ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలోని “ఊహల మడుగు” కథ కు సహ రచయిత కవి డా. కాళ్లకూరి శైలజ గారి వ్యాఖ్యానం. ధన్యవాదాలు శైలజ గారూ… 🙏💐
ఊహల మడుగు
--------------------
కథా రచన రచయిత కు ఒక సవాలు. పాఠకునికి అనుభవం. తెలుగు భాషలో ఏడాదికి సుమారు లక్ష కథలు ముద్రణకు వస్తాయని ఒక అంచనా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు వార్తలు, విశేషాలు, సంఘటనలు....ఇవన్నీ చెప్పే నోటి నుంచి వినే చెవికి వెళ్లే లోపు జరిగేదంతా కథన ప్రక్రియే అనిపిస్తుంది. అందరం కథకులమే! కానీ కథా రచయిత ఇంకొంచెం పరిశ్రమ చేస్తాడు.బుల్లితెర మీద, దిన -మాస పత్రిక లలో, వందలాది కథల మైదానంలో పచ్చిక లా ఇబ్బడిముబ్బడిగా వస్తూ కొత్తదనం కోసం ఉవ్విళ్ళూరుతున్న రోజులివి. గమనిస్తే వీటిలో ఎలిమెంట్ ఆఫ్ సర్ ప్రైజ్ దిశగా ప్రయాణం జరుగుతోంది. పాఠకుల సంఖ్య కోసం,మార్కెట్ కోసం జరుగుతున్న ప్రక్రియలేమో అని ఒక సందేహం వస్తుంది కూడా.ప్రస్తుతం ఉన్న సాంకేతికత సహాయం తో విశ్వసాహిత్యంలో ఏ మూల ఏ రచయిత ఏ కొత్త ప్రయోగం చేసినా దాన్ని అందరూ త్వరగా అంది పుచ్చుకోగలుగుతున్నారు. పైగా గ్లోబలైజేషన్ వలన భావోద్వేగాలలో కూడా సామ్యం పెరిగింది.
ఇవన్నీ ఇలా ఉండగా సమాజంలో ప్రతి వ్యక్తి జీవితం తన చుట్టూఉన్న వారితో చేరువయ్యే ఒక దగ్గరితనం వచ్చింది.దీనికి సోషల్ మీడియా ఒక కారణమని చెప్పాలి. ప్రతివారికి భావప్రకటన స్వేచ్ఛ, తమలాంటి అభిరుచులు, ఆశలు, స్థితిగతులున్న వారు ఇంకా ఎవరున్నారో, వారిని గురించి తెలుసుకోవడం సాధ్యపడుతోంది. కొన్ని ప్రత్యేకమైన జీవిత గాథలు వెలికి వచ్చాయి.రచయితలు అట్లాంటి వారి మానసిక సంఘర్షణను కథగా మలచడం మొదలుపెట్టారు.
వనజ తాతినేని గారి "ఊహల మడుగు" అనే కథ చదవగానే నేను ఒక విశిష్టమైన పఠనానుభూతిని పొందాను.కథనం, పాత్రచిత్రణ ,కథలోని పరిసరాలు,సంఘటనల అల్లిక---- ఇవన్నీ శిశిర ఋతువులో నెమ్మదిగా లోకాన్ని రోజురోజూ అధికమౌతూ మంచు తెర ఆవరించినట్టు ,పాఠకుల మనస్సును కమ్ముకుంటాయి.
కథ ఒక సారి కాదు రెండు మూడు సార్లు చదివించుకుంటుంది.మొదటి సారి దిగ్భ్రాంతి తో కూడిన కన్ఫ్యూజన్ వస్తుంది.రెండవసారి వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి చదువుకుంటాం.
ఇక మూడోసారి రచయిత పక్కన నిలబడి బుద్దిగా,ఎరుకతో ప్రతి వాక్యాన్ని చదువుతాం .అలా అని కథలో సంక్లిష్టత లేదు.నిజం చెప్పాలంటే ఇది కథ కాదు.యథార్థ జీవితంలో ఇందులోని కథానాయిక తో పాటు మనం కూడా నడుస్తూ ఉంటాం.
కథానాయకురాలు పుట్టుకతో వచ్చే ఒక అవకారం తో పాటు, దివ్యాంగురాలు కావడం ఒకానొక జన్యుపరమైన డిఫెక్ట్, మరొక దురదృష్టకరమైన వైరస్ దాడి.
కారణాలు ఏవైనా ఫలితం అనుభవించేది మటుకు ఆ వ్యక్తి మాత్రమే కదా!
ప్రపంచంలో ఏ మూల చూసినా అటువంటి వారి పట్ల సహానుభూతి కన్నా,వారి నిత్య జీవన భారమే ఎక్కువ శాతం సమస్యలకు కారణమౌతుంది. దీనిని చాలా స్పష్టంగా ,సృజనాత్మకంగా 'డీల్" చేయడం రచయిత్రి యొక్క కథనంలో ఉన్న అభినివేశాన్ని తెలియజేస్తోంది.
'సర్రియలిజం' అంటే వాస్తవికత ,ఊహ పడుగు,పేక ల కలనేత గా ఉండడమని, మనందరికీ తెలుసు.
కొంచెం వివరాల్లోకి వెళ్దాం.మనం ఏ మాటలు పైకి చెప్తామో వాటికి రెండు రెట్లు స్వగతంలో అనుకుంటాం.ఎలా ప్రవర్తిస్తామో దానికి మరెన్నో రెట్లు అంతరంగంలో తర్జనభర్జనలు పడతాం.చాలాసార్లు పర్యవసానాన్ని గురించి ఆలోచించి,మన ప్రవర్తనను మార్పు చేసుకుంటూ ఉంటాం.అలా చేయగలిగితే పరిణితి సాధించినట్టే .
ఈ కథలోని కథానాయిక చేతన,
అంతశ్చేతన,ఉపచేతనల నడుమ ఊగిసలాడే భావ చిత్రాలను రచయిత్రి తర్కానికి లోబడి ఉంటూనే ఆశ్చర్యకరమైన విధానంలో వర్ణించారు.
అన్ని విధాల ఆరోగ్యవంతులైన మనుషుల్లో భావోద్వేగాలను ఒక సరళరేఖలో అమర్చినట్లయితే, దురహంకారం- ఆధిపత్య ధోరణి ఒకపక్క, ఆత్మన్యూనతా భావం- నిరసన వల్ల వచ్చే హింసాత్మక ధోరణి మరో పక్క ఉంటాయి.రచయిత్రి ఆ రెండో పక్కనున్న భావోద్వేగాలను స్పృశించడం ఈ కథలోని విశిష్టమైన అంశం.
ఈ తరహా కథలను విజయగాథలు గా చిత్రించే మోహం సర్వసాధారణం.చాలా సార్లు కథ ముప్పావు భాగం గడిచేసరికి కృషి ఫలితంగానో,అసంబద్ధంగానో, ఊహించని చోట నుంచి లభించే మంచితనం వల్లనో ఆ అభాగ్యులు కాస్తా భాగ్యవంతులైపోతారు.అంటే వారికి డబ్బొస్తుందని కాదు; జీవితం లో ఏమి కోల్పోయారో వాటన్నింటినీ పొందినట్టు చూపిస్తారు.వారిని అవహేళన చేసిన వారంతా తల దించుకుంటారు;ఒక్కోసారి సంపూర్ణ మానసిక పరివర్తన కూడా వచ్చేస్తుంది.
ఇది పాఠకుడికి, రచయితకు ఒక భద్రతా భావాన్ని ఇస్తుందేమో తప్ప , సత్యావిష్కరణ జరగదు.కృతకమైన సన్నివేశంగా మిగిలిపోతుంది. అలాంటిది వనజ గారు కథా శీర్షిక "ఊహల మడుగు"అంటూ హెచ్చరిస్తూ కథలోకి తీసుకెళతారు.
వాస్తవికత,కల ఈ రెండూ కానిదే ఊహ. ఊహ మెలకువలో జరుగుతుంది.ఒక్కోసారి అది కల్పనామయ జగత్తుగా మారి, ఆ వ్యక్తిని అబద్ధపు జీవన విధానం వైపు మళ్ళించే ప్రమాదం కూడా ఉండవచ్చు.కథలో ఈ తప్పిదం జరగకుండా, వనజ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించారనిపించింది.
ఊహను నాటకంలో,చలన చిత్రంలో అయితే చూపించడం సులభం.కాస్త blurred images
చూపటం వలన సాధ్యమవుతుంది.
కథల్లో ఊహకు ముందో వెనుకో, 'జరిగింది ఊహ' అని స్పష్టంగా తెలియజేయడం మనం ఇంత వరకూ చదివి ఉన్నాం.ఈ కథలో రచయిత్రి శైలి విభిన్నంగా ఉండడం వలన చదివిస్తుంది.ఇందుకు రచయిత్రి అభినందనీయురాలు.
అక్కడక్కడా కొన్ని categorical statements చేస్తూ,ఊహ ఏదో ,వాస్తవికత ఏదో అన్నది 'ట్రెజర్ హంట్' గేమ్ లోలా రచయిత్రి కొన్ని జాడలను విడిచిపెట్టారు.వీటిని అందిపుచ్చుకోవడమే పాఠకుడు చేయవలసిన పని.
ఉదాహరణకు,
1. “ ఆశ్చర్య పోతున్న వారితో ఇలా మాట్లాడాలని రిహార్సల్ వేసుకుంటున్నాను”.....
2.“అవమానించ బడ్డ మనసుకు ఊహ లైనా శాంతి కలిగించేవే కదా”.....
ఇవి పాఠకుడికి కథ మీద పట్టు సాధించడానికి వ్రాయబడ్డ వాక్యాలు.
కథలో వచ్చే సైకియాట్రిస్ట్ పాత్ర ఇచ్చే సలహాలు రెండో పట్టు.
ఇక తల్లికి,కథానాయికకు మధ్య ఉన్న అనుబంధం గురించి తప్పకుండా చెప్పుకోవాలి.దివ్యాంగురాలైన కూతుర్ని కన్న తల్లి--వరుసగా నిరాశ- నిస్పృహ- తప్పనిసరై భరించే తత్వం-దుఃఖం అనే దశల్లోంచి ప్రయాణించి, ప్రయాణించి చివరకు acceptance లోకి, ఆ తర్వాత ప్రేమ లోని అత్యంత పవిత్రమైన 'ఆప్యాయత' అనే ఆవరణలోకి ఎలా అడుగులు వేసిందో మనం కూడా ఆ ఉద్వేగాలన్నింటినీ అనుభవిస్తే తప్ప అర్థం కావు.ఈ కధలో అమ్మ ఒక శక్తివంతమైన ప్రతీక. ఆమెను ఆదర్శ మానవి (ideal humanbeing)అనుకోవచ్చు.
“అందరూ అమ్మలా ప్రేమను మాత్రమే పంచడం ఎంత బాగుంటుంది?”
ఈ వాక్యం తరువాత కధానాయిక తలపుల్లో మెదిలిన భావనను వనజ గారు అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు.ఆ వాక్యాన్ని పాఠకులు చదివినప్పుడు రచయిత ఉద్దేశ్యం ,గమ్యం,ఉత్తమాభిరుచి అవగాహన లోకి వస్తాయి.అంత గొప్ప వాక్యాన్ని మరి నేను కూడా వ్యాసంలో వ్రాసి తీరాలి కదా! ఈ వాక్యాన్ని వ్రాయడానికి ఎంతో గర్వంగా ఉంది.
“అప్పుడు నా ఆలోచనలు ఇంత భయంకరంగా ఉండవని అదో ఆశ”.
మళ్లీ కథనంతా చదవండి.నాతో మీరంతా ఏకీభవిస్తారని ఎదురు చూస్తూ ఉంటాను.
ఆఖరి పేరా లో కథానాయిక తన పేరు చెప్పింది.పాఠకుడు సరిగ్గా చదివితే అసలీ వాక్యం అవసరం లేదనిపిస్తుంది.ఎందుకంటే కథ ప్రారంభంలోనే
“అమ్మ నాన్న పెట్టిన పేరును సార్థకం చేసుకునే భాగ్యం”
అంటూ ఒక వాక్యం మనకు ఎదురౌతుంది.
ఒకవేళ కథ చదివే తొందరలో దాన్ని మిస్సయితే,రచయిత్రి మళ్లీ మనకు చెప్పారు.ఇప్పుడైనా చదువుకోవచ్చు.
మొత్తం మీద 'మానసిక విశ్లేషణ' అనే సాంప్రదాయకమైన పద్ధతిలో కాక, 'మనోధర్మాన్ని పరిశీలించడం" అనే కొత్త ప్రక్రియతో రచయిత కృతకృత్యురాలు అయ్యారు.
ఈ కథలో ఉన్న సంఘటనలన్నీ తర్కానికి నిలబడగల సంబంధ బాంధవ్యాలను కలిగి వుంటాయి.ఇది శుద్ధ ప్రామాణిక గణిత సూత్రంలా అనిపిస్తుంది.
మంచి కథను అందించిన వనజ తాతినేని గారికి హృదయపూర్వక మైన అభినందనలు.
కాళ్ళకూరి శైలజ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి