22, మే 2023, సోమవారం

మాలతి గారి కథల్లో జీవన మాధుర్యం.

నిడదవోలు మాలతి గారిని నేను చదవడం మొదలెట్టి పన్నెండేళ్లు. కల్పన రెంటాల గారి తూర్పు-పడమర బ్లాగ్ లోని లంకె ల ద్వారా మాలతి గారి కథల గురించి చదివాను. ఆ తరువాత అడపదడపా వారి కథలను చదవడం జరిగేది. ఆ కథల్లోని క్లుప్తత గాఢత నన్ను బాగా ఆకర్షించింది. 


తర్వాత కాలంలో ఫేస్ బుక్ ద్వారా ఆమె పరిచయం అయ్యారు. మాలతి గారి కథలే కాదు వారి రోజూ వారీ అభిప్రాయాల్లో కూడా భావగాంభీర్యం లోతైన ప్రకటన నన్ను  పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెద లాగా మార్చింది. ముఖ్యంగా  నేను వ్రాస్తున్న విధానంలో మార్పు తీసుకువచ్చింది. వీలైనంత వరకూ ఆంగ్లం వాడకుండా తెలుగు రాయడానికి ఆ పరిచయం దోహదపడింది.అందుకు  వారికి కృతజ్ఞతలు. 


వర్దమాన రచయితలకు మాలతి గారి రచనలు పాఠ్యాంశాలు. ఒక సంభాషణ ను క్లుప్తంగా అర్ధవంతంగా స్పష్టంగా యెలా చెప్పగలం అన్నది ఆమె రచనల్లో చదివి తెలుసుకుంటాం. ఆమె కథలను మొదట కథ కోసం చదువుతాను. మళ్లీ రెండవసారి కథ యెలా రాసారు అన్నదాని కోసం అవగాహన కోసం చదువుతాను. వాక్యానికి వాక్యానికి మధ్య చెప్పని కథ గురించి ఆలోచించేదాన్ని.మాలతి గారి కథల్లో చెప్పిన దానికన్నా పాఠకుల ఊహకు అవగాహనను వదిలిపెట్టిన అంశమే ఎక్కువ వుంటుంది. 

 

మంచు దెబ్బ, అవేధ్యాలు, జేబు, ప్రాప్తం, నిజానికీ ఫెమిజానికి మధ్య, విషప్పురుగు,జీవన మాధుర్యం లాంటి కధలు మళ్లీ మళ్లీ చదివిన కథలు. ఆ కథలు చదివిన వెంటనే స్పందించానో లేదో గుర్తులేదు. ఇప్పుడు వేదికపై మాట్లాడటం కోసం మళ్లీ మాలతి గారి రచనలు చదివి అభిప్రాయాలను వల్లె వేయాలని నేను అనుకోవడం లేదు. ఆమె రచనా కాలం నా వయస్సు కన్నా పెద్దది.మనసైనప్పుడు తీసి చదువుకోవడమే!  


సామాన్య పాఠకురాలిగా నా స్పందన యెలా వుంటుందంటే… 

ఒక రచన చదివిన వెంటనే పాఠకురాలిగా నా స్పందనలో కొంత ఉద్విగ్నత ఆవేశం వుంటుంది. అది తగ్గిన తర్వాత మరలా  యింకోసారి చదవడం వలన కథ గురించి ఆలోచించడం మొదలుపెడతాను. ఇక అప్పుడు నా స్పందన నూ అభిప్రాయాలను చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటాను లేదా బద్దకిస్తాను. రచయితకు యెవరైనా తమ రచనలను చదివి మెచ్చుకుంటే చర్చిస్తే ప్రత్యేకంగా గుర్తిస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఇందుకు యెవరూ అతీతులు కారని నా అభిప్రాయం.


 ఆరు దశాబ్దాల పైబడి న మాలతి గారి రచనా వ్యాసంగం యెలాంటిదంటే..చెట్టు యొక్క వేర్లు భూమి లోపల విస్తరిస్తూ భూమి పైన కొమ్మల రూపంలో విస్తరించినట్లు ఆమె కూడా తన అనుభవాల గాఢతను లోలోపలికి యికింపజేసుకుని తనదైన శైలితో హృదయ సంస్కారం తో విశ్వజనీన భావాన్ని   అంతరంగంలో విస్తరించుకుంటూనే బాహ్యంగా తన భావ ప్రకటనతో రచనలను పాఠకుల దరికి చేర్చారు. 


చాలామంది రచనలు గొప్పగా వుండొచ్చు. రచన కన్నా రచయిత గొప్పవారు అయివుండవచ్చు. రచనలు రచయిత కూడా గొప్పగా నాకనిపించింది మాలతి గారిని  చూసినప్పుడు. మాలతి గారి రచనల్లో సందేశం సూచనాప్రాయంగానే వుంటుంది. రచయిత బలవంతంగా పాత్రలో ప్రవేశపెట్టిన నీతి సూత్రం యేది కనిపించదు. పాత్రలను సహజసిద్దంగా పాఠకుడు స్వీకరిస్తాడు. నాకు తెలిసిన సమాజం యిది. ఈ మనుషులు యిట్లా వున్నారు. వారిని నా కథల్లో నవలల్లో యిలా వారిని పరిచయం చేయాలి అన్నట్టు కాకుండానే పాత్ర ఔచిత్యం యేమిటో స్పష్టంగా రేఖాప్రాయంగా సూచిస్తారు. కాంత లాగా కావ్యం దిశానిర్దేశం చేయాలి కదా.. అన్నట్టు. అది నాకు బాగా నచ్చుతుంది. 


 ఎన్నెమ్మకతలు లో సంద్రాలు పాత్ర నాకు చాలా యిష్టం. రచయిత ప్రకటించలేని అభిప్రాయాలను నిర్మొహమాటంగా అమాయకత్వం నింపుకున్నట్టు భ్రమింపజేసే గడుసుదనంతో ప్రశ్నిస్తుంది.తీర్పును ప్రకటిస్తుంది.రచయిత మార్కు పాత్ర అలా పాఠకుల మనసుల్లో తిష్ట వేసుకోవడం రచయిత విజయంగా మనం భావించాలి.


కథల్లో దేశీయత యెంతో నిండుకుని వుంటుంది. పాత్రల మనస్తత్వాల లోగుట్టు ను కూడా చిన్న వాక్యాల ద్వారా పరిచయం చేసేస్తారు.    రంగు తోలు, నిజానికి ఫెమినిజానికి మధ్య  లాంటి డయస్సోర కథలు  మనను ఆలోచింపజేస్తే చాతక పక్షులు, మార్పు   నవలలు రెండూ జీవన వైరుధ్యాలను  కూడా రికార్డ్ చేసి రెండు సంస్కృతుల మధ్య నలిగిపోయి యెప్పుడూ సందిగ్దంలో నడక సాగించే రెండు తరాల ప్రతినిధులను కూడా మనకు పరిచయం చేసారు. స్వగతం లాంటి ప్రకటనకు అవకాశం లేని  అవసరమైన అర్దవంతమైన  చర్చను చేసారు. 


నేనింకా మాలతి గారి రచనలు అన్నీ చదవలేదు. 

మన తెలుగు సంకలనాల్లో మాలతి గారి కథలు అంతగా కనిపించని లోటును పత్రికలు పునఃప్రచురించి పాఠకులకు పరిచయం చేయాల్సిన అవసరం వుంది. 


తూలిక బ్లాగ్ గురించి యెంత చెప్పినా తక్కువే! మాలతి గారు ఆమె రచనలతో పాటు ఆంగ్లంలోకి అనువదించిన తెలుగు కథలు, పరిచయ వ్యాసాలు అన్నీ భద్రపరిచి భావి తరాలకు వొక శాశ్వత నిధి ని సమకూర్చారు. అందుకు ఆమె యెంతో అభినందనీయురాలు.మాలతి గారి విశేషకృషి చూసినప్పుడు ఆమెకు తగిన సహకారం మన తెలుగు సాహిత్య పీఠాల నుండి  లభించడం తక్కువని తెలిసినప్పుడు.. వొక మాట అనుకున్నాను.. ఆమె  బాట పక్కన మలుపులో వొంటరిగా నిలబడి కాంతులిచ్చే వీధి దీపం లాంటిదని. ఆ దీపం వెలుగుల్లో  మనమందరం తెలుగు ను వెలిగించుకోవాలి. మసకబారకుండా కాపాడుకోవాలి. 


 ఎంత బాగా రాసినా తమ రచనలు గుర్తింపబడనప్పుడు రచయితలకు వైరాగ్యం వస్తుంది. అందంగా పరిమళాలు వెదజల్లే పువ్వులు, నిండుగా వర్షించే మేఘాలు వున్నచోటనే  కొన్ని గడ్డిపూలు కురవని మేఘాలు వుంటాయి. వాటి ఉనికి వాటికీ వుంటుంది లే అని అనుకునే ఉదాసీనత కల  రచయితలు వుంటారేమో! కానీ నా అభిప్రాయంలో ఆమె అలాంటి ఉదాసీన రచయిత కాదు. రాసిన ప్రతిదాన్ని ఆమె జాగ్రత్తగా భద్రపరిచారు. నిజానికి ఆమె  సృజించిన సాహిత్యానికి అనువాదాలకు తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. సాహిత్య సంఘాల ముఠాకోరు వైఖరి వల్ల మాలతి గారిని గుర్తించడానికి అభ్యంతరాలు జెప్పి గుర్తించినా వెలుగులోకి రానీకుండా నిర్లక్ష్యం చేసారు. అందుకు ఉదాహరణే.. మునిపల్లె రాజు గారి కథల ఆంగ్ల అనువాదం ఇప్పటికి ప్రచురణ లోకి రాకపోవడం. సాహిత్య అకాడమీ తెలుగు విభాగం  సభ్యులు శ్రద్ద వహిస్తే అదెంత చిన్న విషయమో కదా అని అనిపించింది. 


 సాహిత్యంలో యెవరికి లభించిన గుర్తింపు వారిదే… 

నాకు లభించిన గుర్తింపే నా గుర్తింపు అని వినయంగా ప్రకటించుకునే మాలతి గారికి  కవయిత్రి “ మొల్ల పురస్కారం”  లభించిన సంధర్భంగా .. వారికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు. ఈ పురస్కారం అందించిన మొల్ల పురస్కార కమిటీ నిర్వాహకులకు అభినందనలు.


Old order must give place to the new order. And the new order can never adapt it self to the old. పాత వాళ్ళను కొత్త తరం గౌరవిస్తుంది కానీ అనుసరించదు.. అంటాడు జీవన మాధుర్యం కథలో అల్లుడు రమణారావు.సాహిత్యం విషయంలో అది నిజం కాదేమో! ఆధునిక సాహిత్య స్రవంతి లో యిప్పుడు కనబడుతున్న క్లుప్తత లోతు లను నవ్యతలను మాలతి గారూ యెప్పుడో సాధించారని నా అభిప్రాయం. 


మాలతి గారి గురించి యీ నాలుగు మాటలు చెప్పడం కూడా నేను వొక యోగ్యతాపత్రంగా భావిస్తూ..  నిడదవోలు మాలతి గారికి నమస్సులతో.. కల్పన రెంటాల గారికి ధన్యవాదాలతో…  - వనజ తాతినేని.


 PS: ఈ అభిప్రాయం .. e-book గా తీసుకువస్తామని కల్పనా రెంటాల చెప్పారు . e-book వచ్చిందో లేదో సమాచారం లేదు. ఒక చోట ఈ ప్రసంగపాఠం కార్యక్రమంలో లేదు అని అన్నట్టు చదినాను. నేను అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమంలో పాల్గొనడం వీలవలేదు. గమనించగలరు. ఈ ప్రసంగ పత్రం ఇక్కడ ప్రచురించడం పట్ల అభ్యంతరం ఉంటుందని నేను అనుకోకపోవడం వల్ల ఇక్కడ ప్రచురించడమైనది.కామెంట్‌లు లేవు: