30, సెప్టెంబర్ 2019, సోమవారం

నిర్మాల్యం
నిర్మాల్యం

"వొదినా అమ్మమ్మకు మోకాళ్ళ నొప్పులకు ఆయింట్మెంట్ విటమిన్ టాబ్లెట్లు తీసి యిస్తాను పట్టుకెళతావా"అని అడిగింది చిన్నతాత మనుమరాలు. "అలాగేనమ్మా" అంటే వెంటనే కొనుకొచ్చి యిచ్చి వెళ్ళింది. అమెరికా నుండి మోసుకొచ్చిన  వాటిని యిప్పుడు నాయనమ్మకు యిచ్చిరావాలి. నేనే  స్వయంగా యిచ్చిరావాలనుకోవడానికి కారణం వుంది. ఊరెళ్ళి  చేతి వేళ్ళన్ని యేళ్ళు అయివుండవచ్చు. ఊరి మనుషులైతే యేదో ఒక సందర్భంలో యెక్కడో వొకచోట కనబడవచ్చు కానీ ఊరు కనబడదు కదా, తాతల తరంలో మిగిలిన వాళ్ళలో వొకే వొకరు చిన్న నాయనమ్మ. మందులిచ్చినట్లు  ఆమెను చూసినట్లు వుంటుందని  ఆదివారం పల్లెకు బయలుదేరి వెళ్ళాను.

నాయనమ్మకు ఎనిమిది మంది సంతానం. అయిదుగురు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు. తాతయ్య పెద్దకూతురు పదహారేళ్ళ వయసులో వుండగానే గుండె నొప్పితో మరణిస్తే  రెక్కల క్రింద పిల్లలను సంరక్షించిన తల్లి కోడి వలె నిబ్బరంగా నిలబడింది. ఆడపిల్లలందరినీ చదివించింది. మగపిల్లలు పొలాలు పండిచ్చుకుంటారు పనులు చేసుకుంటారు. ఆడపిల్లలు జీవితంలో వచ్చే వొడిదుడుకులు తట్టుకోవాలంటే జ్ఞానవంతులై వుండాలి తమ కాళ్ళ మీద తాము నిలబడగల్గి వుండాలంటూ ఆ ప్రకారమే పిల్లలను నడిపించింది మరికొందరికి ఆదర్శం అయింది. నాయనమ్మ కూతుళ్ళ కెవరికీ బంగారు ఆభరణాలు చేయించలేదు. పట్టుచీరలూ  కొనలేదు. అందరిని చదివించి ఉద్యోగాలు వచ్చాకే పెళ్ళి చేసింది. ఆఖరి బాబాయి వొక్కడే భార్యతో గొడవలుపడి పెళ్ళైన నెలరోజులకే తెగతెంపులు చేసుకుని వొంటరిగా మిగిలిపోయాడు. పెద్ద కూతురు టీచర్. భర్త చనిపోయి దగ్గరున్న పట్టణంలో వొంటరిగా ఉంటుంది. సెలవలు వున్నప్పుడల్లా  తల్లి దగ్గరకెళ్ళి  వస్తూ వుంటుంది. ఇద్దరు కొడుకులు పట్నంలో కాపురం  పిల్లల చదువుల కోసమని. నిత్యం  కొడుకులు ముగ్గురూ టిఫిన్ తినే సమయానికి అమ్మ ముందు పీట వాల్చుకు కూర్చోవాల్సిందే . మధ్యాహ్నం భోజనం టీలు కాఫీలు అన్నీ చూసి తిరిగి ఇళ్ళకి బయలుదేరేటప్పుడు పాలసీసాలు కాయకూరలు సర్ది చేతికందిస్తుంది. ఊరంతటికీ పేరు. ఎనబై యేళ్ళు దాటినా యెంత  ఓపిక ఆమెకు  అని. వయసులో వున్నబద్దకస్తులైన    పిల్లలకు ఆమెను చూసైనా  కష్టపడి పని చేయడం నేర్చుకోండి అని హితవులు చెబుతారు. మా కుటుంబాల్లోనూ ఊర్లోనూ  చాలామందికి మా నాయనమ్మ రోల్ మోడల్.

కారు వూరిలో ప్రవేశించింది. ఆ వూరిలో వున్న ఒకే ఒక పెంకుటిల్లు అది. అయినా చెక్కు చెదరకుండా నిలిచి వుంది. అరుగు మీద కూర్చుని పేపర్ చదువుతున్న నాయనమ్మ నన్ను చూసి లేచి గబా గబా గుమ్మం దాకా  వచ్చింది. "అమ్మాయీ, ఎన్నాళ్ళకు వచ్చావ్! పుట్టినూరు కూడా జ్ఞాపకం లేకుండా పోతుందే. నాలాంటి దానికి మిమ్మలను చూద్దామనిపించినా రాలేకపోతున్నా. బస్ ఎక్కాలేను దిగాలేను ఒకటే మోకాళ్ళ నొప్పులు. మోటారు కారులో రావాలంటేనేమో వాంతులు" అంటూ  చేతిలో సంచీ అందుకుంది.

కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళగానే వూదొత్తుల వాసన గుభాలించింది.  పూజ గదిలో యింకా దీపం వెలుగుతూనే వుంది.  ఏ పనైనా పొదుపుగా మన్నికగా చేయాలంటే మీ చిన్న నాయనమ్మే అనుకో. ప్రమిదలో వేసే వొత్తి  కూడా సన్నగా దారం పోసి గట్టిగా వొడేసి మెలిపెట్టి చేస్తుంది.  కార్తీకమాసంలో కూడా తక్కువ నూనెతో యెక్కువసేపు  ఆమె  వెలిగించిన దీపాలే వెలిగేవి అనుకో అని అమ్మ చెప్పడం గుర్తొచ్చింది.

"నీ పూజల ఫలమే నాయనమ్మా నీ బిడ్డలందరూ  చల్లగా వున్నారు " అని అంటే  చిన్నగా నవ్వింది. "నీ కొడుకు కోడలు యెలా వున్నారు? అబ్బాయికి మంచి ఉద్యోగామేనా, ఎనిమిదేళ్ళు అయిందిగా వెళ్ళి. ఇల్లు కొనుక్కున్నాడా" అని అడిగింది.

"బాగున్నారు నాయనమ్మా యింకా ఇంటి దాకా  వెళ్ళలేదు. ఆ ట్రంప్ పొమ్మనకుండా పొగబెడుతున్నాడుగా. అబ్బాయికి నిలకడైన ఉద్యోగమే కానీ కోడలికి ఉద్యోగంలేదు".

"నువ్వు బాగా పాడైపోయావు,  పూజలు చేసి ఉపవాసాలు చేసినంత మాత్రాన  ఉద్యోగాలు రావు, కోడలు కడుపు పండదు. వచ్చేవేళకి అన్నీ అయ్యే వస్తాయి. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవద్దు" అని మందలించి అన్నం తిందువుగాని రా అని పిలిచి పీటవాల్చింది. తినేసే బయలుదేరాను నాయనమ్మ అంటే ప్లేట్ లో  సున్నండలు జంతికలు పెట్టి చేతికిచ్చింది. మనుమరాలు యిచ్చిన మందులు యిస్తే యివన్నీ నేను వేసుకుంటానా పెడతానా.. మళ్ళీ పిల్లల్లో యెవరో వొకరికి యివ్వాల్సిందే అని అరమారలో పెట్టింది.

"ఏళ్ళ తరబడి ఈ ఇంటిని పట్టుకుని వేలాడతా వుంటావు. మార్పు కోసమైనా పట్నం రావచ్చుగా. బెజవాడ నుండి అమెరికా దాక యెక్కడ చూసినా నీ పిల్లలు  మనుమలు మనమరాళ్ళ సంతతి వున్నారు. ఒక్క రోజైనా ఇల్లు వదలవు. వచ్చే వారంలో  మేము తిరుమలకు వెళుతున్నాం. అమ్మా నాన్న కూడ వస్తున్నారు,నువ్వుకూడా రా.. వెళదాము " అనంటే నవ్వి ..

"ఏటేటా కొండకి వెళ్ళాలన్న రూలేమన్నా వుందామ్మాయ్. మనసులో ఉండాల్సిన దైవం ఆలోచనల్లో రావాల్సిన పాపభీతి పోయి ఆడంబరం యెక్కువైపోయి ఓ ఎగేసుకుంటా  గుడుల చుట్టూ తిరుగుతూ  పూజలు చేసినంత మాత్రాన భక్తీ పరులు అయిపోతారా? భక్తీ విశ్వాసం ఉచ్వాస నిశ్వాసల్లాంటివి . నా జీవితంలో వొకే వొకసారి తిరుమలకు వెళ్లాను జన్మకో శివరాత్రి అన్నట్టు వొకసారి శ్రీశైలం వెళ్ళాను. మీ తాతయ్య చనిపోయాక  కాశీ వెళ్ళి గంగలో మునిగి ఆ విశ్వనాధుడిని దర్శించుకున్నా. ఆ అన్నపూర్ణమ్మ తల్లిని కొంగుచాచి భిక్షమడిగాను. అవే నేను వెళ్ళిన పుణ్యక్షేత్రాలు తీర్ధయాత్రలు . మళ్ళీ యేనాడు గుడికి వెళ్ళిందేలేదు. రోజూ పేపర్ చదువుతా. టీవీ గీవీ చూడను. చదవాలంటే ఆ లైబ్రరీకి పోయి నాలుగు పుస్తకాలు తెచ్చుకుంటా." అంది

"అయితే యీ పూజలు యాత్రలు  అనవసరం అంటావా" అన్నాను కినుకగా

"గుళ్ళకు  పుణ్య క్షేత్రాలకు వెళ్ళనవసరం లేదు, భగవంతుడు ఎక్కడ లేడు చెప్పు? తులసి మొక్కకు ఓ చెంబుడు నీళ్ళు పోసి భక్తితో నమస్కరించుకుంటా.. ఆయనే మహా విష్ణువు.అదిగో ఆ రావి చెట్టు పశువులకు, మనుషులకు నీడ. పక్షులకు ఆవాసం. అది త్రిమూర్తుల స్వరూపం. ఇదిగో ఈ రుబ్బురోలు పొత్రం ఆరుబయట వెలిసిన శివాలయం. ఓ చెంబుడు నీళ్ళు పోసి కడిగి భక్తితో నమస్కరించుకుని బియ్యం పప్పు పోసి రుబ్బుకుని చేసుకుని తింటా అదే మహా ప్రసాదం. అన్ని చోట్లా ఆయనే. అంతెందుకు నీలోనూ వున్నాడు నాలోనూ వున్నాడు. రోజూ రెండుపూటలా దీపం పెట్టి నాలుగు పూలు పెట్టుకునో పండు పెట్టుకోనో దణ్ణం పెట్టుకుంటాను. పుష్ఫం పత్రం ఫలం తోయం అన్నాడు భగవంతుడు. ఆ నాలిగింటిలో యేదో ఒకటి సమర్పించుకుంటే చాలదా? దేవుడిని దర్శించుకోవాలని  కుటుంబాలు కుంటుంబాలు తరలి వెళ్ళడం అదీ ఖర్చు కలిసి రావాలని కార్లలో వెళ్ళడం సమయం కలిసిరావాలని  డబ్బు ఆదా చేయాలని వేళకాని వేళల్లో ప్రయాణం చేయడం పరిపాటి అయిపోయింది. తప్పు ఎవరిదైనా గాలిలో కలిసిపోయే ప్రాణాలెన్నో, తల్లికి బిడ్డ వుండడు భర్త వుండడు. భర్తకి భార్య వుండదు బిడ్డ వుండడు. ఎందుకమ్మా యీ మూకుమ్మడి కుటుంబ ప్రయాణాలు ? ఆ పుణ్య క్షేత్రానికి వెళ్ళే డబ్బుతో ఒక గేదెనో దూడనో కొని ఓ పేద కుటుంబానికి ఇవ్వు  ఆ గేదె ఉన్నన్నాళ్ళు ఆ కుటుంబానికి నువ్వే భగవంతుడివి "అంది. నాకు నోటమాట రాలేదు ఆమె వాగ్ధాటికి వితరణకు.

ఇంతలోకి  ఒకతను వచ్చి "అమ్మా పాస్టర్ గారు వచ్చారమ్మా. మీతో మాట్లాడాలంట"అన్నాడు.

"వస్తున్నాను పదరా .. జోసెఫ్, అమ్మా కాసేపు నడుం వాల్చు. నేనెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తా " అని  బయటకి వెళ్ళింది.

నేనేమో  నాయనమ్మ మాటలను మననం చేసుకుంటూ  ఆలోచనల్లో పడ్డాను. తను అమెరికాలో  కొడుకింట్లో వున్నప్పుడు  నిత్యం పూజ చేసి మరునాడు ఆ నిర్మాల్యం తీసాక యెక్కడ వేయాలి అనే పీకులాట మొదలయ్యేది. డస్ట్ బిన్ లో వేయడానికి మనసొప్పదు. పోనీ  పారే నీళ్ళలో పడేద్దామా అంటే అక్కడకి తను వెళ్ళలేదు. ఒకోసారి కారులో వెళుతూ తనతో పాటు తీసుకెళ్ళేది. నీళ్ళు కనబడ్డచోట  కారు ఆపమని కొడుకుని అడిగేది . కొడుకు తనని పిచ్చిదాన్ని చూసినట్టు చూసి మళ్ళీ అంతలోనే జాలిపడి యిక్కడ  కారు ఆపడం కుదరదమ్మా అనేవాడు. నిర్మాల్యం యెక్కడ పోయాలి? మన దేశంలో పారే నీటిలో యెక్కడ బడితే అక్కడ కుమ్మరించి వేయడమే. ఒక్క నిర్మాల్యం అని యేముందిలే. పరిశ్రమల కాలుష్యాన్ని మనుషుల కాలుష్యాన్ని పనికిరాని వస్తువులను అన్నింటిని నీరు కనబడితే చాలు అందులో వదిలేయడమే అంది.  ఇక్కడలా చేసేవు  సుమారు ఐదొందలు డాలర్ల వరకూ  ఫైన్ వేసి  ఒక వారం రోజులు సోషియల్ సర్వీస్ చేయిస్తారు. అంటే రోడ్లు ఊడ్వడం లాంటి పనులన్నమాట అని హెచ్చరించాడు. వచ్చేదాకా నిర్మాల్యంని ప్లాస్టిక్ కవరులో నింపి అలాగే వుంచింది. నిర్మాల్యం భగవంతుడికి మేరు పర్వత శిఖరం కన్నా బరువైనది అవునో కాదో కానీ తన  ఆలోచనల్లో  అది అంతకన్నా యెక్కువ  భారమై కూర్చుంది. ఆఖరికి తిరిగి  వచ్చేసేరోజు ఆ నిర్మాల్యం వున్న సంచీని కొడుకుకి చూపించి దీనిని  తీసుకెళ్ళి పారే నీటిలో వేయి నాన్నా, లేకపోతే పచ్చని చెట్టు మొదట్లోనన్నా వేయి అని పదే పదే చెప్పింది. అలాగేలేమ్మా..దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావ్. కూల్ గా వుండు. నేను నువ్వు చెప్పినట్లే చేస్తానుగా అని కొడుకు హామీ ఇచ్చాక మనసు నెమ్మది పడింది.   

నాయనమ్మ అన్నట్టు  పత్రం పుష్పం  ఫలం తోయం అంటారు. తోయమొక్కటి సమర్పించి హృదయ పుష్పాన్ని సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుని విశ్వాసంతో వుండటమే కదా చేసుకోవాల్సింది. తను కూడా అలా చేయడం లేదు. భక్తిలో ఆడంబరాలు ప్రవేశించాక నిర్మాల్యం యెక్కువైపోతుంది. వాటిని తీసుకెళ్ళి నదులలో పోయడం. నదుల ప్రక్షాళన చేయడానికి మానవశ్రమ పాటు  ఆర్ధిక భారం యెక్కువైపోతుంది.  విదేశాలలో లాగా ప్రభుత్వం దండిగా  పరిహారం విధించాలి. అప్పుడు గాని మనుషుల్లో చైతన్యమూ జాగురుకత రాదు. విదేశాలకు వెళ్ళిన పిల్లలకు లోలోపల  మాతృభూమిపై మమకారం వున్నప్పటికి వారు మళ్ళీ వెనక్కి తిరిగి రాకపోవడానికి కారణం రెండే రెండు మాటల్లో చెపుతారు. మనకి  క్రమబద్దీకరణ లేని ట్రాఫిక్, అపరిశుభ్రత. ఎంత గొప్ప దేశాన్ని అలా కాలుష్య కాసారం చేసుకుంటున్నామో కదా  అని బాధ పడ్డాడు కొడుకు. 

మొన్నెప్పుడో రాత్రి ఎనిమిది గంటల వేళ కాశీ విశ్వేశ్వరుడిని ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తుంటే  అరగంట పైనే చూసింది. మారేడు దళాలు పుష్పాలు గంధం విభూది ఇంకా నానారకాల పూజాద్రవ్యాలను సమర్పించి   కొండంత యెత్తులో  స్వామిని ముంచేశారు. నిర్మాల్యం తీసేవాళ్ళు తీసేస్తుంటే భక్తిగా సమర్పించేవాళ్ళు సమర్పిస్తూనే వున్నారు.  అది గుడి కాబట్టి సరిపోయింది.. అదే ఆరుబయలు ప్రదేశంలో లింగరూపంలో స్వామిని ప్రతిష్టింపజేసి వుంటే ఈ దేశ జనులంతా కలిసి మరో కైలాసపర్వతాన్ని స్వామి చుట్టూరా నిర్మించి వుందురేమో అన్న ఆలోచన వచ్చింది. చెంబుడు నీళ్ళు చాలు అని చెప్పేడన్నా కూడా  వినిపించుకోని మూఢ భక్తీ. భగవంతుడిని  తోటి ప్రాణులలో చూడటం నేర్చుకుంటే మనం వారికి చేసే ప్రతి సాయం  స్వామికి నైవేద్యమే అవుతుంది కదా అనుకుంటుంది ఎన్నోసార్లు.

మొట్టమొదటిసారి ముంబాయిలో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర సముద్రాన్ని చూసిన ఆనందంలో వువ్వెత్తున ఆటుపోట్లు వస్తున్నప్పుడు వుత్సాహంగా రెండు అడుగులు ముందుకేసినప్పుడు నీళ్ళతో పాటు కాళ్ళకు పాముల్లా  చుట్టుకున్న ప్లాస్టిక్ సంచులను చూసి కల్గిన బెరుకు యిప్పటికీ తగ్గలేదు.

కొన్ని దేశాలలో బీచ్ లు ఎంత పరిశుభ్రంగా వుంచుతారో. మనకి చెత్త పేర్చడం తప్ప శుభ్రం చేయడానికి వొళ్ళు వొంగదు.అంతా వ్యర్ధం వ్యర్ధం   బయో వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్  మెడికల్ వేస్ట్ కెమికల్ వేస్ట్ అన్నింటిని పంచభూతాలు భరించి తమలో  కలిపేసుకుంటున్నాయి కాబట్టి  ఈ మాత్రం మానవుడు రోగాలతోనన్నా బ్రతికి వున్నాడు వుంటున్నాడు. అప్పుడప్పుడు  ప్రకృతి ప్రకోపాన్ని చవిచూస్తున్నాడు. పంచ భూతాలూ  ఈ వ్యర్ధాలను స్వీకరించని రోజు వ్యర్ధాల మధ్య మరో వ్యర్ధంగా మిగిలిపోయే రోజు వస్తుంది అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా మార్పు రావడంలేదేమిటో ? ఇలా ఆలోచనలు సాగిస్తుంటే  "అమ్మాయి కన్నంటిందా,  టీ పెట్టుకుందాం  చుట్టింట్లోకి పోదాం పద" అంది మంచం దగ్గరకి వచ్చి.

"లేదు నాయనమ్మా,  ఏదో ఆలోచిస్తూ వున్నాను అంటూ లేచి నాయనమ్మతో కలిసి చుట్టింట్లోకి వెళ్లాను. చుట్టింటి పక్కనే కొట్టు గదిలో నుండి ధాన్యం బస్తాలు తీసి రిక్షా మీద వేస్తున్న పాలేరు.

"మిల్లుకు వడ్లు పంపుతున్నానమ్మా, నాలుగెకరాలలో రసాయన ఎరువులు పురుగుమందులు చల్లని ధాన్యం పండిచ్చుకోవడం పిల్లలు ఎవరొచ్చినా బియ్యం కొబ్బరి నూనె పప్పులు పచ్చళ్ళు కారాలు వడియాలు అన్నీ పట్టుకెళతారు. నేను ఉండన్నాళ్ళు ఆమాత్రం జరుగుతాయి . తర్వాత ఎవరి పాట్లు వాళ్ళవి అంది.

:నీకున్న శ్రద్ద వోపిక ఎవరికీ వుండదు నాయనమ్మా! మేము కూడా ప్రశాంతంగా వుంటుందని మావూరికి  వెళ్ళిపోయాం.  ప్లాట్ పరిసర ప్రాంతాలలో యెటు చూపినా పచ్చని పంటపొలాలు అనేకమైన వృక్షాలు అపార్ట్మెంట్ చుట్టూ బోలెడు పూల మొక్కలు ప్రక్కనే ఖాళీ స్థలంలో వున్న రావిచెట్టు పై   వచ్చివాలే  అనేక పక్షులు చూడటానికి యెంత మనోహరంగా వుండేదో. ప్రతిరోజూ పక్షుల కిలకిలా రవాలతో నిద్ర లేవడం చెఱువు గట్టుపై వున్న గుడిలో నుండి వినవచ్చే మంత్రోచ్చరణ  చేయి పట్టుకుని బాల్యంలోకి తీసుకువెళ్ళేయి. అందరూ మీ యింటికి రావాలంటే కష్టంగా వుంది అనడం మొదలెట్టినా  వినిపించుకోలేదు నేను. వచ్చీపోయే చుట్టాలు, స్నేహితుల కోసం రెండు దశాబ్దాలు రణగొణధ్వనుల మధ్య అశాంతిగా బ్రతికాము. ఇప్పుడింటికి  వచ్చే ఆత్మీయులను  మీకు కష్టం లేకుండ    బస్టాప్ లో  దించుతానులే  అని హామీ యిస్తున్నాం. ఒక ఏడాది కాలంలోనే మా  ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలంలో చెట్లన్నీ మాయం. అక్కడ చెట్లన్నీ కొట్టేసి స్థలాన్ని అభివృద్ధి చేయడానికి వొప్పందాలు కుదుర్చుకున్నారట. ఆ చెట్లపై ఆవాసముండే పక్షుల ఆరాటం ఆ పరిసరాలలో గిరికీలు కొడుతూ చేసే ఆర్తనాదాలు అర్ధం చేసుకోవడానికి పక్షుల భాష వచ్చివుండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కొన్ని నెలల తర్వాత కూడా ప్రతి రోజు సాయంసంధ్యలో కొన్ని పక్షులు వచ్చి అక్కడక్కడ తచ్చాడి పోతాయి. చిన్ని చిన్న పక్షులకు బాల్కనీ లో పెంచుకుంటున్న మొక్కలే పెద్ద పెద్ద వృక్షాల మాదిరి కాబోల్సు. ఇరుసంధ్యలలో వచ్చి సందడి చేసి వెళుతుంటే వాటికి కొంచెం సేపైనా ఆతిధ్యం ఇచ్చినందుకు ఆనందంగా ఉంటుంది నాకు" అని ఏకధాటిగా  చెప్పేసెను.

"ఎక్కడ చూసినా ఇదే పని అంటగా. పేపరులో చదువుతున్నాగా"  అంది.

"ఈమాత్రం మనసు విప్పి మాట చెప్పుకోవడానికి కూడా అక్కడ యెవరూ లేరు నాయనమ్మా, ఉన్నా నేను చెప్పేది విని నన్నువో పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు" అన్నాను.

"అవునూ.. మీ ఆయనకీ పెద్ద దొడ్డి ఉండాలిగా మీ వూర్లో, ఎన్ని పాడిగొడ్డు వుండేయో, ఆ రోజులన్నీ పోయి పాలు కొనుక్కునే యవ్వారంలోకి వచ్చారు. ఇంతకీ ఆ స్థలం  అట్టాగే వుందా అమ్మేసుకున్నారా?" ఆరా తీసింది.

"వుంది నాయనమ్మా. అన్నదమ్ములిద్దరికీ వాటా వుంది. సొంత  ఇల్లు కట్టాలని నేనూ, అపార్ట్ మెంట్ కి యివ్వాలని వాళ్ళు అది తెగని వ్యవహారం అయింది" అన్నాను నిసృహగా.

"ఇల్లు కట్టాలంటే మాటలా.. అట్టాగే అద్దెకి వుండి చెట్లు పూల మొక్కలు కూరగాయల మొక్కలు వేసుకో.  ఇప్పుడు కొని తినేవన్నీకల్తీ అయిపోయే" అంది. నా మనసులో వున్న మాట చెప్పేసరికి చిన్నగా నవ్వుకుని అట్టాగే నాయనమ్మా అన్నాను.

"కాలికి మట్టి అంటకుండా వొంటికి చెమట పట్టకుండా చేతికి మెతుకు అంటకుండా వొంటరి బతుకు బతకడం నాగరీకం అయిపోయిందర్రా. నాగరికత అంటే పది తరాల తర్వాత కూడా మనకి నిత్య జీవితంలో పనికి వచ్చేది అవ్వాల్రా ,ఈ కుంపటి ఈ మట్టి కుండ పనికి రాని కాలం ఉంటాదేమో కాస్త ఆలోచించి చెప్పు" అంది.

"నేనూ అదే ఆలోచిస్తున్నాను నాయనమ్మా !  మనీ  మేనేజ్మెంట్ కోర్స్ చదువుకోవడం అవసరమేమో కానీ మనుషులు ప్రకృతికి దగ్గరగా బతకడం నేర్చుకోవడం మరీ అవసరం".

"యెప్పటి నుండో ఇంకుడు గుంటలు అని మొత్తుకున్నా యెవరూ వినడం లేదు, చెట్లు నరికేవాడే కానీ మొక్క నాటే నాధుడు లేడు, వానలు లేక నేల నెర్రులిచ్చి బావులు బోర్లు అడుగంటిపోయి ధాత్రి పుత్రులు ప్రాణులంతా  దాహంతో అలమటిస్తున్నారు. మన దొడ్లో ఇంకుడుగుంత తవ్వించ బట్టి  బావిలో నీళ్ళు వుంటున్నాయి. పల్లెటూర్లలో కూడా యెక్కడ చూసినా ప్లాస్టిక్ భూతం. మనిషి  జీవితావసరాలతో చుట్టుకుని వుక్కిరిబిక్కిరి చేస్తుంది. సముద్రాలలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కొండలు ప్లాస్టిక్ కోరలకు చిక్కుకుని అంతరించిపోతున్న జలజీవాలు. ఎవరిచ్చారు మానవుడికి ఈ హక్కు ? ఈ భువికి తనొక అతిధిలా వచ్చాడు. ఇతర జీవాల వునికిని నాశనంచేసి వుసురు పోసుకుంటున్నాడు. మనకి వ్యర్దంలో నుండి అర్ధం వెతుక్కునే మార్గాలు కావాలి. అసలు వ్యర్ధం కానివి అంటూ లేని  జీవన విధానం కావాలి.  నీవరకు నీకు చెపుతున్నా విను. గుడికి వెళ్ళేటప్పుడు  పూజా ద్రవ్యాలు తగ్గించుకుని ముఖ్యంగా ప్లాస్టిక్ పేకింగ్ లో వచ్చేవి కొనడం ఆపేయి. మార్కెట్ కి వెళ్ళేటప్పుడు గుడ్డ సంచీలు పట్టుకెళ్ళడం మర్చిపోకు. సరుకులు కాగితాలలో పొట్లాం కట్టి యిచ్చే వాళ్ళ దగ్గరే తీసుకో , అట్టా యెవరికివాళ్ళు ఉద్యమంలా  చేస్తే తప్ప మన పర్యావరణం బాగుపడదు" అంది. 

థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ కొటేషన్ తెలియకపోయినా  ప్రకృతిని బాగా అర్ధం చేసుకుని ప్రకృతికి అనుగుణంగా బ్రతకడంలో  నాయనమ్మకు ముందు చూపు వుందనీ   ఆనందమూ వుందని నాకర్ధమై ..  మా నాయనమ్మ అందరికీ  ఆదర్శం ఎందుకైందో  కూడా మరొకసారి తెలిసొచ్చింది .

తపేళ చెక్కలు వేస్తూ తింటూ  పొలం నుండి వచ్చిన బాబాయిలతో కలసి  టీ త్రాగుతూ  బంధువులు గురించి, వ్యవసాయం  దగ్గరనుండి అమెరికా ఆర్ధిక విధానం దాకా మాట్లాడుకుంటుంటే సమయమే తెలియలేదు. అబ్బాయ్ పెద్దోడా .. నువ్వు వెళ్ళేటప్పుడు చెక్ బుక్ తీసుకుపోయి రేపు వచ్చేటప్పుడు డబ్బులు పట్టుకుని రా. ఇందాక ఫాస్టర్ గారు వచ్చారు. ఆ పిల్లాడెవరో అప్లికేషన్ పెట్టుకున్నాడు కదా. వాళ్ళు బాగా పేదవాళ్ళే లే, పిల్లాడు బాగా చదువుతాడని మార్కుల లిస్ట్ అవి చూస్తే అర్ధమయ్యింది. ఆ పిల్లాడికి సహాయం చేద్దాం అంది.

నేను ప్రశ్నార్ధకంగా చూస్తుంటే.. అమ్మ నీకు చెప్పలేదా ఆ విషయాన్ని ? మన ఊరికి అభివృద్ధి నిధి అని వొకటి యేర్పాటు చేశావమ్మా. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి  ఆ నెంబర్ అందరికి యిస్తున్నాం. మన ఊరి వాళ్ళు దేశవిదేశాల్లో వున్నవాళ్ళు ఆ అభివృద్ధి నిధికి తమకి తోచినంత డబ్బు పంపుతున్నారు. ఆ డబ్బుని మన ఊరి పేదపిల్లల చదువులకు వుపయోగిస్తున్నాం. ఊరిలో అందరూ కలిసి అమ్మని సెక్రటరీగా ఎంపిక చేసారు. పది సెంట్ల స్థలంలో హాస్టల్ కూడా కడుతున్నాం. పేద ఆడపిల్లల కోసం. అర్హత కల్గినవాళ్ళకి ఉచిత వసతి తిండి బట్టా ఫీజులు అన్ని ఈ అభివృద్ధి నిధి నుండే తీసి ఖర్చు పెడుతున్నాం. నువ్వు కూడా సాయం చేయాలనిపిస్తే చేయొచ్చు అని అభివృద్ధి నిధి వివరాలున్న కార్డ్ యిచ్చాడు బాబాయి.

అది తీసుకుని చూసి నాయనమ్మ దగ్గరకు వెళ్ళి అభినందనలు తెలిపే భాష తోచక యిష్టంగా కావిలించుకున్నాను. ఆమె స్పర్శ చల్లగా ఉత్తేజంగా అనిపించింది. "ప్రభుత్వాలు చేసేది కాకుండా  మన ఊరికి మనమూ ఎంతో కొంత చేసుకోవాలిగా అమ్మాయ్. ఆరు నెలల్లో ముప్పై లక్షల డబ్బు ఆ నిధికి జమ అయినాయి. వచ్చిన డబ్బు యెవరు పంపారు, యెన్ని పంపారు, దేనికోసం ఖర్చు పెడుతున్నాం అన్న వివరాలను  కాగితాల్లో రాసి  అరుగు మీద గోడకి వేలాడదీసి వుంచుతున్నాం. ఎవరైనా చూడవచ్చు. నువ్వు కూడా మీ అబ్బాయికి చెప్పు" అంది. "అలాగే నాయనమ్మా" అన్నా.

నాయనమ్మ  కేలండర్ తీసి తిధి నక్షత్రం చూసి పూజకు ఉపయోగించిన పూల నిర్మాల్యాన్ని వుంచిన వెదురు బుట్టను తీసుకుని పెరటిలోకి వెళుతూ రా .."మనమరాలా! తోట చూద్దువుగాని. నీకు మొక్కలంటే ఎంత ఇష్టమున్నానువ్వు పెంచగలిగేది కుండీలలోనే కదా ! కాసిని పొట్లకాయలు బెండకాయలు ఆకు కూరలు కోసి ఇస్తా, పట్టుకెళ్ళుదువుగాని" అని పిలిచింది.

ఆమె వెనుకనే పెరటి తోటలోకి వెళ్లాను. అనావృస్టి కాలంలో కూడా పచ్చగా వెలిగిపోతుంది పెరడు. అనేక పూల మొక్కలు దొండ పందిరి పొట్ల పందిరి ఆకు కూరలు ఎక్కడ చూసినా హరితమే. ప్రతి మొక్కని తాకి తాకి చూసి పులకరించిపోయాను.

నేను పరిశీలనగా పెరటి తోట చూస్తుంటే  నాయనమ్మ చిన్న గడ్డపలుగు తీసుకుని గొయ్యి తీస్తూ “భగవంతుని చేరే దారిలోనూ చేరాక అన్నీ పవిత్రమైనవే. పిమ్మట కూడానూ అవి నిర్మాల్యంగా భావింపబడతాయి. దానిని “ చెత్తకుండీ  దృష్టితో చూడకూడదు వ్యర్థం లోనూ అర్థం వెతుక్కోవడం సంస్కారవంతుల లక్షణం " అని చెప్పి తీసిన గోతిలో  నిర్మాల్యాన్ని వేసి  ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ మట్టి వేసి ఆ గోతిని పూడ్చేసింది. "నిర్మాల్యమైనా మనం వాడిన తర్వాత వచ్చే యే వ్యర్ధమైనా  పంచ భూతాలలో కలిసి పోవాలి. అలా  కలిసిపోని విధంగా మన చేష్టలు ఉండకూడదు. అదే ముందు తరాలకు మనమిచ్చే మూలధనం” అంది. నేను ఆమె మాటలను కృష్ణ భగవానుడు చెపుతున్న  గీతావాక్యంలా విన్నాను.
   

పొట్ల పందిరి క్రిందకి  వెళ్ళి ఒక పొడవైన కాయను చూపించి తొలిసారి కాసిన కాయ ఇది అంటూ ఆ కాయను తెంపి పక్కన పెట్టింది. ఇంకో రెండుమూడు కాయలు మిగిలిన రకాలు అన్నీ తెంచి వెదురు బుట్టలో సర్దుకొచ్చింది. ఎంతసేపటికి పక్కన పెట్టిన పొట్లకాయ మీదనే నా చూపు ఆగుతుంది. ఎంత నేవళంగ వుంది నాకిస్తే బాగుండుననే ఆశ. మల్లెలు సన్నజాజిపూలు పూలు కోసుకుని మాల కట్టుకుంటూ వుండు. నేను కుంపటి ముట్టించి పాలు తీసుకొస్తానంటూ వెళ్ళింది. మాల అల్లడం పూర్తయ్యేసరికి   చిక్కని  ఫిల్టర్ కాఫీ గ్లాస్ చేతికిచ్చింది. ఇలాంటి రుచులకు దూరమై నాగరికంగా బ్రతికే బ్రతుకులకు అర్ధం లేదనిపించింది నాకు. కాయకూరలన్నీ గుడ్డ సంచీలో సర్ది మధ్యలో ఇత్తడి డబ్బా సర్దింది. అదెందుకు నాయనమ్మా అవన్నీ యేమీ వద్దు అంటుంటే అది నేతిడబ్బా లేవే! మీ ఆయనకు మైసూర్ పాక్ అంటే ఇష్టంగా, చేసిపెట్టు. నేనేమన్నా కొని యిచ్చానా,యింట్లో పాడేగా  అంది. ప్రతి చిన్న విషయమూ యెంత గుర్తు ఈమెకి అని ఆశ్చర్యపోవడం నావంతు అయింది. నన్ను వీధి గుమ్మందాకా సాగనంపడానికి వస్తూ చిన్న చెంబులోకి పాలు పక్కన పెట్టిన పొట్లకాయ తీసుకుని  వచ్చింది.

"ఇంటి ముందు టైలర్ మస్తాన్ కూతురు  నీళ్ళోసుకుని వుంది. నలుగురి పిల్లల మధ్య చాలీచాలని సంపాదన మధ్య  ఆ పిల్లకి సరిగా పోషణ చేయలేకపోతున్నారు. ఆ బూబమ్మకి  ఈ కాయ యిస్తే వేడి వేడిగా పాలుపోసి కూర వొండి పెట్టుద్ది" అని అంది.

ఆమె వద్ద వీడ్కోలు తీసుకుని వస్తూ .." నాయనమ్మ  జీవన విధానం నుండి నేర్చుకోవాల్సింది  రుచి చూడాల్సినది ఎంతో ఉంది. అందుకోసమైనా తరచూ ఆమె దగ్గరకు రావాలి. ఆమె చేసిన పూజలేమో కానీ ఆమె ఆలోచనా విధానమే ఆ యింటికి రక్షణ అయిందని అనుకున్నాను కూడా.

“ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నవా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే “ పాట సాహిత్యం గుర్తు చేసుకుంటూ  నా వంతుగా నా ఊరికి చేతనైన సాయం చేయాలి. వీలైనంతగా ప్రకృతి సిద్దంగా బతకడమెలాగో తెలియజేసే పని మొదలెట్టాలి. అది గుడి బడి నుండే ప్రారంభం కావాలి. నిర్మాల్యం భగవంతుడికే కాదు మనకి యెంత బరువో యెంత హాని జరుగుతుందో ప్రమాద ఘంటికలు వినిపిస్తూ చూపిస్తూ మరీ తెలియజేయాలి. అందుకు కంకణం కట్టుకుని ముందుకు నడవాలి అనుకుంటూ యింటికి చేరి మా ఇంటాయనకు యీ విషయాలన్నీ ఎపుడెపుడు చెపుదామా అని ఆయన కోసం ఎదురుచూస్తూ నాయనమ్మ మాటలు మననం చేసుకుంటున్నాను

నేనింకా ఆ మత్తులో  ఉండగానే శ్రీకాంతాచారి నుండి ఫోన్. రేపటి సంకటహర చతుర్ధికి సోమవార అభిషేకానికి  పూజ సామాగ్రి అన్నీ రెడీ చేసుకున్నారా అని. నాకు వీలుపడదు లెండి అన్నాను  అప్రయత్నంగా. ఆ పూజకయ్యే ఖర్చు అంతా మరొక రకంగా మానవ సేవకు ఉపయోగించాలని అనుకున్నా  కాబట్టి.

మర్నాడు  గుడికి వెళ్లకుండానే ఏ అలంకారాలు లేని నిర్మలమైన ఆకారంతో ప్రశాంతంగా విరాజిల్లుతున్న భగవంతుని రూపాన్ని జ్ఞాననేత్రంతో దర్శించుకున్నాను. నదిలో కలపాలి అనుకున్న నిర్మాల్యాన్ని  తీసి  ఖాళీ కుండీలో వేసి మట్టిపోసి పైన ఒక నిత్యమల్లి మొక్కని నాటాను.
                       
***************సమాప్తం*********************

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

పూవై పుట్టి

"పూవై పుట్టి "  
(కొత్త కథ 2019 కథా  సంపుటిలో  ప్రచురించిన కథ). 

"రచయితలను నేరుగా స్వర్గానికి కదా తీసుకు వెళ్ళాల్సింది విచారణకు యెందుకు తీసుకొచ్చారు" అని అడిగింది పెద్ద వెలుగు.
"ఈమె స్వర్గానికి వెళ్ళడానికి గింజుకుంటున్నారు. తనకు అర్హత లేదంటున్నారు. అందువల్ల మీ ముందుకు విచారణకు తీసుకుని వచ్చాము" అని చెప్పింది చిన్న వెలుగు  
 "యిక్కడ స్వర్గం నరకం మాత్రమే నిజం. స్వర్గమంటే వెలుగు నరకమంటే చీకటి. సాధారణంగా చేసిన  పనుల వల్లనూ వారి గురించి మాట్లాడుకుంటున్న మాటల వల్లనూ ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. రచయితంటే రవిలాంటి వాడని అర్దం. అక్షర బ్రహ్మ అని కూడా వ్యవహరింతురు  కదా తను సృష్టించే యే పాత్ర వైపు బరువు పడకుండా ధర్మదేవతలా నిలబడే వాడనికదా అర్దం.  అందుకే మీరు  చేసిన పాపాలతో నిమిత్తం లేకుండా  సూక్ష్మ శరీరంతో  ప్రయాణిస్తూ వెలుగులోకి చేరుకున్నారు .  వెళ్ళండి వెళ్లి ఈ వెలుగును మరింత అనుభవించండి" అంది పెద్ద వెలుగు.

"లేదు లేదు నాకొక కోరిక వున్నది అది తీరువరకూ నన్ను ఆ లోకంలోనే సంచరించే అవకాశం ఇవ్వండి" అభ్యర్ధించింది  బూడిద రంగు సూక్ష్మ శరీరం.

"అలా ఎందుకు కోరుకుంటున్నారో మీరు విన్నమించుకోగల్గితే  ఆలోచిస్తాం" అంది పెద్ద వెలుగు

 బూడిద రంగు సూక్ష్మ శరీరం తన వేదనను యిలా వినిపించసాగింది.

"రచయిత సృష్టించిన పాత్రలలో తనను చూసుకుని లీనమవుతూ లేదా తనకు తెలిసిన వారినెవరినైనా స్పురణకు తెచ్చుకుంటూ పాఠకులు రచనలో మమేకమై పోతుంటారు. రచయితకి యిలా జరిగే ఉండొచ్చు అని కూడా వూహిస్తారు. అది నాకు ఎప్పుడూ ఇబ్బంది కాదు కానీ యిప్పుడక్కడ  నన్నెవరూ అభిమానంగా అక్షరాలపల్లకీ యెక్కించి వూరేగించడంలేదు. అవార్డ్ లు రివార్డ్ ల సంగతి అలా ఉంచండి కనీసం  వర్దంతి జయంతి వేడుకలు పూలదండలు యేమీలేవు. దుర్మార్గురాలు, ద్రోహి. సమస్తం  మాధవమయం అని మధురభక్తితో వూరేగినన్నాళ్లు వూరేగి  హఠాత్తుగా నల్లముసుగు వేసుకుంటుందా..  అని  తిట్టిపోస్తున్నారు. నన్నెవరూ అర్దం చేసుకోవడం లేదు, పత్రికల వాళ్ళు కొందరైతే  నా గురించి  యిష్టం వచ్చినట్లు వండి వడ్డిస్తున్నారు. నేను యెంతో  బాగా వ్రాసానని మెచ్చుకుని అభిమానంతో వూగిపోయిన పాఠకజనం కూడా నా చిత్రాన్ని చూసి ముఖం తిప్పేసుకుని మరలా ఆపుకోలేని వుత్సాహంతో  ఆసక్తిగా  చదువుతున్నారు. ఏ వొక్కరూ కూడా నను అదివరకటిలా  మనఃస్పూర్తిగా హృదయానికి  హత్తుకోవడం లేదు. ఎవరికీ వారు నువ్వు ఇంకో  దేవుడి తాలూకూగా అన్నట్టు నన్ను అనుమానంగా చూస్తున్నారు. మీరన్నట్టు చదువరి కూడా  న్యాయ దేవతలా నిలబడి నన్ను ఇష్టా ఇష్టాలున్న మనిషిగా  గుర్తించి నా వ్యక్తిగత జీవితంతో సంబంధం లేని ఒక రచయితను మాత్రమే ఆ రచనల్లో  చూసినప్పుడు  నాకు మనఃశాంతి  వుంటుంది. అప్పుడే యీ  వెలుగు లోకంలోకి వస్తాను. అప్పటిదాకా నన్ను సూక్ష్మరూపంలో  ఆ లోకంలోనే సంచరించడానికి  అనుమతి ఇప్పించండి" అని వేడుకుంది ఆ బూడిదరంగులో కనబడుతున్న సూక్ష్మ శరీరం.
 "సరే  మీ వేదన జాలి గొలుపుతుంది.అనుమతి ఇచ్చాము వెళ్లి రండి" అంది పెద్ద వెలుగు.

తాను జీవించి మరణించిన కాలానికి ఈ భూమి పై చేరుకొని  సంచరిస్తూ  వుంది బూడిద రంగు సూక్ష్మ శరీరం. వెతుకుతూ వుంది. ఆ శరీరానికి రోజులే,కానీ ఈ లోకంలో యేళ్ళుకేళ్ళు గడిచిపోతున్నాయి. ఆమె సూక్ష్మ శరీరం సహస్రాక్షుడిగా మారి భూమిపై తాను సృజించిన  అక్షరాలను చదువుతూ  తన చిత్రాలను  చూస్తూ వున్న వారి మెదడునూ మనసునూ పట్టిపట్టి చూస్తుంది.కొందరు అభిమానంగా తల్చుకుంటున్నారు.  కొందరు మంచిగానూ  చెడుగానూ  మధ్యస్థంగానూ తల్చుకుంటుంటే సంతోష పడుతూనే తనకు కావాల్సిన అభిప్రాయం కోసం సహనంగా ఎదురు చూస్తుంది.

ఆ సూక్ష్మ శరీరం   ఓ  కార్పొరేట్ హాస్పిటల్లో టీవీ చూపిస్తున్న దృశ్యాల ముందు ముగ్గురి మనుషుల  మధ్య జేరి ఆసక్తిగా చూస్తుంది. ఆ సూక్ష్మ శరీరానికి సంతోషంగా కూడా వుంది  అక్కడ కొన్నేళ్ళు తనతో మెలిగిన మున్నీని చూసి .
.*******************************
 సెలైన్ బాటిల్ లో  కలిసిన డ్రగ్  చుక్కల  చుక్కలుగా రాలి శరీరంలోకి  యెక్కుతుంటే మగతగా కళ్ళు మూసుకున్న   భర్తను  చూస్తూ టీవీ ఆన్ చేసి  ఛానల్స్ మార్చుతుంటే ప్రఖ్యాత రచయిత గురించి సంస్మరణ కార్యక్రమం వస్తుంటే అక్కడ ఆగిపోయింది పద్మ.

నర్స్ వచ్చి పేషంట్ ని సెలైన్ బాటిల్ ని  చూసి లంచ్ కి వెళుతున్నాను. అయిపోవడానికి అయిదు నిమిషాల ముందు బజర్ నొక్కండి. ఇంకొక బాటిల్ యెక్కించాలి అని చెపుతూ యధాలాపంగా టీవీ వంక  చూసి కొన్ని నిమిషాలు అక్కడే నిలబడి "కొన్ని సత్యాలు అసత్యాలుగా అసత్యాలు సత్యాలుగా చెలామణి అవుతూ ఆ ప్రేమమయి చరిత్రకు మసి పూస్తుంటే బాధ కల్గుతుంది" అంది.

"ఆమె గురించి మీకు తెలుసా, ఆమె రచనలు చదువుతారా" ఆసక్తిగా అడిగింది పద్మ

"ఆమె నా ఆలోచనల్లో ఇరవయ్యేళ్ళకు పైగానే ప్రయాణిస్తుంది. ఆమె అనంత ప్రయాణం ముగిసి తొమ్మిదేళ్ళు. ఆమెతో కొన్నేళ్ళు  కలిసి వున్నాను కూడా" అంది..

"నిజంగా "..  మరింత ఆశ్చర్యం పద్మ ముఖంలో

"అవును" అంది బలవంతంగా నవ్వుతూ. అప్పటికే  ఆ నర్స్ ముఖం పై నీలినీడలు.

"భోజనం చేసి త్వరగా వచ్చేయండి. మీ దగ్గర ఆమె గురించిన విషయాలు చాలా వినాలి. ప్లీజ్ చెపుతారు కదా!" అంది పద్మ  వొకింత ఉద్వేగంగా.

" తప్పకుండా, కొన్నేళ్ళుగా యెవరితో పంచుకోవాలో తెలియని బాధని మీతో పంచుకుంటాను  అంటూ తెరపై వో  మూలగా కనబడుతున్న ఆమె ఐకాన్ ని  చేతితో ప్రేమగా ఆత్మీయంగా తడిమి చిప్పిల్లిన కళ్ళతో బయటకి వెళ్ళిపోయింది.

తనంటే ఇంత గాఢ అభిమానం వుందా  మున్నీకి.  ఆమె ఏమి చెపుతుందో తప్పక విని తీరాలి అనుకుంది సూక్ష్మ శరీరం. అంతలోనే అసలు తన  కొడుకులేమనుకుంటున్నారో తెలుసుకోవాలి.  ముందు చిన్న కొడుకింటికి వెళితే బాగుంటుంది  అనుకుని అక్కడికి చేరుకుంది.   

అక్కడ చిన్న కొడుకు ఆదిత్య పత్రికలో తల్లి గురించి  వ్రాసిన విషయాలని చదివి ఆవేశపడుతున్నాడు. భార్య ఉష తో  మా అమ్మ గురించి యేమి చెప్పాలనుకుంటుందీమె   సత్యాలను దాచి కొన్ని  శక్తులు అనుకూలంగా చిత్రించే భాధ్యతను తలకెత్తుకుందా ? అమ్మని ప్రపంచం ముందు చపలచిత్తురాలిగా చిత్రించడం నాకసలు నచ్చలేదు. అమ్మది  యెంత  దృఢ సంకల్పం. ఒకసారి నిర్ణయం తీసుకుంటే యెన్నటికీ మార్చుకోదు. మతం మార్చుకునేముందు అన్నయ్య, పిల్లలు, బంధువులు యెందరు అభ్యంతరం చెప్పినా ఆమె అనుకున్నదే చేసి తీరింది. ఆమె పట్టుదలే నాకూ వచ్చింది కాబట్టే ఆఖరి క్షణాలలో ఆమె చెవిలో నారాయణ నారాయణ అంటూ మంత్రాన్ని వినిపించింది నేనే కదానాది కాని  మతాన్ని ఆవహింపజేసుకుని ఆమెకి సాంత్వన   కల్గించనూలేదు.  నీకు తెలుసు కదా యిదంతా.. నువ్వెందుకు స్పందించవు వీటి గురించి అని అడిగాడు తీవ్రంగా.
నిజమేనండీ, ఎవరి యిష్టాలు వారివి. అత్తయ్యగారు  జీవితంలో వందలమంది పురుషులని చూపులతోనే వొడపోసి వుంటుంది.ఇప్పుడీ అపవాదులని మోస్తుంది. తాము అనుకున్నదే నిజమై తీరాలన్న లోకం తీరుపై  ముఖ్యంగా  ఆ వ్యాసం వ్రాసిన ఆమెపై నాక్కూడా అమితమైన కోపం వస్తుంది అంది ఉష.

జీవన నాటకంలో అందరూ పాత్రధారులే. అప్పుడప్పుడు వెళ్లి ప్రేక్షకుల మధ్య మనమూ కూర్చుంటాము. ఆమె జీవితంలోనూ అతనొక పాత్రధారుడు. శుక్లపక్ష తదియ లాంటి అతని నవ్వులో ఆకర్షణ వుండటం నిజమే కావచ్చు. నాలుగు మెరమెచ్చు మాటలు చెప్పి కొన్ని గజల్స్ వినిపించి అమ్మకి సంతోషం కల్గించి వుండుంటాడు. అంతమాత్రానికే  తన కొడుకుల వయసు కన్నా చిన్నవాడైన అతనితో అలాంటి బంధంలోకి వెళుతుందా ? అసహ్యంగా వుంది. తమ జీవితాలను తీర్చిదిద్దుకోవడం, సంతోషంగా యెలా వుండగలమో తెలుసుకోలేని మూర్ఖులు యితరుల జీవితాల్లో జోక్యం చేసుకోవడం పరిపాటి అయిపొయింది. కల్పనకి కూడా హద్దూ పద్దూ వుండొద్దూ అని విసుక్కున్నాడు.

చిన్న కొడుకు కోడలు మాటలు విని నవ్వుకుంది  సూక్ష్మ శరీరం.  

పెద్దన్నయ్య భాస్కర్ తో మాట్లాడాలని కాల్ చేస్తున్నాడు ఆదిత్య. లైన్ ఎంగేజ్లో వుంది. భార్యతో మళ్ళీ తల్లి గురించిన  మాటల్లో  పడ్డాడు.

 ఆమెకి దొరకనిది వెతుకుతున్నది వొకటే.అది సుసాంగత్యం. అమ్మ అన్ని మతగ్రంధాలను చదివేది కదా  బైబిల్ ఖురాన్ బౌద్ధ గ్రంధాలను యెన్నింటిని చూడలేదు మనం ఆమె బల్లపై అన్నాడు తన అభిప్రాయాన్ని బలపరుచుకుంటూ . 

"అవునండీ..మనుషులు సృష్టించిన దేవుళ్ళు  యే వరాలు ఇవ్వలేరు. నువ్వొక వరమీయి అంటూ మీ వద్ద  యెన్నిసార్లు మాట తీసుకోలేదు  చనిపోయిన తర్వాత తన సమాధి ప్రక్కన  జ్ఞాపకంగా యిష్టమైన పూల  మొక్కని నాటమని కూడా  చెప్పింది. ఆ పని చేయలేకపోయినందుకు బాధగానే వుంది. మన తోటలో ఒక  మొక్క నాటి అత్తయ్య గారి విగ్రహం పెడదాము. అలా చేస్తేనన్నా ఆమె ఆత్మ శాంతిస్తుంది" అంది ఉష.

వద్దొద్దు. ఆ పని చేస్తే  మళ్ళీ మనం పత్రికల నోళ్ళలో మరికొన్నాళ్లు నానుతాము. పొరుగురాష్ట్రంలో మరణించితే స్వరాష్ట్రానికి తీసుకెళ్లి అధికార లాంఛనాలతో ఆమెను సాగనంపడం  ఎంతైనా అమ్మకి  దక్కిన అపురూప గౌరవం కదా "అన్నాడు గొప్పగా. 

"హృదయగానాన్ని గుర్తించడం యెలా  అనేకదా అత్తయ్య  వ్రాసినది. ఆమె వ్రాసిన రాతలతో అతికొద్ది సత్యం అప్రమేయమైన వూహలు మాత్రమే యెక్కువగా వుండేవి. సంచలనం కోసం యేవేవో రాస్తే వొకప్పుడు  ఆమెని నిందించిన కుటుంబమే  ఆమె మతం మార్చుకున్నానని  విచారపడితే  సంతోషించాల్సిన వారిమే  కదా ! ఆ కోణంలో అయినా ఆలోచించదు లోకం. ఆమె తోడబుట్టిన వాళ్ళు కూడా  యేదో వొక వ్యాఖ్యానం చేస్తున్నారు. బాధగా వుంటుందండి" అంది కోడలు.  

"అన్నయ్య యేమి  ఆలోచన చేస్తున్నాడో, తన గౌరవానికి భంగం  కల్గుతుందని విసుక్కున్నవాడు యిలాంటి సమయాల్లో ఖండించవద్దూ, మా అమ్మకి అలాంటి వుద్దేశ్యం విచారమూ వుండేది కాదు. ఆమె మనఃస్ఫూర్తిగా ఆ మతాన్ని ప్రేమించింది ఆలింగనం చేసుకుంది అని చెపుతాడా చెప్పడా"  అని ఆదిత్య  అనుకుంటుండాగానే పెద్ద కొడుకు భాస్కర్   నుండి  కాల్ వచ్చింది. 

"అన్నయ్యా అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు" అని అడిగాడు ఆదిత్య. "అమ్మ మనసులో యేముందో నాకు మాత్రం యేమి తెలుసు,నీ దగ్గరేగా యెక్కువ కాలం వుంది. మంచిగానో చెడుగానో మనకి ఒక ఖ్యాతిని ఆర్జించి పెట్టిన అమ్మని  అగౌరవపరచడమెందుకు నువ్వన్నట్టుగానే నేను ఒక ట్వీట్ చేస్తాను. పైగా వరల్డ్ వైడ్ గమనిస్తుంది. అని ఫోన్ పెట్టేసాడు.


ఉస్సూరుమంది సూక్ష్మ శరీరం. వీడికెప్పుడూ హడావిడే. తమ్ముడితో యెక్కువసేపు మాట్లాడితే వాడికి అనుమానాలు తీరిపోయేవిగా అనుకుంది. ఇక రెండవ కొడుకు కిరణ్ యింటికి  వెళ్ళింది.

అక్కడ ఒక పత్రికలో వున్న  అమ్మ ఫోటోని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు కిరణ్ .  మా అమ్మ  మహారాణిలా యెంత  అందంగా వుంది. ఈమె కడుపున కదా తానూ జన్మించినది. ఆమె ప్రేమ కూడా మధ్య వాడైన తనపైన కూడా   యెంతో  వుండేది. ఆ  యిద్దరిని  వదిలేసి తన రచనలపై పూర్తి హక్కుని నాకే  వ్రాసి యిచ్చింది. ఆమె మనసుని నాకన్నా యెక్కువ చదివినవారు యెవరుంటారని ? ఆమె ప్రాణ స్నేహితులు కూడా సెన్సేషన్ కోసం ప్రపంచానికి యేదైనా చెప్పవచ్చుయేమైనా సృష్టించవచ్చు. ఎవరినీ నమ్మడానికి వీలులేదు అసహనంగా అనుకుంటూ యింకొక పత్రిక వైపు చూసాడతడు. 

ఆ పత్రికలో మారిన మత సంప్రదాయ వస్త్రాలు ధరించి మార్చుకున్న పేరుతో వున్న చిత్రం ఒకటి . తానిప్పుడు  నట్టింట్లో  యే  ఫోటో పెట్టుకోవాలి? అన్న చిన్న సందేహంతో పాటు ఆమె గురించి బాగా తెలిసిన సహాయకురాలు పత్రికలవారికి వున్నవీ లేనివీ చెపుతూవుండవచ్చు అని అనిపించింది. ఆమె నెంబర్ కోసం చూసాడు. దొరకలేదు.  అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురిని వెతికి వారిని  అడిగి ఆమె నెంబర్ ను అడిగి తీసుకుని  వెంటనే ఆమెకి కాల్ చేసాడు.

 మున్నీ,మీరు పత్రికల వారికి అమ్మ గురించి యే  విధమైన సమాచారం యివ్వడం అంత మంచిది కాదు. కుటుంబానికి యెంత గర్వకారణంగా ఆమెని మోసామో అంతకన్నా యెక్కువ అపకీర్తినిపుడు  మోయాల్సివస్తుంది. దయచేసి మా బాధని అర్ధం చేసుకుని పత్రికలవాళ్ళని దగ్గరకి రానీయకుండా వుంటే  మంచిది అని హెచ్చరిస్తూనే  యిది ఆమె అభిమానిగా మీ కర్తవ్యమ్ కూడా అంటూ  చిన్నపాటి ఎమోషన్ ని జతచేసాడు మాటల్లో.

కిరణ్  బాబూ ఆ మాత్రం నాకూ తెలుసు. అయినా నేనెక్కడో రెండు రాష్ట్రాల అవతల వున్నాను. మీరు నిబ్బరంగా వుండండి. కానీ అమ్మ  గురించి మీకు తెలియని విషయాలుంటాయి కదా, పోనీ  అవేంటో మీకైనా  చెప్పనీయండి అంటూండగానే వద్దు, అలాంటివి వినే ఆసక్తి, అవసరం నాకు లేదు. నాకే కాదు యింకెవరికి చెప్పే ప్రయత్నం చేయొద్దు నిష్కర్షగా చెప్పి  అని ఫోన్ పెట్టేసేడు.

సూక్ష్మ శరీరం  విరక్తిగా నవ్వుకుంది. ఇంతకన్నా తన  కుటుంబం నుంచి యేమి కోరుకున్నాను గనుక  అననుకుంటూ అక్కడి నుంచి తప్పుకుంది.

 కిరణ్ మాటలు విన్న మున్నీ రాయిలా నిలబడిపోయింది కాసేపు.

ఎంత చెడ్డదీ లోకం. సత్యాన్ని మరుగుపర్చడమే దాని నైజం. దేనినైతే ఆమె అమితంగా ద్వేషించేదో అదే నిజమవుతుంది. తనవాళ్లు పరాయి వాళ్ళు యెవ్వరూ దానికతీతులు కారు అంటూ వుండేది. అదే నిజమవుతుంది.

ఏడెనిమిదేళ్లపాటు ఆమెతో కలిసి వుంది. ఆమెని, ఆమె ద్వారా లోకాన్ని చదవగల్గింది ఆమె. ఈ పాపిష్టి  లోకపు మాటలు అంటని సుదూర తీరాలకేగిపోయాక కూడా అప్పుడు పొడిచి చంపిందికాక  తీరికగా  మళ్ళీపొడిచి పొడిచి చంపుతున్నారిపుడు. అప్పటికప్పుడు జ్ఞాపకాల గుట్టలని తవ్విపోస్తూ తనకిష్టమైన ఆమె కవిత్వాన్ని గుర్తుతెచ్చుకుంది.

 మర్నాడు ఆ కవిత్వాన్ని చదివి వినిస్తుంది హాస్పిటల్ లో పద్మ కి.

 "బ్రతికుండగానే ఆత్మని సమాధి చేసి పవిత్రత ముసుగేసుకునే ప్రపంచానికేమి తెలుసు ప్రణయ బాధ

కురిసి కురవక మరలి వెళ్లే మేఘాలను చూస్తూ   ఇసుక తుఫాన్ గా మారిన ఎడారి యెడబాటు కథ

హృదయాలను కెలకకండి ఆలోచనలను త్రుంచ ప్రయత్నం చెయ్యకండి.

బూతద్దాలతో  అంతరంగాలను  శోధించే పని మొదలెట్టకండి

బడబాగ్నులు దాచుకున్న మహా సముద్రం వాళ్ళు

యేదో వొకనాడు  దావానలంలా  చుట్టేస్తారు వాళ్ళు"

 వింటున్న బూడిదరంగు సూక్ష్మ శరీరం ఆనందంతో నాట్యం చేసింది

 అక్షరాలా విస్ఫోటనం ఆమెది కాక మరెవరిది. అభిమానులు ఆమె వాక్యాన్ని చప్పున పోల్చుకోగలరు వెనువెంటనే హారతి యివ్వగలరు.శీర్షికల క్రింద పేరు చూసి  పాఠకులు ఆత్రుతగా చదువుకునే సంచనల రచనలు చేసేది.స్త్రీల కోరికలు, దుఃఖం మరియు నిరాశ గురించి నిజాయితీగా మాట్లాడేది ఆమె. గజగామిని వీపు ప్రదర్శన  , చాందిని  నడుము ఒంపులు, టబు కటి నాట్యం చూసే రసిక ప్రేక్షకులున్న దేశంలో కళని, స్త్రీ అంతరంగ వేదనని యెగతాళి  వ్యాఖ్యలతో వొంకర నవ్వులతో లెక్కించే సమాజంలో ఆమె  స్త్రీల గురించి యేమి వ్రాసినా అబ్బురంగా చదివిన పాఠకులు లక్షలమంది. ఆమె అభిమానిని  అని చెప్పుకోవడమూ నాకు  గర్వంగానే వుంటుంది. ఆమె దగ్గరే నాకు  వుద్యోగం దొరుకుతుందంటే సంతోషం కాదు. ఇష్టంగా వుద్యోగంలో చేరాను . ఆమె భర్త చనిపోయినరోజులవి. బిడ్డలు యెవరి దారిన వాళ్ళు యెగిరిపోతే తోడు కోసం నన్ను నియమించుకుంది. ఆమె మంచి హాస్యప్రియురాలు. చీటికీ మాటికీ పెద్దగా నవ్వేది ఆ నవ్వులో అమాయకత్వమే కనబడేది. ఆశగా వుత్సాహంగా చైతన్యంగా వుండేది. ఏ విషయాన్నైనా నిర్భయంగా ధారాళంగా తార్కికంగా మాట్లాడే ఆమె దగ్గరకి నిత్యం యెందరో మిత్రులు పత్రికా రంగం వారు అనేకులు వచ్చిపోతుండే వారు. అభిమానిని అంటూ ఫోన్ చేసిన అతనికి అపాయింట్మెంట్ కూడా కుదిర్చి పెట్టింది నేనే. ఆ రోజు నాకు  బాగా జ్ఞాపకం.      

 వేళల్లో వేళ్ళు జొనుపుకుని మంచంపై కూర్చున్న ఆమెని సమీపిస్తూ ఆమె గోరింట గోళ్లని చూస్తూ నా హృదయ రుధిరంతో మీ  గోళ్లు ఎర్రబారినట్టున్నాయి, అంతగా మీ భావాలతో నన్ను గుచ్చి చంపారు అంటూ  ఆమె పాదాలకు కొంచెం ఎడంగా వినయంగా నేలపై కూర్చున్నాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఇచ్చిన రెండు గంటల సమయం దాటి మరో మూడు గంటలు పైగా  అతని ఆకర్షణీయమైన కబుర్లతో రచనలపై  అభిప్రాయాలతో గడిచిపోయాయి. ఆకలవుతుందని అడిగిన అతనికి అప్పటికప్పుడు స్వయంగా వొండి  వడ్డించింది. వెళ్ళేటప్పుడు తాను వ్రాసిన పుస్తకాలన్నింటిపైనా  ఆటోగ్రాఫ్ యిచ్చి బహుకరించింది.

 అది మొదలు ఆమెకి  ప్రతి రోజూ అతని నుండి ఫోన్ కాల్స్ వస్తూ వుండేవి. విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడి నుండి కూడా ఆమెకి కాల్స్ వచ్చేవి. గంటల తరబడి ఆకలి దప్పికలు మరచి అతనితో సంభాషిస్తూ వుండేది. అతని సంభాషణలన్నీ గ్రీష్మపు గాలిలో మొగలి పూల వాసనని మూటగట్టుకుని వచ్చి  మొహంపై కొట్టినట్లు వుండేవని వ్యాఖ్యానించేది .  ఆమె ఊహలన్నింటిని ఊసులుగా మార్చి అందమైన భాషలో సంభాషించేవాడు ఆమె డిజైర్స్ ని ఆకళింపుజేసుకుని యెలా మాట్లాడితే ఆమెకి నచ్చుతుందో గ్రహించి అలాగే సంభాషించి ఆమె మనసుకి  దగ్గరైపోయాడు.అతను సమ్మోహనంగా  నవ్వినప్పుడల్లా నేరుగా   వచ్చి హృదయానికి దిగబడి నట్లుంటుందని  తనకి కల్గిన భావాలని సంకోచంలేకుండా చెప్పేది. ఒకరకంగా సునామీలా ఆమె జీవితంలోకి వచ్చాడతను.నిప్పుని వొడిలో దాచుకున్నట్లు అసంతృప్తిని యాభై ఏళ్ళు దాచుకుని బ్రతికింది ఆమె . తాను సుఖించడం ఆదేశించడమూ  తప్ప తన మనసులోకి తొంగి చూడలేకపోయిన భర్తను తృణప్రాయంగా  తుడిచేసిందనే అనిపించేది.

 కొన్నాళ్ల తర్వాత  అతని ఆహ్వానం మేరకు అతని అతిధి గృహానికి  వెళ్లాం. ఆ ఇల్లు నది వొడ్డునే వుంది. మసక చీకట్లో  నది వొడ్డున్న కూర్చున్న ఆమె వద్దకు వచ్చి ఆలస్యానికి చింతించమని అడుగుతూ నదిలో  కాళ్ళు జాపుకుని కూర్చున్న ఆమె పాదాలపై దోసెళ్లతో నీళ్లు వొంపుతూ "ఎచట నీ పదాంకముల నీక్షింతు నచట అడవి దారియు నందన వనమట్లు తోచు "  గజల్  వినిపించాడు. ఆమె నవ్వుతూ అతని వంక చూసింది. "ప్రేమ భిక్షకునిన్ హింస పెట్టు టరయు ప్రాణ సౌందర్య రాజ్ఞికి పాడి కాదు " అని మరో గజల్ వినిపిస్తూ ఆమె కళ్ళల్లోకి చూసాడు.  అతని కళ్ళల్లో ఆరాధనకి చలించిపోయినట్లయింది. అతి తేలికగా అతని బాహువుల మధ్య ఆమె. నేనొకదాన్ని వున్నాననే సృహ కూడా లేకుండా నదిలో స్నానాలు, చేతిలో చెయ్యేసి తిరగడాలు కొసరి కొసరి తినిపించుకోవడం అలా  మూడు రోజులపాటు వారిదైన సామ్రాజ్యంలో విహరించారు.రచనలలో స్త్రీల ఆలోచనలు మనసు గురించి  రచయితగా యెంత  స్పష్టమైన ప్రతి బింబమో  వ్యక్తిగా అంత అస్పష్టమైన ఆలోచనలతో అమాయకంగా అతని మోహంలో చిక్కుకుంది. తన ఆలోచనలతో యేకాభిప్రాయం గల, తన  మేథని మెచ్చుకోగల  స్నేహితుడిని ఆకాంక్షించిందేమో. వయసు పెరిగేసరికి జ్ఞానం తెలిసే కొద్దీ సంస్కారం పెరిగే కొద్దీ  కొత్త అభిరుచులు మేల్కొని  కోర్కెలు బలపడతాయేమో అనిపించేది నాకు.

 వీడ్కోలు తీసుకుని వచ్చిన కొన్నాళ్ళకి ఆమె యింట్లోనే   కొద్దిమంది మత పెద్దల మధ్య ఆమె మతం మార్చుకుని పేరు కూడా మార్చుకుంది.  వారు ఆమెకి కొత్తగా మారిన మత సంప్రదాయ దుస్తుల్ని బహుకరించారు. ఆమె నిర్ణయం నన్నే కాదు లక్షల ఆమె అభిమానులని గాయపరిచింది. సంప్రదాయాల ముసుగులో మనిషిని అవమానించే మత విశ్వాసాలపై వెగటు పుట్టిందని  తనకి కావాలనుకున్నది స్వల్పంగానైనా దక్కించుకున్నానని  సంతోషంగా చెప్పేది .  ఇదే విషయాన్ని ఆమె మిత్రురాలికి ఫోన్ లో చెబుతూ వుండేది. ఆమెని బంధువులందరూ  వెలివేశారు. ముఖ్యంగా వృద్ధురాలైన తల్లిని చూడలేకపోవడం ఆమెకి అమిత బాధ కల్గించింది. స్త్రీ అంతరంగం సముద్రం లాంటిది లోతుపాతులు  చెలియలికట్టలు తెలుసుకొనుట మానవమాత్రులకి అసాధ్యం. ఆ కాలంలో పత్రికలలో వచ్చిన   గూఢ చిత్ర కవితలు  కూడా ఆమె మనసుని తెలియజేసాయి.మనుషులని మతాల వారీగా విడదీసే మనుషులకేమి తెలుసు మతాలకి అతీతమైనది  మానసిక ప్రేమ. దశాబ్దాలపాటు తన మానసిక ఆధారమైన మాధవుడ్ని మరిపించే ప్రేమ నాకు  లభ్యమైనప్పుడు ఆ మతాన్ని తృణప్రాయంగా విసర్జించానని  లోకం కోపగించుకుంటుంది. ఆ మాధవుడే ఈ మానవుడై తనకి తటస్థించి మధుర ప్రేమని రుచి చూపించి మతమెందుకు మారకూడదు అని సూటిగా నన్ను నాద్వారా సమాజాన్ని ప్రశ్నించినప్పుడు అవును యెందుకు మారకూడదు అని నాకూ అనిపించింది. జీవన పర్యంతం ప్రేమరాహిత్యాన్ని అనుభవించి ద్రోహాన్ని,బంధాలలో మోసాన్ని మోసిన నాకు  రవంత వుపశమనం కల్గితే యీ  లోకానికి యేమి నష్టం అనేది పదే పదే. అవును వొకరి అంగీకారాలతో ఆమెకి యేమి అవసరం ఆమె జీవితం ఆమెది అనుకునేదాన్ని నేను కూడా.ప్రణయం అంటే ఆమె దృష్టిలో దైవత్వం. పలుకులో చూపులో స్పర్శలో అనుభూతిని పొందుతూ యిరువురూ  మమేకం చెందటం.

 అతను బహుమతిగా యిచ్చిన మొబైల్ ఫోన్ ని యెప్పుడూ జాగ్రత్తగా నడుముకి బిగించుకున్న బెల్ట్ లో పెట్టుకుని అతని పలకరింపుకై ఆశతో యెదురు చూసేది.  కానీ అతను మళ్ళీ యెప్పుడూ ఆమె యింటి వైపు తిరిగి చూడలేదు.ఇప్పటికే మన  గురించి లోకం కోడై కూస్తుంది. నా రాజకీయ జీవితానికి వ్యక్తిగత జీవితానికి చాలా నష్టం అంటూ ముఖం చాటేశాడు. అప్పటికే రెండు వివాహాలు చేసుకున్నతను మళ్ళీ వివాహం  అనే పదం వినడం నచ్చక ముఖం చాటేసాడని  ఆమెకి అర్ధమయ్యింది.  ఆమె స్పర్శను ప్రేమని  కోరుకుంది. కోరికను కాదు. మోసపోయానని ఆమెకి తెలిసిపోయింది.కానీ వొప్పుకోవడానికి ఆభిజాత్యం అడ్డువచ్చేదనుకుంటాను. ఘర్ వాపసీగా వెనక్కి వచ్చేయమని హితుల వొత్తిడిని కూడా ఆమె తిరస్కరించింది.  ఒకోసారి దైద్వీ భావనలో వూగిసలాడేది అలాంటప్ప్పుడు ఆమె ఆలోచనలను నాతోనూ దాపరికం లేకుండా  పంచుకునేది.అంతరంగంలో ఆమెకి భయం. అల్లరి  మూకలు తనపై దాడి చేస్తారని పసికట్టింది. తన పిల్లలు,వారి పిల్లలపై దాడి చేస్తారని భయపడి మౌనంగా వుండిపోయింది.నిజానికి మతాల రంగు పులుముకున్న మనుషులని కాకుండా  మనసు విప్పుకుని మాటలు కలబోసుకునే  స్నేహాన్ని ప్రేమని ఆకాంక్షించింది. మనిషికి మతం చిరునామా కాదని ప్రేమే అన్ని మతాలకి చిరునామా అని తాననుకున్నది నిరూపించాలని నిమిష కాల వ్యవధిలోనే మరో  మతాన్ని యిష్టంగా హత్తుకుంది. అతను మాత్రం చిన్న చిన్న  చేపలని వలవేసి మత మార్పిడిలోకి లాగడం కన్నా తిమింగలానికే వలవేసి విజయం సాధించాడని అనిపించేది.

 సంప్రదాయ కుంటుంబాలలో పురుషులు, పిల్లలు ఆఖరికి తోటి స్త్రీలు కూడా పితృస్వామ్య భావజాలంతో నోళ్ళు నొక్కేస్తారు. నిజాలను కూడా కల్పనలుగా, సెన్సేషన్ కోసం వ్రాసిన వ్రాతలుగా కొట్టిపడేస్తారు. డబ్బు కోసమే రాతల్ని ప్రోత్సహించినా ఆ రాతలు నిజమని అంగీకరించడానికి దైర్యం చాలదు. పవిత్రత ముసుగులో తెలియనట్లు నటిస్తారు. అరవై ఐదేళ్ల వయసులో సిగ్గుమాలిన పని చేసిందని తలలు బాదుకునే బదులు ఆమెని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసివుంటే బాగుండేది అనిపించింది. కుటుంబమంతా వెలివేసినా అభిమానులు,మత సమాజం ద్వేషించినా ఆమె నిబ్బరంగా ఆత్మ వంచన లేకుండా జీవిస్తూనే  వియోగాగ్నిలో మండీ మాడిపోయింది. ఆశాభంగాలని జీర్ణించుకుంటూ మౌనాన్ని ఆశ్రయించింది. ప్రేమ పవిత్రయుద్ధంలో ఆమె ఒక సమిధ. అతనిలో ఆమెకి తన ప్రియ సఖుడు కృష్ణుడే కనిపించాడు. ఆమె అప్పటి  బ్రతుకంతా విరహ రాత్రుల మరకలే.ప్రేమను ఆరాధనను కలవరించి పలవరించింది. ఆమె రాధ.కృష్ణుడికై తపించిన రాధ. ప్రేమని ఆశించి కొంత అనుభవించి తనివితీరక ఇంకా ఇంకా ప్రేమించి శుష్కించి క్షీణించి మరణించింది.రోగం కాదు ఆమెని బలితీసుకుంది ప్రేమ అని,దుఃఖవిషం మింగి ఆమె చావుని ఆమె కొనితెచ్చుకుంది అని యెందరికి  తెలుసు. 

 సాహిత్య సంద్రంలో ఒక నదిలా స్వేచ్ఛగా ప్రవహించింది. పూవై పుట్టి అక్షర పరిమళాల్ని పంచి ప్రేమరాహిత్యంతో  ద్రోహం పాదాల క్రింద నలిగిపోయిన పువ్వులాంటి ఆమెకి  యేమివ్వగలను. ఆశలు ఆలోచనలు ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లాంటివని అవి ఎప్పుడూ చేతికందవు అన్న సత్యాన్నిగ్రహించి  ఒక స్త్రీ అంతరంగాన్ని అర్ధం చేసుకున్న మనసుతో యిలా కన్నీటి  అక్షరాల మాలని గ్రుచ్చి ఆమె జ్ఞాపకాలకు అలంకరించడం తప్ప. అని బరువైన మాటలతో ఆమె కథను ముగించింది మున్నీ.  బాగ్ లో దాచిన గులాబీని తీసి  ఆమె వ్రాసిన పుస్తకానికి  ముఖచిత్రంగా వున్న ఆమె ఫోటో పై   ఉంచింది  అభిమానంగా..

 బూడిదరంగు సూక్ష్మ శరీరం మున్నీ చెప్పిన తన కథను వింటూ కన్నీళ్ళు  తుడుచుకుంది.

 పద్మ కూడా భారమైన మనసుతో  ఆలోచిస్తూనే  ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. లోపలి పేజీల్లో వున్న పూల చిత్రాలను చూపిస్తూ ఆమెకి యిష్టమైన  పూలు ఇవేనా అని అడిగింది. .

అవును,మా ప్రాంతంలో వుండే అరుదైన పూలివి.  ఆమె వ్రాసుకున్న  ఆత్మ కథ  పుస్తకం యిది. నేను చెప్పిన కథకు ఎన్నో సంవత్సరాలు  ముందు జరిగిన కథ. ఇందులో  నేను చెప్పిన కథ వుండదు అంది మున్నీ.

  ఇప్పుడు మీరు చెప్పిన కథ  ఆత్మకథ పార్ట్ టూ గా రావాల్సిన కథ అనిపిస్తుంది నాకు.  ప్రేమ  పవిత్ర యుద్ధంలో దగా పడిన స్త్రీల జాబితాలో యిలాంటి ప్రఖ్యాత రచయిత వుండటం ఆశ్చర్యమే కానీ అసాధారణమేమి కాదు కదా ఆమె ఒక స్త్రీ యే కదా !  ఆమె ఒక మైనం ముద్దలాంటింది. అభిమానులు,పాఠకులు సమాజమూ  యే  మచ్చులో   పోసుకుని చూసుకుంటే ఆ విధంగానే  కనబడుతుంది అంతే కదా అంది పద్మ.

పాపపుణ్యాల భీతిని జయించిన ఆమె మతం దేవుడు అనే విశ్వాసాన్ని మట్టుకు గుడ్డిగా పట్టుకుని వేలాడింది.  మాములు మనుషులు లాంటి వారే ఈ రచయితలు కూడా. 

 తన  జీవితంలో జరిగిన ముఖ్యమైన ముగింపు ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి అయిన మున్నీ పాఠకురాలైన పద్మకి  చెప్పడమూ   ఆమె ఓ  న్యాయదేవతలా వ్యాఖ్యానించడమూ  చూసిన బూడిద రంగు సూక్ష్మ శరీరం  సంతోషంతో తబ్బిబై పోయింది. ఇదిగో ఇలాంటి ఆలోచనలున్న మనిషి కోసం తన రచయిత మనసు ఆరాటపడింది . ఇక ఈ భూమి పైన సంచరించాల్సిన పని లేదనుకుంటూ   వెలుగు లోకము వైపు ప్రయాణిoచింది

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

దేవుడా

దేవుడు గాన నాకు కనబడి ఉంటే పొరక్కట్ట తీసుకుని నాలుగు బాది  ఉండును. మనిషిని స్థిమితంగా కాసింత కూసిండనీయకపోయే...

మనుషులందరూ ఒకటే అంటరు గానీ నల్లరంగు తెల్లరంగు ఎర్ర రంగు గోధుమరంగుతో ఎన్ని రంగులు?
మళ్ళీ దేవుళ్ళలో రకాలు  వాళ్ళ గురించి చెప్పే మతాలు. ఈ దేశంలోనే కాదు అనేక దేశాలలో  తినడానికి మెతుకు లేకపోయినా మోయడానికి  మతం కావాలి.  మతం ముసుగులోనే  అస్తిత్వం వెతుక్కోవాలి. అందుకే ..దేవుడా ..నీ మీద చానా కోపంగా వుంది. జనులు అజ్ఞానంలో మూర్ఖత్వంలో పడి కొట్టుకుపోతున్నారు.

కూటికి కటకట లాడేటాళ్ళు కోట్లానుకోట్లు  ఆ కోట్లు వుండేటాళ్ళు వేలు. వుంటానికి చిన్న గుడిసెయినా లేనేటోళ్ళు, అంతస్తులు మీద అంతస్తు లుండేటాళ్లు కొద్దిమంది .

ఆకళ్ళు,రోగాలు, నొప్పులు ఇవన్నీ నిండిన లోకంలో లేనోడికి వుండేటోన్ని చూస్తే కొంత ఈసు మరి కొంత ఉక్రోషం సహజమే కదా! మనుషులందరినీ ఒకటిగా పుట్టీయనందుకు ఈ మాత్రం కోపం రావడం నాలోని రచయితకు సహజమే కదా !

అయ్యో .. దేవుడ్ని ఎంత మాట అనేసినాను. పుణ్యం చేసుకోండిరా అని భూమి మీదకు పంపిస్తే పాపాలు చేసుకుని అనుభవిస్తా వుండారు. ఇది కర్మ సిద్ధాంతం. చేసుకున్నోడికి చేసుకున్నంత.. చేసేది చేయించేది ఆయనే అయినప్పుడు మనం నిమిత్తమాత్రులం. అంతే కదా ! అనుకుంటూ  కూసిని  కన్నీళ్ళ మధ్య మళ్ళీ నిర్వేదం.    పక్షికి రెక్కలు వలె రధానికి చక్రాల వలె .. భక్తీ విశ్వాసం కలిసే వుంటాయి. ఆ విశ్వాసంతో జీవనం సాగించడమే తప్ప జీవశ్చవంలా బ్రతుకులీడుస్తుండటమే తప్ప యెవరిని కరిగించేనూ .. ఈ వేడికోళ్ళు.

ఇలా అనుకుంటుంటే  అప్రయత్నంగా గురుదేవ్ రాతలు గుర్తుకొచ్చాయ్.

"మంత్రాలూ కీర్తనలూ జపతపాలూ విడిచిపెట్టు. తలుపులన్నీ బంధించి, ఈ గుడి చీకటిమూల వొంటరిగా ఎవరిని పూజ చేస్తున్నావు? కళ్ళు తెరచిచూడు, నీ ఎదట ఈశ్వరుడు లేడూ!.

ఎక్కడైతే గట్టినేలను రైతు దున్నుతున్నాడో, ఎక్కడ బాట వేయడానికి కూలీలు రాళ్ళు కొడుతున్నారో, అక్కడ ఈశ్వరుడు ఎండలో వానలో దుమ్ము కొట్టిన బట్టలతో వాళ్ళ మధ్యన తిరుగుతున్నాడు. నీ మడి బట్టలు అవతల పెట్టి అతని వలనే నువ్వూ దుమ్ము నేల మీదకి రా.. 

మోక్షమా! ఆ మోక్షమనేది యెక్కడ వుందయ్యా! మన ప్రభువే సంతోషంగా ఈ సృష్టి బంధాన్ని తన పైని వేసుకున్నాడు. శాశ్వతంగా మనతో తానూ కట్టుబడి వున్నాడు. 

నీ పుష్పాలు, ధూపాలూ, దూరాన పెట్టి నీ ధ్యానంలోంచి బైటికి రా! నీ బట్టలు చిరిగి మరకలైతే, ఇంతలో వచ్చిన ముప్పేమిటి? నుదుటి చెమటతో కష్టించి, కృషిలో అతని పక్కన నిలబడు. 

టాగోర్ “ గీతాంజలి” కి చలం అనువాదం నుండి. 

కష్టపడినా కడుపు నిండెనా ? పని లేక పడక ఎక్కిన వ్యవసాయం అటకెక్కిన పల్లెలు పట్నాలు. అనేకానేక ఆత్మ హత్యలు  :( 

దీనభాంధవుడు యెవరూ లేరు. ప్రజలను వెఱ్ఱి గొర్రెలను చేసి ఆడిస్తున్నవారే. దేవుడికి కూడా రంగులు మార్చుతున్నవారే.

ఈ దేశంలో ఆకలితో ఒక కుక్క చనిపోయిందంటే అందుకు కారణం నేనే అనుకుంటాను అన్న వివేకానందుడు పుట్టిన యీ దేశంలో  మనిషితో సహా అడవులను గురించిన ఆలోచించే నాయకుడే లేడు.

మూర్ఖులు అవినీతిపరులు రాజైన చోట ప్రజల ఇక్కట్లు వినడానికి దేవుడికి చెవులు కూడా లేకపోయే! ఉంటే చూస్తూ ఊరుకుంటాడా ? 

ధర్మం వైపు  పీడితుల వైపు నిలబడి ఉండటమే కదా ..మనిషి తత్త్వం. (రచయిత కాకపోయినప్పటికీనూ )

దేవుడా .. రక్షించు.. మా అజ్ఞానాన్ని అంధకారాన్ని అసహాయతను. విజ్ఞానపు వెలుగును తరుముతూన్న చీకటి కరి మబ్బులను.

ఎందుకోసం ప్రార్దిస్తున్నామో కూడా తెలియని నిస్సహాయత ..లేవనా  లేక వున్నా పట్టించుకోవడం లేదనా ?
ఏమో తెలియదు.

26, సెప్టెంబర్ 2019, గురువారం

ME IN MY SOLITUDE

జగతి జగద్ధాత్రి గారి ఆంగ్ల అనువాదంలో నాకవిత.

ME IN MY SOLITUDE

Who says solitude is loneliness?
It is the hundred thousand’s vision
Of me looking into myself
It’s the great revelation of
Embracing my soul
To describe aloneness is
To chisel the thoughts
To adorn the letters
It’s not filling colors to the paintings
The time
When the lights are off
When the flowers fall down
When the dawn flower blooms
That’s when my solitude mingles
With my aloneness
As the light spreads around the lamp
Around me and in me it’s my solitude that surrounds
Shameless dreams always wait
To disturb my seclusion
As the pains drench the heart book
Solitude is always a brook that never comes to light
Changing the
Hopes that fall as stars
Sweet moments that are held with tact
Moss grown bitter memoirs
Into pebbles
Throws into the ignorant seas
Leaves me ashore
With an over smartness
Not to show any other footprint in my heart forest
With an untouchable attitude
Except for me to touch
Exhausts with the
Labor of umpteen thoughts
Shatters with the explosion of emotions
Flowing as secretions
Breathes in the air of my outer world
Rolling along with the times
Remains a residue
Leaving a little space in my begging bowl
For my tomorrow’s solitude
Holds me as a human
Telugu original : NAA EKAANTHAM LO NENU నా ఏకాంతంలో నేను - వనజ తాతినేని
English trans: Jagaddhatri … 12.58 pm 24/9/2018 Monday25, సెప్టెంబర్ 2019, బుధవారం

నీట చిత్తరువు“అరవై కొమ్మల వృక్షం నేలబడిందంటే తిరిగి లేవదు, ఏమిటో చెప్పాలి” అంది వాకిట్లో ముగ్గు వేస్తూన్న నారాయణమ్మ.


కాసేపు ఆలోచించి “ఏమో తెలియడం లేదు, నువ్వే చెప్పు” అన్నాను.


“పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఇది కూడా తెలియదు మీకు, పొద్దునే లేచి ప్రతి ఆడోళ్ళు చేసేది” అంది .


“ముగ్గేసే పని అందరూ చెయ్యలేరులే” అనంటే నవ్వింది.


నారాయణమ్మ దగ్గర మంచి సంభాషణా చాతుర్యం వుంది, నలుపు రంగులో భలే కళ గా ఉంటుంది.చీటికి మాటికీ విరిసే నవ్వు ఆమె చక్కదనాన్ని చిక్కబరుస్తుంది. బాగా ముగ్గులేయడమే కాదు ముగ్గు గురించిన సామెతలు కూడా తెలుసు ఆ మాటే అంటే..


“సామెతలు, పాటలు, ముగ్గు పిండి చేయడాలు అన్నీ వచ్చు” అంది.


“ఏంటి ముగ్గురాళ్ళు కొట్టేదానివా నువ్వు” అడిగాను ఆసక్తిగా


"ముగ్గురాళ్ళ కొట్టడం కాదు. అసలా ముగ్గు పిండి చేసే గుల్లలను సముద్రం నుండి పట్టుకొచ్చి కాల్చి ముగ్గు పిండి చేసేవాళ్ళం అంది.ముగ్గులో పసుపు కుంకుమ పెట్టి పూలు పెడుతూ ఇంకా ఏవేవో మెరుగులు దిద్దుతున్న తనని ఆపుతూ “వేసింది చాల్లే, అంట్లు తోముకుంటూ ఆ కథ చెపుతువుకాని రా” అన్నాను.అక్కడనుండి కదలకుండానే ఆ కథంతా చెప్పేయగలదని భయమేసి. అవతల ఆఫీస్ కి లేట్ అవుతుందనే భయం నాది.. నేను పాలగిన్నె పొయ్యిమీద పెట్టి నారాయణమ్మ వైపు చూసాను కథ కొనసాగింపమని.


“మా నాయనది నిజాం పట్నం. మా అన్నదమ్ములు మేనత్తలు యిప్పటికి అక్కడే వుండారు. మా నాయనే చేపలు పట్టుకుంటూ బందరు వచ్చేసి అక్కడే నిలిచి పోయాడు. ఆరుగురు అక్కచెల్లెళ్ళం ఇద్దరు అన్నదమ్ములు. మా నాయనొక్కడూ ఏట కెళ్ళి చేపలు తెస్తే మా కడుపులు నిండేది యెట్టా? మానాయన మమ్మల్ని సముద్రంలో దింపి ఏట నేర్పాడు.మా అక్కాళ్ళు నాయనతో పడవమీద ఏటకెళ్ళేవాళ్ళు. చిన్నాళ్ళం మేము ముగ్గురం కలిసి నడుముకు ఉల్లిపాయలు సంచి గోతాము సంచి కట్టుకుని తాటి చెట్టు లోతుకి వెళ్లి మగాళ్లు వేసుకునే పైపంచ ఉంటది చూడు దాన్ని నాలుగు చెరుగులని రెండు చేతులతో పట్టుకుని అలొచ్చినప్పుడల్లా దానితో పాటు ఒడ్డుకు కొట్టుకొచ్చే గవ్వలు ఆల్చిప్పలు నత్త గుల్లలు ఎంట్రకాయలని వొడుపుగా జొవురుకుని నడుముకు కట్టుకున్న సంచీలో యేసుకునేవాళ్ళం. సంచి నిండేదాకా అట్టా దేవులాడతానే వుండేవాళ్ళం. వాటిని ఇంటికి మోసుకొస్తే మా అమ్మ యేటికాటికి యేరు చేసి ఎంట్రకాయలను నత్త గుల్లలను చిన్న చేపలను వూళ్లో తిరిగి అమ్మేసుకోచ్చేది"


“నత్తలను కూడా తింటారా” అని ఆశ్చర్యంగా అడిగితే “ఆ.. ఆసంగతి మీకు తెలియదదేంటి” అని తాను ఆశ్చర్యపోయింది.


“సర్లే నత్తలు యెలా వొలుస్తారు చెప్పు మరి”


“నత్తలుడకబెట్టే సున్నపు గాబు వుండేది మాకు. దానికింద గాడిపొయ్యి. గాబులో నత్తలు నీళ్ళుపోసి పెళ పెళ లాడేమంట పెట్టి వుడకబెట్టే వాళ్ళం. నత్తలు బయటకి వచ్చేసేయి. వాటిని కూర వొండుకోవడమో డబ్బులు కావాలంటే అమ్మేయడమో చేసేది మా అమ్మ. అట్టా మిగిలిన నత్త గుల్ల పెంకులను ఆల్చిప్పలను శంకువులను అన్నింటిని పోగెట్టి బట్టీ పెట్టి కాల్చే వాళ్ళం. అన్ని చక్కగా కాలి సున్నం లాగా అయిపోయేది. కాలని వాటిని నల్ల బడిన పెంకులని యేరి పారేసి ఆ సున్నం పొడిని అమ్ముకునేవాళ్ళం. ఎట్టా ఉండేది అనుకునేవ్ ఆ పిండి, తెల్లగా ఎన్నెల పిగిలిపడతన్నట్టు ఉండేది. ఆ పిండితో ముగ్గేస్తే కర్ర ఎంత చక్కగా వస్తదో. నువ్వుగాని చూసావంటే వొదిలిపెట్టవ్ “ అంది. అంట్లు కడగడం పూర్తిచేసి తడిచేతులు పమిట చెంగుకు తుడుచుకుంటూ.


“ఇప్పుడు కూడా అలా తయారుచేసేవాళ్ళు వున్నారా అడిగాను” కాఫీ కప్పు అందిస్తూ . “


"


ఇప్పుడెవరు చేత్తారు అయన్నీ. అప్పుడు పొట్టకూటి తిప్పలవి. అప్పుడైనా ఆ ముగ్గు పిండికి డబ్బులు ఇచ్చేవ్వాళ్ళా యేమన్నానా, డబ్బు బదులు నూకలు పెట్టేవాళ్ళు, పాత బట్టలిచ్చేవాళ్ళు. అన్నం పెట్టేవాళ్ళు తీగకి కాసిన సొరకాయలిచ్చేవాళ్ళు. అదే పరమానందం మాకు. ఇప్పుడవన్నీ చేసేవాళ్ళు ఎవరుండారు? మర పడవలు వచ్చేసాయి. బోట్ లో సిలిండర్ వేసుకెళ్ళి వంటలు చేసుకుని తింటూ వారం పదిరోజులు ఏట చేసుకుని వచ్చి అమ్ముకుని కూసుని తింటున్నారు. కాకినాడ లో మా వాళ్ళందరూ ఇంట్లో కూసుని తినడమే. ఆడాళ్ళు ఒక్కరు పనికిబోరు. బట్టలుతుక్కునే మిషన్లు కూడా కొనుక్కుని సుఖంగా వుండారు. అని.. నేను పోతన్నా.. నీ దగ్గరే కూసుని కథలు చెప్పుకుంటే ఎట్టా ... అవతల నా పని మొగుడు తరుముతున్నాడు” అని కప్పు కడిగేసి పెట్టి వెళ్ళిపోయింది.


ఎనిమిది ఏళ్ళ క్రితం మా ఇంటి ముందావిడ పనెమ్మాయిని పెట్టుకుంటారా అని అడుగుతూ తన వెనుక నిలబడ్డ నారాయణమ్మని చూపిచ్చింది. విరిగిన మోచేతికి కట్టు కట్టుకుని మెడ చుట్టూ చీర చెంగు కప్పుకుని ఎంతో దిగులుగా కనబడిన ఆమెని చూసి జాలి అనిపించి సరేనన్నాను పనమ్మాయి అవసరం లేకపోయినా కూడా. అట్టా వచ్చి యేళ్ళ తరబడి కూరుకుపోయింది మా ఇంట్లో మనిషిగా. ఏ వేళప్పుడు వచ్చి తలుపు తట్టినా సంకోచం లేకుండా తలుపు తీసి నమ్మకంగా లోపలి రానీయగల్గిన మనిషి అయిపోయింది.


“కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు,అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు.. ఏమిటది ?” అంది ఇల్లు తుడుస్తూ.


“తెలియదులే నువ్వే చెప్పేయ్” అన్నాను కొంచెం విసుగ్గా. నవ్వుకుంటూ పాట అందుకుంది.


“భలే పాడుతున్నావే. నిజం చెప్పు నువ్వసలు చదువుకోలేదా ?”


“ఏం చదువుకోకపోతే పాటలు పాడలేరా,వరసగా పది పాటలు పడతాను ఇనుకో” అంది నన్ను ఆట పట్టిస్తూ. నా ముఖంపై నాట్యమాడే ఆశ్చర్యాన్ని ఆటపట్టిస్తున్నట్లు చూస్తూ నవ్వుకుంటూ “శివుని శిరసు పైనె చిందు లాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ అంటూ మొదలు పెట్టి ఆపకుండా జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె మెల్లంగ వస్తాది నా యెంకీ సల్లంగ వస్తాది నా యెంకీ “అంటూ నాలుగు గీతాలు పాడింది.


బ్యాంకులో వేలిముద్ర వేసి అకౌంట్ ఓపెన్ చేసినప్పటి సంగతి గుర్తొచ్చి “యెట్టా గుర్తుంటాయి నీకవన్నీ” అంటే “రక్తములో వచ్చింది ఎక్కడికి పోద్ది. ఇదంతా మా అమ్మ చలవ. మా అమ్మ పరికి ముగ్గులామె. బందరులో ఆటాడుతూ పాటలు పాడుతున్న ఆమెని చూసి ప్రేమించి పెళ్లి చేసున్నాడు మానాయన. పెద్ద యుద్ధమే చేసాడంట మానాయన యింటో వాళ్ళతో. మా అమ్మని చూస్తే ఆశ్చర్యపోతావ్ మీ యిళ్ళల్లో పుట్టినావిడికి మల్లె వెలిగారం అద్దిన బంగారంలా మెరిసిపోతా వుంటది అంది. వెలిగారం అంటే యేమిటో అది అద్దిన బంగారం యెలా వుంటుందో నాకు తెలియకపోయినా వూ కొట్టి వూరుకుని “అయితే మీ అమ్మ బాగా పాటలు పాడుతుందా?”


“బాగా పాడుద్ది.పెద్ద పెద్దోళ్ళు పండక్కి, పెళ్ళిళ్ళకు ముగ్గులేయడానికి, పోలు పొసే చోట ముగ్గేయడానికి అమ్మవారి గుడిముందు ఉత్సవం ముగిశాక వేసే రతి ముగ్గు వేయడానికి వెంటబెట్టుకుని తీసుకెళ్లేవారు. అంత పేరు మా అమ్మకి” అని గర్వంగా చెప్పింది.


“నువ్విచ్చిన రేడియో ఏం చేసాననుకున్నావ్ ఆమెకే ఇచ్చి పంపిచ్చా మా అక్క కొడుక్కిచ్చి. . వొళ్ళో పెట్టుకు కూర్చుని పాటలు వింటా ఉంటది. రోజు వార్తలు వినాలి. సముద్రం ఎట్టా ఉంటాదో,తుఫాను వస్తుందేమో అని. కొడుకులు సముద్రంలోకి ఏటకెళ్లి యెప్పుడొస్తారో అని యెదురెదురు చూస్తా ఉంటది.ఒకేల తుఫాన్ వార్తలు విన్నదనుకో, చెవికి అతికిచ్చుకుని ఒకటే ఫోన్ చేస్తానే వుంటది కొడుకులు మీద అంత భ్రమత. అందరూ బాగానే వుండారు కదా నేను ఒక్కదాన్నే యిట్టా వుండా. అయినా నా గురించి ఒక్కరవ్వైనా పట్టించుకోదు. తల్లి కూడా అంత కఠినాత్మురాలు” అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.


సరదాగా మొదలైన సంభాషణ దుఖంలోకి దారితీసింది. పమిట చెంగుతో కళ్ళు అడ్డుకుంటూ చెప్పింది తీరం వెంబడి సాగుతున్నజీయితం యిట్టా నగరానికి కొట్టుకొచ్చి గిలగిల లాడతా వుంది. అందరికి నా డబ్బులైతే కావాలి నేను మాత్రం అవసరం లేదు..అనుకుంటూ మనసులో కచ్చ నంతా తుడుస్తున్న బండ్లపై చూపించింది. నేను మౌనంగా వుండిపోయాను. ఇల్లంతా తుడిసి వచ్చి కాఫీ పెట్టవా అంది.


"ఎందుకు పెట్టనూ , కోపం తగ్గిందా?"


"కోపం కాదమ్మా ! మీ అందరూ అప్పుడు ఆదుకోకపోతే ఏమైపోయేదాన్ని నేను. అసలు ఇల్లు వొదిలి ఎందుకొచ్చేసినా అని ఎవురైనా ఆలోచించారా ? బిడ్డలను వొదిలిపెట్టేసి పోయింది అంటారే కానీ ఇల్లు ఎందుకు వదిలిపెట్టానో చెపితే ఒక్కరైనా నమ్మారా? ఎప్పుడు నువ్వడగలేదు నేను చెప్పలేదు గందా.. చెపుతా వినుకో" అంటూ గోడకి వెన్ను ఆనించి స్థిమితంగా కూర్చుంది .


నాకప్పుడు పదమూడేళ్ళు. మా ముగ్గురక్కలకు పెళ్ళై పోయింది. నేను పదమూడో ఏట పెద్దమనిషి అయ్యాను.ఒంటికి వసంతం వొచ్చింది గొంతుకి పంచమం కూయడం వచ్చింది అనేది మా అమ్మ. పెద్దమనిషి అయ్యాక నెలకే మా మేనత్త పల్లిపాళెం నుండి మా ఇంటికి వచ్చింది. ఆమెకి ఒక కొడుకు వున్నాడు. అంతకు ముందే పెళ్ళైపోయింది వాడికి. ఒక కొడుకు పుట్టాక పెళ్ళాం ఆ పిల్లాడిని తీసుకుని ఎల్లిపోయిందంట. నారాయణి ని నాకొడుక్కిచ్చి చేయరా. ఎప్పుడో ఎడం అయిపోయిన వాళ్ళము ఇట్టాగన్న కలిసిపోతాం అని పీడిచ్చింది. మా నాయనకి అంత ఇష్టం లేకపోయినా మా అమ్మ వొప్పిచ్చింది. మా అత్త కొడుకుని అంతకుమునుపు చాలాసార్లు చూసినాను. అప్పుడప్పుడు మా నాయనమ్మ మమ్ములను నిజాం పట్నం తీసుకుపోయేది గందా . ఎంత చొక్కు అనుకున్నావ్ ఆడికి. ఓ ఇచ్చకాలు ఆడేవాడు పెళ్ళాంని పక్కనబెట్టుకుని కూడా. పెళ్ళాం ఎందుకు వొదిలేసి పోయిందో అందరికి తెలుసు.అసలు పని చేయడు, ఎప్పుడూ కల్లు ముంతలు ఎత్తేయడమూ, సారా తాగడం మంచానికి అడ్డంగా పడి ఉండటం. ఇంటో సరైన ఆడది ఉంటే మగాడు ఎందుకు అట్టా తయారవుతాడు. పిల్లనిచ్చావ్ అనుకో నా ఇంటికి లచ్చిందేవి వచ్చినట్టేరా అన్నయ్యా. బాగా చూసుకుంటాం వొప్పుకోవే అని బతిమలాడి మానాయనను ఒప్పించింది.


“మరి నీకిష్టం లేదని చెప్పలేదా ?”


“చెప్పే దైర్యం లేదు, వినేవాళ్ళు లేరు. నాకిష్టం లేకపోయినా మాఘమాసంలో లగ్గమైంది. అత్తారింటికి పంపిచ్చారు. ఆడితో జీయితం నరకం అనుకో. సముద్రం ఈదటం నేర్చుకున్నా కానీ ఆడితో మంచం ఈత నేర్చుకోలేకపోయా.రోజూ గోలే, ఇద్దరు బిడ్డలు పుట్టినా ఆడు రూపాయి సంపాదిచ్చడానికి యిల్లు వొదిలేవాడు కాదు. నిండు గర్భిణిగా వుండి కూడా సముద్రానికి పోయి నత్తలు ఎంట్రకాయలు ఏరుకురావాల్సి వచ్చేది. చేపలమ్ముకొచ్చి మొగుడుకి కూడా కూడు పెట్టాల్సి వచ్చేది. మా తమ్ముళ్లు పెద్దవాళ్ళై బందరు రేవులో ఏట అంత బాగోలేదని కాకినాడకు ఎల్లిపోయారు. మరపడవల్లో పనికి కుదిరిపోయారు. వాళ్లతో కూడా పనికి రమ్మన్నా పోయేవాడు కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే ... అని ఆపింది. చెవి ఉగ్గ పెట్టాను ఏమి చెపుతుందా అని.


మిట్ట మధ్యాహ్నం యేటి కుక్కలు కూడా పొదల్లోకి దూరి నిద్రపోయే టైము. ఎండ కూడా యెన్నెలలాగానే వుంది.సముద్రం కూడా గంభీరంగా వుంది. రెండు చేపలైనా దొరుకుతయ్యి అని తీరానికి పోయాను. ఒక గంటసేపు ఈది కాసిని నత్తలు రెండు చేపలు చేజిక్కించుకుని ఇంటికి బయలుదేరా. మా ఆయనతో తిరిగే నలుగురు చచ్చినోళ్ళు పొదలలో దాక్కున యేటి కుక్కలు చేపల ఏటకి ఒక్కసారే చుట్టేసినట్టు నన్ను నాలుగు పక్కలనుండి చుట్టేసారు.చిల్లకోల వుంది నా చేతిలో. ఒక్కొక్కడిని పొడిచి పారేత్తున్నా.ఒకడు వెనకనుంచి వచ్చి నా చేతిలో చిల్లకోల లాక్కుని విసిరి పారేసాడు. పొదల్లోకి లాక్కుపోతన్నారు వాళ్ళు. అంతలో కట్ట మీదనుంచి డుగ్గు డుగ్గు మని బండేసుకుని వచ్చినాడు అతను గాని రాకపోతే కుక్కలు చింపేసిన ఇస్తరి అయిపోయేది నా బతుకు. అతన్ని చూసి నన్ను వొదిలేసి పారిపోయారు వాళ్ళు.


"ఎవరతను? "


ఆ ఊరి రైతు కొడుకు పెద్ద వ్యవసాయం. చదువుకున్నాడు కూడా. చిన్నప్పుడు మాతో పాటు సముద్రానికి వచ్చి ఈత నేర్చుకున్నాడు.నేనే ఈత నేర్పానప్పుడు. చిన్నప్పటి సేయితం మాది. దేవుడల్లే వచ్చాడు. బెదిరిపోయిన నన్ను బండి మీద ఎక్కించుకుని మా పాలెంకి తీసుకెళ్లాడు. మా పేటలోకి రాగానే ఇక్కడ దించేయ్ నేను నడచిపోతానులే అని దిగి నడిచి పోయాను. నా మొగుడు ఇంట్లోనే ఉండాడు చేపలెయ్యి చిల్లకోల యేది నిన్ను మోటార్ బైకు మీద దించిన ఆ నా కొడుకెక్కడ అని జుట్టు పట్టి కిందకీడ్చి పెడీ పెడీ కొట్టాడు. నేను బండి మీద వొచ్చిన సంగతి నీకెట్టా తెలుసు నువ్వే కదా ఆ నా కొడుకులను నామీదకి ఉసి గెలిపింది అని అడిగా రోషంగా . అవునే నువ్వెంత పతివోతవో తెలుసుకొనేకే అట్టా పంపిచ్చినా అన్నాడు. కడుపు రగులుకుపోయింది. మీదపడి రక్కేసా. వాడు వూరుకుంటాడా నన్ను విరగొట్టేసి పోయాడు. పిల్లలు ఏడుస్తున్నా వొదల్లేదు. మంచాన పడి మూడు రోజులు లెగలే, పిల్లలకు వొండిపెట్టడానికి మా మరుదుల ఇళ్ళకి కాకినాడకు పోయిన మా అత్తను ఫోన్ చేసి పిలిపిచ్చినాడు. మా అత్తకు ఏమి చెప్పినాడో ఏమో, నీకు సిగ్గులేదంటే మొగుడ్ని వొదిలి ఇంకొకడితో ఊరేగుతావా అని బుగ్గల పొడిచి పొడిచి తిట్టి పెట్టింది. నాలుగోనాడు సముద్రం మీదకు ఏటకు పోతన్నానని పోయాడు. కానీ ఏటకు పోలేదు ఏమిలేదు. దాపున దాపున దాక్కుని నాకు కాపలాలు కాసేవాడు. అట్టా మూడుతడవలు చేసాడు. పంచాయితీ పెట్టిద్దును. మా నాయన కొద్దిగా ఓర్చుకో నారాయణా అన్నాడు.


నా మొగుడు మహా రోత మడిసి. చేటలో తౌడుపోసి కుక్కలను ఉసిగొల్పినట్టు సేయితుల్ని నా మీదకు ఉసిగొల్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తాగేవాడు. ఆ సంగతి నాకర్ధమై నా జాగ్రత్తలో నేనుండాలని ఇల్లు కదలడం మానేశా. ఆడు అనుకున్నది జరగడం లేదని నన్ను చీటిమాటికి యేదో వొంక పెట్టేసి బాదేసేవాడు. అడ్డమైన బూతులు కూసేవాడు. విన్నవాళ్ళందరూ ఆడు కూసేది నిజమే అనుకునేవాళ్ళని ఆళ్ళు నన్ను చూసే చూపులను బట్టి అర్ధమైపోతా ఉండేది. ఒకరోజు మా అత్తా మొగుడు మా ఆడబిడ్డ మొగుడికి బాగోలేదని చూసి వచ్చేదానికి కావిలికి పోయారు. ఆ రోజు తీరంకి పోయి అతని కోసం కాపు కాసాను. బండి మీద వస్తున్న అతనికి అడ్డం పడి నన్ను యేడకన్నా తీసుకుని పో అని అడిగా. ఇదిగో నువ్విప్పుడు ఆశ్చర్యపడినట్టే అతను ఆశ్చర్య పడ్డాడు. నేను తప్పు చేసినా చేయకపోయినా నీకు నాకు రంకు కట్టడం మానడంలేదు నా మొగుడు. అదేదో నిజం చేసేయ్ అన్నాను అంది. కథ మొత్తం చెప్పేసేదే. ఇంటికి బంధువులు రావడంతో కథకి కామా పెట్టేసి నారాయణమ్మ పనిలోకి నేను అతిధి మర్యాదలోకి మునిగి పోయాం.


రాత్రి పడుకున్నాక కూడా ఎన్నో ఆలోచనలు చేసాను.నారాయణమ్మ అతనితో కలిసి వచ్చేసిందా ? అతను మోజు తీరాక వదిలేసి వెళ్లిపోయాడా ? అసలేం జరిగిందో ? నిద్ర పట్టలేదు నాకు. ప్రతి మనిషి జీవితంలో ఏవో చీకటి కోణాలుంటాయి హృదయంలో ఎన్నో అగాధాలుంటాయి . అందులో యెన్నో కోర్కెలు దాగుంటాయి. అప్పుడప్పుడూ అవి కీకారణ్యంలో అర్ధరాత్రి మేల్కొన్న మృగాల్లా భీకరంగా అరుస్తుంటాయి. ముసుగు వేసుకుని పైకి నాగరికంగా వుంటారు కానీ కోర్కెల నదిని అవలీలగా దాటేసినవారు ఎందరు?


నారాయణమ్మ కూతురు పెళ్ళికని డబ్బు అప్పుతీసుకుంది. అవి ఇవ్వలేదు. చెప్పా పెట్టకుండా పని మానేసి కొన్ని ఏళ్ళు అయింది. మళ్ళీ ఈ మధ్యే వచ్చి చేరింది. ఇన్నేళ్లు ఎక్కడున్నావ్ అంటే ఎక్కడ వుంటాను కాకినాడలో వుండాను. మతిచెడి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే మావాళ్లు తీసుకుపోయి ఇంటో పెట్టుకున్నారు అని చెప్పింది. తమ్ముడు లేనప్పుడు మరదలు పోట్లాట బెట్టుకుని ఇంట్లో నుండి వెళ్ళగొడితే రాత్రంతా రైల్వే స్టేషన్లో పడుకుని తెల్లారి బండికి వచ్చానని చెపుతుంది కానీ వివరంగా చెప్పదు. మళ్ళీ ఇంకోసారి ఆశ్రయమిచ్చి ఆదుకున్నావ్ అంటుంది. నారాయణమ్మ మిగతా కథ చెప్పే రోజు కోసం ఎదురు చూడటమే అడిగితే అసలు చెప్పదు. ఏదోలే నాకు తోచిన పిచ్చి పనులు చేశా ..అయేమన్నా ఘనకార్యాలా చెప్పుకోడానికి అని దీర్ఘం తీసి తప్పించుకుంటుంది.


మర్నాడు ఉదయాన్నే నారాయణమ్మ పనికి వచ్చింది కానీ ఎప్పటిలా హుషారుగా లేదు. ముఖం దిగులుగా వుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పని చేసుకుని వెళ్ళిపోయింది. ఏం జరిగిందో, పాపం రాత్రంతా గతం గుర్తుతెచ్చుకుని బాధపడిందేమో అందుకే ముఖం అలా వుంది అనుకున్నాను. మధ్యాహ్నం వచ్చి అమ్మగారూ నాక్కూడా కాసిని బియ్యం కడిగిపెట్టు. ఇంటికెళ్లి వొండుకుతినే ఓపికలేదు అంది.


"ఏమైంది జ్వరంగాని వచ్చిందా ? టాబ్లెట్ వేసుకుంటావా?"


నేనడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరేదో చెప్పుకొచ్చింది. వింటూ ఉన్నా. "ప్రతి మగోడికి ఆడదాన్ని తనే రక్షిస్తున్నాడని వొలపరం.కండకావరం ఆడు అట్టా అనుకోకపోతే బతకలేడమ్మా "అంది.


ఏదో పెద్ద విషయమే చెప్పబోతుందనిపించి చిన్నగా నవ్వి కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చున్నా.


"ఆడ మనిషి ఏరుగా వుండి బతుకుతుంటే చూడలేక ఉక్రోషం యెల్ల గక్కుతారు దొంగనాయాళ్ళు. ' ఒరేయ్ పోరా, నువ్వుగాని లేకుంటే నాకు బతకడం తెలియకుండానే మట్టి గొట్టుకు పోతానా యేంటి అని సవాల్ యిసిరి బతుకుతుండా' అని చెప్పేసి వచ్చా అంది.


వింటూనే వున్నాను."తాడి చెట్టు లోతున ఈది గవ్వ పెంకు యేరుకుని పొడి చేసి బతికినదాన్ని భూమ్మీద పనిచేసుకుని బతకలేనా యేంటీ ? "


“కష్టపడి బాగానే బతుకుతున్నావ్. సంవత్సరానికి లక్ష రూపాయలు కూడబెట్టి తమ్ముళ్ళకి ఇస్తున్నావ్ కానీ, ఎందుకీ ఘోష శోష ? పాతవన్నీ తవ్వుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళుపోవడం దిగులుతో కృంగిపోవడం తప్ప. చిలకలా నవ్వుకుంటూ యెప్పటిలా హాయిగా వుండు" అన్నా.


"హాయిగానే వుండానని ఓర్వలేక కుళ్ళు పోతన్నారమ్మా. రాత్రి నా కూతురు ఫోన్ చేసి ఇంత చిన్న పిల్లగా వున్నప్పుడు వొదిలేసి పోయావ్. మా నాయనమ్మ సాకింది కాబట్టి మా అన్న నేను బతికి బట్టకట్టాము. లేకపోతే ఏమైపోదుమో. ఏ రోజన్నా రూపాయి పెట్టావా నాకు. అంతా మీ తమ్ముళ్ళకి దొబ్బబెట్టి మమ్మల్ని సంక నాకిచ్చావ్" అని తిట్టి తిట్టి పోసింది. మళ్ళీ అంతలోనే "అయినా నీ పాపిష్టి సంపాదన నాకెందుకులే. నీ పాపం కొట్టే మా అన్న అట్టా ఉరేసుకుని చచ్చిపోయాడు, తిరిగిన తిరుగుళ్ళు చాల్లే కానీ ఇంటికొస్తే మా నాన్న ఇప్పటికైనా నిన్నేలుకుంటాడు" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.ఎంత మాటనేసింది అది. ఎవరో గుండెని పిడికిటి బట్టి నొక్కినట్టు విలవిలా లాడిపోయాననుకో. దానికి కట్నం యిచ్చి పెళ్లి చేసింది నేను కాదు. వస్తువులు పెట్టింది ఇంటోకి కావాల్సిన సామాను అన్నీ తీసిచ్చింది నేనుకాదూ. అన్నీ నేను సంపాయిచ్చిన డబ్బులతో ముడ్డి దగ్గర్నుండి నోటిదాకా చేయించుకుని పెళ్లికి కూడా నన్ను రావొద్దని నువ్వొస్తే లేచిపోయినదాని కూతురునని చెప్పుకుంటారని ముదురుమాటలు మాట్టాడిన అదేమీ తక్కువది కాదు. నాలుగేళ్లపాటు చెమట చిందించి సంపాదించిన సొమ్మంతా దానికే పెట్టాను. విశ్వాసం లేనిది అది. ఎంత మాటనేసింది అమ్మా". అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.


నారాయణమ్మ కష్టం చెప్పడం మొదలెట్టిందంటే సముద్రపు హోరే. ఏ అడ్డుకట్ట వేసినా ఆగదని నాకు తెలుసు కాబట్టి మాట్లాడకుండా వింటూనే వున్నాను.


"నా కొడుకు మంచాడు. నా దగ్గర పైసా డబ్బులు ఆశించకపోయినా అమ్మా అమ్మా అని చుట్టుకు తిరిగాడు. ఎంత వద్దని చెప్పినా ఇనకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్ళాంతో గొడవలు పడటమే సరిపోయే. పెళ్ళాం నీళ్ళోసుకుందని సంతోషంగా చెప్పాడు. ఇక గొడవలు పడనులేమ్మా. కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకుని బాగా చూసుకుంటాను అని రాత్రి చెప్పినాడు తెల్లారేపాటికి వురికి వేలాడాడు. మా అత్తముండ మాటలే దానికి కారణం. మీ ఆవిడ పుట్టింటికిపోయి మూడు నెలలు అయితే కడుపెట్టా వచ్చిందిరా అందంట. మనసు ఇరిసేసుకుని వురి యేసుకున్నాడు. ఆ పిల్లయినా అలిగి ఇక్కడి నుండి పోయేటప్పటికే నెలసరి నిలిచిపోయిందని చెప్పొద్దా. కూతురు మాటలు కొడుకు చావు ఇన్ని తట్టుకుని మొండిగా బతకపోతే ఏమైంది.. రోడ్డు మధ్యలో నిలబడితే ఒక్క క్షణంలో చచ్చిపోయే. నా కూతురికి రెండు లచ్చలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిపడతాయి" అంది వేదనగా.


చెప్పలేని జాలి ముంచుకొచ్చింది నారాయణమ్మ మీద ."అలాంటి పిచ్చి పనులు,ఆలోచనలు చేయకు. ఒక ముద్ద తిని ఇక్కడే పడుకో ..ఇవాళ ఇంటికి వెళ్లొద్దు" అన్నా.


"ఈ మాత్రం వాటికే చచ్చిపోతే ఎట్టాగమ్మా! ఎక్కడ ఓడిపోయినా జీయితం ముందు ఓడిపోకూడదమ్మా జీయితం గెలవాలి "అంది దృఢంగా అన్నం తిని కాసేపు టీవీ చూసి ఆ మాట ఈ మాట చెపుతూ కాస్త మామూలు మనిషైపోయింది. సాయంత్రమయ్యాక "పనికెళ్ళి ఇంటికిపోయి ఒంటికి కాసిని నీళ్లోసుకుని మళ్ళీ ఇక్కడికే వస్తా" అంది.


"సరే మరి, నీక్కూడా వండేస్తా ఇక్కడే తిను" అని చెప్పి నేనూ పనిమీద బయటపడ్డాను.


రాత్రి అన్నం తిన్నాక నన్ను మెచ్చుకోవడంతో మాటలు మొదలెట్టింది


చెపితేనే వింటావు. మారు ప్రశ్న కూడా వేయవు. ఏళ్ళ తరబడి చూత్తన్నా. నీ కథ ఏంటని అడిగావా ఒక్కసారైనా. ఈ మాట నేను ఎంత మందికి చెప్పి ఉంటానో. ఆమె ఎవరి గురించి పట్టించుకోదు. ఆమె వుద్యోగం ఏమిటో ఆమె ఏమిటో. అంతే తప్ప ఎవరి గురించి ఒక్క మాట మాట్టాడదు. అవసరమైతే సాయం చేసుడు తప్ప. అంది.


"చెప్పాలనుకుంటే నువ్వే చెపుతావు కదా ! ఎదుటిమనిషిని బాధ పెట్టేటట్లు కూపీలు లాగడం గూఢచారి పనిచేయడం నావల్ల కాదులే!"


ఒక కాగితం నా చేతికిచ్చి "ఈ నెంబర్ కి ఫోన్ చేసి పని చేస్తందో లేదో చూడమ్మా. వాళ్ళు ఎత్తితే ఎదో నెంబర్ తప్పు కొట్టానని చెప్పి పెట్టెయ్" అంది.


"ఎవరి నెంబరు ఇది" అనంటే "ఎవరిదో కాదులే, మా పెద్ద తమ్ముడి నెంబర్ అది" అంది. ఆ నెంబర్ కి కాల్చే స్తే రెండో రింగ్ కి లిఫ్ట్ చేసి మాట్లాడితే రాంగ్ నెంబర్ అని కట్ చేసుకుని.. "మీ తమ్ముడు మాట్లాడాడు కదా" అన్నాను.


"నా నెంబర్ రాకుండా చేసేసినాడు దొంగ నా కొడుకు. ఎన్ని డబ్బులు ఇచ్చానో. బోట్ కొనుక్కోమని. వడ్డీతో సహా ఇచ్చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇప్పుడు పెళ్ళాం చాటు మొగుడు అయిపోయాడు. మా నాయన చచ్చిపోయినప్పుడు దినానికి డబ్బులిచ్చాను. మా మరిది చచ్చిపోతే శవం ఎత్తేయడానికి లేకపోతే డబ్బులిచ్చాను. రేషన్ బియ్యం తప్ప ఒక్క వెచ్చాము కొనింది లేదు. ఆ అమ్మ పెట్టిన సద్దికూడు ఇంకో అమ్మ పెట్టిన కూర తిని సొమ్మంతా కూడబెట్టి ఈళ్ళకి యిచ్చాను చూడు. నన్ను చెప్పుదీసుకుని నేనే కొట్టుకోవాలి" అంది.


"ఎందుకలా ఇస్తావ్. బ్యాంకులో వేసుకుంటావ్ కదా ! అలాగే వేసుకో. ఇకమీదట యెవరిని నమ్మబాకు."


"గట్టిగా ఉండాలనుకుంటాను కానీ అయినవాళ్లు కష్టాలలో వుండారనుకుంటే కరిగిపోతాను" అంది. "పడుకోమ్మా ఇక, ఎంత చెప్పినా నా బాధ తీరేది కాదు. మళ్ళీ మీకు చెప్పి మీ మనసు బాధపెట్టడం "అంటూ ఆ రోజుకి మాటలు ముగించేసింది.


మిగతా కథ యెప్పుడు చెపుతుందా అని నేను గుంభనంగా ఎదురుచూస్తూ వున్నాను.


ఒకరోజు మ్యాట్నీ సినిమా చూసి ఇంటికి వెళ్ళకుండా నేరుగా మా ఇంటికి వచ్చేసింది. చాలా హుషారుగా చూసిన సినిమాలో పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా "ఇయ్యాల అతని గురించి చెప్పేయాలి నీకు. ముందు కాసిని టీ పెట్టి ఇవ్వు "అంది.


"టీ లంచం ఇస్తేనే గాని చెప్పవా యేమిటి" అని హాస్యమాడాను.


"నేను చెప్పిన కథ యిన్నావనుకో కథ రాసేయగలవు "అంది. నేను నవ్వుకుని అల్లం దాల్చిన చెక్క యాలకులపొడి వేసి మంచి టీ చేసి యిచ్చాను. త్రాగుతూ చెప్పుకుపోతుంది.


"ఆయాల తీరాన ఎదురెదురు వెళ్ళి అతన్ని నిలబెట్టేసి అలా అడిగానా ? అతను ఆశ్చర్యంగా చూసి ఎందుకు తీసుకుపోవాలి నిన్ను" అని అడిగాడు. "నాకు చిన్నప్పుడు నుండి నువ్వంటే నాకిష్టం" అని చెప్పా. నిజంగానే నాకు చానా యిష్టం అతనంటే. నొక్కులఁ జుట్టు,గడ్డం నొక్కు నవ్వుతున్న కళ్ళతో ఇంగిలాయి ముల్లుతో గుచ్చినట్టు చూపులతో మనసుని గుచ్చి చంపుతూ భలే అందంగా వుంటాడనుకో.తర్వాత ఏమన్నాడో ఇనుకో సరే .. రాత్రికి చెపుతాలే ఏ సంగంతి. నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు.


నా ముఖంలో ఆసక్తి కనబడకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అరమారలో సామాను తీసి తుడిచే పని పెట్టుకున్నాను


"ఆ రోజు వూరికెళ్ళిన అత్తా మొగుడు రాకూడని వేయి దేవుళ్ళకి మొక్కుకున్నా. పదకొండు గంటలకి వచ్చి తలుపు తట్టాడు. పిల్లలను వొదిలేసి అతని వెంట నడిచా. పుంతలోకి నడుచుకుంటూ వెళ్లాం.ఆ రోజు పొర్ణమి. నల్లవావిలి పూత పొలపం చుట్టుకుంటునట్టే అతను నన్ను చుట్టేశాడు. ఆనాడు అతనితో వుందే నా జీయితం. వాడు తప్ప నా మనసుకి దగ్గరగా వచ్చినోడే లేడు. అట్టా అప్పుడప్పుడు కలుసుకుంటా వుండేవారిమీ. ఒకటి రెండుసార్లు మా ఊరివాళ్ల కళ్ళల్లో పడ్డాం కూడా. మొగుడితో ఇరగ గొట్టించుకోవడం సంగతి మామూలైపోయింది.


ఓసి నీ దైర్యం కూలా .. అందుకే అన్నారు కాబోలు ఇష్టపడిన మగాడి కోసం ఆడది అర్ధరాత్రి నదిని కూడా అవలీలగా దాటుతుంది అని" మనసులో అనుకున్నాను


చెప్పడం కొనసాగించింది "ఈ మొగుడు సంసారం నాకొద్దు నన్ను దూరంగా తీసుకో అని అడగడం మొదలెట్టా. అట్టాగే అన్నాడతను. ఇద్దరం వూళ్ళో కనబడకపోతే నా మీదే అనుమానం వస్తది. ముందు నువ్వు విశాఖపట్నం పో. అక్కడ స్టేషన్కి వచ్చి నా స్నేహితుడు నిన్ను తీసుకుని పోతాడు. అక్కడే ఇల్లు కూడా చూసి పెడతాడు, నేను కొన్నాలు పోయాక ఉద్యోగం కోసం పోతున్నా అని చెప్పి నీ దగ్గరికి వస్తా. బతకగల్గితే అక్కడే బతుకుదాం లేకుంటే వేరే చోటుకి పోదాం అన్నాడు. సరేనని ఇంటికి పోయి నాలుగు చీరలు సర్ది పెట్టుకున్నాను. అర్ధరాత్రి పూట మా ఊరి గుడి దగ్గరకు ఆటో వచ్చి ఆగింది. అదెక్కి కూర్చుంటే పొన్నూరు స్టేషన్ కాడ దించాడు. రైలెక్కి విశాఖపట్నంలో దిగి అతని స్నేహితుని కోసం ఎదురు చూసా. అతను నన్ను గుర్తుపట్టడం ఎట్టా అనే సంగతి మర్చిపోయా. అతనేమో వెతుక్కుని వెతుక్కుని ఇంటికి ఎల్లిపోయాడంట. అని అక్కడికి ఆపి కాసిని నీళ్ళు తాగింది.


నాకు టెన్షన్ పెరిగిపోతుంది ..కథ చెప్పడం ఆపేస్తుందేమో అని.


పమిటచెంగుతో ముఖం తుడుచుకుని మళ్ళీ చెప్పడం మొదలెట్టింది "అడ్రెస్స్ కాగితం చూపిచ్చి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటా పోతన్నా. రోడ్డు దాటుతుంటే ఓ మోటార్ సైకిల్ వాడు గుద్దేసి పొతే చెయ్యి ఇరిగిపోయింది. అతని స్నేహితుడు వాళ్ళమ్మ హాస్పిటల్ కి తీసుకుపోయి కట్టుకట్టించి నెలరోజులు బాగా చూసారు. ఆఖరికి ఒక రోజు బాధపడుతూ చెప్పలేక చెప్పలేక చెప్పారు. నేను ఇల్లు విడిచిపెట్టి వొచ్చేసాక మా వాళ్ళందరూ వెళ్లి అతనింటి మీద పడ్డారంట. అతను నాకు తెలియదు అని చెప్పినా వినలేదంట. వొదిలిపెట్టలేదు అంట. చేనుకి యెల్లి చీకటి పడ్డాక ఇంటికి వొస్తుంటే మాటేసి నలుగురు ముసుగేసుకున్న మనుషులు మీదపడి కొట్టి చంపేశారంట. అట్టా నామూలంగా అతను నాశనం అయిపోయాడు. తల్చుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తాను. నేనెందుకు అట్టా తెగబడాలి? అప్పుడే యే గన్నేరు పప్పు తింటేనో నా బాధలు ఇరగడయ్యిపోయేయిగా. ఏమి యెరగని అతన్ని నాశనం చేసేసినాను అని కుమిలి కుమిలి యేడుస్తాను. నావాళ్లు అంటూ యెవరూ లేకుండా ఐదారేళ్ళు గట్టిగానే ఉండాను. మానాయనను చూడాలనిపోయి నా ఆచూకీ చెప్పి తిప్పలు తెచ్చుకున్నా. కష్టపడి నాలుగిళ్ళల్లో పనిచేసుకుని సంపాదించుకోవడమే తప్ప ఏ మొగ పురుగుని దగ్గరికి రానీయలేదు" అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ భారంగా.


"నువ్వు చెప్పిందంతా ప్రేమంటావా?" ఎంత వద్దనుకున్నా నామాటల్లో కఠినం.


"ప్రేమో కామమో ఆయన్నీనాకు తెలియదు. ప్రేమంటే ఈడుకి సంబంధం లేదు. ఈడు జారిపోయాక ఆ ప్రేమ కూడా వానకి తడిసిన ఆకు మీద మురికిలా కారిపోతుందంటే నేను వొప్పుకోను. చిన్నప్పుడు నుండి అతను నా మనసులో వుండాడు. నా మనసుదాకా వొచ్చినాడు నా వొళ్ళంతా కమ్ముకున్నఅతనొక్కడే, అదంతా కాదుకానీ బాగా అర్ధమయ్యేలాగా చెపుతా ఇనుకో, నా కాలి చిటికెనేలు గోరు నుండి నా తల్లో వెంట్రుక చివరిదాకా నిండి వున్నోడు నేను చచ్చేదాకా నాతో వుండేవాడు అతను ఒక్కడే. పెపంచమంతా వందనుకోనీ వెయ్యి రాళ్ళేయనీ.. అతనే నా దృష్టిలో మగోడు. అతనే నా మొగుడు" అంది.


నారాయణమ్మ వైపు అయోమయంగా చూసాను.ఒకచోట దొరకనిది ఇంకొకచోట దొరుకుతుందని భ్రాంతి పడటం కూడా కాదిది. కేవలం మోహపడి బిడ్డలను ఇంటిని వొదిలేసి వచ్చేసింది. తెగింపు వున్న స్త్రీ ఏదోవొకనాడు భర్త అనుమానాన్ని నిజం చేసి తీరుతుంది అన్నట్టుగా నడుచుకొంది. ఇలాంటి స్త్రీలను లోకమే కాదు నేను కూడా హర్షించలేనేమో! అయిష్టాన్నిఆమెపై ఏర్పడిన వ్యతిరేకతను ముఖంపై కనబడనీయకుండా "అతని పేరు ఏమిటి" అనడిగితే "చెప్పను" అంది. "అతనెప్పుడు నా ఎద ఊయల పై ఊగుతూనే ఉంటాడు. మనసు నెమ్మదిగా వున్నప్పుడు నీట చిత్తరువులా కనబడతానే ఉంటాడు" అంది మైమరుపుగా. ఆ క్షణంలో నారాయణమ్మ గొప్ప జ్ఞాన వంతురాలిలా మట్లాడి నన్ను అమితంగా ఆశ్చర్య పరిచింది


నీ ప్రేమ పిచ్చి పాడుగాను గొప్ప సాహసం చేసేవు అని మనసులో అనుకుని "మొత్తానికి మంచి కథ చెప్పేవ్" అన్నాను.


"జీయితంలో వున్న కథలు సినిమాల్లో కానీ కథల పుస్తకాల్లో కానీ వుంటాయేంటి? ఇక నేను ఇంటికి పోతాను. మనస్సుకి తృప్తిగా వుంది ఈ రోజు" అంటూ తేట ముఖంతో చెప్పలేని బరువునేదో నామీద వదిలేసి వెళ్ళిపోయింది. అనవసరంగా అతను అన్యాయం అయిపోయాడే అని ఉసూరుమని నిట్టూర్చాను.


కొన్నాళ్ళ తర్వాత కొలీగ్స్ తో కలిసి పోలవరం డామ్ నిర్మాణం చూడటానికి వెళ్ళాను. అక్కడ నారాయణమ్మని తీసుకొచ్చి పనికి కుదిర్చిన అప్పటి ఎదురింటి ఆమె కనబడింది.వాళ్ళు చాలా యేళ్ళ క్రితమే విజయవాడకి మారిపోయారు. కుశల ప్రశ్నలు అయ్యాక నారాయణమ్మ పని చేస్తుందా ఇంకా అని అడిగింది. మధ్య మధ్యన మానేస్తూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది. బాగుందా అంటే బాగానే వుంది అని చెప్పవచ్చు. మొన్నే తన కథ చెప్పింది. పాపం .. అతను మీ అబ్బాయి స్నేహితుడు అంటగా అని అడిగా.


"అవునండీ. పాపం అంటున్నారు.అతను చచ్చిపోయాడని చెప్పిందా యేంటీ? అతనికి యేమీ అవలేదండీ. అతన్ని కొట్టడమైతే కొట్టారు కానీ సమయానికి ఎవరో చూసి హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు.అతనే చెప్పాడు అప్పుడలా చెప్పమని. గొప్పింటి పిల్లాడు. అందర్నీ వొదులుకుని యీమెకోసం వస్తాడా యేంటీ? తర్వాత నారాయణమ్మకి తెలిసి వుంటుంది లెండి . వాళ్ళ వాళ్ళెవరూ చెప్పకుండా వుంటారా ? "అంది.


"అతనిప్పుడెక్కడ వున్నాడు" బ్రతికే వున్నాడన్న వార్త విన్న సంతోషంలో ఆతృతగా అడిగేసాను.


"విదేశంలో వున్నాడు. చక్కని భార్య,పిల్లలిద్దరు, మంచి వుద్యోగం". నేను నిర్ఘాంతపోయాను.


తిరిగి వస్తూ దారంతా నారాయణమ్మ ఎందుకలా చెప్పిందా అని ఆలోచిస్తూనే వున్నాను. నిజంగానే అతను బ్రతికి వున్నాడని తెలియకుండా ఉండటానికి అవకాశం తక్కువ. అతనికి నారాయణమ్మ పట్ల వుంది కేవలం జాలి లేదా ప్రేమ లేకపోతే అందొచ్చిన అవకాశమా? దొంగాట ఆడాడేమో! అసలు నారాయణమ్మ ఆ ఒక్క విషయం గురించి నిజమే చెప్పిందా? అసలు నేనెందుకు యిలా ఆలోచించాలి ? నేనూ నమూనా యేనా ? తల పగిలిపోయే ప్రశ్నలు. నారాయణమ్మ ఏం చెప్పింది.అతనొక నీట చిత్తరువు అనే కదా చెప్పింది. అదే నిజం. నీళ్లు కదిలితే కరిగిపోయే చిత్రం. ఎంత బాగా చెప్పింది దొంగ మొహంది అని మురిపెంగా తిట్టుకున్నా.


ఆఖరికి ఒకటనిపించింది కొందరికి అనుభవించడం కన్నా వూహించుకోవడంలో ఎక్కువ ఆనందం అని. అనుభవంలోకి రానిదాన్ని నిర్ధాక్షిణ్యంగా చంపడానికి కూడా వెనుకాడరని. అలా అనుకున్నాక మనసుకి తృప్తి కల్గింది. రాజమండ్రిలో టీ త్రాగడానికి బస్ ఆపినప్పుడు అక్కడొక పిల్లాడు అమ్ముతున్న పుస్తకాలలో పొడుపు కథల పుస్తకం కనబడగానే వెంటనే కొనుక్కున్నాను. ఇష్టపడి కష్టం అనుకోకుండా జీవితం గెల్చిన నారాయణమ్మ ముందు ఈసారి పొడుపు కథ విప్పలేక ఓడిపోకూడదని.