23, ఏప్రిల్ 2024, మంగళవారం

ఆనందమానందమాయే!


Blessed with Baby Girl. I became a grandmother, one more time.

 చైత్ర శుద్ద చతుర్దశి చందమామ.. మా ఇంట్లో ఉదయించింది. April 22 ధరిత్రి దినోత్సవం కూడా కదా! 😍❤️❤️

ఈ రోజు నేను తీసిన చిత్రం యిది. 


మనవరాలితో నా సంభాషణ. ఆమె అప్పటికి పెద్ద మనవరాలిగా  పిలవబడలేదు. 😊

నాయనమ్మ: బంగారు తల్లీ! నువ్వు ఇక స్కూల్ కి వెళ్ళాలి కదా! 

మనమరాలు: నువ్వు నా హ్యాపీ బర్త్ డే కి రా.. నాయనమ్మా! 

నాయనమ్మ: ఇప్పుడు రాలేనమ్మా.. నెక్స్ట్ బర్త్ డే కి వస్తాను. అప్పుడు చెల్లి బర్త్ డే కూడా వస్తుంది కదా! 

మనవరాలు: కాదు నాయనమ్మా! నువ్విప్పుడే రావాలి. 

నాయనమ్మ: లేదు బంగారు తల్లీ! మీ దేశం వాడు నన్ను యిప్పుడు రానీయడు. అది సరే కానీ, నీకు చెల్లి పుడుతుంది కదా! నా కివ్వు అమ్మా! చెల్లి ని నేను పెంచుకుంటాను.

మనవరాలు: అయిష్టంగా చూసింది. కాసేపు ఆలోచించింది. తర్వాత “ఇట్స్ మై ఓన్” నేను ఇవ్వను నీకు. 

నాయనమ్మ: నవ్వుకుంది. కాదమ్మా.. చెల్లి ని నాకివ్వు తల్లీ, నేను పెంచుకుంటాను. నీకు హాలిడేస్ వచ్చేసరికి తీసుకొస్తాను.

మనవరాలు: నేనూ, నాన్న నీదగ్గరికి ఇండియా వస్తాం. నీ దగ్గర నేను వుంటానే, సరేనా! 

నాయనమ్మ: నవ్వుకుంది. ఇంకా తను చూడని తన చెల్లి పై ఎంత ప్రేమ. తన చెల్లి ని ఇవ్వడానికి యిష్టపడటం లేదు. అలాగే నాయనమ్మ ను నిరాశపర్చడం యిష్టం లేదు. 

ఎంత సున్నితంగా సముదాయింపుగా చెప్పింది. ఒక విధంగా నాయనమ్మ కి నిరాశ ని పోగొట్టింది. తన మాటలతో ఉపశమనం కల్గించింది. బంగారు తల్లి, లవ్ లీ గర్ల్, విశాల హృదయం. నాయనమ్మ మనవరాలిని మనసారా దీవించింది. చల్లగా వుండు తల్లీ!  అని. 

నా కొడుకు కోడలి ని ..చక్కని కుటుంబంతో  చల్లగా వర్ధిలండీ అని ఆశీర్వదిస్తూ.. 

ఎవరికైనా ఒకే ఒక్క సంతానం వుండకూడదు. వారు వొంటరిగా వుండటం వల్ల యితరులతో పంచుకోవడం అస్సలు తెలియదు. అడగక ముందే అన్నీ కొని యిచ్చే తల్లిదండ్రులు నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యల ప్రేమ గారాబం, అతి శ్రద్ధ వల్ల.. వాళ్ళు స్వార్ధపరులుగా పెరగడానికి మారడానికి అవకాశం వుంది. ఆఖరికి వాళ్ళు 

యేదైనా సరే తల్లిదండ్రులతో కూడా పంచుకోవడానికి యిష్టపడరు. అందుకే వొకరితో చాలు అనుకోకుండా యిద్దరు ముగ్గురు పిల్లలు వుండటం పిల్లల మానసిక ఆరోగ్యానికి మంచిది. కుటుంబంలో అనుబంధానికి పెద్ద పీట వేసినట్లే! ఇప్పటి తల్లిదండ్రులు చాలామంది ఆలోచించాల్సిన విషయం యిది. 

2024 ఏఫ్రియల్ 22 ✍️ 


18, ఏప్రిల్ 2024, గురువారం

నాన్న వదిలేసిన ఆ చేతి ముద్రలు

_A heart touching story _


 *నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు:*

*నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నయ్…*

 నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది… 

గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది… 

తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి…

నా భార్యకు అది చిరాకు.తరచూ నాతో చెబుతోంది.గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్.

ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు.అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద.

నా భార్య నామీద అరిచింది.

నేనూ సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను.”నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు” అని గట్టిగా కేకలేశాను.

గాయపడ్డట్టుగా తన కళ్లు… నావైపు అదోలా చూశాడు… 

నాకే సిగ్గనిపించింది… ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు…

ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను… 

ఓరోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు… 

మంచం మీద పడిపోయాడు… తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు… 

నాలో అదే దోషభావన… 

ఆరోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది… 

నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా…

కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం… 

పెయింటర్స్ వచ్చారు… 

తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు… అరిచాడు…

ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా… 

“మీ తాత చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్లు గీసి, డిజైన్లు వేసి, ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం”సరేనా అని సముదాయించారు…

అలాగే చేశారు… 

ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం… 

ఆ డిజైన్ను మా ఇంటికొచ్చినవాళ్లు అభినందించేవాళ్లు… 

వాళ్లకు అసలు కథ తెలియదు… తెలిస్తే నన్ను ఎంత అసహ్యించుకునేవాళ్లో…!

కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది… 

నాకూ వయస్సు మీద పడింది… శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు… 

నాకిప్పుడు అదే గోడ ఆసరా కావల్సి వస్తోంది… 

నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది…

ఎందుకనిపించిందో తెలియదు, గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను… 

ఓరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు, నా భుజాలు పట్టుకున్నాడు… “నాన్నా! గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతవ్” అని మందలించాడు…

మనవరాలు వచ్చింది, “నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా”అంది ప్రేమగా… 

నాలో దుఖం పొంగుకొచ్చింది… అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు, అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు… 

నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ…

నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది… తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది… 

గదిలోని గోడ మీద నాన్న చేతిముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది… 

టీచర్ బాగా అభినందించిందని చెప్పింది… ‘పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి’ అని రాసిందామె ఆ స్కెచ్ మీద…

నా గదిలోకి వచ్చి పడుకున్నానుమౌనంగా రోదిస్తున్నాను… నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను… 

తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది… ఏమో… తరువాత ఏమైందో నాకు తెలియదు… నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది.






16, ఏప్రిల్ 2024, మంగళవారం

మా..కృష్ణాజిల్లా వాళ్ళంటే…

 ఒక మధ్యతరగతి కుటుంబం. తల్లి తండ్రి కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు అందరూ కలసి జీవిస్తున్నారు. తల్లిదండ్రులు వృద్దులైపోయారు. ఒంట్లో ఓపిక సన్నగిల్లింది. అయినప్పటికి ఏదో ఒక పని చేసి కొడుకుకి ఇతోధికంగా సహాయపడాలనే తాపత్రయంతో వుంటారు ఇద్దరూ కూడా! కొడుకు ఒక ప్యాక్టరీ లో టెక్నీషియన్ గా  చిన్న ఉద్యోగం చేస్తూ వుంటే కోడలు కూడా ఓ పచ్చళ్ళ తయారీ కేంద్రంలో గంటల లెక్కన పనిచేస్తూ.. చన్నీళ్ళకు వేణ్ణీళ్ళు తోడు అన్నట్లుగా పొదుపుగా గుట్టుగా జీవనం సాగిస్తూ వున్నారు. తండ్రి అనారోగ్యంతో వుండగా అతనికి హాస్ఫిటల్ మెడికల్ ఖర్చులకు చాలా ఖర్చు చేయాల్సివస్తుంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సరైన పోషకాహారం కూడా తీసుకోని పరిస్థితులు నెలకొనివుంటాయి. 

ఉదయాన్నే అర లీటరు పాలు తీసుకుంటే పెరిగే పిల్లలకు ఇవ్వాలా అనారోగ్యంతో వున్న వృద్ధులైన తల్లిదండ్రులకు ఇవ్వాలా అనే  సంశయంతో ఆ కొడుకు నలిగిపోతూ వుంటాడు. సాయంత్రం ఇంకో అర లీటరు పాలు కొని మజ్జిగ అవసరాలకు వాడుకుంటూ వుంటారు. భర్త అసహాయతను అర్ధం చేసుకున్న భార్య కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె కొంత చురుకుగా తెలివిగా ఆలోచించింది. ఉదయం పాలు రాగానే అందులో నుండి పావు వంతు పాలు చేసి ఆ పావు వంతు నీళ్ళు కలిపి కాచి పిల్లలకు ఇచ్చింది. ఆ పావు వంతు పాలతో ఇంకో రెండు పావులు నీళ్ళు కలిపి తేయాకు పుదీనా అల్లం వేసి మంచి టీ తయారుచేసి అత్తమామలకు ఇచ్చింది. 

మర్నాడు కొడుకు అదనంగా మరొక పేకెట్ పాలు తీసుకువచ్చి  తల్లితండ్రులకి కూడా పాలు ఇవ్వమని చెబుతాడు భార్యకు. భర్త ఫ్యాక్టరీ నుండి కొంత దూరం స్నేహితుల బైక్ ఎక్కి కొంత దూరం నడిచి వచ్చి ఆ డబ్బుతో పాల పేకెట్ తెచ్చినట్లు తెలుసుకుంటుంది.  కొడుకు చేస్తున్న ఆ పనికి తల్లిదండ్రులు చింతించారు. పాలు తాగితే అజీర్తిగా వుందని పాలు తాగమని గట్టిగా చెప్పేసారు. ఇంకా కోడలు చేసే తేనీరు చాలా నచ్చిందని చెప్పారు. తల్లిదండ్రుల మాటలకు కొడుకు కొంత తెరిపిన పడ్డాడు.

కోడలు ఆలోచిస్తుంది.  పాలు పోషకాహారమే కానీ చాలా ఆహారపదార్థాల లో కన్నా పాలల్లో పోషక విలువలు లేవని చదివి తెలుసుకుంది కాబట్టి.. 5 అరలీటర్ల పాలు కొనడం బదులు అదే ఖర్చుతో కేజీ నువ్వులు కేజీ బెల్లం కొని తెచ్చి.. నువ్వులు మంచి సువాసన వచ్చేదాకా వేయించి బెల్లం వేసి రోట్లో  దంచి  ఉండలు చేసి పిల్లలకు అత్తమామలకు ఇవ్వడం మొదలెట్టింది. ప్రతి రోజూ కోడలు చేసిన హెర్బల్ తేనీరు తాగ్రుతూ.. ఉత్సాహంగా వుంటున్నారు.  నువ్వు వుండలు తినడం వల్ల శరీరానికి కాల్షియం ఐరన్ లభించడంతో వృద్దుడైన తండ్రికి. కొంచెం ఓపిక వచ్చింది కూడా. 

కొడుకు తన ముందున్న  సమస్య తీరినందుకు సంతోషపడ్డాడు.   భార్య వివేకంగా పొదుపుగా సంసారాన్ని నడుపుకుని రావడం చూసి చాలా అభినందించాడు. నేను ఎక్కువ సంపాదించడం లేదని అసమర్థుడిని అనుకోకు. నిజాయితీ వున్నవాళ్ళు అడ్డదారులు తొక్కలేరు. అప్పులు ఎగకొట్టలేరు. నా సామర్థ్యం ఇంతే! అని చెప్పాడు.  నా తల్లిదండ్రులను బాగా చూసుకోగల్గిన మంచిమనసు వున్న వివేకవతివైన భార్య వి నువ్వు నాకు లభించడమే నా అదృష్టం. నేను ఇంకో చిన్న ఉద్యోగం చేయడానికి కష్టపడతాను అని భార్యకు మాట ఇచ్చాడు. 

  ఇక్కడ ఈ వాస్తవ కథలో  చెప్పిన విషయం మాములుగా వుండే విషయం కావచ్చు. కానీ ఇక్కడ ఆ ఇల్లాలిలో కనబడిన వివేకం తన భర్తని సంక్షోభంలో నుండి గట్టెక్కించింది అని తెలుసుకోవాలి. 

మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ వుండేవే! భర్త ఆర్థిక పరిస్థితిని బట్టి భార్య సహకరించడం నేర్చుకోవాలి. కుటుంబ నిర్వహణ ఖర్చులను లెక్కించుకోవడం, అనవసరమైన వస్తువులు,  ఎక్కువ బట్టలు కొనకుండా వుండటం నగ నట్రా కొనకుండా వుండటం, బంధువులకు మిత్రులకు ఎక్కువ రోజులు ఆశ్రయం ఇవ్వకుండా వుండటం వివేకవంతమైన ఆలోచన. బంధుమిత్రులు పడిమేసిన ఇల్లు గుల్ల అది ఏనాటికి కోలుకోలేదు  అని పెద్దలు సామెత చెప్పారు. అది నిజం కూడా.  అలాగే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనవసరమైన వేడుకలు నిర్వహించకుండా అప్పుల పాలవకుండా జాగ్రత్త పడటం మరీ అవసరం. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసంతృప్తి తప్ప ఏమీ వుండదు. 

ఎంత సంపాదించారు అన్నది కాకుండా ఎంత ఖర్చును అదుపులో వుంచితే అంత అప్పుల పాలు కాకుండా వుండగలుగుతారు అని తెలుసుకోవాలి. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా కాళ్ళు వెళ్ళకూడదు. అప్పుల్లో పుట్టి అప్పుల్లోనే జీవితాంతం బతికే పరిస్థితి తెచ్చుకోకూడదు. చిన్న సంసారం చింతలు లేకుండా వుండాలంటే కొంత ప్లానింగ్ గా ముందుకు వెళ్ళడం కొంత సర్ధుబాటు, కొంత త్యాగం అవసరం.  మధ్యతరగతి మందహాసంలో ఎన్నో అణచివేతలు వుంటాయి. అవి ప్రతి ఇల్లాలికి అనుభవం లోకి వచ్చేవే! కోరికలే గుర్రాలైతే కాళ్ళు విరగడం కూలబడటం మాత్రం  ఖాయం. అందలాలకు అర్రులు చాచటం వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు. భర్తలకు భార్యలు సహకరిస్తే కుటుంబం శాంతిగా వుంటుంది. సర్ధుబాటు చేసుకోవడం సాధ్యాసాధ్యాలు అంచనా వేయడం వలన  ఎవరి జీవితమైనా ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. 

ఇంతకీ చెప్పోచ్చేది ఏమిటంటే.. ఈ పై కథలో చెప్పినట్లు.. మా కృష్ణాజిల్లా ఇల్లాళ్లు వివేకవంతులు ముందు చూపు వున్నవారు. పెరట్లో కాయించిన కూరగాయలు తిని అవి లేకపోతే జాడీ కూరలు తిని పాలు పెరుగు నెయ్యి అమ్మి మజ్జిగ తాగి సాదా కాటన్ చీరలు కట్టుకుని సింపుల్ గా బతుకుతూ..వుండేవారు. వీరే ఎక్కడైనా పెండ్లిపేరంటాలకు హాజరైతే వొంటినిండా నగలు పెద్ద అంచు పట్టుచీరలతో ధగధగలాడిపోతూవుంటారు. వారి పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయి వుంటారు. అదీ మా ఇల్లాళ్ల ముందు చూపు. 

మా కృష్ణాజిల్లా వాళ్ళు అంటే.. 

“పక్కింట్లో పెళ్ళి అయితే బంధువుల్లో ఎవరిదో ఒకరిది పట్టుచీర అడిగి తెచ్చుకుని దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టించుకుని విజయా బ్యాంగిల్ స్టోర్ లో అద్దె నగలు తెచ్చుకుని డంబాసారం ప్రదర్శించే వాళ్ళు కాదబ్బా.. “ అనేది మా పెద్దమ్మ. 

ఓ భుజాలు తడుముకోకండి.. 🤣🤣 విజయా బ్యాంగిల్ స్టోర్స్ ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం 😊👍




12, ఏప్రిల్ 2024, శుక్రవారం

వీధి దీపం

 వీధి దీపం

కార్తీకంలో వేలాడదీసిన ఆకాశదీపంలా వీధి దీపం. 

వొంటి స్తంభం గాజు మేడలో నుండి కాంతులు విరజిమ్ముతూ ఆవురావురుమంటూ చీకటిని భక్షిస్తుంది 

పార్క్ లో ఆడి అలసి ఇంటికి పోయే పిల్లలందరికి తోవంతా వెలుగు పంచుతుంది 

కొత్త తావుకు పోతూ బాటను దాటుతున్న ఎరను ముక్కలైపోతావని హెచ్చరిస్తుంది

ముసురు పట్టిన వానలోనూ వానలా కురిసే మంచులోనూ తడిసి ముద్దైపోతూ 

అమవాస్య నాటి వెన్నెల దీపమౌతుంది

మైనస్ డిగ్రీల్లోనూ గడ్డ కడుతూ  తన విధిని మర్చిపోతానేమోనని రగిలిపోతూ జాగ్రత్త పడుతుంది. 

రహదారి మలుపులో నడిరాతిరి వొంటరిగా దిగాలుగా నిలబడి

ఆకురాలు కాలాన్ని  చూస్తూ  దీర్ఘ విషాదాన్ని మోస్తుంది పాపం!

వేకువనే హాయి గొలిపే పక్షుల సంగీతాన్ని మలయమారుతాలను  ఆస్వాదిస్తూ చిన్న కునుకుదీసిందేమో ఉదయపు నడకల సవ్వడి విని ఉలికిపడి మేల్కొంటుంది

సూర్యోదయ  సౌందర్యాన్ని వొంటరిగా జుర్రుకుని దిగ్విజయంగా తన పని నుండి నిష్క్రమింస్తుంది.   

విధి నిర్వహణలో తాను వొంటరి నని అనుకున్నప్పుడల్లా ఓ కాంతివలయం నన్ను చుట్టుకునే వుంటుందనే సృహ కల్గిన రాత్రి సూర్యుడు వీధి దీపం

మూడు కాలాల్ని ఆరు బుుతువులను నిశ్శబ్దంగా అనుభవించిన ఒంటరి భూ నక్షత్రం వీధి దీపం

 తనను చూసినప్పుడల్లా వొకటే తలపోస్తాను నేను

ప్రతి మనిషి వీధి దీపం లా  నిలబడకపోయినా  గూట్లో దీపంలా వెలుగునిస్తే చాలునని.

12/04/24.








10, ఏప్రిల్ 2024, బుధవారం

సామ్రాజ్ఞి

 


సామ్రాజ్ఞి - వనజ తాతినేని


“ఈ రోజేనా, మీ అత్తమామ వచ్చేది?” కూతురు ఉజ్వల ను అడిగింది తల్లి అరుణ. 


“అవునమ్మా! ఆర్నెల్లు వారిని భరించాలంటేనే భయమేస్తుంది. శ్రీకర్ కి తల్లిని చూస్తే చాలు.. ఆమెపై ప్రేమ వరద గోదావరిలా  పొంగుతుంది. ఆమేమో కొడుకు ఇద్దరు బిడ్డల తండ్రైనా ఇంకా పసివాడిలా చూస్తూ నోట్లో ముద్దలు పెడుతుంది. మా అమ్మ వస్తే నీకు వంట పని తప్పుతుంది. మా అమ్మ ఎంత బాగా వంట చేస్తుందో” అని ఊరిస్తున్నాడు.


“అంత ఆందోళన పడకు. అసలు ఆమెను వంటింటి వైపు రానీయకు, నీకు కష్టమైనా సరే ఉదయం టిఫిన్ వంట రెండూ అక్కడ చేసి పడేయ్. మీ అత్తగారి సంగతి నాకు బాగా తెలుసు.  వీలైనంతగా వాళ్ళను పట్టించుకోకు. అభిమానం దెబ్బతింటే వుండమన్నా వుండదు. నెలరోజులకల్లా తిరుగు ప్రయాణంలో వుంటారు” విష బోధ చేసింది కూతురికి. 


“ సరేనమ్మా,రోజూ ఇలా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడే కాల్ చేస్తాను,ఉంటా.. బై..”


శ్రీకర్ ది రిమోట్ జాబ్. మద్యాహ్నం మూడున్నరకు కమ్యూనిటీ బస్ స్టాప్ నుండి పిల్లలను ఇంటికి తెచ్చుకుని స్నాక్స్ ఇచ్చి..పిల్లలను తీసుకుని ఏర్పోర్ట్ కి బయలుదేరాడు. గంటకు పైగా ప్రయాణ దూరం. హెవీ ట్రాఫిక్. ఒక అరగంట ఆలస్యం అయ్యేటట్టుంది అనుకున్నాడు. రోజూ ఇలాంటి హెవీ ట్రాఫిక్ లో నుండే ఉజ్వల ఇంటికి రావాలి. పాపం అలసిపోతుంది. అమ్మ  వున్నన్నాళ్ళు వంట చేసే పని వుండదు. పిల్లలు నాన్నతో గడుపుతారు.. మా ఇద్దరికీ తీరిక దొరుకుతుంది. ఈ స్ప్రింగ్ అంతా హాయిగా గడిచిపోతుంది అనుకున్నాడు. సరళ శ్రీనివాస్  ఇమ్మిగ్రేషన్  ముగించుకుని లగేజ్  కలెక్ట్  చేసుకుని బయటకు వచ్చేసరికి శ్రీకర్ పిల్లలు కనబడ్డారు. మూడేళ్ళ తర్వాత కొడుకుని పిల్లలను చూడటం వారికి సంతోషం కల్గించింది. ఫారిన్ ట్రిప్ అదే తొలిసారి కావడం ముఫ్పై గంటలసేపు ప్రయాణం వల్ల  తల్లిదండ్రులు బాగా అలసిపోయారనిపించింది శ్రీకర్ కు. ఇంకో గంటన్నరకు ఇంటికి చేరుకున్నారు. ఉజ్వల ఇచ్చిన కాఫీ సేవించి ఇండియా నుంచి తెచ్చిన సరంజామా అన్నీ పరిచింది సరళ. బంగారు నగల బహుమానాలు పట్టు బట్టలు తీపి మిఠాయిలు పచ్చళ్ళు వడియాలు అన్నీ చూసి ఉజ్వల సంబరపడింది. 


అమ్మా! గోంగూర పచ్చడి ఉలవచారు ఓపెన్ చేసి అన్నం కలిపి పెట్టమ్మా.. అడిగాడు శ్రీకర్. సరళ తల్లి మనసు ఆర్ద్రమైంది.  వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసి  ముద్దలు చేసి కొడుక్కి పిల్లలకు తినిపించింది. నువ్వు కూడా తినమ్మా.. అని కోడలికి చేతిలో ముద్దలు పెట్టింది.     


 రెండు రోజుల తర్వాత ఆఫీస్ కి వెళ్ళివచ్చిన  ఉజ్వల ఇంట్లో అడుగు పెట్టేసరికి  వంటిల్లు ఘుమ ఘుమ లాడుతుంది. ఈవిడేదో వంటలు కానిచ్చినట్టు వుంది. నిజం చెప్పొద్దు నా వంటకు ఆ ప్లేవర్ రానేరాదు అని మనసులో అనుకుంటూ.. “ఏం చేసారత్తయ్యా” అని అడిగింది. “కొబ్బరి వేసి బెండకాయ వేపుడు, పప్పు చారు చేసానమ్మా. ప్రెష్ అయ్యి రా.. నువ్వు కూడా నాలుగు ముద్దలు తిని రెస్ట్ తీసుకుందువుగాని”.


ఉజ్వల మనసులో అనుకుంది.

“ఈమె ను వంటింటి జోలికి వెళ్లనివ్వకూడదని తను ఎంతగా ప్రయత్నిస్తుందో అంతగా అక్కడే పాతుకుపోతుంది.  శ్రీకర్  ఏమో “నీ హడావిడి వంట తిని జిహ్వ చచ్చిపోయింది. అమ్మ వున్నన్నిరోజులు ఆమె ను వంట చేయనీ” అని గట్టిగానే చెప్పాడు. 


ఉజ్వల   ప్రెష్ అయి  కిందకు వచ్చేసరికి సరళ పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తుంది. ఒళ్లు మండిపోయింది ఆమెకు. ఇదిగో ఇలా చేసే  కొడుకుతో పాటు పిల్లలను మాయలో పడేస్తుంది. నా పిల్లలు నాక్కాకుండా  చేసేస్తారు అని అతిగా ఊహించుకుంది.


“అత్తయ్యా! మీరిలా ప్రతిరోజూ చేత్తో ముద్దలు తినిపించడం అలవాటు చేస్తే.. అదే అలవాటుగా మారుతుంది. అలా చేయడం మాకు ఎక్కడ వీలవుతుంది? బౌల్ స్పూన్ ఇస్తే వాళ్ళే తినేస్తారు”అంది విసురుగా. 


సరళ చిన్నబోయింది. ప్లేట్ టేబుల్ పై పెట్టి బౌల్స్  తెచ్చి ప్లేట్ లో వున్న పదార్ధాలను అందులో వేసి  చెరో స్పూన్ ఇచ్చింది పిల్లలకు. 



మరొకరోజు ఉజ్వల వచ్చేసరికి పిల్లలు కిచెన్ సెట్ తో ఆడుకుంటూ మాట్లాడుకుంటున్నారు

“నానమ్మ పుడ్ చేస్తే యమ్మీ యమ్మీ.. గా వుంటాయి. నాకిష్టం అంది పాప. నాకు నానమ్మ చేసిన హాట్ డోనట్స్ ఇష్టం.. అన్నాడు బాబు. అవి డోనట్స్ కావు.. గారెలు అంటారట తాతయ్య చెప్పారు అంది  పాప. 


 “మీరు వడలు ఎప్పుడు తిన్నారు” ఉజ్వల ప్రశ్న.


“ఈ రోజు నానమ్మ చేసింది కదా, నీక్కూడా వుంచింది.తిను మమ్మీ” అంటూ హాట్ ప్యాక్ తీసుకొచ్చి ఇచ్చింది పాప. సింక్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కొని డైనింగ్ టేబుల్ పై గిన్నెలు తీసి చూసింది. చింతకాయ పచ్చడి, ఇడ్లీలకి దోసెలకు పిండి పల్లీలు వేసి చేసిన కొబ్బరి చట్నీ.. రెడీ గా వున్నాయి. హమ్మయ్య, నాకు వంట గదిలో పనేమీ లేదు. రిలాక్స్ అవ్వొచ్చు అనుకుని ప్లేట్ లో  వడలు పెట్టుకొని చట్నీ వేసుకుంటుండగా బ్యాక్ యార్డ్ లో నుండి శ్రీకర్ వచ్చి “గారెలు చాలా బాగున్నాయి, నేనూ గట్టిగానే లాగించాను”అన్నాడు. వొళ్ళు మండిపోయింది ఉత్పల కి. 


“వాములు తినే సోములకు  పచ్చగడ్డి ప్రసాదం అంట. నేను చేసే పన్నీరు బిర్యానీ నీ ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారు. నువ్వెప్పుడైనా మెచ్చుకున్నావా? ఎంతసేపు మా అమ్మ అంత బాగా చేస్తుంది ఇంత బాగా చేస్తుంది అని మెచ్చుకోవడమే తప్ప”


“ నువ్వు చేసే కేరెట్ హల్వా బాగుంటుంది పాలక్ పన్నీరు బాగుంటుంది అని ఎన్నిసార్లు కాంప్లిమెంట్ లు ఇవ్వలేదు. అంత ఉక్రోషం పనికిరాదు”అన్నాడు ఉడికిస్తున్నట్లు. 


గరాజ్ లో అత్తమామలు వాకింగ్ నుండి వచ్చిన శబ్దం వినబడి సైలెంట్ అయిపోయింది. 


“గారెలు వేడిగా వున్నాయో లేదో,చట్నీ వేసుకున్నావా అమ్మా” అడిగింది సరళ.


“వేడిగానే వున్నాయి అత్తయ్యా, చట్నీ కూడా వేసుకున్నాను. మమ్మీ లాగానే మీరూ గారెలు బాగా చేసారు, చాలా బాగున్నాయి అంటూ పోలిక తెచ్చి శ్రీకర్ వైపు చూసింది.

“అన్నట్టు మీ అబ్బాయి కి ఇష్టమని ఎక్కువగా గారెలు పకోడీ లు చేయకండి. శ్రీకర్ కి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా వుంది.మందులు కూడా వాడుతున్నారు. డీప్ ప్రై లు తగ్గించాను అందుకే” అంటూ మళ్ళీ శ్రీకర్ వైపు చూసింది ఎలా దెబ్బ కొట్టానో చూసావా.. అంటూ.


********


ఉజ్వల వంట తీరు చూస్తుంటే.. అమెరికా కొడుకు ఇంటికి వెళ్ళొచ్చిన తన స్నేహితురాలు వకుళ మాటలు గుర్తుకొస్తున్నాయి సరళకి. ఆమె రచయిత కూడానూ. మనుషులు మనస్తత్వాలను విడమర్చి  చెప్పింది


కొందరు వంట ఇష్టంగా చేస్తారు భర్తకు పిల్లలకు రుచికరంగా వడ్డించాలని. తామూ ఆహారాన్ని ఆస్వాదించాలని. మరికొందరు వంట ప్రేమతో చేస్తారు పిల్లలకు ఇష్టమైన పదార్ధాలని కొసరి కొసరి వడ్డించాలని. కొంతమంది బాధ్యతగా చేస్తారు.. అది వారి నిబద్ధత అని వేరే చెప్పనవసరం లేదు. చాలామంది మొక్కుబడిగా చేస్తారు.. రోజూ చేసే పనే పని అదేగా అన్నట్టు ఎక్కడ లేని విసుగుతో.  వంట చేసే అందరిలోనూ కనిపించే కోణాలు ఇవి. దీనికి ఎవరూ అతీతులు కారు. ఒక్కొక్కసారి వీరందరూ మనలో కూడా వుంటారు అంటూనే .. కోడలి గురించి మాములు అత్తగారిలా ఆరోపణలు చేసింది. 


 “నా కోడలు ఏదో మొక్కుబడిగా వంట చేస్తుంది. జాబ్ కూడా లేదు.  నన్ను వంటింట్లోకి రానివ్వదు. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ వంటిల్లుని నేను ఆక్రమించేసుకున్నాను అని చెబుతుంది.నేను పని చేయకుండా ఖాళీగా కూర్చోలేక కొంత, పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టాలని ఆత్రం కొంత తప్ప నాకు మాత్రం ఓపిక వుందా? పదేళ్ళు అయింది బిడ్డకి వండి పెట్టక.  అక్కడ వున్నన్నాళ్లైనా వాడికి ఇష్టమైనవి వండి పెట్టుకోవాలని అనుకుంటాం తప్ప భార్య చేతి వంట తిననివ్వకుండా వుండాలని కాదుగా. వారిని విడదీయాలని కాదుగా”అంది బాధగా. 


“అసలు వంటింటికి ఆడదానికి అవినాభావ సంబంధం వుంది అనుకుంటా. నాకైతే ఈ వంటిల్లు పీడ వొదిలిపోతే బాగుండును అనుకొంటాను. రోజూ చేసి చేసి మార్పు లేని జీవితం చూసి చూసి రోత పుట్టింది, నా వంటింటి సామ్రాజ్ఞి కిరీటం ఎవరికైనా పెట్టేద్దామని వుంది” అంది తను.


 “ఏమిటో ఈ కోడళ్ళు!! వంటిల్లు తమ చేతిలో నుండి జారిపోతుందని ఆందోళన పడతారో ఏమిటో? వంటిల్లు జారిపోతే భర్త కూడా తమ చేతుల్లో నుండి జారిపోతారని సైకలాజికల్ ఫియర్  వుంటుంది అంట.  అదే కాబోలు నా కోడలికి” అంది వకుళ.  చెప్పడం ఆపలేదు.


“నా కోడలు పొద్దుటే లేచినప్పటినుండి సోపాల్లో జారగిలబడి రకరకాల యాప్స్ ల్లో  డీల్స్ చూసుకుంటూ కూర్చుంటే..  శ్రద్ధగా వంట చేయడానికి తీరిక ఎక్కడ? వేగిరంగా ఏది పూర్తవుతుందో అది చూసి వండి పడేయటమే! అలాంటి ఇల్లాళ్లు అందరూ.. ఒకటి తెలుసుకోవాలి. కుటుంబ ఆరోగ్యం డీల్స్ లో తక్కువ ధరకు దొరకదు అని. 


నాలుగేళ్ళు లేని పిల్లలకు నూడిల్స్ పాస్తాలు పిజ్జాలు శాండ్ విచ్ లు అలవాటు చేయడం పచ్చి బాదంపప్పులు నానబెట్టనివి పెట్టడం పూల్ మఖానా పచ్చివి పేకెట్ లో తీసి పెట్టేయడం.. ప్లాస్టిక్ లంచ్ బాక్స్ లో వేడి వేడి పదార్థాలు పెట్టి వెంటనే క్లోజ్ చేసి స్కూల్ బ్యాగ్ లో తోయడం. కోడలు చేసే ఈ పనులు చూస్తే నాకు భయం. ఈమెకు ఎంత నిర్లక్ష్యం! బాధ్యతా రాహిత్యం?. పిల్లల ఆరోగ్యం పట్ల భర్త ఆరోగ్యం పట్ల  తగినంత శ్రద్ద లేదు. ఇక తన ఆరోగ్యం పట్ల శ్రద్ద ఏముంటుంది? ఎప్పుడూ Hb 8% కన్నా తక్కువో కొంచెం ఎక్కువో.. అంతే! మళ్ళీ వీరివి సైన్సు సబ్జెక్టుల చదువులు. పచ్చి శెనగలు నానబెట్టి కుక్కర్ లో వుడికించి.. అవి వేడిగా వుండగానే తీసి ప్లాస్టిక్ బాక్స్ లో పోసి మూత పెట్టేసి ప్రిడ్జ్ లోకి తీయడం చూసాను నేను. వెంటనే అడిగాను.”ఏమిటమ్మా అలా వేడివేడివి ప్లాస్టిక్ డబ్బాల్లో పోసి .. ఆ వేడివే ప్రిడ్జ్ లోకి పెట్టకూడదు కదా” అని. 


“ఏమీ అవ్వదు అత్తయ్యా అని వొకసారి, వేడి గా లేవు అని అబద్దం తో వొకసారి నా మాట ను కొట్టి పడేసింది. ఆ తీరు చూస్తే భయం వేస్తుంది.  ప్రతి వంటా హై లో పెట్టి తక్కువ సమయంలో వండి అవతల పడేయడం లేదా మాడపెట్టడం. ఓపిక తక్కువ అసహనం ఎక్కువ. కొడుకు పిల్లల  ఆరోగ్యాలు ఏమైపోతాయో  అని వాపోయింది వకుళ.


ఆ మాటలన్నీ పదే పదే గుర్తుకు వస్తున్నాయి సరళ కు. ఉజ్వల వంట తీరు అదే లాగా వుంది అనుకుంది. 


పడక గది స్త్రీ పురుషుల దాంపత్య బంధానికి మూలం అయినట్లే వంట గది కుటుంబ సభ్యుల అనుబంధాలకు ఊతమైంది కదా! ఒకప్పుడు పురుషుల సంపాదన స్త్రీ చేతి వంటగా మారి ఇంట్లో అందరి కడుపు నింపుతుండేది. ఇప్పుడు ఇద్దరి సంపాదన ఆన్ లైన్ పుడ్ ఆర్డర్ లకి మాల్స్ లో కొనే వస్తువులకీ సరిపోవడంలేదు. చేతిసంచీలు దులిపేసుకోవడం క్రెడిట్ కార్డ్ లు గీకేయడం.ఉన్నరోజు పండగ లేని రోజు అలో లక్ష్మణా అంటూ ఇంటి వంట. ఆర్ధిక క్రమశిక్షణ లేదు ఆరోగ్యం పట్ల శ్రద్ద లేదు. ఇండియాలో చిన్నచిన్న పట్టణాల్లోనే ఇలా వుంటే అమెరికా లో ఎట్లా వుంటారో అనుకుంది కానీ కొడుకు కోడలు ప్రతిపనిలో కనబరిచే ప్లానింగ్ సంతృప్తినిచ్చింది సరళ కి. కోడలు ఉజ్వల కావాలనే తనని పక్కన పెడుతున్నట్లు అనిపించింది కూడా!


బ్యాక్ యార్డ్ లో మొక్కలను నాటుతూ .. “అబ్బాయ్ ! వంటింటి పని మొత్తం భార్య మాత్రమే చేయాలని అనుకోవద్దు. ఉజ్వల మాత్రం ఎంత పని చేస్తుంది? జాబ్  చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా ఎక్కడ చేస్తుందీ, నువ్వు కూడా కొంత చేయడం అలవాటు చేసుకో. అనునయంగా చెప్పింది. 


“నీ కోడలికి నాకిష్టమైన వంటకాలు  వొక్కటీ చేయడం సరిగ్గా రాదు. అసలు సరిగ్గా చేయాలని ప్రయత్నించదు కూడా. నేను ఫ్రెండ్స్ తో ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు తినేసి వస్తాను. అక్కడ మాత్రం రుచి ఎందుకు వుంటుంది చెత్త అనుకో అమ్మా! అన్నాడు నిసృహగా. 


“నేను వుండన్నీ రోజులు వంట నేర్పిస్తాను. నీకిష్టమైన పదార్ధాలు నువ్వే చేసుకుని తిను. మీ ఫ్రెండ్ వంశీ రుచికరంగా వంట చేసుకుని తిని  ఆస్వాదిస్తున్నాడు. ఫేస్ బుక్ లో పోస్ట్ ల్లో చూడటం లేదా నువ్వు.”


“చూస్తున్నాను లే అమ్మా, నేనూ వంట చేయాలి. రేపటినుండి వంట నేర్పించు,మనసు పెట్టి నేర్చుకుంటాను” అన్నాడు. 


“.ఉజ్వల ముందు పదే పదే నా వంటలు బాగున్నాయని అనకు. ఆమెకు అది నచ్చడం లేదు. ప్రతి బిడ్డకూ అమ్మ చేతి వంట అమృతం లాగానే తోస్తుంది అంట.  ముఫ్పై ఏళ్ళకు పైగా నాకు వంటిల్లే ప్రపంచం. అయినా మీ నాయనమ్మ నిత్యం నా వంటకు వొంకలు పెడుతుంది. విని మీ నాన్న నువ్వు తమ్ముడూ నవ్వుకోవడం లేదూ.. అని విడమర్చి చెప్పింది. శ్రీకర్ అర్ధమైంది అన్నట్టు నవ్వాడు. 


కోడలు పెద్ద చదువులు చదివి వేల డాలర్లు సంపాదిస్తున్నా వంటింటిని ఇంకొకరికి అప్పగించడం నామోషీ అనుకుటుందా లేక తన ఆధిపత్యం జారిపోతుందని అనుకుంటుందా అన్నది అర్ధం కాలేదు. రోజూ వచ్చేటప్పుడు పిజ్జా లు డోనట్స్ చికెన్ నగ్గెట్స్ శాండ్ విచ్ లు పట్టుకొని రావడం.పిల్లలకు తినిపించడం. శుభ్రంగా తను వంట చేసి పెడుతుంది కదా.. అనుకుని బాధపడింది.


మర్నాడు నుండి సరళ వంటింటి వైపు రావడం మానేసింది. ఉదయం కూడా భార్యాభర్తలు వాకింగ్ కి వెళ్ళసాగారు.  వాకింగ్ లో పరిచయమైన గుంటూరు ఆమె అడక్కుండానే అనేక విషయాలు చెప్పింది. మనసులో వున్నది బాధ కల్గించేది ఎవరికైనా చెప్పుకుంటే కాస్త ఉపశమనం కల్గుతుందని..ఆడవాళ్లు అలా బాధలు వెళ్ళబోసుకుంటారని అనుకుని సరళ  సానుభూతి తో వినేది.


“మగవాడు పెళ్ళవగానే అత్తమామలను కొడుకులా చూసుకుంటాడు.   తల్లిదండ్రులనేమో  పరాయివారిగా శత్రువుల్లా చూస్తుంటాడు. మనమేమైనా విషం పోసి పెంచామా వీడిని, ఇంత విషం కక్కుతున్నాడు అని తల్లిదండ్రులు విస్తుబోతారు. నిర్వేదంగా చూస్తూ వుండిపోతారు. సామెత వుండనే వుంది అంధుడికి అద్దం చూపినట్లు కొడుక్కి హితబోధ పనికిరాదు అని సతి బోధ మాత్రమే వినపడుతుంది అని. 


భర్త తల్లిదండ్రులు వారికి కేటాయించిన గది కి పరిమితమైపోవాలి. బధిరుల్లా చూస్తూ వుండిపోవాలి. భార్య వైపు బంధువులు మాత్రం వంటగది ని ఆక్రమించేస్తారు.ఇష్టమైన వంటకాలను చేసుకుంటారు. వారు దండిగా భుజిస్తారు.ఇతరులను మాత్రం  ప్రసాదంగా తీసుకోమంటారు. ఇంట్లో అన్నింటా వారిష్టాలే వర్ధిల్లాలి. పిల్లలకైతే వారే లవ్ బ్యాంక్ లు. నాయనమ్మ తాతయ్యలవి మాత్రం మొరటు ప్రేమలూ చేష్లలూనూ.  షాపింగ్  చేస్తే తమ వారికి నచ్చినవే అందరికీ నచ్చాలి. మగవాడికి నచ్చేవి కొనుక్కొంటే సతాయింపు. పుట్టింటి వైపు వారు  అవసరాల్లో ఏదైనా అప్పు గిప్పు సర్దితే.. ఇక అంతే సంగతులు. మన ఆర్ధిక పరిస్థితులపై  వారు పెత్తనం చెలాయించేస్తారు. ఇంట్లో మగవాడు కీలుబొమ్మ అయికూర్చుంటాడు. వాడికి అమ్మనాన్నలంటే అలుసు. అకారణంగా  వారిని విసుక్కొంటాడు.మీరిక రాబాకండి అని ముఖంపై ఛీత్కరిస్తాడు.  ఏ రోజైనా తల్లి అనారోగ్యం తో వంట చేయకుండా పడుకుంటే నువ్వు తిన్నావా చచ్చావా అని అడగలేడు కానీ ఇద్దరూ కలసి వంట చేసుకోవాలని మెసేజ్ పెడతాడు.  అత్త వంట చేయడం కోడలికి ఇష్టం లేకపోతే నువ్వు వంట గదిలోకి రాకు.. అని చెప్పేస్తాడు.


కోడలు నోరు విప్పకుండానే భర్తను ఆయుధం చేసి అత్తమామలపై ప్రయోగం చేస్తుంది. అయ్యో! మీరు మీరూ గొడవపడతారు నాకేం సంబంధం లేదు అది మీ ఇంటి విషయం అన్నట్టు చోద్యం చూస్తూ నవ్వుకుంటుంది. రంపపుకోత అనుభవిస్తూ కడుపు చించుకుంటే కాళ్ళపై పడుద్ది అని గుంభనంగా వుండి విమానం ఎక్కే రోజు కోసం ఎదురుచూస్తాను. తండ్రి తాతముత్తాల ఆస్తులు  కావాలి. నగానట్రా అన్నీ కావాలి. భర్త తల్లిదండ్రులు మాత్రం వద్దు. కొడుక్కి పెళ్ళి చేసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవాలి. లేకపోతే ఈ తద్దినాలు ఎవరు భరిస్తారు అనుకుంటున్నారు కోడళ్ళు”  అని చెప్పింది ఆక్రోశంగా..


ప్రతి ఇంట్లోనూ వుండేవే కదండీ ఇవన్నీ. కోడళ్లు భర్తవైపు వారిని భరించలేరు. మా అత్త మంచిది అన్న కోడలు కానీ మా కోడలు బంగారం అన్న అత్తలు కానీ వుండరండీ. ఇది లోక సహజం.ఓదార్పుగా అంది సరళ.  మర్నాడు వాకింగ్ లో  గుంటూరు ఆమె కనబడలేదు. పక్కింటామె చెప్పింది.. ఆమె అదే సిటీ లో వున్న ఇంకో కొడుకింటికి వెళ్ళిందని.  


సరళ ఆలోచిస్తూ వుంది.. 

తను విన్న అనుభవాలన్నీ అత్తల కోణంలో నుండే చూసినవే! కోడళ్ళ తమ వెర్షన్ చెబితే ఎలా వుంటుందో మరి. పెద్ద  వయస్సు  అనుభవం బోల్డు వుంది కదా అని కోడళ్ళను చిన్నపిల్లగా జమకట్టి ఇగో ను ప్రదర్శించే అధికారాన్ని చెలాయించే  అత్తల గురించి కథలు కథలు చెబుతారేమో! అదీ చూద్దాం అనుకుంది.


బయట ఉద్యోగం చేస్తూ ఇంటా అనేక ఇతర పనులు చేసే స్త్రీలకు వంట చేయడం నుండి విముక్తి కోరుకోవాలనుకున్నా అది కుదరని పని. ఆకలి తీర్చుకోవడం ప్రధమ అవసరసం.  తమ కోసం తామైనా వంట చేసుకోక తప్పదు.  స్త్రీలు వంట  చేయకుండా తప్పించుకుంటున్నారో లేక తప్పదనుకుంటారో వారి వారి కుటుంబ పరిస్థితి పై పిల్లల ఆహార ఇష్టాలపై ఆధారపడి వుంటుంది తప్ప వేరొకరు చెప్పగల సలహాను కాదు తీర్పు కానేకాదు అనుకుంది.


మొబైల్ చేతిలోకి తీసుకొని వాట్సాప్ లో స్నేహితురాలు వకుళ కు మెసేజ్ టైప్ చేసింది. 


“ఈ ఆధునిక యుగంలో స్త్రీలు  గరిట పారేసి స్థిమితంగా కూర్చోనూ లేరు. పిల్లలను భర్తను ఆరోగ్యానికి హానికరమైన తిండి తినకండి అని చెప్పకుండా వుండనూ లేరు. వారికి కావాల్సిన నానారకాల వంటలు చేసి పెట్టనూ లేరు. మితిమీరిన స్వేచ్ఛ, అధిక సంపాదన ల ఫలితాలు ఇవి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని  పళ్లెంలో  ఆరగించడానికి బదులు డబ్బాలోని విటమిన్ మాత్రలను కొనుక్కొని తినే కాలం ఇది. వంటింటి సామ్రాజ్యాన్ని పుడ్ మార్కెట్ కూలగొడుతుంది. చాలా చోట్ల ఇంకా అత్తలు కోడళ్ళు వంటింటి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి

ప్రచ్ఛన్న యుద్దం చేస్తూనే వుంటారు.పాత సంప్రదాయానికి సంస్కృతి కి కాలంచెల్లి కొత్త సంస్కృతి ధాటికి పిల్లలు నలిగిపోకుండా వుండాలని ప్రయత్నం చేసే చేతులు మనవి. ఇలా ఎన్నాళ్ళో! బహుశా ఈ చేతుల్లో శక్తి సన్నగిల్లేవరకూ.. నేమో! 

ఇది నా అనుభవం.”

అని రాసి సెండ్ చేసింది. 


*******


ఏడున్నరకల్లా.. పిల్లలకు లంచ్ బాక్స్ లు సర్దేసి కూరలు కూడా చేసేసి రైస్  ఇన్స్టా పోట్ లో పెట్టేసి వెళ్ళిపోయేది ఉజ్వల. కాఫీ కలపడం టీ పెట్టడం, టేబుల్ పై పెట్టినవి పెట్టుకుని తినడం పాత్రలు కడిగి శుభ్రం చేయడం లాంటి పనులు తప్ప ఇంకేం పని లేకుండా పోయింది సరళ కు. పిల్లల బట్టలు వాషింగ్ మెషిన్ లో వేయడం బట్టలు మడత పెట్టడం ఇల్లు శుభ్రం చేయడం మొదలెట్టింది. అలా ఉన్నా కూడా తను చేసిన ప్రతి పనికి వొంకలు పెట్టడం, లేదా తన చేతిలో పని లాక్కుని మీరు మాకు గెస్ట్ లు అత్తయ్య గారూ మీరు పని చేయడం నాకిష్టం లేదు. హాయిగా రిలాక్స్ అవ్వండి “అనేది. కోడలి చతురత మాటకారితనం సరళ కు తెలియనిది కాదు. ఆమెకు తాము రావడం ఇష్టం లేదని ప్రతి చర్యలోనూ అర్థమవుతూనే వుంది. చాలీచాలకుండా అన్నం వొండటం ఒక కూర మాత్రమే చేయడం అదీ రుచి పచీ లేకుండా వుంటే తాము తెచ్చిన ఊరగాయలతో సర్దుకోవడం. శ్రీనివాస్ కొడుకుతో “కోడలు బియ్యం చాలా తక్కువ పెడుతుంది. మనిద్దరం తిన్నాక మీ అమ్మకు అన్నం వుండటం లేదు. బియ్యం కాస్త ఎక్కువ పెట్టమని కోడలికి చెప్పు” అని నిర్మొహమాటంగా చెప్పేసాడు.  


అదేమాట శ్రీకర్ భార్యకు చెప్పగానే పెద్ద యుద్దమే జరిగింది ఇంట్లో. 


“అన్నం చాలకపోతే కాసిని బియ్యం కడిగి పెట్టుకోవచ్చు కదా! కొడుకుతో చెప్పి నన్ను తిట్టించాలని కాకపోతే”అని సరళ పై విరుచుకుపడింది. 


“ఉజ్వలా! అమ్మని ఏం అనకు?  అసలు ఆ విషయం అమ్మ నాకు చెప్పలేదు. అమ్మకు అసలే మొహమాటం. నెలరోజులు పైనే నలిగిన విషయాన్ని అమ్మ అన్నం తినక చిక్కిపోవడం గమనించి ఆఖరికి నాన్నే ఈ విషయం నాకు చెప్పారు. దీనికే ఇంత రాద్దాంతం ఎందుకు? అదనంగా ఇంకో కప్పు బియ్యం వేసి వండు” అని సీరియస్ గా చెప్పాడు. 


మర్నాడు నుండి అన్నం ఎక్కువ వండటం అయితే చేసింది కానీ అత్తగారితో మాట్లాడం మానేసింది. మామ గారితో పొడి పొడి మాటలు. పిల్లలను వారి దగ్గరికి వెళ్ళనీయకుండా చేయడం చూసాడు శ్రీకర్. ఆ ఉక్కపోతను భరించలేకపోయాడు. మనుషులను మనసులను కలుపుదామని తన వంతు ప్రయత్నం చేస్తూ “ మే ఆఖరి వారంలో  పిల్లలకు సెలవులు ఇచ్చేస్తున్నారు. ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్దాం” అన్నాడు ఉజ్వల తో. “మీ ఇష్టం” అంది ఆమె. 


 “తమ్ముడు.. మాకు రిటర్న్ టికెట్ల్ బుక్ చేస్తానంటున్నాడు. కోడలు నెల తప్పింది అంట. బెడ్ రెస్ట్ చెప్పారంట. మీ నానమ్మ కూడా ఎండలకి సోలి పోతుందని అన్నాడు. మేము ఆమెను చూసుకోవాలి కదా!  పై వారంలో వెళ్దామని అనుకుంటున్నాం. పిల్లలకు సెలవులు ఇచ్చారుగా మాతో వాళ్ళను కూడా తీసుకెళ్తాం రా శ్రీకర్”  అన్నాడు. హఠాత్తుగా తండ్రి చెప్పిన విషయం విని మూగబోయాడు. తల్లి వైపు చూసాడు.


“అవును శ్రీ.. ఇక్కడ వుండి మేం చేసేది మాత్రం ఏముంది? మిమ్మల్ని అందర్ని చూసాం కదా! చిన్న కోడలు అవసరంలో వుంది. తల్లి లేని పిల్ల కదా! దగ్గరుండి చూసుకుంటే బావుంటుంది” అంది. 


“పిల్లలను కూడా పంపుదాం. హాలీడేస్ అక్కడ ఎంజాయ్ చేస్తారు” అంది ఉజ్వల. 


“వద్దు, వాళ్ళు ఇక్కడే వుంటారు” అన్నాడు ఖరాకండిగా. శ్రీకర్ కి తెలుసు.  పిల్లలు ఇండియాకి వెళ్ళేది తన తల్లిదండ్రులతోనే కానీ అక్కడికి వెళ్ళాక అత్తగారు పిల్లలను తమింటికి తీసుకెళ్ళి నెలకి వొకసారైనా  నాయనమ్మ తాతయ్య ను కలవనివ్వదని. పిల్లలపై ఉజ్వల తల్లి ప్రభావం పడకుండా వుండాలని కట్టడి చేయాలని అతని ప్రయత్నం. 


“పిల్లలను పంపొద్దని అంటున్నారు. మీ అమ్మ నాన్నకు వాళ్ళను చూసుకునే తీరిక ఎక్కడుంటుంది లెండి. వారికి చిన్నకొడుకు కోడలు అంటేనే ఇష్టం. అసలు నా పిల్లలను వాళ్ళు ప్రేమగా చూస్తారని  అనుకోను. దిగగానే వాళ్ళను మా అమ్మ తీసుకువెళుతుంది”అంది. భార్య వైపు అసహ్యంగా చూసి పక్కకు తిరిగి పడుకున్నాడు శ్రీకర్.అమ్మ నాన్న ను రెండు నెలలు కూడా తనింట్లో  ఉంచుకోలేని అసమర్ధతకు మౌనంగా కన్నీరు కార్చాడు. 


లగేజ్ చెకింగ్ అయి బోర్డింగ్ పాస్ లు తీసుకున్నాక.. సరళ శ్రీనివాస్ పిల్లలను భారమైన హృదయంతో దగ్గరికి తీసుకున్నారు.   


సరళ కోడలి దగ్గరికి వచ్చి..


“ఉజ్వలా! రేపటి నుండి నా వంటింటికి సామ్రాజ్ఞి ని నేను. నీ వంటింటి సామ్రాజ్ఞివి నీవు. నీ కోడలు వచ్చి ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటుందేమో అని బెంగపడకమ్మా! నీ కొడుకు అమెరికా లో పుట్టి పెరుగుతున్నవాడు కదా! వంట చేయడం తప్పకుండా నేర్చుకుంటాడు.  భవిష్యత్ లో నువ్వు కూడా వాడింటికి ఎప్పుడైనా వెళ్ళి గెస్ట్ గా వుండి రావడమే! “ నవ్వుతూ చెప్పింది సరళ.


 ఉజ్వల అత్తగారి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి బలవంతంగా రాని నవ్వు నవ్వింది. చెక్ ఇన్ అయ్యాక లోపలికి వెళుతూ వెనక్కి  వెనక్కి తిరిగిచూస్తూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి బాధగా ముఖం పెట్టాడు శ్రీకర్. తల్లిదండ్రులు కనబడే వరకూ చూస్తూ బై చెబుతూనే వున్నాడు. 


అందరూ లిఫ్ట్ దిగి  కారు పార్కింగ్ వైపు నడిచారు. శ్రీకర్ పిల్లలిద్దరిని చేతులు పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుని వెళుతుంటే.. ఉజ్వల చెవికి బ్లూ టూత్ తగిలించి “అమ్మా! నేనెలా డీల్ చేసానో చూసావా! దీన్నే పొమ్మనకుండా పొగపెట్టడం అంటారట కదా! అని పగలబడి నవ్వింది.


********సమాప్తం********


Disclaimer: ఈ కథను కథగానే చూడండి. బంధుమిత్రులు పరిచయస్తులు అందరూ ఈ కథ చదవగానే మాకు apt గా వుంది మా గురించే రాసింది ఈమె అని వివాదాలకు రావద్దు. కావాలంటే ఇందులో ఉదహరించిన విషయాల గురించి చర్చించండి. ఈ మధ్య ఏ కథ రాసినా కొంతమంది భుజాలు తడుముకుంటున్నారు. ఈ కథలో ఉదహరించిన విషయాలు కొన్ని నా మిత్రుల ఆనుభవాలు ఆలోచనలు కథకు తగిన విధంగా నా కల్పన మాత్రమే! కథ గురించి మాత్రమే చర్చించగలరు. ముందస్తు ధన్యవాదాలు.🙏 - వనజ తాతినేని. 



4, ఏప్రిల్ 2024, గురువారం

హృద్యమైన కథ

 బహుమతి

ఒక పోస్ట్‌మాన్ ఒక ఇంటి తలుపు తట్టి 

" ఉత్తరం" అని పిలిచాడు.

"వస్తున్నాను" అని ఇంటిలోపల నుండి చిన్నపిల్ల గొంతు వినిపించింది.

కానీ ఆ వ్యక్తి రాలేదు. మూడు, నాలుగు నిమిషాలు గడిచాయి. 

 పోస్ట్‌మ్యాన్ కి కోపం ముంచుకొస్తుంది.  “ఏయ్, త్వరగా వచ్చి లెటర్ తీసుకో… అని అరిచాడు. 

మళ్ళీ చిన్నపిల్ల గొంతు వినిపించింది ఇలా..  “సార్, డోర్ కింద లెటర్ పెట్టండి. నేను వస్తున్నాను."

పోస్ట్‌మాన్, “ఇది రిజిస్టర్డ్ లెటర్. దీనికి ఆమోదం కావాలి. కాబట్టి, మీ సంతకం అవసరం."

కొద్ది నిమిషాల తర్వాత తలుపు తెరిచినప్పుడు చిరాకుపడ్డ పోస్ట్‌మ్యాన్ “అయ్యో ! అనవసరంగా నోరు జారానే అని చింతించాడు.

కాళ్లు లేని ఒక అమ్మాయి ఉత్తరం తీయడానికి అతని ముందు మోకరిల్లింది.

పోస్ట్ మ్యాన్ శాంతియుతంగా ఉత్తరం అందజేసి విచారంగా వెనక్కి వెళ్లిపోయాడు.

ఇలాగే రోజులు గడిచిపోయాయి.

పోస్ట్‌మ్యాన్ ఆ అమ్మాయి ఇంటికి ఉత్తరం ఇవ్వడానికివచ్చిప్పుడల్లా అతను తలుపు తెరిచే వరకు ఓపికగా వేచి ఉండేవాడు.

దీపావళి సమీపిస్తోంది, పోస్ట్‌మ్యాన్ ఎప్పుడూ చెప్పులు లేకుండా ఉండటం అమ్మాయి గమనించింది.

 పోస్ట్‌మ్యాన్ లేఖను అందించడానికి వచ్చిన తర్వాత, ఆ అమ్మాయి నిశ్శబ్దంగా నేలపై ఉన్న పాదముద్రల నుండి పోస్ట్‌మ్యాన్ పాదాలను కొలిచింది.

దీపావళికి ముందు ఆ అమ్మాయి అతనితో "అంకుల్, ఇది మీకు నా దీపావళి బహుమతి" అని చెప్పింది.

పోస్ట్‌మ్యాన్, "నువ్వు నాకు కూతురి లాంటిదానివి, నీ నుండి నేను బహుమతి ఎలా పొందగలను?" అన్నాడు.

కానీ ఆ అమ్మాయి మృదువుగా ఒప్పించడంతో పోస్ట్‌మ్యాన్ ప్యాకెట్‌ని అందుకుని ఇంటికి తీసుకెళ్లి తెరిచాడు.

అందులో ఒక జత బూట్లు చూసినప్పుడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి, ఎందుకంటే అతని మొత్తం సేవలో, అతను చెప్పులు లేకుండా ఉన్నాడని ఎవరూ గమనించలేదు.

మరుసటి రోజు, పోస్ట్‌మాన్ తన పోస్టాఫీసుకు చేరుకుని, తక్షణమే తనను బదిలీ చేయాలని పోస్ట్ తన పై అధికారిని వేడుకున్నాడు.

పోస్ట్‌మాస్టర్ కారణం అడగగా.. అతను కన్నీళ్లతో ప్రతిదీ చెప్పాడు. 

"అయ్యా, ఈరోజు తర్వాత నేను ఆ వీధికి వెళ్ళలేను. ఆ చిన్నారి నన్ను చెప్పులు లేకుండా చూసి బూట్లు ఇచ్చింది. నేను ఆమెకు కాళ్ళు ఎలా ఇవ్వగలను?"

( తమిళ మూలం)



 ఈ హృద్యమైన కథ నేను వినిపించాను. వినండీ

21, మార్చి 2024, గురువారం

Back to Roots.. ఎందుకు సాధ్యం కాదు?

 Back to Roots సాధ్యమయ్యే పనేనా.. రెండవ భాగం. 


ప్రస్తుతకాలంలో  వృద్దులైన తల్లిదండ్రులేమో పల్లెల్లో, వారి పిల్లలు యాభై లు అరవైలు దాటిన వారేమో నగరాల్లో.. మూడోతరం పిల్లలేమో మహా నగరాల్లోనూ లేదా విదేశాల్లోనూ. ఒక ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమై మూడు ముక్కలైంది. ఇక నాల్గోతరం ఒంటరిగా ఎవరి గుహలో (అదే నండీ.. ఇల్లు అనడానికి నిర్వచనం ఇవ్వడానికి నమస్కరించని ) ఒంటి ఖైదు గా బ్రతకడానికి సమాయాతమవుతుంది. 

లోపం ఎక్కడుంది? మన ఆలోచనా విధానాల్లోనే వుంది. మనది వ్యవసాయ ప్రాధాన్యమైన దేశం. అందరికీ భూములున్నాయి వ్యవసాయం చేసుకునే జీవించారు అని చెప్పడం కాదు. వ్యవసాయాన్ని కేంద్రీకృతం  చేసుకుని వివిధ వృత్తుల్లో స్థిరపడి ఎవరి పని వారు చేసుకుంటూ బాగానే బతుకుతుండేవారు. ముందుగా చదువులకోసమని బయటకు వెళ్ళడం తర్వాత ఉద్యోగం కోసమని పట్టణాలకు వెళ్ళం ఇప్పుడు ఆ పట్టణాలను కూడా వొదిలి మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళడం జరిగిపోయింది. ఒక కుటుంబం అనేక ముక్కలయ్యాక వారి వారి నివాసానికి భూమి కూడా పంటలు పండటం మానేసి అడవి విస్తీర్ణం తగ్గిపోయి నివాసయోగ్యాలాగా మారిపోతుంది. భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. పల్లె వెళ్ళి పట్టణంలో కలిసిపోయిందా పట్టణమే వచ్చి పల్లె ను మింగేస్తుందా అని ఇద్దమిద్దంగా చెప్పలేం. ఎక్కడ చూసినా కాంక్రీట్ అరణ్యాలు. అయినా కొన్ని లక్షల కుటుంబాలకు సొంత ఇల్లు అనేది కలగా మిగిలిపోయింది. ఉండటానికి సొంత ఇల్లనేదే లేని వారు Back to roots అనుకుంటూ పల్లెలకు వెళ్ళి ఎక్కడ వుండగలుగుతారు? చెప్పండి. వృద్ధులైన తల్లిదండ్రులు వారికి అలవాటైపోయిన సొంత స్థలాన్ని ప్రాంతాన్ని వొదిలి నగరాల్లో తమ బిడ్డల వద్ద ఎక్కువ కాలం వుండలేరు. శరీరాల్లో శక్తి సన్నగిల్లి పిల్లలపై ప్రేమతో కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ.. ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అనే అసహాయ స్థితిలో బతుకుతుంటారు. ఇక మధ్య వయస్కులేమో వారి పిల్లల భవిష్యత్ కోసం శ్రమించి వొత్తిడితో కూడిన జీవితాల్లో నలిగి బిపి షుగర్ లాంటి వ్యాధుల బారిన పడి నగరాల్లో జీవిస్తున్నారు తప్ప back to roots   అంటూ సొంత ఊరికి వెళ్ళలేకున్నారు.  ఎందుకంటే కొంత సౌకర్యవంతమైన జీవితంలో వాళ్ళు కుదురుకున్నారు. సొంత ఇల్లు ఏర్పరుచుకున్న వారు కొందరైతే అద్దె ఇళ్ళలో బ్రతికే వారు కొందరు. ఒకప్పుడు చూరు క్రింద కట్టిన తాడుపై వేలాడే బట్టలు లాగా.. నగరాన్ని పట్టుకుని వేలాడుతున్నారు తప్ప నగరం వొదిలి రావడం లేదు. ఎందుకంటే పల్లెల్లో నాణ్యమైన సరుకులు దొరకవు పాలు దొరకవు, కరెంట్ సరిగా వుండదు. దోమలు, కుళాయి తిప్పితే నీళ్ళు బకెట్ లో పడవు..ముఖ్యంగా హాస్పిటల్ కోసం నగరానికి రావాలి లాంటి కారణాలు. నిజంగా ఈ తరమంతా మనసు పెట్టి  నగరాలను వొదిలి పల్లెలకు మరలి వెళితే ఈ సౌకర్యాలు సమకూరడం చాలా తేలికైన విషయం. వీరు వెళ్ళి మళ్ళీ వ్యవసాయమో దాని అనుబంధ వృత్తులో చేస్తారని కాదు.కనీసం కాలుష్యం బారిన పడిన ఆహారాన్ని తినకుండా మంచి ఆహారం పండించుకోవడానికి పాలు తాగడానికి ఆస్కారం వుంది.  విషతుల్యం కాని  కిలో వంకాయల్ని  ఆర్గానిక్ పేరిట వందరూపాయలు పోసి కొనుక్కుంటున్నాం. పెరటి తోట పోయింది గృహ వైద్యం పోయింది. గృహ వైద్యుడు కనుమరుగైపోయాడు. ప్రతి అవయానికో స్పెషలిస్ట్. మంచి వైద్యం కోసం నాణ్యమైన ఆహార ఉత్పత్తుల కొరకూ వెంపర్లాడుతున్నాం. కార్పోరేట్ మాల్స్ కి పరుగులు పెడుతున్నాం.మనం కార్పోరేట్ వైద్యానికి అలవాటు పడిపోయాం.  మనిషికి అతిముఖ్యమైన ప్రాథమిక అవసరాలన్నీ కార్పోరేట్ గుప్పిట్లో చిక్కుకుంటున్నాయి అని మీకు తెలుసా!?.  అవేమిటంటే … ఇల్లు ఆహారం వైద్యం. ఈ మూడింటికి  అవినాభావ సంబంధం వుంది.ప్రస్తుత కాలంలో ఈ మూడింటి పట్ల మనకున్నది అభద్రతా భావమే! 

మనుషులు సర్దుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఇందుకు మా ఇంటి సంగతే ఉదాహరణగా చెబుతాను చూడండి. మా అత్తమామలకు ముగ్గురు కొడుకులు. అమ్మాయిలు లేరు. ఓ పదేళ్ల ఉమ్మడి కుటుంబం తర్వాత  కొడుకుల సంసారాలు ఎవరివి వారివి అయిపోయాయి. కొడుకులతో సమానంగా ఆస్థుల్లో వాటా తీసుకున్నారు.అది వృద్దులకు చాలా అవసరం కూడా అంటాను నేను. తర్వాత   పదిహేడేళ్ళ క్రితం మా  మామగారు కాలం చేసారు. మా అత్తమ్మ కొద్ది సంవత్సరాలు మాతో వున్నారు. కానీ తర్వాత ఆమె విడిగా వుండాలని కోరుకున్నారు. ఏ కొడుకు దగ్గర ఆమె వుండరు. విడిగా అద్దె ఇంట్లో వుంటారు. నేను ఒక ఇంట్లో ఆమె ఒక ఇంట్లో .. ఇట్లా ఒక ఉమ్మడి కుటుంబం ఏడు ఇళ్లుగా విడిపోయింది. సంప్రదాయంమైన వ్యవసాయ కుటుంబం నాశనమైపోయి ఈ భూమి పై భారం పెంచుతూ ఏడు ఇళ్లు అయింది. అందరూ అన్ని ఆహార ఉత్తత్తులకు మార్కెట్ ను ఆశ్రయించాల్సిందే! కేవలం ముప్పై ఏళ్ళలో ఈ వినాశనం జరిగింది అంటే నమ్ముతారా!? నమ్మాలి ఇది వాస్తవం కాబట్టి.   నా వరకూ నాకు  ఈ భూమిపై రెండిళ్ల భారాన్ని తగ్గిద్దాం అనుకుంటాను. మా అత్తమ్మ నా దగ్గరికి రారు. నా కొడుకు విదేశం నుండి తిరిగిరాడు. కనీసం ఈ నగర జీవనాన్ని వొదిలి నేను పల్లె వైపు అడుగులు వేయలేకపోతున్నాను. నాలుగు రకాల కూరగాయ మొక్కలను పెంచి స్ఞఛ్చమైన ఆహారాన్ని తినలేకపోతున్నాను. ఈసూరుమంటూ జనం ఈ రీతిన వుంటే దేశమేగతిన బాగుపడునోయ్ అన్నారు ఒక కవి గారు. మనిషికంటూ ఒక మంచి వ్యాపకం లేక మంచి ఆహారం లేక ఆరోగ్యకరమైన పరిసరాలు లేక గబ్బిలాల వలె నగరాలను పట్టుకుని వేలాడటం ఎందుకు? 

పల్లెలకు తిరిగి వెళ్లవచ్చు కదా! ఎన్ని పల్లెలు నిర్మానుష్యంగా మారిపోతున్నాయో! ఎన్ని ఇళ్లు తాళాలు వేయబడి మూగగా రోదిస్తున్నాయో.. అంచనా వుందా? ఉన్నన్నాళ్లు అయిన వాళ్ల మధ్య వుంటూ వృద్దాప్యంలో  వున్న పెద్దలకు ఆసరాగా వుంటూ… ఓ నలభై ఏళ్ళ క్రిందటి గ్రామీణ జీవనంలో బ్రతకలేమా? మన జీవితాలను కార్పోరేట్ శక్తుల గుప్పిట్లో మనని మనం బంధించుకోకుండా  హాయిగా పల్లె వాతావరణంలో మనుగడ సాగించలేమా చెప్పండి. మనం నిలబడటానికి ఆనవాలమైన ఈ భూమి తల్లిని అనేక రకాలుగా నాశనం చేస్తున్నాం. బీళ్లుగా మారుస్తున్నాం. లేదా అధిక ఉత్తత్తుల కోసం రసాయనిక ఎరువులు రసాయనిక క్రిమిసంహార మందులు కుమ్మరించి… వాటి ప్రభావాల వల్ల సగం ఆయుష్షు లోకి నెట్టబడిన తరం ఇప్పుడు వుంటున్న 50 -60 సంవత్సరాల తరం ఇది. ముందు మేల్కోవల్సింది వీళ్లే! భూమిని రక్కించుకోవాలి,పచ్చదనాన్ని బ్రతికించుకోవాలి. ప్రకృతిని మనిషి ఎంత నాశనం చేస్తున్నా ప్రకృతి మనకు చాలా ఇస్తూనేవుంది. అందుకే పల్లెలకు వెళ్లాలి.పంట పశువు పక్షి మన జీవన విధానం. లక్షలు పోసి చదరపుటడుగుల్లో ప్లాట్ లు కొనుక్కొనే మనం పల్లెలో ఒక ఎకరం కొనుక్కోలేమా? ఆరోగ్యం కోసం వాకింగ్ చేసే మనం చిన్న పెరటి తోటను పెంచలేమా? చెప్పండి. ప్రాథమిక వైద్యశాల లేని మండల కేంద్రాలు వున్నాయా? ఆలోచించండి మిత్రులారా! జీవనాన్ని జీవితాన్ని మనమే సంక్లిష్టం చేసుకొంటున్నాం. ఓపిక ఉండగానే అకాల అకారణ వృద్ధాప్యాన్ని మోస్తున్నాం. ఆలోచించండి. 

నా పల్లె నడిబొడ్డున జిల్లేళ్ల వనాలు విస్తరిస్తున్నాయి. జిల్లేడు దూదిపై కూడా కూడా పేటెంట్ హక్కులు పొందేంత వరకూ… మౌనంగా వుందామా… రండి పల్లెకు పోదాం అని నడుం బిగించండి.. నగరం ఖాళీ అవటం  మనమే చూస్తాం.  మిత్రులారా భూమి వ్యాపార వనరు కాదు.. మన పొట్టకి ఇంత ఆహారం పెట్టే దేవత అని తెలుసుకుందాం.  నమస్కరించుకుందాం. Save earth Save village life Save health. నేలమ్మ నేలమ్మా  నేలమ్మా… నీకు వేనవేల వందనాలమ్మా… వృక్షో రక్షతి రక్షితః ధర్మో రక్షిత రక్షితః🙏 భూమి పై గుత్తాధిపత్యాన్ని ప్రశ్నిద్దాం. ఆహార వ్యాపారాన్ని నిరసిద్దాం. ఆరోగ్యాలను కాపాడుకుందాం.. మనలో ఒక చైతన్యం రావాలి.  Yes.. చైతన్యం రావాలి. ఇవ్వాళ్టికి ఇంతే ఫ్రెండ్స్! 

ఇంకా Back to Roots.. అనే విషయం పై నాకు చాలా ఆలోచనలున్నాయి. వాటిని ఇంకోసారి పంచుకుందాం…  

19, మార్చి 2024, మంగళవారం

Back to roots సాధ్యమయ్యే పనేనా!?

 ఎందుకో నగర జీవనం నాకంతగా రుచించడం లేదు. పల్లెకి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలని వుంది. నగరంలో ఖర్చులు కూడా అధికంగా వుంటున్నాయి. సాదాసీదాగా జీవించాలన్నా కూడా భారంగా వుంది. నగరంలో నా అభిరుచికి నా (మా) ఆర్ధిక పరిస్థితికి తగ్గట్టుగా ఇల్లు నిర్మించడం కూడా సాధ్యం కాదనిపిస్తుంది. ఇంటి ముందు రోడ్డు తగినంత వెడల్పు లేక అనుమతులు రావడం కష్టం అనిపిస్తుంది. ఇక ఆ స్థలంలో ఇల్లు కట్టే ఉత్సాహం అణిగిపోయింది. 


నా కలల కుటీరం నిర్మించుకోవడానికి పల్లెటూరు బావుంటుందనిపించింది. ఆ పల్లె ఎక్కడో యెందుకు? నేను పుట్టి పెరిగిన ఊరు నాకు చాలా యిష్టం. మా ఇల్లు  నాబాల్య జ్ఞాపకాలు నాకు మానసికమైన బలాన్నిచ్చే బంధాలు ఎన్నో వున్నాయి. మనుషులతోనే కాదు మట్టితో కూడా నా బంధం. 

నాలుగు తరాలు  నా పూర్వీకులు సంచరించిన నేల అది. అక్కడ నేలలో ధూళిలో గాలిలో వారి ఆత్మ సంచరిస్తూ వుంటుందని నా నమ్మకం. పిచ్చి ప్రేమ కూడా! ఎవరికైనా కన్నతల్లి జన్మభూమి కన్నా మించినవి ఏముంటాయి? మనిషికి మట్టికి విడదీయలేని బంధం కదా!  అలా అనిపిస్తూ వుంటుంది. అందుకే మా ఊరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అక్కడ నేను నిలబడటానికి కావాల్సినంత నేల కూడా కొనుక్కొని సొంతం చేసుకోవాలి. మా నాన్నగారికి మా అన్నయ్యకు చెప్పాను. రోడ్డు పక్కనే వుండే విధంగా ఒక ఎకరం పొలమైనా దొరుకుతుందేమో చూడమని. అంతకుముందు ముప్పై ఎనిమిదేళ్ళ క్రితం అమ్మిన పొలం అమ్మకానికి వుందని తెలిసింది. అయితే అది నివాసానికి ఏ మాత్రం వీలు పడని మాగాణి భూమి. ఆ భూమి చుట్టూ ఇటుకరాళ్ళ బట్టీలు నెలకొని వున్నాయి. మా అమ్మ పేరున వున్న భూమి నేను కొనుక్కుంటే బావుంటుంది అనుకున్నాను కానీ అది కొనేసి కౌలుకిచ్చేసి రావడమే! ఎందుకో యిష్టం లేకపోయింది. గట్టి ప్రయత్నం కూడా చేయలేదు. 

తర్వాత  మరొక ప్రయత్నం చేసాను. రోడ్డు పక్కనే వున్న మూడెకరాలు. ఆహా అనిపించింది. నా కలల కుటీరం పచ్చని తోట ఆవులు తువ్వాయిలు అనుకుంటూ  ఏదేదో ఊహాలోకంలో మునిగిపోయాను. ఎకరం ముప్ఫై ఐదు లక్షలు చెప్పారంట. మా అబ్బాయితో చెబితే ఏవేవో సర్దుబాట్లు గురించి ఆలోచించి ఇరువురం సంప్రదించుకుని సాధ్యాసాధ్యాలను లెక్కించుకుని భూమి కొందామని నిర్ణయించుకున్నాం. మూడు ఎకరాలు కొందామని బేరానికి వెళితే  అకస్మాత్తుగా ముందు  చెప్పిన ధర కన్నా సగం పైనే పెంచేసి ఎకరం  యాభై లక్షలు అన్నారు. అయినా ఇప్పుడు అమ్మం. రాష్ట్ర ప్రభుత్వం మారితే భూముల ధరలు మారిపోతాయి. అప్పుడు చూద్దాం లే అన్నారట. నా ఆశలపై కడవల కొద్దీ నీరు కుమ్మరించినట్లైంది. అయినా సరే మరొకమారు మా ఊరు వెళ్ళినప్పుడు మిగిలిన చిన్న ఆశతో ఆ పొలం చూద్దామని వెళ్ళాను. మా ఊరు నుండి మైలవరం వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే. ప్రయాణిస్తూనే పరిశీలించాను. LBEC కి ఒక కిలోమీటర్ పరిధి లోనే వుంది ఆ పొలం. మార్కెట్ విలువ బాగా పెరిగే ప్రాంతమే కానీ పరిసరాలు ఏమంత బాగాలేవు. కనుచూపు మేరా ఎక్కడా పచ్చని పొలాల జాడ లేదు.  చుట్టూ ఇటుకరాళ్ళ బట్టీలు, పొగ కాలుష్యం, బట్టీల్లో పని చేయడానికి వచ్చిన బీహారు ప్రాంత పని వారి గుడిసెలు చాలా కంగాళీ గా తోచాయి. నాకు ఆ ప్రాంతం అస్సలు నచ్చలేదు.  క్షణాల్లోనే వద్దు, అసలు ఇక్కడ వద్దనే వద్దు అని తీర్మానించుకున్నాను. అసలు పల్లెలు ఎలా వుంటాయని మనం ఊహించుకుంటున్నామో అలా వుండటం లేదు. అక్కడ కూడా ప్లాస్టిక్ కాలుష్య కాసారమే! వీలైనంతగా పర్యావరణాన్ని నాశనం చేస్తూనే వున్నారు.  చాలా అసంతృప్తి.   కొన్ని నెలల తర్వాత మళ్ళీ వెతుకులాట ప్రారంభించాలి అనుకున్నాను. నా వెదుకులాట ఫలిస్తుందో లేదో చెప్పలేం. 

నా స్నేహితురాలితో  ఈ సంగతి చెబితే పల్లెటూర్లలో పరిస్థితులు ఏం బాగోలేవు. వ్యవసాయం గిట్టుబాటు కాదు. పెరటితోట కూడా పెంచుకోలేం. కోతులు పీకి పాకం చేసి పెడుతున్నాయి. ఏమైనా డబ్బులుంటే ప్లాట్ కొనుక్కొని అద్దెకి ఇచ్చుకో అంది. ఉపరితలంలో కనిపించే సమస్యలు ఇవి. కానీ నేను మానసికంగా ఏం కోరుకుంటున్నానో అంచనా వేయగల్గడం ఆమె కు కూడా సాధ్యం కాకపోవచ్చు. 

“బయలు నవ్వింది” కథ నేను రాసినదే! నా ఆలోచనలు మానసిక స్థితి యశోదమ్మ మానసిక స్థితి లాంటిదే! Back to roots.. కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ .. ఓపిక వున్నంత వరకూ.. ఇష్టంగా బతుకుదాం.. మనసుకి కష్టంగా వుండకుండా అనుకుంటున్నాను. 

ఏ వ్యాపకం లేక స్థబ్దత నెలకొని జీవనం నిరాశామయంగా వుంది. అపార్ట్మెంట్ సంస్కృతిలో మన అభిరుచికి తగ్గట్టుగా బతకడం నాల్గు గోడల మధ్య కూడా సాధ్యం కాదు. ఇక మొక్కల పెంపకం కూడా పరిమితి
లోనే! మన ఆహారం మనమే పండించుకోవాలి అనే పద్ధతిలోకి వెళ్ళాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను. నేనసలు ఈ ఆలోచన ఎప్పుడో చేయాల్సింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మాకున్న పొలాలు అమ్ముకున్న తర్వాత ఈ ఆలోచన కల్గింది. అమ్మినంత సులభం కాదు అమరడం. అదీ నేను ఒంటరిగా వుండి చేయవల్సిన ప్రయత్నం అది. మనిషి తనకి చేయాలనిపించింది చేయకుండా కాలం సంకెళ్ళు వేయడం అంటే  ఇలాంటి అవాంతరాలు రావడమే అనుకుంటా! సంకల్పబలం వుంది.. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. 



9, మార్చి 2024, శనివారం

గిల్ట్ బతుకులు

 వాళ్ళ పిల్లలు అమెరికాలో వున్నారు.  డబ్బు కి వాళ్ళకేం లోటు ( పచ్చిగా చెప్పాలంటే.. వాళ్ళకేమి దొబ్బిడాయ్) అంటారు కానీ.. నిజాలు ఇవి. 

**********

పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తూ లగ్జరీ గా బతుకుతుంటారు. Mk bags $200 చెప్పులు ధరిస్తారు. SUV కార్లలో తిరుగుతారు.వారి తల్లిదండ్రులు ఇక్కడ వృద్దాప్యపు పెన్షన్ కోసం రైతు భరోసా కొరకూ క్యూ లో నిలబడతారు. సిగ్గు వుండదు వీరికి అని వొక గ్రీన్ కార్డ్ హోల్డర్ వ్యాఖ్యానించారు. 

ఆమె మాటలతో కొంత ఏకీభవిస్తూనే.. ఇంకొక అభిప్రాయం చెప్పాను. పొలం కౌలు కిచ్చి రైతు భరోసా అందుకున్నవారు.. పదెకరాల పొలం వుండి తెల్లకార్డు వున్నవారు వున్నారు. ఆరోగ్య శ్రీ కార్డు కూడా వుంటుంది వీరికి. 

అలాగే అర్హులై వుండి కూడా ఆ వైపు తొంగి చూడనివారు వుంటారు.. నా లాగా. 

నేను వింతతువు పథకం క్రింద పెన్షన్ కి అర్హురాలిని. నాకు ఏ విధమైన ఆస్థిపాస్థులు లేవు. 9 ఏళ్ళ క్రితం కొన్న కారు వొకటి నా పేరున వున్నది అంతే! 

అది తీసేస్తే నేను ప్రభుత్వ పథకాలకు పూర్తి అర్హురాలిని. నేను పెట్రోల్ డీజిల్ కొంటాను. కరెంట్ బిల్ కడతాను. బస్ ఎక్కుతాను. నిత్యావసర సరుకులు బట్టలు బంగారం అన్నీ టాక్స్ చెల్లించే కొంటాను. నేను నాకు వచ్చే పెన్షన్ ఎందుకు వొదులుకోవాలి ? అప్లై చేస్తాను అనుకున్నాను కూడా! 

విదేశాల్లో పిల్లలున్నంత మాత్రాన వారేమి తల్లిదండ్రులకు చేతికి ఎముక లేనట్టు డాలర్స్ ఏమీ విసిరేయరు. వారి సర్ధుబాట్లు  వారి బాధలు వారివి. 

ఇక్కడ పేరంట్స్ కి మాత్రం ఖర్చులు ఎక్కువ.. సహాయాలు చేయమని అడిగేవారు ఎక్కువ. మింగలేక కక్కలేక మౌనం వహించి పిసినారి అని పేరు వేయించుకోవడం తప్ప  పది వేల రూపాయలు కూడా ఇంకొకరికి అప్పు ఇవ్వలేని పరిస్థితి. వారు మార్చిన ఐ ఫోన్ లు వాడుకుంటూ బడాయిగా కారు మీద తిరుగుతూ ఫాల్స్ ప్రిస్టేజ్ లో బతుకుతున్న తల్లిదండ్రులు ఎందరో! 

విదేశాల్లో పిల్లలున్నారంటే డబ్బులుంటాయనే భ్రమలు తొలగిపోవాలి. హాస్ఫిటల్ ఖర్చులకు భయపడి హాస్ఫిటల్ కు వెళ్ళకుండా అనారోగ్యాన్ని మొండిగా నెట్టుకొస్తూ  వున్నవారు ఎందరో! 

నా వరకు నేనైతే పుస్తకాలు కొనడం మానేసాను. టూర్లు మానేసాను. విరాళాలు సహాయాలు ఇవ్వడం మానేసాను.  వేడుకలకు వెళ్ళడం మానేసాను. 

హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు.  వాళ్ళబ్బాయి అమెరికాలో వున్నాడు ఆమె కు ఏమిటబ్బా.. అనుకోవద్దు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక పెన్షన్ కోసం అప్లై చేస్తాను. చిన్నపాటి ఖర్చుల కోసం వుంటాయి అని. 

అభిమానం తో భర్త ఆస్థి అంటుకోని.. 93 లో వొకసారి 2004 లో వొకసారి పుట్టింటి వారిచ్చిన పొలం అమ్ముకుని చేతిలో చిల్లిగవ్వ లేకుండా కొడుకు పై 100% ఆధారపడ్డ అమ్మని నేను. 

స్వశక్తి తో బతికిన కాలం 2000 to 2017 మధ్య కాలం. తలెగరేసి బతికిన కాలం. ప్రస్తుతం విశ్రాంతి మోడ్ లో వున్నాను. 

ఎవరైనా రెండు ఎకరాలు పొలం కౌలుకి ఇస్తే కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ కి రూపకల్పన చేయాలని మహా ఉబలాటంగా వున్నాను. నా దగ్గర చాలా ప్లాన్స్ వున్నాయి మరి.  😊

ఇప్పుడు  నేను పెన్షన్ కి  అర్హురాలినా.. కాదా !? మీరే చెప్పండి. ఒకవేళ కమ్యూనిటీ గార్డెన్ ఆలోచన సక్సెస్ అయితే.. పెన్షన్ వద్దనే వద్దు కూడా! 

రిటైర్మెంట్ ఏజ్ రాకుండానే ఏడేళ్ళ నుండి ఖాళీగా వున్నాను.. అమెరికా ప్రయాణాల వల్ల. 

స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత అవసరమో మరీ గుర్తుకు వస్తుంది. నాకన్నా మా అత్తమ్మ నయం. కొడుకులతో పాటు సమానంగా వాటా తీసుకుని బెట్టుగా పై చేయి గానే బతుకుతుంది వొంటరిగా. 

ఏందో! నాకు మనసవలేదు అలా చేయడం. 

పిల్లలపై అతి ప్రేమ కొంప ముంచుతుంది కూడా.



8, మార్చి 2024, శుక్రవారం

అమెరికా కలలు - కల్లలు

 


ఎందరు పిల్లలు ఈ మంచి మాటను చెవిన పెడుతున్నారు😢😢

తల్లిదండ్రులను మోసం చేసిన పిల్లలు వున్నారు కానీ.. 

బిడ్డలను మోసం చేసిన తల్లిదండ్రులు లేరు. కనీ.. పెంచి.. ఎన్నో ఆశలు పెంచుకుని విదేశాలకు ఉన్నత చదువులకు పంపితే.. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు.. 

తల్లిదండ్రులను వదిలేసి వారిని మానసికంగా చంపేసిన పిల్లలు ఎంత ఉన్నత ఉద్యోగాలు చేస్తే ఏమిటి? 

థూ.. 😡😡 అని ఛీత్కరించాను. 

తెల్లారినాక… ఈ రోజు మరికొందరి వ్యథలు రాయాలనిపించింది. 

మా అన్నయ్య ఉదయం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. 

నేను ఏమన్నానంటే.. ఆ.. ఏం సాధించామని శుభాకాంక్షలు చెబుతున్నావ్, అందుకునే అర్హత కూడా లేదులే.. అన్నాను. 

“అయితే వొక పని చేయి! ఒక కొండను తవ్వి పక్కన పొయ్యి. అప్పుడు అర్హత వచ్చినట్టు” అన్నాడు. 

సెటైర్ కి నవ్వు వచ్చినా.. 

లైఫ్ అంటే చాలా విరక్తి వచ్చేసింది ..రా అబ్బాయ్ అన్నాను. 

ఏమైందమ్మా.. అన్నాడు  మా అన్నయ్య నా దిగులు స్వరం విని. 

అనుభవం నాదే కానవసరం లేదు. ఎవరిదైనా అయ్యో పాపం అనిపిస్తుంది అని

నా ఫ్రెండ్ నిన్న చెప్పిన అమెరికా కొడుకు కథ చెప్పాను. 

ఆమె చెప్పిన మాటలు యదాతథంగా ఇక్కడ.. రాస్తున్నాను.

*****************

ఈ కాలం పిల్లలు చాలా స్వార్ధపరులు అయిపోయారు. తల్లిదండ్రులతో మాట్లాడటానికి సమయం వుండదు. వాళ్ళ ఫ్రెండ్స్ , సరదాలు షికార్లు షాపింగ్ లు పార్టీలు

వాటికే సమయాలు. కనీ పెంచీ వాళ్ళ ఉన్నతికి అహర్నిశం పాటు పడితే .. వాళ్ళు అమ్మానాన్నలతో మాట్లాడే సమయానికి కూడా డబ్బు లెక్కలు వేసుకుంటున్నారు. వాళ్ళను చదివించడం తప్పు అయిపోయింది. మగపిల్లలు వ్యవసాయం చేసుకుంటే కళ్ళెదురుగా వుండేవారు. ఆడపిల్లకు పద్దెనిమిది ఏళ్ళకు పెళ్ళి చేసేస్తే పైత్యం పనులు చేయకుండా వుండేవారు.. అనిపిస్తుంది. విదేశాలకు పిల్లలను పంపిన తల్లిదండ్రులకు అనేక బాధలు అనుకో! 

ఈ కొడుకులున్నారే..  వాళ్ళ సంగతి చెబుతాను చూడు.. వారి భార్యకు 20 జతల చెప్పులు వున్నా ఇంకొన్ని జతల చెప్పులు కొంటారు. పది ఖరీదైన వాచీలున్నా ఇంకో వాచీ కొంటారు. క్లోజెట్ లో వందలకొద్ది జతల బట్టలున్నా నెల నెలా కొంటూనే వుంటారు.ఇరవై హ్యాండ్ బ్యాగ్ లు వున్నా clutch కొంటూనే వుంటారు. రోజూ.. కొరియర్ వాడు ఏదో వొకటి ఇచ్చిపోతూనే వుంటాడు. వాటన్నింటికీ.. డబ్బులుంటాయి. అమ్మనాన్నలకు తిండీతిప్పలకు అయ్యే ఖర్చు పంపడానికి  మాత్రం డబ్బులు లేవు అని కసురుకుంటారు. కళ్ళనీళ్ళు నింపుకుని వెర్రిముఖాలు వేసుకుని చూడటమే! 

మేము ఎట్టాగొట్టా సర్దుకుంటాం నువ్వు జాగ్రత్త రా .. అయ్యా! అని చెప్పాను అంది నా ఫ్రెండ్. 

ఇక కూతురు సంగతి చెబుతా విను. అక్కడికి పోయినా.. అన్నీ మనమే చేసి పెట్టాలి. ఇక్కడికి వచ్చినా అన్నీ చేసి అమర్చాలి. మన అనారోగ్యాలు మన నొప్పులు మన డబ్బు ఇబ్బందులు వారికేమీ పట్టవు. ఆడపిల్లకు ఏం బాధ్యత వుంటది? అన్నీ కొడుకులే చూసుకోవాలి అంటూ.. తెలివిగా జారుకుంటారు. వాళ్ళు ఇండియాకి వచ్చిందే బంగారం కొనడానికి బట్టలు కొనడానికి అన్నట్టు రోజూ షాపింగ్ లు ఫ్రెండ్స్ ఇళ్ళకు తిరగడాలు. వారికి కావల్సిన లిస్ట్ అంతా తెచ్చి  సూటేకేస్ లకు సర్దే కూలీలు లాగా చూస్తారు మనల్ని. అసలు రాకుంటే.. ఏ బాధ లేదు, ఎందుకు కన్నామా ఇలాంటి బిడ్డల్ని అని చెప్పుతో కొట్టుకొంటున్నా “ అంది.

మహిళా దినోత్సవం లో తల్లుల వ్యథలు ఇవి. మహిళగా సాధించిన వ్యక్తిగత విజయాల కన్నా  బిడ్డల స్వార్థం  బారిన పడిన తల్లులను కృంగదీసే అంశాలు ఇవి.

 మహిళలూ.. Take care of yourself.. మాతృ ప్రేమను పరిమితం చేసుకోండి అని మాత్రం చెప్పగలను.