29, సెప్టెంబర్ 2013, ఆదివారం

నలుపందం

బి.బి జి పిక్స్.. నా ఫోటోగ్రఫీ ..


ఈ పోస్ట్ లో .. బ్లాగ్ వీక్షణల సంఖ్య... విశేషంగా... ఇదిగో ఇలా ..


27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

నామిని కథ

నామిని  గారి కథ .. ఒకటి ఈ రోజు చదివాను . కొన్ని తిట్లు కూడా ఈ కథలో ఎంత సహజంగా ఒదిగిపోయాయో,, చూడండి .

ఈ కథ నాకు నచ్చింది ..   "కడుపు కాల్చిన కన్న కూతురు"  ఈ కథలో కూతురు చనిపోతే కన్నతల్లి ఏడ్చిన ఏడుపుకి దేవుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్టు .. బాపు గారు వేసిన   చిత్రం బాగా నచ్చింది.    అందుకే ఇక్కడ  షేర్ చేస్తున్నాను .

కాపీ రైట్ చట్టం క్రింద  ఈ రచన ఇక్కడ ప్రచురణ చేయడంలో .ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి ..వెంటనే తొలగించగలను.

సాకం నాగరాజ సాకం సుధాకర్ గార్లు (తిరుపతి ) వారి మేనకోడలు తేజోవతి జ్ఞాపకార్ధం ప్రచురించిన పుస్తకం నుండి ఈ కథని సేకరించడమైనది .
  

26, సెప్టెంబర్ 2013, గురువారం

చెప్పుకోండి చూద్దాం ..

ఇదేమిటో చెప్పుకోండి చూద్దాం ..

పచ్చి జామకాయ ముక్కలు
పచ్చిమిరపకాయలు

అల్లం

చింతపండు

వెల్లుల్లి పాయలు
జీలకర్ర


 ఉప్పు


కొత్తిమీర తాళింపుతో   రెడీ టూ ఈట్ జామకాయ పచ్చడి

:)

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

ముకుళిత"ముకుళిత"  ఈ పేరు వినగానే  ఆసక్తిగా  చూసింది మాలతి

అమ్మాయి పేరు బావుంది. అమ్మాయి కూడా బావుంటుందా ? అధిక ఆసక్తి.
అవును, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. కాకపొతే కాస్త రంగు తక్కువ.మీకు నచ్చుతుందో లేదో ? సంశయం.

పేరెన్నికగల మాట్రిమోని వారితో యెదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు రావుగారు, ఆయన కూతురు మాలతి   

మీ మనుమడికి ముప్పై నాలుగేళ్ళు దాటుతున్నా కళ్యాణ ఘడియ తోసుకురావడం లేదన్న మీ బాధని  అర్ధం చేసుకోగలం . గత అయిదారేళ్ళుగా  యెన్ని  సంబంధాలు  మీ ముందు వుంచాం, ఒక్కరైనా మీకు నచ్చారా ? పసుపుని వస్త్రకాయం పట్టినట్లు  అమ్మాయిలని  వొడపోత పడుతున్నారాయే !  ఆమ్మాయి రంగు తక్కువ , కుదిరికలు అంత బాగోలేవు  మరి చెక్క బొమ్మలా ఉంది  అని వొంకలు పెట్టుకుంటూ పోతూ వుంటే ముదురు బెండకాయలా బ్రహ్మచారి ముదిరిపోతున్నాడు, కాస్త ఆలోచించడి రావు గారు. యెన్నోసంబంధాలు  కుదిర్చిన అనుభవంతో చెపుతున్నాను   ఇప్పటి అమ్మాయిలు చూస్తేనేమో ముప్పై యేళ్ళు దాటాయా? అంత  బాలా కుమారుడు మనకి జోడీ కాలేడులే అని యెగతాళిగా మాట్లాడుతూ నవ్వడం పరిపాటి అయిపొయింది .  అమ్మాయిల మాటలకి  మనసు చివుక్కుమంటున్నా వోర్చుకోక తప్పడంలేదు.  అదివరకటి కాలంకాదిది,  అమ్మాయిలని గుండెల పై బరువుగున్నారు, గంతకి తగ్గ బొంత లాంటి సంబంధం చూసేసి చటుక్కున పెళ్ళి చేసి పంపిద్దామని అమ్మాయిల తల్లిదండ్రులు అనుకోవడంలేదు. ఆమ్మాయిల చదువులు అటకెక్కటంలేదు  మగ పిల్లలతో సమానంగా చదివి సమానంగా ఉద్యోగాలు చేస్తూ  పెళ్ళి సవాల్ ని వొడుపుగా  విసిరి కావాల్సినదానిని చేజిక్కించుకుంటున్నారు . అబ్బాయిలేమో చదువుకుని అందంగా ఉండి ఉద్యోగం చేయనవసరం లేని అమ్మాయిల కోసం గాలిస్తున్నారు .  ఓ.మాదిరి చదువులు చదివి, గొప్ప అందగత్తెలు కాకున్నా కాస్త మధ్యరకంగా ఉన్నా సరే అమ్మాయిల  కలల వాకిళ్ళు  విదేశీ ద్వారంలో తెరుచుకోవాలని వుబలాటపడుతున్నారు . ఇలాంటివన్నీ మీరు అర్ధం చేసుకుని  యేదో వొక లోపం వున్నా సరిపెట్టుకోవాలి  అని వున్నమాటే చెప్పింది  లక్ష్మి.

ప్రక్కనే వున్నరావు గారి కూతురు  మాలతి కల్పించుకుని  "రంగు విషయంలో నాకు పెద్ద పట్టింపు లేదు మనమందరం   అనుకునే బంగారు రంగు కాంతులీను శరీరఛాయలో  అందం దాగి ఉండదు . మనం మన కళ్ళతో పాటు హృదయంతో కూడా చూడగల్గితే  అమ్మాయిల యొక్క  అందమంతా వారు  సంపాదించిన జ్ఞానం తాలూకూ వెలుగంతా కళ్ళలో కాంతులీనుతూ ఉంటుంది . వారి ఆత్మవిశ్వాసం అంతా వారి మాటల్లో  ప్రకటితమవుతుంది . వారి వివేకం అంతా బాహ్యంగా వారి కదలికలలో కనబడుతుంది వారి ఆలోచనా విధానమంతా స్పందించే తీరుని బట్టి అంచనా వేయవచ్చు. " అమ్మాయి చదువుకుందా ? వివేక వంతురాలేనా అన్నదే ముఖ్యమండీ" అని సైకాలజీ సబ్జక్ట్ చదువుకున్న మాలతి  చెప్పింది.

మాలతి గారి మాటలు విన్న లక్ష్మి తల పట్టుకుంది. అణువణువూ ఇంతగా పరిశీలించే వీరికి తగిన సంబంధం కుదర్చగలనా ? అనే అనుమానం  ఆమెకి  యెప్పటిలాగానే  కల్గింది . ఎలాగోలా ఈ పెళ్ళి కుదిరితే బావుండును. నాలుగు లక్షలు ఇస్తామన్న రావు గారి మాట తెగ ఊరిస్తుంది.మరి కొంత  డబ్బు వేసుకుని డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలి . తనకన్నా వెనుక మాట్రిమోని స్టార్ట్ చేసిన రాణి  ఎప్పటి నుండో  డైమండ్ నెక్లెస్ పెట్టుకుని తిరుగుతూ డాబు ప్రదర్శిస్తుంది అనుకుంది మనసులో.

  డైమండ్ నెక్లెస్ కళ్ళ ముందు మెదలగానే విషయం  తొందరగా ముందుకు జరపాలని తోచి  "అమ్మాయిని ముందుగా మీరు చూస్తారా? ఎక్కడికైనా గుడికి కాని పార్క్ కి కాని పిలిపించమంటారా ? "

ఆ అమ్మాయి ముందు మాకు  నచ్చి, తర్వాత అబ్బాయికి నచ్చితేనే వారితో విషయం మాట్లాడదాం . అప్పటి వరకు యే  విషయం వారికి చెప్పకుండా ఉండటమే మంచిది కండీషన్ చెప్పారు రావు గారు.

"అలాగే  రేపు శుక్రవారం అష్టమహా లక్ష్మి గుడికి  అమ్మాయిని పిలిపించుదాం . మీరు చూసి   యే  సంగతి చెపితే తర్వాత విషయం మాట్లాడుకోవచ్చు"   అంటూ తన ముందు ఉన్న ఫోన్ నంబర్ లిస్టు లో  ముకుళిత నాన్న నంబర్ ని వెతికి కాల్ చేసి విషయం చెప్పింది.   మీరు ఆరున్నరకి గుడి దగ్గరికి చేరుకోవాలి అని చెప్పి  చేతికి ఉన్న వాచ్ లో టైం చూసుకుంటూ లేచి నిలబడింది ఇంకా యెక్కువసేపు  అక్కడే వుంటే  మరిన్ని ప్రశ్నలు వేస్తారని ఆఫీస్ బయటకి నడచింది.

ఆమెతో పాటు బయటకి నడుస్తూ ఈ అమ్మాయైనా సంజయ్ కి నచ్చుతుందంటారా నాన్నగారు ..?

ఏమోనమ్మా ! వాడిష్టం .వీళ్ళు చెప్పినదాని ప్రకారం అమ్మాయికి ముప్పై ఏళ్ళు దాటాయి. ఎందుకని ఆ అమ్మాయికి యింకా  పెళ్ళి కాలేదో ? అనుమానం వెలిబుచ్చాడు .

మనలాగానే  ఆ అమ్మాయికి అనేక గొంతెమ్మ కోర్కెలు వున్నాయేమో యెవరు చూసారు ? మాలతి విసుక్కుంది
 మన  బంధువులలో సంజయ్ వయసున్న వారికి యేడెనిమిది యేళ్ళు వున్న పిల్లలు కూడా ఉన్నారు . వాళ్ళ దాకా ఎందుకు   వాడి కన్నా చిన్నది.మన రమ్య కి మాత్రం ఇద్దరు పిల్లలు పుట్టి చక్కగా స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు . ఒక్కగానొక్క కొడుకు విదేశాలకి వెళ్లి చదువుకుని అక్కడే  ఉద్యోగం చేసుకుంటున్నాడు . గుణవంతుడు ,వెనుక బోలెడంత ఆస్తిపాస్తులు  అయినా వాడికి కళ్యాణ ఘడియ రావడం లేదని నేను బాధపడుతుంటే మీరేమో వచ్చిన సంబంధాలన్నిటిని ఇలా వొంకలు  పెట్టి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది  అని వెళ్లి విసురుగా కారు లో కూర్చుంది.

పెళ్ళంటే మాటలా ?  నేనలా  అన్నీ  వివరంగా చూసి మీ ముగ్గురికి పెళ్ళిళ్ళు చేయబట్టే  మీరందరూ సుఖంగా సంతోషంగా వున్నారు  సమర్ధించుకున్నారు రావు గారు .

మర్నాడు సాయంత్రం "అష్ట మహా లక్ష్మి " గుడికి చేరుకున్నారు .

ముకుళిత , ఆమె తండ్రి కూడా వచ్చారు.  చామాన ఛాయకన్నా వొకింత  తక్కువ రంగుతో  విశాల నయనాలు, సంపెంగ లాంటి ముక్కు, గడ్డం క్రింద చిన్న నొక్కు , నవ్వకుండానే నవ్వినట్లు ఉండే  పెదవులు, చక్కని  జుట్టు  అయిదడుగుల ఆరంగుళాల  యెత్తులో పొందికగా వున్న ఆమెని చూడగానే మాలతికి బాగా నచ్చేసింది . తండ్రికి కూడా అదే విషయం చెప్పింది. రావు గారు కూడా అమ్మాయి రంగు తక్కువ అంటూనే వొప్పుకోక తప్పదు అన్నట్లు తల ఊపారు.
మాలతి  ముకుళితకి కొడుకు సంజయ్ వివరాలు అన్నీ చెప్పి సంజయ్  ఫోన్లో మాట్లాడాలంటే కాస్త  మొహమాట పడతాడు. అతనితో మాట్లాడాలనుకుంటే  ఫేస్ బుక్ లో చాట్ చేయవచ్చు అని సంజయ్  ఐడి ఇచ్చింది
 మీ ఇద్దరూ మాట్లాడుకుని త్వరలోనే మీ  అంగీకారం తెలిపితే  వెంటనే వివాహం చేయాలన్న కోరికని బయట పెట్టింది .  ఆమె ఆత్రుత ని అర్ధం చేసుకున్నట్లు చిన్నగా నవ్వింది ముకుళిత.

ఆ రోజు రాత్రి సంజయ్ కి తనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది ముకుళిత .

సంజయ్  ఆమె రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తూ  మీ పేరు చాలా బావుంది యెవరు పెట్టారు అడిగాడు ఆసక్తిగా .

"అమ్మ" చెప్పింది. ఓ..నాలుగైదు రోజుల పాటు చిన్న చిన్న సంభాషణలతో మొదలైన వారి  చాట్ సీరియస్ విషయాల వైపు మళ్ళింది

"పెళ్ళైన తర్వాత కూడా మీరు వుద్యోగం  చేయాలనుకుంటున్నారా ? "సంజయ్ ప్రశ్న

"నాకిష్టమైనంతకాల వుద్యోగం చేస్తూనే వుంటాను"

"ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నేను సంపాదిస్తున్నాను నా వెనుక బోలెడు ఆస్తి పాస్తులు ఉన్నాయి"

"ఉద్యోగం చేయాలనుకున్నది నా అభిరుచి కూడా అవుతుందని మీరెందుకు  అనుకోకూడదు"  ఆమె యెదురు  ప్రశ్న

"అవసరం లేనప్పుడు యెందుకు  శ్రమపడటం  ?"

"నా స్కిల్స్ అన్నీ సొసైటీకి వుపయోగపడాలి . సొసైటీకి వుపయోగపడనప్పుడు నా యీ చదువు నిరర్ధకం అవుతుంది కదా? " ఆమె వాదన వినిపించింది.
"ఇల్లు చక్కబెట్టుకోవడం, మంచి తల్లిగా ఉండటం గురించి కూడా ఆలోచించ వచ్చు కదా!" అతని మనసులోని కోరిక

"ఇలాంటి ప్రశ్నలు వేసి భార్య ఇంటికే పరిమితం కావాలని కోరుకోబట్టీ నేను ఇన్నాళ్ళు పెళ్ళికి అంగీకారం తెలుపలేదు . మీరు ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు.సారీ !  నన్ను అలా ఉండాలని   శాసించే వారిని నేను పెళ్ళి చేసుకోలేను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ఒకతను కూడా ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చాడు . నన్ను ప్రేమిస్తున్నాడు అనే భావన కన్నా నా వ్యక్తిత్వాన్ని  గౌరవించిన వారంటనే నేను ఎక్కువ ఇష్టపడతాను నా అంతగా నేను ఇష్టపడితే తప్ప ఒకరి భావాలని, ఆలోచనలని బలవంతంగా మోయలేను. బలవంతంగా నాపై రుద్దాలని ప్రయత్నించినప్పుడల్లా నేను నా చుట్టూ ఒక చట్రాన్నిబలంగా బిగించుకుంటాను లుక్ లైక్ టచ్ మి నాట్ .

వెరీ గుడ్ మీ పేరుకి అసలైన నిర్వచనంలా ఉంటారన్నమాట . నవ్వుతూ సంజయ్ కామెంట్ .

నా కొలీగ్ ఒకతను రెండేళ్ళు నన్ను వాచ్ చేసి చేసి నా ఇష్టాలు అయిష్టాలు తెలుసుకుని నాకు ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసుకుని  సరిగా అలాగే ప్రవర్తిస్తూ నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేసాడు అతనికి నా అందం తెలివితేటలు అన్నీ నచ్చాయేమో కానీ వాటితో పాటు  అతనికి నేను సంపాదించే డబ్బు కూడా చాలా అవసరం ఉద్యోగం తప్పకుండా చేయాల్సిందే అని చెప్పాడు. అతనికి నో చెప్పాను.  ఎవరో ఒకరులే  నన్ను ఇష్టపడితే చాలు పెళ్ళి చేసేసుకుని జీవితాంతం అతనిపై పడి బ్రతుకుదాము అనుకునే మనిషిని కాదు, అల్లాగే అతని ఆర్ధిక అవసరాలకి డబ్బు సంపాదించే యంత్రాన్ని కాదు.   అవసరాలకి ముసుగేసి ప్రేమ నటించే మనుషులంటే నాకు అసహ్యం . అలా అని అతనిని నేను ద్వేషించనూ లేదు.   అతనికి నో చెప్పాననే అక్కసుతో నా పై  అపవాదులేసి నేను అతను ప్రేమించుకున్నామని  వివాహం తర్వాత  అతను నన్ను ఉద్యోగం మానేయమని  చెప్పానని అందుకు నేను అంగీకరించలేదని  నా జీతం డబ్బు అంతా నా తల్లిదండ్రులకే ఇవ్వాలని షరతు పెట్టానని ప్రచారం చేసాడు  ఆమె గురించి అడగకుండానే చెప్పింది ..

అప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా ? అతని సందేహం

నేను ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాను. ఎవరైనా  నా అనుమతి లేకుండా నా నీడని కూడా తాకడం సాధ్యం కాని పని. నా తోటి బాటసారుల పట్ల అభావమే తప్ప అభద్రతా భావమే లేదు నిరభ్యంతరంగా మీ ముసుగులు తీసేసి నడవండి. వెలుతురులో తడవండి, ఈ పువ్వుల్లా నవ్వండి,నాలా ఉండండి అని చిన్న సందేశం ఇచ్చాను. ఆత్మ విశ్వాసం తొంగి చూసింది ఆమె మాటల్లో
ఇంతేనా .. మీ లేట్ మేరీడ్ వెనుక కారణాలు   యింకేమైనా వున్నాయా? అతని అనుమానాలు .

వచ్చిన ప్రతి సంబందానికి వొంకలు  పెట్టి పంపుతున్నానని యింట్లో వాళ్ళు కు కావాల్సిన వ్యక్తిని నేనే వెదుక్కునే ప్రయత్నం చేసాను అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. ఒకరిని ప్రేమించాననుకుని అపోహ పడ్డాను బహుశా అది ఆకర్షణ ఏమో ! . అతను ప్రేమిస్తున్నాడు అనుకుని భ్రమ పడ్డాను . అతనికి భార్య పిల్లలు ఉన్నారని తెలిసినప్పుడు షాక్ కొట్టినట్లై దూరం జరిగాను  ప్రేమ పైనే కాదు మనుషులపైనే నమ్మకం పోయింది చెప్పింది
 

మనుషులు అందరూ ఒకే విధంగా ఉండరు. మీలా ఆలోచించేవాళ్ళు ఉండవచ్చు అన్నాడు సంజయ్ .

నాలాంటివారు ఉంటారో లేదో నాకు తెలియదు . నేను ఇలాగే ఉంటాను నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయేమో కానీ నా గురించి నేను చెప్పినా నా గురించి ఇంకొకరు చెప్పినా ఇలాగే ఉంటుంది నా ప్రేమ లో పూర్తిగా ప్రేమే ఉంటుంది , నా ద్వేషం లోనూ ద్వేషమే ఉంటుంది. నాలో ద్వైదీ భావనలేవి ఉండవు. కలగా పులగమైన భావనలతో, అయోమయస్తితిలో, నాకు నేనే అర్ధం కాని స్థితిలో నేనుండను. నా గీత నేనే గీసుకుంటాను, నేగీసిన గీతని నేనే చేరిపేసుకుంటాను తప్ప వేరొకరికి ఆ అవకాశమే మిగల్చను గర్వంగా చెప్పుకుంది

"మీ గురించి చెప్పారు మరి నా గురించి అడగలేదు" అడిగాడతను

"నేను చెప్పిన మూడు విషయాలు మీకు అర్ధమైయితే నేను మీకు ఖచ్చితంగా  నచ్చనని నాకు తెలుసు . నచ్చనప్పుడు మీ గురించిన విషయాలు అడగడం అవసరం కాదు కదా !  అందుకే  ఈ ముకుళిత ముడుచుకునే ఉంటుంది వికసింపజేసే కిరణం తాకేవరకు" తెలివిగా చెప్పింది

మీరు నాకు నచ్చారు . ముఖ్యంగా మీ నిజాయితీ చాలా నచ్చింది నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఏమైనా అడగవచ్చు

అవసరం లేదు . మీ గురించి అంతా తెలుసుకున్నాకే .. ఇంకోసారి పెళ్ళి చూపులకి సిద్దమయ్యాను . పెళ్ళి అంటేనే ఒక  లైఫ్ టైమ్ కమిట్మెంట్,  పూర్తి నమ్మకం,  కొన్ని సర్దుబాటు ,  ఇరువురి మధ్య అవగాహన కావాల్సినవి ఇవే !

 "మీరు నాకు పూర్తిగా  నచ్చారు. నేను మీకు నచ్చినట్లేనా?" అడిగాడతను .


"పెళ్ళి తర్వాత నేను ఎలా ఉండాలన్నది మీరు చెప్పలేదు. అది స్పష్టంగా చెప్పాలి " అడిగింది .

"నేను మొదటే చెప్పాను కదా! హౌస్ వైఫ్ గా ఉంటె చాలు . " అతని కోరిక .

"సరే నండీ, ఆలోచించుకుని  మీ అమ్మ గారితో  నా నిర్ణయం చెపుతాను  bye.. అండీ .".గౌరవంగా చాట్ ముగించింది
"bye .. అండీ . సంతోషకరమైన వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను " చెప్పాడతను .

మరుసటి రోజు ఉదయాన్నే నిర్ణయం కోసం మరింత  సమయం వేచి ఉండనీయక ముకుళిత  మాలతికి ఫోన్ చేసింది .

"ముకుళిత  చెప్పు ! నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం .".అడిగింది మాలతి
"సారీ అండీ ..మీ అబ్బాయిని నేను పెళ్ళి చేసుకోవాలనుకోవడం లేదు " చెప్పింది . 

శుభ వార్త వస్తుందని ఆశించిన మాలతికి తీరని ఆశాభంగం ఎదురైంది .
 

"నా గురించి నేను వివరంగా చెప్పిన తర్వాత కూడా  నేను ఏ కాలేజ్ లో చదివాను, నా ఫ్రెండ్స్ ఎవరు? నేను ఏ కంపెనీలో ఎన్నాళ్ళు పనిచేసాను, ఎవరెవరు నాతో  సన్నిహితంగా మెలిగారు ? నా కాల్ లిస్టు లోఎవరు ఉన్నారు. ఇలాంటి విషయాలు ఎంక్వైరీ చేయించడం అంటే నాకు అసహ్యం పెళ్ళికి కావాల్సినది నమ్మకం . ఆ నమ్మకం లేకుండా నేను ఆ వివాహంలోకి అడుగుపెట్టలేను  ఈ కాలం అమ్మాయిలకి  పెళ్ళికి ముందు లవ్ అఫైర్స్ ఉండటం సాధారణం కావచ్చు . అందరూ అలాంటి అమ్మాయిలే ఉంటున్నారని అనుమానించడం, అవమానించడం కూడా తగదు " ఆవేశంగా చెప్పింది 

పెళ్ళికి ముందు మంచి-చెడు విషయాలు గురించి తెలుసుకోవడం  మంచిదని మా నాన్న గారు వివరాలు కనుక్కోమన్నారమ్మా! అదేమీ తప్పు కాదు కదా! సమర్ధించుకుంది.

"తప్పు కాదని మీరు అంటున్నారు కాని అది నాకు అవమానం అని నేను అనుకుంటున్నాను "

 . ఇటు నుండి మౌనం సమాధానం ..
 

మీ అబ్బాయికి ఉన్నత చదువులు  చదువుకుని, ఉద్యోగం చేయని  ఇల్లు దిద్దుకోగల అందమైన అమ్మాయి కావాలి. భర్త చదువు ఉద్యోగం , సంపాదించే డాలర్లు, ఆస్తిపాస్తులు అందచందం చూసి మురిసిపోయే అమాయకమైన అమ్మాయి అయితే మరీ మంచిది ..అది అతని కోరిక  నేను అలాంటి అమ్మాయిని కాదు కాబట్టి భర్త అనే తోడూ కోసం  ఉద్యోగం, తల్లిదండ్రులు, మాతృ దేశం  ఇవన్నీ వదిలేసుకుని అతనికి పూర్తిగా నచ్చిన విధంగా నేను మారలేను . నేనే కాదు, ఈ తరం ఆడపిల్లలేవరూ అంత వ్యక్తిత్వం ని చంపుకుని బ్రతకలేరు . వివాహం అనేది స్త్రీ పురుషులకి ఇద్దరికీ అవసరమే! కీవలం స్త్రీకి ఒక్కరికే అవసరం  అన్న అభిప్రాయం మార్చుకుంటే మంచిది. చెప్పి తనే లైన్ కట్ చేసింది 
ఈ సంబంధం కూడా చెడగొట్టుకున్నాడా ? తల పట్టుకుంది మాలతి

ఈ కాలం అమ్మాయిలూ ఎంత ఫాస్ట్ గా ఉన్నారు ?  ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ? ముకుళిత లాంటి అమ్మాయిలు  తమకేం కావాలో  తెలుసుకుని    మంచి  ఆలోచనా  ధోరణితో  ఎంత స్పష్టంగా  మాట్లాడుతున్నారు   వీళ్ళు  పెళ్ళి చేసుకుంటే అసలా పెళ్ళిళ్ళు సఫలం అవుతాయా? మగవాళ్ళ అహంకారం అడుగడుగునా తలెత్తి అణగద్రోక్కాలని  చూస్తుంటే  ఈ తరం అమ్మాయిలది ఆత్మ విశ్వాసమో, అతి విశ్వాసమో అర్ధం కాకుండా తయారయ్యారు.  అందుకే పెళ్ళైన  మూన్నాళ్ళకే  పెళ్ళిళ్ళు పెటాకులైపోతున్నాయి. ఇక వీడికి పెళ్ళి కావడం చాలా కష్టమేమో! వీడు ఆడపిల్లై పుట్టినా బాగుండేది అనుకుని దిగులుపడింది మాలతి.

23, సెప్టెంబర్ 2013, సోమవారం

దుఃఖ రహితం

దుఃఖం అనివార్యమైనది.

వాన బారిన ,  ప్రేమ బారిన, దుఃఖం బారిన పడకుండా ఎవరు ఉండలేరేమో !  దుఖానికి మూలకారణం స్పందించే హృదయం ఉన్నందు కేమో!

అసలు దుఃఖం  ఎందుకు వస్తుంది ?  ఒకోసారి  మనది కాని దుఃఖాన్ని  అనుభవిస్తాము  మనం అనుకున్నవి జరగనప్పుడు నిరాశ కల్గుతుంది అప్పుడే కాదు ఇంకెప్పుడు మనం అనుకున్నవి జరగవనే భయంతో కల్గిన  ఊహ కూడా దుఃఖాన్ని పుట్టిస్తుంది .

ఈ జీవితం చాలా చిన్నది . అందులో యవ్వన కాలం మరీ చిన్నది . యవ్వన కాలం లో లభించిన ఆనందం ద్వారానే మిగిలిన రెండు దశలు ఆనందకరంగా జరుగుతాయనీ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఏ పొత్తానికి  ఆ పొత్తం  దుఃఖ చాయలు అంత అంటకుండా జాగ్రత్త పడటమే మనకున్న మార్గం

దుఃఖానికి  హేతువు  కోరికలు ఉండటమే .. అని  గౌతమ బుద్దుడు చెపితే . కోరికలు లేకుండా మనిషి మనుగడ ఎలా సాగిస్తాడని మనకి సందేహం కలుగవచ్చు . అందుకే మితిమీరిన కోర్కెలు ఉండటం మూలంగా  అవి నెరవేరక దుఃఖాన్ని  అనుభవించిక తప్పని పరిస్థితి

దుఃఖ కడలిని యెద .న  దాచవచ్చు గాని  కనుల పొరలు నదులని ఆపతరమా?

కఠిన శిలలని ఒరుసుకుంటూ జలం ప్రవహించి  ప్రవహించి కడలిని చేరినట్లు ... వెలుగుకి చోటిస్తూ రేయి తానంతట తానే  తొలిగినట్లు ...

నిజమేదియో గ్రహించ గల శక్తి ఉన్నప్పుడు . దుఃఖం  మన దరికి చేరకుండా దూరంగా తొలగిపోతుంది .

దుఃఖాన్ని ఎన్నడూ   పంచని నవ్వులని  మాత్రమే పంచే  ఆప్తులని చూసినప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది

దుఃఖంలో నుండి  దుఖం లోకి జారిపోనివ్వకుండా అభయ ముద్ర నిచ్చి వారి  ముద్రలని దుఃఖ నీడన పడకుండా .. మనకి దిశా నిర్దేశం చేసే "గైడ్ " అవసరం ఉంటుంది కదా !

పార్దునికి కృష్ణుడు ఉన్నట్లు,  ఆమ్రపాలికి  బుద్ధుడు శరణ్యం అయినట్లు ...  మనకి ఆధ్యాత్మిక గురువులు అవసరం ఎంతైనా ఉంది. వారిని వెదుక్కుంటూ ... వెళుతూ .. తెలుసుకున్నవి  కొన్ని ...

ఈ జీవితమే ఒక నాటక రంగం ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు  రావటం మన చేతుల్లో లేదు పోవుట మన చేతుల్లో లేదు ..ఎవరి పాత్ర వారు నటించడమే !


19, సెప్టెంబర్ 2013, గురువారం

అనువుకాని వేళ

వయస్సుతో సంబంధం లేకుండా ఆడవారి పై జరిగే అత్యాచారాలని అరికట్టడం ఎవరి పని కావడంలేదు . ఆ అత్యాచారాలని అరికట్టడానికి ఎవరికీ వారు జాగ్రత్తలు తీసుకోవల్సినదే ! మొన్నెప్పుడో నేను ఆడవారికి లైసెన్స్ తుపాకీలు ఇవ్వాలి అప్పుడైయినా భయపడతారని వ్యాఖ్యానించాను . అది కూడా కరక్ట్ కాదు మహిళల చేతుల్లో ఉన్న తుపాకీలు లాక్కుని వారిపై అత్యాచారాలు చేసి చంపేసి పోతారు అని ఒకరు తిరిగి వ్యాఖ్యానించారు

అసలు పగలు రాత్రి తేడానే లేకుండా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయేటప్పుడు ఆడవాళ్ళని బయటకి వెళ్ళ కూడదు అని చెప్పడం కూడా సబబు కాదు ఎందుకంటే ఇల్లు పదిలం కాదని అనిపిస్తుంది కాబట్టి.

రెండేళ్ళ క్రితం ఒకసారి,నాలుగు నెలల క్రితం ఒకసారి .. అసలు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళడం గురించి కూడా ఆలోచించుకోవాలి అని అనుకున్నాను కూడా . చిన్నప్పటి నుండి నాతొ పాటు పెరిగి నా స్వభావం తెలిసిన మా చెల్లెలు కూడా నేను విపరీతంగా భయపడటం చూసి ఆశ్చర్యపోయింది .. తర్వాత నేను కూడా అనుకున్నాను అంత అభద్రతా భావం పనికిరాదేమో నేను అనవసరంగా భయపడుతున్నానని.

అలా భయపడటానికి గల కారణం చెపుతాను ..

రెండేళ్ళ క్రితం మా విజయవాడ పట్టణంలో  "తెలుగు సినిమా పాట -చరిత్ర " డా॥ పైడిపాల గారి పుస్తకావిష్కరణ జరిగింది .. ఆ సభకి ముఖ్య అతిధులుగా "ఎస్.పీబాలసుబ్రహ్మణ్యం " గారు ,"సిరివెన్నెల " గారు వస్తున్నారు , పైగా ఆ సభని నిర్వహిస్తున్నది "ఎక్సరే సాహితీ సంస్థ " కాబట్టి నేను తప్పకుండా వెళ్ళాలి . అంతకన్నా ఎక్కువగా నేను ఎంతగానో అభిమానించే ..."సిరివెన్నెల " గారిని స్వయంగా చూడటం ,మాట్లాడం అన్నది  చేజార్చుకోకూడదని ఆ సభకి వెళ్లాను ..

ఆ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  జరిగింది.  విజయవంతంగా సభ జరిగింది . నేను సిరివెన్నెల గారితో మాట్లాడి వారి "ఆటోగ్రాఫ్ " ని తీసుకున్నాను . అంతవరకూ సంతోషం. సభ పూర్తీ అయినది . ఎవరి దారి వారిది . ఆ రోజు నేను నా ద్విచక్రవాహనం ని బయటకి తీయలేదు . ఇంటి ముందు బస్ ఎక్కి,కళాక్షేత్రం ముందు బస్సు దిగవచ్చని .. హాయిగా బస్ ప్రయాణం చేసాను. అదే పొరబాటు అయిపొయింది. సభ ముగిసిన తర్వాత నేను బయటకి వచ్చి బస్ స్టాప్ లో నిలబడ్డాను ఎంత సేపటికి బస్ లు రావడం లేదు. ఎందుకో నాకు అర్ధం కాలేదు.అలాగే వేచి  చూస్తున్నాను . నా చుట్టూ పోకిరీవాళ్ళు పోగవుతున్నారు. పైకి దైర్యంగా ఉన్నా .. లోపల భయం . వెంటనే .. ఒకరి అడిగాను .. "ఏమండీ బస్ లు రావడం లేదు ఎందుకని ? అండర్ బ్రిడ్జ్ క్రింద పనులు జరుగుతున్నాయి " అటు బస్ లు  రావడం లేదు. మీరు బస్ స్టాండ్ కి వెళ్లి బస్ ఎక్కాల్సిందే " అని చెప్పారు . కాస్తంత దూరం నడిస్తే బస్ స్టాండ్ వచ్చేది కదా ! బుద్ది లేకుండా  ఇంత సేపు ఇక్కడ నిలబడి ఈ పోకిరీ వాళ్ళ బారిన పడ్డాను అనుకుని గబా గబా బస్ స్టాండ్ వైపుకి దారి తీశాను ఇద్దరు నా వెనుక ఫాలోఅవుతూనే ఉన్నారు . నా తోటీ ప్రయాణికులు అనుకున్నంత తేలికగా .. నేను పైకి దైర్యం కూడా గట్టుకుని .. బస్ స్టాండ్ వైపు వచ్చాను .

విజయ వాడ నగరంలో నడి బొడ్డున , పైగా కూత వేటు దూరంలో పోలీస్  కంట్రోల్ రూమ్,అక్కడే ఉన్న   బస్ స్టాప్ లో నిలబడ్డ ఆడవాళ్లకే రక్షణ లేకుండా ఉన్నప్పుడు ..  ఇక  మారుమూలల్లో ఆడవాళ్ళకి రక్షణ ఎలా ఉంటుంది ?

ఆ అనుభవంతో నేను చాలా భయపడి పోయాను .  రాత్రి వేళల్లో జరిగే సభలు సమావేశాలు లాంటి వాటికి వెళ్ళడం కి స్వస్తి చెప్పాను .

ఇలాంటి ఇబ్బందులు ఇవైతే  సాహితీ సభలు,సమావేశాలలో సంస్కారం ముసుగు వేసుకున్న వాళ్ళు   మరి కొందరు. నా ఫేస్ బుక్ ప్రెండ్ ఒకరు చెప్పారు . ఆమె రాజధాని నగరంలో ఒక విశ్వవిద్యాలయంలో వర్క్ చేసేవారు . ఆమెకి సాహిత్యం పట్ల చాలా ఆసక్తి . కవిత్వం వ్రాస్తారు . సభలు సమావేశాలకి తరచూ వెళుతూ ఉంటుంది . ఒక ప్రముఖ సాహితీ వేత్త .. ఆమెని "నాతొ లాంగ్ డ్రైవ్" కి రమ్మని పదే పదే  ఆహ్వానించడం,మొబైల్ కి అశ్లీల సంభాషణలు పంపడం మొదలెట్టేసరికి .. సభలకి వెళ్ళడం మానుకుంది. ఫోన్ నంబర్ మార్చుకుంది . ఇంట్లో భర్తకి చెపితే అవొక ఇబ్బందులు . నిన్ను నేను కవిత్వాలు,కథలు గట్రా వ్రాయమన్నానా !? సభలకి తిరగమన్నానా ..?   ఇల్లు వదిలేసి సభలకి సమావేశాలకి తిరిగితే ఇలాగే అంటాడే .. వాడేమిటి.. ప్రతి ఒక్కడు అలాగే అంటాడు " అని తిట్టి పోసాడు .

ఆమె ఆవిషయం చెప్పి కన్నీరు పెట్టుకున్నారు  ఆ విషయం అలా ఉంచితే .. ఇక నా రెండో అనుభవం గురించి

గత మే నెలలో మా బంధువుల అమ్మాయి పెళ్ళి జరిగింది మెహందీ పంక్షన్ కి మా కుటుంబం మొత్తం వెళ్లాం... అందరం ఆడవాళ్ళమే!   మెహందీ పంక్షన్ లో పాటలు,డాన్స్ , క్విజ్ కార్యక్రమం ఆస్వాదిస్తూ టైం పదిన్నర అయింది అన్న సంగతి చూసుకోలేదు. టైం చూసుకుని ఉలికి పడి ఎదో గబా గబా కతికి .. ఆ పంక్షన్ హాలు నుండి బయట పడ్డాము. వదిన ,మేనకోడలు ఒక వైపుకి వెళ్ళాలి, నేను చెల్లెలు ఒకవైపుకి రావాలి .. బస్ సౌకర్యం ఉంటె .. ఎవరూ వెహికిల్స్ అంటుకోము. (అదొక మాయ రోగం అని ఇంట్లో మగవాళ్ళు తిడతారు కాని భద్రత సమస్య అని అర్ధం చేసుకోరు )

మేము పంక్షన్ జరిగిన పెద్ద హోటల్ నుండి బయటకి వచ్చి కొంచెం దూరంలో ఉన్న బస్ స్టాప్ వైపు నడుస్తున్నాం. ఒక కారు మా వెనుకనే వస్తుంది మమ్మల్ని దాటి ముందుకు వెళ్లి ఆపి లిఫ్ట్ కావాలా అని అడిగాడతను. మేము పట్టించుకోకుండా .. ముందుకు నడవసాగాం . మళ్ళీ కారు మమ్మల్ని దాటి వెళ్లి ఆపి .. మాతో మాట్లాడటానికి ప్రయత్నించాడు . ఆ విషయం మా చెల్లెలు తో చెప్పాను . " మనకి తెలిసిన వాళ్ళు ఎవరైననేమో  అక్కా.. ఎందుకు అలా భయపడతావ్ !?  " అని చిరాకు పడింది . "లేదు మనకి తెలిసిన వాళ్ళు కాదు" అన్నాను . "మనం ఇంత మందిమి ఉన్నాం .. ఎవరేమి చేస్తారు .. నీకు అన్ని భయాలు ఎక్కువయ్యాయి "అని కోప్పడింది

వదిన వాళ్ళు వెళ్ళాల్సిన వైపు బస్ లే రావడం లేదు . ఆటో లో వెళ్ళండి అని మా చెల్లెలు ,వద్దని నేను అలా వాదన గడచి ఎలాగైతేనేమి బస్ వచ్చింది వాళ్ళు వెళ్ళారు .. "అమ్మయ్య " అనుకుని నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాను . మా చెల్లెలు నేను బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాను . తర్వాత మా చెల్లెలు అమ్మాయితో చెపుతుంది ." పెద్దమ్మ .. అదివరకటిలా కాదు విపరీతంగా భయపడుతుంది" అని  చెప్పి... నవ్వుతుంది

నా భయాలకి కారణం ఏమిటంటే .. ఆటో వాళ్ళు కూడా చాలా ప్రమాదకరంగా తయారయ్యారు ఒకసారి  వదిన, మేనకోడలిని తీసుకుని ఆటోలో వెళుతుంటే వాడు మెయిన్ రోడ్ ప్రయాణం వదిలి వేరే రూట్ల ద్వారా ఆటో నడిపాడని భయ పడింది వదిన .   అల్లాగే నా ఫ్రెండ్ ఒకరు హాండ్ ప్రింట్స్, బాతిక్ యూనిట్ నడుపుతూ ఉంటారు . విజయవాడలో అంతగా ఆర్డర్స్ లేవని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు ఇద్దరు ఆడపిల్లలు . వారి చదువులు కూడా అక్కడే !  చాలా కష్ట జీవి. ఆమె ఆర్డర్స్ కోసం హైదరాబాద్ లో చాలా లోపలి ప్రాంతాల లోకి కూడా వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకునే వారు. ఆమె బస్ ప్రయాణమే చేసేవారు . సిటీ అవుట్ స్కర్ట్స్  బస్ స్తాపులలో నిలబడి ఉన్నప్పుడు అంతే..  ప్రక్కనే కారు ఆపి డోర్ తీసి నిలబడే వారట. అలాంటి రెండు మూడు సంఘటనల తర్వాత ఆమె భయపడి పోయి .. పిల్లలని కాలేజ్ హాస్టల్ లో జాయిన్ చేసి  మళ్ళీ విజయవాడకి వచ్చేసారు . " ఆడవాళ్ళు నిజాయితీగా బ్రతకడం చాలా కష్టమండి . హైదరాబాద్ అంటేనే భయం వేసింది " అంటారు ఆమె. ఇలా నా చుట్టూ ప్రక్కల వారి అనుభవాలు .., మన చుట్టూరా జరుగుతున్నా సంఘటనలు చూస్తుంటే .. ఎంతో దైర్యవంతురాలినైన నేను ఉలికిపడుతూ ఉంటానన్నది నిజం .

అసలు ఈ విపరీత దోరణులకి కారణం ఏమిటి ? కనిపించిన ప్రతి ఆడవారిని  తుచ్చంగా చూసే సంస్కృతీ పెరగడానికి కారణం ఏమిటీ!? ఎటువైపుకి వెళుతున్నాం మనం ..? బాహ్య ప్రపంచంలోకి వెళ్ళకుండా ఎలా ఉండగలరు ? ఎవరి పనులు, ఎవరి ఉద్యోగాలు వారివి . ప్రతి ఒక్కరికి బ్రతుకు పోరాటం, ఒంటరిగా ప్రయాణించక తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి.  కనిపించిన ప్రతి వారిని కాముక దృష్టితో చూసే ఈ మాయదారి లోకంలో ఎలా బ్రతకడం ?

నేనైతే ఆడపిల్లలని పదే పదే హెచ్చరిస్తూనే ఉంటాను. "వాడికి ఏం పోయిందో ,నాకు అదే పోయింది " అని అనుకుని సరిపెట్టుకుని బ్రతకగల విశాల దృక్పథం మన భారతీయ స్త్రీలలో రాదు, రాదు గాక రాదు. అలా వచ్చిన రోజున ఇన్ని అత్యాచారాల కేసులు పోలీస్ రికార్డ్ లలో నమోదు కావు , దిన పత్రికల నిత్య వార్తలకి బలి అవవు.

 "అత్యాచారం అన్నది భౌతిక, మానసిక దాడి"  మానసికంగా మనం దృడంగా ఉండగల్గిన పెంపకాలలో పెరగడం లేదు. అనుక్షణం అభద్రతాభావంలో, సమాజం లో నలుగురు ఏమనుకుంటున్నారో అని భయపడుతూ నలుగురి మధ్య  మధ్య తరగతి మందహాసంతో పళ్ళ బిగువునా అన్నీ భరిస్తూ .. బ్రతికే మనుషులం . ఖచ్చితంగా చెప్పాలంటే .. భారతీయ సంస్కృతిని నరం నరం జీర్ణించుకుని శారీరక పవిత్రతని కాపాడు కోవాలనుకునే ఆలోచనలు కల్గిన స్త్రీ జాతి వారసులం " అందుకే .. అనువుకాని వేళ బయట తిరగకండి " అని చెపుతాను.

చదువుంది, ఉద్యోగం ఉంది , సమాన హక్కులు ఉన్నాయి, మా వస్త్రధారణ  మా ఇష్టం  అనుకుని భ్రమపడి  మృగాల బారిన పడకండి. మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పు కాదు కదా!

ఇలా నేను ఎదుర్కొన్న రెండు సమస్యల వల్ల ఒంటరిగా బయటకి వెళ్ళడం అంటేనే ఆలోచించే స్థితికి వచ్చేసాను . 45 ఏళ్ళు దాటిన నేనే ఇలాంటి పరిస్థితులని చూస్తే .. ఇక యువతుల సంగతి ఏమిటీ?
వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ! ముఖ్యంగా తల్లులకి చెప్పేది ఏమిటంటే .. వాళ్ళే తమ  బిడ్డలని కాపాడుకోవాలి తప్పదు

అత్యాచారాలకి  బలి కాకుండా ఉండాలంటే ..  సాధ్యమైనంత వరకు ఒంటరిగా వెళ్ళడం మానేయాలి అని చెపుతున్నాను

.     

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

శిక్షా ఓ హెచ్చరిక

ఉరిశిక్షలు అత్యాచారాలని నిలుపు చేస్తాయా..?  ఇంకా జరుగుతూనే ఉన్నాయి .  అంటూ క్రొత్తగా కొందరు ఉరి శిక్షల్ని వ్యతిరేకిస్తూ ..నిరసన తెలియజేస్తున్నారు. డిల్లీ లో జరిగిన రేప్ నిందితులకి  శిక్ష అమలుపరచడాన్ని నేను హర్షిస్తాను . ఇలాంటి అత్యాచారాలు జరగకుండా చేయాలంటే  అందుకు మనం ఏంచేయాలి ..  అందరికి భాద్యత ఉంది కదా .. !.

అత్యాచారాల భారతం .. లో ఎవరి తప్పు ఎంత ? సినిమాలు,మీడియా or అతి తేలికగా లభిస్తున్న దృశ్య మాధ్యమ అశ్లీల చిత్రాలు

వీటి నిరోధం కోసం ఎలాంటి చట్టాలు ఉన్నాయి ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి ? సామాన్యుడికి అనేక సందేహాలు. సామాజిక అవగాహన పేరిట మీడియా అత్యాచారాల నిరోదానికి దోహదం చేస్తుందా ? ఇంకా ప్రేరేపిస్తుందా?

ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలని పంచుకోండి ..

అలాగే నా బ్లాగ్ లో అదివరకు పోస్ట్ చేసిన  ఈ పోస్ట్ చూడండి .


http://vanajavanamali.blogspot.in/2011/06/blog-post_17.html

నేరం ఎవరు చేసినా శిక్షించడంలో జాలి,సానుభూతి ఉండకూడదు . క్షమించడం అంత తేలిక కాదు . నేర నిరోదానికి  శిక్షా   ఓ  హెచ్చరిక కూడా ..  

16, సెప్టెంబర్ 2013, సోమవారం

జగ్గయ్యపేట రంగు రాళ్ళు చాలమ్మా ! .

ప్రతి రోజూ మెయిల్ బాక్స్ చెక్  చేసుకునేటప్పుడు.. నవ్వుకొవాలో, ఏడవాలో, జాలి పడాలో తెలియని పరిస్థితి.  .

నేను .. మెయిల్ బాక్స్ ఓపెన్ చేసానా .. ఇదిగో.. ఇలా ఉంటాయి విద్యుల్లేఖలు ..

"వనజా  ఐ యాం ఆనంద్  29  ఫ్రం బెంగళూరు, మ్యూజిక్ లవర్ , డు   యు మేరీ  మీ .."  మెయిల్ ఓపెన్ చేయకుండానే పైన కనబడుతూఉంటుంది .  వెంటనే గుండె గుబేల్  మంటుంది కానీ  కొంచెం సేపటిలోనే  తేరుకుని

నేనిలా అనుకుంటాను.." నీ బొంద, నా  కొడుకుకి  ఇంకో మూడేళ్ళు ఉంటే  నీ అంత వయసు ఉంటుంది . నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటిరా ? ఏదో రాంగ్ ID  కి పంపినట్టున్నావ్ ! పనిచూసుకో .. వెళ్ళ  వయ్యా వెళ్ళు  వెళ్ళూ." డిలీట్ బాక్స్ లోకి పంపేస్తాను.

మళ్ళీ తెల్లవారే .." వనజా ఐ వాంట్ సి యు ప్లీజ్ ! డు  యు మేరీ  మీ" ఇలా ఉన్న మెయిల్ చూసి చిరాకు వచ్చేస్తుంది .

"ఒరేయ్ నీకు  ఒకసారి చెపితే అర్ధం కాదా ! వెర్రి ముండా  కొడకా .. నీకేమన్నా పైత్యమంటరా ? ఒకే పాటలు ఇష్టపడినంత మాత్రాన  పెళ్ళిళ్ళు  చేసేసుకుంటారటరా!?  ఇప్పుడు నిజంగా నాముందుకు వస్తే పీలర్ తో తోలు తీసి ఉప్పు, కారంలో పొర్లించి మరీ...  బెంగుళూరుకి ప్లైట్ ఎక్కిస్తా .. ముందు నా ముందుకు రారా చూద్ద్దాం ".. అంటూ  మళ్ళీ డిలీట్ బాక్స్ లోకి పంపేస్తాను.

ఆ పైనే .. నీకు  ఈ రోజు మంచి అవకాశం  కలసి వస్తుంది ..కావాలంటే . మీ  జాతకం లోఈ రోజు ఏం జరుగుతుందో  ఇక్కడ చూసుకోండి  అంటాడు .Horoscop  free  వాడు .

"నా జాతకం వద్దు, నీ పిండా కూడు వద్దు .. పోరా బాబు పో .. నీ దారి నువ్వే చూసుకోరా" అని వాడిని బలవంతంగా డిలీట్  బాక్స్ లోకి పంపుతాను

ఇంకొకటి ..  "వనజా!  మీరు సామ్సంగ్ గెలాక్సీ   ఫోన్ గెలుచుకున్నారు 664 రూపాయలకే ".అంటాడు ఇంకొకడు .

సామ్సంగ్ గెలాక్సీ .. ఆ .. నాకొద్దు .. నా iphone 5 ఉంది ముద్దు ముద్దుగా .. నువ్వు ఫ్రీగా ఇస్తానన్నా నాకొద్దు పోవయ్యా.. అంటూ గిరాటు వేసినట్లు .. వాడిని  డిలీట్  బాక్స్ లోకి పంపుతాను

 కేవలం వెయ్యి రూపాయలకే మీరు  యెన్ఐఐటి సర్టిఫికేట్ పొందవచ్చు వివరాలకు సంప్రదించండి  అని మెయిల్ లో కనబడి మూర్చపోయాను . ఓర్ని! ఇంత  సులభమైన  పద్దతిలో  యెన్ఐటి పూర్తయిపోతుంటే మన ఆంద్ర వాళ్ళు కిండర్ గార్డెన్ స్కూల్ దగ్గరనుండే ఐ ఐ టి కోచింగ్ కోసం కార్పోరేట్ స్కూల్స్ కి,  కాలేజ్ లకి లక్షలు లక్షలు ఖర్చుపెట్టేవాళ్ళు కదా ! తెలియక  వారికి ఎంతన్యాయం జరిగిపోయింది . ఇవాళ కనీసం ఒక వందమంది పేరెంట్స్ కైనా..  ఈ విషయం తెలియజేయాలని కంకణం కట్టుకున్నాను .
 ఇక తరువాత  మెయిల్ చూస్తే .. "వనజా ! మీకు కేవలం  150 రూపాయల ప్యాక్ తో  ఐ  బ్రోస్ , పేషియల్ , పెడిక్యూర్, మేనిక్యూర్, బాడీ వాక్స్ అన్నీ ఇస్తాం. మా పార్లర్ కి ఒకసారి  విజిట్ చేయండి " .. అంటూ ఉంటుంది

ఓర్ని ! ఇంత ఛీఫ్ .ఆఆఆఆఆఆఅ    మొన్నీమధ్య నా హెయిర్ స్టైల్ ట్రిమ్  చేయించుకుంటేనే  650 దొబ్బేసారే ! ఎంత మోసం అనుకుంటూనే .. ఓహో .అర్ధమయిందిలే !  పంక్షన్స్  సీజన్ అయిపోయిందిగా తల్లీ .. ఈగలు తోలుకుంటున్నారా .. అనుకుంటూనే  .. నాకు ఇలాంటివి అలవాటు లేదండి.. నేనంత నాగరికం కాదులే! పూర్ విల్లెజ్ వుమెన్ ని...  అంటూ  వారిని సాగనంపేస్తాను

మీ హాస్పిటల్ బిల్ల్స్ ఎవరు  పే చేస్తారు?  అంటూ అడుగుతారు...   ఇంకొకరు  

 మీకు పుణ్యం ఉంటుంది అదేదేదో మీరు" పే"  చేసేయండి . చాలా రోజుల నుండి టోటల్ హెల్త్  చెకప్ చేయించుకోవాలి అనుకుంటున్నా,, అంటూ .. వారిని పంపేస్తాను

"బెస్ట్ ఇన్స్యూరెన్స్ పాలసీ చేయమంటారా? .. అంటారు ఇంకొకరు

అబ్బే ! అవసరం లేదండి ..కోట్ల  రూపాయలు ఆస్తులు ఉన్నా..చాలా మందికి లాగానే  మాకు రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డ్ ఉందండీ ..  మాకు ఆ కార్డ్  ఉన్నదన్నమాట మీకు తెలిసినట్లులేదు.   మీతో నాకవసరం లేదండీ .. వెళ్లి రండి .. అంటూ మర్యాదగానే పంపిస్తాను .

డాలర్ రేట్ ఎక్కువైతే ఏమిటండి ? మా ట్రావెల్  పాక్ తీసుకోండి ..ఎంజాయ్ చేసి రండి హాట్ హాట్ బిల్స్ తర్వాత  మేమిస్తాం అంటాడు ట్రావెల్  హాట్ వాడు .

 ఇంత వరకు ప్రక్కనే ఉన్న పాపికొండలు చూడటానికే వెళ్ళలేదు .. మా రూపాయి అంత  ఎత్తు ఎగరదులే బాబు .. ఇంకో జంటని వెతుక్కొ.. అంటూ వాడిని బలవంతంగా డిలీట్ బాక్స్ లోకి  తోసేస్తాను

"వనజా .గెట్  మేరీడ్ అగైన్ ?" రెండవ పెళ్ళిళ్ళు చేసే ఓ  వివాహబంధ డాట్ కమ్ .. వాడు అడుగుతున్నాడు

ఒక్కసారి పెళ్ళి  చేసుకోవడానికే  చాలా  కష్టంగా మా అత్తారింటి వాళ్ళ మెడలు ఒంచేసా .. మళ్ళీ రెండో సారి పెళ్ళా ! మొన్నేగా  "స్వాతి వాళ్ళ అమ్మ"  పెళ్లి గురించి  "సారంగ " లో చెప్పించా.. ఆ కథ నేనే వ్రాసానని నీకు తెలియదా .. బుద్దిలేని వెదవ .. రెండో పెళ్లి అంట రెండో పెళ్లి... అంటూ  తిడుతూనే..

 మా వారికి ఫోన్ చేసి "ఏమండీ! వీడెవడో నన్ను రెండవ  పెళ్లి చేసుకుంటావా ? అని అడుగుతున్నాడండి ! ఏం  చెప్పమంటారు ? అని అడిగాను . అందుకు ఆయన ఇలా చెప్పేరు "నేనన్నా కొన  ప్రాణంతో  మిగిలిఉన్నాను ..వాడికి  బతుకు మీద ఆశ లేకపోతే .. ఇప్పుడే చేసుకోమనవే! నేను వెంటనే విడాకులిచ్చేస్తా ! అని  ..

ఇదిగో.. మా వారి మాటలు విన్నావా..? వెనక్కి తిరక్కుండా పరిగెత్తు ...అంటూ వాడిని పంపించాను .

అమ్మయ్య ! ఇవాల్టికి  ఇక్కడ పిల్టర్  అయిపొయిందికాబట్టి  అవసరమయినవి చూసుకుందాం .. అని పనిలో మునిగిపోయాను

ఇంతలో లాండ్ లైన్ మ్రోగింది . అబ్బా.. ఇప్పుడు అక్కడి వెళ్ళాలంటే ఈ సిస్టం ముందు నుండి లేవాలి . లేచి వెళ్ళేటప్పటికి రింగ్ ఆగిపోతే కాల్  బాక్ చేయాలి .  ఎవరైనా సోది వేస్తారు వాళ్ళ బిల్ కాదుగా...  అనుకుంటూ మోకాలు నొప్పి కలుక్కు మంటున్నా .. గబా గబా వెళ్లి రిసీవర్ తీశాను . ఎవరో అపరిచితురాలు .

మేడం .. కాంతి ఎంటర్ ప్రైజెస్  నుంచి కాల్ చేస్తున్నాం . మీ ఫోన్ నంబర్ లక్కీ నంబర్ గా  సెలెక్ట్ అయింది . నాలుగు చిమ్నీస్  ఉన్న   గ్యాస్ స్టవ్  600 రూపాయలకే ఇస్తున్నాం . మీ  ఇంటి అడ్రస్ ఇస్తే డోర్ డెలివరీ ఇస్తాం అడ్రెస్స్ చెప్పండి మేడం .. చాలా మర్యాదగా అడిగింది.

ఏమ్మా .. ఫోన్ నంబర్ ఇచ్చిన టెలీఫోన్  డైరక్టరీ ఇంటి నంబర్ ఇవ్వలేదా తల్లీ  అని మనసులో అనుకుని ..  వద్దమ్మా ! రెండు చిమ్నీలు ఉన్న స్టవ్ పైనే గిర గిర గంట లోపలే వంట చేసి పడే స్తున్నా... నువ్వు నాలుగు పొయ్యిల స్టవ్ తెచ్చి పెడితే అరగంటలో వంట చేసి అక్కడ పడేసి .. ఫేస్ బుక్  లో కూర్చుంటా .. మా ఆయన తిట్లు నుండి కాస్త నన్ను బ్రతకనీ తల్లీ! అంటూ ఫోన్  పెట్టి పడేసాను .

మళ్ళీ ఇలా ఫేస్ బుక్ ముందు కూర్చున్నానా .. మొబైల్ రింగ్ అయింది . ఎవరిదో .. ఈ కొత్త నంబర్ !!??
అనుకుంటూ .. హలో .. అన్నానా ..!!

మేడమ్ .... ఈ మొబైల్ నంబర్  మీదేనా అండీ?  అడిగింది . అవునండీ ..  తొమ్మిదేళ్ళ  నుండి అచ్చంగా నాదేనూ  . మీకేమిటి సందేహం?  అన్నాను .

మీరు చాలా లక్కీ మేడం ! .. హైదరాబాద్ భాగమతి పెరల్స్ వారు .. లక్కీ డీప్  తీస్తే మీ నంబర్ సెలక్ట్ అయింది . మా షాప్ వార్షి కోత్సవం  సందర్భంగా మీకు నలబై వేల రూపాయలు విలువ చేసే ముత్యాల హారం కేవలం 3,300 రూపాయలకే వస్తుంది . మీ అడ్రెస్స్ చెపితే మీకు వి.పి.పి లో పంపబడుతుంది మీరు ఆ డబ్బు కట్టి తీసుకొవచ్చు . అని చెప్పింది .

మా బంగారు తల్లే! మీ తెలంగాణా వారిది  ఎంత ఉదార హృదయం . నేను సీమాంధ్రా మనిషినని తెలియక.. నాకు బహుమానంగా   ముత్యాల హారం  ఇస్తున్నారు కానీ,  ముత్యాలు నా ఒంటికి సరిపడవు తల్లీ! మా జగ్గయ్యపేట రంగు రాళ్ళు చాలమ్మా  . నాకు "  అంటూ ఫోన్ కట్ చేసాను .

నేను ఎంత మూర్ఖురాలినో కదండీ! ఎన్ని ఆఫర్లు .. ప్చ్ .. ఒక్కటన్నా ఉపయోగించుకోవడం రావడం లేదు అనుకుంటున్నాను .

మావారు అప్పుడప్పుడూ అంటూ ఉండేవారు .. "తింగరి బుచ్చి" అని

నిజమేనేమో.. అనుకుంటున్నారా ! ఇలాంటి వెధవ ట్రిక్  లకి పడిపోవడానికి .. నేనేమన్నా .."ఒట్టి  వనజ " అనుకుంటున్నారేమో .. హా.. నేను  బ్లాగర్ "వనజ వనమాలి " అని తెలియదు కాబోలు . :) :)

(రోజూ  అనేక రకాల మార్కెటింగ్ మాయాజాలం కి గురి కాకుండా, బలి కాకుండా   ఉండటం చాలా కష్టం సుమీ !అనుకుంటూ సరదాగా ఈ పోస్ట్ .. హాయిగా నవ్వేసుకోండి నచ్చితే నాలుగు అక్షింతలు వేయండి)
.


14, సెప్టెంబర్ 2013, శనివారం

ఎల్లమ్మ తల్లి సత్తెం


నూనె కుండ 
సత్య ప్రమాణం     ఈ కథ ఇంతకూ ముందు రెండు భాగాలు ఈ లింక్ లలో

దట్టంగా మబ్బులు కమ్ముకొచ్చాయి .. గాలి వాన మొదలయింది .. నూనె కుండ కింద పొయ్యి ఆరి పోయింది ..  పంచాయితీకి వచ్చినాల్లందరూ చెట్ల కిందకి పోయారు  నేను వానలో తడుస్తూనే గుడి చుట్టూ తిరుగుతానే ఉండాను .. కాసేపటికి ఏమైందో తెలియదు .. నేను కళ్ళు తిరిగి పడిపోయాను .

కళ్ళు తెరిచి చూసేసరికి .. మబ్బులు ఎట్టా పోయ్యాయో! కళ్ళల్లో చురుక్కుమని సూరీడు గుచ్చుతున్నాడు . నీరసంగా కళ్ళు తెరిచాను.

మా అమ్మ చెప్తా ఉంది .. నూనె కుండ పంచాయితీ తప్పి పోయిందంట " ఎల్లమ్మ తల్లి సత్తెం కలది అందుకే నూనె  కుండ క్రింద పొయ్యి కూడా చిత్రంగా ఆరిపోయింది . ఇక నూనె కుండలో చెయ్యి పెట్టె పనే లేదు .. నీ పెళ్ళాం ఏ తప్పు చేయలేదని  ఋజువైనట్టే! పంచాయితీ అయిపొయింది అన్నాలు వొండుకుని తిని  ఇక ఇళ్ళకి బోటమే!  " అని పంచాయితీ చెప్పారని సంతోషంగా చెప్పింది .

అట్టా. నేను నూనె కుండలో చెయ్యి పెట్టకుండా తల్లి కాపాడిందని  నేను ఏ తప్పు చేయలేదని చెపుతా ఉంటారు .  నేను ఆ ముక్కే నోరు చించుకుని చెప్పినా ఇనలేదు, ఏడ్చి చెప్పినా ఇనలేదు. నూనె కుండలో చెయ్యి పెట్టాల్సిందే అన్నారు . ఆ తర్వాతయినా మా ఆయనలో అనుమానం జబ్బు పోలేదు .  ఆ వూరిడిచి వచ్చేసాము. ఈ బెజవాడ చుట్టుపక్కల బతుకుతున్నాం , ఇంటోనుండి కాలు బయటకి పెడితే చాలు "ఎవడ్ని ఉంచుకున్నావే ... "(అభ్యంతర పదం) తో .. తిడతా ఉంటాడు. ముగ్గురి బిడ్డలని కన్నా  ఏళ్ళతరబడి అన్నం తిన్నట్టు తిట్లు తింటానే ఉండాను. శుభ్రంగా గుడ్డ కట్టుకోనీయడు,పూలు బెట్టనీయడు, నలుగురితో మాట్టాడనీయాడు. కాలు చెయ్యి ఆడక పదేళ్ళు అయ్యింది . ఏ పని చేయకుండా తిరుగుతున్నా .  పాచి పని చేసి పసి బిడ్డని సాకుతున్నట్టు సాకుతున్నా.. ఇప్పుడు .. తిడతానే ఉంటాడు..  ఆ తిట్లు తిని తిని ఇట్టా అయిపోయా అంటూ చెప్పింది. సన్నగా కట్టేబారిపోయి ఉన్న ఆమెని చూస్తూ జాలిపడ్డాడు రమేష్.

నీకెన్నేళ్ళు అవ్వా.. అడిగాడు అరవయ్యి ఉంటాయయ్యా..  ఈ కళ్ళతో ఎన్నో చూసా.. చెప్పుకుంటే బోలెడు కథలు అంది

 అది సరే ఆ తర్వాత నీకు తెలిసీ ఎవరన్నా .. ఇట్లాంటి పరీక్ష లో నూనె కుండలో చేయి పెట్టారా ? రమేష్ అడుగుతున్నాడు సుబ్బమ్మని.

మా కులంలో మొగుడు అనుమానిత్తే అట్టా నూనె కుండలో చేయి పెట్టి నిరూపించుకోవాల్సినదేనయ్యా .. ఇద్దరు ముగ్గురు కాలి నయం గాక చచ్చిపోయారు . కొంత మందేమో చేయి పెట్టడానికి భయపడి తప్పు చేయకపోయినా చేసామని ఒప్పుకుని డబ్బు కట్టి మొగుడ్ని వదిలేసుకుని ఎల్లిపోతారు మొగుడు నిందేస్తే.. ఆడదాని జీయితం అయిపోయినట్టేనయ్యా! అందుకే మాలో ఆడైనా, మగైనా  మారు మనువులు జాస్తి . అని చెప్పి

దొరసాని .. నేను పోయోస్తా.. రేపు  కనబడతా నమ్మా..  కాసిని డబ్బులు అప్పు ఇయాలి నువ్వు .. అంటూ అడితీలోకి వెళ్ళిపోయింది

నేను ఆలోచిస్తూ ఉన్నా.. ఆ రోజు గాలి వానా రాకుండా ఉండి ఉంటె  .. ఆ  కుండలో  మరుగుతున్న నూనె లో  సుబ్బమ్మ చేత చేయి పెట్టించి ప్రమాణం చేయించి ఉండేవారు . కచ్చితంగా చేయి కాలి చర్మం కూడా ఉడికి పోయి ఉండేది .. ఊహించు కుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది . శీల పరీక్ష పేరిట అమాయుకులైన ఆడవాళ్ళని ఇలా హింసించే ఆచారాల్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలి  ఆవేశంగా అనుకుని ..

 రెండు  తరాల తర్వాత కూడా .. సుబ్బమ్మ మనుమరాలు "రమణ" కి మళ్ళీ నూనె కుండ పరీక్ష పెట్టమని పంచాయితీ చెప్పిన కుల పెద్దల తీర్పు తో .. వాళ్ళ జీవనంలో ఎలాంటి మార్పు రాలేదని  అర్ధమవుతుంది కదా రమేష్ గారు .... అడిగాను

అవునండీ! ఇంతకీ ఈ సుబ్బమ్మ మనుమరాలికి ఈ పరీక్ష పెట్టమన్నారా .. ఏమిటీ అడిగాడు ... అవునని తలూపాను .

మైగాడ్ ..  అలా జరిగిందా ?  అడిగాడు అతను ఆశ్చర్యంగా ..

అలా జరగడానికి "రమణ " ఏమన్నా  సుబ్బమ్మ లాంటి మామూలు ఆడమనిషి కాదు  ఆభిజాత్యం ఎక్కువ. నేను చెప్పడం కాదు కాని మీరు రెండు మూడు రోజుల తర్వాత తీరిక చేసుకుని వస్తే .. స్వయంగా ఆమె నోట వెంబడే .. ఆమె కథ చెప్పిస్తాను ..  అన్నాను

మళ్ళీ .. సస్పెన్స్ లో పెట్టారా.. మేడం అన్నాడతను నవ్వుతూ ....

కొన్ని కథలు మనం చెప్పుకోవడం కన్నా వారి కథ వారి నోటి వెంట వచ్చినప్పుడు వింటేనే బావుంటుంది అన్నాను .రమేష్ నా పోన్ నంబర్ తీసుకుని  రెండు రోజులలో వీలుని బట్టి కలుస్తానని చెప్పి నా   దగ్గర సెలవు పుచ్చుకుని . వెళ్ళిపోయాడు


సరే.ఫ్రెండ్స్... నా కథ  ఇక్కడ ఆగింది .

"రమణ"  రమేష్ తో...  ఆమె కథ  చెప్పేటప్పుడు .. మీరు విందురుగాని .. ఐ మీన్ చదువుదురుగాని .. ఇక ఉండనా మరి ..


13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సత్య ప్రమాణం (నూనె కుండ-2)

 నూనె కుండ    మొదటి భాగపు లింక్

నిన్నటి భాగం తరువాయి ..

"అసలు నూనె కుండ ఎలా పెడతారో.. ఐ మీన్  ఆ ఆచారం ఎలా వచ్చిందో.. ఇప్పుడు ఎలా ఆచరించాలని తీర్పు చెపుతారో .. మీకు తెలుసా !" అడిగాడతను ..

చూడండి.. అంటూ అతని పేరు తెలియక ఆర్దోక్తిలో ఆగిపోయాను .."రమేష్ " మేడం .. అని తన పేరు చెప్పాడు .

చూడండి రమేష్ .... ఈ ఆచారం నేను వినడమే కాని ఎప్పుడు చూడలేదు . ఈ విషయం గురించి చెప్పడానికి ఒక మనిషిని పిలుస్తాను ఆమె మీకు అన్నీ వివరంగా  చెపుతుంది .. అంటూ ..

సుబ్బమ్మ ! ఓ.సుబ్బమ్మ ఓ మారు ఇట్టా రా....... ! అని పిలిచాను .

సుబ్బమ్మ అడితీ దుకాణం లో నుండి బయటకి వచ్చింది .. ఏమ్మా ! దొరసాని ఏం పని బడింది, ఇప్పుడు పిలుస్తా ఉండావు . మా ఇంట్లో రచ్చ రచ్చగా ఉంది మూడు రోజుల నుండి తిండి తిప్పలు లేవు .... ఆ పిల్ల కాపరం అట్టా అయిందని నా కూతురు ఏడస్తా ఉంది. తీర్పు అయిపోయిందిగా .. ఉడుకునీల్లు కాసి దానికి కాస్త తలారా స్నానం చేయించాల. అంది

అయన్నీ నీ చిన్న మనవరాలు చూసుద్దిగాని .. టీవీ లలో పనిజేసే ఈయన నూనె కుండ సంగతి ఇవరం చెప్పమని అడగతా ఉండాడు . నువ్వు చెపుతా ఉంటావ్ కదా !అదేందో ఇప్పుడు చెప్పు అన్నాను ..

ఏయ్యా! ఆయన్నీ పేపర్లో రాస్తావా? టీవిలో చెపుతావా? చెపితే చెప్పావుగాని ,మా పేర్లు రాయబాకయ్యా .. ఇట్టాంటివి  ఉండాయని లోకానికి తెలియాల, ఆడకూతుళ్ళు ఎన్నెన్ని బాధలు పడతన్నారో.. చెప్పుకోవాల , మా గోడు ఇనేదేవరాయ్యా.. మా కన్నోల్లే మొగుడి ఎదాన వేసి ఎనక్కి తిరిగి చూడరయ్యే! మేము మొగుడి జాలి ధర్మాన బతికితే బతికినట్టు,చస్తే చచ్చినట్టు .. అంటూ వెతలు చిట్టా ఇప్పింది .

నేను మౌనగా వింటున్నాను  ఈళ్ల కథలు ఎన్ని కావ్యాలతో సరితూగ గల్చమా అని  ఎన్ని కాన్వాస్లలో చిత్రించగలమా .అని .

"నూనె కుండ సంగతి చెప్పు " తొందరపెట్టాడు రమేష్ ...

ఆ మాట తలచుకుంటే.. ఒళ్ళంతా భగ భగ మండిపోతా ఉంటాది .. ఎల్లమ్మ తల్లి దయ ఉండబట్టి నేను ఇంకా బతికి ఉండాను కాని లేకపోతే దినంబు నూనె కుండ సాచ్చెం చెప్పమని అడిగేటాడు నా మొగుడు అంది ...

రమేష్ ఆలస్యం భరించలేనట్టు నా వైపు చూసాడు

అదే ఆ విషయమే చెప్పు అన్నాను సుబ్బమ్మ నుద్ద్యేశించి.

మా ఆయన నాకు మేన మావ అవుతాడు . రెండు మనువులు చేసుకుని ఐదుగురు బిడ్డలని పెట్టుకుని  నన్ను మూడో మనవాడాడు.  మా అమ్మ తమ్ముడు కిచ్చిచేస్తే కళ్ళ ముందు పడి  ఉంటానని , మా నాయనేమో ఏబై  ఎనిమిది రూపాయల ఓలికి ఆశపడి   ఏబయ్యేళ్ళాడికిచ్చి పెళ్ళి చేసారు . అప్పుడు నా వయసు పదమూడేళ్ళు మా ఆయన సాముగరిడీలు ఆడేవాడు . హరికథలు చెప్పేవాడు . ఎప్పుడు ఊర్లెంబడి తిరగతా  ఉండేవాడు . నేను మున్నేరు చుట్టుపక్కల  మేక పిల్లలని కాసుకుంటూ ఉండేదాన్ని. నా మొగుడొకసారి ఊళ్ళకి బోయి రెండు నెలలకి  ఇంటికి వచ్చాడు . ఆయనోచ్చేటప్పటికి  నేను ఏవిళ్ళు  పడతా ఉన్నాను . ఆయనలో అనుమానం మొదలైంది . నేను లేకుండా నీకు కడుపు ఎట్టా అయిందే ! నాకు ఈ పెళ్ళాం వద్దు ..అని  పంచాయితీ పెట్టి తప్పు కట్టి నన్ను తీసుకుపొమ్మని మా వాళ్లకి కబురంపాడు .

రోజూ రభసే! పద్నాలుగేళ్ళ దాన్ని ఏడవడం కూడా చేతయింది కాదు. కులపంచాయితీ పెట్టారు . నేను నా మొగుడుని  తప్ప పరాయివాడిని ఎరగనని ఒట్టు పెట్టాను  పంచాయితీలో అందరూ మగొళ్ళే కదా! ఒక్కరు కూడా కనికరం చూపించాలా , ఆడు చెపుతున్నాడు కదా! ఇల్లు మొగం చొసి రెండు నెలలయ్యిందని. నువ్వు ఎవడినో ఉంచుకున్నావ్  తప్పు కట్టు . లేదా నూనె కుండలో చేయి పెట్టి తప్పు చేయలేదని నిరూపించుకో .అన్నారు. మేము తప్పు కట్టలేం నూనె కుండలో చెయ్యి పెట్టి నువ్వు నిరోపించుకొ.అని .మా  అమ్మ అయ్యా చెప్పారు .   తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం ? నూనె కుండలో చెయ్యి పెట్ట్టడానికే ఒప్పుకున్నాను .

పంచాయితీ పెద్దలు , ఇరుగు పొరుగు ,చుట్టాలు అందరూ బయలేల్లి ఎడ్ల బండ్లలో  అడవిలో ఉన్న  "ఎల్లమ్మ " తల్లి గుడికేల్లాం . ఆ రాత్రి నన్ను ఉపాసం ఉండమన్నారు . వచ్చినోల్లంతా కోళ్ళు కోసుకుని వండుకుని తిన్నారు . ఖర్చు అంతా  మా ఆయనే భరించాలి. తెల్లారుఝామునే నూటొక్క బిందె నీళ్ళతో నా చేత తలారా స్నానం చేయించారు . బిందె మార్చి బిందె నీళ్ళు  గుమ్మరిస్తా ఉంటె ఊపిరి తిరగలా.. గుప్ప తిప్పుకోనీయకుండా నూటెనిమిది బిందెల నీళ్ళు గుమ్మరించారు . పసుపులో ముంచిన తెల్లని గుడ్డలు కట్టించారు. ఎల్లమ్మ తల్లి గుడి కెదురూగా  మూడు రాళ్ళ పొయ్యి పెట్టి ఆ పొయ్యిలోకేయడానికి  నూటొక్క పిడకలు తయారుగా ఉంచారు . ఒక పాత కుండ నిండా రెండు మానికల నూనె పోశారు . మా ఆడాల్లలో పెద్ద ముత్తైదువని  పిలిచి ఎల్లమ్మ తల్లికి దణ్ణం పెట్టుకుని పొయ్యి ముట్టించి నూనె కుండ పెట్టమని చెప్పారు . అట్టా  చేసాక నన్ను  ఎల్లమ్మ తల్లి గుడి చుట్టూతా ప్రదక్షిణాలు  చేయమన్నారు .

నేను ప్రదక్షిణాలు చేస్తా ఉన్నాను . నూనె మరుగుతా ఉంది ..  నా గుండెల్లో దడ  మొదలయింది . కూర తిరగమాత ఎసేటప్పుడు  చుక్క నూనె పడితేనే కాలిపోయి మంట పుట్టుద్దే,అట్టాంటిది నిండు కుండ నూనెలో నేను చేయి పెట్టి ప్రమాణం చేసేదాకా చెయ్యి తీయకుండా ఉంటె చెయ్యి కాలదా !? అమ్మా.. ఎల్లమ్మ తల్లీ ! ఎంటమ్మా.. ఈ అగ్గి పరీక్ష .. నేను నా మొగుడ్ని తప్ప ఎవరిని ఎరగనే ! అందుకే గద ఈ పరీక్షకి అంత నమ్మకం గా ఒప్పుకున్నా.. .. నా నిజాయితీ ఏంటో .. నిరూపించు తల్లీ అని మొక్కుకుంటూ  గుడి చుట్టూ తిరగతా  ఉండాను , నా కాళ్ళు తేలిపోతన్నాయి. .. నేను అడుగడుక్కి  పడిపోబోయి నిలదొక్కుకుంటూ తిరగతా  ఉండాను..

అప్పుడే ఒక ఇచిత్రం జరిగింది .. ఎల్లమ్మ తల్లి ఉందని నిరూపించింది ..   సత్తె ప్రమాణం జరిగిందిరేణుక దేవి నే ఎల్లమ్మ తల్లిగా పిలుస్తూ పూజించడం కొన్ని ట్రైబల్  జాతులలో ఇప్పటికి ఉంది  

మరి కొంత రేపటి భాగంలో .. 

12, సెప్టెంబర్ 2013, గురువారం

నూనె కుండ
మెయిన్ రోడ్ ని ఆనుకుని ఉన్న సినిమా హాలు . దాని ప్రక్కనే ఓ  పెట్రోల్ బంక్ .. ఆ రెండిటి ప్రక్కన  నాపరాళ్ళు, చలువ రాళ్ళు పేర్చిన అడితీ .. ఆ అడితీ  ఎదురుగా రోడ్డుకి అవతలి వైపున ఎత్తుగా గుబురుగా పెరిగిన చెట్లు బాటసారులకి ఎండా వాన నుండి రక్షణ ఇవ్వడమే కాకుండా .. ఆ రోజు   ఓ  కుల పెద్దల పంచాయితీకి వచ్చినవారికి నీడనిచ్చాయి.

భర్త వైపు నుండి నాలుగు ఆటోల జనం దిగారు . భార్య వైపు నుండి పట్టుమని నలుగురు  కూడా లేరు .. అయితేనేం ? నలబయి మంది మనుషుల లెక్కన ఒకే ఒక స్త్రీ స్వరం  సివంగిలా  విరుచుకు పడుతూ తన వాదన వినిపిస్తూ ఉంది. కుల పెద్దలు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉన్నారు అప్పటికే తీర్పు జరిగి పోయింది . మెల్లగా కొందరు లేచి కల్లు  పాకల వైపు, దగ్గరలో ఉన్న బార్ & రెస్టారెంట్ ల వైపు దారి పట్టారు .

మిగిలిన కొంతమంది ఆడవాళ్ళు .. " ఇది చేసిన తప్పు యెనక పెట్టుకుని నోరేసుకుని చెలుగుతుంది. ఆడడానికి ఇంత  కావరం పనికి రాదు " అయినా ఇదొక్కతె ఈ నూనె కుండ ప్రెమాణం..కి తయారైందా  ఏంటీ ? ఎన్ని చూళ్ళా మనం " అంటూ దుమ్మెత్తి పోస్తుండగా ..

వారికి ఎదురుగా ఒక పెద్ద కారు ఆగింది .. అందులో నుండి కెమారాలు పెట్టుకుని ఇద్దరు దిగారు . ఇంకొకతను చేతిలో మైక్ పట్టుకుని .. కెమరా ఆన్ అన్నట్టు కెమెరా మెన్ వంక చూస్తూ, వీళ్ళ దగ్గరికి వచ్చి .. ఏమండీ ! ఇక్కడేదో కుల పంచాయితీ జరుగుతుందని  తెలిసింది . అసలు అలా పంచాయితీలు చేయవచ్చా? ఇక్కడున్న అందరికి తెలియదా? ఏమైనా గొడవలు ఉంటె పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి , కోర్టుకి వెళ్ళాలి అని అనుకోకుండా ఇంకా ఇలా పంచాయితీలు పెడుతున్నారు. ఇది తప్పని మీకు తెలియదా అంటూ ..  ఆతను  అలా అడగగానే అదేదొ టీవిలో మనం కనబడతాము అనుకుని కొందరు ఉత్సాహంగా ముందుకు వచ్చి చెప్పబోతుండగా .ఇంకొకరు వచ్చి గబా గబా వాళ్ళని వెనక్కి నెట్టి .. "ఇక్కడ ఆట్టాంటియి  ఏమి జరగట లేదండి .. ఏదో మొగుడు పెళ్ళాం తగువులు పెట్టుకుంటే సర్ది చెపుతున్నాం ." అని ఒకరికొకరు సైగ చేసుకుని అక్కడ నుండి జారుకున్నారు .

ఇక అక్కడ అప్పటిదాకా సివంగిలా తిరగబడ్డ "రమణ " ఒకటే నిలబడి ఉంది ..  ఆమె ప్రక్కనే ఉన్న తల్లి, అమ్మమ్మ ,చెల్లి కూడా మీడియా వాళ్ళని చూసి వేగంగా వచ్చే వాహనాలని తప్పించుకుంటూ రోడ్డు దాటి అడితీలోకి వెళ్ళిపోయారు . రమణ ఒంటి పై చీర కూడా లేదు "ఇది ఆడు కొనిచ్చిన చీర.. ఈ చీర కూడా నాకొద్దు  వాడే వద్దనుకుంటే వాడు  కొన్న చీర నా ఒంటిపై  ఎందుకు? అంటూ చీరిప్పి మొగుడి మొహాన కొట్టింది. వెంటనే ఆమె తాత తన భుజం పై ఉన్న తువ్వాలుని వేసి ఆమెకి నలుగురి దృష్టిలో పడకుండా చేసి .ఆడ  దాక పోయొస్తా!  అంటూ కుల పెద్దలతో కలిసి కల్లు దుకాణం కి పోయాడు.

చానల్ వారికి అర్ధం అయిపొయింది. తమకి కావాల్సిన విషయం ని వాళ్ళెవరూ చెప్పరని. ఆఖరి సారి ప్రయత్నించి చూద్దాం అనుకుని ఆశతో వారు కూడా రోడ్డు దాటి  ఇవతలి వైపుకి వచ్చారు వారి వెనుకనే "రమణ" కూడా రోడ్డు దాటి అడితీలోకి పోయింది

నేను అక్కడి నుండి కదలబోతుండగా మీడియా విలేఖరి నన్ను అడిగాడు "ఇక్కడ ఏం  జరుగుతుంది ? అసలు ఇప్పటి వరకు ఏం  జరిగింది " మీరు చూస్తూనే ఉన్నారు కదా ! చెప్పండి .అన్నాడు .

నేను చిన్నగా నవ్వి వాళ్ళతో చెప్పాను   " స్పెషల్  కథనం కాదగ్గ విషయం కొద్దిసేపటి క్రిందే జరిగిపోయింది ".  ..

అదేమిటో  కొంచెం వివరిస్తారా ? జిడ్డు ప్రశ్న. వదిలేటట్టు లేరు .. అనుకుంటూ .. "నిజంగా ఇలాంటి కథనం ని మీరు నిత్యం ప్రసారం   చేసేంత ముఖ్యమైనదే ! ఇప్పటికిప్పుడు నేను రెండు ముక్కల్లో చెప్పే విషయం కాదిది.  మీరు ఈ ప్రత్యక్ష ప్రసారం కాస్త ఆపేసి ..  గంట సేపు  కూర్చో గల్గితే ... వివరంగా చెపుతాను " అన్నాను .

సరే .. ఇప్పుడే చెప్పడానికి మీకు అభ్యంతరం లేదుగా ? అడిగాడు . నేను కొంచెం అసహనంగా ముఖం పెట్టి వారి కేమేరాలవైపు చూసాను .

ఆతను నా అసహనాన్ని గమనించి కెమెరా వారిని  వెళ్ళిపొమ్మని చెప్పాడు.

వాళ్ళు వెళ్ళిన తర్వాత .. ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు .. వ్యక్తిగతంగా  ఇక్కడ ఏం  జరిగిందో తెలుసుకోవాలని ఉంది చెప్పండి ప్లీజ్ !  అడిగాడతను .

నూనె కుండ లో చేయి పెట్టడం అనేది  మీరెప్పుడైనా  విన్నారా ? అడిగాను

"ఎస్,ఎస్  విన్నానండీ ! అబద్దం చెపుతున్నారనే అనుమానం ఉంటె  మరగ కాగుతున్న నూనె కుండలో చేయి పెట్టి తీయాలి నిజం చెపితే చేయి కాలదు లేకపోతే  కాలుతుంది" అలాంటిదే కదా ! అడిగాడు ఆసక్తిగా, ఉత్షాహంగా చూస్తూ ..

అలాంటి నిరూపణే  చెయ్యాలనే  "కుల పంచాయితీ" జరిగింది ఇక్కడ ..  అన్నాను .

మై గాడ్ ! ఇప్పు కూడానా ? మనం అసలు ఎంత అనాగరిక కాలంలో బ్రతుకుతున్నాం !  .. అలా నూనె కుండలో చేయి పెట్టడం  జరిగిందా ? మీరు అదంతా చూస్తూనే నిలుచున్నారు . ఒక భాద్యత గల పౌరురాలిగా మీకు భాద్యత ఉంది కదా ! పోలీస్ కి ఫోన్ చేసి నోటీస్  చెయ్యవచ్చు కదా ! అన్నాడు .

"మీరు కూడా నేను పోన్ చేస్తేనే వచ్చారు" .. నా సమాధానం

నూనె కుండ పంచాయితీ ఎందుకు జరిగింది?  అతని ప్రశ్న .

నా మొహం వివర్ణమయింది ." ఇది  యుగ యుగాల తరతరాలగా జరుగుతున్న పరీక్ష . ఆడదానికి శీల పరీక్ష "  మొగుడు అనుమానపడితే నిరూపించుకోవాలి,  తప్పదు అని చెప్పిన   కుల పురుష పంచాయితీ   తీర్పు చెప్పిన కథ ..  అసహ్యంగా, ఆవేదనగా చెప్పాను .
...
( "రమణ చెప్పిన కథలు శీర్షిక" న  కొన్ని మూడాచారాలు, పురుషాధిక్య ప్రపంచం కలసి  స్త్రీల జీవితాలని ఎలా కాలరాస్తున్నాయో ..చెప్పె ప్రయత్నం చేస్తున్నాను .. యదార్ధ వ్యధార్ద  కథలు ఇవి )

ఈ కథ తరువాయి భాగం ... రేపటి పోస్ట్ లో11, సెప్టెంబర్ 2013, బుధవారం

నాయనమ్మ చెప్పిన కథఅది వర్షా కాలం . ధర్మం  కుంటి  నడక నడుస్తున్నా నెలకి నాలుగు వానలు కురిసే కాలం .

 కృష్ణానదీ గమనంలో రెండు పాయలుగా చీలిపోయి మధ్యలో ఉన్న దివిసీమ గ్రామాలు.
పడవ మీద యేరు దాటి అవతలకి వెళ్ళడమే తప్ప రవాణా సౌకర్యం అంతగా లేని ఆ ఊర్లకి ..  వేరే మార్గమే లేదు .

ఆ రోజు ప్రొద్దుట నుండి  తెర్లు  తెర్లుగా  కడుపులో నొప్పి వచ్చిన మాదిరిగా జల్లులు పడుతూనే ఉన్నాయి . యేరు ఉదృతంగా ప్రవహిస్తూనే ఉంది .. అయినా ఆ ఏటి తీరాన పుట్టి పెరిగిన వారికి ఏటి నడకలు తెలుసు కాబట్టి  అటునిటు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు . నాలుగు పడవలు  అటుఇటు తిరుగుతూనే ఉన్నాయి .  వాన కురుస్తూనే ఉంది చీకటి పడుతుండగా .. యేరు దాటి ఆవలోడ్డుకి వెళ్ళిన పడవలు  రెండు తిరిగి రానేలేదు .
ఈవల ఉన్న రెండు పడవలు  ఇక అటువైపుకి వెళ్ళ నట్టే!

పడవ రాముడు  ఏటి ఒడ్డున ఉన్న పాకలో కూర్చుని తీరిగ్గా చుట్ట కాల్చుకుంటూ ఉన్నాడు . అంతలో అదరాబదరా.. పరిగెత్తుకుంటూ .. ఏటి ఒడ్డుకి వచ్చి నిలబడింది రంగమ్మ..  చేతిలో తాటాకు గొడుగు ఉంది .. ఆ గొడుగు క్రింద  పదేళ్ళ కొడుకుని తడవకుండా చూసుకుంటూ తానూ తడుస్తూ మనిషి అంతా ముద్ద ముద్దగా తడిసి పోయి  ఒంటికి చుట్టుకుపోయిన చీరతో నడక కష్టంగా సాగిస్తూ వచ్చింది .

ఆమెని చూసి ఇప్పుడు ఈ మనిషిని యేరు దాటించాలి కాబొలు.. ఒక్క మనిషి కోసం ఆవలోడ్డుకి ఏమి  వెళతాం ? ఎక్కడోచోట  చుట్టాలో, తెలిసిన వాళ్ళో ఉండి  ఉంటారులే ! పడవ  వెళ్ళదని  చెప్పేస్తే పొలా ? పెందరాడే  ఎక్కడో చోట .సర్దుకుంటాది ... అని మనసులో అనుకుని

ఇప్పుడు ఆ పక్కకి ఎల్లేదానికి కుదరదమ్మా.. ఇక రేపోద్దునే  పడవ  విప్పేది .కేకేసి  చెప్పాడు .

అయ్యో! అలా అంటే  ఎట్టాగయ్యా .. పిల్లగాడికి బాగోకపోతే ఆచార్యుల గారి దగ్గరకి తీసుకొచ్చా..  ఒళ్ళు మాడిపోతా ఉంది  ఇట్టా ఉన్న బిడ్డని పెట్టుకుని ఎవరింటికి పోతాను .. ? అదీగాక ఇంటి కాడ పాలు తాగే  పసి పిల్ల ఉంది . పాలు తీయాల్సిన గేదెలు ఉన్నాయి. ఇద్దరమే ఉన్నామని అనుకోకుండా కాస్త అటుప్రక్క దింపయ్యా ! బతిమలాడుకుంది

రంగమ్మ మాటలు విననట్టే..లేచి నిలబడి తుండు ముక్క దులుపుకుని తలకి చుట్టుకుంటూ ఊరివైపుకి  అడుగులు వేయసాగాడు . ఆడమనిషి అంతలా బతిమలాడుతుంటే అలా వెళ్ళిపోవడం న్యాయంగా ఉందా ! వచ్చే  సాలుకి ధాన్యం కొలిచేటప్పుడు నాలుగు మానికలు ఎక్కువ కొలిపిస్తాను ..కాదనకుండా  రాయ్యా .. నన్ను కాస్త దించి రా..
కావాలంటే  మా ఇంటికాడే అన్నం తిని గుడికాడ పడుకుందువు  గాని ..  అని బ్రతిమలాడింది.

అయినా రాముడు వినడంలేదు .. అప్పుడు రంగమ్మ ఒక మాట అంది . నువ్వు గనక నన్నుఅవతలోడ్డున దించితే .. నీకొక బహుమానం ఇస్తాను " అంది .

"ఏమిస్తావు" అడిగాడు వాడి మనసులో వంకర ఆలోచనలు

" మా ఆయనకీ కూడా చూపనిది నీకు చూపిస్తాను " అంది .

ఆ మాట వినగానే నడుస్తున్నవాడల్లా  గిరుక్కున వెనుదిరిగాడు . పడవ తాడు విప్పుతూ .." మాట తప్పకూడదు" అని హెచ్చరించాడు

 "ఇచ్చిన మాట తప్పను"  అంటూ ...  ఆమె మరో మారు మాట ఇచ్చింది

సన్నగా వర్షం కురుస్తూనే ఉంది . తాటాకు గొడుగు క్రింద పిల్లవాడు .. కురుస్తున్న జల్లులో తడుస్తున్న ఆమెని చూస్తూ .. రంగమ్మ ఇచ్చే బహుమతి ఏమై  ఉంటుందా.. అని  ఆలోచిస్తూ .. లభించబోయే బహుమానం కోసం   ఆత్రంగా  చూస్తున్నట్లు .. ఆవలోడ్డుకి  త్వరత్వరగా తీసుకువెళ్ళి .. పడవ ఆపాడు .

రంగమ్మ ముందు దిగి .. తర్వాత పిల్లవాడిని దించుకుని పదేళ్ళ పిల్లవాడిని చంకన వేసుకుని .. నడక సాగించింది .

ఆమె వెనుకనే .. రాముడు   నడవసాగాడు .. ఆమె వడి వడిగా అడుగులువేసుకుంటూ వెళ్ళిపోతుంది ...

నాకు ఇస్తానన్న బహుమానం ఇవ్వలేదు .అంటూ  దారికెదురుగా ...వెళ్లి అడ్డంగా నిల బడ్డాడు .

సరే ! చూపిస్తాను .. ఉండు అంటూ .. పిల్లవాడిని క్రిందకి దించింది  రంగడి ఎదురుగా నిలబడింది .  అప్పుడామే మొహం  మీద సన్నటి వెలుగు పడతా ఉంది ..  ఆ వెలుతురు లోనే .. ఆమె నుదుట ఉన్న కుంకుమ ని గట్టిగా తుడిచేసుకుంది .

రాముడు కి  ఆమె ఎందుకల్లా చేస్తుందో అర్ధం కాలేదు . ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు . .. నుదు టున ఉన్న కుంకుమంతా  శుభ్రంగా తుడి చేసుకున్నాక.. "ఇదిగి.. ఇది మా  ఆయన చూడకుండా ఉండేది ..నువ్వు చూసేది " అంది .

అమ్మ నీయమ్మ ! ఎంతటి జాణవే  నువ్వు !  అనుకుని ఉసూరుమంటూ ..వెనుదిరిగాదు రాముడు  .

అప్పటి కాలంలో నుదుట కుంకుమ లేని భార్యని భర్త చూడలేడు . ఎందుకని అంటే .అతను మరణిస్తే తప్ప ఆమె నుదుట కుంకుమ లేకుండా ఉండనే ఉండదు . రంగమ్మ అందుకే ..భర్త చూడనిది చూపిస్తాను అని అంత  నమ్మకంగా చెప్పింది .

నాకు ఈ కథ తలచుకున్నప్పుడల్లా తెగ నవ్వు వచ్చేస్తూ ఉంటుంది .

ఇలాంటి కథలెన్నో మా నాయానమ్మ నాకు చెప్పేది . ఆ కథలలో ఎక్కువగా.. మగవారి అవకాశవాదం ,ఆడవాళ్ళ సమయస్పూర్తి ,ఆపద వస్తుందనుకున్నప్పుడు .. ఆడవారు ఎలా తమని తాము కాపాడుకునేవారో ,చాకచక్యంతో పనులు చేయించుకునే వారో ..లాంటి విశేషాలు ఉండేవి .

ఏదో ఒక సామెత ఉంది కదా ! యేరు దాటేదాక పడవ  మల్లాయ్ ! ఏరు దాటాక ఓటి  మల్లాయ్ (కరక్టేనా ?}  అనడం  ఇలాంటిదే అనుకుంటాను .

ఇక ..కొన్ని విషయాలలో .. నేనెలా ఉంటానంటే .. చెపుతాను

నాయనమ్మ చెప్పే కథలలో ,... సాంప్రదాయం, కొన్ని మూడాచారాలు ఉండేవి  . ఇప్పుడు కాలం లో చూస్తే భర్త భార్య నుదుటున కుంకుమ కాకపోయినా స్టిక్కర్ బిళ్ళ అయినా చూస్తున్నాడా? అని అనిపిస్తూ ఉంటుంది  బొట్టు లేకుండానే .. పతి  దేవుడు ముందు ..నేను తిరిగేస్తూ ఉండేదాన్ని ఒకోసారి గాజులు, ఆభరణాలు కూడా బరువే! వాటికి వ్యతిరేకం అని కాదు . ఎందుకో నిరాసక్తత .

 ఏ పార్టీలకో, శుభ కార్యాలకో,గుడికో వెళ్ళేటప్పుడు తప్ప ఇంట్లో ఉండే  మహిళలు కళ్ళకు కాటుక పెట్టుకుని ... నుదుటున కుంకుమ పెట్టుకుని,  మట్టిగాజులతో, తలలో పువ్వులతో కళ  కళ  లాడుతూ తిరుగుతూ ఉన్నారంటే నిజంగా గ్రేటే ..కదా!

అలాంటి వారందరికీ మహిళలకి వందనం .

నిజం చెప్పొద్దూ ..నేను అలా ఉండను .. నన్ను చూస్తే ఏ కొత్త మతం పుచ్చుకున్నానో అనుకునే ప్రమాదం ఉంది కూడా!  బొట్టు, అలంకారాలు మనసుకి నచ్చితే చేసుకోవాలి, బలవంతంగా కాదని నేను అనుకుంటాను. ఖచ్చితంగా చెప్పాలంటే మనసుకి నచ్చి నట్టు చేస్తాను .

ఒక మనిషి మరణిస్తే అలంకారాలన్నింటిని  బలవంతంగా త్యజించాలి అనుకునే దానికి నేను పూర్తీ వ్యతిరేకం. మా తాత గారు మరణిస్తే  మా..నానమ్మని  నిండుగా అలంకరింపజేసి ..నలుగురిలొ కూర్చోబెడుతుంటే రోజు అభ్యంతరం చెప్పేవాళ్ళం. పద్నాలుగో రోజు .. ఏవేవో చెయబొతుంటే  చేయనీయకుండా బలవంతంగా అడ్డుకున్నాం కూడా.

ప్రతి నిత్యం ముగ్గులు పెట్టుకుంటాం . దీపం పెడతాము  కొన్ని సంప్ర దాయాలు తప్పనిసరిగా పాటిస్తాం.
కానీ ఏదీ బలవంతంగా ఆచరించం .

( ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ .. అలాంటి పాటలు మీకు ఇష్టం ఉండవా ? అలాంటి పాటలు గురించి చెప్పరు   అని  ఒక  ఫ్రెండ్ అడిగారు .. అప్పుడు ఈ కథ .. గుర్తుకొచ్చింది).

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

నకిలీ

ఈ మధ్య సోషల్ నెట్వర్క్స్ లో  మనుషులని విభజించే వారు ఎక్కువ అయ్యారు .  వాళ్ళ సమూహాల్లోకి వేరొకరిని రానివ్వకుండా అంటరానితనం తో వెలివేసుకుని తాము మాత్రమే  గొప్ప అనుకుని డబ్బాలు కొట్టుకోవడం, వాళ్ళని వాళ్ళే పోగుడుకోవడం, పొగడడానికి నలుగురిని ప్రత్యేకంగా నియమించుకోవడం చూసాను .

కులం , మతం , జాతి, వర్ణం .. ఇవే కావాలి వీళ్ళకు. ఆ దృష్టితోనే   విమర్శ పేరుతొ చీల్చి చెండాడుతారు. అజ్నాతలగా ఉండి తామే  విజ్ఞాన సర్వస్వం  అన్నట్టు .. అజ్ఞాత కామెంట్లు, ఫేక్ ఐ డి లు .. ఛీ చీ...

మనుషులుగా పుట్టినందుకు ,కాస్త అక్షరం ముక్కలు నేర్చుకున్నందుకైనా  హుందాగా మెలిగితే బావుండును.

జీవన నేపధ్యాల పట్ల ఆసక్తి తగ్గించుకుని .. చుటూ పేక్ ల వల వేయకుండా ప్రతి విషయం  పట్ల  "అసలు  - నకలీ" అనుమానాలకి తావివ్వకుండా  ఉంటే  బావుంటుంది  అనుకుంటున్నాను .మూలాలని కాదు  వెతకాల్సింది .. వ్యక్తిత్వ నిర్మాణాలని చూడండి ...

                                                                                     -  ఫీలింగ్స్  విత్ ..పైట్  ఫర్  రైట్

6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

మంజీరమైనాను నీ పాటలో.."మంజీరమైనాను నీ పాటలో, మందారమైనాను..నీ తోటలో.." చరణం వినిపిస్తుంది
మగత నిద్రలో మరో లోకంలో సంచరిస్తున్న మాధవ్ .. ఉలికిపడి మేలుకున్నాడు. ఎక్కడనుండో వినవస్తున్న పాటని వినడానికి హృదయం రిక్కించి మరీ వెతుక్కుంటున్నాడు. పాట అయిపోయింది కానీ ఎక్కడ నుండి పాట విన వస్తుందో తెలియ రాలేదు.
ఇంటి చుట్టూ వెలిసిన భవన సముదాయాలలో నుండి ఆ పాట విన వచ్చిందని అర్ధమయింది. అర్ధరాత్రి సమయం కాబట్టి ఆ పాట వినే వారి ఆచూకి కనుక్కోవడం చాలా కష్టమని తెలుసు . తల త్రిప్పి ప్రక్కనే నిద్రిస్తున్న భార్యని చూసాడు. పగలంతా పనులతో అలసిపోయి ఉందేమో ఆదమరచి నిద్ర పోతున్న ఆమెకేసి చూస్తే వాత్సల్యం.. కల్గింది . ప్రేమగా ఆమె తలపై చేయి వేసి మృదువుగా నిమిరాడు . ఆ సున్నితమైన స్పర్శకే ఆమె కదిలింది,నిద్రలోనే మాధవ్ చేతిని తీసుకుని చెంపకి భుజానికి మధ్య ఆనించుకుని మాధవ్ పడుకున్న వైపుకి తిరిగి పడుకుంది.స్పర్శ ఇచ్చిన నిశ్చింత, ప్రేమ ఇచ్చిన భద్రత ప్రపంచంలో ఏది కూడా ఇవ్వలేదేమో.. ! తన చేయి విడవకుండా పట్టుకున్న ఆమెనే చూస్తూ పడుకుని ఆ గదిలోనుండి బయటకి రాలేని మాధవ్ మదిలో కొద్ది సేపటి క్రింద విన్న పాటే మెదులుతుంది .
ఒక మది గాయం గేయమై ఆవేదనతో.. ఆలపించే వేళ..
ఆ "వేదన " వినడం కూడా.. మధురమైన వేదనే!
ఒకోసారి తనది కాని వేదన కూడా తనదిగా అనుభవిస్తూ ఉంటాడతను;అదొక ఆనందం. .
ఆ పాట విని విని ఆ పాటకి వీరాభిభిమాని అయిన మాధవ్ ఆ పాట విన్న ప్రతి సారి గాడమైన వేదనని రోజుల తరబడి..అనుభవిస్తూ..అందులో లీనమైపోతాడు.ఒక రకమైన మౌనం ఆవహించి ఎవరు పలకరించినా అయోమయమైన స్థితిలో సమాధానాలు ఇస్తూ ఉండటం జరుగుతుంటుంది .
అవన్నీ గుర్తించే సునిశిత దృష్టి , తీరిక కూడా లేని సత్య మాధవ్ మౌనానికి కారణం ఆర్ధిక ఇబ్బందులు వల్ల కాబోలు పాపం ఎప్పుడూ ఆయన అలా ఆలోచిస్తూ ఉంటారనుకుంటుంది .
తనలో వేదనని తానూ తప్ప మరొకరికి పంచడం ఇష్టం లేని మాధవ్ కొంత నిర్లిప్తతతో ఉంటాడన్నమాటే కానీ, తన భాద్యతని యే మాత్రం మర్చిపోడు, అసలు నిర్లక్ష్యం చేయడు. భార్యని, పిల్లలని అపురూపంగా చూసుకుంటూనే ఉంటాడు . కళ్ళు మూసుకుని తన గురించి తానే విశ్లేషించుకుంటున్న మాధవ్ కనుల నుండి ఒక కన్నీటి చుక్క బయటకి వద్దామా వద్దా అన్నట్టు ఆగిపోయింది .
అంతలోనే మళ్ళీ ఇందాక విన్న పాటే గాలి అలలతో మోసుకొస్తుంది.ఈ పాటని ఎవరో తనకిలాగానే ఇష్టపడేవారైతేనే పదే పదే రీ ప్లే చేసుకుని వింటారనుకోగానే చప్పున మంచం పై నుండి లేచి కూర్చున్నాడు. భార్య నుండి చేయి విడిపించుకుని కిటికీ వద్దకి వచ్చి నిలబడ్డాడు . దోమతెరలు అమర్చి ఉండటం వల్ల కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి కిటికిలో నుండి బయటకి చూసాడు తమ ఇంటి ఖాళీ స్థలం కి ఆన్చి కట్టబడిన అయిదంతస్తుల భవనం లో నుండి ఆ పాట వినబడుతుందని గుర్తించాడు . అలాగే ఆ పాట వింటూ నిలబడి పోయాడు.
మౌన స్వరాల ఈ పంజరాన కలిసాను కడలేని స్వప్నాలలో,విధినటనాలలో, ఋతుపవనాలలోఎన్నాళ్ళుఈవేదన .. ? ఎన్నాళ్ళువేదన?
మాధవ్ తనని తానూ ప్రశించుకున్నట్టు ఉంది
ఇది నా జీవితాలాపన.. ప్రియ దేవాతాన్వేషణ ... ఏమైనదో, ఎట దాగున్నదో, ఎన్నాళ్ళు ఈ వేదన ఎన్నాళ్ళు ఈ వేదన ?
తనని తానూ ప్రశ్నించుకుంటూ.. మది గాయాలుగా మధు గేయాలుగా మార్చుకుంటూనే ఉన్నాను కదా ! ఈ పాటలో లాగానే అనుకున్నాడు. అంతలోనే పాట ఆగిపోయింది
అతని మనసులో పీఠం వేసుకుని ఉన్న రాధ కళ్ళలోకి ప్రాకింది. ఆమె గురించిన జ్ఞాపకాలు వెంటాడుతుండగా .. మంద్రంగా మువ్వల చప్పుడు అతని చెవులని తాకింది . ఆ చప్పుడు కాళ్ళకి ధరించే మువ్వల పట్టీల సవ్వడి .. మాధవ్ బాషలో చెప్పాలంటే మంజీర నాదం . కానీ అతనికి వినవచ్చే చప్పుడు నడుస్తున్నప్పుడు వినిపించే శభ్డం తాలూకూ లా అనిపించలేదు ఎవరో.. మువ్వల పట్టీని చేత పట్టుకుని పైకి ఎగురవేస్తూ క్రింద చేతులలో అందుకుంటూ ఆ రవళులని ఎంతో ఇష్టంగా వింటున్నట్లు అనిపించింది . అలా చాలా సేపు వినబడుతూనే ఉన్నాయి.ఆ రవళులు వినపడెంత వరకు ఉండి తర్వాత వచ్చి మంచంపై పడుకున్నాడు .
"ఏమిటండీ! నిద్ర రావడం లేదా ? చైతూ చదువు గురించేనా ఆలోచిస్తున్నారు? ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది . మీరు ఆలోచిస్తే మాత్రం వాడికి బాగా చదువు వస్తుందా, ఏమిటీ ? వచ్చి పడుకోండి .. ఆ కళ్ళ క్రింద చారలు చూడండి మీ ఆలోచనలకి గుర్తుగా ఎలా పెరుగుతున్నాయో.. అంటూ కోప్పడింది సత్య .
ఏమి మాట్లాడకుండా కనులు మూసుకున్న అతనిని చూస్తూ.. " ఎంత అందమైన కనుదోయి .. ఈ కళ్ళే కదూ పెళ్ళి చూపులలో తన కళ్ళతో కలసి తనకి గాలం వేసింది .." అనుకుంది సత్య . అమ్మాయి పుడితే బావుండును .. మీ పోలిక వస్తే భరత నాట్యం నేర్పించవచ్చు, హావభావాలు బాగా పలుకుతాయి " అనేది . అలాంటి కళ్ళలో ఏదో నిరాశ తారట్లాడుతూ ఉందని ఆమె ఎన్నడూ గుర్తించలేదు. కూడా!
కనులైతే మూసుకున్నాడు కాని మాధవ్ మనసు మెలుకువగా ఉంది.ఆ మెలుకువలో ఓ.ఇరవయ్యి ఏళ్ల జ్ఞాపకం దాగుంది .
రాధ .అందమైన అమ్మాయి అనేకంటే చాలా చురుకైన అమ్మాయి . నాజూకు తనం కన్నా మెత్తని స్వభావామెలో కనబడేవి. ఏదో తెలియని ఆకర్షణ... . ఆమె వైపు లాగేస్తూ ఉండేది . పరిచయస్తుల అమ్మాయి . తను సిమెంట్ ప్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ అదే వూర్లో ఉంటున్న అన్నయ్య వాళ్ళింట్లో ఉండేవాడు . డ్యూటీ లేనప్పుడు పగలు పడుకుని నిద్ర పోతూ ఉంటే తన నిద్రని చెదగోడుతూ వరండాలో కూర్చుని సందడి సందడి చేస్తున్న వారిని మందలించాలని కోపంగా వెళ్ళిన మాధవ్ ఆమెని చూసి టక్కున ఆగిపోయాడు.
ఇదిగో.. మాధవ్ నేను ఎప్పుడూ నీతో చేపుట్టూ ఉంటానే ..,"రాధ" అని .. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అంటూ పరిచయం చేసింది . ఒక సారి ఆమె వైపు చూసి లోపలికి వచ్చేసాడు . ఆమెకి వదినతో సహవాసం. ఎప్పుడూ పాటలు పాడుకుంటూ ఉండేది , ఎన్నెన్నో పాటలు పెదవులపైనే ఉండేవి .. ఎప్పుడైనా ఇంటికి వస్తే మాధవ్ తో మాట్లాడితే ఆ మాటల్లో పాటల ప్రస్తావనే ఎక్కువగా ఉండేది. పాటంటే ఆమెకి అంత ఇష్టం . తనతో ఎప్పుడూ దేబ్బలాడుతూ ఉండేది, అనాలనుకున్న మాట టక్కున అనేసి వెళ్ళిపోయేది . అమ్మో.. ! ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా ఇబ్బందే అనుకుంటూ నవ్వుకుంటూ ఉండే వాడు. వదిన ప్రసవించడానికి వెళ్ళినప్పుడు కూడా బిడియం లేకుండా ఆమె తమ ఇంటికి వస్తూనే ఉండేది . అప్పుడప్పుడూ అనిపించేది .. తనని చూసే ఆ చూపులు, తన కళ్ళతో కళ్ళు కలసి నప్పుడు కనబడే వెలుగులు , తను నవ్వితే కలిగే సిగ్గుదొంతరలు అన్నీ తన కోసమే అన్నట్లు ఉండేవి అనుకునే వాడు మాధవ్ .
ఆరు నెలల తర్వాత వదిన పుట్టింటి నుండి బాబుని ఎత్తుకుని వచ్చింది . బాబుని పెంచడంలో సాయం చేస్తున్నట్లు , బాబుని ముద్దు చేస్తూ రాధ ఎక్కువగా తమ ఇంట్లోనే ఉండేది . రాధను చూస్తుంటే మాధవ్ కి చాలా ఇష్టంగా ఉండేది తన మనసులో మాటని చెప్పాలనుకుంటే చుట్టుప్రక్కల ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండటం వల్ల వీలయ్యేది కాదు అలా ఆర్నెల్లు గడచిపోయాయి బాబుకి ఆర్నెల్లు వచ్చాయి . అన్న ప్రాసన కొండ మీద ఉన్న లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో చేయాలనుకున్నారు . అక్కడికి రాధ వస్తుందని మాధవ్ కి తెలుసు . తన ప్రేమ ప్రకటించడానికి అదే అనువైన సమయనుకున్నాడు .
అతని మనసులో అందమైన దృశ్యం మెదలాడుతూ ఉంది . తమకి ఏ మాత్రం పరిచయం లేని మనుషుల మధ్య .. ఎదురుగా కృష్ణా నది.. నదిలో నుండి గుడికి వెళ్ళే మెట్లు .. ఆ మెట్లపై నడుస్తూ .. ఎవరూ లేకుండా చూసి రాధ ని తను ప్రేమిస్తున్న సంగతి చెప్పేయాలని రిహార్సల్స్ వేసుకుంటూ ఉన్నాడు...
అతను అనుకున్నట్లు గానే .. రాధ అక్కడికి వచ్చింది .. ఒంటరిగా దొరికే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు . అన్నప్రాసన కార్యక్రమం ముగిసేదాకా ఓపికగా వేచి చూసాడు . అందరూ భోజనాలకి కూర్చోగానే రాధ ప్రక్కకి వెళ్లి .." అలా కాసేపు నది వైపు వెళ్లోద్దాం రాకూడదూ " అన్నాడు . "మొహం చూడు మొహం! వెళదాం రాకూడదు అని దీర్గం తీయకపోతే వెళదాం అని అడగవచ్చుగా ? అందుకు కూడా దైర్యం లేని మాధవా ! ఏమి మాటలు చెపుతావ్ ఈ రాధతో " అని వెక్కిరించింది .
"నీకు పిలవడానికి భయం కాని నాకు రావడానికి ఏం భయం వస్తాను పద ..." అంటూ చెప్పి .. "అక్కా నది దాకా వెళ్ళొచ్చి భోజనం చేస్తాను. మీరందరూ భోజనం చేసేయండి అంటూ .. చెప్పేసి వచ్చేసింది .
ఇద్దరూ కలసి మెట్లు దిగుతూ నది వైపుకి వచ్చారు . కొన్నాళ క్రితం అక్కడ జరిగిన సినిమా షూటింగ్ గురించి ముచ్చటించుకుంటూ నీళ్ళతో ఆడుకుంటూ కాసేపు కాలం గడిపారు . అక్కడి నుండి చూస్తే గుడి గోపురం కనబడుతూ ఉంది ..
ఆ దృశ్యం చూపుతూ బాగుంది కదూ ! అడిగాడు . తలూపి ఇంకా ఇంకా .. అని అడిగింది రాధ . మాధవ్ మనసు ఆమెకి తెలుసు . "అంతకన్నా మన ప్రేమ కూడా బావుంటుంది . నువ్వు సంతకం చేస్తే ! అని చెప్పాడు . "అబ్బ.. ఆశ ! .. నీ మొహం చూడు ! ప్రేమ కాదు ఏమి కాదు . మా ఇంట్లో తెలిస్తే నన్ను నిన్ను ఇద్దరినీ కాళ్ళు విరక్కొడతారు " అని బెదిరించింది . అది కాదు రాధా అంటూ వివరించి చెప్పబోయాడు" ఏం కాదు" అని కొట్టి పారేసింది . అతని మోహంలో నిరాశ . ఆమెకది ఆట. మాధవ్ కి ఇప్పుడప్పుడే అంగీకారం చెప్పకూడదు . కొన్నాళ్ళు ఉడికించాలి అనుకుంది. ఆ మాటలు లోలోపల దాచేసుకుని ..ఇలా అంది
ఓస్ .. ఈ విషయం చెప్పదానికేనా ఇక్కడి దాకా రమ్మన్నావ్ ! అక్కడే అడిగితే చెప్పెసేదానిని కదా ! అనవసరంగా ఇంత దూరం నడిపించావు. అంటూ గుడి వైపు వెళ్ళడానికి దారి తీసింది .
రాధ వెనుకనే మాధవ్. సగం మెట్లెక్కి వచ్చాక వెనుదిరిగి చూసింది . రాధ వైపే చూస్తూ .. మెట్ల వంక చూసుకోకుండా పడిపోబోతున్న మాధవ్ ని గబా గబా మెట్లు దిగి పట్టుకోబోయింది . మాధవ్ పడకుండా నిలద్రోక్కుకుని ఆమెని చూసి నవ్వేసాడు . "నేను పడిపోతే నీకెందుకు ?" అన్నాడతను . నువ్వు ఎప్పుడో పడ్డావని నాకు తెలుసులే ! చెప్పింది . ఇప్పుడే పెళ్లి చేసేసుకుందామా.. అడిగాడు "వద్దు " అలాంటి వన్నీ ఇప్పుడు ఆలొచించకు. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు ప్లీజ్ " అంది. ఇక్కడ కొంచెం సేపు కూర్చుందామా ? అడిగాడు . ఇక్కడ వద్దు ఎవరైనా చూస్తే మా నాన్నతో చెపితే ప్రమాదం .. పద అక్కడ కూర్చుందాం అని దూరంగా ఉన్న బండ వైపు చూపించింది .
ఇద్దరూ ఏమి మాట్లాడుకోకుండానే రక రకాల ఆలోచనలతో నడుస్తూ అక్కడికి చేరుకున్నారు. మాధవ్ మనసులో ఏదో తెలియని గుబులు. కులం,ఆస్తి ,హోదాలలో ఇద్దరికీ చాలా తారతమ్యం ఉంది . పైగా అప్పటికే రాధ కి పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారు . ఆ పరిస్థితులలో రాధ ఒప్పుకుంటుందా? ఆని ఆలోచిస్తున్నాడు మాధవ్ .
రాధ కూడా ఏమి మాట్లాడటం లేదు గుడి దగ్గర నుండి చాలా దూరంగా వచ్చేసారు అక్కడ నది ఒడ్డున ఉన్న బండ పైకి చేరుకున్నారు ఇద్దరూ .
రాధా ! ఒకసారి నదిలోకి వెళదాం రా.. అన్నాడు మాధవ్ .. ఎందుకు? ప్రశ్నార్ధకంగా చూసింది . ఆమె చూపులని పట్టించుకోకుండా .. ఆమె చేయి పట్టుకుని నీళ్ళ వద్దకి తీసుకు వెళ్లి .. ఆమెని ఒడ్డునే ఉన్న ఒక చిన్న బండపై నిలబెట్టాడు . తానూ ఏం జేసినా సరే కదలకుండా అలా నిలబడే ఉండమని ఆజ్ఞాపించాడు . రాధ మాధవ్ వంక అనుమానంగా చూసింది . మాధవ్ మాత్రం నీటి వద్దకి వెళ్లి దోసిలి తో నీళ్ళని తెచ్చి బండపై నిలబడిన ఆమె పాదాల పై పొసాడు . అయ్యో ! ఇదేంటి మాధవ్ ! నా కాళ్ళు కడుగుతున్నావ్ ! నాకు ఇది ఇష్టం లేదు. మీరు మగవాళ్ళు అలా చేయవచ్చా ? అని అడుగుతూ వెనుకకి అడుగులు వేసింది . ఆమెని మాట్లాడవద్దని పెదాలపై చూపుడు వేలుంచి సంజ్ఞతో వారించి అలా మూడు సార్లు దోసిలితో నీళ్ళు తెచ్చి ఆమె పాదాలని అభిషేకించాడు . " ఆ కృష్ణమ్మ నీళ్ళతో ఈ రాధమ్మ కి అభిషేకం చేయమని ఈ మాధవ్ కి .ఆ లక్ష్మి నరసింహుడే ఆజ్ఞాపించాడు . నేను కాదు ఈ పని చేసింది అంటూ అల్లరిగా నవ్వాడు .
ఫాంట్ జేబులో నుండి రుమాలు తీసి రాధ సుకుమారమైన లేత తమలపాకుల ల్లాంటి పాదాలని తుడిచాడు . ఆతను ఆ పనులు చేస్తున్నంత సేపు ఆమె అభ్యంతరం చెపుతూనే ఉంది . ఆ తర్వాత్ మాధవ్ షర్ట్ పాకెట్ లో నుండి ఒక పొట్లం తీసి గులాబీ రంగు కాగితం విప్పాడు. అందులోనుండి ఒక వస్తువుని తీసి రాధ కళ్ళ ముందు ఊపాడు . సన్నగా మృదువుగా మ్రోగుతున్న కాలి గజ్జెల వైపు ఆశ్చర్యంగా చూసింది . " ఇవి ముత్యాల ముగ్గు పట్టీలు అంట. షాపతను చెప్పాడు . ఈ పట్టీలు నీ కోసం తెచ్చాను కాదనకూడదు రాధా .. ప్లీజ్ " మాధవ్ అభ్యర్ధన కి ఆమె కరిగిపోయింది . చిన్నగా నవ్వింది .
మాధవ్ రాధ ప్రక్కనే కూర్చుని ఆమె పాదాలని ఒడిలోకి తీసుకుని ఇంత అందమైన పాదాలకి గజ్జెలు లేక ఎంత బోసిగా ఉంటాయో తెలుసా! చురుకుగా కదిలే నీ పాదాలు చూసినప్పుడల్లా నాకు లోలోపల ఏదో తెలియని అలజడి . అది మనసు పొరలలో నుండి తెరలు తెరలుగా ..ఈ నది అలలుగా వినబడుతూ ఉంటుంది .. ఇప్పుడు ఈ మువ్వల సవ్వడితో నువ్వు నడుస్తూ ఉంటే మంద్రంగా ప్రవహించే ఈ కృష్ణమ్మ పరవళ్ళు త్రోక్కుతున్నట్లు ఉంటుంది నా ప్రేమకి గుర్తుగా ఎప్పుడూ నువ్వు వీటిని ధరించే ఉండాలి ! సరేనా ? .
రాధ ఏమి మాట్లాడలేదు అమ్మ ఎప్పుడు కాళ్ళకి పట్టెలు పెట్టుకోమన్నా ఇష్టం లేదని తిరస్కరించేది . ఇప్పుడు కొత్తగా ఈ పట్టీలు పెట్టుకుంటే అమ్మకి అనుమానం రాదూ ! తన ఫ్రెండ్ వద్దన్నా వినకుండా బలవంతంగా పెట్టిందని అబద్దం చెప్పాలి కాబోలని ఆలోచిస్తూ ఉంది .
రాధ చేయి పట్టుకుని లేవదీసి ఇక వెళ్ళిపోదాం పద . మన గురించి గుడిలో వాళ్ళందరూ ఎదురు చూస్తారు అని చెప్పాడు .
రాధ కట్టుకున్న పట్టు పరికిణీ కొంచెం పైకి పట్టుకుని గుడి మెట్లు ఎక్కుతూ తన కాళ్ళకి మాధవ్ పెట్టిన పట్టీల నుండి వినబడు తున్న శబ్దానికి వింతగా చూసుకుంటూ ఉంటే
మాధవ్ మనసు నిండా వింత అనుభూతులు .. ప్రియురాలి అందెల సడిలో హృదయ లయలు ఉంటాయన్నట్టు .. అతనికి ఎంతో ఇష్టమైన మరో పాట లోలా
ఈ చరణ కమలాలు ఎంత మృదులం నా హృదయంలో ఇవి ఎంతో పదిలం. జీవితాంతం తనతో కలిసి నడిచే ఈ పాదాలని,మనిషిని మనసుని పదిలంగా చూసుకోవాలి .. అనుకున్నాడు .
ఇది జరిగిన వారం రోజుల లోపలే .రాధకి పెళ్లి నిశ్చయం అయిపొయింది . ఇంట్లో వారికి ఎదురు సమాధానం చెప్పే దైర్యం, మాధవ్ గురించి చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించే విధం తెలియక .. పెదవి విప్పకుండానే, పదం పాడ కుండానే పధం కదపకుండానే, మాధవ్ కి మళ్ళీ కనబడకుండానే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది రాధ
మాధవ్ మనసులో ఎంతో వేదన ఎవరికీ చెప్పని వేదన . అతని వదిన అన్నీ గ్రహించి రెండు మూడు సార్లు అడిగింది మాధవ్ ఏమిటి అలా ఉంటున్నావ్ !అని .
ఏం లేదు ..బాగానే ఉన్నానే! అని అతని సమాధానం
రాధ పెళ్ళయ్యాక భర్త తో కలసి మాధవ్ ఇంటికి వచ్చింది . అతి మాములుగా వారిని పలకరిస్తూనే ఆమె పాదాల వైపు చూసాడు . అక్కడ తను ఆమెకి కానుకగా ఇచ్చిన మువ్వల పట్టీలు ఉండాల్సిన చోటున పాదాలు బోసిగా దర్శనం ఇచ్చాయి .
అతని మనసు అంతులేని వేదనకి గురైంది . ఇంకెప్పుడూ ఎవరిని ప్రేమించకూడదు . ఇదే మొదటి ప్రేమ ఆఖరి ప్రేమ అనుకున్నాడు. అనుకున్నంత తేలికగా రాధను మర్చిపోలేక అక్కడి నుండి ట్రాన్సఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు . కానీ ఎప్పుడూ ఎవరైనా కాళ్ళకి పెట్టుకున్న పట్టేల నుండి మువ్వల శబ్దం విన్నప్పుడుల్లా గంభీరంగా మారిపోయేవాడు ఈ చిరు మువ్వల సందడితో నా మదిలోకి నడచి రావాల్సిన రాధ వేరొకరి జీవితంలోకి వెళ్ళి పోయి తన మనసుని శూన్యం చేసింది ...నేను నా ప్రియ దేవతని ఎక్కడని అన్వేషించను వేరొకరి జీవితంలోకి ఒదిగిపోయిన రాధ ని అలజడికి గురి చేసి నా ప్రేమని వ్యక్తపరచడం కన్నా ఈ వేదన భరించడమే సరియింది . నా ప్రేమని నేనాలపించడమే మంచిది .అది నా జీవితాలాపన గా తిష్ట వేసుకున్నా సరే! అనుకుంటూ .. అలరించే సినిమా పాటలలోని భావానికి తన జీవిత సత్యాలని జతచేర్చుకుని వేదనలో మునిగిపోతూ ఉన్నాడు . ఆ వేదన ఎంత తీయనో . కాని అనుభవిస్తే తెలియదు అనుకుంటాడు .ఇలా జ్ఞాపాకాలను గుర్తు చేసుకుంటూ ..
తానూ ఇష్టపడే ఈ పాటంటే రాధ కి మాత్రమే తెలుసు ... అంటే ఈ పాట వింటున్నది .రాధ కాదు కదా ! అని అనుమాన పడ్డాడు .
రేపుదయం లేవగానే ఆ ప్లాట్ లోకి ఎవరొచ్చారో గమనించాలి అనుకున్నాడు .
తెల్లవారింది . ప్లాట్లలో ఉన్న ఒక్కొక్కరు బయటకి వస్తున్నారు ,, అందరిని గమనిస్తూ ఉన్నాడు . ఎవరూ రాధలా ఉన్న వ్యక్తీ అతనికి కనబడలేదు , నిరాశ ముంచుకొచ్చింది .నీరసంగా ఆఫీసుకి వెళ్ళిపోయాడు . సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చి మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ ప్రక్కనే వెలిసిన భవన సముదాయం వైపు చూస్తూనే ఉన్నాడు . రాధ లాగానే ఉన్న అమ్మాయిని వెనుక కూర్చోబెట్టుకుని టూ వీలరు పై ఇరవై ఏళ్ళనాడు ఉన్న చురుకుదనంతోనే రోడ్డుపై దూసుకు వెళుతున్న "రాధ" ని చూసాడు . మాధవ్ కి చాలా సంతోషం, ఇంకాసేపటికే రెండు సంచీలతో నిండుగా సామాను తీసుకుని లోపలి వెళుతున్న రాదని చూసాడు . తను నడుపుతున్న బండిని కంట్రోల్ చేస్తూ ఒక కాలు క్రిందకి పెట్టినప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి ఆమె కాలి వైపే చూసాడు . అప్పుడూ ..బొసిగానే కనపడింది ఆమె పాదం .
"ఈ ఆడవాళ్ళు రాతి బండలు మగవారి హృదయాలతో ఆడుకుంటారు క్షణంలో ప్రేమించిన వారిని మర్చిపోయి ఇంకకరితో జీవితం గడిపేస్తారు ." అంటూ ఉండే ఫ్రెండ్ శేఖర్ చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటూ . నిజమేనేమో! అనుకుంటూ లోపలి నడిచాడు. మనిషి జీవితంలో అనేకానేక సమస్యలు ఎలాగో ఉంటూనే ఉంటాయి . చాలా విషయాలకి బండబారిపోతూనే ఉంటాము . జీవితంలో చిన్న చిన్న అనుభూతులు, మధురమైన జ్ఞాపకాలు తో కాస్త ఆనందంగా ఉండటంలో తప్పేమీ ఉంటుందో! "రాధ" కనీసం అలా కూడా నన్ను గుర్తు పెట్టుకోలేదేమో! నేను చాలా దురదృష్ట వంతుడిని.. అనుకున్నాడు మాధవ్ .
చాలా సేపు రాధ గురించి ఆలోచిస్తూ .. ఎవరికైనా మదిలో దాగిన రహస్యాలు అనేకం ఉంటాయి. అవన్నీ జీవిత భాగ స్వామ్యికి తెలిస్తే వారికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. అవన్నీ తెలియడం అనవసరమనిపించింది కాబట్టే సత్యకి ఎప్పుడూ రాధ గురించి చెప్పనే లేదు. లేకుంటే ఆమె ముందు మరొక రకంగా సానుభూతి పొందాల్సి వచ్చేదేమో . అని కూడా అనుకున్నాడు
ఆ రోజు రాత్రి పొద్దు పోయాక పై ప్లాట్ లో నుండి అదే పాట .. వినబడుతూ ఉంది . చాలా అసహనంగా ఫీలయ్యాడు మాధవ్ . అశాంతి తో కదలసాగాడు .
మరుసటి రోజు ఆఫీసుకి వెళుతూ వాచ్ మెన్ భార్య పార్కింగ్ ప్లేస్ లో నుండి బండి తీస్తున్న రాదని పలకరిస్తూ .. "అమ్మగారు .. మీరు కాళ్ళ గొలుసు వేసుకోలేదు ఎందుకని? అలా వేసుకోకుండా ఉండకూడదమ్మా ! అందమైన కాళ్ళకి గొలుసులు వేసుకోవాలి . వేసుకోకపోతే మగవాళ్ళ కాళ్ళకి ఆడవాళ్ళ కాళ్ళకి తేడా లేదంటారు అని అనడం వినబడింది . ఆ మాటలకి రాధ నవ్వేసింది
"మమ్మీకి కాళ్ళ పట్టీలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఒకే ఒకసారి ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తే పెట్టుకుందట . అదే రోజు .. ఒక కాలి పట్టీ జారిపోయిందట . ఇక అంతే ! అమ్మ యెప్పుడూ .. మువ్వలు పెట్టుకొనే లేదు .. మా డాడీ కూడా నువ్వన్నట్టే అంటారు కాని అమ్మ వినదు. పైగా అప్పుడు తన ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ని సెంటిమెంటల్ పూల్ లా ఇప్పటికి భద్రంగా దాచుకుంది .. ప్రాణంలా చూసుకుంటుంది " అని చెప్పింది నవ్వుతూ ..రాధ కూతురు.
ఆ మాటలు వింటున్న మాధవ్ కి .. చాలా సంతోషం. తనని ఇప్పుడు చూస్తే రాధ ఎలా ఫీల్ అవుతుందో! అసలు తన ఇల్లు ఇక్కడే అని ఆమెకి తెలుసా? వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయ్యిందో! వాచ్మెన్ భార్య మాటలు చూస్తుంటే వాళ్ళు ఈ ప్లాట్ లో ఉండటం మొదలెట్టి చాన్నాళ్ళు అవుతున్నట్లుగా ఉన్నాయనుకున్నాడు .
అంతరంగం ఒక మాట చెప్పింది "ఒరేయ్ బుద్దూ ! పట్టీలు బహుమతిగా ఇచ్చిన అబ్బాయిని ఏ అమ్మాయి అయినా జీవితంలో మర్చిపోతుందా !? . (అరె బుద్దూ ! పాయల్ దియా ఉస్ లడకే కో జిందగీ మే ఓ కభి బూల్ నహీ సక్తి ) మాధవ్ పెదవులపై పై .. దరహాసం తళుక్కుమంది.
అతని హృదయం కనబడని మంజీరనాదాన్ని శ్రావ్యంగా వింటుంది ..
ఆ రోజు రాత్రి పొద్దుపోయాక అతనికిష్టమైన పాట వినబడుతూనే ఉంది ..
"మంజీరమైనాను నీ పాటలో..
మందారమైనాను..నీ తోటలో...
వేదనలోనే ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు మాధవ్.