22, జనవరి 2013, మంగళవారం

సుదర్శనచేసే పని సృజనాత్మక మైనదే ! రక రకాల మనుషులను నిశితంగా పరిశీలించే అత్యంత ఇష్టమైన వ్యాపకమే!! కానీ ఎందుకో విసుగు కల్గుతుంది.

 హఠాత్తుగా ఓ.. అయిదారేళ్ళు వెనక్కి వెళ్లి పోయి..ప్రీతికరంగా రేడియో కార్యక్రమాలు వింటూ.. మనకి నచ్చే పాటలు వచ్చినప్పుడు సంతోషంగా ఎగిరి గంతేస్తూ.. కొన్ని పాటల కోసం పోస్ట్ కార్డ్ పై  స్కెచ్ పెన్ లతో..రంగు రంగులను మేళవించి అక్షరాలతో అభిరుచి కార్యక్రమం కి మన అభిరుచి తెలియజేస్తూ.. పాట  ప్రసారం చేయమని కోరుకుంటూ..

ఉదయం 08:35 ఎప్పుడు అవుతుందా !? అని నిమిషాలు లెక్కిస్తూ.. ఒక లాండ్ లైన్,రెండు మొబైల్ పోన్స్ పట్టుకుని రెండు నెంబర్స్ ఫ్రెష్ గా డయిల్  చేస్తూ  కలసిన నెంబర్ లిఫ్ట్ చేయాలి.. లిఫ్ట్ చేయాలి భగవంతుడా .. ఈ నా కాల్ లిఫ్ట్ చేసేలా చూడు అంటూ ..అల్ప మైన కోర్కెలతో..అమిత సంతోషపడే రోజులు మళ్ళీ వస్తాయా!?

అభిమాన ప్రయోక్త జె.పుష్పరాజ్ గళంలో గళం కలిపి ఆనందంతో తబ్బిబ్బు అయిపోయిన  రోజులు డైరీలో మరపు రాని పేజీలు .

 కాలాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ అలాంటి రోజుల్లోకి వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఇంటర్ నెట్ ప్రపంచం పాటని చేరువ చేసింది కాని..మధురానుభూతిని దూరం చేసింది. కొత్తగా అలవాటుపడ్డ ముఖ చిత్రం..  ఆత్మీయంగా నేస్తానికి కాగితంపై వ్రాసుకునే లేఖలని దూరంగా నెట్టేసింది. రెండక్షరా ల పలకరింపులు ,కొన్ని లైక్  లు, బహు కొద్దిగా వ్యాఖ్యలు. ఒకటే పరుగులు. యంత్రం ముందు నుండి యాంత్రిక మైన జీవితం నుండి బయట పడి మాటకి ఆత్మీయ పరిమళాలనద్దే  మనసుతో..సంభాషించాలని ఉంది. కొన్ని ముసుగులను తొలగించుకుని మనసును స్వేచ్చగా గాలికి ఆరేసుకోవాలని ఉంది.

ఖచ్చితంగా ఇలాంటి సమయాలలోనే "సుదర్శన " గుర్తుకు వస్తుంది.సుదర్శన అంటే చలోక్తుల పుట్ట. పెదవి విరుపుతోనే ఇతరుల పెదవులపై నవ్వులు పూయించే విద్య ఆమె సొంతం. నాకు  ఆమెతో ముఖ పరిచయం అయినా లేదు. ఒకరోజు బాగా పని వత్తిడిలో ఉన్నప్పుడు నాకు పోన్ చేసింది. పేరు తెలిసాక మీరు ఫలానా ప్రాంతం నుండి రేడియోకి ఉత్తరాలు వ్రాస్తారు కదా! మీరు సావిత్రి గారికి వీరాభిమాని ..అవునా అడిగాను.

వసుంధ గారు నన్ను భలే గుర్తు పట్టేశారు..చాలా సంతోషం అంది.. వసుంధరా.!.ఆవిడెవరు? అడిగాను అయోమయంగా..
"మీరేనండీ వాణి  జయరాం గారు "అంది. అప్పుడు గాని నాకు అర్ధం కాలేదు నాతో  హాస్యం ఆడుతుంది అని. నిజం చెప్పొద్దూ.. చికాకు అనిపించింది.నేను పని వత్తిడిలో ఉన్నాను. వీలు చూసుకుని మీతో మాట్లాడతాను, ఉండనా మరి అంటూ అనుమతి కోరాను. మీతో  తొలి పరిచయంలోనే విసుగుపెట్టినట్టు ఉన్నాను, మళ్ళీ మాట్లాడుకుందాం "అని తనే పోన్ పెట్టేసింది.

నాకు తీరుబడి ఉన్నప్పుడు కూడా "సుదర్శన"తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కొంత కాలానికి ఆమె మళ్ళీ పోన్ చేసినప్పుడు సిగ్గుపడ్డాను. కొద్దిసేపు సంభాషణ లోనే  ఆమె మంచి మాటకారి మాత్రమే  కాదు.. సాహిత్య అభిలాష ఉన్న వ్యక్తిగా  అర్ధమైంది. తనతో..లోతుగా సంభాషించే కొలది ఆమె పట్ల ఒక గౌరవభావం ఏర్పడింది. వీలయితే ఉత్తరం వ్రాయమని  తన పోస్టల్ చిరునామా  ఇచ్చారు. చిరునామా కాగితం చెత్త బుట్ట కి సొంతం అయిపొయింది కానీ..మా మధ్య అప్పుడప్పుడు పోన్ సంభాషణలు దీర్ఘ సమయాలు కొనసాగుతూ ఉండేవి .

ఎప్పుడైనా మనసు బావుందకపోతే తనతో మాట్లాడితే చాలు. పది నిమిషాలలో మనసు దూది పింజేలా తేలుతూ..నూతన ఉత్సాహం తో పరుగులు తీస్తూ ఉండేదాన్ని. .

నా గొంతు  వాణి జయరాం  గొంతులా ఉంటుందని నన్ను తెగ మెచ్చుకునేది. వాణి జయరాం గారు.. ఒక పాట పాడండి! అని అడిగించుకుని, అడిగించుకుని ఒక పల్లవి పాడి వదిలేసేదాన్ని అంతమాత్రానికి తెగ సంతోషపడేది .

ఒకసారి ఒక కవితా వేదిక ని నిర్వహించడానికి " సుదర్శన" నివాసముంటున్న పట్టణం నుండి నాకు ఆహ్వానం అందింది. ఆమెని కూడా చూసినట్లు ఉంటుందని ప్రయాణం అయ్యాను. నేను రైలు స్టేషన్ లో బండి దిగేటప్పటికి నన్ను ఆత్రుతగా వెదుకుతూ ఆమె ఎదురయింది.  వయస్సు నలుబై పైబడి ఉంటుంది.తెల్లని చీరపై ఊదా రంగు చిన్న చిన్న పువ్వులున్న చీర కట్టుకుని ఒత్తైన తలకట్టుని చక్కగా ముడి చుట్టుకుని పొందికగా ఉంది. నన్ను పోన్ లలో  హాస్యోక్తులతో..గంటల తరబడి మరపింపజేసేది ఈమేనా ? ఆమె ఈమె వేరు వేరు ఏమో..అనుకుని ఆలోచించసాగాను.

అమ్మా..వసుందర.. నేనే సుదర్శన .. బహు దర్శన  వింత దర్శన ..అన్నీ నేనే! అంటూ మేలమాడింది. స్టేషన్ బయటకి వచ్చి..ఆటో మాట్లాడుకుని సభాస్థలం కి వెళదామన్నాను. మా మేడకి వచ్చి నాస్టా చేసుకునిపోదాం రండి..అంది.ఇప్పటికే ఆలస్యం అయింది కదా ! మధ్యాహ్నం భోజన సమయాలు అప్పుడు వెళదాం అని వాయిదా వేసాను. ఆమెతో మాట్లాడుతూనే సభా కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నాను.

మధ్య మధ్య తన గురించిన విషయాలు దొర్లాయి. ఇంటికి పెద్ద కూతురు.మేన బావతో బాల్య వివాహం ,ముగ్గురు మగ బిడ్డలు. తర్వాత భర్త పర స్త్రీ సాంగత్యం కోరి..ఆమెని,ముగ్గురు బిడ్డలని పుట్టింటి పరం చేసి రెండో భార్యతో మరో ఇద్దరు బిడ్డలకి తండ్రి అయి ఈమెని ఈమె బిడ్డలని పరాయి వారిగా తోసేస్తే దినదినంబు ఇసురాయిల్లో గింజలా నలుగుతూ..పాతికేళ్ళ ప్రయాణం చేసిన ఆమె వెతలు గురించి వింటే ఆమె పట్ల సానుభూతి కల్గింది.

 "పెద కాపు కులాన పుట్టినందుకేమో.. పని పాట  చేసుకునే వీలు లేకపోయింది. నాకా..చదువు సంధ్య లేదు ఏ ఇడ్లీల అంగడో .దోసెల కొట్టో పెట్టుకుని బ్రతుకు దామన్నా నామోషీ అయిపోయే! ఏదో అలా కన్నారి పంచన పడి బతుకుతున్నాం."అని చెప్పింది. 

ఆమె చెప్పే  కొన్ని విషయాలు వింటున్నప్పుడు దుఖం ముంచుకొచ్చింది.

ఆమె మాటల్లోనే మరింత నేను తెలుసుకున్న కథ..సుదర్శన పెద్ద కొడుకు పాతికేళ్ళు పెరిగి ప్రయోజకుడై.. ఒక ఉద్యోగస్తుడ య్యాక కాస్త అభిమానంగా బ్రతకాలి అనుకున్నాను. వాడేమో..వేరే కులస్తురాలిని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చి వేరు కాపురం బోయాడు.ఒక బిడ్డ పుట్టినాక చెడు సావాసాల పాలబడి..కోడలినికూడా నా పై దోలి.. దేశం బట్టి పోయాడు. ఆ అమ్మాయికి అనారోగ్యం చేసింది. రోగ నిర్ధారణ పరీక్షల్లో ఆ అమ్మాయికి హెచ్.ఐ.వి.అని వచ్చింది.

"పాపం పారాయి వాళ్ళ బిడ్డ అయినా నిజం చెప్పుకోవాల. కోడలు చాలా మంచిది.ఆ అమ్మాయికి నా కొడుకుని కట్టుకున్నందుకే ఈ శిక్ష. పచ్చి త్రాగుబోతుగా మారిన  కొడుకుని  ఇంటికి  రాడు . వచ్చినా ఆ అమ్మాయిని మమ్మల్ని అందరిని ప్రశాంతంగా బతకనీయడు. ఆ అమ్మికి ఒకటే దిగులు. చచ్చిపోతున్నాను నా బిడ్డని ఎవరు చూస్తారు? అని ఏడుస్తా ఉంటది. మనుమడిని, ఆ అమ్మిని కంటికి రెప్పలా చూసుకుంటానే ఉన్నాం. ఈ దినం కూడా ఆ అమ్మిని హాస్పిటల్కి తీసుకుపోవాలి.కానీ మిమ్మల్ని కలిసేది ఏట్టా ..అందుకే ఆ అమ్మిని మా చెల్లికి ఇచ్చి హాస్పిటల్ కి పంపి ఇటు వచ్చాను "అని చెప్పింది.

సుదర్శనా ! ఇంత గరళం దాచుకుని నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావ్? అడిగాను. కష్టాలు మనుషులకి రాక మానులకి మొక్కలకి వస్తాయా..!? అవన్నీ మామూలే అయిపోయాయి. వీటన్నిటి మధ్య కాస్త మనసుకి తెరిపి పుస్తకాలు ,పాటలు,మీలాంటి నేస్తాలు అని చెప్పింది. నాకు కళ్ళలో..నీళ్ళు చిప్పిల్లాయి.సభ పూర్తి అయ్యేసరికి చీకటి పడింది. నేను ఎక్కబోయే ట్రైన్ అందుకోవాలి అంటే.. సుదర్శన వాళ్ళ ఇంటికి వెళ్ళడం వీలుపడదు. ఆ మాట చెప్పలేకపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్లి సుదర్శన కోడలిని పలకరించి కాస్త దైర్యం చెప్పడం భాద్యత అనుకున్నాను. కానీ వెళ్ళ లేకపోయాను.

రైలు  ఎక్కబోతూ.. నా బేగ్ తెరచి డబ్బు ఎంత ఉందొ చూసాను.టిక్కెట్ తీసుకున్నాక ఉన్న చిల్లర  ఒక వెయ్యి రూపాయలు మాత్రమే  ఉన్నాయి. వెంటనే ఆ వెయ్యి రూపాయలు తీసి.. కోడలి మందుల కోసం వాడమని చెపుతూ నేను సిగ్గుపడ్డాను. సారీ..సుదర్శనా! నిన్ను అవమాన పరచాలని కాదు. ఏదో.. చిన్న సాయం అని చెప్పాను.  నీ మనసు నాకు తెలియదా వసుందరా..! అని నా చేయి తన చేతిలోకి తీసుకుని అలాగే ఉండిపోయింది.
రైలు కదిలింది. నా కళ్ళల్లో నిండుకున్న నీటి మసకల్లో.. ప్లాట్ పారం పై నాకు వీడ్కోలు చెపుతున సుదర్శన రూపం ఎంతో  .ఉన్నతంగా కనబడింది.

తర్వాత కొన్నాళ్ళకి సుదర్శన కోడలు మరణించింది మనుమడు జయంత్ ని నాలుగో కొడుకుగా స్వీకరించి.. మళ్ళీ మరోమారు తల్లి అయింది సుదర్శన.

భూమికి భారమై బ్రతుకుతున్నాను  అయినా బ్రతకాలి మళ్ళీ ఈ బిడ్డని పెంచవద్దూ..అంటుంది మనుమడి  గురించి  చెపుతూ . అప్పుడప్పుడు పెద్ద కొడుకు వచ్చి తన బిడ్డని తానూ తీసుకు వెళతానంటూ..  చేసే రచ్చని ఎదుర్కుంటూ.. నాలుగేళ్ల మనుమడు గీతా పారాయణం నేర్చుకుంటూ.. మధ్యలో నత్తి మాటలు జొరబడుస్తూ..నేర్చున్న శ్లోకాలని వినిపిస్తూ ఉంటే నవ్వు కుంటూ.. ఆ నవ్వులు నాకు పంచాలని పోన్ చేసే సుదర్శన అంటే నాకు వల్లమాలిన అభిమానం..

అప్పుడప్పుడూ పోన్ లో కబుర్లు, కాస్త బరువైన సంభాషణలు,అంతలోనే హాస్యపు గుళికలు..

మా తొలి పరిచయం అయిన రోజుని,అలాగే తనని వాళ్ళ ఊరిలో కలసిన రోజుని గుర్తుపెట్టుకుని పోన్ చేసి మరీ పలకరిస్తూ ఉంటుంది. ఆ ఒక్క విషయమూ చాలు తను మనుషుల పట్ల, మమతల పట్ల ఎంత సున్నితమైన భావన కలిగి ఉంటుందో చెప్పడానికి.

స్త్రీ గా పుట్టినందుకు ఒక్కో స్త్రీ మూర్తి.. ఎన్ని గరళాలని మింగుతూ.. నిత్యం చస్తూ.. అంతలోనే బ్రతుకుతూ.. బ్రతుకు ఈడుస్తూనే  ఉంటారు .

అందరూ.. దీరోదాత్తులైన, ఉక్కు పిడికిలి బిగించి నడిచిన స్త్ర్రీ మూర్తులు  మాత్రమే ఉండరు.. సాదా సీదాగా బ్రతికే సుదర్శనలు ఉంటారు. అలా కూడా బ్రతుకు ఈడ్వక తప్పదు అని చెప్పేందుకేమో  !

అలాటి వారందరికీ ఏమివ్వగలను. కాస్తంత స్నేహ హస్తం,  పిడికెడు ఆత్మ విశ్వాసం, కూసింత సాయం తప్ప.

ఈ యంత్రాల మధ్య నుండి బయటపడి.. కాస్తంత మనుషుల మధ్య పడి  కష్టం చాయ లోకి నేను జొరబడి..సుదర్శన కి మాట-మంచి బంధం వేయాలని పోన్ తీశాను.

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నవ్వుతూ బతికే మనుషుల వెనక ఇటువంటి విషాదాలు ఉంటున్నాయండి, వారు చెప్పుకోలేరు, సానుభూతి చూపితే కూడా బాధ పడతారు, ఏమిటో ఈ బతుకులు...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...


"అందరూ.. దీరోదాత్తులైన, ఉక్కు పిడికిలి బిగించి నడిచిన స్త్ర్రీ మూర్తులు మాత్రమే ఉండరు.. సాదా సీదాగా బ్రతికే సుదర్శనలు ఉంటారు."
మీరు చెప్పింది నిజమేనండీ ...

"కాస్తంత స్నేహ హస్తం, పిడికెడు ఆత్మ విశ్వాసం"
ఇవే మీరు ఆమెకి చేసే గొప్ప సహాయమేమో..శోభ చెప్పారు...

మీ కథనం కంటతడి పెట్టించిందండీ వనజగారు..

ఇలాంటి సుదర్శన లు లోకంలో చాలా మందే ఉన్నారు..

చూసి అయ్యో అనేవారే తప్ప..

మీకు లాగా... కాస్తంత స్నేహ హస్తం, పిడికెడు ఆత్మ విశ్వాసం, కూసింత సాయం చేయాలని ఆలోచించేవాళ్లే చాలా తక్కువ...

కానీ ఈ మాత్రం సాయం కూడా వాళ్లకి ఆసరాయే... సుదర్శన గారికి నమస్సులు.. ఇంతకంటే ఏం చెప్పలేను...

హితైషి చెప్పారు...

జీవితంని జీవించాలంటే ఎన్ని తట్టుకుని నిలబడాలో ఈ కథ చెపుతుంది. ఎందఱో సుదర్శనలు కళ్ళ ముందు మెదిలారు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ.. మీరన్నది నిజమండి. మీ స్పందనకి ధన్యవాదములు.

@రాజీ గారు.. అందరూ జీవన మాధుర్యం అనుభవిస్తూ బ్రతకలేరు. సుదర్శన లాగా బ్రతుకుతూ ఉంటారు ఇది సత్యం.

@శోభ గారు కథనం నచ్చినందుకు ధన్యవాదములు.ఇలాంటి కథలు ని సృశిస్తూ .. నా బ్లాగ్ ప్రయాణం సాగుతుంది.

@వైష్ణవి గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.

SRINIVASA RAO చెప్పారు...

simply superb...Ikaaa chadavalenu..mee blog...stories..heart touching..excellent..thanks