నా అభిమాన కవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా అభిమాన కవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జనవరి 2013, గురువారం

స్నేహ గీతి

స్నేహం  లేకుంటే.. జగమే జడ పదార్ధంలా తోస్తుంది కదా!

స్నేహం గురించి ..నా అభిమాన కవి.. స్నేహ గీతి ఇది.

నేను ఎప్పుడు మరువనిది. నిరంతరం  నా పెదవులపై నలిగేది ..

 ఒక్క పలకరింపు చాలు కదా! 
పెదవులపై నవ్వులు విరబూయడానికి,
పదములుగా  కవిత్వం జాలువారడానికి 


తైలాలు లేకుండా వెలిగేటి దీపం
విద్యుత్ లేకుండా వేలిసేటి దీపం
హృదయాలలో ఎప్పుడూ నిలిచేటి  దీపం
నిజమైన దీపం మా స్నేహ దీపం

వర్ణాలు వర్గాలు వదిలితే స్నేహం
వేషాలు దోషాలు మానితే స్నేహం
ప్రాణాలు అర్పించగల్గితే స్నేహం
కష్టాలు నష్టాలు ఓర్చితే స్నేహం

నిరుపేద అయితే ఏమి ఎవడైతే ఏమి
చదువేమి రానట్టి చవటైతే నేమి
అందాలు చందాలు లేకుంటే ఏమి
నిన్ను కాచినవాడే నిజమైన నేస్తం

దోస్తిని మించినది లేదు జగాన
రత్నాలు కంటే మిన్న అది లోకాన
మిత్రుడే కావాలి సుఖమున,శోకాన 

అతడు లేకున్నచో నగరమే కాన-

చీకటిలో దారి చూపేది నేస్తం
కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తం
మనలోని లోపాలు తెలిపేది నేస్తం
నిజమైన మనిషిగా నిలిపేది స్నేహం..
                                                        - దాశరధి

నా  ఈ నడకలో తోడైన నా మిత్రులందరికీ  ఈ స్నేహ గీతంతో నా మనసు మాట వెల్లడిస్తూ.. మనసారా ధన్యవాదములు.




7, జూన్ 2012, గురువారం

"పెన్నేటి పాట"

నాకు ఎంతొ పరిచయం ఉన్న "పెన్నమ్మ" రంగని పాదాల చెంత.... పరవళ్ళు త్రొక్కుతూ...

ఓ..పది పన్నెండేళ్ళ పాటు పెన్నమ్మ ప్రక్కన నివశించి ఆ పైర గాలులని,ఆప్పుడప్పు వినిపించే వరద ఉదృతి ని జవిజూచిన అనుభవం నాకుంది.

నేను పెళ్లికూతురిగా నా భర్త వెంట పెన్నని దాటి కొంచెం ముందుకెళ్ళి రైలు దిగాను మళ్ళీ వెనక్కి వచ్చి పెన్నమ్మ ప్రక్కనే నా వైవాహిక జీవితం మొదలెట్టాను.

పెన్న లోని తెల్లని మెత్తని ఇసుక నాకు చాలా అబ్బురంగా తోచేది.

ఎందుకంటే ఇక్కడ కృష్ణ లో ఇసుక గండ్ర ఇసుక కొంచెం గోధుమ వర్ణంలో ఉంటుంది. ఆ గరుకు తాలూకు గండ్ర తనం గుప్పిట లో నుండి జారిపోతుంది.కానీ పెన్న లోని ఇసుక మెత్తగా తెల్లగా చల్లగా ఉంటుంది. మా బీడు భూముల్లో నుంచి పెన్న వొడ్డు కి అలా వ్యాహాళికి వెళ్ళినప్పుడు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు కనిపించే ఏటి దృశ్యం ఒక్క పాయ అయినా ప్రవహించక ఎడారి బయలు అనిపించే దృశ్యాలు ఎన్నో వందల సార్లు చూసిన అనుభవం. ఈ పెన్న ఎప్పుడు పరవళ్ళు త్రోక్కడం చూడగలం? అనుకోకుండా వచ్చే వరదల్లో తప్ప..అనుకునే వాళ్ళం. వరద వచ్చి తగ్గిపోయాక చూస్తే.. అర ఎకరం దాక నదిలో కలిసిన వైనం ని చూసి యేరు మింగేసింది అనుకునేవారం.

సారవంతమైన భూములు లలో నీటి జాడ లేక బీడు నేలలో.. ఏ ఆకు కూరలో పండించుకుని పొట్ట బోసుకునే చిన్న కమత గాళ్ళు, వందల అడుగుల లోతులకు బోర్లు వేసి ఆ నీటి తో సేద్యం చేసే రైతులు ..ఆ రైతుల కుటుంబం లో ఒక కుటుంబం మాది.

పెన్న తీరాన రైతన్నల కడగండ్లు చూసినప్పు డల్లా నాకు పెన్నేటి పాట గుర్తుకు వచ్చేది. నెల్లూరు నుండి వెలువడే జమీన్-రైతు లో నేను మొట్ట మొదటిసారిగా "పెన్నేటి పాట " గురించి చదివాను.

అప్పుడు విద్వాన్ విశ్వం గారు మరణించిన సమయంలో పరిచయం చేస్తూ పెన్నేటి పాట గురించి ఉదాహరించి నట్లు జ్ఞాపకం.

ఇప్పుడు విద్వాన్ విశ్వం ..గారి గురించి మన బ్లాగ్ లోకంలోనూ, విరివిగా పత్రికల్లో ను సమీక్షలు చూస్తున్నాము.

వారి గురించిన సమగ్ర విశ్లేషణ లో.. ఒక గ్రంధం ని కూడా తీసుకుని వచ్చారు.
సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పేరిట రచయితలు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్‌లు సంయుక్తంగా సేకరించి సంకలనం చేసిన పుస్తకమిది.

వారి గురించి సమగ్రంగా నాకు తెలియక ముందు నేను ఒకసారి "పెన్నేటి పాట " గురించి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం చేసిన "శత వసంత సాహితీ మంజీరాలు " కార్యక్రమం లో విన్నాను.

"పెన్నేటి పాట" గురించి ఆ కార్యక్రమంలో పరిచయం చేసింది.."భూమన్" గారు అని గుర్తు.

"రాయలసీమలో కరువు పిలిస్తే పలుకుతుంది ,అనంతపురం జిల్లాలో పిలవకుండానే పలుకుతుంది" అని విద్వాన్ విశ్వం గారు అనేవారట.

పన్నెండేళ్ళ క్రితం " పెన్నేటి పాట" వినడం తోనే ఒళ్ళు పులకరించింది. సమకాలీన పరిస్థితులని సాహిత్యం లో జొప్పించి రచనలు చేయడం ఆ రచనలు చదివి పాఠకులు ని ఆలోచించజేసి చైతన్యంగా ఉన్చాలనుకోవడమే సాహిత్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని నేను నమ్మడం వల్లనేమో.. "పెన్నేటి పాట " నాకు చాలా బాగా నచ్చింది.

ఎందుకంటే 1953 ప్రాంతంలో రాయలసీమ ప్రజా జీవనం పై కరాల నృత్యం చేసిన కరువు రక్కసిని కల్లు కట్టినట్లు చూపిన కరుణ రసాత్మక కావ్యం "పెన్నేటి పాట"

పెన్నేటి గట్టున జీవించే గ్రామీణుల బాధామయ గాధలు ఈ కావ్యంలో .కఠోర జీవిత వాస్తవాలు "పెన్నేటి పాట"లో కనబడతాయి.

"పెన్నేటి పాట" పద్య గేయ రూపాల సమ్మిశ్రితమైన ప్రజా కావ్యం . ఇది అయిదు సర్గలుగా విభజించబడింది.


ఆచార్య గంగప్ప గారు రాసిన పీఠికలో "ఈ కావ్యం లో ఉన్నది ఏ ఒక్కరి కథ కాదు.రాయలసీమ వాసుల అందరి కథ. రంగడు,రంగమ్మల జీవచాయలు రాయలసీమ వాసుల జీవితాలకి ప్రతీకలు. విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట "రాయలసీమ కన్నీటి పాట,విశ్వం గారి నేమ్మదిలోని మాట.విశ్వం గారి కైత కమ్మని యూట" అని పలికిన పలుకులు ప్రత్యక్షర సత్యాలు...అని చెప్పారు.

ఇక రాళ్ళ పల్లి వారు అయితే ఇలా అన్నారు. నా మిత్రులు విద్వాన్ విశ్వం గారు సీమ సీమ దైన్యం వల్ల కల్గినట్టి నిర్వేదం వల్లనే "పెన్నేటి పాట గా పరిణమించినది.విశ్వం గారిది మానవ హృదయం.ఊహ కన్నా.భావన కన్నా అనుభవమే మూలాదారముగా వెడలిన పరవశ రచన "పెన్నేటి పాట" అని వ్రాయడం జరిగింది.

"పెన్నేటి పాట' కావ్య నేపధ్యం రాయల సీమ. ఒకనాడు రాయల సీమ సర్వ సంపదలతో విలసిల్లినది.సకల కళతో వర్ధిల్లింది. వీధులలో రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళు అని చెబుతారు చరిత్ర కారులు. అలాంటి వైభవ భూమి అనావృష్టి వల్ల సంపదలు నశించాయి కళలు కళ తప్పాయి. పైరు పచ్చదనాలతో ప్రకాశించాల్సిన పొలాలన్నీ రాళ్ళు రాప్పలుతో నిండి పోయాయి.కరువు రక్కసి నృత్యం చేసింది.ప్రజల జీవితాలు దుర్భరం అయ్యాయి.కాదు దయనీయంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన మానవతావాది విశ్వం గారి హృదయం ద్రవీ భవించింది. కలం పట్టారు. సీమ ప్రజల నిజాయితీని,నిండు మనసుని,దండి తన్నాన్ని వర్ణించి అక్కడి వాతావరణం ని,పరిస్థితులని,భాషని కావ్య రూపంలో సాక్షాత్కరింప జేసారు.


రాయలసీమ పూర్వ వైభవం గతం.


కాని నేటి పరిస్థితి..దుస్థితి..కళ్ళముందు కనిపించే నిజం.

ఇప్పటి పెన్నలో నీటి హోరు జోరు రెండు లేవు. ఎక్కడ చూసినా ఇసుక మేటలు వేసి ఉంది.

చెమటలు కాలువ గట్టే టట్లు పారలతో త్రవ్వి త్రవ్వి తీసినా నీటి చుక్క కనబడని దుస్థితి.

కుండపోత వర్షాలు కురిస్తే వచ్చిన నీరంతా.. ఎండి ఎండి పోయిన ఇసుక లోకి ఇంకిపోతుంది. పెన్నా గట్టుకు సమీపం లో ఉన్న ప్రాంతంలో చిన్ని గాని ఉరితీత,సీతి గాని కారాగార వాసం,ఎంకి వైధవ్యం,ఎరుకలసాని శారీరక బాధ ,చలమన్న పాట్లు అక్కడ అడుగు వేసి అడుగు తీస్తే గుండెల్ని బద్దలు చేసే సంఘటనలు ని గుర్తుకు తెస్తాయని కవి వర్ణిస్తారు.

ఎన్నో ప్రాణులని మింగినా పెన్న నీరు కమ్మగా ఉంటుంది పెన్న నీటిని దోసిలి పట్టి ఒక్క సార్టి నోటిలో పోసుకుని పుక్కిలిస్తే చాలు జన్మకు సార్ధకత ఏర్పడుతుంది స్వచ్చత ప్రాప్తిస్తుంది .పెన్నా నీరు గగుర్పాటు కలిగిస్తుంది.మోసాలని తొలగిస్తుంది ఖండిత వాడిని చేస్తుంది కండలేక ఎండిపోయి బెండుగా మారిన నిజాయితీ ధర్మ దీక్షల్ని పండిస్తుంది ..అని పెన్న గొప్పదనాన్ని వర్ణించిన కవి..


అంతా మంచి పెన్న ఎందుకు ఎండిపోయింది ? ఇంతమందిని కన్నతల్లిలా కాపాడే పెన్న ఎందుకు ఎండిపోయింది?వంటలతో చింతించి ఆరి పోయిందో ,తన సంతతి కోసం మికిలి చింతించి మికిలి దుఖించడం వల్ల పెన్న నీరు ఇంకిపోయిందో అర్ధం కావడం లేదు.

పెన్నా నది నుంచి ప్రవహించే కాలువల్లోని ప్రతి నీటి బొట్టులోను రాయలసీమ రైతుల నెత్తుటి ఛాయలు ప్రతిబింబించి విషాదం కల్గిస్తాయి.
రైతులు రెక్కలు ముక్కలు చేసుకున్నా తగిన ఫలితాన్ని పొందలేక పోతున్నారనే కఠోర సత్యాన్ని మనం విస్మరించకూడదు.

నేటికి అదే పరిస్థితులు. అదే పెన్న తీరు.

విద్వాన్ విశ్వం రాయలసీమ కరువు రక్కసి ప్రతాపానికి గురైన తీరును ,పెన్నా నది ఎండి పోయిన రీతిని "పెన్నేటి పాట"ను కోటి గొంతుకల కిన్నెర మీటుకుంటూ,కోటి గుండెల కంజరి కొట్టు కుంటూ హృదయాన్ని ద్రవింపజేసేరీతిలో వినిపించారు.
(కిన్నెర అంటే వీణ లాంటి వాద్యం,కంజరి అంటే డప్పులాంటి వాద్యం )

సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం .."పెన్నేటి పాట " ని తప్పక చదివి తీరాల్సిందే.!
.
విద్వాన్ విశ్వం గారి రచనలు ఒకనాడు,విరికన్నె ,పాపం,రాతలు-గీతాలు,పెన్నేటి పాట, నా హృదయం వంటి లఘు కావ్యాలు రచించారు.కాదంబరి ,కిరాతార్జునీయం,దశకుమార చరిత్ర ,మేఘ సందేశం మొదలైన రచనలని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు.అలాగే గోర్కి,చెహోవ్,తుర్గిన్స్ లాంటి ప్రపంచ ప్రసిద్ద పొందిన రచయితల కదలని తెలుగులోకి అనువదించారు.

స్పష్టమైన రాజకీయ సామాజిక అవగాహన ఉన్న విద్వాన్ విశ్వం వివిధ పత్రికలో సంపాదకులుగా ఉంటూ
"అవి-ఇవి" , "తెలుపు-నలుపు" "మాణిక్యవీణ"వంటి శీర్షికలని నిర్వహించారు.

ఆ సాహితీ విరూపాక్షుడిని అద్దంలో కొంచెమైనా చూపించే సాహసం చేయడం కూడా చాలా ఇష్టంగా తోచింది.

ఉబుసుపోక కబుర్లు చెప్పుకునే వాళ్ళు ,కాలక్షేపం కోసం సినిమాలకి వెళ్ళే వారు..అందులో కొంత సమయాన్ని ,కొంత ధనాన్ని వెచ్చించి "పెన్నేటి పాట" లాంటి గేయకావ్యాన్ని కొని చదవడం వల్ల సాహిత్యంలో ..సృజించిన వాస్తవ పరిస్థితులని సాహిత్య ప్రయోజనాన్ని అర్ధం చేసుకోగల్గుతారు అని అనుకుంటాను.

పెన్నా ప్రక్కనే ఎప్పుడు ప్రయాణం చేస్తున్నా అక్కడి పరిస్థితులు చూసినా నాకు "పెన్నేటి పాట" గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత హృదయవిదారక కరుణ రసాత్మక కావ్యం .."పెన్నేటి పాట "

ఇక "పెన్నేటి పాట" లో విద్వాన్ విశ్వం గారు వర్ణించినట్లు కాకపోయినా మనోహరంగా ఉండే నేను చూసిన పెన్నమ్మ నిండు పరవళ్ళని చూడాలంటే కడప జిల్లాలో చెన్నూరు దగ్గర చూడాలి. రెండు కొండల నడుమ ఒదిగి ప్రవహించే సోమశిల ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. జొన్నవాడ కామాక్షి తాయి పాదాలను తడుపుతూ రంగ నాయకుడికి తన గల గలతో నిత్యం సేవిస్తూ.. ముందుకు కదులుతూ ఊటుకూరు వద్ద సాగరుని ఒడిలో కలుస్తుంది.


పెన్నమ్మతో ఉన్న అనుబంధం,"పెన్నేటి పాట " కావ్యం పట్ల ఉన్న ఆసక్తి,సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం గారి సమగ్ర పరిచయ గ్రంధం గురించి పరిచయాలు చూడటం వల్ల విషయం ని ఇక్కడ పంచుకునే విధంగా ప్రేరేపించింది.
నేను "పెన్నేటిపాట" గురించి పైన ఉదహరించిన భాగాలు..ఆచార్య నాగార్జున యూనివెర్సిటీ డిగ్రీ విద్యార్ధుల పాఠ్య భాగంలో నుండి సేకరించడం జరిగింది.
తప్పక "పెన్నేటి పాట" ని విద్వాన్ విశ్వం గారి గురించి "సాహితీ విరూపాక్షుడు" తప్పక చదవండి.

5, జూన్ 2012, మంగళవారం

"కిన్నెరసాని "

కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేనే చినుకై
కూనలమ్మ కునుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడ కట్టి
కొండమల్లెలే కొప్పున పెట్టి
వచ్చే దొరసాని మా వన్నెల దొరసాని
... ఇది పాటల తోటమాలి వేటూరి.. కలం రసరమ్య వర్ణన కూడిన నడకలు.
ఎవరా "కిన్నెరసాని"
తెలుగు వారందరికీ అత్యంత ప్రియమైన తెలుగింటి పూబోణి. విశ్వనాద కావ్య నాయిక
వారు వర్ణించి నంత కడు రమణీయంగా ఉంటుందా!?
నేను ఓ..ఎనిమి ఏళ్ళ క్రితం కే టి పి ఎస్ .(కొత్త గూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ) కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్న మా అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అనుకున్నమాట.
గుండాల కి దగ్గరలోనే మా అన్నయ్య వాళ్ళ నివాసం.
ఎప్పుడెప్పుడు "కిన్నెరసాని"డామ్ ని చూద్దామా అని ఒకటే ఆత్రుత. సాయంత్రం అవకముందే తొందరగా వెళ్ళాలని ఒత్తిడిచేసి..జీప్ లొ బయలు దేరాం.

అక్కడ కి వెళ్ళాక కిన్నెరసాని డామ్ పై కి వెళ్లి అంత మనోహరమైన జల సౌందర్యాన్ని,చుట్టూ ఉన్న పచ్చని అడవిని చూసి మది సంబరంతో పరుగులే తీశాను.
మా అన్నయ్య ..ఊరుకోమ్మా ! అందరు చూస్తున్నారు .ఏమిటి చిన్న పిల్లలా ఆ పరుగులు,గంతులు అని అనలేక అనలేక ..మా మేన కోడలని మందలించడం చూసాను.
"ప్రణవి'! ఈ సారి మీ నాన్నగారు లేకుండా ఇక్కడకి వద్దాం. అని నేను నా మేనకోడలు రహస్యంగా చెప్పుకుని...మా అన్నయ్యకి తోడుగా మా వదినని వదిలేసి డామ్ పై నడచుకుంటూ ఓ..కిలోమీటర్ దూరం పైనే పరుగులు తీస్తూ..అలుపు వచ్చినప్పుడు కాస్త ఆగి.. డామ్ లొపలకి దిగి కాళ్ళు చేతులు కడుక్కోవడం,నీళ్ళు చిమ్ముకోవడం చేస్తున్నాం.

అంతలో అమ్మా లొపలకి దిగ వద్దు..మొసళ్ళు ఒడ్డుకి వచ్చి ఉంటే ప్రమాదం అని హెచ్చరించాక..కాస్త మా ఆటవిడుపు చర్యలకి విరామం ఇచ్చి.. కాస్త గంభీరం అయిపోయాం. అలా ఆది పాడి అలసి కొన్ని ఫోటోలు తీసుకుని చీకటి పడుతూ ఉండగా అక్కడ సంచరించడం ప్రమాదమని చెప్పడంతో ఇక వెళ్ళక తప్పదనుకుంటూ అక్కడి నుండి తిరిగి వచ్చేసాం.

అనంతమైన సౌందర్యం.ప్రకృతి సంగీతం..నీటి అలల సవ్వడి..అరకొర మానవుల సవ్వడి.. వేరసీ యా దృశ్యం ఇప్పటికి నా కనుల ముందు కదలాడుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఆటవిడుపుగా వెళ్ళాలనుకుంటే చప్పుమని గుర్తొచ్చే ప్రదేశం కిన్నెరసాని. అక్కడ అభయారణ్యం ఉంది. ఎన్నో జంతువులూ ఆ అరణ్యం లో స్వేచ్చగా తిరిగే టప్పుడు మనం చూసే ఏర్పాటు కూడా ఉంది.

నేను తర్వాత చాలా సార్లు కిన్నెరసాని వెళ్లాలని ప్రయత్నించాను కాని వెళ్ళలేకపోయాను. కిన్నెరసాని చూసిన తర్వాత మరువ నాన్నా మరువలేము. నేను స్వయంగా చూడనప్పుడు కూడా కిన్నెరసాని పై ఒక గొప్ప అనుభూతి భావన ఉండేది. అది నిజం అయింది.

కిన్నెరసాని ని చూసిన తర్వాత విశ్వనాథ వారు కిన్నెరసాని ని వర్ణించిన తీరులో ఎంత భావ గంభీరం,ఎంత సౌందర్యం దాగి ఉన్నాయో కదా! అనిపించింది.

ఇక కిన్నెర సాని గురించి చెప్పాలంటే..


విశ్వనాధ సత్యనారాయణ గారి సొంత ఊరు కృష్ణా జిల్లా నందమూరు.అక్కడ వ్యవసాయం చేయడం అచ్చిరాక భద్రాచలం దగ్గర కాటా పురం లొ భూములు కొని అక్కడ వ్యవసాయం చేసేవారట. అక్కటికి వెళ్ళాలంటే బొగ్గుట్ల నుంచి నడచి "గుండాల"మీదుగా కాటా పురం వెళ్ళాలి అట. అలా తండ్రి వెంట నడచి వెళుతూ కిన్నెరసాని వాగుని చూసారట. వారికి ఆ పరిసర ప్రాంతాలు బాగా నచ్చి కిన్నెరసాని పాటలు అనే కావ్యం వ్రాయడానికి ప్రేరణగా నిలిచింది అని చెపుతారు.

"అసువు లీ దేహమందు ఉన్నంత వరకు
నేను విడలేను కిన్నెరసాని వాగు
నా మనసుని లాగుకోన్నది,లోక
దివ్య మొహనముగా పాడి తెలుగు పాట "
అని ఖండ కావ్యంలో విశ్వనాధ వారు అన్న మాటే కిన్నెరసాని పాటలు అయింది.

కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి గేయ కావ్యాలలో మణి మకుటాయమానమైనది "కిన్నెర సాని పాటలు"

కిన్నెర పాటలు కావ్యంలో ఎనిమిది భాగాలు ఉన్నాయి

అవి..కిన్నెర పుట్టుక,కిన్నెర నడకలు ,కిన్నెర నృత్యం,కిన్నెర సంగీతం,కడలి పొంగు ,కిన్నెర దుఖం,గోదావరి సంగమం కిన్నెర వైభవం.

అసలు ఎవరా కిన్నెరసాని ! ?

ఆమె ఓ..తెలుగింటి కోడలు ఉద్విగ్న హృదయ. ఆమె అత్త మూర్ఖురాలు.ఇంటి పెత్తనం అంతా ఆమెదే!ప్రతి చిన్న విషయానికి కోడలిని నిందించేది

కిన్నెర కి ఆమె భర్తకి మధ్య అరమరికలు లేకపోయినా తల్లి మాటని ఎదిరించలేక మౌనగా ఉండిపోయేవాడు.
అత్త పెట్టిన ఆరళ్ళకు ఓర్చుకోలేక కిన్నెర ఇల్లు విడిచి బయలుదేరింది. ఆమె వెనుక అతను బయలుదేరాడు.
ఆమె వినదు. అలా వెళుతూ వెళుతూ నదిగా మారిపోతుంది..భార్య నదిగా మారడం చూసి అతను కొండగా మారిపోతాడు.

అక్కడ కవి అటు తల్లికి ఇటు భార్యకు చెప్పలేక బండలా పడి ఉన్నాడు కాబట్టి అతను కొండలా మారిపోయాడు అని

కిన్నెర సున్నితమైన హృదయం ఉద్వేగం కలది కాబట్టి నదిగా మారింది.అని వర్ణించడం జరిగింది.

భర్త కొండగా మారడం చూసి ఆమె బాగా శోకించింది మాములుగా మారమని ప్రాదేయపడుతూ ఆ కొండ చుట్టూ తిరుగుతూ వేడుకుంటుంది భర్త ప్రేమ అన్ని గుర్తు తెచ్చుకుని ఇంకెప్పుడు అలా నడుచుకోనని పశ్చాతాపం వ్యక్తపరుస్తుంది. కిన్నెర దుఖం కూడా తనలోని ప్రవాహం లోనే కలసి పోతుంది.

నాకు మల్లె నీవు నది వోలె పారరా

జలముగా ఇద్దరం కలసి పోదామురా
కెరటాలు కెరటాలు కౌగిలిద్దాం రా..

ఓ..నాదా! నాలాగే నీవు నది లాగా మారిపో,ఇద్దరం కలసి పోదాం.తరంగాలు తరంగాలుగా కౌగాలించుకుందాం ..అని వేడుకుంటుంది.

కిన్నెరసాని "విప్రలంబం" ఇక్కడ వర్ణితం

వలదన్న కొద్ది నా పదం లొత్తుచు నీవు
తెలచి కౌగింటిలో తేర్చుకంటూనీవు..
అని గతించిన తమ శృంగారాన్ని కిన్నెర కిన్నెర స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ దుఖిస్తుంది.

వద్దనే కొద్ది నీవు నాపాదాలు ఒత్తుతావు. నమస్కారం చేస్తూ కౌగిలిలో చేర్చుకున్నావు అని గుర్తుచేసుకుంటుంది.


భార్యకి భర్త పాదాలు అంటి నమస్కారం చేయడం ఏమిటి అనుకోకండి.

కుపిత నాయికని ప్రసన్నం చేసుకోవడానికి నాయకుడు అనుసరించే మార్గాలలో "నతి" నమస్కారం ఒకటి.
ముక్కు తిమ్మన కూడా పారిజాతాపహరణం ప్రబంధం లొ లొ "నతి " గురించి వర్ణించారు. ఆ లక్షణాలు ఈ కిన్నెర నడకల లొ విశ్వనాధ వారు పరిచయం చేసారు..

నీ యందు తప్పింక నేను చెయ్యను లేర

ఆన వెట్టితిలేని అడుగు దాటాను లేర
ఇక జన్మలో కోపమింత పొందాను లేర!
ఓ..నాదా ఇక నేను తప్పు చేయను .నువ్వు ఆజ్ఞాపించాకుండా ఒక్క అడుగు కూడా బయటకి వేయను ఇక ఈ జన్మలో ఇంట కోపాన్ని ఎప్పుడూ తెచ్చుకోను ..అని చెపుతుంది.

ఇక్కడ విశ్వనాధ వారిలో సాంప్రదాయవాదం కనబడుతుంది. "భర్త అనుజ్ఞా లేకుండా భార్య బయటకి వెళ్లకూడదని వెళితే కష్టాలు ఎదురవుతాయని చెప్పడమే ఉద్దేశ్యంగా కిన్నెర నడకలు లొ ఈ మాటలు కిన్నెర చేత చెప్ప బడినట్లు విమర్శకుల అభిప్రాయం.


ఆయన సమకాలీనులు చలం,మరి కొందరు ప్రవచించిన అతివల స్వేచ్చ కి విశ్వనాధ వారు ఆమోదయోగ్యం కాదని చెపుతారు.

తానూ నదిగా మారిన తర్వాత తన భర్త రాయిగా మారిన తర్వాత కిన్నెర పలవించి పలవించి ఆగిపోయింది భర్త పాషాణ రూపుడై పడిన ప్రదేశంలో వదల లేక వదల లేక గల గలా తిరిగింది బిగ్గరగా విలపించినట్లు ధ్వనించింది తన వియోగాన్ని భర్త ఒర్చుకోలేదని గ్రహించింది అటువంటి ప్రేమ కల్గిన భర్త తోడి కాపురాన్ని ఇలా చేసుకున్నానని బాధపడింది భర్త రాయిగా పడిఉన్న గుట్టను తన కెరటాలతో కౌగలించుకుంది పైన పడి ఏడ్చింది.

నదిగా మారిన ఆమె అక్కడే ఉండటాన్ని గమనించి జలదేవతలు..ముందుకు ప్రవహించమని తొందర పెడతాయి. ఆమె పతి గుట్టని వదలి వెళ్ళలేక వెళుతూ ఉంటుంది. సముద్రుడు ఆమెని తనలో కలుపుకోవాలని ప్రయత్నిస్తాడు .అప్పుడు గోదావరి మాత కిన్నెరని తనలో కలుపుకుని ప్రవహిస్తూ భద్రాద్రి రాముడి పాదాలను తడుపుతూ ముక్తిపథంలో సాగుతుంది
స్థూలంగా "కిన్నెర సాని" కథ ఇది.

ఏమైతేనేం.. విశ్వనాధ వారు "కిన్నెరసాని పాటలు" అనే కావ్యాన్ని 1917 లొ వ్రాయడం ప్రారంభించి 1927 లొ ప్రచురించారు.


ఈ కావ్యం లొ కొన్ని భాగాలని విశ్వనాధవారు స్వయంగా పాడి వినిపించి ప్రజలని మంత్రముగ్ధులని చేసేవారట.

ఏ సభలకి వెళ్ళినా ఈ విషయం పైన ఉపన్యసించడానికి వెళ్ళినా సరే ముందుగా కిన్నెరసాని పాటలు పాడమని పదే పదే అభ్యర్దిన్చేవారట.

అది ఈ కిన్నెరసాని పాటలు గేయ కావ్యానికి ఉన్న రమణీయ చతురత.
విశ్వనాథ వారికి వారి రచనలలో రామాయణ కల్పవృక్షం అంటే అత్యంత ఇష్టం అయితే.. సాహితి ప్రియులేమో..కిన్నెరసాని పాటలని ఎక్కువగా ప్రేమించేవారట.
కిన్నెర నడకలలో వర్ణన ఎలా ఉంది అంటే..

గడియలోపల పేద కాల్వగా గట్టింది
అడవి తోగుల రాని అన్నట్లు తోచింది.

కొబ్బరిపాలు వాకాలు కట్టినట్లయ్యే
వెయ్యవులోకసారి పిడికినట్లై పోయే

తేలి తారకలు వెంట వెలుగులా నిలిచింది
తలిరు పూవులా వెంట తావిలా తోచింది
తెనుగు పాటల వెంట తీపిలా తోచింది. ..

పదుపు కట్టిన లేళ్ళ కదుపులా తోచింది
కదలు తెల్లని పూల నది వోలె కదిలింది
వడలు తెల్లని త్రాచు పడగలా నిలిచింది ..
అంటూ వర్ణించారు .
విశ్వనాథ సత్యనారాయణగారు ఈ కథా కల్పనపై ఏ ఇతర ప్రభావం లేదని చెప్పినప్పటికీ కొందరు సాహితీవేత్తలు చెప్పినట్లు పోలికలు ఉన్న కథలు ఉన్నాయి.

వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడి చెల్లెలు కౌశికి తన అన్న ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే సోదర ప్రేమతో ఆ ఆశ్రమ సమీపంలో నదీ రూపంలో ప్రవహించడం (2 )రామరాజ భూషణుడు రచించిన వసుచరిత్రలోని శుక్తిమతి అనే నది కోలాహలుడనే పర్వతం నాయకానాయకులు కావడం (౩)ఆంగ్ల కవిత్వంలో షెల్లీ వ్రాసిన ఎరితూజా (ARETHUSA ) (4 )ఆదునిక కవుల్లో అబ్బూరి రామకృష్ణారావు గారు వ్రాసిన "నదీ సుందరి..ఇలా అయిదు పోలికలు అని చెపుతూ ఉంటారు.

ఇది కిన్నెరసాని పాటలు ..గురించి స్థూలంగా.

సాహితీ ప్రియులు ఇంకా వివరంగా ఈ కావ్యాన్ని చదవాలనుకుంటే "కిన్నెరసాని నడకలు " చదివి తీరాల్సిందే!
తీపి తేనెల తెనుగు పాట విశ్వనాథ వారి సంప్రదాయ కవితా ఒరవడిని తెలుసుకుని తీరాల్సిందే!

(ఈ వ్యాసం వ్రాసేటప్పుడు డిగ్రీ చదివిన నాటి పాఠ్య భాగం ని గుర్తుంచుకుని వ్రాయడం జరిగింది. కిన్నెర నడకలు మాత్రమే చదివాను. ఇక పూర్హి కావ్యం చదివితే ఎంత బాగుండునో అనుకుంటాను. ఏవైనా తప్పులు దొర్లి ఉంటే ఏదైనా పొరబాట్లు ఉంటే గమనించిన విజ్ఞులు మన్నించాలి.)









"సితార" చిత్రంలో ఈ "కిన్నెరసాని " పాట వినేయండి



(ఈ పోస్ట్ లో జత పరచిన చిత్రాలు గూగుల్ చిత్రాలు నుండి సేకరణ)

2, మార్చి 2012, శుక్రవారం

" సామాన్య " కల్పన " కథకి "రంగవల్లి పురస్కారం "

కథా  రచయిత్రి, కవయిత్రి  " సామాన్య " గార్కి   " కల్పన "  కథకి    లభించిన      "రంగవల్లి   పురస్కారం  "

సభలో  .. ఆమె కథల పై ప్రముఖుల అభిప్రాయం  ఈ  వీడియో లలో చూడండి .


 సామాన్య  గార్కి  పురస్కారం   వీడియో 1


సామాన్య  గారికి    పురస్కారం   వీడియో 2

మరింత సమాచారం కొరకు "విహంగ"  ఫిబ్రవరి సంచిక చూడండి.

24, సెప్టెంబర్ 2011, శనివారం

కరిగి ప్రవహించిన పాట. ఆ పాట రచయిత జాలాది.


నెమలి కన్ను బ్లాగ్లో   మురళి  గారి లేడి చంపిన పులి నెత్తురు కథ  పరిచయం గురించి చదవగానే నాకు వెంటనే  "యాలో యాలో ఉయ్యాల"  పాట గుర్తుకు వచ్చింది.పాట రచయితా గుర్తుకు వచ్చారు.  

 ఎప్పటి నుండో పాటల రచయిత జాలాది గారి గురించి ఓ..మాట వ్రాయాలని అనుకుంటున్నాను.ఇంతలో..ఇలాను గుర్తుకు వచ్చింది. 

 జాలాది గారిని నేనొక  సభలో.. చూడటం తటస్థించింది.  సుద్దాల అశోక్ తేజ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా పురస్కారం   అందుకున్న తరుణంలో.. విజయవాడలో..వారికి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.  ఆ కార్యక్రమంలో.. మా శబ్దాలయ మిత్రమండలి వారు భాగస్వామ్యం కూడా ఉంది. . ఆ సందర్భంలో.. జాలాది గారు ఒక ముఖ్య అతిధి.



జాలాది గారు  విచ్చేసారని రేడియో అనౌన్సర్ బి.జయప్రకాష్ గారు చెప్పడం .. మీరు వెళ్లి మాట్లాడండి అని చెప్పడం నాకు చాలా సంతోషం కల్గించింది . ఎందుకంటే జాలాది గారి పాటల గురించి చాలా సందర్భాలలో.. రేడియోలో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావించు కోవడం  వల్ల జయప్రకాష్ గారు అలా నాకు చెప్పడం జరిగింది. సరే ! ఇదొక  మంచి అవకాశం అని నేను వారి దగ్గరకు త్వర త్వరగా వెళ్లాను. వారి అమ్మాయి విజయ కూడా నాకు పరిచయం ఉండటం మూలంగా.. వారితో మాట్లాడటం  చాలా సులువు అయింది.

వారిది స్పురద్రూపం అనవచ్చో అనకూడదో కానీ నల్లని రంగు. ఆజానబాహువు.   వారి స్వస్థలం దొండపాడు అయినా పశ్చిమ కృష్ణా జిల్లా యాసలో..మాట్లాడారు.  సర్ ..మీది నందిగామ !? అని అడిగాను. నాకు వారు తెలిసినప్పుడు  నందిగామలో ఉండే వారు . కాదమ్మా అంటూ..చాలా ఓపెన్గా, ఓపికగా ఆప్యాయంగా  చాలా విషయాలు చెప్పారు. అరగంటసేపు వారితో మాట్లాడినంతసేపు  వారు వ్రాసిన యాతమేసి తోడినా సాహిత్యమే నా మదిలో మెదిలింది. వారి బాల్యము,వారి రచనా వ్యాసంగం గురించి నేను చెప్పడం కన్నా   ఇక్కడ     లింక్లో చూడండి.

 "దేవుడే గెలిచాడు "చిత్రంలో.. "ఈ కాలం పది కాలాలు బ్రతకాలని" పాట దగ్గర నుండి..  "చల్ మోహనరంగ" చిత్రంలో..ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు, యాతమేసి  తోడినా, ఎలియాల్లో ఎలియాల్లో.. ఓలమ్మి తిరణాల గిలక, .    పుణ్యభూమి నాదేశం నమో నమామి,"సుల్తాన్" జనగణ జనయిత్రి నా భరతభూమి   వరకు ..ఎన్నో ఆసక్తి కర విషయాలు చెప్పారు. పాటలు గురించి తెలుసుకోవడం అంటే..నేను పాటలు వినడం ద్వారానే.. అదీ  ఒక్క ఆకాశవాణిలో..వినడమే నండీ..అని నేను చెప్పగానే ఆశ్చర్యపోయారు.

చూరట్టుక్కు జారతాది....చిటుక్కు చిట్టుక్కు వాన చుక్క (పల్లెసీమ),అలాగే దీపమేలా వెలిగేది నూనె లేనిదే..ఈ పాపలెలా   పెరిగేది నాన్న లేనిదిలే..(అత్తగారి పెత్తనం ),ముసి ముసి నవ్వులలోన (బ్రహ్మ) తల్లులారా తండ్రులారా (రేపటి పౌరులు) సందె పొద్దు అందాల్లున్న చిన్నదీ..ఏటిమీద  తానాలాడుతున్నదీ  ఉన్నదీ(తూర్పు వెళ్ళే రైలు) కాకమ్మ కాకి(వారాలబ్బాయి) ఇలా ఎన్ని పాటలు గుర్తు చేసుకున్నారో!

వారి  గీత రచనా వైభవం గురించి చెబుతూ.. జాలాది పాటలా..అయితే ఆ చిత్రం హిట్టే! అనేవారట. జే క్యూబ్ అని వ్యవహరించేవారట. అంటే జాలాది+జేసుదాస్+జయసుధ లేదా జయమాలిని..అని అట, అంటే.. అంత విభిన్నంగా సాహిత్యం అందించగలరని అనే ఉద్దేశ్యంతో.. ఇతరులు అన్నమాట, ఉన్నమాట.   నిజమే కదా..!  యాతమేసితోడినా ,అభినవ శశిరేఖవో ..రాసినట్లే .  చాలా  చిత్రాలలో క్లబ్ సాంగ్స్ కి వారు సాహిత్యం అందించారు. జానపద సాహిత్యం జాలాది పాటల్లో..చాలా హృద్యంగా ఉంటుంది. పల్లియ్యల్లో.. మన  ప్రక్కనే  ఉండి   ఎంకి-నాయుడు బావ  కలసి పాడుకున్నట్లే.. "ఆ మూడు ముళ్ళే యరో నూరేళ్ళ పక్కేయ్యరో.."ఎంత మంచి ప్రయోగమో!  నాకు అది యెంత ఇష్టమో..చెప్పలేను.   

అలాగే ముగ్గురు కృ ష్ణలకు కృష్ణ,కృష్ణంరాజు,బాలకృష్ణ కు  పాట రాసానని, మూడుతరాలకు పాట రాసిన ఘనత తనదే అని చెప్పారు. యెన్.టి.ఆర్ .హరి కృష్ణ . జూనియర్ యెన్ టీ.ఆర్ కు కూడా.. ఇంకొక విషయం ఏమిటంటే..ఆయన ఎవరికి పాట వ్రాయకుండా (మోహన్ బాబు చిత్రాలకు మాత్రమే వ్రాసే విధంగా) ఒప్పందం కుదుర్చుకున్నరటగా  అని అడిగితే..అంత లోతు వద్దమ్మా అన్నారు... మాట దాటేస్తూ..  కానీ ఒక దశకంలో..నిజంగా అలాగే వ్రాయడం జరిగిందట కూడా.

కానీ  ఒక ఆసక్తి కర విషయం చెప్పారు. "పెదరాయుడు" చిత్రంలో..ఓ.. పాట వారి రచన .కానీ చిత్రం విడుదలైనాక చూస్తే..వేరే వారి పేరు ఉందని .. అప్పుడు చాలా బాధ కల్గినదని చెప్పారు. ఆ పాట ఏదో..ఆయన రచనా శైలి తెలిసినవారు గుర్తించవచ్చు కూడా.. అతివల కందరికి  ఇష్టమైన పాట అది.

ఇంకొక విషయం ఏమిటంటే.. అలలు కదిలినా పాటే..కలలు చెదిరినా పాటే  ఏ పాట నే పాడను (సీతామాలక్ష్మి ) పాట వారి రచన కాదు ..ఆ పాట వేటూరి గారే  వ్రాసారని చెప్పారు.  ఒక్కసారి అయినా తీరిక చేసుకుని విశాఖ పట్నం  వెళ్ళాలి వారితో..ఇంకా  పాటల గురించి  చాలా చాలా మాట్లాడాలి అనుకున్నాను ఆ క్షణాన.

కొంచెం ఆలస్యంగా సభ ప్రారంభం అవడం మూలగా నాకు వారితో..మాట్లాడే అదృష్టం కల్గింది. తర్వాత సభలో.. వారు మాట్లాడేటప్పుడు "యాతమేసి తోడినా" పాట ఆయన గళం లో వినిపించారు. యెంత భావ గాంభీర్యం వేదన జనియించాయో..ఆ గళంలో.. నేను ఎప్పటికి మరువలేను.  ఆ పాటకి 10 నిమిషాల పాటు ఆడియన్స్ కరతాళ ధ్వనులు..

కొంతమంది స్త్రీల దుఃఖచ్చాయలు..  విపరీతమైన మేకప్ తో..కళా క్షేత్రం  అంతా తానే అయి తిరిగి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించిన ఒక వనిత   అప్పటిదాకా చాలా హడావిడి చేసిన ఆ  వనిత  మేకప్ అంతా చెరిగిపోయేంతగా వెక్కి వెక్కి ఏడవడం ఒక విశేషం అన్నమాట.

ఇరువది అయిదు నిమిషాల ఆయన ప్రసంగాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం రికార్డు చేసినట్లు గుర్తు. ఆయన ప్రతి పాట జనరంజకమే! శ్రోతల హృదయాలలో..ముద్రించుకునే ఉంటుంది.

"సుఖీ భవ సుమంగళి ' మేజర్ చంద్ర కాంత్ లో.పాట వ్రాసి కన్నీరు పెట్టించారు. ఇప్పుడు వారు ఐదు  ఆరు రోజులుగా హాస్పిటల్ లో..కోమా స్థితి లో..ఉన్నట్టు   తెలుసుకుని.. చాలా బాధ పడుతూ.. ఇంకా ఆయన మస్తిష్కంలో..భావాలు కొట్టు మిట్టాడుతూ..పాట వ్రాయమని ప్రేరేపిస్తూ ఉన్నాయేమో..అన్నట్టుగా ఉంది నాకు.              
నాకు  ఇష్టమైన వారి పాటల్లో.. ఒకటి ఇక్కడ..


ప్రాణం ఖరీదు చిత్రంలో.. ఈ పాట

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు  (యాతమేసినా)
దేవుడి గుడిలోదైనా పూరి గుడిసేలోదైనా 
గాలి ఇసిరి  కొడితే ఆ దీపముండదు ఆ దీపముండదు  (యాతమేసి)

పలుపు తాడు మేడకేత్తే పాడి ఆవురా    
పసుపు తాడు మెడకేస్తే   ఆడదాయేరా (ప)
కుడితి నీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాది 
కడుపు  కోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాది 
బొడ్డు   పేగు తెగిపడ్డ   రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం  తెలుసుకో (యాతమేసి ) 

అందరు నడిసోచ్చిన తోవ ఒక్కటే 
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే(అందరు )

మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా   
నిదర ముదర  పడినాక  
పాడే ఒక్కటే వల్లకాడు ఒక్కటే 
కూత నేర్సినాళ్ళ కులం కోకిలంటరా          
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా  (యాతమేసి)



ఎన్ని పాటలో, ఎన్ని ముద్రలో!? విజయ ని (వారి మూడో అమ్మాయి)  కలిసినప్పుడల్లా ..  ఇలా  అనే దాన్ని   "ఎంతటి అదృష్టవతురాలివి.. అంతటి వారికి కూతురిగా పుట్టడమే కాదు మీ నాన్న గారి భావసంద్రాన్ని, ఆవేశాన్ని పుణికి పుచ్చుకున్నావని."  ..

ఇంత కన్నా ఇప్పుడేం చెప్పలేను...
మనిషి కి మరణం ఉంటుంది కానీ..భావాలకి కాదని 
సజీవ ఆలోచనల కి  వారి పాట ఓ.. ఆనవాలు అని.  
ఆలోచనల హిమం కరిగి ప్రవహించినవి  పాటలని .
ఆ పాటల  రచయిత జాలాది.,,అని.

22, జులై 2011, శుక్రవారం

దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు


ఈ రోజు దాశరధి గారి జయంతి..

దాశరధి గారి మొదటి కవితా సంపుటి "అగ్నిధార"

ఆధునికాంధ్ర సాహితీ చరిత్రలో.. దాశరధి గారిది ఒక ప్రత్యేక అధ్యాయం.ఆయన తెలంగాణలో పుట్టడం మూలంగా..భారత స్వాతంత్ర్య పోరాటంలో..ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం  లేకపోయిందని.. చెపుతారు.దాశరధి అటు భారతావని మొత్తం స్వాతంత్ర్య సమర శంఖం పూరిస్తుంటే.. తెలంగాణం లో..ఆ ప్రాంత విముక్తి కొరకు పోరాడవలసి వచ్చినదంటే ..నిజాం పరపీడన వల్ల ప్రజలు ఎన్ని ఇక్కట్ల పాల్బడ్డారో !

దాశరధి తెలుగు దేశంలో ఒక భాగమైన తెలంగాణా స్వాతంత్రోద్యమానికి శంఖం  పూరించారు. ఆ  ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్ట నష్టములకి  గురి అయ్యారు. జైల్లోను,ఉద్యమంలోను.. బాధతో..కవితావేశంలో.. ఆయన వేలువరించిన ఎన్నో కవితా ఖండికలను..మనం దృష్టిలోకి..తీసుకున్నా అందులో..ప్రధానమైనది.."అగ్నిధార"

తెలంగాణా విముక్తి పోరాటంలో తెలుగువారల సమరగీతం దాశరధి లో..ప్రస్పుటంగా కానవస్తుంది.ఆయన ప్రజా కవి. ప్రేక్షకుని వలె కాకుండా ప్రజల కష్టనష్టాలలో  ..తానోకడిగా కలసిపోయి ఉద్యమ వీరుడిగా "పెన్'' అనే ''గన్"  పట్టి..గళం అనే బుల్లెట్ లు వెలువరించి..ప్రజా శక్తులతో కలసి జనంలో కవితావేశాన్ని కల్పించి కార్య రంగంలో..దూకించారు.

నిజం పాలనలో విసిగి పోయిన తెలంగాణా ప్రజల  ఆవేశం,ఆకాంక్షలన్నీ..దాశరధి కవిత్వంలో..ప్రతిబింబించాయి..రజాకార్ల దుండగాలతో ..ఆస్తుల దోపిడీలతో..గృహదహనాలతో ,స్త్రీల మాన అపహరణ లతో.. మారణ దారుణ కాండ కి అట్టుడికి పోయిన కాలంలో.. దాశరధి ఆగ్రహావేశంతో..

ఓ..నిజాం పిశాచమా!కానరాడు 
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని 
తీగెలని తెంపి ,అగ్నిలో దింపినావు 
నా తెలంగాణా కోటి రతనాల వీణ

తర తరాల స్వప్నాల సుందర ఫలమ్ము 
స్వైర భారత భూమి చూపెడెనో  లేదో
విషం గుప్పించినాడు నొప్పించినాడు
మా నిజం నవాబు జన్మజన్మాలబూజు 

అచట పాపము దౌర్జన్య మావరించి  
తెలుగుదేశాన నెత్తురుల్ చిలికి 
మత పిశాచం పేదల కుతుక నమిలి
ఉమ్మివేసెను పిప్పి లోకమ్ము మీద 

నా తెలంగాణా  కోటి రతనాల వీణ 
తీవియలు తెగి  విరిగి నదించ కుండే 
నా తెలుగు జాణ ప్రాణమానాలు దోచి
ఈ నిజం పిశాచి  కన్నెర్ర చేసే..

ఇలా.. సాగింది..అగ్నిధార . సమర గీతమై నిలిచింది.నిజాం ..ప్రభుత్వం ఊరుకుంటుందా ? ఇనుపగొలుసులతో  బంధించి ఓరుగల్లు నగర వీధుల్లో..నడిపించింది. నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్భందించింది. అగ్ని ప్రజ్వరిల్ల కుండా ఆపడం ఎవరి తరం? విప్లవ కవిత్వాన్ని జైలు గోడల మీద శిలాక్షరాలుగా  లిఖించాడు..దాశరధి.
ఆయన ప్రభావంతో..ఎందరో..ఉద్యమంలోకి దుమికి పనిచేసారు. 
తెలంగాణా స్వాతంత్రోద్యమ కవిత ..దాశరధి గళంలో.. పద్య,కావ్య రూపాలలో సాగినా.. ప్రజలు మెచ్చినది..అగ్నిధార..మాత్రమే !

దాశరధి కి కన్నతల్లి అంటే యెంత ఇష్టమో..తెలంగాణ మంటే   అంత ఇష్టం..ఆమెని వేనోల్ కీర్తించి.. తన "రుద్రవీణ" ని ఆమెకి అంకితం  చేసాడు.    

చివరకు నిజాం ప్రభువు..హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో..విలీనం చేసిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..సమైక్యంలోనే అర్ధం ఉందని తలచి.. సమైక్య భావనకి..నడుం బిగించి.. విశాలాంధ్ర సమైక్యత కోసం పద్యాలు వ్రాసారు. ..
తుంగభద్రానదీ భంగమ్ములిరుక్రేనా 
లోరసిపారుచు రుచు లరయు చుండ 
కృష్ణ వేణీ    తరంగిణీ నాలుకలుచాచి 
దారుల రెండిట "మజా"లరయుచుండ
గోదావరీ వీచికా దివ్యహస్త మ్ము 
లిరుకేలన్కుల మన్ను తరచు చుండ 
కోటి   కిన్నెరసాని మాటి మాటికి పొంగి 
రెండు వైపులా దరు లోడంగోనగా 

ఇటునటును తెల్గు  నేల లారటంనోంది
కలసి పోబో జూచున్న యట్టులనే దోచు 
కలిమివేయుము న తెలంగాణ తల్లి 
మూడుకోట్లునోక్కనే ముడి బిగించి ..

నా కోర్కె దీర్చుమమ్మా! 
నీవు మదీయశ్రు కణ  వినిర్మితమాలా 
నీక మ్ము సమర్పించెద 
గాక ,విశాలాంద్ర మనేడి కల నిజమగుతన్ .. అని నదుల నిలా సమైక్య సూత్రంగా వాడారు. 
ఇలా  ప్రాంతం కొరకు,విశాలాంద్రం  కొరకు....ఆయన కలం నర్థించినది.
పునర్నవం,ఆలోచనాలోచనాలు,తిమిరంలో సమరం.. ఇలా కావ్య సృష్టి సాగింది. 

ఎవడైనా మానవుడే-ఎందుకు ద్వేషించడాలు? రాక్షసి నైనా మైత్రికి రానిత్తును భయం లేదు!

హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభించదు -ఉదయం వినా నా కంటికి ఏ వస్తువు రుచించదు 

గతాన్ని కాదనలేను ,వర్తమానం వద్దనబోను ,భవిష్యత్ ఒదులుకోను ..కలం నా కంట మాల .. నా పేరు ప్రజా కోటి -నా వూరు  ప్రజా వాటి ..అంటారు. 

బాంబులలో బలం చచ్చి -పాములలో విషం చచ్చి 
ప్రేమములో బలం హెచ్చి -స్నేహంలో  శక్తి హెచ్చి
చిన్న పాటి అంకుశామున-గున్న ఏనుగును వంచే 
కొత్తరకం పడ్డాయి కనుగోన్నాను రండో !..అంటూ.. ఆయన పథం ని మనకి చూపారు. 

తిమిరంతో ఘన సమరం -జరిపిన బ్రతుకే అమరం 
కవితా తేజోవలయం-అవని శాంతికి అది నిలయం ..అని చెప్పారు. సందర్భాలు వేరువేరుల్లో.  

కమ్మని నా తెలంగాణ ..తొమ్మిది జిల్లాలేనా ? 
బహు లాంధ్రకు తెలంగాణ పర్యాయ పదం కాదా....అన్నారు. వేర్పాటు వాదాలు ని ఆయన మందలించారు. 

ఒక్క తెలుగు -ఒక్క  వెలుగు..అని నినదించారు. 

తల్లీ!నిను ముక్కలోనరించ దలచు వారి 
ఆశ అది ఆశలైయున్న అవసరాన 
నీ పదమ్ము ల్ల  పై తల మోపి నేడు 
చించు చుంటి ఆనందాశ్రు బిన్దువులును.. 
.
నవంబర్ ఒకటి..మనమంతా ఒకటి ..

సూర్య చంద్రులున్నంత వరకు తెలుగు జాతి ఏక సూత్రం పై నిలవాలని ఆయన  ఆకాంక్ష. 

కుడి కంటిని  ఎడమ కన్ను పొడిచేనా ?
కుడి చేతిని ఎడమ చేయి నరికేనా ? 
ఒక దేహం-ఒక గేహం మరిచావా ?
ఒక్క తెలుగు ఒక్క వెలుగు మరిచావా? 

విడిపోవుట -చెడిపోవుట 
విడిపోవుట -పడిపోవుట 
కలసియుంట గెలుచుకుంట 
తెలుగు విలువ తెలుసుకునుట ! 
గుండెను రెండుగా చీల్చు మొండితనం పనికి రాదు
మనుషులని ఏకం చేసే మంచితనం కావాలి.... 
ఇది.. ఆయన భావన. 

ఈనాటి స్వార్ద కుటిల రాజకీయ నాయకుల  పన్నాగాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా  రుద్ది.. ప్రాంతాల  పేరిట.వెనకబాటు తనం పేరిట వేరు కుంపట్లు పెట్టి  విధ్వంసాలు సృష్టించే.. నాయకులు.. ఆంద్ర ప్రాంతం వారిని నిజాం ప్రభువులతో పోల్చి.. తెలంగాణ వాదంతో..అవమాన పరస్తున్నారు. అసలు  తెలంగాణ ప్రజల వెనకబాటుతనం ఎందుకు ఉందో.. ఆలోచిస్తూ.. ప్రజల కవి.. వాస్తవ దృక్పధం కల్గిన సమరశీలి దాశరధి..ని ఒకసరి  పరికించి చూస్తే.. తెలుగు వారిగా వారు ఏం కోరుకున్నారో అర్ధం అవుతుంది.తెలుగు దేశాన్ని..ఇంతగా ప్రేమించిన కవి దార్శకనీయత..ఏమిటో..అర్ధం కావాలని..ఒక చిన్ని ఆశతో.. ఈ..వ్యాసం.  
ఆకాశవాణి విజయవాడ "ఏ" కేంద్రంలో  (2004 జూలై ఇరవైరెండు  న) సాహితీ కార్యక్రమంలో.. ప్రసారం  అయిన ..  నా  ప్రసంగ వ్యాసాన్ని కుదించి..ఈ పోస్ట్.. 

దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు. ఆ బాకు  అజ్ఞాన తిమిరాన్ని..చీల్చి చెండాడాలని.. .. ముకుళిత హస్తములతో..నా అభిమాన కవి..కి..పాదాభి వందనాలతో..