అనుభూతుల పుష్పగుచ్చం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుభూతుల పుష్పగుచ్చం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఏప్రిల్ 2026, ఆదివారం

మట్టి బాట మాయాజాలం

 






మట్టి బాట  మాయాజాలం   - వనజ తాతినేని. 


ఆ మట్టి బాటను చూస్తే చాలు.. 

నా హృదయం నడక తీరు మార్చుకుని 

ముని వ్రేళ్ళ పై నెమలి నాట్యం చేస్తుంది. 


మంచు తెరలపై లేత నారింజ రంగు కాంతి ధారని 

చూస్తే చాలు..ఏ దివ్యత్వమో నన్ను స్పృశించి 

పునీతం చేయబోతోందని సృహ కల్గుతుంది. 


ఆ జనప పూల పంట పశువులకు రుచికరమైన 

భోజనం కాకమునుపే.. 

నా సౌందర్య దాహానికి  దప్పికై నిలువెల్లా తడిపింది 


ఆ జొన్న కంకులపై  పిచ్చి ఆనందంతో గెంతులాడే 

చిన్ని పక్షుల కిచకిచలు వింటూ 

నా పెదవులపై భూపాల రాగం మొలిచింది. 


బాట పక్కన గడ్డి పూవు కూడా తల ఊపుతూ..  

అన్యాపదేశంగా ఏదో సందేశాన్ని అందించింది. 


ఈ ఉదయం మట్టి బాటల మాయాజాలం 

నన్ను పూర్తిగా కమ్మేసింది.కొంత సమయం ఆత్మతో

 కలిసి జీవించడమనే అనుభూతిని మిగిల్చింది. 


(ప్రతి రోజూ బైట్ ల కొద్దీ సందేశాలు చదివే వినే..   

నాకు ప్రకృతి సందేశం హాయినిచ్చిన అనుభవం తో) 


12 April 2026. 08:00am



11, ఏప్రిల్ 2023, మంగళవారం

అవార్డ్ అందుకున్నా

 


అయిపోయిన పెళ్ళికి యిప్పుడెందుకు బాజాలు మోగించడం అని నవ్వకండి ఫ్రెండ్స్.. ఆ విషయాన్ని నా జ్ఞాపకాలనూ భద్రపరచాలని… అంతే! 

ఇంటి పేరు అనే కవిత రాసాను. ఎందుకో సంతృప్తిగా అనిపించలేదు.. మళ్ళీ అదే పేరు తో కథ రాసాను. అది “భూమిక” పత్రికలో ప్రచురితమైంది. 2016 లో అని గుర్తు. 

అంతకు ముందు రెండేళ్ళు లాడ్లీ మీడియా అవార్డు కొకరు నామినేషన్ పంపమని స్నేహితులు కొందరు చెప్పారు. నేను ఆసక్తి లేక మౌనంగా వున్నాను. ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందూ.. మీరు పంపాల్సిందే అని పట్టుబట్టింది. నేను కథ, కవిత రెండు విభాగాలకు నామినేషన్ పంపాను. 

కథ విభాగానికి అవార్డ్ లేదంట. కానీ నా కథ “ఇంటి పేరు” ను యెంపిక చేసి లాడ్లీ మీడియా అవార్డ్ ప్రకటించారు. 

అసలు లాడ్లీ మీడియా అవార్డ్ అంటే యేమిటో చూద్దాం. 

మీడియా లో జెండర్ అవగాహన/స్పృహ పెంచే ఉద్ధేశ్యంతో 2007 నుండి  యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సహకారంతో పాపులేషన్ ఫస్ట్ సంస్థ భారతీయ పత్రికా ప్రపంచంలో లింగ వివక్ష వ్యతిరేక, స్త్రీపురుష సమానత్వ వార్తలకు, రచనలకు, విశ్లేషణలకు గత పది సంవత్సరాలుగా ప్రాంతీయ భాషలలోనూ, ఇంగ్లిష్ లోనూ అవార్డులు ఇస్తున్నది. తెలుగులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేసిన వారికి జర్నలిస్ట్ లకు డాక్యుమెంటరీలకు కూడా ఈ అవార్డులు ప్రకటిస్తారు. 

2017 వ సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల వారికి సంబంధించిన వారికి (నాలుగు రాష్ట్రాల వారికీ) అవార్డుల ప్రధానోత్సవ సభ హైదరాబాద్ కేంద్రంగా రవీంద్రభారతో లో జరిగింది. 

అవార్డ్ కి యెంపిక అయ్యాను అని తెలిసిన తర్వాత ఆ రోజు కు హైదరాబాద్ కు నేనూ, మా చెల్లి, మా అపూ, నా ఫ్రెండ్ కలసి వెళ్ళాం. అక్కడ వసతి భోజన సౌకర్యాలు లాడ్లీ మీడియా సంస్థ వారు అందించారు. 

అవార్డ్ అందుకోవడం.. ఆ అవార్డ్ కార్యక్రమానికి నా స్నేహితులు అనేకమంది వచ్చారు. ఆ సభలో కొండవీటి సత్యవతి గారూ శివాలోలిత గారూ.. సి.వనజ గారూ.. ఇంకా చాలామందిని ప్రత్యక్షంగా కలుసుకున్నాను. తులసి చందూ మా ఇంటి అమ్మాయే అనిపించింది. 

ఆ కార్యక్రమం గురించి నేను బ్లాగ్ లో కూడా పంచుకోలేదు. అవార్డ్ అయితే తీసుకున్నాను కానీ ఆ విషయాన్ని ఆనందంగా పంచుకునే సమయం కాదు అది. ఇంట్లో మా వారు అనారోగ్యంతో వున్నారు. నేను వెళ్ళను అన్నా కూడా “అలా యెందుకు? వెళ్ళి అవార్డ్ తీసుకో” అని పదే పదే వొత్తిడి చేసారు. 

లాడ్లీ మీడియా అవార్డ్ ప్రకటన చేస్తూ కథ కు అవార్డ్ ఇవ్వడం అదే తొలిసారి అని ఆ కథ బాగా రాసారు నాకు బాగా నచ్చింది అని హత్తుకుని అభినందించారు Population First  Director Dr. A L Sharada గారు. ఈ  అవార్డు నా భాధ్యతని మరింత పెంచింది . Thanks a lot  Laadli Media. . 

ఆ కార్యక్రమం జరిగినప్పటి ఫోటోలు ఇవి. 2017 ఏఫ్రియల్ 10 న అందుకున్నాను. ఫేస్ బుక్ లో అప్పుడు share చేసిన post ఇవాళ జ్ఞాపకం చేసింది. బ్లాగ్ లో భద్రపరచుకుందామని ఈ రోజు యిక్కడ పంచుకుంటున్నాను. 

నిజానికి అవార్డులు అందుకోవడం పురస్కారాలు  తీసుకోవడం సత్కారాలు చేయించుకోవడం నాకు యిబ్బందిగా వుంటుంది. 2019 లో కూడా ఒక అవార్డు ను తిరస్కరించాను. నేను సాహిత్యం లో అంత ఎత్తు కు చేరుకోలేదని నాకు తెలుసు. ఇప్పుడు అవన్నీ యెలా వస్తాయో కూడా తెలుసు. నిజానికి నాకు వాటిపై అంత ఆసక్తి కూడా లేదు. 

ఆ నాటి చిత్రాలు.. సర్టిఫికెట్ విజయవాడ ఇంట్లో భద్రంగా వుంది. 😊



ఇంటి పేరు పై నిరసనగా కథ కవిత రాసి.. మీ పేరు చివర ఇంటి పేరు యెందుకు పెట్టుకున్నారు అని అడగకండీ.. సాహిత్యరంగంలో సి. వనజ అక్కినేని వనజ, అడవి పుత్రిక రాసిన వనజ.. ఇంకా చాలామంది వున్నారు. ఎప్పుడూ తికమక అందరికీ.. నాకు ఫోన్ చేసి వారిని ఉదహరించి నాతో మాట్లాడబోతారు అందుకే నా పేరు చివర.. ఇంటిపేరు. నిజానికి నాకు ఇంటి పేరు యిష్టం వుండదు కూడా. అందుకు నా ఆలోచన నా అభిప్రాయం నా అనుభవాలు నావి. అవి మరొకసారి రాస్తాను. 

******************

ఈ అవార్డు కోసం…. 

ప్రింట్,ఎలక్ట్రానిక్,వెబ్ మీడియా నుంచి ఎంట్రిలను పంపవచ్చు. బ్లాగ్స్, ఇ పత్రికలు, ఈ మాగజైన్స్,సోషల్ నెట్వర్కింగ్ లో కాంపైన్స్ మొదలైన వాటి నుండి ఎంట్రీలు పంపొచ్చు.

ఆన్ లైన్ లో కూడా పంపొచ్చు.




31, మార్చి 2023, శుక్రవారం

యాభై యేళ్ళ జ్ఞాపకం


గతాన్ని తవ్వుకుంటేనూ బాల్యాన్ని స్మరించుకుంటేనూ.. మధుర జ్ఞాపకాలూనూ అనుభూతులూనూ.. 


ఎన్టీ వోడిని నేను సినిమాల్లో కాకుండా రెండు సార్లు సమీపంగా చూసానని.. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో గుర్తొచ్చింది. 


మొదటిసారి చూసిన సంగతి కన్నా ముందు…

రెండవసారి చూసిన సంగతి మాత్రం తేలికగా గుర్తుంది.. 1982 లో అనుకుంటాను.నేను ఇంటర్మీడియట్  చదువుకుంటున్నాను. ఆయన పర్యటనలో భాగంగా మైలవరం లో సభ నిర్వహించినప్పుడు ఆయన వెనుకనే వేదికపై కూర్చోగల్గే అదృష్టం దక్కింది. ఎన్టీ ఆర్ కూడా మాతో పాటు వేదికపై పద్మాసనంలో కూర్చున్నారు. 


ఇక మొదటిసారి చూసిన జ్ఞాపకం కోసం యాభై యేళ్ళు వెనక్కి వెళ్ళి  జ్ఞాపకాలను తడుముకున్నాను.


బెజవాడ (విజయవాడ) నేను పుట్టినవూరుకు నా స్వస్థలానికి జంక్షన్ లా వుండేది. కనకదుర్గ గుడికి వెళ్ళి అమ్మవారిని యిప్పటి వరకూ  రెండు లేక మూడుసార్లు మాత్రమే దర్శించాను. మొదటిసారి.. మా పెద మామయ్య చిన్న పిన్ని తో కలిసి వెళ్ళినట్టు లీలగా గుర్తుంది. అదీ దసరా పండుగ తర్వాతని గుర్తు. 


మా అమ్మమ్మ గారింటి దగ్గర పెరిగే నేను పెదమామయ్య చిన్న పిన్ని తో కలిసి మా వూరు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు వుండి తిరుగు ప్రయాణంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత మ్యాట్నీ షో   “పండంటి కాపురం” సినిమా చూసినట్టు గుర్తు. సినిమా కథ నా మెదడుకు యెక్కేంత వయసు నాకు లేదు కానీ.. ఆ సినిమా పూర్తి అయ్యేటప్పటికి చీకటి పడిందని, సినిమా అయిపోగానే.. ఆ సినిమా తెర ముందు వున్న పెద్ద అరుగుపైకి యెన్ టి రామారావు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ ఇంకా పేరు తెలియని సినిమాల్లో నటించే అమ్మాయిలు వొకరి తర్వాత వొకరు ఆ అరుగుపైకి వచ్చి కూర్చుని వొకరి తర్వాత వొకరు మాట్లాడి పూలగుత్తులు ఇచ్చుకుని దండలు వేసారని శాలువాలు కప్పారని గుర్తు వుంది. నాకు బాగా గుర్తుంది మాత్రం గంభీరంగా కోటు ధరించిన  యెన్ టి రామారావు గారు సన్నగా వున్న కృష్ణ గారు. వాణిశ్రీ వున్నట్టు కూడా లీలగా జ్ఞాపకం. వారందరూ సంచీ పట్టి హాలంతా తిరుగుతూ డబ్బులు సేకరించినట్టు కూడా జ్ఞాపకం. కరువొచ్చిందట, వారికి సహాయం చేయడం కోసం అలా చేస్తున్నారని మామయ్య అన్నట్టు జ్ఞాపకం. 


నేను మొదటిసారి చూసిన సినిమా అది. సినిమా లో అట్లా నటించి సినిమా అయిపోయాక తెర ముందుకు వచ్చి కనబడతారని అప్పుడు అనుకున్నాను. ఆ కార్యక్రమం అయ్యేటప్పటికి బాగా పొద్దుపోయింది. సినిమా నటులందరూ వెళుతుంటే అందరూ కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడానికి చేయి అందించడానికి పోటీపడ్డారు. ఆ గుంపులో పడి నాక్కూడా వూపిరి ఆడలేదు. తర్వాత జనసందోహాలతో కలిసి కాలువ మీద వంతెన దాటి బస్టాండ్ కి నడిచివెళ్ళి నూజివీడు వెళ్ళే లాస్ట్ బస్ యెక్కి అమ్మమ్మ యింటికి చేరుకునేటప్పటికి అర్థరాత్రి అయిందని జ్ఞాపకం. ఆ తర్వాత రోజు సినిమా యాక్టర్స్ అందరూ.. కొందరు తెనాలి, కొందరు గుడివాడ వెళ్ళి విరాళాలు సేకరిస్తారని అక్కడ సినిమా యాక్టర్స్ ను చూడొచ్చు అని మామయ్య ఇంటి చుట్టుపక్కల వారికి చెప్పాడు. 


అప్పట్లో రేడియో వినడం వీక్లీలు మాస పత్రికలు చదవడం బెజవాడ వెళ్ళి  సినిమాలు చూడటం గొప్పగా వుండేది. ఎవరైనా బెజవాడ వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకున్నా సినిమా చూసొచ్చినా మర్నాడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ యెంతో ఆత్రుతగా ఎదురు చూసేవారు. సినిమా కథ చెబుతారని కొనుక్కొన్నవి చూడాలని. 


ఆ తెల్లవారి పెదమామయ్య పిన్ని తాము చూసిన సినిమా యాక్టర్స్ ని గురించి గొప్పగా చెప్పడం, వారు మాట్టాడిన మాటలను విరాళాలు సేకరించడం గురించి చెబుతూ గర్వపడటం జ్ఞాపకం వుంది. 


ఎందుకో ఇదంతా లీలగా గుర్తొచ్చింది. పండంటి కాపురం సినిమా యేనా లేక మరేదైనా నా అని అనుమానం. మా పెదమామయ్యను పిన్ని ని ఫోన్ చేసి అడుగుదామనుకున్నాను. నవ్వుకున్నాను.. ఈ విషయమై ఫోన్ చేయాలా అని. మరెలా!? ఒక ఐడియా తట్టింది. . రుజువు పరుచుకోవడానికి పండంటి కాపురం సినిమా రిలీజ్ యెప్పుడైందో గూగుల్ లో వెతికాను. 1972. నా కప్పుడు ఐదేళ్ళు అని గుర్తు. లెక్క సరిపోయింది. ఆ సినిమా శత దినోత్సవం బెజవాడ లో జరిగిందని ఊర్వశి ధియేటర్ అని.. అక్టోబర్ 28 వ తేది న అని ఆ కార్యక్రమానికి పైన పేర్కొన్న అనేకమంది నటీ నటులు హాజరైనారని.. రాయలసీమ కరువు సహాయనిథి కి విరాళాలు సేకరించారని. ఈ వివరాలున్నీ వున్న ఆంధ్రజ్యోతి దిన పత్రికలో లభించింది. భలే సంతోషపడ్డాను. అప్పుటి నా జ్ఞాపకాలు యింకా లీలగా దాగివున్నాయని అర్థమైంది. వావ్ అనిపించింది నాకైతే! 


ఇక తర్వాత మెట్టినిల్లు బెజవాడ ను ఆనుకుని అవడం వల్ల

ముఫ్పై యేడేళ్ళ నుండి బెజవాడ నాలుగు దిక్కులతోనూ కలిసి.. మనుగడ సాగిస్తూ వీధి వీధి.. తిరిగినట్టుగానే వుంటుంది. మన బెజవాడ కదా.. అని ఒడలు ఉప్పొంగుతూ వుంటుంది.


యాభై యేళ్ళ జ్ఞాపకం. వావ్ వనజమ్మా అని భుజం చరచుకున్నాను. 


మెదడు ని చురుగ్గా వుంచుకోవాంటే జ్ఞాపకాలను తవ్వుకోవాలి. భాష మర్చిపోకుండా తప్పులు రాయకుండా వుండాలంటే కాగితంపై రాసుకోవాలి. బిగ్గరగా చదవాలి.



ఉదయం అంటే కలలో నుండి కల లోకి మేల్కొనడం. ఈ ఉదయం.. నేను తీసిన చిత్రాలు. అట్లాంటా నగరం.


 

3, జనవరి 2023, మంగళవారం

అనొద్దు


 అనొద్దు.. 

వీడ్కోలు తాత్కాలికం అయినప్పుడు

పర్లేదు, చెప్పకుండా వెళ్ళొచ్చు

నీ కోసం యెదురుచూపులు లేకపోయినా

రావద్దు అని అనుకోవద్దు

మళ్ళీ రా.. అని అస్సలు చెప్పను

వస్తావు కదా.. అని ఆశ వెలిబుచ్చను

కాలాన్ని విభజించే రేపగలు

నీవున్నావనే సత్యానికి సాక్ష్యాలు


మళ్ళీ కలుద్దాం అనే మాట కొందరికి 

కొన్నింటికి అసలు వర్తించదు. 

మరుగుజ్జు మాటలవి

అస్తిత్వరూపానికి అంతెత్తు రూపాలతో నిలిచిన వారికి

ఆ ముచ్చట యెలా చెప్పను.

ఓరి దేవుడా.. ఇంకా యీ మాట వారితో చెప్పాను కాదు

అదెంత హాస్యాస్పదం 😊




31, జులై 2022, ఆదివారం

మంచు పూల వాన

మంచు పూల వాన 

 

గులాబీ పువ్వు చెవిలో రహస్యం చెప్పాను. 


“నిన్ను ప్రేమిస్తున్నాను అని”.  సంతోషంగా తలను ఊపింది. 

నిత్యం నాకై వెదుకులాడేది. 

దాగుడుమూతలాట నాకిష్టమనే రహస్యం నేను చెప్పలేదుగా.. 

రోజుల తరబడి  రాలిపోకుండా ఎదురుచూసింది. 

మళ్ళీ.. వొకనాడు “నీకొక రహస్యం చెప్పనా” అంటూ.. 

సమీపించానో లేదో.. 

నిశ్శబ్దంగా రేకలు రాల్పుతూ  వివస్త్ర అయింది.

దూరంగా.. “చూడు చూడు.. 

మంచు పూల వాన కురుస్తుంది’’ అనే  మాటలు. 

వారివి   ఆనందోత్సవ సంబరాలు.  ఇక పై ఏ గులాబీ విచ్చుకోదు . 

మంచు కింద   గులాబీ.. రేకల రూపంలో మరికొంత కాలం యెదురు చూస్తుందని నాకు తెలుసు. ప్రేమంటే నాశనం లేని ఏమి కోరుకోని యెదురుచూపు.




In English Translation….  మంచు పూల వాన - వనజ తాతినేని.


Snow fall Like Flower shower 

- Vanaja Tatineni


 

I told a secret in the ear of a rose flower.


"That I love you". She nodded happily.


Always looking for me.


I haven't told you the secret that I like to hide and seek..


She waited for days without falling.


Again.. One day he said "Shall I tell you a secret"..


Approached or not..


Petals were falling silently and 


remained naked

*********


Far away.. Look look words are heard.


  “Snow falls like rain and flower showers” ​​.


They are joyous celebrations. No more roses will bloom.


I know that the rose under the snow will wait a little longer in the form of petals. 

Love is an indestructible, undesired prospect.


*********End**********






5, అక్టోబర్ 2021, మంగళవారం

ఏ దరికి ...

 పూబాల

నిలువెల్లా తడసిపోయింది

జాలిలో తడవడం కావచ్చు

ప్రేమలో తడవడం కావచ్చు

దాహంలో తడవడం కావచ్చు

ఎలాగైతేనేం నిండా తడిసిన తర్వాత 

మిగిలిన అనుభూతిని

గుదిగుచ్చడానికి ఓ దారం కావాలి. 

దండగా మారడానికి ముడులు వేయాలి

కట్టినపుడు బిగిసినట్టే వుంటుంది

వెనుక వెనుక బిగి సడలి ముడి నుండి 

జల్లున జారి పడతాయవి 

అల్లిన చేతులు పూలవలె సుకుమారమైనవి

కుత్తుకలు తెగిపడేలా బలంగా ముడి వేయలేని

జాలి హృదయం కలవి. 

పూలను భావాలను అల్లనల్లగా ముడివేయాలని

సుతిమెత్తగా దరికి చేరవేయాలని 

ఏ దరికి చేరాలని రాసిపెట్టి వుందో 

కడకు ఆ దరికే చేరతాయవి.



31, ఆగస్టు 2020, సోమవారం

పిచ్చుకమ్మలూ.. ఇటు రండి

పిచ్చుకమ్మలూ ఇటు రండి... .                            

మీరు కనుమరుగయ్యారని వాపోతుంది లోకం తమ పాపం ఏమీలేనట్లు

జనులపై దయతలచి మీ ఉనికిని చాటుకుంటూ అతిథిలా వేంచేస్తారు నా గృహానికి.

గూడు అల్లకపోయినా మీకొక గూడు కనబడింది నా వరండా ఇంటిలో

నేను కాసిని గింజలు వేలాడదీసి కొబ్బరిచిప్పలో నీళ్ళు పెట్టినందుకేమో.. అతిథిలా నా ఇంటికి వస్తూనే వుంటారు.

మీ క్షేమం సదా నా బాధ్యత అన్న వాగ్ధానం అర్దమయ్యిందో యోమో..

కరెంట్ తీగలచుట్టపై మెత్తని శయ్య ఏర్పరుచుకుని సరాగాలాడుతుంటారు ఆలుమగలు.  ఎంత మురిపెంగా వుందో మిమ్ము చూస్తుంటే..

మిమ్మలను చూస్తూ నాకు నేనే చెప్పుకుంటానిలా వేరొకరితో చెప్పినట్లు.. హృద్యంగా..

 “ఆమె గూటిలో కూర్చుని ఎదురుగా తీగపై కూర్చున్న అతనితో ఊసులాడుతుంటుంది.

అతను అపుడపుడు పెత్తనాలకు వెళ్ళినట్టేవెళ్ళి.. ఏ పురుగునో పుడకనో తెచ్చి అపురూపంగా ఆమెకందిస్తాడు.

ఆమె కిచకిచ మనుకుంటూ ఒక రెక్కను క్రిందికి వొంచి అతని చుట్టూ తిరుగుతూ ఆనందంగా నాట్యం చేస్తుంది.

అతను ఆమె మెడక్రింద తన తలను వొంచి.. ఓసి.. పిచ్చి ప్రేయసీ.. ఈ మాత్రం దానికేనా ఇంత సంతోషం... ముందురోజులకు కాస్త దాచుకో.. కలకాలపు తోడును కదా నేను.

మన వంశాన్ని వృద్ధి చేసి పంటలకు సస్యరక్షణలో తోడవుదాము.ఇక పోదాం పద పద.

మనుషులు చూస్తే మనపై ఈర్ష్య పడతారు. వారికి మనంత తీరిక మనస్సు ఎక్కడిదీ?
రెండు కళ్ళు దేనికో అప్పగించి మన ఉనికికి ఉపద్రవం తెచ్చిపెట్టేపనిలో తలమనకలైవున్నారు.

త్వరగా ఎగిరిపోదాం పద..  పచ్చని లోకం మన నెలవై.. కొలువై. “   అంటూ మీ కథను అప్పటికి ఆపేస్తాను.

పిచ్చుకమ్మాలూ.. ఇటు రండి అని రోజూ పిలవకుండానే వస్తూండటానికి జొన్న కంకుల గుత్తినొకటి వ్రేలాడగడతాను.

మీ సంతతిని కాపాడటానికి బల్లులను ఇటువైపు చూడకుండా భయపెడతాను. పక్షి పశువూ కీటకమూ జంతువూ అన్నీ వుంటేనే కదా.. మనిషి మనుగడ అన్న  కూసింత స్వార్దంతో కూడానూ..




26, మార్చి 2020, గురువారం

First Love Letter To My Dear Grand Child..

💕First Love Letter to My dear Grand child💕

ఇదిగో... ఇపుడే కాఫీ కలుపుకుని వచ్చి తూర్పు గవాక్షం తెరిచానా... నారింజ రంగు సూర్యుడు ఎంత అందంగా వున్నాడో.. అనుకుంటూ కాఫీ గ్లాస్ అక్కడ పెట్టి మొబైల్ చేతిలోకి తీసుకుని రెండు క్లిక్ లు మనిపించి ఆ అందాల సూరీడ్ని ఫేస్ బుక్ గోడ మీద అందరికీ చూపించాలనే సౌందర్య ఆరాధన, ఆరాటం తీర్చుకుని .. కె జె ఏసుదాస్ మధురంగా ఆలపించిన శివ తాండవం (లాస్య) ని వింటూ చుక్క చుక్క కాఫీ ఆస్వాదిస్తున్న తరుణంలో... మీ నాన్న నుండి నాకు వాట్సాప్ కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిప్ట్ చేసి .. ఏం చేస్తున్నారు బంగారం, డిన్నర్ అయిందా... అని నా ప్రశ్న.

అమ్మా.. బేబి పుట్టిందమ్మా.. అని ఉద్వేగమైన మాటలు. అపుడేనా.. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమమేనా... అని అడిగాను కంగారుగా. ఎవ్విరిథింగ్ ఈజ్ ఫైన్.. అమ్మా. నీ కోడలికి c section జరిగింది. అని చెప్పాడు.. నాకు ఒకేపరి గంగయమునలు కళ్ళలో ఊరుతున్నాయి. వాటిని అణుచుకుంటూ.. అభినందించాను. ఉద్విగ్నతను అణుచుకుంటూ.. ఆశీర్వదించాను. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

బంగారూ... నువ్వు వచ్చే శుభవార్త ఎలా వచ్చిందో తెలుసా! .. మార్గశిర మాసపు గురువారం మునిమాపు వేళ రోజులాగా కాకుండా మరింత ప్రత్యేకంగా కామాక్షి దీపాలతో పాటు మరికొన్ని నూనె దీపాలు వెలిగించి .. ఆ దీపకాంతులు ఇల్లంతా చైతన్యశక్తిని నింపుతున్న వేళలో నేను శ్రీసూక్తం వింటున్న సమయంలో అదొక శుభ ఆశీర్వచనమై శుభతరుణమై .. మీ అమ్మ కాల్ చేసి.. "అత్తయ్యా... అమ్మాయి పుడుతుందంట" అని చెప్పినపుడు సంభ్రమం చెందానని చెప్పను కానీ క్షణకాలం తర్వాత సర్దుకుని.. నిండు హృదయంతో నీ రాకను ఆనందం చేసుకున్న క్షణాలు అవి. నిజం చెప్పొద్దూ.. నాక్కూడా వారసత్వ వ్యామోహం వుండింది. ఆ వ్యామోహాన్ని పటాపంచలు చేసి.. శుభసమయంలో మా ఇంట్లో మహాలక్ష్మి పుడుతుందనే వార్తను విన్నాను అని వెంటనే అయిన వాళ్ళందరికీ ఆ శుభవార్తను పంచుకున్నాను.

మీ నాన్న పుట్టినపుడు ఆడపిల్ల పుట్టలేదని ఏడ్చిన నేను.. నువ్వు పట్టే సమయానికి కాలానికి ఆడపిల్ల కాకపోతే బావుండుననుకునే కాలానికి నెట్టబడ్డానని అనుకుంటాను.. బంగారూ.. నా ఆలోచనలో తప్పు వుందని నేను అనుకోను కానీ.. నీ రాకను నీ లాంటి ఆడబిడ్డల రాకను మనఃస్పూర్తిగా ఆహ్వానిస్తాను తల్లీ..!

మా ఇంటి మహలక్ష్మివి నీవు. నువ్వు పుట్టావన్న వార్తను తొలుతగా నాతో పంచుకున్న నాకే వినిపించిన మీ నాన్నకు తెలుసు.. మీ నానమ్మ నీ కోసం ఎన్ని కలలు కంటుందో.. నువ్వు మీ నాన్న లాగే వుంటావని నేను అనుకుంటే.. అమ్మా.. బేబీ నీలాగానే వుందమ్మా, వ్రేళ్ళు కూడా నీకు లాగానే వున్నాయమ్మా అని మురిసిపోతున్నాడు. నిన్ను ముందు మీ అమ్మ చూసిన తర్వాతే మాకెవరికైనా చూపమని నేను హెచ్చరిక చేసాను. మీ అమ్మ నాన్న నా రెండు కళ్ళు అయితే.. వారి కలల పంటవి.. నువ్వు నాకు పంచప్రాణాలు బంగారూ.. మీ అమ్మనాన్న ఏ పేరైనా పెట్టుకోనీ.. నేను నీకు పెట్టుకున్న పేరు “చిత్కళ”. శ్రీ శార్వరి నామ సంవత్సర చైత్ర శుద్ద విదియ బుధవారం 07:13 pm కి రేవతి నక్షత్రం నాల్గవ పాదం మీనరాశిలో జన్మించిన నీకు.. శుభాశీస్సులు బంగారూ.. ఆ శ్రీగిరి పర్వతం నుండి జగత్ మాతాపితురుల కరుణ కటాక్షాలు నీపై సర్వకాలాలు ప్రసరిస్తూనే వుంటాయని నా ప్రగాఢ విశ్వాసం.

నేను చూసుకున్నట్టే నా కొడుకుని భద్రంగా ప్రేమగా చూసుకోవటానికి నువ్వు వచ్చావు తల్లీ..
అమ్మా.. నన్ను వదలవే తల్లీ.. ఎక్కడో దూరంగా వున్నావనుకున్నా.. ఇదిగో ఇక్కడ కూడా నా కూతురి రూపంలో వుండి అనేక జాగ్రత్తలు చెప్పి సాధిస్తున్నావే .. అని మురిపెంగా.. మీ నాన్న చెప్పే మాటలను మధురంగా.. ఊహించుకుంటున్నా.

ఈ కరోన కాలం కాకపోతే నిను భద్రంగా మృదువుగా అపురూపంగా ఒడిలోకి తీసుకుని లాలించాల్సిన నానమ్మను. ఉయ్యాలలో పడుకుని కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏదో రహస్య భాషలో ఎదురుగా వున్న మీ నాన్నతో సంభాషిస్తున్న నిన్ను మొబైల్ కెమెరాలో చూస్తూ ఆ చూపునుండి హృదయం దాకా ప్రవహింపచేసుకుని గుండెతో గుండెను కలిపి భద్రంగా ముడి వేసుకున్నా బంగారూ..

మీ నాన్న కన్నా ప్రియమైనదానవు.. నిను ఒడిలోకి తీసుకుని ఆ పౌత్రి ప్రేమను నిండుగా ఆస్వాదిస్తుంటే.. నువ్వు నా చిటికెన వేలును నీ చిన్ని గుప్పిటలో బిగించి పట్టుకుంటుంటే.. నేను రాసుకున్న “అమ్మ మనసులో మాట “
లేదా “సాయం చేయడానికి చేతులు కావాలి’’ అన్న కవితలు మదిలో మెదులుతుంటాయేమో మరి.

బంగారూ... ముందు ముందు నా ఊహలు నా ఆశలు నా ఆకాంక్షలు అన్నీ వినే శ్రోతవి నువ్వే. అందుకే.. ఈ అక్షరాలలో నా మనసు మాటలను భద్రం చేస్తున్నా.. తర్వాతెపుడో చదువుకుంటావు కదా..

💕 ✍️ప్రేమతో .. నానమ్మ.🎈🎈💕






ఈ నాటి సూర్యోదయం చిత్రాలు.. 

17, డిసెంబర్ 2019, మంగళవారం

మనిషి చెట్టుకు సంతోషపు పూలు

మార్గశిర మంచులో సూరీడు కూడా కాస్త బద్దకంగా ఆవలించి మెల్ల మెల్లగా రావడానికి కూడా ఇష్టంలేనట్టు తప్పనిసరిగా వెళ్ళాలి కదా అనుకుంటున్నా సమయాలలో .. ముక్కు ఎగబీల్చుకుంటూ .. బాల్కనీ రెయిలింగ్ పై చేతులానించి మంచుభారంతో కదలలేక కదలలేక ఆకులను పూవులను మొహమాటంగా కదుల్చుతూ వున్న పూపొదలను చూడటం నాకిష్టమైన వ్యాపకం. ఆ పూపొదలపై కువకువలాడుతూ సరాగమాడుకున్నట్లుండే బుల్లి పిట్టలు పసుపు పచ్చ సీతాకోకచిలకలను కన్నార్పకుండా చూస్తుంటానని కళ్ళు నొప్పి పుట్టినప్పుడు కానీ తెలియని మైమరపు తనంలో నా సమయాలు గడవడం ఆనందదాయకం కూడా !

ఈ రోజు ఉదయం .. ఎదురుగా రోడ్డవతల బడ్డీకొట్టు బరువైన యువతి తన ఇంటికి వస్తున్న బంధువును  చూసి చటుక్కున లేచి తన రెండు చేతులను విశాలంగా చాచి ఇరవై అడుగులు దూరం ముందుకు నడిచి ఆత్మీయంగా ఆ బంధువుని ఆత్మీయంగా హత్తుకుని చెంపకు చెంప ఆంచి స్వాగతం పలికే మనోహర దృశ్యం చూడటానికి నా కనులు అదృష్టం చేసుకున్నాయని చెప్పాలి. ఇలా ఎందుకు అంటున్నానో మీకర్ధమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. 

ఆ మనోహర దృశ్యం నుండి మళ్ళీ పూపొదలపై నా దృష్టిని పారించినప్పుడు నాకనిపించింది.. కోయకుండా మిగిలి ఎండిన పూలు తరువుకొక సంరంభ చిహ్నమే  కాదు వాటిని గాంచిన మనకు కూడా నిన్నటి అనుభూతి జ్ఞాపకం మరొక తీరులో కనబడుతుంది. మనిషి చెట్టుకు సంతోషపు పూలు నిలువెల్లా పూచే సమయాలవి.

ఈ మధ్య ప్రేమంటే ఏమిటీ అనే ప్రశ్న ..పుట్టుకొచ్చింది. అందరూ తలా ఒక వ్యాఖ్యానమిచ్చారు. "ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే" ... సిరివెన్నెల గారి సాహిత్యం. నా దృష్టిలో ప్రేమంటే .. విశ్వసనీయత నిశ్చింత. కేవలం ఈ రెండిటితోనూ ప్రపంచంలో ఎక్కడైనా తిరిగి భద్రంగా యింటికి వస్తామని నమ్మకం లేకపోవడమే ఇప్పటి అసలైన విషాదం కూడా! 

ప్రేమంటే ..కాంతిని వెదజల్లి మనసుకు కల్గించే శాంతి. ఆ శాంతి కోసం మనుషులు పరిసరాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి మనముంచాలి కదా ..అని అనుకుంటూ ..  అందెశ్రీ పాట "మాయమయిపోతున్నాడమ్మా మనిషన్నవాడు " ను గుర్తుకు తెచ్చుకున్నాను. 






7, డిసెంబర్ 2019, శనివారం

ఇంతకన్నా ఇంకేం కావాలి !?

నా కథలపై ... ఒక మంచి పాఠకురాలి స్పందన

రమాదేవి గారూ ... రచయితకు పాఠకుడు దొరకడమే అదృష్టం అని అనేకసార్లు చెప్పివుంటాను . పాఠకులు తెలిపే స్పందన చూస్తే అది నిజమనిమరింత అదృష్టం పట్టిందని అనుకుంటాను కూడా . మీరు చాలా ఆసక్తిగా పుస్తకాలు అడగడటం ..నేను మీకు పిడిఎఫ్ లో మాత్రమే పంపగల్గడం ఒకింత సిగ్గుపడ్డాను కూడా నేను . ఆ పిడిఎఫ్ లో వున్న రెండు కథా సంపుటాలను చదివి మీ స్పందన తెలిపినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఒకరకంగా ..ఇది నాకొక నూతన ఉత్సాహం. టోటల్లీ పెన్ డౌన్ చేసే అంత నిరాశలో కూరుకుపోయిన నాకు మీ స్పందన కొత్త ఊపిరి.

మీకు నేను చిన్న వివరణ యిచ్చుకుంటున్నాను . నా కథలన్నీ ..ఐ మీన్ నేను వ్రాసిన కథలన్నీ ..నా అనుభవంలో నుండో ..నాకు తెలిసిన వారి అనుభవంలో నుండో వ్రాసినవి ... కథ వ్రాయడం అంటే కల్పన కాదు నాకు . కథలలో బాగా లీనమైపోతామని చెప్పే పాఠకుల భావోద్వేగం నాకు పరిచితమే. ఆ భావోద్వేగాన్ని అణుచుకుని కథ వ్రాయడానికి నేను చాలా శ్రమపడతాను. ఒకోసారి పూర్తిగా విఫలమవుతాను.

ఈ సాయంత్రం నాకుచాలా సంతోషాన్నిచ్చింది. ఇక రాబోతున్న మూడవ సంపుటిలో మరింత పరిపక్వతగా వ్రాసిన కథలే ఉంటున్నాయి. అవి కూడా చదవండి చదువుతూనే వుండండి .. నన్ను నాలాంటి మరికొందరి రచయితల కథలనూ చదివి వారిని ఇలాగే మీ స్పందనతో అభినందిస్తారని ఆశిస్తూ.. మీ స్పందన తెలపండి ..తెలుపుతారు కదూ .. మీరు బ్లాగర్ అయితే మీ బ్లాగ్ చిరునామా తెలియజేయగలరు. facebook లో మీ రాతలే మిమ్మలను గుర్తుపట్టడానికి నాకు ఊతం మరి :)

నేను ముందుగా ఒక పాఠకుడిని ..ఎప్పుడూ పాఠకుడిగా ఉండటానికే ఇష్టపడతాను. రచయితను కావడం యాదృచ్చికమే రమ గారూ .. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు . మీ అనుమతి లేకుండా .. మీ స్పందనను ఇలా పోస్ట్ చేస్తున్నందుకు మన్నించాలి. నమస్తే !

రమాదేవి గారి స్పందన ... విద్యుల్లేఖ లో ఇలా .

చెప్పాలనిపించింది....

rama devi

4:47 PM (4 గంటల క్రితం)

వనజ గారు మీరు రెండు పుస్తకాలు పంపించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది నాలుగు మాటల్లో చెప్పలేను... రాయికి నోరొస్తే ఈ కథల పుస్తకం కొంచెం సౌమ్యంగా నెమ్మదిగా పారే నదిలా కొన్ని ఒక్కసారిగా నదిలో విసిరే రాయి సృష్టించే కల్లోలం కానీ కుల వృక్షం పుస్తకంలో కథలన్నీ మాత్రం జారే జలపాతం లోని వేగాన్ని.. సముద్రంలోని అలల ను ఒడిసి పట్టుకున్నట్టుగా ఉంటాయి.. కుల వృక్షం పుస్తకంలో చాలా కథలు ఇదివరకు చదివినవే.. ఏవో ఒకటి రెండు అసలు చదవలేదు అనుకుంటా.. అయినా కూడా ప్రతి కథ మళ్లీ ఇప్పుడు కొత్తగా చదువుతుంటే మొదటి సారి చదివినప్పుడు ఎంత ఆసక్తి ఉంటుందో.. అంతే ఆసక్తిని ఒక్క రవ్వంత కూడా తగ్గించకుండా మీ కథలన్నీ చదివిస్తాయి.. ప్రతి కథ మనసుని బంధించి ఆలోచనలోకి ఉవ్వెత్తున నెట్టేస్తుంది...

ప్రతి ఒక్క కథ చదువుతున్నప్పుడు దృశ్య రూపకంగా కనిపిస్తుంది.. ఏ ఒక్క కథ కూడా అ ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుండు అని నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు.. ప్రతి కథ చదివే టపుడు ఎలా అనిపిస్తుంది అంటే ..ఆ కథంతా మీరు దూరం నుంచి చూస్తూ చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.. ఎక్కడ ఇది ఒక ఊహ ..కల్పన అని కూడా అనిపించదు..

మీ రచనలలో అందరూ అమ్మాయిలు లేదా స్త్రీలు చాలా ఉన్నతంగా ఉంటారు అంటే నిజంగా మన జీవితంలో ఇటువంటి సంఘటన ఎదురైతే మీ రచనలలో స్త్రీ స్పందించిన విధంగానే స్పందించడమే సబబు అని నాకు అనిపిస్తుంది..

మీ కథలను అందరూ ఒప్పుకుంటారా అని నేను అనను ఎందుకంటే నేను చూసిన వాళ్ళ మధ్యనే చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్లు కూడా కొన్ని అంశాలను వాళ్లు కథలుగానే ఒప్పుకోడానికి ఇష్టపడతారు.. తప్ప నిజంగా అటువంటి ఆత్మగౌరవం గల స్త్రీలు ఉంటారు అని ఒప్పుకోలేరు..

వనజ గారు మీ పుస్తకానికి రివ్యూ రాయాలి అంటే ప్రతీ కథకీ ఒకటి రాయాలి.. ప్రతి కథ రెండు వాక్యాలలో చెప్పడం కుదరదు.. నీ పుస్తకాలు చదివించాలి అంటే ఒక కథని చెప్పినా చాలు మిగతా కథల కోసం వాళ్లే వెంటపడి చదివేస్తారు...

ప్రతి కథలో మీరు కనిపిస్తా రండి అది నిజం మీరు తెలియకముందే మీ బ్లాగ్ చదివాను.. అందులో కథలు చదివాను..అప్పుడు కూడా నా అభిప్రాయం అదే కథలు మీకోసం రాసుకుంటారు మీరు ఉంటారు ఈ కథలో రచయిత్రి తన జీవితంలో నుంచి అనిపిస్తాయి అంటే ఆ జీవితాన్ని అనుభవించారని కాదు మొత్తానికి మీరు ఆ కోణాలన్ని చెప్పగలరు అనిపిస్తుంది..

మీ కథలు చదువుతున్నప్పుడు శరత్ చంద్ర నాయకి గుర్తొస్తుంది...(తోడికోడళ్ళు సినిమాలో సావిత్రి పాత్ర)... జీవితానికి భయపడడం అనేది ఆ నాయకి లక్షణం కానేకాదు...

మీరు పుస్తకాలు పంపించడం వలన ఆ కథల్ని వరుసగా చదువుతుంటే ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను... మీకు నా ధన్యవాదాలు వనజ గారు

మీకు హృదయపూర్వక ధన్యవాదాలు రమ గారూ .. 




26, నవంబర్ 2019, మంగళవారం

సమస్య ..ఒక కానుక



నేను కుండీలో పెంచే మొక్కల్లో ముఖ్యమైనది "మరువం " పాక్షికంగా సూర్యరశ్మి తగిలే చోటులో మరువం బాగా ప్రవర్ధమానం అవుతుంది. పూలు కరువైనప్పుడు మరువం, తులసి దళాలు పూజకు వాడుకుంటాను. అయినా గాలి గట్టిగా వీస్తే చాలు మరువం వాసన కాఫీ వాసనలా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. 

ఒకోసారి మరువం తుంచనప్పుడు ఎండిపోతుంది. అప్పుడప్పుడు ఎండిపోయిన మరువం కొమ్మలను దెచ్చి ఇష్టమైన పుస్తకాలలో పెడుతూ వుంటాను. పెట్టిన పేజీని చదివి అందులో విషయాన్ని చదువుకుని మురిసిపోతాను. పుస్తకాలు బహుమతిగా ఇచ్చినప్పుడు మరువం పెట్టి యిస్తూ వుంటాను. కొన్ని రోజుల క్రిందట  పది దాకా మరువం కొమ్మలు ఎండిపోయి కనిపించాయి. వాటిని తీసుకొచ్చి .. పరుపు పై చక్కగా పేర్చి ఉంచిన పుస్తకాలపై .నుండి ఒక పుస్తకం తీసుకుని అందులో కొన్ని కొమ్మలుంచాను. కొన్ని బట్టల  బీరువాలో పెట్టాను. 

మళ్ళీ యెందుకో ఆసక్తి కలిగి మరువం కొమ్మలు పెట్టిన పుస్తకం చేతిలోకి తీసుకుని ఆ కొమ్మలు పెట్టిన చోటున ఏమి వ్రాసి వుందో చూసుకున్నాను. సమస్యలు అనే కానుక. ఆహా అనుకున్నాను. ఆ కానుక మనకి మనం తెచ్చుకున్నది కావచ్చు ఇతరుల ద్వారా మనకు కలగడం కావచ్చు. ఏమైనా సమస్యలను కానుకగా స్వీకరించక తప్పదు. .సమస్యలు అనుభవాల దండలో పూలు. జ్ఞాపకాలు పూలు వాడినా ఆ పరిమళాన్ని అంటి పెట్టుకున్న దారపు పోగులు. 

సమస్యలు అందరికీ వస్తూ ఉంటాయి. వాటిని ఎలా యెదుర్కొన్నామన్నదే జీవితం. 
చాలా పుస్తకాలు మూడు పెట్టెలవరకూ ఇతరులకి ఇచ్చేసాను. మరికొన్ని పుస్తకాలు చదువుకొని ఇమ్మని మా కిట్టీ సభ్యులకు బట్వాడా చేస్తున్నాను. ఒకరినుండి మరొకరు మార్చుకుని చదువుకోమని. ఒక ఫ్రెండ్ "వేయిపడగలు "అడిగింది. తీసుకెళ్లి యిచ్చాను. మూడునెలలు టైమ్  లిమిట్ పెట్టి అప్పటికి చదివేయాలని చెప్పాను..   

అక్షర క్రమంలో సర్దుకోవాలని కింద పరచి .. అలమారాలు చెమ్మగా ఉన్నాయని ..పుస్తకాలన్నిటినీ పరుపు పై పవళింపజేశాను. ఏమిటో ..నాకీ సమస్య  :) ఎదుర్కోవాలి తప్పదు. 
పెద్దలగా మన పిల్లలు తమకు సమస్యను ఎలా కొని తెచ్చుకుంటారో .. వాటిని ఎలా పరిష్కరించుకుంటారో చూస్తూ ఉండటం తప్పదు. పెద్దలాగా సలహా ఇవ్వబోతే ... నీకెందుకు అని కసురుకుంటారు కాస్త సున్నితమైన వాళ్ళైతే .. I'll Take Care. don't worry అంటారు. సమస్య వాళ్ళ చేయి దాటిపోయేదాకా చూసి అప్పుడు మనం కల్పించుకోవాలన్నమాట. అప్పుడు సమస్యలు ఒక కానుకే అనుకోవాలన్నమాట.నా లిస్ట్ లో వున్నా  కొంతమంది పిల్లలకు ఇది సెటైర్ .. :)  అవకాశం వస్తే పెద్దలు దెప్పకుండా వొదులుతారా యేమిటీ  :) 

ఈ విషయం అంతా రాసాక ..ఇంకొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. పేజీ తెరిచి చూడటం అందులో వున్న విషయాన్ని చదువుకుని sync చేసుకోవడం అన్నది .. నా బైబిల్ మిత్రులని చూసి నాకు అంటుకుని ఉంటుందనిపిస్తుంది  :) ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట అని నానుడి కదా ! 

పని కట్టుకుని చేసే మత  ప్రచారం చాపక్రింద నీరులా మనని చుట్టుకుంటుంది. అది రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నదని మనకి తెలియనిది కాదు. అది ఏ మతమైనా సరే ! మనిషికి మతం ముఖ్యం కాదు.. నా చుట్టూ ఉన్న విషయాలపై కథ వ్రాయాలి అనేంత బలంగా మత విషయాలు రాజకీయ కోణాలు బలంగా వేళ్ళూనుకుంటున్నాయి.  దేవాలయాలు చరిత్ర కూడా బాగా గమనిస్తూ ..అనేక విషయాలు తెలుసుకుంటున్నాను. మనిషికైనా దేశానికైనా సమస్యలు కానుకలు అనుకోవాలి. అంతకు మించి పోరాటం చేయాలి తప్పదు.





 

21, నవంబర్ 2019, గురువారం

తడిచిన గుండెకు తీగైన మరో గుండె




ఈ రోజు నా బ్లాగ్ పుట్టినరోజు ... తొమ్మిదేళ్ల క్రితం ఇదేరోజున బ్లాగ్ వ్రాయడం మొదలెట్టాను.
బ్లాగ్ వ్రాయడం మొదలెట్టకపోతే నేను ఈ రచనా రంగం వైపు వచ్చేదాన్ని కాదేమో .. కాలక్షేపం కోసమైతే బ్లాగ్ మొదలెట్టలేదు .అది కచ్చితంగా చెప్పగలను.నా  బ్లాగ్ అంటే .. నన్ను నేను బహిర్గతం చేసుకుని మళ్ళీ నాలోకి వొంపుకోవడం. ఒకవిధంగా చెప్పాలంటే .. నా ఉనికి. ప్రపంచానికి నా గురించి తెలియజేసేది కూడా . యేవో కొన్ని రాతలు తప్ప నేను వ్రాసుకున్నవి అన్నీ బ్లాగ్ లో జతపరిచాను . కొన్ని తుడిచివేసాను. (నాకు నచ్చక) 
నా జీవితంలో నేను రెండింటిని చూసి గర్వపడతాను .. మొదటిది నా కొడుకు . రెండు నా బ్లాగ్. 
గత సంవత్సరం నేను USA లో అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు .. నాకు ఆరోగ్యం బాగోలేదు. హాస్పిటల్ కి వెళ్లే సమయమూ కాదూ ఎమర్జన్సీ కూడా కాదు. గుండెల్లో మంట విపరీతమైన పెయిన్. నాకేదో అయిపోతుందనిపించింది. అబ్బాయితో చెప్పాను .. నా బ్లాగ్ డిలీట్ అయిపోకుండా జాగ్రత్తగా చూడు అని. అది నా అప్పగింత  :) 

ఇంత శరీరానికి చిన్న ఇబ్బంది కల్గితే ఏదో అయిపోతుందని ఊహించుకుని భయపడటం కూడా నా లక్షణం కాదు. నాకెందుకో ఆ సమయంలో ఒకటి గుర్తుకొచ్చింది. "నువ్వు కచ్చితంగా హార్ట్ ఎటాక్ తోనే చనిపోతావ్, నీ గుండె ..నీవి నీది కాని వేదనలు కూడా మోసి మోసి కునారిల్లిపోయి ఉంటుంది. అన్నీ నీకే కావాలి. అన్నీ హృదయం దాకా తీసుకుంటావ్. నాకెందుకు అని అనుకోవు. నీ జాతకం కూడా అదే చెపుతుంది " అని ఒక ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆ క్షణంలో. నేను జాతకాలను నమ్ముతాను నమ్మను అనేది పక్కన పెడితే .. మనకో మన దగ్గరవాళ్లకు ఏదైనా మంచి లేదా చేదు జరుగుతుందని చెపితే అదే ఆలోచిస్తాము. నేనపుడు ఆ స్థితిలోకి అప్రయత్నంగా నెట్టబడి .. అలా అప్పగింతలు పెట్టాను. 

అప్పటి నా స్థితికి కారణం వెర్టిగో లక్షణాలు .. మరియు .. శరీరానికి కదలికలు లేకుండా ఎప్పుడూ కూర్చునో పడుకునే ఉండటం మూలంగా ... జీర్ణాశయంలో gas ఉత్పత్తి ఎక్కువకావడం. అదంతా తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ .. నేను దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నానో తెలిసిన సమయం అది.  

నా కన్ను చెమరిస్తే మనసు  నీరైతే గుండె బరువెక్కితే  ..   హృదయం చెమ్మగిల్లితే.. కోపం వస్తే ..ఎండ కాస్తే వాన కురిస్తే ..నవ్వొస్తే ... అనుభూతి నిలవనీయకపోతే ..ఆలోచన పంచుకోవాల్సి వస్తే ... నన్ను నేను బహిర్గతం చేసుకుని తెరిపిన పడటానికి .. డైరీ లాంటి బ్లాగ్ .. నాకు భుజమైంది. ఆసరా అయింది. నా తడిచిన గుండెను ఆరేసుకోవడానికి మరో గుండె తీగైంది. అందుకే నా బ్లాగ్ అంటే నాకు అత్యంత ఇష్టం . ... కచ్చితంగా నా బ్లాగ్ లో నేను దొరుకుతాను. <3 ఐ లవ్ మై బ్లాగ్ .  ఎంతోమంది వీక్షకులు .. చదువుతూ .. అభిమానంగా పలకరిస్తారు. అది చాలు కదా ..  హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు "వనజ వనమాలి" నాలోనే నాతోనే వుంటూవుండాలి నా నేస్తమై ... వ్యసనమై..  

ఈ వ్రాతలు ఇసుకలో వ్రాసిన వ్రాతలు కావు. ఏ బేషజాలు లేకుండా .. ఆర్భాటాలు లేకుండా కీర్తికండూతి కోసం ఆలోచించకుండా వ్రాసుకున్న రాతలు. నిజాయితీగా వ్రాసుకున్న రాతలు. 
కథల విషయానికి వస్తే ఒక పాతిక వంతు కల్పనలు ఉండవచ్చు తప్ప .. వాస్తవానికి ..నా అనుభవానికి ఇతరుల అనుభవానికి  దూరంగా నేల విడిచి .. రచనలు చేయలేదు నేను. ఎంతో మంది ఇప్పటికీ చదువుతూ ..తమ స్పందనను నాతో పంచుకుంటూ ... బ్లాగ్ బావుందండీ .. అని చెప్పడం నాకు సంతోషాన్నిస్తుంది. ఆ స్పూర్తితో వ్రాస్తూనే ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతలు. 



17, నవంబర్ 2019, ఆదివారం

చరణౌ కరుణాసింధుః

అంతరాంతరాలలో వున్న దీపం వెలగాలంటే ... ఈశ్వరుడిపై విశ్వాసం వుండాలి. లౌకిక దృష్టితో వ్యాపార దృష్టితో భక్తుడిని భగవంతుడిని చూసినంత కాలమూ భక్తి ఈశ్వరుడు రెండూ మనకి అర్ధం కావు . ఇవి మాటలు అర్ధమైనంత తేలికపాటి జ్ఞానం కాదు. అనుభూతి ప్రధానమైన ఆధ్యాత్మికమైన అనుభవం.  ఎవరి అనుభవం వారికి ప్రాధాన్యం. ఒకరికి మన అనుభవాన్ని సరఫరా చేయలేము... గీతాంజలిని  నిత్య పఠిత గ్రంధము చేసుకోవడం మూలంగా లోకం మరింత బాగా అర్ధమవుతుందని కాదు..మనం యెలా   జీవిస్తే ప్రశాంతంగా వుండగలమో తెలుస్తుంది. ఆ అనుభవంలో నుండి పుట్టినదే క్రింద వ్రాసుకున్న ప్రార్ధన. తర్వాత కొంత ఆలోచన చేసి ... ఈ ఉపోద్ఘాతం వ్రాసుకున్నాను. 

చిత్రం: అరుణాచలేశ్వరుని సన్నిధి (చిత్ర సేకరణ సునీత పోతూరి గోడపై నుండి ) 


తండ్రీ..
నిప్పులు చెరిగే యెండలో రాతి మెట్లపై నడిచే అవసరం కల్పించావ్ సరే..
పాదరక్షలు లేవని భంగ పడకుండా ..
ఆ రాతిబాటకు ఇరుపక్కలా.. పచ్చని పచ్చికనూ పరిచివుంచావు

కష్టంలో కూడా సౌఖ్యాన్ని పక్కనే వుంచిన నిన్ను
నా తండ్రిగా.. కీర్తించకుండా వుండగలమా..
నీ కరుణా సముద్రపు అలల తాకిడికి 
వినమ్రంగా తలవొంచనా.. తడిచిన.. కనులతో.. ఈశ్వరా!