9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మర్యాద వారోత్సవాలు

చాలా రోజుల తర్వాత బసెక్కి ప్రయాణం చేయాల్సిన అవసరమొచ్చింది ఆమెకి. ఒకింత అయిష్టంగానే బస్టాప్ కి బయలుదేరింది.  అప్పుడే స్టాప్ లో ఆగి ఆగనట్లు ఆగి వెంటనే కదులుతున్న బస్ ని హడావిడిగా యెక్కేస్తూ  రెండు నిమిషాలకి వొక బస్ వస్తూనే వుంది అయినా అందరకీ  తొందరే ,వేగవంతమైన ప్రపంచం రాష్ట్ర రోడ్డు సంస్థ నడిపే బస్సుల్లో కనబడుతుంది అని.

బస్ అంతా కిక్కిరిసి వుంది. పిల్లలని చంకనేసుకున్న తల్లులు, తల్లులు కన్నా భుజాలపై  పుస్తకాల సంచుల భారాన్ని మోస్తున్న పిల్లలు, భుజానికి హ్యాండ్ బేగ్ తగిలించుకుని పై రాడ్ ని పట్టుకుని వ్రేలాడుతున్న వుద్యోగినిలు, స్త్రీలకి కేటాయించిన సీట్లలో దర్జాగా కూర్చుని చోద్యం చూస్తున్న పురుష పుంగవులు. ఇది రోజూ కనబడే పరిపాటి దృశ్యాలు. టికెట్ తీసుకుంటూ కండక్టర్ ని అడిగింది ఆమె. మేడమ్ ! యింతమందిమి ప్రయాసపడుతూ  నిలబడి  ప్రయాణం చేస్తుంటే లేడీస్ సీట్లు ఖాళీ చేయించరేమిటీ ?

రోజూ యిదే పరిస్థితి, మీ మాట  మేము వినేదేమిటీ  అన్నట్లు చూస్తారు. ఒకోసారి గంటల తరబడి మేము నిలబడి ప్రయాణం చేస్తూనే వున్నాం. పదినిమిషాలు  ఆమాత్రం నిలబడి ప్రయాణం చేయలేరా ఆకాశంలో సగమంటూ బ్యాగులు తగిలించుకుని వుద్యాగాలకి బయలుదేరినవాళ్ళు అంటూ నోరు పారేసుకుంటున్నారు. ఎంతమందితో వాదించగలం ? నా డ్యూటీ నేను చేయాలికదా ! మీరే అడిగి సీట్లు ఖాళీ చేయించుకుని కూర్చోండి అంటూ ముందుకు వెళ్ళింది లేడీ కండక్టర్.

ఆమె బస్ అంతా పరికించి చూసి స్త్రీల సీట్లలో కూర్చున్నవారిని సీట్లు ఖాళీ చేయమని అడిగింది. మనసులో తిట్టుకుంటూ లేచి సీట్లిచ్చారు కొందరు. కొంతమంది సర్దుకుని కూర్చున్నారు. మరొక సీట్ లో ఒక స్త్రీ -పురుషుడు కూర్చుని వున్నారు. భార్యాభర్తలు కాబోలు, వారిని విడదీయడం యెందుకులే  అని యెవరికి వారు  వూరుకున్నారు. అలాగే ఇరవై నిమిషాలు ప్రయాణం సాగింది. మధ్యలో సెల్ ఫోన్ల రొద. కారుతున్న చెమట వరద. ఇంట్లో చెప్పుకోవడానికి సమయం లేనట్లు ఆడంగుల సొద. అబ్బా .. నరకమంటే ఇదేనేమో.  డ్రైవర్ బాబూ .. తొందరగా పద పద ఆమె మనసులో విసుక్కుంది. వెహికిల్ మీద వెళితే పావు గంట పట్టే ప్రయాణం. ప్రతి స్టాపుకి ఆగి ఆగి ముప్పావు గంట పడుతున్న  ప్రయాణం యిది. ఛీ వెదవది ..అంతా ఆలస్యమే, అందుకే బస్ యెక్కనిది అని తనని తానే  తిట్టుకుంది.   

అంతలో షడన్ బ్రేక్ తో బస్ ఆగింది. చంకలో ఉన్న పిల్లతో సహా తల్లి పడిపోయింది. ఆమెని లేవదీసి దెబ్బలేమైనా  తగిలాయేమో నని చూస్తూ ..ఏమిటయ్యా ఈ షడన్ బ్రేక్ అని అరిచింది ఒకావిడ. ముందు రోడ్డు పై చూడండి. మూడడుగుల యెత్తు వున్న  డివైడర్ ని కూడా అవలీలగా దూకి యెక్కడ బడితే అక్కడ హఠాత్తుగా రోడ్డు దాటేస్తుంటే బ్రేక్ వేయక యే౦ చేయాలి. జనాన్ని గుద్ది చంపేస్తామా ? బుద్ధి లేదు  జనాలకి " అంటూ పైకి అని తర్వాత వినబడకుండా తిట్టుకుంటూ ఉంటూంటే సందట్లో సడేమియా అన్నట్లు అరవై యేళ్ళు పైబడిన వృద్దుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన బస్ లోకి యెక్కబోయాడు. ఎత్తుగా వుండే బస్ మెట్టు యెక్కలేక రాడ్ పట్టుకుని యెక్కడానికి ప్రయత్నించే లోపే బస్ కదిలింది. ఒక కాలు బయట ఇంకో కాలు లోపల  పెట్టి సర్కస్ ఫీట్లు చేస్తూ .. సరిగా యెక్కనీయకుండా యేమిటయ్యా ఆ తొందర  అని అరుస్తున్నాడు.  యేమిటండీ .. యెక్కనిచ్చేది, మీ యిష్ట ప్రకారం యెక్కడబడితే అక్కడ యెక్కేయడమేనా, మా ప్రాణాలు దీయడానికి బయలుదేరతారు అంటూ విసుగుతో కూడిన తిట్ల దండకం మొదలెట్టాడు డ్రైవర్. వృద్దులు,పిల్లలు యెక్కే౦దుకు తక్కువ యెత్తులో వుండే put board అవసరం గురించి అప్పటిదాకా మాట్లాడుకున్న  వారు కూడా ఆ  పెద్దాయనకి లేచి సీట్ యివ్వలేదు. ఆయనలాగే రాడ్ పట్టుకుని వ్రేలాడుతున్నాడు. అంతలో బస్ ఆగింది. యెవరు దిగుతారో సీట్ ఖాళీ అవుతుందా అని వెదుక్కు౦ది. భార్యభర్తలిద్దరూ కూర్చున్నారని అనుకున్న సీట్ లో నుంచి ఆ స్త్రీ లేచి నిలబడింది. అమ్మయ్య సీట్ దొరికింది అనుకుని ఆమె అటువైపు అడుగులేయబోయింది.

స్టాప్ లో  ఆమె ఒక్కతే బస్ దిగి వెళ్ళింది. అతను అలాగే సీట్ లో కూర్చుని వున్నాడు. వాళ్ళ వెనుక సీట్ లో కూర్చున్న వొకాయన బస్ కదలబోతుంది దిగరేమిటీ అనడిగాడు. ఈ రోజు కొంచెం పని వుంది. మార్కెట్ కి వెళ్లి పని చూసుకుని వస్తాను అన్నాడు. అప్పుడు అనుమానం వచ్చింది ఆమెకి. అప్పటివరకూ అతి ప్రక్కన కూర్చుని ప్రయాణం చేసిన ఆమె ఇతని భార్య కాదు. తోటి ప్రయాణికురాలు మాత్రమే అని నిర్దారించుకుంది. దిగి వెళ్ళిపోయిన స్త్రీ రూపాన్ని గుర్తుకుతెచ్చుకుంది. చాలా సాధారణంగా వుంది అయినా యెలాంటి బిడియం లేకుండా పరాయి పురుషుడి ప్రక్కన  గంటకి పైగా కూర్చుని ప్రయాణం చేసింది. బస్ లో మిగతా  వుద్యోగినులు అతని ప్రక్కన సీట్ ఖాళీగా వున్నా కూర్చుని ప్రయాణం చేసే సాహసం చేయలేకపోతున్నారని అనిపించి "ఇక్కడ వ్రేలాడుతున్న ఆడవాళ్ళ అవస్థ చూసైనా మీకు సీట్ ఖాళీ చేయాలనిపించడం లేదా అనడిగింది. కూర్చోమనండి, నేనేమైనా వద్దన్నానా ? మీరైనా కూర్చోవచ్చు అన్నాడు. అతని మాటల్లో వ్యంగ్యం గుర్తించి వోల్లుమండి పోయింది ఆమెకి. యెంత పొగరు వీడికి స్త్రీల పట్ల యింత చులకన భావమా ? మర్యాద వారోత్సవాలు జరిపి స్త్రీలకి కేటాయించిన సీట్లు వారికే ఇవ్వమని, స్త్రీలని గౌరవించమని చెవుల్లో శంఖం వూది మరీ చెప్పారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు . అవన్నీ శుద్ధ దండగ అని ఆలోచిస్తూ వుంది.

ఇంతలో ట్రాఫిక్ కి అంతరాయం కల్గింది. రెండు వైపులా వాహనాలు బారులు బారులుగా నిలిచిపోయాయి. ఏమిటా అన్న ఆసక్తితో బయటకి చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  మహిళలు జరుపుతున్న  ప్రదర్శన.  మహిళపై జరుగుతున్నా లైంగింక వేధింపులు ,ఈవ్ టీజింగ్ , వరకట్న వేధింపులు, మహిళా రిజర్వేషన్లు గురించి యెలుగెత్తి నినదిస్తూ సాగుతున్న ప్రదర్శన పట్టుమని వందమంది కూడా లేని లేమి తనం. మహిళా సమస్యల గురించి వేదికలెక్కి ఉపన్యసించే టపుడు అందరూ సమైక్య వాదులే,మాహిళాభివృద్ధి  కాంక్షించే వాళ్ళే ! కానీ వారితో నడవడానికి వొక్క పురుషుడు కానరాడు. ఇలా అంత రంగంలో తలపోస్తున్న ఆమెకు వెనుకనుండి స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. వీళ్ళకి వొళ్ళు బలిసి హద్దు అదుపు లేకుండా రోడ్డున పడ్డారు. ఇంట్లో మగవాళ్ళు చవటలు కాబట్టి ..అనుకుంటున్న మాటలు వొంటికి  కారం రాసుకున్నట్లు అనిపించింది.  బస్ లో సగానికి  పైగా మహిళలున్నా యెవరూ ఆమాటలు విననట్లే నటించారు. ఎవరెవరితోనో వాదన మనకెందుకన్నట్లు.

స్త్రీలు నిలబడి ప్రయాణం చేస్తున్నారు తప్ప పురుషుడి ప్రక్క సీటు ఖాళీగా వున్నా కూర్చునే సాహసం చేయరు. ఇందాకటి స్త్రీ పెద్దగా చదువుకున్నట్టు కూడా లేదు.అయినా యెంత సహజంగా దైర్యంగా కూర్చుని ప్రయాణం చేసింది. నాలాంటి వారికి యెన్నెన్ని సంశయాలు, యెంత బిడియం. రైల్లో అయితే పర్లేదు కానీ బస్ లో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణం చేసే సాహసం స్త్రీలలో యింకా రాలేదు అపర్ణాసేన్ మిస్టర్ అయ్యర్ & మిసెస్ అయ్యర్ చిత్రంలో కూడా హీరోయిన్ వేరొక పురుషుడి ప్రక్కన బిడియపడుతూ కూర్చున్న వైనం గుర్తుకొచ్చింది అప్రయత్నంగా ఆమెకి.  పొరబాటుగా శరీరాలు తగిలనంత మాత్రానే అపవిత్రమయిపోతామన్న భయం స్త్రీలకి మాత్రమేనా ? లేక ఆ స్త్రీలకి సంబంధిన మగవాళ్ళది కూడానా అనుకుంటూ కాళ్ళు నొప్పి పుడుతున్నట్టు అనిపించి .. పురుషుడి ప్రక్కన ఖాళీగా వున్న సీట్లో టక్కున కూర్చుంది.

 ఆమె అలా కూర్చోగానే బస్ లో వున్న కొందరి చూపుల్లో ఆశ్చర్యం, నొసలు చిట్లించడం గమనించింది. కూర్చునే ముందు లేని ఆలోచన అప్పుడు కల్గింది ఆమెకి . ఎవరైనా తప్పు పట్టినా పట్టించుకోకూడదు అనుకుంది దృఢ౦గా . ఇంకో స్టాప్ రాగానే మరికొన్ని సీట్లు ఖాళీ అయ్యాయి. అయినా ఆమె అతని ప్రక్క నుండి లేచొచ్చి ఖాళీ అయిన సీట్లో కూర్చోలేదు.ఇలాంటి విషయాల వల్లే స్త్రీ చాలా వెనుకబడి వున్నారనిపించింది. ఏ వాన కురిసినప్పుడో , బంద్ ప్రకటించినప్పుడో, ట్రాఫిక్ జామ్ అయినప్పుడో త్వరగా యింటికి చేరాలని ఆదుర్దా  అవసరం వున్నప్పటికీ కూడా యెవరి వాహనంలో అయినా లిఫ్ట్ అడగాలంటే భయం. లిఫ్ట్ యివ్వాలన్నా సంశయం. ఆకాశంలో సగం అన్నది యెంత అబద్దం. మనం యెదిగింది యెక్కడ? కేవలం ఆలోచనల్లో మాత్రమేనా? ఆలోచనల్లోనే కాదు ఆచరణలో కూడా అన్నది యెవరో వొకరు దైర్యంగా నడిచి చూపాలి అనుకుని దైర్యంగా సర్దుకుని కూచుంది. బస్టాండ్ కి వచ్చి ఆగింది బస్. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు యెవరి తొందరలో  వారు . ప్రక్కన కూర్చున్న పురుషుడు కూడా వేరే సీట్లో కూర్చునే ప్రయత్నం చేయలేదు.

మళ్ళీ అనేక ఆలోచనలు. మనం నిజంగా నాగరికత సాధించామా, నాగరికత అనేది మన వేష భాష ల్లోనే కానీ, మన ఆలోచనల్లోనే కానీ ఆచరణలో మాత్రం శూన్యం అనుకుంటుండగా యెవరి పలకరింపుకో  వులికిపడింది.కాస్త పరిచయం వున్న మనిషే ! నవ్వి బాగున్నారా అని అడిగింది. మార్కెట్ కా అనడిగింది ఆమె. అవును అంది ..ప్రక్కన  యెవరూ .. అర్ధోక్తిలో ఆగింది ఆమె . మావారు కాదు అందామె. మరి ఆశ్చర్యంగా చూసింది . కొద్ది క్షణాల తర్వాత ఫ్రెండ్ ..ఆ ..అని అడిగింది. నా ప్రక్కన కూర్చున్నతను యెవరో చెపితే కానీ ఆ రాత్రికి ఆమెకి నిద్రపట్టదేమో అన్నంత యిదిగా అడుగుతుంటే  "కాదండీ .. నా తోటి ప్రయాణికుడు " అంతే అంది. ఆవిడ ముఖంలో మళ్ళీ టన్నుల కొద్దీ ఆశ్చర్యం. అంతలోకి మార్కెట్ రానే వచ్చింది.అందరూ దిగే పనిలో వున్నారు.ఆమె మాత్రం ఆఖరిన నిలబడి యెదురుగా కనబడుతున్న డిపో మేనేజర్  ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంది. ఎందుకమ్మా  నెంబర్ వేసుకుంటున్నారు అనడిగాడు డ్రైవర్. మీ మీద రిపోర్ట్ చేయడానికి కాదులే ! మర్యాద వారోత్సవాల ఫలితాలు గురించి చెపుదామని అని బస్ దిగిపోయింది ఆమె.


1 కామెంట్‌:

buddhamurali చెప్పారు...

వనజవనమాలి గారు rtc ఇంతే అనుకోని తిట్టుకొని వదిలేయడానికి బదులు ఇలాంటి తీరు పై పిర్యాదు చేయాలి. దాంతో అంతా మారిపోతుందని కాదు కొంతైనా మార్పు తప్పాకుండా ఉంటుంది . పిర్యాదు చేస్తే కొంతవరకైన ఫలితం ఉంటుంది