“బహుళ “ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రిక లో నేను రాసిన కథ “రంగు వెలిసిన కల”.. చదవండి.
“రంగు వెలిసిన కల”
బయట శరత్ పూర్ణిమ వెన్నెల పగలబడి నవ్వుతుంది. ఆమె లోపల మసకచీకటిలో ముణగదీసుకుని పడుకుని వుంది. స్మృతి పథంలో చేదు గుర్తులు. ఎవరో పిలుస్తున్నట్లు తలుపు చప్పుడు. అయిష్టంగా లేచి తలుపు తీసింది. ఎదురుగా స్నేహితురాలు.
“ఏమే, ఏ లోకంలో వున్నావ్ నువ్వు, అసలు భూలోకం పైన నివసిస్తున్నావా, పాతాళ లోకం లోనా!?ఎన్ని సందేశాలు పంపాను. ఒక్కదానికి సమాధానం లేదు. ఇవాళ నీకిష్టమైన రోజు కదా,అందుకే వచ్చానిలా” అంటూ ఆమెను చుట్టేసింది స్నేహితురాలు.ఆ చేతిలో ఓ కానుక. లిల్లీ పూల గుచ్చం. స్తబ్దత నిండిన గదికి మదికి చైతన్యం ఇచ్చేలా.
నవ్వి స్నేహితురాలి ఆలింగనం నుండి దూరంగా జరిగింది ఆమె.
“ఎన్నాళ్లిలా జఢత్వం లో మునిగివుంటావ్. జీవితం అంటే విద్యార్థులు బోధన లే కాదు స్పందన సంతోషం కూడా వుండాలి. ఏమంటావ్ మరి”
మౌనం వహించింది.
“నువ్వింకా అతని ప్రేమలో వున్నావా” ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
“లేదు లేదు, తనువు మనసు రెండూ గాయపడ్డాయి, వైరాగ్యం వచ్చేసింది”
“ఏం జరిగిందసలు? తెలుసుకోవచ్చా నేను, నీకు అభ్యంతరమైతే వద్దులే మరి”
చాలా సంవత్సరాలుగా వచ్చినప్పుడల్లా అడుగుతుంది ఈ మాట. ఆమె ఎప్పుడూ మౌనం వహించేది. ఎందుకో ఈ సారి మెత్తబడింది.
“తెలుసుకుని ఏం చేస్తావ్, గతం గతః అనడం మర్చిపోమని చెప్పడం తప్ప. ఈ రోజు నిన్ను నిరాశపరచను లే”అంటూ అనునయించే ఆత్మీయురాలి ముందు తన అంతరంగాన్ని విప్పి చెప్పడం మొదలెట్టింది ఆమె.
స్నేహితురాలు ముందు గది వైపు వెళ్లి ఒకసారి బయటకు చూపు సారించి ఓరగా తలుపు మూసి వచ్చింది.
************
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను యూనివర్సిటీ లో చేరిన కొద్దిరోజుల్లో అతన్ని చూసాను. పదేళ్లైనా యెంత గుర్తుందీ అంటే.. అది యీ వేళే జరిగినట్టు.
సహాధ్యాయిని తో కూడి నడుస్తున్నాను.
“పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో…
గుంపు మధ్యలో నుండి చీల్చుకు వస్తున్న ప్రశ్న గేయం…నా అడుగుల వేగాన్ని మందగింపజేచింది. పిచ్చాపాటి మాటలు ఆగిపోయాయి.
అసంకల్పితంగా గుంపు వైపు కాళ్లు కదిలాయి. కరతాళ ధ్వనులతో పాటు ఒన్స్ మోర్ ప్లీజ్! అభ్యర్ధనల్లో నా గొంతు కలిసింది.
మునివేళ్లపై కాళ్ళు పైకెత్తి నా ముందున్న వాళ్ళ భుజాల పై నుంచి ఆ గాయకుడిని చూసాను. ఎడమ మోచేతి పై తలను ఆనించి విలాసంగా సిమెంట్ బెంచీ పై పడుకుని వున్నాడు. అతని కాళ్ళు బెంచీపై కూర్చున్న వేరొకరి ఒడిలో. మిత్రుడు కాబోలు. తల్లి బిడ్డ పాదాలను ప్రేమతో సవరించినట్లు సవరిస్తున్నాడు. ఎండ తగలకుండా పనామా కేప్ ను ముఖం పై పెట్టుకుని వున్న అతను కేప్ ను తల పైకి జరుపుకుని ఒకసారి చుట్టూరా చూసాడు. వేగవంతంగా అందరిని చూసిన కళ్లు వెనుకనున్న నా వైపు చూసి నిలకడగా నిలిచి విశ్రాంతి తీసుకున్నాయి. ఆపై గొంతు సవరించుకుని.. గేయాన్ని అందుకున్నాడు. భావ వాహిని గాన వాహిని పరిసరాలను స్తంభింపజేసింది. పాట పూర్తవగానే అతను లేచి గుంపును చీల్చుకొని వడివడిగా నడిచాడు.అతని వెనుక యువకులు యువతులు పరుగుదీసి పోటీ పడి అతనికి అభినందనలు తెలుపుతున్నారు. నేను ఉన్నచోటనే నిలబడి చూస్తున్నాను.
అతనిది మోహన రూపం మధుర గాత్రం. నా కన్నె హృదయాన్ని తెరవబోతున్న తాళం చెవిలా ఉన్నాడతను. నిత్యం పాట కోసమో అతని కోసమో వెతుక్కొంటూనే వున్నాను. నెలలు గడుస్తూ వున్నాయి. అతను కూడా నన్ను చూస్తూనే వుండేవాడు. సూటిగా కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ కలవరం కల్గించేవాడు. యూనివర్సిటీ ప్రాంగణంలో వొంటరిగా తిరిగే స్త్రీ కాని పురుషుడు కాని వుండటం అరుదుగా కనబడే దృశ్యం.చదువులు పెరిగినట్టు నవీన సంస్కృతి అలవడింది కదా! అలాంటిచోట నేను వొంటరిగా వుండటం చూపరులకు వింత. వారికి తెలియదు అతని ఊహల తోడుగా నేను జంటగా వున్నానని, ఎద నిండా మథనం జరుగుతూనే వుందని. నోరు విప్పి మాట్లాడనన్నమాటే కానీ రాసుకునే కవిత్వం నిండా అతనితో మాటలే,అతని కథలే.
అతను పాడుతున్నప్పుడు ఉపన్యసిస్తున్నప్పుడు మగ నెమలి పురి విప్పి ప్రదర్శన చేస్తున్నట్లుగా ఆడ నెమళ్ళు మగ నెమలి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా అనేకమంది స్త్రీలు అతన్ని చుట్టుముట్టి వుండేవారు. అతను నాకు కాకుండా పోతాడేమోనని బెంగ నన్ను వెంటాడేది. అదేమిటో…అతన్ని చూస్తూనే వశం తప్పేది మనసు.
“నా హృదయం నా మనసు నా శరీరం అన్నీ నువ్వే. నా ప్రేమ మాత్రమే కాదు నువ్వు నా జీవితం” అనుకుంటూ లోలోపల పలవరించేదాన్ని. గొంతు దాటి బయటకు రాని భావావేశమేదో మూగ బాధై గుండెను మెలిపెడుతూనే వుండేది. ఏ క్షణాన అతన్ని కలగన్నానో ఆ క్షణం నుండి నా మనసు మనసులో లేదు. అతని దొంగ చూపులు కూడా నాతో దాగుడుమూత లాడినట్లు నను వెంటబడి తరుముతున్నట్టే వుండేవి.
నా తలపు వలపు గమనించిన సహాధ్యాయి నన్ను హెచ్చరిస్తూ వుండేది. మనలా అతను చదువు కోసమే ఇక్కడికి రాలేదు అతనికి సంఘాల తోను ఉద్యమాలతో సంబంధం వుంది. వారిదంతా వేరొక ప్రపంచం. మనం వారితో కలవలేం. కలిసి మనలేం. ముందుకెళ్ళకు” అంది. అవన్నీ నాకభ్యంతరంగా తోచలేదు.వీలైతే అతని మార్గంలోకే నేను వెళతాను. లేదా అతని బిడ్డలకు తల్లినై అతని ఆశయాలతో పెంచుతాను అనుకున్నాను మనసులో. చూపుల సంభాషణల తోనే ఆ సంవత్సరమంతా అలా గడిచిపోయింది.
సంవత్సరాంతర సెలవులు. ఇంటికి వెళ్ళాలి.రెండు మాసాలు అతన్ని చూడకుండా వుండగల్గడం అసాధ్యం. ప్రాణాన్ని వదిలేసి పోగలనా!?
అతను నదికి ఆవలి వొడ్డునున్న నగరంలో స్నేహితులతో కలసి వుంటున్నాడని లోకల్ రైలు లో ప్రయాణించి యూనివర్సిటీకి చేరుకొంటాడని తెలుసుకున్నాను. అతన్ని కలిసి నా మనస్సు విప్పి చెప్పాలని ఆ నగరానికి వెళ్ళాను. అతని స్నేహితునితో కబురు పంపాను.రాలేదతను. పరిచయస్తులు యిచ్చిన సమాచారంతో అతను తిరిగే తావులన్నీ వెతికాను.ప్రయాస వృధా అయింది. పగటి కాలమంతా ఓపికగా నది తీరంలో కూర్చున్నాను. రాత్రి సమయం అవుతున్నా అతను కనబడకపోవడంతో నిరాశగా హాస్టల్ గదికి చేరుకున్నాను.
వారం రోజుల తర్వాత యూనివర్సిటీ లో ఒంటరిగా కనిపించాడు. అతన్ని సమీపించాను. ఎన్నో చెప్పాలనుకున్న నేను ఒక్కసారిగా మూగదాన్ని అయిపోయాను.ఎట్టకేలకు నోరు పెగల్చుకుని “అలా షికారు కి వెళదామా మీ నగరానికి. నది వొడ్డు చాలా బాగుంది” అని అడిగాను. “పని వుంది. బేనర్ లు తయారు చేయాలి, కరపత్రాలు
వేయాలి” అన్నాడు.
బిడియంగా అతని పక్కనే కూర్చుని చేతి వేళ్ళు చూసుకుంటూ నేను ప్రేమిస్తున్నాననే సంగతిని చెప్పాను. సమాధానంగా సన్న నవ్వు నవ్వాడతను.సిగ్గు పడి లేచి వచ్చేసాను.
*********
ఆ నగరానికి ఈ నగరానికి మధ్య కొండలను కలుపుతూ వంతెన. కింద పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది. అవిశ్రాంతంగా తిరిగే వాహనాలు. నడకదారిలో చేతిలో చెయ్యేసుకొని తిరుగుతున్న యువ జంటలు. వారిని చూస్తూ తమ జీవితాల్లో అలాంటి కాలం కరిగిపోయిందని భారంగా నిట్టూర్చే చిన్నపిల్లల తల్లిదండ్రులు. సాయంత్రపు నడక కోసం వచ్చి కుర్ర జంటల చిలిపి చేష్టలను ముద్దు ముచ్చట్లను చూసి ముఖం చిటపడలాడించుకుంటూ వెరపు లేదని గొణుక్కొంటూ తిరుగుతున్న వృద్దులు. ఎవరి పనుల్లో వారుండగా తన పనిలో తామున్న నీటిలోని కొంగలు. ఇవన్నీ చూస్తూ నేను.
అక్కడ నేను వుండటానికి కారణం వుంది. అతను కలుద్దాం అన్నాడు. ఎగిరి గంతేసింది హృదయం.ఉత్సాహం పొంగిపొర్లుతుంది.. పాట పెదాలపై తన్నుకొస్తుంది.ఇష్టమైన పాట “తనన తననన తనన తననన
తనన తననన తానన తనననానా..” హమ్ చేస్తూనే వున్నాను.
ఆత్రం భూమి మీద నిలవనివ్వడం లేదు. చెప్పిన సమయానికన్నా ముందే అక్కడికి చేరుకున్నాను.వంతెన ఆ చివర నుండి ఈ చివరి వరకూ చూపులతో జల్లెడ వేస్తున్నా. చెప్పిన సమయం దాటిపోయింది. అతనొస్తున్న జాడ కనబడలేదు. వస్తాడో రాడో నన్న అనుమానం పొడజూపింది. ప్రకృతిని పరిశీలిస్తూ కూర్చున్నాను.అంతకన్నా చేయగల్గింది ఏముంది గనుక?.
నది మధ్యలో చీలిన ఒక పాయ వెంబడి అక్కడక్కడ పెరిగిన రెల్లు పొదలు. దట్టంగా పూసిన రెల్లుపూలను చూస్తుంటే నదిలో ఉవ్వెత్తున లేచిన సముద్ర కెరటాల్లా గోచరించాయి. ఆ రెల్లు పూలకు కిరీటం పెట్టినట్లుగా మెరుస్తున్న సాయంకాల సూర్య కిరణాలు. ఓహ్. ఎలాంటి అద్భుత దృశ్యాలకు ఆనవాలం ఈ నదీతీరం!! ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని అతనితో కలసి పంచుకోలేనందుకు చింతించాను. ఎంతకీ రాడేమిటి విసుక్కుంది మనసు.నారింజ రంగులో వున్న సూర్యుడు ఎర్రని రంగులోకి మారి కొండల మధ్య అదృశ్యమవ్వకముందే మరో దిక్కున చంద్రోదయం. లోన హర్ష రాగ నాదం బయటేమో వెన్నెల ధారాపాతం. నది నీటిలో అలల పడవపై తేలి ఆడుతున్న చంద్రుడు. నది ఒడ్డున వరుసగా పెంచిన పున్నాగ చెట్లు. పూచిన పూలలో వీచే గాలిలో సుమధర పరిమళం.అతని గురించిన ఊహలతో తనువంతా అదో మైకం.
ఎట్టకేలకూ గంట నిరీక్షణ తర్వాత అతనొచ్చాడు. దుమ్ము కొట్టుకుపోయిన శరీరం చిరిగిన బట్టలు. అలసిన కళ్ళలో ఎర్రని జీరలు. చాలా ఆలస్యం అయినట్లుంది కదా అంటూ చేయందుకున్నాడు. ఆ మునివేళ్ళ స్పర్శకి ఒళ్ళు ఝల్లుమంది.
“అలా నడుస్తూ మాట్లాడుకుందాం పద” అన్నాను చొరవజేసి.
ఈ పున్నమి వెన్నెల రేయంతా అతని చేతిలో చెయ్యేసుకుని తిరుగుతూ చంద్రుడికి వీడ్కోలు పలకాలని ఆశగా వుంది. అతనవేమి పట్టనట్లుగా నా చేతిని వొదిలేసి నాలుగడుగుల దూరంలో నాకు అందకుండా ఈలపాట పాడుకుంటూ వెళ్తున్నాడు. అతని వేగాన్ని అందుకోవడానికి నేను అమిత ప్రయాస పడాల్సి వచ్చింది. ఇంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రేమికులు ఇలాగేనా మసలడం!? నిస్పృహ కలిగింది.
పున్నాగ పూల పరిమళం. చుట్టూ పరికించి చూసాను. దూరంగా పచ్చని పచ్చికపై ఒత్తుగా రాలిన పున్నాగపూలు. సంభ్రమంగా అటువైపు నడిచి కొన్ని పూలను యేరుకున్నాను. అతను నన్ను చూస్తూ పక్కనున్న ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు యెంతకీ తెగడం లేదు. ఓ బెంచి బల్లపై కూర్చుని పున్నాగ పూలను జడలా అల్లుతూ కూర్చున్నాను. ఆ బెంచీ పైనే కూర్చుని వీలైతే అతని హృదయానికి దగ్గరగా తలవాల్చి అతని పాటలో లీనమైపోవాలి అని మధురోహలు చేసాను. ఎంతకీ అతని సంభాషణ తెగేటట్టు లేదు.
లేచి వెళ్ళి మాలలమ్ముతున్న పూలమ్మి దగ్గర ఆగి ఒక్కటంటే ఒక్క గులాబీ పువ్వు ను అదీ ఎర్ర గులాబీ ని కొన్నాను. చేతినిండా లిల్లీ పూల గుచ్ఛాలను కొన్నాను.అడిగి మరీ గుండ్రంగా బంతి లాంటి లిల్లీ పూల చెండును కట్టించుకొన్నాను. అప్పుడొచ్చాడతను. దగ్గరకొచ్చి విసుగ్గా ముఖం చిట్లించి “ఇవి యిప్పుడు అంత అవసరమా? “అన్నాడు.
పున్నాగ పూలన్నా లిల్లీ పూలన్నా నాకు చాలా యిష్టం. అవి రెండూ అక్కచెల్లెళ్లేమో, ఎంత సుమధుర పరిమళం అనీ .. అంటూ గులాబీని అతనికి ఇచ్చి “ఐ లవ్యూ” అన్నాను.
అతను నవ్వి.. “నా గది ఇక్కడకు దగ్గరే. అదిగో లైబ్రరీ ప్రక్కన కనబడుతూ వుందే అదే! వెళ్దాం పద” అన్నాడు.
అతని పక్కనే నడుస్తూ.. అశువుగా కవిత్వం వినిపించాను.
“వెలుగు నీడల త్రోవ ప్రక్కన నిలబడి రేయింబవళ్ళ క్రీడని చూస్తున్నాడు చంద్రుడు
మంచు దుప్పటి కప్పుకున్న ధరణిపై చందనాలు చల్లిపోవగా వచ్చాడు చంద్రుడు
తాంబూలంతో పండిన పెదవులతో ఎవరో ముద్దాడినట్లు ఉన్నాడు చంద్రుడు
మూసిన తలుపులని తడుతూ ఇల్లిల్లూ తిరుగుతూ పెత్తనాలు చేస్తున్నాడు చంద్రుడు
పడతి ప్రేమలో తడిసి విరహ వేదన చెంది ఆ చెలిని కూడ మబ్బు చాటుకేగెను చంద్రుడు”...
పూర్తి చేసి అతని చేతిని ముద్దాడుతూ.. నువ్వు నా చంద్రుడివి అన్నాను.
కొంటెగా కనుగీటుతూ.. భుజంపై చెయ్యేసాడు.నా సగము మేని తానైనట్టు పరవశం.
అతను నా పక్కన నడుస్తూనే ఎదురుపడే అమ్మాయిలను పరీక్షగా చూస్తున్నాడు. పార్క్ లో వొంటరిగా వున్న ఒక స్త్రీ ని ఆగి మరీ చూస్తున్నాడు. ఆ యువతి కూర్చున్న భంగిమ వస్త్రధారణ తేడాగా వుంది. అతను వెనక్కి మళ్లి ఆమెతో మాట కలిపి వీడుతున్నప్పుడు వెకిలిగా ఒక అశ్లీల మాటను విసిరాడు.
“వారు ఎవరైనా ఎలాంటి వారైనా కానీయ్ , స్త్రీల గురించి అలా మాట్లాడితే అసహ్యంగా వుంది, నాకు నచ్చలేదు” అన్నాను కోపంగా.
“ఇందులో తప్పేముంది. నా ఉద్రేకాన్ని రెచ్చగొట్టే ఏ స్త్రీని వొదులుకోకూడదు అన్నది నా సిద్ధాంతం. రేపు చూడాలి దీని సంగతి” అన్నాడు ఆ స్త్రీని ఉద్దేశించి.
ఆ మాటతో అతని స్వభావం పూర్తిగా అవగతమైనట్లైంది నాకు.
“చాలామంది స్త్రీలతో సంబంధం వుందా నీకు”
“ ఉంటే మాత్రం నీకెందుకు అభ్యంతరం”
“కనీసం నా ఈ ప్రశ్నకైనా ఆకు కు అందకుండా పోక కు కందకుండా సమాధానం ఇవ్వొచ్చుగా”
నా ప్రశ్నకు సమాధానమివ్వకుండా.. “ఆర్ యూ వర్జిన్” కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాడతను. సమాధానం చెప్పేలోగానే అతని పెదాలపై వెకిలి నవ్వు వెటకారమైన మాటొకటి నా చెవిని తాకింది.
“అవును” అని చెప్పాలనుకున్న మాట ఆగిపోయింది. ఉండేలు దెబ్బ కి విలవిలలాడి కుప్పకూలిన పక్షిలా మనసు. భుజంపై చేయి తోసేసి వడివడిగా పార్క్ బయటకు నడిచాను. రైలు స్టేషన్ వైపు నడుస్తూ ఆలోచించాను.
అతని నడకలో కానీ నడతలో కానీ పట్నవాసపు పట్టభద్రుడి సంస్కారం లవలేశము కూడా గోచరించడం లేదు. పల్లెటూళ్ళో పుట్టి పెరిగిన నాకు ఆ అశ్లీల మాటలు వినడం ఎంత అలవాటైనా సరే అవే మాటలు ఇంకో భాషలో అతని నోట వినడం అసహ్యంగా వుంది. పుస్తకం ముఖ చిత్రం అందంగా వున్నంత మాత్రాన లోపల వున్నదంతా చదివించదగ్గ విషయం కాదేమో అన్న ఆలోచన నాకెందుకు కల్గలేదో! విచారించాను. ఇదంతా అతని గురించి నేను ఉన్నతంగా ఊహించుకోవడం వల్ల వచ్చిన చిక్కు. కానీ అతని లో వున్నది వున్నట్టుగా స్వీకరించడం మానేస్తే అతను నాకు దక్కకుండా పోతాడు. అలా జరగడానికి వీల్లేదంతే! ఎంతగా ప్రేమించానతన్ని నేను!!! జార విడుచుకుంటానా!? బంధమై అల్లుకోవడమే నా లక్ష్యం.
అతనిని మనసారా వాంఛించి మోహించి రాబోయే మధుర క్షణాలను పదే పదే ఊహించుకుంటూ నిత్యం మురిసిపోవడం కలలు కనడం కంటే ఆ క్షణాలను అనుభవిస్తే పోలా! ఇప్పుడే అనుభవిస్తే పోలా! అనవసరపు అలకలు ఈ మాట పట్టింపులు ఎందుకు! పైగా నాకెంతో ఇష్టమైన శరత్ పూర్ణిమ నాటి ఆహ్లాదకర రేయిని చెడగొట్టుకోవడం ఎందుకు? క్షణంలో మనసు మార్చుకుని వెనుదిరిగి అతనున్న యింటి వైపు దారి తీసాను.
అపరిశుభ్రంగా వున్న వీధి గుమ్మంలో నుండి అడుగులు వేస్తూ మేడ యెక్కుతూ చుట్టూ చూసాను. మనుష్య సంచారం పెద్దగా లేని వీధి. పాత కాలపు మిద్దె అది.ఇరుకుగా దుమ్ము పేరుకున్న మెట్లు. నేను వెళ్లే సరికి అతను పుస్తకాలు ముందు కూర్చుని వున్నాడు. నన్ను చూసి.. “వచ్చావా, రా, మరి ఇందాక అంత బెట్టుపోవడం యెందుకో” అన్నాడు ఎగతాళిగా.
గాలి వెలుతురు లేని ఇరుకు గది అది. రంగు మారిన చిత్రాలు బూజు పట్టి కళావిహీనంగా వున్నాయి. చేగువేరా లెనిన్ ఇంకా నాకు తెలియని యెవరెవరివో చిత్రాలతో పాటు చలనచిత్ర నాయికలు. అరవై కేండిల్ బల్బు వెలుగు చిమ్ముతున్న మసక వెలుతురులో కనబడిన దృశ్యం. చెల్లాచెదురుగా పడి వున్న పుస్తకాలు, విడిచి విసిరి పారేసిన బట్టలు, ఖాళీ మద్యం సీసాలు తిని పడేసిన ఆహార పొట్లాలు. ఆ అపరిశుభ్ర వాతావరణం చూసి జుగుప్స కలిగింది. ఒక్క క్షణం అడుగు వెనక్కి వేసాను. ఈ గదిలో మానవ మాత్రులేనా నివసించేది అని సందేహపడ్డాను. మళ్ళీ అంతలోనే బ్రహ్మచారుల నిరుద్యోగుల ఉమ్మడి వసతి గృహం ఎలా వుంటుందిలే యిలా కాకుండా అని మనసుకి సర్ది చెప్పుకున్నాను.
అతనికి తనపై తనకు శ్రద్ధ లేదన్న ఆరోపణలో నుండి జాలి పుట్టుకొచ్చింది. శ్రద్దగా చూసుకోవడానికి నేనో లేదా నా లాంటి వారు ఎవరో వొకరు ముందు ముందు రాకపోరులే అనుకున్నాను. అయినా ఈ మనిషికి పరిసరాలను శుభ్రంగా వుంచుకోవడంలోనే ఆరోగ్యం వుంటుందన్న సృహ కూడా లేదేమిటో! పోనీ చేయదగ్గ ముఖ్యమైన పనులు వున్నట్లు వుండడు. నలుగురిని వెంటేసుకొని రికామీ గా తిరగడం తప్ప. తన ఆరోగ్యంపై తన దేహం పై శ్రద్ధ లేనివాడు గొప్ప గొప్ప ఆశయాల కోసం యితరుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం యే మాత్రం పనిచేయగలడు? అలా అని అతనికున్న అంకిత భావాన్ని శంకించలేను అనుకుంటూ ద్వంద రీతిలో పొంతనలేని ఆలోచనలెన్నో చేసాను.
నేనిప్పుడే వస్తానంటూ అతను బయటకు వెళుతూ “కంగారు పడకు” అన్నాడు. ప్రశ్నార్ధకంగా చూసాను.
“నా రూమ్మేట్స్ ఎవరైనా రావొచ్చు. అమ్మాయిలను తీసుకురావడమే నీ పనా అని కోప్పడతారు. నేను గదికి తాళం పెట్టి వెనుక వైపు నుండి వస్తాను “
వెనుక వైపు తలుపున్న సంగతి నేను గమనించనే లేదే అనుకుంటూ.. కిటికీ దగ్గరకు నడిచాను. బయట కనబడినంత మేరా పచ్చగా ఆహ్లాదంగా వుంది. ఆ పచ్చదనంపై వెన్నెల విరజిమ్ముతూ పలుచగా పొగమంచు పరచుకుంటూ వుంది.ఆ వెనుక నదీతీరం. ఈ మురికి గది కన్నా బయట యెంతో హాయిగా వుంది. అతను వచ్చాక ఆ సంగతి చెప్పి ఆరుబయలు విహారానికి వెళితే బాగుండును అనుకుంటూ చేతిలోని లిల్లీ పూల గుఛ్చాన్ని నీళ్లు పోసిన గ్లాసులో అమర్చి లైట్ ఆపేసి కిటికీ దగ్గరకు నడిచాను. వెన్నెలతో పాటు బయట విసిరి పారేసిన చెత్తను చూసాను. మొదట మాములుగా తర్వాత పరీక్షగా. చూస్తున్నవి తొడుగులు అని అర్ధమయ్యాక ఎందుకో తేలికగా తీసుకోలేకపోయాను. మనసు ముడుచుకుంది. ఈ కాలంలోనూ అతనికి కూడా ఇదంతా సాధారణమైన విషయం కదా! ఎందుకంత ఆలోచన!? అని బుద్ధి మందలించింది.
అతను వెనుక వైపు నుండి లోపలికి వచ్చాడు.తలుపు గడియ వేసి రావడం రావడం జబ్బను పట్టుకుని మూలనున్న చాప వైపు లాక్కుని పోయాడు. నివ్వెరపోయాను, ఏమిటలా జంతువులా! అవే నయమేమో !
అతని చర్యను మనస్సు తిరస్కరిస్తుంది.ఒక్కోసారి చేతి వ్రేళ్ళ కొనల మృదు స్పర్శే మనోహరం. మరోసారి బాహు బంధమే దుర్భరం. అవును,అడిగి అడగని మధ్య వ్యత్యాసం అనంతం కదా!
ఉత్తర క్షణం అతని నుండి విడిపించుకుని వెళ్లిపోతే! అంతకన్నా అపహాస్యం ఇంకోటి వుందా!? ఆలోచిస్తున్నాను. ఆ క్షణాన ఆ వైరుధ్యాల వల్మీకంలో నుండి కోరిక బుస్స్ న పైకి లేచిందేమో! అతని నడుమును చుట్టేసిన నా చేతులు.
ఇద్దరం లేచి బట్టలు ధరించాక “పద పద..త్వరగా నిన్ను బయటకు పంపాలి. వాళ్లొస్తే గదిని సానికొంప చేస్తున్నానని నన్ను గిరాటు వేస్తారు”. అంటూ భుజం పట్టుకొని ముందుకు తోసాడు.వెంటనే చేయి పట్టుకుని వెనుక తలుపు గుండా బయటకు తీసుకొచ్చి కొన్ని అడుగులు వేసిన తర్వాత యేదో మర్చిపోయినట్టు లోపలికి వెళ్లాడు. తిరిగొచ్చి నేను గదిలో వుంచిన లిల్లీ పూల గుచ్ఛాన్ని రోడ్డు పక్కన విసిరేసాడు. నా చేతిలో వొక వస్తువుని వుంచి “ ఈ సారి వచ్చేటప్పుడు ఇవేమి పెట్టుకొని రాకు,గాజులు కూడా” అన్నాడు. గుప్పిట తెరిచి చూస్తే అది నా లోలాకులలో ఒకటి. “ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు” తరిమినట్లు అనేసి వెనక్కి మళ్లాడు.
మనసు పడిన వాడితో సమాగమానికి మధురోహలతో చెంగు చెంగున గెంతిన మనసు ఒక్కసారిగా టప్ మని గాలి తీసిన బుడగలా అయిపోయింది. కొసరి కొసరి తీపి ముద్దులతో మృదువుగా హృదయ రంజకంగా మధురంగా సాగాల్సిన క్రీడ, యాంత్రికంగా ఆత్రంగా అనుభూతి రహితంగా నా శరీరాన్ని ఆక్రమించుకోవడాన్ని మనసు జీర్ణం చేసుకోలేకపోతుంది. అంతే కాదు నన్ను దాహం తీరిన తర్వాత గ్లాసును పక్కన పెట్టినట్లు పెట్టేయడంతో దిమ్మెరపోయాను. శృంగారంలో రకరకాల ఉద్దీపనలు వుంటాయని చదివాను.ఏవేవో ఊహించాను. అవేమి లేకుండా ఏక పక్షంగా భౌతిక సుఖం జుర్రుకోవడం రేప్ తో సమానం. కాకపోతే ఆ కలయిక నా అంగీకారంతో జరిగింది కాబట్టి అంతటి మాట నేను అనలేను. ఏ మాత్రం రసావిష్కరణ లేని నా తొలి సమాగం అది.
చెబుతున్న ఆమె కంఠం వణికింది.
ప్రతి స్త్రీ యవ్వన ప్రవేశకాలం నుండి తమ తొలి సమాగం కోసం ఎన్నో కలలు కంటారు. కానీ నా దురదృష్టం ఏమిటంటే…ఎవరిని కల కన్నానో అతనే నిరాశను మిగిల్చాడు. అతను వీధిలో నన్ను వదిలేసి వెళ్లాక శూన్యం నిండిన మనసుతో రైలు స్టేషన్ చేరుకొన్నా. శరత్ పౌర్ణమి వెన్నెల నగరంపై దేదీప్యమానంగా వెలుగుతుంది. నా లోపలేదో చీకటి కుమ్మరించినట్లు వుంది. తెలిమబ్బు తునకలు వినీలాకాశంలో వొక్కొక్కటి తేలిపోతున్నాయి.నా చుట్టూరా గాఢంగా అలముకున్న లిల్లీ పూల వాసన. అప్పుడు గుర్తొచ్చింది ఎదపై దాచుకొన్న లిల్లీ పూల చెండు. నలగని ఆ చెండు ని చూసి కళ్లు చెమర్చాయి. తేలిపోతున్న కాళ్ళతో మనసు నిండా దుఃఖంతో హాస్టల్ కి చేరుకున్నాను.అతన్ని మనసారా ప్రేమించాను కాబట్టే నాకు ఈ ఆశాభంగమా,నేనతని ప్రేమకు అర్హురాలిని కాదా!?
మాటలు ఎంత శక్తివంతమైనవి. ఎదుటివారిని గాయపరచటానికి ఎన్నడూ ఉపయోగించకూడదని అతనికి తెలియదా! పైగా మాటల ద్వారానే మనుషులను సంఘటితం చేసి వ్యవస్థ పై పోరాడాలనే సంగతి అతను మరిచాడా?మిగిలిన రాత్రంతా అతని గురించి ఆలోచిస్తూనే వున్నా.
అతనిది భౌతిక వాదమే తప్ప నైతిక విలువలు కానీ ఆధ్యాత్మిక విలువలు లేని స్వేఛ్ఛా జీవనం. నాలో వున్న భావుకత నా హృదయ దౌర్బల్యానికి చిహ్నం.అది అంటు రోగం కానందుకు అతనికి అది ఏ మాత్రం అంటనందుకూ నేను చింతించడం లేదు కానీ… అతనికి స్త్రీల స్నేహం పట్ల ప్రేమల పట్ల నమ్మకం లేదు. అతని హృదయంలో ఎవరికీ స్థానం లేదు. అనేకమంది స్త్రీల సాంగత్యాన్ని అతను కోరుకుంటాడు. అశ్లీల భాషలో సంభాషణ నెరపడం అతని అలవాటు. ఆ అశ్లీల భావాన్ని అతను ఆనందిస్తాడు. అది నేను ఎలా మనసుకు తీసుకున్నానంటే తినే ముద్ద ముద్దకు పలుకురాయి తగిలినట్టు. అతని మనస్తత్వానికి సున్నితత్వం ప్రేమ లాంటివి సౌకుమార్యాలు పొసగవు. నేను వున్నది వున్నట్టు స్వీకరించలేను. కొన్ని నటనలు నాకసలు అతకవు. ప్రదర్శించినా అవి ఎంతో ఎబ్బెట్టుగా వుంటాయన్న సంగతి నాకు తెలుసు. కొన్నాళ్ళు నిశ్శబ్దంగా దూరంగా వుందాం అనుకొన్నాను.అది నా మధ్యతరగతి జడ్జి మనస్తత్వం కూడానూ.
ఇంకా చెప్పాలంటే.. అతనికి రెండు గుణములు తక్కువ, తనకు తోచదు ఒకరు చెప్పినా వినడు. అతనిని వొదులుకోవాలా లేదా అన్న సందిగ్ధ దశలో వుండగానే భగవంతుడు నాకొక మేలు చేసాడు. అతని వెకిలి స్వరూపం మొత్తాన్ని నాకు ఆ మర్నాడే బయలుపరిచాడు. నాకా సమయంలో “Man is the measure of all things” అని పైతాగరస్ కోట్ గుర్తుకు రావడం సమంజసమే!
యూనివర్సిటీ ప్రాంగణంలో .. అతను గుంపుతో ఎదురయ్యాడు. చాలా కాలం తర్వాత నేనూ ఒంటరిగా లేను. నన్ను చూసిన అతని మిత్ర బృందం అతనితో సంభాషించడం విన్నాను.
“చిలక చిక్కిందా”
“ మరులు గొన్న చిలక రాకేమి చేస్తుంది,దానంతట అదే గదికి వచ్చి వాలింది”
“ అయితే రాత్రంతా నీకు పండగేనన్నమాట” వీపు వెనుక భళ్ళున నవ్వులు.
“ఆకారం పుష్టి నైవేద్యం నష్టి. మొత్తానికి అదొక చవిటి పర్ర”
ఆ మాటలు వింటున్న నా హృదయానికి తీవ్ర అఘాతం తగిలినట్టైంది. అక్కడికక్కడ భూమి యెందుకు కృంగి పోలేదో అన్న అవమానం! శరీరం వణికింది. దవడలు పిడికిళ్లు గట్టిగా బిగుసుకున్నాయి.రైలింజన్ నుండి వెలువడ్డ పొగలా చెవుల నుండి వెచ్చని ఆవిర్లు. విసురుగా వెనక్కి వెళ్ళి బేగ్ ని అతని ముఖంపై విసిరి కొట్టి అసహ్యంగా చూసి ఖాండ్రించి ఉమ్మేసాను. అతను వెకిలిగా నవ్వి అసహ్యపు మాటనొకటి వదిలి వెళ్ళాడు. నాతో వున్న గుంపు నన్ను చూసి జాలిపడింది.అవమాన దుఃఖం నన్ను కమ్మేసింది.నేలన కూలబడిపోయాను.అది సుత యూనివర్సిటీ వొదిలేసే వరకూ అతని వైపు కన్నెత్తి చూడలేదు నేను.
వీటన్నింటి మధ్య కోల్ఫోయిందేమిటో పొందినదేమిటో నాకై నాకు స్పష్టంగా తెలుసు.శరీరం నాది,హృదయం నాది, భావనలు కూడా నావే, బాధ కూడా ముమ్మాటికీ నాదే!
ఇప్పుడు నాకు శరత్ పూర్ణిమ చల్లని వెన్నెలనూ లిల్లీ పూల గాఢమైన పరిమళాన్ని ఆస్వాదించే మనసు లేదు.అదెప్పుడో ఆవిరై పోయింది.ఆ నాటి ప్రణయం రంగు వెలిసిన కల. మరలా కలలు కనే సాహసం కూడా చేయలేదు.
భారంగా ముగించింది ఆమె.
*************
నిశ్శబ్దాన్ని బద్దలు చేసుకుని స్నేహితురాలి సోదరుడు లోనికి వచ్చాడు.
“మొదట నన్ను క్షమించాలి మీరు. కావాలని కాకపోయినా మీ సంభాషణను వినాల్సి వచ్చింది” అన్నాడు.
ఆమె స్నేహితురాలి వైపు చురుగ్గా చూసింది. కావాలనే అతన్ని వెంటబెట్టుకొని వచ్చావు కదూ.. అన్నట్టు.
స్నేహితురాలు చెవి పట్టుకొని చూపి క్షమించమన్నట్టు చూసింది.
“కనులుంది కలలు కనేందుకే కదండీ. రంగు వెలిసిన కల గురించి ఆలోచన వద్దు. ఇకపై మంచి నిర్ణయం తీసుకోండి” అని సోదరిని బయలుదేర తీసాడతను.
ఎవరితోనూ పంచుకోకూడదనుకున్న విషయం ఇలా బహిర్గతం అయినందుకు కొంత సిగ్గిల్లింది ఆమె. మళ్ళీ అంతలోనే పరాయి వ్యక్తులు ఎవరున్నారులే, ఒకరు ప్రియ నెచ్చెలి,మరొకరు నాతో జీవితాన్ని పంచుకోవాలని ఎదురుచూస్తున్న మనిషి.
*********
మరునాడు ఆమె యింటికి చేరుకొనే సరికి గుమ్మం ముందు.. రెండు కుండీలు కనిపించాయి. ఒక దానిలో నాటడానికి పెరిగినంత ఓ పున్నాగ పూల మొక్క, రెండవ దాంట్లో త్వరలో విరియటానికి సిద్ధంగా వున్న లిల్లీ పూల కుదురు. కుండీలను పక్కన పెడుతూ వాటి క్రింద వుంచిన కాగితాన్ని తీసి చూసింది.
అందులో…
“నేనింత వరకూ ఏ స్త్రీ ని ప్రేమించలేదు.
మీ పాత గాయాల పచ్చిదనమే కాదు మచ్చ కూడా కూడా మాని పోయేంత వరకూ యెదురు చూస్తాను. నన్ను విశ్వసించి ప్రేమించగలరా!? రంగు వెలసిన కల స్థానంలో ఇంద్రధనుస్సు ని సృష్టిద్దాం మీరు వానై నేను యెండై”
ఉద్విగ్నతకు లోనై గుమ్మం మెట్లపై కూర్చుని కనులు మూసుకుంది ఆమె. ఆనాటి రంగు వెలసిన కలను తుడిచేయగలనా నేను అనుకుంటూ.
***************సమాప్తం************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి