31, జనవరి 2013, గురువారం

కష్టాలే ఇష్టాలై..


నాకు ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టడం అంటే చాలా ఇష్టం.
వాటిని ఉక్రోషంతో కూలదోయడం అతనికి  మరీ ఇష్టం.

అలిగిన వారిని  సముదాయించడం నాకు చాలా ఇష్టం 
అందుకే నాపై నేనే అలిగి కూర్చుండ టం మరీ ఇష్టం..

అతనికి చేసిన  వాగ్దానం ని నిలబెట్టుకోవడం కష్టం 
నాకు చేసిన వాగ్దానంకి కట్టుబడి ఉండటం ఇష్టం.

అతనికి ఎల్లప్పుడూ  సమూహం లో ఉండటం ఇష్టం 
నాకు ఒంటరితనంని  వెదుకుతూ.వెళ్ళడం .ఇంకా  ఇష్టం. 

అతనికి  ముప్పొద్దులా ఊహాలోకంలో మునిగి ఉండటం ఇష్టం.
నాకు పదుగురి హితం కోరి పనులపై మనసు పెట్టడం ఇష్టం.

నా ఇష్టాలన్నీ అతనికయిష్టాలై 
అతని ఇష్టాలన్నీ నాకు కష్టాలై...

జీవితం సాగించడం మరీ మరీ ఇష్టం. 

ఇష్టమైన దానితో కలిసి సాగడం  ఇష్టాతి ఇష్టం.


                        "జలతారు వెన్నెల"  "శ్రీ " గారి కోసం ఇష్టంగా ఈ పోస్ట్. 
తొందరగా  ఓ..పోస్ట్ తో వచ్చేయండి ప్లీజ్ ! కాఫీ చల్లారిపోతుంది మరి.

26, జనవరి 2013, శనివారం

శివరంజని


పాడితే శిలలైన కరగాలి.. జీవిత గతులైనా మారాలి, నా పాటకి ఆ బలమున్నదో లేదో పాడిన పిదపే తెలియాలి..

పాటకున్న శక్తి అలాటిదని  మనకి యెన్నో పాటలు చెపుతూ  వుంటాయి.

అలా అని  చెపితే మనం నమ్మేస్తామా యేమిటీ  అనుకునే వాళ్ళని చూసాను కూడా.   పాటంటే  యేమిటో  వాళ్ళకి తెలిస్తే కదా అనుకున్నాను. రేడియోలో వస్తున్న ఈ పాటని వింటూ..

తర్వాత మీరు వినబోయే  పాట శివరంజని చిత్రంలో నుండి  అని  ఎనౌన్సర్ చెపుతూ  వుంటే  విని అలా నిలుచుండి  పోయాను.

అసలు శివరంజని అనే పేరు వింటేనే నాకు పూనకం వచ్చినట్లు వుంటుంది. రాగాలన్నిటిలోకి  శివరంజని రాగం కి వొక  ప్రత్యేకత వుంది  అని చెపుతారు. బాధాతప్త హృదయాలని సేద దీర్చే గుణం ఆ రాగానికి వుందంట. కానీ  ఆ రాగం మాత్రం విషాద రాగమని సంగీతంతో పరిచయం వున్నవాళ్ళు చెప్పుకుంటూ వుంటే  విన్నట్టు గుర్తు. కానీ కొన్నేళ్ళ నుండి శివరంజని అనే పదం వినగానే నాకు "శివరంజని " గుర్తుకు వస్తుంది.

శివరంజని యెవరంటే..నేను జిల్లా పరిషత్ హైస్కూల్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా జాయిన్ అయినప్పుడు ఆ వూర్లో మేము అద్దెకి వుంటున్న  యింటి ప్రక్క అమ్మాయి.పద్దెనిమిది యేళ్ళ వయసు వుండేదేమో. చంకలో వొక పిల్ల గర్భంలో వొక పిల్లని మోస్తూ కనిపించేది.  చాలా అందంగా వుండేది. ఆమెని చూస్తే తూర్పు-పడమర చిత్రంలో శ్రీవిద్య  రూపమే గుర్తుకు వచ్చేది.

ఆ కనులు పండు వెన్నెల గనులు 
ఆకురులు ఇంద్ర నీలాల వనులు 
ఆ వదనం అరుణోదయ కమలం 
ఆ ఆధరం సుమదుర మధు కలశం .. అన్న సాహిత్యమే గుర్తుకు వచ్చేది.

మేము వుంటున్న ఆ వూరిలో త్రాగు నీటికి చాలా యిబ్బంది పడేవాళ్ళం. నగర శివారు గ్రామమే కాబట్టి పట్టణం నుండి కార్పోరేషన్ వాళ్ళు ట్యాంక్ ల తో సప్లై చేసే నీటి కోసం పడిగాపులు పడవలసి వచ్చేది. అక్కడ ధనవంతులు,పేదవారు అని తేడా లేనే లేదు. ఒకోకరు నాలుగైదు బిందెలు పట్టుకుని క్యూలో నిలబడి నీళ్ళు పట్టుకోవాల్సి వచ్చేది . అలాటి సమయాలలో నాకు తను చాలా సాయం చేసేది. నా చేతుల్లో బిందెలుని చొరవగా  తీసుకు వెళ్లి మంచి నీళ్ళు పట్టి యిచ్చేది. ఆ వొక్క  యిబ్బంది తప్ప  అక్కడ యే యిబ్బంది కనబడలేదు నాకు.  అందరకీ  సహాయం చేసే గుణం. ఏ చిన్న అవసరం వచ్చినా సొంత వారిలా ఆదు కునే వైనం చూసి ఆశ్చర్యం వేసేది కూడా.అందుకే యిష్టంగా అక్కడే వుండటానికి నిర్ణయించుకున్నాను.

"ఇదిగో.. టీచరమ్మ ! మీ పట్టణం లో లాగా యిక్కడ పని పాటలు చేయడానికి యెవరు మనుషులు దొరకరు. ఉదయాన్నే లేచి వాకిళ్ళు వూడ్వాలి కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టాలి.బారెడు పొద్దు యెక్కేదాకా  పడుకుని లేచి గబ గబా వుద్యోగాలకి పోతే మీకు అద్దెకిచ్చిన ప్రక్క కూడా మేము శుభ్రం చేయం. " అని ఖరాఖండి గా చెప్పేస్తే ముందు తెల్లబోయి తర్వాత చిన్నబుచ్చుకుని కూడా తలూపక తప్పలేదు. ఆ చిన్న వూళ్ళో అద్దెకి యిల్లు దొరకడం మాటలు కాదని రెండు రోజులు కాలికి బలపం కట్టుకుని తిరిగినప్పుడు తెలిసి వచ్చింది మరి.

ఏ  విషయం అయినా నిర్మొహ మాటంగా అనేయడం పల్లెటూరులో వారికి  అలవాటు. వాళ్ళకి మాటల నయగారం తెలియదు, మనసులో వొకటి పెట్టుకుని పైకి వొకటి మాట్లాడే వాళ్ళ కన్నా..పోన్లే మనసు నొచ్చుకున్నా యిదేనయం అనుకున్నాను.

పొద్దుగూకే వేళ  దీపాలు పెట్టిన తర్వాత నేను వీధి అరుగు మీద కూర్చుంటే "శివరంజని " తన పాపకి అన్నం తినిపిస్తూ.. మా యింటి ముందుకు వచ్చేది. కలుపుగోలు మనిషి. పట్నవాసం అంటే యిష్టం. పదహారేళ్ళకే పెళ్లి చేయడం వల్ల యింకా అమాయకంగానే కనబడేది.

మామ్మ యే౦  జేస్తున్నారు అని అడిగేదాన్ని. "టీవి చూస్తున్నారు ఆంటీ అని చెప్పి ఆపేది కాదు. తన మాటల్లో ఆమె స్వవిష యాలు వినబడుతూ వుండేవి. మా అత్త గారి అమ్మ ఆమె. ఇద్దరూ కూతుళ్ళే, మా ఆయన పెద్ద కూతురి కొడుకు. చిన్నప్పటి నుండి ఆమే పెంచింది. కొడుకులు లేరని మా ఆయనని దత్తత తీసుకుంది. పెద్ద చదువు లేకపోయినా పొలం బాగా వస్తుందని నన్ను యిచ్చి పెళ్లి చేసారు. అంతా ఆమె చెప్పినట్లే వినాలి. మా ఆయనని కూడా మాట్లాడనివ్వదు.అత్త కన్నా యెక్కువ సాధింపులు. పసి పిల్లతో చేసుకోలేకపోతున్నానని మళ్ళీ నీళ్ళో సుకున్నానని  హాస్పిటల్ కి వెళ్లి నాలుగు రోజులు మా యింట్లో వుండి వచ్చానని సాధించి పెడుతుంది.నీ పెళ్ళాం పుట్టింట్లో నెలల పర్యంతం కూర్చుంటే నీకు యెవరు వొండిపెడతారు ? నాకు వోపిక లేదు,మీ చేరెడు మీరు కాసుకోండి అని వేరు పెట్టేసింది అని చెప్పింది.

మనసులో యే మాట దాచుచుకోవడం తెలిసేది కాదు.సాయంత్రం వేళప్పుడే వాకిళ్ళు చిమ్మి అందంగా ముగ్గులు పెట్టేది. రేడియోలో వచ్చే పాటలని తను పాడేది.బాగా చదువుకోవాలని కోరిక వుండేది. నాకు యింతే ప్రాప్తం. కనీసం నా పిల్లలనైనా బాగా చదివించుకోవాలి అని చెప్పేది.

నాకు నవ్వు వచ్చేది. నువ్వే చదువుకునే వయసు. దూర విద్యా కోర్సులలో చేరి చక్కగా చదువుకో అని చెప్పేదాన్ని.

శివరంజని గర్భంతో వుంది కాబట్టి  కడుపులో వున్న బిడ్డ స్థితి గురించి తెలుసుకోవడానికి ఆమెకి పరీక్షలు జరిగాయి. అప్పట్లో అంత కఠిన నియమనిబందనలు వుండేవి కాదు కాబట్టి రెండవసారి పుట్టబోయేది ఆమ్మాయే అని చెప్పారని చెప్పింది    "మళ్ళీ యెవరితో అనబాకండి. మా మామ్మకి తెలిసిందంటే మళ్ళీ ఆడపిల్లేనా అని సాధించి పెట్టుద్ది " అని చెప్పింది.

ఓ మూడు నెళ్ళ తర్వాత  శివరంజని ప్రసవించింది. ఆమెకి మళ్ళీ అమ్మాయే పుట్టినదని అలిగి ఆ పిల్లని తల్లిని చూడటానికి హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఏమిటి మామ్మా.. యేపిల్ల అయితే యేమైంది. ఆడ పిల్లలు  మీ బిడ్డలే కదా, అలా తేడా చూపకూడదు.అమ్మాయిలు మహాలక్ష్మితో సమానం అన్నా వినేది కాదు. శివరంజనికి అమ్మ సాలు వచ్చింది. అలాగే యిద్దరూ వెంటవెంటనే ఆడపిల్లలే పుడతారు అని అనుమానం వచ్చినా అత్తా సాలు వచ్చుద్దిలే..అని వూరుకున్నాను. మా అమ్మాయికి కూతురు వెనుక కొడుకు పుట్టలా, యెంటో మా ఖర్మ యిలా తగలడింది అని ముక్కు చీదేసేది.

ఇంకొకసారికి అవకశం లేకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించారని పుట్టిన బిడ్డకి అయిదు నెలలు వచ్చినా  కాపరానికి తీసుకు రానీయకుండా కత్తి కట్టుకు  కూర్చుంది.  అంతలో యెండాకాలం రానే వచ్చింది. మామిడి కాయలు సీజన్. పెద్దగా పని పాటలు లేకుండా తిరిగే శివరంజని భర్త లారీల కాటా వేసే  వే బ్రిడ్జ్ దగ్గర పనిచేసేవాడు. సరిగా యింటి మొహం చూసేవాడు కాదు. వాళ్ళు వీళ్ళు జోక్యం చేసుకుని మందలించి శివరంజని  కాపరానికి  తీసుకు వచ్చారు. ఆ అమ్మాయి వచ్చిన వొక నెల రోజులకే  ఆమె భర్తకి అనారోగ్యం చేసింది. రోజు రోజుకి చిక్కి శల్యం అయిపోసాగాడు. శివరంజని మోహంలో కళా కాంతి లేదు.

పల్లెటూర్లలో యే విషయం యెక్కువ రోజులు దాగదు కాబట్టి విషయం తొందరగానే బయటకి పొక్కింది. శివరంజని భర్త కి ఎయిడ్స్ వ్యాధి వున్నట్లు నిర్ధారణ అయింది. అలాగే ఆ అమ్మాయికి కూడా. రెండవ పిల్లకి టెస్ట్ చేయించారు.అదృష్టవ శాత్తు. ఆ పిల్లకి నెగెటివ్ అని వచ్చింది.ఆతను వ్యాధి తో కన్నా నలుగురిలో పడుతున్న అవమానం వలన,భయం వలన నాలుగు నెలలు కూడా బ్రతకలేదు. మనుమడు చనిపోగానే అతని అమ్మమ్మ  కొంత ఆస్తి యిచ్చి శివరంజనిని,పిల్లలిద్దరిని పుట్టింటికి పంపేసింది.

ఒకదాని వెనుక వొకటి   కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలకి నేను సైతం మూగపోయాను. రేడియోలలో,టీ వీ లలో, హోరుమని ప్రచారం చేసే అవగాహన కార్యక్రామాలన్నీ గాలిలో ధూళిలో కలసిపోయాయి. అజ్ఞానంతో అవగాహనా లోపంతో మహమ్మారి హెచ్ .ఐ వి కి గురవుతున్న వారిని చూస్తుంటే బాద కల్గేది.అలా శివరంజని జీవితం విషాదమయం అయిపొయింది. ఇద్దరు పసిపిల్లలు, నెత్తిన మోస్తున్న అవమాన భారం,అయ్యో అని చూస్తున్న జాలి చూపులు ఆమెకి నరక ప్రాయం అయ్యాయి. పుట్టింట్లో అంతగా చదువుకొని తల్లి దండ్రులు యెవరో వొకరు వచ్చి అని పోయే మాటలతో.. మరింత నొచ్చుకోవడం ఆ ప్రభావాన్ని శివరంజని మీద చూపేవారు.

నాకు చాలా బాధ కల్గేది. భగవంతుడా, యీ బిడ్డకి  వచ్చిన కష్టం యెవరికీ రాకూడదు అని కోరుకునేదాన్ని.

 రోజులు గడుస్తున్న కొద్దీ శివరంజని తల్లి దండ్రులలో మార్పు వచ్చింది. తమ బిడ్డకి వచ్చిన కష్టానికి బాధపడుతూనే శ్రద్ద తీసుకోకుండా వదిలేస్తే ,సమాజం మాటలని పట్టించుకుంటూ కూర్చుంటే తమ కూతురు తమకి దక్కక పోవడమే కాదు. ఆమె బిడ్డలకి తల్లి లేకుండా పోతుందనే సృహ వచ్చి  శివరంజని ని  క్రమం తప్పకుండా హాస్పిటల్కి  తీసుకు వెళ్ళడం మందులు వాడటం  చేయడం వల్ల ఆమె  మళ్ళీ ఆరోగ్యంగా మారింది.

దగ్గరలో ఉన్న ఎయిడ్స్ సెంటర్ వారు, అప్పుడప్పుడూ నాలాంటివాళ్ళు నేను కలసి ఆ అమ్మాయికి యిచ్చిన సలహాలు సూచనలు వల్ల ఆమెలో ఎయిడ్స్ పట్ల అవగాహన పెరిగింది.భవిష్యత్ పట్ల ఆశాజనకంగా వుత్సాహంగా వుండే  శివరంజని చూస్తే నాకు కాస్త  మనసు తేలిక పడేది. ఓ..రెండేళ్ళు అలా గడచిపోయాయి. నాకు ఆ వూరి నుండి ట్రాస్ఫర్ అయింది. మేము సిటీలోకి వచ్చేసాము.

అప్పుడప్పుడు ఆ వూరి వారి ద్వారా శివరంజని కబుర్లు అడిగి తెలుసుకుంటూ వుండేదానిని. శివరంజని మళ్ళీ వివాహం చేసుకుంది అని తెలిసి ఆశ్చర్యపోయాను. పాజిటివ్ పెళ్ళిళ్ళ ప్రస్థానంలో శివరంజని తన లాంటి యింకొక  పాజిటివ్ వ్యక్తి ని పెళ్ళాడింది ఆతను ప్రభుత్వ వుద్యోగి. తన పరిస్థితి తెలిసి మరొక తనలాంటి వ్యక్తీ తో కలసి జీవితం కొనసాగించాలని అనుకున్నప్పుడు శివరంజని తారసపడటం వారివురుకి ఆమోదం అయి పెళ్లి చేసుకోవడం జరిగిందని. అది ఇష్టం లేని శివరంజని తల్లిదండ్రులు ఆమెని యింటికి  రావడానికి అనుమతించలేదని  తన ఇద్దరి పిల్లలని తీసుకుని అతనితో కలసి హైదరాబాద్ వెళ్ళిపోయిందని విన్నాను.

ఎన్ని యేళ్ళు గడిచినా నాకు శివరంజనిని మర్చిపోవడం కానిపని  అయ్యేది. పదహారేళ్ళకే పెళ్లి, పద్దెనిమిది యేళ్ళకి యిద్దరు పిల్లలు, భర్త హెచ్ ఐ వి తో చనిపోవడం సమాజం లో యెదుర్కొన్న అవమానం. ఆ పిల్ల జీవితంలో అన్నీ విషాద ఘట్టాలే!

శివరంజనికి వొక చెల్లి ఉండేది. శివరంజని జీవితం యిలా అవడం చూసి ఆ అమ్మాయికి పెళ్లి ఆలోచన చేయకుండా బాగా చదివించారు. ఆ అమ్మయి భర్త, ఆమె ఇద్దరూ సాఫ్ట్ వేర్ వుద్యోగస్తులు.విదేశాల్లో వుంటారు. శివరంజనికి తన జీవితం యెన్నాళ్ళు సాఫీగా సాగుతుందో నమ్మకంలేదు. అయినా బిడ్డలని చదివించుకుంటూ స్థిమితంగా వుంది.

ఆమెని పెళ్లి చేసుకున్న వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, యి౦కొన్నాళ్ళకి మరణించడం ఖాయం అని తెలిసినాక తన  తదనంతరం వచ్చే బెన్ఫీట్స్  అన్నీ ఆమెకే చెందేటట్లు వ్రాసి  ఆమెని పుట్టింటికి పంపి అతను తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడని  చెప్పేవారు. అతని తల్లిదండ్రులు కూడా శివరంజని   తన కొడుకుని  సొమ్ము కోసమే పెళ్ళిచేసుకుంది  చస్తాడని తెలిసి అన్నీ చేజిక్కించుకుని వెళ్ళిపోయింది అని అనేవారట.  తల్లిదండ్రుల చెంతకు చేరిన అతనిని  పశువుల పాకలో వుంచితే అయినవాళ్ళ నిరాదరణ మధ్య అతను వొక వారం రోజుల లోపే మరణించినట్లు విన్నాను. మళ్ళీ శివరంజని జీవితంలో విషాదమే!

అంటీ! మా అమ్మాయిల  వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు.. నాకు యేడుపు కూడా రాలేదు. విచ్చలవిడిగా తిరిగి నాకు యీ రోగం అంటించి పెట్టేడే అని కోపం వచ్చేది.నేను చచ్చిపోతానని భయం వేసేది. కానీ ఆనంద్ ని నేను యిష్టపడి పెళ్ళి చేసుకున్నాను.అతను నన్ను బాగానే చూసుకున్నాడు. మేము వొకరి కోసం వొకరు  అన్నట్లుగా బ్రతికాము. అంత ప్రేమ వుండేది.ఆనంద్ చనిపోయాక నాకు బ్రతకాలని లేదు చచ్చిపోవాలని వుంది అంటూ యేడ్చేది. అలా యేడ్చే ఆమెని చూస్తే శివరంజని రాగమే గుర్తుకు వచ్చేది. ఆ రాగంలో కూర్చిన పాటలు గుర్తుకు వచ్చేవి.

కుటుంబ సభ్యుల పట్ల అనుబంధాలకన్నా, డబ్బు ముఖ్య పాత్ర వహించడం చూస్తే వెగటు కల్గేది నాకు. లైంగిక విజ్ఞానం లోపించి వ్యాధుల బారిన పడే బిడ్డల గురించి తల్లి దండ్రులకి భాద్యత ,అవగాహన కూడా ఉండాలి.
 అసలు పిల్లలకి నైతిక విలువలు గురించి చెప్పేది యేమన్నా వుందా?  రాముడుకి వొకే భార్య , వొకే బాణం అలా వుండాల్సిన నైతిక విలువలను నేర్పే ప్రయత్నం చేయరు..అంతా గుప్పిట మూసి వుంచి పెంచాలనుకుంటారు. ఇప్పుడు పిల్లలకి అవసరమైన దానికన్నా యెక్కువే తెలుసు. పిల్లలకి తెలుసు అని పెద్దవాళ్ళకి తెలుసు.అయినా లైంగిక విద్య గురించి, లైంగిక వ్యాధుల గురించి మాట్లాడటానికి జంకుతారు. చాప క్రింద  నీరులా కబళించే వ్యాధుల పట్ల యెవరికీ పట్టదు .ప్రభుత్వం ఖర్చుపెట్టే వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసే పన్నీరు అవుతుంటాయి. యుక్త వయసులోకి వచ్చే పిల్లలకి తల్లి దండ్రులు,గురువులు కన్నా వివరించి చెప్పగల్గే సెక్సాలజిస్ట్  లు,కౌన్సిలర్స్ అవసరం అని  పాఠశాలల  యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు  తెలుసుకోరెందుకు? యిలాంటి ఆలోచనలతో నాకు తల పగిలిపోయేది.

ఎక్కడ చూసినా హెచ్ ఐ వి బాధితులే! వ్యాధి నిరోధకాల గురించి అవగాహన లేని జనం వ్యాధిగ్రస్తుల పాలిట  చూపుతున్న నిరాదరణ , వైఖరి మారేదేప్పటి కో, యెంతమంది స్త్రీలు తమ తప్పిదం అంటూ యేమీ  లేకుండానే.. హెచ్ ఐ వి కి గురై అవమానాల పాల బడుతున్నారో, అర్ధాతర చావులకి గురి అవుతున్నారో, అసలు పెళ్లి కి ముందు  రోగ నిర్ధారణ  పరీక్షల ఫలితాలు యివ్వమని అడగడంలో తప్పులేదని, నిర్దారించుకోవడంలో వచ్చిన నష్టం ఏమిటి..? వివాహానికి పూర్వం ఆరోగ్య పరిక్షా ఫలితాలు  తీసుకోవడం తప్పనిసరి  అనే చట్టం చేయడం కూడా అవసరం  అని అనుకునేదాన్ని.

నాలుగేళ్ళుగా శివరంజని గురించి విషయాలేవీ తెలియలేదు. ఈ మధ్య వాళ్ళ అమ్మ,పిల్లలు యిద్దరితో కలసి మా యింటికి వచ్చింది. చాలా చక్కగా ఉంది. పిల్లలిద్దరూ ముత్యాల్లా వున్నారు. పెద్ద పిల్ల అప్పుడే ఇంటర్ మీడియట్ కి వచ్చేసింది. చిన్న అమ్మాయి చాలా చురుకుగా ఉంది. మా యింటి నుండి షాపింగ్ కి వెళ్లాం. శివరంజని ని ఆ చీర కొనుక్కో, ఈ చీర కొనుక్కో, నువ్వు కొనుక్కోక పొతే నాకు డ్రస్స్ వద్దు అని అలుగుతున్న చిన్న  పిల్లని చూస్తే ముచ్చటేసింది.

శివరంజని ముఖంలో తల్లిగా యెంతో సంతోషం చూసి  నాకు సంతోషం కల్గించింది. అమ్మ-నాన్న  చెల్లి దగ్గరికి వెళ్లి ఆరు నెలలు వుండి వచ్చారు ఆంటీ! చెల్లి నాకు లాప్టాప్ పంపింది. నేను యిప్పుడు.. లాప్టాప్ ద్వారా గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ని నడుపుతున్నాను.  ఎక్కువ అకౌంట్స్  వుంటే మా వూరిలోనే బ్యాంకు బ్రాంచ్ ఓపెన్ చేస్తారు అని చెప్పారు. నేను పని నేర్చుకుంటున్నాను.  డబ్బుకి యే౦ లోటు లేదు. భూముల విలువలు పెరిగి నాకున్న ఆస్తి కోట్ల ధర పలుకుతుంది.భగవంతుడి దయవల్ల ఓ పదేళ్ళు బ్రతికితే నా బిడ్డలు పెద్దవాళ్ళు అవుతారు. అందు కోసం అయినా బ్రతకాలి కదా అని చెప్పింది యెంతో ఆశగా.

 ఆ మాటలు వింటున్న నాకు మళ్ళీ విచారం ముంచుకొచ్చింది. అలా యే౦ జరగదులే! నువ్వు చాలా దైర్యంగా, నిబ్బరంతో మెలుగుతున్నావు. నీలో విశ్వాసమే నీకు బలం,మందు కూడా. అయినా యెంత  మంది యేదో వొక రోగాల బారిన పడి, ప్రమాదవశాత్తు చనిపోవడంలేదు. ఈ రోజు చూసిన వాళ్ళు రేపటికేమవుతారో తెలియడం లేదు. జీవితం ఆశ నిరాశల సయ్యాట. బ్రతకాలి, బ్రతికి చూపించాలి. జీవితం జీవించడం కోసమే కదా అని చెప్పాను అనునయంగా.

 శివరంజని నవ్వింది. మీరు నన్ను మొదటిసారి చూసినప్పుడు మీరన్న మాట, పాట మర్చిపోలేదు ఆంటీ..అని గుర్తు చేసుకుంది.

" రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి. శివరంజని. అద్భుతమైన  రాగం  ఆనందం పంచే  రాగం.. ఈ పేరు యె౦దుకు పెట్టారు నీకు అని  అడిగానంట.
కానీ విషాదం నింపుకున్న రాగం . శివరంజని కి తగ్గట్టుగా అని మనసులో అనుకుని  పైకి మాత్రం  యిలా అన్నాను "అయినప్పటికీ స్వర సుర ఝరి తరంగానివి.  ఎన్ని ఆరోహణలు యెన్ని అవరోహణలు వుంటే  యేమిటి   జీవన సంగీతాన్ని ఆలపిస్తూ  సాగే రాగ తరంగానివి"
శివరంజని నవ్వింది.
ఈ నవ్వులు కలకాలం పూయాలి. మరికొందరికి వుత్సాహాన్ని,స్పూర్తిని యివ్వాలి అని భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాను. అదొక మంచి పాట వినడం లాంటి అనుభూతి నాకు .

24, జనవరి 2013, గురువారం

సంస్కార్

"సంస్కార్ " హిందీ సీరియల్ చూస్తున్నారా?

ఆ సీరియల్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక భారతీయ యువకుడు.. ఉద్యోగ రీత్యా అమెరికా కి వెళ్ళేటప్పుడు..  కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికే సన్నివేశాలు ఎయిర్ పోర్ట్ లో చిత్రీకరించిన  దృశ్యాలు కంటతడి పెట్టించాయి. అలాంటి సన్నివేశాలలో నన్ను ,నా కొడుకు ని పోల్చి చూసుకున్నాను. బహుశా  ఎవరికైనా అంతేనేమో కూడా!

 కుటుంబ సభ్యుల  మధ్య ఉన్న ప్రేమాభిమానాలు,సున్నితమైన అనుబంధాలు,సంస్క్రతి-సంప్రదాయాలు అన్నీ ఎంతో  ఉన్నతంగా దృశ్య మాలికలగా కదలిపోతుంటే.. మనసు కరిగి నీరైపోయింది.

 అమెరికా  చేరిన తర్వాత ఎయిర్ పోర్ట్ లో ఎదురైన చేదు అనుభవాలు,పాస్పోర్ట్ , వర్క్ వీసా పోగొట్టుకుని అతను పడే అవస్థలు చూస్తుంటే..  మన బిడ్డలు ఇలాంటి అవస్థలు ఎదుర్కుంటే ..అన్న ఆలోచన వచ్చి అప్రయత్నంగా  వణికిపోయాను..

వీలయితే ఈ సీరియల్ తప్పక చూడండి. colors చానల్ లో రాత్రి  09:00 to 09:30 సమయంలో ఈ సీరియల్ వస్తుంది. తిరిగి రాత్రి 12:00 to 12:30 వరకు వస్తుంది {IST )


22, జనవరి 2013, మంగళవారం

సుదర్శన



చేసే పని సృజనాత్మక మైనదే ! రక రకాల మనుషులను నిశితంగా పరిశీలించే అత్యంత ఇష్టమైన వ్యాపకమే!! కానీ ఎందుకో విసుగు కల్గుతుంది.

 హఠాత్తుగా ఓ.. అయిదారేళ్ళు వెనక్కి వెళ్లి పోయి..ప్రీతికరంగా రేడియో కార్యక్రమాలు వింటూ.. మనకి నచ్చే పాటలు వచ్చినప్పుడు సంతోషంగా ఎగిరి గంతేస్తూ.. కొన్ని పాటల కోసం పోస్ట్ కార్డ్ పై  స్కెచ్ పెన్ లతో..రంగు రంగులను మేళవించి అక్షరాలతో అభిరుచి కార్యక్రమం కి మన అభిరుచి తెలియజేస్తూ.. పాట  ప్రసారం చేయమని కోరుకుంటూ..

ఉదయం 08:35 ఎప్పుడు అవుతుందా !? అని నిమిషాలు లెక్కిస్తూ.. ఒక లాండ్ లైన్,రెండు మొబైల్ పోన్స్ పట్టుకుని రెండు నెంబర్స్ ఫ్రెష్ గా డయిల్  చేస్తూ  కలసిన నెంబర్ లిఫ్ట్ చేయాలి.. లిఫ్ట్ చేయాలి భగవంతుడా .. ఈ నా కాల్ లిఫ్ట్ చేసేలా చూడు అంటూ ..అల్ప మైన కోర్కెలతో..అమిత సంతోషపడే రోజులు మళ్ళీ వస్తాయా!?

అభిమాన ప్రయోక్త జె.పుష్పరాజ్ గళంలో గళం కలిపి ఆనందంతో తబ్బిబ్బు అయిపోయిన  రోజులు డైరీలో మరపు రాని పేజీలు .

 కాలాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ అలాంటి రోజుల్లోకి వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఇంటర్ నెట్ ప్రపంచం పాటని చేరువ చేసింది కాని..మధురానుభూతిని దూరం చేసింది. కొత్తగా అలవాటుపడ్డ ముఖ చిత్రం..  ఆత్మీయంగా నేస్తానికి కాగితంపై వ్రాసుకునే లేఖలని దూరంగా నెట్టేసింది. రెండక్షరా ల పలకరింపులు ,కొన్ని లైక్  లు, బహు కొద్దిగా వ్యాఖ్యలు. ఒకటే పరుగులు. యంత్రం ముందు నుండి యాంత్రిక మైన జీవితం నుండి బయట పడి మాటకి ఆత్మీయ పరిమళాలనద్దే  మనసుతో..సంభాషించాలని ఉంది. కొన్ని ముసుగులను తొలగించుకుని మనసును స్వేచ్చగా గాలికి ఆరేసుకోవాలని ఉంది.

ఖచ్చితంగా ఇలాంటి సమయాలలోనే "సుదర్శన " గుర్తుకు వస్తుంది.సుదర్శన అంటే చలోక్తుల పుట్ట. పెదవి విరుపుతోనే ఇతరుల పెదవులపై నవ్వులు పూయించే విద్య ఆమె సొంతం. నాకు  ఆమెతో ముఖ పరిచయం అయినా లేదు. ఒకరోజు బాగా పని వత్తిడిలో ఉన్నప్పుడు నాకు పోన్ చేసింది. పేరు తెలిసాక మీరు ఫలానా ప్రాంతం నుండి రేడియోకి ఉత్తరాలు వ్రాస్తారు కదా! మీరు సావిత్రి గారికి వీరాభిమాని ..అవునా అడిగాను.

వసుంధ గారు నన్ను భలే గుర్తు పట్టేశారు..చాలా సంతోషం అంది.. వసుంధరా.!.ఆవిడెవరు? అడిగాను అయోమయంగా..
"మీరేనండీ వాణి  జయరాం గారు "అంది. అప్పుడు గాని నాకు అర్ధం కాలేదు నాతో  హాస్యం ఆడుతుంది అని. నిజం చెప్పొద్దూ.. చికాకు అనిపించింది.నేను పని వత్తిడిలో ఉన్నాను. వీలు చూసుకుని మీతో మాట్లాడతాను, ఉండనా మరి అంటూ అనుమతి కోరాను. మీతో  తొలి పరిచయంలోనే విసుగుపెట్టినట్టు ఉన్నాను, మళ్ళీ మాట్లాడుకుందాం "అని తనే పోన్ పెట్టేసింది.

నాకు తీరుబడి ఉన్నప్పుడు కూడా "సుదర్శన"తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కొంత కాలానికి ఆమె మళ్ళీ పోన్ చేసినప్పుడు సిగ్గుపడ్డాను. కొద్దిసేపు సంభాషణ లోనే  ఆమె మంచి మాటకారి మాత్రమే  కాదు.. సాహిత్య అభిలాష ఉన్న వ్యక్తిగా  అర్ధమైంది. తనతో..లోతుగా సంభాషించే కొలది ఆమె పట్ల ఒక గౌరవభావం ఏర్పడింది. వీలయితే ఉత్తరం వ్రాయమని  తన పోస్టల్ చిరునామా  ఇచ్చారు. చిరునామా కాగితం చెత్త బుట్ట కి సొంతం అయిపొయింది కానీ..మా మధ్య అప్పుడప్పుడు పోన్ సంభాషణలు దీర్ఘ సమయాలు కొనసాగుతూ ఉండేవి .

ఎప్పుడైనా మనసు బావుందకపోతే తనతో మాట్లాడితే చాలు. పది నిమిషాలలో మనసు దూది పింజేలా తేలుతూ..నూతన ఉత్సాహం తో పరుగులు తీస్తూ ఉండేదాన్ని. .

నా గొంతు  వాణి జయరాం  గొంతులా ఉంటుందని నన్ను తెగ మెచ్చుకునేది. వాణి జయరాం గారు.. ఒక పాట పాడండి! అని అడిగించుకుని, అడిగించుకుని ఒక పల్లవి పాడి వదిలేసేదాన్ని అంతమాత్రానికి తెగ సంతోషపడేది .

ఒకసారి ఒక కవితా వేదిక ని నిర్వహించడానికి " సుదర్శన" నివాసముంటున్న పట్టణం నుండి నాకు ఆహ్వానం అందింది. ఆమెని కూడా చూసినట్లు ఉంటుందని ప్రయాణం అయ్యాను. నేను రైలు స్టేషన్ లో బండి దిగేటప్పటికి నన్ను ఆత్రుతగా వెదుకుతూ ఆమె ఎదురయింది.  వయస్సు నలుబై పైబడి ఉంటుంది.తెల్లని చీరపై ఊదా రంగు చిన్న చిన్న పువ్వులున్న చీర కట్టుకుని ఒత్తైన తలకట్టుని చక్కగా ముడి చుట్టుకుని పొందికగా ఉంది. నన్ను పోన్ లలో  హాస్యోక్తులతో..గంటల తరబడి మరపింపజేసేది ఈమేనా ? ఆమె ఈమె వేరు వేరు ఏమో..అనుకుని ఆలోచించసాగాను.

అమ్మా..వసుందర.. నేనే సుదర్శన .. బహు దర్శన  వింత దర్శన ..అన్నీ నేనే! అంటూ మేలమాడింది. స్టేషన్ బయటకి వచ్చి..ఆటో మాట్లాడుకుని సభాస్థలం కి వెళదామన్నాను. మా మేడకి వచ్చి నాస్టా చేసుకునిపోదాం రండి..అంది.ఇప్పటికే ఆలస్యం అయింది కదా ! మధ్యాహ్నం భోజన సమయాలు అప్పుడు వెళదాం అని వాయిదా వేసాను. ఆమెతో మాట్లాడుతూనే సభా కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నాను.

మధ్య మధ్య తన గురించిన విషయాలు దొర్లాయి. ఇంటికి పెద్ద కూతురు.మేన బావతో బాల్య వివాహం ,ముగ్గురు మగ బిడ్డలు. తర్వాత భర్త పర స్త్రీ సాంగత్యం కోరి..ఆమెని,ముగ్గురు బిడ్డలని పుట్టింటి పరం చేసి రెండో భార్యతో మరో ఇద్దరు బిడ్డలకి తండ్రి అయి ఈమెని ఈమె బిడ్డలని పరాయి వారిగా తోసేస్తే దినదినంబు ఇసురాయిల్లో గింజలా నలుగుతూ..పాతికేళ్ళ ప్రయాణం చేసిన ఆమె వెతలు గురించి వింటే ఆమె పట్ల సానుభూతి కల్గింది.

 "పెద కాపు కులాన పుట్టినందుకేమో.. పని పాట  చేసుకునే వీలు లేకపోయింది. నాకా..చదువు సంధ్య లేదు ఏ ఇడ్లీల అంగడో .దోసెల కొట్టో పెట్టుకుని బ్రతుకు దామన్నా నామోషీ అయిపోయే! ఏదో అలా కన్నారి పంచన పడి బతుకుతున్నాం."అని చెప్పింది. 

ఆమె చెప్పే  కొన్ని విషయాలు వింటున్నప్పుడు దుఖం ముంచుకొచ్చింది.

ఆమె మాటల్లోనే మరింత నేను తెలుసుకున్న కథ..సుదర్శన పెద్ద కొడుకు పాతికేళ్ళు పెరిగి ప్రయోజకుడై.. ఒక ఉద్యోగస్తుడ య్యాక కాస్త అభిమానంగా బ్రతకాలి అనుకున్నాను. వాడేమో..వేరే కులస్తురాలిని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చి వేరు కాపురం బోయాడు.ఒక బిడ్డ పుట్టినాక చెడు సావాసాల పాలబడి..కోడలినికూడా నా పై దోలి.. దేశం బట్టి పోయాడు. ఆ అమ్మాయికి అనారోగ్యం చేసింది. రోగ నిర్ధారణ పరీక్షల్లో ఆ అమ్మాయికి హెచ్.ఐ.వి.అని వచ్చింది.

"పాపం పారాయి వాళ్ళ బిడ్డ అయినా నిజం చెప్పుకోవాల. కోడలు చాలా మంచిది.ఆ అమ్మాయికి నా కొడుకుని కట్టుకున్నందుకే ఈ శిక్ష. పచ్చి త్రాగుబోతుగా మారిన  కొడుకుని  ఇంటికి  రాడు . వచ్చినా ఆ అమ్మాయిని మమ్మల్ని అందరిని ప్రశాంతంగా బతకనీయడు. ఆ అమ్మికి ఒకటే దిగులు. చచ్చిపోతున్నాను నా బిడ్డని ఎవరు చూస్తారు? అని ఏడుస్తా ఉంటది. మనుమడిని, ఆ అమ్మిని కంటికి రెప్పలా చూసుకుంటానే ఉన్నాం. ఈ దినం కూడా ఆ అమ్మిని హాస్పిటల్కి తీసుకుపోవాలి.కానీ మిమ్మల్ని కలిసేది ఏట్టా ..అందుకే ఆ అమ్మిని మా చెల్లికి ఇచ్చి హాస్పిటల్ కి పంపి ఇటు వచ్చాను "అని చెప్పింది.

సుదర్శనా ! ఇంత గరళం దాచుకుని నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావ్? అడిగాను. కష్టాలు మనుషులకి రాక మానులకి మొక్కలకి వస్తాయా..!? అవన్నీ మామూలే అయిపోయాయి. వీటన్నిటి మధ్య కాస్త మనసుకి తెరిపి పుస్తకాలు ,పాటలు,మీలాంటి నేస్తాలు అని చెప్పింది. నాకు కళ్ళలో..నీళ్ళు చిప్పిల్లాయి.సభ పూర్తి అయ్యేసరికి చీకటి పడింది. నేను ఎక్కబోయే ట్రైన్ అందుకోవాలి అంటే.. సుదర్శన వాళ్ళ ఇంటికి వెళ్ళడం వీలుపడదు. ఆ మాట చెప్పలేకపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్లి సుదర్శన కోడలిని పలకరించి కాస్త దైర్యం చెప్పడం భాద్యత అనుకున్నాను. కానీ వెళ్ళ లేకపోయాను.

రైలు  ఎక్కబోతూ.. నా బేగ్ తెరచి డబ్బు ఎంత ఉందొ చూసాను.టిక్కెట్ తీసుకున్నాక ఉన్న చిల్లర  ఒక వెయ్యి రూపాయలు మాత్రమే  ఉన్నాయి. వెంటనే ఆ వెయ్యి రూపాయలు తీసి.. కోడలి మందుల కోసం వాడమని చెపుతూ నేను సిగ్గుపడ్డాను. సారీ..సుదర్శనా! నిన్ను అవమాన పరచాలని కాదు. ఏదో.. చిన్న సాయం అని చెప్పాను.  నీ మనసు నాకు తెలియదా వసుందరా..! అని నా చేయి తన చేతిలోకి తీసుకుని అలాగే ఉండిపోయింది.
రైలు కదిలింది. నా కళ్ళల్లో నిండుకున్న నీటి మసకల్లో.. ప్లాట్ పారం పై నాకు వీడ్కోలు చెపుతున సుదర్శన రూపం ఎంతో  .ఉన్నతంగా కనబడింది.

తర్వాత కొన్నాళ్ళకి సుదర్శన కోడలు మరణించింది మనుమడు జయంత్ ని నాలుగో కొడుకుగా స్వీకరించి.. మళ్ళీ మరోమారు తల్లి అయింది సుదర్శన.

భూమికి భారమై బ్రతుకుతున్నాను  అయినా బ్రతకాలి మళ్ళీ ఈ బిడ్డని పెంచవద్దూ..అంటుంది మనుమడి  గురించి  చెపుతూ . అప్పుడప్పుడు పెద్ద కొడుకు వచ్చి తన బిడ్డని తానూ తీసుకు వెళతానంటూ..  చేసే రచ్చని ఎదుర్కుంటూ.. నాలుగేళ్ల మనుమడు గీతా పారాయణం నేర్చుకుంటూ.. మధ్యలో నత్తి మాటలు జొరబడుస్తూ..నేర్చున్న శ్లోకాలని వినిపిస్తూ ఉంటే నవ్వు కుంటూ.. ఆ నవ్వులు నాకు పంచాలని పోన్ చేసే సుదర్శన అంటే నాకు వల్లమాలిన అభిమానం..

అప్పుడప్పుడూ పోన్ లో కబుర్లు, కాస్త బరువైన సంభాషణలు,అంతలోనే హాస్యపు గుళికలు..

మా తొలి పరిచయం అయిన రోజుని,అలాగే తనని వాళ్ళ ఊరిలో కలసిన రోజుని గుర్తుపెట్టుకుని పోన్ చేసి మరీ పలకరిస్తూ ఉంటుంది. ఆ ఒక్క విషయమూ చాలు తను మనుషుల పట్ల, మమతల పట్ల ఎంత సున్నితమైన భావన కలిగి ఉంటుందో చెప్పడానికి.

స్త్రీ గా పుట్టినందుకు ఒక్కో స్త్రీ మూర్తి.. ఎన్ని గరళాలని మింగుతూ.. నిత్యం చస్తూ.. అంతలోనే బ్రతుకుతూ.. బ్రతుకు ఈడుస్తూనే  ఉంటారు .

అందరూ.. దీరోదాత్తులైన, ఉక్కు పిడికిలి బిగించి నడిచిన స్త్ర్రీ మూర్తులు  మాత్రమే ఉండరు.. సాదా సీదాగా బ్రతికే సుదర్శనలు ఉంటారు. అలా కూడా బ్రతుకు ఈడ్వక తప్పదు అని చెప్పేందుకేమో  !

అలాటి వారందరికీ ఏమివ్వగలను. కాస్తంత స్నేహ హస్తం,  పిడికెడు ఆత్మ విశ్వాసం, కూసింత సాయం తప్ప.

ఈ యంత్రాల మధ్య నుండి బయటపడి.. కాస్తంత మనుషుల మధ్య పడి  కష్టం చాయ లోకి నేను జొరబడి..సుదర్శన కి మాట-మంచి బంధం వేయాలని పోన్ తీశాను.

18, జనవరి 2013, శుక్రవారం

నా జీవితం నా చేతుల్లో..

.
“అసలీ  ఆవకాయ పచ్చళ్ళు యెవరు  కనిపెట్టారో కానీ చెడ్డ చిరాకేస్తుంది. తినేటప్పుడు యింటిల్లపాది లొట్టలేసుకుంటూ టెంకెని  వడేసి  నములుకుంటూ రసస్వాదనలో మునిగి పోతారు కానీ  పచ్చడి పట్టేటప్పుడు  యీ మండుటెండల్లో చెమటలు కక్కుతూ యెంత  కష్టపడాలో వీళ్ళకేం  తెలుసు ? ”

ఇద్దరు  పిల్లలున్నారన్నమాటే కానీ   కాస్త అమ్మకి సాయం చేద్దామనే యింగిత  జ్ఞానమయినా లేదు. ఎప్పుడూ ఆ నెట్ లో తలదూర్చి చాటింగ్ చేసుకోవడమే  తప్ప.  తమ చుట్టూ వున్న ప్రపంచం  యేమిటో అన్నది అసలక్కరలేదు
పైకనుకుంటూ  కూతురు, కొడుకు పై  విసుగునంతా ప్రదర్శించింది సుజాత.

అయినా వాళ్ళలో వీసమెత్తు  కదలిక  కూడా లేదు. ఇంకా చెప్పాలంటే  మామిడికాయలని  ముక్కలగా చేస్తున్న   తల్లి వైపు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అమ్మ కోపం యెంతసేపులే   అన్న అతి రహస్యాన్ని  అర్ధం చేసుకున్నట్లు.
అంతలో గుమ్మం ముందు యెవరో వచ్చిన కదలిక కనిపించి కారుతున్న చెమటని తుడుచుకుంటూ తల పైకెత్తి చూసింది  సుజాత.
“విజయ” కనబడింది. సంతోషం ముఖంలోకి కరంట్ లా ప్రవహించింది.

"రా ..రా.. అనుకోకుండా యేమిటీ.. యీ హటాత్తు రాక  అని అడుగుతూనే లేచి నిలబడి ప్రిజ్డ్  వైపు అడుగులు వేసింది.

చెప్పులు విడిచి బయటున్న పంపు దగ్గర  కాళ్ళు కడుక్కుని కాస్త ముఖం మీద నీళ్ళు చిలకరించుకుని చేత్తో తుడుచుకుంటూ లోపలకి   వచ్చింది విజయ.

“ముందు ఈ చల్లటి నీళ్ళు త్రాగు.  ఇంత ఎండన పడ్డావ్? భోజనం చేసావా!? ప్రశ్నలు గ్రుమ్మరించింది సుజాత.
మంచి నీళ్ళ గ్లాస్ తీసుకుని గట గట తాగేసి మరి కాసిని అన్నట్లు చూసింది.

మరి కాస్త నీళ్ళు త్రాగి కాస్త సేదతీరగానే  చెప్పు అన్నట్లు చూసింది విజయ
“ఈ రోజు ఓ స్కూల్ వాళ్ళు టీచర్స్ పోస్ట్ కోసం ఇంటర్యూ  చేస్తున్నారు. అందుకోసమే రావాల్సి వచ్చింది ” చెప్పింది విజయ.

“ఇంటర్యూ బాగా జరిగిందా? బాగా చేసావా?”ఆత్రుతగా అడిగింది.

“ఏదో..పర్వాలేదు. సెలక్ట్ అయ్యింది  లేనిది తర్వాత పోన్ చేసి చెపుతానన్నారు” చెప్పింది.

కొద్దిగా నిరాశ సుజాతకి.  "నేను ఈజీగానే తీసుకున్నానులే!" అంది విజయ.

నిజానికి విజయ కంటే.. ఆమెకొచ్చే ఉద్యోగం పట్ల సుజాతకే ఎక్కువ వర్రీ ఉంది. వాళ్ళిద్దరికీ ఓ..నాలుగేళ్ల పరిచయం. సుజాత పని చేస్తున ఆపీస్ కి విజయ వస్తూ ఉంటుంది. ఓ పదేళ్ళ వయసు తేడా వున్నాయేదో తెలియని బంధం వారిని కలిపింది.మంచి స్నేహితులు అయ్యారు.

“తొందరగా నీకొక వుద్యోగం దొరికితే బాగుండు” అంది సుజాత . విజయ మౌనంగా వింటూ ఆలోచిస్తుంది.

“మోడల్ స్కూల్ టీచర్ పోస్ట్ ల కోసం జరిగే ఎగ్జాం యెప్పుడూ ?”అడిగింది. .

“ఓ..పది రోజులు  తర్వాత ఉంది” చెప్పింది కాస్త అనాసక్తిగా..

ఏమిటమ్మా ! అంత నిరాశగా వున్నావు? అడిగింది..

” ఏం చేయను ..అసలెందుకు బ్రతకాలో, ఈ వుద్యోగాల కోసం  యెందుకు ప్రయత్నించాలో అర్ధం కావడం లేదు.
“రజియా”కి పోన్ చేసావా?

“చేసాను, విషయం చెప్పాను..నీ కూతురితో నువ్వే మాట్లాడు అని  పోన్ ని ఆ పిల్లకిచ్చేసింది .రెండు మూడు మాటల తర్వాత అడిగాను. "నేనొస్తున్నాను ..నువ్వు నాతోపాటు వచ్చేయి"  అన్నాను వెంటనే పోన్ కట్ చేసింది. రెండు నిమిషాలు ఆగి మళ్లీ పోన్ చేసాను. రజియానే మాట్లాడింది. “వదినా నేను అప్పు, అమ్మీ అందరు చెప్పి చూసాము. అమ్మ వెంట వెళ్ళు నీకక్కడ చాలా  బాగుంటుంది అని. కానీ ఆపిల్ల వినడం లేదు. నేను వెళ్ళనంటే  వెళ్ళను .  మీకు అంత బరువైతే, నన్ను మీరు బలవంతంగా పంపించాలనుకుంటే ..నేను యింట్లో నుంచి  వెళ్ళిపోతాను కాని ..ఆమె దగ్గరకి మాత్రం నన్ను వెళ్ళమని చెప్పొద్దు” అని ఖచ్చితంగా కోపంగా చెప్పిందట ..”

ఆ మాటలు చెపుతున్నప్పుడు విజయ కళ్ళల్లో కన్నీరు.

నేను తననేమైనా కావాలని వదిలేసానా? నేనంటే  యేమిటో నాకు తెలియని, వొంటిమీద సృహ లేని    మెదడు మొద్దు బారిపోయిన  పరిస్థితుల్లో నా వెంట తనని తెచ్చుకోలేకపోవడం తప్పే! కాని నన్నిలా  ద్వేషించుకునే తప్పు నేనేమి చేసానో..నాకర్ధం కావడం లేదు”అంది విజయ.

ఆ పరిస్థితిలో  ఇంకేదైనా మాట్లాడినా విజయని యింకా యెక్కువ  బాధ పెట్టడమే అవుతుందని సుజాతకి తెలుసు. కొంచెం కాఫీ కలిపి ఇచ్చింది. త్రాగుతూ చెప్పింది.”పోయినసారి  తనని చూడటానికి నేను వెళ్ళినప్పుడు నా కూతురు నాకు కాఫీ కలిపి యిచ్చింది.అంత పెద్దదయిపోయింది తెలుసా? “అంది నవ్వుతూ

“ఈ సంవత్సరం అయినా స్కూల్ కి పంపుతారా లేదా? లేకపోతే  మదర్సాకే పంపుతారా?” కించిత్ కోపంగా అడిగింది.

“నాకు తెలిసినంతవరకూ ఓ రెండేళ్ళు యింట్లో  పని పాట నేర్పి ..పెళ్లి చేసి పడేస్తారు.అంతకన్నా వేరే సూచనలు వాళ్ల  దగ్గర లేవు "అంది.

“నువ్వుసలు యెలా   వూరుకోగాల్గుతున్నావ్? ఆ పిల్ల వయసు పదేళ్ళు నిండినాయి. చదువు సంధ్య లేదు,మంచి-చెడు తెలియదు.  ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గులేదా?”  తీవ్రంగా అడిగింది సుజాత.

“నన్నేం  చేయమంటావు  చెప్పు “

“తల్లిగా నీకసలు భాద్యత లేదని అనుకుంటున్నావా!? అతను వ్యసనపరుడు..వదిలి పడేసాడు. నీకేమయింది?”

“నా జీవితమే అలా తగలడింది.. ఇక యింతే  ప్రాప్తం అనుకుని వదిలేయడమే!”అంది విజయ.

"నువ్వులా అంటే ఒప్పుకోను. అసలు ఒకరి జీవితం నాశనం కావడానికి  యితరుల మీద తప్పులు రుద్దేయడానికి యితరుల వల్లనే తమ జీవితం అలా తయారైందని యేడవడానికి, వో కడివెడు కన్నీళ్లు కార్చడానికి తయారుగా వున్నట్లు  వుండే  వాళ్ళని చూస్తే నాకసహ్యం. అసలు యితరులలెవరో నాశనం చేయడానికి ప్రయత్నించినా మనకి మనం యే౦ చేసుకుంటున్నాం, యే౦ చేయగల్గుతున్నాం అని ఆలోచించుకోవాలి. ఖర్మ అని, ప్రారబ్ధం  అని సరిపెట్టుకోవడాన్ని   ఎస్కేపిజం అంటారు. అయినా నీకు ఈ వైరాగ్య భావనలు రావడంలో ఆశ్చర్యమేం  లేదులే.. యెప్పుడూ గుళ్ళు గోపురాలు , వూర్లు తిరగడం.  ముప్పయి మూడేళ్ళ వయసులో  యివన్నీ  నీకు అవసరమా!?
నీ జీవితం గురించి నీకాసక్తి, శ్రద్ద లేకపోయినా ఓ బిడ్డకి తల్లిగా నీ అవసరం వుందో, లేదో అదైనా  తెలుసుకో.." కోపంగా చెప్పింది.

ఆ కోపంలో అభిమానం వుందని  విజయకి తెలుసు కాబట్టి యేమి మాట్లాడలేదు.

“నాన్న ఓ సంబంధం చూసారు. వాళ్ళు త్వరగా అవునో,కాదో తేల్చి చెప్పమని   వొత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు యేమీ  చెప్పను . డి.ఎస్ .ఈ ఎగ్జాం అయ్యాక చెపుతాం అన్నారట నాన్న” అంది.

“అంటే పరీక్ష బాగా వ్రాసి వుద్యోగం వచ్చే అవకాశం ఉందా! లేదా? అని తెలుసుకున్నాక చెపుతారన్నమాట. చాలా బావుంది” అంది సుజాత వ్యంగంగా.“వరుడు వివరాలు ఏమిటో ”అడిగింది
“వయస్సు 52 భార్య మరణించింది .  ముగ్గురు కొడుకులు, ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. బాగా ఆస్థి ఉంది మూడవ కొడుకు పెళ్లై పోతే  ఆస్తులన్నీ పంచేసి ఆయన సెటిల్ అవుదామనుకుంటూన్నాడట.
‘బేష్  బ్రహ్మాండంగా వుంది. మూడవ కొడుకు పెళ్ళికి అత్తగారి పాత్రలో తలంబ్రాల చీర యిచ్చి, బొట్టు పెట్టి తర్వాత ఆయనకీ పిల్లలని కంటావన్నమాట. చాలా బాగుంది” మీ నాన్నకసలు  కళ్ళు ఉన్నాయా ? లేకపోతే అప్పుడు చేయలేకపోయిన  పెళ్లిని యిప్పుడు చేయాలనుకుంటున్నారా, ఏమైనా యిదే౦  బాగోలేదు. నీకెలా అనిపిస్తుందో  కాని నాకసహ్యంగా వుంది  అంది సుజాత

“నాకు నచ్చలేదు. అసలు వచ్చిన ప్రతి సంబందానికి నువ్వే వంకలు పెడతావు. ఈ వయసులో, నువ్వు చేసిన ఘనకార్యానికి యింతకన్నా మంచి సంబంధం వస్తుందా అని తిట్టి పోస్తుంది అమ్మ. మళ్ళీ కాసేపేమో దానికి యీ వయసులో పెళ్లి యె౦దుకు? మనతో పాటు కృష్ణ,రామ అని వుంటుందిలే అంటుంది.

"తమ్ముడేమో అసలు నాతో  మాట్లాడటం మానేసాడు. ఆ యింట్లో నన్ను  అర్ధం చేసుకుంది  “మాధవి” మాత్రమే! పరాయి యింటి  పిల్ల .ఆరేళ్లలో నన్ను యెప్పుడూ  చిన్నమెత్తు మాట కూడా అనలేదు. "అని చెప్పింది మరదలు గురించి.

“సరేలే! వీటి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏమి ప్రయోజనం లేదు.భోజనం చేయి. ఈ పచ్చడి పనులు పూర్తి చేయాలి. కదా! “అంది సుజాత.

ఇప్పుడు వద్దు, వెళ్లబోయే ముందు తింటాను. పద పని చేసుకుందాం !అని తనే అక్కడి నుండి లేచింది.
ఏదో చానల్ లో “సీతాకోక చిలుక” సినిమా వస్తుంది చూడు మమ్మీ.అని సుజాత  కూతురు యింకో  రూంలో నుండి కేకేసి చెప్పింది. ఆ సినిమా అంటే పిచ్చి నాకు. మతాంతర వివాహం  టీనేజ్ ప్రేమ ..సబ్జక్ట్ భలే బాగుంటుంది "అంది సుజాత.

"అంతకన్నా మంచి కథలున్నాయి జీవితంలో " అంది విజయ.

మామిడి ముక్కలు నరుకుతూ వుండగా విజయ ఒక మాట అంది ." అసలు ఈ ప్రేమ వివాహాలు చేసుకుంటున్న వారందరినీ  యిలా ముక్కలు నరికినట్లు నరకాలి అంది." అంతులేని కోపం ఆ మాటల్లో .

“ఎందుకులే అంత మాట. అందరి జీవితం నీ జీవితం లా వుండదు. మీ వివాహ జీవితంలో అన్ని అంతరాలు,బేదాలు వున్నాయా యేమిటీ ? అంది సాలోచనగా.

నేనెప్పుడు వివరంగా చెప్పలేదు కదూ..అంటూ  విజయ తన వివాహ జీవితం వైపు కబుర్లు మళ్ళించింది. ఉండు ఉండు..అంటూ  సుజాత తన కూతురు ”డాలీ” ని పిలిచింది. పనిలో సాయం చేసే నెపంతో. కొంచెం అయిష్టంగానే కూర్చుని మామిడి కాయలోని జీడి ముక్కలని తీస్తూ శుభ్రం చేస్తూ ఆ పిల్ల వో చెవి వేసింది

విజయ చెప్పడం మొదలెట్టింది.

డాలీ కూడా శ్రద్దగా వినడానికి రెడీ అయింది.

“నాకప్పుడు ఇరవయ్యి యేళ్ళున్నాయి డిగ్రీ పూర్తి చేసి సెలవల్లో  కొత్తగా వచ్చిన కంప్యూటర్ క్లాస్స్ లకి వెళుతున్న రోజులు. అప్పుడప్పుడు నేను వెళుతున్న  కంప్యూటర్ సెంటర్ కి బాషా వచ్చే వాడు. అతను చిన్నప్పుడు నుండి నాకు తెలుసు .నాకన్నా ముందు నుండే ఆ స్కూల్ లో చదివే వాడు.పదవ తరగతి చదువుతూ  మధ్యలో మానేసాడు. ఏదో చిన్న చిన్న బిజినెస్ లు చేస్తుండే వాడని  తెలుసు. నేను కంప్యూటర్ క్లాస్ లకి వెళ్లినన్ని  రోజులు రాకపోయినా యెక్కువగానే  అక్కడికి వచ్చేవాడు. ఇరవయ్యి యేళ్ళు   వయస్సు వచ్చిన నాకతను  యెందుకు వస్తున్నాడో అర్ధం అయ్యేది. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర,అతనికి నాకు మాత్రమే   తెలిసిన  కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర  ఆ “విజయ” వప్పు కుంటే పెళ్లి చేసుకుంటాననేవాడట. అది విని నేను వాడి మొహం లే!. శుద్ధ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేనెక్కడా!,ముస్లిం అయిన అతనెక్కడ!? అవన్నీ యే౦ కుదరవులే..నోర్మూసుకుని పని చూసుకోమను”అని చెప్పేదాన్ని.

కొన్నాళ్ళు అతను నాకు కనిపించలేదు.కళ్ళకి కనబడే ప్రేమ అనే మత్తు  వదిలిపోయింది. నా సమాధానం విని  నా జోలికి రాకుండా   వెళ్ళిపోయి వుంటాడులే అనుకునే దాన్ని” చెప్పింది విజయ.
ఇంటరెస్ట్ గా ఉంది. మరి తర్వాత మీ పెళ్లి యెలా జరిగింది ?అడిగింది డాలీ

“ఆ రోజు శుక్రవారం. నేను తలంటు పోసుకుని  పట్టు లంగా కట్టుకుని ..తలలో పూలతో..మెడలో నగలతో. కంప్యూటర్ క్లాస్స్ కి వెళ్లాను. వెళ్ళేటప్పుడు ..మా అమ్మ అచ్చు పెళ్లి కూతురిలా వున్నావు అని మురిసి పోయింది. ఆమె మాటకి వున్న బలం యెంత౦టే ఆరోజు నా పెళ్లి జరిగిపోయింది.

నేను కంప్యూటర్ సెంటర్ కి వెళ్ళగానే మెయిన్ డోర్ దగ్గరే బాషా నా కోసం కాసుకు కూర్చుని ఉన్నాడు. నేను లోపలకి వెళ్లబోతుంటే చటుక్కున నా చేయి పట్టుకుని నన్ను పెళ్ళిచేసుకుంటావా!? నువ్వంటే  నాకు చాలా ఇష్టం,  యే లోటు చేయకుండా బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అతని కళ్ళల్లో ప్రేమకో,లేదా అతను అడిగిన విధానానికి సానుభూతి  కలిగో  వెంటనే తల వూపేశాను. అతని కళ్ళల్లో సంతోషం. ఓ..పది  నిమిషాల్లో అతను అతని  స్నేహ బృందమంతా  కలసి  మూడు ఆటోలలో అక్కడికి వచ్చేసారు.

బాషా కంప్యూటర్ ముందు కూర్చున్న నా దగ్గరకి వచ్చి ‘వెళదాం రా”అన్నాడు. నేను వెనుక ముందు యే౦ ఆలోచించలేదు.అక్కడి నుండి లేచి  అతని వెంట వచ్చేసాను.  అతను నన్ను  ఓ..ఆటోలో యెక్కించుకుని అమ్మవారి గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అతని స్నేహితులు పది మంది వరకు మా వెంట వచ్చారు. వాళ్ళందరి సాక్షిగా  ఆ గుళ్ళో నామెడలో తాళి కట్టాడు. నేను అతని భార్య ని అయ్యాను. “బాషా” అతని యింటికి నన్ను తీసుకు వెళ్ళ లేదు. వాళ్ళు ఉండే ఏరియా అంతా ముస్లిం లే వుంటారని చెప్పి . అక్కడ నేనుండలేననుకుని వేరొక ఇల్లు తీసుకున్నాడు.నేను అతనితో కలసి ఆ  యింటికి  వెళ్ళేటప్పటికి ఒక యింటికి  కావాల్సిన సామానులు యేమైతే కావాలో అన్నీ వివరంగా అమర్చి వున్నాయి . నాకు చాలా ఆశ్చర్యంగాను,సంతోషం గాను అనిపించింది.

“నీ మనసు నాకు తెలుసు, నువ్వు నా కోసం అన్ని అభ్యంతరాలు వదులుకుని వస్తావని నా మనసుకి తెలుసు  “నీ కోసమే యివ్వన్నీ  కొని ఉంచాను” అని చెప్పాడు.అతనికి నా పై యెంత ప్రేమ లేకపోతే యింత ముందు చూపుతో యివ్వన్నీ అమర్చగలడు..అననుకోగానే అతని పై నాకు వువ్వెత్తున ప్రేమ పుట్టుకు వచ్చింది. అతనిని హత్తుకుని మనఃస్పూర్తిగా  “ఐ లవ్ యూ” అని చెప్పాను. మధ్యాహ్నం అయ్యేటప్పటికి  మాములుగా నేను వెళ్ళే సమయానికి  యింటికి చేరుకోక పోయసరికి మా వాళ్లకి అనుమానం వచ్చింది. వెతకడం మొదల పెట్టారు. విషయం తేలికగానే తెలిసింది.

“ఛీ ! అది యింతటితో చచ్చింది అనుకుందాం. ఇలాంటి పనులు  మన యింటా వంటా ఉన్నాయా? పోయి పోయి

ఓ  తురక వాడిని కట్టుకుంది.దీనికి యింతకన్నా మంచోడు దొరక లేదా!? “ఇదిగో యీ యింట్లో  దాని వూసు యెత్తితే నరికి పారేస్తాను జాగ్రత్త ..అంటూ నాన్న హుంకరించడం జరిగిందట.

ఆ సాయంత్రానికి అమ్మ,పెద్ద మామయ్యా వచ్చారు. ఏం జరిగింది, అతనిని నువ్వు ప్రేమించావా? అని అడిగారు.లేదని తలూపాను. మరి అయితే యెలా  జరిగింది  ఈ పెళ్లి ? అని అడిగారు. జరిగిన విషయం చెప్పాను.
అతను అలా అడగగానే వెళ్ళిపోయావా? నీకేం మాయరోగం వచ్చిందే, యిలా  చేసావు. యింకా చదువుకుంటే చదివించి మంచి అబ్బాయికిచ్చి పెళ్లి  చేద్దామనుకున్నాను. . ఈ పెళ్లి-గిళ్లి యేమీ  జరగలేదనుకో.. ఆ తాళి తెంచి పడేసి .మాతో వచ్చెయ్యి  అంది అమ్మ. నేను మాట్లాడలేదు. ఎదురుగా బాషా నిలబడి వున్నాడు.  నేనేమి  చెబుతానా అని నా వంకే  చూస్తున్నాడు. పాపం, అతను నన్నెంతగా  ప్రేమించాడు, నాకోసమెంత చేస్తున్నాడు అని గుర్తుకువచ్చి”నేను రాను మీరు వెళ్ళిపొండి.”అని చెప్పేసాను.

కాసేపు నాకు నచ్చ చెపుదామని ప్రయత్నం చేసి అది వీలుపడక, నన్ను తిడుతూ,శపిస్తూ వెళ్ళిపోయారు అమ్మ,మామయ్య.

రెండు  రోజులు గడిచేటప్పటికి బాషా అమ్మ,అతని బంధువులు బిల బిల లాడుతూ వచ్చేసారు. మా కోడలు బంగారు బొమ్మలా ఉంది. ఎంతైనా మా బాషా  యెంపిక  గొప్పది..అంటూ మెటికలు విరిచుకుని ముచ్చట పడిపోయారు.
నిన్ను కన్నవాళ్ళు  వద్దని వదిలేస్తే మేము వదిలేస్తామా? ఒరేయ్..బాషా ! ఏమిటిరా, కోడలని యిక్కడ ఒంటరిగా  వుంచావ్?  మన యింటికి  తీసుకుని పోదాం పద. మన యింటికి తీసుకుని పోయి పెద్దాళ్ళతో మాట్టాడి మళ్లీ మన పద్దతిలో “షాది’ చేసుకోవాల…అని అన్నారు.

బాషా అలాగే అన్నాడు. నేను అతని వైపు చూసాను. “నీకు ఇష్టమైతేనే !” అన్నాడు.

నేనప్పుడు  కూడా  యేమి ఆలోచించలేదు.అతనితో కలసి బతకాలనుకున్నప్పుడు అతని మతంలోకి మారితే తప్పేమిటీ ?అనిపించింది.

నేను,బాషా కలసి అతని తల్లి ఉంటున్న యింటికి  మారిపోయాం, అతనికి తండ్రి లేడు.ఓ.అక్క మాత్రం వుంది. ఆమెకి పెళ్ళైంది. ఒక వారంలోపులోనే నన్ను ముస్లిం మతంలోకి మార్చి వేసారు. పుట్టినప్పటి నుండి నన్ను అంటిపెట్టుకున్న తిలకం బొట్టు,ఆ బొట్టు క్రింద పెట్టుకునే కుంకుమ బొట్టు అన్ని తీసివేసేటప్పుడు..యెక్కడో  గుండెలో కలుక్కుమంది. నాకు బొట్టు పెట్టుకోవడం యెంతిష్టమో..ప్రతి శుక్రవారం పాదాలకి పసుపు రాసుకోవడమంటే  యెంత ప్రాణమో ! ఇవన్నీ  యిక వుండవని తెలుసుకుని యేడుపొచ్చింది. కానీ బయటకి తెలియనివ్వలేదు
నా మెడలో బాషా గుడిలో కట్టిన తాళిని తీసివేసారు. నాలో ఊపిరిపోసుకుని పెరిగిన నా మత విశ్వాసాలు అన్నీ ఒక్కొక్క టిని  నా నుండి దూరం చేస్తున్నారు.  చూడమ్మా! ఇక నువ్వు మీ పద్దతులన్నీ పూర్తిగా మర్చిపోవాలి. నిన్ను ముస్లింగా కలుపుకున్న తర్వాత నీకు మీ పద్దతులు యేవి గుర్తుకు రాకూడదు. . “నీకు  జమీలా” అని పేరు పెడుతున్నాం. ఇక నువ్వు ఆ పేరుతోనే పిలవబడతావని  చెప్పారు..

 నాకెందుకో   ఆ పేరు నచ్చలేదు. విజయ అన్న పిలుపు మానేసి  బాషా కూడా నన్ను  జమీలా అని పిలవడం చిత్రంగా తోచింది. నాకివ్వన్నీ వద్దు,నన్ను నాలాగే వుండనివ్వండి అని గట్టిగా అరచి చెప్పాలనిపించింది. కానీ నా నోరు పెగల లేదు.

ఇరవయ్యి ఏళ్ళపాటు వుదయం నిద్రలేచినప్పుడు  అరచేతులు చూసుకుని  “కరాగ్రే వసతే లక్ష్మి,,కర మధ్యే సరస్వతి,కరమూలే తూ గోవిందః ,ప్రభాతే కర దర్శనం”  అంటూ కరదర్శనం చేసుకునే  నేను భూమిపై పాదాలు ఆనిస్తూ.. భూమాతను  క్షమాపణ  కోరుతూ ప్రార్దించే  నేను, వాకిలి వూడ్చి సూర్యదయానికి ముందే కల్లాపి జల్లి అందంగా ముగ్గులు పెట్టే  నేను  అవన్నీ  చేయక నా చేతులు కట్టేసినట్లు అనిపించింది

కాలకృత్యాలు తీర్చుకుని  స్నానం  చేసివచ్చి తాతయ్య తో కలిపి ..సూర్య నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయం ని పఠించే నేను ..విషు శతసహస్ర నామం పారాయణం చేసే నేను అవన్నీ యెక్కడో పనికి రాని వస్తువులని  పారేసిన విధంగా  మరుగున పడేయడం నా వల్ల కాలేదు. అలవాటు ప్రకారం పారాయణం  గొంతు  పెల్లుబికి వచ్చేస్తుండేది. అలాగే అణచి వేసుకుని  లోలోపలే వల్లెవేస్తూ ఉండేదాన్ని.మళ్ళీ అంతలోనే మతం మారిన గుర్తుకు వచ్చి  యెవరన్నా చూస్తారేమో అన్న దిగులు ముంచు కొచ్చేది. అదేమిటో..’బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీమ్” అనుకోవడం వచ్చేదే కాదు.

పెళ్ళంటే  యేమిటో అనుకున్నాను. క్రొత్త జీవితం బాగుంది అనుకున్నాను. మధ్యలో ఈ  మతం మారడమేమిటీ  జీవితం యిలా  అయిపోయింది అనుకున్నాను.

బాషాని  అడిగాను. మళ్ళీ చదువుకోవడం మొదలెడతాను అని.

నీకెందుకు  పరేషాన్? నేనున్నానుకదా! నేను సంపాదిస్తాను నువ్వు యింట్లో   హాయిగా వుండు,  నువ్వు పనికూడా చేయనవసరం లేదు. అమ్మీ అన్ని చూసుకుంటుంది అన్నాడు.

తను ప్రొద్దుటే వెళితే  రాత్రికి రావడమే! ఈ లోపు పగలంతా  మా అత్త వైపు  చుట్టాలు వచ్చే వాళ్ళు. చేపలు,మాంసం,రొయ్యలు తెచ్చి వంటలు చేసే వాళ్ళు. నాకు  ఆ వాసన చూస్తేనే కడుపులో దేవేసేది. వాళ్ళు అందరూ  ఆ పదార్ధాలని లొట్టలు వేసుకుని తినడం నాకు నచ్చేది కాదు .

మా అత్త చెల్లెలు ఈ కోడలు ఇలా మన తినే తిండిని అసహ్యించుకుంటే యెట్టా.. రేపు బాషా గాడికి యే౦ వండి పెట్టుద్ది.. ఏమైనా సరే మాంసాలు,చేపలు వండటం  నేర్పాల్సిందే అని పట్టు బట్టుకు కూర్చుంది. బతికి ఉన్న చేపలు తీసుకు వచ్చినన్ను చేపలు శుభ్రం  చేసే బండ దగ్గర కూర్చో పెట్టి నా చేత చేపలు రుద్దించడం,ముక్కలు కోయించడం, చేపించేవారు. ప్రక్కనే వుండి   ఆ వంటలు చేయడం నేర్చుకోమని బలవంతం చేసేవారు. ఆ వాసనలకి నాకు కడుపులో త్రిప్పి వికారంతో వాంతులు అయ్యేవి.

అప్పుడు  గాని వదిలేసే వారు కాదు .  "సంబడం  ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ,మొగుడు తో పడుకుంటేనే  సరిపోతుందా? వాడికి రుచికరమైన పదార్ధాలు వండి పెట్టడం తెలియవద్దు." అనేవారు. వెటకారంగా.

ఎప్పుడైనా బయటకి వెళ్ళా లంటే తప్పని సరిగా ..బురఖా ధరించి,నఖాబ్ కట్టుకుంటేనే  కానీ బయటకి వెళ్ళనిచ్చేవారు కాదు. నాకు ఆ బురఖాలో బందించినట్లు ఉండేది. ఊపిరి ఆడేది కాదు. వాళ్ళ ఆచారం ప్రకారం ఖురాన్ చదవమనే వారు.రాకపోతే నేర్చుకోమని మదర్సాకి వెళ్ళమని వొత్తిడి చేసేవారు. అలా అని మా యింట్లో ఆడవాళ్ళందరూ రోజు నమాజు చేయడం నేను చూడలేదు. ఆఖరికి బాషా కూడా  ముస్లిం ఆచారం ప్రకారం పద్దతిగా నమాజ్ చేసే వాడు కాదు. మతం మారడానికి  యెందుకు ప్రాముఖ్యతనిచ్చారో కూడా అర్ధంమయ్యేది కాదు.ప్రతి చిన్న విషయానికి మత సంబంధమైన  విషయమే పోల్చి చూపేవారు. “రమదాన్ “ఆచరించడం జాగారాలు చేయడం నా వల్ల అయ్యేది కాదు. మనసులో లేని భక్తి యెంత ఆచరిస్తే మాత్రం సొంతం అవుతుందా అనుకునేదాన్ని.

అప్పుడపుడు నేను బాషా తో కలసి బయటకి వెళ్ళినప్పుడు అమ్మ,నాన్న ఎవరైనా కనబడతారేమో అని చూసేదాన్ని.చూపులతో చుట్టుపక్కల వెదుక్కునేదాన్ని. వాళ్ళు వూరు వదిలేసి విజయవాడకి వెళ్లిపోయారని తెలిసిన రోజు బాగా యేడ్చాను.

బాషాతో యేమైనా చెప్పుకోవాలనిపించినా వీలు పడేది కాదు. ఉన్న రెండు గదుల ఇంటిలో  మేము దగ్గరగా ఉండటం కూడా వీలయ్యేది కాదు. వదినా !నేను నీతోనే పడుకుంటాను అని మా చిన్నత్త కూతుర్లు వచ్చేసేవారు. బాషాకి నాకు  మధ్య  యేమిటో తెలియని , చెప్పలేని దూరం ఉండేది. రాత్రుళ్ళు బాగా యేడుపు వచ్చేది. ఏమిటీ యిలాటి జీవితం  కోసమా!? నేను అందరిని విడిచి  వచ్చేసింది అనుకునే దాన్ని.

అలా రోజులు గడుస్తున్నాయి. “ముస్కన్ ” కడుపున పడింది. ఆ సంగతి తెలిసినప్పటి  నుండి బాషా ప్రేమగా చూసుకునేవాడు.అన్నీ కొని తెచ్చి  తినమని బలవంతం చేసేవాడు. నేను గర్భంతో వున్న రోజుల్లోనే బాషా తల్లి చనిపోయింది

బాషా చేస్తున్న వ్యాపారం లో బాగా నష్టం వచ్చింది. ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పులు, బంధువులు   చేసిన మోసం వల్ల మేము ఉంటున్న యిల్లు కోల్పోవలసి వచ్చింది. మా కోడలు మంచిది అన్న మా  చిన్నత్త అత్త నోటివెంట.. “దరిద్రపు గొట్టు”ది యిది వచ్చింది ఆంతా వూడ్చుకు పోయింది,ఆఖరికి మా అక్క కూడా చచ్చింది.” అని తిట్టి పోసేది.

“ముస్కన్  ” పుట్టింది. అప్పుడైనా చూడటానికి రాని అమ్మానాన్నల గురించి బాషా వాదులాడేవాడు. ఎక్కడైనా తల్లిదండ్రులు మీ వాళ్ళు  వున్నట్టు  వున్నారా?  వాళ్లకి  అంత పట్టుదల యేమిటీ అనేవాడు.

ఎపుడైనా సరదాకి త్రాగే బాషా  క్రమంగా రోజు తాగడం మొదలెట్టాడు.వేరొక ముస్లిం అమ్మాయి తో సంబంధం పెట్టుకుని నేరుగా ఆ అమ్మాయినే యింటికి  తీసుకు వచ్చి కాపురం పెట్టాడు. వాళ్ళిద్దరూ ప్రక్క గదిలో సరసాలాడుకుంటుంటే  నాకు అడ్డు చెప్పాలనిపించేది కూడా కాదు. అందుకు అందరూ  తిట్టేవారు.అలా మొగుడుని వదిలేస్తావా? తీసుకుని వచ్చిన “ఆ చినాల్ రండ్ ” ని తరిమి కొట్టాలి  కాని అనేవారు.  ఆమెకి నేనే వంట చేసి పెట్టవలసి  వచ్చినప్పుడు మాత్రం మనసు యెదురు తిరిగేది. ఏమైనా అంటే నువ్వు నాకు నచ్చినట్లు వుండటం  లేదు.మొగుడిని సుఖపెట్టడం నీకు చేతకాదు.  అందుకే ఆమెని షాదీ చేసుకున్నాను.అయినా పోషించేది నేను. నోర్మూసుకుని దానికి కూడా వండి పెట్టు అనేవాడు. అలా మనసుని చంపేసుకుని బ్రతకడం  అలవాటు చేసుకున్నాను. “ముస్కన్” చూస్తే నేనేమై పోయినా  పర్వాలేదు నా బిడ్డ నాకుంది చాలు అనుకునేదాన్ని.  ఏమి జరిగిందో యేమో కాని  యింట్లో  వుండే   ఆమె  ఓ..రెండు నెలలకి వెళ్ళిపోయింది.  తిరిగి రాలేదు. కాని వెళ్ళేటప్పుడు మాత్ర౦ బాగా డబ్బు చేజికించుకుని వెళ్ళింది అని చెప్పేవారు. డబ్బు పొతే పోయిందిలే,దాని పీడా  పోయింది అనుకున్నాను.

ఒకసారి ఆరునెల పాపగా వున్నప్పుడు అనుకుంటాను. “ముస్కన్ ” బాగా జబ్బు పడింది. హాస్పిటల్ లో జాయిన్ చేసాం అక్కడే వుంచాలన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని ఆరోజున బిడ్డ ప్రాణాల కొరకు అభిమానం చంపుకుని నాన్నకి కబురు పంపాను. నాన్న డబ్బు తీసుకు వచ్చి హాస్పిటల్ బిల్ కట్టి..మనుమరాలిని చూసి మరి కొంత డబ్బు యిచ్చి వెళ్ళారు.

బాషా  మాత్రం నాన్న యింటికి  యెందుకని  రాలేదని గొడవ చేసాడు. మెల్ల మెల్లగా నన్ను అమ్మ వాళ్ళ యింటికి  వెళ్ళమని బలవంత పెట్టసాగాడు.కులాంతర వివాహం,మతాంతర వివాహం మనమే కొత్తగా చేసుకున్నామా? యెందరో చేసుకుంటున్నారు, పెళ్లి అయి మూడేళ్ళు దాటినా  వో బిడ్డ పుట్టినా మీ వాళ్ళు యెందుకు రారు  అని గొడవ పడేవాడు.వాళ్లు రాకపోతే పోనీ నువ్వే వెళ్ళు. కనీసం నీకు అక్కడ ఆస్తిలో వాటా అయినా వస్తుంది అనేవాడు.  ఆ మాటలు వింటుంటే బాషాలో అనేక రకాల క్రొత్త మనుషులు కనబడసాగారు.

 అతనెంత వొత్తిడికి గురిచేసినా నేను అమ్మ వాళ్ళ యింటికి  వెళ్ళ లేదు. ఎన్నోరోజులు పస్తులు వున్నాం.కనీసం పిల్లదానికి పాలు కూడా వుండేవి కావు. అయినా రోజు భాషా మాత్రం త్రాగే ఇంటికి వచ్చేవాడు.

“ముస్కన్”‘ ని మా చిన్నత్త పిల్లలు తీసుకువెళ్ళి ఆలనా పాలన చూసేవారు. “ముస్కన్ ‘ కి నాలుగో యేడు వచ్చాక ఒక చిన్న కాన్వెంట్లో టీచర్గా చేరాను. పొద్దున్నే లేచి వండుకుని పిల్లకి పెట్టుకుని  కేరేజ్ కట్టుకుని స్కూల్కి  వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం కి వచ్చేదాన్ని.  బాషా వచ్చి తింటే తినేవాడు లేకపోతే  లేదు. నాకు భుక్తికి గడచి పోయేది. కాబట్టి పెద్ద సమస్యలు లేవు అనిపించేవి.

సుఖాలు లేకున్నా పర్వాలేదు కష్టాలు లేకుంటే చాలు అనుకుని తృప్తితో జీవించడంకూడా  యిష్టం లేకపోయిందేమో,  నువ్వు వుద్యోగం  చేయవద్దు మానేయమని గొడవ పెట్టుకునే వాడు. నా సర్టిఫికెట్స్ చింపి పారేస్తాను  అని    బెదిరించే వాడు. ఇవన్నీ చూసిన యింటి  ప్రక్కవాళ్ళు కాస్త సాయంగా ఉండేవారు. ఎప్పుడైనా అవసర పడితే  డబ్బు అప్పు యిచ్చేవారు.

ఒకసారి బాషా ముప్పయి వేలు డబ్బు కావాలని అడిగాడు. మనకి యెవరిస్తారు, నేనెవరిని అడగాలి ? అన్నాను.
మీ ఇంటికి వెళ్లి పట్టుకుని రా ! అన్నాడు.

నేను  అక్కడికి వెళ్ళను,అడగను అని గట్టిగా చెప్పేసాను.
అర్ధరాత్రి సమయంలో నన్ను యింట్లో నుండి  బయటకి నెట్టేసి తలుపులు మూసుకున్నాడు. ఆ రాత్రంతా కటిక చీకతో గడిపాను. నా జీవితమే కాళ రాత్రి అయిపోయిందని అనుకున్నాను. అలా రెండు మూడు సార్లు జరిగాయి.ఇవన్నీ నాన్నకి తెలిసి ఆయన స్నేహితుడు ద్వారా డబ్బు పంపించి అప్పుగా యిప్పించామని చెప్పమన్నారు. నాన్న స్నేహితుడు  అప్పుగా  డబ్బు  యిస్తున్నట్లు   చెప్పి భాషా కే డబ్బు  యిచ్చి  వెళ్ళారు. ఎవరెవరో తన మీద నమ్మకంతో డబ్బు అప్పు యిచ్చారు  కానీ మావాళ్ళు సాయం చేయలేదని తిట్టేసేవాడు. నన్ను వుద్యోగం చేయడం మానేయ మన్నాడు. అతనితో వాదన యెందుకని వుద్యోగం మానేసాను. రెండు మూడు నెలలకే  పిల్లకు కూడా పట్టెడు మెతుకులు పెట్టలేని స్థితి వచ్చింది.

నేను మళ్ళీ స్కూల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వుద్యోగం చేయడం మొదలెట్టాను. స్కూల్ నుండి వచ్చాక చిన్న చిన్న పనులు చేయడం చేసి డబ్బు సమకూర్చే  ప్రయత్నం చేసాను.

ఆ రోజు యెనిమిది  గంటలకే  యింటికి వచ్చేసాడు బాష. నేనప్పటికి వంట చేయలేదు. తనని చూసి వంట చేయడం మొదలేట్టాను .అప్పటికే ‘పిల్లని తీసుకుని బయటకి వెళ్లి బిర్యాని పేకెట్ కొనుక్కుని  యిద్దరూ తినేసి వచ్చారు.
బాషా తాగి వచ్చి వున్నాడేమో విపరీతంగా తిట్టడం మొదలెట్టాడు. నా వోపిక నశించి యెదురు ప్రశ్న వేసాను.మా నాన్న యిచ్చి  పంపిన డబ్బు గురించి చెప్పాను. అంతే వొక్క వుదుటున లేచి..నా జుట్టు పట్టుకుని బయటికి యీడ్చి పడేసి విపరీతంగా కొట్టి లొపలకి వెళ్లి  తలుపులు వేసుకున్నాడు.

ప్రక్క యింటి  వాళ్ళు కూడా యెవరు లేరు. ఆ సమయంలో మెదడు మొద్దు బారిపోయిన స్థితిలో రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ రైలు యెక్కేసి పెద్దనాన్న యింటికి  చేరుకున్నాను.అర్ధరాత్రి ఆ స్థితిలో వచ్చిన నన్ను చూసి పెద్దమ్మ పెద్దనాన్న  చాలా బాధ పడ్డారు. తెల్లవారేసరికి  నాన్నరానే  వచ్చారు. నన్ను ఆ స్థితిలో చూసి యేడ్చారు.

ఒక ఆరు నెలల కాలం పెద్ద నాన్న ఇంట్లో ఉన్నాను. మధ్యలో ఒకసారి “ముస్కన్ ” ని తీసుకుని బాషా పెద్దనాన్న యింటికి  వచ్చాడు.వాళ్ళు  మంచిగానే మాట్లాడి అమ్మాయి వస్తానంటే తీసుకుని వెళ్ళమని చెప్పారు. ముస్కన్ వాళ్ళ నాన్న వొడిలో కూర్చుని వుంది బెరుకుగా అపరిచితురాలిని చూస్తున్నట్లు నన్ను చూస్తుంది కానీ నా దగ్గరకి రాలేదు. బిడ్డని దగ్గరకు తీయాలని నాకు అనిపించలేదు. అప్పటికే  వో నాలుగు నెలలు దూరం అవడం వల్ల కావచ్చు అనుకుంటాను

“జమీలా యింటికి  వెళదాం రా అని పిలిచాడు బాషా.

“నేను రాను నాకసలు యిల్లే లేదు” చెప్పాను.

మనకివన్నీ కొత్తవి అయినట్లు మాట్లాడతావు యేమిటి? ఎన్ని సార్లు మనం గొడవ పడలేదు.కలసి ఉండలేదు. వచ్చేయి వెళ్లి పోదాం అన్నాడు

“నేను రాను.” స్థిరంగా చెప్పాను. నా మాటలు విన్న బాషా నిజంగా  యేడుస్తూనో లేక యేడుపు నటిస్తూనో నువ్వు లేకపోతే  నేను బ్రతకలేను నువ్వు వచ్చేయి  అంటూ నా చేయి పట్టుకున్నాడు.

ఇలా చేయి పట్టుకుని అడిగినందుకే కదా  నన్ను నేను మర్చిపోయి  నీ వెంట బడి  వచ్చేసాను. అలా యిప్పుడు మాత్రం  నీ వెంట నేను రాలేను అన్నాను.

ఇదేనా నీ ఆఖరి  మాట? అని అడిగాడు.నేను సమాధానం కూడా చెప్పలేదు.ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాను బాషా యేడుస్తూ వుంటే  “అబ్బాజాన్ మత్ రో, జాయేంగే చలో .”అంటూ అతని కన్నీళ్లు తుడుస్తూ కనబడింది. కబ్ బీ లడ్లేతే హై! క్యోం?   అంటూ తండ్రి చేయి పట్టుకుని తీసుకు వెళ్ళింది వెళుతూ నావైపు  వో చూపు చూసింది.

    "అబ్బాకే  పాస్ పైసే నహీ హై తేరే కనే హైనా! తు  దే!"అంది.

తన వయసు అప్పుడు ఆరేళ్ళు నేను అలా వో ఆర్నెల్లపాటు పెదనాన్న యింట్లో  వున్నాను.నన్ను వాళ్ళు కన్న కూతురికన్నా యెక్కువగానే చూసుకున్నారు.నాన్న అమ్మకి, తమ్ముడికి నచ్చ చెప్పి నన్ను విజయవాడలో మా యింటికి  తీసుకు వచ్చారు.
అప్పటికి తమ్ముడి పెళ్ళయి వో రెండు నెలలే అయింది.కొత్తగా పెళ్ళయిన తమ్ముడు -అతని భార్యతో కలసి అమ్మ-నాన్న నేను రెండు గదుల మధ్య యిరుక్కుని యెలా ఉన్నామో!  అక్కడికి వెళ్ళగానే నన్ను గుడుల వెంట తిప్పారు. నా యిష్టాలతో పని లేదు. నా ఆలోచనలు యేమిటో వారికి కనుక్కోవలసిన అవసరం లేడు. నా పేరును మళ్లీ “విజయ’గా మార్చేసారు. మతం మార్చుకున్నందుకు యేవో ప్రత్యేక  పూజలు చేసి సంప్రోక్షణ చేయించారు.  శ్రీ వైష్ణవం లో కి మార్పించారు. ఎప్పుడైనా మనసు  మారి  మళ్ళీ బాషాతో కలసి బ్రతకడానికి అక్కడికి   వెళ్లి పోతానో అన్న అనుమానం అమ్మది. నాకు శరీరం మీద శ్రీ చక్ర చిహ్నాలు వేయించారు. ఇప్పుడు నా మతం నన్ను బాహ్యంగా అంటిపెట్టుకునే ఉంటుంది. నిత్యం గుడులకి తిరగడం పూజా కార్యక్రమాలో పాల్గొనడం, యెవరైనా   తెలిసిన వారు నా గురించి అడిగితే  “ఆ తురక దరిద్రాన్ని వదిలించుకున్నాం “  అని చెప్పేవారు.

పగలంతా యెలా ఉన్నా రాత్రయ్యే సరికి “ముస్కన్” గుర్తుకు వచ్చేది. నాకు వున్న వొకే వొక వారధి రజియా. ఆమె “ముస్కన్ ” ని పెంచుతుంది. ఆమె భర్త “రాజు’ అతను బాషాకి  ప్రాణ స్నేహితుడు కావడం వల్ల “ముస్కన్” భాద్యతని ప్రేమగా స్వీకరించాడు.అతను  హిందూ,  మతం మార్చుకుని క్రిస్టియన్ గా మారాడు, ముస్లిం అయిన రజియాని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతను క్రైస్తవం ఆచరిస్తాడు. ఇంట్లో ఉర్దూ మాట్లాడనివ్వడు. చర్చిలకి తీసుకు వెళతారు.వారి పెంపకంలో ఐదేళ్ళు పెరిగింది. స్కూల్ కి పంపలేదు. రజియాకి పుట్టిన పిల్లలు ఇద్దరినీ మోస్తూ అంట్లు తోముతూ బట్టలు వుతుకుతూ పదకొండు యేళ్ళు వచ్చేసరికి వంట చేస్తూ.. టి.వి చూస్తూ పెరుగుతుంది.

ఇక ఇక్కడ చూస్తే నేను ఈ అయిదేళ్ళలో స్కూల్ లో టీచర్గా పని చేసాను. ఎమ్.బి.ఏ..చదువుకుంటాను. పీజ్ కట్టు అమ్మా! అని అడిగితే  యింకా నీకు  చదువెందుకు ? అంది అమ్మ.

తమ్ముడు బాగానే ఉంటాడు. ఎప్పుడైనా చిరాకు పడినప్పుడో,అమ్మ-మాధవి కి జరిగిన గొడవలు వచ్చినప్పుడో ఆ దరిద్రాన్ని ఇంకా యిన్నేళ్ళు యింట్లో  వుంచుకుంటారు ఏదో ఒక సంబందం చూసి పెళ్లి చేయండి అంటాడు.
అమ్మ పెళ్లి వద్దంటుంది. నాన్న పెళ్లి చేయాలి అంటాడు..ఇలా అయిదేళ్ళు.. ఏం జరుగుతుందో.నేనేం చేయాలో తెలియకుండా గడచిపోయాయి. ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఏజంట్ గా చేరి పాలసీలు చేయించడం, యెదుగు బొదుగులేని టీచర్ వుద్యోగం చేస్తూ  అప్పుడప్పుడు గుంటూరు మామయ్యా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు సమయం చూసుకుని.. “ముస్కన్” చూసి రావడం చేస్తుంటాను.

నా కూతురు  నేను చూడటానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి దగ్గరికి రాదు. నేను దగ్గరికి తీసుకుందామన్న నన్ను దూరంగా తోసేస్తుంది. నేను తీసుకువెళ్ళినవి తీసుకుంటుంది కాని నాతో  మాట్లాడాడు.  తండ్రి వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా దగ్గరకు వెళుతుంది. అతను తెచ్చి యిచ్చిన వాటిని తీసుకుంటుంది.ఇద్దరు కలసి బయటకి వెళతారు. ఏమేమి కావాలో అడిగి  అతని చేత కొనిపించికుంటుంది
ఒక యేడాది క్రితం నేను వెళ్ళినప్పుడు చెప్పాను. ఇన్నేళ్ళు నుండి నాకు తనని తీసుకువెళ్ళడం కుదరలేదు అని కొద్ది నెలలో తనను తీసుకుని వెళతానని చెప్పాను. సరేనని తల ఊపింది. “ముస్కన్” ని నేను తీసుకువెళతాను.బాషాతో నాకు సంబంధం లేకుండా చేయండి అంతే చాలు అని అడిగాను. విడాకులు ఇప్పించే మార్గం చేస్తానని అని చెప్పాడు రాజు.

అబ్బాజాన్ ని వద్దంటే అమ్మ నాకు వద్దు. నేను వెళ్ళను అని చెప్పింది అంట. నేను స్థాణువు అయ్యాను. “ముస్కన్ ‘ చిన్న పిల్ల. యే౦ జరిగిందో అర్ధం చేసుకునే వయసు రాలేదు. కాని నా పట్ల వ్యతిరేక భావం మనసులో నాటుకుని పోయింది. బిడ్డని వదిలేసి వెళ్ళిపోయిన తల్లిగా నా పట్ల యెంత ద్వేషం వుందో నాకర్ధం అయింది. నేను నా కూతురిని తీసుకొస్తానంటే నా తల్లిదండ్రులు,తమ్ముడు వొప్పుకోరు, పోనీ “ముస్కన్”ని తీసుకుని వచ్చి నా దారిన నేను వేరేగా  వుండి అయినా నా బిడ్డని చూసుకోవాలని వున్నా తండ్రిని వద్దంటే పిల్ల నా వద్దకు రావడానికి యిష్టపడక పోవడం అంతా అయోమయం. నేనేం  చేయాలో తెలియని ఆలోచించుకోలేని తనం.

ఈ మధ్యలో మరికొన్ని విషయాలు యెవరి ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. బాషా  కొన్ని గొడవలలో తలదూర్చి హత్యా ప్రయత్న నేరం క్రింద జైలుకి వెళ్లి శిక్ష అనుభవించడం అన్నీ జరిగిపోతూ వున్నాయి. నాకు భవిష్యత్ లేదు. నా బిడ్డకి భవిష్యత్తు లేదు.
ఇలా కాలం జరుగుతూ వుండగానే  తర్వాత రాజుకి కాలం చెల్లి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని భార్య,ఇద్దరు పిల్లలు, ముస్కన్  కలిపి వీధిన  పడ్డారు. పదకొండో  సంవత్సరం రాగానే  “ముస్కన్’ శరీరం వికసించిన వార్తలు. దాని మెదడు వికసించనేలేదు. చదువు లేదు. మంచి సంస్కారం లేదు. కూతురిని  బడికి  పంపి చదివాల్సిన అమ్మని నేనిక్కడ కొత్త చదువు చదువుతున్నాను. అక్కడ నా బిడ్డ అజ్ఞానంలో బ్రతుకుతుంది. నా బిడ్డ యెదిగి యెదగ కుండానే మేనత్త కొడుకుకి యిచ్చి పెళ్లి చేయాలంటున్నారు. ఇక్కడ ముప్పైమూడేళ్ళ నాకు ఓ పిల్ల తల్లినైనా నాకు ఆ పిల్లని అనాధగా వదిలేసి మరో పెళ్లి చేసుకోవాలని వొత్తిడి చేస్తున్నారు.
నన్ను పెళ్లి చేసుకోవడానికి యిష్టపడినవాడు. నా బిడ్డని తన బిడ్డగా అంగీకరిస్తాడా? అసలు మానాన్న చేయాలనుకున్నా  నాకు పెళ్లి అవుతుందా? ఓ వంట మనిషి, పనిమనిషి కోసం పెళ్లి చేసుకునే వాడు నాకు మళ్ళీ  జీవితం ఇస్తాడా? గత జీవితం  గురించి ప్రశ్నించకుండా వుండగలడా? నాకు అసలు పెళ్లి అవసరమా! చేదు అనుభవాలతో మనసే కాదు శరీరం బండబారిపోయింది. నా బిడ్డని అమాంతం  ఆ మూర్ఖత్వపు చట్రం నుంచి బయటకి తీసుకుని వచ్చి  నా నీడలో ఆరోగ్యంగా పెంచుకోవాలి. నేను పస్తులు వున్నా సరే! అనిపిస్తుంటుంది

ఆ పట్టుదలతోనే బి.ఈ.డి పూర్తి చేసాను. ఇప్పుడు ఏం.ఏ కి కట్టాను. డి.ఎస్ సి  రాస్తున్నాను. నా ప్రయత్నాలు యెంతవరకు సఫలీకృతం అవుతాయో చెప్పలేను.

అమ్మ  తిరువనంతపురం  వెళ్లి వొక నెల రోజులు  వుండివద్దాం రా అంటుంది.  ఆహోబిలంలో విష్ణు సహస్ర పారాయణం చేయాలట. వెళదాం పద అంటుంది. ఆమె నన్ను  గుళ్ళు  గోపురాలు తిప్పే సహాయకురాలిగానే  చూస్తుంది.తమ్ముడు యీ శని యెప్పుడు  వదిలి పోతుంది ? అన్నట్టు చూస్తాడు. నాన్న పెళ్లి చేసి పంపటానికి  ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చేవాడు యిలాటి వాడు అయినా సరే!  ఎవరి ధోరణి వారిది.  నా అభిప్రాయం వాళ్లకి అక్కర్లేదు. ఇంట్లో యే విషయాల్లో నేను తలదూర్చ కూడదు. తినడం, వుద్యోగం చేయడం, పడుకోవడం అంతే నా  పరిదధి.

నేను యెవరికి పనికి రాని వస్తువుని.మనసు లేకుండా జీవచ్చవంలా బ్రతికే మనిషిని.అసలు ఆ యింట్లో  వుండకూడదు అనిపిస్తుంది. బయట బతికే దైర్యం లేదు. ఎవడెవడో దగ్గరకి రావాలని చూస్తాడు.నా కన్నా చిన్నవాడు నా తమ్ముడి స్నేహితుడు పెళ్లి అయింది.అయితేనేం మన యిద్దరం సహ జీవనం చేద్దాం అంటాడు. ప్రతి వొక్కడు ఓ రాయి వేసి చూద్దాం పడుద్దేమో అన్నట్టు ప్రవర్తిస్తారు.మనసుని, శరీరాన్ని కాపాడుకోవడం కష్టం అయిపోతుంది.
అక్కడ చూస్తే  రాజు చచ్చిపోయాడు కాబట్టి  రజియా కి అభ్యంతరం చెప్పేవాళ్ళు యెవరు లేరు. “ముస్కన్” ని మదర్సాకి పంపుతుంది. ఓ రెండేళ్ళకి మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. బాషా తాగి తాగి ఏ పేవ్మెంట్ల పైనో, పార్కులలోనో పడి వుంటాడు  నన్ను సాదించే వుద్దేశ్యం తోనే  నేను విడాకులకి అప్లై చేసినా నాకు విడాకులు యివ్వడు.  ఇంట్లో నాకు పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. “ముస్కన్’ ని నా వెంట పంపితే ఆ ప్రయత్నాలు ఆగిపోతాయి యెలాగోలా నచ్చ జెప్పి పంపించే ప్రయత్నం చేయమని  రజియాకి చెప్పాను.

 వదినా! పెళ్లీడుకి వచ్చిన పిల్లని పెట్టుకుని మళ్ళీ నీకు పెళ్లి యేమిటి ? అంటుంది. నేనేంచేయను? యేమిటీ నా జీవితం అనిపిస్తుంది అని దీర్ఘమైన కథ చెప్పి  భారంగా నిట్టూర్చింది.
కుటుంబంలో జరిగే గొడవలు, తండ్రుల బేడ్ హాబిట్స్  అమ్మల పేషియన్సీ గురించి నేను నా ఫ్రెండ్స్ కథలు కథలుగా చెప్పుకుంటూనే వుంటాం కానీ మతాంతర వివాహాల మధ్య యిన్ని సమస్యలు ఉన్నాయా!? మీ కథ వల్ల చాలా  విషయాలు తెలుస్తున్నాయి. అసలు మతం అంటే యీ మనుషులు  యెందుకు అంత ప్రాముఖ్యత యిస్తారు అడిగింది డాలీ.
ఈ విషయం నాకన్నా మీ అమ్మ బాగా చెప్పగలరు ఆమెనే అడుగు అంది విజయ.
” చెప్పమ్మా“ అడిగింది డాలీ. విజయ జీవితంలో జరిగిన సంఘటనల గూర్చి ఆలోచిస్తున్న సుజాత వులికి పడింది.
ఏమిటి అడుగుతున్నావు అంది.

వివాహంలో మనుషుల మధ్య మతానికి యెందుకంత ప్రాముఖ్యత ? అని మళ్ళీ అడిగింది.

ఎందుకంటే మనిషి మతాన్నిఅవలంభించడం వల్ల కొన్ని మంచి సంస్కారాలు అలవడతాయి. మంచి-చెడు తేడా తెలుస్తుంది. చెడ్డ పనులు చేయకుండా మతం మనిషిని నియంత్రిస్తుంది. దాదాపు  అన్ని మతాలూ ఒకటే చెబుతాయి. అంతా మనం అర్ధం చేసుకోవడం లోనే వుంది. కొన్ని చోట్ల మతం మనుషులని కలవనీయ కుండా అడ్డు కట్ట వేస్తుంది అని అంది సుజాత.

అదే యెలా  అన్నది నాకర్ధం కావాలి !అని అడిగింది  డాలీ.  మళ్ళీ సమాధానం చెప్పే లోపే “మా మేడమ్ వొకరు  వున్నారు ఆవిడ పి.హెచ్ డి.చేసారు. ఒక ముస్లిం ని వివాహం చేసుకున్నారట. వివాహమప్పుడు ఆమె అతని మతం లోకి మారి ముస్లింగా పేరు మార్చుకుంటేనే ఆ పెళ్లి జరిగింది అంట. అసలు ఆవిడకి ఓ స్వంత ఆలోచన అయినా వుందా?  వివాహానికి  మతానికి యేమిటీ సంబంధం అని ఆలోచించలేదా?
అలాగే మా సర్ వొకరు  ఆయన  కెమిస్ట్రీ అద్భుతంగా బోధిస్తారు. ఆయన వివాహం అయ్యాక వేరొక స్త్రీ తో ప్రేమలో పడ్డారట. ఆమెని చట్టబద్దంగా పెళ్లి చేసుకోవడానికి గాను  ఆయన  ముస్లిం గా మారి ద్వితీయ వివాహం చేసుకున్నారు అని చెబుతారు. మతాలూ మార్చుకుని వొకరిని మోసం చేసి చేసుకునే వివాహాల విలువ ఏమిటి? యెందుకు  వీళ్ళంతా యిలా  ప్రవర్తిస్తారు. వీళ్ళా మాకు గురువులు అంది ఆవేశంగా.

చాలా మంది విద్యాధికులు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నప్పుడు మతం వొక సమ్యగా వుంటుంది. అదే పురుషుడు అయితే మతం మార్చుకోవాల్సిన పని లేదు. స్త్రీ అయితే తప్పని సరిగా పురుషుడి మతంలోకి మారిపోతుంది.ఆ మారడం యిష్ట పూర్వకం కావచ్చు,బలవంతం కావచ్చు. అయితే మతం మారిన తర్వాత కూడా వారిలో వున్న ఆచార వ్యవహారాలూ, రక్తం లో జీర్ణించుకుపోయిన కొన్ని భావాలు రూపు మాసి పోతాయని అనుకోవడం పొరబాటే! వాళ్ళల్లో పుట్టుకతో వచ్చిన మతాచార వ్యవహారాలు,ఆహారపు అలవాట్లు అలాగే వుంటాయి. మతం మారామని మోసం చేసుకోవడం తప్ప అక్కడ యేమి వుండదు.”అంది సుజాత.

అసలు ఒక స్త్రీ-ఒక పురుషుడు కలసి బ్రతకడానికి యే వొక్క మతమో  యెందుకు అవసరం? యెవరి మతాన్ని వారు ఆచరించుకుంటూ యెదుటి వారి మతాన్ని గౌరవిస్తూ పరస్పర అభిప్రాయాలని గౌరవించుకుంటూ వుండటంలో వున్న విశాల దృక్పధం యె౦దుకు అలవరచుకోరు?  కనీసం మతం మారడం అనవసరం అన్న జ్ఞానం యె౦దుకు కలుగదు?
ఈ మతం రంగులు, ఊసరవెల్లి తనాలు యేమిటో నాకర్ధం కాదు ఐ హేట్ ట్ థిస్ అంది.

అలా అంటూనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ  అక్కా! మీరు మీ పర్సనల్ లైఫ్ గురించి శ్రద్ద తీసుకోండి..అక్కా. నేను చిన్నదానినే అయినా  నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. .

మీ అమ్మాయి గురించి  వర్రీ అవకండి  తప్పకుండా  “ముస్కన్” మీ దగ్గరకి తిరిగి వస్తుంది. అయితే ఆ రావడానికి మాత్రం  సమయం పడుతుంది. అని చెప్పి తన గదిలోకి వెళ్లి పోయింది.

సీతాకోక చిలక సినిమా కన్నా  యెక్కువ జరిగింది యిక్కడ అంది సుజాత.

మళ్ళీ తనే మాట్లాడుతూ " అవును విజయా “యెవరో నీ జీవితం నాశనం కావడానికి కారణం అని ఆలోచించక నీ జీవితం గురించి నువ్వు యెలాంటి నిర్ణయం తీసుకున్నావు.నీకు నువ్వు యే మాత్రం విలువ యిచ్చు కుంటున్నావు? నీ  బిడ్డకి  యెలాంటి భవిష్యత్ యివ్వాలనుకుంటున్నావో  బాగా ఆలోచించి అడుగు వేయి . ఇప్పుడు నీ జీవితం నీ చేతిలోనే వుంది.

“ఈ మాత్రం సలహా చెప్పేవారు లేక నేను ఓ..అయిదేళ్ళు నా బిడ్డకి దూరం అయ్యాను ‘ బాధ స్పష్టంగా కనబడింది  విజయలో
“ఏం పర్వాలేదు. నీకు అండగా యెప్పుడూ నేను తోడుంటాను. ముందు డి.ఎస్.సి  యెగ్జామ్స్ వ్రాసి రా. తర్వాత ముస్కన్ దగ్గరకి వెళదాం. పాప తప్పక నీతో  వస్తుంది చెప్పింది భరోసాగా.

  విజయ కాస్త నిశ్చింతగా కనబడింది.

. ఇక నేను వెళతాను రేపు వుదయం ఆరుగంటలకే  క్లాస్స్ వుంది .అంత వుదయాన్నే యిక్కడినుండి బయలుదేరి వెళ్లి క్లాస్స్ కి అందుకోలేను అని లేచింది విజయ

“భోజనం చేసి వెళ్ళు, రా అంటూ బలవంతంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించింది తింటూ చెప్పింది.. యే౦ చేయాలో ఆలోచించుకోలేకపోతున్నాను అందుకే నీ సలహా కోసం వచ్చాను.  యిప్పుడు చాలా ప్రశాంతంగా వుంది. నా కర్తవ్యం యేమిటో నాకు స్పష్టంగా కనబడుతుంది అని చెప్పింది. చిన్న చిరునవ్వుతో.

అమ్మయ్య అనుకుని సుజాత నవ్వుతూ  చూస్తూ వుండగా “అవును .. యిప్పుడు నా జీవితం నా చేతుల్లోనే ఉంది.  నేనింకా బాగా చదవాలి.తర్వాత  నా బిడ్డని బాగా చదివించడానికి, తనకి మంచి భవిష్యత్ యివ్వడానికి “అని చెప్పింది

విజయ వెళ్ళిపోయాక ఆవకాయ పచ్చడి మిశ్రమం  కలుపుతూ  యిలా అనుకుంది. వివాహ జీవితం కూడా ఆవకాయ పచ్చడి  లాంటిదే. అన్నీ సరిగ్గా కుదిరితేనే మంచి రుచికరంగా వుంటుంది అందులో యేది తక్కువైనా అది చూడటానికి, తినడానికి కూడా  బాగోదని. విజయ జీవితం కూడా  అన్నీ సమంగా పడని ఆవకాయ  పచ్చడి లాంటిదే అని.


17, జనవరి 2013, గురువారం

స్నేహ గీతి

స్నేహం  లేకుంటే.. జగమే జడ పదార్ధంలా తోస్తుంది కదా!

స్నేహం గురించి ..నా అభిమాన కవి.. స్నేహ గీతి ఇది.

నేను ఎప్పుడు మరువనిది. నిరంతరం  నా పెదవులపై నలిగేది ..

 ఒక్క పలకరింపు చాలు కదా! 
పెదవులపై నవ్వులు విరబూయడానికి,
పదములుగా  కవిత్వం జాలువారడానికి 


తైలాలు లేకుండా వెలిగేటి దీపం
విద్యుత్ లేకుండా వేలిసేటి దీపం
హృదయాలలో ఎప్పుడూ నిలిచేటి  దీపం
నిజమైన దీపం మా స్నేహ దీపం

వర్ణాలు వర్గాలు వదిలితే స్నేహం
వేషాలు దోషాలు మానితే స్నేహం
ప్రాణాలు అర్పించగల్గితే స్నేహం
కష్టాలు నష్టాలు ఓర్చితే స్నేహం

నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైతే నేమి
అందాలు చందాలు లేకుంటే ఏమి
నిన్ను కాచినవాడే నిజమైన నేస్తం

దోస్తిని మించినది లేదు జగాన
రత్నాలు కంటే మిన్న అది లోకాన
మిత్రుడే కావాలి సుఖమున,శోకాన 

అతడు లేకున్నచో నగరమే కాన-

చీకటిలో దారి చూపేది నేస్తం
కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తం
మనలోని లోపాలు తెలిపేది నేస్తం
నిజమైన మనిషిగా నిలిపేది స్నేహం..
                                                        - దాశరధి

నా  ఈ నడకలో తోడైన నా మిత్రులందరికీ  ఈ స్నేహ గీతంతో నా మనసు మాట వెల్లడిస్తూ.. మనసారా ధన్యవాదములు.




12, జనవరి 2013, శనివారం

వెతుకులాట

హాయ్ ఫ్రెండ్స్ !.. 

 కీ బోర్డ్ పై టక టక లాడించి చాలా రోజులైంది. వ్రాసే మూడ్ లేక గతంలో వ్రాసినవి పోస్ట్  చేస్తూ వచ్చాను

ఎందుకో.. హఠాత్తుగా ఆలోచనలు స్తంభించి పోయాయి. రోజులు కూడా ఆనాసక్తంగా మారి పోయాయి. మీరు గమనించారో లేదో.. బ్లాగ్ లలో కూడా మంచి పోస్ట్స్ ,కామెంట్స్ తగ్గిపోయాయి. న్యూ ఇయర్ ఎంతో   ఉత్సాహంగా ఉంటుంది అనుకున్నాను   అందరి సంగతి ఏమో  కానీ .. నాకై నేనే నిరాశ గా ఉన్నాను. 

గత సంవత్సరం తో పోలిస్తే .. ఈ సంవత్సరం మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు భయం కల్గిస్తున్నాయి. ఆడపిల్లలకి భద్రత లేదు,  ఈ దేశంలో మన ఉనికి ఏమిటి అని ఉలికిపడాల్సి వస్తుంది. డబ్బు చుట్టూ తిరిగే ప్రపంచం.కాస్తంత మనసు లేదు కూసింత శాంతి లేదు. అంతా పరుగులాట.అలసి అలసి పోతూ..

జరుగుతున్న కొన్ని సంఘటనల పట్ల ఆలోచించడానికి కూడా మెదడు మొద్దు బారిపోయింది.
 నాకైతే ఇప్పుడు ఎలా ఉంది అంటే.. పాట వినాలని లేదు,కవిత్వం చదవాలని లేదు.పూబంతుల చెంత గడపాలని లేదు.తెలిమంచులో తుమ్ముతూ అందమైన ముగ్గులు వేయాలని లేదు..వంట చేయడం మహా బోర్..తినడం..అంటే..  ఇంకా విరక్తి.

"ఈ బాధామయ గాధాలయ ప్రపంచం నుండి పారిపోయి.. అమ్మ ఒడిలో తలదాచుకుని  ఆదమరచి నిదురపోవాలని  ఉంది." 

"బాల్యంలోకి పరుగులు తీసి.. అమాయకమైన మనసుతో..రంగు రంగుల పెన్సిళ్ల తో.. అస్పష్టమైన ఆలోచనలని బొమ్మలాగా గీసి చూసుకుంటూ.. సరిగ్గా రాలేదని కాగితాల పై అలగాలని ఉంది". 

"తొణికిస లాడుతున్న చెరువులో దిగి హాయిగా జలకాలాడాలని  ఉంది". 

"వాగు ఒడ్డున పిచ్చిక గూళ్ళు కట్టుకుని హాయిగా ఆటలాడుకోవాలని ఉంది" 

ఆరుబయట నులక మంచం పై పడుకుని నక్షత్రాలు లెక్కబెట్టాలని...  ఎవరికీ వినబడకుండా చల్లని వెన్నెలని  పంచె చంద్రుడితో.. ఊసులు చెప్పాలని ఉంది.


ఇవన్నీ తలబోస్తూ.. నేను  ఇంకా చిన్న బొప్పినా ..అలా ఉండే అదృష్టం దక్కడానికి ..అనుకుంటూ.. నన్ను నేను చూసుకుందామని  నిలువుటద్దం ముందు నిలబడ్డాను.

అద్దం ఎప్పుడూ..నిజమే చెపుతుంది. అక్కడక్కడ తెల్లబడుతున్న జుట్టు. 45 ఏళ్ళు నిండ బోతున్న నేను. మనసు చూస్తే బాల్యంలోకి పరుగులు తీస్తుంది.బాల్యం మరొకమారు కావాలంటుంది. చవిచూసిన ఈ అనుభవాల లోకం నుండి దూరంగా పారిపోవాలని అంటుంది.

నిజంగా అద్దం నిజమే చెపుతుంది కదా! మనమే అద్దం అబద్దం చెపుతుందని మనని మనం మోసం చేసుకుంటాం కదా! అందుకే అద్దానికి తెర  కట్టేసి.. నన్ను నేను చూసుకోకుండా జాగ్రత్త పడి బయటకి వచ్చి .."గుండెల నిండా గాలి పీల్చుకున్నాను."

జీవించడం ఎలాగో.. ప్రతి శ్వాస కి జీవించడం ఎలాగో వెతుకుతున్నాను.! వెతుకు తున్నాను!!. వెతుకుతున్నాను.!!!

నాలో నన్నే వెతుకుతున్నాను.

రేపటికైనా దారి దొరుకుతుందని వెదుకుతున్నాను. ఈ వెదుకులాట ఆగేనా!?


(నన్ను నేను తరచి చూసుకునే కొన్ని సమయాలలో .. ఇలా..)


8, జనవరి 2013, మంగళవారం

ఓ..కాంత ..ఏకాంత గాధ.."తన్హాయి"



"తన్హాయి" నవలని నేను నవలగానే చదివాను. నేను ఆ నవలని చదక ముందు.. ఆ నవల పై వచ్చిన సమీక్షలని చదవాలనుకున్నాను. 

కానీ.. సమీక్షలు  చదివి నవల చదివితే.. ఆ సమీక్షల ప్రభావం నాలో ఉన్న   
పఠనా శక్తిని చంపేస్తుందేమో అని అనిపించింది. 

తన్హాయి నవలని చదవడం  మొదలెట్టగానే.. కొంచెం ఆసక్తి. ..ఓహ్.. పెళ్ళయిన వారి మధ్య ప్రేమ చిగురించిందా!? ఏమవుతుందో..చూద్దాం  అనుకుంటూ ఏక బిగిన చదవడం మొదలెట్టాను. చదువుతున్న కొద్దీ పరిచయం అవుతున్న ప్రతి పాత్ర లోను..మరో నేను ప్రత్యక్షం అవుతున్నాను. కల్హార,కౌశిక్ ల ప్రేమ,వారి మానసిక సంఘర్షణ .. నాకు తెలిసిన ఎవరిలోనో చూస్తున్నట్లు బలమైన భావన. 

కౌశిక్ అనుకుంటాడు..కల్హార మనసు నాది. ఆమె పూర్తిగా నా సొంతం. ఆమెని నాతొ కలసి జీవించడానికి ఒప్పించి  నా భార్యకి తెలియకుండా.. ఆమెతో.. కలసి ఉండటం ని సాధ్యం చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రేమలో ..ఆ ప్రేమని సొంతం చేసుకోవడంలోను ,మరొకరికి అన్యాయం చేస్తున్నామన్న భావనలోను యెంత మానసిక క్షోభ
ఉంటుందో..చదువు కుంటూ పోతుంటే.. టెన్షన్ మొదలయింది. ఆఖరికి ఏమవుతుందో..అన్న టెన్షన్ తో.. ఆఖరి పేజీలు చదవడం నాకు అలవాటు. కానీ మనసు ఉగ్గ బట్టుకుని ఓపికగా..చదవడం చేసాను. విదేశాలలో జరిగే పెళ్ళిళ్ళు.వారు తీసుకునే స్వేచ్చా నిర్ణయాలు..అందువల్ల కుటుంబానికి జరిగే నష్టాలు గురించి ఆలోచిస్తూనే.. కౌశిక్,కల్హార ల ప్రేమ ఒక తీరం చేరాలని ఆశించాను. కానీ కల్హార యెంత సంఘర్షణ అనుభవించింది. యెంత నిజాయితీగా..తన మనసుని,భావాలని వ్యక్తీకరించ గల్గింది అని నిశితంగా చూసేటప్పటికి ఆ పాత్ర పై..నాకు అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. చదివిన బాగం నే  మళ్లీ మళ్లీ చదివాను.

అపుడు.. ఈ నవలపై ఒక సమీక్ష వ్రాస్తే అన్న ఆలోచన వచ్చింది. అది ఒక సాహసమే.. అనుకున్నాను. ఎందుకంటె..సమీక్ష వ్రాయడం అంటే.. ప్రతి పాత్రని నిశితంగా అర్ధం చేసుకోగల్గి  ఏ  పాత్ర పై అభిమానం ఏర్పరచుకోకుండా నిస్పక్షపాతంగా తప్పు ఒప్పులని చెబుతూ..వ్రాయాలి ఏమో! కానీ నాకు ఈ నవల చదవడం పూర్తయ్యేటప్పటికి "కల్హార"పాత్ర పై..విపరీతమైన అభిమానం పుట్టుకొచ్చింది. పెళ్లి అయిన తర్వాత పుట్టే  ప్రేమ పై నెగెటివ్ ఫీలింగ్ .ని ..అది సమంజసమే అని చెప్పడం సాహసం అని చెప్పను. అది సహజం అని కొందరైనా గుర్తించారు కాబట్టి ..అలాటి ప్రేమలోని.. లోతుపాతులని, కలసి బ్రతకాలి అనుకునే టప్పుడు ఉండే   సాధ్యా సాధ్యాలని .. చెప్పే ప్రయత్నం చేసారు ..నవలా రచయిత్రి.

మానసిక మైన ప్రేమ మాత్రమే సొంతం చేసుకుని.. బాధతో విడిపోయిన పెళ్ళయిన ప్రేమికులు కల్హార-కౌశిక్ లు. వారి మధ్య శారీరక సంబంధాలు కనుక నెలకొని ఉంటే.. వారి జీవిత భాగస్వామ్యులు చైతన్య,మృదుల..అంత పాజిటివ్గా ఆలోచించ గల్గేవారా!? అన్న కోణంలో.. నేను చేసిన ఈ సమీక్ష. ఇది.
  
ప్రేమ .. ఒక భావ ఉద్వేగం,కొన్ని అనుభూతుల పుష్ప గుచ్చం. 
పెళ్లి ..ఒక భాద్యత తో కూడిన ఆలోచనా స్రవంతి.


ఎవరి యెదలో ఎప్పుడు ఈ ప్రేమ జనియిస్తుందో..ఎందుకు  మరణిస్తుందో ..! మరణించి బ్రతికి ఉంటుందో..ఎవరు చెప్పలేరు.


భావాలు,అభిరుచులు కలసినంత మాత్రాన ఎవరు  స్నేహితులు అయిపోరు.కలవక పోయినా భార్యాభర్తలు కాకుండాను పోరు. కానీ .. ఆమె లేదా అతని ఫీలింగ్ ని తన ఫీలింగ్ గా అనుభూతి చెందే  భావం మాత్రం ..ఖచ్చితంగా iప్రేమే! 

ఆ ప్రేమలో స్వార్ధం ఉంటుంది కౌశిక్ ప్రేమలో స్వార్ధం ని చూస్తాం మనం, కల్హార మనసు తనది అని తెలుస్తూనే ఉంది. ఆమె మనసు పై సర్వ అధికారంఉన్నప్పుడు..ఆమె శరీరం ని తను  కోరుకుంటున్నాడు.అది అతనికి తప్పుగా తోచలేదు. ఎందుకంటె అతను పురుషుడు. ఏ పురుషుడు కూడా నీ మనసుమాత్రమే నాకు కావాలి నీ శరీరం  నాకు అక్కర్లేదు అనడు. తనువూ,మనసు కలిస్తేనే పరిపూర్ణం అనుకోవడం కద్దు.


అదే సంఘర్షణ కల్హార మనసులోనూ తలెత్తి..కౌశిక్ ని తను మనసారా  కోరుకుంటున్నాని అర్ధం కాగానే.. భయం కల్గుతుంది  అది ఆమెలో కల్గిన శారీరక,మానసిక స్పందనలకి పరాకాష్ట. అది మనం గుర్తించ గల్గుతాము కూడా.

కౌశిక్ ని ప్రేమించానని తెలియగానే ఆమె మనసులో తలెత్తిన సంఘర్షణ .. అదే ప్రేమని కొనసాగించాలనే ఉద్దేశ్యం ఉంటే..తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలు ఆమెకళ్ళ ముందు కదలాడి..ఆమెని కట్టడి చేసి ముందుకు వెళ్ళనీయకుండా సంకెళ్ళు వేసాయి కానీ.. కౌశిక్ పై ఆమెకి కల్గిన ప్రేమని మొదలంటా తుడిచివేయలేకపోయింది..అంటే.. మనసు యొక్క ప్రభావం మనిషిని శాసించ లేదని చెప్పకనే చెబుతుంది.

కౌశిక్ కల్హార ల మద్య ఒక ఆకర్షణ ,బలీయమైన మోహం,ఇద్దరు దగ్గరగా ఉండాలనే కాంక్ష కూడా కనబడుతుంది.వ్యక్తీ గతమైన భావనలకి విలువనీయకుండాఇద్దరూ కూడా వారితో ముడిపడిన మిగిలిన వారి గురించి కూడా ఆలోచించుకుని విడివడటం.. "తన్హాయి" చదివిన పాఠకుల అందరి కి నచ్చిన విషయం.

కల్హార మరో రాజేశ్వరి కాలేదు. చినుకుకై పుడమి నోరు తెరిచి నట్టు..కౌశిక్ ప్రేమకై ఆమె అంతరంగం పరితపించింది. అయినను మోహం తో అతని దరి చేరలేదు.కౌశిక్ ప్రేమలో ఆమెకి హృదయ సాంత్వన లభించింది. ఆమె స్నేహితురాలు మోనికా ఇంట్లో వారు ఇరువురు కలసినప్పుడు ప్రేమలోని ఒక ఉద్వేగం తో..వారుఇరువురు ఆత్మీయంగా దగ్గరిగా ఒదిగిపోవడంలో ప్రేమ తప్ప దేహపరమైన కాంక్ష ఉండకపోవడాన్ని  మనం చూడవచ్చు. 

చైతన్య తో.. గడిపిన జీవితంలో ప్రేమ లేకపోయినా ..ఆ బంధంలో భద్రత ఉంది. తన కూతురి బాగోగులు,సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానం కూడా ఉన్నాయి . అందు కోసమే.. ఆ ప్రేమని త్యజించింది.
హటాత్తుగా ..ఆమె కి లభించిన  ప్రేమ పాత్ర లో కౌశిక్ ఇచ్చిన ప్రేమామృతం తో నింపబడిన తర్వాత కూడా ఆమె సంశయించింది. నిజాయితీగా తనలో కౌశిక్ పట్లకల్గిన భావ సంచలనాలను చైతన్యకి చెప్పడం అన్నది సాహస నిర్ణయమే!ఇలా ఎందుకు  చెప్పడం ? మనసులోనే దాచేసుకోవచ్చు కదా ..అన్న చిరాకు కల్గుతుంది. కానీ కల్హార తనను తానూ మోసగించుకొని,ఇతరులని మోసగించే గుణం లేని నిజాయితీ కల్గిన స్త్రీ. 

చైతన్య కూడా .. మీరివురి మధ్య సంబంధం అక్కడి వరకు వెళ్ళిందా..? అనే సందేహాన్ని పదే పదే వ్యక్తీకరిస్తాడు. అది ఒక అనుమాన పూర్వకమైన  సందేహం,అవమాన పూర్వక మైన సందేహం కూడా.

అలాంటి సందేహం పురుషునిలో ఉంటుందని తెలుసు కాబట్టీ.. కల్హార పాత్రని కౌశిక్ తో మమేకం
చేయకుండా..శారీరక సంబంధాలకి అతీతమైన ప్రేమ కూడా ఉంటుందని ఒక పాజిటివ్ దృక్పధాన్ని చెప్పే ప్రయత్నంలో  సపహలీకృతం అయ్యారనే చెప్పవచ్చు. 

రచయిత్రి.. ఈ కోణం లోనే.. కల్హార చుట్టూ..ఒక బలమైన కోట గోడ కట్టారు. స్త్రీ మనసులో పెళ్లి తర్వాత కూడా ప్రేమ జనించడం సహజమైనదే! వివాహ బంధంలోమూడో మనిషి కి ప్రవేశం కొన్ని అసంతృప్తుల మధ్య మాత్రమే సులువు అవుతుంది. ఆ అసంతృప్తి కల్హార మనసులో ఉంది. ప్రేమ లేని పెళ్లి ఉంటుంది. ఉందికూడా. అదే ప్రేమ ఉన్న మనుషులు ఒకటిగా కలసి ఉండటానికి ..అంతకి ముందు ఉన్న బందాలని త్రుంచుకు వెళ్ళ గల్గె సాహసం భారతీయ స్త్రీకి ఉండదు అనికాదు కాని.. ఆ సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ముందు..వివేకం కల వ్యక్తిగా ఆలోచించడం, నిజాయితీగా చెప్పడం .. జీవితాంతం ఒక అనుమాన పూరితమైనప్రశ్నకి సమాధానం తానూ చెప్ప గల్గినా  కూడా ఆ ప్రశ్న ని ఎదుర్కోడానికి తయారుగా తనని తానూ బలోపేతం చేసుకోవడం సామాన్య విషయమేమీ కాదు.చాలా మంది కల్హార పాత్రని చిన్న చూపు చూస్తారేమో..కూడా! పెళ్లి అయిన స్త్రీకి మళ్ళీ ప్రేమ ఏమిటి? అన్న నిరసన భావం తో పాటు చైతన్య కాబట్టి అర్ధంచేసుకోగల్గాడు..అన్న సానుభూతి చైతన్య పై కలగడం సాధారణ విషయం.

మనసు భావ సంచనల రూపం. దురదృష్టవశాత్తు మనసుని మనం నగ్నీకరించి చెప్పలేం. అలాగే  మాట కూడా. మనం  మాటకి ముసుగు వేస్తాం. కల్హార తనమనసుని ఎక్కువ కాలం దాచుకోలేకపోయింది. నిజాయితీగా ఏం  చేయాలో  చెప్పమని చైతన్యని  అడుగుతుంది. ఒకవేళ అతను ఆమెని ద్వేషించి ఆమె నుండివిడిపోయినా కూడా ఆమె తప్పుకు ఆమె బాద్యురాలిగా చేసుకునే వ్యక్తిత్వం ఉన్న స్త్రీ.


ఇదే నవలలో.. ఇంకా కొన్ని స్త్రీల పాత్రల కంటే కూడా ఆమె పాత్ర.. విభిన్నమైనది.

పవిత్రత అన్నది అది మానసికమా - శారీరకమా అన్నది ఎవరికి వారు విలువనిచ్చుకునే విషయం. ప్రమాదవశాత్తు పడిన ప్రేమలో.. మనసు జారిపోయినా చాలా సందర్భాలలో  కౌశిక్  సన్నిహితంగా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడల్లా   అతనిని కట్టడి చేస్తూ..ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చైతన్య పదే పదే అడిగినప్పుడు కూడా  తానూ మనసునే కోల్పోయింది కాని శరీరాన్ని కౌశిక్ తో పంచుకోలేదు అని చైతన్య కి చెప్పగల్గింది. అదే విషయం వారి మధ్య ఎడబాటు రాకుండా ఎడబాటు కానీయ కుండా ..కాపాడ కల్గింది. చైతన్య కూడా ఒక సాధారణ పురుషుడే! తన వైవాహిక జీవితం అనే కోట కి పగుళ్ళు ఏర్పడినాయి అనితెలియగానే..తన పరువు-ప్రతిష్ట లకి భంగం వాటిల్లుతుందని బాదపడతాడు. భార్యకి తను ఏం తక్కువ చేసాడు ..ఇప్పుడేనా కల్హార ఇలా ప్రవర్తించడం,లేకఇంతకూ ముందు కూడా ఇలాటి ప్రేమ కలాపాలు కొనసా గించి మభ్య పెట్టిందా లాటి ప్రశ్నలు తలెత్తుతాయి. అదే అభద్రతా బావం మృదుల మనసులో కూడాతలెత్తడం సహజం. .

కౌశిక్,కల్హార ల మధ్య శారీరక సంబంధం కనుక ఏర్పడి ఉంటే.. చైతన్య కానీ ,మృదుల కానీ ఆ విషయాన్ని అంతా తేలికగా తీసుకునే వారా!? ఇదంతాఆలోచించేనేమో రచయిత్రి కౌశిక్,కల్హార మధ్య శారీరక దూరాన్ని ఉంచారు ఏమో అనిపించక తప్పదు. 

ప్రేమలో మోహం కూడా మిళితమై ఉండటమే..ప్రేమకి పరాకాష్ట. సంపూర్ణ ప్రేమ స్వభావాన్ని అనుభవంలోకి రానీయక ఒక ఆత్మీయ చుంభనంతో ఇరువురుప్రేమికులని విడదీయడం వెనుక.. భారతీయ మనస్తత్వమే గోచరించింది. అదే ఇంకెవరు ఆయినా లేదా రంగనాయకమ్మ లాంటి రచయిత్రి అయి ఉన్నట్లుఅయితే ఆ విషయం కి అంత ప్రాధాన్యత నివ్వరు. ప్రేమ అన్నది మనసుల కలయిక ,శరీరాల కలయిక అన్నదానికి ప్రాముఖ్యత నివ్వరు. నీ మనసులో ప్రేమేకావాలి నీ శరీరం వద్దు అనే ప్రేమికుడు ఎవరైనా ఉన్నారంటే నమ్మశక్యం కాదు. 

మన భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఇంకా బ్రతికి ఉంది అంటే కారణం అదే! ప్రేమ లేకపోయినా పెళ్లి జరిగాక శారీరకమైన సంబంధం ద్వారా పురుషుడు స్త్రీతో అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఆ అనుబందాన్ని బలోపేతం చేసుకుంటాడు.ఒకవేళ పురుషుడు  వేరొక ఆకర్షణలో పడినా కూడా స్త్రీలు తప్పని సరి అయిసర్దుకుని ఉండే వారు కావడం వల్ల వివాహ వ్యవస్థకి భంగం వాటిల్లలేదు.

అదే స్త్రీల విషయంలోకి వచ్చేసరికి పెళ్ళికి ముందు ఎన్ని ఊహలు ఉన్నా.. పెళ్లి జరిగిన తర్వాత పురుషుడి చుట్టూ..తన ఆలోచనలని అల్లుకుని..అందుకుఅనుగుణంగా తనని తీర్చి దిద్దుకుంటూ అక్కడే జీవితాన్ని నిర్మించుకుంటుంది.

ప్రపంచం ఏమిటో తెలియని స్త్రీకి పురుషుడే ప్రపంచం. అందుకని ఏమో.. స్త్రీలని వీధి వాకిట నిలబడటానికి కూడా అభ్యంతరం చెప్పేవారు. ప్రపంచాన్ని చూసినస్త్రీకి తనకి కావాల్సినది ఏదో తెలుసుకుంటుంది. ఆ తెలుసుకున్న క్రమంలో.. హద్దు దాటుతుంది. ఆ హద్దు దాటే ప్రయత్నంలో తనకి తానే చేటుచేసుకుంటుంది. అసంత్రుప్తులని బడబాగ్నిలా దాచుకుని ..కోర్కెలని అణచుకొని వివాహ జీవితంలో మగ్గిపోతుంది. నాకు కల్హార పాత్రలో ఇదే కనబడింది. సప్తసముద్రాలు దాటినా యెంత ఉద్యోగం చేసినా.. ఆమెలో కల్గిన ప్రేమ రాహిత్యం అన్న భావనని చైతన్య తుడిచి వేయగలడా? కౌశిక్ ని ఆమె మనసు నుండి తుడిచి వేయగలడా!? 

స్త్రీ ప్రేమ మానసికం. ప్రేమించిన వ్యక్తి ని ఆలోచనలోను,జ్ఞాపకాలలోను నింపుకుని ప్రేమని క్షణ క్షణం సజీవంగా ఆస్వాదించ గలదు. ఆఉత్తెజంతోనే.. బ్రతక గలననే నిబ్బరం తోనే.. కౌశిక్ తనని వీడి పోతుంటే.. కల్గిన బాధని అనుభవిస్తూ కూడా అలాగే నిలబడి పోయింది.

ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది అంటారు. వారి ఎడబాటు మాత్రం జీవిత కాలం బ్రతికి ఉండటానికి అని వారిద్దరికీ మాత్రమే తెలుసు. మరో ఇద్దరికీతెలిసే అవకాశం ఉన్నా కూడా.. వారు మనిషికి ఇచ్చిన ప్రాముఖ్యత మనసుకి ఇవ్వలేదు కాబట్టి..సంప్రదాయమైన వివాహ జీవితం మాత్రం పై పైమెరుగులతో..లోపల డొల్ల గానే మిగిలి ఉంటుంది.

అవగాహన,సర్దుబాటు,రాజీపడటం,సమాజంలో గౌరవం  ఈ నాలిగింటి కోసమే ఆ రెండు జంటలు ..మరో రెండు హృదయపు శకలాల పై నిలబడి ఉన్నాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం.

ఈ నవలలో నాకు అత్యంత బాగా నచ్చిన పాత్ర కల్హార. తనలో కలిగే భావనలకి ఎక్కడా ముసుగు వేయదు. అనవసరమైన పవిత్రతని ఆపాదించు కోదు.ఎప్పటికప్పుడు సహజంగా ప్రవర్తించడం కనబడుతుంది. రక్త మాంసాలు ఉన్న స్పందన కల్గిన స్త్రీగా.. ఆమె మనసులో కల్గిన భయాలని మరచిపోయే చోటుకౌశిక్ సాన్నిహిత్యమే అని ఆమెకి తెలుసు. అలాగే చైతన్య తో.. తన జీవితం లో కల్గిన లోటు కూడా ఏమి ఉండదు అని అనుకుంటుంది. కౌశిక్ నిప్రేమించడానికి, చైతన్యని ద్వే షించాల్సిన   పని లేదు అనుకుంటుంది. ఇద్దరి పైనా ఏక కాలంలో ప్రేమ కల్గినా కూడా అది తప్పు కాదనుకుంటుంది

ప్రేమ లక్షణం బహుశా అదేనేమో!అది అందరికి  నచ్చదు కూడా. ఇద్దరి పై ప్రేమ ఏమిటి..అది వళ్ళు బలిసిన ప్రేమ కాకపొతే..అని తిట్టిన్చుకోవాల్సి వచ్చినా సరే రహస్యంగా ఉంచక ఏమో..ఎందుకు కల్గిందో.. ఈ ప్రేమ ..అనుకునే.. స్వచ్చత కల్గిన స్త్రీ మూర్తి కల్హార.  ఆమె  ప్రేమని..బహుశా కౌశిక్ కూడా  పూర్తిగా అర్ధం చేసుకుని ఉండదు. ఒక్క మోనికా తప్ప.

ఒకే ఒక్క రోజు ఆయినా సరే అతనితో సన్నిహితంగా ఉండి సంపూర్ణ జీవితం ని గడపాలనే ఆకాంక్షని వ్యక్త పరుస్తుంది. అక్కడ మనసు,శరీరం రెండు కలసిన కలయికకి యెంత తపించిపోయిందో.. రచయిత్రి సహజంగా వ్రాశారు. అందులో ఎక్కడా కల్హార పాత్రని ద్వైదీ భావనలో ..తేలియాడించనూ ఒక ఇనుప చట్రంలో ను బిగించలేదు. మనసు పిలుపు కన్నా కూడా శరీరం పిలుపు  కూడా  అంతే బలంగా ఉంటుందని కల్హార పాత్ర ద్వారా.. చెప్పడం ని  పాఠకులు జీర్ణించు కోలేరేమో అన్న అనుమానం  ఉంది. కాని అలా చెప్పడం  సబబుగానే అనిపించింది.

తప్పు ఒప్పు ల దృష్టి తో చూస్తే..ఆంతా తప్పే! అసలు తన్హాయి నవల లో కల్హార పాత్ర చిత్రీకరణే తప్పు. మన మధ్య చైతన్య లు, మృదుల లు ఎక్కువ శాతం, కౌశిక్ లు మరి కొంత శాతం, అతి తక్కువ శాతం మంది మాత్రమే కల్హార లాంటి నిజాయితీ కల్గిన పాత్రలు ఉంటారు.

రచయిత్రి నాలుగు పాత్రలలోనూ తన వ్యక్తి గత అభిప్రాయం ని జోప్పించినా జోప్పించక పోయినా అది పెద్ద పరిగణలోకి నేను తీసుకోలేదు. కల్హార పాత్ర చిత్రీకరణ ని చాలా మంది స్వాగతిస్తారు అనుటలో ఎట్టి సందేహం లేదు. 

కల్హార .. వికసిత విరాజ కుసుమం. . బుద్భుదమైనభావ జాలంలోనుండి..జనియించిన  సహస్ర భావాల తో అరవిరిసిన పుష్పం..

తనలో కలిగే భావాలని,ఆలోచనలు  స్వేచ్చగా వెల్లడించు కునేటప్పుడైనా నిజాయితీ లోపిస్తే.. ఈ మనుషులకి మనసు అనే వ్యర్ధ పదార్ధం ఎందుకు? అని నాకు అనిపించినది అంటే..అంతలా కల్హార పాత్ర చుట్టూ.. నెలల తరబడి నా ఆలోచనలు చుట్టుకుని ఉన్నాయి.

పెళ్ళికి ముందు పెట్టుకునే డేటింగ్ గురించి ,  ఓపెన్ మేరేజ్ సిస్టం గురించి,వైఫ్  స్వాపింగ్ గురించి  మనం చీత్క రించు కుంటున్నాం కానీ మన భారతీయ వివాహ వ్యవస్థలో సంప్రదాయ  ముసుగులో.. ఎన్నో మనవి కాని విచ్చలవిడి తనాలు రాజ్యం యేలుతున్నాయి సంప్రదాయవాదులు పాశ్చాత్య నాగరికత తో మన వాళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు .కానీ మన వారిలోనూ ఉండే బహు భార్యా తత్వాలు,అక్రమ సంబంధాలు మాటేమిటి!? కొన్ని భావజాలాల మధ్య స్త్రీ స్వేచ్చని అణగ ద్రొక్కిన ..వివాహ వ్యవస్థలో.... కల్హార లాటి వాళ్ళు తమ మనసుని..తమలో పెళ్లి తర్వాత కల్గిన భావ ప్రకంపనలని వెల్లడి చేసే నిజాయితీ తనం అందువల్ల కలిగే  పరిణామాలు మంచి-చెడులు .. వాటి మధ్య వివాహ బందానికి ఇస్తున్న ప్రాధాన్యత అందరికి నచ్చి ఉండవచ్చును.

నాకు మాత్రం కౌశిక్  ప్రేమకి దూరం అవుతున్న కల్హార మనసులో వేదన కళ్ళముందు కదలాడుతుంది. ఆమె పాత్రపై సానుభూతి కల్గుతుంది.

 "ప్రేమయన నొక పంచభూతముల సమాహారమ్ము!అందుకలయికొక్కటేను,ప్రేమికుల ముందున్న దారి!!" అని సాఖీ గీతం. ఇదేమిటి ..వీరు ఇలా విడిపోయారు అన్న బాధ కల్గింది.కన్నీళ్లు వచ్చాయి. 

మనసంటే అచ్చమైన నిజాయితీ.
 
ఆ మనసుకి లభించే కూసింత ఆలంబన, లభించిన  ప్రేమ,జీవన పర్యంతం కాపాడే స్నేహ హస్తం  దొరికే చోట  మనసు స్వేచ్చగా నిర్భయంగా మసలగల్గుతుంది.

కల్హార మనసుకి  తనకి కావలసినది దొరికే చోటు కౌశిక్  హృదయం అని తెలుసు.ఇద్దరు వివాహితుల మధ్య   అది సాధ్యం కాదు కనుకనే విడిపోయి ఆ ప్రేమని తలచుకుంటూ.. బ్రతక గలం అని .దూరం అవుతారు.    మనసు ఏకాంతంలో తనని తానూ తరచి చూసుకుంటుంది. ప్రపంచం నుండి విడివడి  ఆ ఒంటరి తనం లోనే, తనలోనే బ్రతుకుతూ.. కాసిన్ని మధుర జ్ఞాపకాలుతో....సహజీవనం చేస్తుంది.   అదే "తన్హాయి"

ఈ నవల లోని కథ పాతదే కావచ్చు. ఎందుకంటె.. వివాహం తరవాత ప్రేమ కూడా చాలా పాతదే!  ఒక "సిల్సిలా" చిత్రం.. నా కనుల ముందు..అలా కదలాడింది. ఆఖరిగా ఒకటి అనిపించింది. కల్హార-కౌశిక్ విడిపోయారు కాబట్టి ఇది..ఒక "సిల్సిలా" చిత్రం లా ఉంది. లేకపోతె.. మేఘసందేశం అయి ఉండేది అని.

 ఒక వివాహిత స్త్రీ మనసులోని భావ ప్రకంపనలని, అనుభూతులని ..అక్షరీకరించి.. "కల్హార" ని  పరిచయం చేసినందుకు. కల్పన రెంటాల గారికి ..అభినందించక తప్పదు.

అలాగే నేను గమనించిన ఒక ..చిన్న అంశం. కలువ పూలతో.. లక్ష్మి దేవిని పూజించడం కాదు.కమలాలు..అని చెప్పాలి కదా! కలువ కి  కమలానికి తేడా ఉంది .. ఆ చిన్న విషయంని గమనించలేదేమో అనుకున్నాను. కొన్ని చోట్ల ఇంగ్లీష్ లో ఉన్న సంభాషణ లన్నిటిని తెలుగులో ఉంచితే బాగుండును కదా అనిపించింది కూడా.
ప్రతి పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి అయిన స్త్రీ కూడా చదవాల్సిన నవల ఇది.

 "ఓ అపురూప ప్రేమ కావ్యం " గా ఉదాహరించుకోవచ్చు కూడా. 

4, జనవరి 2013, శుక్రవారం

ఆనవాలు

పురిటి గడ్డని ఓ నాలుగేళ్ల తర్వాత చూస్తున్నాననేమో   ఎద లయలలో  ఎక్కడో రేగుతున్న  ఎడతెగని  ఉద్వేగపు అలజడి కన్ను మూతపడ నివ్వడం  లేదు. పక్క  కుదరడం   లేదు.

 పక్కనే మెసులుతున్న సవ్వడికేమో భార్య లేచి బద్దకంగా ఆవలిస్తూ "ఏమండీ! ఇకనైనా  నిద్రపోరా?ఎంతసేపని ఆలోచిస్తారు. మీకే విషయం మీద ఒక అభిప్రాయం లేనిదే ఇక మీ నాన్నకి  చెప్పి ఏం ఒప్పించ గల్గుతారు . ఆయనకన్నా సెంటిమెంటల్ ఫూల్ మీరు" అనేసింది. 

నేను ఏం సమాధానం చెప్పలేదు. "మీరు నిద్రపోతారో లేదో మీ ఇష్టం.తెల్లవారుజ్హామున లేచి  మెయిన్  డోర్  బయట  లాక్ చేసుకుని మీరు వెళ్ళిపొండి.నాకసలే నిద్ర చాలడం లేదు " అని చెప్పేసి ముసుగు తన్ని పడుకుంది. 

తన భార్యకి అంత సుతిమెత్తనైన మనసు లేకపోవడమే మంచిదేమో!ఎదుటి వారి మనసు గాయ పడుతుందో లేదో చూసుకోకుండానే అనాల్సిన మాట అనేసి ఎదుటి మనిషిని బాద పెట్టామనే బెరుకు కూడా లేకుండా అతి మాములుగా ఉంటుంది.

ఈ మాటలే  ఆమెతో అన్నాననుకోండి.  మీలా ఉంటే   ఇక ఈ లోకంలో బ్రతికినట్లే !   అయినా మిమ్మల్ని అని ఏం లాభం ? మిమ్మల్ని అలా పెంచిన ఆ పుణ్యమూర్తులని  ఎంతైనా సరే మెచ్చుకుని తీరాల్సిందే అంటూ  గాలిదుమారంలా మాటలని విసురుతూ  విషయాన్ని అమ్మ నాన్నల వైపు  మళ్ళిస్తుంది.   లోకంలో   భార్యామణుల అసంకల్పిత ప్రతీకార చర్యకి ఎప్పుడూ బలయ్యేది భర్త వైపు వాళ్ళే  అనుకుంటాను. ఇలా ఆలోచిస్తూ ఒక గంటలోపే గడిపేసానేమో  ఇక ప్రక్క పై నుండి లేచి బయటకి వచ్చాను. హాల్లో దక్షిణం వైపు గోడకి  అమ్మ ఫోటో మినుకు మినుకు వెలుగుతోఉన్న దీపం.నాలో మిగిలినవనుకున్న జ్ఞాపకాల గుర్తుల్లా..  

అక్కడి   నుండి  .నా చూపు క్రిందికి దిగి దివాన్ కాట్ పై పడింది. ఒక ఇరవై రోజుల క్రితం వరకు నాన్న స్థానం అది.  అప్పుడప్పుడు నాన్న   పడక పిల్లలతో పాటే.  వాళ్ళ గదిలో కబుర్లు,హాయిగా క్రింద ఏ చాపో,దుప్పటో  పరచుకుని ఏ ఆంక్షలు లేకుండా నేలంతా డొల్లాడుతూ ఉష్! అమ్మ వస్తుంది అనే హెచ్చరికలు మద్య, కాశీ మజిలీ కతలు,సుమతీ శతకం వల్లె  వేయించడాలు, పిల్లల అల్లరి ప్రశ్నలు నాన్న ఓపికైన సమాధానాలు తో అదో చైతన్యం. 

కాలం  అలాగే గడచి పోతుందనుకున్నఆశ అడియాశ అయిపొయింది .

నాన్న ఇక్కడి నుండి వెళ్ళిన రోజు ఏం జరిగిందో కళ్ళ ముందు మెదిలింది.  నాన్న వల్ల పిల్లలకి క్రమశిక్షణ లేకుండా పోతుందని క్లాస్స్ లో రాన్కింగ్ పడిపోయిందని లాగే ఉంటే పల్లెటూర్లో  మట్టి  పిసుక్కో డానికి కూడా పనికి రారని  నా భార్య నిశ్చితాభిప్రాయం.

" మామగారూ ! మీ పాత కాలం సుద్దులు,శతకాలు వాళ్ళని ఏ అందలాలు ఎక్కించాలేవు. మీరు లేనప్పుడే నయం  పిల్లలు నేను చెప్పిన మాట వినేవారు. ఇప్పుడు మీ అలుసు చూసుకుని ఈవెనింగ్ ట్యూషన్ కి వెళ్ళడం లేదు" అంది.

"ట్యూషన్ లో చేర్పించు తల్లీ! నేనే రోజు సాయంత్రం  తీసుకునివెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తాను " ఆన్నాడు నాన్న మృదువుగా..

"మీకెందుకు ఆ శ్రమ !? ఎలాగు గొడ్డు చాకిరి చేసుకుంటూ ఇంటాబయటా కష్ట పడి సంపాదిస్తున్నాను కదా.. ఇంటికే వచ్చి ట్యూషన్ చెప్పి వెళ్ళే ఏర్పాటు చేసాను లెండి. మీరు వాళ్ళ చదువుకి అడ్డు రాకుంటే చాలు" అంది పెడసరంగా.   

"అమ్మా!  తాత గారిని ఏమన్నా అన్నావంటే ఊరుకోను. నేనే ఎగ్జాం కి బాగా ప్రిపేర్ అవలేదని   చెపుతున్నాను కదా!"అన్నాడు రిషి . 

"ఏంటిరా ! ఎదురు సమాధానం చెపుతున్నావ్? చీరేస్తాను"అంటూ వాడి వెంట పడింది. 

ఆ రోజు రాత్రి మీ నాన్న ఇక్కడ ఉంటే..నా పిల్లలు నా మాట వినరు. వాళ్ళ భవిష్యత్   బాగుండాలనే కదా.. ఉద్యోగం చేస్తున్నాను అంది. తను ఒక రియల్ ఎస్టేట్ వారి ఆఫీస్ లో డెస్క్  వర్క్ చేస్తుంది. 

"అందుకే నాన్న ఉంటే మన ఇద్దరం వచ్చేవరకు వాళ్ళకి ఒంటరి తనం ఉండదు కదా! అయినా ఆయనేం చేసారు ..మధ్యలో "అన్నాను. 

"ఆయన ఆరోగ్యం బాగోలేక ట్రీట్మెంట్  తీసుకుని  ఏదో కొద్ది రోజులు ఉంది వెళ్ళిపోతారు అనుకున్నాను. ఆయన ఇక్కడే ఉండిపోతారని   అనుకోలేదు. అదివరకులా ఆ పల్లెలోనే ఉండవచ్చు కదా.".అంది.

"ఉన్నది నేను ఒక్కడిని. అమ్మ పోయిన పదేళ్ళ నుండి చుట్టపు చూపుగా రావడమే తప్ప ఆయనిక్కడ  ఎప్పుడైనా ఒక నిద్ర అయినా చేసారా ? ఆరోగ్యం బాగోలేని స్థితిలో ఆయన అక్కడ ఉండటం ఏం బాగుంటుంది". అన్నాను. 

"మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆయన ఇక్కడ ఉండటానికి లేదు.."ఖండితంగా చెప్పింది. నేను ఇంకా వాదిస్తే నాన్నకి వినబడుతుందని నేను మాట్లాడలేదు.

వూళ్ళో పదెకరాల పొలంలో వచ్చే ఆదాయం అంతా తీసుకుని వచ్చి నాన్న కోడలికే ఇస్తుంటారు.  "ఇల్లాలంటే సంసారం నడిపే రధ సారధి. మగవాళ్ళకి ఏం తెలుస్తాయి  ఇంటి ఖర్చులు   అవీ.. పొద్దస్తమాను   కష్టపడటం  ఇంటికి వచ్చి తిని పడుకోవడం తప్ప "అంటారు.

అమ్మ ఉన్నప్పుడు అంతా అమ్మే చూసుకునేది.  తాతలు ఇచ్చిన రెండెకరాల పొలాన్ని పది ఎకరాలు చేసి.. ఇరవయ్యి ఏళ్ళు  నా పట్నం చదువుల కోసం  ఆహర్నిశలు  శ్రమించిన ఆయన్ని నా ఇంట్లో విశ్రాంతిగా ఉండనివ్వలేని నా చేతకానితననాకి  సిగ్గుపడాల్సి వస్తుంది.

 లోలోప దుఖం. "బాబూ !ఇలాగేనా నువ్వు మీ తండ్రికి ఇచ్చే గౌరవం అని అమ్మ నిలదీసి అడిగినట్లు ఉంటుంది. 

తెల్లవారాక నేను లేచే టప్పటికే నాన్న తన బట్టల సంచీతో ఊరికి వెళ్ళడానికి తయారుగా ఉన్నాడు.

"నాన్నా ఇప్పుడు ఊరికి వెళ్ళడం ఎందుకు? మీరు వెళితే పిల్లలకి ఎవరు తోడూ ఉంటారు? అన్నాను .నా మాటలు అతుకు పెట్టినట్లుగా ఉన్నాయని నాకు తెలుస్తూనే ఉన్నాకూడా

"మళ్ళీ వస్తానులే  బాబు.  ఏమిటో,  ఆర్నెల్లు అయ్యిందిగా ఊరిపై పీకుతుంది "అన్నాడు నాన్న.
తాతగారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అని  కావ్య  ఏడుపు  మొహం పెట్టింది.

మళ్ళీ త్వరగానే వచ్చేస్తాను కదా తల్లి. ! అలా ఏడవ కూడదు అంటూ మనుమరాలిని  ఓదారుస్తూనే      అటు వైపు తిరిగి నాన్న కళ్ళు తుడుచుకుంటున్నారు.  


నేను ఏమి మాట్లాడకుండా కాలకృత్యాలు తీర్చుకుని నాన్నని బస్ స్టాండ్ లో దింపి వచ్చాను. 

నేను వచ్చే టప్పటికి భార్యా మణి పోన్ లో  వాళ్ళ అక్కతో అనుకుంటాను మొహం అంతా వెలుగుతూ ఉండగా చెపుతూ ఉంది.  

"అబ్బ , ఆ ముసలాయన పీడా వదిలిపోయింది.  ఆర్నెల్ల నుండి నా ఇల్లు నాకు పరాయిదై పోయింది. రోజు గంట కొట్టినట్లు అయిదున్నరకి అల్లా ఆయన గారికి కాఫీలు అందించడం,ఏడు గంటలకి టిఫిన్లు పెట్టడం.. విసుగేసిపోయింది అనుకో. ఆయన నాలుగు గంటలే లేవడం,వాకింగ్ కి కొడుకుని  లేపడం . పూలు కోసుకు వచ్చి పూజ చేసుకో అమ్మా అని చెప్పడం, నేను లేవడం ఆలస్యం అయితే వంట ఇంట్లోకి జొరబడి కాఫీలు   కలిపి .కొడుకుకి ఇవ్వడం నా వంట ఇల్లు అంతా  అరాచకం అయిపొయింది అనుకో !  పైగా ఆయన ఉంటే మా ఆయన నైటీ వేసుకోనివ్వారు. పెద్ద వాళ్ళ ముందు గౌరవంగా ఉండటం నేర్చుకోమని పోరు పెడుతుంటారు.  నా స్వేచ్చ, నా ఇష్టా ఇష్టాలు అన్నీగాయబ్.!  అందుకే మొహమాటం లేకుండా పిల్లల చదువు వంక చెప్పి గట్టిగా క్లాస్  తీసుకున్నాను. 


తెల్లారేసరికి సంచీ సర్దేసాడు." చెపుతుంది.

అటు వైపు ఏం అడిగారో కానీ నా గురించి ఒక స్టాండ్ మార్క్ స్టాక్ డైలాగ్  

"మా ఆయన ఒట్టి సెంటిమెంటల్ పూల్. ఆయన వెంట బడి బస్ స్టాండ్ దాకా వెళ్ళాడు.  మళ్ళీ ఈ సారి ఆ ముసలాయనని  ఈ ఇంటికి రాకుండా ఏం చేయాలో ఏమిటో..?  ఫిక్సుడ్ డిపాజిట్ లాగా పిక్సుడ్ లైఫ్ ఉంటే బాగుండును. సీనియర్ సిటిజన్స్ అనేది లేకుండా " అని.. పగలబడి నవ్వుతూ .  వెనుకకి తిరిగి నన్ను చూసింది కానీ  ఏమి తొట్రు పడలేదు.

పైగా "జోక్ బాగా పేల్తుంది కదండీ"అంది.

"నోర్ముయ్యి."అని మాత్రం అనగల్గాను. 

"మా ఆయనలో సెన్సాఫ్ హ్యుమరే లేదు. అన్నిటికి విసుగే "అని చెపుతుంది.

నిజమే!  నాలో సేన్సాఫ్ఫ్ హ్యూమర్ ఏమిటీ? హ్యుమానిటీ కూడా తగ్గుతుంది అనుకుని అక్కడినుండి దూరంగా పారిపోయాను.  నాలా భార్యల ముందు పిరికిగొడ్డులా పారిపోయేవాళ్ళు యెంత మందో! 

అలా నాన్న వెళ్ళాక ఫోన్ సమాచారమే తప్ప  ప్రేమగా ఆయనని నేను వెళ్లి చూసే తీరిక లేక  పోయింది.

నిన్న సాయంత్రం భార్య  ఆఫీసు నుండి హడావిడిగా వచ్చి చెప్పుల్లో   కాళ్ళు   అయినా తీయకుండానే

"ఏమండీ ఇది విన్నారా..!?"అని అడిగింది.

ఏమిటన్నట్లు చూసాను.  "మన వూరు ఉంది చూసారు."ఆగింది. నేను ఏమి అంటానో అని అనుకుంటాను.. 

మన వూరు అని అందంటే.. ఏదో ప్రమాదం ముంచు కొచ్చినట్లే  అని నా మనసు సంకేతం అందించింది. నేను చెప్పు అనకుండానే చెప్పడం మొదలెట్టింది. 

"మన వూరిలో మన పొలం ప్రక్క నుండే బైపాస్ రోడ్డు పడుతుంది అట. మన పొలం ప్రక్కన ఉన్న పొలాన్ని  ఓ ఇరవయి ఎకరాల వరకు  మా రియల్ ఎస్టేట్  వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారట.ఆ వెంచర్ కోట్ల లాభాలు ఆర్జించి పెడుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ కొనే పొలానికి దారి మన పొలం లోనుండే వెళుతుందట." అని చెప్పుకొచ్చింది. 

"అది దారి కాదు కాలువ కట్ట. ఆ కాలువ లో నుండి వచ్చే నీళ్ళే మాగాణి భూములకి ఆధారం. అలాగే వరదలు వచ్చినప్పుడు చేలల్లో నీళ్ళు అన్నీ ఆ కాలువ ద్వారానే బయటకి వెళ్ళాలి " అని చెప్పాను. 

"నిజమే అనుకోండి కానీ ఇపుడు వ్యవసాయం ఏం గిట్టు బాటుగా ఉందండీ, మనం ఆ కాలువ ని ఆనుకుని మన పొలం పొడుగూతా కొన్ని గజాలు దారికి ఇచ్చామంటే మన పొలంకి బోలెడంత  రేటు పెరుగుతుంది. మనం ఇచ్చిన స్థలానికి రేటుకి రేటు ఇచ్చి  మనకి సిటీలో  డ్యూ ప్లెక్స్  ఇల్లు ఇస్తామంటున్నారు. ఇచ్చేద్దా మండి. "అని చెప్పింది. ఒహొ..యెంత  పకడ్బందీ ప్లాన్ వేసేవే! భార్యా మణి అనుకున్నాను.

" నాన్నని ఒక మాట అడిగి "అన్నాను.ఆమె మాటని తక్షణం కాదంటే ఏం ఉపద్రవం సృష్టిస్తుందో తెలిసి.

"మీరు గట్టిగా చెపితే ఆయన ఏమంటారు. ఆయనకీ మనం కాక ఎవరం   ఉన్నాం. మన మంచి-చెడు ఆయనకీ కాక   ఎవరికి చెప్పుకుంటాం ? అంది.

నేను ఆమె మాటలకి ఆశ్చర్యపోలేదు. పదేళ్లుగా ఆమె రెండునాల్కల  ధోరణికి అలవాటు పడిపోయాను. 

"రేపే వెళ్లి మీ నాన్నగారికి ఈ విషయం చెప్పి ఒప్పించండి." హుకుం జారీ చేసింది. నాన్న ఒప్పు కుంటాడో లేదో! కానీ నాన్నని ఒక  సారి చూసినట్లు ఉంటుంది వూరికి   వెళ్లి రావాలి అనుకుని ఆమె తో.. మాత్రం " సరే వెళతానులే  ! " అన్నాను. 

అలా నాలుగేళ్ల తర్వాత ఊరికి వెళుతున్నాను. సమయం నాలుగు గంటలవుతుంది.ఇక మళ్ళీ పడుకోకుండా స్నానం చేసి తయారు అయ్యాను. బయలుదేరేముందు ఎందుకైనా మంచిదని నాన్నకి   ఫోన్ చేసాను.   నాన్న ఆశ్చర్య పోతూనే  బండి మీద వద్దు దట్టమైన పొగ మంచు కురుస్తుంది. బస్ ఎక్కి రా అని చెప్పాడు. 

నేను బస్ దిగేటప్పటికి నాన్న  బస్ స్టాప్ లో నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను బస్ దిగగానే నా చేతిలో ఉన్న సంచిని అందుకోబోయాడు.నేను  సున్నితంగా తిరస్కరించాను. చాలా కాలంకి రావడం మూలంగా నేమో.. "బాబూ బాగున్నావా? చాలా ఏళ్ళ తర్వాత వచ్చావ్? నాన్నని మళ్ళీ  తీసుకు వెళ్ళడానికి వచ్చావా? "లాంటి ప్రశ్నలతో నన్ను నాకు గుర్తు చేస్తున్నారు. 

 అందరిని పలకరింపులకి సమాధానం ఇస్తూ  ఇంటికి వచ్చే టప్పటికి ఓ పావు గంట పట్టింది.  

"పిల్లలు ఎలా ఉన్నారు ? పద్దాక వాళ్ళే గుర్తుకు వస్తున్నారు" అడిగాడు నాన్న. "బాగున్నారు నాన్నా. నిన్ను తీసుకురమ్మన్నారు "అబద్దం చెప్పాను. 

నిజానికి   నేను ఇక్కడికి వచ్చేదే తెలియదు వాళ్ళకి . అని మనసులో అనుకుంటూ                


నాన్న చేది పట్టిన బావిలోని నీళ్ళు   పాకుడు పట్టకుండా తెల్లగా సున్నం రాసిన రాతి తొట్టి నిండా  తొణికిసలాడుతున్నాయి నా మనసులో నిండిన సంతోషంలా .  

కాళ్ళు కడుక్కుని   కాస్త మొహం మీద నీళ్ళు చిలకరించుకుని కర్చీఫ్ తో తుడుచుకుంటుంటే నాన్న తన భుజం మీద తువ్వాలు తీసి ఇచ్చాడు అమ్మ చీర కొంగుతో తుడుచుఉన్న ఆత్మీయ  స్పర్శ గుర్తుకు తెచ్చేలా. 

"ఇటు కూర్చోరా ఇప్పుడే కాఫీ తెచ్చి ఇస్తాను" అన్నాడు నాన్న. అతిది మర్యాదలు జరపడానికి నాన్న తప్ప ఆ ఇంట్లో ఎవరు లేరు. ఉండాల్సిన అమ్మ పది ఏళ్ళక్రితమే కాలం   చేసింది.  అమ్మ ఉన్నప్పుడు మరుగున పడిన నాన్న ప్రేమ ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. నాన్న కాఫీ కలుపుతూ ఉంటే  ఇల్లంతా తిరిగి చూసాను. పెచ్చులు పెచ్చులు గా ఊడిపోయి ఉన్న సున్నం గోడలు, పగలంతా ఎనిమిది గంటల కరంట్ కోతతో చీకటితో నిండిన గదులు  ఒక   విధమైన ముక్కు   వాసన  అబ్బ ఈ వాసనలో ఈ చీకటిలో నాన్న ఎలా ఉంటున్నాడో !?  

అందరి ఇళ్ళు బాగున్నాయి. తను బ్యాంకు లోన్ తీసుకుని అయినా  మంచి ఇల్లు ఇక్కడే కట్టుకోవాలి. ఎక్కడెక్కడో.పెద్ద ఇల్లు ఉంటే మాత్రం ఏం గొప్ప? పుట్టిన ఊర్లోనే గొప్పగా ఉండాలిగాని అనుకున్నాను స్వగతంలో  

అమ్మ ఉన్నప్పుడు ఎంతో శుభ్రంగా ఉండే ఇల్లు ఇలా అయిపొయింది. క్రింద గచ్చంతా  కూడా తవట వేసినట్లు మచ్చలు మచ్చలుగా ఉంది. నాన్న వంట ఇంట్లో ఏదో అవస్థలు పడుతున్నట్లున్నాడు. 

నా కోసం  ఏమి ప్రత్యేకంగా చేయ వద్దు   అని చెప్పడానికన్నట్లు వంటింట్లోకి  వెళ్లాను. వంటింటి  గోడపై అమ్మ సంప్రదాయం కొనసాగిస్తూ  ఉన్నట్లు బల్లులు రాకుండా ఉంటాయని అమ్మ పెట్టినట్లుగానే కోడిగుడ్డు డోప్పలు తగిలించే ఉన్నాయి. శుభ్రంగా కాగితాల పిండితో అలికిన చేట, గోడకి కొట్టిన  గ్యాస్ లైటర్ స్టాండ్ అన్నీ అమ్మ ఉన్నప్పుడు  ఉన్నట్లే ఉన్నాయి. బియ్యం డబ్బా తీసి చూసాను పురుగు పట్ట కుండా ఎండిన వేప ఆకు కలిపి   వుంది.  కాఫీ తాగుతూ పెరట్లో తిరుగుతుంటే నాన్న బియ్యం కడిగి ఆ నీటిని కరివేపాకు చెట్టు మొదట్లో వంచుతూ కనబడ్డాడు.  చిన్నప్పుడు తను  నిద్ర లేచేటప్పటికే ఎర్రగా మండుతూ సెగలు కక్కే బొగ్గుల కుంపటి,పొగ గొట్టం తుప్పు పట్టి కనిపించాయి అమ్మ పక్కనే ఉండి సరదాగా  పొగ ఊది అవస్థలు పడిన రోజులు  జ్ఞాపకం వస్తున్నాయి.  విసన కర్ర తీసుకుని బొగ్గుల పొయ్యిని బాగా రాజింపజేసిన జ్ఞాపకం, 

ఎన్నో రోజులుగా కోయకుండా రాలిపోయి ఉన్న సన్నజాజులు మనుషులు ఒకరి తర్వాత ఒకరు రాలిపోతున్న  విధంకి  ప్రతీకగా కనిపించాయి. 

నిజానికి తన వూరు ఊరంతా ఖాళీ అయిపొయింది. తన తండ్రితరం వారు కొద్దిగా వాళ్ళ తండ్రుల తరం వారు వేళ్ళ సంఖ్యలోనూ  గత వైభవాన్ని గుర్తుకు తెచ్చు కుంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఒకమాదిరిగా ఉన్న కుటుంబాలలోని పిల్లలందరూ చదువుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే   స్థిరపడి పోయి వాళ్ళ ఆర్దిక   అభివృద్దికి చిహ్నంగా పాత పెంకుటిళ్ళు కూల్చి  మేడలు కట్టారు కార్లు అమర్చారు కానీ అందులో ఉంటున్నది మాత్రం జీవచ్చవాలే! ఏడాదికో రెండేళ్ళకో ఆ ఇళ్ళకి ఓ పది రోజులు పండగ వస్తుంది. అంతే! వచ్చినప్పుడు..కూడా ప్రేమగా, ఆత్మీయంగా హత్తుకోలేని అడ్డు గోడలు ఒట్టి పోయిన  పశుశాలలు.

కాన్వెంట్   చదువుల కోసం మిగిలిన కుటుంబాలు దగ్గరలోని సిటీకి  కాపురాలు  మార్చడం, నామ మాత్రంగా మిగిలిపోయిన వ్యవసాయం, విస్తరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం.ఇది తన ఊరు ముఖ చిత్రం. 

దాదాపుగా అన్ని ఊర్ల పరిస్తితి ఇంతేనేమో! పల్లె వెళ్లి పట్నంలో కలుస్తుందా ? పట్నం వచ్చి పల్లెని  కబలిస్తుందా?  ఏదో చెప్పలేని పరిస్థితి.    

ఎండ పెరిగింది. లోపలి వచ్చాను. గోడల చల్లదనం హాయిగా ఉంది . చలువరాతి పరిశుభ్రమైన   ఇంటిలో ఉంటున్న తను ఈ ఇంటి వాతావరణం కి అలవాటు పడటానికి   ఓ గంట పట్టింది.అయినా ఇక్కడ ఏదో తెలియని హాయి ఉంది. నాన్న ఏదో రెండు కూరలు వండాక తనకి పెద్దమ్మ  వరుసకయ్యే ఆమె వచ్చి మా ఇంట్లో భోజనం చేయి బాబు. పాపం నాన్న ఏం చేయి కాల్చుకుని చేస్తాడు అని వచ్చింది. 


"లేదులే పెద్దమ్మా  నాన్న  వంట చేసేసాడు.ఇక్కడే తింటాను." అని చెప్పాను.సరే రాత్రియినా మా ఇంట్లో భోజనం చేయి."అని చెప్పింది పెద్దమ్మ. 

రాత్రికి  ఇక్కడ ఉండటమా? ఆలోచన. సరే అన్నట్లు తల ఊపాను. నాన్న ముఖంలో సంతోషం; ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఓగంట తర్వాత భోజనం చేసాం. నాన్న కొసరి కొసరి   వడ్డించాడు. ఇంట్లో నాలుగు రకాల కూరలలో లేని రుచి ఏదో తగులుతుంది.అది ప్రేమ రుచి అనుకుంటాను.  

కాసేపు అలా పందిరి మంచం మీద పడుకున్నాను. చిన్నప్పుడు నుండి ఈ మంచం మీదే కదా పెరిగి పెద్దయ్యింది ఎందుకో ఆ మంచం మీద అమిత మైన ప్రేమ పుట్టుకొచ్చ్చింది. ఏనాడు నాన్నని ఏది అడగని నేను..  నాన్నా ఈ పందిరి మంచం కావాలి నాకు అడిగాను. నాన్న నవ్వి అలాగేలేరా వేసి పంపనా? అన్నాడు. కాదు నేనే వేసుకెళతానూ అన్నాను. నాన్న అర్ధమైనట్లు తల ఊపాడు. ఓ గంట పాటు చిన్న కునుకు   తీసి  నాన్న ఇచ్చిన టీ  తాగి నాన్నా ! అలా మాగాణి పొలం లోకి వెళ్లి వద్దామా అడగాలనుకున్నాను. అంతలో నాన్నే అడిగారు. "అలా. మాగాట్టి చేలోకి వెళ్లి వద్దాం రా ! అని.   సరే అన్నాను. 

మాగాణి పొలాల మద్య నుండి నున్నని తారు రోడ్డు. పల్లె నుండి పట్టణానికి జ్ఞానాన్ని, సంపదనంతటిని  మోసుకుని వెళ్ళడానికి   వేసినట్లు.

ఈ రోడ్డుని వెడల్పు జేసి   బందరు దాకా బైపాసస్ రోడ్డు వేస్తున్నారు రా అన్నాడు నాన్న.

" నేను పేపర్లో చదివాను"  చెప్పాను. 

ఆ రోడ్డు నుండి చీలి ఎడమ వైపు ఉన్న మా పొలంలోకి  దిగాము వరికోసి  వేశాక రెండో పంటకి   నీళ్ళు అందుతాయో లేదని అపనమ్మకం వల్ల ఏమో ఎవరు మళ్ళీ దాళ్వా సాగు చేయడం లేదు ఆరు తడి పంటలు వేసారు. మా చేనుకి తూర్పు ప్రక్కన   ఉన్నపంట కాలవ దగ్గరికి వచ్చాం. కాలువ ఎండి పోయి ఉంది. 

"ఈ కాలవని దానికి ఆనుకుని ఉన్న మన పొలంలోని ఓ ముప్పై  అడుగుల వెడల్పుకి వచ్చే దారినే కదా వాళ్ళు ఇమ్మని అడుగుతుంది."అడిగాడు నాన్న. 

నేను షాక్ అయ్యాను. "నాన్నా మీకు ఇది ముందే తెలుసా.!?"  అడిగాను. 

"లేదురా! నువ్వు బయలు దేరి వచ్చాక  కోడలు పోన్ చేసి చెప్పింది." చెప్పాడు నాన్న. పీకల దాక భార్య పై కోపం   ముంచుకొచ్చింది.

"నాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏం లేదురా!  పిల్లలకి నగరం నడిబొడ్డు కి స్కూల్  కి  వెళ్ళడానికి గంటల తరబడి బస్ లలో   మగ్గిపోవాల్సి వస్తుంది.  మనం ఈ దారి ఇస్తే మనకి  ఇల్లు ఇస్తారు. బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఈ కాలువ మొత్తాన్ని పూడ్చేసి రోడ్డు వేసేస్తారు. ఈ కాలవ  క్రింద సాగులో ఉన్న పొలాలకి యెంత ఊపిరో నీకు తెలుసు. ఈ కాలవ కింద అందరు ఎకరం, రెండెకరాలు ఉన్న  రైతులే . ఇప్పటీకే వ్యవసాయం గిట్టు బాటు అవక అప్పుల్లో ఉన్నారు. మనం దారి ఇస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు సిండికేట్   అయి వాళ్ళ అవసరాలని తెలుసుకుని పొలాలన్నీ కారు చవకగా కాజేద్దామని   చూస్తారు. ఊరు ఊరు గాకుండా పోతుంది" అని వివరంగా చెప్పాడు నాన్న.

"అయినా ఇక్కడ వచ్చి ఎవరుంటారు రా ఇక్కడ ఏమన్నా కాలేజీలా పాడా? ! ఏదన్నా రోగం, నొప్పి వచ్చినా  హాస్పిటల్ కి  పాతిక మైళ్ళు పరిగెత్తాలి. "

"అది కాదు   నాన్నా! ఏదో ఇళ్ళ నిర్మాణం కి అంటున్నారు.

"లేదురా! ఆమతలబున్నీ నిజం కాదు ఏదో నల్ల డబ్బు ఉన్న వాళ్ళ పన్నాగం ఇది. ఇక్కడ ఇళ్ళ ప్లాటులు ఏసినా  వెర్రి బట్టినట్టు కొనేది పట్నం వాళ్ళే  రా ముందు ముందు పెరగకపోతాయా అని ఆశ. ఇంకొన్ని   ఏళ్ళకి ఇది కూడా   దొరకదని భయం, లేని డిమాండ్   సృష్టించి నోటి మీద లక్షల లెక్క   పెంచేస్తున్నారు. రెండేళ్లనాడు లక్ష రూపాయలు కూడా రేటు పలకని పొలాలు ఈ ఏడాది ఇరవై లక్షలకి కొని ఏం చేస్తారు? పంట గట్టిగా పండినా ఇరవై వేలకి  మించి ఆదాయం రాదు.ఇరవై లక్షల  రేటు అనడమే కానీ ఆరు లక్షలకి  మించి ఎక్కడా   బేరం జరగడం లేదు. అంతా  వ్యాపారుల మాయా జాలం  అని వివరంగా చెప్పాడు నాన్న.

"మనం ఇప్పుడు దారి ఇస్తే కాలవ లేకుండా పోద్ది. ఈ ఊరులో వ్యవసాయం చేసేవాడు ఉండడు .అయిన కాడికి   అమ్ముకుని అప్పులు తీర్చుకుని బాధల నుండి బయట పడతారు, జల్సాలు చేస్తారు".సూక్ష్మంగా అన్నీ పరిశీలించినట్లు  చెప్పాడు నాన్న  నాకు ఆశ్చర్యం వేసింది.  నాన్నది ఏడో  తరగతి చదువు మాత్రమే! అయినా యెంత అవగాహన.!! అందుకే చదువు కన్నా అనుభవం ముఖ్యం అంటారు.   

నేను ఆలోచించసాగాను. "మనం దారి ఇవ్వవద్దు.నాన్నా ! ఎక్కడ   పడితే అక్కడ ఆక్రమించుకుని అక్రమ   నిర్మాణాలు చేపట్టి,నీటి పారుదల వ్యవస్థని, మురుగునీటి వ్యవస్తని నాశనం చేసి చెరువులు ఊళ్ళు, ఊళ్లు చెరువులు అయ్యే  పరిస్తితిని అడ్డుకోవాలి అంటే మనం మన వంతు భాద్యతగా ఉండాలి" అన్నాను నేను. 

"మన  దూరపు బంధువు నాకు బాబాయి కొడుకు రవి నీకు  బాబాయ్ అవుతాడు   వాడు  తెలుసు కదా..  ..పొలాలకి రేట్లు పెరిగినాయని  ధీమా వచ్చి వడ్డీలకి తెచ్చి  మరీ వ్యాపారం చేసాడు. అటు వ్యాపారం కలసి రాలేదు. ఇప్పుడు లక్షలకి లక్షలు రేటు పలుకుతుందని అనుకున్నపొలం కొనే నాధుడే లేడు. కొనుక్కునే  వాడు ఆరు లక్షలు అంటాడు. అమ్ముకునేవాడు ఇరవయి లక్షలు ఉంది..అంతకన్నా తక్కువ  అయితే ఇవ్వనని భీష్మించుకుని కూర్చుని ఆఖరికి అప్పుల వాళ్ళ  బాధలు పడలేక పురుగు మందు తాగి చచ్చిపోయాడు. ఉన్న పొలం అంతా  అప్పులవాళ్ళు ఎగదన్నుకుపోయారు. వాడి పెళ్ళాం బిడ్డలు రోడ్డున పడ్డారు" నాన్న బాధగా చెప్పాడు.      

అలా వ్యవసాయం ,ఇబ్బందులు చెప్పుకుంటూ ఇంటికి  వచ్చాం.

ఆ రాత్రికి ఆలోచిస్తూ ఉన్నాను.

అర్ధరాత్రి లేచి నాన్నని లేపి మరీ చెప్పాను, నాన్నా! మనం  దారి ఇవ్వం. మా పది ఎకరాలు పొలం మొత్తం ఎకరం ఇరవయ్యి లక్షల చొప్పున అయితేనే  ఇస్తాం అని చెపుదాం.అన్నాను.

వాళ్ళు ఖచ్చితంగా  వద్దని అంటారు రా,ఎందుంటే మనం దారి ఇస్తే వాళ్ళు కొనే పొలం రేటు ఎకరం ఆరు లక్షలు. మన పొలం  కొనే రేటు ఇరవై లక్షలు  పెట్టాలి గనుక    లాభాలు ఉండవు కాబట్టి ఎట్టి  పరిస్థితుల్లోను  కొనరు అన్నాడు నాన్న .

అదే  కదా ! మనకి   కావాల్సింది. ఇక  వ్యాపారులెవరు మన పొలాలకేసి  కన్నెత్తి చూడరు  అని చెప్పాను.

నాన్న తలపంకించాడు . 

తెల్లవారి నాలుగు గంటలకే నా సెల్ పోనే మోగింది. నా భార్య నుండి పోన్. నాన్న  పొలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడా లేదా అన్నది తెలుసుకోవాలని ఆత్రం. 

"నీకొక శుభవార్త నాన్న  దారి మాత్రమే  ఎందుకు? మన పది ఎకరాలు పొలం అమ్మేసుకో అని అన్నారు.   . ఎకరం ఇరవై లక్షలు రేటు వస్తుంది. మనకి   రెండు కోట్లు   వస్తాయి చెప్పాను  ఆశ గా ఊరిస్తూ..

"అవునా మామయ్యా గారు ఒప్పుకున్నారా? మై గుడ్నెస్   చాలా హేపీ అండి." అంది.

ఒక   మాట నువ్వు ఏమనుకోనంటేనే .!? .అడిగాను. "చెప్పండి "అంది భార్యా మణి

"మరి నాన్న పొలం అమ్మేశాక ఎలా ! ఆయన  ఎక్కడ  ఉంటారు? " అడిగాను .

 "అయ్యో ! అదేం మాటండీ, ఆయనకి మనం కాక  ఇంకా ఎవరున్నారు. మనతోనే ఉంటారు.ఇంటికి పెద్దదిక్కు .పిల్లలు కూడా ఆయనపై దిగులు పెట్టుకున్నారు. 

ఆయన రానన్నా సరే బలవంతంగానైనా తీసుకుని రండి" చెప్పింది సంతోషంగా రెండు కోట్లు వస్తున్నాయి అనే ఆనందంలో.

అలాగే మరొక   పోన్ చేసాను. మేము మీకు దారి ఇవ్వదల్చుకోలేదు. పొలం మొత్తంగా అయితేనే  అమ్మదలచాము. ఎకరం  ఇరవై లక్షల ఖరీదు  లెక్కన అయితేనే   ఇస్తామని చెప్పాను. వాళ్ళు అంత ఎక్కువైతే వద్దని చెప్పేశారు నాకు.  ఇప్పుడు ఎంతో .హాయిగా ఉంది. నా పొలం జోలికి ఇప్పట్లో ఎవరూ రారు.  

నిజానికి ఆ పొలం అమ్మడం నాకేమాత్రం ఇష్టం లేదు.  నా భార్య మాటల్లో నేనెప్పుడు ఓ..సెంటిమెంటల్ పూల్ ని. కానీ నా ఊరు, నా వాళ్ళ విషయంలో నేనెప్పుడు సెంటిమెంటల్ ఫూల్ నే నని నా భార్య కి అర్ధంయ్యేదాక ఓర్చుకోక తప్పదు కూడా. 

అలాగే నా భార్య పరిస్తితి ఇప్పుడు  కుడితిలో పడ్డ ఎలుకలా ఉంటుంది.  ఇప్పుడామె  నాన్నని కాదని అనడానికి వీలులేదు . 

అలా నేను అనుకున్న రెండు పనులు అలా విజయవంతంగా నెరవేరాయి. 

నాన్నా,నేను కలసి పందిరి మంచం వేసుకుని పట్నం బయలుదేరాం.  మా బొగ్గుల పొయ్యిని, ఊదుడు  గొట్టాన్ని  చేతిలోకి తీసుకున్నాను.  నా కొడుకు రిషి కి వాటిని  అపురూపంగా చూపాలని. 

చిరు చీకట్లు ముసురు కుంటున్నాయి.  అక్కడ చిరు కాంతులతో నా ఊరు  పల్లె ఆనవాలు మిగులుస్తున్నట్లు ఉంది.

"అవును, నా తరం వరకయినా   నా పల్లె ఆనవాలుని  కాపాడాలని కంకణం  కట్టుకున్నాను.

కౌముదిలో 2012 మే మాసంలో వచ్చిన కథ