసి వస్తుంది. మొక్కలు స్ట్రాంగ్ అవుతాయి అంటుంది పిడికిలి బిగించి. పెద్దలను సైలెంటుగా అనుసరిస్తారు పిల్లలు. రెండు మూడు నెలల బట్టి ప్రతి కొత్త పదం విన్నప్పుడల్లా అంటే ఏమిటి? అనే ప్రశ్నలు వేస్తుంది.  ఇంగ్లీషు పదానికి తెలుగు మాట తో పాటు రెండు మూడు పర్యాయ పదాలు ఒక హిందీ పదం నేర్పుతున్నాను. ఇంకో ఏడాది నేను ఇక్కడే వుంటే బాగుండును అనిపిస్తుంది. పిల్లను వొదిలి వెళ్ళాలంటే మూడు నెలల ముందునుంచే  ఇప్పుడు నుండే దిగులు పుడుతుంది. అచ్చు ఇలాగే నా బిడ్డను పెంచాను కదా! వాడు నన్ను ఎలా నొప్పిస్తున్నాడో అలాగే మనుమరాలు కూడా అనుకుంటాను.


సంవత్సరం క్రితం …నాయనమ్మా నేను నిన్ను కొడతా.. అనేది. ఎందుకమ్మా అంటే.. అంతే, నేను నిన్ను కొడతా! అనేది మళ్ళీ. మీ తాత లాగా కొడతావు కాబోల్సు అని నవ్వేదాన్ని. మనం అనుకొంటాం కానీ అనువంశిక లక్షణాలు కొన్ని కనబడతాయి పిల్లల్లో. నా మొండితనం.. కనబడుతుంది. వాళ్ళ తాత లాగా చేయి కాలు విసరడం కనబడుతుంది. నెమ్మదిగా అలవాటు మానిపించాం. వాళ్ళ నాన్నకు కూడా తన తండ్రి అహంకారం బాగానే అంది పుచ్చుకున్నాడు. ఎంతైనా మగవాడు కదా అనే భావన, నా మాటే సాగాలి అనే పట్టుదల వచ్చిందని అర్ధం అవుతుంది. నా చేయి వదిలి పదమూడేళ్లు అయింది కాబట్టి ఇంతకాలం చాలా విషయాలను గమనించే అవకాశం రాలేదు. చిన్న విషయాలు లాగే కనిపించే పెద్ద విషయాలు గురించి ఆలోచన చేస్తాను. సున్నితంగా చెప్పి చూస్తాను. పిల్లలకు బాల్యంలో మనం వేసే ముద్రల వల్ల వ్యక్తి వికాసం వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటాయట. పిల్లది మనని చూసే నేర్చుకుంటుంది రా అబ్బాయీ అంటే.. నాకు తెలుసులే నువ్వు ఊరుకో అంటాడు.


ఇందాక వొక విషయం చెప్పలేదు కదా.. ఇంట్లో పురుషుడు ఎవరైనా ఇది నా ఇల్లు అని మాట్లాడితే నాకు వొళ్ళు మండుద్ది. వారికి పిత్రార్జితంగానో వారసత్వపు ఆస్థిగానో, లేదా స్వశక్తి తోనే నిర్మించుకుని కొనుక్కొని వుండొచ్చు. అంత మాత్రం చేత నా ఇల్లు అని వొక్కాణించడం నాకు నచ్చదు. ఆ ఇల్లు అచ్చంగా పురుషుడిది అయిపోదు. ఇంట్లో తల్లికో సోదరిమణులకో భార్యకో ఎంతోకొంత వారికి  కూడా భాగం వుంటుంది. గృహ నిర్వహణ ఇంటి పనులు కూడా ఉద్యోగం లాంటివే. మరి ఉద్యోగం అన్నాక జీతం భత్యం వుంటాయి కదా.. ఇల్లాలు కూడా ఇంటి ఓనర్ కింద లెక్క. ఇది నా ఇల్లు అని అహంకారంగా పురుషుడు ప్రకటించడం సబబు కాదు. స్త్రీలు ఎంత బాధ పడతారు. నొచ్చుకుంటారు. ఇది నా అనుభవమే కాక ఎంతోమంది అనుభవం కూడా. కవనశర్మ గారి భార్య ఇల్లు, పుట్టిల్లు, అమ్మకో గది లాంటి కథలు గుర్తొస్తాయి. గృహిణి లకు కూడా నాది అనుకోదగ్గ ఇల్లు వుండాలి. ఉద్యోగం చేసి నీకొక ఇల్లు సమకూర్చుకో అమ్మా.. అని కోడలికి చెప్పాను సీరియస్ గానే. మా మధ్య పుల్లలు పెడుతున్నావ్ అంటాడు అబ్బాయి. కాదు, ఇతరుల యిష్టాలకు విలువ గుర్తింపు ఇవ్వకపోవడం  అణచిపెట్టడం వల్ల ఎవరి స్వతంత్రం వారు వెదుక్కొంటారు. అది కుటుంబానికి మంచిది కాదు అని చెపుతాను. అందరి ఆకాంక్షలను కూడా ఈ భూమి తీర్చలేదు. ఉన్నంతలో సర్దుకోవాలి అని చెబుతాను.


గడచిపోయిన గాధల నుంచి  ఎంతోకొంత  మంచి నేర్చుకోని మనుషులు వికాసం చెందలేరు. 


 ఎంతోకొంత నేర్చుకుని తన భవిష్యత్తు నిర్మించుకోకపోతే మనిషికి  పతనం తప్పదు. 


అలాగే జరిగిన చరిత్రను మరచిన దేశం కూడా పతనం కాక తప్పదు. 


వ్యక్తి అయినా దేశం అయినా ప్రపంచం అయినా..  పాఠాలు నేర్చుకోవడం  తప్పనిసరి.


నిన్న నేను రాసిన ఈ చిన్నపాటి ఆలోచనలు కూడా  ఆ ఒరవడిలో రాసుకున్నవే! వ్యక్తుల్లో  సమాజంలో ఆధిపత్య భావజాలం సమసిపోవడానికి కొన్ని తరాలు చాలవు. బలవంతుడు బలహీనుడిపై సాగించే ఆధిపత్యం అది. బలహీనుడి నుండి కూడా నేను బలహీనుడిని కాను అనే తిరుగుబాటు రావాలి. కుటుంబంలో మాత్రం ఆధిపత్యభావజాలాన్ని ప్రేమతో దయతో భరించాల్సిందే. తప్పదు. కాదంటే..  ఏముందీ.. ఏకో నారాయణ😊😚


మా తాత తరం క్లుప్తంగా నిరాడంబరంగా బతికితే మా నాన్నల తరం సర్దుకుని బతుకుతుంది. మా తరం సౌకర్యంగా బతుకుతుంటే మా బిడ్డల తరం విలాసంగా బతుకుతున్నారు. క్షణం తీరిక లేదు. వెనుకేసే కొండలూ లేవు. నిశ్చింత లేదు.రేపటి తరం ఎలా బతుకుతుందో మరి. బిడ్డల పెంపకం తల్లిదండ్రులది.. ఫలితం వారికి సమాజానికి కూడా.







కామెంట్‌లు లేవు: