5, మార్చి 2016, శనివారం

పలుచన కానీయకే చెలీ

సురేష్  సెలవు రోజు ఉదయం   రెండు రకాల టిఫిన్ లని  ఆరగించి  రెండవ సారి కాఫీ  రుచిని ఆస్వాదించి కాసేపు  పేపర్ ని  మరి కాసేపు టీవి కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్న సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.

"ఏమండీ.. ఎవరో వచ్చినట్లు ఉన్నారు. కాస్త అటు వెళ్లి చూడరా.. అంది లక్ష్మి  .

బద్దకంగా లేచి డోర్ తీసాడు . లక్ష్మి స్నేహితురాలు వేణి  నిలబడి ఉంది.

"రండి రండి " అంటూ ఆహ్వానించాడు. "ఈమె వచ్చింది అంటే.. చాలా విషయాలే తెలుస్తాయి. కాస్త టైం పాస్ అవుతుంది కూడా అనుకున్నాడు" సురేష్.

"లక్ష్మీ ..వేణి గారు వచ్చారు." అంటూ చెప్పాడు.

"వేణీ..  నీకు ఎదురొచ్చి ఆహ్వానం పలుకలేను కాని ఇటు వంటింటి వైపు రా"అని పిలిచింది లక్ష్మి

"ఏం చేస్తున్నావు"అంటూ వచ్చింది.

ఇదిగో.. నాన్వెజ్ ఐటమ్స్  చేస్తూ.. బిజీగా ఉన్నానే! ఇవాళే కదా కాస్త రుచికరంగా మనసు పెట్టి చేసుకోగలం.  నీకప్పుడే  ఇంట్లో పని ఆంతా అయిపోయిందా ఏమిటీ? " .

"అసలు నేను పనేమీ అంటుకోలేదు. పిల్లలని తీసుకుని ఆయన వాళ్ళింటికి వెళ్ళారు. ఇక రాత్రికే రావడం,అందుకే నిన్ను చూసినట్టు ఉంటుందని  ఇటు వైపు వచ్చాను" 

"అందరూ  వెళ్ళారు కదా.. నువ్వు వెళితే బాగుండేది.. ఒక్కరోజన్నా అందరు కలసి  ఉన్న తృప్తి కలిగేది పెద్దవాళ్ళకి "

"అబ్బ..  అక్కడికి వెళ్ళాలంటేనే బోర్ లక్ష్మి.  కోడలిగా ఆ ఇంటికి వెళ్లి అక్కడ వంట ఇంట్లోకి వెళ్లి పడి పడి నానారకాలు వండి వడ్డించలేను. ఆరోగ్యం బాగోలేదని సాకు చెప్పి తప్పించుకున్నాను"

 ఇలా అంటున్నాని ఏమీ అనుకోవద్దు.. నెలకి ఒకసారి అయినా అలా అందరు కలిస్తే బాగుంటుంది కదా! పైగా ప్రతి ఆదివారం. మీ ఆయన,పిల్లలు అక్కడకి వెళితే.. వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాలని మీ అత్తయ్యగారు హైరానా పడటం,పెద్దవయసులో ఆవిడని ఇబ్బంది పెట్టడం బావుండదేమో..ఒక సారి ఆలోచించు"

"మనుమడు,మనుమరాలకి  ముద్దుమురిపెంగా ఆ మాత్రం వండిపెట్టలేరా ఏమిటి? వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడతారు నేనంత సున్నితంగా ఆలోచించలేను " మై లైఫ్ మై వే .. దట్సాల్ అంతే ! " తేలికగా చెప్పి సరేలే.. ఆ ముచ్చట్లు  ఎందుకు గాని..కాస్త టీ పెట్టవే.. తలనొప్పిగా ఉంది"  అంది.

"ఇదిగో..ఇప్పుడే టీ చేసి తీసుకుని వస్తాను. నువ్వు వెళ్లి ..హాల్లో..కూర్చో. సురేష్ ఉన్నారు నీకు మాటలకి మంచి కంపెనీ"అని వేణి ని అవతలకి పంపి.. చేతిలో పని ప్రక్కన పడేసి.. టీ తయారీలో చేయి పెట్టింది.

కాసేపటికి టీ కప్పులు  తీసుకుని వచ్చేటప్పటికి సురేష్,వేణి మంచి కబుర్లు లో ఉన్నారు.

ఇంతకీ.."కాలాతీత వ్యక్తులు" హీరోయిన్ ఇందిర కాదంటారా..? కల్యాణి  యే అని ఈ వ్యాస రచయిత అభిప్రాయం తో ఏకీభవిస్తున్నారా? అంటుంది వేణి.

"నేను ఏకీభవించడం కాదండీ! పాఠకులు  అందరు ఏకీభవించాలి కదా!" అంటున్నాడు సురేష్.

రాక్ లో ఉన్న బుక్స్ అన్నీ సోఫాలోకి వచ్చి చేరాయి. వీళ్ళిద్దరకి అప్పుడప్పుడు సాహిత్యం  విషయంలో  అలా చర్చలు జరుగుతూనే  ఉంటాయి.

టీ ఇచ్చేసి మళ్ళీ వంట పనిలో మునిగిపోయింది కానీ చాలా చిరాకుగా ఉంది లక్ష్మికి.

వేణి తనకి  స్నేహితురాలే!  ఒకే ఊరు. చిన్నప్పటి నుండీ స్నేహితురాలే ! కొంచెం నిర్లక్ష్యంగా, స్వార్ధంగా ఉంటుందన్న మాటే కాని స్నేహపాత్రురాలే! కాకపొతే.. మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు..మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని అడిగే రకం.

పుస్తకాలు,పేపర్ లు గట్రా బాగా చదువుతుంది కాబట్టి  మగవాళ్ళు అందరితో..అన్ని విషయాలు తర్కిస్తుంది. అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా అలంకరించుకుంటుంది. మగవాళ్ళు అందరూ దీపం చుట్టూ శలభంలా తిరిగినట్టు  ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటారు. వేణి తో ఎక్కువసేపు మాట్లాడాలని ఆమె దృష్టిలో తామూ   పడాలనుకుని ఆసక్తి లేకపోయినా రక రకాల పత్రికలూ,నవలలు కొని అక్కడక్కడా చదివి అంతా చదివేసి జీర్ణం చేసేసుకుని ఆ రచనలని స్వీయానుభవం చేసేసుకున్నట్లు మాట్లాడే వాళ్ళు ఉంటారు.  అలాంటి  వాళ్ళతో మాట్లాడినంత సేపు మాట్లాడి తర్వాత వాళ్ళ మాటల గురించి  ఎక్కెసంగా తనతో చెపుతూ పడీ పడీ నవ్వడం తెలుసు. అదొక సరదా వేణికి . 

"ఇష్టం లేనప్పుడు మాట్లాడటం ఎందుకే ! తర్వాత తాటాకులు కట్టడం ఎందుకు ? బిజీ గా ఉన్నానని ఒక్క మాట చెప్పి కట్ చేసుకోవచ్చుగా అంటే .అందులో  ఎంత వినోదం ఉందొ నీకేం తెలుసు ? వాళ్ళు మాత్రం  ఆడవాళ్ళతో మాట్లాడాలని తాపత్రయ పడేది ఆ వినోదం కోసం కాదు"  అని నవ్వేస్తుంది. 


ఖాళీ కప్పులు తీసుకు రావాలని హాల్లోకి వెళ్ళిన లక్ష్మిని  "నా కోసం స్పెషల్ ఏమి చేస్తున్నావ్ ? పూర్ణాలు చేయి లక్ష్మి. నువ్వు చేసిన పూర్ణాలు చాలా బాగుంటాయి . వేడి వేడి పూర్ణాలకి గుంట పెట్టి నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటాయి. అంది అభినయిస్తూ . "ఇంకొసారి చేస్తానులే  శెనగపప్పు కొంచమే ఉంది ఇంట్లో"  

"నీ స్నేహితురాలు అడుగుతుందిగా . శ్రమ అనుకోకుండా చేసేసేయ్   కిరాణా షాపుకి నేనెళ్ళొస్తా! "అంటూ సురేష్ చెప్పుల్లో కాళ్ళు దూర్చాడు. 


"పూత పిండి మైదా వద్దు . బియ్యం మినప పప్పు నానపెడదాం పద " అంటూ సాయం చేసేదానిలాగా లేచింది వేణి. 

ఆదివారం మధ్యాహ్నం కాస్త నడుం వాల్చుదాం అనుకుంటే ఇలా వంటిల్లుకి బందీ అయిపోవాల్సి వస్తుంది అని మనసులో తిట్టుకుంటూ ..  ప్రిజ్ద్ లో నుండి బెల్లం తీసి బయటపడేసి కొబ్బరి తురిమే పనిలో పడింది  . సురేష్ షాప్ నుండి వచ్చేదాకా లక్ష్మితో  కబుర్లు చెప్పి తర్వాత లేచి వెళ్ళిపోయింది. భోజన సమయంలో నాన్ వెజ్ ఎక్కువ తినను ... తినను అంటూనే చేసిన వాటిలో సగభాగం తినేసింది. రాత్రికి పిల్లకి కూడా చారుమెతుకులే పెట్టాలి లేదా మళ్ళీ కూరలు చేసుకోవాలి అనుకుంది లక్ష్మి. భోజనం చేసాక ఇంటిముందున్న తోటపై పడింది వేణి కన్ను. ప్రొద్దున్నే పూజకి పూవులు దొరకడంలేదు అంటూ  విరగబూసిన చేమంతులని చొరవగా తుంచేసుకుంది. గులాబీలని, మర్నాడిచ్చే మందారు మొగ్గల్ని కూడా వదలకుండా కోసేసి వడిలో వేసింది.  మా కుండీలలో ఈ మొక్కలేదు . ఆ .. అంటులేదు అంటూ రకరకాలు  సేకరించింది. "ముంగిట ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందని పూల మొక్కలని పెంచుకుంటే ... ఆ పూలన్నీ అలా తుంచేస్తావేమిటే"  కసురుకుంది . 


"ఇదిగో లక్ష్మి .. దేవుడి పూజకి పూలు కోసుకుంటుంటే వద్దంటున్నావ్ నీకు పాపం తగుల్తుంది జాగ్రత్త "అంటూ ..బెదిరించింది. పదిళ్ళకి సరిపోయే మునక్కాయల్ని కొట్టించుకుని సంచీలో పెట్టుకుంది బోసిపోయిన మొక్కలని చూసి మనసు బాధపడింది లక్ష్మి కి. సాయంత్రం  టీ  కి ముందు ఉల్లిపాయ పకోడీ, రాత్రి ఏడుగంటలప్పుడు వేడి వేడి పూర్ణాలు తిన్నన్ని తినేసి నేను ఒక్కదాన్నే తిన్నాననే  గిల్టీ ఫీలింగ్  కల్గుతుంది పిల్లలకి వారికి కూడా పెట్టవే అని బాక్స్ లోకి సర్దుకుంది . చీకటి పడింది నడిచేమి వెళతాను ఇటువైపు ఆటో లేవీ కూడా రావు బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తారా అంటూ సురేష్ ని అడిగింది. అలాగేనంటూ బండి తీసాడు . అతని వెనుక ఎక్కి కూర్చుని చొరవగా భుజం మీద చెయ్యేసింది. గతుక్కుమంది లక్ష్మి మనసు. వేణీ  కుడి చేతికి ప్రతాప్ అన్నయ్య గిఫ్ట్ గా  అమెరికా నుండి  పంపిన ఖరీదైన రిస్ట్ వాచీ. 


సురేష్ ఇంటికి రాగానే "వేణీ చేతికి  ఆ వాచీ  ఎలా వెళ్ళింది? " అని అడిగింది. "ఆమె నన్ను అడిగింది నువ్వెలాగూ పట్టుకోవడం లేదుగా ఆమెకి  బాగా నచ్చిందందని  ఇచ్చేశాను" అన్నాడు. 


"అడిగిందని, నచ్చిందందని ఏది అడిగినా ఇచ్చేస్తారా మీరు !?  నా వస్తువు కదా  నన్నడగాల్సిన అవసరం ఉందని మీ ఇద్దరికీ అనిపించలేదా ? "  కోపంగా అడిగింది.  సురేష్ మౌనం వహించాడు. 


వేణీ  ఉద్యోగం చేసే అవసరం ఉన్నాకూడా  ఉద్యోగం చేయదు. అలా అని తన సరదాలు ఏమీ మానుకోదు. నగల దగ్గరనుండి పుస్తకాల వరకు చనువుగా అడిగి పుచ్చుకుని  తీసుకెళుతుంది.  లక్ష్మికి  అలా ఇష్టం ఉండదు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఉద్యోగప్రయత్నం చేసింది. తను పనిచేసే ఆఫీస్ లోనే ఉద్యోగం రావడం వల్ల ఉద్యగం చేయడానికి తేలికగానే ఒప్పుకున్నాడు సురేష్.  ఇద్దరూ  ఉద్యోగం చేస్తుండబట్టి  ఆర్ధికంగా  వేణీ కన్నా మెరుగైన  పరిస్థితి లో ఉండి సొంత ఇల్లు,కారు అమర్చుకున్నారు. "నీకేం తక్కువ ? అందమైన భర్త, చక్కగా చదువుకునే పిల్లలు, సొంత ఇల్లు ,ఉద్యోగం అన్నీ ఉన్నాయి ' నాకే అన్ని అత్తెసరు దక్కాయి . దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి" అంటుంది. యధాలాపంగా అంటూ ఉండే మాటల్లో  ఈర్ష్య ధ్వనిస్తూ ఉంటుందని లక్ష్మికి అర్ధమైంది.  


లక్ష్మికి పదే పదే సురేష్ భుజంపై చొరవగా చేయెసి కూర్చున్న వేణి, ఆమె చేతికి ఉన్న వాచీ కళ్ళల్లో మెదులుతున్నాయి. ఈ వేణి స్నేహానికి ముగింపు ఇచ్చేయాలి. జాగ్రత్త పడాలి  అనుకుంది బలంగా.  


అప్పుడప్పుడూ .. వేణి  సురేష్ కి రింగ్ ఇవ్వడం గమనించింది.   లక్ష్మి గమనించినప్పుడల్లా   మీ ఫ్రెండ్  ఎందుకో మిస్సుడ్ కాల్  చేసింది. బాలెన్స్ లేదేమో ..  నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్  తీసుకొచ్చి  ఇచ్చేవాడు. 

"ఆమెప్పుడూ అంతే ! చాలా పిసినారి. అంతగా అవసరమైతే తనే తర్వాత ఫోన్  చేస్తుంది లే ! "అని నిర్లక్ష్యంగా ఊరుకొనేది. 


సురేష్ రహస్యంగా వేణి తో మాట్లాడుతున్నది గమనిస్తూనే ఉంది లక్ష్మి.  ఆమె ఆకర్షణలో పడిపోయాడు. తనలో లేని అందం,  పరిశీలనా శక్తి , అవగాహన  ఆమెకి ఉన్నాయని చాలా సార్లు  మెచ్చుకున్నాడు కూడా ! పరాయి ఆడవాళ్ళ పట్ల భర్త చూపే ఆసక్తులు తక్కువేమీ కాదని తెలుసు లక్ష్మి కి.  తెలిసి తెలిసి మూడో మనిషిని తమ మధ్యకి రానివ్వదలచుకోలేదు. 


మరుసటి ఆదివారం ఉదయాన్నే వేణి కి కాల్ చేసింది లక్ష్మి. "ఇంట్లో ఉన్నావా ? సాయంత్రం మీ ఇంటి వైపు వస్తున్నాం " అని.  

"లేదు లక్ష్మి .. అందరం కలసి నిన్న సాయంత్రమే అమ్మ వాళ్ళింటికి వచ్చాం " 

"సరేలే .. ఇంకెప్పుడైనా వస్తాను" అని పెట్టేసింది. 

సాయంత్రం ఆరింటప్పుడు లక్ష్మి, సురేష్, పిల్లలిద్దరూ కలసి కళాక్షేత్రం కి వెళుతూ .. "వేణి వాళ్ళింటికి వెళదాం సురేష్ " అంది. 

"వాళ్ళు ఊళ్ళో లేరు కదా .. తెలిసి ఎందుకు వెళ్ళడం ? " పిచ్చా నీకు అన్నట్టు చూస్తూ అన్నాడు . 

"లేదు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు.  వేణి కావాలనే అబద్దం చెప్పింది. కావాలంటే  మీకు నిరూపిస్తాను పదండి" అంది. ఒకవైపు పిల్లలు అవి గమనిసున్నారనే సిగ్గు కల్గింది లక్ష్మికి . 

భర్తని,పిల్లలని  కార్లోనే ఉండమని తనొక్కతే వేణి ఇంటికి వెళ్లి బెల్ కొట్టింది లక్ష్మి. తలుపు తీసిన వేణి ముఖం రంగులు మారిపోయింది. హడావిడిగా మర్యాదలు చేస్తూ ..ఇప్పుడే ఊరినుండి వచ్చాం . అంది.   


కళా క్షేత్రంలో జరిగే  "పాడుతా తీయగా " పాటల రికార్డింగ్ కార్యక్రమానికి  ఫ్రీ పాసులు వచ్చాయి. నా కొలీగ్  తెచ్చిచ్చారు, వాళ్ళమ్మాయి  పాటలు పాడేవాళ్ళలో ఉందని. నీకు అలాంటి కార్యక్రమాలంటే ఇష్టం కదా .. కళాక్షేత్రం మీ ఇంటికి దగ్గరే ఉంది, నేను  మీ ఇంటికి వచ్చినట్టూ ఉంటుంది. పిల్లలని, నిన్ను ఆ ప్రోగ్రాం చూడటానికి తీసుకెళ్ళినట్టూ  ఉంటుందనుకుని కాల్ చేసాను.  నువ్వేమో ఇంట్లో లేనని అబద్దం ఆడావు కదా 


"అబద్దమా ! నాకేం అవసరం అలా చెప్పడం , నిజంగా ఊరెళ్ళాము లక్ష్మీ ! " 


ప్రొద్దున్నే నీతో మాట్లాడాక  మా అమ్మతో  మాట్లాడాను . ప్రక్కనే మీ అమ్మ కూడా ఉంది.  నాతో  మాట్లాడింది కూడా ! మీరెళ్ళినట్లు ఏమీ చెప్పలేదు. పైగా పండక్కి  చీర కొనిపెట్టలేదని నువ్వు అలిగావని, ఫోన్ కూడా చేయడం లేదని బాధపడింది. ధాన్యం డబ్బులు వచ్చాక ఇస్తాను నువ్వెళ్ళి ఓ  రెండువేలు వేణి కి ఇచ్చి రామ్మా!  అని చెప్పింది. 

"..... "


ఇవిగో రెండు వేలు. నీకు ఇద్దామనే వచ్చాను తప్ప నీలా ఏదో ఒక ప్రయోజనం ఆశించి,వినోదం ఆశించి మీ ఇంటికి రాలేదు. స్నేహాలని, బంధాలని  మరీ అంత చులకన చేయకు వేణీ !  అది నీకు మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా చప్పున బయటకి వచ్చేసింది లక్ష్మి.    

   

(అనుపమ మహిళా మాస పత్రిక మార్చి 2016 సంచికలో ప్రచురితం )

కామెంట్‌లు లేవు: