బరువులు
నిన్న చాలా బరువులు ఎత్తాను బాధగా మోసాను.
కాసేపు వొంటరిగా కూర్చుని ఆలోచించాను
పడుకునే ముందు కాళ్ళు కడుక్కునట్టు
ఎత్తిన బరువులన్నింటిని మురికికూపంలోకి
విసిరేసాను.
కలల నిద్రలో సేదతీరాను
మా అమ్మ బుగ్గపై వొక ముద్దిచ్చి..
నాకు కావాల్సినవి ఇవ్వమని గారాం చేశాను కూడా!
అమ్మ ఏం చెప్పిందంటే.. ..
మరీ బరువులు యెత్తుకోకు మరీ పరుగులు తీయకు..
నీ శక్తి సన్నగిల్లకుండా నువ్వు పడిపోకుండా వుండాలి..
నేనున్నాను గా!
నీ బరువు నేనెత్తుకుంటాను
నీ పరుగు నేను పూర్తి చేస్తాను
పదిలం .. బిడ్డా! అని ముది గారాం చేసింది.
మా అమ్మ లో వేల యశోదమ్మలు కనిపించారు.
నేను మాత్రం…
చిటికిన వేలితో గోవర్ధన గిరి ని
యెత్తినట్లు.. బరువులను మోయగల
సులువు కనిపెట్టాలి.
మా అమ్మ కు కష్టం లేకుండా.
ప్రేమ ఎంత బరువో అంత సలీసు కూడా.
కాదంటారా!?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి