30, డిసెంబర్ 2024, సోమవారం

వాన కురిసిన రోజు

 విజయవాడలో  “ఎక్సరే” సాహితీ సంస్థ  నెల నెలా వెన్నెల అనే కవితా కార్యక్రమం నిర్వహించేది. ఒక అంశాన్ని ఇచ్చి కవిత్వం రాయమనేవారు. “వాన కురిసిన రోజు “ అనే అంశం ఇచ్చారు. అప్పుడు నేను రాసిన కవిత ఇది. వాన కురిసిన రోజు అందరికీ ఆహ్లాదం కానేకాదు. గుడిసె బ్రతుకుల వారికైతే మరీ కష్టం. నా చిన్నతనంలో నాతో కలసి చదివే ఒక అబ్బాయి వాళ్ళ ఇల్లు ఇలా పొలాలకి రోడ్డు కు మధ్యన  వానకు కురిసిన నీటిలో  వుండేది. ఆ అబ్బాయి వాళ్ళమ్మ వెదురుతో బుట్టలు తయారుచేసి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేది. నాకెప్పుడూ వారి ఇల్లు ఆ జీవన సమరం ఆసక్తి గానూ సానుభూతి గానూ వుండేది. క్రిస్టమస్ పండుగ వస్తే ఆ అబ్బాయి వాళ్ళమ్మ వెదురు బద్దలతో స్టార్ చేసి కాగితాలు అంటించి గుడిసె ముందు వేలాడదీసేది. ఈ క్రిస్టమస్ కి మా ఇంటి చుట్టూ కొంతమంది విద్యుత్ కాంతులతో వెలిగే నక్షత్రాన్ని వేలాడదీసినప్పుడు ఆమె అప్రయత్నంగా జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకాలతో ఈ కవిత వెలుపలకు వచ్చింది. పుస్తకాల్లో దాచిన రాత ఇది. వెలికితీత లో బయల్పడింది. 

వాన కురిసిన రోజు    - వనజ తాతినేని 

గుడిసె లోపల కురుస్తున్న వాన చినుకులను పట్టటానికి ఇంట్లో సామాన్లు అన్నీ పరుస్తుంది అమ్మ. 

నేను నిండిన పాత్రలను గుమ్మం బయట పారబోస్తూ వుంటాను. 

అంతలో ఒక అతిథి వచ్చాడు గొడుగు వేసుకుని. 

అమ్మ లోపలికి రండి అని పిలవడానికి సిగ్గు పడింది. 

పొయ్యి లో పిల్లి పడుకునే వుంది..

 నాన్న ఇంకా రాలేదు వస్తాడన్న ఆశ లేదు. ఆకలితో అలమటిస్తూ నేను. మరొక ఆకలి అల్లరి తో పచార్లు చేస్తున్న అతిధి . అతనిచ్చిన గొడుగు పైసలు తీసుకొని  ఊర్లోని అంగడికి నేను. 

ఆ రాత్రి నా ఆకలి పిల్లి ఆకలి తీరింది. అతిథి ఆకలి తీరింది. 

అతను వెళ్ళి పోయాక  అమ్మ కన్నీటి వానలో నిలువెల్లా తడుస్తూ తనను శుభ్రపరుచుకుంది.

నాన్నకెలాగూ జాలి లేదు.. 

వానక్కూడా జాలి లేకుండా పోయింది. అమ్మనెందుకు ఏడిపిస్తుంది!?


కామెంట్‌లు లేవు: