24, సెప్టెంబర్ 2011, శనివారం

కరిగి ప్రవహించిన పాట. ఆ పాట రచయిత జాలాది.


నెమలి కన్ను బ్లాగ్లో   మురళి  గారి లేడి చంపిన పులి నెత్తురు కథ  పరిచయం గురించి చదవగానే నాకు వెంటనే  "యాలో యాలో ఉయ్యాల"  పాట గుర్తుకు వచ్చింది.పాట రచయితా గుర్తుకు వచ్చారు.  

 ఎప్పటి నుండో పాటల రచయిత జాలాది గారి గురించి ఓ..మాట వ్రాయాలని అనుకుంటున్నాను.ఇంతలో..ఇలాను గుర్తుకు వచ్చింది. 

 జాలాది గారిని నేనొక  సభలో.. చూడటం తటస్థించింది.  సుద్దాల అశోక్ తేజ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా పురస్కారం   అందుకున్న తరుణంలో.. విజయవాడలో..వారికి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.  ఆ కార్యక్రమంలో.. మా శబ్దాలయ మిత్రమండలి వారు భాగస్వామ్యం కూడా ఉంది. . ఆ సందర్భంలో.. జాలాది గారు ఒక ముఖ్య అతిధి.



జాలాది గారు  విచ్చేసారని రేడియో అనౌన్సర్ బి.జయప్రకాష్ గారు చెప్పడం .. మీరు వెళ్లి మాట్లాడండి అని చెప్పడం నాకు చాలా సంతోషం కల్గించింది . ఎందుకంటే జాలాది గారి పాటల గురించి చాలా సందర్భాలలో.. రేడియోలో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావించు కోవడం  వల్ల జయప్రకాష్ గారు అలా నాకు చెప్పడం జరిగింది. సరే ! ఇదొక  మంచి అవకాశం అని నేను వారి దగ్గరకు త్వర త్వరగా వెళ్లాను. వారి అమ్మాయి విజయ కూడా నాకు పరిచయం ఉండటం మూలంగా.. వారితో మాట్లాడటం  చాలా సులువు అయింది.

వారిది స్పురద్రూపం అనవచ్చో అనకూడదో కానీ నల్లని రంగు. ఆజానబాహువు.   వారి స్వస్థలం దొండపాడు అయినా పశ్చిమ కృష్ణా జిల్లా యాసలో..మాట్లాడారు.  సర్ ..మీది నందిగామ !? అని అడిగాను. నాకు వారు తెలిసినప్పుడు  నందిగామలో ఉండే వారు . కాదమ్మా అంటూ..చాలా ఓపెన్గా, ఓపికగా ఆప్యాయంగా  చాలా విషయాలు చెప్పారు. అరగంటసేపు వారితో మాట్లాడినంతసేపు  వారు వ్రాసిన యాతమేసి తోడినా సాహిత్యమే నా మదిలో మెదిలింది. వారి బాల్యము,వారి రచనా వ్యాసంగం గురించి నేను చెప్పడం కన్నా   ఇక్కడ     లింక్లో చూడండి.

 "దేవుడే గెలిచాడు "చిత్రంలో.. "ఈ కాలం పది కాలాలు బ్రతకాలని" పాట దగ్గర నుండి..  "చల్ మోహనరంగ" చిత్రంలో..ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు, యాతమేసి  తోడినా, ఎలియాల్లో ఎలియాల్లో.. ఓలమ్మి తిరణాల గిలక, .    పుణ్యభూమి నాదేశం నమో నమామి,"సుల్తాన్" జనగణ జనయిత్రి నా భరతభూమి   వరకు ..ఎన్నో ఆసక్తి కర విషయాలు చెప్పారు. పాటలు గురించి తెలుసుకోవడం అంటే..నేను పాటలు వినడం ద్వారానే.. అదీ  ఒక్క ఆకాశవాణిలో..వినడమే నండీ..అని నేను చెప్పగానే ఆశ్చర్యపోయారు.

చూరట్టుక్కు జారతాది....చిటుక్కు చిట్టుక్కు వాన చుక్క (పల్లెసీమ),అలాగే దీపమేలా వెలిగేది నూనె లేనిదే..ఈ పాపలెలా   పెరిగేది నాన్న లేనిదిలే..(అత్తగారి పెత్తనం ),ముసి ముసి నవ్వులలోన (బ్రహ్మ) తల్లులారా తండ్రులారా (రేపటి పౌరులు) సందె పొద్దు అందాల్లున్న చిన్నదీ..ఏటిమీద  తానాలాడుతున్నదీ  ఉన్నదీ(తూర్పు వెళ్ళే రైలు) కాకమ్మ కాకి(వారాలబ్బాయి) ఇలా ఎన్ని పాటలు గుర్తు చేసుకున్నారో!

వారి  గీత రచనా వైభవం గురించి చెబుతూ.. జాలాది పాటలా..అయితే ఆ చిత్రం హిట్టే! అనేవారట. జే క్యూబ్ అని వ్యవహరించేవారట. అంటే జాలాది+జేసుదాస్+జయసుధ లేదా జయమాలిని..అని అట, అంటే.. అంత విభిన్నంగా సాహిత్యం అందించగలరని అనే ఉద్దేశ్యంతో.. ఇతరులు అన్నమాట, ఉన్నమాట.   నిజమే కదా..!  యాతమేసితోడినా ,అభినవ శశిరేఖవో ..రాసినట్లే .  చాలా  చిత్రాలలో క్లబ్ సాంగ్స్ కి వారు సాహిత్యం అందించారు. జానపద సాహిత్యం జాలాది పాటల్లో..చాలా హృద్యంగా ఉంటుంది. పల్లియ్యల్లో.. మన  ప్రక్కనే  ఉండి   ఎంకి-నాయుడు బావ  కలసి పాడుకున్నట్లే.. "ఆ మూడు ముళ్ళే యరో నూరేళ్ళ పక్కేయ్యరో.."ఎంత మంచి ప్రయోగమో!  నాకు అది యెంత ఇష్టమో..చెప్పలేను.   

అలాగే ముగ్గురు కృ ష్ణలకు కృష్ణ,కృష్ణంరాజు,బాలకృష్ణ కు  పాట రాసానని, మూడుతరాలకు పాట రాసిన ఘనత తనదే అని చెప్పారు. యెన్.టి.ఆర్ .హరి కృష్ణ . జూనియర్ యెన్ టీ.ఆర్ కు కూడా.. ఇంకొక విషయం ఏమిటంటే..ఆయన ఎవరికి పాట వ్రాయకుండా (మోహన్ బాబు చిత్రాలకు మాత్రమే వ్రాసే విధంగా) ఒప్పందం కుదుర్చుకున్నరటగా  అని అడిగితే..అంత లోతు వద్దమ్మా అన్నారు... మాట దాటేస్తూ..  కానీ ఒక దశకంలో..నిజంగా అలాగే వ్రాయడం జరిగిందట కూడా.

కానీ  ఒక ఆసక్తి కర విషయం చెప్పారు. "పెదరాయుడు" చిత్రంలో..ఓ.. పాట వారి రచన .కానీ చిత్రం విడుదలైనాక చూస్తే..వేరే వారి పేరు ఉందని .. అప్పుడు చాలా బాధ కల్గినదని చెప్పారు. ఆ పాట ఏదో..ఆయన రచనా శైలి తెలిసినవారు గుర్తించవచ్చు కూడా.. అతివల కందరికి  ఇష్టమైన పాట అది.

ఇంకొక విషయం ఏమిటంటే.. అలలు కదిలినా పాటే..కలలు చెదిరినా పాటే  ఏ పాట నే పాడను (సీతామాలక్ష్మి ) పాట వారి రచన కాదు ..ఆ పాట వేటూరి గారే  వ్రాసారని చెప్పారు.  ఒక్కసారి అయినా తీరిక చేసుకుని విశాఖ పట్నం  వెళ్ళాలి వారితో..ఇంకా  పాటల గురించి  చాలా చాలా మాట్లాడాలి అనుకున్నాను ఆ క్షణాన.

కొంచెం ఆలస్యంగా సభ ప్రారంభం అవడం మూలగా నాకు వారితో..మాట్లాడే అదృష్టం కల్గింది. తర్వాత సభలో.. వారు మాట్లాడేటప్పుడు "యాతమేసి తోడినా" పాట ఆయన గళం లో వినిపించారు. యెంత భావ గాంభీర్యం వేదన జనియించాయో..ఆ గళంలో.. నేను ఎప్పటికి మరువలేను.  ఆ పాటకి 10 నిమిషాల పాటు ఆడియన్స్ కరతాళ ధ్వనులు..

కొంతమంది స్త్రీల దుఃఖచ్చాయలు..  విపరీతమైన మేకప్ తో..కళా క్షేత్రం  అంతా తానే అయి తిరిగి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించిన ఒక వనిత   అప్పటిదాకా చాలా హడావిడి చేసిన ఆ  వనిత  మేకప్ అంతా చెరిగిపోయేంతగా వెక్కి వెక్కి ఏడవడం ఒక విశేషం అన్నమాట.

ఇరువది అయిదు నిమిషాల ఆయన ప్రసంగాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం రికార్డు చేసినట్లు గుర్తు. ఆయన ప్రతి పాట జనరంజకమే! శ్రోతల హృదయాలలో..ముద్రించుకునే ఉంటుంది.

"సుఖీ భవ సుమంగళి ' మేజర్ చంద్ర కాంత్ లో.పాట వ్రాసి కన్నీరు పెట్టించారు. ఇప్పుడు వారు ఐదు  ఆరు రోజులుగా హాస్పిటల్ లో..కోమా స్థితి లో..ఉన్నట్టు   తెలుసుకుని.. చాలా బాధ పడుతూ.. ఇంకా ఆయన మస్తిష్కంలో..భావాలు కొట్టు మిట్టాడుతూ..పాట వ్రాయమని ప్రేరేపిస్తూ ఉన్నాయేమో..అన్నట్టుగా ఉంది నాకు.              
నాకు  ఇష్టమైన వారి పాటల్లో.. ఒకటి ఇక్కడ..


ప్రాణం ఖరీదు చిత్రంలో.. ఈ పాట

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు  (యాతమేసినా)
దేవుడి గుడిలోదైనా పూరి గుడిసేలోదైనా 
గాలి ఇసిరి  కొడితే ఆ దీపముండదు ఆ దీపముండదు  (యాతమేసి)

పలుపు తాడు మేడకేత్తే పాడి ఆవురా    
పసుపు తాడు మెడకేస్తే   ఆడదాయేరా (ప)
కుడితి నీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాది 
కడుపు  కోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాది 
బొడ్డు   పేగు తెగిపడ్డ   రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం  తెలుసుకో (యాతమేసి ) 

అందరు నడిసోచ్చిన తోవ ఒక్కటే 
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే(అందరు )

మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా   
నిదర ముదర  పడినాక  
పాడే ఒక్కటే వల్లకాడు ఒక్కటే 
కూత నేర్సినాళ్ళ కులం కోకిలంటరా          
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా  (యాతమేసి)



ఎన్ని పాటలో, ఎన్ని ముద్రలో!? విజయ ని (వారి మూడో అమ్మాయి)  కలిసినప్పుడల్లా ..  ఇలా  అనే దాన్ని   "ఎంతటి అదృష్టవతురాలివి.. అంతటి వారికి కూతురిగా పుట్టడమే కాదు మీ నాన్న గారి భావసంద్రాన్ని, ఆవేశాన్ని పుణికి పుచ్చుకున్నావని."  ..

ఇంత కన్నా ఇప్పుడేం చెప్పలేను...
మనిషి కి మరణం ఉంటుంది కానీ..భావాలకి కాదని 
సజీవ ఆలోచనల కి  వారి పాట ఓ.. ఆనవాలు అని.  
ఆలోచనల హిమం కరిగి ప్రవహించినవి  పాటలని .
ఆ పాటల  రచయిత జాలాది.,,అని.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"యాతమేసి తోడినా..." పాటని ఇన్నాళ్ళుగా వింటూ ఆ సాహిత్యాన్ని మనసులో అభినందించానే కాని, గీత రచయిత జాలాది గారని తెలుసుకోలేదు. ఆయన రాసిన మంచి పాటలు తెలిపారు. ధన్యవాదాలు. I Wish him very speedy recovery.
రామకృష్ణ

తెలుగు పాటలు చెప్పారు...

manchi song dhanyavadhamulu vanaja garu

జ్యోతిర్మయి చెప్పారు...

జాలాది గారిని పరిచయం చేసి, మంచి పాటల్ని గుర్తు చేశారు వనజ గారూ..
"సందపొద్దు అందాలున్నా చిన్నదీ.." ఈ పాట చాలా సార్లు విన్నాను కానీ,ఇది జాలాది గారు వ్రాశారని తెలియదు.

vishnu చెప్పారు...

chala baadha kalginche paata. chala paatalu chepparu.manchi patalu chebutharu meeru.thanks andi.

rajasekhar Dasari చెప్పారు...

క్రొత్త నీరు లోని పాటలు ఒక క్రొత్త ప్రయోగము. మీరు ఇచ్చిన వాటిలో కొన్ని పాటలు విన్నాను గాని జాలాది గారు వ్రాసినవని తెలియదు . చక్కటి జ్ఞాపకాలను గుర్తు చేసారు , వందనములు.