కొన్ని సాయంకాలాల్లో..
పిల్లలు దుమ్ము ధూళి అనే అభ్యంతరాలేవీ లేకుండా పిడికిళ్ళతో మట్టిని విసురుకుంటూ కోతి కొమ్మచ్చి లాడుకుంటూ అలసి వొక్కక్కరే విడివిడిగా అస్తమయానికి ముందర వెలిగే జేగురురంగు సూర్యుడిని తలపిస్తారు
వానలో తడుస్తూ వొప్పుల కుప్పలాటలాడుకుంటూ రంగు రంగుల కాగితపు పడవలు వదులుతూ వాటినే తోసే పూల తెడ్డులాగా పక్కనే పరుగులు పెడుతూ వుంటారు
వాన వెలిసినాక యేర్పడిన బురద గుంటలో కప్పల్లా ఎగిరెగిరి దూకుతూ చిందులేస్తూ ముఖాలకు బురదను పూసుకుంటూ తుడుచుకుంటూ చూస్తున్న వాళ్ళ ముఖాలను వెలిగిస్తూ వుంటారు
కిటికీలో నుంచి అవన్నీ చూస్తుండే నేను కళ్ళతో కోలాటమాడ చేతకాక మనసుతో కాసేపు వాళ్ళతో జేరి ఆడుకొని వస్తూ.. వానకు తడిసిన చంద్రకాంతతో పోటీ పడి వెలిగిపోతాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి