15, ఫిబ్రవరి 2017, బుధవారం

ఏమిటో ..

కొన్నాళ్ల క్రితం  ఒక విషయం నా అనుభవంలోకి వచ్చింది . ఒకటే నవ్వుకున్నాను. కొందరు ఇదంతా చదివి అంతగా నవ్వేది ఏముంది అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు పంచుకోవాలి తప్పదు.

మా వారికి అనారోగ్యం కారణంగా వైద్య పరీక్ష biopsy తీయించి diagnostic చేయడానికి ఓ  డయాగ్నొస్టిక్స్ సెంటర్ కి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి రిసెప్షన్ లో ఉన్నామె భోజనం చేస్తున్నారు. కొద్దిసేపు వెయిట్ చేద్దాం అప్పటికే చాలా ఆలస్యం అయిందనుకుంటూ చైర్ లో కూర్చున్నానో లేదో ఆమె చేయి కడుక్కుని వచ్చేసారు . అయ్యో ..నేను వెయిట్ చేస్తాను, పర్వాలేదు భోజనం ముగించి రండి అన్నాను ఇబ్బందిగా . లేదండీ భోజనం చేయడం అయిపోయింది, చెప్పండి ఏం కావాలి ? అని అడిగారు .
పరీక్ష చేయించే నిమిత్తం తీసుకొచ్చిన ప్లూయిడ్స్ & పీస్ బాక్స్ ని ఆమె చేతికి ఇచ్చి ఆమె అడిగిన డబ్బు ఇచ్చి ఎప్పుడు రమ్మంటారు అని అడిగాను . ఆమె ఐదు రోజుల తర్వాత కాల్ చేస్తాము అప్పుడు రండి అన్నారు . అంతకు క్రితం పరీక్ష చేసినపుడు 24 గంటలలోనే ఇచ్చిన సంగతి చెప్పాను. ఈ టెస్ట్ ఆలస్యం అవుతుందని చెప్పి ఆ రిపోర్ట్ ఇప్పుడు మీదగ్గర ఉందా అని అడిగారు . ఉందని చెప్పి తీసి ఇస్తే ..జెరాక్స్ తీయించి ఒక copy ఇమ్మని అడిగారు . డ్రైవర్ ని పిలిచి  జెరాక్స్ సెంటర్ కి పంపి .. వెయిట్ చేస్తూ ఉండగా ..  ఆమె కూతురు వచ్చి  ఎదురుగా ఉన్న అద్దంలో  ప్రక్కకు తిరిగి వెనక్కి తిరిగి కర్లీ లాంగ్  హెయిర్ స్టైల్ ని చూసుకుంటూ ..ఎలా ఉంది మమ్మీ అని అడుగుతుంది.  ఆ అమ్మాయి బ్యూటీ  పార్లర్ కి వెళ్లి వచ్చినట్లు తెలుస్తూనే ఉంది. బాగానే ఉందిలే ! అందంగా కనబడాలనే సృహ కన్నా ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి తెలియడంలేదు నీకు .CBC చేసాను కదా  RBC count   చాలా తక్కువుంది ఎనిమిది కన్నా తక్కువ అంది . నేను ఆ పిల్ల వంక ఆశ్చర్యంగా చూసాను . చాలా లావుగా ఉంది . నా చూపుని అర్ధం చేసుకున్న ఆమె    అమ్మాయి హైదరాబాద్లో హాస్టల్ లో ఉంటుంది . ఎంతసేపు కోక్ లు ,పిజ్జాలు అదే ఆహారం . ఉన్న నాలుగురోజులైనా పండ్లరసాలు ఇవ్వాలి అని చెప్పింది . నేను నాకు తెలిసిన కొన్ని కూరగాయలు,పండ్లు గురించి చెప్పాను . ఆమె చాలా సంతోషించి ఇంటికి వెళ్ళాక చేసి చూస్తాను అంది .

ఆమెకి గత  రిపోర్ట్ కాపీ ఇచ్చి బయటకి వచ్చి కార్లో కూర్చుని డోర్ వేసుకోబోతుండగా ఆ అమ్మాయి గబ్ గబా బయటకి వచ్చి..ఆంటీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆత్మీయంగా అనిపించారు . మీకు ఏమైనా  హెల్ప్ చేయాలనిపిస్తుంది . ముఖ్యంగా అంకుల్ హెల్త్ గురించి . అంటూ  నాకు కొన్ని బైబిల్ వాక్యాలు వ్రాసియున్న కార్డ్స్ ఇచ్చి ..రోజూ ఇవి చూసుకుంటూ ఉండండి అంది . నేను మొహమాటంగానే అందుకున్నాను . అంకుల్ మెడిసన్ వేసుకునే టప్పుడు  ఈ వాక్యాలతో పాటు యేసు రక్తంకి జై అనుకోండి అంది. నేనూ మీ తరపున ప్రేయర్ చేస్తాను,  అలాగే మీరు రేపు ఆదివారం ప్రేయర్ కి రండి ..అంటూ చర్చ్ అడ్రెస్స్ తో ఉన్న రూట్ మ్యాప్ కార్డు ని నా  చేతిలో పెట్టింది. నేను థాంక్స్ చెప్పి కార్ డోర్ వేసుకున్నాను (కాస్త కోపంగా ) ఆ అమ్మాయిలో నాకు అనేక కోణాలు కనిపించాయి. తన ఆరోగ్యం పట్ల తనకి శ్రద్దలేదు, తల్లి బాధ పట్ల ఆలోచన లేదు. ఇతరుల స్థితిని బట్టి సానుభూతి చూపిస్తూ  మత ప్రచారం చేసే  ఆసక్తి మాత్రం ఉంది. నేనైతే ఖచ్చితంగా అలా చేయను.  ఆరోగ్యం చేర్చమని మౌనంగా ప్రార్ధించి ఉండేదాన్ని.

తాము నమ్మిన వాటిపట్ల విశ్వాసం మంచిదే ! కానీ అలా చేయండి, ఇలా చేయండి అనే సలహాలు నాకిష్టం ఉండవు . ముఖ్యంగా ఇలాంటి మానసిక పరిస్థితుల్లో దేవుని పేరిట జరిగే ప్రచారం. పుట్టిన తర్వాత కేర్ కేర్ మని  ఏడ్చిన క్షణం నుండి మృత్యువుని నీడగా మోస్తున్న వాళ్ళం . అంతా దైవేచ్ఛ! మనకి ఎలా  రాసి ఉంటే అలా జరుగుతుంది అనే స్వభావం నాది.  మానవ ప్రయత్నాలు అన్నీ చేస్తాను తప్ప బలహీన స్థితిలో ఎవరి ప్రలోభాలకు నేను లొంగను. అన్నట్టు నేను వ్రాసిన సంస్కారం కథలో కూడా ఇలాంటి అంశం ఉంటుంది. నేను పరమత ద్వేషిని కాదు కానీ మత  ప్రచారానికి వ్యతిరేకిని ..అందుకే నవ్వుకుంటాను గుర్తుచేసుకుని మరీ !   ఏమిటో ..ఈ మనుషుల తీరు ? 

5, ఫిబ్రవరి 2017, ఆదివారం

ఈ రోజు

ఈ ప్రభాతాన ఆహ్లాదకరమైన విరిబాలల నవ్వులని చూపి

ఆయువు కొంచమైనా అలాగే ఉండటం నేర్చుకోమన్నావ్

ఏ సీతాకోకచిలకల గుంపుకో ఈ వనానికి వచ్చే దారిచూపించి

ఆ అక్షరాలని మీతో పాటు ఎగరేయమని చెప్పేవుంటావు


వీనులవిందైన సంగీతాన్ని భావ పరిమళాలని కలగలిపిన

పాటని రవాణా చేయమని చిరుగాలిని ఆదేశించే ఉంటావు

ఉదయిస్తున్న సూర్యుడిని చూపించి ఎవరి

పనిని వారు బాధ్యతతో చేసుకుపోవడమెలాగో నేర్చుకోమన్నావు.


ఇన్ని చూపిన నువ్వు ...

వేటగాడిని ఏ రూపంలో పంపనున్నావో తండ్రీ ..

నా హ్రదికి శరాన్ని గురి పెట్టమని ..

నిత్య గాయాల నీ దయామృత లేపనాల సంయోగమే కదా ..

నాకిచ్చిన ఈ రోజు.




1, ఫిబ్రవరి 2017, బుధవారం

దింపేయగ రాలేవా

పొరలు విప్పుకుంటున్న బాధ  పొగిలి పడుతుంది

రాలుగాయి రాత్రి ముందుకు కదలనంటుంది

మనసంచున వ్రేలాడుతున్నదాన్ని పుటుక్కున తెంపేయలేను, 

మాటేసిన సంవేదనని  కన్నీళ్ళతో కడిగెయ్యలేను


అనుభవాలన్నీ ఆవేదనలో విభజన చెందాక 

రెండు సగాలు  నిశ్శబ్ధ సంపుటాలై గాలికి రెపరెపలాడతాయి

ప్రవాహమైనా మాటైనా గడ్డ కట్టి ఎక్కువ కాలం ఉండలేనట్లు 

మనాదిపడి మనిషి మిగిలి ఉండగలడా 


తీరం దాటే తరుణం కోసం 

తల్లడిల్లే కల్లోల కడలిని చూస్తుండటమంటే  

మరమేకుని గుండెలోదించుతున్నట్టు  ఉంటుంది

నేనన్నది పరావర్తనం చెంది బహుముఖాలై 

వేల హస్తాలైనా  బాగుండును  

ఓ హృదయానికి సాంత్వన చేకూరేనేమో


కాలానికెందుకన్ని రంగులద్దుతావ్

ఆశ రేకిత్తించడం ఆనవాయితీ గనుకనా 

అడిగానని అనుకోవద్దే  

ఒకమారు  అడిగి అమ్మ నిచ్చుకున్న

 జ్ఞాపకం తరుముతూనే ఉంది 


బాధల నదిలో కొట్టాడుతున్న నావ  తెరచాపని  

 దింపేయగ రాలేవా కారుణ్యంతో

క్షణానికోమారు తూట్లుపడే హృదయాన్ని 

కుట్టుకోలేకపోతున్నా...

01/02/2017 -11:00 pm