10, మార్చి 2023, శుక్రవారం

విముక్తం

విముక్తం - వనజ తాతినేని

ఒక ఇంజెక్షన్ కు బదులు మరొక ఇంజెక్షన్ ఇవ్వబోయిన కరుణ తృటిలో మేలుకుని జాగ్రత్త పడింది. చేసే పనిలో శ్రద్ధ పెట్టకపోతే వున్న ఉద్యోగం వూడుతుందన్న భయమైతే లేదు కానీ ఒక ప్రాణం రిస్క్ లో పడివుండేది.  అది తన నర్స్ వృత్తికి కళంకమే కదా అనుకుంది కరుణ. ఆ రోజు మొక్కుబడిగా పనిచేయడం వెనుక  ఆమె మనసును మెదడును అల్లకల్లోలపరిచే విషయం ఒకటి వుంది. అది ప్రపంచానికి పెద్దది కాకపోవచ్చు. అంతకు క్రితం ఒక పేషంట్ కు ఆక్సిజన్ అందక ఊపిరి ఆగిపోవడం కన్నా ముఖ్యమైనది కాకపోవచ్చు. కానీ కరుణకు మాత్రం అది చాలా తీవ్రమైన విషయమే. 

అందుకే ఆమెను ఏం చేద్దాం అనే ప్రశ్న కుదుపేస్తుంది. ఆ…ఏం చేద్దాం అనే ప్రశ్నకు సమాధానం మన నుండే వస్తుంది. కాకపొతే కొంత ఆలస్యంగా వస్తుంది.ఆలస్యం జరుగుతున్నప్పుడల్లా అసహనం పుట్లు పుట్లుగా మొలుచుకొస్తుంది. ఆ  అసహనపు బరువును కూడా మోయాల్సింది తనే కదా అనుకుంది కరుణ. 

పోనీ..  పాపని యిచ్చి అమ్మను ఊరికి పంపేస్తే! ప్చ్.. మూడు నెలలు కూడా నిండని పసిబిడ్డ. తల్లిపాలకు దూరం చేయడానికి మనసొప్పడంలేదు. రోజూ హాస్ఫిటల్ కు బయలుదేరే ముందు పాలు పిండి డబ్బాలో పోసిచ్చి వస్తుంది. మధ్యలో మధ్యాహ్నం మూడు గంటలపుడు ఒకసారి ఇంటికొచ్చి పాపకు పాలు పట్టి వస్తుంది.  బట్టలు మార్చుకోవడం శానిటైజ్ చేసుకోవడం పాపకు పాలుపట్టి హడావిడిగా ఇంత తినేసి పరుగులు తీయడం. తను పని చేస్తుంది గైనిక్ డాక్టర్ దగ్గర కాబట్టి ఇబ్బంది లేదు. కోవిడ్ పేషంట్ లలో గర్భిణీలు యెక్కువ లేకపోయినా మిగిలిన కోవిడ్ పేషెంట్ ల కోసం హాస్ఫిటల్ లో రెండు ప్లోర్ లను  కేటాయించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ భయం భయంగా డ్యూటీలు చేస్తూ ఈ పరిస్థితుల నుండి యెపుడు బయటపడతామా అని యెదురుచూస్తూ వుంటే.. ఇంట్లో భర్త రాజు అనే మనిషి అలా.. 

దురలవాట్లు ఉన్నా అతను మనిషి అనుకుంది ఇన్నాళ్ళూ. కానీ అతని లోపలొక మృగం దాక్కునివుంది. కబళించడానికి ఎత్తులు వేసుకుంటుంది అని ఈ వేళ తెలుసుకుంది. కోవిడ్  తీవ్రత బాగా వున్న రోజుల్లో కూడా మాస్క్ వుందీ లేదు అనే సృహ కూడా లేకుండా రోజూ వైన్ షాప్ దగ్గరకూ చికెన్ షాపు దగ్గరకూ తిరగడం రుచికరంగా వొండి పెట్టడం లేదని సణగడం. చేయడానికి పనిలేదని బొంకడం. ముప్పొద్దులా తినడం మంచంలో పడి దొర్లడం. అవి ఎంతో మంది ఆడవాళ్లు భరిస్తున్నవే. అలాగే నేనూ భరించక తప్పదు అనుకుంటుంది. కానీ ఈ విషయమే భరింపలేకున్నది.  వావివరుసలు వయస్సు మరిచి అత్యాచారం చేసే ఒక మృగాడి భార్య అంటే తనకెంత అవమానం. రేపు పెరిగి పెద్దదయ్యే బిడ్డకెంత అవమానం. ఇలాంటి ఉచ్చనీచాలు మరిచిన మృగం తనకు పుట్టిన బిడ్డలను కూడా వదులుతుందా!? రోజూ ఎన్ని వినడం లేదూ, కన్నబిడ్డలనూ కాటేసే తండ్రుల గురించి.  వినీ వినీ మనసు బండబారిపోతుంది. ఇకమీదట తనిల్లు మృగాడిల్లుగా మారిపోనుందా? తల్లి సుగుణమ్మను తల్చుకుని బెంగటిల్లింది.వేగిరం ఇంటికి వెళ్లాలని ఆరాటపడుతుంది.

***************

ఇక సుగుణమ్మ విషయానికి వస్తే కూతురు కరుణ కు కాన్పు సమయంలో సాయంగా వుండాలని  వచ్చింది గానీ అల్లుడు రాజు చూపులు సుగుణమ్మకు నచ్చలేదు. ఆడది కనబడితే చాలు తినేసాలా చూడటం రెండు కాళ్ళ మధ్య చేయి పెట్టుకోవడం, రెండు అర్దాల మాటలు మాట్టాడటం అన్నీ ఎలపరం పుట్టించేవి. ఒంటరిగా బిడ్డను పెట్టుకుని బతుకుతున్న సుగుణమ్మకు మగవాడి చూపులను బట్టి వాడిని అంచనా వేయడం పెద్ద కష్టమేమి కాదు.అతనికి దూరం దూరంగా తిరుగుతూ పగలు వంటింట్లో పనితోనూ  పక్కింటి వారితో ముచ్చట్లు చెబుతూనూ రాత్రుళ్ళు వరండా గదిలోనూ కాలక్షేపం చేస్తూ వుంది. మూడో నెల రాగానే పాపను నేను తీసుకుని వెళ్ళి పోతపాలు పోసి పెంచుతాలేమ్మా,ఊరికి పోతాను అంది. ఇంకో రెండు నెలలు వుండమ్మా,ఐదవనెల రాగానే వెళుదువుగాని అని తల్లిని వేడుకుంది కరుణ.మౌనం వహించింది సుగుణమ్మ.

ముందురోజు కరుణ హాస్పిటల్ నుండి వచ్చేసరికి సుగుణమ్మ పసిపాపను వొళ్ళో పెట్టుకుని  వీధి గుమ్మంలో దిగులుగా కూర్చుని వుంది. రాత్రి ఎనిమిదవుతున్నా వంట చేయలేదు తీగపై యెండేసిన బట్టలూ తీయలేదు. గదిలో మంచం పై తుండుగుడ్డ ముఖంపై వేసుకుని పడుకుని వున్న రాజు.అతని  ముఖంపై  గాయం. ఏదో బలమైన వస్తువుతో కొట్టినట్టు నల్లగా కమిలిపోయి వుంది. సుగుణమ్మ వంట చేసుకుంటున్న కరుణ దగ్గరకు వచ్చి “ఇక నేనిక్కడ వుండలేకపోతున్నాను ఊరికి వెళ్లిపోతానమ్మా” అంది.  మరేం ఆలోచించకుండా అలాగే అంది కరుణ. ఎందుకో భర్త ప్రవర్తనపై అనుమానంగా వుంది. ఏం జరిగింది అని అడిగి తల్లిని అవమానపరచకూడదు అనుకుంది. ఆ రాత్రంతా ఏం చేయాలి అని ఆలోచన చేస్తూనే ఉంది. 

మర్నాడు హాస్పిటల్ కు వచ్చింది  కానీ అక్కడ ఉండలేక ఓ గంటలో వస్తానని పర్మిషన్  తీసుకుని ఇంటికి వస్తూంది. దారిలో పక్క పోర్షన్ లో ఉంటున్నామె కనబడింది. ఇంట్లో తల్లి ఒక్కటే వుంటే..మనసేదో కీడు శంకించింది. ఏదో భయం అనుమానం ప్రవేశించి పరిగెత్తినట్లు నడుచుకుంటూ ఇంటికి చేరింది. వీధి తలుపు మూసి వుండేసరికి వెనుకవైపు నుండి లోపలికి రాబోయి కనబడిన దృశ్యాన్ని చూసి భగభగ మండిపోయింది కరుణ.


వంట చేసుకుంటున్న సుగుణమ్మను వెనుకనుండి  కౌగలించుకున్నాడు రాజు.  సుగుణమ్మ ముందు పసిపిల్లలా ఉలికిపడింది తర్వాత తుఫాను గాలికి అల్లల్లాడిన చిగురులా వణికిపోయింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. కాయకష్టం చేసి ఉక్కులా మారిన ఆమె శరీరం అతనిని తీవ్రంగా ప్రతిఘటించింది. కాలితో డొక్కలో ఒక తన్ను తన్నింది రాజును. అమ్మా.. అని అరిచాడు.ఆమెను వొదిలేసి ముందు గదిలోకి వెళ్ళాడు. తర్వాత అతని కూతలు. నోటికి పట్టరాని మాటలు. అవి వింటూ వణికిపోయింది అవమానపడింది.తల్లిది మచ్చలేని నైతిక ప్రవర్తన.పాతికేళ్ళకే భర్త చనిపోయినా పరాయి పురుషుడి నీడ పడకుండా కాయకష్టం చేసి బిడ్డను పెంచుకుంది. అలాంటి తల్లిని ఎన్నేసి మాటలన్నాడు ఆ కామాంధుడు. భర్తను నిలువునా తగలబెట్టాలనే ఆవేశాన్ని అణుచుకుని అసహ్యించుకుంది.

శబ్దం చేయకుండా వీధి వైపుకు వెళ్ళి తలుపు తట్టింది. తలుపు తీసిన రాజు వంగి వంగి నడుస్తూ బజారుకు వెళ్ళొస్తానని జారుకున్నాడు. అతనలా నడవడం గమనించనట్టే వచ్చి పాపను వొళ్ళోకి తీసుకుని.. అమ్మా! కాస్త టీ పెట్టి ఇవ్వమ్మా తలనొప్పిగా వుంది.అందుకే పర్మిషన్ పెట్టి వచ్చాను అంది.

టీ తాగుతూ అనుకుంది. వెంటనే తల్లిని పాపను ఊరికి పంపించేయాలని. పంపితే మాత్రం అక్కడకైనా వెళ్ళడని గ్యారంటీ ఏమిటీ?. పాపను చూసుకోవడానికి నేను వెళ్ళొద్దా అని బొంకుతాడు కూడా. హాస్పిటల్ కి వచ్చి డ్యూటీ చేస్తూ ఆలోచించసాగింది. అంతకూ పాపకు మూడవనెల కూడా రాకుండానే పచ్చివొళ్ళు ఆరకుండానే విరహ బాధ పడుతున్నాడని పక్క పంచుకుంటూనేవుంది. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే వుంది. అయినా భర్త కామపు చూపు తల్లిపై పడిందని అర్దమవుతూనేవుంది. మీ అమ్మ పోలిక నీకు రాలేదు అని అనడానికి మీ అమ్మ అందం ఫిగర్ నీకు రాలేదు అనడానికి తేడా ఖచ్చితంగా  వుందని తనకీ తెలుసు.  మద్యం మత్తులో యేదో వాగుతున్నాడని మనసును మభ్య పెట్టుకుంది.  ఇన్నాళ్ళూ వీడి చేష్టలను తనతో చెప్పలేక తల్లి ఎంత అవస్థ పడుతుందో పాపం! 

అసలు ఇలాంటి కామ తెగులు పట్టుకున్న వారిని శిక్షించాలంటే వొకటే మార్గం. డిల్లీ కేసు వాదిస్తున్న లాయర్ వొక మాటన్నాడు. వీళ్ళకు జైలుశిక్షలు ఉరిశిక్షల కన్నా ముందు రెండు చేతుల బొటనవేళ్ళు కత్తిరించాలని.  ఇకపై తల్లి జోలికి వెళితే వీడికి ఈ శిక్షే వేయాలి అనుకుంది. లంచ్ కి వెళ్లిన డాక్టర్ కు ఫోన్చేసి, విషయమంతా చెప్పి ఇప్పుడు నేను ఏమి చేయాలి చెప్పండి మేడమ్! అని సలహా కూడా అడిగింది. డాక్టర్ ఈవినింగ్ హాస్పిటల్ కు వచ్చేవరకూ కూడా ఏదో తెలియని కలవరం భయం ఆమెని నిలవనీయడం లేదు. డాక్టర్ వచ్చి “అతనిపై  అదివరకు కూడా చాలా కంప్లైంట్ లు వున్నాయి కరుణా!. బిల్డింగ్ పనులకు వస్తున్న ఆడకూలీల పట్ల మిస్ బిహేవ్ చేసేవాడని విన్నాను. నువ్వే ప్రేమా దోమా అని అతన్ని చేసుకున్నావు. పోలీస్ కంప్లైంట్ అదీ యివ్వడానికి మీ అమ్మ కూడా వొప్పుకోకపోవచ్చు. అది  ఆమెకూ అవమానంగా వుంటుంది కదా. రాజుని నేను రమ్మన్నానని చెప్పు. పెద్దరికంతో అతన్ని మందలిస్తాను, కేసుపెడతానని కూడా భయపెడతాను” అంది.

ఊరికి ఫోన్ చేసి అత్తకు విషయం చెప్పింది కరుణ. మా అమ్మ కూడా నీలాంటిదే కదా. ఆమెను వదిలేసి డ్యూటికి వెళ్లాలంటే భయంగా వుంది అంది. ఫోన్ లో అత్తా కోడలి మధ్య జరిగిన సంభాషణ వింటున్న మామ “భయపడ వద్దమ్మా,నేనక్కడుంటే నా కొడుకునిమక్కెలిరగతన్నేవాడిని. వాడిని ఉన్నపళంగా బయలుదేరి ఇక్కడకు రమ్మన్నానని చెప్పు. మీ అమ్మను వెంటనే ఊరికి పంపించేయి” అని చెప్పాడు.మగవాడైనా ఈయనే నయం ధృతరాష్ట్రుని ప్రేమ చూపలేదు అని కొంచెం మనసును తేలికపరుచుకుంది.

రాత్రి తూలుతూ ఇంటికొచ్చిన రాజు తో “ పొలం పనులు వున్నాయంట మీ నాన్న  వెంటనే రమ్మంటున్నాడు నిన్ను”  అని చెప్పింది. అప్పటికి డాక్టరమ్మ రమ్మన్న విషయం చెప్పకుండా దాటేసింది. తెల్లవారి  అతను టిఫిన్ చేసి బయటకు  వెళ్ళాక తల్లి దగ్గర కూర్చుని భుజంపై ఓదార్పుగా చెయ్యేసింది. తనేదో తప్పుచేసినదానికిమల్లే కూతురు ముఖంలోకి చూడలేక తలొంచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సుగుణమ్మ. తన మూలంగా తల్లికి జరిగిన అవమానానికి భోరున ఏడ్చింది కరుణ.బాధ అవమానం కలిస్తే ఎంత క్షోభ వుంటుందో అంతకుమించిన దుఃఖాన్ని బయటకు వెళ్ళగక్కలేక లోలోపలే కుళ్ళికుళ్ళి ఏడుస్తూ కూర్చున్నారిద్దరూ. సాయంత్రానికి  కొద్దిగా తేరుకున్న కరుణ లేచి “రేపు పాపను నిన్ను ఊరికి పంపుతాను. వీలైనంత అక్కడకు రాకుండా చూస్తాను. డాక్టర్ గారికి కూడా చెప్పాను అంతకన్నా ఇప్పుడు నేనేమి చేయలేనమ్మా” అంది. 

“అల్లుడిని అల్లుడిగా కూడా అనుకోను.నా బిడ్డలాంటోడు అనుకుంటాను. అట్టాంటిది నన్ను యెన్ని మాటలన్నాడు. ఎంత అవమానం చేసాడు.ఆ మాటలూ చేష్టలూ నేను నీకు చెప్పలేనమ్మా”  అని కూతురు వొళ్ళో తలబెట్టుకుని మళ్లీ కుళ్ళికుళ్ళి ఏడ్చింది. “ అమ్మా ! నువ్వేమిటో నాకు తెలియదా? నువ్వు ఒక్కరోజు కూడా వుండొద్దు యిక్కడ. అక్కడ కూడా వొంటరిగా వుండొద్దు. మామయ్య వాళ్ళింట్లో వుండు కొన్నాళ్ళు” అంది.

అవసరమైన సామాన్లు సర్దింది.అమ్మను పాపను ఊర్లో దించి వస్తాను నాలుగు రోజులు లీవ్ కావాలి అని డాక్టర్ కు మెసేజ్ చేసింది.తల్లి ఏటిఎమ్ కార్డ్  అడిగి తీసుకుని కొంత డబ్బు, పాపకు కావాల్సిన సామానులు కొనుక్కురావడానికి బయటకు వెళ్ళింది.  కరుణ వెళ్ళిన కాసేపటికే  రాజు యింటికి చేరుకున్నాడు.అతని చేతిలో తళతళలాడుతున్న గొడ్డలి.వరండా గదిలో వొక మూలన పెట్టాడు. చేను కంచె బాగుచేయడానికి తండ్రి గొడ్డలి కొనుక్కురమ్మన్నాడని అందుకే వెనక్కి వచ్చాను.మళ్ళీ రేప్రొద్దున వెళతాను అని చెపుతున్నాడు పక్క పోర్షన్ లో వాళ్ళకు.”ఈ ముదనష్టపోడు ఊరికి వెళ్లాడనుకుంటే మళ్లీ వెనక్కి ఎందుకొచ్చాడో! ఈ మనిషి నీడ చూస్తే కూడా సిగ్గు అవమానంతో చచ్చిపోవాలనిపిచ్చుద్ది” అనుకుంది సుగుణమ్మ మనసులో.

ఆ రాత్రి భోజనాలయ్యాక లైట్  ఆర్పబోతూ “రేపొద్దున పాపనిచ్చి అమ్మను ఊరికి పంపుతున్నాను. ఆమె మాత్రం ఎన్నాళ్ళు వుంటది ఇక్కడ” అంది భర్తతో. “ఇప్పుడంత తొందరేం పడింది.ఇక్కడే వుంటదిలే మనతోపాటు” అన్నాడతను తేలికగా తేల్చిపారేస్తూ. 

“ఆమె ఇక్కడ వుండనిచ్చేలా వుంటున్నావా నువ్వు? నువ్వు చేసే వెకిలిచేష్టలు అన్నీ తెలుసు నాకు. మనిషై పుట్టాక కాస్తైనా సిగ్గుండాలి. నీ తల్లితో  అయితే అలా ప్రవర్తిస్తావా నువ్వు” ఛీత్కారం కోపం కలగలిసిన గొంతుతో వణికిపోతూ అడిగింది. 

“మీ అమ్మ నాకోరిక తీరిస్తే యేమైనా కరిగిపోతుందా అరిగిపోతుందా.. ఆమెను సుఖపెడతాను  నిన్ను బాగా చూసుకుంటాను. మీరిద్దరూ సర్దుకుంటే తప్పేముంది” అన్నాడు మరింత వెకిలిగా.

కోపంతో ముఖం జేవురించింది కరుణకు. “పళ్ళు రాలగొడతాను, నీకు కామంతో కళ్ళు మూసుకుపోయాయి.మంచి మర్యాద తెలియని నిన్ను నేను పెళ్ళి చేసుకున్నాను చూడూ! అది నా బుద్ధి తక్కువ. సిగ్గూ శరం లేకుండా ఇంకా ఏమేమి వాగుతున్నాడో చూడు. తూ.. నీ బతుకు తగలెయ్య” అని ఖాండ్రించి ఉమ్మేసి.. “మర్యాదగా మా అమ్మ కాళ్ళు పట్టుకుని ఆమెను క్షమించమని అడుగు. తప్పైపోయింది ఇంకెప్పుడూ అలా ప్రవర్తించను అమ్మగా మన్నించమని అడుగు” అవేశంతో కంపించిపోతూ చొక్కా పట్టుకుని లాగింది కరుణ. అతను ఆమెను విదిలించుకుని వెన్ను చూపి గోడకేసి తిరిగి పడుకున్నాడు.

అతను పడుకున్న మంచం పై కూర్చోవడానికి కూడా అసహ్యమేసి నేలపై గోడకానుకుని కూర్చుంది. ఉయ్యాలలో పాప లేచి ఆకలితో తల్లి కోసం వెదుక్కుంటుంది. పాపను తీసుకుని వొడిలో వేసుకుని పాలు తాగిస్తూ భర్త మాటల వల్ల కల్గిన అసహ్యంతో అతన్ని ఛీత్కరిస్తూ ఆలోచిస్తుంది. ఇక అతనిని భరించడం తన వల్లకాదు. తన దృష్టిలో అతను చేసేది చేయాలనుకునేది చాలా పెద్ద నేరం. మంచి మాటలు మందలింపులు అతని తలకెక్కడం కష్టం.తనేమో తల్లికి ఎల్లప్పుడూ అతనినుండి రక్షణ కల్పించలేదు.  జరగరానిదేదైనా జరిగితే తల్లి ఆ అవమానభారం మోయలేదు. ఇకపై తామిద్దరూ ఏ నిమిషాన ఏమి జరుగుతుందో అన్న భయంతో రోజులు వెళ్ళమారదీయలేరు. అతని నుండి విడాకులు తీసుకుని విడిగా జీవించడం మంచిది.అదంత సులభం కాదు కానీ తప్పదు.తల్లికి తను, తనకి తన బిడ్డ.భగవంతుడు నాకింతే రాసి పెట్టాడనుకుని మొండిగా బతికేయాలి. ఈ రాత్రి తెల్లవారితే చాలు అనుకుంది. 

గంటలు గడుస్తున్నా ఆలోచనలతో నిద్రపడ్డక  పాపను ఉయ్యాలలో వేసి నేల మీద పడుకుని మెసలుతూనే వుంది కరుణ.మనసంతా కటిక చేదుగా వుంది. హృదయం క్షోభిస్తుంది. ఇలాంటి మనిషినా తను ఏరి కోరి పెండ్లాడింది!? రాజుతో తన పెళ్ళి జరిగినప్పటి విషయాలు తర్వాత తనకు సాయంగా వుండటానికి తల్లి తన దగ్గరికి వచ్చినప్పటి విషయాలు గుర్తుచేసుకుంటుంది కరుణ.

*********

హాస్పిటల్ పై అంతస్తులు కడుతున్నప్పుడు రాజు పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారిన తర్వాత  తను రాజును ప్రేమించిన విషయం చెప్పి పెళ్ళి చేసుకుంటానని తల్లితో చెప్పినపుడు  ఆమె అభ్యంతరం చెప్పింది. “ఆ అబ్బాయి చేసే పని యేదన్నా కానీ చూడటానికి మాత్రం ఏమంత గుణవంతుడిగా కనబడటంలేదు. వద్దమ్మా అంది. 

తను తల్లి మాటలను లక్ష్యపెట్టక  మంకుపట్టుపట్టింది. “కొందరు చూపులకు అట్టాగే కనబడతారమ్మా! హాస్పిటల్ కట్టడం మొదలుపెట్టినప్పటినుంచి చూస్తున్నాను.మంచివాడు. నన్ను బాగా చూసుకుంటాడు. అతను మా డాక్టరమ్మకు కూడా బాగా తెలుసు. కావాలంటే ఆమెను అడుగు”. 

“బిడ్డవని నా మనసుకు అనిపించింది నీకు చెప్పాను. వాళ్ళనూ వీళ్ళను అడగడం ఏందిలే, నీకు నచ్చాడు అన్నావుగా అట్టాగే కానీయ్”అంది అమ్మ. 

 కొడుకుకు నచ్చిన పిల్లను చూడడానికి వచ్చిన రాజు తల్లిదండ్రులకు నా కన్నా నా జీతం, వెనకున్న ఆస్థి నచ్చింది. అయినా రెండు లక్షలు పెళ్ళి కట్నం ఆడపడుచు కట్నం అని అడిగారు. 

“ఉన్న యిల్లు మడిచెక్కా  అన్నీ అమ్మాయికే కదండీ. అడిగినంత కట్నం నేను యివ్వలేను అన్నా వాళ్ళూ  ఊరుకోలేదు. ఏదో మా పిల్లాడు ప్రేమించానంటున్నాడు కాబట్టి ఈ మాత్రం దానికే సరే అంటున్నాం. వాడికి బయటనుండి బోలెడు సంబంధాలొస్తున్నాయి. కట్నం కూడా బాగా యిస్తామని వస్తున్నారు అని బెట్టుపోయారు, మీ కట్నానికి ఈ  సంబంధం కుదరదని చక్కా లేచిపోయారు. నేను కూడా తల్లి కష్టం అర్దం చేసుకుని రాజుతో చెప్పింది. మీ కట్నాల ఆశకు మేము తూగలేం. నువ్వొద్దు నీ ప్రేమ వొద్దు పొమ్మంది. అయినా రాజు నువ్వులేక నేను లేనంటూ తన చుట్టూ తిరుగుతూనే వున్నాడు. నెలరోజుల తర్వాత  రాజు తల్లిదండ్రులు వాళ్ళంత వాళ్ళే కబురుపెట్టి పెళ్ళి ఖాయపరచుకున్నారు. పెళ్ళిలో ఏవేవో లాంఛనాలు పేరిట బాగానే గుంజుకున్నారు. పెళ్ళి జరిగి రెండేళ్ళైనా తల్లి  సుగుణమ్మ దగ్గర డబ్బు గుంజుకునే యావలోనే వుంటారు.

పెళ్ళైన కొత్తలో బాగానే వుండే రాజులో క్రమేపి మార్పులు. పనీపాటా మానేసి తిరగడం బాగా అలవాటైపోయింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అది చాలు. మనిషి సుఖంగా బతకడానికి  ఇది చాలులే అనేవాడు.  తను గవర్నమెంట్  ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. వస్తుందని తనకు నమ్మకం లేకపోయినా అతనికి విపరీతమైన నమ్మకం.  పెళ్ళయ్యాక పదిరోజులు సెలవు పెట్టి పుట్టింట్లో వున్నదే లేదు. మరీ గుబులు మళ్ళితే తను పుట్టింటికి వెళ్ళకుండా తల్లినే పిలిపించుకునేది.  తనకు నెల తప్పిన దగ్గర్నుండి ఒకటే వేవిళ్ళు.బాగా నీరసించిపోయింది. అపుడైనా పదినాళ్ళు తల్లి దగ్గరకు వెళ్ళి వుండటానికి వీలుకాలేదు. అత్తింటి వారు ఆదుకోరు. నచిక్కి శల్యమై కళ్ళల్లో ఊపిరిపెట్టుకుని బతుకుతెరువు కోసం ఊగిసలాడుతున్న బిడ్డ బాధ చూడలేక జీవనాధారం అయిన పాడిగేదెలను అమ్మి పడేసి మిగిలిన పడ్డ దూడలను మేపుకూలీకి తోలేసి నాకు సాయంగా వుండటానికి పట్నానికి వచ్చింది అమ్మ. 

అమ్మా! నిన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నా అంటే “బిడ్డ కష్టం కంటే తల్లికింకేం కష్టం వుంటుందే బిడ్డా! నీ కోసం ఎన్ని కష్టాలైనా పడాలని నువ్వు నా కడుపున పడ్డప్పుడే అనుకున్నా, ఈదిన బతుకీత ముందు ఇదో కష్టమా, పుట్టిన నీ బిడ్డను చూస్తే అన్నీ మరిచిపోతాము” అని నవ్వుతూ చెప్పింది అమ్మ. కళ్ళు చెమర్చి తను పసిపాపలా తల్లిని అల్లుకుపోయింది.

మొదటి వేవ్ రెండో వేవ్  కోవిడ్ భయం మధ్య తొమ్మిది నెలలూ నిండాయి. పండంటి ఆడ బిడ్డను సిజేరియన్  చేసి తీసి నా పక్కన పడుకోబెట్టింది డాక్టరమ్మ. హాస్ఫిటల్ బిల్లు లేకుండా ఒక నెల సెలవు జీతమూ రెండూ యిచ్చి రెండో నెల నుండి నన్ను డ్యూటీకి హాజరవమని చెప్పింది. 

పురిటి స్నానానికి మనుమరాలిని చూడటానికి బంధువులను తీసుకొని వచ్చింది మా అత్త. “మా వైపు అందరికీ మొదటి బిడ్డ మగపిల్లడే. అమ్మ సాలు ఎక్కడికిపోద్ది,నీకూ అదే వచ్చింది”అంది అత్త దెప్పినట్లు. “ఆడైనా మగైనా మీ అబ్బాయిదే బాధ్యత కదా, ఈ మాత్రం దానికి అమ్మసాలు అత్తసాలు అనే పోలికలెందుకులే అత్తా” అని తెలివిగా కొట్టిపారేసింది తను. 

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక చుట్టాలందరూ వెళ్ళిపోయి తీరికగా కూర్చున్నాక.. “మీ అమ్మకు కానుపు ఖర్చు తగ్గింది కదా, ఆ యాభై వేలు నాకిస్తే డైలీ పైనాన్స్ వాళ్ళకు కట్టాల్సిన బాకీ కట్టుకుంటాను”అన్నాడు రాజు. 

“డైలీ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు యెపుడు తెచ్చావ్ యెంత తెచ్చావ్, నాకసలు చెప్పనేలేదు” అనడిగింది కోపంగా. 

“నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంతా నా యిష్టం. ఆ డబ్బులు అడిగి తీసుకుని నాకివ్వు “ అన్నాడు.  

“ఇది వదినా నీ కొడుకు వరస, పెళ్ళాన్ని దబాయించి డబ్బులు తీసుకోవడమే తప్ప.. మొగుడు పెళ్ళాం వొకళ్ళనొకళ్ళు సంప్రదించుకుని లెక్కా డొక్కా చూసుకోవాలని తెలియదు. నిదరలేస్తే పెళ్ళాన్ని డబ్బులు అడుగుతాడు. అది మాత్రం ఇంకెన్ని సర్దుకుంటది. ఒంటిమీద వున్న చిన్న చితక వస్తువులన్నీ  తాకట్టు పెట్టేసింది.  నిండు నెలలప్పుడు కూడా ఉద్యోగానికి పోయి జీతం రాళ్ళతో సంసారం లాక్కొస్తావుంది. రెండేళ్ళవుతుంది పనికి పోయి. ఏదో ఒక పని చూసుకోమని కాస్త నువ్వన్నా చెప్పు అబ్బాయికి” అని చెప్పింది  అమ్మ వియ్యపురాలితో. 

“ఈ రెండేళ్ళు నుండి టాపీ పని లేకపోయే. నా కొడుకు ఏం చదివిండనీ  ఏం ఉద్యోగం చేయగలడనీ ఏదన్నా పని చూసుకోమని చెప్పడానికి. ఆడు మాత్రం ఏం చేయగలడు నేనేం చెప్పగలను? అంత చదివిన చిన్నాడికి పనిలేక గోళ్ళు గిల్లుకుంటా కూసుండే “

"అదీ నిజమేలే, టాపీ వాళ్ళకే పని చూపిచ్చలేక పోతుంటే సాప్ట్వేర్ ఉద్యోగాలు ఏమి యిప్పిచ్చుద్దిలే ఈ గవర్నమెంట్’’ అంది తల్లి.ఆ మాటల్లో యెగతాళి అర్థమైన నేను చిన్నగా నవ్వుకుంటే అర్దంకాని అత్త తన ధోరణిలోనే.. ‘’సొంత ఊర్లో వుండకుండా  పట్నానికి ఎగేసుకుని వస్తే అద్దె కట్టాలి పాలు గీలు అన్ని కొనాలి, ఏడ డబ్బులన్నీ వాటికే చాలవు. అప్పులు చేయక ఏం చేస్తాడు” అంది కొడుకుని వెనకేసుకొస్తూ. 

డైలీ ఫైనాన్స్ కి ఇచ్చినతను  పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతుంటే.. బాకీల వాళ్ళు  అట్టా ఇంటి చుట్టూ తిరుగుతుంటే నాకు నామోషీగా ఉంటుంది. ఆ డబ్బులేవో నేనిస్తాను బాకీ తీర్చేయండని  తల్లి అంటే తనే వద్దంది.అడిగినప్పుడల్లా అతనికి డబ్బు ఇస్తూవుంటే డబ్బు విలువ మనిషి విలువ రెండూ తెలియవు. ఎక్కడ తెచ్చి కడతాడో చూద్దామని తనే ఆపింది.

బాధగా గతం గుర్తు చేసుకుంటూ... పెళ్ళైన నాటినుండి ఇప్పటి దాకా అతని ప్రవర్తన అలవాట్లు తనకి మాత్రమే ఇబ్బంది కల్గిస్తున్నాయని అనుకుంది కానీ అది తల్లి దాకా విస్తరిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇది ఇంతటితో ఆగాలి ఆగి తీరాలి. ఎంత ఘాతకానికి ఒడిగడుతున్నాడు!? అయిష్టతతో ప్రతిఘటిస్తున్నా దౌర్జన్యంగా ఆ స్త్రీ పై లైంగికదాడికి పాల్పడే మగవాడి నుండి అసహాయ స్త్రీ తనను తాను ఎలా రక్షించుకోగలదు? ఇంట్లో కూడా తమ వారే చేస్తున్న లైగింక దాడుల నుండి స్త్రీలకు విముక్తి యెప్పుడు!? ఎడారిలో తనంతట తాను అదృశ్యమైన నదిలా అత్యాచార యత్నం జరిగిన ప్రతి స్త్రీకూడా అక్కడికక్కడే మాయమైపోతే బాగుండును.అత్యాచారం జరిగాక బతికి బట్ట కట్టిందా యెన్నెన్ని అవమానాలు కాచుకుకూర్చుని వుంటాయి దాడిచేయడానికి. జరిగినాక వగచే కన్నా జరగకముందే జాగ్రత్త పడాలి. భర్తైనా కొడుకైనా తండ్రైనా సోదరుడైనా ఎవరిపైనైనా ఇలాంటి లైగింక దాడులకు పాల్పడినట్లు తెలిసినా ఒకవేళ గ్రహించినా సరే వారిని కుటుంబ అనుబంధాల నుంచి వెలివేయాలి. బహిష్కరించాలి.అదే వారికి అసలైన శిక్ష. తను ఇంతకు ముందు అనుకున్నట్లు భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకున్న నిర్ణయమే సరైంది అనుకుంది  దృఢంగా.

***************

భార్య ఆలోచనలేవి తెలియని రాజు తన వంకరబుద్ధిని మరొకసారి బయటపెట్టుకుంటూ అర్ధరాత్రి సమయంలో లేచి సుగుణమ్మ పడుకున్న వరండా గదిలోకి వెళ్ళబోయాడు. అడ్డుకోబోయిన కరుణను లాగిపెట్టి కొట్టాడు.అక్కుపక్షిలా ఉన్న ఆమె కళ్ళు బైర్లు కమ్మి నేలకు అంటుకుపోయింది. తనకు అడ్డొస్తే  మూలనున్న గొడ్డలి తీసుకుని నరుకుతాను అన్నాడు కృూరంగా.  

కొద్దిసేపటికి తెప్పరిల్లింది కరుణ. కళ్ళు తెరిచింది.  ఎదురుగా దిక్కుతోచని స్థితిలో మూల మూలకు జరుగుతున్న తల్లిని ఆమెను కబళించడానికి చూస్తున్న మానవ మృగాన్ని చూసింది. అంతే! ఒక్క ఉదుటున లేచి మూలన ఉన్న గొడ్డలిని చేతిలోకి తీసుకుంది. వెనుక నుండి ఆవేశంతో ఆ మృగాన్ని నరుకుతూనే వుంది. మృగం నోట హృదయవిదారకమైన కేకలు, భయం నుండి ఆశ్చర్యం మరింత భయంలోకి జారుకున్న సుగుణమ్మ చేష్టలుడిగి నిలుచుండిపోయింది. ఆమె కళ్ళలో నిలిచిపోయిన ఒకే దృశ్యం.కాముకుడిని నరుకుతున్న కాళికలాంటి కూతురి రూపం నర్తనమై జ్వలిస్తుంది. బయటనుండి దబదబ బాదుతున్న తలుపు చప్పుళ్ళ మధ్య ఆవేశం అణిగిన కరుణ  కిందకు ఒరిగిపోయింది. 

కరుణ కళ్ళు తెరిచి చూసే సరికి చుట్టూరా పోలీసులు ఇంటి బయట అనేకమంది. నిర్వికారమైన చూపులతో తల్లి సుగుణమ్మ.తన చేతిలో వుండాల్సిన గొడ్డలి ఆమె చేతిలో. 

అయోమయంగా చూస్తున్న కరుణను చూసి ఊయలలో పిల్లను తీసుకొచ్చి కరుణ వొడిలో వేసింది డాక్టరమ్మ. పక్కనే కూర్చుని వెన్ను తడుతూ కొంచెం నీళ్ళు తాగు కరుణా, అమ్మకు ఏమీ కాదు” అంటుంది భరోసాగా. 

అయ్యో! భగవంతుడా! నేనిలాంటిది ఏనాడూ కోరుకోలేదు .ప్రాణాలు కాపాడే వృత్తిలో వున్న నేను ఇలా చేయడం ఏమిటి మేడమ్” అంటూ కరుణ చేతుల్లో ముఖం దాచుకుంది.

*******0**********

#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.
కామెంట్‌లు లేవు: