4, ఫిబ్రవరి 2019, సోమవారం

ఏనుగు అంబారీఅమ్మా! యెలా వున్నావ్, నీరసం తగ్గిందా, మందులు వేసుకుంటున్నావా, నీ అకౌంట్ కి మనీ ట్రాన్సఫర్ చేసాను చూడు.

ఇప్పుడే మోటెల్  నుండి నడిచి వస్తుంటే… యీ  ఆకురాలు కాలంలో  వీధులన్నీ మన సంక్రాంతికి ప్రతి వీథిలో  రంగులలంకరించిన ముగ్గులు గాలికి చెదిరినట్లు కనబడుతున్నాయి.  చెట్లన్నీ  మౌనంగా ధ్యానం చేసుకుంటూ మనలోకి మనం చూసుకుని రివ్యూ రాసుకోమన్నట్టు  చెపుతున్నాయి. సెల్ఫ్ ఫీడ్ బ్యాక్ అవసరం కదా! ఫోన్ లో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పలేను నీకు. అందుకే యీ ఉత్తరం రాస్తూ ..

నేనిక్కడ లెర్న్ కమ్ ఎర్నెర్ ప్రాసెస్ లో  చాలా నేర్చుకున్నాను. డబ్బు సంపాదించలేకపోయినా చాలా అనుభవం సంపాదించాను.   ప్రపంచమే వొక పెద్ద పాఠశాల. ఇల్లు నేర్పనిది ప్రపంచం నేర్పుతుంది అంటారుగా, నిజమే.   ప్రపంచం నుండి యేం తీసుకోవాలన్నది మాత్రం  యింటి సంస్కారం నేర్పుతుంది. వుద్యోగం లేకపోయేటప్పటికీ మొత్తంగా నేనిక్కడే ఫెయిల్ అయినట్టున్నాను.

నేర్వవలసినది నేర్వకుండా నేర్చినది మర్చిపోకుండా అసలెన్ని తిప్పలో తెలుసా ! ఎన్ని కథలో , ఇదిగో మళ్ళీ రెండవ థ రాయకుండా ధ వ్రాసావని వూరికే గొడవచేయకు. నువ్వు నేర్పినవన్నీ గాలిలోకి ఎగిరే ముందే గాలికొదిలేసి వచ్చేసాను. తెలుగులో రాయక మూడేళ్ళపోయింది. మూడు ముళ్ళు యెప్పుడేయించుకుంటావ్   అంటావ్. నువ్వేం కంగారు పడకు. అయితే గియితే యిక్కడ నల్ల జాతీయుడిని లవ్వాడతాను కానీ  ఇండియన్ ని ప్రేమించను. పాపం నల్ల జాతి వాళ్ళు వివక్ష కి  గురైనవాళ్ళని నాకు బాగా జాలి యేర్పడింది. మనవాడినే ప్రేమించి లేదా ఒప్పందం కుదుర్చుకుని నీ చేత లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళి చేయించను. ఆడంబరం కోసం అభద్రతలో యెంతో కష్టపడి సంపాదించుకున్న  సొమ్ముకి కాళ్ళొచ్చి పోయేటట్లు అస్సలు చేయను. నేను అంత త్యాగాలు  చేయలేనమ్మా, అనవసరంగా కులమూ కులమూ  అని వూరికే  లబ లబలాడి పోకు. అన్న ఎన్ఠీఆర్ పూనుతాడు నాకు.

సరేలే, యింకేంటి సంగతులు? ఏమీ తోచడం లేదు అనుకుంటూ ఇంకా మిషన్ ని అరగదీస్తూనే వున్నావా ? మన ఇంటిప్రక్కన ఆ కిరస్తానీ పిల్ల వుండేది చూడు, అదేనమ్మా  శరీరాన్ని బస్తాలో వేసి కుదేసినట్లు గున గునలాడుతూ తిరుగుతూ వుంటుంది చూడు ఆ పిల్ల. (బాడీ షేమింగ్ చేయకూడదు తప్పు అంటావని నాకు తెలుసులే)రెండు నెలలకొకసారి ఆఖరి ఇంచ్ వరకూ కుట్లు వేయమని వీలవకపోతే క్లాత్ ఎటాచ్ చేసి ప్యాచ్ వర్క్ అందాలు సృష్టించమని నిన్ను వూపిరాడనివ్వదు  కదా, ఆ అమ్మాయి యింకా వస్తుందా ?  ఎందుకమ్మా ఆమెకి  నిజం చెప్పలేవు నువ్వు ? శరీరాలు పెరిగినంత యీజీగా బాడీ ఫిట్టింగ్ కుట్టడం  యీజీ కాదని. పైగా ఆమె  వెళుతూ వెళుతూ యేమన్నదో తెలుసా? సిటీలో టైలర్ కి యివ్వకుండా నీతో బ్లౌజులు కుట్టించుకోవడం అంటే  పరోక్షంగా మనకి సహాయం చేయడమంటా. వెళుతూ వెళుతూ ఆ మాట నేను వినేటట్లు  అని వెళ్ళింది. నువ్వు వినలేదులే, బాధపడతావని నేను చెప్పలేదు. వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు సర్దుకోవడం చేతకాక  దాన్ని కప్పెట్టుకోవడానికి ఎదుటివాళ్ళ మీద పడి  యేడుస్తారు. "వారానికి నాలుగుసార్లు బిర్యానీలు  రోజుకు రెండు కోక్ లు తాగి గేదెల్లా పడుకుంటే వొళ్ళు పెరుగుద్దా తరుగుద్దా. పోవమ్మా ఫో. పోయి సిటీలో ఆ మాస్టర్ టైలర్ దగ్గరే కుట్టించుకో. నీకు వాళ్ళే కరక్ట్ "అని సమాధానమిచ్చా ఆమెకు.

ఎంత ఓర్పమ్మా నీకు ? కొలతలకు యిచ్చిన బట్టలకి ఇంత మురికి వుందేమిటో.. ఆ కంపు యేమిటో అంటూ  వాటిని అంటుకోవడం ఇష్టం లేకపోయినా ఆ అయిష్టాన్ని దాచుకుని వాళ్ళిచ్చే వందరూపాయల కుట్టుకూలి కోసం బ్లవుజులు కుట్టిన నీ పరిస్థితి లాంటిదే  యిప్పుడిక్కడ నా పరిస్థితి కూడా. అసలా అలగా జాతోళ్ళ  బట్టలు  నిన్నెవరు కుట్టమన్నారు అంత అయిష్టంగా  వుంటే కుట్టడం మానేయ్, మనకసలకి అంత ఖర్మేమి  పట్టిందట? మనం కూటికి పేదైతే నేమి కులానికి పేద కాదన్న సంగతి గుర్తుంచుకో  అనే నాన్న మాటలు గుర్తుకొచ్చి  మరీ వెగటుబుట్టుద్ది. నిజం చెప్పు, నాన్నది టూమచ్ యెస్కేపిజం కదూ…

డబ్బు లేకపోయినా కాస్త అందంగా వుండి  బాగా చదువుకుంటున్న నన్ను చూసి పక్కింటివాళ్ళు ఈర్ష్య పడటం వాళ్ళ ఈర్ష్యని చూసి నేను చికాకుని అణుచుకుంటూ నిజాలు మాట్లాడితే భరించలేరు మరి.  వాళ్ళది  వుడుకుమోత్తనం అయినప్పుడు  నాది గండ్రతనం యెందుకు కాకూడదు చెప్పసలు?.వాళ్ళకు పడీపడీ చదవాల్సిన పనిలేదు. బోలెడన్ని మార్కుల పనీ లేదు. ఏ రోజన్నా  సూర్యోదయం అంటే యెఱుగుదురా అనడిగితే వారికి కోపం వస్తుంది. అరకొర చదువుతోనే  ఠక్కునెళ్ళి వుద్యోగంలో కూర్చుంటారు. రేసులో ప్రతిభ వుండి కూడా వెనుకబడిన మనలను చూసి నవ్వుకుంటారు. ఏదో విషయం చెపుదామని యెక్కడెక్కడికో వెళ్ళిపోయా కదా! అన్నట్టు ఆ కిరస్తానీ పిల్ల వాళ్ళ అన్నయ్య కూడా నాకు దగ్గరలోనే వుంటున్నాడు. మంచి జీతమే వస్తుంది. వాడి వొంకర తనం యేమీ తగ్గలేదు. డాలర్ల బలుపు చూసి యింకా పెరిగింది కూడా.  కల్యాణీ బిర్యానీ అని ముక్కుమూసుకునే మనం ఇక్కడ ప్రక్కనోడు తింటుంటే అయిష్టతని కూడా లోలోపల అణిచిపెట్టి ప్లెసెంట్ ని పెదాలకి అద్దుకుంటాం. ఇదిగో యిలాగే యితరుల రుచులను అభిరుచులను అభిప్రాయాలను గౌరవించాలని నేర్చుకుంటామిక్కడ.అది నాకు చాలా నచ్చింది కూడా.

నాన్న లాగా తిని కూర్చోకుండా డెబ్భై ఏళ్ళు వచ్చినా  చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వృద్ధ బామ్మలు అడుగడునా కనబడతారు. ముఖ సౌందర్యానికి వేలకు వేలు తగలేస్తారు. ఎక్కడ చూసినా అందంగా వుండాలని కనబడాలని శరీరాన్ని హింసించుకునే నారీ మణులు కనబడతారు. అంతా వ్యాపార సంస్కృతే కదమ్మా, వూరికే కొంటూనే ఉంటారు.  ఇక్కడ బ్యూటీ  పార్లర్ కి వెళ్ళకపోతే మొగుళ్ళు వదిలేస్తారట.మా నల్ల ఫ్రెండ్ చెప్పాడులే. ర్యాండమ్ థాట్స్ మావిద్దరివి. మా దేశంలో పెద్ద పెద్ద కారణాలకు కూడా మొగుళ్ళను పెళ్ళాలు వదిలేయరు అన్నాను. ఆ కారణాలు యేమిటేమిటీ చెప్పమని ప్రాణం తీస్తాడు. నీ కథ చెప్పాను. ముఖం విచారంగా పెట్టి మీ నాన్నపై ఆమెకెందుకు అంత జాలి అని అడిగాడు. నేను పడి పడి నవ్వాననుకో.

అన్నట్టు   అసలిక్కడ కులం సంగతి చెప్పకుండా బతకలేము. దేశీవాళ్ళు  మనిషి పరిచయమవగానే  కుక్కలు నేరస్తుడిని పసి కట్టినట్లు  గుచ్చి గుచ్చి నానా రకాల ప్రశ్నలు వేసి కూపీలు తీసి ఆఖరికి  కులం కంపు బయట పెట్టేసుకుంటారు.కూటికి పేదోమో  కానీ కులానికి పేద కాదు అనే మన స్టాక్ డైలాగ్  యిక్కడ పనికిరాదు. సూది గుచ్చుకున్న నొప్పి తెలియకుండా విషభావాలు మెదడులోకి ప్రవేశపెట్టడం అనే విద్య బాగా తెలిసినవాళ్ళు మనవాళ్లే అంటే నమ్మవు నువ్వు. అలా  యెందుకుంటారులే అంటావ్. కుక్కలకిచ్చిన ఇంపార్టెన్స్ తోటి మనిషికివ్వరు. పక్కింటివాళ్ళ కుక్కను కూడా చూసి నవ్వరు ముఖం చిట్లించరు.అంతా గుంభనమే.

ప్రపంచంలో  ప్రతిదీ మార్కెట్. మార్కెట్ లో యేవైనా అమ్మబడతాయి.అందుకు సాక్ష్యంగా ఇక్కడ యోగా లెగ్గిన్స్ భలే అమ్ముడు పోతున్నాయి. ఆఖరికి మనసు పడే బాధ కూడా  శ్రమ లాగే. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఆ డిగ్నిటీనీ నువ్వు  గడప దాటకుండా కుట్టు మిషన్ లో వెతుక్కుంటే నేను విమానమెక్కి యింకో మూల  ఒక మోటెల్ లో స్టివార్డ్ గా పని చేస్తున్నా.  ఉష్ష్.. ఎవరికి చెప్పకు. నాన్నకి కూడా చెప్పవని నాకు తెలుసులే. పరువు తక్కువ కదూ. పాతికేళ్ళ తేడాతో ఎన్ని మార్పులో చూసావు కదమ్మా,భాష మారింది భావం మారింది ఆహారం మారింది. నేను మారను అంటే కుదరదమ్మా యిక్కడ.   మెడ  మీద కత్తి పెట్టుకుని మరీ మారాలి.పొరుగు దేశంలో కూర్చుని నేను నాదేశం అంటూ దేశభక్తి అంటే కుదరదమ్మా ఇప్పుడు మానవుడు విశ్వ మానవుడు.గీతలు గీసుకోవడం అస్సలు కుదరదు. కాకపోతే గీతలు దాటడానికి రూల్స్ రాత కోతలు ఉంటాయి  నీకెంతో ఇష్టమైన రాఖీ కూతురు తీసిన రాజీ  సినిమాలో ఆయ్ వతన్ పాట విను. దేశమును ప్రేమించుమన్నా గేయాన్ని గుర్తుకు తెస్తుంది. రెండూ యే దేశం వాళ్ళైనా పాడుకోగల్గిన గీతాలు. నాదిపుడు ఠాగూర్ కి వున్నట్టు  విశ్వ ప్రేమ.

ఈ మధ్య యేమీ తోచక మాట్లాడేవాళ్ళు లేక  పాకిస్తానీ వాళ్ళ “హమ్ సఫర్ “ సీరియల్  సిరీస్ చూసాను. ఆ అమ్మాయి కిజార్ యెంత గట్టి అమ్మాయి తెలుసా. రేపు నీకేదైనా అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతే  జీవితంలో ఒడిదుడుకులొస్తే ఆ అమ్మాయంత   గట్టిగా నిలబడాలని అనుకున్నాకూడా ! నోటికి ఏదొస్తే అది మాట్లాడమే అని నువ్వు గట్టిగా కూకలేస్తే వినడం నాకొక సరదా అమ్మా ! మరి నువ్వు సర్జరీ చేయించుకోవడం ఆలస్యం చేస్తే అది యే కేన్సర్ కో దారి అయితే  పరిస్థితి యేమిటో ఆలోచించు. అందుకే ఇలా చెపుతున్నా. ఆరోగ్యంతో ఆటలాడవద్దు మరి. చెప్పినమాట వినాలి మా అమ్మ కదూ ! చదువుకుంటూ నవ్వేసుకుంటావులే, నాకు తెలుసుగా… కన్నీళ్ళొస్తున్నాయే అమ్మా!

అన్నట్టు  అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతున్నా కూడా. వచ్చే ఏడాది పెన్ వరల్డ్ వాయిసెస్ ఫెస్టివల్ లో  జాయిన్ అవ్వాలని అనుకుంటున్నా.  ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ లో  హ్యూమన్ రైట్స్ ఫోకస్ చేస్తూ నిర్వహిస్తారట. ఈ ఏడాది జరిగినప్పుడు హిల్లరీ వచ్చారు. ఆమె ఎంత చక్కగా మాట్లాడారనుకున్నావ్ . ఈ ఏడాది కొత్త గొంతుకలు వినిపించడానికొక ఛాన్స్ దొరుకుతుందేమోనని వెయిట్ చేస్తున్నా. ఛాన్స్ వస్తే మనదేశం గురించే మాట్లాడతాను.  గృహ హింస లైంగిక వివక్ష గురించి రాసుకోవడానికి స్వేచ్ఛనిచ్చి కులం మతం లాంటి నిషేదిత అంశాలతో కథలు గట్రా రాకూడదని బిర్రబిగదీసుకు కూర్చున్న పత్రికలు కొన్ని తెల్లారి లేస్తే అదే వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తాయి. సాహిత్యం ఆ విషయాలను నోట్ చేయకూడదని ఆంక్షలు విదిస్తుంది. రాజకీయ రాబందుల గూళ్ళల్లో కులం మతం గుడ్లు పెడుతున్నాయి. పీక్కూతినడానికి ఇవి చాలవూ! ఆకలి జ్ఞానం రోగం యేపాటివి చెప్పు?. ఎక్కడ చూసినా భావ స్వేచ్ఛ అలా వర్ధిల్లుతూ  వుందని నలుగురం కూర్చుని వున్నప్పుడు చెప్పుకుని  నవ్వుకుంటున్నాం.

బాబాయి కూతురు ఇక్కడ ఎమ్మెస్ చేయడానికి తయారవుతున్నానని చెప్పింది. ఇక్కడికొస్తే లైఫ్ బాగుంటుందన్న భరోసాలేదు మంచితనమూ లేదు గట్టిదనమూ లేదు. ఇన్నింటిమధ్య సంపూర్ణత్వం ఆశించడం పూలిష్ గా ఉంటుంది అని చెప్పలేకపోయా. గారాబంగా పెరిగిన చెల్లి యిక్కడ నెగ్గడం కష్టం. కష్టాలే కదా యెలాగోలా పడదాము అనుకుంటే రావచ్చు. అప్పులు చేసి రావద్దని చెప్పు.మన ఖాళీ గిన్నెలను డాలర్ తో నింపుకోవాలని మాత్రం రావద్దు అని ఈసారి నేనే ఫోన్ చేసినప్పుడు చెపుతాలే. నువ్వు చెపితే మా పిల్ల వెళితే మేము బాగుపడతామని యిష్టం లేక ఇలా చెపుతుందని పిన్ని బాబాయి  అనుకుంటారు.

నిజంగా ఇక్కడ ఏమీ ఆశాజనకంగా లేదమ్మా , హెచ్ వన్ బి వుంది కదా  అనుకుంటే సరిపోదు.  వర్క్ లోడ్ తో చిత్ర హింస అనుభవిస్తూ   మూడు నెలలకోసారి కాంట్రాక్ట్ జాబ్ పూర్తై క్రెడిట్ కార్డు లతో నెట్టుకొస్తూ వుంటారు. అక్కడేమో   సిటీలో మంచి లొకాలిటీలో అమ్మ నాన్నలకు ప్లాట్,  కారు యివ్వాలి. ఇక  పెళ్ళి కోసం ఓ ముప్పై లక్షలు సంపాదించుకోవాల్సి వచ్చే  ముప్పై యేళ్ళు దాటేసిన బాల్డ్ హెడ్ యువకులు వాళ్ళతో యవ్వనోద్రేకంతో జతకట్టే అదే పరిస్థితిలో వుండే యువతులూ గురించి మీకేం తెలియొద్దు.  డాలర్ల కలలు  కనండి. కలలు కంటూనే వుండండి.

ఫోన్ ఆన్సర్ చేస్తే జాబ్ గురించి మాట్లాడాల్సి వస్తుందనో తల్లిదండ్రులు డబ్బులు పంపమని సంకేతం ఇస్తారనో చూసి కూడా  చూడనట్టు నటిస్తూ కోపం అసహనంతో తమని తామే తిట్టుకుంటూ విసుక్కుంటూ తరువాత  పశ్చాత్తాప పడుతూ బతుకు బరువీడుస్తున్న పిల్లల గురించి ఆలోచించాలి. దూరపు కొండలు నునుపు అని పిల్లలకు ఆశలు రేపొద్దని చెప్పాలి అంటే ఎంత మొహమాటం లేకుండా ఉండాలి. ఆ మొహమాటం లేకుండానే చెపుతున్నానమ్మా .. నన్ను అనవసరంగా పంపావు యిక్కడికి.అప్పులు చేసి మరీ పంపావు.  కట్టాల్సిన అసలు రొక్కం, వడ్డీలు కలల్లో కూడా డాన్స్ చేస్తున్నాయి. బిడ్డ భవిష్యత్ బాగుండాలని తల్లిగా నువ్వు ఆశ పడటంలో తప్పులేదులే! నా కూతురు గొప్ప చదువులు చదివి వేలకి వేలు డాలర్లు సంపాదిస్తుంది అని చెపుతూ  నీ చుట్టుపక్కల అమ్మలక్కల కళ్ళల్లో  ఈర్ష్యను చూస్తూ  హాయిగా  నవ్వుకో.

చాలా నేర్చుకున్నా. జీవితమనే ఆట  ఆడాలనుకున్నప్పుడు ఆ ఆట రూల్స్  తెలిసుండాలి.  కొట్టడమో , తప్పించుకునే గుంట  నక్క తెలివితేటలుండటమో  కాదు దెబ్బ తగిలితే ఓర్చుకోవడం తట్టుకోవడం తెలియకపోతే యీ ఆట ఆడలేమని తెలుసుకున్నాను. పోరాటమంటే ఏమిటన్నది   ప్రతిక్షణం నిన్ను చూసి నేర్చుకున్నదాన్ని కదా మరి.

ఒకటి చెప్పనా అమ్మా ! ఏనుగు అంబారీ చూడటానికి గొప్పగానే ఉంటుంది. ఏనుగెప్పుడు సహనం కోల్పోయి చిందులు తొక్కుతుందోనని  భయపడుతూ   జారీ పడిపోకుండా పట్టుకుని కూర్చోడం యెంత కష్టమో  అంబారీ లో కూర్చున్న వాళ్ళకి  తెలుస్తుంది.అచ్చు అలా ఉంటుంది యిక్కడ మా బతుకు. నా చిన్నప్పుడు ఏనుగు సవారీ చేయడానికి సరదా పడుతున్న నన్ను యెక్కించి జారిపడిపోతాననే భయంతో ఆ ఏనుగు వెనక  వెనకనే నడిచావు చూడు. అదే గుర్తుకొస్తుంటుంది నాకు. ఇప్పుడు కూడా నేను పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉండాలి.  వడ్డీల సంగతి పక్కన పెట్టి సర్జరీ చేయించుకో, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో,  ఇక యింతకన్నా యెక్కువ ఆశలు పెట్టుకోకు. నిన్ను బ్రతికించుకోవడానికయినా  కార్పొరేట్ డాక్టర్స్ ధనదాహం తీర్చడానికి నేను నిత్యం  కష్టం ముల్లుతో గుచ్చుకుంటుంటానులే . బెంగపడకు, మనుషులకు విలువలను డామినేట్ చేసే అవసరాలు చుట్టుకుని ఉన్నంత కాలమూ విలువలు వలువలూడ్చినంత తేలికగావూడ్చి పారేయడమే.

కొన్ని నిజాలు  తెలిస్తే ఏడ్చి ఏడ్చి ఎండుకొమ్మలా పెళ్ళున విరిగిపోతావని నా భయం. అందుకే నీకు ఏమీ చెప్పను. అయినా నీ వద్ద ఏ రహస్యాలు వుండవు కదా,అందుకే కొన్ని మాములుగా కొన్ని అసహనంగా కలగాపులగం చేసి  కక్కుతున్నా. ఎవరికీ చెప్పుకోలేకపోతే యెవరి భుజమూ ఆసరాగా ఓదార్పుగా లేకపోతే మానసిక రోగాలు వస్తాయని నువ్వే చెప్పావుగా.  ఈ దేశం యెప్పుడు తల్చుకుంటే అప్పుడు పొమ్మంటేనూ పోనీ యెప్పుడైనా   నేను రావాలనుకుంటేనూ నాకంటూ వొకరుండాలి కదమ్మా. నీకన్నా గొప్పగా నాకెవరు వున్నారని!? ఏడుపొస్తుంది, రెక్కలు కట్టుకుని వచ్చి నీ వొడిలో పడుకుని తనివితీరా యేడవాలని వుంది.  ఉంటానమ్మా ..నీ దీప.

PS:  కేవలం పదిహేనువందల  డాలర్ల కోసం నీకు సర్జరీ చేయించడానికయ్యే ఖర్చు కోసం  యెప్పుడూ మీరు అతిశయంగా చెప్పుకునే కులం తొడుక్కున్న నేను  మీరు తీసి తీసి పడేసే  ఓ కులం తక్కువాడి కింద నెలరోజులు నలిగిపోయాననే నిజం  నీకు తెలియాల్సిన అవసరం లేదు. కూటికి పేద కానీ కులానికి పేద కాదుగా.  రోగం నయం చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే చస్తాను. యెప్పుడైనా చచ్చేదిగా అని స్టాక్ డైలాగ్ చెపుతావని నాకు తెలుసు. నువ్వు లేకపోయాక మా అమ్మ ప్రాణం ఖరీదు కొన్ని వందల డాలర్లేనా అని ముందు ముందు  నేను సిగ్గుపడాల్సి వస్తుందేమో మరి. అందుకే తెగింపు కొచ్చేసాను. కాస్తంత దైవభక్తి  నేర్చిన జ్ఞానం  కళ్ళల్లో  తడి లోపలెక్కడో దాగినట్టే వున్నాయి. ఎప్పుడన్నా  కాసేపు ఏడ్చి తెరిపిన పడతాను.  కొద్దిగా ఊహించుకుంటే నువ్వు లేనప్పటి దుఃఖం కన్నా చిన్న దుఃఖమే కదా ఇది అనుకుని ఊపిరి పీల్చుకుంటాను.

***********************************

అని లెటర్ ముగించి మెయిల్ సెండ్ చేయబోయి ఆపేసిన దీప కొద్దిగా ఆలోచించింది.  అమ్మకి  యీ విషయం  తెలియాల్సిన అవసరమేముంది  అనుకుని వెంటనే ఆఖరి పేరా తుడిచేసి..సెండ్ చేసి భారంగా నిట్టూర్చింది.
 

(ఫిబ్రవరి 2019 సాహిత్య ప్రస్థానం  సంచికలో ప్రచురితం)

1 కామెంట్‌:

మాలతి చెప్పారు...

వనజగారూ,
ఏనుగు అంబారీ కథ చదివేను.
నేను 46ఏళ్ళగా ఈదేశంలో ఉన్నా సమాజంలో ఎవరితోనూ కలవలేదు కనక నాకు చాలా విషయాలు తెలీవు. నేను వచ్చినకొత్తలో ఇక్కడ డాలర్లంటే బోలెడు రూ. అని అనుకుంటారనుకున్నాను కానీ అది ఇంకా మారలేదని మీకథ చూసేకే అర్థమయింది. కూటికి పేదయితే కులానికి పేదా అన్న సామెతని మీరు ప్రత్యేకమైన పద్ధతిలో వాడడం నాకు నచ్చింది. అలాగే "మీనాన్నకి ఆమెపై ఎందుకంత జాలి"లాటివి కూడా సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప తోచవు. మీరు బాగానే పసి కట్టినట్టున్నారు మనిషితత్వం. నిజానికి మీరు రాసిన ఒకొక సంఘటన విడిగా మరో మంచి కథ కాగలదు. ఒక నవలకి సరిపడా సరుకుంది ఈ కథలో.
మంచికథ. బహుమతి గెలుచుకోగలకథ. మరొకసారి అభినందనలు.