21, నవంబర్ 2019, గురువారం

తడిచిన గుండెకు తీగైన మరో గుండె
ఈ రోజు నా బ్లాగ్ పుట్టినరోజు ... తొమ్మిదేళ్ల క్రితం ఇదేరోజున బ్లాగ్ వ్రాయడం మొదలెట్టాను.
బ్లాగ్ వ్రాయడం మొదలెట్టకపోతే నేను ఈ రచనా రంగం వైపు వచ్చేదాన్ని కాదేమో .. కాలక్షేపం కోసమైతే బ్లాగ్ మొదలెట్టలేదు .అది కచ్చితంగా చెప్పగలను.నా  బ్లాగ్ అంటే .. నన్ను నేను బహిర్గతం చేసుకుని మళ్ళీ నాలోకి వొంపుకోవడం. ఒకవిధంగా చెప్పాలంటే .. నా ఉనికి. ప్రపంచానికి నా గురించి తెలియజేసేది కూడా . యేవో కొన్ని రాతలు తప్ప నేను వ్రాసుకున్నవి అన్నీ బ్లాగ్ లో జతపరిచాను . కొన్ని తుడిచివేసాను. (నాకు నచ్చక) 
నా జీవితంలో నేను రెండింటిని చూసి గర్వపడతాను .. మొదటిది నా కొడుకు . రెండు నా బ్లాగ్. 
గత సంవత్సరం నేను USA లో అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు .. నాకు ఆరోగ్యం బాగోలేదు. హాస్పిటల్ కి వెళ్లే సమయమూ కాదూ ఎమర్జన్సీ కూడా కాదు. గుండెల్లో మంట విపరీతమైన పెయిన్. నాకేదో అయిపోతుందనిపించింది. అబ్బాయితో చెప్పాను .. నా బ్లాగ్ డిలీట్ అయిపోకుండా జాగ్రత్తగా చూడు అని. అది నా అప్పగింత  :) 

ఇంత శరీరానికి చిన్న ఇబ్బంది కల్గితే ఏదో అయిపోతుందని ఊహించుకుని భయపడటం కూడా నా లక్షణం కాదు. నాకెందుకో ఆ సమయంలో ఒకటి గుర్తుకొచ్చింది. "నువ్వు కచ్చితంగా హార్ట్ ఎటాక్ తోనే చనిపోతావ్, నీ గుండె ..నీవి నీది కాని వేదనలు కూడా మోసి మోసి కునారిల్లిపోయి ఉంటుంది. అన్నీ నీకే కావాలి. అన్నీ హృదయం దాకా తీసుకుంటావ్. నాకెందుకు అని అనుకోవు. నీ జాతకం కూడా అదే చెపుతుంది " అని ఒక ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఆ క్షణంలో. నేను జాతకాలను నమ్ముతాను నమ్మను అనేది పక్కన పెడితే .. మనకో మన దగ్గరవాళ్లకు ఏదైనా మంచి లేదా చేదు జరుగుతుందని చెపితే అదే ఆలోచిస్తాము. నేనపుడు ఆ స్థితిలోకి అప్రయత్నంగా నెట్టబడి .. అలా అప్పగింతలు పెట్టాను. 

అప్పటి నా స్థితికి కారణం వెర్టిగో లక్షణాలు .. మరియు .. శరీరానికి కదలికలు లేకుండా ఎప్పుడూ కూర్చునో పడుకునే ఉండటం మూలంగా ... జీర్ణాశయంలో gas ఉత్పత్తి ఎక్కువకావడం. అదంతా తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ .. నేను దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నానో తెలిసిన సమయం అది.  

నా కన్ను చెమరిస్తే మనసు  నీరైతే గుండె బరువెక్కితే  ..   హృదయం చెమ్మగిల్లితే.. కోపం వస్తే ..ఎండ కాస్తే వాన కురిస్తే ..నవ్వొస్తే ... అనుభూతి నిలవనీయకపోతే ..ఆలోచన పంచుకోవాల్సి వస్తే ... నన్ను నేను బహిర్గతం చేసుకుని తెరిపిన పడటానికి .. డైరీ లాంటి బ్లాగ్ .. నాకు భుజమైంది. ఆసరా అయింది. నా తడిచిన గుండెను ఆరేసుకోవడానికి మరో గుండె తీగైంది. అందుకే నా బ్లాగ్ అంటే నాకు అత్యంత ఇష్టం . ... కచ్చితంగా నా బ్లాగ్ లో నేను దొరుకుతాను. <3 ఐ లవ్ మై బ్లాగ్ .  ఎంతోమంది వీక్షకులు .. చదువుతూ .. అభిమానంగా పలకరిస్తారు. అది చాలు కదా ..  హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు "వనజ వనమాలి" నాలోనే నాతోనే వుంటూవుండాలి నా నేస్తమై ... వ్యసనమై..  

ఈ వ్రాతలు ఇసుకలో వ్రాసిన వ్రాతలు కావు. ఏ బేషజాలు లేకుండా .. ఆర్భాటాలు లేకుండా కీర్తికండూతి కోసం ఆలోచించకుండా వ్రాసుకున్న రాతలు. నిజాయితీగా వ్రాసుకున్న రాతలు. 
కథల విషయానికి వస్తే ఒక పాతిక వంతు కల్పనలు ఉండవచ్చు తప్ప .. వాస్తవానికి ..నా అనుభవానికి ఇతరుల అనుభవానికి  దూరంగా నేల విడిచి .. రచనలు చేయలేదు నేను. ఎంతో మంది ఇప్పటికీ చదువుతూ ..తమ స్పందనను నాతో పంచుకుంటూ ... బ్లాగ్ బావుందండీ .. అని చెప్పడం నాకు సంతోషాన్నిస్తుంది. ఆ స్పూర్తితో వ్రాస్తూనే ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతలు. కామెంట్‌లు లేవు: