“అరవై కొమ్మల వృక్షం నేలబడిందంటే తిరిగి లేవదు, ఏమిటో చెప్పాలి” అంది వాకిట్లో ముగ్గు వేస్తూన్న నారాయణమ్మ.
కాసేపు ఆలోచించి “ఏమో తెలియడం లేదు, నువ్వే చెప్పు” అన్నాను.
“పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఇది కూడా తెలియదు మీకు, పొద్దునే లేచి ప్రతి ఆడోళ్ళు చేసేది” అంది .
“ముగ్గేసే పని అందరూ చెయ్యలేరులే” అనంటే నవ్వింది.
నారాయణమ్మ దగ్గర మంచి సంభాషణా చాతుర్యం వుంది, నలుపు రంగులో భలే కళ గా ఉంటుంది.చీటికి మాటికీ విరిసే నవ్వు ఆమె చక్కదనాన్ని చిక్కబరుస్తుంది. బాగా ముగ్గులేయడమే కాదు ముగ్గు గురించిన సామెతలు కూడా తెలుసు ఆ మాటే అంటే..
“సామెతలు, పాటలు, ముగ్గు పిండి చేయడాలు అన్నీ వచ్చు” అంది.
“ఏంటి ముగ్గురాళ్ళు కొట్టేదానివా నువ్వు” అడిగాను ఆసక్తిగా
"ముగ్గురాళ్ళ కొట్టడం కాదు. అసలా ముగ్గు పిండి చేసే గుల్లలను సముద్రం నుండి పట్టుకొచ్చి కాల్చి ముగ్గు పిండి చేసేవాళ్ళం అంది.ముగ్గులో పసుపు కుంకుమ పెట్టి పూలు పెడుతూ ఇంకా ఏవేవో మెరుగులు దిద్దుతున్న తనని ఆపుతూ “వేసింది చాల్లే, అంట్లు తోముకుంటూ ఆ కథ చెపుతువుకాని రా” అన్నాను.అక్కడనుండి కదలకుండానే ఆ కథంతా చెప్పేయగలదని భయమేసి. అవతల ఆఫీస్ కి లేట్ అవుతుందనే భయం నాది.. నేను పాలగిన్నె పొయ్యిమీద పెట్టి నారాయణమ్మ వైపు చూసాను కథ కొనసాగింపమని.
“మా నాయనది నిజాం పట్నం. మా అన్నదమ్ములు మేనత్తలు యిప్పటికి అక్కడే వుండారు. మా నాయనే చేపలు పట్టుకుంటూ బందరు వచ్చేసి అక్కడే నిలిచి పోయాడు. ఆరుగురు అక్కచెల్లెళ్ళం ఇద్దరు అన్నదమ్ములు. మా నాయనొక్కడూ ఏట కెళ్ళి చేపలు తెస్తే మా కడుపులు నిండేది యెట్టా? మానాయన మమ్మల్ని సముద్రంలో దింపి ఏట నేర్పాడు.మా అక్కాళ్ళు నాయనతో పడవమీద ఏటకెళ్ళేవాళ్ళు. చిన్నాళ్ళం మేము ముగ్గురం కలిసి నడుముకు ఉల్లిపాయలు సంచి గోతాము సంచి కట్టుకుని తాటి చెట్టు లోతుకి వెళ్లి మగాళ్లు వేసుకునే పైపంచ ఉంటది చూడు దాన్ని నాలుగు చెరుగులని రెండు చేతులతో పట్టుకుని అలొచ్చినప్పుడల్లా దానితో పాటు ఒడ్డుకు కొట్టుకొచ్చే గవ్వలు ఆల్చిప్పలు నత్త గుల్లలు ఎంట్రకాయలని వొడుపుగా జొవురుకుని నడుముకు కట్టుకున్న సంచీలో యేసుకునేవాళ్ళం. సంచి నిండేదాకా అట్టా దేవులాడతానే వుండేవాళ్ళం. వాటిని ఇంటికి మోసుకొస్తే మా అమ్మ యేటికాటికి యేరు చేసి ఎంట్రకాయలను నత్త గుల్లలను చిన్న చేపలను వూళ్లో తిరిగి అమ్మేసుకోచ్చేది"
“నత్తలను కూడా తింటారా” అని ఆశ్చర్యంగా అడిగితే “ఆ.. ఆసంగతి మీకు తెలియదదేంటి” అని తాను ఆశ్చర్యపోయింది.
“సర్లే నత్తలు యెలా వొలుస్తారు చెప్పు మరి”
“నత్తలుడకబెట్టే సున్నపు గాబు వుండేది మాకు. దానికింద గాడిపొయ్యి. గాబులో నత్తలు నీళ్ళుపోసి పెళ పెళ లాడేమంట పెట్టి వుడకబెట్టే వాళ్ళం. నత్తలు బయటకి వచ్చేసేయి. వాటిని కూర వొండుకోవడమో డబ్బులు కావాలంటే అమ్మేయడమో చేసేది మా అమ్మ. అట్టా మిగిలిన నత్త గుల్ల పెంకులను ఆల్చిప్పలను శంకువులను అన్నింటిని పోగెట్టి బట్టీ పెట్టి కాల్చే వాళ్ళం. అన్ని చక్కగా కాలి సున్నం లాగా అయిపోయేది. కాలని వాటిని నల్ల బడిన పెంకులని యేరి పారేసి ఆ సున్నం పొడిని అమ్ముకునేవాళ్ళం. ఎట్టా ఉండేది అనుకునేవ్ ఆ పిండి, తెల్లగా ఎన్నెల పిగిలిపడతన్నట్టు ఉండేది. ఆ పిండితో ముగ్గేస్తే కర్ర ఎంత చక్కగా వస్తదో. నువ్వుగాని చూసావంటే వొదిలిపెట్టవ్ “ అంది. అంట్లు కడగడం పూర్తిచేసి తడిచేతులు పమిట చెంగుకు తుడుచుకుంటూ.
“ఇప్పుడు కూడా అలా తయారుచేసేవాళ్ళు వున్నారా అడిగాను” కాఫీ కప్పు అందిస్తూ . “
"
ఇప్పుడెవరు చేత్తారు అయన్నీ. అప్పుడు పొట్టకూటి తిప్పలవి. అప్పుడైనా ఆ ముగ్గు పిండికి డబ్బులు ఇచ్చేవ్వాళ్ళా యేమన్నానా, డబ్బు బదులు నూకలు పెట్టేవాళ్ళు, పాత బట్టలిచ్చేవాళ్ళు. అన్నం పెట్టేవాళ్ళు తీగకి కాసిన సొరకాయలిచ్చేవాళ్ళు. అదే పరమానందం మాకు. ఇప్పుడవన్నీ చేసేవాళ్ళు ఎవరుండారు? మర పడవలు వచ్చేసాయి. బోట్ లో సిలిండర్ వేసుకెళ్ళి వంటలు చేసుకుని తింటూ వారం పదిరోజులు ఏట చేసుకుని వచ్చి అమ్ముకుని కూసుని తింటున్నారు. కాకినాడ లో మా వాళ్ళందరూ ఇంట్లో కూసుని తినడమే. ఆడాళ్ళు ఒక్కరు పనికిబోరు. బట్టలుతుక్కునే మిషన్లు కూడా కొనుక్కుని సుఖంగా వుండారు. అని.. నేను పోతన్నా.. నీ దగ్గరే కూసుని కథలు చెప్పుకుంటే ఎట్టా ... అవతల నా పని మొగుడు తరుముతున్నాడు” అని కప్పు కడిగేసి పెట్టి వెళ్ళిపోయింది.
ఎనిమిది ఏళ్ళ క్రితం మా ఇంటి ముందావిడ పనెమ్మాయిని పెట్టుకుంటారా అని అడుగుతూ తన వెనుక నిలబడ్డ నారాయణమ్మని చూపిచ్చింది. విరిగిన మోచేతికి కట్టు కట్టుకుని మెడ చుట్టూ చీర చెంగు కప్పుకుని ఎంతో దిగులుగా కనబడిన ఆమెని చూసి జాలి అనిపించి సరేనన్నాను పనమ్మాయి అవసరం లేకపోయినా కూడా. అట్టా వచ్చి యేళ్ళ తరబడి కూరుకుపోయింది మా ఇంట్లో మనిషిగా. ఏ వేళప్పుడు వచ్చి తలుపు తట్టినా సంకోచం లేకుండా తలుపు తీసి నమ్మకంగా లోపలి రానీయగల్గిన మనిషి అయిపోయింది.
“కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు,అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు.. ఏమిటది ?” అంది ఇల్లు తుడుస్తూ.
“తెలియదులే నువ్వే చెప్పేయ్” అన్నాను కొంచెం విసుగ్గా. నవ్వుకుంటూ పాట అందుకుంది.
“భలే పాడుతున్నావే. నిజం చెప్పు నువ్వసలు చదువుకోలేదా ?”
“ఏం చదువుకోకపోతే పాటలు పాడలేరా,వరసగా పది పాటలు పడతాను ఇనుకో” అంది నన్ను ఆట పట్టిస్తూ. నా ముఖంపై నాట్యమాడే ఆశ్చర్యాన్ని ఆటపట్టిస్తున్నట్లు చూస్తూ నవ్వుకుంటూ “శివుని శిరసు పైనె చిందు లాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ అంటూ మొదలు పెట్టి ఆపకుండా జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె మెల్లంగ వస్తాది నా యెంకీ సల్లంగ వస్తాది నా యెంకీ “అంటూ నాలుగు గీతాలు పాడింది.
బ్యాంకులో వేలిముద్ర వేసి అకౌంట్ ఓపెన్ చేసినప్పటి సంగతి గుర్తొచ్చి “యెట్టా గుర్తుంటాయి నీకవన్నీ” అంటే “రక్తములో వచ్చింది ఎక్కడికి పోద్ది. ఇదంతా మా అమ్మ చలవ. మా అమ్మ పరికి ముగ్గులామె. బందరులో ఆటాడుతూ పాటలు పాడుతున్న ఆమెని చూసి ప్రేమించి పెళ్లి చేసున్నాడు మానాయన. పెద్ద యుద్ధమే చేసాడంట మానాయన యింటో వాళ్ళతో. మా అమ్మని చూస్తే ఆశ్చర్యపోతావ్ మీ యిళ్ళల్లో పుట్టినావిడికి మల్లె వెలిగారం అద్దిన బంగారంలా మెరిసిపోతా వుంటది అంది. వెలిగారం అంటే యేమిటో అది అద్దిన బంగారం యెలా వుంటుందో నాకు తెలియకపోయినా వూ కొట్టి వూరుకుని “అయితే మీ అమ్మ బాగా పాటలు పాడుతుందా?”
“బాగా పాడుద్ది.పెద్ద పెద్దోళ్ళు పండక్కి, పెళ్ళిళ్ళకు ముగ్గులేయడానికి, పోలు పొసే చోట ముగ్గేయడానికి అమ్మవారి గుడిముందు ఉత్సవం ముగిశాక వేసే రతి ముగ్గు వేయడానికి వెంటబెట్టుకుని తీసుకెళ్లేవారు. అంత పేరు మా అమ్మకి” అని గర్వంగా చెప్పింది.
“నువ్విచ్చిన రేడియో ఏం చేసాననుకున్నావ్ ఆమెకే ఇచ్చి పంపిచ్చా మా అక్క కొడుక్కిచ్చి. . వొళ్ళో పెట్టుకు కూర్చుని పాటలు వింటా ఉంటది. రోజు వార్తలు వినాలి. సముద్రం ఎట్టా ఉంటాదో,తుఫాను వస్తుందేమో అని. కొడుకులు సముద్రంలోకి ఏటకెళ్లి యెప్పుడొస్తారో అని యెదురెదురు చూస్తా ఉంటది.ఒకేల తుఫాన్ వార్తలు విన్నదనుకో, చెవికి అతికిచ్చుకుని ఒకటే ఫోన్ చేస్తానే వుంటది కొడుకులు మీద అంత భ్రమత. అందరూ బాగానే వుండారు కదా నేను ఒక్కదాన్నే యిట్టా వుండా. అయినా నా గురించి ఒక్కరవ్వైనా పట్టించుకోదు. తల్లి కూడా అంత కఠినాత్మురాలు” అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.
సరదాగా మొదలైన సంభాషణ దుఖంలోకి దారితీసింది. పమిట చెంగుతో కళ్ళు అడ్డుకుంటూ చెప్పింది తీరం వెంబడి సాగుతున్నజీయితం యిట్టా నగరానికి కొట్టుకొచ్చి గిలగిల లాడతా వుంది. అందరికి నా డబ్బులైతే కావాలి నేను మాత్రం అవసరం లేదు..అనుకుంటూ మనసులో కచ్చ నంతా తుడుస్తున్న బండ్లపై చూపించింది. నేను మౌనంగా వుండిపోయాను. ఇల్లంతా తుడిసి వచ్చి కాఫీ పెట్టవా అంది.
"ఎందుకు పెట్టనూ , కోపం తగ్గిందా?"
"కోపం కాదమ్మా ! మీ అందరూ అప్పుడు ఆదుకోకపోతే ఏమైపోయేదాన్ని నేను. అసలు ఇల్లు వొదిలి ఎందుకొచ్చేసినా అని ఎవురైనా ఆలోచించారా ? బిడ్డలను వొదిలిపెట్టేసి పోయింది అంటారే కానీ ఇల్లు ఎందుకు వదిలిపెట్టానో చెపితే ఒక్కరైనా నమ్మారా? ఎప్పుడు నువ్వడగలేదు నేను చెప్పలేదు గందా.. చెపుతా వినుకో" అంటూ గోడకి వెన్ను ఆనించి స్థిమితంగా కూర్చుంది .
నాకప్పుడు పదమూడేళ్ళు. మా ముగ్గురక్కలకు పెళ్ళై పోయింది. నేను పదమూడో ఏట పెద్దమనిషి అయ్యాను.ఒంటికి వసంతం వొచ్చింది గొంతుకి పంచమం కూయడం వచ్చింది అనేది మా అమ్మ. పెద్దమనిషి అయ్యాక నెలకే మా మేనత్త పల్లిపాళెం నుండి మా ఇంటికి వచ్చింది. ఆమెకి ఒక కొడుకు వున్నాడు. అంతకు ముందే పెళ్ళైపోయింది వాడికి. ఒక కొడుకు పుట్టాక పెళ్ళాం ఆ పిల్లాడిని తీసుకుని ఎల్లిపోయిందంట. నారాయణి ని నాకొడుక్కిచ్చి చేయరా. ఎప్పుడో ఎడం అయిపోయిన వాళ్ళము ఇట్టాగన్న కలిసిపోతాం అని పీడిచ్చింది. మా నాయనకి అంత ఇష్టం లేకపోయినా మా అమ్మ వొప్పిచ్చింది. మా అత్త కొడుకుని అంతకుమునుపు చాలాసార్లు చూసినాను. అప్పుడప్పుడు మా నాయనమ్మ మమ్ములను నిజాం పట్నం తీసుకుపోయేది గందా . ఎంత చొక్కు అనుకున్నావ్ ఆడికి. ఓ ఇచ్చకాలు ఆడేవాడు పెళ్ళాంని పక్కనబెట్టుకుని కూడా. పెళ్ళాం ఎందుకు వొదిలేసి పోయిందో అందరికి తెలుసు.అసలు పని చేయడు, ఎప్పుడూ కల్లు ముంతలు ఎత్తేయడమూ, సారా తాగడం మంచానికి అడ్డంగా పడి ఉండటం. ఇంటో సరైన ఆడది ఉంటే మగాడు ఎందుకు అట్టా తయారవుతాడు. పిల్లనిచ్చావ్ అనుకో నా ఇంటికి లచ్చిందేవి వచ్చినట్టేరా అన్నయ్యా. బాగా చూసుకుంటాం వొప్పుకోవే అని బతిమలాడి మానాయనను ఒప్పించింది.
“మరి నీకిష్టం లేదని చెప్పలేదా ?”
“చెప్పే దైర్యం లేదు, వినేవాళ్ళు లేరు. నాకిష్టం లేకపోయినా మాఘమాసంలో లగ్గమైంది. అత్తారింటికి పంపిచ్చారు. ఆడితో జీయితం నరకం అనుకో. సముద్రం ఈదటం నేర్చుకున్నా కానీ ఆడితో మంచం ఈత నేర్చుకోలేకపోయా.రోజూ గోలే, ఇద్దరు బిడ్డలు పుట్టినా ఆడు రూపాయి సంపాదిచ్చడానికి యిల్లు వొదిలేవాడు కాదు. నిండు గర్భిణిగా వుండి కూడా సముద్రానికి పోయి నత్తలు ఎంట్రకాయలు ఏరుకురావాల్సి వచ్చేది. చేపలమ్ముకొచ్చి మొగుడుకి కూడా కూడు పెట్టాల్సి వచ్చేది. మా తమ్ముళ్లు పెద్దవాళ్ళై బందరు రేవులో ఏట అంత బాగోలేదని కాకినాడకు ఎల్లిపోయారు. మరపడవల్లో పనికి కుదిరిపోయారు. వాళ్లతో కూడా పనికి రమ్మన్నా పోయేవాడు కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే ... అని ఆపింది. చెవి ఉగ్గ పెట్టాను ఏమి చెపుతుందా అని.
మిట్ట మధ్యాహ్నం యేటి కుక్కలు కూడా పొదల్లోకి దూరి నిద్రపోయే టైము. ఎండ కూడా యెన్నెలలాగానే వుంది.సముద్రం కూడా గంభీరంగా వుంది. రెండు చేపలైనా దొరుకుతయ్యి అని తీరానికి పోయాను. ఒక గంటసేపు ఈది కాసిని నత్తలు రెండు చేపలు చేజిక్కించుకుని ఇంటికి బయలుదేరా. మా ఆయనతో తిరిగే నలుగురు చచ్చినోళ్ళు పొదలలో దాక్కున యేటి కుక్కలు చేపల ఏటకి ఒక్కసారే చుట్టేసినట్టు నన్ను నాలుగు పక్కలనుండి చుట్టేసారు.చిల్లకోల వుంది నా చేతిలో. ఒక్కొక్కడిని పొడిచి పారేత్తున్నా.ఒకడు వెనకనుంచి వచ్చి నా చేతిలో చిల్లకోల లాక్కుని విసిరి పారేసాడు. పొదల్లోకి లాక్కుపోతన్నారు వాళ్ళు. అంతలో కట్ట మీదనుంచి డుగ్గు డుగ్గు మని బండేసుకుని వచ్చినాడు అతను గాని రాకపోతే కుక్కలు చింపేసిన ఇస్తరి అయిపోయేది నా బతుకు. అతన్ని చూసి నన్ను వొదిలేసి పారిపోయారు వాళ్ళు.
"ఎవరతను? "
ఆ ఊరి రైతు కొడుకు పెద్ద వ్యవసాయం. చదువుకున్నాడు కూడా. చిన్నప్పుడు మాతో పాటు సముద్రానికి వచ్చి ఈత నేర్చుకున్నాడు.నేనే ఈత నేర్పానప్పుడు. చిన్నప్పటి సేయితం మాది. దేవుడల్లే వచ్చాడు. బెదిరిపోయిన నన్ను బండి మీద ఎక్కించుకుని మా పాలెంకి తీసుకెళ్లాడు. మా పేటలోకి రాగానే ఇక్కడ దించేయ్ నేను నడచిపోతానులే అని దిగి నడిచి పోయాను. నా మొగుడు ఇంట్లోనే ఉండాడు చేపలెయ్యి చిల్లకోల యేది నిన్ను మోటార్ బైకు మీద దించిన ఆ నా కొడుకెక్కడ అని జుట్టు పట్టి కిందకీడ్చి పెడీ పెడీ కొట్టాడు. నేను బండి మీద వొచ్చిన సంగతి నీకెట్టా తెలుసు నువ్వే కదా ఆ నా కొడుకులను నామీదకి ఉసి గెలిపింది అని అడిగా రోషంగా . అవునే నువ్వెంత పతివోతవో తెలుసుకొనేకే అట్టా పంపిచ్చినా అన్నాడు. కడుపు రగులుకుపోయింది. మీదపడి రక్కేసా. వాడు వూరుకుంటాడా నన్ను విరగొట్టేసి పోయాడు. పిల్లలు ఏడుస్తున్నా వొదల్లేదు. మంచాన పడి మూడు రోజులు లెగలే, పిల్లలకు వొండిపెట్టడానికి మా మరుదుల ఇళ్ళకి కాకినాడకు పోయిన మా అత్తను ఫోన్ చేసి పిలిపిచ్చినాడు. మా అత్తకు ఏమి చెప్పినాడో ఏమో, నీకు సిగ్గులేదంటే మొగుడ్ని వొదిలి ఇంకొకడితో ఊరేగుతావా అని బుగ్గల పొడిచి పొడిచి తిట్టి పెట్టింది. నాలుగోనాడు సముద్రం మీదకు ఏటకు పోతన్నానని పోయాడు. కానీ ఏటకు పోలేదు ఏమిలేదు. దాపున దాపున దాక్కుని నాకు కాపలాలు కాసేవాడు. అట్టా మూడుతడవలు చేసాడు. పంచాయితీ పెట్టిద్దును. మా నాయన కొద్దిగా ఓర్చుకో నారాయణా అన్నాడు.
నా మొగుడు మహా రోత మడిసి. చేటలో తౌడుపోసి కుక్కలను ఉసిగొల్పినట్టు సేయితుల్ని నా మీదకు ఉసిగొల్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తాగేవాడు. ఆ సంగతి నాకర్ధమై నా జాగ్రత్తలో నేనుండాలని ఇల్లు కదలడం మానేశా. ఆడు అనుకున్నది జరగడం లేదని నన్ను చీటిమాటికి యేదో వొంక పెట్టేసి బాదేసేవాడు. అడ్డమైన బూతులు కూసేవాడు. విన్నవాళ్ళందరూ ఆడు కూసేది నిజమే అనుకునేవాళ్ళని ఆళ్ళు నన్ను చూసే చూపులను బట్టి అర్ధమైపోతా ఉండేది. ఒకరోజు మా అత్తా మొగుడు మా ఆడబిడ్డ మొగుడికి బాగోలేదని చూసి వచ్చేదానికి కావిలికి పోయారు. ఆ రోజు తీరంకి పోయి అతని కోసం కాపు కాసాను. బండి మీద వస్తున్న అతనికి అడ్డం పడి నన్ను యేడకన్నా తీసుకుని పో అని అడిగా. ఇదిగో నువ్విప్పుడు ఆశ్చర్యపడినట్టే అతను ఆశ్చర్య పడ్డాడు. నేను తప్పు చేసినా చేయకపోయినా నీకు నాకు రంకు కట్టడం మానడంలేదు నా మొగుడు. అదేదో నిజం చేసేయ్ అన్నాను అంది. కథ మొత్తం చెప్పేసేదే. ఇంటికి బంధువులు రావడంతో కథకి కామా పెట్టేసి నారాయణమ్మ పనిలోకి నేను అతిధి మర్యాదలోకి మునిగి పోయాం.
రాత్రి పడుకున్నాక కూడా ఎన్నో ఆలోచనలు చేసాను.నారాయణమ్మ అతనితో కలిసి వచ్చేసిందా ? అతను మోజు తీరాక వదిలేసి వెళ్లిపోయాడా ? అసలేం జరిగిందో ? నిద్ర పట్టలేదు నాకు. ప్రతి మనిషి జీవితంలో ఏవో చీకటి కోణాలుంటాయి హృదయంలో ఎన్నో అగాధాలుంటాయి . అందులో యెన్నో కోర్కెలు దాగుంటాయి. అప్పుడప్పుడూ అవి కీకారణ్యంలో అర్ధరాత్రి మేల్కొన్న మృగాల్లా భీకరంగా అరుస్తుంటాయి. ముసుగు వేసుకుని పైకి నాగరికంగా వుంటారు కానీ కోర్కెల నదిని అవలీలగా దాటేసినవారు ఎందరు?
నారాయణమ్మ కూతురు పెళ్ళికని డబ్బు అప్పుతీసుకుంది. అవి ఇవ్వలేదు. చెప్పా పెట్టకుండా పని మానేసి కొన్ని ఏళ్ళు అయింది. మళ్ళీ ఈ మధ్యే వచ్చి చేరింది. ఇన్నేళ్లు ఎక్కడున్నావ్ అంటే ఎక్కడ వుంటాను కాకినాడలో వుండాను. మతిచెడి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే మావాళ్లు తీసుకుపోయి ఇంటో పెట్టుకున్నారు అని చెప్పింది. తమ్ముడు లేనప్పుడు మరదలు పోట్లాట బెట్టుకుని ఇంట్లో నుండి వెళ్ళగొడితే రాత్రంతా రైల్వే స్టేషన్లో పడుకుని తెల్లారి బండికి వచ్చానని చెపుతుంది కానీ వివరంగా చెప్పదు. మళ్ళీ ఇంకోసారి ఆశ్రయమిచ్చి ఆదుకున్నావ్ అంటుంది. నారాయణమ్మ మిగతా కథ చెప్పే రోజు కోసం ఎదురు చూడటమే అడిగితే అసలు చెప్పదు. ఏదోలే నాకు తోచిన పిచ్చి పనులు చేశా ..అయేమన్నా ఘనకార్యాలా చెప్పుకోడానికి అని దీర్ఘం తీసి తప్పించుకుంటుంది.
మర్నాడు ఉదయాన్నే నారాయణమ్మ పనికి వచ్చింది కానీ ఎప్పటిలా హుషారుగా లేదు. ముఖం దిగులుగా వుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పని చేసుకుని వెళ్ళిపోయింది. ఏం జరిగిందో, పాపం రాత్రంతా గతం గుర్తుతెచ్చుకుని బాధపడిందేమో అందుకే ముఖం అలా వుంది అనుకున్నాను. మధ్యాహ్నం వచ్చి అమ్మగారూ నాక్కూడా కాసిని బియ్యం కడిగిపెట్టు. ఇంటికెళ్లి వొండుకుతినే ఓపికలేదు అంది.
"ఏమైంది జ్వరంగాని వచ్చిందా ? టాబ్లెట్ వేసుకుంటావా?"
నేనడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరేదో చెప్పుకొచ్చింది. వింటూ ఉన్నా. "ప్రతి మగోడికి ఆడదాన్ని తనే రక్షిస్తున్నాడని వొలపరం.కండకావరం ఆడు అట్టా అనుకోకపోతే బతకలేడమ్మా "అంది.
ఏదో పెద్ద విషయమే చెప్పబోతుందనిపించి చిన్నగా నవ్వి కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చున్నా.
"ఆడ మనిషి ఏరుగా వుండి బతుకుతుంటే చూడలేక ఉక్రోషం యెల్ల గక్కుతారు దొంగనాయాళ్ళు. ' ఒరేయ్ పోరా, నువ్వుగాని లేకుంటే నాకు బతకడం తెలియకుండానే మట్టి గొట్టుకు పోతానా యేంటి అని సవాల్ యిసిరి బతుకుతుండా' అని చెప్పేసి వచ్చా అంది.
వింటూనే వున్నాను."తాడి చెట్టు లోతున ఈది గవ్వ పెంకు యేరుకుని పొడి చేసి బతికినదాన్ని భూమ్మీద పనిచేసుకుని బతకలేనా యేంటీ ? "
“కష్టపడి బాగానే బతుకుతున్నావ్. సంవత్సరానికి లక్ష రూపాయలు కూడబెట్టి తమ్ముళ్ళకి ఇస్తున్నావ్ కానీ, ఎందుకీ ఘోష శోష ? పాతవన్నీ తవ్వుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళుపోవడం దిగులుతో కృంగిపోవడం తప్ప. చిలకలా నవ్వుకుంటూ యెప్పటిలా హాయిగా వుండు" అన్నా.
"హాయిగానే వుండానని ఓర్వలేక కుళ్ళు పోతన్నారమ్మా. రాత్రి నా కూతురు ఫోన్ చేసి ఇంత చిన్న పిల్లగా వున్నప్పుడు వొదిలేసి పోయావ్. మా నాయనమ్మ సాకింది కాబట్టి మా అన్న నేను బతికి బట్టకట్టాము. లేకపోతే ఏమైపోదుమో. ఏ రోజన్నా రూపాయి పెట్టావా నాకు. అంతా మీ తమ్ముళ్ళకి దొబ్బబెట్టి మమ్మల్ని సంక నాకిచ్చావ్" అని తిట్టి తిట్టి పోసింది. మళ్ళీ అంతలోనే "అయినా నీ పాపిష్టి సంపాదన నాకెందుకులే. నీ పాపం కొట్టే మా అన్న అట్టా ఉరేసుకుని చచ్చిపోయాడు, తిరిగిన తిరుగుళ్ళు చాల్లే కానీ ఇంటికొస్తే మా నాన్న ఇప్పటికైనా నిన్నేలుకుంటాడు" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.ఎంత మాటనేసింది అది. ఎవరో గుండెని పిడికిటి బట్టి నొక్కినట్టు విలవిలా లాడిపోయాననుకో. దానికి కట్నం యిచ్చి పెళ్లి చేసింది నేను కాదు. వస్తువులు పెట్టింది ఇంటోకి కావాల్సిన సామాను అన్నీ తీసిచ్చింది నేనుకాదూ. అన్నీ నేను సంపాయిచ్చిన డబ్బులతో ముడ్డి దగ్గర్నుండి నోటిదాకా చేయించుకుని పెళ్లికి కూడా నన్ను రావొద్దని నువ్వొస్తే లేచిపోయినదాని కూతురునని చెప్పుకుంటారని ముదురుమాటలు మాట్టాడిన అదేమీ తక్కువది కాదు. నాలుగేళ్లపాటు చెమట చిందించి సంపాదించిన సొమ్మంతా దానికే పెట్టాను. విశ్వాసం లేనిది అది. ఎంత మాటనేసింది అమ్మా". అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.
నారాయణమ్మ కష్టం చెప్పడం మొదలెట్టిందంటే సముద్రపు హోరే. ఏ అడ్డుకట్ట వేసినా ఆగదని నాకు తెలుసు కాబట్టి మాట్లాడకుండా వింటూనే వున్నాను.
"నా కొడుకు మంచాడు. నా దగ్గర పైసా డబ్బులు ఆశించకపోయినా అమ్మా అమ్మా అని చుట్టుకు తిరిగాడు. ఎంత వద్దని చెప్పినా ఇనకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్ళాంతో గొడవలు పడటమే సరిపోయే. పెళ్ళాం నీళ్ళోసుకుందని సంతోషంగా చెప్పాడు. ఇక గొడవలు పడనులేమ్మా. కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకుని బాగా చూసుకుంటాను అని రాత్రి చెప్పినాడు తెల్లారేపాటికి వురికి వేలాడాడు. మా అత్తముండ మాటలే దానికి కారణం. మీ ఆవిడ పుట్టింటికిపోయి మూడు నెలలు అయితే కడుపెట్టా వచ్చిందిరా అందంట. మనసు ఇరిసేసుకుని వురి యేసుకున్నాడు. ఆ పిల్లయినా అలిగి ఇక్కడి నుండి పోయేటప్పటికే నెలసరి నిలిచిపోయిందని చెప్పొద్దా. కూతురు మాటలు కొడుకు చావు ఇన్ని తట్టుకుని మొండిగా బతకపోతే ఏమైంది.. రోడ్డు మధ్యలో నిలబడితే ఒక్క క్షణంలో చచ్చిపోయే. నా కూతురికి రెండు లచ్చలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిపడతాయి" అంది వేదనగా.
చెప్పలేని జాలి ముంచుకొచ్చింది నారాయణమ్మ మీద ."అలాంటి పిచ్చి పనులు,ఆలోచనలు చేయకు. ఒక ముద్ద తిని ఇక్కడే పడుకో ..ఇవాళ ఇంటికి వెళ్లొద్దు" అన్నా.
"ఈ మాత్రం వాటికే చచ్చిపోతే ఎట్టాగమ్మా! ఎక్కడ ఓడిపోయినా జీయితం ముందు ఓడిపోకూడదమ్మా జీయితం గెలవాలి "అంది దృఢంగా అన్నం తిని కాసేపు టీవీ చూసి ఆ మాట ఈ మాట చెపుతూ కాస్త మామూలు మనిషైపోయింది. సాయంత్రమయ్యాక "పనికెళ్ళి ఇంటికిపోయి ఒంటికి కాసిని నీళ్లోసుకుని మళ్ళీ ఇక్కడికే వస్తా" అంది.
"సరే మరి, నీక్కూడా వండేస్తా ఇక్కడే తిను" అని చెప్పి నేనూ పనిమీద బయటపడ్డాను.
రాత్రి అన్నం తిన్నాక నన్ను మెచ్చుకోవడంతో మాటలు మొదలెట్టింది
చెపితేనే వింటావు. మారు ప్రశ్న కూడా వేయవు. ఏళ్ళ తరబడి చూత్తన్నా. నీ కథ ఏంటని అడిగావా ఒక్కసారైనా. ఈ మాట నేను ఎంత మందికి చెప్పి ఉంటానో. ఆమె ఎవరి గురించి పట్టించుకోదు. ఆమె వుద్యోగం ఏమిటో ఆమె ఏమిటో. అంతే తప్ప ఎవరి గురించి ఒక్క మాట మాట్టాడదు. అవసరమైతే సాయం చేసుడు తప్ప. అంది.
"చెప్పాలనుకుంటే నువ్వే చెపుతావు కదా ! ఎదుటిమనిషిని బాధ పెట్టేటట్లు కూపీలు లాగడం గూఢచారి పనిచేయడం నావల్ల కాదులే!"
ఒక కాగితం నా చేతికిచ్చి "ఈ నెంబర్ కి ఫోన్ చేసి పని చేస్తందో లేదో చూడమ్మా. వాళ్ళు ఎత్తితే ఎదో నెంబర్ తప్పు కొట్టానని చెప్పి పెట్టెయ్" అంది.
"ఎవరి నెంబరు ఇది" అనంటే "ఎవరిదో కాదులే, మా పెద్ద తమ్ముడి నెంబర్ అది" అంది. ఆ నెంబర్ కి కాల్చే స్తే రెండో రింగ్ కి లిఫ్ట్ చేసి మాట్లాడితే రాంగ్ నెంబర్ అని కట్ చేసుకుని.. "మీ తమ్ముడు మాట్లాడాడు కదా" అన్నాను.
"నా నెంబర్ రాకుండా చేసేసినాడు దొంగ నా కొడుకు. ఎన్ని డబ్బులు ఇచ్చానో. బోట్ కొనుక్కోమని. వడ్డీతో సహా ఇచ్చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇప్పుడు పెళ్ళాం చాటు మొగుడు అయిపోయాడు. మా నాయన చచ్చిపోయినప్పుడు దినానికి డబ్బులిచ్చాను. మా మరిది చచ్చిపోతే శవం ఎత్తేయడానికి లేకపోతే డబ్బులిచ్చాను. రేషన్ బియ్యం తప్ప ఒక్క వెచ్చాము కొనింది లేదు. ఆ అమ్మ పెట్టిన సద్దికూడు ఇంకో అమ్మ పెట్టిన కూర తిని సొమ్మంతా కూడబెట్టి ఈళ్ళకి యిచ్చాను చూడు. నన్ను చెప్పుదీసుకుని నేనే కొట్టుకోవాలి" అంది.
"ఎందుకలా ఇస్తావ్. బ్యాంకులో వేసుకుంటావ్ కదా ! అలాగే వేసుకో. ఇకమీదట యెవరిని నమ్మబాకు."
"గట్టిగా ఉండాలనుకుంటాను కానీ అయినవాళ్లు కష్టాలలో వుండారనుకుంటే కరిగిపోతాను" అంది. "పడుకోమ్మా ఇక, ఎంత చెప్పినా నా బాధ తీరేది కాదు. మళ్ళీ మీకు చెప్పి మీ మనసు బాధపెట్టడం "అంటూ ఆ రోజుకి మాటలు ముగించేసింది.
మిగతా కథ యెప్పుడు చెపుతుందా అని నేను గుంభనంగా ఎదురుచూస్తూ వున్నాను.
ఒకరోజు మ్యాట్నీ సినిమా చూసి ఇంటికి వెళ్ళకుండా నేరుగా మా ఇంటికి వచ్చేసింది. చాలా హుషారుగా చూసిన సినిమాలో పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా "ఇయ్యాల అతని గురించి చెప్పేయాలి నీకు. ముందు కాసిని టీ పెట్టి ఇవ్వు "అంది.
"టీ లంచం ఇస్తేనే గాని చెప్పవా యేమిటి" అని హాస్యమాడాను.
"నేను చెప్పిన కథ యిన్నావనుకో కథ రాసేయగలవు "అంది. నేను నవ్వుకుని అల్లం దాల్చిన చెక్క యాలకులపొడి వేసి మంచి టీ చేసి యిచ్చాను. త్రాగుతూ చెప్పుకుపోతుంది.
"ఆయాల తీరాన ఎదురెదురు వెళ్ళి అతన్ని నిలబెట్టేసి అలా అడిగానా ? అతను ఆశ్చర్యంగా చూసి ఎందుకు తీసుకుపోవాలి నిన్ను" అని అడిగాడు. "నాకు చిన్నప్పుడు నుండి నువ్వంటే నాకిష్టం" అని చెప్పా. నిజంగానే నాకు చానా యిష్టం అతనంటే. నొక్కులఁ జుట్టు,గడ్డం నొక్కు నవ్వుతున్న కళ్ళతో ఇంగిలాయి ముల్లుతో గుచ్చినట్టు చూపులతో మనసుని గుచ్చి చంపుతూ భలే అందంగా వుంటాడనుకో.తర్వాత ఏమన్నాడో ఇనుకో సరే .. రాత్రికి చెపుతాలే ఏ సంగంతి. నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు.
నా ముఖంలో ఆసక్తి కనబడకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అరమారలో సామాను తీసి తుడిచే పని పెట్టుకున్నాను
"ఆ రోజు వూరికెళ్ళిన అత్తా మొగుడు రాకూడని వేయి దేవుళ్ళకి మొక్కుకున్నా. పదకొండు గంటలకి వచ్చి తలుపు తట్టాడు. పిల్లలను వొదిలేసి అతని వెంట నడిచా. పుంతలోకి నడుచుకుంటూ వెళ్లాం.ఆ రోజు పొర్ణమి. నల్లవావిలి పూత పొలపం చుట్టుకుంటునట్టే అతను నన్ను చుట్టేశాడు. ఆనాడు అతనితో వుందే నా జీయితం. వాడు తప్ప నా మనసుకి దగ్గరగా వచ్చినోడే లేడు. అట్టా అప్పుడప్పుడు కలుసుకుంటా వుండేవారిమీ. ఒకటి రెండుసార్లు మా ఊరివాళ్ల కళ్ళల్లో పడ్డాం కూడా. మొగుడితో ఇరగ గొట్టించుకోవడం సంగతి మామూలైపోయింది.
ఓసి నీ దైర్యం కూలా .. అందుకే అన్నారు కాబోలు ఇష్టపడిన మగాడి కోసం ఆడది అర్ధరాత్రి నదిని కూడా అవలీలగా దాటుతుంది అని" మనసులో అనుకున్నాను
చెప్పడం కొనసాగించింది "ఈ మొగుడు సంసారం నాకొద్దు నన్ను దూరంగా తీసుకో అని అడగడం మొదలెట్టా. అట్టాగే అన్నాడతను. ఇద్దరం వూళ్ళో కనబడకపోతే నా మీదే అనుమానం వస్తది. ముందు నువ్వు విశాఖపట్నం పో. అక్కడ స్టేషన్కి వచ్చి నా స్నేహితుడు నిన్ను తీసుకుని పోతాడు. అక్కడే ఇల్లు కూడా చూసి పెడతాడు, నేను కొన్నాలు పోయాక ఉద్యోగం కోసం పోతున్నా అని చెప్పి నీ దగ్గరికి వస్తా. బతకగల్గితే అక్కడే బతుకుదాం లేకుంటే వేరే చోటుకి పోదాం అన్నాడు. సరేనని ఇంటికి పోయి నాలుగు చీరలు సర్ది పెట్టుకున్నాను. అర్ధరాత్రి పూట మా ఊరి గుడి దగ్గరకు ఆటో వచ్చి ఆగింది. అదెక్కి కూర్చుంటే పొన్నూరు స్టేషన్ కాడ దించాడు. రైలెక్కి విశాఖపట్నంలో దిగి అతని స్నేహితుని కోసం ఎదురు చూసా. అతను నన్ను గుర్తుపట్టడం ఎట్టా అనే సంగతి మర్చిపోయా. అతనేమో వెతుక్కుని వెతుక్కుని ఇంటికి ఎల్లిపోయాడంట. అని అక్కడికి ఆపి కాసిని నీళ్ళు తాగింది.
నాకు టెన్షన్ పెరిగిపోతుంది ..కథ చెప్పడం ఆపేస్తుందేమో అని.
పమిటచెంగుతో ముఖం తుడుచుకుని మళ్ళీ చెప్పడం మొదలెట్టింది "అడ్రెస్స్ కాగితం చూపిచ్చి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటా పోతన్నా. రోడ్డు దాటుతుంటే ఓ మోటార్ సైకిల్ వాడు గుద్దేసి పొతే చెయ్యి ఇరిగిపోయింది. అతని స్నేహితుడు వాళ్ళమ్మ హాస్పిటల్ కి తీసుకుపోయి కట్టుకట్టించి నెలరోజులు బాగా చూసారు. ఆఖరికి ఒక రోజు బాధపడుతూ చెప్పలేక చెప్పలేక చెప్పారు. నేను ఇల్లు విడిచిపెట్టి వొచ్చేసాక మా వాళ్ళందరూ వెళ్లి అతనింటి మీద పడ్డారంట. అతను నాకు తెలియదు అని చెప్పినా వినలేదంట. వొదిలిపెట్టలేదు అంట. చేనుకి యెల్లి చీకటి పడ్డాక ఇంటికి వొస్తుంటే మాటేసి నలుగురు ముసుగేసుకున్న మనుషులు మీదపడి కొట్టి చంపేశారంట. అట్టా నామూలంగా అతను నాశనం అయిపోయాడు. తల్చుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తాను. నేనెందుకు అట్టా తెగబడాలి? అప్పుడే యే గన్నేరు పప్పు తింటేనో నా బాధలు ఇరగడయ్యిపోయేయిగా. ఏమి యెరగని అతన్ని నాశనం చేసేసినాను అని కుమిలి కుమిలి యేడుస్తాను. నావాళ్లు అంటూ యెవరూ లేకుండా ఐదారేళ్ళు గట్టిగానే ఉండాను. మానాయనను చూడాలనిపోయి నా ఆచూకీ చెప్పి తిప్పలు తెచ్చుకున్నా. కష్టపడి నాలుగిళ్ళల్లో పనిచేసుకుని సంపాదించుకోవడమే తప్ప ఏ మొగ పురుగుని దగ్గరికి రానీయలేదు" అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ భారంగా.
"నువ్వు చెప్పిందంతా ప్రేమంటావా?" ఎంత వద్దనుకున్నా నామాటల్లో కఠినం.
"ప్రేమో కామమో ఆయన్నీనాకు తెలియదు. ప్రేమంటే ఈడుకి సంబంధం లేదు. ఈడు జారిపోయాక ఆ ప్రేమ కూడా వానకి తడిసిన ఆకు మీద మురికిలా కారిపోతుందంటే నేను వొప్పుకోను. చిన్నప్పుడు నుండి అతను నా మనసులో వుండాడు. నా మనసుదాకా వొచ్చినాడు నా వొళ్ళంతా కమ్ముకున్నఅతనొక్కడే, అదంతా కాదుకానీ బాగా అర్ధమయ్యేలాగా చెపుతా ఇనుకో, నా కాలి చిటికెనేలు గోరు నుండి నా తల్లో వెంట్రుక చివరిదాకా నిండి వున్నోడు నేను చచ్చేదాకా నాతో వుండేవాడు అతను ఒక్కడే. పెపంచమంతా వందనుకోనీ వెయ్యి రాళ్ళేయనీ.. అతనే నా దృష్టిలో మగోడు. అతనే నా మొగుడు" అంది.
నారాయణమ్మ వైపు అయోమయంగా చూసాను.ఒకచోట దొరకనిది ఇంకొకచోట దొరుకుతుందని భ్రాంతి పడటం కూడా కాదిది. కేవలం మోహపడి బిడ్డలను ఇంటిని వొదిలేసి వచ్చేసింది. తెగింపు వున్న స్త్రీ ఏదోవొకనాడు భర్త అనుమానాన్ని నిజం చేసి తీరుతుంది అన్నట్టుగా నడుచుకొంది. ఇలాంటి స్త్రీలను లోకమే కాదు నేను కూడా హర్షించలేనేమో! అయిష్టాన్నిఆమెపై ఏర్పడిన వ్యతిరేకతను ముఖంపై కనబడనీయకుండా "అతని పేరు ఏమిటి" అనడిగితే "చెప్పను" అంది. "అతనెప్పుడు నా ఎద ఊయల పై ఊగుతూనే ఉంటాడు. మనసు నెమ్మదిగా వున్నప్పుడు నీట చిత్తరువులా కనబడతానే ఉంటాడు" అంది మైమరుపుగా. ఆ క్షణంలో నారాయణమ్మ గొప్ప జ్ఞాన వంతురాలిలా మట్లాడి నన్ను అమితంగా ఆశ్చర్య పరిచింది
నీ ప్రేమ పిచ్చి పాడుగాను గొప్ప సాహసం చేసేవు అని మనసులో అనుకుని "మొత్తానికి మంచి కథ చెప్పేవ్" అన్నాను.
"జీయితంలో వున్న కథలు సినిమాల్లో కానీ కథల పుస్తకాల్లో కానీ వుంటాయేంటి? ఇక నేను ఇంటికి పోతాను. మనస్సుకి తృప్తిగా వుంది ఈ రోజు" అంటూ తేట ముఖంతో చెప్పలేని బరువునేదో నామీద వదిలేసి వెళ్ళిపోయింది. అనవసరంగా అతను అన్యాయం అయిపోయాడే అని ఉసూరుమని నిట్టూర్చాను.
కొన్నాళ్ళ తర్వాత కొలీగ్స్ తో కలిసి పోలవరం డామ్ నిర్మాణం చూడటానికి వెళ్ళాను. అక్కడ నారాయణమ్మని తీసుకొచ్చి పనికి కుదిర్చిన అప్పటి ఎదురింటి ఆమె కనబడింది.వాళ్ళు చాలా యేళ్ళ క్రితమే విజయవాడకి మారిపోయారు. కుశల ప్రశ్నలు అయ్యాక నారాయణమ్మ పని చేస్తుందా ఇంకా అని అడిగింది. మధ్య మధ్యన మానేస్తూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది. బాగుందా అంటే బాగానే వుంది అని చెప్పవచ్చు. మొన్నే తన కథ చెప్పింది. పాపం .. అతను మీ అబ్బాయి స్నేహితుడు అంటగా అని అడిగా.
"అవునండీ. పాపం అంటున్నారు.అతను చచ్చిపోయాడని చెప్పిందా యేంటీ? అతనికి యేమీ అవలేదండీ. అతన్ని కొట్టడమైతే కొట్టారు కానీ సమయానికి ఎవరో చూసి హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు.అతనే చెప్పాడు అప్పుడలా చెప్పమని. గొప్పింటి పిల్లాడు. అందర్నీ వొదులుకుని యీమెకోసం వస్తాడా యేంటీ? తర్వాత నారాయణమ్మకి తెలిసి వుంటుంది లెండి . వాళ్ళ వాళ్ళెవరూ చెప్పకుండా వుంటారా ? "అంది.
"అతనిప్పుడెక్కడ వున్నాడు" బ్రతికే వున్నాడన్న వార్త విన్న సంతోషంలో ఆతృతగా అడిగేసాను.
"విదేశంలో వున్నాడు. చక్కని భార్య,పిల్లలిద్దరు, మంచి వుద్యోగం". నేను నిర్ఘాంతపోయాను.
తిరిగి వస్తూ దారంతా నారాయణమ్మ ఎందుకలా చెప్పిందా అని ఆలోచిస్తూనే వున్నాను. నిజంగానే అతను బ్రతికి వున్నాడని తెలియకుండా ఉండటానికి అవకాశం తక్కువ. అతనికి నారాయణమ్మ పట్ల వుంది కేవలం జాలి లేదా ప్రేమ లేకపోతే అందొచ్చిన అవకాశమా? దొంగాట ఆడాడేమో! అసలు నారాయణమ్మ ఆ ఒక్క విషయం గురించి నిజమే చెప్పిందా? అసలు నేనెందుకు యిలా ఆలోచించాలి ? నేనూ నమూనా యేనా ? తల పగిలిపోయే ప్రశ్నలు. నారాయణమ్మ ఏం చెప్పింది.అతనొక నీట చిత్తరువు అనే కదా చెప్పింది. అదే నిజం. నీళ్లు కదిలితే కరిగిపోయే చిత్రం. ఎంత బాగా చెప్పింది దొంగ మొహంది అని మురిపెంగా తిట్టుకున్నా.
ఆఖరికి ఒకటనిపించింది కొందరికి అనుభవించడం కన్నా వూహించుకోవడంలో ఎక్కువ ఆనందం అని. అనుభవంలోకి రానిదాన్ని నిర్ధాక్షిణ్యంగా చంపడానికి కూడా వెనుకాడరని. అలా అనుకున్నాక మనసుకి తృప్తి కల్గింది. రాజమండ్రిలో టీ త్రాగడానికి బస్ ఆపినప్పుడు అక్కడొక పిల్లాడు అమ్ముతున్న పుస్తకాలలో పొడుపు కథల పుస్తకం కనబడగానే వెంటనే కొనుక్కున్నాను. ఇష్టపడి కష్టం అనుకోకుండా జీవితం గెల్చిన నారాయణమ్మ ముందు ఈసారి పొడుపు కథ విప్పలేక ఓడిపోకూడదని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి