ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలో "పైడి బొమ్మ " కథకు వ్యాఖ్యానం రాసిన శశికళ ఓలేటి గారికి ధన్యవాదములతో .. ఆ కథ పరిచయం .
పైడి బొమ్మ...నా మనోగతం.
అలనాటి రామచంద్రుడికి అశ్వమేధ యాగ నిర్వహణకు తన ధర్మపత్ని స్థానంలో స్వర్ణ సీత అవసరమయ్యింది. ఈ కధలో రామచంద్రరావు గారికి...ధర్మబద్ధంగా తాళి కట్టిన భార్య అధర్మ మార్గాన్ని ఎంచుకుంటే....ఆపద్ధర్మంగా ఆదరించి,చేరదీసిన మహిళ....అత్యంత ఉన్నతంగా సతీధర్మాన్ని నెరవేర్చి, ఆయన ఏకపత్నీవ్రత దీక్షకు భంగం రానీయకుండా.. ఎటువంటి హోదాను,ఎటువంటి ఆర్ధిక భద్రతను కోరుకోకుండానే....తన సత్ప్రవర్తనతో, త్యాగనిరతితో, ఆధ్యాత్మిక నడవడితో... నిస్వార్థంగా...ఆయననూ, ఆయన పిల్లలను ఆదరించి, అలరించిన తీరు అద్భుతంగా తన కథ పైడిబొమ్మలో మలిచారు శ్రీమతి వనజ తాతినేని గారు.
పద్మవల్లీ ఆండాళ్ళు గురించి రాస్తూ..." అలుపన్నది లేకుండా గానుగ రోలులో కణెంలా తిరుగుతూ పనిచేసేది!"...అంటుంది ఈ కథ చెప్పే నీలోత్పల, రామచంద్రరావు గారి మనవరాలు. తన తాతయ్య దృష్టిలో నిజమైన నీలోత్పల ఆండాళ్ళు. బురదలో పుట్టినా...తన అస్థిత్వాన్ని హుందాగా లోకానికి చూపించే పద్మం లాంటిది ఆండాళ్ళు.ఆమెను తన పైడి బొమ్మగా వర్ణిస్తూ...తాతగారు తన జీవితంలోని ముఖ్య ఘటనలు, కుటుంబ సభ్యుల వంచనలు, మలుపులు, భార్యను దూరం పెట్టి,ఆండాళ్ళును ఆదరించవలసి వచ్చిన పరిస్థితులు, ఆండాళ్ళు... ఆయన పిల్లలను,మనవరాలినీ... సక్రమంగా పెంచి, ఆయనకు స్వధర్మపాలనలో అడుగడుగూ తోడుగా నిలిచిన ప్రతీ వివరాన్నీ ఆయన డైరీలో రాసుకుంటారు.
ఆయన నిష్క్రమణ ను స్థితప్రజ్ఞతతో స్వీకరించి..ఆశ్రమవాసం చేసి , అక్కడే తనువు చాలిస్తుంది ఆండాళ్ళు. అదే ఈ కధకు ఆరంభం.
మానవ సంబంధాల్లో లోటుపాట్ల గురించి మనకు అనేక పితూరీలు ఉంటాయి. నిజానికి తరచి చూసుకుంటే...ఎక్కడో అక్కడ మనకు జీవితంలో సమతుల్యత లభిస్తుంది. రామచంద్రరావు గారికీ,ఆయన పిల్లలకూ అదే జరిగింది... ఆండాళ్ళు రూపంలో. సరోజ నెరవేర్చలేని కర్తవ్యాలు తను నెరవేర్చి, భర్తకూ,పిల్లలకూ..ఆమె పంచలేని ప్రేమను తను అందించి...ఆ ఇంటి ఇలవేల్పు అయ్యింది ఆండాళ్ళు...అది కూడా పూర్తి నిష్కామంగా, నిస్వార్థంగా...ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా.
వనజగారి శైలిలో ఎంత లాలిత్యముంటుందో...అంత తీవ్రత కూడా ఉంటుంది. కుటుంబాల్లో పైకి పొక్కనీకుండా, కప్పెట్టేసే కొన్ని నగ్నసత్యాలు, అనైతిక ప్రవర్తనల గురించి... ఆమె చాలా కఠిన వైఖరి తో తమ కధల్లో చర్చిస్తారు. ఏ ఒక్క వాక్యమూ అసంబద్ధంగా ఉండదు. కధకు అవసరమైన ప్రతీ రసాన్నీ సమపాళ్ళలో వాడుకుంటారు...ఆ విధంగా పాఠకులను తన కధనంలోకి నేర్పుగా లాగేసుకుంటారు. ఆ పాత్రల మధ్యనే తిరుగాడిన పాఠకులకు...కథ తాలూకు సారాంశం ,సందేశం చాలా గాఢంగా హత్తుకునిపోయి ఉంటుంది.
తమ కుటుంబానికి అంత సేవ చేసిన ఆండాళ్ళు...ఎవరూ లేని అనాధలా ఆశ్రమంలో చనిపోవడాన్ని...కథకురాలు నీలోత్పల తీవ్రంగా గర్హిస్తుంది. తాతగారి ఆస్తులు తీసుకున్న ఆయన పిల్లలు...ఆయన అత్యంతంగా ప్రేమించిన ఆండాళ్ బాధ్యత తీసుకోలేదన్న అసంతృప్తి ,ఆక్రోశం అడుగడుగునా వ్యక్తపరుస్తుంది. అక్కడ మనకు ఆమెలో రచయిత్రి నిష్పక్షపాత వైఖరి అడుగడుగునా కనిపిస్తుంది.
నీలోత్పలకు తన తాతగారు ఒక హీరో. ధర్మం తప్పని రాముడంతటి వారు. కధలో ఎక్కడా కూడా ఆయన మీద పల్లెత్తు మాట వెయ్యలేదు. అయితే వయసులో ఉన్న సౌందర్యవతి అయిన భార్యను వదిలేసి, నెలల తరబడి వ్యాపార నిమిత్తం ఆమెకు దూరంగా ఉంటూ...ఆమెకు దారితప్పే అవకాశం ఆయనే ఇచ్చారు. స్త్రీకి వివాహం ద్వారా ఆర్ధిక,సాంఘిక భద్రతతో పాటూ లైంగిక సుఖం కూడా అవసరం అన్నది మౌలిక సూత్రం. భార్య అక్రమ సంబంధాన్ని ఉదాసీనంగా తీసుకుని,ఆమెను పరిత్యజించి,పిల్లలను దూరం చేసి,ఆండాళ్ళును చేరదీసి...ఆయన అదే తన నైతిక విజయం అనుకోడం కాస్త అసంబద్ధంగా ఉంది. అదే ఆయన భార్యను సంస్కరించి, ఆమెను సమాదరించి,ఆమెకో వ్యాపకాన్ని సృష్టించి...ఉద్ధరించి ఉండుంటే...ఆయన మహోన్నతుడు అయ్యుండేవారు.అప్పుడు కథ వేరుగా ఉండేది. కధా సమయం యొక్క కాలమాన పరిస్థితులు, వ్యక్తుల మానసిక స్థితిగతులు, సంఘమర్యాదలు కూడా పరిగణనలోకి తీసుకుని ,రచయిత్రి కధలోని మలుపులను సృష్టించి ఉంటారు.
ఇకపోతే క్రిష్ణమాచార్య పాత్ర. ఒక పాత్రత ఉన్న కులంలో పుట్టి పాతకుడిలా ప్రవర్తించిన వ్యక్తి.బహుశా బ్రాహ్మణ కులానికున్న vulnerability రచయిత్రి వాడుకున్నట్టు అనిపించింది. ఏ కులమో తెలియని ఆండాళ్ళు ఔన్నత్యాన్ని,అగ్రకులస్థుడయిన క్రిష్ణమాచార్య దిగజారుడు తనంతో పోల్చడానికి ఆ పాత్ర సృష్టించినట్లు ఉన్నారు రచయిత్రి. స్త్రీ జారుడు మెట్లు మీద ప్రయాణమే చెయ్యకూడదు.చెయ్యడం మొదలు పెడితే...ఆమెది అధోగతే,పతనావస్థే. అక్కడ బ్రాహ్మణుడున్నా, మరొకరున్నా...అదే పరిస్థితి.
రచయిత్రి కధనాన్ని ఆద్యంతం చాలా ఆసక్తికరంగా కొనసాగించారు.డైరీలో పేజీలను నీలోత్పల మధ్యమధ్యలో తీసి చదవడం వలన,అక్కడక్కడా క్రోనలాజికల్ గా మనకు చిన్న అయోమయం ఉంటుంది.కానీ అంతలోనే మనకు అసలు విషయం అవగతం అవుతూ ఉంటుంది.డైరీలో ...తన మనోవ్యధను, భావోద్వేగాలను, ఆండాళ్ళు పట్ల ఎనలేని కృతజ్ఞతాభావాన్ని, భార్య వంచన పట్ల ఎగిసిపడిన దుఃఖావేశాన్నీ రామచంద్రరావు గారు రాసుకున్న తీరు హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
ఒక అర్ధశతాబ్దం క్రిందట... చాలా గ్రామీణ నేపధ్యం ఉన్న వ్యాపార కుటుంబాల్లో...మానవ సంబంధాల్లో నెలకొని ఉన్న అనిశ్చితిని... కథావస్తువు గా తీసుకుని,తన అనుభవజ్ఞతతో, అద్భుతమైన శైలి, నైపుణ్యం తో,ఒక పరిపూర్ణమైన కధను అందించిన తాతినేని వనజ గారు సదా ప్రశంసనీయులు, అభినందనీయులు. సహా రచయితగా ఈ కథను నేను విశ్లేషించడం గౌరంగా భావిస్తూ ..వనజ గారి అముద్రిత కథా సంపుటికి అభినందనలు తెలియజేస్తూ ..
ధన్యవాదాలతో
శశికళ ఓలేటి
టెన్నిసీ, యుఎస్ఏ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి