ఈ కథలతో చచ్చే చావొచ్చి పడిందంటే నమ్మండి :) అయినా బుద్ధి రాదు.
"దుఃఖపు రంగు" కథ వ్రాసి ఒక సంవత్సరం పైన. కథకి టైటిల్ సమంజసంగా ఉందా లేదోనని కొన్నాళ్ళు సంశయం. ఒక పేరున్న పత్రికకు పంపాను . రెండు నెలలకు మీ కథ ప్రచురణకు ఎంపిక కాలేదు అన్నారు. కొద్దిగా నిరుత్సాహం.
మరలా ఒక మాసపత్రిక వారిని కథను పంపమంటారా అని అడిగి వారు పంపమంటే కథ పంపాను. ఆరు నెలలు కాలంలో కథ పంపిన నాలుగుమాసాలు దాటిన దగ్గర్నుండి రెండు నెలల కాలంలో ఆ కథ ఎంపిక సంగతి తెలియజేయమని నాలుగుసార్లు మెయిల్ పంపాను. ఆఖరికి వారు సమాధానం చెప్పారు. కథలు వేయకపోవడం వల్ల మీ కథ ప్రచురించలేకపోయామనీ కథ మాత్రం చాలా బాగుంది అని ప్రశంసించారు. వారికి ధన్యవాదాలు చెప్పి (కథ బాగుందని చెప్పి నాలో ఉత్సాహం నింపినందుకు) మరో పత్రికకు పంపాను. రెండు నెలలు ఓపికగా చూసి కథ పరిస్థితి తెలుసుకున్నాను, అదెక్కడో పాతాళంలో పడిపోయిన దానిని వెదికి ఈ కథ మరీ చిన్నదిగా ఉందని పెద్దగా వున్న మరో కథ పంపమని అంటే ఇంకో కథ పంపాను. (అది అర్హత పొందలేదు).
సరే మూడు పత్రికలకు పంపి తిరిగొచ్చిన పెళ్ళికూతురుని ఇంకో పత్రికకు పంపాను. రెండు వారాలకు కథ ఎంపికైంది. త్వరలో ప్రచురిస్తున్నాం అని సమాచారం పంపారు. అంటే నాలుగు గుమ్మాలు ఎక్కితే గాని ఒక గుమ్మం లో నుండి ప్రపంచంలో పడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టు వదలని విక్రమార్కుడిలా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాల్సిందే.
కథ మొదటి పత్రికకు పంపినప్పుడు ఏదైతే పంపానో ఇప్పటికీ అదే కథ. ఒక్క చిన్న సవరణ లేకుండా ఏర్పూ కూర్పు చేయబడని కథ " దుఃఖపు రంగు "
అది ప్రచురణలోకి రావడానికి ఇంత కథ అంత సహనం వుంది. కాబట్టి కొత్త కథకులు తెలుసుకోవాల్సింది యేమిటంటే... కథ తిరిగొచ్చిందని నిరాశ పడవద్దు. గతంలో పిడికిట్లో పూలు అనే కథ వ్రాసిన తర్వాత రెండు సంవత్సరాలు చాలా పత్రికల గుమ్మం ఎక్కి దిగి వచ్చింది. ఆఖరికి ఆ కథ "సారంగ" లో ప్రచురితమైంది. ఇంకో విశేషం కూడా సాధించింది ఈ కథ. ఆ సంగతి తర్వాత పంచుకుంటాను.
ఇదండీ.. కథలు వ్రాసి అవి ప్రచురణ లోకి రాకపోతే కలిగే నిరాశ మనోవేదన. ఇంత అనుకుంటానా .. కథ రాయకపోతే ఏమైంది అని మెదలకుండా కూర్చోను. మళ్ళీ ఎప్పుడో రాయడం మొదలెట్టి మళ్ళీ ఇలాంటి పాట్లు పడుతూ శిరోభారం మోస్తూ వుంటాను. ఇదంతా పేరాశకి మాత్రమే కాదు ఎమోషన్స్ ఫీలింగ్స్ వెళ్ళగ్రక్కుకోవడానికి కూడా ! నా చుట్టూ ఉన్నవాళ్ళ జీవితాలను చూస్తూ కొంత అవగాహనతో ఆవేశంతో ఆవేదనతో అక్షరాల్లోకి వొంపేస్తూ వుంటాను. రాయడమంటే అదొక తపన. అంతే ! ఆ రాతలు చదివి మెచ్చుకుంటే అదో తృప్తి.
త్వరలో "దుఃఖపు రంగు " కథ వస్తుంది. అప్పుడు చదవాలండోయ్ మరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి