31, మార్చి 2018, శనివారం

ఆహ్వానం

బ్లాగ్ మిత్రులకు ఆహ్వానం 
పుస్తకావిష్కరణ ఆహ్వానం
"కుల వృక్షం"  
ద్వితీయ కథా సంపుటి ఆవిష్కరణ.
వేదిక: మధుమాలక్ష్మి ఛాంబర్ హాల్ 
(ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి) 
మొగల్రాజపురం, విజయవాడ. 
తేదీ : 08/04/2018 ఆదివారం సాయంత్రం. 05:30కి
అధ్యక్షత: డా. ఈమని శివనాగిరెడ్డి. సి ఈ వో సి సి వి ఏ
ఆవిష్కరణ: శ్రీమతి పి. సత్యవతి ప్రముఖ రచయిత్రి
పరిచయం: చందు తులసి -యువ కథా రచయిత
కథలపై విశ్లేషణ : కాట్రగడ్డ దయానంద్ - ప్రముఖ కథారచయిత
కథావిమర్శ:అరసవిల్లి కృష్ణ విరసం
ఆత్మీయ అతిదులు : వేంపల్లి షరీప్ ప్రముఖ కథా రచయిత
జి .లక్ష్మి సాహితీ ప్రచురణలు
సాయంత్రం 05:30 కి సభ ప్రారంభం.
మితృలందరికీ ఆత్మీయ ఆహ్వానం అందిస్తూ...

-వనజ తాతినేని






28, మార్చి 2018, బుధవారం

రాయికి నోరొస్తే ..

మన సహ బ్లాగర్, కవయిత్రి  శ్రీమతి మంజు యనమదల (కబుర్లు కాకరకాయలు బ్లాగ్ ) "రాయికి నోరొస్తే " కథా సంపుటిని సమీక్షించి నన్ను ఆశ్చర్య పరిచారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమీక్ష "గోదావరి "  తెలుగు దినపత్రికలో ఈ సమీక్షని చూడవచ్చు. 
**************



26, మార్చి 2018, సోమవారం

నూతిలో గొంతుకలు

అన్న కట్టిన కొత్తింటి చుట్టూ తిరిగి చూసి చాలా బాగుందిల్లు. అదివరకంటే విశాలంగా ఉంది .గాలి వెలుతురూ ధారాళంగా వస్తుంది,పైగా బోలెడన్ని మొక్కలు పెంచుకోవచ్చని సంతోషిస్తూ పడమటి వైపు గోడకి అవతల వాస్తుదోషం వుందని  విడగొట్టబడిన స్థలంలో బాగా పెరిగిన వేప టేకు చెట్లు,వేప చెట్టు చూసి  పోనీలే వాస్తు పిచ్చిలో పడి  మొక్కలకి జాగా అయినా  మిగిల్చారు అనుకున్నా.  ఎంతైనా తండ్రి అదృష్టవంతుడు. తన జీవితకాలంలో రెండుసార్లు  క్రొత్త ఇళ్ళల్లో ఉండే భాగ్యం కల్గింది . ఒకటి తండ్రి కట్టిన ఇల్లు, రెండవది కొడుకు కట్టిన ఇల్లు. నీళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈశాన్యంలో  తవ్వించిన ఆరడుగుల వెడల్పు గల నూతిలోకి  మోటార్ బిగించి  ట్యాంక్ లో నీరు నిలవ ఉండే ఏర్పాటు చేసి  తండ్రికి నీళ్ళు తోడుకునే శ్రమ కూడా లేకుండా చేసాడు కొడుకు అనుకుంది.

ఈ ఇంటి నీటి కష్టాలన్నీ ఆడవాళ్ళవే కదా !  ఆర్థికంగా చితికి ఇంట్లో  పనివాళ్ళు లేకపోయాక మగమహారాజులు యే రోజైనా నూతిలోకి కడవేసి నీళ్ళు తోడిన కష్టం తెలిస్తే కదా అని ఉక్రోషపడింది. అప్రయత్నంగా బలిష్టంగా ఉన్న తన దండ చేతులని చూసుకుంది . మీ పోలికలు, శరీర ఆకృతి అంతా బాగుంటుంది. చేతులే మగవాళ్ళ చేతుల్లా ఉంటాయి  అనింది శాంతమ్మ అనే స్నేహితురాలు.ఇంటి అవసరాలకి, పశువులు త్రాగడానికి   పదేళ్ళ వయసునుండే నూతిలో  నుండి నీళ్ళు తోడి, మోసి భుజం దగ్గరనుండి మోచేతి దాకా ఒకేలా ఉంటూ  బలంగా తయారయింది ఇందుకేననుకుంటా అనుకున్నానప్పుడు.

మళ్ళీ దక్షిణం వైపు గోడ దగ్గరికి వచ్చి గోడవతల తొంగి చూసే ప్రయత్నం చేసి తనకన్నా అరడగు ఎత్తు ఎక్కువలో ఉన్న గోడపై నుండి అవతలకి తొంగి చూసే వీలు లేక ముక్కాలి పీట యెక్కి గోడవతలకి తొంగి చూసాను.  నూతి చూపు తగిలిన ఇరవై అడుగుల వెడల్పు  స్థలమంత మేరా  వదిలేసి కట్టిన ప్రహరీ గోడ అవతల ఇంటి నేలమట్టం అంతెత్తు చెరువు మట్టి తొలి ఉండటం గమనించి "ఎందుకు నాన్నా! అంత మెరక పోశారు, చాలా ఖర్చై ఉంటుందిగా. అయినా ఇప్పుడు నుయ్యి పూడిపోయి రోడ్డులో కలిసిపోయిందిగా,  అంత స్థలం వదిలేసి గోడకట్టి విడగొట్టారెందుకు?   రెండున్నర సెంట్ల స్థలం దాకా ఉంటుంది. ఇంత స్థలం పొతే చాలా డబ్బు పోయినట్టుకాదు ఈ ఊరు కూడా CRDA లో కలిసి పోయిందిగా"  "నుయ్యి పూడ్చేస్తే మాత్రం  దాని చూపు పోనే  పోదు. విడగొట్టి ఇల్లు కట్టమన్నాడు సిద్దాంతి . అందుకే పాతింటి స్థలంలోనే ఉత్తరం తూర్పు  బాగా వదిలి  కట్టాం . ఇంచ్ కూడా దక్షిణపు ప్రక్క పల్లం ఉండకూడదని అంత మెరక తోలిచాడు అన్నాయ్" అన్నాడాయన.

చూపు సారించి తమకి తూర్పున ఉన్న ఇంటికి ఆగ్నేయంగా రోడ్డులో కలిసిపోయిన పెద్ద నుయ్యిని  గుర్తు చేసుకుంది జ్ఞాపకాలలో.  ఎంత పెద్ద నుయ్యో అది.  పెద్దవాళ్లందరూ మోటబాయి అనేవాళ్ళు  ఇప్పుడంటే నుయ్యి అని నాజూకుగా అంటన్నారుకానీ  నా చిన్నతనంలో బాయే అనేవాళ్ళు అని చెపుతూ  తాతయ్య నా చిన్నప్పుడు చెరువు నీళ్ళు రాని చోట పెద్ద బాయిలు తవ్వి  ఇత్తడితోనూ,ఇండాలియన్ తోనూ చేసిన పెద్ద పెద్ద బానలతో,తొట్టె ఆకారం లాంటి పాత్రలతో   నీళ్ళని యెద్దులతో తోడించి  పాటి మీద తోటల్లో పొగాకు  పండించే వాళ్లు.  మన పెద్ద చావిట్లో అటక మీద వున్నయ్యే అయ్యే మోటలంటే  వెళ్లి చూసిరా అని చెప్పేవాడు.

 పెద్ద నూతిలో నీళ్ళు ఎంత  నల్లగా ఉండేవి,అంతే తీయగా కూడా ఉండేవి.ఇత్తడి బిందెకి తాడు బిగించి   తాబేటి  పై అంగేసి ఒక్కసారిగా తాడుని నూతిలోకి  వదిలితే  డబ్ మన్న చప్పుడుతోపాటు నీళ్ళు తొణికిసలాడుతూన్న శబ్దానికి రెండు బజార్ల అవతల నిద్రపోతున్నవాళ్ళు కూడా లేసి కూర్చునేవారు. వేప పుల్ల నోట్లో వేసుకుని వచ్చి బిందెలో నీళ్ళు ముంచుకుని తెల్లారిందంటే పిల్లా! నిద్దరబోతున్న నీళ్ళని కూడా లేపేసి జోళ్ళు జోళ్ళు మోసేసి గాబులు నింపేస్తావ్! యెనకమాల మాక్కాసిని ఉంచావా లేదా అని పరాచికాలడేది నాగరత్నమ్మ మామ్మ.   తనకి ఊహ వచ్చాకే ముగ్గురు ఆడవాళ్ళు ఆ నూతిలో  పడి చనిపోయారు . తను కూడా ఒకసారి కాలుజారి నూతిలో పడిపోతూ  ఎలాగో ఒకచేత్తో గట్టిగా తాగాడిని పట్టుకుని వ్రేలాడుతుండగా పెద్దతాత కొడుకొచ్చి చేతిని పట్టుకుని పైకి లాగి రక్షించాడు.అప్పటికే నిండుగా ఉన్న నూతిలోకి ఒరిగి సగం శరీరం తడిసి పోయింది కూడా.

ఆరోజు అమ్మ గట్టిగా ఏడ్చింది. గంగమ్మ చల్లగా చూడబట్టి నా బిడ్డ బ్రతికి బయటపడింది . ఆ నూతిలో పడిన వాళ్ళలో ఒక్కరైనా బ్రతికి బయట కట్టలేదు. పిల్ల నింపిన గాబులో నీళ్ళు పోసుకుని ఉరుకులు పరుగులుమీద రాచకార్యాలు యెలగబెట్టటానికి పోవడమే తప్ప  మగాడయి వుండి  ఏనాడైనా నాలుగు జోళ్ళు నీళ్ళు తెచ్చి పోసిన పాపాన పోయ్యాడా అని నాన్నని సాపిస్తూ, ఇంత కఠినాత్ముడిని ఎట్టా కన్నదో మహా తల్లి . ముసలాళ్ళకి నీళ్ళు తోడి పోసావంటే నీ కాళ్ళు  ఇరక్కొడతా అంటూ హెచ్చరించింది. మధ్యలో నాయనమ్మ ఏం చేసింది ఆమెని తిడతావ్ అంటూ  విసుక్కుంటూ అమ్మకి దూరంగా జరిగి బట్టలుతకడానికి వేసిన బొంత రాయి పై కూర్చున్నా . నాయనమ్మ గబగబా వచ్చి పమిట చెంగుతో నీళ్ళు కారుతున్న తలని తుడిచి రిబ్బన్ పువ్వునిప్పిరెండు జడలని విప్పి తల బాగా తుడిచింది.

అంతమంది దొడ్లలో బారలు బారలు పెరిగిన తాళ్ళున్నాయి . ఒక్కల్లైన  ఒక తాడిని నరికి తాగాడిని వెయ్యకపోతున్నారు . పుచ్చిపోయి వూలిపోయి వున్న తాగాడి యెప్పుడు విరిగి నూతిలో పడుద్దో అన్నట్టు ఉంది  అందరూ సొంత నూతులు తవ్వుకుని దాన్ని వొదిలెసారు . ఈశాన్యం స్థలం లేక నుయ్యి తవ్వుకోలేక ఇంత దూరం నుండి నీళ్ళు మోసుకోలేక అవస్థ పడతున్నాం . ఉండటానికి ముగ్గురు కొడుకులుండి తిండికే కాదు నీళ్ళకి అలమటించాల్సివస్తుంది  అంది నాయనమ్మ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ .

మా అమ్మ నీళ్ళు పోయ్యొద్దు అంటే మాత్రం నేను మానేస్తానా నాయనమ్మా!.  చూడకుండా అయినా నేను పోస్తానుగా ఏడవబాకు అంటే. నీళ్ళ కోసం కాదమ్మా! ఆ నూతి మీద నీళ్ళు తోడుతూ నువ్వేమవుతావో అని నాకు భయం. మీ పెద్దత్తనిని మింగిన నుయ్యి అది . మీ నాన్న మేనత్తని మింగిన నుయ్యి కూడా అదే అంది. ఇంకా కల్యాణి , కళ్యాణీ వాళ్ళ అమ్మ, మూలింటి వాళ్ళ కోడలు కూడా ఆ నూతిలో  పడి చచ్చిపోయారుగా  అన్నాను. ఆ తర్వాత ఆ నూతిలో  నీళ్ళు తోడటానికి నాకేంభయం వేయలేదు కానీ అమ్మకి భయమేసింది.

అమావాస్య రోజు రాత్రిపూట మా ఇంటి చాకలిని తోడు తీసుకుని  కోడి పెట్టని ఒకదాన్ని పట్టుకుని దానికి పసుపు పూసి కుంకమ బొట్లు పెట్టి మెడలో వేపాకుల దండేసి ఆ కోడి పెట్టని నన్ను  నూతి  దగ్గరకి  తీసుకెళ్ళి కోడిని నా చుట్టూ మూడుసార్లు త్రిప్పి నేలకి తాపించి  కోడిని  కోసి   తల నుండి కారే రక్తాన్ని నూతిలోకి  విదిలించింది మా చాకలి . చచ్చిన  కోడిని  నూతి ప్రక్కనే గుంటతీసి పూడ్చి వేసి ఆ మట్టిపై పెద్ద రాయిని పెట్టిచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చి తలస్నానం చేయించి నా చేతికి తాయెత్తు కట్టి యిక భయమేమి లేదు. గంగ గండం అమ్మాయికి తొలిగిపోయినట్లే అని అమ్మ దగ్గరనుండి వందరూపాయలు పుచ్చుకుని వెళ్ళింది. ఇక అప్పటినుండి  దూరంగానున్న  వేరే నూతి నుండి నీళ్ళు తెచ్చుకోవడం మొదలు పెట్టాం . తర్వాతతర్వాత ఆ నుయ్యి కృంగిపోయి పూడిపోయింది. అలా నా జ్ఞాపకాలలో పెద్ద నుయ్యిని గుర్తుచేసుకుని భారంగా నిట్టూర్చి ఇంటిలోపలికి వచ్చాను. ఆ రాత్రి ఇంటికి వచ్చాక కూడా నూతి జ్ఞాపకాలు నన్నొదలలేదు. ముఖ్యంగా కల్యాణి, తన గురించే ఆలోచిస్తూ పడుకున్నాను .

*******************

నేను చెంబు తీసుకుని పాటిమీదకి వెళుతున్నాను.  ఎవరెవరో నేనెరుగని ముఖాలు రెండు, యెరిగిన ముఖాలు మూడు నూతిలోనుండి కీచు గొంతులతో నన్ను పిలుస్తున్నట్టు ఉంది. అందరూ ఏమిటేమిటో చెపుతున్నారు . ఎవరేమి చెపుతున్నారో నాకసలు అర్ధం కావడం లేదు. చెవుల్లో హోరు మనే శబ్దంతో పాటు యేడుస్తున్న శబ్దం, వెక్కిళ్ళు పెడుతున్న శబ్దం. నేను నూతిలోకి తొంగి చూస్తున్నాను. అమ్మ నాయనమ్మ వచ్చి నన్ను చేయి పట్టి వెనక్కి లాక్కోస్తున్నారు. ఉండండి వాళ్ళు ఏమిటో చెపుతున్నారు విని వస్తాను అంటున్నా వినకుండా  ఇంటికి లాక్కుని వచ్చేసారు. నేను  బిర్ర బిగదీసి దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు నూతిలో గొంతుకలు వినిపిస్తూనే ఉన్నాయి. అబ్బబ్బా ! మీరందరూ ఇలా రొద పెడితే నాకేమి అర్ధం అవుతుంది. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి వింటాను అన్నాను . వినడమే కాదు యీ రాత్రి  మా గొంతుకలకి నీ కలం అరువువ్వాలి. ఎవరికీ చెప్పని రహస్యాన్ని నీకు చెపుతున్నాం అన్నాయి. రహస్యమా ! అందరూ చెప్పేది రహస్యాలేనా  అంటూ  ఆసక్తిగా లేచి కూర్చున్నాను.

ముందుగా వయసులో పెద్దదాన్ని నేను చెపుతా .. అంటూ రత్తమ్మ గొంతు విప్పింది.  నీకన్నా మూడు తరాల ముందు ఇంటి ఆడపడుచుని నేను అంటూ కథ మొదలెట్టిందామె.అయిదుగురు అన్నదమ్ముల మధ్య ఒకే ఒక ముద్దుల చెల్లిని. అన్నదమ్ముల కళ్ళ ముందరే తిరగాలని మేనమామ దాయాదుల ఇంటికి కోడలిని చేసారు. ఐదురోజుల పెళ్ళి మీనాలో ఊరేగింపు,  వడ్డాణం,కంటె, రవ్వ బేసరి, నాలుగు జతల గాజులు,నాలుగుబళ్ళ ఇత్తడిసామాను,పందిరిమంచం,ఆవు,దూడ రెండెకరాల పొలం కట్నం కింద రాసిచ్చి సారె చీరలతో ఘనంగా అత్తవారింటికి  పంపారు. నేను కాస్త పొట్టిగా తెల్లగా  మరీ సన్నం మరీ బండగా కనబడని ముక్కుతో  అందంగా ఉండేదాన్ని. మా ఆయన అన్నదమ్ములిద్దరూ. మా ఆయన కూడా నాలానే పొట్టి మనిషి. ఆయనకీ విరుద్దంగా మా బావ ఆజానుబాహువు అందగాడు. మా తోడికోడలు పేదింటి పిల్ల. చంకలో  పిల్ల కడుపులో పిల్లతో నీరసంగా ఉండేది. మా అత్త,విధవరాలైన ఆడపడుచు తగని గయ్యాళులు. పెళ్ళైన పదహారురోజులకే నా ఒంటిమీద నగలన్నీ వొలుచుకుని భోషాణంలో  పెట్టి తాళాలు బిగించుకున్నారు.  గొప్ప సంబంధం అని చేసుకుంటే ఇంతేనా ఇచ్చేది అని సూటిపోటి మాటలతో దెప్పి పొడిచేవారు.వారానికొకసారి అయినా యేదో ఒక సారె పుట్టింటి నుండి రాకపోతే కాల్చుకు తినేవాళ్ళు. రాత్రి పూట మా ఆయన పడకటింట్లోకి వస్తే చాలు మా అత్తగారు  ధాన్యం పురి దగ్గర ఎలుకలు తవ్వుతున్నాయనో, దూడలు విప్పుకుని ఆవుల దగ్గరకి వెళ్ళాయనో కేకలు పెట్టి   మమ్మల్ని దూరం చేసేది. పగలల్లా పొలం పనులతో ఆయన ఇంటి పనులతో నేను తీరిక లేకుండా ఉండేవారిమి. ఏడాది దాటినా మా మధ్య మొగుడు పెళ్ళాం బంధం ఏర్పడనేలేదు . కోడలు నీళ్లోసుకోలేదు అంటే ఆమె పుట్టింటి నుండి తెచ్చిన భోగభాగ్యాలు తినడానికి ఆ నలుసే లేదు పాపం అని మెటికలు విరిచేది. మా ఆయన మెతక అవడంతో యేమీ మాట్లాడలేక నిస్సహాయంగా చూస్తూ ఉండేవాడు. మా బావ చూపు నాపై పడింది. తమ్ముడిని వరికుప్ప దగ్గరకి కాపాలాకి పంపి గదిలోకి వచ్చి గడియవేసాడు. నా అరుపులు విని అత్తా ఆడపడుచు కిటికీ ప్రక్కకొచ్చి  నోరుమూసుకుని ఉండు. ఎన్నాళ్ళ నుండి సాగుతుందీ రంకు. మేము చూసేసరికి అరుపులు మొదలు పెట్టావ్ .. అని కానీయరా అబ్బాయ్ , ఒక నలుసు కడుపులో బడితే వారసుడిని అడ్డం బెట్టుకుని దాని మేనమామలు కాజేసిన  మన ఆస్తిని దీని అమ్మకి కట్టబెట్టారుగా . ఇప్పుడు  దీని అన్నదమ్మల నుండి ఆ  ఆస్తిని లాగేయవచ్చుఅని కిటికీ తలుపులు మూసి వెళ్ళారు. కాసేపటికే  నా బ్రతుకు ఆ కుక్క చింపిన విస్తరి అయిపోయింది. ఆసంగతి నా అన్నదమ్ములకి చెప్పాలని  ఆ అర్ధరాత్రి వేళే  దొడ్డి తలుపు తీసుకుని పుట్టింటికి బయలుదేరాను. ఇంకా పర్లాంగు దూరం అయితే పుట్టింట్లో పడేదాన్ని. మా అత్త ఆడపడుచు బావ ముగ్గురూ నా వెనుకగా వచ్చి నా చీర చెంగే ముఖాన కప్పి మజ్జిగ కవ్వం తాడుతో మెడకి ఉరి బిగించి యీ నూతిలోకి తోసేసి యింటికెళ్ళి యేమీ యెరగనట్టు పడుకున్నారు. తెల్లారాకనూతిలో  నా శవాన్ని చూసి గగ్గోలు పెడుతూ .. ఇంకా కడుపు పండలేదు మా అబ్బాయికి మగతనం లేదా అని అనుకుంటారు అన్నానమ్మా ! ఆ మాటకే నూతిలో  దూకి చావాలా  అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడ్చారు. మా ఆయనకి జరిగినది తెలిసినా పెదవి విప్పలేదు. అత్తింటి వాళ్ళు కట్నం చాలలేదని ఆరళ్ళు పెట్టారు అందుకే నూతిలో దూకిందని యేడ్చుకుని యేడ్చుకుని ఆళ్ళ పిల్లలకి నాపేరు పెట్టుకున్నారు అని ముగించింది. తాతయ్య ఎప్పుడూ చెపుతూ ఉండేవాడు.  అసలు  సంగతి ఇదా అంటూ ఆశ్చర్యం ప్రకటించాను.ఇక మీ మేనత్త తన చెపుతుంది విను అంది.

***************************

  నా మేనత్త . ఆమెనసలు చూడనే లేదు నేను. అందరూ ఎత్తు, లావు,  కళ్ళు,జుత్తు అన్నీ ఆమె పోలికే అంటారు. ఏదీ నన్ను చూడనీ అంటూ బావిలోకి తొంగి చూసాను. గోధుమ రంగు శరీర ఛాయ,  పెద్ద కళ్ళు ,ఒత్తైన కనురెప్పలు, నల్లటి నిగ నిగలాడే పొడవైన జుత్తు, పల్చటి పెదాలు కొద్దిగా బండ ముక్కు.. నాకులాగానే ఉంది ఆమె. అచ్చు అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టు గానే ఉంది. అత్తా .. అన్నాను సంభ్రమంగా. చిన్నగా నవ్వింది. నీకులాగానే చురుకుగా ఉండేదాన్ని. ఇంటి వెనక వాళ్ళబ్బాయి దబ్బపండులా పచ్చగా ఉండేవాడు. కావాలని చేసుకున్నాడు. గోడదిగి పుట్టింటికి కూడా రానిచ్చేవాడు కాదు. పెళ్ళైన కాడి నుంచి ఒకటే రోగం. ఎంతమందికి చూపించినా నా రోగం తగ్గేది కాదు . ఆఖరికి బెజవాడ వెళ్లి కూడా చూపించాడు మా పెద్దతమ్ముడు. అయినా తగ్గలేదు. ఇది యింటిపనికి పనికిరాదు పడకటింటికి పనికిరాదు. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపొండి..అని పంపించేసారు. నా రోగం ఏమిటన్నది నేను ఎవరికీ చెప్పినదాన్ని కాదు. మా అత్త  పెళ్ళి అయి నాలుగేళ్ళు అయినా పిల్లలు పుట్టలేదని తిట్టిపోసేది. పిల్లలు ఎందుకు పుట్టటం లేదో నేను ఎలా చెప్పేది. నా మొగుడు పరమ వికృతమైన వాడు. ఒంటిమీద బడితే విలవిలలాడాల్సిందే. ఏ పశువో, పక్షో అయితే ఆడమగ కలయికంటే యేమిటో తెలిసేదేమో, వాడు పేరుకే మనిషి.   క్షేత్రంలో విత్తు నాటితే మొలకెత్తుతుంది గాని యింకెక్కడో నాటుతానంటే ఎన్నాళ్ళని ఓర్చుకునేది. ఎవరితోనయినా చెప్పుకోవాలంటే సిగ్గు. ఆఖరికి డాక్టర్తో చెప్పుకుందామంటే మగ డాక్టర్ అయిపోయే. ఎవరైనా నీకెక్కడ బాగోలేదు అని అడిగారా ? నాడి చూసేది,కళ్ళు చూసేది, వొళ్ళు చూసేది అంతే. దొడ్డికి వెళితే రక్తం ధారలుగా పోయేది. నడక కష్టమై నిత్యం జ్వరంతో ఉండికూడా   మొగుడిముందు బోర్లా పడుకునే బాధ యే౦దిరా భగవంతుడా అనుకుని కన్నీళ్లు పెట్టడమే ! రక్తం అంతా పోయి వొళ్ళు నీలంగా మారిపోయి మంచానికి అత్తుక్కుంటే.. రెండెకరాలు పొలం అమ్మి  వైద్యానికి మద్రాసు తీసుకుపోవడానికి తయారైనాడు మా పెద్ద తమ్ముడు. అప్పుడైనా నా బాధ యిది అని మా అమ్మకి చెప్పాలనుకున్నా  కానీ చెప్పలేకపోయా.  వైద్యం చేయించుకుని నేను బ్రతికి మళ్ళీ ఆ మొగుడి దగ్గరకే కదా పోవాలి అనుకుని చడి చప్పుడు కాకుండా  చెంబుతో నీళ్ళు తీసుకుని  పాటిదిబ్బల మీదకి పోతున్నట్లు పోయి .. యీ నూతిలో  దూకేసా ! అట్టా నా వాళ్లకి యెకరాలు మిగిలే, నా బాధలు తీరె! అంది కళ్ళు తుడుచుకుంటూ.నేను మాట రాక చూస్తూ ఉండిపోయా.

మగాడికి పెళ్ళాన్ని సుతిమెత్తగా చూసుకోవడం తెలియకపోయే మనసెరిగి కాపరం చెయ్యడం తెలియకపోయ్యే. వొళ్లో పెట్టేదాన్ని దడిలో పెడతా, రొచ్చుని తీసుకొచ్చి నోట్లో పెడతా అంటే రోగాలు కాక యేమొస్తాయి తల్లీ! పగాడికి కూడా వద్దు ఈ బాధ. సానికొంపల్లో పుట్టినదానికి కూడా యెగటు పుట్టే కాపరం అది. ఇదిగో ఈ గంగమ్మ చేతులు జాపి చల్లగా తనలోకి జేర్చుకుని రొవ్వంత శాంతినిచ్చింది. చెప్పుకోలేని రోగం వచ్చి చచ్చిపోయింది అని చెప్పుకోకండి.  ఇకముందు మన యింటి  ఆడాల్లైనా  యిదిగో అత్త యీ ఇబ్బంది పడి చెప్పులేక చచ్చిపోయింది అని చెప్పుకోండి తల్లీ . అని కళ్ళు తుడుచుకుంది. ధారలగా కారే కన్నీరుని తుడుచుకోవాలనే సృహ కూడా లేకుండా అత్తా  అంటూ ఆమె దగ్గరకి వెళ్లబోయాను. జాగ్రత్తమ్మ,నూతిలో  పడిపోతావ్ ,వెనక్కి వెళ్ళు నేను కూడా వెళ్ళుతున్నా అని మాయం అయింది ఆమె.

****************
అత్తా అని  లేచి ఏడుస్తున్నాను. కలో మేలుకవో తెలియని స్థితిలోనే కాసిని  నీళ్ళు త్రాగి పడుకున్నాను.  మళ్ళీ కళ్ళముందు కళ్యాణీ కదలాడింది. నిజంగానే కళ్యాణీ కాలు జారి నూతిలో పడిందా లేక వాళ్ళ అన్నయ్య స్నేహితుడు అమ్మ నాన్న ఆట ఆడేసాడా? అప్పటికీ  ఇప్పటికి నా సందేహం అలాగే ఉండిపోయింది.. ఆలోచిస్తూ అలా కళ్ళు మూసుకున్నాను.

*********************

వెక్కి వెక్కి ఏడుస్తుంది కళ్యాణీ .. ఏయ్.. ఎందుకేడుస్తున్నావ్ ! నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా చాలా యేడ్చాను కళ్యాణీ. ఏం జరిగింది, వాడు చెంబు తీసుకుని వెళ్ళినప్పుడు తుమ్మ పొదలమధ్యకి తీసుకెళ్ళి మళ్ళీ యేమన్నా చేసాడా? అమ్మ నాన్న ఆట ఆడితే పిల్లలు పుడతారని నీకు ఖచ్చితంగా తెలుసా ! అవున్లే మీ నాన్న గారు డాక్టర్ యేగా! నీకు తెలిసే ఉండవచ్చు. పిల్లలు పుడతారంటే ఇష్టం లేకపోతే మందులేసి, జిల్లేడు వత్తులేసి  కడుపులు తీసేస్తారని నువ్వే చెప్పావుగా ! అలా చేయించుకునే పనిగా , అసలెందు చచ్చిపోయావ్ , నాకు ఆడుకోవడానికి నీలా మంచి స్నేహితులే లేరని ఎంత యేడుస్తున్నానో తెలుసా !  అన్నాను.

కళ్యాణీ నవ్వి నువ్వు చాలా తెలివికలదానివి. నీకు అనుమానం వచ్చేసిందా ! నిజంగానే నేను నూతిలో  ప్రమాదవశాత్తు పడిపోలేదు ,కావాలనే దూకేసాను.  మా అన్నయ్య స్నేహితుడు ఆ సాయిబ్బుల అబ్బాయి నా వెంట పడుతున్నాడు అని చెప్పానుగా , వాడే మా యింట్లో యెవరూ లేనప్పుడు దూరి మా పందిరి మంచం క్రింద వొక్కసారంటే వొక్కసారి అమ్మ నాన్న ఆట ఆడుకుందాం అని ఆడాడు. తర్వాత కూడా మా అన్నయ్యకి ఆ సంగతి చెప్పేస్తా అని బెదిరించి రోజూ ఆడతానే ఉన్నాడు. అమ్మ లేదు, అక్క దగ్గరకి కాన్పు చేయడానికి వెళ్ళింది కదా ! నాన్న కూడా  రోజూ ఇంటికి రాకుండా నర్స్ యింటికేపోతున్నాడు. ఇక నేను యెవరికీ చెప్పాలి. అన్నయ్యకి చెపితే చంపేస్తాడు.  ఆరోజు  మధ్యాహ్నం వాంతులు అయ్యాయి. అవి ఎలాంటి వాంతులో  నాకు తెలుసుగా. అక్కవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు అలాగే వాంతి చేసుకునేవారు. మధ్యాహ్నం  అమ్మ నాన్న ఆట ఆడుకుందాం అని వచ్చిన ఆ సాయబ్బుల అబ్బాయిని మనం నిజంగానే అమ్మా నాన్న కాబోతున్నాం యెటైనా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాము అని అడిగాను.  అప్పుడు వాడు అమ్మ నాన్న ఆటా , అసలు మనమెప్పుడు ఆ ఆట ఆడాము?నాకు తెలియనే తెలియదు.. మీ నాన్నకి చెప్పి నిన్ను కొట్టించాలి అని వెళ్ళిపోయాడు. నాకు ఏడుపొచ్చి నూతిలో  దూకేసాను అంది.

 నా అనుమానం నిజమే అయింది కళ్యాణీ ! అసలు నువ్వెందుకు అలా చేసావ్ ? వాడు నన్ను కూడా అలాగే అన్నాడు. మా అమ్మతో చెపుతా అన్నాను.   నువ్వు నాతో అప్పుడే చెపితే మా అమ్మతో చెప్పి వాడి కీళ్ళు విరగ్గొట్టిచ్చి ఉండేవాళ్ళమి కదా ! అనవసరంగా చచ్చిపోయావ్ అన్నాను వెక్కుతూ. కళ్యాణీ కూడా యేడుస్తూనే ఉంది. మీ అమ్మ రాకుండానే నిన్ను పూడ్చి పెట్టేసారు. తర్వాత మీ అమ్మ వచ్చి ఎంత యేడ్చిందో తెలుసా ! మంచానికి అతుక్కుపోయింది. ఆ సాయిబ్బులాడు వంకరగా నవ్వుతూనే ఉండేవాడు నన్ను చూసి. ఒకరోజు పాటి మీద నా చేయి పట్టుకున్నాడు. ఏడుస్తూనే చెంబుతో వాడి ముఖం మీద కొట్టి పారిపోయి వచ్చేసాను. తర్వాత నేను నూతిమీద నీళ్ళు తోడుతుంటే నూతిలో  ఈత కొడుతూ నా కాళ్ళ మధ్య నుండి చూస్తూ యేడిపించేవాడు.అప్పుడు అమ్మకి చెప్పాను వాడిసంగతి.   తర్వాత మా ఇంట్లో మరుగుదొడ్డి కట్టించేసింది.  తర్వాత వాడికి పెళ్లై యిద్దరు పిల్లలు పుట్టాక పెళ్ళాం ఎవరితోనో లేచిపోయింది. వాడికి యేదో రోగం వచ్చి ఈసూరుమంటూ ఉండేవాడు. ఇప్పుడు వాడు చచ్చాడో బతికాడో కూడా  తెలియదు, నాకు వాడంటే అంత అసహ్యం. అన్నట్టు నీకు తెలుసా! మీ అమ్మ కూడా ఇదే బావిలో పడి చచ్చిపోయింది. అన్నాను. ఇదిగో అమ్మ కూడా యిక్కడే వుందిగా చూడు అంది కళ్యాణి.

******************

" డాక్టర్త్ గారి అత్తయ్య గారూ " అన్నాను నేను సంతోషంగా. పిల్లా ! ఇంకా ఆ పేరుతోనే పిలుస్తావా ?అంటూ నవ్వింది. ఎలా ఉన్నారు? మీరు ఈ నూతిలో  పడి చచ్చిపోయాక యిక యెవరూ యీ నూతి నీళ్ళు వాడటం మానేశారు. మేము కూడా  నీళ్ళకి రావడం మానేశాము  !  అవునూ మీరెలా పడిపోయారు ? కళ్ళు తిరిగి పడిపోయారా ? అన్నాను.

లేదమ్మా ! చెప్పుకుంటే సిగ్గుచేటు. మా ఇంటెదురుగా ఉండేవాడే మీ రంగా రావు మావయ్య వాడే నా చావుకి కారణం. ఛీ ..వాడా ! వాడంటేనే ఆడాల్లందరికీ అసహ్యం. కళ్యాణీ కూడా మీకెప్పుడూ చెప్పి ఉండదులే ! ఆడపిల్లలు కనబడితే చాలు పంచె యెత్తి రెండుకాళ్ళ మధ్యన ఉన్నదాన్నితీసి  చూపించే వాడు. దాన్ని చేత్తో పట్టుకుంటావా / రూపాయిస్తా ! అనేవాడు. వాడితో మాట్టాడితే వాత పెడతాను. వొట్టి మదపు వెధవ..అని మా  చిన్న మేనత్త కూడా తిట్టేది అన్నాను. ఊ ..వాడే ! మీ డాక్టర్ మామయ్య గారు లేనప్పుడు ఇంట్లోకి జొరబడి మా ఆవిడ కార్తీక మాసం అని మడి కట్టుకుని కూర్చుంది. వస్తానన్న నర్సి ముండ ఇంతవరకూ రాలేదు. మీ ఆయన కూడా లేడుగా . వెయ్యి రూపాయలిస్తా అంటూ తలుపులు బిగించి మంచానికి కాళ్ళు చేతులు కట్టేసి ముఖం మీదకి తెచ్చి రుద్దబోయాడు. అరిసినా వదిలిపెట్టలేదు . చెంపలు చెంపలు వాయించి వాడి కుతి తీర్చుకోబోయాడు పైగా మీ ఆయన డాక్టర్ గా . ఇలాంటివి నీకు నేర్పే ఉంటాడు. నువ్వైతే బాగా వొడుపు నేర్చుకుని వుంటావని వస్తే యిలా కొరికి పెడతావేమిటే ముండా అంటూ .. పిడి గుద్దులు గుద్దాడు. నేను గట్టిగా అరిచేటప్పటికి వెనకింటి వదిన గారు వచ్చారు. ఆమెని చూసి రెండు కాళ్ళ మధ్య రక్తం కారుతున్న దాన్ని పంచతో వొత్తిపట్టుకుని పరిగెత్తాడు. ఆరుగురు బిడ్డల తల్లిని.  అన్నయ్యగారూ  అని పిలిచే నన్ను వావి, వయసు మరిచి  బిడ్డపోయిన దుఃఖంలో ఉన్న  సంగతి కూడా మరిచి అంతటి దురాగతానికి పాల్పడ్డాడు. అందరూ నావి ఎత్తు పళ్ళు, పార పళ్ళు అని వెక్కిరించేవాళ్లుగా, ఆ పళ్ళనే ఆయుధాలుగా చేసి వాడి తీట తీశాను కానీ వెనకింటి ఆమె చూడనే చూసింది. మీరు చనువియ్యకపోతే దైర్యంగా లోపలికి ఎందుకు వస్తాడు ? డబ్బులకి ఆశపడి ఉంటారు,అందులో కుటుంబం కూడా జరగడంలేదుగా అంది. అవమానం అనిపించింది  నూతిలో దూకాను. అందరూ మతిస్థిమితం లేక  నీళ్ళు తోడుకుంటూ ఓపిక లేక కళ్ళు తిరిగి పడిపోయింది అనుకున్నారు అని చెప్పింది. అత్తయ్యగారు అన్నాను బాధగా , ఆ రంగారావు గాడు  మిమ్మల్ని అలా చేసినందుకు యేదో గుప్తరోగం వచ్చి చచ్చాడులే ! అన్నాను. నూతిలో నుండి యే సవ్వడి లేదు. అయ్యో! ఇప్పటిదాకా మాట్లాడిన వీళ్ళందరూ ఇంతలోనే యేమైపోయినట్లు ..అనుకుంటూ నూతొడ్డు  నుండి లేవబోయాను.

***********************

అందరు చెప్పింది విన్నావ్ . మరి నేను చెప్పేది వినవా ..అంది ఇంకో గొంతు చెయ్యి పైకెత్తి ఊపుతూ. ఆ చేతి నిండుగా  రంగు రంగుల గాజులు. ఇంకో రెండు రోజులుంటే అమ్మలక్కలు ఆ చేతుల గాజుల్ని పగలగొట్టి విధవని చేసేసేవాళ్ళు. పెద్ద కర్మ అవకముందే చచ్చిపోయింది కాబట్టి ఇదే నూతి ఒడ్డున చేటల నిండుగా గాజులు తెచ్చి అందరికి పంచిన జ్ఞాపకంలో నుండి తేరుకుంటూ   ఆమె వొంక చూసి నువ్వు మూలింటి  వాళ్ళ కోడలివి కదా అన్నాను. అవును అంది నవ్వుతూ. చందమామ ముఖంలో మల్లెపూలు పూసినట్టు ఉంది ఈమె నవ్వు అనుకున్నాను . పాపం ! మీ ఆయన చనిపోయాడని నువ్వు కూడా నూతిలో దూకి చనిపోయావు కదూ! తప్పు కదూ,పాపం నెలల పసిపిల్లవాడ్ని వదిలేసి మీరిద్దరూ అలా చచ్చిపోవచ్చా అన్నాను

 ఏం చేయను ? చచ్చిపోవాలని లేకపోయినా చచ్చిపోయాను. మా మామ ఎంతటి అభాండం వేసాడో నామీద. మా ఆయనకీ రెండో భార్యని నేను. మా అత్తమామ ఎప్పుడో గొడవలు పడి విడిపోయారంట . మా ఆయన మా మామ దగ్గర పెరిగి మంచి ఉద్యోగస్తుడు అయ్యాడు.హాస్పిటల్ లో పనిచేసేవాడు మా ఆయనకీ పెళ్ళి చేసి ఆయనతోనే ఉండేవాడట మామ. రెండో సంబంధం అయినా అందంగా ఉండాడు ఆస్తిపాస్తులున్నాయని మా అమ్మ  నన్ను వొప్పించి పెళ్ళి చేసింది. సంబంధం మాట్లాడుకునే టప్పుడే తండ్రి కొడుకు వేరు వేరుగా వుండేటట్టు అయితేనే పిల్లనిస్తానని మా అమ్మ చెప్పింది అంట. మా మామ ఈ ఊర్లోనే ఉండేవాడని మీకు తెలుసు కదా ! అప్పుడప్పుడు మా ఇంటికివచ్చేవాడు. మా ఆయన తను ఉన్నప్పుడే తండ్రిని మా ఇంటికి రమ్మని తను లేనప్పుడు మా యింటికి రావద్దని గట్టిగా చెప్పేసాడు. నా సవతి మీద లేనిపోనివన్ని పుట్టిచ్చి మా ఆయనకీ ఎక్కించి వాళ్ళని విడగోట్టేసాడని మా ఆయన చెప్పేవాడు. మా ఆయన చచ్చిపోయిన రోజు  యేమి జరిగిందంటే మామ మా ఇంటికి వచ్చాడు. భోజనం చేసి సాయంత్రం దాకా ఉండి మా ఆయన డ్యూటికి వెళుతూ తండ్రిని బస్ యెక్కించేడు. మా ఆయన దూరంగా వెళ్ళాక ఎక్కిన బస్ దిగి   మళ్ళీ మా యింటికి వచ్చి కూర్చున్నాడు. నాకు యేదో జరుగుతుందని భయంగానే ఉంది. వంటింట్లో పనిచేసుకుంటున్న  నా వెనుక నిలబడి నడుం చుట్టూ  చేయి వేసాడు. అంతలో భళ్ళున తలుపు తెరచుకుంది . గుమ్మంలో మా ఆయన. నన్నేమి అనలేదుకానీ  తండ్రి ముఖాన ఖాండ్రించి ఉమ్మాడు. లోపలి గదిలోకి వెళ్లి మత్తు ఇంజక్షన్ చేసుకుని మంచంపై పడుకుని చనిపోయాడు. నేను తేరుకుని చూసేసరికి ఘోరం జరిగిపోయింది. దహన  కార్యక్రమాలన్నీ అయినాక కొడుకు చచ్చిపోవడానికి కారణం నేనే అని ఆయన హాస్పిటల్ నుండి యింటికి వచ్చేసరికి  నేనెవరితోనో కలిసి వుండటం చూసాడని అందుకే ఇంజెక్షన్ చేసుకుని చచ్చిపోయాడని  బంధువులందరికీ చెప్పాడు. ఆస్థిలో చిల్లిగవ్వ కూడా యివ్వనని  పేచీ పెట్టాడు. కొడుకు  ఎందుకు చనిపోయాడో మా అత్తకి తెలుసు. అంతకి ముందు భార్యపై చెప్పిన కల్లబొల్లి విషయాలన్నీ కూడా మా మామ కట్టుకతలే అని తల్లి కొడుకులకి తెలుసునని ఆమె చెప్పింది. అర్ధరాత్రి సమయంలో నన్ను నిద్రలేపి వాడి నిజస్వరూపాన్ని నాకళ్ళకి చూపించింది. పశువులతోనూ , పెంపుడు కుక్కలతోనూ వాడి పైశాచిక రతి క్రీడల గురించి చెప్పింది. నేను వణికిపోయాను. కొడుకుకి వారసత్వంగా వచ్చే ఆస్తిని పసిపిల్లాడి పేరున వ్రాయించడానికి పూనుకుంది కూడా !   మా అత్తకూడా నా తరపున మాట్లాడేసరికి నన్ను బెదిరించడం  మొదలపెట్టాడు. నా భర్తకి వచ్చే వాటా కాకుండా తనకున్న ఆస్తి మొత్తం నా పిల్లాడికి వ్రాసి యిస్తాను తనతో ఉండిపొమ్మని లేకపోతే  బయటవాళ్ళతో యెవరితోనో కాదు నీకు నాకు సంభంధం ఉండటం వల్లే నా కొడుకు చచ్చిపోయాడని చెపుతానని బెదిరించాడు. వాడి వేధింపులు భరించలేక నేను లేకపోయినా పిల్లాడిని మా అత్త బాగా చూసుకుంటుందనే నమ్మకం కుదిరి .. చెంబు పట్టుకుని వచ్చి మా అమ్మ ప్రక్కన ఉండగానే  ఈ నూతిలోకి దూకేసాను అంది. నేను మూగబోయి వింటూనే వున్నా.

ఆడాళ్ళకి చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడల్లా యిదిగో ఇట్టాంటి నూతులే సీతమ్మని భూదేవి  తల్లి తనలోకి పొదువుకున్నట్టు చల్లగా అక్కునజేర్చుకుంటుంది.  వినిపించుకునే మనసుండాలే కానీ వేల వేల నూతుల్లో నాలాంటి స్త్రీల లోగొంతుకలు వినబడుతూనే ఉంటాయి. నీ కలం అరువిచ్చి ఈ గొంతుకలని వినిపించు చెల్లీ .. ఇంటింటికి ఒక నుయ్యి లేకపోయినా వీధి వీధికి ఒక నుయ్యి అయినా ఉండాలి. జనం నీళ్ళు త్రాగడానికి కాదు. మన ఆడాళ్ళు కన్నీళ్లు దాచుకోవడానికయినా నుయ్యి ఉండాలి. నూతులని పూడ్వ నీయకండి.  తరతరాల ఆడాళ్ళ ఆత్మాభిమానాన్ని ఇలాగన్నా నిలుపుకోనీయండి,  వికృతమైన మగాడి కోరికల అగ్గి నుండి తప్పించుకుని పుట్టిళ్ళు ఆదరించకపోయినా  నిస్సహాయతలో ఆదుకోవడానికి ఓ తోడు ఉండనివ్వండి   అంటూ తలని నీళ్ళలోకి వంచింది ఆమె. నేను తేరుకునే లోపే గుడ గుడ మనే శబ్దం నూతి మధ్యలో. నీళ్ళు కాసేపు వలయాలుగా తిరిగి తిరిగి నిశ్చలంగా నిలబడిపోయాయి.

ప్రొద్దున్నే పనిమనిషి వచ్చి ఇల్లు ఊడుస్తూ అమ్మగారూ .. ఇవిగో యీ కాయితాలు యేవిటో చూడండి పనికొచ్చేయ్యే అంటారా .. కథలు గిధలు వ్రాసుకుంటారుగా, అయ్యేమన్నానేమో చూసుకోండి అంటూ  పేపర్ చదువుకుంటున్న నా  ముందు పెట్టి వెళ్ళింది.

నేనెప్పుడు వ్రాసానబ్బా ఈ కథ!  అనుకుంటూ చూసానా .. నూతిలో గొంతుకలు అని కనబడింది. వినబడింది కూడానేమో ! అందుకే కలం అరువిచ్చాను కాబోలు అనుకుంటూ  ఆలోచనగా ఆ కాగితాలవైపు చూస్తూ వున్నాను (అమ్మలు పెద్దమ్మలు అక్కలు అందరూ చిన్న పిల్లలు వింటే జడుసుకుంటారని గుసగుసలుగా చెప్పుకునే విషయాలు సబ్ కాన్షియస్ గా ఉండి ఈ కథ వ్రాశానా లేక నిజంగా  వాళ్ళందరూ కలలోకి వచ్చి జరిగిన విషయాలని చెప్పారా అని  తేల్చుకోలేక సతమతమవుతున్నా) 


(2018 మార్చి భూమిక రజతోత్సవ సంచికలో ప్రచురితం )


21, మార్చి 2018, బుధవారం

రెప్పల తడి పై సమీక్ష

రెప్పల తడి కథపై  వాయుగండ్ల శశి .. వ్రాసిన సమీక్ష ఇక్కడ .

 ఈ రోజు సాక్షి ఫండే లో వచ్చిన వనజ తాతినేని గారి కథ.
ఒకే వాక్యం లో చెప్పాలంటే సత్యవతికి కుక్క చనిపోయినప్పుడు వచ్చినంత 
ఏడుపు మొగుడు చనిపోయినప్పుడు ఎందుకు రాదు?
కుక్క సారీ బుజ్జోడు చనిపోయినప్పుడు ఏదో లోపలిది ఏదో
వదిలి వెళ్లినట్లు అయి వర్షంగా కుమిలి కుమిలి కురిసిన దుఃఖం ఒక్క చుక్కగా
కూడా భర్త శవం పక్కన రాలేదే!!!
ఇదంతా సమాజానికి కష్టంగా ఉంది,సత్యవతి ఏడవక పోవడం.
ఏడ్చి తీరాల్సిందే లేకుంటే ఏదో అయిపోతుంది దానికి.
ఏడుపు అంటే నవ్వు కాదుగా ఊరికినే పెదాల మీద అంటించుకోవడానికి!!!
దానికి మాత్రలు కూడా ఉండవు కాబోలు లోకం కోసం ఏడుద్దాము అన్నా.
అయినా లోకం ఒకప్పుడు మొగుడు చనిపోతే నువ్వుకూడా చనిపో అని సతిలో
తోసింది.ఇప్పుడు రాజారామ్ మోహనరాయ్ గారి పుణ్యమా అని ఏడుపే కదా మీ
నుండి అడుగుతుంది.కొంచెం ఇచ్చేస్తే పోతుంది కదా.
ఏడుపు ఊరికే వస్తుందా? లోపల ఏదో కదలాలి.మనదైనది ఏదో దూరంగా
లాగేస్తున్నట్లు,ఇక ఎప్పటికీ రానట్లు, హృదయం నుండి ఏదో తెగిపోయినట్లు ....
రెక్కలు తెగిన పావురం అయి మనసు ఇంకో మనసు కోసం గిలగిల కట్టుకోవాలి.
అదుగో!అప్పుడు వస్తుంది ఏడుపు గొల్లుమంటూ..... కట్టలు తెగిన వరద నీరులా
లోపలి బరువును మోసుకొస్తూ ,కాలిపోయే బంధాన్ని గుండెలపై పొదువుకుంటూ,
వదిలిపోవద్దని కాళ్ళు పట్టుకుంటూ .....అలా రావాలి.
కానీ ఇక్కడ బంధం ఏది?
తాళి కట్టాడు నిజమే!అందుకే కదా తనను కాదని,తన కష్ట సుఖాలు
పట్టించుకోకుండా ఇంకొకరితో తిరిగి చివరి దశలో వచ్చినా సేవలు చేసింది.
సేవలకు హృదయం తో పనిలేదు కరుణ చాలు.కానీ దుఃఖం అలా ఎలా
వస్తుంది!ఆయన ఎప్పుడూ తోడు ఉన్నాడని ఇప్పుడు శూన్యం అనుభవించడానికి?
తోడు లేని ఆయన ఇపుడు పోతే మాత్రం గాజులు బొట్టు తీసేయాలి లోకానికి.
ఎదురు పడితే విసుక్కోవడం,కసురుకోవడం. నిజానికి ఇలాంటి భర్తకంటే మొక్కలు,
కుక్కలు మేలు.కొంచెం ప్రశాంతత ఇస్తాయి అని వ్రాసిన రచయిత మాటలు అక్షరాల నిజం.
ఇప్పుడు కూడా సత్యవతికి శూన్యం లో బుజ్జోడే గుర్తుకు వస్తున్నాడు సత్యవతికి,భర్త కాదు.
తన కోసం ఇంటి దాకా వచ్చివెళ్లే బుజ్జోడు.కొంచెం పాలకు ఎంతో విశ్వాసం చూపే బుజ్జోడు.
,బుజ్జోడా బయటకు వెళదాము వస్తావా!అనగానే పరుగున తోడు వచ్చే బుజ్జోడు,
దూరం అయిపోతే....సత్యవతి ఏమవుతుంది?
బంధం మనకు ఎవరితో ఎలా ఏర్పడుతుందో తెలీదు.అది మొక్కలు అయినా కుక్కలు
ఆయినా దానికి చాలా విలువ ఉంటుంది.మరి అలాంటి విలువకూడా తాళి కట్టిన భార్య
మనసులో సాధించలేని భర్తలను చూసి జాలిపడటం తప్ప ఏమి చేయలేము.
ఇది సమాజం లో అర్ధం చేసుకోవాల్సిన సున్నిత సమస్య.లేకుంటే తడవని కళ్ళను
ముసుగులో కప్పి నటించడం తప్పఇంకో దారి లేదు.
చక్కటి కథనం తో వనజ గారు ఒక సమస్యను మన ముందుంచారు.

16, మార్చి 2018, శుక్రవారం

భూమిక లో ..నేను

 భూమిక రజతోత్సవ సంచిక  మార్చి మాస పత్రికలో ..నేను వ్రాసిన  "నూతిలో గొంతుకలు " కథ.
పత్రికలో కథని చదవండి ప్లీజ్ !



ఆడాళ్ళకి చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడల్లా ఇదిగో ఇట్టాంటి నూతులే సీతమ్మని భూదేవి  తల్లి తనలోకి పొదువుకున్నట్టు చల్లగా అక్కునజేర్చుకుంటుంది.  వినిపించుకునే మనసుండాలే కానీ వేల వేల నూతుల్లో నాలాంటి స్త్రీల లోగొంతుకలు వినబడుతూనే ఉంటాయి. నీ కలం అరువిచ్చి ఈ గొంతుకలని వినిపించు చెల్లీ .. ఇంటింటికి ఒక నుయ్యి లేకపోయినా వీధి వీధికి ఒక నుయ్యి అయినా ఉండాలి. జనం నీళ్ళు త్రాగడానికి కాదు. మన ఆడాళ్ళు కన్నీళ్లు దాచుకోవడానికయినా నుయ్యి ఉండాలి. నూతులని పూడ్వ నీయకండి.  తరతరాల ఆడాళ్ళ ఆత్మాభిమానాన్ని ఇలాగన్నా నిలుపుకోనీయండి,  వికృతమైన మగాడి కోరికల అగ్గి నుండి తప్పించుకుని పుట్టిళ్ళు ఆదరించకపోయినా  నిస్సహాయతలో ఆదుకోవడానికి ఓ తోడు ఉండనివ్వండి   అంటూ తలని నీళ్ళలోకి వంచింది ఆమె. నేను తేరుకునే లోపే గుడ గుడ మనే శబ్దం నూతి మధ్యలో. నీళ్ళు కాసేపు వలయాలుగా తిరిగి తిరిగి నిశ్చలంగా నిలబడిపోయాయి.

(నూతిలో గొంతుకలు ) 

11, మార్చి 2018, ఆదివారం

రెప్పలతడి

ఈ రోజు సాక్షి Funday లో ఈ వారం కథ గా ప్రచురితమైన కథ "రెప్పల తడి" చదవండి .. 



 సత్యవతికి అర్ధరాత్రి లోనే  మెలుకువ వచ్చింది. శతాయుస్షులో సగం  దాటబోతున్నా  ఆమె   కాలాన్నిసద్వినియోగంగా  అరగదీయడం  ఇప్పటికీ నేర్చుకోలేకపోయానని బాధపడుతుంది   వొళ్ళు అరగదీసి, యిల్లు అరగదీసి, పాత్రలరగదీసి ఇంకా  పుస్తకాలనిఛానల్స్ ని  కీ బోర్డ్ ని  కూడా అరగదీసి చివరికి  మంచాన్ని అరగదీద్దామంటే అసలు చేతనవడం లేదని తనని తాను తిట్టుకుంది. పోనీ కాసేపు రోడ్డు నరగదీద్డామనుకుంటే రోడ్డుపై తిరిగే  మనుషుల ముఖాలు అరిగిపోతాయేమోనని ముఖం చాటు చేసుకుని వెళ్లిపోతుంటారని చివుక్కుమనే మనసుని రాయి చేసుకుంటుంది.   
మళ్ళీ అంతలోనే  ఆలోచన చేస్తూ "అవునూ, మనసెందుకు అరిగిపోకుండా రాతి కవచంలా ఈ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంది.  వెధవ మనసని వెధవ మనసు" అని   తిట్టుకుంటూ  బెడ్ రూమ్ లో నుండి  బయటకొచ్చి  సోఫాలో  కూలబడి యాంత్రికంగా టీవి ఆన్ చేసింది
తనువూ మనసులు ఆలోచనలు అన్నీ కలిసి విడదీయరాని అనుబంధం ఉన్న అర్ధనారీశ్వరతత్వానికి రూపమే భార్యాభర్తల బంధం అంటూ చెపుతున్నాడు ఓ పెద్దాయన. ఇన్ని కలవడం అసలు సాధ్యమయ్యే విషయమేనా?  యిగో లు సాటిస్ పై చేయడం కోసం ప్రతి క్షణం నటించడమే కదా ! ఏనాడూ భర్త  తన మనసు తీరాన్ని  ఓ అనురాగపు అలలా తాకనేలేదు. సాంగత్యమంతా హృదయ ఘోష.   విరగొట్టి వెళ్ళిన మనసుకి కట్టుకట్టే నాధుడు లేనే లేడనట్టు విరక్తిగా బతికింది అని తోచగానే ఎందుకో చప్పున దుఃఖం ముంచుకొచ్చింది.  అప్పటికప్పుడు గడచిన జీవితాన్ని తరచి చూసుకుంది.
*********** 
ఈ యేడుపు ఏడవలేదనేగా  ఆరోజు అందరూ విచిత్రంగా చూసారు. "చెట్టంత మనిషి చనిపోతే ఒక్క కన్నీటి చుక్కైనా రాల్చడం లేదు, యే౦ మనిషో పాడు" అంటూ చెవులు కొరుక్కున్నారంట కూడా. భావోద్వేగాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి అప్పుడెందుకు రాలేదో నేను మాత్రం యే౦ చెప్పగలను, అయినా  ఇంకెక్కడ ఉంటుంది దుఃఖం? ఇన్నేళ్ళ దుఃఖం లోలోపలికి యింకిపోయి కడలి లెక్కన లోన  దాగుంది. దాన్ని తోడిపోసే చేద యెవరి చేతిలోనో,చేష్టలోనో  అతని చావులోనో ఎందుకుంటుంది.? కనుల పొరల మధ్య  పొంగుతున్న నదులని ఆపడం ఎవరికైనా సాధ్యమా ! అని గొంతెత్తి ప్రశ్నించాలనిపించిది సత్యవతికి. 
 అసలీ  భార్య /భర్త అనే  బంధాన్ని  మోయడంలోనే   ఏదో తెలియని ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి తనం ఉందేమో! అందుకే అతగాడు  తన  బంధంలో వూపిరాడక యింకొక బంధంలో యిరుక్కుని అనుభవించినన్నాళ్ళు జీవితాన్ని  అనుభవించి కాటికి కాళ్ళు జాపుకుని కళ్ళెదురుగా వచ్చి పడి  అప్పుడు కూడా సాధిస్తుంటే క్షణ క్షణానికోసారి  చచ్చి మరలా పుట్టి  నిత్యం చస్తూ బ్రతుకుతూ వుండటంలో యె౦త నరకయాతన అనుభవించిందో ఈ యిరుగుపోరుగమ్మలకి తెలుసా అసలు? రేపో మాపో అన్నట్లున్న మనిషి కూడా  కక్ష, కార్పణ్యంతో  యేదో ఒక వొంకతో సాధిస్తుంటే,  పూట పూటకి రుచికరంగా వండి  పెట్టడం లేదని వొంటికాలి మీద మీదకి వస్తుంటే తనమీద తనకే జాలి కల్గేది. కనీసం అప్పుడైనా అభిమానం ముంచుకొచ్చి  కఠినంగా ఉండాలన్నా సిగ్గేసేది. నీరు పల్లమెరిగినట్లు బంధాల బరువులన్నీ  భరించే వారిపైనే నాట్యమాడుతుంటాయనుకుని  అన్నీ భరిస్తూ   అతని ఆఖరి శ్వాస కూడా సుతిమెత్తగా గాలిలో కలిసిపోయే వరమివ్వమని కోరుకుంది  తప్ప ఆ  ప్రాణిని  ఇంకో విధంగా యాతనకి  గురి చేయాలని అనుకోలేదు కదా అననుకుంటుంది స్వగతంలో.
అర్ధాంగిగా  విలువ సంపాదించుకోవడమంటే జనం ఇచ్చే విలువ లెక్కించుకుంటూ  తనకి తానూ ఏ విధమైన విలువనిచ్చుకోకుండా వ్యక్తిత్వాన్ని అస్థిత్వాన్ని హననం  చేసుకోవడన్నమాట  అని లోలోపల   గొణుక్కు౦టుంది.  ఎవరైనా ఏమి వదిలి వెళతారు? కాసిని నవ్వులనోఆకాంక్షలనో, దుఖాలనో, అవమానాలనో ఇంకా చెప్పాలంటే  బిడ్డల రూపంలో అహంకారపు జాడల్ని వదిలి వెళతారు. ఇప్పుడు నాకు మిగిలింది విధవరాలు  అన్న అవమానమేగా అంటుంది సన్నిహితులతో.  
మూన్నెళ్ళ తర్వాత ఒక  సాయంత్రం మొక్కలకి నీళ్ళు పోసుకోవాలని గేటు బయటకి వెళ్ళగానే ఎదురింటి ఆమె ముఖంపై విసురుగా తలుపేసుకుంది.  సత్యవతికి బయటకి వెళ్ళాలంటే అవమానపడాలనే భయమేస్తుంది. ఆ సమయంలో గతంలో  ప్రక్కింట్లో ఉండే కుమారి గారు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఆమె  చిన్న మామగారు అనారోగ్యంతో బాధపడుతూ తాను భార్య కన్నా  ముందుగానే మరణిస్తానని గ్రహించి  ఆమెకి ఎన్నో ముందు జాగ్రత్తలు చెప్పారంట. కొడుకు కూతురు ఎవరింటికి వెళ్లొద్దు. నీ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకుని నిన్ను జీతం భత్యం లేని పని మనిషిని చేసేస్తారు అలాగే బొట్టు గాజులు తీయడం లాంటివి ఏమీ చేయొద్దు, ఇరుగు పొరుగు యెలా ప్రవర్తించినా ఏమీ పట్టించుకోవద్దు. మొక్కలని, కుక్కలని పెంచుకో  ప్రేమ, ప్రశాంతత కల్గుతాయి అనిఆయన సత్యం చెప్పారు అనిపించింది సత్యవతికి. కుమారి గారు చెప్పిన మాటలతో పాటు బుజ్జోడు  మరీ జ్ఞాపకం వస్తున్నాడు. హృదయపు చెమ్మ రెప్పల మధ్యకి  ఎప్పుడు ప్రాకిందో మరి. నాలుగు నెలలు గతంలో వెళ్ళింది. 
 ************ 
సత్యవతి ఇంట్లో యేకాకిగా మిగిలిపోయిన రోజులవి. పదిమంది ఉండాల్సిన ఆ  పెద్ద ఇంట్లో పలకరించే వాళ్లే కరువు. ఎవరికీ వాళ్లకి  భర్త చనిపోయిన మనిషికి సాయంగా ఉండటానికి  ఏదో అయిష్టత. దానిని కప్పి పుచ్చుకోవాడానికి అనేక రకాలుగా బొంకటాలు. మాటలు కూడా కరువే, ఫ్రీ జిబి డేటా పుణ్యమా అని ఒకవేళ యెవరైనా  పలకరించినా తిన్నావా, పడుకున్నావా లాంటి చచ్చు పుచ్చు ప్రశ్నలు తప్ప మాటల్లో మనసుండదు. ఎప్పుడు లైన్ కట్టవుతుందా యెదురుచూడటమే. కురిసినప్పుడు విసుక్కోవడం యె౦డినప్పుడు యెదురుచూపు చూడటం లాంటిదే  ఈ పలకరింపు కూడా ! అనుకునేది 
 ఆ  మధ్య బుజ్జోడితో స్నేహం ఆమెకి  హాయిగా ఉండేది. పార్కింగ్ ప్లేస్లో పడుకోబెట్టిన భర్త  శవం ప్రక్కన ఆమె  మౌనంగా కూర్చున్నప్పుడు కూడా  వచ్చి  ఆమె  ప్రక్కనే  మౌనంగా కాసేపు నిలబడి వెళ్ళాడు. మా బంధం ఏనాటిదో! ఈ జన్మలో కొన్ని నెలల ముందేగా కలిసింది మరి. బహుశా  పూర్వజన్మ వాసనలు వదలవేమో అని ఆలోచించేది. అయినా  ఈ వాసనలే కదూ మనుషులని తమ దేహాల చుట్టూ తిప్పుకుంటాయి. చివరాఖరికి  గుంతలో పాతిపెట్టమనో ,అగ్ని కీలలకి ఆహుతిమ్మనో కూడా  తరుముతూ ఉంటాయి అని భారంగా నిట్టూర్చేది  కూడా ! అన్నట్టు బుజ్జోడు ఎవరో చెప్పలేదు కదూముందు  వాడి గురించి  చెప్పాలి మీకు. ఏడాది క్రితం వాడు ఆ ఇంటికి వచ్చినప్పుడు వాడికి మెడలో బెల్ట్ కూడా ఉంది, వాడిని  పెంచుకుంటున్న ఎవరో తీసుకొచ్చికావాలని  బయట వదిలేసి వెళ్ళిన బాపతు. వాచ్ మెన్ సుబ్బారావు వాడిని దగ్గరకి  తీసి  పెంచుతున్నాడు.పసి బిడ్డలనే కర్కశంగా ముళ్ళపొదలలో విసురుతున్న ఈ రోజుల్లో కుక్కని వదిలేయడం ఏమంత పెద్ద విషయం లేమ్మా అన్నాడు కూడా !
 బుజ్జోడు అమాయకమైన చూపులతో  యెవరినయినా కట్టిపడేస్తాడు, విశ్వాసం కూడా అట్టే ప్రదర్శించని శరీర భాష. ఎవరిని పల్లెత్తి పలకరించిన పాపాన పోడు.గేట్  దగ్గర పడుకుని  వచ్చేపోయే వాళ్ళని మౌన మునిలా చూస్తూ ఉంటాడు. అరవటం రాదు సరికదా  కరవడం అనే సహజ లక్షణాన్ని మర్చిపోయాడు. రోజూ ఖాళీ పాల బాటిల్స్ వేసిన సంచీ  గేట్ కి తగిలించి రావాడనికి వెళ్ళినప్పుడు సత్యవతి  వాడిని బుజ్జోడా  అని పిలుస్తూ  ముద్దు జేసేది  అయినా వాడిలో చలనం ఉండేది కాదు. వాడికి పట్టడానికి పాలు యెవరు పోస్తున్నారు? అనడిగి  ఎప్పుడైనా నేను  కూడా  కాసిని పాలు పోస్తానని చెప్పింది కానీ  ఏ రోజు వాడి గిన్నెలో  చెంచా పాలు పోసిన పాపాన పోలేదు. స్వతహాగా ఆమెకెందుకో బుజ్జాడి జాతిని చూస్తే విముఖత. మనుషులు తల్లిదండ్రులని, పిల్లలని కూడా చూడనంత ప్రేమగా అపురూపంగా చూస్తున్నందుకు మనుషులపై ఏర్పడిన విముఖత వాటిపై  అసహ్యంగా రూపాంతరం చెందిందనుకుంటా.
ఒకరోజు బుజ్జోడి  గిన్నె నిండా  విరిగిపోయిన పాలు ఆ గిన్నె చుట్టూ  ముసురుకున్న ఈగలు గమనించి బుజ్జోడు ఏడి  అని అడిగింది.  అదిగోనమ్మా, కారు కింద అన్నాడు సుబ్బారావు. ఒంగి చూస్తే నలతగా నేలకి అంటుకుని పడుకున్నాడు. జాలేసింది ఆమెకి, కూర్చుని వాడిని చేతిలోకి తీసుకుని ప్రేమగా తల నిమిరి "ఏంటమ్మా వొంట్లో బాగోలేదా, జ్వరమొచ్చిందా ? సుబ్బారావు హాస్పిటల్ కి తీసుకు వెళతాడు, వెళ్ళు .  ముందు కొంచెం పాలు తాగు" అంటూ కాసేపు వాడిని చేత్తో పరామర్చించి దగ్గరలో ఉన్న డాక్టర్ అడ్రెస్స్ చెప్పి వాక్సిన్ కూడా వేయించమని చెప్పి వచ్చింది.
ఇక అది మొదలు రోజు పాల బాటిల్స్ సంచీ ఇవ్వడానికిఇస్త్రీ బట్టలు ఇవ్వడానికి  సుబ్బారావు వచ్చినప్పుడల్లా అతని వెనుకే సత్యవతి  ఇంటికి వచ్చేవాడు. "బుజ్జోడా, నువ్వూ వచ్చావా? పాలు తాగుతావా అని అడిగేదిఅలా వారి  పరిచయం పెరిగింది. ఆమె  సాయంత్రం పూట వాకింగ్ కి వెళుతున్నప్పుడో , కూరగాయలు కొనడానికి  రోడ్డు మీదకి  వచ్చినప్పుడో  ఆమె  వెంట బయటకి వచ్చేవాడు . వాడి జాతి వాళ్ళని  చూస్తే  వాడికి భయంమనుషుల కాళ్ళ ప్రక్కన  నక్కి నక్కి ఉండటమో  లేకపోతే లోపలకి పరిగెత్తడమో చేసేవాడుఒకోసారి సత్యవతి ప్రక్కనే ఉందన్న  ధైర్యంతో వాడి జాతి ప్రాణులని చూసి గయ్ గయ్ మని అరుస్తూ అచ్చు వెనుక బోలెడంత  ప్రజా బలముందని రెచ్చిపోయి మాట్లాడే ప్రతిపక్ష నాయకుడిలా తన ప్రతాపం చూపేవాడు. గేటు ఎదురుగుగా  రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టు దగ్గరకి వెళ్ళి కాలెత్తి పనికానిచ్చుకుని ఆనందాన్ని అనుభవించేవాడు. వాడు వేస్తున్న వేషాలు  ఆటకాయి చేష్టలు చూస్తూ  నవ్వుకుంటూ రోజూ  కాసేపు నన్ను నేనే  గేటుకి కట్టేసుకోవాల్సిందే  అని మురుసుకునేది సత్యవతి.
  
ఎప్పుడైనా ఆమె  కిందకి వెళ్ళని రోజున ఆ ఫ్లోర్ కి వచ్చి లిఫ్ట్ కి  గేటు కి మధ్య పచార్లు చేసేవాడే తప్ప గేటు దాటి లోపలికి అడుగు  కూడా వేసేవాడు కాదు. అప్పుడు సత్యవతికి  చప్పున  మల్లీశ్వరి చెప్పిన క్యాటరింగ్  రావు గాడు గుర్తుకొచ్చేవాడు. ఒంటరి స్త్రీలున్న ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి కదా అని  ఎవరింట్లోకి బడితే వాళ్ళింట్లోకి అనుమతి లేకుండా జోరబడే కుక్క అని అని తిట్టి అంతలోనే నాలిక కరుచుకుని బుజ్జోడుని తక్కువచేయకూడదనే ఇంగితం పాటించేది.
  బుజ్జోడు మధ్యాహ్నసమయాలలో మెట్లమీదే  పడుకుని ఉండేవాడు.  కర్ణేoద్రియాలకి కఠోరంగా వినిపించే మనిషి శబ్దాలకన్నా మౌనంగా వినిపించే భాషే  మేలనుకుని పుస్తకమో ఫోనో పట్టుకుని మెట్లమీదకి వెళ్లి కూర్చునేది  సత్యవతి .  బుజ్జోడి కళ్ళలోకి ఆమె  వాడు ఆమె కళ్ళలోకి చూస్తూ నిశ్శబ్దంగా మాట్లాడుకుంటూ వుండే వాళ్ళు.
ఒకరోజు బయటకి వెళుతూ "బుజ్జోడా బయటకి వెళదాం వస్తావా" అని అడిగింది . మౌనంగా గేటుదాకా వచ్చాడు కానీ యెక్కి కాళ్ళ దగ్గర కూర్చోలేదు. బండి స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్లిందో లేదో భౌ భౌ మని అరుస్తూ రయ్యిన బండెనుక పరిగెత్తాడు. ఆమె  కొంచెం ఆశ్చర్యంగా వాడి వైపు చూస్తూ రానన్నావు కదా, ఇప్పుడు కొత్తగా అరుస్తున్నావు ఏమిటి అనడుగుతూనే బండిని పోనిస్తుండగా బండి ముందుకు పరిగెత్తి అడ్డంగా నిలబడ్డాడు. ఆమె  బండి ఆపేసి కాలు క్రింద వుంచి "రా !ఎక్కి కూర్చో" అని చోటిచ్చింది. బండి ఎక్కకుండా  కాలు ప్రక్కన నిలబడి భౌ భౌ మని  అరుస్తున్నాడు మళ్ళీ .   "రానప్పుడు  యెందుకనవసరంగా అరుస్తావ్? ఏముంది ఇక్కడ అంటూ  ప్రక్కకి వొంగి చూసుకుని  ఏదో ఆలోచనలో ఉండి  బండి స్టాండ్ తీయకుండానే ముందుకు వెళుతున్నానని వెంబడించి  హెచ్చరిక చేసినందుకు  సత్యవతి మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. బుజ్జోడి పై ప్రేమ ముంచుకొచ్చింది, బండి స్టాండ్ వేసి  వాడిని చేతుల్లోకి తీసుకుని ముద్దులాడింది.

ఆరోజు ఏం జరిగిందంటే ఇలాగే  తెల్లవారుఝామునే మెలుకువ  వచ్చిన సత్యవతికి   బుజ్జోడుని వెంటనే చూడాలనిపించిందిఇప్పుడేం చేస్తున్నాడో అనుకుంటూ మళ్ళీ అంతలోనే  ఇంకేంజేస్తాడు? మెట్లమీద మునగదీసుకుని పడుకుని యేదైనా అలికిడి వినగానే కళ్ళని మాత్రమే తిప్పుతూ చూస్తూడంటం తప్ప. వాడిని చూసి  పదిహేను రోజులవుతుంది. రోజూ గ్రిల్ల్స్ బయట నిలబడి చూసి చూసి వెళ్లిపోతున్నాడంట. వాడికి నాకు ఏదో తెలియని అనుబంధం. వాడిని అప్పటికప్పుడే చూడాలనిపించింది సత్యవతికి.  ఆత్రుతగా మెట్లమీదుగా క్రిందికి దిగి వస్తూ   ఈ రోజు  ఎవరేమనుకున్నా సరే వాకింగ్ ఫ్రెండ్స్ తనని చూసి పలకరించకుండా గబా గబా ముందుకు వెళ్ళిపోయినా సరే  బుజ్జోడితో కలిసి వాకింగ్ కి వెళ్లి రావాలని  నిశ్చయించుకుంది.  
ఎవరికీ వారు  స్వేచ్చలేదు స్వాతంత్ర్యం లేదు అని వాపోవడం ఎందుకు ? కావాలని తీసుకుంటే  ఏమవుతుంది ? నాలుగు రోజులు  చెవులు కొరుక్కుంటారు అంతేగా ? అయినా సమాజానికి ఇంకేమి పని లేదా తన పనులు మానేసి  ఎంతసేపూ ప్రక్కనోడు ఏం చేస్తున్నాడోనని భూతద్దం పెట్టి మరీ చూస్తుందా ఏమిటీ? అనుకుంటూ మెట్లు దిగుతుంటే ఆ చప్పుడుకి తలతిప్పి చూసిన బుజ్జోడు మెల్లిగా లేచి నించున్నాడువాడి తలమీద చెయ్యేసి "యేరా బుజ్జోడా! ఇన్నాళ్ళు నేను కనబలేదని దిగులుపెట్టుకున్నావా? నేను వచ్చేసాలే, మనిమిద్దరం రోజూ వాకింగ్ కి వెళ్లి వద్దాం,సరేనా " అన్జెప్పి ఆమె  మెట్లు దిగుతుంటే బుజ్జోడు ఆమె  వెనుకే వచ్చేసాడు.

మెయిన్ గేట్ తీసుకుని రోడ్డు మీదకి  వచ్చారు వారిద్దరూఎక్కడో వర్షం కురుస్తున్న ఆనవాలు. ఉత్తరపు వైపు నుండి వచ్చే చల్లని గాలి శరీరాన్ని తాకగానే గత ఇరవై రోజుల నుండి  నాలుగు గోడల మధ్య బిగించి ఉన్న సంకెళ్ళ నుండి  విముక్తిని కల్గినట్లు అనిపించింది సత్యవతికి. ఆమె  ముందూ,  వెనుక బుజ్జోడు  పల్చటి వెన్నెల వెలుగులో అక్కడక్కడా వెలిగే దీపాల వెలుగులో  నున్నటి తారు రోడ్డు మీద రెండు రౌండ్ లు తిరిగారుఅప్పటికే కొంతమంది వాకింగ్ చేస్తూ కనబడారు. వాళ్లకి ఎదురవకుండా ప్రక్క వీధిలోకి వెళ్లి మెయిన్ రోడ్ మీదగా వాళ్ళ  సందులోకి వచ్చేసరికి  సన్నగా చినుకులు పడసాగాయి.  సత్యవతి తలపైకెత్తి చూస్తే నల్లని మబ్బులకోపు. "వానొచ్చేసిందిరా, అయినా  సరే మనం ఇంటికి వెళ్లొద్దు. వానలో తడుస్తూ ఇంకో రౌండ్ వెళ్లివద్దాం" అంది ఉత్సాహంగా. రోడ్డు ప్రక్కనే  ఉన్న గుంటలో  నిన్న కురిసిన వర్షం నీరు చేరుకొని అది చిన్న చెరువుని తలపిస్తుంది. అందులో వీధి కుక్క ఒకటి పడుకుని ఉంది . బుజ్జోడు ప్రక్కనే ఆమె ఉందనే  దైర్యంతో ఆ కుక్క మీద కయ్యానికి వెళ్ళాడుఆ కుక్క కూడా అక్కడ నుండి లేవడం ఇష్టం లేదన్నట్టుగా లేచి  గయ్యిమని  అరుస్తూ రోడ్డు దాటి అవతలకి వెళ్ళింది దాన్ని వెంబడిస్తూ వెళ్ళబోతున్న బుజ్జోడి మీదకి విజయ పాల వ్యాన్  యమదూతలా  దూసుకొచ్చేసింది.  
సత్యవతికి  ఆపాదమస్తకం వణికిపోయింది. వ్యాన్ ఆగకుండానే ముందుకు వెళ్ళింది. ఆమె  పరుగెత్తి కెళ్ళి బుజ్జోడి  శరీరాన్ని చేతుల్లోకి తీసుకుంది. దెబ్బలేమీ తగల్లేదులే అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న మరుక్షణంలోనే  బుజ్జోడు  ఆమె  కళ్ళలోకి చూస్తూ పెంచే చేతికి తెలియకుండా  త్రుంచే చేయి ఒకటి  అదృశ్యంగా అనుసరిస్తూనే ఉంటుంది కదా అన్నట్లుగా  తలవాల్చేసాడుచుట్టూ జనం పోగయ్యారు, అయ్యో పాపం అంటూ జాలి కురిపించి  కొద్దిగా ముందుకు సాగి రోజూలాగానే  రోడ్డ్డు ప్రక్క ఇళ్ళల్లో పూసిన పూలని కొమ్మలొంచి మరీ కోసి క్యారీ బ్యాగ్ లో వేసుకుంటూ ముందుకు సాగిపోయారు. మరికొంతమంది స్త్రీలు వాకింగ్ కని  వస్తూ వొళ్ళో బుజ్జోడిని పెట్టుకుని కూర్చున్నఆమె  దగ్గర ఆగి సానుభూతి చూపసాగారు.   అప్పటిదాకా కురుస్తున్న పాల వెన్నెలంతా కరిగి జడి వాన అయిందా అన్నట్టు వర్షం మొదలైందిభర్త చనిపోయినప్పుడు కంటెంట చుక్క కూడా కార్చని  ఈమె యిప్పుడు  యె౦దుకిలా యేడుస్తుందని  అమ్మలక్కలు ఆశ్చర్యంగా చూస్తున్నారుఆ వర్షంలా  ఆమె  దుఃఖం  కూడా కురుస్తూనే ఉంది
 ***************
అది జరిగి రెండు నెలలైనా   కేవలం బుజ్జోడి జ్ఞాపకాలతోనే  మళ్ళీ  అటో ఇటో  ధారలై  కురుస్తూనే ఉంది  రెప్పలని  తడుపుతూనే ఉంది.  తడి ఆరని జ్ఞాపకాలలో సత్యవతి బ్రతుకుతూనే ఉంది. 


1, మార్చి 2018, గురువారం

కల్పన కూడా కన్నీరే ..

కథకి ముందు

త్వరలో ప్రచురితం కానున్న ఆ  కథని గూర్చి ..నా అంతరంగం ..

ఓ కథ వ్రాస్తూ  ఇంతగా కన్నీరు పెట్టడం ఇదే మొదటిసారి. నా చేత కన్నీరు పెట్టించిన కథలో  పాత్రలకి లేని గొప్పదనాన్ని అపాదిద్దామనే ఆలోచన కూడా లేదు నాకు. తారసపడిన కొన్ని పాత్రలు రచయిత వ్యకీకరణకి కూడా అందనంత గొప్పవి  కూడా అయి వుండొచ్చని నేనూ వొప్పుకుంటాను.

ఈ మధ్య ఒక సీనియర్ రచయిత అన్నారు "ఎవరి అనుభవాన్ని వారు వ్రాసినంత గొప్పగా ఇంకొకరు వ్రాయలేరు" అని. అయితే "గొప్పగా వ్రాసినవన్నీ స్వీయ అనుభవాలు" అని పాఠకులు  అనుకునే ప్రమాదం ఉంది కదా !  ..అంటే నవ్వేసారు.

"ఒకవేళ  రచయిత వ్రాసేది తన గురించే అయినప్పుడు  వ్రాసేది తానే అయినప్పుడు సత్యమే వ్రాస్తానా అతిశయోక్తులు వ్రాసుకుంటున్నానా  ? నేనంటే మంచా  లేదా చెడా ? ఊహు ..మూడో మనిషినై చూసుకుంటే తప్ప చెప్పలేను అననుకోవాలి. అలా అనుకున్నప్పుడే కథ వ్రాయాలి " అని   నేనూ  అన్నాను . చేరువై దూరమైనా, దూరమైనాక మళ్ళీ చేరువైనా  వచ్చేది మాత్రం కన్నీళ్ళే! ఆ కన్నీళ్ళకి కారణం మనిషే కానక్కర్లేదు కూడా !

 
ఆ   కథ వ్రాస్తున్నప్పుడు అప్పుడు నేనున్న పరిస్థితులలో వ్యక్తిగా అనుభూతుల వంతెన ఒక్కసారిగా   కూలిపోయింది. దాని స్థానే యాంత్రికత చోటు చేసుకుంటుంది. ఆ యాంత్రికత లోనే  రచయితగా ఈ కథ వ్రాయడం  ఒక అవసరమైంది. ముగిసాక  ఇలా కన్నీరైంది.

త్వరలో ప్రచురితమయ్యే కథ కోసం యెదురుచూద్దాం ..మీతో పాటు నేను కూడా !