11, మార్చి 2023, శనివారం

దృశ్య భూతం

దృశ్య భూతం _వనజ తాతినేని


ఉయ్యాల బల్లపై కూర్చుని  మొబైల్ ఫోన్ తో తీసిన చిత్రాలను చూసుకుంటూ.. ఆహా ఏమి రంగులు ఎంత సౌందర్యం. మంచు తెరలు మధ్య విలాసంగా తలలూపే విరిసి విరియని తులిప్స్ రంగు రంగులలో విరిసిన క్రోకస్ లు డెఫోడిల్స్ తో బేక్ యార్డ్ కళ కళ లాడిపోతుంది. ఈ పూల రంగులను చూస్తూ ఆకలి దప్పికలు  మరచిపోవచ్చు… అని నేను సౌందర్య లాలసలో మునిగిపోతున్న వేళ.. డోర్ తెరుచుకుని నాయనమ్మ నాయనమ్మ అంటూ నా దగ్గరకు వచ్చింది మనుమరాలు. రావడం రావడంతోటే  నా చేతిలో వున్న ఫోన్ ని అధికారంగా లాక్కుని యూ ట్యూబ్ ఓపెన్ చేసి బొటనవేలితో వేగంగా స్క్రోల్ చేస్తుంది. వెంటనే నేను లోపలికి వెళ్ళి బొమ్మల పుస్తకం తీసుకువచ్చి.. ఉయ్యాల బల్లపై కూర్చుని పేజీ తెరిచి అనగనగా..అనగనగా అనగానే ఫోన్ నా పక్కన పడేసి ఒళ్ళో కెక్కి కూర్చుంది. నేను నవ్వుకుని ఫోన్ దాచేసి పుస్తకం మనుమరాలి చేతికిచ్చి ఆలోచనలో పడ్డాను. ఈ తరం పిల్లలు పుస్తకాలు చదువుతారా.. !? నేనే చదవడం లేదు.


ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఓటిటి లు జీవితంలో ఒక భాగంగా మారాక వాటికి దూరంగా బతకడం చాలా కష్టమనిపిస్తుంది.  ఇటీవలకాలంలో అప్పుడప్పుడు వాటిని రహస్యంగా చూడాల్సివస్తుంది.  దీనినే చిత్తచాపల్యం అంటారు కాబోలు అనుకుంటూ పెద్దగా నవ్వుకున్నాను. వీటన్నింటికి కారణం నా మనమరాలు.


 మనుమరాలు కోవిడ్ ప్రారంభంలో పుట్టింది. ఆ కోవిడ్ పుణ్యమా అని  తనకు రెండేళ్ళు నిండుతున్నా ఇరుగుపొరుగు సంబంధమే లేకపోయింది. ప్రతి యిల్లు తాళాలు లేని జైలు వార్డును తలపిస్తుంది. ఇక పాపకు స్నేహితులెవరిని పరిచయం చేయాలి. పెద్దవారి ముద్దు మురిపాలు వెగటు కొట్టి తెరపై కదిలే బొమ్మలను చూస్తూ మైమరచిపోతుంది. మూడు పూటలా ఆమ్ తినేటప్పుడు మొదలైన రైమ్స్ పర్వం నిద్రపోయాక కానీ తెరిపివ్వడం లేదు. చిన్ను పప్పు జె జె రైనీ బింగో డోరా వీరంతా పాపకు స్నేహితులై పోయాక ఇంటిల్లిపాదికి స్నేహితులవక తప్పలేదు. ప్రపంచ సమాచారం కోసం ఛానల్ మార్చామా గే బీ..కేకల పర్వమే!


 అయితే  రెండేళ్ళు కూడా నిండని పసిపాప చాలా చురుకైనది. సంవత్సరంన్నర వచ్చేసరికే అమ్మ ఫోన్ నాన్న ఫోన్ లతోపాటు ఇంట్లో వున్న అందరి మొబైల్ ఫోన్ లను చేతిలోకి తీసుకొంటుంది. ఇవ్వకపోతే ఏడ్చి రాగాలు తీసి పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తుదకు ఫోన్ చేజిక్కించుకుని విజయదరహాసం ఒలికిస్తూ టకటకామని పాస్ వర్డ్ ని నొక్కి ఫోన్ ఓపెన్ చేయడం యూ ట్యూబ్ ఆప్ ని  తెరిచి తనకిష్టమైన రైమ్స్ ని సెలెక్ట్ చేసుకుని చూస్తూ ఆనందించడం. అవి నచ్చకపోతే ఫోటో గేలరీ లోకి వెళ్ళి ఫోటోలు చూసుకోవడం అనేది కరతలామలకం  అయిపోయింది. మొదటసారి అలా చేయడాన్ని ఇంట్లో అందరితో పాటు నేనూ చూసి ఒకింత ఆశ్చర్యచకితరాల్ని అయిపోయాను. ఈ తరం పిల్లలు పుట్టుకతోనే టెక్నాలజీ నేర్చుకుని దానికి బానిసలై పోతున్నారనిపించింది. 


ఇలా ఏమాత్రం మంచిది కాదని అందరం కలసి మాట్లాడుకుని మొబైల్ ఫోన్స్ పాస్వర్డ్ మార్చేసి టివి పెట్టడం తగ్గించేసాం. నేనైతే పసిదాన్ని చలి మంచు వాన లేని సమయాలు చూసుకుని ఆరుబయలు ను పరిచయం చేస్తూ తన విభ్రమఆశ్చర్య ఆనందాలను చూస్తూ మురిసి పోతున్నాను.అలా బయట తిప్పినంతసేపూ తిప్పి లోపలికి రాగానే టివి రిమోట్ కోసం వెతుక్కొంటుంది పాప. నాయనమ్మ టివి టివి అంటూ కాళ్ళకు చుట్టుకుంటుంది.ఏదో మాయ మాటలు చెప్పి దృష్టి మరల్చి బొమ్మల ముందు కూర్చోబెట్టడానికి దశాబ్దాల అనుభవం సరిపోవటంలేదు కదే కుంకా అని మురిపెంగా హత్తుకోవడం.. చంకనేసుకుని గోరు ముద్దలు తినిపించడం   రైమ్స్ నే కథలుగా మార్చి  చెబుతూ నిద్ర పుచ్చడంలో బాగానే  ఆరితేరాననుకుంటున్నాను కానీ.. లోలోపల ఓ భూతం గురించి భయంగానే వుంది. దాని పేరు గాడ్జెట్స్ భూతం.నా మనుమరాలనే కాదు ఏ ఇంట్లో పిల్లలను చూసినా నా మనుమరాలి లాగే వున్నారని వారి వారి ఇళ్ళల్లో పెద్దవాళ్ళు చెపుతుంటే ఆ భయం కొండలా పెరిగిపోతుంది కొండచిలువలా చుట్టేస్తుంది. ఆ భూతం ప్రతి ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో వున్న మూడొంతుల మందిని  పట్టి పీడిస్తుంది. సోమరిపోతుల్లా మారిపోయి రోగగ్రస్త శరీరాలతో అతి తెలివితో వికృత ఆలోచనలతో పిచ్చి గంతులతో వెర్రిపుట్టిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఏవేవో భయాలు మనసును నిలకడగా వుండనీయడంలేదు. ప్రక్కనే పడుకుని అమాయకంగా నిద్రిస్తున్న మనుమరాలి ముఖంలోకి చూస్తూ వుంటే అంతే అమాయకత్వం నిండిన అరుణ్ గుర్తుకు వచ్చాడు. 


ఎందుకో ఈ మధ్య పదే పదే ఆ పిల్లవాడే గుర్తుకొస్తున్నాడు అనుకుంటూ నాలుగు నెలల గతంలోకి వెళ్ళాను.  


*********

కొన్ని నెలల క్రితం ఇండియాలో అమ్మాయింట్లో వున్నప్పుడు ఒక ఐదారేళ్ళ పిల్లవాడి తండ్రి ఆదివారం పూట అమ్మాయితో మాట్లాడానికి వచ్చేవాడు. అది చూసి నాకు  చిరాకు వచ్చి..


“హాస్పిటల్ లో విన్నది చాల్లేదా ఇంటికి కూడా రావడానికి పర్మిషన్ ఇస్తున్నావ్,  అతను మరీ నిద్రమంచాలు దిగి కాఫీ కూడా తాగకముందే గుమ్మం ముందు ప్రత్యక్షం అవుతున్నాడు”అని విసుక్కుంటే.. “ఆ బాబు ది ఓ ప్రత్యేకమైన కేసు లే అమ్మా! ఆ తల్లి తండ్రి బాధ చూడలేక నేనే ఇంటికి రండి మాట్లాడదాం అని చెప్పాను. విసుక్కోకుండా నాకూ అతనికి కూడా కాఫీ తీసుకుని రా”.. అని చెప్పి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళింది కరుణ. 


తన భర్త కూతురికి కరుణ అన్న పేరు ఎందుకు పెట్టారో కానీ పేరుకు తగ్గట్టు మానవ సహజమైన జాలి సానుభూతి ప్రేమ స్థాయిని దాటి అందరి యెడల  కరుణ ను మాత్రమే కురిపిస్తూవుంటుంది. తన మనస్తత్వానికి తగినట్లు పీడియాట్రిక్స్  చేసింది.  కొన్నేళ్ళుగా కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తుంది. 


ఫిల్టర్ లో డికాషన్ కి వేసి పాలు గిన్నెలో పోస్తూ యదాలాపంగా హాల్లో కూర్చునివున్న వారిరువురి సంభాషణ వింటున్నాను.


“కూర్చోండి. బాబు ఎలా వున్నాడు? ఇక్కడికి తీసుకురావాల్సింది. మా పిల్లలతో కలసి ఆడుకునేవాడు”


“ తీసుకురావాలనే అనుకున్నాను. కానీ మీరేమి అనుకుంటారోనని ఆగిపోయాను మేడమ్”


“పర్వాలేదు తీసుకురండి, పిల్లలతో కలిస్తే ఆ జఢత్వం మొండితనం అన్నీ పోతాయి. మందులు వేయకూడదు.అసలు మందులేవీ అవసరంలేని ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీ భార్యాభర్తలిరువురు ఓపికగా మరింత ప్రేమగా అవసరమైనపుడు కాస్త కఠినంగా వుంటే చాలు. మీ అబ్బాయి అందరి పిల్లలు లాగానే వుంటాడు.”


“మీరు ఇలా చెబుతుంటే చాలా ధైర్యంగా వుంటుందండీ.. కానీ ఇంట్లో కళ్ళెదురుగా బాబును చూస్తుంటే దిగులు ముంచుకొస్తుంది. నిన్న సాయంత్రం నేను బజారుకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చుని టివి చూస్తున్నాడండీ. నా భార్య వంటింట్లో పని చేసుకుంటుంది. నేను వాడిని ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. అసలు బాహ్య సృహ కూడా లేదు. నోట్లో వేలు, పెదాల చివరినుండి ధారగా కారిపోతున్న సొంగ. కోపంతో గట్టిగా అరిచాను.ఉలికిపడి గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. సోఫా తడిపేసాడు. నా భార్య కంగారుగా హాల్లోకి వచ్చింది. వాడిని దగ్గరకు తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. అరగంటకు కానీ ఏడుపు ఆపలేదు. తర్వాత నేను దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నించినా నా దగ్గరకు రాలేదు. ఇంట్లో ఫోన్ లు లాప్ టాప్ లు వాడికి కనబడకుండా చేయాలంటే కష్టంగా వుంది. ఒక బెడ్ రూమ్ లో వాటిని వుంచి మరొక బెడ్ రూమ్ లోనూ.. హాల్లోనూ వాడిని తిప్పుతున్నాం. వంతులు వారిగా ఒకరు వర్క్ చేస్తుంటే మరొకరు వాడిని అటెండ్ అవుతూ పెంచుతున్నాం. తల ప్రాణం తోకకు వస్తుందంటే నమ్మండి.” వేదన వినబడుతుంది అతని స్వరంలో. 


“కొన్నాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరు జాబ్ మానేయండి. పిల్లవాడి కన్నా ఎక్కువ కాదు కదా జాబ్” అంది కరుణ. 


నేను కాఫీ తీసుకువెళ్ళి అతనికి కరుణ కి ఇచ్చి..” మా కరుణ కు హాస్పిటల్ కు వెళ్ళకపోతే వీలవదు కాబట్టి మా అల్లుడే జాబ్ మానేసి పిల్లలను పెంచుకున్నాడు.అలా ఒక ఏడు రెండేళ్ళు కూడా కాదు ఏకంగా ఎనిమిదేళ్ళపాటు. పిల్లలు మంచిగా ఆరోగ్యంగా పెరగాలంటే ఆ మాత్రం శ్రద్ధ తప్పదు. ఇదేమైనా వెనకటి కాలమా.. ఎలాగోలా పెరుగుతారు అనుకోవటానికి” అన్నాను నేను. ఈ విషయాలన్నీ మాట్లాడతావెందుకమ్మా అన్నట్లు వారింపుగా చూసింది కరుణ. 


“పెళ్ళయ్యేటప్పటికి ఇద్దరం బెంగుళూరులో సాప్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నామండీ, ఇంటి అద్దెలకు సంపాదనలో నాలుగవ వంతు ఖర్చు అవుతుందని ఆలోచించి రెండు జీతాలున్నాయి కదా అనే దైర్యంతో గేటెడ్ కమ్యూనిటీ లో విల్లా హౌస్ తీసుకున్నాం. ఒక సంవత్సరానికి తల్లితండ్రి అయ్యాం.ఇఎమ్ఐ లు కట్టాలంటే జాబ్ మానేయడం కుదరదు. మా అమ్మ నాన్నలకు పాడి వ్యవసాయం. వాళ్ళు పదిరోజులు కూడా మా దగ్గర వుండటానికి వీలుకాదు. ఇక మా అత్త గారు వచ్చి సాయంగా రెండేళ్ళు వున్నారన్న మాటే కానీ ఆమె వల్లనే బాబు ఇలా తయారయ్యాడు. ఆమెకు మోకాళ్ళ నొప్పి ఆయాసం వల్ల వాడిని సరిగ్గా పెంచలేక  వాడి వెంటబడి తిరగలేక మొబైల్ లోనూ ఐ పాడ్ ల లోనూ రైమ్స్ చూపిస్తూ వాటిని  బాగా అలవాటు చేసారు. మేము ఫోన్ లాక్కుంటే ఏడ్చి గీ పెట్టేవాడు. స్కూల్ కి వెళితే వాడే మానేస్తాడులే..అని నేను నా భార్య కూడా చూసి చూడనట్టు వుండిపోయే వారిమి. 

 ప్లే స్కూల్  కు వెళ్ళినా ఇంటికి రాగానే మొబైల్ ఫోన్ ఐ పాడ్ కావాలనే పేచీ పెడతాడు. ఇవ్వకపోతే అన్నం తినడూ పాలు తాగడూ.. ఇదొక నరకం అనుకోండి”


“మీ అబ్బాయి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యాడు.మీరు ఒకేసారి వాటిని దూరం చేయడానికి ప్రయత్నించకూడదు.నిదానంగా తగ్గించుకుంటూ రావాలి. ఉదయం సాయంత్రం రోజూ ఆడుకోవడానికి ఇక్కడికి తీసుకురండి. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే క్రమేపి అవన్నీ తగ్గుతాయి” అని లేచి నిలబడింది కరుణ. టైమ్ సెన్స్ తెలుసుకున్న అతనూ లేచి నిలబడి.. థాంక్స్ చెప్పి సెలవు తీసుకున్నాడు.


అతను వెళ్ళాక  కరుణతో అన్నాను. ప్రతి ఇంట్లోనూ ఇదే సమస్య. పసిపాప నుండి ముదుసలి వారి వరకూ.. తెరపై తలదూర్చడమే. ఏదో కాసేపు కూసేపో అయితే అనుకోవచ్చు..పొద్దు పొడిచింది మొదలు వేగు చుక్క కనబడే వరకూ ఆ హస్త భూషణం వదిలితే కదా! ఆరోగ్యాలు మానసిక ఆరోగ్యాలు పాడవుతుంది ఇందుకు కాదూ” అన్నాను. 


“మానవజాతే కంట్రోల్ తప్పిపోతుంది. ఉన్నంతలో పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా.టెక్నాలజీ పదునంచు కత్తి.అది ఎవరినైనా గాయపరుస్తుంది తప్పదు” అంటూ తన మొబైల్ లో ఏదో చూస్తున్న కూతురు గ్రీష్మను సున్నితంగా మందలించి ఆడుకోవడానికి క్రిందకు పంపింది కరుణ. 


మరొక ఆదివారం వచ్చేసరికి ప్రొద్దుటే మళ్ళీ అరుణ్ అనే పిల్లవాడి తండ్రి నుండి కాల్. ఈ రోజు బాబును తీసుకుని నేను నా భార్య కూడా రావాలనుకుంటున్నామండీ.. రావచ్చా.. అని రిక్వెస్ట్. 


ఫ్యామిలీ అంతా కలిసి అత్త గారింటికి బయలుదేరబోతున్న కరుణ వెళ్ళకుండా ఆగిపోయి భర్తను పిల్లలనూ పంపాలనుకుంది. సాయంత్రం రమ్మనకూడదూ,బయలుదేరి ఆగిపోవడం ఎందుకు అంటే.. అల్లుడు జోక్యం చేసుకుని “పర్వాలేదు లెండి. ఆ పిల్లవాడి పేరెంట్స్ వర్రీ గా వున్నారు. వాళ్ళను రానివ్వండి. ఆ పిల్లాడు కూడా మన పిల్లలతో కాసేపు ఆడుకుంటాడు” అని పిల్లలను తీసుకుని క్రిందకు వెళ్ళిపోయాడు.  అల్లుడు అర్థం చేసుకునే తత్వం కలవాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎన్ని గొడవలు వచ్చేవి భార్యాభర్తల మధ్య ఇగోల సమస్యలు వచ్చివుండేవి అనుకున్నాను స్వగతంలో. 


అరగంట తర్వాత ఆ పిల్లవాడు అరుణ్ అతని తల్లిదండ్రులు వచ్చారు. వారికి తాగడానికి నీళ్ళు యిస్తూ అరుణ్ ని చూసాను. ముద్దుగా పాలుకారే బుగ్గలు ఉంగరాల జుట్టుతో బెరుకు బెరుకుగా చూస్తూ తల్లిని కరిచి పెట్టుకుని వున్నాడు. కరుణ  గ్లౌస్ మాస్క్ ధరించి వచ్చి అరుణ్ ని చూస్తూ చాక్లెట్ ఇస్తాను రమ్మని పిలిచింది. తల్లిని మరింత హత్తుకుని పోయి ఆమె దుప్పటాలో ముఖం దాచుకున్నాడు.  కరుణ అరుణ్ తండ్రి వంక చూసి.. “మా పిల్లలు మిగతా ప్లాట్ లలో వున్న పిల్లలందరూ క్రింద ఆడుకుంటున్నారు. మీరు కూడా అరుణ్ ని తీసుకువెళ్ళి వారిని చూపించండి. పిల్లలతో కలుస్తాడేమో చూద్దాం” అని అంది.


అలాగే మేడమ్! అంటూ భార్య ముఖంలోకి చూసి ఏదో సంజ్ఞ చేసి అరుణ్ ని తీసుకుని క్రిందకు వెళ్ళాడతను. 


“మీరు అనవసర భయాలు పెట్టుకోకండి.. అన్నీ మెల్లగా సర్దుకుంటాయి” అంది అరుణ్ తల్లితో. ఆ మాత్రం అనునయానికే ఆ తల్లి కళ్ళు చెరువులయ్యాయి.


“అసలు మా బిడ్డను సరిగ్గా పెంచగలమా అని భయం వేస్తుంది డాక్టర్. అసలు నాకెలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. అస్తమానం  నోట్లో వేలు కాళ్ళ మధ్య చేయి పెట్టుకుంటాడు. మనం తీసేసినా మళ్ళీ వెంటనే అదే పని చేస్తాడు.ఆ అలవాటు మాన్పలేక పోతున్నాను” అంది నిసృహగా. 


“అదేమంత పెద్ద విషయం కాదు. పిల్లల్లో  లైంగిక ఆసక్తి పసితనం నుండే మొదలవుతుంది. మరికొన్ని అసంకల్పిత చర్యలు జీన్స్ నుండి సంక్రమిస్తాయి.మా అబ్బాయి చరణ్ కూడా ఆడవారిని చూడగానే చేయి రెండు కాళ్ళ మధ్య పెట్టుకుంటాడు.అది నాభర్త నుంచి వచ్చింది.  అతనికి అతని తండ్రి నుండి వచ్చిన అనువంశిక లక్షణం. మనమేమి చేయలేం. సభ్యత కాదని తెలిసినపుడు వాళ్ళంతట వాళ్ళే కంట్రోలు చేసుకుంటారు అని విపులీకరించి చెప్పింది కరుణ. 


“ఇదంతా.. మీ అమ్మ చేసింది.. నా బుజ్జి బంగారమే అంటూ.. వాడి బెల్లం పట్టుకుని ముద్దు చేసేది.అప్పుడే నేర్చుకున్నాడు వాడు అని షంట్ తున్నారు మా వారు.  రెండేళ్ళు మాతోనే వుంది అమ్మ. తర్వాత నాన్నకు అనారోగ్యంగా వుందని ఇక పిల్లాడ్ని ఎలాగోలా మీరే పెంచుకోండి అని  అమ్మ వెళ్ళిపోయింతర్వాత బాబు సంరక్షణ కొరకు మా వారికి అక్క  వరుసయ్యే ఆమెను తీసుకొచ్చుకున్నాం. ఆమె పేరు నాగమణి. భర్త చనిపోయి తిండి బట్టా లోటుతో  ఒంటరిగా బ్రతుకీదుతూ వుంది ఆమెకు ఆధారం కల్పించినట్టు వుంటుంది అని బెంగుళూరు తీసుకొచ్చాం. అడగకుండానే నెలకు పదివేలు ఆమె అకౌంట్ లో వేసేసే వారిమి. ఆమె కూడా ఇంటి పని వంట పని బాబు సంరక్షణ అన్నీ బాగా చూసుకునేది. కానీ తను పని చేసుకునేటపుడు బాబుకు మొబైల్ ఫోన్ ఇవ్వడం టివి పెట్టి వదిలేయడం చేసేది. మేమిద్దరం ఉదయం ఎనిమిదిన్నరకు ఇల్లొదిలి ఆఫీస్ కు వెళితే.. తిరిగి వచ్చేసరికి రాత్రి ఏడు గంటలయ్యేది. మా ఇరువురికి ఓపికలు లేక గంటో రెండు గంటలో ముద్దుచేసి ఆమెకు ఇచ్చేసేవారిమి. బాబు కూడా ఆమెకు బాగా మాలిమి అవుతున్నాడని మనసులో కలుక్కుమన్నా కనబడకుండా సరిపెట్టుకునేదాన్ని.బాబు కూడా ఆరోగ్యంగా పెరుగుతున్నాడు అది చాల్లే అనుకుని సంతృప్తి పడేదాన్ని.నాలుగవ సంవత్సరం వచ్చాక ప్లే స్కూల్ కి వెళ్ళివస్తున్నాడు ఇక  స్కూల్ లో జాయిన్ చేద్దాం అనుకుంటూ వుండగా.. కోవిడ్-19 మొదలైంది. మొదటి వేవ్ లోనే ఆమెకు మాకు కోవిడ్ సోకింది. ట్రీట్మెంట్ కు కూడా బాగా ఖర్చైంది కూడా. ఆమెకు  నెగిటివ్ వచ్చిన తర్వాత ఇక ఉండలేనంటూ ఊరికి వెళ్ళిపోయింది. అప్పటినుండి మాకు కష్టాలు మొదలయ్యాయి. లాక్ డవున్  వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ చేసుకుంటూ ఇద్దరం కలసి పిల్లాడిని పెంచడానికి అవస్థపడి పోతున్నాం. పాలు త్రాగడు అన్నం తినడు.నిద్రపోడు. రైమ్స్ చూస్తూ వున్నప్పుడు మాయ చేసి నోట్లో కుక్కడమే. ఇక రాత్రుళ్ళు నిద్రపోడు. అత్త అత్త అంటూ ఆమె వున్న గది వైపు చేయి చూపుతాడు. ఆమె మీద బెంగతో చిక్కిపోతున్నాడని మళ్ళీ రమ్మని పిలిచాం. ఇంకో రెండు వేలు ఎక్కువ ఇస్తామని అన్నాం కూడా. కానీ ఆమె రాలేదు. ఆమె వల్ల వచ్చిన పర్యవసానం మాత్రం ఇంతా అంతా కాదు.బాబును గాడ్జెట్స్ కి అలవాటు చేయడంతో పాటు ఆమె వికృత ఆనందానికి బాబును బలి చేసిందని ఆలస్యంగా అర్థమైంది. చెప్పాలంటే నాకు సిగ్గుగా వుంది మేడమ్ అని చెప్పడానికి విరామం తీసుకుంది. అవతల గదిలో కూర్చుని వింటున్న నేను ఉలికిపడ్డాను. నాలుగేళ్ళ పసివాడిని ఏమి చూసి వుంటుందో అని గుండె గుబగుబలాడింది కూడా. 


కరుణ మాట్లాడలేదు. ఆమె బిడియాన్ని వదిలించుకుని చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ చెప్పలేకపోయింది. కరుణ అనునయంగా నన్ను డాక్టర్ గా కాదు ఒక అక్క అనుకుని చెప్పండి మీ బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యం  మీ ఆనందం మీకు ముఖ్యం కదా అని మెత్తగా అనునయిస్తూనే హెచ్చరించింది. 


ఆమె కాసేపు తటపటాయించింది. కరుణ ఓపికగా ఎదురుచూస్తుంది.వినడానికి టెన్షన్ గా ఎదురుచూస్తూ నేను.


 “రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోడు డాక్టర్. విసిగించేస్తాడు. చిరాకుతో నాలుగు తగిలిస్తాను కూడా. ఏడుస్తూ అతుక్కుపోతాడు. చాలారోజుల పాటు నా గుండెలపై కూర్చుని ముందుకు ముందుకు జరుగుతూ వచ్చి నా ముఖంపై కూర్చోవడం. అర్థం కాని భాషలో ఏదో చెప్పడం. వెంటనే నేను వాడిని పక్కన పడుకోబెట్టుకుని చిచ్చు కొట్టడం. ఎప్పటికోగాని నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు టబ్ లో నిలబెట్టి స్నానం చేయిస్తూవుంటే తన శిశ్నాన్ని తీసుకొచ్చి నా నోటి దగ్గర పెట్టినపుడు నాకు అర్థమైంది. కోపంతో అసహ్యంతో వణికిపోయాను. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఒక్కదాన్నే వున్నాను కాబట్టి  సరిపోయింది అనుకుంటూ గబుక్కున కింద కూర్చోపెట్టి ఎక్కడ చూసావు ఎవరు నేర్పారు రా నీకు అంటూ గట్టిగానే నాలుగు తగిలించాను. కోపం తగ్గాక ఆలోచిస్తే అర్థమైంది. ఆ ముదనష్టపుది పోర్న్ మూవీస్ చూసి చూసి తన వికృతాన్ని పసిబిడ్డపై చూపించింది అని. బిడ్డలు లేని ఆడది కదా! మా బిడ్డలో తనకు కల్గని కడుపుపంట భాగ్యాన్ని  చూసుకుని మురిసిపోతుంటుందని భావించి కాస్త ఏమరుపాటుగా వుంటే బిడ్డను అలా వాడుకుంది. చాలారోజులు నా భర్తతో చెప్పాలా లేదా అని ఆలోచిస్తూ.. ఆ అలవాటు మాన్పాలని అడిగినప్పుడల్లా గాడ్జెట్స్ ను ఇచ్చేదాన్ని. రాత్రిళ్ళు నిద్ర పోకుండా విసిగిస్తున్నాడని మా వారు విసుక్కుని వేరే గదిలోకి మారిపోయాడు. ఈ భయంకర సత్యాన్ని ఎక్కువ కాలం మోయలేక నా భర్తకు చెప్పేసాను. విభ్రాంతి చెందాడు. మొదట నమ్మలేదు. ఒకటి రెండుసార్లు బాబు ప్రవర్తన చూసాక ఇక తన పక్కనే పడుకోబెట్టుకుంటున్నారు. ఆమె వెళ్ళిపోయి ఏడాది దాటినా ఇంకా ఆమె కోసం వెదుక్కుంటాడు బాబు. నోట్లో వేలు కాళ్ళ మధ్య చేయి.. టాయ్లెట్ హాబిట్స్ అలవాటు పడలేదు. గట్టిగా మాట్లాడితే చాలు పేంట్ తడిపేసుకుంటాడు.  ఎవరితోనూ కలవడు. నాలుగుసార్లు పిలిచినా పలకడు. విపరీతమైన అల్లరి చేస్తాడు.ఎవరికీ చెప్పుకోలేము. స్థలం మారితే బాగుంటాడని ఇక్కడకు షిప్ట్ అయ్యాం. ఇప్పటికే అయినవాళ్ళందరూ ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే పిల్లలు ఇలాగే మందకొడిగా మాటలు రాకుండా తయారవుతారు మానేయరాదు అనే హితోక్తులు. కోవిడ్ మూలంగా ఎవరింటికీ ఎవరం వెళ్ళడం లేదు కాబట్టి శాంతిగా సంతోషంగా లేకపోయినా గుట్టుగా నెట్టుకొస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డను బాగా పెంచుకోగల్గడం ఎలా అనే చింత. ఏం చేయాలి.. చెప్పండి డాక్టర్” అని అడుగుతుంది. 


వింటున్న నేను షాక్ తిన్నాను. ఏకకాలంలో వెగటు జుగుప్స  అసహ్యం. పసి ఆడపిల్లలనే కాదు మగ పిల్లలను కూడా అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన ముదనష్టపు మనుషుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గు భయం. అమ్మమ్మలు మేనత్తలు మగ పిల్లల లైంగిక అవయవాన్ని తాకి ముద్దులాడటం కొత్తేమికాకపోవచ్చు కానీ ఆ చర్య అభ్యంతరకరమే. ఆ చర్య వెనుక లిబిడో దాగివుంటుంది అని వయస్సుతో సంబంధం లేకుండా ప్రేరేపించినట్లవుతుందని వారికి కూడా తెలియదేమో!


కరుణ.. ఆ తల్లిని అడుగుతుంది.. “మీరు ఫ్రాయిడ్ ని చదివారా!?  పిల్లల్లో కూడా లైంగిక ఆసక్తి సహజం అంటారు. మన భారతీయ సంస్కృతిలో అవన్నీ సహజంగా అంగీకరించడం కష్టం. పువ్వులను నేల రాసినట్టు పద ఘట్టనల క్రింద నలిపేసినట్లే కసుకాయలను తెంపి కొరికి అవతల పడేసేవారు వుంటారు. తల్లిదండ్రులు తప్ప ఎవరి సంరక్షణలోనూ పిల్లలను వదలడం అంత శ్రేయస్కరం కాదు. మీ ఆలోచనలు భయాలు నాకర్థం అవుతున్నాయి.మీరు శ్రద్ధ తీసుకుంటే అన్నీ చక్కబడతాయి. భయపడవద్దు.ముందు పిల్లాడి తల్లిదండ్రులుగా  మీరేదో  తప్పు చేసేసారనే గిల్టీ కాన్షియస్ లో నుండి బయటకు రండి.ఇదో చిన్న సమస్యగా చూడండి అప్పుడే మీ ఒత్తిడి తగ్గి చక్కగా ఆలోచించగల్గుతారు. అని చెప్పి లోపలికి వచ్చి అమ్మా.. కొద్దిగా కాఫీ కలుపు. ఆ మూడ్ లో నుండి ఆమెను బయటపడేయాలి అంటూ బుక్ రాక్ లో    అనేక పుస్తకాల మధ్య వున్న ఒక పుస్తకాన్ని వెతికి పట్టుకుని హాల్లోకి తీసుకువెళ్ళింది. 


“మీరు ఎ. ఎస్. నీల్  సమ్మర్ హిల్  బుక్ చదివారా!? పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కరదీపిక లాంటిది ఈపుస్తకం.  ఇది తీసుకువెళ్ళి మీ ఇద్దరూ చదవండి. మీ భయాలు పోగొట్టుకోండి. మీ  ప్రశ్నలన్నింటికి సమాధానం చెపుతుంది  ఈ పుస్తకం. క్రమం తప్పకుండా బాబును బయటకు తీసుకువెళ్ళి తన వయస్సు పిల్లలతో కలపండి. పార్క్ లో  తిప్పండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ  నాయనమ్మ తాతయ్యలకు అమ్మమ్మకు దగ్గర చేయండి. అత్యవసరం అయితేనే స్మార్ట్ ఫోన్ లను బయటకు తీయండి.  పుస్తకాలను ప్రకృతిని పరిచయం చేయండి. ఇవే అసలైన మందు” అని వివరించి చెప్పింది. 


కాఫీ ఇస్తూ చూసాను.ఆ తల్లి ముఖంలో  చిన్న చిరునవ్వు . ముఖం తేటగా వుంది. “థాంక్యూ సో మచ్ డాక్టర్. నేను జాబ్ కు రిజైన్ చేయాలనుకుంటున్నాను. నాకు బాబు కన్నా ఏదీ ముఖ్యం కాదు”.. అంది. 


చిరునవ్వుతో  ఆమెను సాగనంపాక “అమ్మా!  అసలు తప్పంతా పెద్దలిది కాదూ.. పుట్టి పుట్టగానే నాలుగు నెలలన్నా నిండకుండా వీడియో కాల్ లో మనుషులను పరిచయం చేస్తున్నాం. ఎత్తుకుని తిప్పే ఓపికలు లేక తీరిక లేక స్క్రీన్ ను అలవాటు చేస్తున్నాం. పెద్దలకు ఎలాగూ కంట్రోల్ లేదు. పిల్లలను పసివయసు నుండే చెడగొడుతున్నాం. ఈ హస్త భూతం దృశ్య భూతం వదిలితే కానీ మనుషులు బాగుపడరు. నువ్వు కూడా మనుమరాలితో గంటల కొద్ది వీడియో చాట్ లు ఆపు.యంత్ర దృశ్య సాన్నిహిత్యం కన్నా ఆరోగ్యకరమైన ఆలోచనలున్న మానవ స్పర్శ సాన్నిహిత్యం పిల్లలకు అవసరం.చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు” అని హెచ్చరించింది. 


 ************

ఇప్పుడు అవన్నీ గుర్తుచేసుకుంటే ఏదో తెలియని భయం అలుముకుంది నాకు. అరుణ్ ఎలాగున్నాడో! కరుణ కు ఫోన్ చేసినప్పుడు మర్చిపోకుండా కనుక్కోవాలి.పిల్లల మనసులు ఎంత స్వచ్ఛమైనవి. పెద్దలను అనుకరించే అనుసరించే వయసులో వున్నప్పుడు వారికి మంచి వాతావరణాన్ని పరిచయం చేయాలి. లేకపోతే ముమ్మాటికి అది పెద్దల తప్పిదమే!


మనుమరాలితో కాలం గడుపుతూ నా అపరిమితమైన ప్రేమ ప్రకటనతో తనలో  నాకే మాత్రం తెలియని జ్ఞాపకం లేని నా పసితనాన్ని ఆస్వాదిస్తూ ఆనందం అనుభవిస్తున్నప్పుడు ఆ బిడ్డకు ఏది మంచిదో అది మాత్రం అందించవద్దూ ! గాడ్జెట్స్ తన చేతికి అందనివ్వకూడదు. పుస్తక పఠనం కూడా పూర్తిగా మూలన పడింది.అంతకు ముందే నయం. పాత వాసనలు పోనీయకుండా ఎప్పుడో ఒకప్పుడు తనివితీరా చదువుకునేదాన్ని. ఆ అలవాటును పునరుద్దించుకోవాలి. వెధవ ఫేస్ బుక్  వాట్సాఫ్  తదితర  దరిద్రాలన్నింటిని వదిలేయాలి.మనుమరాలి కోసమైనా సరే పుస్తకాలు పట్టుకోవాలి అని అనుకుంటే రిలీఫ్ గా అనిపించింది.


నిద్ర లేచిన పాప మళ్ళీ టివి పెట్టమని అడిగింది. ఇంతకు ముందెన్నడూ బూచి అనే పదాన్ని వినిపించని నేను అందులో బూచి వుందని చెప్పి పాపను భయపెట్టాను. భయంగా నన్ను అల్లుకుంది. విరబోసుకున్న జట్టుకు రబ్బర్ బేండ్ వేస్తాను అంటే ముఖం ముందుకు చేతిని చాచి చూపుడు వేలును అటు ఇటూ ఊపుతూ నో.. నో.. అంది నన్ను అనుకరిస్తూ. పాలు త్రాగాక ఒద్దికగా నా వొళ్ళో కూర్చుని ముక్కులో వేలు పెట్టుకుంది. పెదాలపై వేలుంచి తప్పమ్మా అంటే తీసేసింది కానీ మళ్ళీ పెట్టుకునే ప్రయత్నం చేసింది. నేను వారించే ప్రయత్నం చేయలేదు. సమ్మర్ హిల్ పుస్తకం నేను చదివిన తర్వాతనే నా పిల్లలు కూడా చదివారని మర్చిపోను నేను. ఒళ్ళో కూర్చున్న పాపను ఎత్తుకుని బయటకు వచ్చాను. ఇద్దరం షూస్ ధరిస్తుంటే కోడలు అడిగింది తన కూతురిని ఎక్కడికి వెళుతున్నావు అమ్ములూ అని. తన చిన్ని చిన్ని చేతులతో ముఖం మీద పడే జుట్టును ఎగద్రోసుకుంటూ “వాక్” కి అంది. 

అవునా అంటే .. హా..అని ఓ వింతైన హావభావాలు ప్రదర్శించి అక్క చెల్లి అన్న పాప అనుకుంటూ ముందుకు పరుగుపెట్టింది. 


పాప వెనుక అడుగులు వేస్తూ పిల్లలకు రుచి చూపించడమే మన వంతు, వారికి ఏది ఇష్టమైతే దానినే ఆస్వాదిస్తారని మనం వదిలేయకూడదు. ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందో దానినే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. పిల్లలే కాదు మనమూ నో అని చెప్పగల్గేంత కఠినం అలవర్చుకోవాలి.అప్పుడే మన నట్టింటి నుండి దృశ్య భూతాలు పరార్ అవుతాయి అనుకుంటూ పరిసరాలను గమనిస్తూ వున్నాను.


కమ్యూనిటీ పార్క్ లో లేత పచ్చ లాన్ పై  రకరకాల పువ్వుల్లా దరహాసాలు వెదజల్లే పిల్లలు వాళ్ళను ఓ కంట  కనిపెట్టుకుని వుంటూనే కబుర్లాడుకునే పెద్దలు.ఆన్లైన్ క్లాసుల బెడద తగ్గి ఎగరేసిన బెలూన్ వలే స్వేఛ్ఛగా ఎగురుతూ తుళ్లింతలు పెట్టే కొంచెం పెద్ద పిల్లలూ వర్క్ ఫ్రమ్ తీసేస్తే బాగుండు ఆ బండచాకిరీతో పాటు ఖైదీల్లా ఇంటికి అతుక్కునే బాధ తగ్గుతుందని చెప్పుకునే సాప్ట్వేర్ జీవులు వెరసీ అక్కడంతా వసంతమాసానికి ముందే వచ్చే ఫాల్గుణశోభలా కళకళ లాడుతూ వుంది. పెద్దల నోళ్ళు మాట్లాడుతూనే వున్నా ధ్యాస మాత్రం అరచేతిలో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పైనే వుంది. అప్పుడప్పడూ తల క్రిందకి దించి బొటనవేలితో స్క్రీన్ ను స్క్రోల్ చేస్తూనే వున్నారు.భూత వైద్యం ముందుగా ఇప్పించాల్సింది పిల్లలకు కాదు పెద్దలకు తప్పనిసరేమో అనుకున్నాను సాలోచనగా.


**************౦****************


#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.



కామెంట్‌లు లేవు: