19, నవంబర్ 2026, గురువారం

నిషిద్ధ ప్రేమ

 



ఈ “మమేకం” సిరీస్ లో “నేనూ నువ్వు” అనేది “అనేకం”. నేను నేను కాదు, నువ్వు యెవరూ కాదు. ఇది వొక కవితా సిరీస్ మాత్రమే ! కథలు రాసే మూడ్ లేక అసలు యేమీ రాసే మూడ్ లేక రాస్తున్న రాతలు యివి. ఇంతేసంగతులు. 😊😊✍️. 


నిషిద్ధ ప్రేమ - వనజ తాతినేని. 


నువ్వు కల్పిత మానవుడివి కాదు

కథలోని పాత్ర కాదు

నిరంతర నా ఆలోచనా స్రవంతికి

ఏకైక ఆధారం నువ్వు

జీవిత గమనంలో రహస్య బంధం నువ్వు


అసంపూర్ణంగా నిర్మితమైన వంతెనపై

ప్రయాణం నిషిద్ధమెలాగో

అసంపూర్ణ ప్రేమపై సాధికారతమంత

విడ్డూరం.


చెరసాలగా మారిన ప్రేమలో

జీవితం గాయంతో విలవిలలాడే పక్షి

రెక్కలున్నా ఎగరలేని వేదన

గూడున్నా చేరలేని దూరం


నా కథకు నువ్వే ప్రారంభం

ఈ మౌనానికి నేనే ప్రారబ్ధం

నిశ్శబ్దపు గోడలు కూల్చేద్దాం రావోయ్ 

క్షతగాత్రులమైనా సరే దివ్య ఔషధాన్ని 

లేపనంలా పూసుకుందాం


శిశిరంలో వాసంతి రంగు చీర చుట్టుకుని 

ప్రకృతి కాంత యెదురు చూస్తుంది 

రావోయ్! 


19/11/2026. 07:16am.


#హృదయకవితలు

#మమేకం

#వనజతాతినేని

#vanajatatineni


కామెంట్‌లు లేవు: