30, మే 2023, మంగళవారం

ఒంటరి గాజు మేడ


 ఒంటరి గాజు మేడ “ఈ దేవదారు చెట్టు”

మునిమాపువేళ.. మా వెనుకవైపు అంతా పక్షుల కిలకిల రవాలతో సంగీతసభ జరుగుతున్నట్లు వుంటుంది. 

కళ్ళనిండుగా చూసింది చాలు అనుకుంటూనే.. మళ్ళీ చపలచిత్తంతో వీడియోలో భద్రపరిచే ప్రయత్నం చేస్తాను. మనుమరాలు నా ఒడిలో బుద్ధిగా కూర్చుని పక్షుల సందడిని ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తూ వుంటుంది. ఫోటో తియ్యి ఫోటో తియ్యి.. అంటూ ప్రేరేపిస్తూ వుంటుంది. మరి నాయనమ్మ ఫోటోల పిచ్చిని సంవత్సరంన్నర నుండి జాగ్రత్తగా గమనిస్తుందాయె. 😊😚

ఆ చెట్టును చూసినప్పుడల్లా.. ఎందుకో “ఆఖరికి నువ్వొకతివే నా కోసం నిలిచివుంటివి” అన్న కవి వాక్యం గుర్తుకొస్తూ వుంటుంది. ఈ అనుకోవడం వెనుక ఒక నిర్వేదం వుంది మరి. ఆ చెట్టు గురించి చెప్పాలంటే ఆ పరిసరాలు గురించి చెప్పాలి మరి. అదంతా గత వైభవంగా మిగిలిపోయిందిపుడు. 

ఇదిగో.. ఆ కనబడుతుందే .. అది మా కమ్యూనిటీ వెనుక విశాలమైన ఖాళీ స్థలంలో రోడ్డు వారగా  వున్న దేవదారు వృక్షం. ఏభై అడుగుల యెత్తుతో ఠీవిగా నిలబడివుంటుంది. ఆ ఖాళీ స్థలం అంతా దట్టమైన చెట్లతో ఎంత దట్టమైన అంటే మన రెండు కాళ్ళు పక్క పక్కనే వుంటే ఎలా వుంటుందో అలా వుండేవి చెట్లు. ఒకసారి పెద్ద గాలివానకు ఆ చెట్టు పక్కనే వున్న ఇంకొక రెండు చెట్లు పెళపెళమనే శబ్దంతో మొదలంటా విరుచుకుపడిపోయాయి. అర్ధరాత్రి ఆ శబ్దానికి ఉల్కిపడి లేచి.. ఈ చెట్టే పడిపోయి వుంటుంది అనుకున్నాం. కానీ అది అలాగే ఠీవిగా నిలబడివుంది. ఆ చెట్టు చుట్టుపక్కల అలాంటి దేవదారు వృక్షాలు తప్ప మిగతా దారంతా మేపిల్ వృక్షాలు! ఆ మేపిల్ వృక్షాలన్నీ రంగులు మారుతూ మోడులై మిగిలి బోసిపోతున్నా తాము మాత్రం పచ్చగా నిలబడివుంటాయి  దేవదారు వృక్షాలు. అలా అనేక పక్షులకు ఆవాసంగా వుంటుంది ఈ వృక్షం కూడా. పక్షులు వాలి వున్నప్పుడు ఆ  పక్షులే చెట్టు ఆకుల్లా వుండి కొత్తగా చూసేవారికి ఆకుల్లాగానే భ్రమింపజేస్తాయి. ఉదయసాయంత్రాలు వర్షం వేళల్లోనూ.. ఆ చిట్టడవిని చూస్తూ వుండటం అదొక చెప్పనలవికాని అనుభూతి.  ఆకుపచ్చని సముద్రంపై కారుమేఘాలు వాలినప్పుడు..నా మనసు కాన్వాస్ పై చిత్రించుకున్న చిత్రాలు యెన్నెన్నో! 

గత సెప్టెంబర్ లో నేను వచ్చిన వారం తర్వాత .. వొకొనొక రోజు అందరూ నిద్రలేవకముందే.. పెద్ద పెద్ద ఢబేల్మనే శబ్దాలతో చెట్లను రంపపు యంత్రాలతో కోస్తున్న శబ్దం దానికి తోడు జెసిబి ల చప్పుళ్ళతో ఆ ప్రదేశమంతా భీతావహంగా వుంది. నాకు గుండెల్లో చెప్పలేని అలజడి. గబగబా కిందకు వెళ్ళి.. తలుపు తెరుచుకుని బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళాను. అక్కడ జరుగుతున్న విధ్వంసకాండ ను చూసి నిశ్చేష్టురాలినయ్యాను. 

ఏడెనిమిది జెసిబిలు రెండు క్రేన్

లు ఒక నలభైమంది మనుషులు. నలభై అడుగుల ఎత్తున్న అనేకమైన చెట్లను ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ట్రక్ లకు ఎత్తుతున్నారు. వెలుపలికి తరలిస్తున్నారు. కాసేపు దిగులుగా చూసి బరువుగా నిట్టూర్చి..లోపలకు వచ్చాను. బ్రష్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి అక్కడ కాసేపు నిలబడి చూస్తూ వుండిపోయాను. ఎవరితోనైనా ఈ విషయం  పంచుకోవాలనిపించింది.  అబ్బాయికి కాఫీ కలిపి తీసుకొచ్చి ఇచ్చి .. మన వెనుక వున్న చెట్లన్నీ నరికేస్తున్నారు అని చెప్పగానే.. అవునా.. అంటూ వొక్క ఉదుటున లేచి బ్లైండ్స్  పూర్తిగా పైకి లాగి వెలుపలికి చూసాడు. పచ్చని వనం మాయమవుతూ వుంది. గూళ్ళు పెట్టిన పక్షుల దీనమైన అరుపులు. పైన తిరుగుతున్న రాకాసి గద్దలు. ఆ ప్రాంతమంతా రణరంగంలా గోచరిస్తుంది.  కొండంత ఆపేక్ష తప్ప ఆయుధాలు ధరించిలేని ధరణి జరుగుతున్న నాశనానికి కన్నీరు కార్చే వుంటుంది. నా చంకలో కూర్చున్న మనుమరాలు కూడా బిక్కముఖం వేసుకుని చూస్తూ వుంది. 

ఆ చుట్టుపక్కలంతా పచ్చగా కళకళలాడుతూ వుంటుంది. పొల్యూషన్ వుండదు. ఆరోగ్యకరంగా గాలి పీల్చుకోవచ్చు అనుకొని ఇక్కడ ఇల్లు కొనుక్కొన్నాను. ఆ పచ్చదనం అంతా మాయమైపోతుంది. ఈ రోడ్డు వెడల్పు చేసి హైవే లైన్ చేస్తున్నారేమో అందుకే నరికేస్తున్నారు అన్నాడు అబ్బాయి. అసలు కమ్యూనిటీ ఏర్పడినప్పుడు అక్కడొక పెద్ద పార్క్ నెలకొల్పుతారు అని ప్లాన్ వుందట. కాసేపు చూసి  భారంగా నిట్టూర్చి కూతురుతో “నీ చిన్నప్పుడు ఇదంతా అడవిలాగా వుండేది,అని చెప్పాలేమో ఇక”అంటూ అక్కడి నుండి కదిలి మాములు జీవితంలోకి వెళ్ళిపోయాము.   ఒక నెలయ్యే సరికి రెండు పర్లాంగుల వరకూ చెట్లన్నీ నరికేసి బయటకు తోలేసి భూమిని చదునుచేయడం మొదలెట్టారు. రోజూ చూసే దృశ్యాన్నే పదే పదే చూస్తూ వుంటే బాధ పలుచనవుతుంది అంటారు కదా! ఆ స్థితి లోకి వచ్చేసాము. 

అంతా నరికేసిన తర్వాత ఈ చెట్టును యెందుకో వదిలేసారు మరి.  ఒంటి స్తంభం మేడ వలె వొంటరిగా నిలబడిన ఆ చెట్టుని చూస్తే నాకు అదొక గుబులు. చుట్టూ వున్న  చెట్లన్నీ నిర్ధాక్షిణ్యంగా కూల్చబడ్డాక... ఆ చెట్టును ఆశ్రయించుకున్న పక్షులన్నీ ఏమి ఆలోచిస్తాయో అనుకుంటాను నేను. 

కాసేపు నా ఊహలో నా పక్షి మనసు ఈ విధంగా.. 

“ఆ ఇంటినాశ్రయించుకున్న  నాలాంటి అనేకానేక జీవులు. మేము వినిపించే కవిత్వాన్ని సంగీతమంటారు కొందరు కూజితాలు కువకువలు కిచకిచలు అంటారు మరికొందరు.. వాక్యంలో కవిత్వాన్ని వెతుక్కునే నిజమైన కవులు ప్రాణుల ఉనికిని చాటే చైతన్య జీవరాగం అంటారు. మాకు ఆశ్రయమంటూ మిగల్చాలి కానీ మా ఉనికి మీకు బతుకుపై తీపి ఆశని పెంచే ఆహ్లాదాన్ని పంచే  స్వర సంగీత ఝరి కదా మేము అంటూ విన్నపాలు వినిపిస్తుంటాయి”  

ఇంకా చెప్పాలంటే.. ఇప్పటికీ మనిషిని అమాయకంగా నమ్మి ఆ చెట్టుపై పక్షులన్నీ గూళ్ళు పెట్టుకుని వున్నాయి. ఆ గూళ్ళకు చెట్టు భరోసా ఇవ్వలేదు. చెట్టు కు ఆధారభూతమైన భూమి భరోసా ఇవ్వలేదు. 

పక్షులన్నీ ఎగిరిపోయాక ఒంటరిగా నిలబడ్డ చెట్టును చూస్తే మరింత దిగులు. చెట్టు వొంటరైంది అని. అంతలోనే ఓదార్పు ఇన్ని పక్షులకు ఆవాసమైంది జన్మ ధన్యం అని. ఏమిటో ఈ ద్వైద్వీ భావన. 

వొంటరితనమంటే భయపడే మనిషి  సమూహం నుండి తనను తాను వెలివేసుకుని ఆ వొంటరితనం లోకే జొచ్చుకుని పోతున్నాడు చెట్టు పుట్ట మట్టి జంతువు పక్షులు అన్నింటిని కడతేరుస్తూ.. 

ఆ మాయమైన స్థలంలో .. ఏదో స్టోరేజ్ లేదా మాల్ నిర్మాణం జరుగుతుంది. 

నిర్మాణాల పక్కన మిగిలిన భాగం .. ఆఖరి వీడియోలో.. 

అభివృద్ధి అంటే విధ్వంసమే ఎక్కడైనా సరే 🤔

#worldenvironmentday2023

#vanajatatineni

తరువాత మనుమరాలికి ఒక కథ చెప్పడం ప్రారంభించాను. అది ఇంకో భాగంలో..



కామెంట్‌లు లేవు: