28, జూన్ 2014, శనివారం

అభివృద్ధికి అధ్బుత దీపం ఉందా?

అభివృద్ధి మాట వింటే అసహనం కొందరిలో ....
జరిగేది అభివృద్దే కాదంటారు . అలాంటప్పుడు నా ఆలోచనలు ఇలా ఉంటాయి
జరుగుతున్నది అరకొర అభివృద్ధి అయితే పూర్తి అభివృద్ధి చేయడం ఎవరివల్ల సాధ్యం ? నాయకుల చేతిలో అద్భుత దీపం ఉందా ?

విశ్వమానవ సమానత్వం ,శ్రేయస్సు దృష్ట్యా ఖండాలమధ్య హద్దులే చెరిగిపోతున్నాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందరికి అందుబాటులోకి వస్తుంది ఆ ఫలితాలని అనుభవిస్తూనే అభివృద్దిని వ్యతిరేకించేవారిని చూస్తున్నాం ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్దిని కాంక్షించే క్రమంలో మూలాలని ,సంస్కృతిని విచ్చిన్న చేస్తూనే ఉన్నారు. సహజ వనరులని మితిమీరి వాడుకుంటూ పర్యావరణ సమతుల్యానికి చేటు చేస్తూనే ఉన్నారు తప్పనిసరై కొంత,మానవ నిర్లక్ష్యం కొంత, మితిమీరిన స్వప్రయోజనాలు మరి కొంత.

అభివృద్దిని కాంక్షిస్తూనే మూలాలు మిగిలి ఉండాలని భావించే వారు మానవ నాగరికత అభివృద్ధి ఎలా చెందిందో గమనిస్తూనే మనం ఎలాంటి ఫలాలని అనుభవిస్తున్నామో గుర్తెరగాలి ..

ఉదాహరణకి కొన్ని .. మనం అదివరకు కట్టెల పొయ్యి వాడేవాళ్ళం . కట్టెలు కోసం చెట్లని నరికేవాళ్ళం . (అవి కాకుండా ఇంకా చెట్ల అవశేషాలు కంది కంప, ఎండిన మామిడి కొమ్మలు,పేడ ఊకతో తయారయిన పిడకలు కర్ర బొగ్గులు ఇలా ) చెట్లు నరకడం వల్ల పర్యావరణ నాశనం అని అర్ధం కాకపోయినా పొగ లేని పొయ్యిలు కూడా వద్దనుకుని గ్యాస్ వాడకం అందరికి అందుబాటులోకి వచ్చింది సహజంగా లభించే గ్యాస్ ని వెలికి తీసి వాడటం అభివృద్ధి,  బయో గ్యాస్ వాడకం అభివృద్దికి సూచకం, సోలార్ విధ్యుత్ అభివృద్దికి సూచకం

చెట్లని నరకడం  వల్లపర్యావరణ నాశనం జరుగుతుందని నరకడం ఆగిందా ? మిగిలిన అనేక అవసరాల కోసం  చెట్లు నరుకుతూనే ఉన్నారు ఇలా అభివృద్ధి క్రమంలో మనం  గమనించాల్సినది చాలా ఉంది .. మితిమీరిన సెల్ ఫోన్ వాడటం వల్ల టవర్స్ పెరిగి రేడియేషన్ వల్ల పిచ్చుకల లాంటి ప్రాణులే అంతరించి పోతున్నాయి .. మరి మనం సెల్ పోన్ వాడటం ఆపేసామా ? ఎయిర్ కండీషన్ వాడకం ఆపేసామా? మనవంతు ఏమి చేయకుండానే పర్యావరణాన్ని నాశనం చేస్తూనే అభివృద్ధి ఫలాలని అనుభవిస్తూనే అభివృద్దిని విమర్శించడం తగునా ? 

నిజమైన అభివృద్ది ఫలాలు అందేదాకా వేచి వుండే ఓపిక  అందరికి ఉందా?  ఇది ఆలోచించే విషయం కదా ! విధ్యుత్ కోతని నిరసిస్తున్నాం.. విధ్యుత్ లేకుండా ఉండటం అలవాటు చేసుకుంటే సహజ వనరులైన బొగ్గు బర్న్ అయ్యే పని ఉండదు.,. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది కదా ! కానీ మనం అలా ఉండగల్గుతున్నామా?

కులం మతం ప్రాంతం రాజకీయాల్ని మోస్తున్నాయి
ధన స్వామ్య వ్యవస్థలోనే ప్రజాస్వామ్యం అనే అప్రజాస్వామ్యం వేళ్ళూనుకుంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా కార్పోరేట్ కనుసన్నలలోనే మెలుగుతుంది .. రాజకీయ పార్టీల మనుగడకి అధికారంలోకి రావడానికి వారి డబ్బు చాలా అవసరం.  అధికారంలోకి వచ్చాక కార్పోరేట్ రంగానికి పెద్దపీట వేయడం ప్రభుత్వాల పని..
సంస్కరణ ఎవరివల్ల సాధ్యం.. ? ప్రజలు ఓటు విలువని నోటుతో,. సీసా మందుతో అమ్ముకున్నరోజే వారిని ప్రశ్నించే హక్కు కోల్పోతున్నారు.   ప్రజాలేమన్నా తక్కువా? వీళ్ళకి స్వప్రయోజన చింతన లేదా చెప్పండి ? 

అభివృద్దికి గనులు అవసరమే.,.పరిశ్రమలు.,. ,ప్రాజెక్ట్లు అవసరమే ! ఆ అభివృద్ధి ముసుగులో స్వార్ధప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా దోచేస్తూ పేదల మీద అబలల మీద దాడులు చేసేవారిని తప్పకుండా ప్రశ్నించాలి. వారి తరపున ముందు నడిచేవారిని అభినందిద్దాం.. అంతే కాని అభివృద్దిని వ్యతిరేకించవద్దు అభివృద్ధి గమనం లో మానవ నిర్లక్ష్యాన్ని గుర్తుచేస్తూ అభివృద్దికి కొత్త భాష్యం చెప్పేవారి మాటలని గౌరవిద్దాం. 
ప్రాజెక్ట్ ల నిర్మాణంలో ఆదిమవాసిప్రజలందరూ వారి ప్రాంతాలకి దూరమయ్యారు . వారికి చాలా నష్టం జరిగి ఉంటుంది.    తెహ్రి డాం నిర్మాణం వల్ల ఎన్నో రాష్ట్రాలకి ముప్పు ఉందని ఆ డాం నిర్మాణం ఆగిందా ? ఎప్పుడు ప్రాజక్ట్ లు కట్టినా ఏదో ఒక వివాదం ఉంది. అంతెందుకు .. కొన్నేళ్ళ క్రితమే నిర్మితమైన "శంషాబాద్ " విమానాశ్రయ నిర్మాణంలో నష్టపోయింది చిన్నా చితక రైతులు కాదా !? ప్రజలకి పర్యావరణం మీద ప్రేమ కన్నా రాజకీయ పార్టీలకి కొమ్ముకాయడం ఎక్కువైపోయింది. ప్రత్యేక ఆర్ధిక మండల్లు పేరిట సేకరించి బహుళజాతి సంస్థలకి ధారాదత్తం చేసిన భూమి కన్నా సొంత రాజధానికి సేకరించిన భూమి పైనే విమర్శలు ఎక్కువయ్యాయి. త్రాగు నీళ్ళకి ఎంత కట కటో హైదరాబాద్ లో అనుభవించి వచ్చారు. భవిష్యత్ తో అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే నదీ తీర ప్రాంతం, అందరికి అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. భవిష్యత్ లో ఇబ్బందులు కలుగకూడదనే ముందు చూపుతో రాజధాని నిర్మాణం సాగుతుందని ఎందుకు అర్ధం చేసుకోరు ? 

చేతికి చిప్ప ఇచ్చి పంపిస్తే... ఇలాంటి పరిస్థితులల్లొ ఏ పార్టీ నుంచి ఎంపిక కాబడ్డ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారో ఆలోచించండి. కాస్త నిజాయితీగా పని చేసేవాళ్ళని గౌరవించండి. ఓపిగ్గా పనులు చేయించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి.   ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి ... మోసపోకుండా . . ఎవరికీ వారు వ్యక్తి అభివృద్ధి గురించి ఆలోచించుకుంటూ ...తర్వాత సమాజం గురించి ఆలోచించడం మంచిదని తెలుసుకుంటే ... నాయకులపై ఆశలుండవు. వాళ్ళు మాత్రం దేవుళ్ళేమికాదు. వాళ్ళ ఆశలు,వాళ్ళ ఆకళ్ళు తీరినాకనే ప్రజల గురించి ఆలోచిస్తారు. ఈ మాత్రం అవగాహన ఉన్నవాళ్ళు ఎవరూ పదే పదే నాయకులని తిట్టరు. 

భావప్రకటన స్వేచ్ఛ మనహక్కు ... ఆ హక్కుని అల్ప విషయాల పట్ల, కాలక్షేపపు బఠానీ కబుర్లకి అతిగా వాడేసి అసహనం పెంచుకోవడం తప్ప ... మంచికి ఉపయోగించుకోవాలని తెలుసుకోలేకపోవడం  శోచనీయం.     


అభివృద్దికి గనులు అవసరమే.,.పరిశ్రమలు.,.ప్రాజెక్ట్లు అవసరమే ! ఆ అభివృద్ధి ముసుగులో స్వార్ధప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా దోచేస్తూ పేదల మీద అబలల మీద దాడులు చేసేవారిని తప్పకుండా ప్రశ్నించాలి. వారి తరపున ముందు నడిచేవారిని అభినందిద్దాం.. అంతే కాని అభివృద్దిని వ్యతిరేకించవద్దు అభివృద్ధి గమనం లో మానవ నిర్ల్క్ష్యన్ని గుర్తుచేస్తూ అభివృద్దికి కొత్త భాష్యం చెప్పేవారి మాటలని గౌరవిద్దాం

24, జూన్ 2014, మంగళవారం

ఎవరైతే ఏమిటి ?

సాయి బాబా ! రామ్? ఎవరైతే ఏమిటి ? అభ్యంతరం ఎందుకు ?

రోజు గుడికి వెళుతూ కూడా దేవుడున్నాడా లేడా అన్న సందేహం కల్గినట్లు .

సాయిబాబా దేవుడు కాదు . ఎందుకో నాకు అలానే అనిపిస్తుంది అలా అని సాయిబాబాని నేను ద్వేషించడంలేదు . సాయిని పూజించే వారిని వ్యతిరేకించనూ లేదు .. నా దృష్టిలో గుడి అంటే శివాలయం ,విష్ణాలయం, అమ్మవారి ఆలయం .... ఇలా అన్నమాట .అది నా భావన

నాతో చాలా మంది చెప్పారు షిర్డీ వెళ్లి ఆయన విగ్రహం ముందు నిలబడి కూడా ఆయనకీ నమస్కరించడానికి మనసొప్పలేదు . ఆయన దైవం అంటే అంగీకరించలేకపోయాను  అక్కడ జరిగే హారతి లోను మనఃస్పూర్తిగా పాల్గోనలేకపోయానని చెప్పినవారు ఉన్నారు .

వారిలోనూ నాలోనూ ఎందుకలాంటి భావన అని  నా ఆలోచన .
సాధారణంగా పుట్టుక నుండి మనకొక సంప్రదాయం ఉంటుంది మనం కొన్నింటిని స్వయంగా ఆస్వాదిస్తేనే, అనుభూతికి లోనైతేనే ఒక స్థిర అభిప్రాయంకి వస్తాం . అదే ప్రామాణికంగా తీసుకుంటాం . అలాంటి అభిప్రాయానికి  రానప్పుడు ఎవరి మాటని మనం లేక్కించం అది దేవుడు విషయమయినా దెయ్యం విషయమయినా సరే! ఎవరి నమ్మకమే వారికి ప్రాధాన్యం కదా !

అడుగడుగునా గుడి ఉంది గుడిలోన దైవముంది మన హిందువుల విశ్వాసం కూడా అదే ఒక రాయిని నిలబెట్టి  ప్రాణ ప్రతిష్ట చేసి చుట్టూ నాలుగు గోడలు కట్టి శాస్త్రోక్తంగా ధ్వజస్తంభం  ప్రతిష్టించి రోజూ వేదాలలోని భాగాలతో మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే అక్కడ మనకి తెలియని శక్తి ఏదో అదృశ్యరూపంలో నెలకొని ఉండి దైవం అన్న భావంలో మనుషులని కాపాడుతుందని మన నమ్మకం కూడా . అలాంటి భావనతోనే మూడు కోట్ల మంది దేవతలని మనం పూజిస్తున్నాం ప్రకృతిలో నిబిడీకృతమై ఉన్న అన్నింటిని మనం దైవ స్వరూపంగానే భావిస్తాం ..అలాగే ఇతర ప్రాణుల పట్ల భూత దయ కల్గి ఉండటం కూడా   అది మన జీవన విధానంం... .

ఇక సాయి బాబా దేవుని రూపమా కాదా అన్న విషయానికి వస్తే .....కొందరు పీఠాదిపతులు వ్యతిరేకించిన విషయం ఇప్పుడు కొత్తదేమీ కాదు ఈ విషయం నేను చాలా సంవత్సరాలుగా వింటున్నాను . సాయిబాబా గుడిలో పూజారులుగా ఉన్నవారిని వారి బంధువర్గం ఈ విషయంలో విభేదించడం చూసాను .

సాధారణ మానవులలో ఉండే మానవత్వం కన్నా ఎక్కువ శాతం మానవత్వముండి  తోటి ప్రాణులపట్ల దయ, జాలి కనికరం చూపే వారిని మీరు మనిషి కాదు దేవుడు తో సమానం అని కీర్తించేది మనమే ! దైవత్వం అపాదించేది మనమే ! సాయి బాబా గా తెలిసిన ఆయన్ని సాయి రామ్ గా మార్చేసింది మనమే ! సర్వ ప్రాణులపట్ల దయకలిగి మానవసేవ మాధవ సేవ చేయమని చెప్పిన వారికి దేవుడు ముద్ర వేసారు . సాయి బాబా తర్వాత అలాంటి  మహనీయులే పుట్టారు . రమణ మహర్షి , భగవాన్ వెంకయ్య స్వామి ఇలా కొందరు . అందరికి గుళ్ళు కట్టి పూజలు చేస్తే వాళ్ళు దేవుల్లవుతారు . ఎందుకంటే భక్తి అనే పిచ్చి జనం కి ఎక్కువ కాబట్టి . ఆచరించినా ఆచరించక పోయినా  సాయి బాబా చరిత్ర ఆయన జీవనమార్గం మంచే చెప్పింది.. ఆయన మనిషిగా ఉండే మనిషిలో  ఉన్న దైవత్వమే చూపాడు.. కృతజ్ఞతా భావం ఉన్నవారు మనిషినే దైవం అంటారు .. దైవం అని గుడులు కట్టి పూజించక పోయినా పర్లేదు . మంచి మార్గం ని అనుసరిస్తే చాలు .ఇష్టమయినవారు పూజించినా ఎవరికీ నష్టం లేదు. ఎవరైనా సరే దైవం పేరిట దీనులని  దోచుకు తినకుండా ఉంటే అదే చాలు  . ఇప్పుడు పీఠాధి పతులు చేస్తున్నవి అదే కదా! . శైవం వైష్ణవం పేరుతో కొట్టుకు చచ్చినట్లు ఇది మరో వివాదమా ?  హే  భగవాన్ !
  .
  .    

17, జూన్ 2014, మంగళవారం

మతం మనిషికి అవసరమా !?.




మతం మనిషికి అవసరమా !?. 

ఆది మానవుడిది ఏ మతం ? పరిణామ క్రమంలో మనిషి మనుగడ మతంతోనే ముడిపడి బలపడిందా !? 

మతం మనిషికి మానసిక అవసరమా !? లేక మతమనే అవసరాన్ని సృష్టించుకున్నామా ? 

 ఇటు శ్రీలంకలో అతివాద బౌద్ధ  మతస్తులు మైనారిటీ ముస్లిం మతస్తులని ఊచకోత కోసి సింహళీయులు తమిళలపై జరిగిపిన హింసని గుర్తుకు తెస్తున్నాయి . 

అటు ఇరాక్ లో తెగలమధ్య విద్వేషాలతో లాభ పడుతున్నది ఇంకొకరు 

ఇక మనదేశంలో ముజఫర్ నగర్ లో జరుగుతున్న హింసాకాండ 

ఎక్కడ చూసినా బలవంతుల చేతిలో బలహీనుల అణచివేత

మతం పేరిట జరుగుతున్న మారణకాండ 

అన్ని దేశాలలోనూ రాజకీయ నాయకుల ఓట్ల బ్యాంకు కి మతం అవసరవతున్నప్పుడూ

మనిషి మనిషిగా బ్రతకలేకుండా మతం ముసుగులో ముఖాలు దాచుకుంటూ తమని తాము మభ్య పెట్టుకుంటూ విద్వేషాల మధ్య బతుకు దుర్భరం అవుతున్నప్పుడూ మతం అవసరమా అనిపిస్తుంది 

ధర్మం అనుకుంటూ  కొందరి విద్వేషాలకి అడ్డుకట్ట వేయలేక ఉదారవాదంతో  బ్రతికేస్తున్న హిందువులది  మతం కాదా ? ఇలా ఎన్నో ప్రశ్నలుదయిస్తున్నాయి ? 

మతం గీతం మనకొద్దు మానవత్వమే మా మతం . అందరికి అదే సమ్మతం అంటూ పసి పిల్లలకి భోధించినంత సులభం కాదేమో కదా ! 

మతం గూర్చి మనకి ఎన్నో ఆసక్తి కల్గించే విషయాలు దారావాహికంగా వచ్చే వ్యాసాలలో నేను కొన్ని చదివాను .. వీలయితే మీరు చదివి చూడండి 

మతం పునాదులు  గురించి డా|| ఆర్కే గారి వ్యాసం లోని ఒక భాగాన్ని చూడండి ప్రజాసాహితి మే నెల సంచికలో

ప్రజా సాహితి కినిగే లో కూడా  లభ్యమవుతుంది 

12, జూన్ 2014, గురువారం

జాతీయ జెండా యేనా !? కాస్ట్యూమ్స్ క్రియేటివిటీ నా?





నడి రోడ్డుపై ఒక ఆడకూతురిని ఒంటిపై నూలుపోగులేకుండా వివస్త్ర మార్చి అవమానిస్తే జాతీయ జెండాని కప్పి ఆమెగౌరవాన్ని  కాపాడటం కన్నా ఇంకేమి గౌరవం కావాలని అనుకున్న రోజులు వేరు . ఈనాడు వేరు

చీరలోని గొప్పదనం గురించి "చంద్రబోస్" ఒక పాటనే  వ్రాసి జనుల హృదయం తాకేటట్టు చేసారు 

"విదేశాల వనితలకు సారె పోసి పంపేది
భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది"  అని 

సగౌరంగా స్థానాన్ని ఇచ్చారు మనమందరం మెచ్చాంకూడా! 

చీర కట్టడం సంగతి అలా ఉంచండి చీర కట్టడమే నామోషి అనుకునే మన "సెలబ్రిటీ " లు వారి దేహాలపై జాతీయ జెండా లోని మూడు రంగులని నింపి మనకి తలవంపులు తెచ్చేస్తున్నారు వివాదాస్పదం చేసి మరీ వార్తలలోకెక్కి బాగా పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఇది  జాతీయ జెండా యేనా !?   కాస్ట్యూమ్స్ క్రియేటివిటీ నా?

ఈ రోజు రాగా కాం వారి పోస్ట్ ఒకటి చూసాను ఆ పోస్ట్ చూడగానే ఒక రకమైన విరక్తి వచ్చేసింది దేశభక్తి నరనరాన పొంగడం ఏమో కాని ఇలాంటివి చూసినప్పుడు "గుండెల్లో లేని దేశ భక్తి ని ఒంటిపై చూపే ఈ సెలబ్రిటీ లని వెంటనే "సెల్ " లో వేయాలి వీరి చేతనే ప్రతి రోజు జాతీయగీతం ఆలపింపజేయాలి మారుమూల ప్రాంతాలకి పంపి జాతీయత అంటే ఏమిటో జాతీయ జెండా కి ఉన్న విలువ ఏమిటో... ఎలా గౌరవించాలో తరగతులు నిర్వహించే శిక్ష వేయాలి " అనిపించింది 

ఇంతకీ ఈ తారాగణం ఏం చేస్తున్నారో..ఈlink చూడండి  

 ఈ పాట వినేసి "చంద్రబోస్ "గారికి ఈ పాటకి కోరియోగ్రఫీ చేసిన "సుచిత్ర చంద్రబోస్" జై చెప్పేద్దాం.. @ భారతమాతాకి జై బోలో ! 


11, జూన్ 2014, బుధవారం

బి యాస్

ఒక తల్లి హృదయం నదీమతల్లిపై ఆగ్రహావేశం

బియాస్ 

నువ్వెంతటి మోసగత్తెవి....
దారిన పోయేవారిని 
రా రామ్మని ఆహ్వానించావు
నీ అందాలని తమతో బందీగా 
తీసుకు వెళ్ళాలనుకున్న పువ్వులని 
చిదిమేసి నీ గర్భాన దాచుకున్నావ్
ఎందరో తల్లులకి గర్భశోకం మిగిల్చిన
నిన్ను నదీమ తల్లిగా ఎలా కీర్తించం!

తెలుగుతోటంతా ధ్వంసమై
కన్నీరుమున్నీరవుతూంది

నువ్వెంత ప్రమోదమో....
అంతకంత ప్రమాదకారివని హెచ్చరిస్తూ....
మా దుఃఖరాశులన్నీ ఘనీభవించిపోయి
నీలా నడకలు సాగించమని
                                                      ఉద్భోదిస్తూ.... ఉన్నావా?  "బి యాస్"